108 Bible Verses About Being Humble

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Being Humble
  1. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

    6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

    దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

    7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

    బానిస రూపం తీసుకున్నాడు.

    మానవుల పోలికలో కనిపించాడు.

    ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

    8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,

    తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

    9-11 అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా,

    భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా,

    ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా,

    దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి,

    అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.

  2. 4 కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు. 5 ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా? 6 కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.

    7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. 8 దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి. 9 చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి. 10 ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.

  3. 5 యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి ఉండండి. దేవుడు గర్విష్టులను ఎదిరించి వినయం గలవారికి కృప చూపుతాడు. 6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.

    7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి.

  4. 7 ఆ విందుకు ఆహ్వానం అందినవారు భోజనపంక్తిలో అగ్ర స్థానాలను ఎన్నుకోవడం చూసి ఆయన ఇలా అన్నాడు, 8 “నిన్ను ఎవరైనా పెళ్ళి విందుకు పిలిస్తే అక్కడ అగ్ర స్థానంలో కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే గొప్పవాణ్ణి అతడు పిలిచి ఉండవచ్చు. 9 మిమ్మల్నిద్దర్నీ పిలిచినవాడు వచ్చి, ‘ఈయన్ని ఇక్కడ కూర్చోనివ్వు’ అనవచ్చు. అప్పుడు నువ్వు సిగ్గు పడి చివరి స్థానంలో కూర్చోడానికి వెళ్తావు. 10 కాబట్టి నీకు ఆహ్వానం అందినప్పుడు వెళ్ళి చివరి స్థానంలో కూర్చో. అప్పుడు నిన్ను ఆహ్వానించిన వాడు వచ్చి నీతో ‘మిత్రమా, పై స్థానానికి వెళ్ళు.’ అనవచ్చు. అప్పుడు నీకు అందరి ముందూ గౌరవం కలుగుతుంది. 11 తనను తాను గొప్ప చేసుకునేవాడు తగ్గడం, తగ్గించుకునేవాడు హెచ్చడం జరుగుతుంది.”

  5. 28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  6. 1-3 కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను.

  7. 13 నేను ఆకాశాన్ని మూసివేసి వాన కురవకుండా చేసినప్పుడూ, దేశాన్ని నాశనం చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడూ, నా ప్రజల మీదికి తెగులు రప్పించినప్పుడూ, 14 నా పేరు పెట్టుకున్న నా ప్రజలు తమని తాము తగ్గించుకుని, ప్రార్థన చేసి, నన్ను వెతికి, తమ దుష్టత్వాన్ని విడిచి నన్ను వేడుకుంటే, నేను పరలోకం నుండి వారి ప్రార్థన విని, వారి పాపాన్ని క్షమించి, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. 15 ఈ స్థలం లో చేసే ప్రార్థన మీద నా దృష్టి ఉంటుంది, నా చెవులు దాన్ని వింటాయి.

  8. 33 యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం వృద్ది చేసుకునే సాధనం. వినయం కలిగి ఉంటే గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి.

  9. 18 ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది.

    19 దుర్మార్గులతో కలసి దోచుకున్న సొమ్ము పంచుకోవడం కంటే, వినయంతో దీన మనస్కులతో ఉండడం మంచిది.

  10. 1 ఆ రోజుల్లోనే శిష్యులు వచ్చి, “పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవరు?” అని యేసుని అడిగారు. 2 అప్పుడాయన ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి, వారి మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు, 3 “మీరు మారుమనస్సు పొంది చిన్నపిల్లల్లాంటి వారైతేనే పరలోకరాజ్యంలో ప్రవేశించగలరని మీతో కచ్చితంగా చెబుతున్నాను. 4 కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు.

  11. 9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10 “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11 పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.

    14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.

    15 తమ పసి పాపల మీద యేసు తన చేతులుంచాలని కొందరు వారిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన శిష్యులు అది చూసి ఆ తీసుకువచ్చిన వారిని అదిలించారు. 16 అయితే యేసు వారిని తన దగ్గరికి పిలిపించాడు. “పిల్లలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆటంకపెట్టవద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాటి వారిదే. 17 చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

  12. 4 యెహోవా పట్ల భయభక్తులు వినయాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని తెస్తాయి.

  13. 15 ఎందుకంటే, మహా ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి అయినవాడు ఇలా చెబుతున్నాడు. “నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తూ ఉన్నాను. అయినా, వినయంగల వారితో నలిగిన వారితో కూడా ఉంటాను. వినయం గలవారి ప్రాణాన్ని సేదదీర్చడానికీ నలిగినవారి ప్రాణాన్ని తెప్పరిల్లజేయడానికీ నేనున్నాను.

  14. 12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.

    14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది.

  15. 8 మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు.

    ఆయన నిన్ను కోరేదేంటంటే,

    న్యాయంగా ప్రవర్తించు.

    కనికరాన్ని ప్రేమించు.

    వినయంగా నీ దేవునితో నడువు.

  16. 8 మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు. అందరికీ ఒక్కడే బోధకుడు. మీరంతా సోదరులు. 9 ఇంకా, భూమిమీద ఎవరినీ ‘తండ్రి’ అని పిలవవద్దు. పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి. 10 అంతే గాక, మీరు గురువులని పిలిపించుకోవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. 11 మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి. 12 తనను తాను గొప్ప చేసికొనేవాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.

