79 Bible Verses About Distractions

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Distractions
  1. 29 తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. “అంజూర చెట్టునూ మిగిలిన అన్ని చెట్లనూ చూడండి. 30 అవి చిగురించినప్పుడు వసంత రుతువు వచ్చేసిందని మీరు తెలుసుకుంటారు కదా! 31 అదే విధంగా ఈ సంగతులు జరుగుతున్నప్పుడు దేవుని రాజ్యం దగ్గరలో ఉందని తెలుసుకోండి. 32 ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతం కాదని మీకు కచ్చితంగా చెబుతున్నాను. 33 ఆకాశమూ భూమీ అంతం అవుతాయి కానీ నా మాటలు ఎన్నటికీ అంతం కావు.

    34 “తినడం, తాగడం వల్లా, మత్తుగా ఉండడం వల్లా, ఇహలోక చింతల వల్లా మీ హృదయాలు బరువెక్కి ఉండగా, ఆ రోజు ఒక వలలాగా ఆకస్మికంగా మీ మీదికి వచ్చి పడకుండా జాగ్రత్త పడండి. 35 ఆ రోజు లోకంలో ఉన్న వారందరి పైకి అకస్మాత్తుగా వస్తుంది. 36 కాబట్టి జరగబోయే వీటన్నిటి నుండి తప్పించుకుని, మనుష్య కుమారుడి ముందు నిలవడం కోసం శక్తిగల వారుగా ఉండడానికి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి” అని చెప్పాడు.

  2. 1 సోదరులారా, కాలాలను సమయాలను గూర్చి నేను మీకు రాయనక్కరలేదు. 2 రాత్రి పూట దొంగ ఎలా వస్తాడో ప్రభువు దినం కూడా అలానే వస్తుందని మీకు బాగా తెలుసు. 3 ప్రజలు “అంతా ప్రశాంతంగా భద్రంగా ఉంది. భయమేమీ లేదు,” అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భవతికి నొప్పులు వచ్చినట్టుగా వారి మీదికి నాశనం అకస్మాత్తుగా వస్తుంది కనుక వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.

    4 సోదరులారా, ఆ రోజు దొంగలాగా మీ మీదికి రావడానికి మీరేమీ చీకటిలో ఉన్నవారు కాదు. 5 మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రి సంతానం కాదు. చీకటి సంతానమూ కాదు. 6 కాబట్టి ఇతరుల్లాగా నిద్ర పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం. 7 నిద్రపోయే వారు రాత్రుళ్ళు నిద్రపోతారు. తాగి మత్తెక్కేవారు రాత్రుళ్ళే మత్తుగా ఉంటారు. 8 విశ్వాసులమైన మనం పగటి వాళ్ళం కాబట్టి మనలను మనం అదుపులో ఉంచుకుందాము. విశ్వాసం, ప్రేమను కవచంగా, రక్షణ కొరకైన ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకుందాం.

    9 ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ పొందడానికే మనలను నియమించాడు గానీ ఉగ్రతను ఎదుర్కోడానికి కాదు. 10 మనం మెలకువగా ఉన్నా నిద్రపోతూ ఉన్నా తనతో కలసి జీవించడానికే ఆయన మన కోసం చనిపోయాడు. 11 కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలగజేసుకోండి.

  3. 31 ఆకాశం, భూమి గతించిపోతాయి. కాని నా మాటలు ఎన్నటికీ గతించవు. 32 అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారుడికి గానీ, మరెవ్వరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు. 33 జాగ్రతగా ఉండండి. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు.

    34 “ఇది తన ఇల్లు విడిచి వేరే దేశం వెళ్ళిన ఒక మనిషిలాగా ఉంటుంది. అతడు తన సేవకులకు అధికారం ఇచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పగించి ద్వారం దగ్గర ఉన్నవాడికి మెలకువగా ఉండమని చెప్పాడు. 35 కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, అర్థరాత్రి వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, సూర్యోదయం వేళ వస్తాడో మీకు తెలియదు. 36 ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో జాగ్రత్త! 37 నేను మీకు చెబుతున్నది అందరికి చెప్తున్నాను, మెలకువగా ఉండండి.”

  4. 10 చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. 11 మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.

    12 ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.

    13 అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. 14 మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం, 15 పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. 16 వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి. 17 ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.

    18 ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి.

  5. 8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. 9 వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.

