83 Bible Verses About Pride
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
16 విలువైన బంగారం సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్ఠం. వెండి సంపాదించడం కంటే తెలివితేటలు కోరుకోవడం ఉపయోగకరం.
17 నిజాయితీపరులకు దుష్ట ప్రవర్తన విడిచి నడుచుకోవడమే రాజమార్గం వంటిది. తన ప్రవర్తన కనిపెట్టుకుని ఉండేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు.
18 ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది.
19 దుర్మార్గులతో కలసి దోచుకున్న సొమ్ము పంచుకోవడం కంటే, వినయంతో దీన మనస్కులతో ఉండడం మంచిది.
20 ఉపదేశం శ్రద్ధగా ఆలకించే వారికి మేలు కలుగుతుంది. యెహోవాను ఆశ్రయం కోరేవాడు ధన్యుడు.
-
11 నీ ఆడంబరం, నీ తీగ వాయిద్య స్వరం పాతాళానికి పడిపోయాయి. నీ కింద పురుగులు వ్యాపిస్తాయి. క్రిములు నిన్ను కప్పుతాయి.
12 తేజోనక్షత్రమా, వేకువచుక్కా, ఆకాశం నుంచి నువ్వెలా పడిపోయావు? జాతులను కూల్చిన నువ్వు నేలమట్టం వరకూ ఎలా తెగి పడిపోయావు?
13 నువ్వు నీ హృదయంలో, ‘నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని గొప్ప చేసుకుంటాను, ఉత్తరం వైపు ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను,
14 మేఘమండలం మీదకు ఎక్కుతాను, మహోన్నతుడైన దేవునితో నన్ను సమానంగా చేసుకుంటాను’ అనుకున్నావు. 15 అయితే నువ్వు ఇప్పుడు పాతాళపు లోతుల్లోకి దిగిపోయావు. నరకంలో పడి ఉన్నావు.
-
5 ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా? 6 కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.
7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. 8 దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి. 9 చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి. 10 ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.
-
1 తోటి పెద్దనూ, క్రీస్తు బాధలు చూసిన వాణ్ణి, ప్రత్యక్షం కాబోయే మహిమలో భాగస్వామినీ అయిన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. 2 మీ దగ్గరున్న దేవుని మందను కాయండి. బలవంతంగా కాకుండా దేవుడు కోరే రీతిగా ఇష్ట పూర్వకంగా వారిని చూసుకోండి. చెడు లాభం ఆశించి కాకుండా ఇష్టంగా వారిని చూసుకోండి. 3 మీ అజమాయిషీ కింద ఉన్న వారిపై పెత్తనం చేసేవారుగా ఉండక, మందకు ఆదర్శంగా ఉండండి. 4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీకు వాడిపోని మహిమ కిరీటం లభిస్తుంది.
5 యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి ఉండండి. దేవుడు గర్విష్టులను ఎదిరించి వినయం గలవారికి కృప చూపుతాడు. 6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.
7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి.
-
2 తమ అహంకారాన్నిబట్టి దుర్మార్గులు పీడిత ప్రజలను తరుముతున్నారు. కానీ వారు పన్నిన మోసపు ఎత్తుగడల్లో వారే చిక్కుకునేలా చెయ్యి.
3 దుర్మార్గుడు తమ హృదయవాంఛను బట్టి గర్విస్తాడు. అత్యాశాపరులకు అనుగ్రహం చూపించి, యెహోవాను అవమానిస్తాడు.
4 దుర్మార్గుడు బహు గర్విష్టి అయిన కారణంగా అతడు యెహోవాను వెదకడు. అతడు దేవుణ్ణి పట్టించుకోడు గనక దేవుని గురించి ఆలోచించడు.
-
12 నాలో జ్ఞానం, వివేకం నివసిస్తున్నాయి. మంచి చెడ్డలు ఏమిటో నేను గ్రహించగలను.
13 దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, అహంకారం, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం.
-
9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10 “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11 పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.
14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.
-
2 గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది. జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు.
-
10 యెహోవా భీకర సన్నిధి నుంచి, ఘనత కలిగిన ఆయన మహిమ నుంచీ వెళ్లి గండ శిలల్లో, నేలలో దాగి ఉండు.
11 మానవుని అహంకార దృష్టిని ఆయన తగ్గించేస్తాడు.
మనుషుల గర్వాన్ని అణగదొక్కుతాడు.
ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు.
12 గర్వం, దురహంకారం, అతిశయం కలిగిన ప్రతివాణ్ణి ఆ రోజున సేనలకు ప్రభువైన యెహోవా కింద పడేస్తాడు.
