32 Bible Verses About Fasting

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Fasting
  1. 16 మీరు ఉపవాసం చేసేటప్పుడు దొంగ భక్తుల్లాగా మీ ముఖాలు నీరసంగా పెట్టుకోవద్దు. తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖాలను వికారం చేసుకుంటారు. వారు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను. 17 నువ్వు ఉపవాసం ఉన్నపుడు ఉపవాసమున్నట్టు మనుషులకి కనబడాలని కాకుండా, ఏకాంతంలో ఉన్న తండ్రికే కనబడాలని, తలకు నూనె రాసుకుని ముఖం కడుక్కో. 18 అప్పుడు ప్రజలకు కాక, రహస్యంలో ఉన్న నీ తండ్రికే కనబడతావు. అప్పుడు రహస్యంలో చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.

  2. 1 అంతియొకయలోని క్రైస్తవ సంఘంలో బర్నబా, నీగెరు అనే సుమెయోను, కురేనీ వాడైన లూకియ, రాష్ట్రపాలకుడు హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు అనే ప్రవక్తలూ బోధకులూ ఉన్నారు.

    2 వారు ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం ఉన్నపుడు, పరిశుద్ధాత్మ, “నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కోసం వారిని నాకు కేటాయించండి” అని వారితో చెప్పాడు. 3 విశ్వాసులు ఉపవాసముండి, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిన తరువాత వారిని పంపించారు.

    4 కాబట్టి బర్నబా, సౌలు పరిశుద్ధాత్మ పంపగా బయలుదేరి సెలూకియ వచ్చి అక్కడ నుండి సముద్ర మార్గంలో సైప్రస్ ద్వీపానికి వెళ్ళారు.

  3. 3 “మేమెందుకు ఉపవాసమున్నాం? నువ్వెందుకు చూడవు? మమ్మల్ని మేము ఎందుకు తగ్గించుకున్నాం? నువ్వు గమనించలేదు” అని వాళ్ళు అంటారు.

    మీ ఉపవాస దినాన మీరు మీకిష్టం వచ్చినట్టు చేస్తూ మీ పనివాళ్ళను కఠినంగా చూస్తారు.

    4 మీరు ఉపవాసమున్నప్పుడు పోట్లాడుకుంటారు. మీ పిడికిళ్ళతో కొట్టుకుంటారు.

    మీరు ఈ రోజుల్లో ఉపవాసముండేది మీ స్వరం పైన వినబడాలని కాదు.

    5 నేను కోరేది అలాంటి ఉపవాసమా? ప్రతివాడు తనను తాను అణుచుకుంటే సరిపోతుందా?

    ఒకడు రెల్లులాగా తలవంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పరచుకుని కూర్చోవడం ఉపవాసమా? అలాంటి ఉపవాసం యెహోవాకు ఇష్టమని మీరనుకుంటారా?

    6 నేను ఆమోదించే ఉపవాసం ఏదంటే,

    దుర్మార్గపు బంధకాలను విప్పడం, కాడిమాను మోకులు తీసేయడం,

    అణగారిన వారిని విడిపించడం, ప్రతి కాడినీ విరగగొట్టడం.

    7 ఆకలితో అలమటించే వాళ్లతో నీ ఆహారం పంచుకోవడం, ఇల్లు లేకుండా తిరిగే పేదవారిని నీ ఇంట్లోకి చేర్చుకోవడం.

    దిగంబరిగా నీకెవరైనా కనిపిస్తే, వాడికి బట్టలు ఇవ్వు. నీ సొంత బంధువులకు నీ ముఖం చాటేయవద్దు.

    8 అప్పుడు నీ వెలుగు, ఉదయకాంతిలాగా ఉదయిస్తుంది. నీ ఆరోగ్యం నీకు త్వరగా లభిస్తుంది.

    నీ నీతి, నీకు ముందుగా వెళ్తుంది. యెహోవా మహిమ నీ వెనుక కావలి కాస్తుంది.

    9 అప్పుడు నువ్వు పిలిస్తే యెహోవా జవాబిస్తాడు. సహాయం కోసం నువ్వు మొర్ర పెడితే “ఇదిగో ఇక్కడే ఉన్నాను” అంటాడు.

