81 Bible Verses About Work
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
23 మీరు ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి. మనుషుల కోసం అని కాదు గానీ ప్రభువుకు చేస్తున్నట్లు భావించుకుని చేయండి. 24 ప్రభువు నుండి మీకు వారసత్వం బహుమతిగా లభిస్తుందని మీకు తెలుసు. ప్రభువైన క్రీస్తుకు మీరు సేవ చేస్తున్నారు.
-
6 సాటి విశ్వాసులారా, మేము ఉపదేశించిన సత్యాల ప్రకారం చేయకుండా సోమరులుగా బ్రతుకుతున్న వారి నుండి తొలగి పోవాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర మీకు ఆదేశిస్తున్నాం. 7 మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య సోమరులుగా ప్రవర్తించలేదు. 8 ఎవరి దగ్గరా ఉచితంగా ఆహారం భుజించలేదు. మేము మీలో ఎవరికీ భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాం, కష్టపడి పని చేశాం.
9 మీరు మమ్మల్ని అనుకరించడం కోసం, ఆదర్శంగా ఉండాలనే ఇలా చేశాం కానీ మాకు మీ దగ్గర హక్కు లేదని కాదు. 10 అలాగే మేము మీ దగ్గర ఉన్నప్పుడు, “పని చేయకుండా ఎవడూ భోజనం చేయకూడదు” అని ఆజ్ఞాపించాం కదా! 11 మీలో కొంతమంది ఏ పనీ చేయకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ సోమరుల్లా తిరుగుతున్నారని మేము వింటున్నాం. 12 అలాంటి వారు ప్రశాంతంగా పని చేసుకుంటూ సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాం.
13 సోదరులారా, మీరైతే యోగ్యమైన పనులు చేయడంలో నిరుత్సాహపడవద్దు. 14 ఈ పత్రికలో మేము చెప్పిన ఆదేశాలకు ఎవరైనా లోబడకపోతే వాణ్ణి కనిపెట్టి ఉండండి. అతనికి సిగ్గు కలిగేలా అతనితో కలిసి ఉండవద్దు.
-
4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.
6 దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. 7 రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనపరచడానికి ఆయన ఇలా చేశాడు.
8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.
-
16 ఆయన స్త్రీతో “పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు. అతడు నిన్ను ఏలుతాడు” అని చెప్పాడు. 17 ఆయన ఆదాముతో “నువ్వు నీ భార్య మాట విని ‘తినొద్దు’ అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు. 18 నువ్వు ఎంత కష్టం చేసినా నేల ముళ్ళ తుప్పలను, ముళ్ళ పొదలనే మొలిపిస్తుంది. నువ్వు పొలంలో పండించిన పంట తింటావు. 19 నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూ చెమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు” అని చెప్పాడు.
-
26 దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27 దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.
28 దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు. 29 దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.
30 భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది. 31 దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.
-
8 విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి. 9 నువ్వు కష్టపడి ఆరు రోజుల్లో నీ పని అంతా ముగించాలి. 10 ఏడవ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఆ రోజున నువ్వు, నీ కొడుకు, కూతురు, సేవకుడు, దాసీ, నీ ఇంట్లో ఉన్న విదేశీయుడు, నీ పశువులు ఎవ్వరూ ఏ పనీ చెయ్యకూడదు.
11 ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్న సమస్తాన్నీ సృష్టించాడు. ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అందువల్ల యెహోవా విశ్రాంతి దినాన్ని దీవించి తనకోసం పవిత్ర పరిచాడు.
-
9 సోదర ప్రేమను గూర్చి ఎవరూ మీకు రాయనక్కరలేదు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పించాడు. 10 అలాగే మీరు మాసిదోనియ అంతటా ఉన్న సోదరులను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమలో మీరు మరింత వృద్ధి చెందుతూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాం.
11-12 సంఘానికి బయట ఉన్నవారి పట్ల మర్యాదగా ఉండడం, మీకు కొదువ ఏమీ లేకుండా మేము ఆదేశించిన విధంగా ప్రశాంతంగా జీవించడం, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ సొంత విషయాల్లో ఆసక్తి కలిగి మీ చేతులతో కష్టపడి పని చేసుకుంటూ ఉండడం లక్ష్యంగా పెట్టుకోండి.
-
4 శ్రద్ధ లేకుండా బద్దకంగా పనిచేసే వాడు దరిద్రుడుగా మారతాడు. శ్రద్ధ కలిగి పనిచేసే వాడికి సంపద సమకూరుతుంది.
5 బుద్ధిగల కుమారుడు ఎండాకాలంలో సమకూర్చుకుంటాడు. పంట కోత సమయంలో నిద్రపోయే కుమారుడు కుటుంబానికి అవమానం కలిగిస్తాడు.