    10 తన నిత్య మహిమకు క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన అపార కరుణానిధి అయిన దేవుడు కొంత కాలం మీరు బాధపడిన తరువాత, తానే మిమ్మల్ని సరైన స్థితిలోకి తెచ్చి, బలపరచి, సామర్థ్యం ఇచ్చి స్థిర పరుస్తాడు.

  6. 38 వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది. 39 ఆమెకు మరియ అనే సోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం వింటూ ఉంది. 40 మార్త ఎన్నో పనులు పెట్టుకుని తొందరపడుతూ ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది. నీకేం పట్టదా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు” అంది.

    41 అందుకు ప్రభువు, “మార్తా, మార్తా, నువ్వు బోలెడన్ని పనులను గురించి తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే. 42 మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు” అని ఆమెతో చెప్పాడు.

  7. 1 ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “ఆటంకాలు రాకుండా ఉండడం అసాధ్యం. కానీ అవి ఎవరి వల్ల వస్తాయో అతని స్థితి ఎంత భయానకమో! 2 అలాంటి వ్యక్తి ఈ చిన్న బిడ్డల్లో ఎవరికైనా ఆటంకం కలగజేయడం కంటే అతడి మెడకు తిరగలి రాయి కట్టి సముద్రంలో పడవేయడం అతనికి మేలు.

  8. 20 కుమారా, నేను చెప్పే మాటలు విను. నా నీతి బోధలు మనసులో ఉంచుకో.

    21 నీ మార్గం అంతటిలో నుండి వాటిని అనుసరించు. నీ హృదయంలో వాటిని భద్రంగా దాచుకో.

    22 అవి దొరికిన వారికి జీవం కలుగుతుంది. వాళ్ళ శరీరమంతటికీ ఆరోగ్యం కలిగిస్తాయి.

    23 అన్నిటికంటే ముఖ్యంగా వాటిని నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. అప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి.

    24 నీ నోటి నుండి కుటిలమైన మాటలు, మోసకరమైన మాటలు రానియ్యకు.

    25 నీ కంటిచూపు సూటిగా ఉండనియ్యి. నీ ఆలోచనల్లో ముందు చూపు కలిగి ఉండు.

    26 నువ్వు నడిచే మార్గం సరళం చెయ్యి. అప్పుడు నీ దారులన్నీ స్థిరపడతాయి.

    27 కుడివైపుకు గానీ, ఎడమవైపుకు గానీ తొలగిపోవద్దు. దుర్మార్గం వైపు నడవకుండా నీ అడుగులు తప్పించుకో.”

  9. 1 అందుచేత మనం విన్న సంగతుల నుండి కొట్టుకుని పోకుండా వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. 2 ఎందుకంటే దేవదూతలు పలికిన సందేశం నమ్మదగినదైతే, ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన శిక్ష కలిగితే, 3 ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? ఆ రక్షణను మొదటిగా ప్రభువే ప్రకటించాడు, దాన్ని విన్న వారి ద్వారా అది మనకు రుజువు అయింది. 4 దేవుడు తన సూచకక్రియలు, అద్భుతాలు, అనేక రకాల గొప్ప గొప్ప కార్యాలు చేయడం ద్వారానూ, తన ఇష్ట ప్రకారం పంచి ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాల ద్వారానూ దాన్ని నిర్ధారణ చేశాడు.

  10. 5 సంఘానికి బయట ఉన్నవారి విషయంలో జ్ఞానంతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.

  11. 38 అప్పుడు ఆయన వారితో, “నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పాడు.

    39 ఆయన కొంత దూరం వెళ్ళి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు” అని ప్రార్థన చేశాడు. 40 శిష్యుల దగ్గరికి వచ్చి, వారు నిద్ర పోతుండడం చూసి, “నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా? 41 మీరు పరీక్షలో పడకుండా ఉండేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమేగానీ శరీరం బలహీనం” అని పేతురుతో అన్నాడు.

    42 యేసు రెండవ సారి దూరంగా వెళ్ళి, “నా తండ్రీ, నేను దీన్ని తాగితేనే తప్ప నా నుండి తీసివేయడం సాధ్యం కాదనుకుంటే, నీ చిత్తమే నెరవేరనీ!” అని ప్రార్థన చేశాడు. 43 ఆయన తిరిగి వచ్చి, వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు నిద్రాభారంతో మూతలు పడుతున్నాయి.

    44 ఆయన వారిని మళ్ళీ విడిచి వెళ్ళి, ఆ మాటలే తిరిగి చెబుతూ మూడోసారి ప్రార్థన చేశాడు.