  17. 12 విపత్తుకు ముందు మనిషి హృదయం అహంకార పూరితంగా ఉంటుంది. వినయం వల్ల గౌరవం కలుగుతుంది.

  18. 25 కాబట్టి యేసు వారిని పిలిచి, “ఇతర జాతుల్లో అధికారులు ప్రజల మీద పెత్తనం చేస్తారనీ గొప్పవారు వారిమీద అధికారం చెలాయిస్తారనీ మీకు తెలుసు. 26 కానీ మీరు అలా ప్రవర్తించకూడదు. మీలో గొప్పవాడుగా ఉండాలని కోరేవాడు మీకు సేవకుడుగా ఉండాలి. 27 మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి. 28 అలాగే మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోడానికి రాలేదు. ఆయన ఇతరులకి సేవ చేయడానికీ అనేకమంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికీ వచ్చాడు” అని చెప్పాడు.

  19. 2 ఆయన యెహోవా ఎదుట లేత మొక్కలాగా ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్కలాగా పెరిగాడు.

    అతనికి ఎలాంటి మంచి రూపంగానీ గొప్పదనంగానీ లేదు. మనలను ఆకర్షించే అందమేమీ ఆయనలో కనబడలేదు.

    3 ఆయన మనుష్యుల తృణీకారానికీ నిరాకరణకూ గురి అయ్యాడు. ఆయన విచారాలతో అస్తమానం బాధలతో నిండిపోయినవాడు.

    మన ముఖాలు ఆయనకు కనబడకుండా చేసుకున్నాం. ఆయన తృణీకారానికి గురి అయ్యాడు. ఆయనంటే మనకు లెక్కలేదు.

    4 అయితే ఆయన మన రోగాలను కచ్చితంగా భరించాడు. మన దుఖాలను మోశాడు.

    అయినా దేవుడు ఆయనను శిక్షించాడనీ దెబ్బ కొట్టి బాధించాడనీ మనం భావించుకున్నాం.

    5 కానీ ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలగగొట్టడం జరిగింది.

    మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్దాం.

    6 మనందరం గొర్రెలలాగా దారి తప్పాము. మనలో ప్రతివాడూ తనకిష్టమైన దారికి తొలగిపోయాము.

    యెహోవా మనందరి దోషాన్ని ఆయనమీద మోపాడు.

    7 ఆయన దుర్మార్గానికి గురి అయ్యాడు. బాధల పాలైనా అతడు నోరు తెరవలేదు.

    గొర్రెపిల్లలాగా ఆయన్ని వధకు తీసుకుపోయారు. బొచ్చు కత్తిరించే వారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు.

    8 అన్యాయపు తీర్పుతో ఆయన్ని శిక్షించారు. ఆ తరంలో ఆయన గురించి ఎవరు పట్టించుకున్నారు?

    నా ప్రజల దుర్మార్గానికి ఆయనకు శిక్ష పడింది. సజీవుల భూమిలోనుంచి అతడు హతమయ్యాడు.

  20. 3 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి.

  21. 2 గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది. జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు.

    3 నిజాయితీ గల వారిని వారి న్యాయబుద్ధి నడిపిస్తుంది. దుర్మార్గుల మూర్ఖత్వం వారిని చెడగొడుతుంది.

  22. 5 సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు.

  23. 34 ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు.

  24. 23 ఎవరి అహం వాణ్ణి అణచి వేస్తుంది. వినయమనస్కుడు గౌరవానికి నోచుకుంటాడు.

  25. 13 మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి. 14 కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి. 15 ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది.

    16 ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి. 17 అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం. తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది. సమ్మతి గలది. కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది. 18 శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది.

  26. 2 మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో మిమ్మల్ని పరీక్షించి మీ హృదయాన్ని తెలుసుకోడానికీ, మిమ్మల్ని లోబరచుకోడానికీ మీ యెహోవా దేవుడు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి.

    3 రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.

  27. 27 ‘నీ మనస్సు మెత్తనిది కాబట్టి, ఈ స్థలం మీదా దానిలో నివసించే వారి మీదా దేవుని మాటలను నీవు విని, నా ముందు నిన్ను నీవు తగ్గించుకుని నీ బట్టలు చించుకుని నా ముందు ఏడ్చావు కాబట్టి నేను కూడా నీ మాట విన్నాను’ ఇది యెహోవా ప్రకటన.

  28. 8 యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు.

    9 దీనులను న్యాయంగా నడిపిస్తాడు, దీనులకు తన మార్గం బోధిస్తాడు.

  29. 4 యెహోవా తన ప్రజలందరినీ అమితంగా ప్రేమిస్తున్నాడు. దీనులైన తన ప్రజలకు రక్షణ భాగ్యం ప్రసాదించాడు.

  30. 13 ఆ సమయాన యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు. 14 అయితే యోహాను, “నేను నీచేత బాప్తిసం పొందవలసి ఉండగా, నీవు నా దగ్గరికి వస్తున్నావా?” అని ఆయనను నివారింపజూశాడు. 15 కానీ యేసు, “ఇప్పటికి కానివ్వు. నీతి అంతా ఇలా నెరవేర్చడం మనకు సబబే” అని అతనికి జవాబిచ్చాడు, కాబట్టి అతడు ఆ విధంగా చేశాడు.