-
5 సేవకులారా, భయంతో వణకుతో, క్రీస్తుకు లోబడినట్టు, ఈ లోకంలో మీ యజమానులకు హృదయపూర్వకంగా లోబడండి. 6 మనుషులను సంతోషపెట్టేవారు చేసినట్టు పైపైన కాక, క్రీస్తు దాసులుగా దేవుని సంకల్పాన్ని హృదయపూర్వకంగా జరిగిస్తూ, 7 ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవచేయండి. 8 దాసుడైనా, స్వతంత్రుడైనా, మీలో ప్రతివాడూ తాను చేసిన మంచి పనికి ప్రభువు వలన ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.
9 యజమానులారా, మీరూ మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. మీకూ మీ దాసులకూ ఒక్కడే యజమాని పరలోకంలో ఉన్నాడనీ, ఆయన పక్షపాతం లేని వాడనీ గ్రహించి, వారిని బెదిరించడం మానండి.
-
6 సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి జ్ఞానం తెచ్చుకో.
7 వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు.
8 అయినప్పటికీ అవి ఎండాకాలంలో తమకు తిండి సిద్ధం చేసుకుంటాయి. పంట కోత కాలంలో ఆహారం సమకూర్చుకుంటాయి.
9 సోమరీ, ఎంతసేపటి వరకూ నిద్రపోతూ ఉంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు?
10 ఇంకా ఎంతసేపు కునికిపాట్లు పడుతూ “కొంచెం సేపు నిద్రపోతాను, కాస్సేపు చేతులు ముడుచుకుని పడుకుంటాను” అనుకుంటావు?
11 అందువల్ల దోపిడీ దొంగ వచ్చినట్టు దరిద్రం నీకు ప్రాప్తిస్తుంది. ఆయుధం ధరించిన శత్రువు వలే లేమి నీ దగ్గరికి వస్తుంది.
-
23 కష్టంతో కూడిన ఏ పని చేసినా ఫలితం దక్కుతుంది. వ్యర్ధమైన మాటలు దరిద్రానికి నడుపుతాయి.
-
4 పగలున్నంత వరకూ నన్ను పంపిన వాడి పనులు మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది. అప్పుడిక ఎవరూ పని చేయలేరు. 5 ఈ లోకంలో ఉన్నంతవరకూ నేను ఈ లోకానికి వెలుగుని” అని చెప్పాడు.
6 ఆయన ఇలా చెప్పి, నేలపై ఉమ్మి వేసి, దానితో బురద చేసి ఆ బురదను ఆ గుడ్డివాడి కన్నులపై పూశాడు. 7 “సిలోయం కోనేటికి వెళ్ళి దాంట్లో కడుక్కో” అని వాడికి చెప్పాడు. సిలోయం అనే మాటకు ‘వేరొకరు పంపినవాడు’ అని అర్థం. వాడు వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కుని చూపు పొంది తిరిగి వచ్చాడు.
-
28 దొంగతనం చేసేవాడు దాన్ని విడిచిపెట్టాలి. తన చేతులతో కష్టపడి పనిచేసి అక్కరలో ఉన్నవారికి సహాయం చేయాలి.
-
10 నిన్ను చేయమని అడిగిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయి. నువ్వు వెళ్ళే సమాధిలో పని గాని, ఉపాయం గాని, తెలివి గాని, జ్ఞానం గాని లేదు.
-
1 అయితే నీవు ఆరోగ్యకరమైన ఉపదేశానికి అనుకూలమైన సంగతులను బోధించు. 2 వృద్ధులు నిగ్రహం కలిగి, గౌరవపూర్వకంగా, వివేకంతో మెలుగుతూ విశ్వాసం, ప్రేమ, సహనంలో శుద్ధంగా ఉండాలి.
3 అలాగే వృద్ధ స్త్రీలు గౌరవప్రదంగా, పుకార్లు పుట్టించేవారుగా కాకుండా ఉండాలి. అస్తమానం మద్యపానంలో మునిగి తేలుతూ ఉండకూడదు. నడవడిలో భయభక్తులు గలిగి మంచి విషయాలు నేర్పుతూ ఉండాలి. 4-5 దేవుని వాక్యానికి చెడ్డ పేరు రాకుండేలా తమ భర్తలను, పిల్లలను ప్రేమతో చూసుకోవాలని యువతులను ప్రోత్సహిస్తూ, మనసును అదుపులో ఉంచుకుంటూ, శీలవతులుగా, తమ ఇంటిని శ్రద్ధగా చక్కబెట్టుకొనేవారుగా, తమ భర్తలకు లోబడుతూ ఉండాలని వృద్ధ స్త్రీలు వారికి బోధించాలి.
6 అలానే మనసు అదుపులో ఉంచుకోవాలని యువకులను హెచ్చరించు. 7 నిన్ను వ్యతిరేకించేవాడు నీ గురించి చెడ్డ మాటలేవీ చెప్పలేక సిగ్గుపడే విధంగా అన్ని మంచి పనుల విషయంలో నిన్ను నీవే ఆదర్శంగా కనపరచుకో. 8 నీ ఉపదేశం యథార్థంగా, మర్యాదపూర్వకంగా, విమర్శకు చోటియ్యనిదిగా ఉండాలి.
