101 Bible Verses About Evil
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
10 చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. 11 మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
12 ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.
13 అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. 14 మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం, 15 పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. 16 వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి. 17 ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.
18 ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి. 19 సువార్త రహస్యాన్ని ధైర్యంగా తెలియజేసేలా, నేను మాట్లాడనారంభించినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నా కోసం కూడా ప్రార్థించండి. 20 సంకెళ్ళలో ఉన్న నేను ఈ సువార్త నిమిత్తమైన రాయబారిని. నేను ఈ సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా.
-
20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22 వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”
-
12 కుటిలంగా మాట్లాడేవాడు దుర్మార్గుడు, నిష్ప్రయోజకుడు.
13 వాడు కన్ను గీటుతూ కాళ్లతో సైగలు చేస్తాడు. చేతి వేళ్లతో గుర్తులు చూపిస్తాడు.
14 వాడి హృదయం దుష్ట స్వభావంతో ఉంటుంది. వాడు ఎప్పుడూ కీడు తలపెట్టాలని చూస్తాడు.
15 అలాంటివాడి మీదికి హఠాత్తుగా ప్రమాదం ముంచుకు వస్తుంది. ఆ క్షణంలోనే వాడు తిరిగి లేవకుండా కూలిపోతాడు.
16 యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు.
17 అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు, 18 దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు, 19 లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.
-
7 అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి పోరాటం చేశాడు. 8 కానీ గెలవడానికి వాడి బలం చాలలేదు. కాబట్టి పరలోకంలో ఆ మహా సర్పానికీ వాడి అనుచర దూతలకూ స్థానం లేకపోయింది. 9 ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వాడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వాణ్ణీ వాడితో పాటు వాడి అనుచర దూతలనూ భూమి మీదికి తోసి వేశారు.
10 అప్పుడు నేను పరలోకం నుండి బిగ్గరగా వినబడిన స్వరం విన్నాను. “మన సోదరులను నిందించే వాడూ, పగలనీ రాత్రనీ లేకుండా దేవుని ఎదుట మన సోదరులపై నేరం మోపే వాడైన అపవాదిని భూమి మీదికి తోసేశారు. కాబట్టి ఇక మన దేవుని రక్షణా శక్తీ రాజ్యమూ వచ్చేశాయి. ఆయన అభిషిక్తుడైన క్రీస్తు అధికారమూ వచ్చింది. 11 వారు గొర్రెపిల్ల రక్తం తోనూ, తమ సాక్షాలతోనూ వాణ్ణి జయించారు. మరణం వచ్చినా సరే, తమ ప్రాణాలను ప్రేమించలేదు.
12 కాబట్టి పరలోకమూ, పరలోకంలో నివసించే వారూ, సంబరాలు చేసుకోండి. భూమీ, సముద్రం, మీకు యాతన. ఎందుకంటే అపవాది మీ దగ్గరికి దిగి వచ్చాడు. వాడు భీకరమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు.
-
20 “కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు.
అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది.”
21 కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి.
-
34 విష సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. 35 మంచివాడు తన హృదయంలోని మంచి సంపదలో నుండి మంచి వాటిని బయటికి తెస్తాడు. చెడ్డవాడు తన హృదయంలోని చెడ్డ సంపదలో నుండి చెడ్డవాటిని బయటికి తెస్తాడు.
-
9 మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి.
-
26 ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. 27 అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు.
28 వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.
30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, 31 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. 32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.
-
13 చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, “ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది,” అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు, ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా.
14 ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. 15 చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది.
-
38 “‘కంటికి బదులు కన్ను, పన్నుకు బదులు పన్ను’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 39 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి. 40 ఎవరైనా నీ అంగీ విషయం వివాదం పెట్టుకుని దాన్ని లాక్కుంటే అతనికి నీ పైచొక్కా కూడా ఇచ్చివెయ్యి. 41 ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్ళు వెళ్ళు. 42 నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు.
43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.
46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.
-
13 దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, అహంకారం, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం.
-
14 మీరు బతికేలా చెడు విడిచి మంచి వెతకండి.
అలా చేస్తే మీరనుకున్నట్టు
యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు
తప్పకుండా మీతో ఉంటాడు.
15 చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి.
పట్టణ గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరచండి.
ఒకవేళ యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు
యోసేపు వంశంలో మిగిలిన వారిని కనికరిస్తాడేమో.
-
13 మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.”
-
21 అన్నిటినీ పరిశీలించి శ్రేష్ఠమైన దాన్ని పాటించండి.
22 ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి.
-
5 అలాగే, నాలుక శరీరంలో చిన్న భాగమే అయినా, ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పు రవ్వ ఎంత పెద్ద అడవిని తగల బెడుతుందో గమనించండి! 6 నాలుక కూడా ఒక అగ్ని. పాప ప్రపంచం మన శరీరంలో అమర్చి ఉన్నట్టు అది ఉండి, శరీరమంతటినీ మలినం చేసి, జీవన మార్గాన్ని తగలబెడుతుంది. తరవాత నరకాగ్నికి గురై కాలిపోతుంది.
