17 Bible Verses About The Lord's Supper
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
26 వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకుని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీన్ని మీరు తీసుకుని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు. 27 తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి. 28 ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం. 29 నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి ఇలాటి ద్రాక్షరసం మళ్ళీ తాగే రోజు వరకూ నేనిక దాన్ని తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు.
-
14 సమయం వచ్చినప్పుడు ఆయనా ఆయనతో కూడా అపొస్తలులూ భోజనానికి కూర్చున్నారు. 15 అప్పుడాయన, “నేను హింస పొందక ముందు మీతో కలిసి ఈ పస్కా విందు ఆరగించాలని ఎంతో ఆశించాను. 16 ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకూ మళ్ళీ దాన్ని తిననని మీతో చెబుతున్నాను.” 17 తరువాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి, “మీరు దీన్ని తీసుకుని పంచుకోండి. 18 ఇక దేవుని రాజ్యం వచ్చే వరకూ నేను ద్రాక్షారసం తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు.
19 ఆ తరవాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి, దాన్ని విరిచి వారికిచ్చి, “ఇది మీ కోసం ధారాదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అని చెప్పాడు. 20 అలాగే భోజనమైన తరువాత ఆయన ఆ పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన.
-
14 కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపొండి. 15 తెలివైన వారితో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పిన విషయాలను మీకై మీరే ఆలోచించి నిర్ణయించుకోండి.
16 మనం స్తుతులు చెల్లించే పాత్రలో నుండి తాగడం క్రీస్తు రక్తంలో భాగం పంచుకోవడమే. మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో భాగం పంచుకోవడమే. 17 మనమంతా ఒకే రొట్టెలో భాగం పంచుకొంటున్నాం. రొట్టె ఒక్కటే కాబట్టి దాన్ని తీసుకొనే మనం అనేకులమైనప్పటికీ ఒక్కటే శరీరం అయ్యాం.
18 ఇశ్రాయేలీయులను చూడండి. బలిపీఠం మీద అర్పించిన వాటిని తినేవారు బలిపీఠంలో పాలిభాగస్తులే కదా? 19 ఈ విషయంలో అభిప్రాయం ఇది. విగ్రహాల్లో గాని, వాటికి అర్పించిన వాటిలో గానీ ఏమైనా ఉన్నదని నేను చెప్పడం లేదు. 20 యూదేతరులు అర్పించే బలులు దేవునికి కాక దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలి భాగస్తులు కావడం నాకిష్టం లేదు. 21 మీరు ప్రభువు పాత్రలోనిదీ, దయ్యాల పాత్రలోనిదీ ఒకేసారి తాగలేరు. ప్రభువు బల్లమీదా, దయ్యాల బల్ల మీదా, ఈ రెంటి మీదా ఉన్నవాటిలో ఒకేసారి భాగం పొందలేరు. 22 ప్రభువుకు రోషం కలిగిస్తామా? మనం ఆయనకంటే బలవంతులమా?
-
22 వారు భోజనం చేస్తూ ఉండగా యేసు రొట్టె తీసుకుని ఆశీర్వదించి, దాన్ని విరిచి వారికిచ్చి, “దీన్ని తీసుకుని తినండి. ఇది నా దేహం” అన్నాడు. 23 తరువాత ఒక పాత్ర తీసుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వారికి ఇచ్చాడు. ఆ పాత్రలోనిది వారందరూ తాగారు. 24 ఆయన వారితో, “ఇది నా రక్తం. అనేకుల కోసం చిందే నిబంధన రక్తం. 25 నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి, కొత్త ద్రాక్షారసం మళ్ళీ తాగే రోజు వరకూ ఇక నేను దాన్ని తాగను అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను” అన్నాడు.
26 అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళారు.
-
42 వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.
43 అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు. 44 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. 45 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. 46 ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ, 47 ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.
