90 Bible Verses About Worshiping God

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Worshiping God
  1. 21 “అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో, యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము. 22 మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. 23 నిజమైన ఆరాధికులు తండ్రిని హృదయ పూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వస్తుంది. ఇప్పటికే వచ్చేసింది. తనను ఆరాధించేవారు అలాటివారే కావాలని తండ్రి చూస్తున్నాడు.

    24 దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.”

  2. 1 రండి, యెహోవాకు పాట పాడదాం, మన రక్షణకు ఆధారశిలకు ఆనందంగా పాడదాం.

    2 కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వద్దాం, ఆయనకు స్తుతి గీతాలు పాడదాం.

    3 యెహోవా గొప్ప దేవుడు. దేవుళ్ళందరికీ పైగా ఉన్న గొప్ప రాజు.

    4 భూమి అగాధస్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరాలు ఆయనవే.

    5 సముద్రం ఆయనది. ఆయనే దాన్ని చేశాడు. ఆయన చేతులు పొడి నేలను చేశాయి.

    6 రండి సాగిలపడి ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త యెహోవా ఎదుట మోకరిల్లుదాం.

    7 ఆయన మన దేవుడు. మనం ఆయన పోషించే ప్రజలం. ఆయన చేతికింది గొర్రెలం. ఈ రోజున మీరు ఆయన స్వరం వింటే ఎంత బాగుండు!

  3. 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ.

  4. కృతజ్ఞత కీర్తన.

    1 ప్రపంచ ప్రజలారా, యెహోవాకు సంతోషంతో కేకలు వేయండి.

    2 ఆనందంగా యెహోవాకు సేవ చేయండి, ఆనంద గీతాలు పాడుతూ ఆయన సన్నిధికి రండి.

    3 యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయన మనలను పుట్టించాడు. మనం ఆయన వాళ్ళం. మనం ఆయన ప్రజలం. ఆయన మేపే గొర్రెలం.

    4 కృతజ్ఞతతో ఆయన ద్వారాలగుండా ప్రవేశించండి. స్తుతులతో ఆయన ఆవరణాల్లోకి రండి. ఆయనకు ధన్యవాదాలు చెప్పండి. ఆయన నామాన్ని పొగడండి.

  5. దావీదు కీర్తన.

    1 బలవంతులారా, యెహోవాకు మహిమ, ప్రభావం ఉన్నాయని గుర్తించండి!

    2 యెహోవా నామానికి ఉన్న అర్హతనుబట్టి ఆయనకు మహిమ ఉందని గుర్తించండి. ఆయన మహిమకు తగిన వస్త్రాలు ధరించి ఆయనను ఆరాధించండి.

  6. 8 యెహోవా నామానికి తగిన గొప్పదనం ఆయనకు చెల్లించండి. అర్పణతో ఆయన ఆవరణాల్లోకి రండి.

    9 పవిత్రాలంకారాలతో యెహోవా ఎదుట సాగిలపడి మొక్కండి. ప్రపంచమంతా ఆయన ఎదుట వణకండి.

  7. 8 ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికీ ఆరు రెక్కలున్నాయి. వాటి చుట్టూ, లోపలా, రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలూ రాత్రీ మానకుండా ఈ విధంగా చెబుతున్నాయి, “పూర్వం ఉండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అంతటినీ పరిపాలించే వాడూ, దేవుడూ అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!”

    9 ఆ ప్రాణులు సింహాసనంపై కూర్చుని శాశ్వతంగా జీవిస్తున్న వాడికి ఘనత, కీర్తి, కృతజ్ఞతలూ సమర్పిస్తూ ఉన్నప్పుడు 10 ఆ ఇరవై నలుగురు పెద్దలూ సింహాసనంపై కూర్చున్న వాడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు శాశ్వతంగా జీవిస్తున్న వాడికి మొక్కి, 11 “మా ప్రభూ, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి” అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు.

  8. 14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.

    16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.

    17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.

  9. 28 కాబట్టి మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దేవునికి కృతజ్ఞులమై ఉందాం. దేవునికి అంగీకారమైన విధంగా భక్తితో, విస్మయంతో ఆయనను ఆరాధించుదాం. 29 ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని.

  10. 15 యేసు ద్వారా మనం నిరంతరం దేవునికి స్తుతులు యాగంగా అర్పిస్తూ ఉండాలి. స్తుతులు అంటే మన పెదవుల ద్వారా ఆయన పేరును అంగీకరిస్తూ మనం ఆయనకు అర్పించే ఫలం. 16 ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం.

  11. 5 అప్పుడు లేవీయులైన యేషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నెయా, షేరేబ్యా, హోదీయా, షెబన్యా, పెతహయా, అనే వాళ్ళు నిలబడి “సదాకాలం మీకు దేవుడుగా ఉన్న యెహోవాను స్తుతించండి” అని కేకలు వేసి, ఈ విధంగా స్తుతులు చెల్లించారు. “సకల ఆశీర్వాదాలకు, ఘనతలకు మించిన నీ పవిత్రమైన నామానికి స్తుతులు. 6 ఆకాశ మహాకాశాలను, అందులో ఉండే సైన్యాలను, భూమిని, భూమిపై ఉన్న సమస్తాన్ని, సముద్రాలను, వాటిలో ఉండే వాటిని సృష్టించి వాటినన్నిటినీ కాపాడుతున్న అద్వితీయ దేవుడైన యెహోవావు నువ్వే. ఆకాశ సైన్యమంతా నీకు లోబడుతుంది.

  12. 29 యెహోవా నామానికి తగిన మహిమను ఆయనకు చెల్లించండి.

    నైవేద్యాలు చేత పట్టుకుని ఆయన సన్నిధిలో చేరండి.

    పవిత్రత అనే ఆభరణాలు ధరించుకుని

    ఆయన ముందు సాగిలపడండి.

  13. 17 అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి. 18 మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి. 19 కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి. 20 ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.

    21 క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి.

  14. 9-11 అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా,

    భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా,

    ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా,

    దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి,

    అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.

  15. 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాల్లో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనలను దీవించాడు. 4 క్రీస్తులో మనలను సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనలను ఎన్నుకున్నాడు. 5 యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా స్వీకరించడానికి దేవుడు తన ప్రేమతో ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.