7 అన్ని రకాల అడవి మృగాలను, పక్షులను, పాకే ప్రాణులను, సముద్ర జీవులను మానవుడు తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకున్నాడు కూడా. 8 కాని, మనుషుల్లో ఏ ఒక్కరూ నాలుకను ఆధీనంలో ఉంచుకోలేక పోతున్నారు. అది ఎడతెగని దుష్టత్వం. అది మరణం కలిగించే విషంతో నిండి ఉంది. 9 నాలుకతో మన ప్రభువైన తండ్రిని స్తుతిస్తాం. అదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న మనిషిని శపిస్తాం. 10 ఒకే నోటినుంచి స్తుతి, శాపం రెండూ బయటకు వస్తాయి. నా సోదరులారా, ఇలా ఉండకూడదు.
-
5 మనుషుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు. 6 తాను భూమిమీద మనుషులను చేసినందుకు బాధపడి, హృదయంలో విచారించాడు.
7 కాబట్టి యెహోవా “నేను సృష్టించిన మనుషులను ఈ భూమిమీద లేకుండా చేస్తాను. మనుషులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాశపక్షులను భూమిమీద లేకుండా తుడిచి వేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను” అన్నాడు.
-
20 దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు.
21 అయితే సత్యాన్ని అనుసరించే వాడు తన పనులు మరింత స్పష్టంగా కనిపించడానికీ దేవుని పట్ల విధేయతలో అవి జరిగాయని వెల్లడి చేయడానికీ వెలుగు దగ్గరికి వస్తాడు.”
-
29 మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారికి ప్రయోజనం కలిగేలా వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.
30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ వద్దు. ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకూ మీపై ఉంటుంది. 31 సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. 32 హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.
-
23 ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.
-
10 యెహోవాను ప్రేమించే మీరంతా దుర్మార్గాన్ని అసహ్యించుకోండి! తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడతాడు, దుర్మార్గుల చేతిలోనుంచి ఆయన వారిని తప్పిస్తాడు.
-
1 మంచాల మీద పడుకుని మోసపు పనులు ఆలోచిస్తూ
దుర్మార్గాలు చేసేవారికి బాధ తప్పదు.
వాళ్లకు అధికారముంది
కాబట్టి పగటి వెలుతురులో వాళ్ళు అలా చేస్తారు.
-
1 దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు. 2 స్త్రీ ఆ సర్పంతో “ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు. 3 కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది.
4 పాము స్త్రీతో “మీరు చావనే చావరు. 5 ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు” అన్నాడు.
-
10 తరువాతి రోజు దేవుని నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా దిగి వచ్చింది. అతడు ఇంట్లో పూనకంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎప్పటిలాగే తంతి వాద్యం తీసుకుని వాయించాడు. 11 ఒకసారి సౌలు తన చేతిలో ఉన్న ఈటెతో దావీదును గోడకు గుచ్చేస్తాననుకుని ఆ ఈటెను దావీదు మీద బలంగా విసిరాడు. అయితే అది తనకు తగలకుండా దావీదు రెండుసార్లు తప్పించుకున్నాడు.
-
17 అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది. 18 మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు. 19 మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు. 20 ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు.
21 “‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు. 22 ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు. 23 అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.
-
1 ప్రభువు దయగల వాడని మీరు రుచి చూశారు కాబట్టి 2 అన్ని రకాల దుష్టత్వం, మోసం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానండి. 3 కొత్తగా పుట్టిన బిడ్డల్లా, స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన పాలను ఆశించండి. దాని ద్వారా మీరు రక్షణలో ఎదుగుతారు.
-
14 అందుకు దేవుడైన యెహోవా పాముతో “నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు. 15 నీకూ స్త్రీకీ నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు” అన్నాడు.
16 ఆయన స్త్రీతో “పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు. అతడు నిన్ను ఏలుతాడు” అని చెప్పాడు. 17 ఆయన ఆదాముతో “నువ్వు నీ భార్య మాట విని ‘తినొద్దు’ అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు. 18 నువ్వు ఎంత కష్టం చేసినా నేల ముళ్ళ తుప్పలను, ముళ్ళ పొదలనే మొలిపిస్తుంది. నువ్వు పొలంలో పండించిన పంట తింటావు. 19 నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూ చెమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు” అని చెప్పాడు.
-
14 చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి పనులు చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు.
-
16 చెడు కార్యాలు చేసే వాళ్ళ జ్ఞాపకం భూమిపై ఉండకుండా చేయడానికి యెహోవా వాళ్లకు విరోధంగా ఉన్నాడు.
-
11 అయితే యెహోవాను వదిలేసి, నా పవిత్ర పర్వతాన్ని విస్మరించి, అదృష్టదేవుడికి బల్ల సిద్ధపరచి, విధి దేవుడికి పానీయార్పణం అర్పిస్తున్నారు.
12 నేను పిలిచినప్పుడు మీరు జవాబివ్వలేదు. నేను మాట్లాడినప్పుడు మీరు వినలేదు.
దానికి బదులు నా దృష్టికి చెడ్డగా ప్రవర్తించారు. నాకిష్టం లేని వాటిని కోరుకున్నారు.