-
17 మీకు ఈ క్రింది ఆజ్ఞనిస్తూ మిమ్మల్నేమీ మెచ్చుకోవడం లేదు. ఎందుకంటే మీరు సమావేశం కావడం ఎక్కువ కీడుకే కారణమౌతున్నది గానీ మేలుకు కాదు. 18 మొదటి సంగతి, మీరు సమావేశమైనప్పుడు మీలో తగాదాలు ఉన్నాయని వింటున్నాను. కొంతమట్టుకు ఇది నిజమే అనిపిస్తుంది. 19 మీలో నిజంగా యోగ్యులు ఎవరో తెలియాలంటే మీలో భిన్నాభిప్రాయాలు ఉండవలసిందే.
20 మీరంతా సమావేశమై కలిసి తినేది ప్రభు రాత్రి భోజనం కాదు. 21 ఎందుకంటే మీరు ఆ భోజనం తినేటప్పుడు ఒకడికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే తింటున్నాడు. దీనివలన ఒకడు ఆకలితో ఉండగానే ఇంకొకడు బాగా తిని తాగి మత్తులో మునిగిపోతాడు. 22 ఏమిటిది? తిని తాగడానికి మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘాన్ని చిన్నచూపు చూస్తూ లేని వారిని చిన్నచూపు చూస్తూ? మీతో ఏమి చెప్పాలి? మిమ్మల్ని మెచ్చుకోమంటారా? ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోలేను.
23 నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువే నాకు ఇచ్చాడు. ప్రభు యేసు అప్పగించబడిన రాత్రి, ఆయన ఒక రొట్టె చేత పట్టుకున్నాడు. 24 స్తుతులు చెల్లించిన తరువాత దాన్ని విరిచి, “ఇది మీ కోసమైన నా శరీరం. తీసుకుని తినండి. నా జ్ఞాపకార్థం దీన్ని చేయండి” అని చెప్పాడు. 25 భోజనం చేసిన తరువాత ఆ విధంగానే ఆయన పాత్రను చేత పట్టుకుని, “ఈ పాత్ర నా రక్తం మూలంగా చేసిన కొత్త నిబంధన. మీరు దీన్ని తాగిన ప్రతిసారీ నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అన్నాడు. 26 మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోది తాగిన ప్రతిసారీ ప్రభువు వచ్చేవరకూ ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు.
27 కాబట్టి ఎవరైతే అయోగ్యమైన విధానంలో ప్రభువు రొట్టెను తిని ఆయన పాత్రలోది తాగుతారో వారు ప్రభువు శరీరం, ఆయన రక్తం విషయంలో అపరాధులు అవుతారు. 28 కాబట్టి ప్రతి ఒక్కడూ తనను తాను పరీక్షించుకుని ఆ రొట్టె తిని, ఆ పాత్రలోది తాగాలి. 29 ఎందుకంటే ప్రభువు శరీరం గురించి సరైన అవగాహన లేకుండా దాన్ని తిని, తాగేవాడు తన మీదికి శిక్ష కొని తెచ్చుకుంటున్నాడు. 30 ఈ కారణం చేతనే మీలో చాలామంది నీరసంగా, అనారోగ్యంగా ఉన్నారు. చాలామంది చనిపోయారు కూడా. 31 అయితే మనలను మనం పరిశీలించుకుంటూ ఉంటే మన పైకి తీర్పు రాదు. 32 మనం తీర్పు పొందినా లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ప్రభువు మనలను శిక్షించి సరిదిద్దుతున్నాడు.
33 కాబట్టి నా సోదర సోదరీలారా, మీరు భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఒకడి కోసం ఒకడు వేచి ఉండండి. 34 మీరు ఇలా కలుసుకోవడం మీపై తీర్పు రావడానికి కారణం కాకుండేలా, ఆకలి వేసినవాడు తన ఇంట్లోనే భోజనం చేసి రావాలి. మీరు రాసిన మిగతా సంగతులను నేను మీ దగ్గరకి వచ్చినప్పుడు సరిచేస్తాను.
