26 Bible Verses About Forgiving Others

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Forgiving Others
  1. 12 మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు.

    13 మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.”

    14 “మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు. 15 మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు.

  2. 12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.

    14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది.

  3. 31 సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. 32 హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.

  4. 25 అంతే కాక మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరితోనైనా విరోధముంటే అతన్ని క్షమించండి. 26 అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”

  5. 37 ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు ఎవరూ మీకు తీర్పు తీర్చరు. ఎవరి మీదా నేరారోపణ చేయవద్దు. అప్పుడు ఎవరూ మీ మీద నేరం మోపరు. ఇతరులను క్షమించండి. అప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది.

  6. 3 మీ వరకూ మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి.

    4 అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా ఏడు సార్లు అపరాధం చేసి అదే రోజు ఏడు సార్లు మీ దగ్గరికి వచ్చి, ‘పశ్చాత్తాప పడుతున్నాను’ అంటే మీరు అతణ్ణి క్షమించాలి.”

  7. 21 “‘హత్య చేయవద్దు. హత్య చేసేవాడు శిక్షకు లోనవుతాడు’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు. 22 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు.

    23 “కాబట్టి నీవు నీ కానుకను బలిపీఠం వద్ద అర్పించే ముందు, నీ సోదరునికి నీ మీద ఏదైనా విరోధ భావం ఉందని నీకు గుర్తుకు వచ్చిందనుకో. 24 నీ కానుకను అక్కడే, బలిపీఠం ఎదుటే వదిలి వెళ్ళు. ముందు నీ సోదరునితో రాజీ పడు. ఆ తరువాత వచ్చి నీ కానుకను అర్పించు.

  8. 15 “ఇంకో విషయం. నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే. 16 అతడు వినకపోతే, ‘ప్రతి విషయమూ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి.’ కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. 17 అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి. అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా, పన్ను వసూలుదారుడుగా పరిగణించు.

    18 “నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో, దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు. 19 ఇంకో విషయం, దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు.

    20 “ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను.”

  9. 21 అప్పుడు పేతురు వచ్చి, “ప్రభూ, నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్లు సరిపోతుందా?” అని యేసుని అడిగాడు. 22 అందుకు యేసు అతనికి జవాబిస్తూ, “ఏడు సార్లు వరకే కాదు, ఏడుకు డెబ్భై సార్ల వరకూ అని నీతో చెబుతున్నాను. 23 కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడడానికి పూనుకున్నట్టు ఉంది.

    24 అతడు లెక్క చూడడం ప్రారంభించగానే, అతనికి పదివేల తలాంతులు బాకీపడిన ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు. 25 ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ రాజు అతనినీ అతని భార్యనూ అతని పిల్లలనూ, ఇంకా అతనికి ఉన్నదంతా అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు. 26 అప్పుడా పనివాడు ఆ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, ‘రాజా, నా విషయం కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. 27 ఆ రాజు జాలిపడి, అతని బాకీ అంతా క్షమించి, అతనిని విడిచి పెట్టేశాడు.

    28 అయితే ఆ పనివాడు బయటికి వెళ్ళి తనకు కేవలం వంద దేనారాలు బాకీ ఉన్న తోటి పనివాణ్ణి చూసి ‘నా బాకీ తీర్చు’ అని అతని గొంతు పట్టుకున్నాడు. 29 అందుకు అతని తోటి పనివాడు సాగిలపడి, ‘కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. 30 కాని దానికి అతడు ఒప్పుకోక తన బాకీ తీర్చేవరకూ అతణ్ణి ఖైదులో పెట్టించాడు.

    31 “అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి, వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు. 32 అప్పుడా రాజు ఆ మొదటి పనివాణ్ణి పిలిపించి, ‘నువ్వు చెడ్డవాడివి. నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ బాకీ అంతా క్షమించేశానే! 33 నేను నీ మీద దయ చూపించినట్టే నీవు కూడా నీ తోటి పనివాణ్ణి క్షమించాలి కదా’ అని చెప్పి 34 అతని మీద కోపంతో అతడు తనకు బాకీపడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టే వారికి అతన్ని అప్పగించాడు.

