65 Bible Verses About Music
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.
16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.
17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.
-
18 మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి. 19 కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి. 20 ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.
21 క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి.
-
6 వారు ఫిలిష్తీయులను ఓడించి, తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళల్లో ఉన్న స్త్రీలంతా అమిత ఆనందంగా తంబురలతో, వాయిద్యాలతో పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును ఎదుర్కున్నారు. 7 ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ:
“సౌలు వెయ్యిమందిని,
దావీదు పదివేలమందినీ చంపేశారు.” అని పాడారు.
-
1 యెహోవాను కీర్తించండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో దేవుణ్ణి స్తుతించండి. ఆయన ప్రభావాన్ని గొప్పచేసే ఆకాశవిశాలాల్లో ఆయనను స్తుతించండి.
2 ఆయన బలమైన కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి. ఆయనకున్న గొప్ప బలప్రభావాలను బట్టి ఆయనను స్తుతించండి.
3 బాకాలు ఊదుతూ ఆయనను స్తుతించండి. సితారాతో, శ్రావ్యమైన స్వరాలతో ఆయనను స్తుతించండి.
4 తంబుర వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆయనను స్తుతించండి. తంతివాద్యం మీటుతూ, వేణువు మోగిస్తూ ఆయనను స్తుతించండి.
5 తాళాలు మోగిస్తూ ఆయనను స్తుతించండి. గంభీరమైన ధ్వనులు చేసే తాళాలు వాయిస్తూ ఆయనను స్తుతించండి.
6 ప్రాణం ఉన్న ప్రతి జీవీ యెహోవాను స్తుతిస్తుంది గాక. యెహోవాను కీర్తించండి.
-
4 దేవుని మందసం ఉన్న ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తెస్తున్నప్పుడు అహ్యో బండికి ముందు నడిచాడు. 5 దావీదు, ఇశ్రాయేలీయులంతా దేవదారు చెట్టుకలపతో చేసిన రకరకాల సితారాలు, సన్నాయి వాయిద్యాలు, తంబురలు, మృదంగాలు, పెద్ద డప్పులు వాయిస్తూ యెహోవా సన్నిధిలో నాట్యం చేస్తున్నారు.
-
8 నా కోసం వెండి బంగారాలను, వివిధ దేశాల రాజులకు, సంస్థానాల అధిపతులకు ఉండేటంత సంపదను సమకూర్చుకున్నాను. గాయకులనూ గాయకురాళ్ళనీ, మనుషులు కోరేవాటన్నిటినీ సంపాదించుకుని అనేకమంది స్త్రీలనూ ఉంచుకున్నాను.
-
14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తరువాత యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ అతణ్ణి భయపెట్టి, వేధించడం మొదలుపెట్టింది, 15 సౌలు సేవకులు “దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ నిన్ను భయపెడుతున్నది. 16 నీ సేవకులమైన మాతో చెప్పు, దేవుని దగ్గర నుండి దురాత్మ నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు దాని నుండి ఉపశమనం పొందడానికి తంతివాద్యం చక్కగా వాయించగల ఒకణ్ణి వెదుకుతాం. దురాత్మ వచ్చి నిన్ను వేధించినప్పుడల్లా అతడు తంతివాద్యం వాయించడం వల్ల నువ్వు బాగుపడతావు” అని సౌలుతో అన్నారు.
17 అప్పుడు సౌలు “బాగా వాయించగల ఒకణ్ణి వెతికి నా దగ్గరికి తీసికురండి” అని వారితో చెప్పాడు. 18 వారిలో ఒకడు “బేత్లెహేము వాడైన యెష్షయి కొడుకుల్లో ఒకణ్ణి చూశాను, అతడు చక్కగా వాయించగలడు, అతడు ధైర్యవంతుడు, యుద్ధవీరుడు, మాటకారి, అందగాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కూడా” అని చెప్పాడు. 19 సౌలు యెష్షయి దగ్గరకి తన సేవకులను పంపి “గొర్రెలు కాస్తున్న నీ కొడుకు దావీదును నా దగ్గరకి పంపించు” అని కబురు చేశాడు.
20 అప్పుడు యెష్షయి ఒక గాడిదపై రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తి, ఒక మేకపిల్లను ఉంచి దావీదు ద్వారా సౌలుకు పంపించాడు. 21 దావీదు సౌలు దగ్గరకి వచ్చి అతని ముందు నిలబడినపుడు అతడు సౌలుకు బాగా నచ్చాడు. అతణ్ణి సౌలు ఆయుధాలు మోసే పనిలో పెట్టారు.
22 అప్పుడు సౌలు “దావీదు నాకు బాగా నచ్చాడు కాబట్టి అతణ్ణి నా సముఖంలో నిలిచి ఉండడానికి ఒప్పుకో” అని యెష్షయికి కబురు పంపాడు. 23 దేవుని నుండి దురాత్మ వచ్చి సౌలును వేధించినప్పుడల్లా దావీదు తంతి వాద్యం వాయించేవాడు. అప్పుడు దురాత్మ అతణ్ణి విడిచిపోయేది. అతడు కోలుకుని నెమ్మది పొందేవాడు.