    ఇతరులను అణిచివేయడం, వేలుపెట్టి చూపిస్తూ నిందించడం, మోసంగా మాట్లాడడం నువ్వు మానుకుంటే,

    10 ఆకలితో అలమటించే వారికి నీకున్న దానిలోనుంచి ఇచ్చి, బాధితుల అవసరాలను తీర్చి వాళ్ళను తృప్తి పరిస్తే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది. నీ చీకటి నీకు మధ్యాహ్నం లాగా ఉంటుంది.

    11 అప్పుడు యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూ ఉంటాడు. ఎండిపోయిన నీ ఆత్మను తృప్తిపరుస్తాడు.

    నీ ఎముకలను బలపరుస్తాడు. నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉంటావు.

    ఎన్నడూ ఆగని నీటి ఊటలాగా ఉంటావు.

    12 పురాతన శిథిలాలను నీ ప్రజలు మళ్ళీ కడతారు. అనేక తరాల నుంచి పాడుగా ఉన్న పునాదులను నువ్వు మళ్ళీ వేస్తావు. నిన్ను “గోడ బాగుచేసేవాడు, నివాసాల కోసం వీధులు మరమ్మత్తు చేసేవాడు” అంటారు.

  4. 21 అప్పుడు దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుని మాకూ, మా సంతానానికి, మా ఆస్తిపాస్తులకు క్షేమకరమైన ప్రయాణం జరిగేలా దేవుణ్ణి వేడుకోవడానికి అహవా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించాలని ప్రకటించాను. 22 ఆయన్ను వేడుకునే వారికి క్షేమం కలిగించడానికి మన దేవుని హస్తం కాపుదలగా ఉంటుంది గానీ, ఆయనను తిరస్కరించే వారి పైకి ఆయన తీవ్రమైన కోపం రగులుకొంటుందని మేము రాజుతో చెప్పాం. అందువల్ల దారి మధ్యలో శత్రువుల బారి నుండి మమ్మల్ని కాపాడడానికి సైనికులను, గుర్రపు రౌతులను సహాయంగా పంపమని రాజును అడిగేందుకు నాకు సిగ్గు అనిపించింది.

    23 ఈ విషయాన్ని బట్టి మేము ఉపవాసం ఉండి దేవుని వేడుకొన్నప్పుడు ఆయన మా విన్నపం ఆలకించాడు.

  5. 9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10 “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11 పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.

    14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.

  6. 14 అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పరిసయ్యులూ మేమూ తరచుగా ఉపవాసం ఉంటాము గానీ నీ శిష్యులు ఉపవాసం ఉండరెందుకు?” అని ఆయనను అడిగారు. 15 యేసు వారికిలా జవాబిచ్చాడు. “పెళ్ళికొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్ళి వారు విచారంగా ఉంటారా? అయితే పెళ్ళికొడుకును వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి. అప్పుడు వారు ఉపవాసం ఉంటారు.

    16 “ఎవడూ పాత బట్టకు కొత్త బట్ట అతుకు వేయడు. వేస్తే ఆ అతుకు బట్టను చింపేస్తుంది. ఆ చినుగు మరింత పెద్దదవుతుంది. 17 పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయరు. పోస్తే ఆ తిత్తులు పిగిలిపోయి, ద్రాక్షారసం కారిపోతుంది. తిత్తులు పాడైపోతాయి. అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోస్తారు. అప్పుడు ఆ రెండూ చెడిపోవు.”

  7. 13 అయితే వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె గుడ్డ ధరించాను. నా తల వాల్చి వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నాను.

    14 అతడు నాకు సోదరుడైనట్టుగా వేదన పడ్డాను. నా తల్లి కోసం అయినట్టుగా కుంగిపోయాను.

  8. 12 యెహోవా ఇలా అంటున్నాడు,

    “ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ

    హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.”

    13 మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు.

    త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు.

    శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు.

    కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక

    మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి.

    14 ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో.

    మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని,

    పానార్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో ఎవరికి తెలుసు?

    15 సీయోనులో బాకా ఊదండి.

    ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి.

    16 ప్రజలను సమకూర్చండి.

    సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి.

    పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి.

    పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి,

    పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి.

  9. 1 అప్పుడు అపవాది వల్ల యేసును విషమ పరీక్షలకు గురి చేయడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. 2 నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది. 3 శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు” అన్నాడు. 4 అందుకు ఆయన “మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు, అని రాసి ఉంది” అన్నాడు.

  10. 1 మాదీయుడైన అహష్వేరోషు కుమారుడు దర్యావేషు కల్దీయులపై రాజయ్యాడు. 2 అతని పరిపాలనలో మొదటి సంవత్సరం దానియేలు అనే నేను యెహోవా తన ప్రవక్త అయిన యిర్మీయాకు ఇచ్చిన వాక్కు రాసి ఉన్న గ్రంథాలు చదువుతున్నాను. యెరూషలేము విడిచిపెట్టబడిన స్థితిలో ఉండవలసిన 70 సంవత్సరాలు పూర్తి కావచ్చాయని గ్రహించాను.

    3 అప్పుడు నేను గోనెపట్ట కట్టుకుని, ఉపవాసముండి, ధూళిలో కూర్చుని ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ప్రభువైన దేవుని వైపుకు నా ముఖం తిప్పుకున్నాను.

    4 నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి మా పాపాలు ఒప్పుకున్నాను. “ప్రభూ, మహాత్మ్యం, మహా శక్తి గల దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి పట్ల నీ నిబంధనను నీ కృపను నీవు జ్ఞాపకం చేసుకుంటావు. 5 మేము పాపం, అతిక్రమం చేశాము. నీ ఆజ్ఞల నుండి, విధుల నుండి తప్పి పోయి, తిరుగుబాటు చేశాము. 6 నీ దాసులైన ప్రవక్తలు నీ నామాన్ని బట్టి మా రాజులకు, మా అధిపతులకు, మా పూర్వికులకు, యూదయ దేశప్రజలందరికి చెప్పిన మాటలు మేము వినలేదు.

  11. 1 పారసీకరాజు కోరెషు పరిపాలన కాలంలో మూడవ సంవత్సరంలో బెల్తెషాజరు అనే దానియేలుకు ఒక సంగతి వెల్లడి అయింది. గొప్ప యుద్ధం జరుగుతుంది అనే ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించాడు. అది ఆ దర్శనం వలన అతనికి తెలిసింది.

    2 ఆ రోజుల్లో దానియేలు అనే నేను మూడు వారాలు దుఃఖంలో మునిగి పోయాను. 3 మూడు వారాలు గడిచే దాకా నేను సంతోషంగా భోజనం చేయలేకపోయాను. మాంసం తినలేదు. ద్రాక్షారసం తాగ లేదు. స్నానం, నూనె రాసుకోవడం చేయలేదు. 4 మొదటి నెల ఇరవై నాలుగవ తేది నేను హిద్దెకెలు అనే మహా నది తీరాన ఉన్నాను.

    5 నేను కళ్ళెత్తి చూడగా, నారబట్టలు ధరించుకున్న ఒకడు కనిపించాడు. అతడు నడుముకు మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు. 6 అతని శరీరం కెంపు వర్ణంలో ఉంది. అతని ముఖం మెరుపులాగా ఉంది. అతని కళ్ళు జ్వాలామయమైన దీపాలు, అతని భుజాలు, పాదాలు తళతళలాడే ఇత్తడిలాగా ఉన్నాయి. అతని మాటల ధ్వని గొప్ప జనఘోష లాగా ఉంది.

  12. 36 దేవుని మూలంగా పలికే అన్నా అనే ఆమె కూడా అక్కడ ఉంది. ఆమెది ఆషేరు గోత్రం, ఆమె పనూయేలు కుమార్తె. ఆమె పెళ్ళయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వృద్ధాప్యంలో, 37 ఎనభై నాలుగేళ్ళ వయసు వరకూ వితంతువుగా ఉండిపోయింది. ఆమె దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేది. 38 ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, యెరూషలేము విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ బిడ్డను గురించి మాట్లాడుతూ ఉంది.

