77 Bible Verses About Hard Work

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Hard Work
  1. 22 దాసులారా, మనుషులను మెప్పించాలని చూసే వారిలా పైకి కనిపించాలని కాకుండా ప్రభువుకు భయపడుతూ చిత్తశుద్ధితో అన్ని విషయాల్లో మీ ఇహలోక యజమానులకు లోబడి ఉండండి.

    23 మీరు ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి. మనుషుల కోసం అని కాదు గానీ ప్రభువుకు చేస్తున్నట్లు భావించుకుని చేయండి. 24 ప్రభువు నుండి మీకు వారసత్వం బహుమతిగా లభిస్తుందని మీకు తెలుసు. ప్రభువైన క్రీస్తుకు మీరు సేవ చేస్తున్నారు.

  2. 6 సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి జ్ఞానం తెచ్చుకో.

    7 వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు.

    8 అయినప్పటికీ అవి ఎండాకాలంలో తమకు తిండి సిద్ధం చేసుకుంటాయి. పంట కోత కాలంలో ఆహారం సమకూర్చుకుంటాయి.

    9 సోమరీ, ఎంతసేపటి వరకూ నిద్రపోతూ ఉంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు?

    10 ఇంకా ఎంతసేపు కునికిపాట్లు పడుతూ “కొంచెం సేపు నిద్రపోతాను, కాస్సేపు చేతులు ముడుచుకుని పడుకుంటాను” అనుకుంటావు?

    11 అందువల్ల దోపిడీ దొంగ వచ్చినట్టు దరిద్రం నీకు ప్రాప్తిస్తుంది. ఆయుధం ధరించిన శత్రువు వలే లేమి నీ దగ్గరికి వస్తుంది.

  3. 6 సాటి విశ్వాసులారా, మేము ఉపదేశించిన సత్యాల ప్రకారం చేయకుండా సోమరులుగా బ్రతుకుతున్న వారి నుండి తొలగి పోవాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర మీకు ఆదేశిస్తున్నాం. 7 మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య సోమరులుగా ప్రవర్తించలేదు. 8 ఎవరి దగ్గరా ఉచితంగా ఆహారం భుజించలేదు. మేము మీలో ఎవరికీ భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాం, కష్టపడి పని చేశాం.

    9 మీరు మమ్మల్ని అనుకరించడం కోసం, ఆదర్శంగా ఉండాలనే ఇలా చేశాం కానీ మాకు మీ దగ్గర హక్కు లేదని కాదు. 10 అలాగే మేము మీ దగ్గర ఉన్నప్పుడు, “పని చేయకుండా ఎవడూ భోజనం చేయకూడదు” అని ఆజ్ఞాపించాం కదా! 11 మీలో కొంతమంది ఏ పనీ చేయకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ సోమరుల్లా తిరుగుతున్నారని మేము వింటున్నాం. 12 అలాంటి వారు ప్రశాంతంగా పని చేసుకుంటూ సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాం.

  4. 1 నా కుమారా, క్రీస్తు యేసులో ఉన్న కృపచేత బలవంతుడవుగా ఉండు. 2 అనేకుల ముందు నేను నీకు నేర్పిన సంగతులను ఇతరులకు బోధించగలిగిన, నమ్మకమైన వ్యక్తులకు అప్పగించు.

    3 క్రీస్తు యేసు కోసం మంచి సైనికుడిలా కష్టాలు భరించు. 4 సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన జీవితంలో ఇతర వ్యాపకాల్లో చిక్కుకోకుండా తనను సైన్యంలో చేర్చుకున్నవాణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నిస్తాడు. 5 ఒక క్రీడాకారుడు నియమాల ప్రకారం పూర్తిచేయకపోతే అతనికి బహుమానం దొరకదు. 6 కష్టపడిన వ్యవసాయదారుడే రాబడిలో మొదటి భాగం పొందడానికి అర్హుడు. 7 నేను చెప్పే మాటలు ఆలోచించు. అన్ని విషయాల్లో ప్రభువు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు.