-
30 సోమరిపోతు చేను నేను దాటి వస్తుంటే తెలివిలేనివాడి ద్రాక్షతోట నేను దాటి వస్తుంటే, 31 ఇదిగో దాన్నిండా ముండ్ల తుప్పలు పెరిగి ఉన్నాయి. ముళ్ళపొదలు వ్యాపించి ఉన్నాయి. దాని రాతి గోడ శిథిలం అయి పోయింది.
32 నేను దాన్ని చూసి ఆలోచించాను. దాన్ని గమనించి బుద్ధి తెచ్చుకున్నాను.
33 మరికాస్త నిద్ర, మరికాస్త కునుకు, నిద్ర పోవడానికి మరికాస్త చేతులు ముడుచు కోవడం, 34 వీటివల్ల నీకు దారిద్రర్యం పరిగెత్తుకుంటూ వస్తుంది ఆయుధం ధరించిన సైనికుడు వచ్చినట్టు లేమి నీమీదికి వస్తుంది.
-
2 అబ్రాహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్పు పొంది ఉంటే అతడు గొప్పలు పోవడానికి కారణం ఉండేది గానీ అది దేవుని ఎదుట కాదు. 3 లేఖనం చెబుతున్నదేమిటి? “అబ్రాహాము దేవునిలో నమ్మకముంచాడు. దాని ద్వారానే అతడు నీతిమంతుడని తీర్పు పొందాడు.” 4 పని చేసే వ్యక్తికి ఇచ్చే జీతం అతనికి హక్కుగా రావలసిన సొమ్మే గాని దానం కాదు.
5 కానీ క్రియలు చేయకుండా దానికి బదులు భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చే దేవునిలో కేవలం విశ్వాసం ఉంచే వ్యక్తి విశ్వాసాన్నే దేవుడు నీతిగా ఎంచుతాడు.
-
58 కాబట్టి నా ప్రియ సోదరులారా, స్థిరంగా, నిబ్బరంగా ఉండండి. మీ కష్టం ప్రభువులో వ్యర్థం కాదని ఎరిగి, ప్రభువు సేవలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి.
-
1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, 2 “యూదా గోత్రానికి చెందిన బెసలేలును నేను నియమించుకున్నాను. అతడు ఊరీ కొడుకు, హూరు మనుమడు. 3 అతనికి నేను అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, సమస్త జ్ఞానం, నేర్పరితనం ప్రసాదించాను. అతణ్ణి నా ఆత్మతో నింపాను. 4 అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి. రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కను కోసి నునుపు చేయడంలో నిపుణుడు. 5 నేను ప్రసాదించిన సమస్త జ్ఞానం, వివేకాలతో అతడు పనులు జరిగిస్తాడు.
-
4 సోమరిపోతు ఎక్కువగా ఆశ పడతాడు గానీ వాడికి ఏమీ మిగలదు. కష్టపడి పని చేసేవాడు సుఖంగా జీవిస్తాడు.
-
17 యేసు వారితో, “నా తండ్రి ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. నేను కూడా చేస్తున్నాను” అన్నాడు.
-
17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.
-
16 నీ సేవకులకు నీ పని చూపించు, మా సంతానం నీ వైభవాన్ని చూడనివ్వు.
17 మా యెహోవా దేవుని ప్రసన్నత మా మీద ఉండు గాక. మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి. నిజంగా, మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి.
-
9 కష్టపడి పని చేసిన వారికి దాని వలన వచ్చిన లాభమేముంది?
10 మానవులు చేయడానికి దేవుడు వారికి ఇచ్చిన పని ఏమిటో నేను చూశాను.
11 దేవుడు ప్రతి దానినీ దాని కాలానికి సరిపడినట్టుగా చేశాడు. ఆయన నిత్యమైన జ్ఞానాన్ని మానవుల హృదయాల్లో ఉంచాడు. దేవుని కార్యాలను మొదటి నుండి చివరి వరకూ పూర్తిగా గ్రహించడానికి అది చాలదు.
12 కాబట్టి మానవులకు బతికినంత కాలం సంతోషంగా, మంచి జరిగిస్తూ ఉండడం కంటే శ్రేష్ఠమైనదేదీ లేదని నేను గ్రహించాను. 13 ప్రతి ఒక్కరూ అన్నపానాలు పుచ్చుకుంటూ తన కష్టార్జితాన్ని అనుభవించడం దేవుడిచ్చే బహుమానమే అని కూడా గ్రహించాను.
-
15 “అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకుని మీ దగ్గరికి వస్తారు. కాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 16 వారి ఫలాలను బట్టి వారిని తెలుసు కోవచ్చు. ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరపండ్లు గానీ కోస్తారా? 17 అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది. 18 మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు. 19 మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు. 20 ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు.
21 “‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు. 22 ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు. 23 అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.