  13. 21 వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి చాలా మందిని శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకూ ఈకొనియకూ అంతియొకయకూ తిరిగి వచ్చారు. 22 శిష్యుల మనసులను దృఢపరచి, విశ్వాసంలో నిలకడగా ఉండాలనీ, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక హింసలు పొందాలనీ వారిని ప్రోత్సహించారు.

    23 ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి, వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు.

  14. 33 వారాయనతో, “యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు. పరిసయ్యుల శిష్యులు కూడా అలాగే చేస్తారు. కానీ నీ శిష్యులు తిని తాగుతూ ఉన్నారు” అని అన్నారు. 34 అందుకు యేసు, “పెళ్ళి కొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్ళి ఇంట్లో ఉన్న వారితో మీరు ఉపవాసం చేయించగలరా? 35 పెళ్ళి కొడుకును వారి దగ్గర నుండి తీసుకు పోయే రోజులు వస్తాయి. ఆ రోజుల్లో వారు ఉపవాసం చేస్తారు” అని వారితో చెప్పాడు.

    36 ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు, “ఎవరూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయరు. ఒక వేళ అలా చేస్తే కొత్త బట్ట చింపవలసి వస్తుంది. కొత్తదానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలవదు. 37 ఎవడూ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయడు. పోస్తే కొత్త ద్రాక్షారసం వలన ఆ తిత్తులు చినిగిపోతాయి. రసం కారిపోతుంది. తిత్తులు పాడవుతాయి. 38 అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోయాలి.

  15. 1 అదే నెల 24 వ తేదీన ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకుని తలల మీద దుమ్ము పోసుకుని సమావేశమయ్యారు. 2 ఇశ్రాయేలీయులు వేరే జాతి ప్రజల్లో నుండి వేరైపోయి నిలబడి, తమ పాపాలు, తమ పూర్వీకుల పాపాలు ఒప్పుకున్నారు. 3 వారు ఒక పూటంతా అక్కడే నిలబడి దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చదివించుకున్నారు. మరో పూట తమ పాపాలు ఒప్పుకొంటూ దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లిస్తూ వచ్చారు.

  16. 28 మోషే నలభై రాత్రింబగళ్ళు యెహోవా దగ్గరే ఉండిపోయాడు. అతడు భోజనం చెయ్యలేదు, నీళ్ళు తాగలేదు. ఆ సమయంలో దేవుడు చెప్పిన శాసనాలను, అంటే పది ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాడు. 29 మోషే సీనాయి కొండ దిగే సమయానికి ఆజ్ఞలు రాసి ఉన్న ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉన్నాయి. అతడు ఆయనతో మాట్లాడుతున్న సమయంలో అతని ముఖం వెలుగుతో ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలేదు. అతడు కొండ దిగి వచ్చాడు.

  17. 11 దావీదు ఆ వార్త విని తన బట్టలు చింపుకున్నాడు. అతని దగ్గర ఉన్నవారంతా అలాగే చేసి, 12 సౌలూ, యోనాతానూ యెహోవా ప్రజలూ ఇశ్రాయేలు వంశీకులూ యుద్ధంలో చనిపోయారని వారిని గూర్చి దుఃఖపడుతూ, ప్రలాపిస్తూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉన్నారు.

  18. 4 భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు. 5 ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి.

  19. 16 వాణ్ణి నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాను గాని వారు బాగుచేయలేక పోయారు” అని చెప్పాడు. 17 అందుకు యేసు, “వక్ర మార్గం పట్టిన విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎప్పటి వరకూ మిమ్మల్ని సహిస్తాను? అతణ్ణి నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు. 18 యేసు ఆ దయ్యాన్ని గద్దించగానే అది ఆ బాలుణ్ణి విడిచిపెట్టేసింది. వెంటనే అతడు బాగుపడ్డాడు.

    19 తరువాత శిష్యులు ఏకాంతంగా యేసును కలిసి, “మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేక పోయాం?” అని అడిగారు. 20 అందుకాయన, “మీ అల్పవిశ్వాసమే దానికి కారణం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్ళిపోతుంది అని మీతో కచ్చితంగా చెబుతున్నాను. 21 మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు” అని వారితో చెప్పాడు.

  20. 5 నీనెవె పట్టణం వాళ్ళు దేవునిలో విశ్వాసం ఉంచి ఉపవాసం ప్రకటించారు. గొప్పవాళ్ళూ, సామాన్యులూ అందరూ గోనె పట్ట కట్టుకున్నారు.

    6 ఆ సంగతి త్వరలోనే నీనెవె రాజుకు చేరింది. అతడు తన సింహాసనం దిగి, తన రాజవస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదెలో కూర్చున్నాడు. 7 అతడు ఇలా ప్రకటన చేయించాడు “రాజూ ఆయన మంత్రులూ ఆజ్ఞాపించేదేమంటే, మనుషులు ఏమీ తినకూడదు. పశువులు మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు.”

    8 “మనుషులు, పశువులు గోనెపట్ట కట్టుకుని దేవునికి బిగ్గరగా మొర్రపెట్టాలి. అందరూ తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టి తాము చేస్తున్న దౌర్జన్యం మానాలి. 9 ఒకవేళ దేవుడు తన మనస్సు మార్చుకుని తన కోపాగ్ని చల్లార్చుకుని మనం నాశనం కాకుండా చేస్తాడేమో ఎవరికి తెలుసు?”

    10 నీనెవె వాళ్ళు తమ చెడు ప్రవర్తన వదిలిపెట్టడం దేవుడు చూసి తన మనస్సు మార్చుకుని వాళ్లకు వేస్తానన్న శిక్ష వెయ్యలేదు.

  21. 4 సేనల ప్రభువు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే,

    5 “దేశప్రజలందరికీ, యాజకులకు నీవీ మాట తెలియజేయాలి.

    జరిగిన ఈ డెబ్భై సంవత్సరాలు ఏటేటా ఐదవ నెలలో ఏడవ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖపడుతూ వచ్చారుగదా?

    నా పట్ల భక్తితోనే ఉపవాసం ఉన్నారా?

    6 మీరు ఆహారం తీసుకున్నప్పుడు స్వప్రయోజనానికే గదా తీసుకున్నారు?

    మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనానికే గదా పానం చేశారు?

  22. 14-15 అయితే నువ్వు చేసిన ఈ పనివల్ల యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నువ్వు ఒక మంచి కారణం చూపించావు. కాబట్టి నీకు పుట్టబోయే పసికందు తప్పకుండా చనిపోతాడు” అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు.

    16 యెహోవా ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డను మొత్తి జబ్బు పడేలా చేశాడు. 17 దావీదు ఉపవాసం ఉండి లోపలికి వెళ్లి బిడ్డ కోసం దేవుణ్ణి బతిమిలాడుతూ రాత్రంతా నేల మీద పడి ఉన్నాడు. ఇంట్లో ప్రముఖులు అతణ్ణి నేలపై నుండి లేపడానికి ప్రయత్నించారు. కానీ దావీదు ఒప్పుకోలేదు, వారితో కలసి భోజనం చేయలేదు.

    18 ఏడవ రోజు బిడ్డ చనిపోయాడు. దావీదు సేవకులు “బిడ్డ బతికి ఉన్నపుడు అతనితో ఏమి చెప్పినా అతడు మన మాట వినలేదు.

  23. 8 అతడు లేచి తిని, తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు.

  24. 2 అంతలో కొంతమంది వచ్చి “మృత సముద్రం అవతల ఉండే అరాము వైపు నుంచి ఒక గొప్ప సైన్యం నీ మీదికి వస్తూ ఉంది. గమనించండి. వారు హససోన్‌ తామారు అనే ఏన్గెదీలో ఉన్నారు” అని యెహోషాపాతుకు తెలియచేశారు.

    3 అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారించడానికి మనస్సు పెట్టి, యూదా అంతటా ఉపవాసం ఆచరించాలని చాటించాడు. 4 యూదావారు యెహోవా సహాయాన్ని అడగడానికి సమావేశమయ్యారు. యెహోవా దగ్గర విచారించడానికి యూదా పట్టణాలన్నిటిలో నుంచి ప్రజలు వచ్చారు.