    6 తన దివ్యకృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దాన్ని తన ప్రియ కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు.

  16. 9 ఆ తరువాత సింహాసనం ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా ఒక మహా జనసమూహం నిలబడి ఉండడం నేను చూశాను. వీరిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. వారిలో ప్రతి జాతినుండీ, ప్రతి వంశం నుండీ, ప్రతి గోత్రం నుండీ, భూమి మీద ఉన్న అన్ని భాషల్లో మాట్లాడే వారి నుండీ ప్రజలు ఉన్నారు. వారు తెల్లని బట్టలు ధరించి చేతుల్లో ఖర్జూరం మట్టలు పట్టుకుని ఉన్నారు. 10 వీరంతా కలసి,

    “రక్షణ సింహాసనంపై కూర్చున్న మా దేవునిది, గొర్రెపిల్లది”

    అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు.

    11 దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారంతా సింహాసనం ఎదుట సాష్టాంగపడి తమ ముఖాలు నేలకు ఆనించి,

    12 “ఆమేన్! మా దేవుడికి కీర్తీ, యశస్సూ, జ్ఞానమూ, కృతజ్ఞతలు, ఘనత, శక్తి, మహా బలం కలకాలం కలుగు గాక” అని చెబుతూ దేవుణ్ణి పూజించారు.

  17. 8 యోహాను అనే నేను ఈ సంగతులన్నీ విన్నాను, చూశాను. అలా నేను వింటూ చూస్తూ ఉన్నప్పుడు వాటిని నాకు చూపిస్తున్న దూతను పూజించడానికి అతని ఎదుట సాష్టాంగపడ్డాను. 9 అప్పుడు అతడు, “అలా చెయ్యకు. నేను నీకూ, నీ సోదరులకూ, ప్రవక్తలకూ, ఈ పుస్తకంలో మాటలను పాటించే వారందరికీ తోటి సేవకుణ్ణి. దేవుణ్ణి పూజించు” అని చెప్పాడు.

  18. 9 ఆ పెద్దలు, “ఆ గ్రంథాన్ని తీసుకుని దాని సీలులు తెరవడానికి నువ్వు యోగ్యుడివి. నువ్వు వధ అయ్యావు. ప్రతి వంశం నుండీ, ప్రతి భాష మాట్లాడే వారి నుండీ, ప్రతి జాతి నుండీ, ప్రతి జనం నుండీ నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషులను కొన్నావు. 10 మా దేవుడికి సేవ చేయడానికి వారిని ఒక రాజ్యంగానూ యాజకులుగానూ చేశావు. కాబట్టి వారు భూలోకాన్ని పరిపాలిస్తారు” అంటూ ఒక కొత్త పాట పాడారు.

    11 ఇంకా నేను చూస్తూ ఉండగా సింహాసనాన్నీ, ఆ ప్రాణులనూ, పెద్దలనూ చుట్టుకుని ఉన్న గొప్ప దూతల బృంద స్వరం వినిపించింది. వారి సంఖ్య లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఉంది. 12 వారు, “వధ అయిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, యశస్సు, ప్రశంస పొందడానికి యోగ్యుడు” అని పెద్ద స్వరంతో చెబుతూ ఉన్నారు.

    13 అప్పుడు పరలోకంలోనూ భూమి పైనా భూమి కిందా సముద్రంలోనూ సృష్టి అయిన ప్రతి ప్రాణీ వాటిలోనిదంతా “సింహాసనంపై కూర్చున్న ఆయనకూ గొర్రెపిల్లకూ ప్రశంసా ఘనతా యశస్సూ పరిపాలించే శక్తి కలకాలం కలుగు గాక!” అనడం నేను విన్నాను.

    14 ఆ నాలుగు ప్రాణులూ, “ఆమేన్‌” అని చెప్పాయి. ఆ పెద్దలు సాగిలపడి పూజించారు.

  19. 7 యెహోవా అబ్రాముతో “నీ వారసులకు ఈ దేశాన్ని ఇస్తాను” అని చెప్పాడు. అక్కడ అతడు యెహోవాకు హోమ బలి అర్పించాడు.

    8 అతడు అక్కడనుంచి బయలుదేరి బేతేలుకు తూర్పువైపు ఉన్న కొండ దగ్గరికి వచ్చాడు. పడమర వైపు ఉన్న బేతేలుకు, తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు హోమబలి అర్పించి, యెహోవా పేరట ప్రార్థన చేశాడు.

  20. 1 దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ వివరించి చెప్పాడు, 2 నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే.

    3 నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు.

    4 పైన ఆకాశంలో గానీ, కింద భూమి మీద గానీ, భూమి కింద ఉండే నీళ్లలో గానీ ఎలాంటి ఆకారాన్నీ, ప్రతిమను తయారు చేసుకోకూడదు, వాటి ముందు సాష్టాంగపడ కూడదు, వాటిని పూజించ కూడదు.

    5 ఎందుకంటే నీ దేవుడనైన నేను రోషం గలవాణ్ణి. నన్ను లక్ష్యపెట్టని వారి విషయంలో వాళ్ళ మూడు నాలుగు తరాల దాకా వాళ్ళ పూర్వికుల దుష్టత్వం వారి సంతతి పైకి రప్పిస్తాను.

    6 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారిపై వెయ్యి తరాల వరకూ నా కరుణ చూపిస్తాను.

  21. 1 నాదాబు అబీహులు అహరోను కొడుకులు. వీళ్ళు తమ ధూపం వేసే పాత్రల్లో నిప్పులు ఉంచి వాటిపై ధూప ద్రవ్యాన్ని వేశారు. యెహోవా ఆదేశించని వేరే అగ్నిని ఆయన సమక్షంలోకి తీసుకు వచ్చారు. 2 దాంతో యెహోవా సమక్షంలో నుండి మంటలు వచ్చి వాళ్ళని కాల్చి వేశాయి. యెహోవా సమక్షంలోనే వాళ్ళు చనిపోయారు.

    3 అప్పుడు మోషే అహరోనుతో “నాకు సమీపంగా ఉన్నవారికి నా పవిత్రతని చూపిస్తాను. ప్రజలందరి ముందూ నేను మహిమ పొందుతాను అని యెహోవా చెప్పిన మాటకి అర్థం ఇదే” అన్నాడు. అహరోను ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు.

