68 Bible Verses About Redemption

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Redemption
  1. 13 కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి.

    14 విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు.

    15 మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి.

    16 ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి” అని రాసి ఉంది.

    17 ప్రతి ఒక్కరి పని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు, “తండ్రీ” అని పిలిచే వారైతే భూమిమీద మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి.

    18 మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని వెల ఇచ్చి విమోచించాడు. వెండి బంగారాల లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాదు.

    19 అమూల్యమైన రక్తంతో, అంటే ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తం ఇచ్చి, మిమ్మల్ని విమోచించాడు. 20 విశ్వం ఉనికిలోకి రాక ముందే దేవుడు క్రీస్తుని నియమించాడు. అయితే ఈ చివరి రోజుల్లోనే దేవుడు ఆయన్ని మీకు ప్రత్యక్ష పరిచాడు. 21 ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. దేవుడాయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి మీ విశ్వాసం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి.

  2. 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాల్లో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనలను దీవించాడు. 4 క్రీస్తులో మనలను సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనలను ఎన్నుకున్నాడు. 5 యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా స్వీకరించడానికి దేవుడు తన ప్రేమతో ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.

    6 తన దివ్యకృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దాన్ని తన ప్రియ కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు. 7 దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది. 8 ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు. 9 ఆయన క్రీస్తు ద్వారా తన ఇష్ట పూర్తిగా ప్రదర్శించిన పథకం తాలూకు రహస్య సత్యాన్ని మనకు తెలియజేశాడు.

    10 కాలం సంపూర్ణమైనప్పుడు పరలోకంలోనూ, భూమి మీదా ఉన్న సమస్తాన్నీ క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు.

  3. 21 ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి. 22 అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి. 23 భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. 24 నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. 25 క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. 26 ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.

    27 కాబట్టి మనం గొప్పలు చెప్పుకోడానికి కారణమేది? దాన్ని కొట్టివేయడం అయిపోయింది. ఏ నియమాన్ని బట్టి? క్రియలను బట్టా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టే. 28 కాబట్టి మనుషులు ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వలన నీతిమంతులని తీర్పు పొందుతున్నారని నిర్ణయిస్తున్నాము.

  4. 15 కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన ప్రముఖుడు. 16 ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి. 17 ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి.

    18 సంఘం అనే శరీరానికి ఆయనే తల. సర్వాధికారానికీ మూలకేంద్రం ఆయనే. అన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానం కలిగేటందుకు చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేవడంలో ఆయన ప్రథముడు. 19 ఆయనలో దైవత్వం సర్వసంపూర్ణత నివసించాలనీ, 20 కుమారుడి ద్వారా సమస్తాన్నీ తనతో రాజీ చేసుకోవాలనీ దేవుడు ఇష్టపడ్డాడు. ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న వాటినన్నిటినీ తన కుమారుడు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీ చేసుకోవడం ద్వారా ఆయన ఈ కార్యం చేశాడు.

    21 ఒకప్పుడు మీరు కూడా దేవునికి పరాయివారుగా ఉన్నారు. మీ ఆలోచనల్లోనూ మీరు చేసిన దుష్క్రియల వలనా దేవునికి శత్రువులుగా ఉన్నారు.

    22 అయితే రక్త మాంసాలున్న క్రీస్తు శరీరంలో మరణం వల్ల ఆయన మిమ్మల్ని తనతో రాజీ చేసుకున్నాడు. తన ఎదుట మిమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా నిలబెట్టుకోడానికి ఆయన ఇలా చేశాడు.

  5. 11 చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది. 12-13 మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ భక్తిహీనతనూ, ఈ లోక సంబంధమైన దురాశలనూ వీడి, ఈ యుగంలో నీతితో, భక్తితో జీవించమని అది మనకు నేర్పుతుంది.

    14 ఆయన సమస్తమైన విచ్చలవిడి పనుల నుండి మనలను విమోచించి, మంచి పనులు చేయడంలో ఆసక్తిగల ప్రజలుగా పవిత్రపరచి తన సొత్తుగా చేసుకోడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు.

  6. 11 అయితే క్రీస్తు రాబోయే మంచి విషయాలకు ప్రధాన యాజకుడిగా వచ్చాడు. చేతులతో చేయనిదీ, సృష్టి అయిన ప్రపంచానికి చెందనిదీ, పాత గుడారం కంటే మరింత ఘనమైనదీ, మరింత పరిపూర్ణమైనదీ అయిన గుడారం గుండా వచ్చాడు. 12 మేకల, కోడె దూడల రక్తంతో కాకుండా క్రీస్తు తన సొంత రక్తంతో అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించాడు. తద్వారా శాశ్వతమైన రక్షణ కలిగించాడు.

