34 Bible Verses About Storms

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Storms
  1. 36 శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరి కొన్ని పడవలు కూడా వారివెంట వచ్చాయి. 37 అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి. 38 పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు. 39 ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది.

    40 అప్పుడాయన శిష్యులతో, “మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?” అని అన్నాడు. 41 వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు.

  2. 23 ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేసేవారు మహాజలాల మీద తిరుగుతూ వ్యాపారం చేసేవారు

    24 యెహోవా కార్యాలను, సముద్రంలో ఆయన చేసే అద్భుతాలను చూశారు.

    25 ఆయన సెలవియ్యగా తుఫాను పుట్టింది. అది దాని తరంగాలను పైకెత్తింది.

    26 వారు ఆకాశందాకా ఎక్కుతూ అగాధానికి దిగుతూ ఉన్నారు. బాధతో వారి ప్రాణం కరిగిపోయింది.

    27 మత్తెక్కిన వారివలె వారు ముందుకి, వెనక్కి దొర్లుతూ ఇటు అటు తూలుతూ ఉన్నారు. వారు ఏమీ తోచక ఉన్నారు.

    28 బాధకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు.

    29 ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగాలు అణిగిపోయాయి.

    30 అవి నిమ్మళమైపోయాయని వారు సంతోషించారు. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు.

    31 ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

  3. 5 మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు. 6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

    8 చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. 9 మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.

  4. 1 యెహోవా వాక్కు అమిత్తయి కొడుకు యోనాకు ప్రత్యక్షమై ఇలా తెలియజేశాడు. 2 “నువ్వు లేచి నీనెవె మహాపట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటన చెయ్యి. ఆ నగరవాసుల దుర్మార్గం నా దృష్టికి ఘోరంగా ఉంది.” 3 కానీ యోనా యెహోవా సన్నిధినుంచి పారిపోయి తర్షీషు పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. యొప్పేకు వెళ్లి తర్షీషుకు వెళ్ళే ఒక ఓడ చూశాడు. ప్రయాణానికి డబ్బులిచ్చి, యెహోవా సన్నిధినుంచి దూరంగా తర్షీషు వెళ్లి పోవడానికి ఆ ఓడ ఎక్కాడు.

    4 అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి వీచేలా చేశాడు. అది సముద్రంలో గొప్ప తుఫానుగా మారింది. ఓడ బద్దలైపోయేలా ఉంది. 5 అప్పుడు ఆ ఓడ నావికులు చాలా భయపడ్డారు. ప్రతి ఒక్కడూ తన దేవునికి మొర్రపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి అందులో ఉన్న సరకులను సముద్రంలో పారేశారు. అయితే యోనా ఓడ లోపలి భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రపోతున్నాడు.

    6 అప్పుడు ఓడ నాయకుడు అతని దగ్గరికి వచ్చి “నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు! ఒకవేళ నీ దేవుడు మనలను గమనించి మనం నాశనం కాకుండా చూస్తాడేమో” అన్నాడు.

  5. 4 ఎందుకంటే దరిద్రులకు నీవు భద్రతగాను, అవసరతలో ఉన్నవారికి సంరక్షకునిగానూ ఉన్నావు. గాలివానలో ఆశ్రయంగాను వేసవిలో నీడగానూ ఉన్నావు. నిర్దయుల ఊపిరి సెగలాగా గోడకి తగులుతున్న తుఫానులాగా ఉంటే నీవు కవచంగా ఉన్నావు.

    5 ఎండ వేడిమి వర్షాభావం ఉన్న ప్రదేశాన్ని అణచి వేసినట్టు నీవు అన్యుల ఘోషను అణచివేశావు. మేఘం నీడలో ఎండ చల్లారి పోయినట్టు బలాత్కారుల జయకీర్తన అణిగి పోతుంది.

  6. 21 వారు చాలాకాలం పస్తులు ఉండగా పౌలు వారి మధ్య నిలబడి, “అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండానే ఉండవలసింది. అప్పుడీ హానీ, నష్టమూ కలగకపోయేది. 22 ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. ఓడకి మాత్రమే నష్టం కలుగుతుందిగానీ, మీలో ఎవరి ప్రాణానికీ హాని కలగదు. 23 నేను ఎవరి వాడినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి, 24 ‘పౌలూ, భయపడకు. నీవు సీజరు ముందు నిలబడాల్సి ఉంది. ఇదిగో, నీతో కూడ ఓడలో ప్రయాణిస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు. 25 కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతుందని నేను దేవుని నమ్ముతున్నాను. 26 అయినప్పటికీ మనం కొట్టుకుపోయి ఏదైనా ఒక ద్వీపానికి తగులుకోవాలి” అని చెప్పాడు.