13 సమున్నతంగా అతిశయించే లెబానోను దేవదారు వృక్షాలన్నిటికీ,
బాషాను సింధూర వృక్షాలన్నిటికీ,
14 ఉన్నత పర్వతాలన్నిటికీ, అతిశయించే కొండలన్నిటికీ,
15 ఎత్తయిన ప్రతి గోపురానికీ, పడగొట్టలేనంత బలమైన ప్రతి కోటగోడకూ,
16 తర్షీషు ఓడలన్నిటికీ, అందమైన తెరచాప నౌకలకూ విరుద్ధంగా ఆ రోజును సేనలకు ప్రభువైన యెహోవా నియమించాడు.
17 అప్పుడు మనిషి అహంకారం అణిగిపోతుంది.
మనుషుల గర్వం తగ్గిపోతుంది.
ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు.
-
10 గర్వాంధుడు కలహాలు రేపుతాడు. మంచి మాటలు ఆలకించే వారికి జ్ఞానం చేకూరుతుంది.
-
3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.
6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.
దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.
7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.
బానిస రూపం తీసుకున్నాడు.
మానవుల పోలికలో కనిపించాడు.
ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.
8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,
తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.
-
2 కాబట్టి అధ్యక్షుడు నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య ఉన్నవాడూ కోరికలు అదుపులో ఉంచుకునేవాడూ వివేచనాపరుడూ మర్యాదస్థుడూ అతిథి ప్రియుడూ బోధించడానికి సమర్థుడూ అయి ఉండాలి. 3 అతడు తాగుబోతూ జగడాలమారీ కాక మృదుస్వభావి, ధనాశ లేనివాడూ అయి ఉండాలి. 4 తన పిల్లలు తనకు సరైన గౌరవంతో లోబడేలా చేసుకుంటూ తన కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకునేవాడై ఉండాలి.
5 ఎవడైనా తన కుటుంబాన్నే సరిగా నిర్వహించకపోతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు? 6 అతడు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. ఎందుకంటే అతడు గర్విష్టి అయి అపవాది పొందిన శిక్షనే పొందుతాడేమో. 7 అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండేలా సంఘానికి బయట ఉన్నవారి చేత మంచి పేరు పొందినవాడై ఉండాలి.
-
1 ఓబద్యా దర్శనం. ఎదోము గురించి యెహోవా ప్రభువు ఈ విషయం చెబుతున్నాడు. యెహోవా నుంచి మేము ఒక నివేదిక విన్నాం. “లెండి. ఎదోము మీద యుద్ధం చేయడానికి కదలండి” అని దేవుడు ఒక రాయబారిని రాజ్యాలకు పంపాడు. 2 నేను ఇతర రాజ్యాల్లో నిన్ను తక్కువ చేస్తాను. వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు.
3 నీ హృదయ గర్వం నిన్ను మోసం చేసింది. కొండ సందుల్లో ఎత్తయిన ఇంట్లో నివసించే నువ్వు “నన్నెవడు కింద పడేస్తాడు?” అని నీ మనస్సులో అనుకుంటున్నావు. 4 గద్దలా నువ్వు పై పైకి ఎగిరినా నక్షత్రాల్లో గూడు కట్టుకున్నా అక్కడనుంచి నిన్ను కింద పడేస్తాను, అని యెహోవా చెబుతున్నాడు.
-
23 ఎవరి అహం వాణ్ణి అణచి వేస్తుంది. వినయమనస్కుడు గౌరవానికి నోచుకుంటాడు.
-
1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.
3 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి.
-
20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22 వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”
-
1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. 2 దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. 3 పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.
4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.
5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.
6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.
7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.
-
15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. 16 ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే. 17 ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.
-
1 ఇప్పుడిక గ్రహాలకు బలి అర్పించిన వాటి విషయం: మనమంతా తెలివైన వారమే అని మనకి తెలుసు. తెలివి మిడిసిపడేలా చేస్తుంది గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. 2 ఎవరైనా తనకు ఏదైనా తెలుసు అని భావిస్తే, అతడు గ్రహించ వలసిందేమంటే తాను తెలుసుకోవలసినంత ఇంకా తెలుసుకోలేదు అని. 3 ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవునికి అతడు తెలుసన్నమాట.
-
6 సోదరీ సోదరులారా, “రాసి ఉన్నవాటిని మించి వెళ్లవద్దు” అనే మాట అర్థం మీరు గ్రహించాలని ఈ మాటలు మీ మేలు కోసం నాకూ అపొల్లోకూ ఆపాదించుకుని ఉదాహరణగా చెప్పాను. మీరు ఒకరి మీద ఒకరు విర్రవీగ కూడదని ఈ విధంగా వివరించాను.