కాబట్టి నేను కత్తిని మీకు విధిగా నియమిస్తాను. మీరంతా వధకు లోనవుతారు.”
-
15 అందుకు పేతురు, “ఈ ఉపమానభావం మాకు వివరించు” అని ఆయనను అడిగాడు. 16 అప్పుడాయన, “మీరు ఇంకా అవివేకంగా ఉన్నారా? 17 నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది. 18 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? 19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి. 20 మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” అని వారితో చెప్పాడు.
-
6 ఆయన ప్రతి మనిషికీ అతని పనుల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. 7 మంచి పనులను ఓపికగా చేస్తూ, మహిమ, ఘనత, అక్షయతలను వెదికే వారికి నిత్యజీవమిస్తాడు. 8 అయితే స్వార్ధపరులు, సత్యాన్ని విడిచిపెట్టి దుర్నీతిని జరిగించే వారి మీదికి దేవుని ఉగ్రత, మహా కోపం వస్తాయి. 9 చెడ్డ పని చేసే ప్రతి మనిషి ఆత్మకు, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి బాధ, వేదన కలుగుతాయి. 10 అయితే మంచి పని చేసే ప్రతి వ్యక్తికి, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి మహిమ, ఘనత, శాంతిసమాధానాలు కలుగుతాయి.
11 ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు.
-
1 ప్రతి ఒక్కడూ తన పై అధికారులకు లోబడాలి. ఎందుకంటే దేవుని వల్ల కలిగింది తప్ప అధికారం మరేదీ లేదు. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే. 2 కాబట్టి అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియామకాన్ని ఎదిరిస్తున్నాడు. తద్వారా అతడు తన మీదికి తానే శిక్ష తెచ్చుకొంటాడు. 3 పాలనాధికారులు చెడు పనులకే భయకారకులు గానీ మంచి పనులకు కాదు. వారికి భయపడకుండా ఉండాలంటే, మంచి పనులు చెయ్యి. అప్పుడు వారు నిన్ను మెచ్చుకుంటారు. 4 వారు నీ మేలు కోసం ఉన్న దేవుని సేవకులు. అయితే నీవు చెడ్డ పని చేసినప్పుడు భయపడాలి. వారు కారణం లేకుండా కత్తిని ధరించరు. వారు చెడు జరిగించే వారి మీద కోపంతో ప్రతీకారం చేసే దేవుని సేవకులు.
-
4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.
5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.
6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.
7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.
-
21 యెహోవా ఆ ఇంపైన వాసన ఆస్వాదించి “వారి హృదయాలు బాల్యం నుంచే దుష్టత్వం వైపు మొగ్గుచూపాయి. ఇక ఎప్పుడూ మనుషులను బట్టి భూమిని కీడుకు గురిచేయను. నేనిప్పుడు చేసినట్టు ప్రాణం ఉన్నవాటిని ఇకపై ఎన్నడూ నాశనం చెయ్యను.
-
దావీదు కీర్తన
1 చెడ్డ వారిని చూసి నువ్వు క్షోభపడకు. అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసూయ పడకు.
2 ఎందుకంటే వాళ్ళు గడ్డిలాగా త్వరలోనే ఎండిపోతారు. పచ్చటి మొక్కల్లా వాడి పోతారు.
3 యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు.
4 తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.
5 నీ జీవిత గమనాన్ని యెహోవాకు అప్పగించు. ఆయనలో నమ్మకముంచు. ఆయన నీ తరుపున పని చేస్తాడు.
6 పగటి వెలుగులా నీ న్యాయవర్తననూ, మధ్యాహ్నపు వెలుగులా నీ నిర్దోషత్వాన్నీ ఆయన చూపిస్తాడు.
7 యెహోవా ఎదుట మౌనంగా ఉండు. సహనంతో ఆయన కోసం వేచి ఉండు. దుర్మార్గాలు చేసి ఎవరన్నా విజయం సాధిస్తే చింతించకు. ఎవరన్నా కుట్రలు చేస్తే విచారించకు.
-
15 నువ్వు ఈ లోకంలో నుంచి వారిని తీసుకు వెళ్ళమని నేను ప్రార్థన చేయడం లేదు గాని, దుర్మార్గుని నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను.
-
15 బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి. 16 సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి. 17 అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి.
-
13 మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి. 14 కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి. 15 ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది.
16 ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి. 17 అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం. తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది. సమ్మతి గలది. కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది. 18 శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది.
-
9 కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
10 జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి. 11 అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి. 12 ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది.
-
8 పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు.
-
18 దేవుని ద్వారా పుట్టినవాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా పుట్టిన వాణ్ణి దేవుడు పాపం నుండి కాపాడుతాడు. దుష్టుడు ముట్టకుండా ఉంచుతాడు. 19 మనం దేవుని సంబంధులం అని మనకు తెలుసు. లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉంది.