-
11 మద్యం తాగుదామని తెల్లారే లేచి తమకు మంట పుట్టించే దాకా చాలా రాత్రి వరకూ ద్రాక్షారసం తాగే వారికి బాధ.
12 వారు సితారా, స్వరమండలం, తంబుర, సన్నాయి వాయిస్తూ ద్రాక్షారసం తాగుతూ విందు చేస్తారు గానీ యెహోవా పని గురించి ఆలోచించరు.
ఆయన తన చేతితో చేసిన వాటిని లక్ష్యపెట్టరు.
-
4 వాళ్ళు దంతపు మంచాల మీద పడుకుని,
పరుపుల మీద ఆనుకుని కూర్చుంటారు.
మందలోని గొర్రె పిల్లలను, సాలలో కొవ్విన దూడలను కోసుకుని తింటారు.
5 తీగ వాయిద్యాల సంగీతంతో పిచ్చిపాటలు పాడుతూ
దావీదులాగా వాయిద్యాలను మరింత మెరుగ్గా వాయిస్తారు.
6 ద్రాక్షారసంతో పాత్రలు నింపి తాగుతారు.
పరిమళ తైలాలు పూసుకుంటారు కానీ
యోసేపు వంశం వారికి వచ్చే నాశనానికి విచారించరు.
-
25 మునుపు దావీదూ, రాజుకు దీర్ఘ దర్శి అయిన గాదూ, ప్రవక్త అయిన నాతానుల ఆజ్ఞ ప్రకారం హిజ్కియా యెహోవా మందిరంలో తాళాలనూ తీగె వాయిద్యాలనూ సితారాలనూ వాయించడానికి అతడు లేవీయులను ఏర్పాటు చేశాడు. అలా జరగాలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉన్నాడు. 26 దావీదు చేయించిన వాద్యాలను వాయించడానికి లేవీయులను బూరలు ఊదడానికి యాజకులను నియమించారు.
27 బలిపీఠం మీద దహనబలులను అర్పించమని హిజ్కియా ఆజ్ఞాపించాడు. దహనబలి అర్పణ ఆరంభం కాగానే బూరలతో, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యాలతో యెహోవాకు స్తుతిగానం ఆరంభమయింది. 28 సమాజమంతా ఆరాధిస్తూ వుంటే గాయకులు పాటలు పాడారు, బూరలూదారు. దహనబలి అర్పణ ముగిసే వరకూ ఇదంతా జరుగుతూ ఉంది.
29 వారు బలులు అర్పించడం ముగించిన తరువాత రాజు, అతనితో ఉన్న వారంతా తలవంచి ఆరాధించారు. 30 దావీదూ, దీర్ఘ దర్శి ఆసాపూ, రాసిన పాటలు పాడి యెహోవాను స్తుతించమని రాజైన హిజ్కియా, అధికారులూ లేవీయులకు ఆజ్ఞాపిస్తే వారు ఆనందంతో స్తుతి గానం చేసి, తలవంచి ఆరాధించారు.
-
5 ఈ విధంగా వెళ్తూ ఫిలిష్తీయుల దండులో నివాసం ఉండే దేవుని కొండకు చేరతావు. అక్కడ ఊరి దగ్గరకి నువ్వు రాగానే, తంతి వాయిద్యాలు, తంబుర, సన్నాయి, సితారా వాయిస్తున్నవారు, వారి వెనుక ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల గుంపు నీకు కనబడుతుంది. వారు ప్రకటన చేస్తూ వస్తారు.
-
8 ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు ప్రాణులూ, ఇరవై నలుగురు పెద్దలూ ఆ గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగపడ్డారు. ఆ ఇరవై నలుగురు పెద్దల చేతుల్లో తీగ వాయిద్యాలూ ధూపంతో నిండి ఉన్న బంగారు పాత్రలూ ఉన్నాయి. ఆ ధూపం పరిశుద్ధుల ప్రార్థనలు.
9 ఆ పెద్దలు, “ఆ గ్రంథాన్ని తీసుకుని దాని సీలులు తెరవడానికి నువ్వు యోగ్యుడివి. నువ్వు వధ అయ్యావు. ప్రతి వంశం నుండీ, ప్రతి భాష మాట్లాడే వారి నుండీ, ప్రతి జాతి నుండీ, ప్రతి జనం నుండీ నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషులను కొన్నావు. 10 మా దేవుడికి సేవ చేయడానికి వారిని ఒక రాజ్యంగానూ యాజకులుగానూ చేశావు. కాబట్టి వారు భూలోకాన్ని పరిపాలిస్తారు” అంటూ ఒక కొత్త పాట పాడారు.