  12. 1 దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు. 2 స్త్రీ ఆ సర్పంతో “ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు. 3 కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది.

    4 పాము స్త్రీతో “మీరు చావనే చావరు. 5 ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు” అన్నాడు. 6 స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.

    7 అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు.

  13. 12 పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.

    13 చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, “ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది,” అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు, ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా.

    14 ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. 15 చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది. 16 నా ప్రియ సోదరులారా, మోసపోకండి.

  14. 24 ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవునికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు.

    25 “అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే, ‘ఏమి తినాలి? ఏమి తాగాలి?’ అని మీ జీవితాన్ని గురించి గానీ, ‘ఏమి కట్టుకోవాలి?’ అని మీ శరీరం గురించి గానీ బెంగ పెట్టుకోవద్దు. తిండి కంటే జీవితమూ బట్టల కంటే శరీరమూ ఎక్కువే కదా! 26 ఎగిరే పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైన వారు కాదా?

    27 ఆందోళనపడి మీలో ఎవరు తన జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడు? 28 బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి పని చేయవు, బట్టలు నేయవు. 29 అయినా నేనంటాను, తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సైతం వీటిలో ఒక్క దానికున్నంత అలంకారం లేదు. 30 ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!

    31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. 32 దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు. 34 కాబట్టి రేపటి విషయం దిగులు పడవద్దు. దాని సంగతి అదే చూసుకుంటుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.

  15. 35 “మీ నడుము బిగించుకుని ఉండండి. మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి. 36 యజమాని ఎప్పుడు వస్తాడో అని అతని కోసం ఎదురు చూస్తూ అతడు పెండ్లి విందు నుండి వచ్చి తలుపు కొట్టగానే తలుపు తీసే సేవకుల్లా ఉండండి.

    37 యజమాని వచ్చి ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ దాసులు ధన్యులు. అప్పుడు అతడు తన నడుం కట్టుకుని వారిని భోజనానికి కూర్చోబెట్టి, వారికి తానే పరిచర్య చేస్తాడని మీకు కచ్చితంగా చెబుతున్నాను. 38 అతడు రాత్రి రెండవ జాములో వచ్చినా, మూడవ జాములో వచ్చినా ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ సేవకులు ధన్యులు. 39 దొంగ ఏ సమయంలో వస్తాడో ఇంటి యజమానికి తెలిస్తే అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనివ్వడని తెలుసుకోండి. 40 మీరు ఊహించని సమయంలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి” అని వారికి చెప్పాడు. 41 అప్పుడు పేతురు, “ప్రభూ ఈ ఉపమానం మా కోసమే చెబుతున్నావా లేక అందరి కోసం చెబుతున్నావా?” అని ఆయనను అడిగాడు.

    42 దానికి ప్రభువు ఇలా అన్నాడు, “సరైన సమయంలో అందరికీ ఆహారం పెట్టడానికి యజమానుడు తన ఇంటిపై నియమించే నమ్మకమైన, బుద్ధిగల నిర్వాహకుడెవడు? 43 యజమాని వచ్చి ఏ పనివాడు ఆ విధంగా చేయడం చూస్తాడో ఆ పనివాడు ధన్యుడు. 44 అప్పుడు ఆ యజమాని తన ఆస్తి అంతటి మీదా అతణ్ణి ఉంచుతాడని మీకు చెబుతున్నాను.

  16. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. 16 కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.

  17. 8 ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి. దానిలో రాసి ఉన్న వాటన్నిటినీ చేయడానికి నీవు జాగ్రత్త పడేలా రాత్రీ పగలూ దాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు.

  18. 42 ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. 43 దొంగ ఏ గంటలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతడు మేలుకుని ఉండి దొంగతనం చేయనివ్వడు కదా! 44 మీరు ఎదురు చూడని గంటలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి.

    45 “ఒక యజమాని తన ఇంట్లో పనివారికి వేళకు భోజనం పెట్టడానికి నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుడు ఎవరు? 46 యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఏ దాసుడు ఆ విధంగా చేస్తుండడం గమనిస్తాడో ఆ దాసుడు ధన్యుడు. 47 ఆ యజమాని తన యావదాస్తి మీదా ఆ దాసుని నియమిస్తాడని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను. 48 కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని ఆలస్యంగా వస్తాడులే’ అని తన మనసులో అనుకుని 49 తన సాటి సేవకులను కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే, 50 అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు. 51 వాణ్ణి రెండు ముక్కలుగా నరికించి కపట వేషధారులతో బాటు వాడిని శిక్షిస్తాడు. అక్కడ ఏడుపూ పండ్లు కొరకడమూ ఉంటాయి.”

