99 Bible Verses About The Church

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About The Church
  1. 41 అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు. 42 వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.

    43 అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు. 44 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. 45 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. 46 ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ, 47 ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.

  2. 14 ఆయనే మన శాంతి. ఆయన యూదులనూ యూదేతరులనూ ఏకం చేశాడు. మన ఉభయులనూ విడదీస్తున్న విరోధమనే అడ్డుగోడను తన శరీరం ద్వారా కూలగొట్టాడు. 15 అంటే, ఆ ఇద్దరి నుండి ఒక కొత్త ప్రజను సృష్టించడానికి విధులూ ఆజ్ఞలూ గల ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడు. 16 వారి మధ్య ఉన్న వైరాన్ని సిలువ ద్వారా నిర్మూలించి, వీరిద్దరినీ దేవునితో ఏకం చేసి శాంతి నెలకొల్పాలని ఇలా చేశాడు 17 యేసు వచ్చి దూరంగా ఉన్నవారికి సువార్తను, శాంతిని ప్రకటించాడు. దగ్గరగా ఉన్నవారికి శాంతిసమాధానాలు ప్రకటించాడు. 18 యేసు ద్వారానే మీరూ మేమూ ఒకే ఆత్మ ద్వారా తండ్రిని చేరగలం.

    19 కాబట్టి యూదేతరులైన మీరు ఇకమీదట అపరిచితులూ పరదేశులూ కారు. పరిశుద్ధులతో సాటి పౌరులు, దేవుని కుటుంబ సభ్యులు. 20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డారు. 21 ఆయన వల్లనే తన కుటుంబమనే కట్టడం చక్కగా అమరి, ప్రభువు కోసం పరిశుద్ధ దేవాలయంగా రూపొందుతూ ఉంది. 22 ఆయనలో మీరు కూడా ఆత్మలో దేవునికి నివాసస్థలంగా ఉండడానికి వృద్ది చెందుతూ ఉన్నారు.

  3. 11-12 విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు. 13 మనమంతా విశ్వాసంలో, దేవుని కుమారుడి గురించిన జ్ఞానంలో ఏకీభావం కలిగి ఉండాలనీ క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణ పరిణతికి సమానమైన పరిణతి చెందాలనీ ఆయన ఇలా నియమించాడు. 14 అప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని కల్పించిన అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము. 15 ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం. 16 ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా అమరి, దానిలోని ప్రతి అవయవమూ కీళ్ళ మూలంగా కలిసి ఉండి, తన శక్తి కొలది పని చేసినపుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది.

  4. 5 ఆధ్యాత్మిక గృహంగా కట్టడానికి వాడే సజీవమైన రాళ్ల లాగా మీరున్నారు. దాని వలన, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండగలరు.

    6 ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది,

    “నేను సీయోనులో మూల రాయి వేస్తున్నాను.

    అది విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ.

    ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు.”

    7 కాబట్టి విశ్వసిస్తున్న మీకు ఇది గౌరవప్రదమైనది. అయితే విశ్వసించని వారికి,

    “ఇల్లు కట్టే వారు నిరాకరించిన రాయి, మూలకు తలరాయి అయింది.”

    8 అది “అడ్డురాయి, అడ్డుబండ” అయింది.

    వారు వాక్యానికి అవిధేయులై తొట్రుపడుతున్నారు. దాని కోసమే దేవుడు వారిని నియమించాడు.

    9 చీకటిలో నుంచి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికైన వంశంగా రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజగా ఉన్నారు.

    10 ఒకప్పుడు మీరు ప్రజ కాదు.

    కానీ ఇప్పుడు దేవుని ప్రజ.

    పూర్వం మీరు కనికరానికి నోచుకోలేదు.

    అయితే ఇప్పుడు కనికరం పొందారు.

  5. 15 “అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు. 16 వెంటనే సీమోను పేతురు, “నీవు అభిషిక్తుడివి! సజీవుడైన దేవుని కుమారుడివి!” అని చెప్పాడు.

    17 అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు, “యోనా కుమారా, సీమోనూ, నీవు ధన్యుడివి. ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసింది పరలోకంలోని నా తండ్రే గాని మానవ మాత్రులు కాదు. 18 ఇంకో విషయం, నీవు పేతురువి. ఈ బండమీద నా సంఘాన్ని నిర్మిస్తాను. పాతాళ లోకపు ద్వారాలు దాన్ని ఎదిరించి నిలబడలేవు. 19 పరలోక రాజ్యపు తాళాలు నీకిస్తాను. నీవు భూమి మీద దేనిని బంధిస్తావో దాన్ని పరలోకంలో బంధించడం, దేనిని విడిపిస్తావో దాన్ని పరలోకంలో విడిపించడం జరుగుతుంది.”

  6. 24 సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.

    25 పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి. 26 సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి, 27 దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.

  7. 4 ఎలాగంటే ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలున్నప్పటికీ, వాటన్నిటికీ ఒక్కటే పని ఉండదు. 5 అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవాలుగా ఉన్నాము.

    6 దేవుడు మనకనుగ్రహించిన కృప ప్రకారం వివిధ రకాల కృపావరాలు కలిగి ఉన్నాము. కాబట్టి, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం ప్రకారం ప్రవచించాలి. 7-8 పరిచర్య వరం ఉన్న వాడు పరిచర్య చేయాలి. బోధించే వరం ఉన్నవాడు బోధించాలి. ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. పంచిపెట్టేవాడు ధారాళంగా పంచిపెట్టాలి.

  8. 9 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. 10 ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు.

    11 ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి పొందిన వాడనీ సున్నతి పొందని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ లేదు. క్రీస్తే సమస్తం, సమస్తంలో ఆయనే ఉన్నాడు.

    12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.

    14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.

    16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.

    17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.

  9. 9 ఈ ప్రేమ మూలంగా మీ గురించి మేం విన్న రోజు నుండీ మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు సంపూర్ణ జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం కలిగి ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం. 10 ప్రతి మంచి కార్యం విషయంలోనూ మీరు ఫలిస్తూ, దేవునికి సంబంధించిన జ్ఞానంలో పెరుగుతూ, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేలా, ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము ప్రార్ధిస్తున్నాం. 11 మహిమ ప్రభావాలతో కూడిన ఆయన శక్తి మిమ్మల్ని ప్రతివిధమైన సామర్థ్యం ఇచ్చి బలపరచాలని దేవుణ్ణి వేడుకుంటున్నాం. అదే మీకు సహనాన్నీ, పట్టుదలతో కొనసాగే శక్తినీ కలిగిస్తుంది.

    12 వెలుగు నివాసులుగా తనకోసం ప్రత్యేకించబడిన వారి వారసత్వంలో భాగం పంచుకోడానికి మనలను అర్హులుగా చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. 13 ఆయన మనలను చీకటి రాజ్యపు ఆధిపత్యం నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుడి రాజ్యంలోకి తరలించాడు. 14 ఆ కుమారుడిలోనే మనకు పాప క్షమాపణా విమోచనా ఉన్నాయి.

    15 కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన ప్రముఖుడు. 16 ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి. 17 ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి.

    18 సంఘం అనే శరీరానికి ఆయనే తల. సర్వాధికారానికీ మూలకేంద్రం ఆయనే. అన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానం కలిగేటందుకు చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేవడంలో ఆయన ప్రథముడు. 19 ఆయనలో దైవత్వం సర్వసంపూర్ణత నివసించాలనీ, 20 కుమారుడి ద్వారా సమస్తాన్నీ తనతో రాజీ చేసుకోవాలనీ దేవుడు ఇష్టపడ్డాడు. ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న వాటినన్నిటినీ తన కుమారుడు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీ చేసుకోవడం ద్వారా ఆయన ఈ కార్యం చేశాడు.

  10. 1 తోటి పెద్దనూ, క్రీస్తు బాధలు చూసిన వాణ్ణి, ప్రత్యక్షం కాబోయే మహిమలో భాగస్వామినీ అయిన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. 2 మీ దగ్గరున్న దేవుని మందను కాయండి. బలవంతంగా కాకుండా దేవుడు కోరే రీతిగా ఇష్ట పూర్వకంగా వారిని చూసుకోండి. చెడు లాభం ఆశించి కాకుండా ఇష్టంగా వారిని చూసుకోండి. 3 మీ అజమాయిషీ కింద ఉన్న వారిపై పెత్తనం చేసేవారుగా ఉండక, మందకు ఆదర్శంగా ఉండండి. 4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీకు వాడిపోని మహిమ కిరీటం లభిస్తుంది.

    5 యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి ఉండండి. దేవుడు గర్విష్టులను ఎదిరించి వినయం గలవారికి కృప చూపుతాడు. 6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.

    7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి.

  11. 1 ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నపుడు రోజువారీ భోజనాల వడ్డనల్లో తమలోని విధవరాళ్ళను చిన్నచూపు చూస్తున్నారని గ్రీకు భాష మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదుల మీద ఫిర్యాదు చేశారు.

    2 అప్పుడు పన్నెండుమంది అపొస్తలులు శిష్యుల సమూహాన్ని తమ దగ్గరికి పిలిచి, “మేము దేవుని వాక్యాన్ని బోధించడం మాని భోజనాలు వడ్డించడం మంచిది కాదు. 3 కాబట్టి సోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వారై, మంచి పేరున్న ఏడుగురిని మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాం. 4 మేము మాత్రం ప్రార్థనలోనూ, వాక్య పరిచర్యలోనూ కొనసాగుతూ ఉంటాం” అన్నారు.

    5 ఈ మాట అందరికీ నచ్చింది. కాబట్టి, వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండి ఉన్న స్తెఫను, ఇంకా ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, సీమోను, పర్మెనాసు, యూదామతంలోకి మారిన అంతియొకయ నివాసి నీకొలాసు అనేవారిని ఎంచుకున్నారు. 6 వారిని అపొస్తలుల ముందుంచారు. అపొస్తలులు ప్రార్థన చేసి వారిమీద చేతులుంచారు.

  12. 26 యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు. 27 క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు. 28 ఇందులో యూదుడు-గ్రీసుదేశస్థుడనీ దాసుడు-స్వతంత్రుడనీ పురుషుడు-స్త్రీ అనీ తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు. 29 మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు.