-
28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”
-
34 యేసు వారిని చూసి, “నన్ను పంపించిన వాని ఇష్టాన్ని చేయడం, ఆయన పని చేసి ముగించడమే నా ఆహారం.
-
1 ఆకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీపూర్తి అయ్యాయి. 2 ఏడవ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచీ ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. 3 దేవుడు ఆ ఏడవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచీ విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు.
-
12 మీ యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. 13 ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని చేయాలి. 14 ఏడో రోజు మీ యెహోవా దేవునికి విశ్రాంతి దినం. ఆ రోజు మీరు, మీ కొడుకు, కూతురు, దాసుడు లేక దాసి, మీ ఎద్దు లేక గాడిద, మీ పశువుల్లో ఏదైనా సరే, మీ ఇంట్లో ఉన్న పరదేశితో సహా, ఏ పనీ చేయకూడదు. ఎందుకంటే మీకులాగా మీ దాసుడు, మీ దాసి కూడా విశ్రాంతి తీసుకోవాలి.
15 మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మీ దేవుడు యెహోవా తన బాహుబలంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడ నుండి రప్పించాడని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి, విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆయన మీకు ఆజ్ఞాపించాడు.
-
17 ఇదంతా చూస్తే సూర్యుని కింద జరిగేదంతా నన్ను కుంగదీసింది. అంతా నిష్ప్రయోజనంగా, ఒకడు గాలిని పట్టుకోడానికి బాధ పడినట్టుగా కనిపించింది. నాకు జీవితం మీద అసహ్యం వేసింది.
18 సూర్యుని కింద నేను ఎంతో బాధపడి సాధించిన వాటన్నిటినీ నా తరవాత వచ్చేవాడికి విడిచిపెట్టాలని గ్రహించి నేను వాటిని అసహ్యించుకున్నాను. 19 వాడు తెలివైనవాడో, బుద్ధిహీనుడో ఎవరికి తెలుసు? అయితే సూర్యుని కింద నేను బాధతో, జ్ఞానంతో సంపాదించినదంతా వాడి అధికారం కిందకు వెళ్తుంది. ఇదీ నిష్ప్రయోజనమే. 20 కాబట్టి సూర్యుని కింద నేను పడిన కష్టమంతటి విషయంలో నేను నిస్పృహ చెందాను.
21 ఒకడు జ్ఞానంతో, తెలివితో, నైపుణ్యంతో కష్టపడి ఒక పని చేస్తాడు. అయితే అతడు దాని కోసం పని చేయని వేరొకడికి దాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తున్నది. ఇది కూడా నిష్ప్రయోజనంగా, గొప్ప విషాదంగా ఉంది. 22 సూర్యుని కింద మానవుడు పడే కష్టానికీ చేసే పనులకూ అతడికేం దొరుకుతున్నది? 23 అతడు రోజులో చేసే పనులన్నీ కష్టంతో, వత్తిడితో నిండి ఉన్నాయి. కాబట్టి రాత్రి పూట కూడా అతడి మనస్సుకు నెమ్మది దొరకదు. ఇది కూడా నిష్ప్రయోజనమే.
-
16 మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.
-
36 అయితే యోహాను నా గురించి చెప్పిన సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకుంది. నేను చేయడానికి నా తండ్రి నాకిచ్చిన పనులే ఆ సాక్ష్యం. ప్రస్తుతం నేను చేస్తున్న ఈ కార్యాలే తండ్రి నన్ను పంపాడని నా గురించి సాక్ష్యం చెబుతున్నాయి.
-
15 మనం పుట్టుకతో యూదులం గానీ, “యూదేతర పాపులం” కాదు. 16 మనిషి యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారానే దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు గాని, ధర్మశాస్త్ర క్రియల వలన కాదు. ఆ సంగతి ఎరిగిన మనం కూడా ధర్మశాస్త్ర క్రియల వలన గాక క్రీస్తు పట్ల విశ్వాసం ద్వారానే దేవుని చేత నీతిమంతులుగా తీర్పు పొందడానికి యేసు క్రీస్తులో విశ్వాసముంచాము. ధర్మశాస్త్ర క్రియల వలన ఎవరూ నీతిమంతుడని తీర్పు పొందడు గదా.
-
8 ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత ఇంటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్న వాడు. అలాటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.
-
4 అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు 5 మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. 6-7 దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.
-
24 ఒళ్ళువంచి పనిచేసే వాళ్ళు అధికారం సంపాదిస్తారు. సోమరిపోతులు ఊడిగం చెయ్యాల్సి వస్తుంది.
-
9 పనిలో సోమరిగా ఉండేవాడు నష్టం కలిగించే వాడికి అన్న.
-
4 నేను గొప్ప గొప్ప పనులు చేశాను. నా కోసం ఇళ్ళు కట్టించుకున్నాను, ద్రాక్షతోటలు నాటించుకున్నాను. 5 తోటలు, ఉద్యానవనాలను వేయించి వాటిలో పలు రకాల పండ్ల చెట్లు నాటించాను. 6 ఆ చెట్లకు నీటి కోసం నేను చెరువులు తవ్వించాను. 7 ఆడ, మగ పనివారిని నియమించుకున్నాను. దాసులుగానే నా ఇంట్లో పుట్టినవారు నాకు ఉన్నారు. యెరూషలేములో నాకు ముందు ఉన్న వారందరికంటే ఎక్కువగా పశువులు, గొర్రె మేకల మందలు నేను సంపాదించుకున్నాను.
8 నా కోసం వెండి బంగారాలను, వివిధ దేశాల రాజులకు, సంస్థానాల అధిపతులకు ఉండేటంత సంపదను సమకూర్చుకున్నాను. గాయకులనూ గాయకురాళ్ళనీ, మనుషులు కోరేవాటన్నిటినీ సంపాదించుకుని అనేకమంది స్త్రీలనూ ఉంచుకున్నాను. 9 నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటే గొప్పవాణ్ణి, ఆస్తిపరుణ్ణి అయ్యాను. నా జ్ఞానం నన్ను నడిపిస్తూనే ఉంది.
10 నా కళ్ళు చూడాలని ఆశపడిన వాటిని చూడకుండా నేను అడ్డు చెప్పలేదు.
నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషించింది.
అందుకే సంతోషాలను అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు.
ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం.
11 అప్పుడు నేను చేసిన పనులన్నిటినీ, వాటి కోసం నేను పడిన బాధ అంతటినీ గమనించి చూస్తే
అవన్నీ నిష్ప్రయోజనంగా, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా కనిపించింది.
సూర్యుని కింద ప్రయోజనకరమైనది ఏదీ లేనట్టు నాకు కనిపించింది.
-
19 “చాలా కాలం తరువాత ఆ యజమాని తిరిగి వచ్చి తన పనివారి దగ్గర లెక్కలు చూసుకున్నాడు. 20 అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు మరో ఐదు తలాంతులు తెచ్చి ‘అయ్యగారూ, మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో ఐదు తలాంతులు సంపాదించాను’ అని చెప్పాడు.
21 అతని యజమాని, ‘ఆహా! నీవు నమ్మకమైన మంచి పనివాడివి! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో’ అన్నాడు.
22 అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, ‘అయ్యగారూ, మీరు నాకు రెండు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో రెండు తలాంతులు సంపాదించాను’ అని చెప్పాడు. 23 యజమాని, ‘ఆహా! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో’ అన్నాడు.
24 తరువాత ఒక్క తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు. అతడన్నాడు, ‘అయ్యగారూ, మీరు విత్తనాలు నాటని చోట పంట కోయడానికీ, వెదజల్లని చోట పంట పోగుచేసుకోడానికీ చూసే కఠినాత్ములని నాకు తెలుసు. 25 కాబట్టి నాకు భయం వేసి, మీరిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టాను. ఇదిగో, తీసుకోండి’ అన్నాడు.
26 అందుకు ఆ యజమాని అతనితో, ‘నీవు సోమరివాడివి! చెడ్డ దాసుడివి. నేను విత్తని చోట కోసేవాడిని, వెదజల్లని చోట పంట పోగుచేసుకో జూసేవాడిని అని నీకు తెలుసు గదా! 27 అలాంటప్పుడు నీవు నా డబ్బును వడ్డీ వ్యాపారుల దగ్గర ఉంచాల్సింది. అప్పుడు నేను వచ్చి దాన్ని వడ్డీతో కలిపి తీసుకుని ఉండేవాణ్ణి’ అని చెప్పి, 28 ‘ఆ తలాంతును వాడి దగ్గర నుండి తీసుకుని పది తలాంతులు ఉన్నవాడికి ఇవ్వండి.
29 ఉన్న ప్రతివాడికీ మరింత ఇవ్వడం జరుగుతుంది, అతడు సమృద్ధి కలిగి ఉంటాడు. లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది. 30 పనికిమాలిన ఆ దాసుణ్ణి బయట ఉన్న చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి.
-
38 వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది. 39 ఆమెకు మరియ అనే సోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం వింటూ ఉంది. 40 మార్త ఎన్నో పనులు పెట్టుకుని తొందరపడుతూ ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది. నీకేం పట్టదా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు” అంది.
41 అందుకు ప్రభువు, “మార్తా, మార్తా, నువ్వు బోలెడన్ని పనులను గురించి తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే. 42 మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు” అని ఆమెతో చెప్పాడు.
-
11-12 విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు. 13 మనమంతా విశ్వాసంలో, దేవుని కుమారుడి గురించిన జ్ఞానంలో ఏకీభావం కలిగి ఉండాలనీ క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణ పరిణతికి సమానమైన పరిణతి చెందాలనీ ఆయన ఇలా నియమించాడు. 14 అప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని కల్పించిన అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము. 15 ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం. 16 ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా అమరి, దానిలోని ప్రతి అవయవమూ కీళ్ళ మూలంగా కలిసి ఉండి, తన శక్తి కొలది పని చేసినపుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది.