  19. ప్రథమ పరిచ్ఛేదము

    1 దుర్మార్గుల సలహా ప్రకారం నడుచుకోనివాడు, పాపాత్ముల దారిలో నిలవనివాడు, అల్లరి మూకలతో కూర్చోని వాడు ధన్యుడు.

    2 అతడు యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తాడు. అతడు రేయింబవళ్ళు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు.

    3 అతడు నీటికాలువల ఒడ్డున నాటి, ఆకు వాడకుండా తగిన కాలంలో ఫలించే చెట్టులాగా ఉంటాడు. అతడు ఏది చేసినా వర్ధిల్లుతాడు.

  20. 13 ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.

  21. 13 మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ధైర్యం గలిగి, బలవంతులై ఉండండి. 14 మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.

  22. 1 “పరలోక రాజ్యాన్ని ఈ విధంగా పోల్చవచ్చు. పదిమంది కన్యలు పెళ్ళికొడుకును కలుసుకోడానికి కాగడాలు పట్టుకుని బయలుదేరారు. 2 వీరిలో ఐదుగురు తెలివి తక్కువ వారు, ఐదుగురు తెలివైన వారు. 3 తెలివి తక్కువ వారు తమ దీపాలు పట్టుకున్నారు గాని తమతో నూనె తీసుకుని పోలేదు. 4 తెలివైన వారు తమ దీపాలతో బాటు సీసాల్లో నూనె తీసుకుని వెళ్ళారు. 5 పెళ్ళికొడుకు రావడం ఆలస్యం కావడంతో వారంతా నిద్రపోయారు.

    6 అర్థరాత్రి, ‘ఇడుగో, పెళ్ళికొడుకు వస్తున్నాడు. అతనికి ఎదురు వెళ్ళండి’ అనే పిలుపు వినిపించింది. 7 అప్పుడు ఆ కన్యలంతా లేచి తమ దీపాలు సరిచేసుకున్నారు.

    8 అయితే తెలివి తక్కువవారు, ‘మా దీపాలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం మాక్కూడా ఇస్తారా?’ అని తెలివైన వారిని అడిగారు. 9 అందుకు వారు, ‘మా దగ్గర ఉన్న నూనె మన ఇద్దరికీ సరిపోదేమో, మీరు వెళ్ళి నూనె అమ్మేవారి దగ్గర కొనుక్కోండి’ అని చెప్పారు.

    10 వారు కొనడానికి వెళ్తూ ఉండగానే పెళ్ళికొడుకు వచ్చేశాడు. అప్పుడు సిద్ధంగా ఉన్న ఐదుగురు యువతులు అతనితో కలిసి పెళ్ళి విందుకు లోపలికి వెళ్ళారు. వెంటనే తలుపు మూశారు. 11 ఆ తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ‘ప్రభూ, ప్రభూ, మాకు తలుపు తెరవండి’ అని అడిగారు. 12 కాని ఆయన, ‘నేను కచ్చితంగా చెబుతున్నాను, మీరెవరో నాకు తెలీదు’ అన్నాడు. 13 ఆ రోజైనా, ఆ గంటైనా మీకు తెలియదు కాబట్టి మేలుకుని ఉండండి.

  23. 29 సోదరులారా, నేను చెప్పేదేమంటే, సమయం కొద్దిగానే ఉంది కాబట్టి ఇక ముందు భార్యలు గలవారు భార్యలు లేనట్టుగా ఉండాలి. 30 ఏడ్చేవారు ఏడవనట్టు, సంతోషించేవారు సంతోషించనట్టు ఉండాలి. కొనేవారు తాము కొన్నది తమది కానట్టు ఉండాలి. 31 ఈ లోక వ్యవహారాలు సాగించేవారు లోకంతో తమకేమీ సంబంధం లేనట్టు ఉండాలి. ఎందుకంటే ఈ లోక వ్యవస్థ గతించిపోతూ ఉంది.