11 ఇంకా నేను చూస్తూ ఉండగా సింహాసనాన్నీ, ఆ ప్రాణులనూ, పెద్దలనూ చుట్టుకుని ఉన్న గొప్ప దూతల బృంద స్వరం వినిపించింది. వారి సంఖ్య లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఉంది. 12 వారు, “వధ అయిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, యశస్సు, ప్రశంస పొందడానికి యోగ్యుడు” అని పెద్ద స్వరంతో చెబుతూ ఉన్నారు.
13 అప్పుడు పరలోకంలోనూ భూమి పైనా భూమి కిందా సముద్రంలోనూ సృష్టి అయిన ప్రతి ప్రాణీ వాటిలోనిదంతా “సింహాసనంపై కూర్చున్న ఆయనకూ గొర్రెపిల్లకూ ప్రశంసా ఘనతా యశస్సూ పరిపాలించే శక్తి కలకాలం కలుగు గాక!” అనడం నేను విన్నాను.
14 ఆ నాలుగు ప్రాణులూ, “ఆమేన్” అని చెప్పాయి. ఆ పెద్దలు సాగిలపడి పూజించారు.
-
3 అప్పుడు లేవీయులు ముప్ఫై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు ఉన్న వాళ్ళను లెక్కలో చేర్చారు. వాళ్ళ సంఖ్య ముప్ఫై ఎనిమిది వేలు.
4 వాళ్ళల్లో ఇరవై నాలుగు వేలమంది యెహోవా మందిరం పని పర్యవేక్షించే వారుగా, ఆరు వేల మంది అధికారులుగా న్యాయం తీర్చేవారుగా ఉన్నారు. 5 నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమితులయ్యారు. మరో నాలుగు వేలమందిని దావీదు చేయించిన వాయిద్యాలతో యెహోవాను స్తుతించేవాళ్ళుగా నియమించారు.
-
1 నీతిపరులారా, యెహోవాలో ఆనందించండి. న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు స్తుతించడం యుక్తమైనది.
2 వీణలు మోగించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. పది తీగెలున్న వాయిద్యంతో ఆయనకు స్తుతులు పాడండి.
3 ఆయనను గూర్చి ఒక కొత్త పాట పాడండి. నైపుణ్యంతో కమ్మగా వాయిస్తూ సంతోషాతిరేకంతో పాడండి.
4 ఎందుకంటే యెహోవా వాక్కు న్యాయబద్ధమైనది. ఆయన చేసే ప్రతిదీ న్యాయమే.
-
4 ఆ సమయంలో రాజ ప్రతినిధి ఒకడు ఇలా ప్రకటించాడు. “సమస్త ప్రజలారా, దేశస్థులారా, వివిధ భాషలు మాట్లాడేవారలారా, మీకు ఇచ్చే ఆజ్ఞ ఏమిటంటే, 5 బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు మీకు వినబడినప్పుడు మీరంతా రాజైన నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారపు విగ్రహం ఎదుట సాష్టాంగపడి నమస్కరించాలి. 6 అలా సాష్టాంగపడి నమస్కరించని వారిని వెంటనే మండుతున్న అగ్నిగుండంలో పడవేస్తారు.”
7 బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు వినబడ్డాయి. ప్రజలంతా, దేశవాసులు, వివిధ భాషలు మాట్లాడేవాళ్లు సాష్టాంగపడి రాజు నిలబెట్టించిన విగ్రహానికి నమస్కరించారు.
-
19 ఫరో గుర్రాలు, రథాలు, రౌతులు సముద్రంలోకి అడుగుపెట్టగానే యెహోవా వాళ్ళ మీదికి సముద్రపు నీళ్ళు పొంగిపొరలేలా చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచారు. 20 అహరోను సోదరి, ప్రవక్త్రి మిర్యాము తంబుర వాయిస్తూ బయలుదేరింది. స్త్రీలంతా తంబురలు వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆమెను వెంబడించారు. 21 మిర్యాము వాళ్ళతో కలిసి ఈ విధంగా పాడింది.
-
4 అతడు యెహోవా మందసం ముందు సేవ చేస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాను ఘనపరచడానికీ, కృతజ్ఞత చెల్లించడానికీ, ఆయనకు స్తోత్రాలు చెల్లించడానికీ లేవీయుల్లో కొందరిని నియమించాడు.
5 వాళ్ళల్లో అధిపతి అయిన ఆసాపు, అతని తరువాతి వాడు జెకర్యా, యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళు స్వరమండలాలు, తీగ వాద్యాలు వాయించడానికి నిర్ణయంయామకం జరిగింది. ఆసాపు కంచు తాళాలు వాయించేవాడు. 6 బెనాయా, యహజీయేలు అనే యాజకులు ఎప్పుడూ దేవుని నిబంధన మందసం ముందు బాకాలు ఊదడానికి నియామకం అయ్యారు.
7 ఆ రోజు దావీదు మొదటిగా ఆసాపునూ, అతని బంధువులనూ, యెహోవాను స్తుతిస్తూ కృతజ్ఞత అర్పించడానికి ఈ పాట పాడాలని నియమించాడు.
8 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.
ఆయన పేరును ప్రకటన చెయ్యండి.
ఆయన కార్యాలను ప్రజల్లో తెలియజెయ్యండి.
9 ఆయనను గూర్చి పాడండి.
ఆయనను కీర్తించండి.
ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.
-
4 లోకమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయండి. ఉల్లాసంగా పాడండి. పాటలెత్తి ఆనందంగా పాడండి. ప్రస్తుతులు పాడండి.
5 తీగ వాయిద్యంతో యెహోవాకు ప్రశంసలు పాడండి. తీగ వాయిద్యంతో మధురంగా పాడండి.
6 బాకాలతో కొమ్ముబూర ధ్వనితో, రాజైన యెహోవా ఎదుట సంతోషంగా కేకలు వేయండి.
7 సముద్రం, దానిలో ఉన్నదంతా ఘోషిస్తుంది గాక. లోకం, దాని నివాసులు కేకలు వేస్తారు గాక!
8 నదులు చప్పట్లు కొట్టాలి. కొండలు ఆనందంతో కేకలు పెట్టాలి.
9 లోకానికి తీర్పు తీర్చడానికి, నీతితో ప్రపంచ ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి యెహోవా రాబోతున్నాడు.
-
25 మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు. 26 అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి.
-
21 మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు.
మీ ప్రత్యేక సభలంటే నాకేమీ ఇష్టం లేదు.
22 నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా
నేను వాటిని అంగీకరించను.
సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను.
23 మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి.
మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను.
24 నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి.
నీతిని ఎప్పుడూ ప్రవహించేలా చేయండి.
-
1 తరువాత నేను చూస్తూ ఉన్నాను. నాకు ఎదురుగా సీయోను పర్వతంపై గొర్రెపిల్ల నిలబడి ఉండడం నాకు కనిపించింది. ఆయనతో కూడా 1, 44,000 మంది ఉన్నారు. వారందరి నొసళ్ళపై ఆయన పేరూ, ఆయన తండ్రి పేరూ రాసి ఉన్నాయి. 2 అప్పుడు విస్తారజలం పడుతున్నట్టుగా, పెద్ద ఉరుము శబ్దంలా పరలోకం నుండి ఒక శబ్దం రాగా విన్నాను. తీగ వాయిద్యాలు వాయించేవారు వాయిస్తున్న శబ్దం వలే అది ఉంది.
3 వారంతా సింహాసనం ఎదుటా, ఆ నాలుగు ప్రాణుల ఎదుటా, పెద్దల ఎదుటా ఒక కొత్త పాట పాడారు. భూలోకంలో విమోచన జరిగిన 1, 44,000 మంది తప్ప ఇంకెవ్వరూ ఆ పాటను నేర్చుకోలేరు.
-
1 మనం బబులోను నదుల దగ్గర కూర్చుని ఏడుస్తూ సీయోనును జ్ఞాపకం చేసుకున్నాం.
2 అక్కడ ఉన్న నిరవంజి చెట్ల కొమ్మలకు మన తంతివాయిద్యాలు తగిలించాం.
3 మనలను బందీలుగా పట్టుకుని హింసిస్తున్నవాళ్ళు సీయోను కీర్తనల్లో ఒక పాట పాడండి, మేము విని ఆనందిస్తాం అన్నారు.
4 మనం అన్యుల దేశంలో ఉంటూ యెహోవా కీర్తనలు ఎలా పాడగలం?
5 యెరూషలేమా, నేను నిన్ను మరచిపోతే నా కుడి చెయ్యి తన నైపుణ్యాన్ని కోల్పోతుంది గాక.
6 నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకోకపోతే, నాకున్న మహానంద కారణాలకు మించి యెరూషలేమును ప్రాముఖ్యమైనదిగా ఎంచకపోతే నా నాలుక నా అంగిటికి అంటుకుంటుంది గాక.
-
8 కేరింతలు కొట్టే వారి ధ్వని మానిపోయింది. సితారాల ఇంపైన సంగీతం ఆగి పోయింది.
9 మనుషులు పాటలు పాడుతూ ద్రాక్షారసం తాగరు. పానం చేసేవారికి మద్యం చేదైపోయింది.
-
1 అప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఇలా కీర్తించారు. “యెహోవాను గురించి పాడతాను. ఆయన శత్రువు గుర్రాన్నీ, రౌతునూ,
సముద్రంలో ముంచి వేశాడు.
గొప్ప విజయం సాధించాడు.
2 యెహోవాయే నా బలం, నా గానం,
నా రక్షణకర్త. ఆయన నా దేవుడు, ఆయనను స్తుతిస్తాను.
ఆయన నా పూర్వీకుల దేవుడు, ఆయనను ఘనపరుస్తాను.