-
12 నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. 13 ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు.
-
11 ప్రియులారా, మీరీ లోకంలో పరదేశులుగా, బాటసారులుగా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మకు విరోధంగా పోరాటం చేసే శరీర దురాశలు విసర్జించాలని వేడుకుంటున్నాను. 12 యూదేతరులు మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉంటే, వారు మీ మంచి పనులు చూసి, దేవుడు దర్శించే రోజున ఆయనను మహిమ పరచేలా, వారి మధ్య మీ మంచి ప్రవర్తన చూపించండి.
-
19 ఋతువులను సూచించడానికి ఆయన చంద్రుణ్ణి నియమించాడు. సూర్యుడికి అతడు అస్తమించవలసిన కాలం తెలుసు.
20 నీవు చీకటి కమ్మ జేయగా రాత్రి అవుతున్నది. అప్పుడు అడవిజంతువులన్నీ సంచరిస్తున్నాయి.
21 సింహం పిల్లలు వేట కోసం గర్జిస్తున్నాయి. తమ ఆహారాన్ని దేవుని చేతిలోనుండి తీసుకోడానికి చూస్తున్నాయి.
22 సూర్యుడు ఉదయించగానే అవి మరలిపోయి తమ గుహల్లో పడుకుంటాయి.
23 సాయంకాలం దాకా పాటుపడి తమ పనులు జరుపుకోడానికి మనుషులు బయలుదేరుతారు.
-
24 యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది.
-
2 మీరు తెల్లారే లేచి చాలా ఆలస్యంగా ఇంటికి వస్తూ, కష్టపడి పని చేసి ఆహారం తింటూ ఉండడం వ్యర్ధం. దేవుడు తనకిష్టమైన వారికి నిద్రనిస్తున్నాడు.
-
11 తన భూమిని సేద్యం చేసుకునే వాడికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. బుద్ధిహీనుడు వ్యర్థమైన వాటిని అనుసరిస్తాడు.
-
15 సోమరితనం గాఢనిద్రలో పడేస్తుంది. పని చేయడం ఇష్టం లేని వాడు పస్తులుంటాడు.
-
29 తన పనిలో నిపుణతగల వాణ్ణి చూసావా? వాడు రాజుల సమక్షంలోనే నిలబడతాడు, మామూలు వాళ్ళ ఎదుట కాదు.
-
27 మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకుని వస్తాడు. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికీ వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.
-
29 అప్పుడు యేసు, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది ఇది, ‘ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ప్రభువైన మన దేవుడు, ఆ ప్రభువు ఒక్కడే. 30 పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ. 31 రెండవది, ‘నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అంతగా ప్రేమించాలి.’ వీటికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు” అని జవాబిచ్చాడు.
-
37 నేను నా తండ్రి పనులు చెయ్యకపోతే నన్ను నమ్మకండి. 38 అయితే, నేను నా తండ్రి పనులు చేస్తూ ఉంటే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలోను నేను తండ్రిలోను ఉన్నామని మీరు తెలుసుకుని అర్థం చేసుకునేందుకు ఆ పనులను నమ్మండి.”
-
21 ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి. 22 అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి. 23 భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. 24 నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. 25 క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. 26 ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.
27 కాబట్టి మనం గొప్పలు చెప్పుకోడానికి కారణమేది? దాన్ని కొట్టివేయడం అయిపోయింది. ఏ నియమాన్ని బట్టి? క్రియలను బట్టా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టే.
-
6 ఈ కారణం చేతనే మీరు పన్నులు కడుతున్నారు. ఎందుకంటే అధికారులు ఎప్పుడూ ఈ పనిలోనే దేవుని సేవకులుగా సేవ చేస్తుంటారు.
-
12 రాత్రి చాలా వరకూ గడిచిపోయి పగలు సమీపంగా వచ్చింది కాబట్టి మనం చీకటి కార్యాలను విడిచిపెట్టి, వెలుగు సంబంధమైన ఆయుధాలను ధరించుదాం.
-
10 దేవుడు నాకు దయచేసిన కృప వలన నేను నైపుణ్యం గల నిర్మాణకునిగా పునాది వేశాను. మరొకడు దాని మీద నిర్మిస్తున్నాడు. అయితే దాని మీద కడుతున్న ప్రతి ఒక్కరూ తాము ఏ విధంగా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి.
11 పునాది యేసు క్రీస్తే. వేసిన ఈ పునాది కాక, వేరే పునాది ఎవరూ వేయలేరు.