    32 మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్ళి కానివాడు ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఆయన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు. 33 పెళ్ళయిన వాడు తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోకవిషయాల గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు. 34 అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. అదే విధంగా పెళ్ళయిన స్త్రీకీ, పెళ్ళికాని స్త్రీకీ తేడా ఉంది. కన్య శరీరంలో ఆత్మలో పవిత్రత కలిగి ఉండాలని ప్రభువు కార్యాలను గూర్చి శ్రద్ధ కలిగి ఉంటుంది. పెళ్ళైన స్త్రీ అయితే తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటుంది. 35 మీకు ఆటంకంగా ఉండాలని కాదు, మీ మంచి కోసమే చెబుతున్నాను. మీరు మంచి నడవడితో, ఇతర ధ్యాసలేమీ లేకుండా ప్రభువుపై దృష్టి ఉంచి ఆయన సేవ చేయాలని నా ఆశ.

  24. 15 “వినండి! నేను దొంగలా వస్తున్నాను. పదిమందిలో సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా, బయటకు వెళ్ళినప్పుడు తన నగ్నత్వం కనిపించకుండా జాగ్రత్తగా ఉండి దుస్తులు ధరించి ఉండేవాడు దీవెన పొందుతాడు.”

  25. మేమ్‌

    97 నీ ధర్మశాస్త్రం నాకెంతో ఇష్టంగా ఉంది. రోజంతా నేను దాన్ని ధ్యానిస్తున్నాను.

    98 నీ ఆజ్ఞలు అనునిత్యం నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నాయి.

  26. 11 ఈ ఉపమానానికి అర్థం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం. 12 దారి పక్కన పడిన విత్తనాలు ఎవరంటే వీరు వాక్కును వింటారు గానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని తీసివేస్తాడు. 13 రాతి నేలపై పడిన విత్తనాలు ఎవరంటే వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే వారు. కానీ వారిలో వేరు లేదు కాబట్టి కొంతకాలం నమ్మి తరువాత విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు. 14 ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరిని పోలిన వారంటే, వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో, సుఖాలతో, సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు. వీరి ఫలం పక్వానికి రాదు. 15 మంచి నేలపై పడే విత్తనాలు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్కును విని, భద్రంగా చేపట్టి ఓపికతో ఫలించేవారు.

  27. 28 “ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించీ, మీ మట్టుకు మిమ్మల్ని గురించీ జాగ్రత్తగా ఉండండి. 29 నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే క్రూరమైన తోడేళ్ళు వంటివారు మీలో ప్రవేశిస్తారు. వారు మందపై జాలి చూపరు.

    30 అంతేకాక శిష్యులను తమతో ఈడ్చుకుపోవడం కోసం దారి మళ్ళించే మాటలు పలికే వ్యక్తులు మీలో నుండే బయలుదేరుతారు. 31 కాబట్టి మూడు సంవత్సరాలుగా నేను రాత్రింబగళ్ళు కన్నీళ్ళతో మీలో ప్రతి ఒక్కరికీ ఎడతెగక బుద్ధి నేర్పడం మానలేదని గుర్తుంచుకుని మెలకువగా ఉండండి.

  28. 15 బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి. 16 సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి.

  29. 1 మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. 2 మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.

    3 మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి.

  30. 7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.

  31. 7 “నా విషయంలో ఆటంకాలు కలిగించడం లోకానికి తీర్పుకు కారణమౌతుంది. ఆటంకాలు రాక మానవు. కానీ అవి ఎవరి వలన కలుగుతాయో, ఆ వ్యక్తికి శిక్ష తప్పదు. 8 నీ చెయ్యి గాని, నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే, దాన్ని నరికి పారవెయ్యి. రెండు చేతులూ రెండు పాదాలూ ఉండి నిత్యాగ్నిలో పడడం కంటే కుంటివాడుగానో, అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది. 9 నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవెయ్యి. రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.

  32. 33 నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను.

    34 ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను.

    35 పాపులు భూమిపై లేకుండా పోవాలి. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవాను స్తుతించండి.

  33. 15 నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను.

    16 నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను.

  34. 8 చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. 9 మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.

  35. 1 పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు. 2 ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది. 3 వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల్లో కొన్ని తినకూడదని వీరు అంటారు.

  36. 7 మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకు పోలేము. 8 కాబట్టి అవసరమైన అన్నవస్త్రాలు కలిగి వాటితో తృప్తిగా ఉందాం. 9 ధనవంతులు కావాలని ఆశించేవారు శోధనలో, ఉచ్చులో, బుద్ధిహీనమైన, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. అలాంటివి మనుషులను సంపూర్ణ పతనానికి నాశనానికీ గురిచేస్తాయి. 10 ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కుని తెచ్చుకున్నారు.