  22. 1 అదే నెల 24 వ తేదీన ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకుని తలల మీద దుమ్ము పోసుకుని సమావేశమయ్యారు. 2 ఇశ్రాయేలీయులు వేరే జాతి ప్రజల్లో నుండి వేరైపోయి నిలబడి, తమ పాపాలు, తమ పూర్వీకుల పాపాలు ఒప్పుకున్నారు. 3 వారు ఒక పూటంతా అక్కడే నిలబడి దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చదివించుకున్నారు. మరో పూట తమ పాపాలు ఒప్పుకొంటూ దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లిస్తూ వచ్చారు.

  23. దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పుడు రాసినది

    1 దేవా, నా దేవుడివి నీవే. మనసారా నిన్ను వెదుకుతాను. నీళ్లు లేక ఎండిపోయిన ప్రాంతంలో నా ప్రాణం నీకోసం దప్పిగొని ఉంది. నిన్ను చూడాలని నా శరీరం ఆత్రుతతో ఎదురు చూస్తున్నది.

    2 నీ బలాన్ని, నీ మహిమను చూడాలని పరిశుద్ధ మందిరంలో నీవైపు చూస్తూ కనిపెడుతున్నాను.

    3 నీ నిబంధన నమ్మకత్వం జీవం కంటే శ్రేష్టం. నా పెదాలు నిన్ను స్తుతిస్తాయి.

    4 నీ పేరున నా చేతులు పైకెత్తి నా జీవిత కాలమంతా నిన్ను స్తుతిస్తాను.

  24. 13 ప్రభువు ఇలా అంటున్నాడు “ఈ ప్రజలు నోటిమాటతో నా దగ్గరకి వస్తున్నారు.

    వీళ్ళు పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు. కానీ వాళ్ళ హృదయాలను నాకు దూరంగా ఉంచారు. మనుషులు ఏర్పరచిన ఆచారాలను నేర్చుకుని దాని ప్రకారం వాళ్ళు నా పట్ల భయభక్తులు చూపుతున్నారు.

    14 కాబట్టి చూడండి, ఈ ప్రజల మధ్య ఒక మహా ఆశ్చర్యకరమైన పని చేస్తాను. అద్భుతం వెనుక అద్భుతాన్ని చేస్తాను.

    వారి జ్ఞానుల జ్ఞానం నశించిపోతుంది. వివేకుల వివేకం అదృశ్యమై పోతుంది.”

  25. 42 వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.

    43 అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు. 44 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. 45 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. 46 ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ, 47 ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.

  26. 7-9 వేష ధారులారా, ‘ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే, మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు’ అని యెషయా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు.”

  27. 8 అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పూజించి ఆయనను మాత్రమే సేవించాలి’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు.

  28. 29 తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలు ప్రజల పెద్దలందరినీ సమావేశ పరిచారు. 30 మోషేతో యెహోవా చెప్పిన మాటలన్నిటినీ వారికి అహరోను వివరించాడు. ప్రజలందరి ఎదుటా అద్భుత క్రియలను జరిగించినప్పుడు అందరూ వారి మాటలు నమ్మారు. 31 యెహోవా తమ బాధలను కనిపెట్టి తమను దర్శించాడని విన్న ఇశ్రాయేలు ప్రజలు తలలు వంచుకుని ఆయనను ఆరాధించారు.

  29. 31 యెహోవా ఏలుతున్నాడని జనాల్లో చాటించండి.

    ఆకాశాలు ఆనందించు గాక.

    భూమి సంతోషించు గాక

    32 సముద్రం, దాని సంపూర్ణత ఘోషిస్తుంది గాక.

    పొలాలు వాటిలో ఉన్న సమస్తం సంతోషిస్తాయి గాక.

    యెహోవా వస్తున్నాడు.

    33 భూజనులకు తీర్పు చెప్పడానికి యెహోవా వస్తున్నాడు.

    వనవృక్షాలు ఆయన సన్నిధిలో ఆనందంతో కేకలు వేస్తాయి.

    34 యెహోవా మంచివాడు, ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది.

    ఆయనను స్తుతించండి.

    35 దేవా మా రక్షకా, మమ్మల్ని రక్షించు.

    మమ్మల్ని సమకూర్చు.

    36 మేము నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా

    నిన్ను స్తుతిస్తూ అతిశయించేలా

    అన్యజనుల వశంలో నుంచి మమ్మల్ని విడిపించు

    అని ఆయన్ను బతిమాలుకోండి.

    ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా

    యుగాలన్నిట్లో స్తోత్రం పొందుతాడు గాక.

    ఈ విధంగా వాళ్ళు పాడినప్పుడు ప్రజలందరూ ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించారు.

  30. 3 అగ్నీ యెహోవా తేజస్సూ మందిరం పైకి దిగటం చూసి ఇశ్రాయేలీయులంతా సాష్టాంగ నమస్కారం చేసి “యెహోవా దయ గలవాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అంటూ ఆయనను ఆరాధించి స్తుతించారు.

  31. 22 నీ నామం నా సోదరులకు ప్రచారం చేస్తాను. సమాజం మధ్య నిన్ను స్తుతిస్తాను.

    23 యెహోవా పట్ల భయం ఉన్నవారలారా, ఆయన్ని స్తుతించండి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని ఘనపరచండి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని చూసి విస్మయం చెందండి.

  32. ప్రధాన సంగీతకారుని కోసం

    1 సర్వలోకమా, దేవుని గూర్చి ఆనంద ధ్వనులు చెయ్యి. ఆయన బలమైన నామాన్ని కీర్తించండి.

    2 ఆయన నామానికి మహిమ ఆపాదించండి. ఆయనకు స్తోత్రాలు చెప్పండి.

    3 నీ కార్యాలు ఎంతో భీకరమైనవి. నీ మహా శక్తిని బట్టి నీ శత్రువులు నీకు లోబడతారు.

    4 లోకమంతా నీకు నమస్కరించి నిన్ను కీర్తిస్తుంది, నీ నామాన్నిబట్టి నిన్ను కీర్తిస్తుంది, అంటూ దేవుణ్ణి ఘనపరచండి. సెలా.