  31. 1 యెహోవా ఇలా చెబుతున్నాడు,

    “ఆకాశం నా సింహాసనం. భూమి నా పాద పీఠం. అయితే మీరు నా కోసం కట్టబోతున్న ఇల్లు ఎక్కడ? నేను విశ్రాంతి తీసుకునే స్థలం ఎక్కడుంది?

    2 వాటన్నిటినీ నేనే చేశాను. అవి అలా వచ్చాయి” అని యెహోవా తెలియజేస్తున్నాడు.

    “ఎవరైతే వినయం, నలిగిన హృదయం కలిగి నా మాట విని వణకుతారో వారిమీదే నా దృష్టి ఉంటుంది.

  32. 42 అయితే యేసు వారిని దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు, “అన్యజనుల అధికారులు ప్రజల మీద తమ ఆధిపత్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తారు. వారిలో ప్రముఖులు వారిపై అధికారం చెలాయిస్తారు. 43 మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు కావాలనుకొనేవాడు సేవకుడై ఉండాలి. 44 మీలో మొదటివాడు కావాలని కోరేవాడు అందరికీ దాసుడై ఉండాలి. 45 ఎందుకంటే మనుష్య కుమారుడు సేవ చేయించుకోడానికి రాలేదు, సేవ చేయడానికీ, అందరి పక్షాన తన ప్రాణాన్ని వెలగా ధార పోయడానికి వచ్చాడు.”

  33. 46 అప్పుడు మరియ ఇలా అంది, “నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది.

    47 ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు.

    48-49 నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది.

    సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం.

  34. 27 అహాబు ఆ మాటలు విని తన బట్టలు చించుకుని గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి, గోనెపట్ట మీద పడుకుని చాలా విచారించాడు. 28 యెహోవా తిష్బీ వాడైన ఏలీయాతో ఇలా చెప్పాడు. 29 “అహాబు నా ఎదుట తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూశావా? తనను నా ఎదుట తగ్గించుకుంటున్నాడు కాబట్టి, రాబోయే ఆ కీడును అతని కాలంలో పంపించను. నేనతని కొడుకు రోజుల్లో అతని వంశం మీదికి కీడు రానిస్తాను.”

  35. 9 సీయోను నివాసులారా, సంతోషించండి.

    యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి.

    నీ రాజు నీతితో, రక్షణ తీసుకుని, దీనుడై,

    గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు.

  36. 12 యేసు వారి కాళ్ళు కడిగి, తన వస్త్రాలు తీసుకుని, యథాప్రకారం కూర్చుని, వారితో, “నేను మీ కోసం ఏం చేశానో మీకు తెలుసా? 13 మీరు నన్ను బోధకుడు, ప్రభువు అని సరిగానే పిలుస్తున్నారు. 14 బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. 15 నేను మీకోసం చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక ఆదర్శం చూపించాను.

    16 నేను మీకు కచ్చితంగా చెబుతున్నాను, దాసుడు తన యజమానికన్నా గొప్పవాడు కాదు. వెళ్ళినవాడు వాణ్ణి పంపినవానికన్నా గొప్పవాడు కాదు. 17 ఈ సంగతులు మీకు తెలుసు కాబట్టి, వీటి ప్రకారం చేస్తే మీరు ధన్యులు.

  37. 9 మీకు మన ప్రభు యేసు క్రీస్తు కృప తెలుసు గదా? ఆయన ధనవంతుడై ఉండీ తన పేదరికం వలన మీరు ధనవంతులు కావాలని, మీ కోసం పేదవాడయ్యాడు.

  38. 24 తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది. 25 అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. ప్రజల మీద అధికారం చెలాయించే వారు ‘ధర్మదాతలు’ అని పిలిపించుకుంటారు. 26 మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు తక్కువవాడుగా, నాయకుడు సేవకుడిలా ఉండాలి. 27 అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను.

  39. 26 సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా. 27 దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. 28 గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. 29 ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం.

    30 అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. 31 “అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు.

  40. 6 యెహోవా మహా ఘనుడైనప్పటికీ ఆయన దీనులను పట్టించుకుంటాడు. గర్విష్ఠుల కదలికలు ఆయన దూరం నుండే పసికడతాడు.

  41. 5 మన ప్రభువు గొప్పవాడు. ఆయన గొప్ప శక్తి సామర్ధ్యాలు గలవాడు. ఆయన జ్ఞానం అమితమైనది.

    6 యెహోవా దీన స్థితిలో ఉన్నవారిని ఆదరిస్తాడు. ఆయన దుష్టులను నేలమట్టం చేస్తాడు.

  42. 3 తండ్రి సమస్తం తన చేతుల్లో పెట్టాడనీ, తాను దేవుని దగ్గర నుంచి వచ్చాడనీ, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడనీ యేసుకు తెలుసు. 4 ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసుకుని దాన్ని నడుముకు చుట్టుకున్నాడు. 5 అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవడం ప్రారంభించాడు.

    6 ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. అప్పుడు పేతురు ఆయనతో, “ప్రభూ, నువ్వు నా కాళ్ళు కడుగుతావా?” అన్నాడు. 7 యేసు అతనికి జవాబిస్తూ, “నేను చేస్తున్నది ఇప్పుడు నీకు అర్థం కాదు. కాని, నువ్వు తరవాత అర్థం చేసుకుంటావు” అన్నాడు. 8 పేతురు ఆయనతో, “నువ్వు నా పాదాలు ఎన్నడూ కడగకూడదు” అన్నాడు. యేసు అతనికి జవాబిస్తూ, “నేను నిన్ను కడగకపోతే, నాతో నీకు సంబంధం ఉండదు” అన్నాడు.