-
13 మీలో ఎవరికైనా కష్టం వస్తే అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడాలి.
-
1 రండి, యెహోవాకు పాట పాడదాం, మన రక్షణకు ఆధారశిలకు ఆనందంగా పాడదాం.
2 కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వద్దాం, ఆయనకు స్తుతి గీతాలు పాడదాం.
-
30 అప్పుడు యెఫ్తా యెహోవాకు ఇలా మొక్కు కున్నాడు “నువ్వు నాకు అమ్మోనీయుల మీద జయం కచ్చితంగా ఇస్తే, 31 నేను అమ్మోనీయుల దగ్గర నుంచి క్షేమంగా తిరిగి వస్తున్నప్పుడు, నన్ను ఎదుర్కోడానికి నా ఇంటి ద్వారం నుంచి బయలుదేరి ఏది వచ్చినా అది యెహోవాకు ప్రతిష్ట చేస్తాను. ఇంకా దహన బలిగా దాన్ని అర్పిస్తాను” అన్నాడు.
32 అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళగా యెహోవా అతనికి జయం ఇచ్చాడు గనుక అతడు వాళ్ళని, 33 అంటే, అరోయేరు మొదలు మిన్నీతుకు వరకూ ఆబేల్కెరామీము వరకూ ఇరవై పట్టణాల వాళ్ళను ఎవరూ మిగలకుండా హతం చేశాడు. ఆ విధంగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ముందు నిలువలేక వారికి లొంగిపోయారు. 34 యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కూతురు తంబురలతో నాట్యంతో బయలుదేరి అతనికి ఎదురొచ్చింది. ఆమె తప్ప అతనికి మగ సంతానమేగాని ఆడసంతానమేగాని లేదు.
35 కాబట్టి అతడు ఆమెను చూసి, తన బట్టలు చింపుకుని “అయ్యో నా కూతురా, నువ్వు నన్ను ఎంతో క్రుంగదీశావు, నన్ను తల్లడిల్లజేశావు. నేను యెహోవాకు మాట ఇచ్చాను గనుక వెనుక తీయలేను” అన్నాడు.
-
6 కెరూబుల మధ్య నివాసం చేసే దేవుడైన యెహోవా పేరు పెట్టిన ఆయన మందసాన్ని యూదాలో ఉండే కిర్యత్యారీము అనే బాలా నుంచి తీసుకు రావడానికి అతనూ, ఇశ్రాయేలీయులందరూ అక్కడికి వెళ్ళారు.
7 వాళ్ళు దేవుని మందసాన్ని ఒక కొత్త బండి మీద ఎక్కించి, అబీనాదాబు ఇంటి నుంచి తీసుకువచ్చారు. ఉజ్జా, అహ్యో అనే వారు బండిని తోలారు. 8 దావీదూ, ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణశక్తితో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, తీగ వాయిద్యాలు, తంబురాలు, కంచు తాళాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ ఉన్నారు.
-
43 వాళ్ళు తమ భార్యా బిడ్డలతో కలసి దేవుడు తమకు అమితమైన సంతోషం కలిగించినందుకు ఆ రోజు విలువైన హోమాలు అర్పించి ఆనందించారు. యెరూషలేంలో వాళ్ళు చేసిన ఆనంద ధ్వనులు చాలా దూరం వినిపించాయి.
-
ప్రధాన సంగీతకారుని కోసం, గిత్తీతు రాగంతో పాడేది. ఆసాపు కీర్తన.
1 మనకు బలం అయిన దేవునికి బిగ్గరగా పాడండి, యాకోబు దేవునికి ఉత్సాహంగా కేకలు వేయండి.
2 పాట పాడి, కంజరి వాయించండి, మధురంగా తీగ వాయిద్యాలు వాయించండి.
3 అమావాస్య రోజు, మన పండగ మొదలయ్యే పౌర్ణమి రోజు కొమ్ము ఊదండి.
4 అది ఇశ్రాయేలీయులకు చట్టం. యాకోబు దేవుడు నిర్ణయించిన కట్టడ.
-
12 ఈ గంధపు చెక్కతో రాజు యెహోవా మందిరానికి, రాజగృహానికి స్తంభాలూ, గాయకులకు సితారాలూ స్వరమండలాలూ చేయించాడు. ఇప్పుడు అలాంటి గంధం చెక్క దొరకదు. ఎక్కడా కనిపించదు కూడా.
-
2 తరువాత నేను ఒక గాజు సముద్రం లాంటిది చూశాను. దానితో అగ్ని కలసి ఉంది. క్రూర మృగాన్నీ, దాని విగ్రహాన్నీ, దాని పేరునూ సూచించే సంఖ్యనూ జయించిన వారు ఆ గాజు సముద్రం దగ్గర నిలబడి ఉండడం నేను చూశాను. వారి చేతుల్లో దేవుడు ఇచ్చిన తీగ వాయిద్యాలు ఉన్నాయి.