  13. 24 అధికంగా ప్రేమించడానికీ, మంచి పనులు చేయడానికీ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి. 25 కొంత మంది సమాజంగా సమకూడడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ దినం దగ్గర పడడం చూసే కొద్దీ ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉండండి.

  14. 28 “ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించీ, మీ మట్టుకు మిమ్మల్ని గురించీ జాగ్రత్తగా ఉండండి. 29 నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే క్రూరమైన తోడేళ్ళు వంటివారు మీలో ప్రవేశిస్తారు. వారు మందపై జాలి చూపరు.

    30 అంతేకాక శిష్యులను తమతో ఈడ్చుకుపోవడం కోసం దారి మళ్ళించే మాటలు పలికే వ్యక్తులు మీలో నుండే బయలుదేరుతారు. 31 కాబట్టి మూడు సంవత్సరాలుగా నేను రాత్రింబగళ్ళు కన్నీళ్ళతో మీలో ప్రతి ఒక్కరికీ ఎడతెగక బుద్ధి నేర్పడం మానలేదని గుర్తుంచుకుని మెలకువగా ఉండండి.

  15. 12 శరీరం ఒక్కటే, అందులో అనేక అవయవాలు ఉన్నాయి. అవన్నీ ఒకే శరీరంలో అవయవాలైనా శరీరం ఒకటే. క్రీస్తు కూడా అలానే ఉన్నాడు. 13 ఎలాగంటే, యూదులైనా, గ్రీకులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమంతా ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మలోనే బాప్తిసం పొందాం. మనమంతా ఒకే ఆత్మను పానం చేశాం. 14 శరీరం అంటే ఒక్క అవయవమే కాదు, అది అనేక అవయవాలతో ఉంది. 15 పాదం ‘నేను చేతిని కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు’ అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. 16 అలాగే చెవి ‘నేను కన్ను కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు’ అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. 17 శరీరమంతా ఒక్క కన్నే ఉంటే ఇక వినడం ఎలా? శరీరమంతా ఒక్క చెవే అయితే వాసన ఎలా చూడాలి?

    18 అందుకే దేవుడు ప్రతి అవయవాన్నీ తన ఇష్టం ప్రకారం శరీరంలో ఉంచాడు. 19 అవన్నీ ఒకే అవయవం అయితే శరీరమేది? 20 అయితే ఇప్పుడు అవయవాలు అనేకం, శరీరం మాత్రం ఒక్కటే. 21 కాబట్టి కన్ను చేతితో, “నీవు నాకక్కర లేదు” అనీ, తల పాదాలతో, “మీరు నాకక్కర లేదు” అనీ చెప్పడానికి వీలు లేదు. 22 అంతేకాక, శరీరంలో బలహీనంగా కనిపించే అవయవాలు ఎక్కువ అవసరమైనవి.

    23 శరీరంలో ఘనత లేనివని తలంచే అవయవాలను మరి ఎక్కువగా ఘనపరుస్తాం. అందం లేదని తలచే అవయవాలకు ఎక్కువ అందాన్ని కలిగిస్తాం. 24-25 అందమైన అవయవాలకు మరింత అందం అక్కర లేదు. ఆ విధంగా దేవుడు శరీరంలో వివాదాలు రాకుండా అవయవాలన్నీ ఒకదాని పట్ల మరొకటి శ్రద్ధ వహించేలాగా, తక్కువ దానికే ఎక్కువ ఘనత కలిగించి, శరీరాన్ని అమర్చాడు. 26 కాబట్టి ఒక అవయవం బాధపడితే మిగిలిన అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి. ఒకటి ఘనత పొందితే అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి. 27 మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు.

    28 దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు. 29 అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు. 30 అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు. 31 కృపావరాల్లో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వ శ్రేష్ఠ మార్గాన్ని మీకు చూపిస్తాను.

  16. 1-3 కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. 4 ఏ విధంగా మీ పిలుపుకు సంబంధించిన నిశ్చయతతో ఉన్నారో ఆ విధంగా శరీరం ఒక్కటే, ఆత్మా ఒక్కడే. 5 ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. 6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికంటే పైనా, అందరి ద్వారా అందరిలో ఉన్నాడు.

  17. 15 “ఇంకో విషయం. నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే. 16 అతడు వినకపోతే, ‘ప్రతి విషయమూ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి.’ కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. 17 అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి. అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా, పన్ను వసూలుదారుడుగా పరిగణించు.

    18 “నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో, దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు. 19 ఇంకో విషయం, దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు.

    20 “ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను.”

    21 అప్పుడు పేతురు వచ్చి, “ప్రభూ, నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్లు సరిపోతుందా?” అని యేసుని అడిగాడు. 22 అందుకు యేసు అతనికి జవాబిస్తూ, “ఏడు సార్లు వరకే కాదు, ఏడుకు డెబ్భై సార్ల వరకూ అని నీతో చెబుతున్నాను.

  18. 1 అంతియొకయలోని క్రైస్తవ సంఘంలో బర్నబా, నీగెరు అనే సుమెయోను, కురేనీ వాడైన లూకియ, రాష్ట్రపాలకుడు హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు అనే ప్రవక్తలూ బోధకులూ ఉన్నారు.

    2 వారు ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం ఉన్నపుడు, పరిశుద్ధాత్మ, “నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కోసం వారిని నాకు కేటాయించండి” అని వారితో చెప్పాడు. 3 విశ్వాసులు ఉపవాసముండి, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిన తరువాత వారిని పంపించారు.

  19. 9 మన ప్రభు యేసు క్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.

    10 సోదరులారా, మన ప్రభు యేసు క్రీస్తు నామంలో నేను మిమ్మల్ని వేడుకునేది ఏమంటే మీరంతా ఏకభావంతో మాట్లాడుతూ, మీలో మీకు విభేదాలు లేకుండా చూసుకోండి. ఒకే మనసుతో, ఒకే ఉద్దేశంతో కలిసి మెలసి ఉండండి.

    11 సోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారి ద్వారా తెలిసింది. 12 మీలో ఒకడు ‘నేను పౌలు వాణ్ణి,’ ఒకడు ‘నేను అపొల్లో వాణ్ణి,’ మరొకడు ‘నేను కేఫా వాణ్ణి,’ ఇంకొకడు ‘నేను క్రీస్తు వాణ్ణి’ అని చెప్పుకుంటున్నారని నేను విన్నాను.

    13 క్రీస్తు చీలికలు అయ్యాడా? పౌలు మీ కోసం సిలువ అనుభవించాడా? పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా? 14 నేను క్రిస్పుకు, గాయికి తప్ప వేరెవరికీ బాప్తిసం ఇయ్యలేదు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. 15 ఎందుకంటే నా నామంలోకి మీరు బాప్తిసం పొందారని చెప్పుకోవడం నాకిష్టం లేదు.

  20. 8 అలాగే పరిచారకులు గౌరవానికి తగినవారుగా, రెండు నాలుకలతో మాట్లాడనివారుగా ఉండాలి. తాగుబోతులుగా, అక్రమ లాభం ఆశించేవారుగా ఉండకూడదు. 9 వెల్లడైన విశ్వాస సత్యాన్ని పవిత్రమైన మనస్సాక్షితో అంటిపెట్టుకొనే వారుగా ఉండాలి. 10 మొదట వారిని పరీక్షించాలి. తరువాత వారు నిందకు చోటివ్వనివారని తేలితే పరిచారకులుగా సేవ చేయవచ్చు.

    11 అలాగే వారి భార్యలు కూడా గౌరవించదగినవారూ అపనిందలు ప్రచారం చేయనివారూ తమ కోరికలు అదుపులో ఉంచుకొనేవారూ అన్ని విషయాల్లో నమ్మకమైనవారూ అయి ఉండాలి. 12 పరిచారకులు ఒకే భార్య కలిగినవారూ, తమ పిల్లలనూ తమ ఇంటివారిని చక్కగా నిర్వహించుకొనేవారుగా ఉండాలి. 13 పరిచారకులుగా మంచి సేవ చేసిన వారు మంచి స్థానం సంపాదించుకుని క్రీస్తు యేసు పైని విశ్వాసంలో గొప్ప ధైర్యం పొందుతారు.

  21. 5 నేను నీకు ఆదేశించినట్టు నువ్వు ఇంకా క్రమపరచని వాటిని క్రమపరచి, ప్రతి పట్టణంలోని క్రీస్తు ప్రభువు సంఘంలో పెద్దలను నియమించడం కోసం నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చాను.

    6 సంఘపెద్ద నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య కలవాడై ఉండాలి. అతని పిల్లలు లెక్కలేనితనంగా క్రమశిక్షణ లేనివారు అనే పేరు లేకుండా విశ్వాసులై ఉండాలి. 7 అధ్యక్షుడు దేవుని ఇంటి సేవ నిర్వహించేవాడు కాబట్టి నిందారహితుడుగా ఉండాలి. అతడు అహంకారి, ముక్కోపి, ద్రాక్ష మద్యానికి అలవాటు పడినవాడు, దెబ్బలాడేవాడు, దురాశపరుడు అయి ఉండకూడదు. 8 అతిథి ప్రియుడు, మంచిని ప్రేమించేవాడు, ఇంగిత జ్ఞానం గలవాడు, నీతిపరుడు, పవిత్రుడు, ఆశలను అదుపులో ఉంచుకొనేవాడు, 9 నమ్మదగిన బోధను స్థిరంగా చేపట్టడం ద్వారా క్షేమకరమైన సిద్ధాంతం బోధిస్తూ ప్రజలను హెచ్చరించడంలో, ఎదిరించే వారి వాదాలను ఖండించడంలో సమర్ధుడుగా ఉండాలి.

  22. 11 పునాది యేసు క్రీస్తే. వేసిన ఈ పునాది కాక, వేరే పునాది ఎవరూ వేయలేరు.

