97 Bible Verses About Deceit

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Deceit
  1. 23 చెడు హృదయం ఉండి ప్రేమగా మాట్లాడే పెదాలు ఉండడం మట్టి పెంకుపై పూసిన వెండి పూతతో సమానం.

    24 పగవాడు పెదాలతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు.

    25 వాడు దయగా మాటలాడితే వాడి మాట నమ్మవద్దు. వాడి హృదయంలో ఏడు అసహ్యమైన విషయాలు ఉన్నాయి.

    26 వాడు తన ద్వేషాన్ని కపట వేషంతో కప్పుకుంటాడు. సమాజంలో వాడి చెడుతనం బట్టబయలు అవుతుంది.

    27 గుంట తవ్వే వాడే దానిలో పడతాడు. రాతిని పొర్లించే వాడి మీదికే అది తిరిగి వస్తుంది.

    28 అబద్ధాలాడే నాలుక తాను నలగగొట్టిన వాళ్ళను ద్వేషిస్తుంది. ముఖస్తుతి మాటలు పలికే నోరు నాశనం తెస్తుంది.

  2. 4 మీలో ప్రతివాడూ తన పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    ఏ సోదరుణ్నీ నమ్మవద్దు. ఎందుకంటే నిజంగా ప్రతి సోదరుడూ మోసం చేసేవాడే.

    ప్రతి పొరుగువాడూ అపనిందలు వేస్తూ తిరుగుతుంటాడు.

    5 ప్రతివాడూ సత్యం చెప్పకుండా తన పొరుగువాడిని మోసం చేస్తాడు. అక్రమం జరిగించడం వారికి అలవాటై పోయింది. ఎంతసేపూ ఎదుటి వారిలో తప్పులు పట్టాలని చూస్తారు.

    6 కపటం మధ్యలో నువ్వు నివసిస్తున్నావు. వారి కపటంలో వారు నన్ను తెలుసుకోలేక పోతున్నారు. ఇదే యెహోవా వాక్కు.

    7 కాబట్టి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, చూడూ, నేను వారిని లోహం లాగా కరిగించి పరీక్షించబోతున్నాను. వారికి ఇంతకంటే మరేమి చెయ్యను?

    8 వారి నాలుక పదును పెట్టిన బాణం, అది కపటమే పలుకుతుంది.

    ఒకడు తన పొరుగువారితో పైకి స్నేహపూర్వకంగా మాట్లాడతాడు గాని మనస్సులో మాత్రం మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయి.

    9 ఈ సంగతులు తెలిసీ నేను వారిని శిక్షించకూడదా?

    ఈ దేశాన్ని దండించ కూడదా? ఇదే యెహోవా వాక్కు.

  3. 9 హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు?

  4. 4 నువ్వు దుష్టత్వాన్ని సమర్ధించే దేవుడివి కాదు. చెడుతనం చేసే వాళ్ళు నీ అతిథులుగా ఉండరు.

    5 దురహంకారులు నీ సన్నిధిలో నిలబడరు. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లను నువ్వు ద్వేషిస్తావు.

    6 అబద్ధమాడే వాళ్ళను నువ్వు నాశనం చేస్తావు. హింసించేవాళ్ళను, మోసగాళ్ళను యెహోవా ద్వేషిస్తాడు.

  5. 42 యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించి ఉండేవారు. నేను వచ్చింది దేవుని దగ్గర్నుంచే. నా అంతట నేను రాలేదు. ఆయనే నన్ను పంపించాడు. 43 నా మాటలు మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా మాట వినే మీకు సహనం లేదు. 44 మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి.

    45 నేను చెబుతున్నది సత్యమే అయినా మీరు నన్ను నమ్మరు. 46 నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించ గలరు? నేను సత్యాన్నే చెబుతున్నా మీరెందుకు నమ్మడం లేదు? 47 ఒకడు దేవునికి చెందినవాడు అయితే దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు కాబట్టి మీరు ఆయన మాటలు వినరు.”

  6. 5 కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి. 6 వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి వస్తుంది.

    7 గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు. 8 కానీ ఇప్పుడు మీరు తీవ్ర కోపం, ఆగ్రహం, దుర్మార్గపు ఉద్దేశాలు, నిందా వాక్కులు, మీ నోటి నుండి అవమానకరమైన మాటలు, బూతులు అన్నీ వదిలి పెట్టాలి. 9 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. 10 ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు.

  7. 1 దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు. 2 స్త్రీ ఆ సర్పంతో “ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు. 3 కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది.

    4 పాము స్త్రీతో “మీరు చావనే చావరు. 5 ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు” అన్నాడు.

  8. 10 దుర్మార్గుల ఇళ్ళల్లో అన్యాయంగా సంపాదించిన సంపద ఉంది.

    అసహ్యకరమైన తప్పుడు తూకాలున్నాయి.

    11 తప్పు త్రాసు, తప్పు రాళ్లున్న సంచి ఉంచుకున్న వ్యక్తిని నేను నిర్దోషి అంటానా?

    12 ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు.

    అక్కడి ప్రజలు అబద్దికులు.

    వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది.

    13 కాబట్టి నేను నిన్ను తీవ్రంగా గాయపరచాను.

    నీ పాపాలను బట్టి నిన్ను నిర్మూలం చేశాను.

  9. 22 కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి 23 మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. 24 దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.

    25 మనం ఒకరికొకరం అవయవాల వంటి వారం. కాబట్టి మీరు అబద్ధాలు మానేసి మీ సాటిమనిషితో సత్యమే పలకాలి.

  10. 12 సోదరులారా, సజీవుడైన దేవుని నుండి తొలగిపోయే హృదయం, అవిశ్వాసంతో నిండిన చెడ్డ హృదయం మీలో ఉండకుండాా జాగ్రత్త పడండి. 13 పాపపు వంచన వల్ల మీలో ఎవరూ కఠినులు కాకుండా ప్రతిరోజూ, ఈ రోజు అనే సమయం ఉండగానే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి.

  11. 20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22 వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”

  12. 13 వేరు వేరు తూకం రాళ్లు పెద్దదీ, చిన్నదీ రెండు రకాలు మీ సంచిలో ఉంచుకోకూడదు. 14 వేరు వేరు తూములు పెద్దదీ, చిన్నదీ మీ ఇంట్లో ఉంచుకోకూడదు. 15 మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో మీరు శాశ్వతకాలం జీవించి ఉండేలా కచ్చితమైన న్యాయమైన తూనికరాళ్లు ఉంచుకోవాలి. కచ్చితమైన న్యాయమైన కొలత మీకు ఉండాలి. 16 ఆ విధంగా చేయని ప్రతివాడూ అంటే అన్యాయం చేసే ప్రతివాడూ మీ యెహోవా దేవునికి అసహ్యుడు.

  13. 10 జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి. 11 అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి. 12 ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది.

  14. 5 దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం. 6 మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. 7 అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.

  15. 11 నేను మీ దేవుడైన యెహోవాను.

    మీరు దొంగతనం చేయకూడదు.

    అబద్ధం ఆడకూడదు.

    ఒకడినొకడు దగా చెయ్యకూడదు.

    12 నా నామం పేరిట అబద్ధంగా ఒట్టు పెట్టుకోకూడదు.

    నీ దేవుని పేరును అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.

  16. 16 యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు.

    17 అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు, 18 దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు, 19 లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.

  17. 22 అబద్ధాలు పలికే పెదవులంటే యెహోవాకు అసహ్యం. నిజాయితీపరులను ఆయన ప్రేమిస్తాడు.

  18. 13 అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు. 14 ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటాడు. 15 అందుచేత, వాడి సేవకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. వారి పనులనుబట్టే వారి అంతముంటుంది.

  19. 16 నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు.

  20. 3 వ్యర్ధమైవి నా కన్నుల ఎదుట ఉండకుండా చూసుకుంటాను. భయభక్తులు లేనివాళ్ళు చేస్తున్న పనులు నాకు అసహ్యం. వాటికి నేను దూరంగా ఉంటాను.

    4 మూర్ఖంగా ఆలోచించేవాడు నాకు దూరంగా ఉండాలి. దుష్టకార్యాలంటే నాకు అసహ్యం.

    5 తమ పొరుగువాణ్ణి చాటుగా ఎగతాళి చేసే వాళ్ళను నేను హతం చేస్తాను. అహంకారంతో ప్రవర్తించే వాళ్ళను, గర్విష్టులను నేను దూరంగా ఉంచుతాను.

    6 దేశంలో నమ్మకంగా ఉండే వాళ్ళు నా చుట్టూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సన్మార్గంలో నడుచుకునే వాళ్ళు మాత్రమే నాకు సేవకులుగా ఉంటారు.

    7 మోసంతో బతికేవాడు నా ఇంట్లో ఉండకూడదు. అబద్ధాలు పలికేవాడు నా కళ్ళ ఎదుట నిలబడకూడదు.

    8 ప్రతిరోజూ ఉదయాన్నే దేశంలో దుర్మార్గులందరినీ నేను సంహరిస్తాను. యెహోవా పట్టణంలో పాపం చేసేవాళ్ళు లేకుండా చేస్తాను.

  21. 1 ప్రభువు దయగల వాడని మీరు రుచి చూశారు కాబట్టి 2 అన్ని రకాల దుష్టత్వం, మోసం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానండి. 3 కొత్తగా పుట్టిన బిడ్డల్లా, స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన పాలను ఆశించండి. దాని ద్వారా మీరు రక్షణలో ఎదుగుతారు.

  22. 9 అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు నాశనమౌతాడు.

  23. 8 క్రీస్తుపై కాకుండా మానవ సంప్రదాయాలపైనా, ప్రాపంచిక మూల సూత్రాలపైనా ఆధారపడ్డ తత్వజ్ఞానాన్నీ, కేవలం మోసపూరితమైన వట్టి వాదాలనూ ప్రయోగించి ఎవరూ మిమ్మల్ని వశం చేసుకోకుండా చూసుకోండి.

  24. 8 అప్పుడు ఆ అక్రమ పురుషుడు బయటపడతాడు. ప్రభు యేసు తన నోటి శ్వాస చేత వాణ్ణి సంహరిస్తాడు. తన ఆగమన తేజస్సుతో నాశనం చేస్తాడు. 9 సాతాను సమస్త శక్తీ, వాడి కపట సూచక క్రియల, అద్భుతాల ద్వారా అక్రమ పురుషుడు బయట పడతాడు. నశిస్తున్న వారి మధ్య నీతి రాహిత్యమైన అన్ని మోసాలతో వాడు తనను వెల్లడి చేసుకుంటాడు.

    10 ఎందుకంటే వారు రక్షణ పొందేలా సత్యాన్ని ప్రేమించలేదు, అంగీకరించలేదు. 11 ఈ కారణం చేత సత్యాన్ని నమ్మకుండా అక్రమంలోనే సంతోషించే వారిని శిక్షించడానికి 12 అబద్ధాన్ని నమ్మేలా భ్రమింపజేసే దాన్ని దేవుడు వారి మధ్యకు పంపిస్తున్నాడు.

  25. 2 నా న్యాయాన్ని తీసివేసిన దేవుని జీవం తోడు. నా ప్రాణాన్ని వ్యాకుల పరచిన సర్వశక్తుని తోడు.

    3 నా ప్రాణం నాలో ఉన్నంత కాలం, దేవుని ఊపిరి నా నాసికా రంధ్రాల్లో ఉన్నంత వరకు,

    4 నిశ్చయంగా నా పెదవులు అబద్ధం పలకవు. నా నాలుక మోసం ఉచ్ఛరించదు.

    5 మీరు చెప్పినది న్యాయమని నేనెంత మాత్రం ఒప్పుకోను. మరణమయ్యే దాకా నేనెంత మాత్రం యథార్థతను వదిలి పెట్టను.

  26. 22 ఆయన ఎలాంటి పాపం చేయలేదు.

    ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు.

  27. 8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.

  28. 7 అతని నోరు శాపంతో, కపటంతో, హానికరమైన మాటలతో నిండి ఉంది. అతని నాలుక గాయపరిచి నాశనం చేస్తుంది.

  29. 5 నీతిమంతులు చెప్పే ఆలోచనలు న్యాయసమ్మతం. దుర్మార్గుల సలహాలు మోసంతో కూడినవి.

  30. 12 క్రీస్తు యేసులో సద్భక్తితో జీవించాలని కోరేవారంతా హింస పొందుతారు. 13 అయితే చెడ్డ వారూ, వంచకులూ ఇతరులను మోసపరుస్తూ తాము కూడా మోసపోతూ అంతకంతకూ చెడిపోతారు. 14 కానీ నీవు మాత్రం కచ్చితంగా తెలుసుకున్న వాటిని ఎవరి ద్వారా నేర్చుకున్నావో గ్రహించి వాటిలో నిలకడగా సాగిపో. 15 ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు.

  31. 14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు. “ప్రవక్తలు నా పేరున అబద్ధాలు ప్రకటిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు. వాళ్ళకు ఎలాంటి ఆజ్ఞా ఇవ్వలేదు. వాళ్ళతో మాట్లాడలేదు. అయితే వాళ్ళ హృదయాల్లోనుంచి మోసపూరితమైన దర్శనాలూ పనికిమాలిన, మోసపు శకునాలూ వస్తున్నాయి. వీటినే వాళ్ళు మీకు ప్రవచిస్తున్నారు.

    15 అందుచేత యెహోవా అనే నేను చెబుతున్నది ఏమంటే, నేను వాళ్ళను పంపకపోయినా, నా పేరును బట్టి కత్తిగానీ కరువుగానీ ఈ దేశంలోకి రాదు అని చెబుతున్నారు. ఆ ప్రవక్తలు కత్తితో కరువుతో నాశనమవుతారు.”

  32. 28 వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.

    30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, 31 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. 32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.

  33. 2 నీ నాలుక నాశనాన్ని ఆలోచిస్తుంది. అది పదునైన కత్తిలా వంచన చేస్తూ ఉంది.

    3 నువ్వు మంచి కంటే దుర్మార్గాన్ని ఎక్కువ ప్రేమిస్తావు. న్యాయం మాట్లాడటం కంటే అబద్దం మాట్లాడటం నీకిష్టం.

    4 కపటమైన నాలుకా! ఇతరులను మింగేసే మాటలను నువ్వు ప్రేమిస్తావు.

    5 కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు. ఆయన నిన్ను నీ గుడారంలో నుండి పెరికి వేస్తాడు. సజీవులుండే ప్రాంతం నుండి నిన్ను పెల్లగిస్తాడు.

  34. 3 సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్టు మీ మనసులు క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను.

  35. 20 మీ సాటి మనిషికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు.

  36. 35 వాళ్ళ కడుపులో ఉన్న కపటాన్ని వాళ్ళు బయటకు వెళ్ళగక్కుతారు. వాళ్ళ అంతరంగంలో వంచన నివసిస్తుంది.”

  37. 3 యెహోవా పర్వతం ఎక్కే అర్హత ఎవరికుంది? ఆయన పవిత్ర స్థలంలో ఎవరు ప్రవేశించగలరు?

    4 అసత్యంపై మనసు పెట్టకుండా, మోసపూరితంగా ఒట్టు పెట్టుకోకుండా, నిర్దోషమైన చేతులూ, శుద్ధమైన హృదయం కలిగినవాడే.

    5 అతడు యెహోవా వల్ల ఆశీర్వాదం పొందుతాడు, తన రక్షకుడైన దేవుని వల్ల నిర్దోషత్వం పొందుతాడు.

  38. 12 జీవితాన్ని కాంక్షించేవాడు, ఎక్కువ కాలం జీవించాలని ఆశించే వాడు, చక్కని జీవితం కావాలి అనుకునేవాడు ఏం చేయాలి?

    13 దుర్మార్గమైన మాటలు పలకకుండా ఉండు. అబద్ధాలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో.

  39. 3 వాడు పలికే మాటలు పాప భూయిష్టంగా, మోసపూరితంగా ఉన్నాయి. వాడికి జ్ఞానంగా ప్రవర్తించడం, మంచి పనులు చేయడం ఇష్టం లేదు.

  40. 7 అసలు క్రైస్తవుల మధ్య ఒకరితో ఒకరికి వివాదం ఉండడమే మీ అపజయం. దాని కంటే మీరు అన్యాయం సహించడం మంచిది కదా? దానికంటే మీ వస్తువులు పోగొట్టుకోవడం మంచిది కదా? 8 అయితే మీరే ఇతరులకు, మీ సోదర సోదరీలకే అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు.

    9 అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతికి పాలుపడే వారూ, విగ్రహాలను పూజించేవారూ, మగ వేశ్యలు, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులూ, విపరీత సంపర్కం జరిపే వారూ, 10 దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    11 గతంలో మీలో కొంతమంది అలాటివారే. అయితే ప్రభు యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మ మిమ్మల్ని కడగడం ద్వారా పవిత్రులై దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు.

  41. 11-12 విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు. 13 మనమంతా విశ్వాసంలో, దేవుని కుమారుడి గురించిన జ్ఞానంలో ఏకీభావం కలిగి ఉండాలనీ క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణ పరిణతికి సమానమైన పరిణతి చెందాలనీ ఆయన ఇలా నియమించాడు. 14 అప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని కల్పించిన అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము.

  42. 2 యెహోవా, అబద్ధాలు పలికే పెదాల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను కాపాడు.

  43. 1 దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం.

  44. 17 సత్యం కోసం నిలబడేవాడు నీతిగల మాటలు పలుకుతాడు. అబద్ద సాక్ష్యం పలికేవాడు కపటపు మాటలు పలుకుతాడు.

  45. 23 “ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు’ అని చెబితే నమ్మవద్దు. 24 కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు. 25 ఇదిగో, ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను. 26 కాబట్టి ఎవరైనా ‘ఇదిగో, క్రీస్తు అరణ్యంలో ఉన్నాడు’ అని చెప్పినా, ‘ఇదిగో, ఈ గది లోపల ఉన్నాడు’ అని చెప్పినా మీరు నమ్మవద్దు. వారి వెంట వెళ్ళవద్దు.

  46. 13 వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది.

    వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు.

    వారి పెదవుల కింద పాము విషం ఉంది.

  47. 6 పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది. 7 కాబట్టి వారికి దూరంగా ఉండండి.

  48. 14 ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. 15 చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది. 16 నా ప్రియ సోదరులారా, మోసపోకండి. 17 ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు.

  49. 1 గతంలో కూడా ఇశ్రాయేలీయుల్లో అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. అదే విధంగా మీ మధ్య కూడా అబద్ధ బోధకులు లేస్తారు. వారు నాశనకరమైన విరుద్ధ సిద్ధాంతాలను రహస్యంగా ప్రవేశపెడుతూ, తమ కోసం వెల చెల్లించిన ప్రభువును కూడా నిరాకరిస్తారు. దాని ద్వారా తమ మీదికి తామే త్వరగా నాశనం తెచ్చుకుంటారు. 2 అనేక మంది వారి విచ్చలవిడితనాన్ని అనుకరిస్తారు. అందువల్ల సత్యమార్గానికి అపకీర్తి కలుగుతుంది. 3 ఈ అబద్ధ బోధకులు అత్యాశతో, కట్టు కథలతో తమ స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. వారికి విధించిన శిక్ష పూర్వకాలం నుండి వారికోసం సిద్ధంగా ఉంది. వారి నాశనం నిద్రపోదు.

  50. 10 అప్పుడు ఆ ప్రదేశంలో కరువు వచ్చింది. కరువు తీవ్రంగా ఉన్న కారణంగా అబ్రాము ఐగుప్తులో నివసించడానికి వెళ్ళాడు. 11 అతడు ఐగుప్తులో ప్రవేశించడానికి ముందు తన భార్య శారయితో “చూడు, నువ్వు చాలా అందగత్తెవని నాకు తెలుసు, 12 ఐగుప్తీయులు నిన్ను చూసి, ‘ఈమె అతని భార్య’ అని నీ మూలంగా నన్ను చంపుతారు. కాని నిన్ను బ్రతకనిస్తారు. 13 నీ వల్ల నాకు మేలు కలిగేలా, నీ కారణంగా నేను చావకుండేలా నువ్వు నా సోదరివి అని దయచేసి చెప్పు” అన్నాడు.

  51. 20 వాళ్ళు శాంతిని గూర్చి మాట్లాడరు. దేశంలో ప్రశాంతంగా జీవిస్తున్న వాళ్లకు విరోధంగా మోసపూరితమైన మాటలు కల్పిస్తారు.

  52. 1 దేవా, నాకు న్యాయం తీర్చు. దైవభక్తిలేని ప్రజలతో నా తరుపున వాదించు.

  53. 28 అకారణంగా నీ పొరుగువాడిపై సాక్ష్యం పలక వద్దు. నీ పెదాలతో మోసపు మాటలు పలకొచ్చా?

  54. 6 ‘యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని చెప్పే వాళ్ళు అబద్ధపు దర్శనాలు చూసి అబద్ధపు జోస్యాలు చెప్తారు. యెహోవా వాళ్ళని పంపలేదు. అయినా తమ సందేశం జరుగుతుంది అని ప్రజలు ఆశ పడేలా చేస్తారు. 7 నేను అసలేమీ మాట్లాడకుండానే ‘యెహోవా చెప్పేది ఇదీ, అదీ’ అంటూ చెప్పే మీరు అబద్ధపు దర్శనాలు చూడలేదా? అబద్ధపు జోస్యాలు చెప్పలేదా?

    8 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు అబద్ధపు దర్శనాలు చూసి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ప్రభువైన యెహోవా మీకు విరోధంగా చేస్తున్న ప్రకటన ఇదే, 9 అబద్ధపు దర్శనాలు చూస్తూ జోస్యం చెప్తున్న ప్రవక్తలకి నేను వ్యతిరేకిని. నా ప్రజల సభలోకి వాళ్ళని రానివ్వను. ఇశ్రాయేలు ప్రజల్లో వాళ్ళను నమోదు చేయను. వాళ్ళు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికి వీల్లేదు. అలా జరిగినప్పుడు నేనే యెహోవాను, అని మీరు తెలుసుకుంటారు.

  55. 2 అయితే సిగ్గుకరమైన రహస్య విషయాలను నిరాకరించాము. మేము కుయుక్తిగా ప్రవర్తించడం లేదు, దేవుని వాక్యాన్ని వక్రం చేయడం లేదు. దేవుని దృష్టిలో ప్రతివాడి మనస్సాక్షికీ మమ్మల్ని మేమే అప్పగించుకొంటూ సత్యం ప్రకటిస్తున్నాము.

  56. 11 స్త్రీలు మౌనంగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. 12 ఉపదేశించడానికీ, పురుషుని మీద అధికారం చేయడానికీ స్త్రీకి అనుమతినివ్వను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే. 13 ఎందుకంటే దేవుడు మొదట ఆదామును తరువాత హవ్వను గదా సృష్టించాడు? 14 ఆదాము మోసపోలేదు, స్త్రీయే మోసపోయి అపరాధి అయింది.

  57. 10 మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయనను అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.

  58. 11 అప్పుడు భూమిలో నుండి మరో క్రూర మృగం పైకి రావడం చూశాను. వాడికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు రెండు ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలాగా మాట్లాడుతూ ఉన్నాడు. 12 వాడు ప్రాణాంతకమైన దెబ్బ తగిలి పూర్తిగా నయమైన మొదటి క్రూర మృగానికున్న అధికారాన్ని, వాడి సమక్షంలో ఉపయోగిస్తూ ఉన్నాడు. తద్వారా ఆ మొదటి మృగాన్ని భూమీ, దానిలో నివసించే వారంతా పూజించేలా చేశాడు.

    13 వాడు అనేక చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు. మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి అద్భుతాలు చేస్తున్నాడు. 14 తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమిపై అందర్నీ మోసం చేస్తూ ఉన్నాడు. కత్తి దెబ్బ తిన్నా బతికే ఉన్న మొదటి క్రూరమృగానికి ఒక విగ్రహాన్ని స్థాపించాలని వాడు అందరికీ చెబుతూ ఉన్నాడు.

    15 పైగా ఆ మృగం విగ్రహానికి ప్రాణం పోసి అది మాట్లాడేలా చేయడానికీ, ఆ మృగం విగ్రహాన్ని పూజించని వారిని చంపడానికీ వాడికి అధికారం ఇవ్వడం జరిగింది.

  59. 27 పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసినవారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్నవారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.

  60. 14 జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణ ద్వారాల నుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యులు అయ్యేందుకై తమ వస్త్రాలను ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు.

    15 పట్టణం బయట కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ ఉంటారు.

  61. 6 నేను మీ నాన్నకు నా శాయశక్తులా సేవ చేశానని మీకు తెలుసు. 7 మీ నాన్న నన్ను మోసం చేసి పది సార్లు నా జీతం మార్చాడు. అయినా దేవుడు అతని మూలంగా నాకు నష్టం రానియ్యలేదు.

    8 అతడు, ‘పొడలు గలవి నీ జీతమవుతాయి’ అని చెప్పినప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలను ఈనాయి. ‘చారలు గలవి నీ జీతమవుతాయి’ అని చెప్పినప్పుడు అవి చారలు గల పిల్లలను ఈనాయి. 9 ఆ విధంగా దేవుడు మీ నాన్న మందలను తీసి నాకిచ్చాడు.

  62. 35 కొలతలోగాని తూనికలోగాని పరిమాణంలో గాని మీరు అన్యాయం చేయకూడదు. 36 న్యాయమైన త్రాసులు న్యాయమైన బరువులు, న్యాయమైన కొల పాత్రలు న్యాయమైన పడి మీకుండాలి. నేను ఐగుప్తులోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను.

  63. 22 గేహాజీ “అంతా క్షేమమే. నా యజమాని నన్ను పంపించాడు. ‘ఎఫ్రాయిము పర్వత ప్రాంతం లోని ప్రవక్తల సమాజం నుండి ఇద్దరు యువకులు ఇప్పుడే నా దగ్గరికి వచ్చారు. మీరు దయచేసి వారి కోసం ముప్ఫై నాలుగు కిలోల వెండీ, రెండు జతల బట్టలూ ఇవ్వండి’ అని చెప్పమన్నాడు” అన్నాడు.

    23 అందుకు నయమాను “నీకు డెబ్భై కిలోలు సంతోషంగా ఇస్తాను” అన్నాడు. నయమాను గేహాజీని బలవంతపెట్టి రెండు బస్తాల్లో డెబ్భై కిలోల వెండి ఉంచి, రెండు జతల బట్టలూ ఇచ్చి వాటిని మోయడానికి తన దగ్గర ఉన్న ఇద్దరు పనివాళ్ళను పంపాడు. వారు వాటిని మోసుకుని గేహాజీ ముందు నడిచారు. 24 వారు పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు గేహాజీ ఆ వెండి బస్తాలను తీసుకుని ఇంట్లో దాచిపెట్టి వాళ్ళను పంపించి వేశాడు. వారు వెళ్ళిపోయారు. 25 తరువాత అతడు లోపలికి వెళ్ళి తన యజమాని ఎలీషా ఎదుట నిలబడ్డాడు. ఎలీషా అతణ్ణి “గేహజీ, నీవు ఎక్కడినుండి వస్తున్నావ్?” అని అడిగాడు. దానికి గేహాజీ “నీ సేవకుణ్ణి. నేను ఎక్కడికీ వెళ్ళలేదు” అన్నాడు.

    26 అప్పుడు ఎలీషా గేహజీతో “ఆ వ్యక్తి నిన్ను కలుసుకోడానికి తన రథాన్ని ఆపినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదనుకున్నావా? డబ్బూ, మంచి బట్టలూ, ఒలీవ తోటలూ, ద్రాక్ష తోటలూ, గొర్రెలూ, పశువులూ, సేవకులూ, సేవకురాళ్ళూ వీటిని సంపాదించుకోడానికి ఇదా సమయం? 27 అందుచేత నయమానుకి ఉన్న కుష్ఠు నీకూ, నీ వారసులకూ నిత్యం ఉంటుంది” అన్నాడు. కాబట్టి గేహాజీకి మంచులా తెల్లని కుష్టురోగం వచ్చింది. అతడు ఎలీషా దగ్గరనుండి వెళ్ళి పోయాడు.

  64. 2 యెహోవా నిర్దోషిగా పరిగణించిన వాడు, తన ఆత్మలో కపటమనేది లేనివాడు ధన్యజీవి.

  65. 5 నమ్మకమైన సాక్షి అబద్ధం పలకడు. కపట సాక్షికి అబద్ధాలు చెప్పడమే ఇష్టం.

  66. 25 నిజాలు పలికే సాక్షి మనుషులను కాపాడతాడు. అబద్ధాలు చెప్పేవాడు కేవలం మోసగాడు.

  67. 9 అతడు చనిపోయినప్పుడు నేరస్థులతో అతన్ని సమాధి చేశారు. ధనవంతుని దగ్గర అతన్ని ఉంచారు.

    అతడు ఏ నేరమూ చేయలేదు. అతని నోట మోసం ఎప్పుడూ లేదు.

  68. 13 అక్రమంగా తన ఇంటినీ, అన్యాయంగా తన మేడగదులనూ కట్టించుకునే వాడికి బాధ. జీతమివ్వకుండా తన పొరుగువాడి చేత ఊరికే పని చేయించుకునే వాడికి బాధ.

  69. 12 ఎఫ్రాయిము వారు నా చుట్టూ అబద్ధాలు అల్లారు.

    ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించారు.

    కానీ యూదా వారు ఇంకా నాతోనే ఉన్నారు.

    పరిశుద్ధ దేవునికి నమ్మకంగానే ఉన్నారు.

  70. 7 కనానీయ వర్తకులు అన్యాయపు త్రాసును వాడుతారు.

    దగా చెయ్యడమే వారికి ఇష్టం.

    8 “నేను ధనవంతుడినయ్యాను, నాకు చాలా ఆస్తి దొరికింది.

    నేను సంపాదించుకున్న దానిలో దేనిని బట్టీ శిక్షకు తగిన పాపం నాలో ఉన్నట్టు ఎవరూ చూపలేరు” అని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు.

  71. 1 నరహత్య చేసిన పట్టణమా, నీకు బాధ తప్పదు. అది నిరంతరం అబద్ధాలతో దొంగిలించి తెచ్చిన వస్తువులతో నిండి ఉంది. దాని చేతుల్లో హతమైన వారు దానిలో ఉన్నారు.

  72. 18 ఎవరూ తనను తాను మోసగించుకోవద్దు. మీలో ఎవరైనా ఈ లోకరీతిగా తాను జ్ఞానం గలవాడిని అనుకుంటే, జ్ఞానం పొందడం కోసం అతడు తెలివి తక్కువవాడు కావాలి. 19 ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి తెలివి తక్కువతనమే. “జ్ఞానులను వారి కుయుక్తుల్లోనే ఆయన పట్టుకుంటాడు” అనీ,

  73. 4 చూడండి, మీ చేను కోసిన పనివారి కూలీ ఇవ్వకుండా, మీరు మోసంగా బిగపట్టిన కూలీ కేకలు వేస్తున్నది. మీ కోతపని వారి ఆక్రందనలు సేనల ప్రభువు చెవిని బడుతున్నాయి.

  74. 13 దేవుడైన యెహోవా స్త్రీతో “నువ్వు చేసిందేమిటి?” అన్నాడు. స్త్రీ “సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను” అంది.

  75. 6 కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు. 7 అక్కడి మనుషులు అతని భార్యను చూసి ఆమె సంగతి ఇస్సాకును అడిగారు. దానికతడు “ఆమె నా చెల్లి” అని చెప్పాడు. ఆమె తన భార్య అని చెప్పడానికి భయపడ్డాడు. ఎందుకంటే రిబ్కా అందకత్తె కాబట్టి అక్కడి మనుషులు ఆమె కోసం తనని చంపుతారేమో అనుకున్నాడు.

  76. 18 అతడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్నగారూ, అని పిలిచాడు. ఇస్సాకు “కొడుకా ఏమిటి? నువ్వు ఎవరివి?” అని అడిగాడు. 19 దానికి యాకోబు “నేను ఏశావుని. నీ పెద్ద కొడుకుని. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. లేచి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అన్నాడు.

  77. 1 యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు. 2 “ఒక వ్యక్తి తన పొరుగున ఉన్నవాడు తనకు అప్పగించిన దాని విషయంలో అతణ్ణి మోసం చేసినా, వంచించినా, దోచుకున్నా, లేక తన పొరుగున ఉన్నవాణ్ణి పీడించినా 3 అతడు పోగొట్టుకున్న వస్తువు తనకు దొరికినా దాని విషయం అబద్ధం చెప్పినా, ఒట్టు పెట్టి మరీ అబద్ధం చెప్పినా, ఇంకా ఇలాంటి విషయాల్లో పాపం చేస్తే అది యెహోవాకి వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించి చేసిన పాపం అవుతుంది. 4 ఇలా పాపం చేసినవాడు అపరాధి. కాబట్టి అలాంటివాడు తను ఇతరుల దగ్గర దోచుకున్నదీ, పీడించి సంపాదించిందీ, లేక తనకు అప్పగించినదీ, తనకు దొరికినదీ తిరిగి ఇచ్చివేయాలి.

    5 తాను దేని గురించైతే అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని పూర్తిగా చెల్లించాలి. ఇంకా అది ఎవరికి చెందుతుందో వారికి దానిలో ఐదో వంతు తప్పక చెల్లించాలి. దాన్ని అపరాధ బలి అర్పించే రోజున చెల్లించాలి.

  78. 19 అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు.

    మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు.

    ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా?

    ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?

  79. 12 నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు నా కోసం ఉచ్చు బిగిస్తున్నారు. నాకు హాని కలగాలని చూసేవాళ్ళు వినాశకరమైన మాటలు పలుకుతున్నారు. రోజంతా మోసపూరితంగా మాట్లాడుతున్నారు

  80. 118 నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు త్రోసిపుచ్చుతావు. అలాటి వారంతా దగాకోరులే, నమ్మలేని వారే.

  81. 8 వివేకం ఉన్నవారు తమ ప్రవర్తన విషయంలో జ్ఞానం కలిగి జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. బుద్ధి లేనివారు తమ మూర్ఖత్వంతో మోసపూరిత కార్యాలు జరిగిస్తారు.

  82. 6 అబద్ధాలాడి ధనం సంపాదించుకోవడం మరణ సమయంలో కొన ఊపిరితో సమానం.

  83. 18 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? 19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి.

  84. 20 వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు.

  85. 8 జక్కయ్య నిలబడి, “ఇదిగో ప్రభూ, నా ఆస్తిలో సగం పేదలకిస్తున్నాను. నేనెవరినైనా మోసం చేసి ఏదన్నా తీసుకుంటే అతనికి నాలుగంతలు మళ్ళీ చెల్లిస్తాను” అన్నాడు.

  86. 12 ప్రజలను, పెద్దలను, ధర్మ శాస్త్ర పండితులనూ రేపి అతని మీదికి వచ్చి అతణ్ణి పట్టుకుని మహాసభ ఎదుటికి తీసుకు పోయారు. 13 అబద్ధ సాక్షులను నిలబెట్టారు. వారు, “ఈ వ్యక్తి ఎప్పుడూ ఈ పరిశుద్ధ స్థలానికీ మన ధర్మశాస్త్రానికీ విరోధంగా మాట్లాడుతున్నాడు. 14 నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారాలను మారుస్తాడని వీడు చెప్పగా మేము విన్నాము” అని చెప్పారు.

  87. 7 మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.

    8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు.

  88. 8 మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.

  89. 7 యేసు క్రీస్తు రక్తమాంసాలతో వచ్చాడని ఒప్పుకోని మోసగాళ్ళు చాలా మంది ఈ లోకంలో బయలుదేరారు. అలాటి వాడు వంచకుడు, క్రీస్తు విరోధి.

  90. 31 వారు ఒక మేకపిల్లను చంపి, యోసేపు అంగీని దాని రక్తంలో తడిపారు. 32 వారు దాన్ని తమ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి “ఇది మాకు దొరికింది. ఇది నీ కొడుకు అంగీనో కాదో చూడు” అన్నారు. 33 అతడు దాన్ని గుర్తుపట్టి “ఈ అంగీ నా కొడుకుదే, ఏదో ఒక క్రూర జంతువు వాణ్ణి చంపి తినేసింది. తప్పనిసరిగా అది యోసేపును చీల్చేసి ఉంటుంది” అన్నాడు.

    34 యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుముకు గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కొడుకు కోసం దుఃఖించాడు. 35 అతని కొడుకులు, కూతుర్లు అందరూ అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నం చేశారు గానీ అతడు ఓదార్పు పొందలేదు. “నేను ఏడుస్తూ చనిపోయిన వారుండే స్థలానికి నా కొడుకు దగ్గరికి వెళ్తాను” అని అతడు యోసేపు కోసం ఏడ్చాడు.

  91. 20 అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ముందు నిలబడి, ‘నేను అతణ్ణి ప్రేరేపిస్తాను’ అని చెప్పాడు. యెహోవా, ‘ఏవిధంగా?’ అని అతణ్ణి అడిగాడు. 21 అందుకు ఆ ఆత్మ, ‘నేను వెళ్ళి అతని ప్రవక్తలందరి నోట అబద్ధాలాడే ఆత్మగా ఉంటాను’ అని చెప్పాడు. అందుకు యెహోవా ‘నువ్వు అతణ్ణి ప్రేరేపించి సఫలమౌతావు. వెళ్ళి అలా చెయ్యి’ అని సెలవిచ్చాడు. 22 నీ ప్రవక్తలైన వీరి నోటిలో యెహోవా అబద్ధాలాడే ఆత్మను ఉంచాడు. యెహోవా నీకు కీడు నిర్ణయించాడు.”

  92. 18 దుష్టుల సంపద వాళ్ళను మోసపరుస్తుంది. నీతి అనే విత్తనం నాటేవాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు.

  93. 19 నిజాలు పలికే పెదవులు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. అబద్ధాలు పలికే నాలుక ఉనికి క్షణకాలం.

    20 కీడు తలపెట్టేవాళ్ళ హృదయాల్లో మోసం ఉంటుంది. శాంతి కోసం సలహాలు ఇచ్చేవాళ్ళకు సంతోషం కలుగుతుంది.

  94. 27 పంజరం నిండా పిట్టలు ఉన్నట్టు వారి ఇళ్ళు కపటంతో నిండి ఉన్నాయి. దానితోనే వారు గొప్పవారు, ధనవంతులు అవుతారు.

    28 వారు కొవ్వు పట్టి బాగా బలిసి ఉన్నారు. దుర్మార్గంలో వారు ఎంతో ముందుకు వెళ్ళారు.

    తండ్రి లేనివారు వ్యాజ్యంలో గెలవకుండేలా వారికి అన్యాయంగా తీర్పు తీరుస్తారు. బీదవారి వ్యాజ్యాల్లో సహకరించరు.

  95. 1 అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు. 2 భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.

    3 అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? 4 అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు.

  96. 9 ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వాడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వాణ్ణీ వాడితో పాటు వాడి అనుచర దూతలనూ భూమి మీదికి తోసి వేశారు.

  97. 7 వెయ్యి సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలో నుండి విడుదల అవుతాడు. 8 వాడు బయల్దేరి భూమి నాలుగు దిక్కుల్లో ఉన్న గోగు, మాగోగులను మోసం చేసి లెక్కకు సముద్రపు ఇసుకలాగా ఉన్న వారిని యుద్ధానికై సమకూరుస్తాడు. 9 వారు బయలు దేరి పరిశుద్ధుల శిబిరమైన ప్రియ పట్టణాన్ని ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది.

    10 వారిని మోసం చేసిన అపవాదిని మండుతున్న గంధకం సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధల పాలవుతారు.