    35 మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.

  10. 18 మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి.

    19 ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోవద్దు. దేవుని కోపానికి చోటియ్యండి. “పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది.

    20 “కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు.

    అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది.”

  11. 43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.

    46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.

  12. 33 వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు.

    34 అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు” అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు.

  13. 20 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక 21 నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది.”

    22 ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కానీ అబ్రాహాము ఇంకా యెహోవా సముఖంలోనే నిలబడి ఉన్నాడు. 23 అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. “దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా?

    24 ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా? 25 నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?” 26 దానికి యెహోవా “సొదొమ పట్టణంలో యాభైమంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను” అన్నాడు.

    27 అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. 28 యాభై మంది నీతిమంతుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువయ్యారనుకోండి. ఐదుగురు తక్కువయ్యారని ఆ పట్టణమంతటినీ నాశనం చేస్తావా?” అని మళ్ళీ అడిగాడు. అందుకాయన “అక్కడ నలభై ఐదుగురు కనిపిస్తే నాశనం చేయను” అన్నాడు.

    29 అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ “ఒకవేళ అక్కడ నలభై మందే కనిపిస్తారేమో” అన్నాడు. దానికి ఆయన “ఆ నలభై మంది కోసం నాశనం చేయను” అని చెప్పాడు. 30 అతడు మళ్ళీ “ప్రభూ, నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ ముప్ఫై మందే అక్కడ కనిపిస్తారేమో” అన్నాడు. అప్పుడాయన “ముప్ఫై మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు. 31 అందుకు అతడు “నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ ఇరవైమందే ఉంటారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “ఆ ఇరవైమంది కోసం నాశనం చేయను” అన్నాడు.

    32 చివరిగా అతడు “ప్రభూ, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ పదిమందే అక్కడ ఉన్నారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “పదిమంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు. 33 అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.

  14. 4 మాకు వ్యతిరేకంగా ఎవరైనా చేసిన అపరాధాలు మేము క్షమిస్తూ ఉన్నాం గనక మా పాపాలనూ క్షమించు. మమ్మల్ని పరీక్షలోకి తీసుకు వెళ్ళకు’ అని పలకండి” అని చెప్పాడు.

  15. 59 వారు స్తెఫనును రాళ్ళతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును పిలుస్తూ, “యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకో” అని చెప్పాడు. 60 అతడు మోకరించి, “ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్దు” అని గొంతెత్తి పలికాడు. ఈ మాట పలికి కన్ను మూశాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు.

  16. 8 “నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించు,” అని లేఖనాల్లో రాసి ఉన్న దైవ రాజాజ్ఞ పాటిస్తే, మీ ప్రవర్తన సరిగా ఉన్నట్టే.

    9 కాని మీరు కొందరి విషయంలో పక్షపాతంగా ఉంటే మీరు పాపం చేస్తున్నట్టే. మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు ధర్మశాస్త్రమే నిర్ధారిస్తున్నది. 10 ఎవరైనా ధర్మశాస్త్రం అంతా పాటించి, ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో అయినా తడబడితే, ఆజ్ఞలన్నిటినీ మీరిన అపరాధి అవుతాడు. 11 “వ్యభిచారం చెయ్యవద్దు” అని చెప్పిన దేవుడు, “హత్య చెయ్యవద్దు” అని కూడా చెప్పాడు. నువ్వు వ్యభిచారం చేయకుండా హత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే.

    12 నిజమైన స్వాతంత్రం ఇచ్చే ధర్మశాస్త్రం విషయంలో తీర్పుకు గురయ్యే వారికి తగినట్టుగా మాట్లాడండి. అదే విధంగా ప్రవర్తించండి. 13 కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది.