  7. 5 సీయోను కొండలోని ప్రతి నివాస స్థలం మీద, దాని సమావేశ ప్రాంగణాల మీద పగలు మేఘం, పొగ, రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశం ఒక మహిమ పందిరిలా యెహోవా కలగజేస్తాడు. 6 ఆ మహిమ పగలు ఎండకు నీడగానూ, గాలివానకు ఆశ్రయంగానూ, పైకప్పుగానూ ఉంటుంది.

  8. 24 “కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు. 25 వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు. 26 నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు. 27 వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం.”

    28 యేసు ఈ మాటలు చెప్పి ముగించినపుడు ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. 29 ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాక అధికారం గల వాడిలాగా వారికి బోధించాడు.

  9. 2 యెహోవా రోషం గలవాడు. ఆయన ప్రతీకారం చేస్తాడు. ఆయన తీవ్రమైన కోపంతో ఉన్నాడు. యెహోవా తన శత్రువులపై ప్రతీకారం చేస్తాడు. ఆయనకు విరోధంగా ప్రవర్తించే వారి మీద కోపం తెచ్చుకుంటాడు. 3 యెహోవా తొందరగా కోపం తెచ్చుకోడు. ఆయన సర్వ శక్తిశాలి. దోషులను ఆయన నిర్దోషులుగా చూడడు. యెహోవా తుఫానులో నుండి, సుడిగాలిలో నుండి వస్తాడు. మేఘాలు ఆయన కాలి కింద మన్ను లాగా ఉన్నాయి. 4 ఉప్పొంగే సముద్రాన్ని ఆయన గద్దించి ఆణిగిపోయేలా చేస్తాడు. నదులన్నీ ఎండిపోయేలా చేస్తాడు. బాషాను, కర్మెలు వాడిపోతాయి. లెబానోను పువ్వులు వాడిపోతాయి.

    5 ఆయనపట్ల కలిగిన భయం వల్ల పర్వతాలు కదిలిపోతాయి. కొండలు కనిపించకుండా కరిగి పోతాయి. ఆయన ఎదుట నిలువలేక భూమి వణికిపోతుంది. భూమి, దానిపై నివసించేవారంతా ఆయన అంటే భయపడతారు. 6 ఆయన తీవ్రమైన కోపాన్ని తట్టుకోగలిగేవాడు ఎవడు? ఆయన ఉగ్రత ఎదుట ఎవ్వరూ నిలబడలేరు. ఆయన కోపం అగ్ని ప్రవాహంలాగా పారుతుంది. ఆయన కొండలను బద్దలయ్యేలా చేస్తాడు.

  10. 11 యెహోవా అతనితో “నీవు వెళ్లి పర్వతం మీద నా ఎదుట నిలబడు” అన్నాడు. అప్పుడు యెహోవా అటుగా వెళ్ళగానే ప్రచండమైన గాలి లేచింది. పర్వతాలు బద్దలై బండరాళ్ళు ముక్కలైపోయాయి గాని యెహోవా ఆ గాలిలో లేడు. గాలి వెళ్లిపోయిన తరువాత భూకంపం వచ్చింది గాని ఆ భూకంపంలో యెహోవా లేడు. 12 ఆ భూకంపం వెళ్ళిపోయిన తరువాత అగ్ని జ్వాలలు కన్పించాయి గాని ఆ అగ్నిలో యెహోవా లేడు. అగ్ని ఆగిపోగానే చాలా నెమ్మదిగా మాట్లాడే ఒక స్వరం వినిపించింది.

    13 ఏలీయా ఆ స్వరం విని, తన దుప్పటితో ముఖం కప్పుకుని బయలుదేరి గుహ ఎదుట నిలబడ్డాడు. అప్పుడు “ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్?” అనే మాట వినిపించింది.