  43. 18 వారు వచ్చినపుడు వారితో ఇలా అన్నాడు, “నేను ఆసియలో కాలు మోపిన రోజు నుండి మీ మధ్య ఏ విధంగా ఉన్నానో మీకే తెలుసు.

    19 యూదుల కుట్రల వలన నాకు విషమ పరీక్షలు సంభవించినా కన్నీటితోనూ, సంపూర్ణమైన వినయభావంతోనూ ప్రభువుకు సేవ చేశానని మీకు తెలుసు. 20 మీకు ప్రయోజనకరమైన దేనినీ నేను దాచుకోకుండా బహిరంగంగా, ఇంటింటికీ తిరిగి బోధించాను. 21 అంతేకాక, దేవుని ఎదుట పశ్చాత్తాప పడి మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచాలని యూదులకూ, గ్రీసు దేశస్తులకూ ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నానో, అంతా మీకు తెలుసు.

  44. 16 ఒకరిపట్ల ఒకరు ఏక మనసు కలిగి ఉండండి. గొప్పవాటి గురించి ఆలోచించవద్దు. దీనులతో సహవాసం చెయ్యండి. మిమ్మల్ని మీరు తెలివైన వారని అనుకోవద్దు.

  45. 8 చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి.

    9 కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.

    10 జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి. 11 అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి.

  46. 6 అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులు, రాజు వినయంగా తల వంచుకుని “యెహోవా న్యాయవంతుడు” అని ఒప్పుకున్నారు.

    7 వారు తమను తాము తగ్గించుకోవడం యెహోవా చూశాడు. యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిచ్చాడు. “వారు తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి నేను వారిని నాశనం చేయను. షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలో వారికి రక్షణ దయచేస్తాను.

  47. 5 “ఇదిగో నీ రాజు దీనుడుగా గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడని సీయోను కుమారితో చెప్పండి.”

  48. 33 వారు కపెర్నహూము చేరారు. అందరూ ఇంట్లో చేరాక యేసు వారితో, “దారిలో మీరు దేని గురించి చర్చించుకుంటున్నారు?” అని అడిగాడు. 34 అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే దారిలో వారు తమలో ఎవరు గొప్ప, అని వాదించుకున్నారు. 35 యేసు కూర్చుని పన్నెండు మందిని పిలిచి, “మీలో ఎవడైనా ముఖ్యుడుగా ఉండాలంటే అతడు అందరికన్నా చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి” అని వారితో అన్నాడు.

    36 అప్పుడాయన ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్య నిలబెట్టాడు. ఆ బిడ్డను ఎత్తుకుని ఇలా అన్నాడు, 37 “నా పేరిట ఇలాంటి చిన్నవారిలో ఒకరిని ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్టే. నన్ను స్వీకరించేవారు నన్ను కాదు, నన్ను పంపిన ఆయనను కూడా స్వీకరిస్తున్నారు.”

  49. 18 ఎవరైనా కపట వినయం ప్రదర్శిస్తూ, దేవదూతల పట్ల భక్తి కనపరుస్తూ మీరు మీ బహుమానం పోగొట్టుకొనేలా చేయకుండా జాగ్రత్త పడండి. అలాటివాడు తాను చూసిన విషయాలను అతిశయోక్తిగా చెప్పుకుంటాడు. వాడు తన శరీర సంబంధమైన ఆలోచన వల్ల కారణం లేకుండానే వాటి విషయంలో గర్విష్టి అవుతాడు.

    19 అలాంటి వాడు శిరస్సుగా ఉన్న క్రీస్తు యేసును అంటి పెట్టుకుని ఉండడు. ఆ శిరస్సు వల్లనే శరీరానికి పోషణ జరుగుతుంది. ఆ శిరస్సు వల్లనే కీళ్లతో, నరాలతో శరీరం ఒక్కటిగా ఉంటుంది. దేవుడు ప్రసాదించే ఎదుగుదలతో శరీరం అభివృద్ధి చెందుతుంది.

  50. 1 పరిపాలకులకూ, అధికారులకూ లోబడి ఉండాలనీ ప్రతి మంచి పనీ చేయడానికి సిద్ధంగా ఉండాలనీ వారికి గుర్తు చెయ్యి. 2 వారు ఎవరినీ దూషించకుండా, వాదనలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా మనుషులందరి పట్లా సంపూర్ణమైన మర్యాద కలిగి జీవించాలి. 3 ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ద్వేషానికి గురి అవుతూ ద్వేషిస్తూ ఉండేవాళ్ళం.

    4 అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు 5 మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. 6-7 దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.

    8 ఈ మాట నమ్మదగింది కాబట్టి దేవునిలో విశ్వసించేవారు తమ ఎదుట ఉంచబడిన మంచి పనులు శ్రద్ధగా చేయడంలో మనసు లగ్నం చేయమని నీవు ఈ సంగతులను గూర్చి గట్టిగా చెప్పాలని నేను కోరుతున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి.

    9 అంతేగానీ, అర్థం పర్ధంలేని వాదాలు, వంశావళులను గూర్చిన వాదోపవాదాలు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వివాదాల వలన ప్రయోజనం శూన్యం. అవి ఎందుకూ కొరగానివి కాబట్టి వాటికి దూరంగా ఉండు.