-
14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తరువాత యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ అతణ్ణి భయపెట్టి, వేధించడం మొదలుపెట్టింది, 15 సౌలు సేవకులు “దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ నిన్ను భయపెడుతున్నది. 16 నీ సేవకులమైన మాతో చెప్పు, దేవుని దగ్గర నుండి దురాత్మ నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు దాని నుండి ఉపశమనం పొందడానికి తంతివాద్యం చక్కగా వాయించగల ఒకణ్ణి వెదుకుతాం. దురాత్మ వచ్చి నిన్ను వేధించినప్పుడల్లా అతడు తంతివాద్యం వాయించడం వల్ల నువ్వు బాగుపడతావు” అని సౌలుతో అన్నారు.
-
4 చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.
-
13 మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు.
-
20 కట్టెలు లేకపోతే మంట ఆరిపోతుంది. కొండేలు చెప్పేవాడు లేకపొతే జగడం చల్లారుతుంది.
21 నిప్పు కణికెలకు బొగ్గులు, అగ్నికి కట్టెలు. పోట్లాటలు రేపడానికి కలహప్రియుడు.
22 కొండేలు రుచిగల పదార్థాల వంటివి. అవి కడుపులోకి మెత్తగా దిగిపోతాయి.
23 చెడు హృదయం ఉండి ప్రేమగా మాట్లాడే పెదాలు ఉండడం మట్టి పెంకుపై పూసిన వెండి పూతతో సమానం.
-
3 అందరికీ ఒకే విధంగా జరగడం అనేది సూర్యుని కింద జరిగే వాటన్నిటిలో బహు దుఃఖకరం. మనుషుల హృదయం చెడుతనంతో నిండిపోయింది. వారు బతికినంత కాలం వారి హృదయంలో మూర్ఖత్వం ఉంటుంది. ఆ తరువాత వారు చనిపోతారు. ఇది కూడా దుఃఖకరం.
-
1 సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు. “నియమిత దినం రాబోతుంది. అది కాలుతూ ఉన్న కొలిమిలాగా ఉంటుంది. గర్విష్ఠులంతా, దుర్మార్గులంతా ఎండుగడ్డిలాగా ఉంటారు. వారిలో ఒక్కరికి కూడా వేరు గానీ, చిగురు గానీ ఉండదు. రాబోయే ఆ దినాన అందరూ తగలబడి పోతారు.
-
43 “అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసం నీళ్ళు లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది. 44 దానికి విశ్రాంతి దొరకదు. అప్పుడది ‘నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను’ అనుకుని వచ్చి, ఆ ఇంట్లో ఎవరూ లేక అది ఊడ్చి చక్కగా సర్దిపెట్టి ఉండడం చూస్తుంది. 45 అప్పుడది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరో ఏడు దయ్యాలను వెంటబెట్టుకుని వస్తుంది. అవన్నీ అక్కడే నివాసముంటాయి. అందుచేత ఆ వ్యక్తి చివరి స్థితి మొదటి దాని కంటే అధ్వాన్నం అవుతుంది. ఈ దుష్టతరం వారికీ అలాగే అవుతుంది.”
-
10 అది చూసి ముందుగా పనిలో చేరినవారు తమకు ఎక్కువ జీతం దొరుకుతుంది అని ఆశించారు గాని వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇచ్చారు. 11-12 వారు దాన్ని తీసుకుని ‘చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పని చేశారు. మేమైతే పగలంతా ఎండలో కష్టపడి పని చేశాం. కానీ వారికీ మాకూ జీతం సమానంగా ఇచ్చారేమిటి?’ అని ఆ యజమాని మీద సణుక్కున్నారు.
13 అప్పుడా యజమాని వారిలో ఒకడితో, “మిత్రమా, నేను నీకు అన్యాయమేమీ చేయలేదు. నీకు జీతం ఒక దేనారం ఇస్తానని ఒప్పుకున్నాను కదా? 14 నీ కూలి సొమ్ము తీసుకుని వెళ్ళు. నీకిచ్చినట్టే చివరిలో వచ్చిన వారికి కూడా ఇవ్వడం నా ఇష్టం. 15 నా సొంత డబ్బును నాకిష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకునే అధికారం నాకు లేదా? నేను మంచివాణ్ణి కావడం నీకు కడుపు మంటగా ఉందా?” అని అన్నాడు. 16 ఆ విధంగా చివరివారు మొదటివారూ, మొదటివారు చివరివారూ అవుతారు.”
-
45 “ఒక యజమాని తన ఇంట్లో పనివారికి వేళకు భోజనం పెట్టడానికి నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుడు ఎవరు? 46 యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఏ దాసుడు ఆ విధంగా చేస్తుండడం గమనిస్తాడో ఆ దాసుడు ధన్యుడు. 47 ఆ యజమాని తన యావదాస్తి మీదా ఆ దాసుని నియమిస్తాడని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను. 48 కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని ఆలస్యంగా వస్తాడులే’ అని తన మనసులో అనుకుని 49 తన సాటి సేవకులను కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే, 50 అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు. 51 వాణ్ణి రెండు ముక్కలుగా నరికించి కపట వేషధారులతో బాటు వాడిని శిక్షిస్తాడు. అక్కడ ఏడుపూ పండ్లు కొరకడమూ ఉంటాయి.”
-
31 “మనుష్య కుమారుడు తన మహిమతో, తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.