    12 ఈ పునాది మీద ఎవరైనా బంగారం, వెండి, విలువైన రాళ్ళు, చెక్క, చెత్త పరకలు, ఇలాటి వాటితో కడితే 13 వారి వారి పని బయట పడుతుంది. ఆ రోజు దాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ఎందుకంటే అది అగ్నివల్ల బయట పడుతుంది. ప్రతి ఒక్కరి పనినీ మంటలే పరీక్షిస్తాయి. 14 పునాది మీద ఎవరి పని నిలబడుతుందో అతనికి ప్రతిఫలం దొరుకుతుంది. 15 ఎవరి పని కాలిపోతుందో అతనికి నష్టం వస్తుంది. అతడు తప్పించుకుంటాడు గానీ మంటల్లో నుండి తప్పించుకొన్నట్టుగా ఉంటాడు.

    16 మీరు దేవుని ఆలయమనీ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనీ మీకు తెలియదా? 17 దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు అతణ్ణి పాడు చేస్తాడు. దేవుని ఆలయం పవిత్రమైనది. ఆ ఆలయం మీరే.

  23. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

    14 అయినా నా కష్టాలు పంచుకోవడంలో మీరు మంచి పని చేశారు. 15 ఫిలిప్పీయులారా, నేను సువార్త బోధించడం మొదలుపెట్టి మాసిదోనియ నుంచి బయలుదేరినప్పుడు మీ సంఘమొక్కటే నాకు సహాయం చేసి నన్ను ఆదుకున్నది. ఈ సంగతి మీకే తెలుసు. 16 ఎందుకంటే తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికీ నా అవసరం తీర్చడానికి సహాయం చేశారు.

    17 నేను బహుమానాన్ని ఆశించి ఇలా చెప్పడం లేదు, మీకు ప్రతిఫలం అధికం కావాలని ఆశిస్తూ చెబుతున్నాను. 18 నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు ద్వారా అందాయి. నాకు ఏమీ కొదువ లేదు. అవి ఇంపైన సువాసనగా, దేవునికి ఇష్టమైన అర్పణగా ఉన్నాయి. 19 కాగా నా దేవుడు తన ఐశ్వర్యంతో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు.

  24. 18 చేతితో తాకగలిగే పర్వతం దగ్గరకో, మండుతూ ఉండే కొండ దగ్గరకో, అంధకారం దగ్గరకో, విషాదం దగ్గరకో లేదా ఒక తుఫాను దగ్గరకో మీరు రాలేదు. 19 బాకా శబ్దానికి మీరు రాలేదు. విన్నవారు ఇక తమకు ఏ మాటా చెప్పవద్దని ఏ స్వరం గురించి బ్రతిమాలుకున్నారో అది పలికిన మాటలకు మీరు రాలేదు. 20 ఎందుకంటే వారు విన్న ఆజ్ఞకు వారు తట్టుకోలేకపోయారు: “ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా సరే, దాన్ని రాళ్ళతో కొట్టి చంపాలి” అన్నదే ఆ ఆజ్ఞ.

    21 భీకరమైన ఆ దృశ్యాన్ని చూసిన మోషే, “నేను ఎంతో భయపడి వణుకుతున్నాను” అన్నాడు. మీరు అలాంటి వాటికి రాలేదు. 22 ఇప్పుడు మీరు సీయోను పర్వతం దగ్గరకూ సజీవుడైన దేవుని పట్టణం దగ్గరకూ అంటే పరలోకపు యెరూషలేము దగ్గరకూ, ఉత్సహించే వేలాది దేవదూతల దగ్గరకూ వచ్చారు. 23 పరలోకంలో నమోదు అయిన జ్యేష్టుల సమాజం దగ్గరకూ, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకూ సంపూర్ణత పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకూ మీరు వచ్చారు. 24 ఇంకా కొత్త ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న యేసు దగ్గరకూ, హేబెలు రక్తం కంటే మెరుగైన వాటిని తెలియజేసే చిలకరించిన రక్తం దగ్గరకూ మీరు వచ్చారు.

  25. 14 నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు. 15 నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను. 16 ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి.

  26. 14-15 ఈ కారణం వలన పరలోకంలో, భూమి మీదా ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి తన కుటుంబం అని పేరు పొందిందో ఆ తండ్రి ముందు నేను మోకాళ్ళూని ప్రార్థిస్తున్నాను. 16-17 ఆయన మీలో ఉన్న తన ఆత్మ ద్వారా తన మహిమైశ్వర్యాన్ని బట్టి శక్తితో మిమ్మల్ని బలపరచడం అనే వరం ఇవ్వాలి. క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి. మీరు ఆయన ప్రేమలో వేరు పారి స్థిరంగా ఉండాలి. ఇదే నా ప్రార్థన 18 పరిశుద్ధులందరితో కలిసి దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో పూర్తిగా గ్రహించగలగాలనీ 19 జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోడానికి తగిన శక్తి పొందాలనీ నా ప్రార్థన.

    20 మనలో పని చేసే తన శక్తి ప్రకారం మనం అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే ఎంతో ఎక్కువగా చేయ శక్తి గల దేవునికి, 21 సంఘంలో క్రీస్తు యేసులో తరతరాలకూ నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్‌.

  27. 22 దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచి, సంఘంలోని అన్నిటి మీదా ఆయనను తలగా నియమించాడు. 23 ఈ సంఘం ఆయన శరీరం, అంతటినీ అన్ని విధాలుగా నింపుతున్న ఆయన సంపూర్ణత.

  28. 15 యేసు ద్వారా మనం నిరంతరం దేవునికి స్తుతులు యాగంగా అర్పిస్తూ ఉండాలి. స్తుతులు అంటే మన పెదవుల ద్వారా ఆయన పేరును అంగీకరిస్తూ మనం ఆయనకు అర్పించే ఫలం. 16 ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం.

    17 మీ నాయకులకు విధేయులుగా ఉండండి. వారికి లోబడి ఉండండి. ఎందుకంటే వారు లెక్క అప్పజెప్పే వారిలా మీ ఆత్మల క్షేమం కోసం కావలివారుగా ఉన్నారు. మీ గురించి వారు విచారంతో కాకుండా సంతోషంగా కావలి కాసేవారుగా ఉండడానికి వారికి లోబడండి. వారు విచారంగా ఉండడం మీకు మేలుకరం కాదు.

    18 అన్ని విషయాల్లో యోగ్యంగా జీవించాలనే మంచి మనస్సాక్షి మాకుందని నమ్ముతున్నాం. మా కోసం ప్రార్ధించండి.

  29. 1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు. 2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.

    3 అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు. 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.

    5 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు.

  30. 20 నువ్వు నన్ను పంపావని లోకం నమ్మేలా, తండ్రీ, నాలో నువ్వు, నీలో నేను ఉన్నట్టే, 21 వారు మనలో ఏకమై ఉండాలని వారి కోసం మాత్రమే నేను ప్రార్థన చేయడం లేదు. వారి మాటవల్ల నాలో నమ్మకం ఉంచే వారంతా ఏకమై ఉండాలని వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. 22 మనం ఏకమై ఉన్నట్టే, వారు కూడా ఏకమై ఉండాలని నువ్వు నాకిచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను.

    23 వారిలో నేను, నాలో నువ్వు ఉన్న కారణంగా వారు పరిపూర్ణులుగా ఏకంగా ఉన్న దాన్ని బట్టి, నువ్వు నన్ను పంపావని, నువ్వు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించావని, లోకం తెలుసుకొనేలా నువ్వు నాకు ఇచ్చిన మహిమను వారికి ఇచ్చాను.

    24 “తండ్రీ, నేను ఎక్కడ ఉంటానో, నువ్వు నాకిచ్చిన వారు నాతో కూడా అక్కడ ఉండాలని, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వారు చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే భూమికి పునాది వేయక ముందు నుంచే నువ్వు నన్ను ప్రేమించావు.

    25 నీతిన్యాయాలు గల తండ్రీ, లోకం నిన్ను తెలుసుకోలేదు, కాని నువ్వు నాకు తెలుసు. నువ్వు నన్ను పంపావని వీరికి తెలుసు. 26 నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ వారిలో ఉండాలనీ, నేను వారిలో ఉండాలనీ, నీ నామాన్ని వారికి తెలియజేశాను. ఇంకా తెలియజేస్తాను.”

  31. 17 మీకు ఈ క్రింది ఆజ్ఞనిస్తూ మిమ్మల్నేమీ మెచ్చుకోవడం లేదు. ఎందుకంటే మీరు సమావేశం కావడం ఎక్కువ కీడుకే కారణమౌతున్నది గానీ మేలుకు కాదు. 18 మొదటి సంగతి, మీరు సమావేశమైనప్పుడు మీలో తగాదాలు ఉన్నాయని వింటున్నాను. కొంతమట్టుకు ఇది నిజమే అనిపిస్తుంది. 19 మీలో నిజంగా యోగ్యులు ఎవరో తెలియాలంటే మీలో భిన్నాభిప్రాయాలు ఉండవలసిందే.

    20 మీరంతా సమావేశమై కలిసి తినేది ప్రభు రాత్రి భోజనం కాదు. 21 ఎందుకంటే మీరు ఆ భోజనం తినేటప్పుడు ఒకడికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే తింటున్నాడు. దీనివలన ఒకడు ఆకలితో ఉండగానే ఇంకొకడు బాగా తిని తాగి మత్తులో మునిగిపోతాడు. 22 ఏమిటిది? తిని తాగడానికి మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘాన్ని చిన్నచూపు చూస్తూ లేని వారిని చిన్నచూపు చూస్తూ? మీతో ఏమి చెప్పాలి? మిమ్మల్ని మెచ్చుకోమంటారా? ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోలేను.

    23 నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువే నాకు ఇచ్చాడు. ప్రభు యేసు అప్పగించబడిన రాత్రి, ఆయన ఒక రొట్టె చేత పట్టుకున్నాడు. 24 స్తుతులు చెల్లించిన తరువాత దాన్ని విరిచి, “ఇది మీ కోసమైన నా శరీరం. తీసుకుని తినండి. నా జ్ఞాపకార్థం దీన్ని చేయండి” అని చెప్పాడు. 25 భోజనం చేసిన తరువాత ఆ విధంగానే ఆయన పాత్రను చేత పట్టుకుని, “ఈ పాత్ర నా రక్తం మూలంగా చేసిన కొత్త నిబంధన. మీరు దీన్ని తాగిన ప్రతిసారీ నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అన్నాడు. 26 మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోది తాగిన ప్రతిసారీ ప్రభువు వచ్చేవరకూ ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు.