  17. 30 మరుసటి రోజు మోషే ప్రజలతో “మీరు గొప్ప పాపం చేశారు. నేను యెహోవా దగ్గరికి కొండ ఎక్కి వెళ్తాను. ఒకవేళ మీరు చేసిన పాపం కోసం ఏదైనా ప్రాయశ్చిత్తం చేయగలనేమో” అన్నాడు.

    31 మోషే యెహోవా కొండకు మళ్ళీ వెళ్ళాడు. “అయ్యో, ఈ ప్రజలు ఎంతో పాపం చేశారు. వాళ్ళు తమ కోసం బంగారు దేవుణ్ణి చేసుకున్నారు. 32 అయ్యో, వాళ్ళు చేసిన పాపాన్ని పరిహరించు, లేని పక్షంలో నువ్వు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తొలగించు” అని బతిమాలుకున్నాడు.

  18. దావీదు రాసిన కీర్తన, మస్కిల్. దైవధ్యానం.

    1 తాను చేసిన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు, తన పాపాలు పరిహారం అయినవాడు ధన్యజీవి.

    2 యెహోవా నిర్దోషిగా పరిగణించిన వాడు, తన ఆత్మలో కపటమనేది లేనివాడు ధన్యజీవి.

    3 నేను నిశ్శబ్దంగా ఉండి రాత్రంతా మూల్గుతున్నాను. దాంతో నా ఎముకలు బలహీనమై పోతున్నాయి.

    4 పగలూ రాత్రీ నా మీద నీ చెయ్యి భారంగా ఉంది. వేసవిలో దుర్భిక్షంలా నా శక్తి అంతా హరించుకు పోయింది. సెలా.

    5 అప్పుడే నా పాపాన్ని నీ ఎదుట ఒప్పుకున్నాను. నా దోషాన్ని ఇక నేను దాచిపెట్టుకోలేదు. నేను నా అతిక్రమాలను యెహోవా దగ్గర అంగీకరిస్తాను అనుకున్నాను. అప్పుడు నువ్వు నా పాపాలను క్షమించావు. సెలా.

  19. 8 పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.

  20. 8 చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి.

    9 కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.

  21. 7 పేదవాణ్ణి అతని బంధువులంతా ఏవగించుకుంటారు. అలాగైతే అతని స్నేహితులు మరింకెంతగా దూరమైపోతారు! వాడు వాళ్ళను పిలుస్తాడు గానీ వాళ్ళక్కడ ఉండరు.

  22. 17 నీ శత్రువు పడిపొతే సంతోషించవద్దు. వాడు తూలిపడినప్పుడు నీవు మనస్సులో అనందించవద్దు.

    18 యెహోవా అది చూసి అసహ్యించుకుని వాడి మీదనుండి తన కోపం చాలించుకుంటాడేమో.

  23. 21 నీ పగవాడు ఆకలిగా ఉంటే వాడికి అన్నం పెట్టు. దాహంతో ఉంటే వాడికి మంచినీళ్ళు ఇవ్వు.

    22 అలా చేస్తే వాడి తలపై నిప్పులు కుప్పగా పోసిన వాడివౌతావు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తాడు.

  24. 36 మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి.

  25. 3 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి.

  26. ప్రధాన సంగీతకారుడి కోసం. బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు దగ్గరకు నాతాను వచ్చినప్పుడు దావీదు రాసిన కీర్తన.

    1 దేవా, నీ నిబంధన కృప కారణంగా నన్ను కనికరించు. నీ అధికమైన కరుణను బట్టి నా దోషాలను తుడిచివెయ్యి.

    2 నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు. నా పాపం నుండి నన్ను పవిత్రపరచు.

    3 నా అతిక్రమాలేంటో నాకు తెలుసు. నేను చేసిన పాపం నా కళ్ళ ఎదుటే ఉంది.

    4 నీకు వ్యతిరేకంగా, కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతావు. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు.