82 Bible Verses About Fear and Worry

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Fear and Worry
  1. 4 ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి.

    5 మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు. 6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

    8 చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. 9 మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.

  2. 6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.

    7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి.

  3. 8 నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను ఎన్నుకున్న యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,

    9 భూదిగంతాల నుండి నేను నిన్ను తీసుకువచ్చాను. దూరంగా ఉన్న అంచుల నుండి నిన్ను పిలిచాను.

    10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను.

    నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి.

    దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను.

    నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.

    11 నీ మీద కోపపడే వారంతా సిగ్గుపడి, అవమానం పాలవుతారు.

    నిన్ను ఎదిరించే వారు కనబడకుండా నశించిపోతారు

    12 నువ్వెంత వెదికినా నీతో కలహించే వారు కనిపించరు.

    నీతో యుద్ధం చేసే వారు లేకుండా పోతారు, పూర్తిగా మాయమైపోతారు.

    13 నీ దేవుణ్ణి అయిన యెహోవా అనే నేను, ‘భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను’ అని చెబుతూ నీ కుడిచేతిని పట్టుకున్నాను.

    14 పురుగులాంటి యాకోబూ, అల్పమైన ఇశ్రాయేలూ, ‘భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను’” అని యెహోవా సెలవిస్తున్నాడు.

    ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే నీ విమోచకుడు.

  4. 4 నేను యెహోవాకు విజ్ఞాపన చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి మీదా నాకు విజయమిచ్చాడు.

    5 ఆయన వైపు చూసే వాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ ముఖాల్లో అవమానం అన్నది కన్పించదు.

    6 అణచివేతకు గురైన ఈ వ్యక్తి విలపించాడు. దాన్ని యెహోవా విన్నాడు. సమస్యలన్నిటి నుండి అతణ్ణి రక్షించాడు.

    7 యెహోవా అంటే భయమూ భక్తీ ఉన్న వాళ్ళ చుట్టూ ఆయన దూత కాపలా ఉంటాడు. వాళ్ళను కాపాడుతూ ఉంటాడు.

    8 యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి.

    9 యెహోవా ఎన్నుకున్న ప్రజలారా! ఆయన అంటే భయమూ, భక్తీ కలిగి ఉండండి. ఆయనంటే భయభక్తులు ఉన్నవాడికి ఎలాంటి కొరతా ఉండదు.

  5. 26 నా తండ్రి నా పేరిట పంపే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు.

    27 శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి. 28 ‘నేను వెళ్ళిపోతున్నాను గాని మీ దగ్గరికి తిరిగి వస్తాను’ అని నేను చెప్పడం మీరు విన్నారు. మీరు నన్ను ప్రేమిస్తే, మీరు సంతోషిస్తారు. ఎందుకంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా తండ్రి నాకన్నా గొప్పవాడు.

  6. 26 అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు. 27 ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.

    28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.

  7. ప్రధాన సంగీతకారుని కోసం. యోనతేలెం రెహూకిం అనే రాగంతో పాడేది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నపుడు అతడు రాసిన కీర్తన.

    1 దేవా, నన్ను కరుణించు. మనుషులు నన్ను మింగివేయాలని చూస్తున్నారు. వారు రోజంతా నా మీద పోరాడుతూ నన్ను అణచివేస్తున్నారు.

    2 గర్వంగా నాతో పోరాడేవారు అనేకులున్నారు. రోజంతా నా కోసం కాపు కాసి నన్ను మింగాలని చూస్తున్నారు.

    3 నాకు భయం కలిగిన రోజున నిన్ను ఆశ్రయిస్తాను.

    4 నేను ఆయన మాటలను కీర్తిస్తాను. నేను భయపడను. ఎందుకంటే దేవునిలో నమ్మకం పెట్టుకున్నాను. మనుషులు నన్నేమి చేయగలరు?

  8. 24 ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవునికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు.

    25 “అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే, ‘ఏమి తినాలి? ఏమి తాగాలి?’ అని మీ జీవితాన్ని గురించి గానీ, ‘ఏమి కట్టుకోవాలి?’ అని మీ శరీరం గురించి గానీ బెంగ పెట్టుకోవద్దు. తిండి కంటే జీవితమూ బట్టల కంటే శరీరమూ ఎక్కువే కదా! 26 ఎగిరే పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైన వారు కాదా?