3 వారు దేవుని సేవకుడైన మోషే పాట, గొర్రెపిల్ల పాట పాడుతూ,
“ప్రభువైన దేవా, సర్వపరిపాలకా, నీవి గొప్పకార్యాలు, అద్భుతాలు.
సార్వభౌమా, నీ విధానాలు న్యాయమైనవి, సత్యమైనవి.
4 ప్రభూ, నువ్వు మాత్రమే పరిశుద్ధుడివి, నీకు భయపడనివారెవరు? నీ నామాన్ని కీర్తించనిదెవరు?
నీ న్యాయక్రియలు అందరికీ తెలిశాయి. కాబట్టి అన్ని జాతుల వారూ నీ సన్నిధికి వచ్చి నిన్ను పూజిస్తారు.”
-
27 దావీదు, మందసం మోసే లేవీయులందరూ, సంగీతం నిర్వహించే కెనన్యా సన్నని నారతో నేసిన వస్త్రాలు వేసుకున్నారు. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించాడు. 28 ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటం చేస్తూ కొమ్ములు, బాకాలు ఊదుతూ, కంచు తాళాలు కొడుతూ, స్వరమండలాలు, తీగ వాద్యాలు వాయిస్తూ యెహోవా నిబంధన మందసాన్ని తీసుకు వచ్చారు.
-
12 రాజును పొగుడుతూ పరుగులు పెడుతున్న ప్రజల శబ్దం అతల్యా విని, యెహోవా మందిరంలో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చింది. 13 ప్రవేశ స్థలం దగ్గర అతనికి ఏర్పాటు చేసిన స్తంభం దగ్గర రాజు నిలబడడం ఆమె చూసింది. అధికారులూ, బాకాలు ఊదేవారూ రాజు దగ్గర ఉండి, దేశంలోని ప్రజలంతా సంతోషిస్తూ, బాకాలతో శబ్దాలు చేస్తూ, గాయకులు సంగీత వాద్యాలతో స్తుతిపాటలు పాడుతూ ఉండడం చూసి బట్టలు చించుకుని “రాజ ద్రోహం! రాజద్రోహం!” అని అరిచింది.
-
31 నా స్వరమండలం శోక గీతం వినిపిస్తున్నది. నా వేణువు రోదనశబ్దం ఆలపిస్తున్నది.
-
ప్రధాన సంగీతకారుడి కోసం, శోషన్నిము రాగం పై పాడాలి. కోరహు వారసుల దైవ ధ్యానం. ఒక ప్రేమ గీతం.
1 నా హృదయం ఒక శ్రేష్ఠమైన విషయంతో నిండి పొంగి పొర్లుతున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని బిగ్గరగా చదువుతాను. నా నాలుక వేగంగా రాసేవాడి కలంలా ఉంది.
-
22 నా దేవా, నేను నీ యథార్థ క్రియలను బట్టి స్వరమండల వాయిద్యంతో నిన్ను స్తుతిస్తాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తిస్తాను.
23 నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నప్పుడు నా పెదాలు, నువ్వు విమోచించిన నా ప్రాణం నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేస్తాయి. నాకు హాని కలిగించాలని ప్రయత్నించే వాళ్ళు అవమానం పాలై అయోమయంలో ఉన్నారు.
-
18 తరువాత రాజు తన భవనానికి వెళ్ళాడు. ఆ రాత్రి ఆహారం తీసుకోకుండా వినోద కాలక్షేపాల్లో పాల్గొనకుండా ఉండిపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు.
-
30 అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు.
-
7 నా హృదయం నిశ్చింతగా ఉంది. దేవా, నా హృదయం నిశ్చింతగా ఉంది. నేను పాడతాను, అవును, నేను స్తుతిగానం చేస్తాను.
8 నా ప్రాణమా, మేలుకో. స్వరమండలమా, సితారా, మేలుకోండి. నేను వేకువనే నిద్ర లేస్తాను.
9 ప్రభూ, జాతుల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాను. ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను.
10 ఎందుకంటే, నీ కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉంది, నీ సత్యం మేఘమండలం వరకూ వ్యాపించి ఉంది.
11 దేవా, ఆకాశం కంటే ఉన్నతుడవుగా నిన్ను నీవు కనపరచుకో. నీ ప్రభావం ఈ భూమి అంతటి మీదా ఉన్నతంగా కనిపిస్తుంది గాక.
-
విశ్రాంతి దినం కోసం పాట, ఒక కీర్తన.
1 యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం, మహోన్నతుడా, నీ నామానికి స్తుతి పాడడం మంచిది.
2 ఉదయాన నీ కృపను ప్రతి రాత్రీ నీ విశ్వసనీయతను తెలియజేయడం మంచిది.
3 పది తీగల వాయిద్యంతో, సితారా మాధుర్యంతో స్తుతించడం మంచిది.