32 మానవులందరినీ పోగుచేసి ఆయన ముందు నిలబెడతారు. అప్పుడు ఒక గొల్లవాడు తన మందలో మేకలను, గొర్రెలను వేరు చేసినట్టు 33 ఆయన తన కుడి వైపున ‘గొర్రెలు’ (నీతిపరులు), ఎడమవైపున ‘మేకలు’ (అనీతిపరులు) ఉండేలా వేరు చేసి నిలబెడతాడు.
34 తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి. 35 ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. 36 బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు.
37 అందుకు నీతిపరులు ‘ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం? 38 ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం? 39 ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండడం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం?’ అని ఆయనను అడుగుతారు. 40 అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే’ అని వారికి జవాబిస్తాడు.
41 “తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. 42 ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. 43 పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు’ అని చెబుతాడు.
44 అందుకు వారు కూడా, ‘ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దాహంతో ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండడం చూసి నీకు సహాయం చేయలేదు?’ అని అడుగుతారు. 45 అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే’ అని వారికి జవాబిస్తాడు. 46 వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు.”
-
23 యేసు వారిని తన దగ్గరికి పిలిచి, ఉదాహరణల రూపంలో ఇలా అన్నాడు, “సైతాను సైతానును ఎలా వెళ్ళగొడతాడు? 24 చీలికలు వచ్చిన రాజ్యం నిలబడదు. 25 చీలికలు వచ్చిన కుటుంబం నిలబడదు. 26 అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే వాని అధికారం అంతమౌతుంది గదా. 27 నిజానికి ఒక బలవంతుడి ఇంట్లో దొంగతనం చేయాలంటే మొదట అతణ్ణి కట్టివేయాల్సిందే.
28 నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మనుషులు చేసిన అన్ని పాపాలను, వారు పలికే దైవ దూషణలను దేవుడు క్షమిస్తాడు. 29 కాని పరిశుద్ధాత్మను దూషించినవాణ్ణి దేవుడు ఎన్నడూ క్షమించడు. అలా చేసేవాడు శాశ్వత పాపం చేసిన దోషంలో ఉంటాడు.” 30 ‘ఆయనకు దయ్యం పట్టింది’ అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు.
-
6 మీరు గర్వంతో మిడిసిపడడం మంచిది కాదు. పులిపిండి కొంచెమే అయినా, అది పిండి ముద్దనంతటినీ పులిసేలా చేస్తుందని మీకు తెలుసు కదా! 7 మీరు పులిపిండి లేని వారు కాబట్టి తాజా పిండిముద్ద కావడం కోసం పాత పులిపిండిని పారవేయండి. ఎందుకంటే క్రీస్తు అనే మన పస్కా పశువు బలి అర్పణ జరిగింది.
-
14 అవిశ్వాసులతో మీరు జతగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి? 15 క్రీస్తుకు సాతానుతో ఒప్పందమేమిటి? అవిశ్వాసితో విశ్వాసికి భాగమేమిటి? 16 దేవుని ఆలయానికి విగ్రహాలతో సంబంధం ఏమిటి? మనం జీవం గల దేవుని ఆలయం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు.
“నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడుగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”
17 కాబట్టి, “మీరు వారిలో నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు”
అని ప్రభువు చెబుతున్నాడు.
18 “నేను మిమ్మల్ని చేర్చుకుంటాను,
మీకు తండ్రిగా ఉంటాను. మీరు నాకు కొడుకులుగా కూతురులుగా ఉంటారు”
అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు.
-
7 మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.
8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు.
-
21 యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు. 22 కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి 23 మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. 24 దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.
25 మనం ఒకరికొకరం అవయవాల వంటి వారం. కాబట్టి మీరు అబద్ధాలు మానేసి మీ సాటిమనిషితో సత్యమే పలకాలి. 26 కోపపడవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు. 27 సాతానుకు అవకాశం ఇవ్వకండి.
-
1 పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు. 2 ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది. 3 వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల్లో కొన్ని తినకూడదని వీరు అంటారు.
4 దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొన్నది ఏదీ నిషేధం కాదు. 5 ఎందుకంటే దేవుని వాక్యమూ ప్రార్థనా దాన్ని పవిత్ర పరుస్తాయి.
-
10 ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కుని తెచ్చుకున్నారు.
-
9 అప్పు రద్దు చేయాల్సిన “ఏడో సంవత్సరం దగ్గర పడింది” అనే చెడ్డ తలంపు మీ మనస్సులో కలగనీయవద్దు. బీదవాడైన మీ సోదరునిపై మీరు దయ చూపి అతనికేమీ ఇవ్వకపోతే వాడొకవేళ మిమ్మల్ని గూర్చి యెహోవాకు మొరపెడితే అది మీకు పాపం అవుతుంది.
-
1 ఏహూదు చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు మళ్ళీ యెహోవా దృష్టికి దోషులయ్యారు గనక 2 హాసోరులో ఏలే కనాను రాజైన యాబీను చేతికి ఆయన వాళ్ళను అప్పగించాడు. అతని సేనాధిపతి పేరు సీసెరా. అతడు యూదేతరుల ప్రాంతం హరోషెతులో ఉంటున్నాడు.