12 ఈ పునాది మీద ఎవరైనా బంగారం, వెండి, విలువైన రాళ్ళు, చెక్క, చెత్త పరకలు, ఇలాటి వాటితో కడితే 13 వారి వారి పని బయట పడుతుంది. ఆ రోజు దాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ఎందుకంటే అది అగ్నివల్ల బయట పడుతుంది. ప్రతి ఒక్కరి పనినీ మంటలే పరీక్షిస్తాయి. 14 పునాది మీద ఎవరి పని నిలబడుతుందో అతనికి ప్రతిఫలం దొరుకుతుంది. 15 ఎవరి పని కాలిపోతుందో అతనికి నష్టం వస్తుంది. అతడు తప్పించుకుంటాడు గానీ మంటల్లో నుండి తప్పించుకొన్నట్టుగా ఉంటాడు.
-
20 ఎవరు ఏ స్థితిలో ఉండగా పిలుపు పొందారో ఆ స్థితిలోనే ఉండాలి. 21 దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు బానిసగా ఉన్నావా? దాని గురించి చింతించవద్దు. అయితే నీకు స్వేచ్ఛ పొందడానికి శక్తి ఉంటే స్వేచ్ఛ పొందడమే మంచిది. 22 ప్రభువు పిలిచిన బానిస ప్రభువు వలన స్వతంత్రుడు. అదే విధంగా స్వతంత్రుడుగా ఉండి పిలుపు పొందిన వాడు క్రీస్తుకు బానిస. 23 ప్రభువు మిమ్మల్ని వెల చెల్లించి కొన్నాడు కాబట్టి మనుషులకు దాసులు కావద్దు. 24 సోదరులారా, మనలో ప్రతి ఒక్కరినీ ఏ స్థితిలో ఉండగా పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో నిలిచి ఉందాం.
-
10 ధర్మశాస్త్రం విధించిన క్రియలపై ఆధారపడి జీవించే వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే, “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది. 11 ధర్మశాస్త్రం వలన దేవుడు ఎవరినీ నీతిమంతునిగా తీర్చడు అనే విషయం స్పష్టం. ఎందుకంటే, “నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు.” 12 ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, “దాని విధులను ఆచరించే వాడు వాటి వల్లనే జీవిస్తాడు.”
13 ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించేలా, అబ్రాహాము పొందిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కలగడానికి, క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనలను ధర్మశాస్త్ర శిక్ష నుంచి విమోచించాడు. 14 అందుకే, “మాను మీద వేలాడిన ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది.
-
16 నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. 17 శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.
18 ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. 24 క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.
-
3 ఏ గొప్పతనం లేనివాడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటుంటే తనను తానే మోసపరచుకుంటున్నాడు. 4 ప్రతివాడూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది. 5 ప్రతివాడూ తన బరువు తానే మోసుకోవాలి గదా?
-
9 సోదరులారా, మా ప్రయాస, కష్టం మీకు జ్ఞాపకముంది కదా! మీకు దేవుని సువార్త ప్రకటించేటప్పుడు మేము మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టపడి పని చేశాం.
-
1 నా కుమారా, క్రీస్తు యేసులో ఉన్న కృపచేత బలవంతుడవుగా ఉండు. 2 అనేకుల ముందు నేను నీకు నేర్పిన సంగతులను ఇతరులకు బోధించగలిగిన, నమ్మకమైన వ్యక్తులకు అప్పగించు.
3 క్రీస్తు యేసు కోసం మంచి సైనికుడిలా కష్టాలు భరించు. 4 సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన జీవితంలో ఇతర వ్యాపకాల్లో చిక్కుకోకుండా తనను సైన్యంలో చేర్చుకున్నవాణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నిస్తాడు. 5 ఒక క్రీడాకారుడు నియమాల ప్రకారం పూర్తిచేయకపోతే అతనికి బహుమానం దొరకదు. 6 కష్టపడిన వ్యవసాయదారుడే రాబడిలో మొదటి భాగం పొందడానికి అర్హుడు. 7 నేను చెప్పే మాటలు ఆలోచించు. అన్ని విషయాల్లో ప్రభువు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు.
-
14 నా సోదరులారా, ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెప్పి, క్రియలు లేనివాడైతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం అతన్ని రక్షించగలదా?
15 ఒక సోదరునికి గాని, సోదరికి గాని కట్టుకోడానికి బట్టలు, ఆ రోజు తినడానికి భోజనం అవసరం అయితే, 16 మీలో ఒకడు అలాటి వారితో, “శాంతిగా వెళ్ళు, వెచ్చగా ఉండు, తృప్తిగా తిను” అని చెబితే ఏం ప్రయోజనం? 17 అదే విధంగా, క్రియలు లేకుండా విశ్వాసం ఒక్కటే ఉంటే, అదీ చచ్చినదే. 18 అయినా ఒకడు, “నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి” అనవచ్చు. క్రియలు లేని నీ విశ్వాసం నాకు చూపించు. అప్పుడు నేను నా క్రియల ద్వారా నా విశ్వాసం చూపిస్తాను.
19 దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు సరే. కానీ దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయి. నమ్మి గడగడా వణుకుతున్నాయి. 20 బుద్ధిలేనివాడా! క్రియలు లేని విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు అని నీకు తెలుసుకోవాలని లేదా?