    11 దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు. 12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి, దేవుడు దేనిని పొందడానికి నిన్ను పిలిచాడో ఆ నిత్యజీవాన్ని చేపట్టు. దాని విషయంలో నువ్వు అనేకమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావు.

  37. 15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. 16 ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే. 17 ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.

  38. 12 కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో, అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి.

  39. 1 సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. 2 ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.

    3 ఏ గొప్పతనం లేనివాడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటుంటే తనను తానే మోసపరచుకుంటున్నాడు.

  40. 7 అన్నిటికీ అంతం సమీపించింది. కాబట్టి మెలకువగా, ప్రార్థనల్లో చైతన్య వంతులుగా ఉండండి.

  41. 148 నీవిచ్చిన వాక్కును నేను ధ్యానించడానికి నాకళ్ళు రాత్రిజాములు గడవక ముందే తెరుస్తాను.

  42. 33 నా ఉపదేశాలను నిర్యక్షం చేయకుండా వాటిని పాటించి వివేకంతో నడుచుకోండి.

    34 నా ఉపదేశం వినేవాళ్ళు ధన్యులు. ప్రతిరోజూ నా గుమ్మం దగ్గర కనిపెట్టుకుని నా గుమ్మం తలుపుల దగ్గర నా కోసం కాచుకుని నా ఉపదేశం వినేవారు ధన్యులు.

  43. 18 ఆయన తానే బాధలు పొంది, శోధనల గుండా వెళ్ళాడు కాబట్టి శోధనలనెదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి సామర్ధ్యం కలిగి ఉన్నాడు.

  44. 4 యేసు వారితో ఇలా అన్నాడు, “ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. 5 చాలామంది నా నామంలో వచ్చి ‘నేనే క్రీస్తుని’ అని చెప్పి అనేకమంది దారి తప్పేలా చేస్తారు. 6 అంతే గాక మీరు యుద్ధాల గురించి వింటారు. వాటి గురించిన వార్తలు వింటారు. అప్పుడు కలవరపడవద్దు. ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు.

  45. 17 సోదరులారా, నేను వేడుకునేదేమంటే, మీరు నేర్చుకొన్న బోధకు వ్యతిరేకంగా విభజనలు, ఆటంకాలు కలిగించే వారిని కనిపెట్టి చూడండి. వారికి దూరంగా తొలగిపొండి. 18 అలాటివారు ప్రభు యేసు క్రీస్తుకు కాదు, తమ కడుపుకే దాసులు. వారు వినసొంపైన మాటలతో, ఇచ్చకాలతో అమాయకులను మోసం చేస్తారు. 19 మీ విధేయత మంచి ఆదర్శంగా అందరికీ వెల్లడైంది. అందుకు మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మంచి విషయంలో జ్ఞానులుగా, చెడు విషయంలో నిర్దోషంగా ఉండాలి.

  46. 16 నీ గురించీ ఉపదేశం గురించీ జాగ్రత్త వహించు. వీటిలో నిలకడగా ఉండు. నీవు అలా చేసినప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడమే గాక నీ ఉపదేశం విన్న వారిని కూడా రక్షించుకుంటావు.

  47. 8 అన్నివేళలా యెహోవా వైపు నేను చూస్తూ ఉంటాను, ఆయన కుడిచేతిలోనుంచి నేను కదిలిపోను!

  48. 23 పాలకులు నాకు విరోధంగా కుట్ర పన్ని అపనిందలు వేసినా నీ సేవకుడు మాత్రం నీ కట్టడలను ధ్యానిస్తూనే ఉంటాడు.

    24 నీ శాసనాలు నాకు సంతోషదాయకం. అవి నాకు ఆలోచనకర్తలు.

  49. 36 “అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గానీ ఏ మనిషికీ తెలియదు. చివరికి పరలోకంలోని దూతలకు, కుమారుడికి కూడా తెలియదు. 37 నోవహు రోజుల్లో ఎలా ఉండేదో మనుష్య కుమారుడి రాకడ కూడా అలా ఉంటుంది. 38 జలప్రళయం రాక ముందు నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ, మనుషులు తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు. 39 జలప్రళయం వచ్చి వారంతా కొట్టుకునిపోయే వరకూ వారికి తెలియలేదు. ఆ విధంగానే మనుష్య కుమారుడి రాకడ ఉంటుంది.