    27 ఆందోళనపడి మీలో ఎవరు తన జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడు? 28 బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి పని చేయవు, బట్టలు నేయవు. 29 అయినా నేనంటాను, తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సైతం వీటిలో ఒక్క దానికున్నంత అలంకారం లేదు. 30 ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!

    31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. 32 దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు. 34 కాబట్టి రేపటి విషయం దిగులు పడవద్దు. దాని సంగతి అదే చూసుకుంటుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.

  9. 6 ఆ కారణంగానే నేను నీమీద నా చేతులు ఉంచడం ద్వారా నీకు కలిగిన దేవుని కృపావరాన్ని ప్రజ్వలింపజేసుకోమని నిన్ను ప్రోత్సహిస్తున్నాను. 7 దేవుడు మనకు శక్తీ, ప్రేమా, నిగ్రహం కలిగించే ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనం కలిగించే ఆత్మను ఇవ్వలేదు.

  10. 16 దేవునికి మనపై ఉన్న ప్రేమను మనం తెలుసుకుని విశ్వసించాము. దేవుడు ప్రేమ. ప్రేమలో నిలిచి ఉన్నవాడు దేవునిలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. 17 తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా మన మధ్య ఈ ప్రేమ పరిపూర్ణం అయ్యింది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆయన ఉన్నట్టే ఉన్నాం.

    18 ప్రేమలో భయం లేదు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే భయం శిక్షకు సంబంధించింది. భయం ఉన్నవాడు ఇంకా ప్రేమలో పరిపూర్ణత పొందలేదు. 19 దేవుడే మొదట మనలను ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం.

  11. దావీదు కీర్తన.

    1 యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు.

    2 పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు.

    3 నా ప్రాణాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు, తన నామాన్ని బట్టి సరైన మార్గాల్లో నన్ను నడిపిస్తాడు.

    4 చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.

  12. 22 తరువాత యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, “అందుచేత ఏం తింటామని మీ ప్రాణం కోసమో, ఏం కట్టుకుంటామని మీ శరీరం కోసమో మధన పడవద్దు. 23 ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా? 24 కాకుల గురించి ఆలోచించండి. అవి విత్తనాలు చల్లవు, కోయవు, వాటికి గిడ్డంగులూ, కొట్లూ లేవు. అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటే ఎంతో ఉన్నతమైన వారు. 25 పైగా మీలో ఎవడు చింత పడడం వల్ల తన ఎత్తును ఒక మూరెడు ఎక్కువ చేసుకోగలడు? 26 కాబట్టి చిన్న చిన్న విషయాలే మీరు చేయలేకపోతే పెద్దవాటిని గురించి ఆలోచించడం ఎందుకు? పువ్వులు ఎలా పూస్తున్నాయో చూడండి. 27 అవి కష్టపడవు, బట్టలు నేయవు. అయినా తన వైభవమంతటితో సహా సొలొమోనుకున్న అలంకరణ ఈ పూలలో ఏ ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెబుతున్నాను.

    28 అల్ప విశ్వాసులారా, ఈ వేళ పొలంలో ఉండి, రేపు పొయ్యిలో వేసే అడవి గడ్డినే దేవుడిలా అలంకరిస్తే మీకు మరి ఎంతో ఖాయంగా బట్టలిస్తాడు గదా. 29 ఏం తింటాం, ఏం తాగుతాం అని దిగులు పెట్టుకోకండి. చింతించకండి. 30 లోకులు వీటిని వెతుకుతారు. ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలుసు. 31 మీరు మాత్రం ఆయన రాజ్యాన్ని వెదకండి. దానితోపాటుగా ఇవి కూడా మీకు లభిస్తాయి.

    32 చిన్న మందా, భయపడకండి. మీకు రాజ్యాన్నివ్వడం మీ తండ్రికి ఇష్టం. 33 మీకు ఉన్నవాటిని అమ్మి దాన ధర్మాలు చేయండి. పరలోకంలో పాతగిలిపోని డబ్బు సంచులనూ, నాశనం కాని ధనాన్నీ సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, పురుగు పట్టదు. 34 మీ డబ్బు ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడే ఉంటుంది.

  13. 5 డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. “నిన్ను ఎన్నటికీ విడిచి పెట్టను. నిన్ను పరిత్యజించను” అని దేవుడే చెప్పాడు. 6 కాబట్టి, “ప్రభువు నాకు సహాయం చేసేవాడు. నేను భయపడను. నన్ను ఎవరేం చేయగలరు?” అని ధైర్యంగా చెప్పగలిగేలా తృప్తి కలిగి ఉందాం.

  14. 1 అయితే యాకోబూ, నిన్ను పుట్టించిన యెహోవా, ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఇలా చెబుతున్నాడు,

    “నేను నిన్ను విమోచించాను, భయపడకు. నిన్ను పేరుపెట్టి పిలుచుకున్నాను. నువ్వు నా సొత్తు.

    2 నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను.

    నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు.

    నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు

    3 యెహోవా అనే నేను నీకు దేవుణ్ణి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నీ రక్షకుణ్ణి.

    నీ ప్రాణరక్షణ క్రయధనంగా ఐగుప్తును, నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చాను.

    4 నువ్వు నాకు ప్రియుడివి, ప్రశస్తమైనవాడివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

    కాబట్టి నీకు ప్రతిగా జాతులను, నీ ప్రాణానికి బదులుగా జనాలను అప్పగిస్తున్నాను.

    5 భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానాన్ని రప్పిస్తాను. పడమటి నుండి నిన్ను సమకూరుస్తాను.

  15. దావీదు కీర్తన.

    1 యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణానికి ఆశ్రయం, నేను ఎవరికి బెదరాలి?

    2 నా శరీరాన్ని మింగడానికి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నా విరోధులూ శత్రువులూ తొట్రిల్లి కూలిపోతారు.

    3 నాతో యుద్ధం చెయ్యడానికి శత్రువు శిబిరం వేసుకుని ఉన్నా, నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగినా నేను ధైర్యంగానే ఉంటాను.

  16. 17 యెహోవా నాకు సాయం రాకపోతే నేను మరణనిశ్శబ్దంలో పండుకునే వాడినే.

    18 నా కాలు జారింది అని నేనంటే, యెహోవా, నీ కృప నన్ను ఎత్తిపట్టుకుంది.

    19 నా లోని ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి నన్ను బెదిరిస్తుంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగచేసింది.

    20 దుర్మార్గ పాలకులు నీతో జత కట్టగలరా? అన్యాయం చేద్దామని వాళ్ళు చట్టం కల్పిస్తారు.

  17. 5 నీవు జీవించే రోజులన్నిటిలో ఎవ్వరూ నీ ముందు నిలవలేరు, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడుగా ఉంటాను. నిన్ను విడిచి పెట్టను, వదిలెయ్యను. 6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. వారికిస్తానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశాన్ని కచ్చితంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు.

    7 అయితే నీవు నిబ్బరంగా, ధైర్యంగా, అతి జాగ్రత్తగా నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతా శ్రద్ధగా పాటించాలి. నీవు వెళ్ళే ప్రతి చోటా విజయం సాధించేలా నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. 8 ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి. దానిలో రాసి ఉన్న వాటన్నిటినీ చేయడానికి నీవు జాగ్రత్త పడేలా రాత్రీ పగలూ దాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. 9 నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”

  18. 22 నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.

    23 దేవా, నువ్వు దుష్టులను నాశనకూపంలో పడవేస్తావు. ఇతరులతో పోలిస్తే రక్తాపరాధులు, వంచకులు సగం కంటే ఎక్కువకాలం బతకరు. నేనైతే నీలోనే నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాను.

  19. 28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  20. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

    7 నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.

    8 అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి.

  21. 35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా? 36 దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే,

    “నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం.

    వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”

    37 అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

  22. 25 విచారం నిండిన హృదయం క్రుంగిపోతుంది. దయగల మంచి మాట హృదయానికి సంతోషం కలిగిస్తుంది.

  23. ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. అలమోత్ రాగం పై పాడాలి. ఒక గీతం.

    1 దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం.

    2 కాబట్టి భూమి మారిపోయినా, సముద్ర అఖాతంలో పర్వతాలు మునిగిపోయినా మేము భయపడం.

    3 సముద్రంలో నీళ్ళు గర్జించినా, తీవ్ర ఉద్రేకంతో అవి పొంగినా, వాటి పొంగుకు పర్వతాలు కంపించినా సరే. సెలా.

  24. 12 ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది.

    13 మీరు మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసే వాడెవడు? 14 మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు. 15 దానికి బదులు, మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునిలో మీకున్న ఆశాభావం విషయం అడిగే ప్రతి వ్యక్తికీ సాత్వీకంతో వినయంతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.

    16 మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో మీకున్న మంచి జీవితాన్ని అపహసించే వారు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు చెడ్డవారన్నట్టుగా మీకు విరోధంగా వారు మాట్లాడుతున్నారు. 17 కీడు చేసి బాధ పడడం కంటే మేలు చేసి బాధ పడటం దేవుని చిత్తమైతే, అదే చాలా మంచిది.

  25. 26 కాబట్టి మీరు వారికి భయపడవద్దు. కప్పిపెట్టింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచింది ఏదీ తెలియకుండా ఉండదు. 27 మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి. మీ చెవిలో వినిపించేది మేడలమీద చాటించండి.

    28 “ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు. ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి. 29 రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు. 30 మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు. 31 కాబట్టి భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు.

  26. దావీదు కీర్తన

    1 చెడ్డ వారిని చూసి నువ్వు క్షోభపడకు. అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసూయ పడకు.

    2 ఎందుకంటే వాళ్ళు గడ్డిలాగా త్వరలోనే ఎండిపోతారు. పచ్చటి మొక్కల్లా వాడి పోతారు.

    3 యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు.

    4 తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.

    5 నీ జీవిత గమనాన్ని యెహోవాకు అప్పగించు. ఆయనలో నమ్మకముంచు. ఆయన నీ తరుపున పని చేస్తాడు.

    6 పగటి వెలుగులా నీ న్యాయవర్తననూ, మధ్యాహ్నపు వెలుగులా నీ నిర్దోషత్వాన్నీ ఆయన చూపిస్తాడు.

    7 యెహోవా ఎదుట మౌనంగా ఉండు. సహనంతో ఆయన కోసం వేచి ఉండు. దుర్మార్గాలు చేసి ఎవరన్నా విజయం సాధిస్తే చింతించకు. ఎవరన్నా కుట్రలు చేస్తే విచారించకు.

    8 కోపపడకు. నిరుత్సాహపడకు. చింతపడకు. దానివల్ల సమస్యలు కలుగుతాయి.

    9 దుర్మార్గకార్యాలు చేసే వాళ్ళు నిర్మూలం అవుతారు. కానీ యెహోవా కోసం వేచి చూసే వాళ్ళు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.

  27. 3 బలహీనమైన చేతులను బలపరచండి. వణుకుతున్న మోకాళ్లను దృఢపరచండి.

    4 బెదిరిన హృదయాలు గలవారితో ఇలా చెప్పండి. “భయపడకుండా ధైర్యంగా ఉండండి. ప్రతిదండన చేయడానికి మీ దేవుడు వస్తున్నాడు.

    చేయాల్సిన ప్రతీకారం ఆయన చేస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు.”

  28. 5 ఇరుకైనచోట ఉండి నేను యెహోవాకు మొర్రపెట్టాను. విశాలస్థలంలో యెహోవా నాకు జవాబిచ్చాడు.

    6 యెహోవా నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను. మనుషులు నాకేమి చేయగలరు?

    7 యెహోవా నా పక్షం వహించి నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేరడం నేను చూస్తాను.

    8 మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.

  29. 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.

    12 అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను. 13 మీరు పూర్ణమనస్సుతో నన్ను అన్వేషిస్తారు కాబట్టి, నన్ను కనుగొంటారు. 14 అప్పుడు నేను మీకు దొరుకుతాను,’ ఇది యెహోవా వాక్కు. ‘తరువాత, నేను మిమ్మల్ని నిర్బంధంలో నుంచి రప్పించి, మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లోనుంచి, స్థలాల్లోనుంచి మిమ్మల్ని పోగు చేస్తాను.’ ఇది యెహోవా వాక్కు. ‘ఎక్కడినుంచి మిమ్మల్ని బందీలుగా పంపానో, అక్కడికే మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను,’

  30. 1 “మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి. 2 నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను. 3 నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను. 4 నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ దారి కూడా తెలుసు” అన్నాడు.

  31. 6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు. వాళ్ళను చూసి కంగారు పడవద్దు. మీతో వచ్చేవాడు మీ యెహోవా దేవుడే. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మర్చిపోడు.”

  32. 5 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు “మనుషులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు. శరీరులను తనకు బలంగా చేసుకుని తన హృదయాన్ని యెహోవా మీదనుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు.

    6 వాడు ఎడారిలోని పొదలాగా ఉంటాడు. వాడికి ఏ మేలూ కనబడదు. వాడు ఎడారిలో రాళ్ళ మధ్య, చవిటి భూమిలో నిర్జన ప్రాంతంలో నివసిస్తాడు.

    7 అయితే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వాడికి ఆశ్రయంగా ఉంటాడు.

    8 వాడు నీళ్ళ ఊట దగ్గర చెట్టులాగా ఉంటాడు. దాని వేళ్ళు చుట్టుపక్కలా వ్యాపిస్తాయి. ఎండ వచ్చినా దానికి చలనం ఉండదు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. కరువు కాలాల్లో కంగారు పడదు. కాపు మానదు.

  33. 11 నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. 12 అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

  34. 23 ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారు. 24 అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు. 25 శిష్యులు ఆయనను నిద్ర లేపి, “ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి” అంటూ కేకలు వేశారు. 26 యేసు వారితో, “అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు?” అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది. 27 శిష్యులు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటివాడో! గాలీ సముద్రం ఈయన మాట వింటున్నాయే” అని చెప్పుకున్నారు.

  35. 14 దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు. 15 ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం. 16 మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు. 17 మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం.

    18 మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను. 19 దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది.

  36. 4 నా స్నేహితులైన మీకు నేను చెప్పేదేమిటంటే దేహాన్ని చంపడం మినహా మరేమీ చేయలేని వాడికి భయపడవద్దు. 5 ఎవరికి మీరు భయపడాలో చెబుతాను. చంపిన తరువాత నరకంలో పడవేసే శక్తి గల వాడికి భయపడండి. ఆయనకే భయపడమని మీకు చెబుతున్నాను.

    6 ఐదు పిచ్చుకలను రెండు కాసులకు అమ్ముతారు కదా. అయినా వాటిలో ఒక్కదాన్ని కూడా దేవుడు మర్చిపోడు. 7 మీ తలవెంట్రుకలన్నిటికీ లెక్క ఉంది. భయపడకండి. మీరు ఎన్నో పిచ్చుకల కంటే విలువైన వారు కదా.

    8 ఇంకా మీతో చెప్పేదేమిటంటే, నన్ను మనుషుల ముందు ఎవరు అంగీకరిస్తాడో వాణ్ణి మనుష్య కుమారుడు దేవుని దూతల ముందు అంగీకరిస్తాడు. 9 మనుషుల ముందు నేనెవరో తెలియదు అనే వారి గురించి నేను కూడా దేవుని దూతల ముందు వారెవరో నాకు తెలియదు అని చెబుతాను.

  37. 7 అతడు దుర్వార్తకు జడిసి పోడు. అతడు యెహోవాను నమ్ముకుని నిబ్బరంగా ఉంటాడు.

    8 అతని మనస్సు స్థిరంగా ఉంటుంది. తన శత్రువులపై గెలిచేదాకా అతడు భయపడడు.

  38. 18 ప్రజలంతా ఆ ఉరుములు, మెరుపులు, భీకరమైన బూర శబ్దం, ఆ కొండ నుండి రగులుతున్న పొగ చూసి భయపడ్డారు. భయంతో దూరంగా తొలగిపోయి మోషేతో, 19 “దేవుడే గనక మాతో మాట్లాడితే మేమంతా చచ్చిపోతాం. నువ్వే మాతో మాట్లాడు, మేము వింటాం” అన్నారు.

    20 అందుకు మోషే “భయపడకండి. మిమ్మల్ని పరీక్షించడానికి, ఇక నుంచి మీరు పాపం చేయకుండా ఆయన భయం మీకు ఉండేలా దేవుడు వచ్చాడు” అని ప్రజలతో చెప్పాడు.

  39. 10 నిశ్శబ్దంగా ఉండండి. నేనే యెహోవాని అని తెలుసుకోండి. జనాలలో నన్ను హెచ్చిస్తారు. భూమిపై నన్ను ఉన్నత స్థానంలో ఉంచుతారు.

    11 సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మన ఆశ్రయం.

  40. యాత్రల కీర్తన

    1 కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడనుండి వస్తుంది?

    2 యెహోవాయే నాకు సహాయం చేస్తాడు. భూమిని, ఆకాశాలను సృష్టించింది ఆయనే.

  41. 30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.

    31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.

    వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.

    అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

  42. 22 ముళ్ళ మొక్కల్లో చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం వింటారు గానీ ఈ లోక చింతలూ, సంపదలోని మోసమూ ఆ వాక్యాన్ని అణచివేస్తాయి. కాబట్టి వారు ఫలించకుండా పోతారు.

  43. 7 మోషే యెహోషువను పిలిచి, “నువ్వు నిబ్బరంగా, ధైర్యంగా నిలబడు. యెహోవా ఈ ప్రజలకిస్తానని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వీరితోబాటు వెళ్లి దాన్ని వారికి స్వాధీనం చెయ్యాలి. 8 నీకు ముందుగా వెళ్ళేవాడు యెహోవాయే. ఆయన నీతో ఉంటాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, మర్చిపోడు. భయపడవద్దు. వాళ్ళను చూసి దిగులు పడవద్దు” అని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అతనితో చెప్పాడు.

  44. 1 సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు.

    2 ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, అని నేను యెహోవాను గురించి చెబుతాను.

    3 వేటగాడు పన్నిన ఉచ్చు నుంచి ప్రాణాంతకవ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు.

    4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన నమ్మకత్వం నిన్ను కాపాడే కవచంగా ఉంటుంది.

    5 రాత్రిలో కలిగే భయభ్రాంతులకు, పగటివేళ ఎగిరి వచ్చే బాణాలకూ నువ్వు భయపడవు.

    6 చీకట్లో తచ్చాడే రోగానికిగానీ మధ్యాహ్నం సోకే వ్యాధికి గానీ నువ్వు బెదిరిపోవు.

  45. 16 శాంతి ప్రదాత అయిన ప్రభువు తానే ఎప్పుడూ అన్ని పరిస్థితుల్లో, అన్ని విధాలా మీకు శాంతిని అనుగ్రహించు గాక! ప్రభువు మీకందరికీ తోడై ఉండు గాక!

  46. 13 మీ యెహోవా దేవునికే భయపడాలి, ఆయననే పూజించాలి, ఆయన పేరట మాత్రమే ప్రమాణం చేయాలి. 14 మీరు ఇతర దేవుళ్ళను, అంటే మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల ప్రజల దేవుళ్ళను పూజింపకూడదు.

    15 మీ మధ్య ఉన్న మీ యెహోవా దేవుడు రోషం గల దేవుడు కాబట్టి ఆయన కోపాగ్ని మీ మీద చెలరేగి దేశంలో ఉండకుండాా మిమ్మల్ని నాశనం చేస్తాడు.

  47. 39 ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది.

    40 అప్పుడాయన శిష్యులతో, “మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?” అని అన్నాడు. 41 వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు.

  48. 32 మీరందరూ ఎవరి ఇంటికి వారు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతూ ఉంది. వచ్చేసింది కూడా. అయినప్పటికీ, నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిని కాదు. 33 నన్ను బట్టి మీకు శాంతి కలగాలని నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు బాధ ఉంది. కాని ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను” అన్నాడు.

  49. 17 నేను ఆయనను చూడగానే నిశ్చేష్టు డి నా ఆయన కాళ్ళ దగ్గర పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి నాతో ఇలా అన్నాడు, “భయపడకు, మొదటివాణ్ణీ చివరివాణ్ణీ నేనే. 18 జీవిస్తున్నవాణ్ణీ నేనే. చనిపోయాను కానీ శాశ్వతకాలం జీవిస్తున్నాను. మరణానికీ, పాతాళ లోకానికీ తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి.

  50. 40 మార్త ఎన్నో పనులు పెట్టుకుని తొందరపడుతూ ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది. నీకేం పట్టదా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు” అంది.

    41 అందుకు ప్రభువు, “మార్తా, మార్తా, నువ్వు బోలెడన్ని పనులను గురించి తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే. 42 మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు” అని ఆమెతో చెప్పాడు.

  51. 32 మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్ళి కానివాడు ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఆయన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు. 33 పెళ్ళయిన వాడు తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోకవిషయాల గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు. 34 అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. అదే విధంగా పెళ్ళయిన స్త్రీకీ, పెళ్ళికాని స్త్రీకీ తేడా ఉంది. కన్య శరీరంలో ఆత్మలో పవిత్రత కలిగి ఉండాలని ప్రభువు కార్యాలను గూర్చి శ్రద్ధ కలిగి ఉంటుంది. పెళ్ళైన స్త్రీ అయితే తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటుంది.

  52. 12 యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాడు ఎవరు? అతడు కోరుకోవలసిన మార్గం ఆయన అతనికి నిర్దేశిస్తాడు.

    13 అతని ప్రాణం సంతోషంగా ఉంటుంది. అతని సంతానం దేశానికి వారసులవుతారు.

    14 ఆయనపట్ల భయభక్తులు గల వారికి యెహోవా ఆలోచన తెలుస్తుంది, ఆయన తన నిబంధన వాళ్లకు తెలియజేస్తాడు.

  53. 10 యెహోవా పట్ల భయం జ్ఞానానికి మూలం. ఆయన శాసనాలను అనుసరించేవారంతా మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం.