21 మన పూర్వికుడు అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పణ చేసినప్పుడు, క్రియల వల్ల నీతిమంతుడుగా తీర్పు పొందలేదా? 22 అతని విశ్వాసం క్రియలతో కలిసి పని చేసింది. అతని క్రియల ద్వారా విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహిస్తున్నావు గదా. 23 “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.” అని లేఖనాల్లో ఉన్న విషయం నెరవేరింది. అంతేకాక అబ్రాహాముకు దేవుని స్నేహితుడు అని పేరు వచ్చింది.
24 మనిషిని విశ్వాసం ద్వారా మాత్రమే కాకుండా క్రియల ద్వారా దేవుడు నీతిమంతుడుగా ఎంచడం మీరు చూశారు. 25 అలానే వేశ్య రాహాబు కూడా వార్తాహరులను ఆహ్వానించి వేరొక మార్గంలో వారిని పంపివేయడాన్ని బట్టి తన క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలుగా ఎంచ బడింది గదా? 26 ప్రాణం లేని శరీరం ఎలా మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే.
-
1 ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. 2 భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.
3 దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది.
-
3 నీ చేతి వేళ్ళు తయారు చేసిన నీ ఆకాశాలనూ, వాటి తావులలో నీవుంచిన చంద్రనక్షత్రాలనూ నేను చూసినప్పుడు,
4 నువ్వు పట్టించుకోవడానికి మానవజాతి ఏ పాటిది? నువ్వు మానవాళి పట్ల శ్రద్ధ చూపడానికి వారు ఎంతటివాళ్ళు?
-
5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.
6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.
-
8 అయినా, యెహోవా, నువ్వే మాకు తండ్రివి.
మేము బంకమన్నులాగా ఉన్నాం. నువ్వు మాకు కుమ్మరివి. మేమంతా నీ చేతి పని.
-
53-54 యేసు ఈ ఉపమానాలు చెప్పి ఊరుకున్న తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్ళి తన సొంత ఊరు వచ్చి, సమాజ మందిరాల్లో వారికి బోధిస్తూ ఉన్నాడు. వారు ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడ నుంచి వచ్చాయి?
-
25 అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “నేను మీకు చెప్పాను గాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
-
11 తండ్రిలో నేను, నాలో తండ్రి ఉన్నాం అని నమ్మండి. అదీ కాకపోతే, ఈ క్రియల గురించి అయినా నన్ను నమ్మండి.
-
12 నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, నా మీద నమ్మకం ఉంచినవాడు, నేను చేసే క్రియలు కూడా చేస్తాడు. అంతమాత్రమే కాదు, ఇంతకన్నా గొప్ప క్రియలు చేస్తాడు. ఎందుకంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను.
-
5 నేను ద్రాక్ష తీగ, మీరు కొమ్మలు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు.
-
28 కాబట్టి మనుషులు ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వలన నీతిమంతులని తీర్పు పొందుతున్నారని నిర్ణయిస్తున్నాము.
-
28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.
-
2 మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్న ఒకే విషయం ఏమిటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందారా లేక విన్న దాన్ని విశ్వసించడం వలన పొందారా?
-
5 ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతాలు చేయించేవాడు, ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలనా లేక విశ్వాసంతో వినడం వల్ల చేయిస్తున్నాడా?
-
6 యేసు క్రీస్తులో సున్నతి పొందడంలోనో, పొందకపోవడంలోనో ఏమీ లేదు, ప్రేమతో పని చేసే విశ్వాసమే ముఖ్యం.
-
14 మన వారు నిష్ఫలులు కాకుండా, ముఖ్య అవసరాలను సమకూర్చుకోగలిగేలా మంచి పనులు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి.
-
10 దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. పరిశుద్ధులకు మీరు సేవలు చేశారు. చేస్తూనే ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమనూ మీ సేవలనూ ఆయన మర్చిపోడు.
11 మనం దేని కోసం ఎదురు చూస్తున్నామో దాని విషయంలో మీలో ప్రతివాడూ సంపూర్ణ నిశ్చయతతో, శ్రద్ధతో చివరి వరకూ సాగాలని మా అభిలాష. 12 మీరు మందకొడిగా ఉండాలని మేము కోరుకోవడం లేదు. విశ్వాసంతో, సహనంతో, వాగ్దానాలను వారసత్వంగా పొందిన వారిని అనుకరించాలని కోరుకుంటున్నాం.
-
17 ప్రతి ఒక్కరి పని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు, “తండ్రీ” అని పిలిచే వారైతే భూమిమీద మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి.
18 మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని వెల ఇచ్చి విమోచించాడు. వెండి బంగారాల లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాదు.
19 అమూల్యమైన రక్తంతో, అంటే ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తం ఇచ్చి, మిమ్మల్ని విమోచించాడు.
-
12 “చూడండి, నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసిన పనుల ప్రకారం నేనివ్వబోయే ప్రతిఫలం నా దగ్గర ఉంది.
Shows Read in context, Share and Copy.