  50. 4 మాకు వ్యతిరేకంగా ఎవరైనా చేసిన అపరాధాలు మేము క్షమిస్తూ ఉన్నాం గనక మా పాపాలనూ క్షమించు. మమ్మల్ని పరీక్షలోకి తీసుకు వెళ్ళకు’ అని పలకండి” అని చెప్పాడు.

  51. 10 సోదరులు అదే రాత్రి పౌలునూ సీలనూ బెరయ ఊరికి పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళారు. 11 వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఉన్నత భావాలు గలవారు. ఎందుకంటే వీరు శ్రద్ధతో వాక్యాన్ని అంగీకరించి, పౌలు, సీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి రోజూ లేఖనాలను తరచి చూస్తూ వచ్చారు.

  52. 18 నాలో, అంటే నా శరీరంలో మంచిదేదీ లేదని నాకు తెలుసు. మంచిని చేయాలనే కోరిక నాకు కలుగుతుంది గాని, దాన్ని చేయడం నా వల్ల కావడం లేదు. 19 నేను చేయాలని కోరే మంచిని చేయకుండా, నేను చేయగోరని చెడును జరిగిస్తున్నాను. 20 నేను కోరని దాన్ని చేస్తే అది నాలోని పాపమే గాని నేను కాదు. 21 అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాలోనే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను.

    22 అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. 23 కానీ వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసులోని ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవాల్లోని పాప నియమానికి నన్ను బందీగా చేస్తున్నది. 24 అయ్యో, నేనెంత నికృష్టుణ్ణి? చావుకు లోనైన ఈ శరీరం నుండి నన్నెవరు విడిపిస్తారు? 25 మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెబుతున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవనియమానికీ, శరీర విషయంలో పాప నియమానికీ దాసుణ్ణి.

  53. 17 కాబట్టి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినడం క్రీస్తు గురించిన మాట ద్వారా కలుగుతుంది.

  54. 11 కాబట్టి మీరు కాలాన్ని పరిశీలించి, నిద్ర నుండి మేల్కొన వలసిన సమయం అయ్యిందని గ్రహించండి. మనం మొదట విశ్వాసులం అయినప్పటి కంటే, మన రక్షణ ఇప్పుడు మరింత దగ్గరగా ఉంది. 12 రాత్రి చాలా వరకూ గడిచిపోయి పగలు సమీపంగా వచ్చింది కాబట్టి మనం చీకటి కార్యాలను విడిచిపెట్టి, వెలుగు సంబంధమైన ఆయుధాలను ధరించుదాం. 13 పోకిరీ వినోదాలతో, తాగిన మత్తులో, లైంగిక దుర్నీతితో హద్దూ అదుపూ లేని కామంతో, కలహాలతో, అసూయలతో కాకుండా పగటి వెలుగులోలాగా మర్యాదగా నడుచుకుందాం. 14 చివరగా ప్రభు యేసు క్రీస్తును ధరించుకోండి. శరీరానికీ దాని వాంఛలకు చోటియ్యకండి.

  55. 3 భర్త తన భార్య పట్లా, భార్య తన భర్త పట్లా వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి. 4 భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు. 5 ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి.

  56. 3 సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్టు మీ మనసులు క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను.

  57. 5 డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. “నిన్ను ఎన్నటికీ విడిచి పెట్టను. నిన్ను పరిత్యజించను” అని దేవుడే చెప్పాడు.

  58. 11 నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను.

  59. 5 యెహోవా కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా ప్రాణం ఎదురు చూస్తుంది. ఆయన మాటపైనే ఆశ పెట్టుకున్నాను.

    6 రాత్రి కాపలాదారులు ఉదయం కోసం ఎలా ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కోసం ఎదురు చూస్తూ ఉంది.

  60. 21 అప్పటినుంచి యేసు తాను యెరూషలేము వెళ్ళి అక్కడి పెద్దల, ప్రధాన యాజకుల, ధర్మశాస్త్ర పండితుల చేతుల్లో అనేక హింసలు పొంది, చనిపోయి, మూడవ రోజు తిరిగి సజీవంగా లేవడం తప్పనిసరి అని తన శిష్యులతో చెప్పడం మొదలుపెట్టాడు. 22 అప్పుడు పేతురు ఆయన్ని ఒక పక్కకి తీసుకు పోయి, “ప్రభూ, అది నీకు దూరమవుతుంది, నీకలా ఎప్పటికీ జరగదు” అని గద్దింపుగా అన్నాడు. 23 అయితే యేసు పేతురు వైపు తిరిగి, “సాతానూ, నా వెనక్కి పో! నువ్వు నాకు దారిలో అడ్డుబండగా ఉన్నావు. నీవు దేవుని సంగతులపై కాక మనుషుల సంగతుల పైనే మనసు పెడుతున్నావు” అన్నాడు.