    8 నా సువార్త ప్రకారం, దావీదు సంతానంలో పుట్టి చనిపోయినవారిలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకో. 9 ఆ సువార్త విషయంలో నేను ఒక నేరస్థుడిలా సంకెళ్ళపాలై కష్టాలు అనుభవిస్తున్నాను. అయితే దేవుని వాక్యానికి మాత్రం సంకెళ్ళు లేవు.

    10 అందుచేత ఎన్నికైనవారు నిత్యమైన మహిమతో క్రీస్తు యేసులోని రక్షణ పొందాలని నేను వారి కోసం అన్నీ ఓర్చుకుంటున్నాను.

    11 “మనం ఆయనతో చనిపోతే ఆయనతో బతుకుతాం.

    12 కష్టాలు సహిస్తే ఆయనతోబాటు రాజ్య పరిపాలన చేస్తాం.

    ఆయన ఎవరో మనకు తెలియదు అంటే

    ఆయన కూడా మనం ఎవరో తెలియదు అంటాడు.

    13 ఆయన తన నైజానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు కాబట్టి,

    మనం నమ్మకస్తులం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగినవాడే,”

    అనే మాటలు నమ్మదగినవి.

  5. 23 కష్టంతో కూడిన ఏ పని చేసినా ఫలితం దక్కుతుంది. వ్యర్ధమైన మాటలు దరిద్రానికి నడుపుతాయి.

    24 ఐశ్వర్యం జ్ఞానులకు కిరీటం వంటిది. బుద్ధిహీనుల మూర్ఖత్వం వారికి మరింత మూర్ఖత్వం తెచ్చిపెడుతుంది.

  6. 9 సోదర ప్రేమను గూర్చి ఎవరూ మీకు రాయనక్కరలేదు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పించాడు. 10 అలాగే మీరు మాసిదోనియ అంతటా ఉన్న సోదరులను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమలో మీరు మరింత వృద్ధి చెందుతూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాం.

    11-12 సంఘానికి బయట ఉన్నవారి పట్ల మర్యాదగా ఉండడం, మీకు కొదువ ఏమీ లేకుండా మేము ఆదేశించిన విధంగా ప్రశాంతంగా జీవించడం, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ సొంత విషయాల్లో ఆసక్తి కలిగి మీ చేతులతో కష్టపడి పని చేసుకుంటూ ఉండడం లక్ష్యంగా పెట్టుకోండి.

  7. 4 సోమరిపోతు ఎక్కువగా ఆశ పడతాడు గానీ వాడికి ఏమీ మిగలదు. కష్టపడి పని చేసేవాడు సుఖంగా జీవిస్తాడు.

  8. 15 దేవుడైన యెహోవా ఏదెను తోట సాగు చెయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెట్టాడు.

  9. 24 ఒళ్ళువంచి పనిచేసే వాళ్ళు అధికారం సంపాదిస్తారు. సోమరిపోతులు ఊడిగం చెయ్యాల్సి వస్తుంది.

  10. 4 శ్రద్ధ లేకుండా బద్దకంగా పనిచేసే వాడు దరిద్రుడుగా మారతాడు. శ్రద్ధ కలిగి పనిచేసే వాడికి సంపద సమకూరుతుంది.

    5 బుద్ధిగల కుమారుడు ఎండాకాలంలో సమకూర్చుకుంటాడు. పంట కోత సమయంలో నిద్రపోయే కుమారుడు కుటుంబానికి అవమానం కలిగిస్తాడు.

  11. 10 నిన్ను చేయమని అడిగిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయి. నువ్వు వెళ్ళే సమాధిలో పని గాని, ఉపాయం గాని, తెలివి గాని, జ్ఞానం గాని లేదు.

  12. 11 తన భూమిని సేద్యం చేసుకునే వాడికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. బుద్ధిహీనుడు వ్యర్థమైన వాటిని అనుసరిస్తాడు.

  13. 31 కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి.

  14. 4 ప్రతివాడూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది. 5 ప్రతివాడూ తన బరువు తానే మోసుకోవాలి గదా? 6 వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి. 7 మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.

    8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు. 9 మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము. 10 కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.