  51. 10 నువ్వు నీ సేవకుడికి చేసిన ఉపకారాలన్నిటికీ నమ్మకత్వమంతటికీ నేను పాత్రుణ్ణి కాను. ఎందుకంటే, కేవలం ఈ నా చేతి కర్రతో ఈ యొర్దాను దాటాను. ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను.

  52. 5 నేను “అయ్యో, నావి అపవిత్రమైన పెదాలు. అపవిత్రమైన పెదాలున్న జనం మధ్య నివసిస్తున్నాను.

    నేను నశించాను. రాజు, సేనల ప్రభువు అయిన యెహోవాను నేను కన్నులారా చూశాను” అనుకున్నాను.

  53. 43 నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం!

  54. 16 యోసేపు “అది నావలన కాదు, దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు” అని ఫరోతో చెప్పాడు.

  55. 10 ఈ రోజు వరకూ వాళ్ళు అణకువతో ఉండలేదు. వాళ్ళ ముందూ వాళ్ళ పితరుల ముందూ నేను ఉంచిన ధర్మశాస్త్రాన్నిగానీ ఆజ్ఞలనుగానీ వాళ్ళు గౌరవించలేదు. వాటి ప్రకారం జీవించలేదు.”

  56. 27 ఆమె, “ప్రభూ, నిజమే! కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపై నుండి కింద పడే ముక్కలు తింటాయి కదా” అంది.

  57. 29 పెళ్ళి కొడుక్కే పెళ్ళి కూతురు ఉంటుంది. అయితే పెళ్ళి కొడుకు స్నేహితుడు నిలబడి పెళ్ళికొడుకు స్వరం వింటూ ఎంతో సంతోషిస్తాడు. అందుకే నా సంతోషం సంపూర్ణం అయింది. 30 ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి.”

  58. 30 “నా అంతట నేనే దేనినీ చేయలేను. నేను విన్న దాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడను గానీ నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది. 31 నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యం కాదు. 32 నా గురించి సాక్షమిచ్చేవాడు మరొకడున్నాడు. నా గురించి ఆయన ఇచ్చే సాక్ష్యం సత్యమని నాకు తెలుసు.

  59. 22 “బెల్షస్సరూ, అతని కొడుకువైన నీకు ఈ విషయాలన్నీ తెలుసు. అవన్నీ తెలిసి కూడా నువ్వు నీ మనస్సును అదుపులో ఉంచుకోకుండా పరలోకంలో ఉండే ప్రభువుకంటే అధికంగా నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు. 23 ఎలాగంటే నువ్వూ, నీ అధికారులు, రాణులు, ఉపపత్నులు దేవుని ఆలయం నుండి తెచ్చిన పాత్రల్లో ద్రాక్షామద్యం పోసుకుని సేవించారు. బంగారం, వెండి, యిత్తడి, ఇనుము, చెక్క, రాయిలతో చేసిన, చూడలేని, వినలేని, గ్రహించలేని దేవుళ్ళను కీర్తించారు. నీ ప్రాణం, నీ సకల సంపదలు ఏ దేవుని చేతిలో ఉన్నాయో ఆ దేవుణ్ణి నువ్వు ఘనపరచలేదు.

  60. 5 యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి, 6 “ప్రభూ, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు” అని చెప్పాడు. 7 “నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను” అని యేసు అతనికి జవాబిచ్చాడు. 8 ఆ శతాధిపతి, “ప్రభూ, నీవు నా యింట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మాట మాత్రం అనండి. నా పనివాడు బాగుపడతాడు. 9 నేను కూడా అధికారం కింద ఉన్నవాడినే. నా చేతి కింద కూడా సైనికులున్నారు. నేను ఎవడినైనా ‘వెళ్ళు’ అంటే వాడు వెళ్తాడు. ఎవడినైనా ‘రా’ అంటే వాడు వస్తాడు. నా పనివాణ్ణి ‘ఇది చెయ్యి’ అంటే చేస్తాడు” అని జవాబిచ్చాడు.

    10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, తన వెంట వస్తున్న వారితో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఎవరికైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని కచ్చితంగా చెబుతున్నాను. 11 తూర్పు నుంచీ పడమర నుంచీ చాలా మంది వచ్చి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు పరలోక రాజ్యంలో విందులో కూర్చుంటారు. 12 అయితే రాజ్య కుమారులను మాత్రం బయట చీకట్లోకి తోసేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.” 13 యేసు శతాధిపతితో, “వెళ్ళు. నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది” అన్నాడు. ఆ క్షణంలోనే అతని పనివాడు బాగుపడ్డాడు.

  61. 27 అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను.

  62. 3 మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పారు. “హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఎంతకాలం వరకూ నా మాట వినకుండా ఉంటావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.

  63. 3 మోషే ఎంతో సాధుగుణం గలవాడు. భూమిపైన ఉన్నవారందరిలో ఎంతో సాత్వికుడు.

  64. 29 దేవుడు గర్విష్టులను వంచుతాడు. కళ్ళు దించుకునే వారిని కాపాడతాడు.

  65. 1 రేపటి రోజును గూర్చి డంబాలు పలక వద్దు. ఏ రోజున ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు?

    2 నీ నోరు కాదు, వేరొకరు ఎవరన్నా, నీ స్వంత పెదవులు కాదు ఇతరులే నిన్ను పొగడాలి.

  66. 1 “మనుషులకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ప్రతిఫలమూ రాదు. 2 కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో, వీధుల్లో అలా చేస్తారు. వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని కచ్చితంగా చెబుతున్నాను.