-
23 దేవుడు అబీమెలెకుకు, షెకెము నాయకులకు వైరం కలిగించే దురాత్మను వాళ్ళ మీదికి పంపాడు. అప్పుడు షెకెము నాయకులు అబీమేలెకుతో తమకున్న ఇప్పండం విషయంలో ద్రోహం చేశారు.
-
6 ఒకరోజున దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు. సాతాను కూడా దేవదూతలతో కలిసి వచ్చాడు. 7 యెహోవా “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని సాతానును అడిగాడు. అందుకు అతడు “భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను” అని జవాబిచ్చాడు. 8 అప్పుడు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థ వర్తనుడు. నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు” అన్నాడు.
9 అందుకు సాతాను “యోబు ఊరకే దేవుడంటే భయభక్తులు చూపిస్తున్నాడా? 10 నువ్వు యోబునూ, అతని సంతానాన్నీ, అతని ఆస్తి అంతటినీ కంచె వేసి కాపాడుతున్నావు గదా? నువ్వు అతడు చేస్తున్న ప్రతిదాన్నీ దీవిస్తున్నావు గనక అతని ఆస్తి దేశంలో ఎంతో విస్తరించింది. 11 అయితే ఇప్పుడు నువ్వు అతనికి వ్యతిరేకంగా నీ చెయ్యి చాపి అతనికి ఉన్నదంతా నాశనం చేస్తే అతడు నీ మొహం మీదే నిన్ను దూషించి నిన్ను వదిలేస్తాడు” అని యెహోవాతో అన్నాడు.
-
7 నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.
8 అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి.
-
27 కుడివైపుకు గానీ, ఎడమవైపుకు గానీ తొలగిపోవద్దు. దుర్మార్గం వైపు నడవకుండా నీ అడుగులు తప్పించుకో.”
-
2 అయినా ఆయన జ్ఞాని. ఆయన నాశనాన్ని పంపిస్తాడు. తన మాటలను ఆయన వెనక్కి తీసుకోడు.
దుర్మార్గుల ఇంటి మీదికీ, పాపులకు సహాయం చేసే వాళ్ళ మీదికీ ఆయన లేస్తాడు.
-
7 వారి కాళ్లు పాపం చేయడానికి పరుగెడుతున్నాయి. నిరపరాధుల రక్తాన్ని ఒలకపోయడానికి అవి త్వరపడుతున్నాయి.
వారి ఆలోచనలు పాపిష్టి ఆలోచనలు. వారి దారులు దుర్మార్గం, నాశనం.
8 శాంతి మార్గం వారికి తెలియదు. వారి నడతల్లో న్యాయం కనబడదు.
వాళ్ళు వంకరదారులు కల్పించుకున్నారు. ఆ దారుల్లో నడిచే వాళ్ళకు శాంతి కలగదు.
-
37 మీ మాట ‘అవునంటే అవును, కాదంటే కాదు’ అన్నట్టే ఉండాలి. అలా కాని ప్రతిదీ అపవాది సంబంధమైనదే.
-
23 నీ కన్ను పాడైతే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది. అందుచేత నీలో ఉన్న వెలుగే చీకటి అయితే ఆ చీకటి ఎంత భయంకరమైనదో కదా!
-
19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
-
15 ఎవరూ కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి పట్ల మరొకరూ, ఇంకా మనుషులందరి పట్లా ఎప్పుడూ మేలైన దానినే చేయడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి.
-
1 ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో దోషులైన కారణంగా యెహోవా ఏడు సంవత్సరాల పాటు వాళ్ళను మిద్యానీయుల చేతికి అప్పగించాడు.
-
7 దుర్మార్గులు పాడైపోయి లోకంలో లేకుండా పోతారు. నీతిమంతుల నివాసం స్థిరంగా నిలుస్తుంది.
-
6 దుష్టుని ఆహారం భుజించ వద్దు. అతడు నీవు తింటున్నదాన్ని అదే పనిగా చూస్తుంటాడు. వాడి రుచిగల పదార్థాలను ఆశించవద్దు.
7 ఇలాంటి వాడు లోలోపల ఖరీదు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నీతో “తినండి, తాగండి” అంటూ ఉంటాడు గానీ అది హృదయపూర్వకంగా అనే మాట కాదు.
8 నీవు తిన్న కొద్ది ఆహారాన్ని కూడా కక్కి వేస్తావు. నీవు పలికిన యింపైన మాటలు అనవసరంగా మాట్లాడినట్టు అవుతుంది.
-
20 కీడును మేలనీ మేలును కీడనీ చెప్పేవారికి, చీకటిని వెలుగుగా వెలుగును చీకటిగా ఎంచే వారికి బాధ.
చేదును తీపి అనీ తీపిని చేదు అనీ భావించే వారికి బాధ.
-
9 ప్రవక్తల గూర్చిన సమాచారం. యెహోవా గురించి, ఆయన పరిశుద్ధమైన మాటలను గురించి నా గుండె నాలో పగిలిపోయింది. నా ఎముకలన్నీ వణికి పోతున్నాయి. నేను మత్తు మందు సేవించినవాడిలా అయ్యాను. ద్రాక్షమద్యం వశమైన వాడిలా అయ్యాను.