7 ఎందుకంటే నీకొక్కడికే ఉన్న గొప్పతనం ఏమిటి? నీకు ఉన్నదానిలో నువ్వు ఉచితంగా పొందనిది ఏమిటి? ఇతరుల నుండి పొంది కూడా అది నీ సొంతమే అన్నట్టు గొప్పలు చెప్పుకోవడమెందుకు? 8 ఇప్పటికే మీకు అవసరమైనవన్నీ మీరు సంపాదించుకున్నారంటనే! ఇప్పటికే ధనవంతులయ్యారంటనే! మా ప్రమేయం లేకుండానే మీరు రాజులైపోయారంటనే! అయినా, మీరు రాజులు కావడం మంచిదేగా, మేము కూడా మీతో కలిసి ఏలవచ్చు!
-
5 హృదయంలో గర్వం ఉన్నవాళ్ళు యెహోవాకు అసహ్యం. తప్పనిసరిగా వాళ్లు శిక్ష పొందుతారు.
-
1 సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. 2 ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.
3 ఏ గొప్పతనం లేనివాడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటుంటే తనను తానే మోసపరచుకుంటున్నాడు. 4 ప్రతివాడూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది.
-
10 యెహోవా నామం బలమైన దుర్గం. నీతిపరుడు అందులో తలదాచుకుని సురక్షితంగా ఉంటాడు.
11 ధనవంతుడి ఆస్తి అతనికి దిట్టమైన కోట. అది పటిష్టమైన ప్రాకారం అని అతని భ్రమ.
12 విపత్తుకు ముందు మనిషి హృదయం అహంకార పూరితంగా ఉంటుంది. వినయం వల్ల గౌరవం కలుగుతుంది.
-
16 ఒకరిపట్ల ఒకరు ఏక మనసు కలిగి ఉండండి. గొప్పవాటి గురించి ఆలోచించవద్దు. దీనులతో సహవాసం చెయ్యండి. మిమ్మల్ని మీరు తెలివైన వారని అనుకోవద్దు.
-
3 ఎవరైనా మన ప్రభువైన యేసు క్రీస్తు ఆరోగ్యకరమైన ఉపదేశానికీ, దైవభక్తికి అనుగుణమైన బోధకూ సమ్మతించకుండా, దానికి భిన్నంగా బోధిస్తే 4 వాడు గర్విష్టి. వాడికి ఏమీ తెలియదన్నమాట. వాడు తర్కాల్లో వాగ్వాదాల్లో నిమగ్నమై ఉంటాడు. ఫలితంగా అసూయ, కలహం, దూషణలు, అపోహలు కలుగుతాయి. 5 ఇంకా చెడిపోయిన మనసుతో అలాటి వారు సత్యం నుండి తొలగిపోయి దైవభక్తి ధనసంపాదన మార్గం అనుకుంటారు.
-
26 సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా. 27 దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. 28 గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. 29 ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం.
30 అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. 31 “అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు.
-
4 అహంకారం గర్విష్టి హృదయం భక్తిహీనులు వర్ధిల్లడం పాపం.
-
51 ఆయన తన బాహువుతో ప్రతాపం కనపరిచాడు. గర్విష్ఠులను, వారి అంతరంగంలోని ఆలోచనలను బట్టి చెదరగొట్టాడు.
52 బలవంతులను గద్దెల పైనుంచి పడదోసి దీనులను ఎక్కించాడు
-
16 యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు.
17 అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు, 18 దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు, 19 లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.
-
1 ఎఫ్రాయీములో తాగుబోతులకు గర్వకారణంగా ఉన్న పూలమాలకు బాధ. వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యానికి బాధ.
అది ద్రాక్షారసం వశంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు నివసించే పచ్చని లోయ తలపై ఉన్న కిరీటం.
2 వినండి! శక్తిశాలీ, బలశాలీ అయిన ఒకడు ప్రభువుకి ఉన్నాడు. అతడు వడగళ్ళ లాంటి వాడు.
అతడు వినాశనకారి అయిన తుఫాను వంటివాడు. ముంచెత్తే బలమైన జడివాన వంటివాడు. ఆయన తన చేతితో భూమిని కొడతాడు.
3 ఎఫ్రాయీములో తాగుబోతులకు గర్వకారణంగా ఉన్న కిరీటాన్ని కింద పడేసి కాళ్ళతో తొక్కుతారు.
-
1 చివరి దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయని నీవు గ్రహించాలి. 2 మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. వారు గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, కన్నవారికి అవిధేయులు, చేసిన మేలు మరిచేవారు, అపవిత్రులు, 3 బొత్తిగా సహజ ప్రేమ లేనివారు, ఇతరులతో సామరస్యంగా ఉండలేనివారు, దుర్భాషలాడేవారు, నిగ్రహం లేనివారు, క్రూరులు, మంచిని ద్వేషించేవారు. 4 వారు ద్రోహులు, తలబిరుసు మనుషులు, గర్వాంధులు, దేవునికంటే శరీర సౌఖ్యాన్నే ఎక్కువగా ప్రేమించేవారు. 5 వారు పైకి భక్తి గలవారిలా ఉంటారు గానీ దాని శక్తిపై ఆధారపడరు. వారికి దూరంగా ఉండు.
-
33 అది నిర్భయంగా జీవిస్తుంది. భూమి మీద దానికి సమానమైనది లేదు.
34 అది గర్వంగా ఉండే వాటిని తిరస్కారంగా చూస్తుంది. గర్వించే వాటన్నిటికీ అది రాజు.
-
34 ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు.
-
24 అహంకారి, గర్విష్టి-అతనికి అపహాసకుడు అని పేరు. అలాంటివాడు గర్వంతో మిడిసి పడతాడు.
-
12 తానే జ్ఞాని అనుకునే వాణ్ణి చూసావా? వాణ్ణి సరి చేయడం కంటే మూర్ఖుణ్ణి సరి చేయడం తేలిక.
-
5 అలాంటి వ్యక్తి తరపున నేను అతిశయిస్తాను. అయితే నా బలహీనతల విషయంలో తప్ప నా తరపున నేను అతిశయించను. 6 ఒకవేళ అతిశయించాలనుకొన్నా అది తెలివి తక్కువతనమేమీ కాదు. ఎందుకంటే నేను సత్యమే చెబుతున్నాను. కానీ ఎవరైనా నాలో చూసినదాని కంటే, నేను చెప్పింది విన్నదాని కంటే నన్ను ఎక్కువ ఘనంగా ఎంచకుండా ఉండేలా అతిశయించడం మానుకుంటాను.
7 నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత. 8 అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను. 9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.
10 బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.
-
2 స్త్రీ ఆ సర్పంతో “ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు. 3 కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది.
4 పాము స్త్రీతో “మీరు చావనే చావరు. 5 ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు” అన్నాడు. 6 స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.
7 అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు.
-
16 అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సులో గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయడానికి యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు. 17 యాజకుడైన అజర్యా, అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతనివెంట లోపలికి వెళ్ళారు. 18 వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి “ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయడం నీ పని కాదు. ధూపం వేయడానికి ప్రతిష్ఠించిన అహరోను సంతతివారైన యాజకుల పని అది. పరిశుద్ధస్థలంలో నుంచి బయటికి వెళ్ళు. నీవు ద్రోహం చేశావు. దేవుడైన యెహోవా సన్నిధిలో ఇది నీకు ఘనత కలగజేయదు” అని చెప్పారు.
19 ఉజ్జియా రౌద్రుడయ్యాడు. అతడు ధూపం వేయడానికి ధూపకలశం చేత్తో పట్టుకుని ఉన్నాడు. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కనే అతడు ఉన్నప్పుడు యాజకులు చూస్తూ ఉండగానే అతని నుదుటిపై కుష్టురోగం పుట్టింది. 20 ప్రధానయాజకుడైన అజర్యా, అతనితో ఉన్న యాజకులంతా అతని వైపు చూసినప్పుడు అతని నొసట కుష్టు కనిపించింది. కాబట్టి ఆలస్యం చేయకుండా అతడు అక్కడనుంచి బయటికి వెళ్లాలని వారు చెప్పారు. యెహోవా తనను దెబ్బ కొట్టాడని తెలుసుకుని బయటికి వెళ్ళడానికి అతడు కూడా త్వరపడ్డాడు.
21 రాజైన ఉజ్జియా చనిపోయే వరకూ కుష్టురోగిగానే ఉన్నాడు. కుష్టురోగిగా యెహోవా మందిరంలోకి పోకుండా కడగా ఉన్నాడు. కాబట్టి అతడు ప్రత్యేకంగా ఒక ఇంట్లో నివసించేవాడు. అతని కొడుకు యోతాము, రాజ భవనం మీద అధిపతిగా దేశప్రజలకు న్యాయం తీర్చేవాడు.
-
16 కొండ శిఖరాలపై నివసిస్తావు. పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకున్నావు,
నీ భీకరత్వం విషయంలో నీ హృదయంలో గర్వం నిన్ను మోసం చేసింది.
గద్దలాగా ఉన్నత స్థలాల్లో గూడు కట్టుకుని ఉన్నావు.