  15. 3 నీ పనుల భారమంతా యెహోవా మీద ఉంచు. అప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి.

  16. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

  17. 58 కాబట్టి నా ప్రియ సోదరులారా, స్థిరంగా, నిబ్బరంగా ఉండండి. మీ కష్టం ప్రభువులో వ్యర్థం కాదని ఎరిగి, ప్రభువు సేవలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి.

  18. 5 సేవకులారా, భయంతో వణకుతో, క్రీస్తుకు లోబడినట్టు, ఈ లోకంలో మీ యజమానులకు హృదయపూర్వకంగా లోబడండి. 6 మనుషులను సంతోషపెట్టేవారు చేసినట్టు పైపైన కాక, క్రీస్తు దాసులుగా దేవుని సంకల్పాన్ని హృదయపూర్వకంగా జరిగిస్తూ, 7 ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవచేయండి. 8 దాసుడైనా, స్వతంత్రుడైనా, మీలో ప్రతివాడూ తాను చేసిన మంచి పనికి ప్రభువు వలన ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.

    9 యజమానులారా, మీరూ మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. మీకూ మీ దాసులకూ ఒక్కడే యజమాని పరలోకంలో ఉన్నాడనీ, ఆయన పక్షపాతం లేని వాడనీ గ్రహించి, వారిని బెదిరించడం మానండి.

  19. 12 నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. 13 ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు. 14 మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి. 15 దానివలన మీరు కుటిలమైన వక్రమైన ఈ తరం ప్రజల మధ్య నిర్దోషులు, నిందారహితులు, నిష్కళంకులైన దేవుని కుమారులుగా, లోకంలో దీపాలుగా వెలుగుతుంటారు. 16 జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు క్రీస్తు తిరిగి వచ్చే రోజున నేను వ్యర్థంగా పరుగెత్తలేదనీ నా పని వృధా కాలేదనీ నాకు తెలుస్తుంది. గొప్పగా చెప్పుకోడానికి నాకొక కారణం ఉంటుంది.

    17 మీ విశ్వాస బలిదాన పరిచర్యలో నేను పానార్పణగా పోయబడినా, నేను సంతోషిస్తూ మీ అందరితో ఆనందిస్తాను. 18 అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి.

  20. 30 సోమరిపోతు చేను నేను దాటి వస్తుంటే తెలివిలేనివాడి ద్రాక్షతోట నేను దాటి వస్తుంటే, 31 ఇదిగో దాన్నిండా ముండ్ల తుప్పలు పెరిగి ఉన్నాయి. ముళ్ళపొదలు వ్యాపించి ఉన్నాయి. దాని రాతి గోడ శిథిలం అయి పోయింది.

    32 నేను దాన్ని చూసి ఆలోచించాను. దాన్ని గమనించి బుద్ధి తెచ్చుకున్నాను.

    33 మరికాస్త నిద్ర, మరికాస్త కునుకు, నిద్ర పోవడానికి మరికాస్త చేతులు ముడుచు కోవడం, 34 వీటివల్ల నీకు దారిద్రర్యం పరిగెత్తుకుంటూ వస్తుంది ఆయుధం ధరించిన సైనికుడు వచ్చినట్టు లేమి నీమీదికి వస్తుంది.

  21. 11 ఆసక్తి విషయంలో వెనకబడిపోవద్దు, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. 12 ఆశాభావంతో ఎదురు చూస్తూ సంతోషించండి. కష్టాల్లో సహనం చూపుతూ, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి.

  22. 8 ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత ఇంటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్న వాడు. అలాటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.

  23. 28 దొంగతనం చేసేవాడు దాన్ని విడిచిపెట్టాలి. తన చేతులతో కష్టపడి పనిచేసి అక్కరలో ఉన్నవారికి సహాయం చేయాలి.

  24. 17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.

  25. 2 నువ్వు చేస్తున్న పనులూ, నువ్వు పడుతున్న కష్టమూ, నీ ఓర్పూ నాకు తెలుసు. నువ్వు దుర్మార్గులను సహించలేవనీ, అపొస్తలులు కాకుండానే, మేము అపొస్తలులం అని చెప్పుకుంటూ తిరిగే వారిని పరీక్షించి వారు మోసగాళ్ళని పసిగట్టావనీ నాకు తెలుసు. 3 ఎంతో ఓర్పుతో నువ్వు నా నామం కోసం భారం భరిస్తూ అలసి పోలేదనీ నాకు తెలుసు.