    13 ఎందుకంటే కేవలం ఎద్దుల రక్తమూ, మేకల రక్తమూ, ఆవు దూడ బూడిదను చల్లడం ఆచారపరంగా అశుద్ధమైన శరీర విషయంలో పవిత్రపరిస్తే 14 ఇక నిత్యమైన ఆత్మ ద్వారా ఎలాంటి కళంకం లేకుండా దేవునికి తనను తాను సమర్పించుకున్న క్రీస్తు రక్తం, సజీవుడైన దేవునికి సేవ చేయడానికి నిర్జీవమైన పనుల నుండి మన మనస్సాక్షిని ఎంతగా శుద్ధి చేయగలదో ఆలోచించండి!

    15 ఈ కారణం చేత ఈ కొత్త ఒప్పందానికి క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. ఇలా ఎందుకంటే, మొదటి ఒప్పందం కింద ఉన్న ప్రజలను వారు చేసిన పాపాలకు కలిగే శిక్ష నుండి విడిపించడానికి ఒకరు చనిపోయారు. కాబట్టి దేవుడు పిలిచిన వారు ఆయన వాగ్దానం చేసిన తమ శాశ్వతమైన వారసత్వాన్ని స్వీకరించడానికి వీలు కలిగింది.

  7. 1 నేను చెప్పేదేమిటంటే, వారసుడు తండ్రి సంపద అంతటికీ యజమాని అయినప్పటికీ పిల్లవాడుగా ఉన్నంతకాలం అతనికీ దాసునికీ ఏ తేడా లేదు. 2 తండ్రి నిర్ణయించిన రోజు వచ్చే వరకూ అతడు సంరక్షకుల, నిర్వాహకుల అధీనంలో ఉంటాడు. 3 అలాగే మనం పిల్లలంగా ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడి దాసులంగా ఉన్నాము.

    4 అయితే సరైన సమయం వచ్చినపుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీకి పుట్టి, 5 మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు.

    6 మీరు కుమారులు కాబట్టి, “అబ్బా! తండ్రీ!” అని పిలిచే తన కుమార ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపాడు. 7 కాబట్టి నీవిక ఏమాత్రం బానిసవి కాదు, కొడుకువే. కొడుకువైతే దేవుని ద్వారా వారసుడివి.

  8. 13 ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించేలా, అబ్రాహాము పొందిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కలగడానికి, క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనలను ధర్మశాస్త్ర శిక్ష నుంచి విమోచించాడు. 14 అందుకే, “మాను మీద వేలాడిన ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది.

  9. 18 మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను. 19 దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. 20 ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి, 21 నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది. 22 ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు. 23 అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం.

  10. 1 అయితే యాకోబూ, నిన్ను పుట్టించిన యెహోవా, ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఇలా చెబుతున్నాడు,

    “నేను నిన్ను విమోచించాను, భయపడకు. నిన్ను పేరుపెట్టి పిలుచుకున్నాను. నువ్వు నా సొత్తు.

    2 నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను.

    నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు.

    నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు

    3 యెహోవా అనే నేను నీకు దేవుణ్ణి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నీ రక్షకుణ్ణి.

    నీ ప్రాణరక్షణ క్రయధనంగా ఐగుప్తును, నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చాను.

    4 నువ్వు నాకు ప్రియుడివి, ప్రశస్తమైనవాడివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

    కాబట్టి నీకు ప్రతిగా జాతులను, నీ ప్రాణానికి బదులుగా జనాలను అప్పగిస్తున్నాను.

  11. 8 ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు ప్రాణులూ, ఇరవై నలుగురు పెద్దలూ ఆ గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగపడ్డారు. ఆ ఇరవై నలుగురు పెద్దల చేతుల్లో తీగ వాయిద్యాలూ ధూపంతో నిండి ఉన్న బంగారు పాత్రలూ ఉన్నాయి. ఆ ధూపం పరిశుద్ధుల ప్రార్థనలు.

    9 ఆ పెద్దలు, “ఆ గ్రంథాన్ని తీసుకుని దాని సీలులు తెరవడానికి నువ్వు యోగ్యుడివి. నువ్వు వధ అయ్యావు. ప్రతి వంశం నుండీ, ప్రతి భాష మాట్లాడే వారి నుండీ, ప్రతి జాతి నుండీ, ప్రతి జనం నుండీ నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషులను కొన్నావు. 10 మా దేవుడికి సేవ చేయడానికి వారిని ఒక రాజ్యంగానూ యాజకులుగానూ చేశావు. కాబట్టి వారు భూలోకాన్ని పరిపాలిస్తారు” అంటూ ఒక కొత్త పాట పాడారు.

    11 ఇంకా నేను చూస్తూ ఉండగా సింహాసనాన్నీ, ఆ ప్రాణులనూ, పెద్దలనూ చుట్టుకుని ఉన్న గొప్ప దూతల బృంద స్వరం వినిపించింది. వారి సంఖ్య లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఉంది. 12 వారు, “వధ అయిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, యశస్సు, ప్రశంస పొందడానికి యోగ్యుడు” అని పెద్ద స్వరంతో చెబుతూ ఉన్నారు.

    13 అప్పుడు పరలోకంలోనూ భూమి పైనా భూమి కిందా సముద్రంలోనూ సృష్టి అయిన ప్రతి ప్రాణీ వాటిలోనిదంతా “సింహాసనంపై కూర్చున్న ఆయనకూ గొర్రెపిల్లకూ ప్రశంసా ఘనతా యశస్సూ పరిపాలించే శక్తి కలకాలం కలుగు గాక!” అనడం నేను విన్నాను.

    14 ఆ నాలుగు ప్రాణులూ, “ఆమేన్‌” అని చెప్పాయి. ఆ పెద్దలు సాగిలపడి పూజించారు.

  12. 24 నీవు కొనుక్కునే ఆస్తి అంతటి విషయంలో విడుదల హక్కును గుర్తించాలి. నీవు ఎవరినుంచి ఆస్తి కొన్నావో ఆ కుటుంబం దాన్ని తిరిగి కొనుక్కునే సదుపాయం కల్పించాలి. 25 నీ సోదరుడు పేదరికం వల్ల తన ఆస్తిలో కొంత అమ్ముకుంటే అతని సమీప బంధువు దాన్ని విడిపించడానికి ఎదుటికి వచ్చి తన సోదరుడు అమ్మినదాన్ని విడిపిస్తాడు.

    26 అయితే ఒకడు సమీప బంధువు లేకపోయినా తన ఆస్తిని విడిపించుకోడానికి కావలసిన డబ్బు తానే సంపాదించుకుంటే 27 దాన్ని అమ్మిన సమయం నుండి గడచిన సంవత్సరాలు లెక్కబెట్టాలి. తన ఆస్తి కొనుక్కున్న వాడికి ఆ డబ్బు ఇచ్చి అతడు తన ఆస్తిని దక్కించుకుంటాడు. 28 అతనికి దాని తిరిగి కొనుక్కునేందుకు కావలసిన డబ్బు దొరక్క పోతే అతడు అమ్మిన ఆస్తి సునాద సంవత్సరం వరకూ కొన్న వాడి స్వాధీనంలో ఉండాలి. సునాద సంవత్సరంలో అది విడుదల అవుతుంది. అప్పుడతడు తన ఆస్తిని తిరిగి పొందుతాడు.

  13. 25 నా విమోచకుడు శాశ్వతంగా ఉండే వాడనీ, అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడనీ నాకు తెలుసు.

    26 ఈ విధంగా నా చర్మం చీకి చీలికలైపోయినా నా శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను.

    27 మరెవరో కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా చూస్తాను. నా లోపలి భాగాలు కృశించిపోయాయి.

  14. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

    18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు.

  15. 7 వాళ్ళలో ఎవడూ తన సోదరుణ్ణి రక్షించుకోలేడు. తన సోదరుడి కోసం ఎవడూ దేవునికి బంధ విముక్తి వెల చెల్లించలేడు.

    8 ఎందుకంటే ఒక వ్యక్తి జీవిత విమోచనకు చాలా వ్యయం అవుతుంది. అది ఎప్పుడైనా ఎంతో వ్యయంతో కూడుకున్నది.

    9 ఎవరూ తన శరీరం కుళ్ళిపోకుండా కలకాలం జీవించరు.

  16. 30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ వద్దు. ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకూ మీపై ఉంటుంది. 31 సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి.

  17. 6 కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. నేనే యెహోవాను. ఐగుప్తీయుల బానిసత్వం కింద ఉన్న మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని ఆ దేశం నుండి బయటకు రప్పిస్తాను. వాళ్లకు గొప్ప తీర్పు క్రియలు చూపి, నా చేతులు చాపి వారి బానిసత్వం కింద ఉన్న మిమ్మల్ని విడిపిస్తాను. 7 మిమ్మల్ని నా సొంత ప్రజగా నా చెంత చేర్చుకుని మీకు దేవుడైన యెహోవాగా ఉంటాను. అప్పుడు ఐగుప్తీయుల బానిసత్వం కింద నుండి మిమ్మల్ని విడిపించి బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. 8 అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇస్తానని నేను చెయ్యి ఎత్తి శపథం చేసిన దేశానికి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ దేశాన్ని మీకు సొంతం చేస్తాను. నేను యెహోవాను.”

  18. 44 తరువాత యెహోవా మోషేకి ఇలా ఆదేశించాడు. 45 “ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన 22, 273 మందిలో ప్రతివాడికి బదులుగా నువ్వు లేవీ జాతి వారిని వారి పశువులకి బదులుగా లేవీ జాతి వారి పశువులను తీసుకో. లేవీ జాతి వారు నా వారుగా ఉంటారు. నేనే యెహోవాను.

    46 ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి పుట్టినవారు లేవీ జాతి వారి కంటే 273 మంది ఎక్కువ అయ్యారు. వారిని విడిపించడం కోసం ఒక్కొక్కరి దగ్గర ఐదేసి తులాల వెండి తీసుకో. 47 పరిశుద్ధ స్థలంలో ప్రమాణమైన తులం బరువులో అది ఉండాలి. ఒక తులం 20 చిన్నాలు. 48 ఎక్కువైన వారిని విడిపించడానికి సేకరించిన ఆ ధనాన్ని అహరోనుకూ అతని కొడుకులకూ ఇవ్వాలి.”

    49 కాబట్టి మోషే లేవీ జాతివారి కంటే ఎక్కువగా ఉన్న వారి దగ్గర ఆ విడుదల సొమ్మును సేకరించాడు. 50 ఇశ్రాయేలు ప్రజల పెద్ద కొడుకుల దగ్గర ఆ సొమ్మును సేకరించాడు. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం ప్రకారం 1, 365 తులాలు సేకరించాడు. 51 మోషే తనకు యెహోవా ఆదేశించినట్లు ఆ విడుదల సొమ్మును అహరోనుకీ అతని కొడుకులకీ ఇచ్చాడు.

  19. 21 యాకోబూ, ఇశ్రాయేలూ, వీటిని గురించి ఆలోచించు. నువ్వు నా సేవకుడివి. నేనే నిన్ను నిర్మించాను.

    ఇశ్రాయేలూ, నువ్వు నాకు సేవకుడివి. నేను నిన్ను మరచిపోను.

    22 మంచు విడిపోయేలా నేను నీ అతిక్రమాలను, మేఘాలు తొలగిపోయేలా నీ పాపాలను తుడిచివేశాను. నేను నిన్ను విమోచించాను. నా దగ్గరికి తిరిగి రా.

    23 యెహోవా ఆ పని పూర్తి చేశాడు. ఆకాశాల్లారా, గీతాలు పాడండి. భూమీ, దాని కింది అగాధ స్థలాలు గొప్ప ధ్వని చేయండి.

    పర్వతాలూ, అరణ్యం, అందులోని ప్రతి వృక్షం, సంగీతనాదం చేయండి.

    యెహోవా యాకోబును విమోచిస్తాడు. ఆయన ఇశ్రాయేలులో తన మహిమను కనపరుస్తాడు.”

  20. 25 కాబట్టి యేసు వారిని పిలిచి, “ఇతర జాతుల్లో అధికారులు ప్రజల మీద పెత్తనం చేస్తారనీ గొప్పవారు వారిమీద అధికారం చెలాయిస్తారనీ మీకు తెలుసు. 26 కానీ మీరు అలా ప్రవర్తించకూడదు. మీలో గొప్పవాడుగా ఉండాలని కోరేవాడు మీకు సేవకుడుగా ఉండాలి. 27 మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి. 28 అలాగే మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోడానికి రాలేదు. ఆయన ఇతరులకి సేవ చేయడానికీ అనేకమంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికీ వచ్చాడు” అని చెప్పాడు.

  21. 28 “ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించీ, మీ మట్టుకు మిమ్మల్ని గురించీ జాగ్రత్తగా ఉండండి.

  22. 1 హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది,

    “నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది.

    యెహోవాలో నాకు ఎంతో బలం కలిగింది.

    నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను.

    నా విరోధుల మీద నేను అతిశయపడతాను.

  23. 11 యెహోవా మీతో మీ పూర్వికులతో వాగ్దానం చేసినట్టు కనాను దేశంలోకి నిన్ను రప్పించిన తరువాత 12 మీకు పుట్టే ప్రతి మొదటి సంతానాన్ని, మీ పశువులకు పుట్టే ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి. పశువులకు, మందలకు కలిగే తొలి మగ సంతానం యెహోవాదే.

    13 ప్రతిష్ఠించినది గాడిద పిల్ల అయితే దాని ఖరీదు చెల్లించి విడిపించి దానికి బదులు గొర్రెపిల్లను ప్రతిష్ఠించాలి. అలా విడిపించలేకపోతే దాని మెడ విరగదీయాలి. మీ కొడుకుల్లో మొదట పుట్టిన వారి నిమిత్తం ఖరీదు చెల్లించి వారిని విడిపించుకోవాలి. 14 ఇకముందు మీ కొడుకులు ‘ఇలా ఎందుకు చెయ్యాలి?’ అని అడిగితే, వాళ్ళతో, ‘ఐగుప్తు బానిసత్వంలో ఉన్న మనలను తన బలమైన హస్తం కింద యెహోవా బయటికి రప్పించాడు. 15 ఫరో మనలను వెళ్ళనివ్వకుండా తన మనస్సును కఠినం చేసుకున్నప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల, పశువుల మొదటి సంతానం అంతటినీ సంహరించాడు. అందుకే నేను ప్రతి తొలిచూలు మగ పిల్లలన్నిటినీ యెహోవాకు బలిగా అర్పిస్తాను. మొదట పుట్టిన నా కొడుకుల కోసం ఖరీదు చెల్లించి విడిపించుకుంటాను’ అని చెప్పాలి. 16 యెహోవా తన బలమైన హస్తం చేత మనలను ఐగుప్తు నుండి బయటికి రప్పించాడు గనుక నీ చెయ్యి మీదా నొసటి మీదా ఆ సంఘటన జ్ఞాపక సూచనగా ఉండాలి.”

  24. 5 దేవుడొక్కడే, దేవునికీ మనిషికీ మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే మానవుడు. 6 ఈయన అందరి కోసం విమోచన వెలగా తనను తానే సమర్పించుకున్నాడు. సరైన సమయంలో దేవుడు దీన్ని ధృవీకరించాడు.

    7 దీన్ని గూర్చి ప్రకటించేవానిగా అపొస్తలునిగా దేవుడు నన్ను నియమించాడు. నిజం చెబుతున్నాను. అబద్ధమాడడం లేదు. నేను యూదులు కాని వారికి విశ్వాస సత్యాలను బోధించేవాణ్ణి.

  25. 6 ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. 7 నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. 8 అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. 9 కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం. 10 ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము. 11 అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి పొందాము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునిలో ఆనందిస్తున్నాం.

  26. 7 యెహోవా జాలిపరుడు. ఇశ్రాయేలూ, యెహోవా మీద ఆశలు నిలుపుకో. ఆయన క్షమించడానికి ఇష్టపడే వాడు.

    8 ఇశ్రాయేలువారి పాపాలన్నిటి నుండి విముక్తి కలిగించేది ఆయనే.

  27. 45 ఎందుకంటే మనుష్య కుమారుడు సేవ చేయించుకోడానికి రాలేదు, సేవ చేయడానికీ, అందరి పక్షాన తన ప్రాణాన్ని వెలగా ధార పోయడానికి వచ్చాడు.”

  28. 25 “ఇంకా సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలు కలుగుతాయి. సముద్రం, దాని అలల హోరు శబ్దానికి భూమి మీద ప్రజలు భయకంపితులై యాతన పడతారు. 26 ఆకాశంలోని శక్తులు కదిలిపోతాయి. కాబట్టి లోకం పైకి రాబోయే వాటిని గురించిన భయం ప్రజలకి కలుగుతుంది. వారు గుండెలవిసి పోయి కూలిపోతారు. 27 అప్పుడు మనుష్య కుమారుడు బల ప్రభావంతో, గొప్ప యశస్సు కలిగి మేఘాలపై రావడం చూస్తారు. 28 ఇవి జరగడం ఆరంభమైనప్పుడు ధైర్యం తెచ్చుకోండి. తలలు పైకెత్తి చూడండి. మీ విముక్తి దగ్గరవుతూ ఉంటుంది” అన్నాడు.

  29. 68 “ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందు గాక.

    ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగించాడు.

    69 తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు.

    70-73 మన శత్రువులబారి నుండీ మనలను ద్వేషించే వారందరి చేతినుండీ తప్పించి రక్షణ నిచ్చాడు.

    దీన్ని గురించి ఆయన ఆదినుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు.

    ఆయన మన పూర్వీకులను కరుణించడానికీ తన పవిత్ర ఒడంబడికను,

    అంటే మన తండ్రి అయిన అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికీ ఈ విధంగా జరిగించాడు.

    74-75 మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది,

    పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో,

    పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ,

    భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే,

    మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం.

  30. 22 ప్రభువు పిలిచిన బానిస ప్రభువు వలన స్వతంత్రుడు. అదే విధంగా స్వతంత్రుడుగా ఉండి పిలుపు పొందిన వాడు క్రీస్తుకు బానిస. 23 ప్రభువు మిమ్మల్ని వెల చెల్లించి కొన్నాడు కాబట్టి మనుషులకు దాసులు కావద్దు.

  31. 3 వారంతా సింహాసనం ఎదుటా, ఆ నాలుగు ప్రాణుల ఎదుటా, పెద్దల ఎదుటా ఒక కొత్త పాట పాడారు. భూలోకంలో విమోచన జరిగిన 1, 44,000 మంది తప్ప ఇంకెవ్వరూ ఆ పాటను నేర్చుకోలేరు. 4 వీళ్ళు స్త్రీతో లైంగిక సంబంధం మూలంగా తమను అశుద్ధం చేసుకోని వారు. లైంగికంగా తమను పవిత్రంగా ఉంచుకొన్న వారు. వీళ్ళు గొర్రెపిల్ల వెళ్ళిన చోటికల్లా వెళ్తూ ఆయనను అనుసరిస్తూ ఉంటారు. మానవాళిలో నుండి దేవుని కోసమూ, గొర్రెపిల్ల కోసమూ ప్రథమ ఫలాలుగా విమోచన జరిగిన వారు.