  54. 26 యెహోవాపట్ల భయం, భక్తి కలిగి ఉన్నవారు ఎంతో ధైర్యంగా ఉంటారు. వారి సంతానానికి ఆశ్రయం దొరుకుతుంది.

    27 యెహోవా పట్ల భయభక్తులు జీవం కలిగించే ఊట. దాని మూలంగా వారు మరణం ఉచ్చుల్లో నుండి తప్పించు కుంటారు.

  55. 15 మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు.

    మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టాడు.

    ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు.

    ఇక మీదట మీకు అపాయం సంభవించదు.

    16 ఆ దినాన ప్రజలు మీతో ఇలా అంటారు.

    యెరూషలేమూ, భయపడకు.

    సీయోనూ, ధైర్యం తెచ్చుకో.

    17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు.

    ఆయన శక్తిశాలి.

    ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు.

    ఆయన బహు ఆనందంతో నీ విషయం సంతోషిస్తాడు.

    నీ పట్ల తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ విషయమైన సంతోషము మూలంగా ఆయన హర్షిస్తాడు.

  56. 36 యేసు వారి మాటలు పట్టించుకోకుండా, వెంటనే సమాజ మందిరం అధికారితో, “భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు” అన్నాడు.

  57. 48 ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చాలా కష్టంగా పడవ నడపడం చూసి యేసు తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా, 49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళ మీద నడవడం చూసి, దయ్యం అనుకుని భయపడి బిగ్గరగా కేకలు వేశారు. 50 వెంటనే యేసు వారితో, “ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!” అని అన్నాడు.

    51 ఆయన వారి దగ్గరికి వచ్చి, పడవ ఎక్కగానే గాలి ఆగింది. వారు తమలో తాము ఆశ్చర్యపడుతూ అమితంగా విభ్రాంతి చెందారు.

  58. 22 మీ యెహోవా దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి వారికి భయపడ వద్దు.”

  59. 1 యెహోవాను స్తుతించండి. యెహోవా పట్ల భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలనుబట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు.

  60. 10 జ్ఞానం కలిగి ఉండడానికి మూలాధారం యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడమే. వివేకానికి ఆధారం పరిశుద్ధుడైన దేవుణ్ణి గూర్చిన తెలివి కలిగి ఉండడమే.

  61. 11 వారు సమాజమందిరాల్లో పెద్దల దగ్గరకూ అధిపతుల దగ్గరకూ అధికారుల దగ్గరకూ మిమ్మల్ని తీసుకు వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా జవాబివ్వాలా, ఏం మాట్లాడాలా అని చింత పడవద్దు. 12 మీరు ఏం చెప్పాలో ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ మీకు నేర్పిస్తాడు.”

  62. 22 సూర్యుని కింద మానవుడు పడే కష్టానికీ చేసే పనులకూ అతడికేం దొరుకుతున్నది? 23 అతడు రోజులో చేసే పనులన్నీ కష్టంతో, వత్తిడితో నిండి ఉన్నాయి. కాబట్టి రాత్రి పూట కూడా అతడి మనస్సుకు నెమ్మది దొరకదు. ఇది కూడా నిష్ప్రయోజనమే.

  63. 12 నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి.

  64. 26 సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తరువాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు. 27 కానీ భయంతో తీర్పు కోసం ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది. అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్ని ఉంటుంది.

  65. 15 దేవుని మనిషి దగ్గర పనివాడు ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళాడు. పట్టణం చుట్టూ గుర్రాలూ, రథాలూ, పెద్ద సైన్యం మోహరించి ఉండటం చూశాడు. అప్పుడు ఆ పనివాడు “అయ్యో ప్రభూ, ఇప్పుడు మనమేం చేద్దాం?” అని దేవుని మనిషితో అన్నాడు. 16 దానికి ఎలీషా “భయపడవద్దు, వాళ్ళ వైపు ఉన్నవాళ్ళ కంటే మన వైపు ఉన్నవాళ్లు ఎక్కువ మంది” అని జవాబిచ్చాడు.

    17 ఆ తరువాత ఎలీషా “యెహోవా, వీడు చూడాలి. అందుకోసం దయచేసి వీడి కళ్ళు తెరువు” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఆ పనివాడి కళ్ళు తెరిచాడు. వాడు ఆ పర్వతమంతా అగ్ని జ్వాలల్లాంటి గుర్రాలూ, రథాలూ ఎలీషా చుట్టూ ఉండటం చూశాడు.