అయినా నిన్ను అక్కడనుండి కిందకు లాగి పడవేస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
-
14 “లవొదికయలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.
ఆమేన్ అనే పేరున్న వాడూ నమ్మకమైన సత్యసాక్షీ దేవుని సృష్టికి మూలం అయిన వాడూ చేసే ప్రకటన ఏమిటంటే, 15 నీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వేడిగా కూడా లేవు. నువ్వు చల్లగానో, వేడిగానో ఉంటే మంచిది. 16 నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉండకుండాా గోరువెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మిలా ఊసేద్దామనుకుంటున్నాను. 17 ‘నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది, నాకే లోటూ లేదు’ అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే నీవొక నిర్భాగ్యుడివి, దీనావస్థలో ఉన్నావు, దరిద్రుడివి, గుడ్డివాడివి. బట్టలు లేవు.
18 నా సలహా విను, నీకు సంపద పెరగడం కోసం కొలిమిలో కరగబెట్టిన బంగారాన్నీ, నీ నగ్నత్వం కనిపించి నీ సిగ్గు పోకుండా ధరించడానికి తెల్లని వస్త్రాలనూ, నీవు చూడగలిగేలా కళ్ళకు మందు నా దగ్గర కొనుక్కో. 19 నేను ప్రేమించేవారిని మందలిస్తాను. శిక్షిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు.
-
5 తమ పొరుగువాణ్ణి చాటుగా ఎగతాళి చేసే వాళ్ళను నేను హతం చేస్తాను. అహంకారంతో ప్రవర్తించే వాళ్ళను, గర్విష్టులను నేను దూరంగా ఉంచుతాను.
-
11 చెడుతనాన్ని బట్టి ఈ లోకాన్నీ, తమ దోషాన్ని బట్టి దుష్టులనూ శిక్షిస్తాను. గర్విష్టుల అహంకారం అంతమొందిస్తాను. క్రూరుల అహంకారం అణిచివేస్తాను.
-
6 మోయాబు గర్వం గురించి మేము విన్నాం. అతని అహంకారం, అతని ప్రగల్భాలు, అతని క్రోధం గురించి విన్నాం. కానీ అతని ప్రగల్భాలు వట్టివి.
-
28 వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.
30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, 31 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. 32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.
-
11 ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిర్లక్ష్యం చేసి మీ దేవుడైన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త పడండి. 12 మీరు కడుపారా తిని, మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తారు. 13 మీ పశువులు, గొర్రెలు, మేకలు వృద్ధి చెంది, మీ వెండి బంగారాలు విస్తరించి, మీకు కలిగినదంతా వర్ధిల్లుతుంది.
14 అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో.
-
9 ఆమె గర్వాన్నీ, ఘనతా ప్రాభవాలనూ అగౌరవ పరచడానికీ,
భూమి మీద ఘనత పొందిన ఆమె పౌరులను అవమాన పరచడానికీ సేనల ప్రభువైన యెహోవా సంకల్పించాడు.
-
5 కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి. 6 వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి వస్తుంది.
7 గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు. 8 కానీ ఇప్పుడు మీరు తీవ్ర కోపం, ఆగ్రహం, దుర్మార్గపు ఉద్దేశాలు, నిందా వాక్కులు, మీ నోటి నుండి అవమానకరమైన మాటలు, బూతులు అన్నీ వదిలి పెట్టాలి. 9 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. 10 ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు.
11 ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి పొందిన వాడనీ సున్నతి పొందని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ లేదు. క్రీస్తే సమస్తం, సమస్తంలో ఆయనే ఉన్నాడు.
12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.
-
3 యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది.
మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే.
కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు.
అహంకారమైన మాటలు మీ నోట నుంచి రానియ్యవద్దు.
-
4 మనిషి ఆత్మ తనలో తాను ఉప్పొంగుతుంది. అది యథార్థంగా ఉండదు.
అయితే నీతిమంతుడు తన విశ్వాసమూలంగా బ్రదుకుతాడు.
5 ద్రాక్షారసం గర్విష్టి యువకుణ్ణి మోసం చేసి నిలవననీయకుండా చేస్తుంది.
అతని ఆశలను పాతాళమంతగా విస్తరింప జేస్తుంది. మరణం లాగా అది తృప్తినొందదు.
అతడు సకలజనాలను వశపరచుకుంటాడు. ప్రజలందరినీ తన కోసం సమకూర్చుకుంటాడు.
-
6 కాబట్టి గర్వం వారి మెడ చుట్టూ కంఠహారం లాగా ఉంది. దుర్మార్గతను వారు వస్త్రంలాగా ధరిస్తారు.
-
25 దురాశ గలవాడు కలహం రేపుతాడు. యెహోవా పట్ల నమ్మకం పెట్టుకునే వాడు వర్ధిల్లుతాడు.
-
9 హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు?
-
28 పైన చెప్పిన విషయాలన్నీ రాజైన నెబుకద్నెజరుకు సంభవించాయి. 29 ఒక సంవత్సర కాలం గడచిన తరువాత అతడు తన రాజధాని పట్టణం బబులోనులోని ఒక నగరంలో సంచరించాడు. 30 అతడు దాన్ని చూస్తూ. “ఈ బబులోను నగరం మహా విశాలమైన పట్టణం. నా బలాన్ని, నా అధికారాన్ని, నా ప్రభావ ఘనతలను చూపించుకోవడానికి దీన్ని నా రాజధాని నగరంగా కట్టించుకున్నాను” అని తనలో తాను అనుకున్నాడు.
31 ఈ మాటలు రాజు నోట్లో ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం “రాజువైన నెబుకద్నెజర్, ఈ ప్రకటన నీ కోసమే. నీ రాజ్యం నీ దగ్గర నుండి తొలగిపోయింది. 32 రాజ్యంలోని ప్రజలు తమ దగ్గర నుండి నిన్ను తరుముతారు. నువ్వు అడవిలో జంతువుల మధ్య నివాసం చేస్తావు. పశువులాగా గడ్డి మేస్తావు. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాలపై అధికారిగా ఉండి, ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వాళ్లకు అనుగ్రహిస్తాడు అని నువ్వు తెలుసుకునే వరకూ ఏడు కాలాలపాటు నీ పట్ల ఇలా జరుగుతుంది” అని వినిపించింది.
33 ఆ క్షణంలోనే ఆ మాట నెబుకద్నెజరు విషయంలో నెరవేరింది. ప్రజల్లో నుండి అతడు తరిమివేయబడ్డాడు. అతడు పశువుల వలె గడ్డిమేశాడు. ఆకాశం నుండి కురిసే మంచు అతని శరీరాన్ని తడిపింది. అతని తల వెంట్రుకలు గరుడ పక్షి రెక్కల ఈకలంత పొడవుగా, అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివిగా పెరిగాయి. 34 ఆ రోజులు ముగిసిన తరువాత నెబుకద్నెజరు అనే నాకు తిరిగి మానవ బుద్ధి వచ్చింది. నా కళ్ళు ఆకాశం వైపు ఎత్తి, సర్వోన్నతుడు దేవుడు, శాశ్వత కాలం ఉండే దేవునికి స్తోత్రాలు చెల్లించి కీర్తించాను. ఆయన అధికారం కలకాలం నిలుస్తుంది. ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది.
-
11 ఆ దినాన నీ గర్వాన్ని బట్టి సంతోషించే వారిని నీలో నుండి నేను వెళ్లగొడతాను.
కాబట్టి నా పరిశుద్ధమైన కొండ దగ్గర నీవిక అహంకారం చూపించవు.
నా మీద తిరగబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు.
-
12 తనను తాను గొప్ప చేసికొనేవాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.
-
4 అలగాజనం వేసే నిందలతో, గర్విష్ఠుల తిరస్కారాలతో మేము నిండిపోయాము.
-
6 యెహోవా మహా ఘనుడైనప్పటికీ ఆయన దీనులను పట్టించుకుంటాడు. గర్విష్ఠుల కదలికలు ఆయన దూరం నుండే పసికడతాడు.
-
49 “చూడు! నీ చెల్లెలు సొదొమ పాపం ఏమంటే, అది తనకు కలిగిన కులాసాను బట్టి అహంకారం చూపింది. దేని గురించీ దానికి దిగులు లేదు, దేన్నీ లక్ష్య పెట్టదు. పేదల చేతులు దాని వైపుకు, దాని కూతుళ్ళ వైపుకు చాచి ఉన్నాయి గానీ అది ఎవరికీ సాయం చెయ్యలేదు. 50 వాళ్ళు అహంకారంతో నా దృష్టిలో అసహ్యమైన క్రియలు చేశారు గనుక నేను దాన్ని చూసి వాళ్ళను వెళ్ళగొట్టాను.
-
17 అయితే, “అతిశయించేవాడు ప్రభువులోనే అతిశయించాలి.” 18 ప్రభువు మెచ్చుకొనే వాడే యోగ్యుడు గానీ తనను తానే మెచ్చుకొనేవాడు యోగ్యుడు కాడు.
-
7 ఆమె తనను తాను హెచ్చించుకుంది. విలాస భోగాల్లో జీవించింది.
అంతే మొత్తంలో ఆమెకు హింసనూ, వేదననూ కలగజేయండి.