    3 నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనీయవద్దు. 4 అప్పుడే నీ దానం గుప్తంగా ఉంటుంది. ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. 5 మీరు ప్రార్థన చేసేటప్పుడు కపట వేషధారుల్లాగా ఉండవద్దు. మనుషులకు కనబడాలని సమాజ మందిరాల్లో, వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. వారు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను.

    6 నీవు ప్రార్థన చేసేటప్పుడు, నీ లోపలి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని, రహస్యంగా తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. 7 అంతే కాక మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరుల్లాగా వృథా మాటలు పదే పదే పలక వద్దు. చాలా ఎక్కువ మాట్లాడితేనే దేవుడు వింటాడని వారు అనుకుంటారు.

    8 కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు.

  67. 19 ఈయన పోట్లాడడు, కేకలు వేయడు. ఈయన స్వరం వీధిలో వారికెవ్వరికీ వినిపించదు.

    20 న్యాయాన్ని గెలిపించే వరకూ,

    ఈయన నలిగిన రెల్లును విరవడు.

    ఆరిపోతున్న వత్తిని నలపడు.

  68. 37 పేతురును, జెబెదయి ఇద్దరు కొడుకులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, కలతలో మునిగిపోయాడు. 38 అప్పుడు ఆయన వారితో, “నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పాడు.

    39 ఆయన కొంత దూరం వెళ్ళి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు” అని ప్రార్థన చేశాడు.

  69. 18 దావీదు “రాజువైన నీకు అల్లుణ్ణి కావడానికి నేనెంతటివాణ్ణి? నా స్తోమతు ఎంతటిది? ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబం ఏపాటిది?” అని సౌలుతో అన్నాడు.

    19 అయితే సౌలు తన కుమార్తె మేరబును దావీదుకు ఇచ్చి పెళ్లి చేయవలసి ఉండగా, ఆమెను మెహోల గ్రామం వాడైన అద్రీయేలుకు ఇచ్చి పెళ్లి చేశాడు.

    20 అయితే సౌలు కూతురు మీకాలు దావీదును ప్రేమించింది. సౌలు అది విని సంతోషించాడు. 21 “ఆమెను అతనికిచ్చి పెళ్లి చేస్తాను. ఆమె అతనికి ఉరి లాగా ఉంటుంది, ఫిలిష్తీయుల చెయ్యి అతనికి వ్యతిరేకంగా ఉంటుంది.” అని అనుకున్నాడు. సౌలు, రెండోసారి దావీదుతో “నువ్వు నా అల్లుడౌతున్నావు” అని చెప్పాడు.

    22 సౌలు తన సేవకులతో ఇలా ఆజ్ఞాపించాడు “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడండి, ‘రాజుకు నువ్వంటే ఇష్టం కలిగింది. రాజు సేవకులంతా నీపట్ల స్నేహంగా ఉన్నారు. కాబట్టి నువ్వు రాజుకు అల్లుడివి కావాలి’ అని చెప్పండి.”

    23 సౌలు సేవకులు దావీదుతో మాట్లాడినప్పుడు అతడు “నేను పేదవాణ్ణి, పేరు ప్రఖ్యాతులు లేనివాణ్ణి. రాజుకు అల్లుడు కావడమంటే ఆది చిన్న విషయంగా మీకు అనిపిస్తుందా?” అని వారితో అన్నాడు.

  70. 2 నేను యెహోవాను స్తుతిస్తాను. అణచివేతకు గురైన వాళ్ళు అది విని సంతోషిస్తారు గాక!

  71. 32 దీనులు అది చూసి సంతోషిస్తారు. దేవుని వెదికేవారలారా, మీ హృదయాలు తిరిగి బ్రతుకు గాక.

    33 అక్కరలో ఉన్నవారి ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. బంధకాల్లో ఉన్న తన వారిని ఆయన అలక్ష్యం చేయడు.

  72. 11 మానవుని అహంకార దృష్టిని ఆయన తగ్గించేస్తాడు.

    మనుషుల గర్వాన్ని అణగదొక్కుతాడు.

    ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు.

  73. 19 అణచివేతకి గురైన వాళ్ళు యెహోవాలో ఆనందిస్తారు. మనుషుల్లో పేదలైన వాళ్ళు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిలో ఆనందిస్తారు.

  74. 4 అలసినవాణ్ణి నా మాటలతో ఆదరించే జ్ఞానం నాకు కలిగేలా శిష్యునికి ఉండాల్సిన నాలుక యెహోవా నాకిచ్చాడు.

    శిష్యునిలాగా నేను వినడానికి ఆయన ప్రతి ఉదయాన నన్ను మేల్కొలుపుతాడు.

    5 ప్రభువైన యెహోవా నా చెవికి వినే బుద్ధి పుట్టించాడు కాబట్టి నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా దూరం జరగలేదు.

    6 నన్ను కొట్టే వారికి నా వీపును, వెంట్రుకలు పెరికే వారికి నా చెంపలను అప్పగించాను.

    ఉమ్మి వేసేవారికి, అవమానించే వారికి నా ముఖం దాచుకోలేదు.

  75. 37 ఈ విధంగా నెబుకద్నెజరు అనే నేను, పరలోకపు రాజును స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఘనపరుస్తున్నాను. ఎందుకంటే ఆయన జరిగించే కార్యాలన్నీ సత్యం, ఆయన నడిపించే విధానాలు న్యాయం. ఆయన గర్వంతో ప్రవర్తించే వాళ్ళను అణిచివేసే శక్తి గలవాడు.