  26. 9 పనిలో సోమరిగా ఉండేవాడు నష్టం కలిగించే వాడికి అన్న.

  27. 33 నేను ఎవరి వెండినిగానీ, బంగారాన్నిగానీ, వస్త్రాలుగానీ ఆశించలేదు. 34 నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు.

    35 మీరు కూడా అదే విధంగా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలనీ, ‘పుచ్చు కోవడం కంటే ఇవ్వడం ధన్యకరమైనది’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనీ, నేను అన్ని విషయాల్లో మీకు ఆదర్శంగా నిలిచాను.”

  28. 7 నిన్ను వ్యతిరేకించేవాడు నీ గురించి చెడ్డ మాటలేవీ చెప్పలేక సిగ్గుపడే విధంగా అన్ని మంచి పనుల విషయంలో నిన్ను నీవే ఆదర్శంగా కనపరచుకో. 8 నీ ఉపదేశం యథార్థంగా, మర్యాదపూర్వకంగా, విమర్శకు చోటియ్యనిదిగా ఉండాలి.

  29. 3-4 అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.

  30. 12 మా చేతులతో కష్టపడి పని చేసుకుంటున్నాం. ప్రజలు మమ్మల్ని నిందించినా ప్రతిగా దీవిస్తున్నాం. ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకుంటున్నాం. 13 మమ్మల్ని తిట్టిన వారితో దయగానే మాట్లాడుతున్నాం. ఇప్పటికీ మమ్మల్ని అందరూ ఈ లోకంలోని మురికిగా, పారేసిన కసువులాగా ఎంచుతున్నారు.

  31. 17 ఆయన ఆదాముతో “నువ్వు నీ భార్య మాట విని ‘తినొద్దు’ అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు. 18 నువ్వు ఎంత కష్టం చేసినా నేల ముళ్ళ తుప్పలను, ముళ్ళ పొదలనే మొలిపిస్తుంది. నువ్వు పొలంలో పండించిన పంట తింటావు. 19 నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూ చెమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు” అని చెప్పాడు.

  32. 16 నీ సేవకులకు నీ పని చూపించు, మా సంతానం నీ వైభవాన్ని చూడనివ్వు.

    17 మా యెహోవా దేవుని ప్రసన్నత మా మీద ఉండు గాక. మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి. నిజంగా, మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి.

  33. 2 నువ్వు కష్టపడి సంపాదించినది తప్పకుండా అనుభవిస్తావు. నీకు అంతా శుభం కలుగుతుంది, నువ్వు వర్ధిల్లుతావు.

  34. 5 శ్రద్ధగలవారి ఆలోచనలు లాభాన్ని తెస్తాయి. తొందరపాటుగా పనిచేసే వాడికి నష్టమే.

  35. 25 సోమరిపోతు చేతులు పనిచేయవు. వాడి కోరికలే వాడికి చావు తెచ్చిపెడతాయి.

    26 రోజంతా అతనిలో ఆశలు ఊరుతూనే ఉంటాయి. యథార్థంగా ప్రవర్తించేవాడు వెనుదీయకుండా ఇస్తూనే ఉంటాడు.

  36. 4 ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు.

  37. 2 ఏడవ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచీ ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. 3 దేవుడు ఆ ఏడవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచీ విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు.

  38. 13 అతిగా నిద్ర పోవద్దు. లేకపోతే దరిద్రం ముంచుకు వస్తుంది. మేలుకుని ఉంటే కడుపు నిండా ఆహారం ఉంటుంది.

  39. 37 దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు.

  40. 8 విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి. 9 నువ్వు కష్టపడి ఆరు రోజుల్లో నీ పని అంతా ముగించాలి. 10 ఏడవ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఆ రోజున నువ్వు, నీ కొడుకు, కూతురు, సేవకుడు, దాసీ, నీ ఇంట్లో ఉన్న విదేశీయుడు, నీ పశువులు ఎవ్వరూ ఏ పనీ చెయ్యకూడదు.