  33. 24 అతడు ఆ ఆజ్ఞను పాటించి, వారిని లోపలి చెరసాలలోకి తోసి, కాళ్ళను రెండు కొయ్య దుంగల మధ్య బిగించాడు.

    25 మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు. 26 అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి.

  34. 14 మీరు వేరొక దేవునికి మొక్కకూడదు. నేను ‘రోషం గల దేవుడు’ అనే పేరున్న యెహోవాను. నేను రోషం గల దేవుణ్ణి.

  35. దావీదు రాసిన స్తుతి కీర్తన

    1 నా రాజా, నా దేవా, నిన్ను ఘనపరుస్తాను. నీ నామాన్ని అన్నివేళలా కీర్తిస్తాను.

    2 అనుదినం నిన్ను స్తుతిస్తాను. శాశ్వతకాలం నీ నామాన్ని కీర్తిస్తాను.

    3 యెహోవా ఘనత వహించినవాడు. ఆయన అధిక స్తుతులకు పాత్రుడు. ఆయన గొప్పతనాన్ని గ్రహించడం ఎవరి తరం కాదు.

    4 ఒక తరం వారు మరో తరం వారి ఎదుట కార్యాలు తెలియజేసి నిన్ను కొనియాడతారు. నీ పరాక్రమ కార్యాలను నెమరు వేసుకుంటారు.

  36. 3 బాకాలు ఊదుతూ ఆయనను స్తుతించండి. సితారాతో, శ్రావ్యమైన స్వరాలతో ఆయనను స్తుతించండి.

    4 తంబుర వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆయనను స్తుతించండి. తంతివాద్యం మీటుతూ, వేణువు మోగిస్తూ ఆయనను స్తుతించండి.

    5 తాళాలు మోగిస్తూ ఆయనను స్తుతించండి. గంభీరమైన ధ్వనులు చేసే తాళాలు వాయిస్తూ ఆయనను స్తుతించండి.

    6 ప్రాణం ఉన్న ప్రతి జీవీ యెహోవాను స్తుతిస్తుంది గాక. యెహోవాను కీర్తించండి.

  37. 8 అపవాది మళ్ళీ ఆయనను చాలా ఎత్తయిన కొండపైకి తీసుకు పోయి, ప్రపంచ రాజ్యాలను, వాటి వైభవాన్ని ఆయనకు చూపించాడు. 9 “నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే వీటన్నిటినీ నీకిస్తాను” అన్నాడు. 10 అప్పుడు యేసు “సాతాన్! అవతలికి పో! ‘ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయన్నే నువ్వు సేవించాలి’ అని రాసి ఉంది” అన్నాడు.

  38. 52 వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. 53 దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.

  39. 1 యెహోవాకు ఒక కొత్త పాట పాడండి, ప్రపంచమంతా యెహోవాకు పాడండి.

    2 యెహోవాకు పాడండి, ఆయన నామం స్తుతించండి, ప్రతిరోజూ ఆయన రక్షణ ప్రకటించండి.

    3 రాజ్యాల్లో ఆయన గొప్పదనాన్ని తెలియచేయండి, ప్రపంచ దేశాల్లో ఆయన అద్భుతాలను వివరించండి.

    4 యెహోవా గొప్పవాడు. ఆయన్ని మెండుగా ప్రస్తుతించాలి. దేవుళ్ళందరికంటె ఎక్కువగా ఆయనపై భయభక్తులు నిలపాలి.

    5 జాతుల దేవుళ్ళంతా వట్టి విగ్రహాలే. అయితే ఆకాశాలను చేసింది యెహోవా.

    6 ఘనతాప్రభావాలు ఆయన ముందున్నాయి. బలం, సౌందర్యం ఆయన పవిత్ర ఆలయంలో ఉన్నాయి.

  40. 10 ఇలాంటి ఒక ఆజ్ఞ జారీ అయిందని దానియేలుకు తెలిసినప్పటికీ అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం యెరూషలేము వైపుకు తెరిచి ఉన్న తన ఇంటి పైగది కిటికీల దగ్గర మోకాళ్ళపై ప్రతిరోజూ మూడుసార్లు తన దేవునికి ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ ఉన్నాడు.

  41. 3 ఎందుకంటే, మనం దేవుని ఆత్మతో ఆరాధిస్తూ శరీరం మీద నమ్మకం పెట్టుకోకుండా క్రీస్తు యేసులో అతిశయిస్తున్నాము. మనమే అసలైన సున్నతి పొందిన వాళ్ళం.

  42. 3 వారు దేవుని సేవకుడైన మోషే పాట, గొర్రెపిల్ల పాట పాడుతూ,

    “ప్రభువైన దేవా, సర్వపరిపాలకా, నీవి గొప్పకార్యాలు, అద్భుతాలు.

    సార్వభౌమా, నీ విధానాలు న్యాయమైనవి, సత్యమైనవి.

    4 ప్రభూ, నువ్వు మాత్రమే పరిశుద్ధుడివి, నీకు భయపడనివారెవరు? నీ నామాన్ని కీర్తించనిదెవరు?

    నీ న్యాయక్రియలు అందరికీ తెలిశాయి. కాబట్టి అన్ని జాతుల వారూ నీ సన్నిధికి వచ్చి నిన్ను పూజిస్తారు.”

  43. 20 అప్పుడు యోబు లేచి తన పై దుస్తులు చింపుకున్నాడు. తలవెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు. 21 “నేను నా తల్లి కడుపులోనుండి దిగంబరిగా వచ్చాను. దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగు గాక.”

  44. 8 ప్రభూ, దేవుళ్ళలో నీకు సాటి ఎవరూ లేరు. నీ పనులకు సాటి ఏదీ లేదు.

    9 ప్రభూ, నువ్వు సృజించిన రాజ్యాలన్నీ వచ్చి నీ ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు నీ నామాన్ని గొప్ప చేస్తారు.

    10 నువ్వు గొప్ప వాడివి. ఆశ్చర్యమైన పనులు చేస్తావు. నీవొక్కడివే దేవుడివి.

  45. 5 మన యెహోవా దేవుణ్ణి స్తుతించండి. ఆయన పాదపీఠం ముందర ఆరాధించండి. ఆయన పవిత్రుడు.