  32. పంచమ పరిచ్ఛేదము

    1 యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యం ఉంటుంది.

    2 యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుతారు గాక. విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించిన వారూ,

    3 తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నానాదేశాల నుండి ఆయన పోగు చేసినవారూ ఆ మాట పలుకుతారు గాక.

  33. 9 ఆయన తన ప్రజలకు విమోచన కలగజేసేవాడు. తన నిబంధన ఆయన శాశ్వతంగా ఉండాలని ఆదేశించాడు. ఆయన నామం పవిత్రం, పూజ్యం.

  34. 2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు.

    3 ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు.

    4 నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు.

    5 నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.

  35. 15 అలాగైతే, మనం కృప కిందే గాని ధర్మశాస్త్రం కింద లేము కాబట్టి పాపం చేద్దామా? అలా ఎన్నటికీ చేయకూడదు. 16 మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా? 17 దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు. 18 తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు.

  36. 5 నా ఆత్మను నీ చేతికప్పగిస్తున్నాను. యెహోవా, నమ్మదగిన దేవా, నువ్వు నన్ను విమోచిస్తావు.

  37. 15 అయితే దేవుడు నా ప్రాణాన్ని పాతాళం శక్తి నుండి కాపాడతాడు. ఆయన నన్ను స్వీకరిస్తాడు.

  38. 57 నేను నీకు మొర్ర పెట్టిన రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో “భయపడవద్దు” అని చెప్పావు.

    58 ప్రభూ, నువ్వు నా జీవితపు వివాదాల విషయంలో వాదించి నా జీవాన్ని విమోచించావు.

  39. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.

    4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.

    6 దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. 7 రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనపరచడానికి ఆయన ఇలా చేశాడు.

    8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  40. 3 తరువాత అతడు “మోయాబు దేశంనుండి తిరిగి వచ్చిన నయోమి మన సోదరుడైన ఎలీమెలెకు భార్య. ఆమె తన భర్తకు చెందిన భూమిని అమ్మివేస్తోంది. కాబట్టి నువ్వు శ్రద్ధగా వినాలని నేను ఒక విషయం చెబుతున్నాను. 4 ఈ ఊరి పెద్దల సమక్షంలో, నా కుటుంబ పెద్దల సాక్షిగా నువ్వు ఆ భూమిని విడిపించుకో. ఒకవేళ విడిపించడానికి నువ్వు సిద్ధపడితే నాకు స్పష్టంగా చెప్పు. దాన్ని నువ్వు విడిపించుకోలేకపోతే అది కూడా స్పష్టంగా చెప్పు. నువ్వు కాకపోతే దాన్ని విడిపించే దగ్గర బంధువు వేరే ఎవరూ లేరు. నీ తరువాత దగ్గర బంధువుని నేనే” అని అతనితో చెప్పాడు. అందుకతడు “నేను విడిపిస్తాను” అన్నాడు.

    5 అప్పుడు బోయజు “నువ్వు నయోమి దగ్గర నుండి ఆ భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ భూమితో పాటుగా చనిపోయిన వాడి భార్యను, మోయాబుకు చెందిన రూతును కూడా స్వీకరించాలి. చనిపోయిన వాడి ఆస్తిపై అతని పేరు నిలబెట్టాలంటే ఇదే మార్గం” అన్నాడు. 6 దానికి ఆ బంధువు “నేను దాన్ని విడిపిస్తే నా సొంత వారసత్వం పాడవుతుంది. కాబట్టి దాన్ని విడిపించే ఆ హక్కు నువ్వే తీసుకో. ఎందుకంటే నేను ఆ భూమిని విడిపించుకోలేను” అన్నాడు.

  41. 14 అయినా పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచిస్తానా?

    మృత్యువు నుండి వారిని రక్షిస్తానా?

    ఓ మరణమా, నీవు తెచ్చే బాధలు ఎక్కడ? వాటిని ఇటు తీసుకురా.

    పాతాళమా, నీ నాశనం ఏది? దాన్ని ఇటు తీసుకురా.

    నాకు కనికరం పుట్టదు.

  42. 38 ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, యెరూషలేము విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ బిడ్డను గురించి మాట్లాడుతూ ఉంది.

  43. 9 చీకటిలో నుంచి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికైన వంశంగా రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజగా ఉన్నారు.

  44. 19 జంతువుల్లో మొదట పుట్టిన ప్రతి పిల్ల నాది. నీ పశువుల్లో మొదటిగా పుట్టిన ప్రతి మగది, అది దూడ గానీ, గొర్రెపిల్ల గానీ అది నాకు చెందుతుంది. 20 గాడిదను విడిపించాలంటే దానికి బదులు గొర్రెపిల్లను అర్పించాలి. గాడిదను విమోచించకపోతే దాని మెడ విరగగొట్టాలి. మీ సంతానంలో పెద్ద కొడుకుని వెల చెల్లించి విడిపించాలి. నా సన్నిధానంలో ఒక్కడు కూడా ఖాళీ చేతులతో కనిపించకూడదు.