  32. 14 దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు. 15 ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం. 16 మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు. 17 మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం.

  33. 10 కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.

  34. 25 బర్నబా సౌలును వెదకడానికి తార్సు ఊరు వెళ్ళి, అతనిని వెదికి కనుగొని అంతియొకయ తోడుకుని వచ్చాడు. 26 వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘంతో ఉండి చాలామందికి బోధించారు. అంతియొకయలోని శిష్యులను మొట్టమొదటి సారిగా ‘క్రైస్తవులు’ అన్నారు.

    27 ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ వచ్చారు. 28 వారిలో అగబు అనే ఒకడు నిలబడి, లోకమంతటా తీవ్రమైన కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది. 29 అప్పుడు శిష్యుల్లో ప్రతివారూ తమ శక్తి కొద్దీ యూదయలోని సోదరులకు సహయం పంపడానికి నిశ్చయించుకున్నారు. 30 వారు అలా చేసి, బర్నబా, సౌలుల ద్వారా పెద్దలకు డబ్బు పంపించారు.

  35. 14 అవిశ్వాసులతో మీరు జతగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి? 15 క్రీస్తుకు సాతానుతో ఒప్పందమేమిటి? అవిశ్వాసితో విశ్వాసికి భాగమేమిటి? 16 దేవుని ఆలయానికి విగ్రహాలతో సంబంధం ఏమిటి? మనం జీవం గల దేవుని ఆలయం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు.

    “నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడుగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”

    17 కాబట్టి, “మీరు వారిలో నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు”

    అని ప్రభువు చెబుతున్నాడు.

    18 “నేను మిమ్మల్ని చేర్చుకుంటాను,

    మీకు తండ్రిగా ఉంటాను. మీరు నాకు కొడుకులుగా కూతురులుగా ఉంటారు”

    అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు.

  36. 17 చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా వాక్యోపదేశంలో, బోధలో కష్టపడే వారిని, రెండింతలు గౌరవానికి యోగ్యులుగా పరిగణించాలి. 18 ఇందుకు అనుగుణంగా లేఖనంలో, “కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అనీ, “పనివాడు తన జీతానికి అర్హుడు” అనీ ఉంది.

  37. 1 మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు 2 పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.

    4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.

    6 దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. 7 రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనపరచడానికి ఆయన ఇలా చేశాడు.

    8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  38. 31 కాబట్టి యూదయ, గలిలయ, సమరయ, ప్రాంతాలంతటా సంఘం ప్రశాంతంగా ఉంటూ అభివృద్ది చెందింది. ప్రభువు పట్ల భయం, పరిశుద్ధాత్మ ప్రసాదించే ఆదరణ కలిగి సాగిపోతూ విస్తరించింది.

    32 ఆ తరువాత పేతురు ఆ ప్రాంతమంతా తిరిగి, లుద్ద అనే ఊరులో నివసిస్తున్న దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు.

  39. 10 నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.

    11 “నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. 12 అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు.

    13 “లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు.

    14 ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు. 15 ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది. 16 మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.

  40. 12 నీ యౌవనాన్ని బట్టి ఎవరూ నిన్ను చులకన చేయనియ్యకు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో, విశ్వాసులకు ఆదర్శంగా ఉండు. 13 నేను వచ్చే వరకూ లేఖనాలను బహిరంగంగా చదవడంలో, హెచ్చరించడంలో, బోధించడంలో శ్రద్ధ వహించు. 14 పెద్దలు నీ మీద చేతులుంచినపుడు ప్రవచనం ద్వారా నీవు పొందిన ఆత్మ వరాన్ని నిర్లక్షం చేయవద్దు.

    15 నీ అభివృద్ధి అందరికీ కనబడేలా వీటి మీద మనసు ఉంచి, వీటిని సాధన చెయ్యి.

  41. 13 మీలో ఎవరికైనా కష్టం వస్తే అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడాలి. 14 మీలో ఎవరైనా జబ్బు పడ్డాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి, వారు ప్రభువు నామంలో అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి. 15 విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది. ప్రభువు అతణ్ణి లేపుతాడు, అతడు పాపం చేసి ఉంటే అతనికి పాపక్షమాపణ దొరుకుతుంది.

    16 కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీకు స్వస్థత కలిగేలా ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన ఫలభరితమైనది. అది ఎంతో బలవత్తరమైనది.

  42. 22 అప్పుడు సోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బా అనే పేరున్న యూదానూ సీలనూ ఎన్నుకుని, వారిని పౌలు, బర్నబాలతో అంతియొకయ పంపడం మంచిదని అపొస్తలులకూ పెద్దలకూ సంఘమంతటికీ తోచింది.

    23 వారు ఇలా రాసి పంపారు. “అపొస్తలులూ పెద్దలూ సోదరులూ అయిన మేము అంతియొకయ, సిరియా, కిలికియలోని యూదేతరులైన సోదరులకు, శుభాకాంక్షలతో చెప్పి రాస్తున్నది,

  43. 19 ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. 20 ఆయన అలా చెప్పిన తరువాత వారికి తన పక్కనూ చేతులనూ చూపించాడు. వారు ప్రభువును చూసి ఎంతో సంతోషించారు.

    21 అప్పుడు యేసు తిరిగి, “మీకు శాంతి కలుగు గాక! తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను” అని వారితో చెప్పాడు. 22 ఈ మాట చెప్పిన తరువాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి. 23 మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి” అని చెప్పాడు.

  44. 32 విశ్వసించిన వారంతా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. 33 అపొస్తలులు గొప్ప ప్రభావంతో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్షమిచ్చారు. గొప్ప దైవ కృప అందరినీ ఆవరించింది. 34 భూములూ ఇళ్ళూ ఉన్నవారంతా వాటిని అమ్మేసి, ఆ డబ్బు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. 35 వారు ప్రతివారికీ అవసరం చొప్పున పంచి పెట్టారు కాబట్టి వారిలో ఎవరికీ కొదువ లేకపోయింది.

    36 సైప్రస్ దీవికి చెందిన యోసేపు అనే ఒక లేవీయునికి అపొస్తలులు ‘బర్నబా’ అనే పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం ‘ఆదరణ పుత్రుడు.’ 37 ఇతడు తనకున్న పొలం అమ్మేసి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.

  45. 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. 30 ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.

  46. 16 మనం స్తుతులు చెల్లించే పాత్రలో నుండి తాగడం క్రీస్తు రక్తంలో భాగం పంచుకోవడమే. మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో భాగం పంచుకోవడమే. 17 మనమంతా ఒకే రొట్టెలో భాగం పంచుకొంటున్నాం. రొట్టె ఒక్కటే కాబట్టి దాన్ని తీసుకొనే మనం అనేకులమైనప్పటికీ ఒక్కటే శరీరం అయ్యాం.

  47. 26 సోదరులారా, ఇప్పుడేం జరుగుతున్నది? మీరు సమావేశమైనప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలని, ఇంకొకడు దేవుని మాటలు ఉపదేశించాలని చూస్తున్నాడు, వేరొకడు దేవుడు తనకు బయలు పరచిన దాన్ని ప్రకటించాలని చూస్తున్నాడు. ఒకడు తెలియని భాషతో మాటలాడాలని చూస్తుండగా మరొకడు దానికి అర్థం చెప్పాలని కనిపెడుతున్నాడు. సరే, అంతటినీ సంఘాభివృద్ధి కోసం జరిగించండి.

  48. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

    6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

    దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

    7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

    బానిస రూపం తీసుకున్నాడు.

    మానవుల పోలికలో కనిపించాడు.

    ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

    8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,

    తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

  49. 1 కాబట్టి, పరలోక సంబంధమైన పిలుపులో భాగస్థులూ, పరిశుద్ధులూ అయిన సోదరులారా, మన ఒప్పుకోలుకు అపొస్తలుడూ, ప్రధాన యాజకుడూ అయిన యేసును గూర్చి ఆలోచించండి. 2 దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టే ఈయన కూడా తనను నియమించిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. 3 మోషే కంటే ఎక్కువ కీర్తి యశస్సులకు ఈయన యోగ్యుడిగా లెక్కలోకి వచ్చాడు. ఎందుకంటే నిర్మాణం అయిన ఇంటి కంటే దాన్ని నిర్మించిన వాడికే ఎక్కువ గౌరవం. 4 ప్రతి ఇంటినీ ఎవరో ఒకరు నిర్మిస్తారు. కానీ సమస్తాన్నీ నిర్మించిన వాడు దేవుడే. 5 దేవుడు భవిష్యత్తులో చెప్పే వాటికి సాక్షమివ్వడానికి మోషే ఒక సేవకుడిగా దేవుని ఇంట్లో నమ్మకమైనవాడుగా ఉన్నాడు. 6 కానీ క్రీస్తు కుమారుడి యూదాలో దేవుని ఇంటి నిర్వాహకుడిగా ఉన్నాడు. మనకు కలిగిన ఆత్మనిబ్బరాన్నీ, ఆ నిబ్బరం వల్ల కలిగే అతిశయాన్నీ గట్టిగా పట్టుకుని ఉంటే మనమే ఆయన ఇల్లు.

  50. 8 అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు. 9 ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి. 10 దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి. 11 ఎవరైనా బోధిస్తే, దైవోక్తుల్లా బోధించాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్ధ్యంతో చేయాలి. దేవునికి యేసు క్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మహిమ కలుగుతుంది. మహిమ, ప్రభావం ఎప్పటికీ ఆయనకే చెందుతాయి. ఆమేన్‌.

  51. 15 యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు సర్వ లోకానికీ వెళ్ళి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి. 16 దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు.

    17 “నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి, వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. కొత్త భాషలు మాట్లాడతారు. 18 తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు. విషం తాగినా వారికి ఏ హానీ కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగుపడతారు.”

  52. 23 ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి, వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు.