  25. 11 అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు. “ఈ ప్రజల మేలు కోసం ప్రార్థన చేయవద్దు.

    12 వాళ్ళు ఉపవాసమున్నప్పటికీ నేను వారి మొర వినను. వాళ్ళు దహనబలులూ నైవేద్యాలూ అర్పించినా నేను వాటిని అంగీకరించను. కత్తితో, కరువుతో, అంటువ్యాధులతో వారిని నాశనం చేస్తాను.”

  26. 13 యాజకులారా, గోనెపట్ట కట్టుకుని దుఖించండి!

    బలిపీఠం దగ్గర సేవకులారా, ఏడవండి.

    నా దేవుని సేవకులారా, గోనెసంచి కట్టుకుని రాత్రంతా గడపండి.

    నైవేద్యం, పానార్పణం, మీ దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోయాయి.

    14 ఉపవాస దినం ప్రతిష్ఠించండి. సంఘంగా సమకూడండి.

    యెహోవాను బతిమాలడానికి పెద్దలనూ దేశ నివాసులందరినీ

    మీ దేవుడు యెహోవా మందిరంలో సమకూర్చండి.

  27. 8 సౌలు నేలమీద నుండి లేచి కళ్ళు తెరచినా ఏమీ చూడలేకపోయాడు కాబట్టి వారతని చెయ్యి పట్టుకుని దమస్కులోకి నడిపించారు. 9 అతడు మూడు రోజులు చూపు లేకుండా ఉన్నాడు. ఏమీ తినలేదు, తాగలేదు.

    10 దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడున్నాడు. ప్రభువు దర్శనంలో, “అననీయా!” అని అతనిని పిలిచాడు. 11 అతడు, “చిత్తం” అన్నాడు. అందుకు ప్రభువు, “నువ్వు లేచి, ‘తిన్ననిది’ అనే పేరున్న వీధికి వెళ్ళు. అక్కడ యూదా అనే అతని ఇంట్లో తార్సు ఊరి వాడైన సౌలు అనే మనిషి కోసం అడుగు. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. 12 దర్శనంలో అతడు అననీయ అనే వ్యక్తి లోపలికి వచ్చి అతడు చూపు పొందేలా తల మీద చేతులుంచడం చూశాడు” అని చెప్పాడు.

  28. 30 అందుకు కొర్నేలి, “నాలుగు రోజుల క్రితం ఇదే సమయానికి, మధ్యాహ్నం మూడు గంటలకు నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి ధగధగలాడే బట్టలు ధరించిన ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి 31 ‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. పేదవారికి నీవు చేసిన దానధర్మాలను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు యొప్పేకు మనిషిని పంపి

  29. 18 మీరు యెహోవా దృష్టికి దుర్మార్గం జరిగించి చేసిన మీ పాపాలను బట్టి ఆయనకు కోపం పుట్టించడం వలన, అన్నపానాలు మానివేసి మళ్ళీ నలభై పగళ్లు, నలభై రాత్రులు నేను యెహోవా సన్నిధిలో సాగిలపడి ఉన్నాను.

  30. 33 తెల్లవారుతుండగా పౌలు, “పద్నాలుగు రోజుల నుండి మీరేమీ ఆహారం తీసుకోక పస్తులున్నారు. 34 కాబట్టి ఆహారం పుచ్చుకోమని మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయంగా ఉంటుంది. మీలో ఎవరి తలనుండీ ఒక్క వెంట్రుక కూడా నశించదు” అని చెప్పి ఆహారం తీసుకోమని అందరినీ బతిమాలాడు.

  31. 1 “మనుషులకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ప్రతిఫలమూ రాదు. 2 కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో, వీధుల్లో అలా చేస్తారు. వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని కచ్చితంగా చెబుతున్నాను.

    3 నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనీయవద్దు. 4 అప్పుడే నీ దానం గుప్తంగా ఉంటుంది. ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.

  32. 24 ఉపవాసం మూలాన నా మోకాళ్లు బలహీనమై పోయాయి. నా శరీరం ఎముకల గూడు అయిపోయింది.