  11. 22 యేసు వెంటనే శిష్యులను తనకంటే ముందుగా ఆవలి తీరానికి వెళ్ళమని పడవ ఎక్కించాడు. 23 ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత, ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. 24 అప్పటికి ఆ పడవ సముద్రం మధ్యలో ఉంది. ఎదురు గాలితో అలలు పడవను కొడుతూ ఉంటే ఆ తాకిడికి అది వారి అదుపు తప్పి కొట్టుకుపోతూ ఉంది.

    25 రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. 26 ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు. 27 వెంటనే యేసు, “ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు” అన్నాడు. 28 పేతురు, “ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు. 29 యేసు “రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని 30 గాలిని చూసి భయపడి మునిగిపోతూ, “ప్రభూ, నన్ను రక్షించు” అని కేకలు వేశాడు. 31 వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, “అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు.

    32 యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది.

  12. 17 ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు.

    18 విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు.

    19 ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటి పైనా అతనికి విజయం ఇస్తాడు.

    20 ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతాడు. వాటిలో ఒక్కటి కూడా విరిగి పోదు.

  13. 10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను.

    నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి.

    దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను.

    నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.

  14. 6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.

    7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి.

  15. 23 మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములు వడగండ్లు కురిపించాడు. భూమి మీద పిడుగులు పడుతున్నాయి. ఐగుప్తు దేశం అంతటా యెహోవా వడగళ్ళు కురిపించాడు. 24 ఆ విధంగా వడగళ్ళు, వడగళ్ళతో కూడిన పిడుగులు ఎంతో బాధ కలిగించాయి. ఐగుప్తు దేశం ఏర్పడినది మొదలు ఇలాంటిది సంభవించ లేదు. 25 ఐగుప్తు దేశమంతటా కురిసిన ఆ వడగళ్ళు మనుష్యులను, జంతువులను, బయట ఉండిపోయిన సమస్తాన్నీ నాశనం చేశాయి. పొలంలో ఉన్న పంట అంతా నాశనం అయ్యింది. చెట్లన్నీ విరిగిపోయాయి. 26 అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషెను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు.

  16. 1 సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు.

    2 ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, అని నేను యెహోవాను గురించి చెబుతాను.

    3 వేటగాడు పన్నిన ఉచ్చు నుంచి ప్రాణాంతకవ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు.

    4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన నమ్మకత్వం నిన్ను కాపాడే కవచంగా ఉంటుంది.

    5 రాత్రిలో కలిగే భయభ్రాంతులకు, పగటివేళ ఎగిరి వచ్చే బాణాలకూ నువ్వు భయపడవు.

  17. 2 వినండి! శక్తిశాలీ, బలశాలీ అయిన ఒకడు ప్రభువుకి ఉన్నాడు. అతడు వడగళ్ళ లాంటి వాడు.

    అతడు వినాశనకారి అయిన తుఫాను వంటివాడు. ముంచెత్తే బలమైన జడివాన వంటివాడు. ఆయన తన చేతితో భూమిని కొడతాడు.

  18. 1 కడవరి వాన కాలంలో వర్షం దయచేయమని యెహోవాను వేడుకోండి. ఆకాశంలో మెరుపులు పుట్టేలా చేసేవాడు యెహోవాయే. ఆయన ప్రతి ఒక్కరి పొలంలో పంటలు పెరిగేలా సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడు.

  19. 33 నన్ను బట్టి మీకు శాంతి కలగాలని నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు బాధ ఉంది. కాని ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను” అన్నాడు.

  20. 9 నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”

  21. 8 అప్పుడు యెహోవా “వారికి భయపడవద్దు, వారిని నీ చేతికి అప్పగించాను, వారిలో ఎవరూ నీ ముందు నిలబడలేరు” అని యెహోషువతో చెప్పగానే, 9 యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతా నడచి వారి మీద హఠాత్తుగా దాడి చేశాడు.

    10 అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ప్రజల ముందు వారిని గందరగోళానికి గురి చెయ్యగానే యెహోషువ గిబియోను ముందే మహా ఘోరంగా వారిని హతం చేశాడు. బేత్‌హోరోనుకు పైకి వెళ్ళే మార్గంలో అజేకా వరకూ, మక్కేదా వరకూ, యోధులు వారిని తరిమి హతం చేస్తూనే ఉన్నారు. 11 వారు ఇశ్రాయేలీయుల నుండి బేత్‌హోరోనుకు దిగిపోయే తోవలో పారిపోతుండగా, వారు అజేకాకు వచ్చే వరకూ యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగళ్ళను వారి మీద కురిపించాడు. కాబట్టి వారు దాని వల్ల చనిపోయారు. ఇశ్రాయేలీయులు కత్తితో చంపిన వారికంటే ఆ వడగండ్ల వలన చచ్చినవారు ఎక్కువమంది అయ్యారు.