  53. 1 “మీరూ మీ కొడుకులూ మీ మనుమలూ 2 మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలు, ఆజ్ఞలు అన్నిటినీ మీ జీవితకాలమంతా పాటిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు స్వాధీనం చేసుకోడానికి నది దాటి వెళ్తున్న దేశంలో మీరు పాటించడానికి మీకు బోధించాలని మీ యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన కట్టడలు, విధులు ఇవే.

    3 ఇశ్రాయేలూ, నీ పూర్వీకుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో సుఖశాంతులతో బాగా అభివృద్ధి చెందడానికి నువ్వు వాటిని విని, అనుసరించాలి.

    4 ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు. 5 నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.

    6 ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి.

    7 మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి.

    8 అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి. 9 మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి.

  54. 1 ఆ రోజు నుండి యెరూషలేములోని సంఘానికి తీవ్రమైన హింస మొదలైంది. 2 కాబట్టి, అపొస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ ప్రాంతాల్లోకి చెదరి పోయారు. భక్తిపరులైన మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గూర్చి చాలా దుఖించారు. 3 అయితే సౌలు ప్రతి ఇంట్లోకి చొరబడి, స్త్రీ పురుషులను ఈడ్చుకుపోయి, చెరసాలలో వేస్తూ సంఘాన్ని పాడు చేస్తున్నాడు.

    4 అయినా, చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ వెళుతున్నారు.

    5 ఫిలిప్పు సమరయ ఊరికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు. 6 జనసమూహాలు ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూసి అతడు చెప్పిన మాటల మీద ధ్యాస పెట్టారు. 7 చాలా మందికి పట్టిన దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదలిపోయాయి. చాలామంది పక్షవాతం వచ్చినవారూ, కుంటివారూ బాగుపడ్డారు. 8 అందుకు ఆ పట్టణంలో చాలా ఆనందం కలిగింది.

  55. 5 కానీ పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, యూదేతరులకు సున్నతి చేయించాలనీ, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేలా వారికి ఆజ్ఞాపించాలనీ చెప్పారు.

    6 అప్పుడు అపొస్తలులూ పెద్దలూ ఈ సంగతి గూర్చి ఆలోచించడానికి సమావేశమయ్యారు. చాలా చర్చ జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇలా అన్నాడు.

  56. 37 అప్పుడు మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకుని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. 38 అయితే పౌలు పంఫులియలో పరిచర్యకు తమతో రాకుండా విడిచి వెళ్ళిపోయిన వాణ్ణి వెంటబెట్టుకుని పోవడం భావ్యం కాదని తలంచాడు. 39 ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు. బర్నబా, మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి సైప్రస్ వెళ్ళాడు.

    40 పౌలు సీలను ఎంపిక చేసుకుని, సోదరులు తనను ప్రభువు కృపకు అప్పగించగా బయలుదేరి, 41 సంఘాలను బలపరుస్తూ సిరియా కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశాడు.

  57. 9 మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి. 10 సోదర ప్రేమతో ఒకడిపై ఒకడు అభిమానం చూపిస్తూ, గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి. 11 ఆసక్తి విషయంలో వెనకబడిపోవద్దు, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. 12 ఆశాభావంతో ఎదురు చూస్తూ సంతోషించండి. కష్టాల్లో సహనం చూపుతూ, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. 13 పవిత్రుల అవసరాల్లో సహాయం చేస్తూ, అతిథులను శ్రద్ధగా ఆదరించండి. 14 మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. దీవించండి గానీ శపించవద్దు. 15 సంతోషించే వారితో కలిసి సంతోషించండి. దుఖపడే వారితో కలిసి దుఖపడండి. 16 ఒకరిపట్ల ఒకరు ఏక మనసు కలిగి ఉండండి. గొప్పవాటి గురించి ఆలోచించవద్దు. దీనులతో సహవాసం చెయ్యండి. మిమ్మల్ని మీరు తెలివైన వారని అనుకోవద్దు.

    17 కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టిలో మేలు జరిగించండి. 18 మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి.

    19 ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోవద్దు. దేవుని కోపానికి చోటియ్యండి. “పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది.

    20 “కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు.

    అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది.”

    21 కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి.

  58. 17 సోదరులారా, నేను వేడుకునేదేమంటే, మీరు నేర్చుకొన్న బోధకు వ్యతిరేకంగా విభజనలు, ఆటంకాలు కలిగించే వారిని కనిపెట్టి చూడండి. వారికి దూరంగా తొలగిపొండి.

  59. 2 రాబోయే భవిష్యత్తులో పర్వతాలన్నిటికన్నా యెహోవా మందిర పర్వతం ఉన్నతంగా సుస్థిరమౌతుంది.

    అన్ని కొండల కంటే ఘనత పొందుతుంది.

    జాతులన్నీ దానిలోకి ప్రవాహంలా వస్తారు.

    3 అనేక మంది వచ్చి ఇలా అంటారు.

    “ఆయన మార్గాల్లో మనం నడిచేందుకు,

    ఆయన మనకు తన త్రోవలు నేర్పించేలా,

    యాకోబు దేవుని మందిరం ఉన్న యెహోవా పర్వతానికి ఎక్కి వెళ్దాం రండి.”

    ఎందుకంటే, సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు బయలు వెళ్తుంది.

    4 ఆయన మధ్యవర్తిగా ఉండి అన్యజాతులకు న్యాయం తీరుస్తాడు.

    అనేక జాతులకు తీర్పు తీరుస్తాడు.

    వాళ్ళు తమ కత్తులను నాగటి నక్కులుగానూ,

    తమ ఈటెలను మోట కత్తులుగానూ సాగగొడతారు.

    జనం మీదకి జనం కత్తి ఎత్తరు.

    ఇంక ఎన్నడూ యుద్ధ సన్నాహాలు చెయ్యరు.

  60. 3 క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమంతా ఆయన మరణంలోకి కూడా బాప్తిసం పొందామని మీకు తెలియదా?

    4 తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము. 5 ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం. 6 ఎందుకంటే, మనకు తెలుసు, మనం ఇకమీదట పాపానికి దాసులుగా ఉండకుండాా పాపశరీరం నాశనం అయ్యేలా, మన పాత స్వభావం క్రీస్తుతో కలిసి సిలువ మరణం పాలైంది.

  61. 9 అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతికి పాలుపడే వారూ, విగ్రహాలను పూజించేవారూ, మగ వేశ్యలు, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులూ, విపరీత సంపర్కం జరిపే వారూ, 10 దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    11 గతంలో మీలో కొంతమంది అలాటివారే. అయితే ప్రభు యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మ మిమ్మల్ని కడగడం ద్వారా పవిత్రులై దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు.

  62. 1 కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి. 2 క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.

    3 మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన. 4 కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలిగానీ అసభ్యమైన మాటలు, మూర్ఖపు మాటలు, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలక కూడదు. ఇవి మీకు తగినవి కావు. 5 మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం. 6 పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది. 7 కాబట్టి వారికి దూరంగా ఉండండి. 8 గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి. 9 ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం. 10 కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ, 11 పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి. 12 ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.

  63. 11 మనుషుల చేతులతో చేసినట్టు కాకుండా దేవుడు ఆయనలో మీకు సున్నతి చేశాడు. స్వభావరీత్యా శరీరంలో ఉన్న పాపపు నైజాన్ని తీసివేయడమే క్రీస్తులో మీరు పొందిన సున్నతి.

    12 బాప్తిసంలో మీరు ఆయనతో కూడా సమాధి అయ్యారు. అయితే చనిపోయిన వారిలో నుండి ఆయనను సజీవంగా లేపిన దేవుని శక్తిపై మీకున్న విశ్వాసం వల్ల మీరు కూడా సజీవంగా లేచారు.

  64. 16 కాబట్టి తినే విషయంలోనూ తాగే విషయంలోనూ, పండగ రోజులూ, అమావాస్య, విశ్రాంతి దినం వంటి విషయాల్లోనూ ఎవరూ మిమ్మల్ని విమర్శించకుండా చూసుకోండి. 17 ఇవన్నీ జరగబోతున్న వాటికి నీడల్లాంటివి. వాటి నిజస్వరూపం క్రీస్తులో ఉంది.

    18 ఎవరైనా కపట వినయం ప్రదర్శిస్తూ, దేవదూతల పట్ల భక్తి కనపరుస్తూ మీరు మీ బహుమానం పోగొట్టుకొనేలా చేయకుండా జాగ్రత్త పడండి. అలాటివాడు తాను చూసిన విషయాలను అతిశయోక్తిగా చెప్పుకుంటాడు. వాడు తన శరీర సంబంధమైన ఆలోచన వల్ల కారణం లేకుండానే వాటి విషయంలో గర్విష్టి అవుతాడు.

    19 అలాంటి వాడు శిరస్సుగా ఉన్న క్రీస్తు యేసును అంటి పెట్టుకుని ఉండడు. ఆ శిరస్సు వల్లనే శరీరానికి పోషణ జరుగుతుంది. ఆ శిరస్సు వల్లనే కీళ్లతో, నరాలతో శరీరం ఒక్కటిగా ఉంటుంది. దేవుడు ప్రసాదించే ఎదుగుదలతో శరీరం అభివృద్ధి చెందుతుంది.

  65. 4 అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు 5 మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. 6-7 దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.

  66. 25 కాబట్టి యేసు వారిని పిలిచి, “ఇతర జాతుల్లో అధికారులు ప్రజల మీద పెత్తనం చేస్తారనీ గొప్పవారు వారిమీద అధికారం చెలాయిస్తారనీ మీకు తెలుసు. 26 కానీ మీరు అలా ప్రవర్తించకూడదు. మీలో గొప్పవాడుగా ఉండాలని కోరేవాడు మీకు సేవకుడుగా ఉండాలి. 27 మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి. 28 అలాగే మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోడానికి రాలేదు. ఆయన ఇతరులకి సేవ చేయడానికీ అనేకమంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికీ వచ్చాడు” అని చెప్పాడు.