  61. 1 అయితే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడ సజీవులుగా లేపాడు కాబట్టి పైన ఉన్న వాటినే వెతుకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. 2 పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు.

  62. 26 “మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి, ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకు కలిగించిన ఎలాంటి జబ్బూ మీకు రానియ్యను. యెహోవా అనే నేనే మిమ్మల్ని బాగుచేసేవాణ్ణి.”

  63. 3 యెహోవా, నా నోటికి కాపలా ఉంచు. నా పెదాలు అనే ద్వారాన్ని కాపు కాయి.

  64. 6 సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి జ్ఞానం తెచ్చుకో.

    7 వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు.

    8 అయినప్పటికీ అవి ఎండాకాలంలో తమకు తిండి సిద్ధం చేసుకుంటాయి. పంట కోత కాలంలో ఆహారం సమకూర్చుకుంటాయి.

  65. 4 అందుకు ఆయన “మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు, అని రాసి ఉంది” అన్నాడు.

  66. 27 “‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా. 28 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు. 29 నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. 30 నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.

  67. 15 ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు, “మీరు అత్యాశకు చోటివ్వకండి. జీవం అంటే సంపదలు విస్తరించడం కాదు.”

  68. 16 నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. 17 శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.

  69. 4 అంత మాత్రమే కాక కల్పనా కథలను, అంతూ పొంతూ లేని వంశావళులను పట్టించుకోవద్దని వారికి ఆజ్ఞాపించు. ఎందుకంటే అవి వివాదాలకు కారణమౌతాయే గాని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుకు ఎంత మాత్రమూ తోడ్పడవు.

  70. 8 మనందరం పని చేసినందుకు రావలసినవి పోగొట్టుకోకుండా, సంపూర్ణ ప్రతిఫలం పొందేలా చూసుకోవాలి.

  71. 2 మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో మిమ్మల్ని పరీక్షించి మీ హృదయాన్ని తెలుసుకోడానికీ, మిమ్మల్ని లోబరచుకోడానికీ మీ యెహోవా దేవుడు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి.

    3 రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.

  72. 5 అయితే మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ, ఆయన మార్గాలన్నిటిలో నడుస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనను హత్తుకుని సేవిస్తూ, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోండి.”

  73. 9 దేవా, నా బలమా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నా ఎత్తయిన బురుజు నువ్వే.

  74. 23 నీ కన్ను పాడైతే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది. అందుచేత నీలో ఉన్న వెలుగే చీకటి అయితే ఆ చీకటి ఎంత భయంకరమైనదో కదా!

  75. 36 దేవుని మూలంగా పలికే అన్నా అనే ఆమె కూడా అక్కడ ఉంది. ఆమెది ఆషేరు గోత్రం, ఆమె పనూయేలు కుమార్తె. ఆమె పెళ్ళయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వృద్ధాప్యంలో, 37 ఎనభై నాలుగేళ్ళ వయసు వరకూ వితంతువుగా ఉండిపోయింది. ఆమె దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేది. 38 ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, యెరూషలేము విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ బిడ్డను గురించి మాట్లాడుతూ ఉంది.

  76. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  77. 2 నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని 3 రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి.

  78. 6 రకరకాల విషమ పరీక్షల వలన ఇప్పుడు మీరు విచారించవలసి వచ్చినా దీన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు.

    7 నాశనం కాబోయే బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది. బంగారాన్ని అగ్నితో శుద్ధి చేస్తారు గదా! దాని కంటే విలువైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత పరీక్షకు నిలిచి, యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు మెప్పునూ మహిమనూ ఘనతనూ తెస్తుంది.

  79. 17 కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మీకు తెలుసు కాబట్టి అక్రమకారుల మోసం మిమ్మల్ని తప్పు దారి పట్టించి మీ స్థిరత్వం పాడు చేయకుండా జాగ్రత్తపడండి. 18 మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు కృపలో అభివృద్ధి పొందండి. ఆయనకే ఇప్పుడూ, శాశ్వతంగా మహిమ కలుగు గాక! ఆమేన్.