  66. 26 ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు. 27 వెంటనే యేసు, “ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు” అన్నాడు.

  67. 3 కాని యెహోవా, నువ్వే నాకు డాలు, నువ్వే నాకు మహిమ, నా తల ఎత్తేవాడివి.

    4 నేను యెహోవాకు నా స్వరమెత్తినప్పుడు, ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబిస్తాడు. సెలా.

    5 నేను పడుకుని నిద్రపోయాను. యెహోవా నాకు క్షేమం ఇచ్చాడు గనక మేల్కొన్నాను.

    6 అన్ని వైపులనుంచి వచ్చి నాకు విరోధంగా మొహరించిన గుంపులకు నేను భయపడను.

  68. 13 తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు, యెహోవా తనను గౌరవించే వాళ్ళను జాలితో చూసుకుంటాడు.

  69. 13 ఇదంతా విన్న తరువాత తేలింది ఇదే.

    నువ్వు దేవుని మీద భయభక్తులు ఉంచి ఆయన ఆజ్ఞలను పాటించాలి.

    మానవులంతా చేయాల్సింది ఇదే.

    14 ఎందుకంటే దేవుడు ప్రతి పనినీ, రహస్యంగా ఉంచిన ప్రతి విషయాన్నీ,

    అది మంచిదైనా చెడ్డదైనా, తీర్పులోకి తెస్తాడు.

  70. 14 కనుక మేము ఏం జవాబులు చెప్పాలా అని ముందే ఆలోచించుకోకూడదని మీ మనసులో నిశ్చయం చేసుకోండి. 15 మీ విరోధులు ఎదిరించలేని, కాదనలేని జ్ఞానాన్నీ, నోటిమాటలనూ మీకిస్తాను.

  71. 19 కాగా నా దేవుడు తన ఐశ్వర్యంతో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు.

  72. 1 ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా దూత అబ్రాముకు దర్శనమిచ్చాడు. “అబ్రామూ, భయపడకు! నేనే నీకు డాలును, గొప్ప బహుమానాన్ని” అన్నాడు.

  73. 12 జెకర్యా అతనిని చూసి, కంగారుపడి భయపడ్డాడు. 13 అప్పుడా దూత అతనితో, “జెకర్యా, భయపడకు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు.

  74. 28 ఈ విషయాలు మాత్రమే కాకుండా క్రీస్తు సంఘాలన్నిటిని గురించిన దిగులు రోజూ నా మీద భారంగా ఉంది.

  75. 10 చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. 11 మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.

    12 ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.

    13 అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.

  76. 11 భయంతో యెహోవాను ఆరాధించండి, గడగడ వణకుతూ ఆనందించండి.

  77. 4 అతన్ని చూసి కావలివారు భయపడి వణకుతూ చచ్చిన వారిలా పడిపోయారు.

  78. 23 యెహోవాకు చెందవలసిన భయభక్తులు ఆయనకి చెల్లించాలి. అది జీవ సాధనం. అది ఉన్న వాడు తృప్తిగా బ్రతుకుతాడు.

  79. 57 నేను నీకు మొర్ర పెట్టిన రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో “భయపడవద్దు” అని చెప్పావు.

    58 ప్రభూ, నువ్వు నా జీవితపు వివాదాల విషయంలో వాదించి నా జీవాన్ని విమోచించావు.

  80. 20 అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, “దావీదు కుమారా, యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది.

  81. 5 ద్వీపాలు చూసి దిగులు పడుతున్నాయి.

    భూదిగంతాలు వణకుతున్నాయి, ప్రజలు వచ్చి చేరుకుంటున్నారు.

  82. 25 “ఇంకా సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలు కలుగుతాయి. సముద్రం, దాని అలల హోరు శబ్దానికి భూమి మీద ప్రజలు భయకంపితులై యాతన పడతారు. 26 ఆకాశంలోని శక్తులు కదిలిపోతాయి. కాబట్టి లోకం పైకి రాబోయే వాటిని గురించిన భయం ప్రజలకి కలుగుతుంది. వారు గుండెలవిసి పోయి కూలిపోతారు. 27 అప్పుడు మనుష్య కుమారుడు బల ప్రభావంతో, గొప్ప యశస్సు కలిగి మేఘాలపై రావడం చూస్తారు. 28 ఇవి జరగడం ఆరంభమైనప్పుడు ధైర్యం తెచ్చుకోండి. తలలు పైకెత్తి చూడండి. మీ విముక్తి దగ్గరవుతూ ఉంటుంది” అన్నాడు.