  45. 23 నువ్వు విమోచించిన ఇశ్రాయేలీయులనే నీ ప్రజలవంటి వారు లోకంలో ఎక్కడా లేరు. నీ ప్రజలయ్యేలా వారిని నీవు విమోచించావు. నీకు పేరు ప్రఖ్యాతులు కలిగేలా, నీ ప్రజలను బట్టి నీ దేశం కోసం భీకరమైన గొప్పకార్యాలు చేసేలా దేవుడవైన నువ్వు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవుళ్ళ వశంలో నుండి విడిపించావు.

    24 యెహోవావైన నీవు వారికి దేవుడై ఉండి, వారు నిరంతరం ఇశ్రాయేలీయులు అనే పేరుగల ప్రజలుగా నీ కోసం నిలిచి ఉండేలా స్థిరపరచావు.

  46. 15 నీ గొప్ప బలంతో నీ ప్రజలకు-యాకోబు యోసేపుల సంతతికి విజయాన్నిచ్చావు. సెలా

  47. 3 యెహోవా ఇలా చెబుతున్నాడు “మిమ్మల్ని ఉచితంగా అమ్మేశారు గదా! ఉచితంగానే మీకు విమోచన వస్తుంది.”

  48. 11 కాని నా వరకైతే నేను నిజాయితీగా నడుచుకుంటాను. నన్ను విమోచించి నన్ను కరుణించు.

  49. 9 ఆయన ఎర్రసముద్రాన్ని గద్దించగా అది ఆరిపోయింది. మైదానం మీద నడిచినట్టు ఆయన వారిని అగాధజలాల్లో నడిపించాడు.

    10 పగవారి చేతిలోనుండి వారిని రక్షించాడు. శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించాడు.

    11 నీళ్లు వారి శత్రువులను ముంచివేశాయి. వారిలో ఒక్కడైనా మిగల్లేదు.

  50. 7 మనుషుల తృణీకారానికీ రాజ్యాల ద్వేషానికీ గురై పరిపాలకులకు బానిసగా ఉన్నవానితో,

    ఇశ్రాయేలు విమోచకుడు, పరిశుద్ధుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు,

    “యెహోవా నమ్మకమైనవాడనీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనీ

    రాజులు తెలుసుకుని నిలబడతారు. అధికారులు నీ ఎదుట వంగుతారు.”

  51. 9 వారి బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు.

    ఆయన ప్రేమతో, కనికరంతో వారిని రక్షించాడు.

    పురాతన దినాలన్నిటిలో ఆయన వారిని ఎత్తుకుంటూ మోస్తూ వచ్చాడు.

  52. 1 నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. 2 మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం.

  53. 11 పూజింపదగ్గ వాళ్ళలో యెహోవాలాంటివాడు ఎవడు? పవిత్రత వైభవంలో నీ వంటి వాడెవడు? స్తుతికీర్తనలతో ఘనపరచదగిన వాడు, అద్భుతాలు చేసే నీవంటి వాడెవడు?

    12 నీ కుడి చెయ్యి చాపినప్పుడు వాళ్ళను భూమి మింగివేసింది.

    13 నీ కనికరం వల్ల ఈ ప్రజలను విడిపించి నీ శక్తి ద్వారా నీ సన్నిధికి తీసుకువచ్చావు.

  54. 7 అంతేగానీ మీరు ఇతర జాతులకంటే విస్తారమైన ప్రజలని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు. ఇతర జాతుల ప్రజలకంటే సంఖ్యలో మీరు తక్కువే గదా. 8 అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన మీ పూర్వీకులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కనుక తన బాహుబలంతో మిమ్మల్ని బానిసత్వం నుండీ ఐగుప్తు రాజు ఫరో చేతి నుండి విడిపించాడు.

  55. 22 దేవా, తన బాధలన్నిటిలో నుంచి ఇశ్రాయేలును రక్షించు.

  56. 11 యెహోవా విమోచించినవారు సంగీతనాదంతో సీయోనుకు తిరిగి వస్తారు.

    వారి తలలమీద ఎప్పటికీ నిలిచే సంతోషం ఉంటుంది. సంతోషానందాలు వారికి నిండుగా ఉంటాయి. దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోతాయి.

  57. 21 నేను నిన్ను దుర్మార్గుల చేతిలోనుంచి విడిపిస్తాను. నిరంకుశుల బారినుంచి నిన్ను విమోచిస్తాను.”

  58. 11 ఎందుకంటే, మూల్యం చెల్లించి, తనకు మించిన బలం ఉన్న వాడి చేతిలోనుంచి యెహోవా యాకోబును విమోచించాడు.