  46. 6 యేసు వారితో,

    “‘ఈ ప్రజలు మాటలతో నన్ను గౌరవిస్తారు కాని,

    వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది.

    7 వారు మానవ కల్పితమైన నియమాలను దేవుని ఉపదేశంగా బోధిస్తారు కాబట్టి వారి ఆరాధన వ్యర్థం,’

    అని కపట వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికింది సరైనదే!

  47. 9 చీకటిలో నుంచి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికైన వంశంగా రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజగా ఉన్నారు.

  48. 4 అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి,

    “ఆమెన్, హల్లెలూయ!” అని చెబుతూ ఆయనను పూజించారు.

    5 అప్పుడు, “దేవుని దాసులు, ఆయనకు భయపడే వారు,

    గొప్పవారైనా అనామకులైనా అందరూ మన దేవుణ్ణి స్తుతించండి” అంటూ ఒక స్వరం సింహాసనం నుండి వినిపించింది.

    6 తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది.

    “హల్లెలూయ! సర్వ శక్తిశాలి, మన ప్రభువు అయిన దేవుడు పరిపాలిస్తున్నాడు.”

    7 “గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది.

    పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది.

    కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం.

    ఆయనకు మహిమ ఆపాదించుదాం.”

  49. 20 అహరోను సోదరి, ప్రవక్త్రి మిర్యాము తంబుర వాయిస్తూ బయలుదేరింది. స్త్రీలంతా తంబురలు వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆమెను వెంబడించారు. 21 మిర్యాము వాళ్ళతో కలిసి ఈ విధంగా పాడింది.

  50. 27 బలిపీఠం మీద దహనబలులను అర్పించమని హిజ్కియా ఆజ్ఞాపించాడు. దహనబలి అర్పణ ఆరంభం కాగానే బూరలతో, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యాలతో యెహోవాకు స్తుతిగానం ఆరంభమయింది. 28 సమాజమంతా ఆరాధిస్తూ వుంటే గాయకులు పాటలు పాడారు, బూరలూదారు. దహనబలి అర్పణ ముగిసే వరకూ ఇదంతా జరుగుతూ ఉంది.

    29 వారు బలులు అర్పించడం ముగించిన తరువాత రాజు, అతనితో ఉన్న వారంతా తలవంచి ఆరాధించారు. 30 దావీదూ, దీర్ఘ దర్శి ఆసాపూ, రాసిన పాటలు పాడి యెహోవాను స్తుతించమని రాజైన హిజ్కియా, అధికారులూ లేవీయులకు ఆజ్ఞాపిస్తే వారు ఆనందంతో స్తుతి గానం చేసి, తలవంచి ఆరాధించారు.

  51. అబీమెలెకు సమక్షంలో పిచ్చివాడిలాగా నటించినప్పుడు అతడు దావీదును వెళ్ళగొట్టగా దావీదు రాసిన కీర్తన.

    1 అన్ని సమయాల్లో నేను యెహోవాను స్తుతిస్తాను. నా నోట్లో నిత్యమూ ఆయన స్తుతి ఉంటుంది.

    2 నేను యెహోవాను స్తుతిస్తాను. అణచివేతకు గురైన వాళ్ళు అది విని సంతోషిస్తారు గాక!

    3 నాతో కలసి యెహోవాను ప్రశంసించండి. మనం అందరం కలసి ఆయన నామాన్ని పైకెత్తుదాం.

  52. 3 వాళ్ళు నాట్యం చేస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తారు గాక. తంబుర, సితారా మోగిస్తూ ఆయనను గూర్చి ఆనంద గీతాలు గానం చేస్తారు గాక.

  53. 20 మీరంతా సమావేశమై కలిసి తినేది ప్రభు రాత్రి భోజనం కాదు. 21 ఎందుకంటే మీరు ఆ భోజనం తినేటప్పుడు ఒకడికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే తింటున్నాడు. దీనివలన ఒకడు ఆకలితో ఉండగానే ఇంకొకడు బాగా తిని తాగి మత్తులో మునిగిపోతాడు. 22 ఏమిటిది? తిని తాగడానికి మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘాన్ని చిన్నచూపు చూస్తూ లేని వారిని చిన్నచూపు చూస్తూ? మీతో ఏమి చెప్పాలి? మిమ్మల్ని మెచ్చుకోమంటారా? ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోలేను.

    23 నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువే నాకు ఇచ్చాడు. ప్రభు యేసు అప్పగించబడిన రాత్రి, ఆయన ఒక రొట్టె చేత పట్టుకున్నాడు. 24 స్తుతులు చెల్లించిన తరువాత దాన్ని విరిచి, “ఇది మీ కోసమైన నా శరీరం. తీసుకుని తినండి. నా జ్ఞాపకార్థం దీన్ని చేయండి” అని చెప్పాడు. 25 భోజనం చేసిన తరువాత ఆ విధంగానే ఆయన పాత్రను చేత పట్టుకుని, “ఈ పాత్ర నా రక్తం మూలంగా చేసిన కొత్త నిబంధన. మీరు దీన్ని తాగిన ప్రతిసారీ నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అన్నాడు. 26 మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోది తాగిన ప్రతిసారీ ప్రభువు వచ్చేవరకూ ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు.

    27 కాబట్టి ఎవరైతే అయోగ్యమైన విధానంలో ప్రభువు రొట్టెను తిని ఆయన పాత్రలోది తాగుతారో వారు ప్రభువు శరీరం, ఆయన రక్తం విషయంలో అపరాధులు అవుతారు. 28 కాబట్టి ప్రతి ఒక్కడూ తనను తాను పరీక్షించుకుని ఆ రొట్టె తిని, ఆ పాత్రలోది తాగాలి.