  67. 5 నేను ద్రాక్ష తీగ, మీరు కొమ్మలు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. 6 ఎవరైనా నాలో ఉండకపోతే, అతడు తీసి పారేసిన కొమ్మలా ఎండిపోతారు. వారు ఆ కొమ్మలను పోగుచేసి మంటలో వేస్తారు. అవి కాలిపోతాయి. 7 మీరు నాలో, నా మాటలు మీలో ఉంటే, ఎలాంటి కోరికైనా అడగండి. అది మీకు జరుగుతుంది. 8 మీరు అధికంగా ఫలించి, నా శిష్యులుగా ఉంటే, నా తండ్రికి మహిమ కలుగుతుంది.

    9 తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమలో నిలకడగా ఉండండి. 10 నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నిలకడగా ఉన్నట్టే, మీరు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలకడగా ఉంటారు. 11 మీలో నా ఆనందం ఉండాలని, మీ ఆనందం పరిపూర్ణం కావాలని, ఈ సంగతులు మీతో మాట్లాడాను.

  68. 19 ఆసియలోని సంఘాల వారు మీకు అభివందనాలు చెబుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల, వారి ఇంట్లో ఉన్న సంఘమూ ప్రభువులో మీకు అనేక అభివందనాలు చెబుతున్నారు. 20 ఇక్కడి సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకుని, మీరు ఒకరికి ఒకరు అభివందనాలు చెప్పుకోండి.

  69. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. 24 క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.

    25 మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం. 26 అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం.

  70. 1 సోదరులారా, ఆత్మసంబంధులైన మనుషులతో మాట్లాడే విధంగా నేను మీతో మాట్లాడ లేకపోయాను. శరీర స్వభావం గలవారితోనూ, క్రీస్తులో పసిబిడ్డలతోనూ మాట్లాడే విధంగా మీతో మాట్లాడవలసి వచ్చింది. 2 మిమ్మల్ని పాలతోనే పెంచాను గాని బలమైన ఆహారం తినిపించలేదు. ఇప్పుడు కూడా మీరు దాన్ని తీసుకునే స్థితిలో లేరు. 3 ఎందుకంటే మీరింకా శరీర స్వభావంతోనే ఉన్నారు. మీ మధ్య అసూయ, కలహం ఉన్నాయి. దాన్ని బట్టి మీరు శరీర స్వభావం కలిగి మానవ రీతిగా నడచుకొనేవారే కదా?

    4 మీలో ఒకడేమో “నేను పౌలుకు చెందినవాణ్ణి,” మరొకడు “నేను అపొల్లోకు చెందిన వాణ్ణి,” అని చెబుతూ ఉంటే మీరు శరీర స్వభావులే కదా 5 అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? ఇద్దరూ పరిచారకులే గదా. ఇద్దరికీ ప్రభువు ఇచ్చిన బాధ్యతలకు అనుగుణంగా వారి ద్వారా మీరు నమ్మారు. 6 నేను నాటాను, అపొల్లో నీరు పోశాడు. అయితే దాన్ని నీరు పోశాడు చేసింది దేవుడే. 7 కాబట్టి పెరిగేలా చేసిన దేవునిలోనే ఉంది గాని, నాటేవాడిలో గాని, నీరు పోసేవాడిలో గాని ఏమీ లేదు. 8 నాటే వాడూ నీరు పోసేవాడూ ఒక్కటే. ఒక్కొక్కరు కష్టపడిన కొద్దీ ప్రతిఫలం పొందుతారు. 9 మేము దేవునితో కలిసి పని చేసే వాళ్ళం. మీరు దేవుని పొలం, దేవుని కట్టడం.

  71. 1 ఎవరైనా సంఘానికి అధ్యక్షుడుగా ఉండాలనుకుంటే అతడు శ్రేష్ఠమైన పనిని కోరుకుంటున్నాడు అనే మాటను నమ్మవచ్చు. 2 కాబట్టి అధ్యక్షుడు నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య ఉన్నవాడూ కోరికలు అదుపులో ఉంచుకునేవాడూ వివేచనాపరుడూ మర్యాదస్థుడూ అతిథి ప్రియుడూ బోధించడానికి సమర్థుడూ అయి ఉండాలి. 3 అతడు తాగుబోతూ జగడాలమారీ కాక మృదుస్వభావి, ధనాశ లేనివాడూ అయి ఉండాలి. 4 తన పిల్లలు తనకు సరైన గౌరవంతో లోబడేలా చేసుకుంటూ తన కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకునేవాడై ఉండాలి.

    5 ఎవడైనా తన కుటుంబాన్నే సరిగా నిర్వహించకపోతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు? 6 అతడు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. ఎందుకంటే అతడు గర్విష్టి అయి అపవాది పొందిన శిక్షనే పొందుతాడేమో. 7 అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండేలా సంఘానికి బయట ఉన్నవారి చేత మంచి పేరు పొందినవాడై ఉండాలి.

  72. 1 పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు. 2 ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది. 3 వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల్లో కొన్ని తినకూడదని వీరు అంటారు.

    4 దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొన్నది ఏదీ నిషేధం కాదు. 5 ఎందుకంటే దేవుని వాక్యమూ ప్రార్థనా దాన్ని పవిత్ర పరుస్తాయి. 6 ఈ సంగతులను సోదరులకు వివరించడం ద్వారా నీవు అనుసరించే విశ్వాస వాక్యాలతో మంచి ఉపదేశంతో ఎదుగుతూ క్రీస్తు యేసుకు మంచి సేవకుడివి అనిపించుకుంటావు.

    7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు వదిలేసి, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో. 8 శరీర సాధనలో కొంత ప్రయోజనం ఉంది. కాని దైవభక్తిలో ప్రస్తుత జీవితానికీ రాబోయే జీవితానికీ కావలసిన వాగ్దానం ఉన్నందున అన్ని విషయాల్లో అది ఉపయోగకరంగా ఉంటుంది.

  73. 8 చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి.

    9 కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.

    10 జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి. 11 అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి. 12 ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది.

  74. 5 దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం. 6 మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. 7 అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.

    8 మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.

    9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు. 10 మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయనను అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.

  75. 9 క్రీస్తు బోధలో నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగే ప్రతివాడూ దేవుడు లేనివాడు. ఈ బోధలో నిలిచి ఉండే వాడికి తండ్రి, కుమారుడు కూడా ఉన్నారు. 10 ఈ ఉపదేశం కాకుండా మరొక ఉపదేశంతో ఎవరైనా మీ దగ్గరికి వస్తే, అతన్ని కుశల ప్రశ్నలు వేయవద్దు. మీ ఇంటికి ఆహ్వానించవద్దు. 11 అతన్ని పలకరించినవాడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడే.

  76. 18 చివరి కాలంలో భక్తిలేని తమ ఆశలననుసరించి నడుచుకొంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని అపొస్తలులు మీతో చెప్పారు. 19 వీరు సహజ సిద్ధంగా దైవాత్మ లేని వారు. ప్రకృతి సంబంధులు, భేదాలు కలిగించేవారు.

    20 కాని ప్రియులారా, అతి పవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ 21 మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి.

  77. 7 “గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది.

    పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది.

    కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం.

    ఆయనకు మహిమ ఆపాదించుదాం.”

    8 ఆమె ధరించుకోడానికి మెరిసిపోయే, పరిశుభ్రమైన శ్రేష్ఠవస్త్రాలు ఇచ్చారు.

    ఈ శ్రేష్ఠవస్త్రాలు పరిశుద్ధుల నీతి కార్యాలు.

    9 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి.” అతడే ఇంకా, “ఇవి నిజంగా దేవుని మాటలు” అన్నాడు.

  78. 31 చూడు, నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో, ఒక కొత్త ఒప్పందం స్థిరం చేసే రోజులు వస్తున్నాయి,” ఇది యెహోవా వాక్కు.

    32 “అది ఐగుప్తులోనుంచి నేను వాళ్ళ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చిన రోజుల్లో వాళ్ళ పితరులతో నేను చేసిన ఒప్పందం లాంటిది కాదు. నేను వాళ్ళకు ఒక భర్తగా ఉన్నా, ఆ రోజుల్లో వాళ్ళు ఆ ఒప్పందం ఉల్లంఘించారు.” ఇది యెహోవా వాక్కు.

    33 “కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు.

    34 “అప్పుడు ప్రతివాడూ తన పొరుగువాడికి, తన సహోదరునికి బోధిస్తూ, ‘యెహోవాను తెలుసుకో!’ అని ఇక చెప్పడు. ఎందుకంటే, వాళ్ళల్లో చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వాళ్ళ దోషాలు క్షమించి, వాళ్ళ పాపాలు ఇంక ఎన్నడూ మనసులో పెట్టుకోను.” ఇది యెహోవా వాక్కు.

  79. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

    18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు. 19 ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. 20 దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు.

    21 అయితే సత్యాన్ని అనుసరించే వాడు తన పనులు మరింత స్పష్టంగా కనిపించడానికీ దేవుని పట్ల విధేయతలో అవి జరిగాయని వెల్లడి చేయడానికీ వెలుగు దగ్గరికి వస్తాడు.”

  80. 4 వారు ఆ పట్టణాల ద్వారా వెళ్తూ, యెరూషలేములో ఉన్న అపొస్తలులూ పెద్దలూ నిర్ణయించిన విధులను పాటించేలా వాటిని వారికి అందజేశారు.

  81. 5 ధర్మశాస్త్ర మూలమైన నీతిని నెరవేర్చేవాడు దాని వల్లనే జీవిస్తాడని మోషే రాస్తున్నాడు. 6 అయితే విశ్వాసమూలమైన నీతి ఇలా చెబుతున్నది, “పరలోకానికి ఎవడు ఎక్కిపోతాడు? (అంటే క్రీస్తును కిందకి తేవడానికి). 7 లేక అగాధంలోకి ఎవడు దిగిపోతాడు? (అంటే క్రీస్తును చనిపోయిన వారిలో నుండి పైకి తేవడానికి) అని నీ హృదయంలో అనుకోవద్దు.”

    8 కానీ ఆ నీతి ఏమి చెబుతున్నదో చూడండి,

    “దేవుని వాక్కు మీకు దగ్గరగా, మీ నోటిలో,

    మీ హృదయంలో ఉంది.”

    మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్కు కూడా ఇదే. 9 అదేమంటే యేసును ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుని, దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడని నీ హృదయంలో నమ్మితే, నీకు రక్షణ కలుగుతుంది. 10 ఎలాగంటే మనిషి నీతి కోసం హృదయంలో నమ్ముతాడు, పాప విమోచన కోసం నోటితో ఒప్పుకుంటాడు. 11 “ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరూ సిగ్గుపడరు” అని దేవుని వాక్కు చెబుతున్నది. 12 ఇందులో యూదులూ, గ్రీకులూ అనే వ్యత్యాసం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఆయన తనకు ప్రార్థన చేసే వారందరికీ కృప చూపగల సంపన్నుడు. 13 ఎందుకంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ పాపవిమోచన కలుగుతుంది. 14 నమ్మని వాడికి వారు ఎలా ప్రార్థన చేస్తారు? తాము వినని వాడిపై ఎలా నమ్మకం పెట్టుకుంటారు? ఆయన్ని గురించి ప్రకటించేవాడు లేకుండా వారెలా వింటారు? 15 ప్రకటించే వారిని పంపకపోతే ఎలా ప్రకటిస్తారు? దీన్ని గురించి, “శ్రేష్ఠమైన వాటిని గురించిన శుభ సమాచారం అందించే వారి పాదాలు ఎంతో అందమైనవి” అని రాసి ఉంది.

  82. 1 విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్న వారిని చేరదీయండి గానీ వారి అనుమానాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు. 2 ఆహార పదార్ధాలు అన్నీ తినవచ్చని ఒకడు నమ్ముతుంటే, ఇంకొకడు నమ్మకం లేక కూరగాయలే తింటున్నాడు. 3 తినేవాడు తినని వాణ్ణి తక్కువగా చూడకూడదు. తినని వాడు తినేవాడిపై నిందారోపణ చేయకూడదు. ఎందుకంటే దేవుడు అతణ్ణి అంగీకరించాడు. 4 వేరొకరి సేవకుని విషయంలో న్యాయం చెప్పడానికి నువ్వెవరివి? అతడు నిలబడినా, పడిపోయినా అది అతని యజమాని బాధ్యత. కాని అతడు నిలబడతాడు. ప్రభువు అతణ్ణి నిలబెట్టడానికి శక్తి గలవాడు.

    5 ఇంకొక చోట ఒకడు ఒక రోజు కంటే మరొక రోజు మంచిదని నమ్ముతున్నాడు. ఇంకొకడు రోజులన్నీ మంచివే అని నమ్ముతున్నాడు. ప్రతివాడూ తనకు తాను ఒక నిర్ణయానికి రావాలి. 6 ప్రత్యేకమైన రోజులను పాటించేవాడు ప్రభువు కోసమే ఆ పని చేస్తున్నాడు. తినేవాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు కాబట్టి ప్రభువు కోసమే తింటున్నాడు. అలాగే తిననివాడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి ప్రభువు కోసమే తినడం మానేస్తున్నాడు.

  83. 17 క్రీస్తు నన్ను బాప్తిసమియ్యడానికి పంపలేదు. ఆయన సిలువ వ్యర్ధం కాకుండేలా, జ్ఞానయుక్తమైన మాటలతో కాక కేవలం సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు.

    18 సిలువ సందేశం, నశించే వారికి వెర్రితనమే గాని రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి.

  84. 1 పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి. 2 నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచి పెట్టాలి.

  85. 5 ఎవరైనా నాకు బాధ కలగజేసి ఉంటే, నాకు మాత్రమే కాదు, కొంతవరకూ మీకందరికీ బాధ కలగజేశాడు (ఇంతకంటే కఠినంగా మాట్లాడడం నాకిష్టం లేదు). 6 అలాంటి వాడికి మీలో ఎక్కువమంది వలన కలిగిన ఈ శిక్ష చాలు. 7 కాబట్టి మీరిక అతణ్ణి శిక్షించకుండా క్షమించి, ఆదరించడం మంచిది. లేకపోతే అతడు అధిక దుఃఖంలో మునిగిపోతాడేమో. 8 అందుచేత అతని పట్ల మీ ప్రేమ స్థిరపరచమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.

  86. 6 “కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు. 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. 8 అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు.

    9 దీని గురించి “అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని లేఖనంలో రాసి ఉంది.

    10 విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు. 11 ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది.

  87. 24 ఇప్పుడు మీ కోసం నేను పడుతున్న హింసల్లో సంతోషిస్తున్నాను. సంఘం అనే తన శరీరం కోసం క్రీస్తు పడిన యాతనల్లో కొదువగా ఉన్న వాటిని నా వంతుగా నా శరీరంలో సంపూర్ణం చేస్తున్నాను. 25 రహస్య సత్యంగా ఉన్న దేవుని వాక్కును సంపూర్ణంగా తెలియజేయడానికి దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ప్రకారం నేను సంఘానికి సేవకుణ్ణి అయ్యాను. 26 ఈ రహస్యం యుగయుగాలుగా తరతరాలుగా మర్మంగా ఉంది కానీ ఇప్పుడు దేవుడు తన పవిత్రులకు దాన్ని తెలియజేశాడు. 27 అన్యజనుల్లో ఈ మర్మం అనే దివ్య సంపదను తెలియజేయాలని దేవుడు తలంచాడు. ఈ మర్మం మీలో ఉన్న యేసు క్రీస్తే. ఆయనే మహిమను గూర్చిన ఆశాభావం.

    28 మేము ప్రకటిస్తున్నది ఈయననే. ప్రతి వ్యక్తినీ క్రీస్తులో పరిపూర్ణుడిగా చేసి దేవుని ముందు నిలబెట్టాలి. ఈ ఉద్దేశంతోనే మేము సమస్త జ్ఞానంతో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నాం బోధిస్తున్నాం. 29 దీని కోసం నేను శ్రమిస్తూ ఉన్నాను. నాలో బలంగా పని చేస్తున్న ఆయన మహత్తర శక్తిని నేను వినియోగించుకుంటూ ప్రయాసపడుతున్నాను.

  88. 16 ఎప్పుడూ సంతోషంగా ఉండండి.

    17 ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.

    18 ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.

  89. 12 ఎందుకంటే దేవుని వాక్కు సజీవమైనది, క్రియాశీలకమైనది, రెండంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండి ప్రాణం నుండి ఆత్మనూ, కీళ్ళ నుండి మూలుగనూ విభజించగలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది హృదయంలోని ఆలోచనలపైనా ఉద్దేశాలపైనా తీర్పు చెప్పగలదు. 13 సృష్టిలో ఆయనకు కనిపించనిది అంటూ ఏదీ లేదు. మనం లెక్క అప్పగించవలసిన దేవుని దృష్టికి అంతా స్పష్టంగా ఉంది.

    14 ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. 16 కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.

  90. 6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. వారికిస్తానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశాన్ని కచ్చితంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు.

    7 అయితే నీవు నిబ్బరంగా, ధైర్యంగా, అతి జాగ్రత్తగా నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతా శ్రద్ధగా పాటించాలి. నీవు వెళ్ళే ప్రతి చోటా విజయం సాధించేలా నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. 8 ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి. దానిలో రాసి ఉన్న వాటన్నిటినీ చేయడానికి నీవు జాగ్రత్త పడేలా రాత్రీ పగలూ దాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. 9 నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”

  91. 16 ఈ కారణం చేత ఆ వాగ్దానం అబ్రాహాము సంతతి వారందరికీ, అంటే ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రాహాముకున్న విశ్వాసం గలవారికి కూడా కృపను బట్టి వర్తించాలని, అది విశ్వాసమూలమైనది అయ్యింది. ఆ అబ్రాహాము మనందరికీ తండ్రి.

  92. 12 సోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతూ ప్రభువులో మీకు నాయకత్వం వహిస్తూ మీకు బుద్ధి చెబుతూ ఉన్నవారిని గౌరవించండి. 13 వారు చేస్తున్న పనిని బట్టి వారిని ప్రేమతో ఎంతో ఘనంగా ఎంచుకోవాలని బతిమాలుతున్నాం. ఒకరితో మరొకరు శాంతి భావనతో ఉండండి.

  93. 1 “ఎఫెసులో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

    తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకుని ఏడు దీపస్తంభాల మధ్య తిరిగేవాడు చెప్పే విషయాలు ఏవంటే, 2 నువ్వు చేస్తున్న పనులూ, నువ్వు పడుతున్న కష్టమూ, నీ ఓర్పూ నాకు తెలుసు. నువ్వు దుర్మార్గులను సహించలేవనీ, అపొస్తలులు కాకుండానే, మేము అపొస్తలులం అని చెప్పుకుంటూ తిరిగే వారిని పరీక్షించి వారు మోసగాళ్ళని పసిగట్టావనీ నాకు తెలుసు. 3 ఎంతో ఓర్పుతో నువ్వు నా నామం కోసం భారం భరిస్తూ అలసి పోలేదనీ నాకు తెలుసు.

    4 అయినా నీ విషయంలో నాకు అభ్యంతరం ఒకటి ఉంది. మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలి వేశావు. 5 కాబట్టి ఎంత ఉన్నత స్థాయి నుండి నువ్వు పడిపోయావో గుర్తు చేసుకో. పశ్చాత్తాపపడి ప్రారంభంలో చేసిన పనులు చెయ్యి. అలా చేసి నువ్వు మారితే సరి. లేకపోతే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని అక్కడ నుండి తీసివేస్తాను. 6 అయితే నీలో ఈ విషయం ఉంది. నికొలాయితులు అనే వారి పనులను నువ్వు అసహ్యించుకుంటున్నావు. ఆ పనులంటే నాకూ అసహ్యమే.

    7 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించేవాణ్ణి దేవుని పరమ నివాసంలో ఉన్న జీవ వృక్ష ఫలాలను తిననిస్తాను.”

  94. 8 “స్ముర్నలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

    మొదటివాడూ చివరివాడూ చనిపోయి తిరిగి బతికిన వాడు చెబుతున్నదేమిటంటే, 9 నువ్వు పడుతున్న హింసలూ, నీ పేదరికమూ నాకు తెలుసు. కానీ నువ్వు ధనవంతుడివే. మేము యూదులమే అని పైకి అంటున్నా నిజానికి సాతాను సమాజానికి చెందినవారు నిన్నెలా దూషణల పాలు చేస్తున్నారో నాకు తెలుసు. 10 నీకు కలగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. విను, మిమ్మల్ని పరీక్షించడానికి సాతాను మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. పది రోజులు హింస ఉంటుంది. చనిపోయేంత వరకూ నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను.