10 దేశం వ్యభిచారులతో నిండిపోయింది. వారిని బట్టే దేశం దుఃఖిస్తూ ఉంది. ఎడారిలో పచ్చిక మైదానాలు ఎండిపోయాయి. ప్రవక్తలు చెడ్డగా ప్రవర్తిస్తున్నారు. తమ బలాన్ని సరిగా వాడడం లేదు.
11 ప్రవక్తలూ యాజకులూ పాడైపోయారు. నా ఆలయంలో కూడా వాళ్ళ దుర్మార్గం నేను చూశాను. ఇది యెహోవా వాక్కు.
12 కాబట్టి చీకట్లో వాళ్ళ దారి జారిపోయే నేలలాగా ఉంటుంది. వాళ్ళను గెంటేస్తారు. వాళ్ళు దానిలో పడిపోతారు. వాళ్ళను శిక్షించే సంవత్సరంలో వాళ్ళ మీదికి విపత్తు రప్పిస్తాను. ఇది యెహోవా వాక్కు.
13 సమరయ ప్రవక్తల మధ్య నేరం చూశాను. వాళ్ళు బయలు దేవుడి పేర ప్రవచనం చెప్పి నా ఇశ్రాయేలు ప్రజలను దారి తప్పించారు.
14 యెరూషలేము ప్రవక్తల మధ్య ఘోరమైన పనులు నేను చూశాను. వాళ్ళు వ్యభిచారులు. మోసంలో నడుస్తున్నారు. వాళ్ళు దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారు! ఎవడూ తన దుర్మార్గం విడిచిపెట్టడం లేదు. వాళ్ళంతా నా దృష్టికి సొదొమ ప్రజల్లాగా మారారు. యెరూషలేము నివాసులు గొమొర్రా ప్రజల్లాగా మారారు.
-
11 “నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. 12 అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు.
-
3 అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? 4 అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు.
-
8 అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తగిన విధంగా ఉపయోగిస్తే అది మేలైనదే అని మనకు తెలుసు.
9 దేవుడు నాకు అప్పగించిన ఈ గొప్ప సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ఉన్నది నీతిమంతుల కోసం కాదు. ధర్మ విరోధులూ తిరుగుబాటు చేసేవారూ భక్తిహీనులూ పాపులూ దుర్మార్గులూ భక్తిహీనులూ చెడిపోయిన వారూ తల్లిదండ్రులను చంపేవారూ హంతకులూ 10 వ్యభిచారులూ స్వలింగ సంపర్కులూ బానిస వ్యాపారులూ అబద్ధికులూ అబద్ధ సాక్ష్యం చెప్పేవారూ నిజమైన బోధకు వ్యతిరేకంగా నడచుకొనేవారూ ఇలాటివారి కోసమే ధర్మశాస్త్రం ఉంది అని మనకు తెలుసు.
11 ఈ మహిమగల సువార్తను మహిమగల దివ్య ప్రభువు నాకు అప్పగించాడు.
-
2 నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని 3 రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి. 4 ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు.
-
7 జయించేవాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు.
8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.
-
13 హత్య చెయ్యకూడదు.
14 వ్యభిచారం చెయ్యకూడదు.
15 దొంగతనం చెయ్యకూడదు.
16 నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు.
17 నీ పొరుగువాడి ఇల్లు గానీ, అతని భార్యను గానీ, దాస దాసీలను గానీ, అతని ఎద్దును గానీ, గాడిదను గానీ, నీ పొరుగు వాడికి చెందిన దేనినీ ఆశించకూడదు.
-
12 జీవితాన్ని కాంక్షించేవాడు, ఎక్కువ కాలం జీవించాలని ఆశించే వాడు, చక్కని జీవితం కావాలి అనుకునేవాడు ఏం చేయాలి?
13 దుర్మార్గమైన మాటలు పలకకుండా ఉండు. అబద్ధాలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో.
-
9 దుర్మార్గకార్యాలు చేసే వాళ్ళు నిర్మూలం అవుతారు. కానీ యెహోవా కోసం వేచి చూసే వాళ్ళు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.
-
16 మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి.
మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి.
మీ దుష్టత్వం మానండి.”
17 మంచి చెయ్యడం నేర్చుకోండి.
న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి.
తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి.
వితంతువు పక్షాన నిలబడండి.
-
9 హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు?
10 నేను యెహోవాను. హృదయాన్ని పరిశోధిస్తాను. మనసును పరీక్షిస్తాను. ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తన ప్రకారం వారి పనులకు తగ్గట్టుగా నేనిస్తాను.
-
1 అప్పుడు అపవాది వల్ల యేసును విషమ పరీక్షలకు గురి చేయడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు.
-
39 “వ్యభిచారులైన ఈ దుర్మార్గపు తరం వారు సూచక క్రియ అడుగుతున్నారు. యోనా ప్రవక్త గురించిన సూచక క్రియ తప్ప ఏ సూచక క్రియా వారికి ఇవ్వబడదు.