-
7 ఆదివారం నాడు మేము రొట్టె విరవడానికి సమకూడినప్పుడు పౌలు తరువాతి రోజు వెళ్ళవలసి ఉంది కాబట్టి అతడు వారితో అర్థరాత్రి దాకా విస్తరించి మాట్లాడుతూ ఉండిపోయాడు.
-
53 అప్పుడు యేసు వారితో ఇలా చెప్పాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. మీరు మనుష్య కుమారుడి శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగకపోతే మీలో మీకు జీవం ఉండదు. 54 నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్యజీవం ఉన్నవాడు. అంత్యదినాన నేను అతణ్ణి లేపుతాను. 55 నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం. 56 నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడు నాలో ఉండిపోతాడు. నేను అతనిలో ఉండిపోతాను. 57 సజీవుడైన తండ్రి నన్ను పంపాడు. ఆయన వల్లనే నేను జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవాడు కూడా నా వల్ల జీవిస్తాడు. 58 పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. మీ పూర్వీకులు మన్నాను తిని చనిపోయినట్టుగా కాకుండా ఈ ఆహారాన్ని తినే వాడు కలకాలం జీవిస్తాడు.” 59 ఆయన ఈ మాటలన్నీ కపెర్నహూములోని సమాజ మందిరంలో ఉపదేశిస్తూ చెప్పాడు.
-
47 కచ్చితంగా చెబుతున్నాను. విశ్వసించేవాడు నిత్యజీవం గలవాడు.
48 జీవాహారం నేనే. 49 మీ పూర్వీకులు అరణ్యంలో మన్నాను తిన్నారు. అయినా చనిపోయారు. 50 పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీన్ని తిన్నవాడు చనిపోడు. 51 పరలోకం నుండి దిగి వచ్చిన జీవాన్నిచ్చే ఆహారం నేనే. ఈ ఆహారం ఎవరైనా తింటే వాడు కలకాలం జీవిస్తాడు. లోకానికి జీవాన్నిచ్చే ఈ ఆహారం నా శరీరమే.”
-
9 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి.” అతడే ఇంకా, “ఇవి నిజంగా దేవుని మాటలు” అన్నాడు.
-
23 యేసు జవాబిస్తూ, “ఎవడైనా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట ప్రకారం చేస్తాడు. నా తండ్రి అతణ్ణి ప్రేమిస్తాడు. మేము అతని దగ్గరికి వచ్చి అతనితో నివాసం చేస్తాము.
-
21 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలను పిలిపించాడు. వాళ్ళతో ఇలా చెప్పాడు. “మీరు మీ కుటుంబాల కోసం మందలోనుండి మేకపిల్లను గానీ గొర్రెపిల్లను గానీ తీసుకుని పస్కా బలి అర్పించండి. 22 తరువాత హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి, గుమ్మాల పైకమ్మికీ రెండు నిలువు కమ్ములకూ పూయాలి. మీలో ఎవ్వరూ తెల్లవారే వరకూ మీ ఇళ్ళ గుమ్మాల గుండా బయటకు వెళ్ళకండి. 23 యెహోవా ఐగుప్తీయులను హతమార్చడానికి తిరుగుతూ ఇంటి గుమ్మం పైకమ్మి మీదా రెండు నిలువు కమ్ముల మీదా ఉన్న రక్తాన్ని చూసి ఆ ఇంటిని దాటిపోతాడు. సంహారం చేసే దూతను మీ ఇళ్ళలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని సంహరించడానికి ఆయన అనుమతి ఇయ్యడు.
24 అందుచేత మీరు దీన్ని ఆచరించాలి. ఇది మీకు, మీ సంతతికి శాశ్వతమైన చట్టంగా ఉంటుంది. 25 యెహోవా వాగ్దానం చేసినట్టు ఆయన మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఒక ఆచార క్రియగా పాటించాలి. 26 మీ కొడుకులు ‘మీరు జరిగిస్తున్న ఈ ఆచారం ఎందుకోసం?’ అని మిమ్మల్ని అడిగితే, 27 ‘ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను సంహరించే సమయంలో వారి మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజల ఇళ్ళను దాటి ఐగుప్తులో మనల్ని కాపాడాడు’ అని చెప్పాలి” అన్నాడు. అప్పుడు సమకూడిన ప్రజలంతా అది విని తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు. 28 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విధేయులై యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్టు చేశారు.