    11 ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్న సమస్తాన్నీ సృష్టించాడు. ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అందువల్ల యెహోవా విశ్రాంతి దినాన్ని దీవించి తనకోసం పవిత్ర పరిచాడు.

  41. సొలొమోను రాసిన యాత్రల కీర్తన

    1 యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టే వారు పాటుబడడం వ్యర్ధం. యెహోవా పట్టణానికి కావలిగా ఉండకపోతే దాన్ని కాపలా కాసేవాళ్ళు నిలబడి ఉండడం వ్యర్ధం.

    2 మీరు తెల్లారే లేచి చాలా ఆలస్యంగా ఇంటికి వస్తూ, కష్టపడి పని చేసి ఆహారం తింటూ ఉండడం వ్యర్ధం. దేవుడు తనకిష్టమైన వారికి నిద్రనిస్తున్నాడు.

  42. 1 కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు.

    2 అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి.

    3 అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో.

    4 అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు.

    5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  43. 6 మాకు కష్టాలు వస్తే అవి మీ విమోచన కోసం, మీ ఆదరణ కోసం. మాకు ఆదరణ కలిగితే అది కూడా మీ ఆదరణ కోసమే. మాలాగే మీరూ పడుతున్న కష్టాలను సహించడానికి కావలసిన ఓర్పును ఈ ఆదరణ కలిగిస్తున్నది.

  44. 27 నేను మిమ్మల్ని చూడడానికి వచ్చినా, రాకపోయినా, అందరూ కలిసికట్టుగా సువార్త విశ్వాసం పక్షంగా పోరాడుతూ, ఏక భావంతో నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినేలా, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి.

  45. 9 ఈ ప్రేమ మూలంగా మీ గురించి మేం విన్న రోజు నుండీ మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు సంపూర్ణ జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం కలిగి ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం. 10 ప్రతి మంచి కార్యం విషయంలోనూ మీరు ఫలిస్తూ, దేవునికి సంబంధించిన జ్ఞానంలో పెరుగుతూ, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేలా, ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము ప్రార్ధిస్తున్నాం. 11 మహిమ ప్రభావాలతో కూడిన ఆయన శక్తి మిమ్మల్ని ప్రతివిధమైన సామర్థ్యం ఇచ్చి బలపరచాలని దేవుణ్ణి వేడుకుంటున్నాం. అదే మీకు సహనాన్నీ, పట్టుదలతో కొనసాగే శక్తినీ కలిగిస్తుంది.

    12 వెలుగు నివాసులుగా తనకోసం ప్రత్యేకించబడిన వారి వారసత్వంలో భాగం పంచుకోడానికి మనలను అర్హులుగా చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.

  46. 4 అందుకే మీరు పొందుతున్న హింసలన్నిటిలోనూ, మీరు సహిస్తున్న యాతనల్లోనూ, మీ సహనాన్నీ, విశ్వాసాన్నీ చూసి దేవుని సంఘాల్లో మీ గురించి మేమే గర్వంగా చెబుతున్నాం.

  47. 10 నీవు మాత్రం నా బోధనూ, ప్రవర్తననూ, ఉద్దేశాన్నీ, విశ్వాసాన్నీ, సహనాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ అనుకరించావు. 11 అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అనే పట్టణాల్లో నేను అనుభవించిన హింసలనూ ప్రమాదాలనూ ఎరిగే నన్ను వెంబడించావు. అలాంటి హింసలు నేను సహించాను గాని, వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు.

  48. 36 దేవుని ఇష్టాన్ని జరిగించిన తరువాత, ఆయన వాగ్దానం చేసిన వాటిని పొందడానికి మీకు సహనం కావాలి.

    37 “ఇక కొద్ది కాలం తరువాత రానున్న వాడు తప్పకుండా వస్తాడు.

    ఆయన ఆలస్యం చేయడు.