-
23 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. 24 వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు. 25 యేసు దురాత్మను గద్దిస్తూ, “మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు. 26 ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది.
27 ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు.
-
13 మరి ఉత్తమమైంది నాకు చావును తెచ్చిందా? కానే కాదు. అయితే పాపం ఉత్తమమైన దాని ద్వారా పాపంగా కనిపించాలని, అది నాకు చావును తీసుకు వచ్చింది. అంటే పాపం ఆజ్ఞ మూలంగా మరింత ఎక్కువ పాపం కావడం కోసం, అది నాకు చావును తెచ్చిపెట్టింది. 14 ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని మనకు తెలుసు. అయితే నేను పాపానికి అమ్ముడుబోయిన శరీర సంబంధిని.
15 ఎందుకంటే నేను చేసేది నాకు తెలియదు. నేను దేనిని ఇష్టపడతానో దాన్ని కాక దేన్ని ద్వేషిస్తానో దానినే చేస్తున్నాను. 16 నేను ఇష్టపడని దాన్ని చేస్తున్నట్టయితే ధర్మశాస్త్రం మంచిదే అని ఒప్పుకుంటున్నాను. 17 కాబట్టి దాన్ని చేసేది నాలోని పాపమే గాని నేను కాదు. 18 నాలో, అంటే నా శరీరంలో మంచిదేదీ లేదని నాకు తెలుసు. మంచిని చేయాలనే కోరిక నాకు కలుగుతుంది గాని, దాన్ని చేయడం నా వల్ల కావడం లేదు. 19 నేను చేయాలని కోరే మంచిని చేయకుండా, నేను చేయగోరని చెడును జరిగిస్తున్నాను. 20 నేను కోరని దాన్ని చేస్తే అది నాలోని పాపమే గాని నేను కాదు.
-
20 యూదేతరులు అర్పించే బలులు దేవునికి కాక దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలి భాగస్తులు కావడం నాకిష్టం లేదు. 21 మీరు ప్రభువు పాత్రలోనిదీ, దయ్యాల పాత్రలోనిదీ ఒకేసారి తాగలేరు. ప్రభువు బల్లమీదా, దయ్యాల బల్ల మీదా, ఈ రెంటి మీదా ఉన్నవాటిలో ఒకేసారి భాగం పొందలేరు.
-
33 మోసపోకండి. “దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుంది.”
-
1 మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు 2 పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.
4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.
6 దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. 7 రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనపరచడానికి ఆయన ఇలా చేశాడు.
8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.
-
11 పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి. 12 ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.
-
18 ప్రభువు అన్ని చెడుపనుల నుండీ నన్ను తప్పించి సురక్షితంగా తన పరలోక రాజ్యం చేరుస్తాడు. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక, ఆమేన్.
-
21 కాబట్టి, సమస్త పాపపు రోతనూ, దుష్టత్వాన్నీ వదిలి మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును సాధు గుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్ధ్యం ఉంది.
-
7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.
-
8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.
-
11 మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలన్న సందేశం మీరు ఆరంభం నుండి వింటూనే ఉన్నారు. 12 సైతాను సంబంధి అయిన కయీను తన తమ్ముణ్ణి చంపాడు. మీరు అతనిలా ఉండవద్దు. కయీను తన తమ్ముణ్ణి ఎందుకు చంపాడు? అతని క్రియలు దుర్మార్గమైనవి. అతని తమ్ముని క్రియలు నీతిగలవి.
-
14 భక్తిహీనుల గుంపులో చేరవద్దు. దుర్మార్గుల ఆలోచనలతో ఏకీభవించవద్దు.
15 అందులోకి వెళ్ళకుండా తప్పించుకు తిరుగు. దాని నుండి తొలగిపోయి ముందుకు సాగిపో.
-
9 “సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇచ్చాడు.
సత్యాన్ననుసరించి తీర్పు తీర్చండి.
ఒకరిపట్ల ఒకరు కరుణా వాత్సల్యం కనపరచుకోండి.
10 వితంతువులను, తండ్రిలేని వారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకండి. మీ సోదరులకు హృదయంలో కీడు తలపెట్టకండి.”
-
11 అయితే కేఫా, అంతియొకయకు వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు. కాబట్టి నేను ముఖాముఖిగా అతన్ని నిలదీశాను. 12 ఎందుకంటే, యాకోబు దగ్గర నుంచి కొంతమంది రాక ముందు అతడు యూదేతరులతో భోజనం చేస్తున్నాడు. వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తగ్గి, పక్కకి వెళ్ళిపోయాడు. 13 మిగతా యూదులు కూడా కేఫాతో ఈ కపటంలో కలిసిపోయారు. బర్నబా కూడా వారి కపట వేషధారణ వల్ల మోసపోయాడు. 14 వారు సువార్త సత్యాన్ని అనుసరించడం లేదని నేను చూసి అందరి ముందు కేఫాతో, “నీవు యూదుడవై ఉండి కూడా యూదుల్లాగా కాక యూదేతరుడిలా ప్రవర్తిస్తుంటే, యూదేతరులు యూదుల్లాగా ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు?” అన్నాను.
Shows Read in context, Share and Copy.