-
1 యెహోవాను స్తుతించండి. యెహోవాకు నూతన గీతం పాడండి. భక్తులు సమకూడే ప్రతిచోటా ఆయనకు స్తుతి గీతాలు పాడండి.
2 ఇశ్రాయేలు ప్రజలు తమ సృష్టికర్తను బట్టి సంతోషిస్తారు గాక. సీయోను ప్రజలు తమ రాజును బట్టి ఆనందిస్తారు గాక.
3 వాళ్ళు నాట్యం చేస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తారు గాక. తంబుర, సితారా మోగిస్తూ ఆయనను గూర్చి ఆనంద గీతాలు గానం చేస్తారు గాక.
-
23 అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినపుడు అక్కడ వాయిద్యాలు వాయించే వారినీ గోల చేస్తున్న గుంపునూ చూశాడు. 24 “వెళ్ళిపోండి. ఈ అమ్మాయి చనిపోలేదు. నిద్రపోతూ ఉంది” అన్నాడు. అయితే వారు నవ్వి ఆయనను హేళన చేశారు.
-
8 యెహోషువ ప్రజలకాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు, ఏడు పొట్టేలు కొమ్ము బూరలు యెహోవా సన్నిధిని పట్టుకుని ముందుకు వెళ్తూ, ఆ బూరలు ఊదుతుండగా యెహోవా నిబంధన మందసం కూడా వారి వెంట నడిచింది.
-
6 యాజకులు తమ తమ సేవా స్థలాల్లో నిలిచారు. లేవీయులు “యెహోవా కృప నిత్యమూ నిలుస్తుంది” అంటూ దేవుణ్ణి స్తుతించడానికి దావీదు ఏర్పాటు చేసిన యెహోవా గీతాలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. యాజకులు వారికి ఎదురుగా నిలబడి బూరలు ఊదుతూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలంతా నిలబడి ఉన్నారు.
-
7 కృతజ్ఞతా స్తుతులతో యెహోవాను కీర్తించండి. తంతి వాయిద్యంతో మన దేవునికి స్తుతి గీతాలు పాడండి.
-
12 “నరపుత్రుడా, తూరు రాజును గురించి శోకగీతం ఎత్తి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఒకప్పుడు నువ్వు పరిపూర్ణంగా గొప్ప తెలివితేటలతో అందాల రాశిలా ఉండే వాడివి. 13 దేవుని తోట, ఏదెనులో నువ్వున్నావు! అన్ని రకాల ప్రశస్త రత్నాలు నీకు అలంకాంరంగా ఉండేవి. మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి, కెంపు, సులిమాని రాయి, మరకతం, నీలం, పద్మరాగం, మాణిక్యం, బంగారంలో పొదిగిన ఆభరణాలు నువ్వు అలంకరించుకున్నావు. నిన్ను సృజించిన రోజే అవి నీకు తయారయ్యాయి.
14 అభిషేకం పొందిన కెరూబులా నేను నిన్ను నియమించాను. దేవుని పర్వతం మీద నువ్వున్నావు. నిప్పుకణికల వంటి రాళ్ల మధ్య నువ్వు నడిచేవాడివి. 15 నిన్ను సృష్టించిన రోజునుంచి నీలో పాపం కనిపించే వరకూ నీ ప్రవర్తన లోపం లేకుండా ఉంది.
-
11 నీ ఆడంబరం, నీ తీగ వాయిద్య స్వరం పాతాళానికి పడిపోయాయి. నీ కింద పురుగులు వ్యాపిస్తాయి. క్రిములు నిన్ను కప్పుతాయి.
-
13 నేను నీ సంగీతాలను మాన్పిస్తాను. నీ సితారా నాదం ఇక వినబడదు.
-
26 అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళారు.
-
15 కాబట్టి నేనేం చెయ్యాలి? నా ఆత్మతో ప్రార్ధిస్తాను, మనసుతో కూడా ప్రార్ధిస్తాను. ఆత్మతో పాడతాను, మనసుతో కూడా పాడతాను.
-
1 ఆ రోజు దెబోరా, అబీనోయము కొడుకు బారాకు, ఈ కీర్తన పాడారు,
2 ఇశ్రాయేలులో నాయకులు నాయకత్వం వహించినపుడు
ప్రజలు సంతోషంగా, స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొన్నారు.
మేము యెహోవాను స్తుతిస్తాం!
3 రాజులారా వినండి! అధికారులారా ఆలకించండి!
నేను యెహోవాకు కీర్తన పాడుతాను.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను స్తుతుల కీర్తన పాడుతాను.
-
22 లేవీయులకు అధిపతి అయిన కెనన్యా సంగీతం నిర్వహణలో ప్రవీణుడు గనుక అతడు దాన్ని జరిగించాడు.
-
64 సమకూడిన ప్రజలు మొత్తం 42, 360 మంది అయ్యారు. 65 వీరు కాకుండా వీరి దాసులు, దాసీలు 7, 337 మంది, గాయకులు, గాయనిలు 200 మంది ఉన్నారు.