    38 నా నీతిమంతుడు విశ్వాసం వల్లనే జీవిస్తాడు.

    అతడు వెనక్కు మళ్ళితే అతణ్ణి గూర్చి నేను సంతోషించను.”

  49. 1 మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. 2 మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.

    3 మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి.

  50. 15 సోమరితనం గాఢనిద్రలో పడేస్తుంది. పని చేయడం ఇష్టం లేని వాడు పస్తులుంటాడు.

  51. 24 అన్నపానాలు పుచ్చుకోవడం కంటే, తన కష్టంతో సంపాదించిన దానితో తృప్తి చెందడం కంటే మానవునికి శ్రేష్టమైంది లేదు. అది దేవుని వల్లనే కలుగుతుందని నేను గ్రహించాను.

  52. 18 నేను చూసిన దానిలో కోరదగినది, మంచిది ఏంటంటే, ఒకడు దేవుడు తనకు నియమించిన జీవితమంతా తన కష్టార్జితంతో అన్నపానాలు తీసుకుంటూ, క్షేమంగా బతకడమే. అదే దేవుడు వాడికి నియమించింది.

    19 అంతే గాక దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానిలో తన వంతు అనుభవించడానికి, అన్నపానాలు పుచ్చుకోడానికి, తన కష్టార్జితంలో సంతోషించడానికి వీలు కలిగిస్తే అది దేవుని దీవెన అని భావించాలి. 20 అతడు చేసే పనిలో దేవుడు అతనికి సంతోషం కలిగిస్తాడు కాబట్టి అతడు తన జీవితంలోని రోజులను పదే పదే జ్ఞాపకం చేసుకోడు.

  53. 8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  54. 2 నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని 3 రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి.

  55. 12 మీ యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. 13 ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని చేయాలి. 14 ఏడో రోజు మీ యెహోవా దేవునికి విశ్రాంతి దినం. ఆ రోజు మీరు, మీ కొడుకు, కూతురు, దాసుడు లేక దాసి, మీ ఎద్దు లేక గాడిద, మీ పశువుల్లో ఏదైనా సరే, మీ ఇంట్లో ఉన్న పరదేశితో సహా, ఏ పనీ చేయకూడదు. ఎందుకంటే మీకులాగా మీ దాసుడు, మీ దాసి కూడా విశ్రాంతి తీసుకోవాలి.

    15 మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మీ దేవుడు యెహోవా తన బాహుబలంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడ నుండి రప్పించాడని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి, విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆయన మీకు ఆజ్ఞాపించాడు.

  56. 14 మీ సోదరుల్లో గానీ మీ దేశంలోని గ్రామాల్లో ఉన్న విదేశీయుల్లోగానీ దరిద్రులైన కూలివారిని బాధించకూడదు. ఏ రోజు కూలి ఆ రోజే ఇవ్వాలి. 15 సూర్యుడు అస్తమించేలోగా అతనికి కూలి చెల్లించాలి. అతడు పేదవాడు కాబట్టి అతనికి వచ్చే సొమ్ము మీద ఆశ పెట్టుకుంటాడు. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్ర పెడతాడేమో. అది నీకు పాపమవుతుంది.

  57. 11 మోసం చేసి సంపాదించిన సొత్తు తరిగి పోతుంది. కష్టపడి ధనం సంపాదించిన వాడు దాన్ని వృద్ధి పరుచుకుంటాడు.

  58. 13 సోమరి “బయట సింహం ఉంది, బయటికి వెళ్తే చచ్చిపోతాను” అంటాడు.

  59. 38 మీరు దేని కోసం ప్రయాస పడలేదో దాన్ని కోయడానికి మిమ్మల్ని పంపాను. ఇతరులు చాకిరీ చేశారు. వారి కష్టఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు” అన్నాడు.

  60. 9 సోదరులారా, మా ప్రయాస, కష్టం మీకు జ్ఞాపకముంది కదా! మీకు దేవుని సువార్త ప్రకటించేటప్పుడు మేము మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టపడి పని చేశాం.

  61. 15 దేవుని దృష్టిలో ఆమోదయోగ్యుడుగా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా నిన్ను నీవే దేవునికి కనుపరచుకో.