  54. 6 అప్పుడు మరో దూతను చూశాను. అతడు ఆకాశంలో ఎగురుతున్నాడు. భూమిమీద నివసించే వారందరికీ ప్రతి దేశానికీ, తెగకూ, ప్రతి భాష మాట్లాడే వారికీ, ప్రతి జాతికీ ప్రకటించడానికి అతని దగ్గర శాశ్వత సువార్త ఉంది. 7 అతడు, “మీరు దేవునికి భయపడండి. ఆయనకు మహిమ ఆపాదించండి. ఆయన మనుషులకు తీర్పు చెప్పే సమయం వచ్చింది. కాబట్టి భూమినీ, ఆకాశాలనూ, సముద్రాన్నీ, భూమి మీద నీటి ఊటలనూ సృష్టించిన ఆయనను పూజించండి.” అంటూ బిగ్గరగా చెప్పాడు.

  55. 9 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి.” అతడే ఇంకా, “ఇవి నిజంగా దేవుని మాటలు” అన్నాడు. 10 అందుకు నేను అతణ్ణి పూజించడానికి అతని ముందు సాష్టాంగపడబోయాను. కానీ అతడు, “అలా చేయకు! యేసుకు సాక్షులుగా ఉన్న నీకూ నీ సోదరులకూ నేను తోటి దాసుణ్ణి మాత్రమే” అన్నాడు.

  56. 9 మోషే ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడు స్తంభం లాంటి మేఘం దిగి వచ్చి ఆ గుడారం ద్వారం దగ్గర నిలిచేది. అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు.

    10 ఆ మేఘస్తంభం ఆ గుడారం ద్వారాన నిలవడం చూసిన ప్రజలందరూ తమ తమ గుడారాల ద్వారాల్లో లేచి నిలబడి నమస్కారం చేసేవారు.

  57. 4 ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు. 5 నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.

    6 ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి.

    7 మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి.

    8 అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి. 9 మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి.

  58. 22 అందుకు సమూయేలు “ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా, దహనబలులు, హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్ఠం.

  59. ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. ముత్ లబ్బెన్ రాగం.

    1 హృదయ పూర్వకంగా నేను యెహోవాకు ధన్యవాదాలు చెల్లిస్తాను. యెహోవా, నీ ఆశ్చర్య కార్యాలన్నిటి గురించి నేను చెబుతాను.

    2 మహోన్నతుడైన యెహోవా! నేను నీ గురించి సంతోషించి హర్షిస్తాను. నీ నామానికి స్తుతి కీర్తన పాడుతాను.

  60. 11 నువ్వు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చావు. నా గోనెపట్ట తీసివేసి, సంతోషాన్ని నాకు వస్త్రంగా ధరింపజేశావు.

    12 అందుకే నా ప్రాణం మౌనంగా ఉండక, నీకు స్తుతులు పాడుతుంది. యెహోవా, నా దేవా, నేను నిన్ను ఎల్లకాలం స్తుతిస్తాను.

  61. 4 అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరకూ, నాకు అత్యధిక సంతోష కారణమైన నా దేవుని దగ్గరకూ వెళ్తాను. సితారా వాయిస్తూ నా దేవుణ్ణి స్తుతిస్తాను.

  62. దావీదు కీర్తన.

    1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.

  63. 16 ఎప్పుడూ సంతోషంగా ఉండండి.

    17 ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.

    18 ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.

  64. 12 కాబట్టి ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన్ని ప్రేమించి, మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణాత్మతో సేవించు.

    13 మీ మేలు కోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను, కట్టడలను పాటించడం తప్ప మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకేమి కోరుతున్నాడు?

  65. 15 గిద్యోను ఆ కల, దాని భావం విన్నప్పుడు, అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల శిబిరంలోకి తిరిగి వెళ్లి “లెండి, యెహోవా మిద్యానీయుల సైన్యం మీద మీకు జయం ఇచ్చాడు” అని చెప్పి,

  66. 11 యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ సమావేశమైన యాజకులంతా తమ వంతులతో నిమిత్తం లేకుండా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. 12 ఆసాపు, హేమాను, యెదూతూను, వారి కుమారులు, సహోదరులు, గాయకులైన లేవీయులంతా, సన్నని నార వస్త్రాలు ధరించి, తాళాలు, తంబురలు, సితారాలు చేత పట్టుకుని బలిపీఠానికి తూర్పు వైపు నిలబడ్డారు.

    13 వారితో బాటు 120 మంది బాకాలు ఊదే యాజకులు నిలబడ్డారు. బూరలూదే వారూ గాయకులూ ఒకేసారి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ గానం చేసినప్పుడు యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయటికి వెళ్ళి ఆ బాకాలతో తాళాలతో ఇతర వాద్యాలతో కలిసి గొంతెత్తి “యెహోవా దయ గలవాడు. ఆయన కృప నిత్యమూ ఉంటుంది” అని స్తోత్రం చేశారు.

    14 అప్పుడు ఒక మేఘం యెహోవా మందిరాన్ని నింపింది. యెహోవా తేజస్సుతో ఆ మందిరం నిండిపోవడం వలన సేవ చేయడానికి యాజకులు ఆ మేఘం దగ్గర నిలబడలేక పోయారు.

  67. 15 ఈ స్థలం లో చేసే ప్రార్థన మీద నా దృష్టి ఉంటుంది, నా చెవులు దాన్ని వింటాయి. 16 నా పేరు ఈ మందిరానికి నిత్యమూ ఉండేలా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచాను. నా కనులు, నా మనస్సు నిత్యం దాని మీద ఉంటాయి.

  68. 5 అప్పుడు అందరికంటే ఎత్తయిన వేదికపై ఎజ్రా నిలబడి ప్రజలంతా చూస్తుండగా గ్రంథం తెరిచాడు. ప్రజలంతా లేచి నిలబడ్డారు. 6 ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించినప్పుడు ప్రజలంతా తమ చేతులు పైకెత్తి ఆమేన్‌, ఆమేన్‌ అని కేకలు వేస్తూ, క్రిందికి నేల వైపుకు తమ తలలు వంచుకుని యెహోవాకు నమస్కరించారు.

  69. 25 మహా సమాజంలో నీ నుండి నా స్తుతి వస్తుంది. ఆయనపట్ల భయభక్తులు కలిగిన వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లిస్తాను.

    26 బాధితులు భోజనం చేసి తృప్తి పొందుతారు. యెహోవాను వెదికేవాళ్ళు ఆయనను స్తుతిస్తారు. వారి హృదయాలు శాశ్వతకాలం జీవిస్తాయి గాక.