  76. 3 దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులు అనుసరించే దీనులారా, యెహోవాను వెదకండి.

    మీరు వెతికి వినయంతో నీతిని అనుసరిస్తే ఒకవేళ ఆయన ఉగ్రత దినాన మీరు భద్రంగా ఉంటారేమో.

  77. 51 అప్పుడు ఆయన వారితో కలిసి బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసికుంది.

  78. 14-15 “సీయోను కుమారీ, భయపడకు! నీ రాజు గాడిద పిల్ల మీద కూర్చుని వస్తున్నాడు”

    అని రాసి ఉన్న విధంగా యేసు చిన్న గాడిదను చూసి దాని మీద కూర్చున్నాడు.

  79. 1 స్వయంగా పౌలు అనే నేను క్రీస్తులో ఉన్న సాత్వీకంతో, మృదుత్వంతో మీకు విన్నపం చేస్తున్నాను. మీతో ఉన్నపుడు దీనునిగా, మీతో లేనపుడు ధైర్యశాలిగా ఉన్నాను గదా!

  80. 23 వీటిలో మానవ నిర్మితమైన మత విధానాల జ్ఞానమూ కపట వినయమూ శరీరాన్ని కఠినంగా అదుపులో పెట్టుకోవడం వంటివి ఉన్నాయి. కానీ శరీర కోరికలను నియంత్రించుకునే విషయంలో అవి ఎందుకూ కొరగానివి.

  81. 15 పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగినదీ, సంపూర్ణంగా అంగీకరించదగినదీ. అలాంటి పాపుల్లో నేను మొదటి వాణ్ణి.

  82. 11 అప్పుడు మోషే దేవునితో “ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించడానికి నేను ఏపాటి వాణ్ణి?” అని అన్నాడు.

  83. 18 అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్ళి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు. “నా ప్రభూ యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేనెంతటివాణ్ణి? నా వంశం ఏపాటిది? 19 నన్ను ఇంతగా హెచ్చించి నాకు చేసినదంతా నీకు స్వల్పమైన విషయం. నీ దాసుడనైన నా వంశానికి భవిషత్తులో కలగబోయే ఉన్నతిని గూర్చి నాకు వెల్లడించావు. యెహోవా, నా ప్రభూ, దావీదు అనే నేను ఇక నీతో ఏమి చెప్పుకొంటాను?

  84. 28 యాతన పడే వారిని రక్షిస్తావు

    గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేస్తావు.

  85. 7 నా దేవా, యెహోవా, నీవు నా తండ్రి దావీదుకు బదులుగా నీ సేవకుడైన నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుణ్ణి. రాజ్య వ్యవహారాలు జరిపించడానికి నాకు తెలివి చాలదు.

  86. 24 ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి చనిపోయేలా ఉన్నాడు. అతడు యెహోవాకు ప్రార్థన చేస్తే, ఆయన అతనితో మాట్లాడి, అతడు బాగుపడతాడనేదానికి ఒక గురుతు ఇచ్చాడు. 25 అయితే హిజ్కియా గర్వించి తనకు చేసిన మేలుకు తగినట్లు ప్రవర్తించలేదు. కాబట్టి అతని మీదికీ యూదా యెరూషలేము మీదికీ యెహోవా కోపం వచ్చింది. 26 అయితే చివరకూ హిజ్కియా తన హృదయ గర్వం విడిచి, తానూ యెరూషలేము నివాసులూ తమను తాము తగ్గించుకున్నారు. కాబట్టి హిజ్కియా రోజుల్లో యెహోవా కోపం ప్రజల మీదికి రాలేదు.

  87. 27 బాధపడే వాళ్ళను నువ్వు రక్షిస్తావు. కాని, గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళను కిందకు అణిచి వేస్తావు!

  88. 17 అప్పుడు మనిషి అహంకారం అణిగిపోతుంది.

    మనుషుల గర్వం తగ్గిపోతుంది.

    ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు.

    18 విగ్రహాలు పూర్తిగా గతించిపోతాయి.

  89. 8 సీమోను పేతురు అది చూసి, యేసు మోకాళ్ళ ముందు పడి, “ప్రభూ, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు” అన్నాడు.

  90. 11 నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. 12 అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

  91. 10 మోషే “ప్రభూ, నీవు నీ దాసుడినైన నాతో మాట్లాడడానికి ముందుగానీ తరవాతగానీ ఏనాడూ నేను మాటకారిని కాను. నా నోరు, నా నాలుక మందమైనవి” అన్నాడు.

  92. 17 అయితే మీరు, ‘మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి’ అనుకుంటారేమో.

    18 కాబట్టి మీరు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు తన నిబంధనను ఈ రోజులాగా స్థాపించాలని మీరు ఐశ్వర్యం సంపాదించుకోడానికి మీకు సామర్ధ్యం కలిగించేవాడు ఆయనే.

  93. 7 యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు.

    కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే.

  94. 21 అప్పుడు సౌలు “నేను బెన్యామీను గోత్రానికి చెందినవాణ్ణి కదా. నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రాల్లో అల్పమైనది కదా. నా కుటుంబం బెన్యామీను గోత్రపు వారందరిలో అల్పులు కదా? నాతో ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు?” అన్నాడు.

  95. 8 కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నీకు చెబుతున్నదేమిటంటే, గొర్రెల మందలు కాచుకొంటూ గొర్రెలశాల్లో ఉంటున్న నిన్ను నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించాను.