  62. 30 మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు, 31 “వినండి, ఊరు కొడుకు, హూరు మనుమడు బెసలేలును యెహోవా ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి. 32 రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కలను కోసి నునుపు చేయడంలో నిపుణుడు. 33 అతనికి ఆయన అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, జ్ఞానం, నైపుణ్యం ప్రసాదించాడు. అతణ్ణి దేవుడు తన ఆత్మతో నింపాడు. 34 అతడు, దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు ఇతరులకు ఈ పనులు నేర్పించడానికి సామర్ధ్యం కలిగినవాళ్ళు.

    35 వాళ్ళు ఆ విధమైన ఎలాంటి పని అయినా చేయడానికి దేవుడు వాళ్ళకు సామర్ధ్యం ఇచ్చాడు. చెక్కేవాళ్ళ పనిగానీ, చిత్రకారుల పనిగానీ నీలం ఊదా ఎర్ర రంగు సన్నని నార దారాలతో బుటాపని గానీ, నేతపని గానీ వాళ్లకు బాగా తెలుసు. వాళ్ళు అలాంటి పనులు చెయ్యగలరు, చేయించగలరు.”

  63. 23 సాయంకాలం దాకా పాటుపడి తమ పనులు జరుపుకోడానికి మనుషులు బయలుదేరుతారు.

  64. 26 సోమరిని పనికి పెట్టుకునే యజమానికి వాడు పండ్లకు పులుపులాగా, కళ్ళకు పొగలాగా ఉంటాడు.

  65. 27 సోమరిపోతు వేటకు వెళ్ళినా ఏమీ పట్టుకోలేడు. చురుకుదనం కలిగి ఉండడం గొప్ప వరం.

  66. 4 నాట్లు వేసే కాలంలో సోమరిపోతు నాగలి పట్టడు. కోతకాలంలో పంటకోసం వస్తే వాడికి ఏమీ దొరకదు.

  67. 19 వాడు తెలివైనవాడో, బుద్ధిహీనుడో ఎవరికి తెలుసు? అయితే సూర్యుని కింద నేను బాధతో, జ్ఞానంతో సంపాదించినదంతా వాడి అధికారం కిందకు వెళ్తుంది. ఇదీ నిష్ప్రయోజనమే. 20 కాబట్టి సూర్యుని కింద నేను పడిన కష్టమంతటి విషయంలో నేను నిస్పృహ చెందాను.

    21 ఒకడు జ్ఞానంతో, తెలివితో, నైపుణ్యంతో కష్టపడి ఒక పని చేస్తాడు. అయితే అతడు దాని కోసం పని చేయని వేరొకడికి దాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తున్నది. ఇది కూడా నిష్ప్రయోజనంగా, గొప్ప విషాదంగా ఉంది. 22 సూర్యుని కింద మానవుడు పడే కష్టానికీ చేసే పనులకూ అతడికేం దొరుకుతున్నది? 23 అతడు రోజులో చేసే పనులన్నీ కష్టంతో, వత్తిడితో నిండి ఉన్నాయి. కాబట్టి రాత్రి పూట కూడా అతడి మనస్సుకు నెమ్మది దొరకదు. ఇది కూడా నిష్ప్రయోజనమే.

  68. 4 కష్టంతో, నైపుణ్యంగా చేసే ప్రతి పనీ వేరొకరి అసూయకి కారణం అవుతున్నదని నేను చూశాను. ఇది కూడా నిష్ప్రయోజనంగా, ఒకడు గాలిని పట్టుకోడానికి చేసే ప్రయత్నంలాగా ఉంది. 5 బుద్ధిహీనుడు పని చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం వల్ల తనను తనే నాశనం చేసుకుంటున్నాడు. 6 రెండు చేతులతో కష్టం, గాలి కోసం ప్రయత్నాలు చేసేకంటే ఒక చేతిలో నెమ్మది కలిగి ఉండడం మంచిది.

    7 నేను ఆలోచిస్తున్నపుడు సూర్యుని కింద నిష్ప్రయోజనమైంది ఇంకొకటి కనిపించింది.