    27 భూనివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా వైపు తిరుగుతారు. జాతుల కుటుంబాలన్నీ ఆయన ఎదుట వంగి నమస్కారం చేస్తాయి.

    28 ఎందుకంటే రాజ్యం యెహోవాదే. జాతులను పాలించేవాడు ఆయనే.

  70. 3 యెహోవా పర్వతం ఎక్కే అర్హత ఎవరికుంది? ఆయన పవిత్ర స్థలంలో ఎవరు ప్రవేశించగలరు?

    4 అసత్యంపై మనసు పెట్టకుండా, మోసపూరితంగా ఒట్టు పెట్టుకోకుండా, నిర్దోషమైన చేతులూ, శుద్ధమైన హృదయం కలిగినవాడే.

    5 అతడు యెహోవా వల్ల ఆశీర్వాదం పొందుతాడు, తన రక్షకుడైన దేవుని వల్ల నిర్దోషత్వం పొందుతాడు.

    6 ఆయనను కోరుకున్న తరం, యాకోబు దేవుని సన్నిధిని కోరుకున్నవాళ్ళు అలాంటివాళ్ళే. సెలా.

  71. 1 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి.

    2 ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.

    3 ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక.

    4 యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి.

    5 ఆయన సేవకుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతివారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.

    6 ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.

  72. 1 యెహోవా, నీవే నా దేవుడివి. నేను నిన్ను ఘన పరుస్తాను. నీ నామాన్ని స్తుతిస్తాను. నీవు అద్భుతాలు చేశావు. సత్య స్వభావాన్ననుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చావు.

  73. 6 విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకుండా ఆచరిస్తూ నా నిబంధనను ఆధారం చేసుకుంటూ

    యెహోవాకు సేవకులై యెహోవా నామాన్ని ప్రేమిస్తూ

    ఆయన్ని ఆరాధించడానికి ఆయన పక్షం చేరే విదేశీయులను నా పరిశుద్ధ పర్వతానికి తీసుకు వస్తాను.

    7 నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేస్తాను.

    నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులూ బలులూ నాకు అంగీకారమవుతాయి.

    నా మందిరం అన్ని రాజ్యాలకూ ప్రార్థన మందిరం అవుతుంది.

  74. 28 నెబుకద్నెజరు “షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుడికి స్తుతి కలుగు గాక. తమ దేవునికి తప్ప మరి ఎవరికీ నమస్కరించమనీ, ఎవరినీ పూజించమనీ చెప్పి రాజు ఆజ్ఞను ధిక్కరించారు. తనను నమ్ముకున్న తన సేవకులను ఆ దేవుడు తన దూతను పంపించి రక్షించాడు.

  75. 5 ఆధ్యాత్మిక గృహంగా కట్టడానికి వాడే సజీవమైన రాళ్ల లాగా మీరున్నారు. దాని వలన, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండగలరు.

  76. 10 రాతి చెక్కడం పనివారు యెహోవా మందిరం పునాది వేస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలు రాజు దావీదు నిర్ణయించిన క్రమం ప్రకారం యాజకులు తమ వస్త్రాలు ధరించుకుని బాకాలతో నిలబడ్డారు. ఆసాపు వంశం వారైన లేవీయులు చేతి తాళాలతో యెహోవాను స్తుతించారు. 11 వీరు వంతుల వారీగా “యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల మీద ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అని పాడుతూ యెహోవాను కీర్తించారు. యెహోవా మందిరం పునాది పడడం చూసిన ప్రజలంతా గొప్ప శబ్దంతో యెహోవాను స్తుతించారు.

    12 గతంలో ఉన్న మందిరాన్ని చూసిన యాజకుల్లో, లేవీయుల కుటుంబ పెద్దల్లో ముసలివారు చాలామంది ఇప్పుడు వేస్తున్న మందిరం పునాదిని చూసి గట్టిగా ఏడ్చారు. కొంతమంది సంతోషంతో గట్టిగా కేకలు వేశారు. 13 ఏవి ఏడుపులో, ఏవి హర్ష ధ్వానాలో ప్రజలు తెలుసుకోలేక పోయారు. ప్రజలు వేసిన కేకల శబ్దం చాలా దూరం వినబడింది.

  77. 2 నీ పరిశుద్ధ ఆలయం వైపుకు తిరిగి నిన్ను ఆరాధిస్తాను. నీ నిబంధన విశ్వసనీయత, నీ నమ్మకత్వాలను బట్టి నీ నామానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. నీవు నీ పేరు ప్రతిష్టలను, నీ వాక్కును గొప్ప చేశావు.

  78. 21 మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు.

    మీ ప్రత్యేక సభలంటే నాకేమీ ఇష్టం లేదు.

    22 నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా

    నేను వాటిని అంగీకరించను.

    సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను.

    23 మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి.

    మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను.

    24 నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి.

    నీతిని ఎప్పుడూ ప్రవహించేలా చేయండి.

  79. 6 యెహోవాకు నేనేం తీసుకురాను?

    మహోన్నతుడైన దేవునికి వంగి నమస్కారం చేయడానికి ఏం తీసుకురాను?

    దహనబలులనూ ఏడాది దూడలనూ తీసుకుని నేను ఆయన దగ్గరికి రానా?

    7 వేలకొలది పొట్టేళ్లు, పది వేల నదుల నూనెతో యెహోవా సంతోష పడతాడా?

    నా అతిక్రమానికి నా పెద్ద కొడుకుని నేనివ్వాలా?

    నా సొంత పాపానికి నా గర్భఫలాన్ని నేనివ్వాలా?

    8 మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు.

    ఆయన నిన్ను కోరేదేంటంటే,

    న్యాయంగా ప్రవర్తించు.

    కనికరాన్ని ప్రేమించు.

    వినయంగా నీ దేవునితో నడువు.

  80. 16 నేను వింటుంటే నా అంతరంగం కలవరపడుతున్నది. ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి. నా ఎముకలు కుళ్లిపోతున్నాయి. నా కాళ్లు వణకుతున్నాయి. జనాలపై దాడి చేసే వారు సమీపించే దాకా నేను ఊరుకుని బాధ దినం కోసం కనిపెట్టవలసి ఉంది.