  22. దావీదు కీర్తన.

    1 యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు.

    2 పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు.

    3 నా ప్రాణాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు, తన నామాన్ని బట్టి సరైన మార్గాల్లో నన్ను నడిపిస్తాడు.

    4 చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.

  23. 8 యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీలాంటి బలిష్టుడెవడు? నీ విశ్వాస్యత నిన్ను ఆవరించి ఉంది.

    9 ఉప్పొంగే సముద్రాన్ని నువ్వు అదుపులో ఉంచుతావు, అలలు ఉవ్వెత్తుగా లేస్తే నువ్వు వాటిని అణచివేస్తావు.

  24. 26 కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. మీరు భయంతో వణుకుతున్నప్పుడు నేను మిమ్మల్ని ఎగతాళి చేస్తాను.

    27 తుఫాను వచ్చినట్టు మీకు భయం కలుగుతుంది, సుడిగాలి రేగినట్టు ప్రమాదం వచ్చి పడుతుంది. మీకు కష్ట సమయాలు, దుఃఖ సమయాలు సంభవిస్తాయి. అప్పుడు నేను మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తాను.

  25. 47 చీకటి పడుతూ ఉన్న సమయంలో శిష్యులు ఉన్న పడవ సముద్రం మధ్యలో ఉంది. యేసు మాత్రమే ఒడ్డున ఉన్నాడు. 48 ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చాలా కష్టంగా పడవ నడపడం చూసి యేసు తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా, 49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళ మీద నడవడం చూసి, దయ్యం అనుకుని భయపడి బిగ్గరగా కేకలు వేశారు. 50 వెంటనే యేసు వారితో, “ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!” అని అన్నాడు.

    51 ఆయన వారి దగ్గరికి వచ్చి, పడవ ఎక్కగానే గాలి ఆగింది. వారు తమలో తాము ఆశ్చర్యపడుతూ అమితంగా విభ్రాంతి చెందారు. 52 ఎందుకంటే రొట్టెలు పంచిన అద్భుతాన్ని వారు చూశారు కాని, వారి హృదయం బండబారి పోయింది కాబట్టి రొట్టెలను గురించిన సంగతి వారు గ్రహించలేదు.

  26. 17 ఇది గోదుమ పంట కోసే కాలం గదా. మీ కోసం రాజును నియమించమని కోరుకోవడం ద్వారా యెహోవా దృష్టిలో మీరు ఘోరమైన తప్పిదం చేశారని మీరు గ్రహించి తెలుసుకొనేలా యెహోవా ఉరుములు, వర్షం పంపాలని నేను ఆయనను వేడుకొంటున్నాను.” 18 సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములు, వర్షం పంపించగా ప్రజలంతా యెహోవాకు, సమూయేలుకు అమితంగా భయపడ్డారు.

  27. 6 నిన్ను సేనల ప్రభువైన యెహోవా శిక్షిస్తాడు. ఉరుములతో, భూకంపాలతో, భీకర శబ్దాలతో, సుడిగాలి తుఫానులతో, దహించే అగ్నిజ్వాలలతో ఆయన నిన్ను శిక్షిస్తాడు.

  28. 31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.

    వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.

    అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

  29. 7 యెహోవా ఉత్తముడు, బాధ కలిగినప్పుడు ఆయన ఆశ్రయం కలిగిస్తాడు. తనపై నమ్మకం ఉంచేవాళ్ళు ఆయనకు తెలుసు.

  30. 28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  31. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.

  32. 9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.

    10 బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.

  33. 7 దేవుడు మనకు శక్తీ, ప్రేమా, నిగ్రహం కలిగించే ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనం కలిగించే ఆత్మను ఇవ్వలేదు.

  34. 5 మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. 6 కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు. 7 అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు. 8 అలాటి వాడు చంచలమైన మనసు గలవాడు. తన విషయాలన్నిటిలోనూ నిలకడ లేనివాడు.