-
17 పొంగని రొట్టెల పండగలో మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, “మనం పస్కా భోజనాన్ని ఆచరించడానికి ఏర్పాట్లు ఎక్కడ చేయమంటావు?” అని అడిగారు. 18 అందుకాయన, “మీరు పట్టణంలో ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నా కాలం సమీపించింది. నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కా భోజనం చేస్తాను, అని మా గురువు అంటున్నాడని అతనితో చెప్పండి” అన్నాడు. 19 యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి శిష్యులు పస్కాను సిద్ధం చేశారు.
-
7 మీరు పులిపిండి లేని వారు కాబట్టి తాజా పిండిముద్ద కావడం కోసం పాత పులిపిండిని పారవేయండి. ఎందుకంటే క్రీస్తు అనే మన పస్కా పశువు బలి అర్పణ జరిగింది. 8 కాబట్టి, చెడు నడవడితో, దుష్టత్వంతో కూడిన పాత పులిపిండితో కాక, నిజాయితీ, సత్యం అనే పొంగని రొట్టెతో పండగ జరుపుకుందాం.
-
32 అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “పరలోకం నుండి వచ్చే ఆహారాన్ని మోషే మీకివ్వలేదు. పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారాన్ని నా తండ్రే మీకిస్తున్నాడు. 33 అందుచేత దేవుడిచ్చే ఆహారం ఏమిటంటే, పరలోకంనుంచి దిగివచ్చి లోకానికి జీవం ఇచ్చేవాడే” అని వారితో అన్నాడు.”
-
1 నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్న ప్రకారం మీరూ నాలాగా ఉండండి.
-
8 ప్రజల్లో దోషాలు కనిపించినప్పుడు దేవుడు ఇలా అన్నాడు,
“చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో
నేను కొత్త ఒప్పందాన్ని చేసే రోజులు వస్తున్నాయి.
9 ఐగుప్తు దేశం నుండి వారి పూర్వీకులను చెయ్యి పట్టుకుని
బయటకు రప్పించిన రోజున వారితో నేను చేసిన ఒప్పందం వంటిది కాదిది.
ఎందుకంటే వారు ఆ ఒప్పందంలో కొనసాగలేదు.
నేనూ ఇక వారిమీద మనసు పెట్టడం మానేశాను.”
10 ఇంకా ప్రభువు ఇలా అన్నాడు,
“ఆ రోజులు గడిచాక నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసే ఒప్పందం ఇది.
వారి మనసుల్లో నా శాసనాలు ఉంచుతాను.
అలాగే వారి హృదయాలపై వాటిని రాస్తాను.
నేను వారి దేవుడినై ఉంటాను. వారు నా ప్రజలై ఉంటారు.
11 ‘ప్రభువును తెలుసుకో’ అంటూ వారిలో ఎవడూ తన ఇరుగు పొరుగు వాళ్లకి గానీ
తన సోదరునికి గానీ ఉపదేశం చేయడు.
ఎందుకంటే చిన్నవాడి దగ్గర నుండి గొప్పవాడి వరకూ
అందరూ నన్ను తెలుసుకుంటారు.
12 నేను వారి అవినీతి పనుల విషయమై కరుణ చూపుతాను.
వారి పాపాలను ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను.”
13 ఆయన ‘కొత్త ఒప్పందం’ అని చెప్పడం వల్ల, మొదటి ఒప్పందాన్ని పాతదిగా చేశాడు. దేన్నైతే ఆయన పాతది అని ప్రకటించాడో అది మాసిపోవడానికి సిద్ధంగా ఉంది.
Shows Read in context, Share and Copy.