ఎందుకంటే ఆమె తన మనసులో, “నేను రాణిగా కూర్చుండేదాన్ని, విధవను కాను.
సంతాపం చూడనే చూడను” అనుకుంది.
8 కాబట్టి ఆమెకి కీడులన్నీ ఒక్క రోజే కలుగుతాయి. మరణమూ, దుఖమూ, కరువూ వస్తాయి.
దేవుడైన ప్రభువు మహా శక్తిశాలి. ఆమెకు తీర్పు చెప్పేది ఆయనే. ఆమె అగ్నికి ఆహుతైపోతుంది.”
-
12 వారి పెదాల మాటలను బట్టి, వారి నోటి పాపాన్ని బట్టి, వారు పలికిన శాపాలను బట్టి, అబద్ధాలను బట్టి వారు తమ గర్వంలో చిక్కుకునేలా చెయ్యి.
-
23 యెహోవా చెప్పేదేమంటే “తెలివైనవాడు తన తెలివిని బట్టీ బలవంతుడు తన బలాన్ని బట్టీ గర్వించకూడదు. అలాగే ధనవంతుడు తన ఆస్తిని బట్టి గర్వించకూడదు.
24 దేనిలో అతిశయించాలంటే, ఈ భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడంలోనే అతిశయించాలి.
అలాటి వాటిలోనే నేను ఆనందిస్తాను.”
-
12 కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో, అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి.
-
9 దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి సంతోషించాలి. 10 ధనవంతుడైన సోదరుడు, తాను కూడా గడ్డి పువ్వులా రాలిపోతానని తెలిసి, తన దీనస్థితిని బట్టి సంతోషించాలి.
11 సూర్యుడు ఉదయించిన తరువాత మండే ఎండకు మొక్క ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది. దాని అందం అంతా పోతుంది. అదేవిధంగా ధనవంతులు కూడా తమ కార్యకలాపాల్లో ఉండగానే వాడిపోతారు.
-
2 మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో మిమ్మల్ని పరీక్షించి మీ హృదయాన్ని తెలుసుకోడానికీ, మిమ్మల్ని లోబరచుకోడానికీ మీ యెహోవా దేవుడు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి.
3 రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.
4 ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడిపోలేదు, మీ కాళ్ళు బరువెక్కలేదు.
-
13 వర్తమానికులు వచ్చారన్న మాట హిజ్కియా విని వాళ్ళను లోపలికి రప్పించి, తన రాజనగరంలోనూ, రాజ్యంలోనూ ఉన్న అన్ని వస్తువుల్లో, దేనినీ దాచకుండా, తన వస్తువులు ఉన్న కొట్టూ, వెండి బంగారాలూ, సుగంధ ద్రవ్యాలూ, సువాసన తైలం, ఆయుధశాల, తన వస్తువుల్లో ఉన్నవన్నీ వాళ్లకు చూపించాడు.
-
23 యెహోవా భక్తులంతా ఆయన్ని ప్రేమించండి. యెహోవా తనను నమ్మిన వారిని కాపాడతాడు. కానీ గర్విష్టుల విషయంలో ఆయన సంపూర్ణమైన ప్రతీకారం జరిగిస్తాడు.
-
దావీదు రాసిన యాత్రల కీర్తన
1 యెహోవా, నా హృదయంలో అహంకారం లేదు. నా కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించడం లేదు. నాకు మించిన విషయాల జోలికి నేను వెళ్ళడం లేదు.
-
9 నిన్ను చంపేవాళ్ళ ఎదుట, ‘నేను దేవుణ్ణి’ అంటావా? నువ్వు మనిషివే గానీ దేవుడివి కాదు గదా! నిన్ను పొడిచేవాళ్ళ చేతుల్లో నువ్వు ఉంటావు. 10 నువ్వు విదేశీయుల చేతుల్లో సున్నతిలేని వాళ్ళ చావు చస్తావు. ఈ విషయం చెప్పింది నేనే. ఇదే యెహోవా ప్రభువు సందేశం.”
-
1 “మనుషులకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ప్రతిఫలమూ రాదు. 2 కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో, వీధుల్లో అలా చేస్తారు. వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని కచ్చితంగా చెబుతున్నాను.
3 నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనీయవద్దు. 4 అప్పుడే నీ దానం గుప్తంగా ఉంటుంది. ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.
-
14 అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయంలో తప్ప మరి దేనిలోనూ గొప్పలు చెప్పుకోవడం నాకు దూరమవుతుంది గాక. ఆయన ద్వారా లోకానికి నేనూ, నాకు లోకం సిలువ మరణం చెందాను.