  96. 18 యెహోవాను సంప్రదించడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ మాట తెలియపరచండి. 19 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం పాడవుతుందని, దాని కాపురస్థులు శాపానికి గురి అవుతారని నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిలో దీనత్వం కలిగి, నీ బట్టలు చింపుకుని నా సన్నిధిలో కన్నీళ్లు కార్చావు గనుక నీవు చేసిన మనవి నేను అంగీకరించాను.

    20 నేను నిన్ను నీ పితరుల దగ్గరికి చేరుస్తాను. నీవు ప్రశాంతంగా సమాధికి వెళ్తావు. నేను ఈ స్థలం మీదకి రప్పించే కీడును నీవు నీ కళ్ళతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు” అని చెప్పింది. అప్పుడు, వారు ఈ వార్త రాజు దగ్గరికి తెచ్చారు.

  97. 12 అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించాడు. యెహోవా నియమించిన యిర్మీయా ప్రవక్త మాట వినలేదు. అతని ఎదుట తనను తాను తగ్గించుకోలేదు.

  98. 4 చూడు, నేను నీచుణ్ణి. నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిస్తాను? నా నోటి మీద చెయ్యి ఉంచుకుంటాను.

    5 ఒక సారి మాట్లాడాను. నేను మళ్ళీ నోరెత్తను. రెండు సార్లు మాట్లాడాను. ఇకపై పలకను.

  99. 4 నువ్వు అన్నావు. “నేను మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి నా మాట ఆలకించు. ఒక సంగతి నిన్ను అడుగుతాను. దాన్ని నాకు తెలియజెప్పు.”

    5 నిన్ను గూర్చిన విషయాలు నేను విన్నాను. అయితే ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను.

    6 కాబట్టి నన్ను నేను అసహ్యించుకుని, ధూళిలో, బూడిదెలో, పడి పశ్చాత్తాపపడుతున్నాను.

  100. దావీదు రాసిన యాత్రల కీర్తన

    1 యెహోవా, నా హృదయంలో అహంకారం లేదు. నా కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించడం లేదు. నాకు మించిన విషయాల జోలికి నేను వెళ్ళడం లేదు.

    2 తల్లిపాలు విడిచిన పిల్ల తన తల్లి దగ్గర నిశ్చింతగా ఉన్నట్టు నేను ప్రశాంతంగా ఉండి నాప్రాణాన్ని స్థిమితంగా ఉంచుకున్నాను.

  101. 2 దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడడానికి త్వరపడక నీ నోటిని కాచుకో.

    దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు,

    కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి.

  102. 15 నేనేమనగలను? ఆయన నా గురించి మాట పలికాడు, ఆయనే దాన్ని జరిగించాడు.

    నా హృదయంలో నిండి ఉన్న దుఃఖాన్ని బట్టి నా సంవత్సరాలన్నీ తడబడుతూ గడిపేస్తాను.

  103. 23 యెహోవా చెప్పేదేమంటే “తెలివైనవాడు తన తెలివిని బట్టీ బలవంతుడు తన బలాన్ని బట్టీ గర్వించకూడదు. అలాగే ధనవంతుడు తన ఆస్తిని బట్టి గర్వించకూడదు.

    24 దేనిలో అతిశయించాలంటే, ఈ భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడంలోనే అతిశయించాలి.

    అలాటి వాటిలోనే నేను ఆనందిస్తాను.”

  104. 46 తమలో ఎవరు గొప్పవాడు అనే వాదం వారిలో పుట్టింది. 47 యేసు వారి హృదయాల్లోని ఆలోచనలను తెలుసుకుని ఒక చిన్న బిడ్డను తన దగ్గర నిలబెట్టుకుని, 48 “ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే అతడు నన్ను స్వీకరిస్తున్నాడు. నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరిస్తున్నాడు. మీలో ఎవరు అందరి కంటే చిన్నవాడిగా ఉంటాడో వాడే గొప్పవాడు.”

  105. 24 పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా! కాబట్టి అదేవిధంగా మీరు బహుమానం పొందాలని పరుగెత్తండి. 25 అంతే కాక పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని విషయాల్లో ఆత్మనిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడి పోయే ఆకుల కిరీటం కోసం పరిగెత్తితే, మనం అక్షయమైన కిరీటం కోసం ఆత్మ నిగ్రహంతో పరిగెత్తుతాము.

    26 కాబట్టి నేను గమ్యం లేని వాడిలా పరుగెత్తను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు. 27 ఇతరులకు ప్రకటించిన తరువాత ఒక వేళ నేనే అర్హత కొల్పోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి, దాన్ని నాకు లోబరచుకొంటున్నాను.

  106. 30 అతిశయపడాల్సి వస్తే నేను నా బలహీనతలను కనపరిచే వాటిలోనే అతిశయిస్తాను.

  107. 1 మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. 2 మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.

    3 మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి. 4 మీరు ఇంతవరకూ రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడమూ, దానితో పోరాడటమూ చేయలేదు.

  108. 3 జడలు అల్లుకోవడం, బంగారు ఆభరణాలు, ఖరీదైన బట్టలు అనే బాహ్య అలంకారాలు మీకు వద్దు. 4 వాటికి బదులు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. అలాంటి అలంకారం నాశనం కాదు. అది దేవుని దృష్టికి చాలా విలువైనది.