  69. 62 దానికి యేసు, “నాగలిపై చెయ్యి పెట్టి వెనక్కి చూసేవాడు ఎవడూ దేవుని రాజ్యానికి తగడు” అని వాడితో చెప్పాడు.

  70. 24 ఇప్పుడు మీ కోసం నేను పడుతున్న హింసల్లో సంతోషిస్తున్నాను. సంఘం అనే తన శరీరం కోసం క్రీస్తు పడిన యాతనల్లో కొదువగా ఉన్న వాటిని నా వంతుగా నా శరీరంలో సంపూర్ణం చేస్తున్నాను. 25 రహస్య సత్యంగా ఉన్న దేవుని వాక్కును సంపూర్ణంగా తెలియజేయడానికి దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ప్రకారం నేను సంఘానికి సేవకుణ్ణి అయ్యాను. 26 ఈ రహస్యం యుగయుగాలుగా తరతరాలుగా మర్మంగా ఉంది కానీ ఇప్పుడు దేవుడు తన పవిత్రులకు దాన్ని తెలియజేశాడు. 27 అన్యజనుల్లో ఈ మర్మం అనే దివ్య సంపదను తెలియజేయాలని దేవుడు తలంచాడు. ఈ మర్మం మీలో ఉన్న యేసు క్రీస్తే. ఆయనే మహిమను గూర్చిన ఆశాభావం.

    28 మేము ప్రకటిస్తున్నది ఈయననే. ప్రతి వ్యక్తినీ క్రీస్తులో పరిపూర్ణుడిగా చేసి దేవుని ముందు నిలబెట్టాలి. ఈ ఉద్దేశంతోనే మేము సమస్త జ్ఞానంతో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నాం బోధిస్తున్నాం. 29 దీని కోసం నేను శ్రమిస్తూ ఉన్నాను. నాలో బలంగా పని చేస్తున్న ఆయన మహత్తర శక్తిని నేను వినియోగించుకుంటూ ప్రయాసపడుతున్నాను.

  71. 6 మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగానే ఆయనలో నడుస్తూ ఉండండి. 7 ఆయనలో స్థిరంగా నాటుకుని ఉండండి. ఆయన పైనే మీ జీవితాలు కట్టుకోండి. మీకు బోధించిన రీతిగానే విశ్వాసంలో వేరు పారి ఉండండి. కృతజ్ఞతలు చెల్లించడంలో పొంగిపొరలుతూ ఉండండి.

  72. 2 మీ అందరి కోసం దేవునికి ఎప్పుడూ మా ప్రార్థనల్లో కృతజ్ఞతలు చెబుతూ మీ కోసం ప్రార్ధిస్తూ ఉన్నాం. 3 విశ్వాసంతో కూడిన మీ పనినీ, ప్రేమతో కూడిన మీ ప్రయాసనూ, మన ప్రభు యేసు క్రీస్తులో ఆశాభావం వల్ల కలిగిన మీ సహనాన్నీ మన తండ్రి అయిన దేవుని సమక్షంలో మేము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం.

  73. 16 నీ గురించీ ఉపదేశం గురించీ జాగ్రత్త వహించు. వీటిలో నిలకడగా ఉండు. నీవు అలా చేసినప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడమే గాక నీ ఉపదేశం విన్న వారిని కూడా రక్షించుకుంటావు.

  74. 7 మంచి పోరాటం సాగించాను, నా పరుగు ముగించాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను.

  75. 14 మన వారు నిష్ఫలులు కాకుండా, ముఖ్య అవసరాలను సమకూర్చుకోగలిగేలా మంచి పనులు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి.

  76. 12 పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.

  77. 5 ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి జ్ఞానం, 6 జ్ఞానానికి ఆశల అదుపు, ఆశల అదుపుకు ఓర్పు, ఓర్పుకు భక్తి, 7 భక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమకు దైవ ప్రేమ జోడించండి. 8 ఇవి మీలో నిలిచి ఉండి వృద్ధి చెందినపుడు, మన ప్రభు యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో మందకొడిగా, నిష్ఫలంగా ఉండరు.