  59. 20 నేను క్రీస్తుతోబాటు సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను సమర్పించుకున్న దేవుని కుమారుడి మీద విశ్వాసం వల్లనే.

  60. 9 అతడు, “ఎవరు నువ్వు?” అని అడిగాడు. ఆమె “నేను రూతు అనే నీ దాసిని. నువ్వు నన్ను విడిపించగల సమీప బంధువువి. నాపై నీ కొంగు కప్పు” అంది.

  61. 21 నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాంటి జాతి భూలోకంలో ఏది? ఐగుప్తులోనుంచి నువ్వు విమోచించిన నీ ప్రజల ముందు నిలబడనివ్వకుండా నువ్వు అనేక జాతులను తోలివేసినందువల్ల మహా భీకరమైన పేరు తెచ్చుకొన్నావు. వాళ్ళు నీ సొంత ప్రజలయ్యేలా వాళ్ళను విమోచించడానికి దేవుడవైన నువ్వు బయలుదేరావు.

    22 నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నిత్యం నీకు ప్రజలయ్యేలా నువ్వు ఆ విధంగా చేశావు. యెహోవావైన నువ్వు వాళ్లకు దేవుడివయ్యావు.

  62. 26 మాకు సహాయం చేయడానికి లే. నీ నిబంధన కృపను బట్టి మమ్మల్ని విమోచించు.

  63. 17 నీ సేవకుడి నుండి నీ ముఖం తిప్పుకోకు. నేను నిస్పృహలో ఉన్నాను, నాకు త్వరగా జవాబివ్వు.

    18 నా దగ్గరికి వచ్చి నన్ను విమోచించు. నా శత్రువులను చూసి నన్ను విడిపించు.

  64. 23 నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నప్పుడు నా పెదాలు, నువ్వు విమోచించిన నా ప్రాణం నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేస్తాయి. నాకు హాని కలిగించాలని ప్రయత్నించే వాళ్ళు అవమానం పాలై అయోమయంలో ఉన్నారు.

  65. 34 ఆయన వారిని బాధలకు గురి చేసినప్పుడల్లా వారు ఆయన వైపు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకున్నారు.

    35 దేవుడు తమ ఆశ్రయదుర్గమనీ మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనీ వారు జ్ఞాపకం చేసుకున్నారు.

  66. 5 నిన్ను సృష్టించినవాడు నీకు భర్త. ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా.

    ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. లోమంతటికీ దేవుడు అని ఆయన్ని పిలుస్తారు.

    6 భర్త వదిలి వేయగా ఎంతో విచారంతో ఉన్న భార్యను భర్త తిరిగి రప్పించినట్టు, పడుచుతనంలో పెళ్ళిచేసుకుని తృణీకారానికి గురి అయిన భార్యను తిరిగి రప్పించినట్టుగా యెహోవా నిన్ను తిరిగి రప్పించాడని, నీ దేవుడు చెబుతున్నాడు.

    7 కొంతసేపే నేను నిన్ను వదిలేశాను. అయితే ఎంతో జాలితో నేను నిన్ను చేరదీస్తాను.

    8 కాసేపే నీమీద కోపంతో నా ముఖం దాచాను.

    నీ మీద జాలి చూపిస్తాను. నిన్నెప్పటికీ నమ్మకంగా ప్రేమిస్తానని నిన్ను విమోచించే యెహోవా చెబుతున్నాడు.

  67. 21 అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాలోనే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను.

    22 అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. 23 కానీ వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసులోని ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవాల్లోని పాప నియమానికి నన్ను బందీగా చేస్తున్నది. 24 అయ్యో, నేనెంత నికృష్టుణ్ణి? చావుకు లోనైన ఈ శరీరం నుండి నన్నెవరు విడిపిస్తారు? 25 మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెబుతున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవనియమానికీ, శరీర విషయంలో పాప నియమానికీ దాసుణ్ణి.

  68. 1 అప్పుడు జీవజలనదిని ఆ దూత నాకు చూపించాడు. అది స్ఫటికంలా నిర్మలంగా మెరుస్తూ ఉంది. అది దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం నుండీ, 2 ఆ పట్టణం ప్రధాన వీధి మధ్యలో నుండి ప్రవహిస్తుంది. ఆ నదికి రెండు పక్కలా జీవ వృక్షం ఉంది. అది నెల నెలా ఫలిస్తూ, పన్నెండు రకాల పండ్లు కాస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉపయోగపడతాయి.

    3 అక్కడ ఇక శాపం అనేది ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం అక్కడ ఉంటుంది. ఆయన సేవకులు ఆయనకు సేవ చేస్తారు. 4 ఆయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళపై ఉంటుంది. 5 రాత్రి ఇక ఎప్పటికీ కలగదు. దీపాల కాంతీ, సూర్యుడి వెలుగూ వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వెలుగై వారిమీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు కలకాలం పరిపాలిస్తారు.