-
ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. ముత్ లబ్బెన్ రాగం.
1 హృదయ పూర్వకంగా నేను యెహోవాకు ధన్యవాదాలు చెల్లిస్తాను. యెహోవా, నీ ఆశ్చర్య కార్యాలన్నిటి గురించి నేను చెబుతాను.
2 మహోన్నతుడైన యెహోవా! నేను నీ గురించి సంతోషించి హర్షిస్తాను. నీ నామానికి స్తుతి కీర్తన పాడుతాను.
-
లలిత గీతం. దావీదు కీర్తన
1 దేవా, నా హృదయం నిబ్బరంగా ఉంది. నేను పాడుతూ నా ఆత్మతో స్తుతిగానం చేస్తాను.
2 స్వరమండలమా, సితారా, మేలు మేలుకోండి. నేను వేకువనే లేస్తాను.
3 ప్రజలమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను.
4 యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తయినది. నీ సత్యం మేఘాలంత ఎత్తుగా ఉంది.
-
9 దేవా, నిన్ను గురించి నేనొక కొత్త గీతం పాడతాను. పదితంతుల సితారా మోగిస్తూ నిన్ను కీర్తిస్తాను.
-
15 ఒక రాజు జీవిత కాలంలా డెబ్భై సంవత్సరాలు తూరును మర్చిపోవడం జరుగుతుంది. డెబ్భై సంవత్సరాలు ముగిసిన తర్వాత తూరులో ఒక వేశ్యా గీతంలో ఉన్నట్టు జరుగుతుంది.
16 అంతా మర్చిపోయిన వేశ్యా! తంతి వాద్యం తీసుకుని పట్టణంలో తిరుగులాడు.
అందరూ నిన్ను జ్ఞాపకం చేసుకునేలా దాన్ని చక్కగా వాయించు. ఎక్కువ పాటలు పాడు.
-
33 నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను.
34 ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను.
-
10 ఆనంద సంతోషాలు ఫలభరితమైన పొలాల నుంచి అదృశ్యం అవుతాయి. నీ ద్రాక్షల తోటలో సంగీతం వినిపించదు. ఉత్సాహ ధ్వని వినబడదు. గానుగుల్లో ద్రాక్షగెలలను తొక్కేవాడు లేడు. ద్రాక్షల తొట్టి తొక్కేవారి సంతోషభరితమైన కేకలు నేను నిలుపు చేశాను.
-
1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను.
-
4 అలా ఆరు రోజులు చేయాలి. ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని ముందుగా నడవాలి. ఏడవ రోజున మీరు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ యాజకులు బూరలు ఊదాలి. 5 మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూండగా మీరు ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి, అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలిపోతుంది. యోధులు ప్రతి ఒక్కరూ ఎవరి ముందు వారు చక్కగా ఎక్కుతూ దాని మీద దాడి చెయ్యాలి” అన్నాడు.
-
29 దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్నీ బుద్ధినీ అత్యంత వివేచన గల మనస్సునూ దయ చేశాడు. 30 అతనికి కలిగిన జ్ఞానం తూర్పుదేశాల వారి జ్ఞానం కంటే, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటే మించిపోయింది. 31 అతడు మానవులందరి కంటే, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కొడుకులు హేమాను, కల్కోలు, దర్ద అనేవారి కంటే జ్ఞానవంతుడు. కాబట్టి అతని కీర్తి చుట్టూ ఉన్న ప్రజలందరిలో వ్యాపించింది. 32 అతడు 3,000 సామెతలు చెప్పాడు. 1,005 కీర్తనలు రచించాడు.
-
6 సోదరులారా, ఆలోచించండి. నేను మీ దగ్గరికి భాషలతో మాట్లాడుతూ వచ్చాననుకోండి. నా మాటలు మీకు అర్థం కాక, వాటిలో దేవుడు బయలు పరచిన విషయాలను గానీ, జ్ఞానం గానీ, దేవుడు చెప్పమన్న సందేశం గానీ, లేక ఎదైనా ఉపదేశం గానీ లేకుండా ఉంటే నా వలన మీకు ప్రయోజనమేమిటి? 7 నిర్జీవమైన వస్తువులైన వేణువు ఊదినా, వీణ వాయించినా, అవి వేరు వేరు స్వరాలు పలకకపోతే, వాడిన వాయిద్యమేదో ఎలా తెలుస్తుంది? 8 బాకా స్పష్టంగా వినిపించకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు?
-
22 కాబట్టి తీగ వాయిద్యాల శబ్దాలూ, గాయకుల పాటలూ, పిల్లనగ్రోవి, బూరలు ఊదేవారి శబ్దాలూ ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైనా చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. తిరగలి శబ్దం ఇక ఎప్పటికీ నీ దగ్గర వినపడదు.
Shows Read in context, Share and Copy.