    11 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించే వాడికి రెండవ మరణం ఏ హని చేయలేదు.”

  95. 12 “పెర్గములో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

    రెండు వైపులా పదునున్న కత్తి కలవాడు చెబుతున్న సంగతులు. 13 నీ నివాసం సాతాను సింహాసనం ఉన్న చోట ఉంది అని నాకు తెలుసు. అయినా నా పేరును నువ్వు గట్టిగా పట్టుకున్నావు. సాతాను నివసించే ఆ స్థలంలో నా కోసం సాక్ష్యం చెప్పిన అంతిపా అనే నా విశ్వాసిని చంపిన రోజుల్లో కూడా నువ్వు నీ విశ్వాసాన్ని వదల్లేదు.

    14 అయినా నువ్వు చేస్తున్న కొన్ని తప్పులను నేను ఎత్తి చూపాల్సిందే. అవేవంటే ఇశ్రాయేలీయులు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేలా, వ్యభిచారం చేసేలా వారిని తప్పుదారి పట్టించమని బాలాకుకు నూరిపోసిన బిలాము బోధను ఖచ్చితంగా పాటించేవారు నీలో ఉన్నారు. 15 అలాగే నికొలాయితుల బోధను అనుసరించే వారు కూడా నీలో ఉన్నారు. 16 కాబట్టి పశ్చాత్తాపపడు. లేకపోతే నీ దగ్గరికి త్వరగా వస్తాను. నా నోటి నుండి వెలువడుతున్న కత్తితో వారితో యుద్ధం చేస్తాను.

    17 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట విను గాక. ఎవరైతే జయిస్తారో అతణ్ణి దాచి ఉంచిన మన్నాను తిననిస్తాను. అంతే కాకుండా అతనికి తెల్ల రాయిని ఇస్తాను. ఆ రాతి మీద ఒక కొత్త పేరు రాసి ఉంటుంది. ఆ పేరు పొందిన వాడికే అది తెలుస్తుంది గానీ ఇంకెవరికీ తెలియదు.”

  96. 18 “తుయతైరలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. అగ్నిజ్వాలల్లాటి కళ్ళూ, మెరుస్తున్న కంచు లాంటి పాదాలూ ఉన్న దైవ పుత్రుడు చెప్పే సంగతులు ఏమిటంటే, 19 నీ పనులూ నీ ప్రేమా నీ విశ్వాసమూ నీ సేవా నీ ఓర్పూ అన్నీ నాకు తెలుసు. ప్రారంభంలో నువ్వు చేసిన పనుల కంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు ఎక్కువని నాకు తెలుసు.

    20 అయినా నీ మీద ఒక తప్పు ఎత్తి చూపాలి. అదేమిటంటే ‘నేను ప్రవక్తని’ అని చెప్పుకుంటున్న యెజెబెల్ అనే స్త్రీని నువ్వు సహిస్తున్నావు. ఆమె తన బోధతో నా సేవకులకు వ్యభిచారం చేయడం, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం నేర్పిస్తూ వారిని మోసం చేస్తూ ఉంది. 21 పశ్చాత్తాపపడడానికి నేను ఆమెకు సమయమిచ్చాను. కానీ ఆమె వ్యభిచారం విడిచి పశ్చాత్తాపపడడానికి ఇష్టపడలేదు. 22 ఇదిగో విను, నేను ఆమెను జబ్బుపడి మంచం పట్టేలా చేస్తాను. ఆమెతో వ్యభిచారం చేసిన వారు పశ్చాత్తాప పడాల్సిందే. లేకపోతే వారు తీవ్రమైన హింసలు పడేలా చేస్తాను. 23 ఆమె పిల్లలను కచ్చితంగా చంపుతాను. దాని వల్ల అంతరంగాలనూ హృదయాలనూ పరిశీలించేవాణ్ణి నేనే అని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. మీలో ప్రతి ఒక్కరికీ వారు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాను.

    24 అయితే తుయతైరలో మిగిలినవారు, అంటే ఈ బోధను అంగీకరించకుండా, సాతాను లోతైన విషయాలు అభ్యసించని వారితో ‘ఇక మరే భారమూ మీ మీద పెట్టను’ అని చెబుతున్నాను. 25 నా రాక వరకూ మీకు ఉన్నదాన్నే గట్టిగా పట్టుకోండి. 26 జయిస్తూ, నా పనులను చివరి వరకూ చేసేవాడికి జాతులపై అధికారం ఇస్తాను. 27 అతడు ఇనప దండంతో వారిని పరిపాలిస్తాడు. వారిని మట్టి కుండను పగలగొట్టినట్టు ముక్కలు చెక్కలు చేస్తాడు. 28 తండ్రి నాకు ఇచ్చినట్లుగా నేనూ అతనికి ఉదయతారను కూడా ఇస్తాను.

    29 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”

  97. 1 “సార్దీస్‌లో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

    ఏడు నక్షత్రాలూ దేవుని ఏడు ఆత్మలూ ఉన్నవాడు చెప్పే విషయాలు. నీ పనులు నాకు తెలుసు. బ్రతికి ఉన్నావనే పేరు మాత్రం నీకు ఉంది గానీ నువ్వు చచ్చిన వాడివే. 2 జాగ్రత్త పడు. చావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని బలపరచుకో. ఎందుకంటే నీ పనులు నా దేవుని ముందు నాకు సంపూర్ణంగా కనిపించడం లేదు. 3 కాబట్టి నీవు ఉపదేశం ఎలా పొందావో, ఎలా విన్నావో జ్ఞాపకం చేసుకో. దానినే ఆచరించి పశ్చాత్తాప పడు. నువ్వు మేలుకొనక పోతే, నేను దొంగలా వస్తాను. ఏ సమయంలో వస్తానో నీకు ఎంతమాత్రం తెలియదు.

    4 అయితే సార్దీస్ లో నీ దగ్గర ఉన్నవారిలో కొందరు తమ బట్టలు మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు. కాబట్టి వారు తెల్లటి బట్టలు వేసుకుని నాతో కలసి నడుస్తారు. 5 జయించేవాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలో నుండి అతని పేరును నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతే కాకుండా నా తండ్రి ఎదుటా ఆయన దూతల ఎదుటా అతడి పేరు ఒప్పుకుంటాను.

  98. 7 “ఫిలదెల్ఫియలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

    సత్యం మూర్తీభవించిన వాడూ పరిశుద్ధుడూ దావీదు తాళం చెవులను చేత పట్టుకున్న వాడు; తెరిచాడంటే ఎవరూ మూయలేరు, మూశాడంటే ఎవరూ తీయలేరు, అలాటి ఈయన చెప్పే విషయాలేమిటంటే, 8 నీ పనులు నాకు తెలుసు. చూడు, నీ ఎదుట తలుపు తీసి ఉంచాను. దాన్ని ఎవరూ మూయలేరు. నీ బలం స్వల్పమే అయినా నా వాక్కుకు విధేయత చూపావు. నా నామాన్ని తిరస్కరించలేదు. 9 సాతాను సమాజానికి చెందినవారై ఉండి, మేము యూదులమే అని అబద్ధమాడే వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ కాళ్ళపై పడి నీకు నమస్కారం చేస్తారు. నేను నిన్ను ప్రేమించానని వారికి అర్థం అయ్యేలా చేస్తాను. 10 ఓర్పుతో సహించాలన్న నా ఆదేశానికి నువ్వు కట్టుబడి ఉన్నావు. కాబట్టి భూమిపై నివసించే వారిని పరిశోధించడానికి లోకం మీదికి రాబోయే పరీక్షా కాలంలో నేను నిన్ను కాపాడతాను.

    11 నేను త్వరగా వస్తున్నాను. నీ కిరీటాన్ని ఎవరూ తీసుకోకుండా నీకున్న దాన్ని గట్టిగా పట్టుకో. 12 జయించేవాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. అందులో నుండి అతడు ఇక ఎప్పటికీ బయటకు వెళ్ళడు. నా దేవుని పేరునూ పరలోకంలో నా దేవుని దగ్గర నుండి వస్తున్న నా దేవుని పట్టణమైన కొత్త యెరూషలేము పేరునూ నా కొత్త పేరునూ అతనిపై రాస్తాను. 13 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”

  99. 14 “లవొదికయలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

    ఆమేన్‌ అనే పేరున్న వాడూ నమ్మకమైన సత్యసాక్షీ దేవుని సృష్టికి మూలం అయిన వాడూ చేసే ప్రకటన ఏమిటంటే, 15 నీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వేడిగా కూడా లేవు. నువ్వు చల్లగానో, వేడిగానో ఉంటే మంచిది. 16 నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉండకుండాా గోరువెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మిలా ఊసేద్దామనుకుంటున్నాను. 17 ‘నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది, నాకే లోటూ లేదు’ అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే నీవొక నిర్భాగ్యుడివి, దీనావస్థలో ఉన్నావు, దరిద్రుడివి, గుడ్డివాడివి. బట్టలు లేవు.

    18 నా సలహా విను, నీకు సంపద పెరగడం కోసం కొలిమిలో కరగబెట్టిన బంగారాన్నీ, నీ నగ్నత్వం కనిపించి నీ సిగ్గు పోకుండా ధరించడానికి తెల్లని వస్త్రాలనూ, నీవు చూడగలిగేలా కళ్ళకు మందు నా దగ్గర కొనుక్కో. 19 నేను ప్రేమించేవారిని మందలిస్తాను. శిక్షిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు.

    20 చూడండి, నేను తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాను. ఎవరైనా నా మాట విని తలుపు తీస్తే నేను లోపలికి అతని దగ్గరికి వస్తాను. నేను అతనితో కలసి భోజనం చేస్తాను. అతడూ నాతో కలసి భోజనం చేస్తాడు. 21 నేను విజయం సాధించి నా తండ్రితో కలసి ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టే జయించేవాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోనిస్తాను.

    22 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”