-
27 బాధపడే వాళ్ళను నువ్వు రక్షిస్తావు. కాని, గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళను కిందకు అణిచి వేస్తావు!
-
5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.
6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.
7 నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.
8 అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి.
-
1 సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు. “నియమిత దినం రాబోతుంది. అది కాలుతూ ఉన్న కొలిమిలాగా ఉంటుంది. గర్విష్ఠులంతా, దుర్మార్గులంతా ఎండుగడ్డిలాగా ఉంటారు. వారిలో ఒక్కరికి కూడా వేరు గానీ, చిగురు గానీ ఉండదు. రాబోయే ఆ దినాన అందరూ తగలబడి పోతారు.
-
3 “ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే.
-
5 నేను ద్రాక్ష తీగ, మీరు కొమ్మలు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు.
-
11 నీ ఆగ్రహాన్ని నలుదెసలా విసిరి వెయ్యి. గర్విష్టులందరినీ చూసి వారిని కూలగొట్టు.
12 గర్విష్టులైన వారిని చూసి వారిని అణగదొక్కు. దుష్టులు ఎక్కడుంటే అక్కడ వారిని అణిచి వెయ్యి.
-
25 అప్పుడు శుద్ధి ఆచారాల గురించి యోహాను శిష్యులకీ ఒక యూదుడికీ వివాదం పుట్టింది. 26 వారు యోహాను దగ్గరికి వచ్చారు. “బోధకా, యొర్దాను నది అవతల నీతో ఒక వ్యక్తి ఉన్నాడే, ఆయన గురించి నువ్వు సాక్ష్యం కూడా చెప్పావు. చూడు, ప్రస్తుతం ఆయన కూడా బాప్తిసం ఇస్తున్నాడు. అందరూ ఆయన దగ్గరకే వెళ్తున్నారు” అని చెప్పారు. 27 అందుకు యోహాను ఇలా అన్నాడు, “పరలోకం నుండి ఇస్తేనే గానీ ఎవరూ ఏదీ పొందలేరు.
28 నేను క్రీస్తును కాననీ ఆయన కంటే ముందుగా నన్ను పంపడం జరిగిందనీ నేను చెప్పాను. దానికి మీరే సాక్షులు. 29 పెళ్ళి కొడుక్కే పెళ్ళి కూతురు ఉంటుంది. అయితే పెళ్ళి కొడుకు స్నేహితుడు నిలబడి పెళ్ళికొడుకు స్వరం వింటూ ఎంతో సంతోషిస్తాడు. అందుకే నా సంతోషం సంపూర్ణం అయింది. 30 ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి.”
-
18 ఎవరూ తనను తాను మోసగించుకోవద్దు. మీలో ఎవరైనా ఈ లోకరీతిగా తాను జ్ఞానం గలవాడిని అనుకుంటే, జ్ఞానం పొందడం కోసం అతడు తెలివి తక్కువవాడు కావాలి. 19 ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి తెలివి తక్కువతనమే. “జ్ఞానులను వారి కుయుక్తుల్లోనే ఆయన పట్టుకుంటాడు” అనీ, 20 “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు” అనీ రాసి ఉంది కదా.
21 కాబట్టి మనుషులను బట్టి ఎవరూ అతిశయించ కూడదు. ఎందుకంటే అన్నీ మీవే. 22 పౌలైనా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, అన్నీ మీవే. 23 మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవాడు.
-
8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.
-
1-3 కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. 4 ఏ విధంగా మీ పిలుపుకు సంబంధించిన నిశ్చయతతో ఉన్నారో ఆ విధంగా శరీరం ఒక్కటే, ఆత్మా ఒక్కడే. 5 ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. 6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికంటే పైనా, అందరి ద్వారా అందరిలో ఉన్నాడు.
-
3 ఏ విధంగానూ ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మొదట అనేకమంది దేవునిపై తిరుగుబాటు చెయ్యాలి. వారు దేవునికి వ్యతిరేకంగా ఘోర పాపం జరిగించే ఒకణ్ణి అంగీకరించి వాడికి లోబడతారు. వీడే నాశన పుత్రుడు. వీడు బయట పడేంతవరకూ ఆ రోజు రాదు. 4 వీడు దేవుడు అనబడే ప్రతి దానినీ, లేక పూజలందుకునే ప్రతి దానినీ ధిక్కరిస్తాడు. దానంతటికీ పైగా తనను హెచ్చించుకుంటాడు. తానే దేవుడినని చూపించుకుంటూ దేవుని ఆలయంలో తిష్ట వేస్తాడు.
-
13 “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట. 14 రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.
15 కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి. 16 ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది. 17 మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.
Shows Read in context, Share and Copy.