    17 అంజూరపు చెట్లు పూత పట్టకపోయినా,

    ద్రాక్షచెట్లు ఫలింపక పోయినా,

    ఒలీవచెట్లు కాపులేక ఉన్నా,

    చేనులో పైరు పంటకు రాకపోయినా,

    గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, కొట్టంలో పశువులు లేకపోయినా,

    18 నేను యెహోవా పట్ల ఆనందిస్తాను.

    నా రక్షణకర్తయైన నా దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తాను.

  81. 18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది. 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

    21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

    24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.

  82. 26 సోదరులారా, ఇప్పుడేం జరుగుతున్నది? మీరు సమావేశమైనప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలని, ఇంకొకడు దేవుని మాటలు ఉపదేశించాలని చూస్తున్నాడు, వేరొకడు దేవుడు తనకు బయలు పరచిన దాన్ని ప్రకటించాలని చూస్తున్నాడు. ఒకడు తెలియని భాషతో మాటలాడాలని చూస్తుండగా మరొకడు దానికి అర్థం చెప్పాలని కనిపెడుతున్నాడు. సరే, అంతటినీ సంఘాభివృద్ధి కోసం జరిగించండి. 27 ఎవరైనా తెలియని భాషతో మాట్లాడితే, ఇద్దరు, అవసరమైతే ముగ్గురికి మించకుండా, ఒకరి తరువాత ఒకరు మాట్లాడాలి. ఒకరు దానికి అర్థం చెప్పాలి. 28 అర్థం చెప్పేవాడు లేకపోతే అతడు సంఘంలో మౌనంగా ఉండాలి. అయితే అతడు తనతో, దేవునితో మాట్లాడుకోవచ్చు. 29 ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చు. మిగిలినవారు ఆ ఉపదేశాన్ని వివేచనాపూర్వకంగా వినాలి. 30 అయితే అక్కడ కూర్చున్న మరొకనికి ఏదైనా వెల్లడి అయితే మొదటివాడు మౌనంగా ఉండాలి. 31 అందరూ నేర్చుకొనేలా, ప్రోత్సాహం పొందేలా మీరంతా ఒకడి తరవాత ఒకడు దేవుడిచ్చిన సందేశం ప్రకటించ వచ్చు. 32 ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. 33 ఎందుకంటే దేవుడు శాంతి సమాధానాలు కలిగించే వాడే గాని గందరగోళం కలిగించేవాడు కాడు. పరిశుద్ధుల సంఘాలన్నిటిలో 34 స్త్రీలు సంఘ సమావేశాల్లో మౌనంగా ఉండాలి. వారు లోబడి ఉండవలసిందే. వారికి మాట్లాడేందుకు అనుమతి లేదు. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రం కూడా చెబుతున్నది. 35 వారు దేనినైనా తెలుసుకోవాలంటే వారి ఇంట్లో తమ భర్తలను అడగాలి. సంఘంలో స్త్రీ మాట్లాడడం అవమానకరం. 36 ఏం, దేవుని వాక్కు మీ నుండే బయలుదేరిందా? మీ దగ్గరికి మాత్రమే వచ్చిందా?

    37 ఎవరైనా తాను ప్రవక్తననీ లేక ఆత్మీయ వ్యక్తిననీ భావిస్తే ఇక్కడ నేను మీకు రాస్తున్నవి ప్రభువు చెప్పిన ఆజ్ఞలని అతడు కచ్చితంగా తెలుసుకోవాలి. 38 ఎవరైనా దీన్ని పట్టించుకోక పొతే అ వ్యక్తిని పట్టించుకోకండి. 39 కాబట్టి నా సోదరులారా, దేవుడిచ్చిన సందేశం ప్రకటించడం అనే వరాన్ని ఆసక్తితో కోరుకోండి. తెలియని భాషలతో మాట్లాడటాన్ని ఆపకండి. 40 అంతా మర్యాదగా, క్రమంగా జరగనీయండి.

  83. 25 యెహోవా మహా ఘనత వహించినవాడు.

    ఆయన ఎంతో స్తుతి పొందదగినవాడు.

    సమస్త దేవుళ్ళకంటే ఆయన పూజార్హుడు.

  84. 3 నువ్వు పవిత్రుడవు. ఇశ్రాయేలు చేసే స్తుతులతో రాజుగా సింహాసనం మీద కూర్చుని ఉంటావు.

  85. ఒక పాట, కోరహు వారసుల కీర్తన.

    1 మన దేవుని పట్టణంలో తన పరిశుద్ధ పర్వతంపై యెహోవా గొప్పవాడు. అత్యధికంగా ఆయన్ని స్తుతించాలి.

  86. 9 ప్రభూ, జాతుల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాను. ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను.

  87. 4 దేవుని గూర్చి పాడండి. ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానం చేయండి. యొర్దాను నదీ లోయ ప్రాంతంలో స్వారీ చేసే దేవుని కోసం, ఒక రాజమార్గం ఏర్పాటు చేయండి. ఆయన పేరు యెహోవా. ఆయన ఎదుట పండగ చేసుకోండి.

    5 తన పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా, వితంతువులకు సహాయకుడిగా ఉన్నాడు.

  88. 8 నీ కీర్తితో, ప్రభావ వర్ణనతో దినమంతా నా నోరు నిండిపోయింది.

  89. 1 యెహోవాను స్తుతించండి. పరలోక నివాసులారా, యెహోవాను స్తుతించండి. ఉన్నత స్థలాల్లో నివసించేవాళ్ళంతా ఆయనను స్తుతించండి.

    2 ఆయన దూతలారా, మీరంతా ఆయనను స్తుతించండి. ఆయన సైన్య సమూహమా, మీరంతా ఆయనను స్తుతించండి.

    3 సూర్యడా, చంద్రుడా, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల్లారా మీరంతా ఆయనను స్తుతించండి.

    4 అంతరిక్షంలో ఉన్న నగరాల్లారా, ఆయనను స్తుతించండి. ఆకాశంపై ఉన్న జలాశయాల్లారా ఆయనను స్తుతించండి.

    5 అవన్నీ యెహోవా నామాన్ని స్తుతిస్తాయి గాక. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ ఏర్పడ్డాయి.

  90. 37 అందుకు యేసు,

    “‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.

    38 ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.

    39 ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.