77 Bible Verses About Giving Thanks

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Giving Thanks
  1. 15 ఎవరూ కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి పట్ల మరొకరూ, ఇంకా మనుషులందరి పట్లా ఎప్పుడూ మేలైన దానినే చేయడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి.

    16 ఎప్పుడూ సంతోషంగా ఉండండి.

    17 ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.

    18 ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.

  2. 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.

    16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.

    17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.

  3. 10 విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు. 11 ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది.

    12 మీరు చేసే ఈ సేవ పరిశుద్ధుల అక్కరలు తీర్చడమే కాకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించేలా చేస్తుంది. 13 ఈ సేవ ద్వారా మీ యోగ్యత కనబడుతుంది. క్రీస్తు సువార్తను ఒప్పుకుని విధేయులై, ఇంత ఉదారంగా వారికీ, అందరికీ పంచిపెట్టడం బట్టి, వారు కూడా దేవుణ్ణి మహిమ పరుస్తారు. 14 మీ పట్ల దేవుడు కనపరచిన అత్యధికమైన కృపను చూసి, వారు మీ కోసం ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు. 15 వర్ణించ శక్యం గాని ఆయన బహుమానానికి దేవునికి ధన్యవాదాలు.

  4. 2 ఆనందంగా యెహోవాకు సేవ చేయండి, ఆనంద గీతాలు పాడుతూ ఆయన సన్నిధికి రండి.

    3 యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయన మనలను పుట్టించాడు. మనం ఆయన వాళ్ళం. మనం ఆయన ప్రజలం. ఆయన మేపే గొర్రెలం.

    4 కృతజ్ఞతతో ఆయన ద్వారాలగుండా ప్రవేశించండి. స్తుతులతో ఆయన ఆవరణాల్లోకి రండి. ఆయనకు ధన్యవాదాలు చెప్పండి. ఆయన నామాన్ని పొగడండి.

    5 యెహోవా మంచివాడు. ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది. ఆయన విశ్వసనీయత తరతరాలకు ఉంటుంది.

  5. 4 ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి.

    5 మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు. 6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

  6. 15 బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి. 16 సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి. 17 అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి. 18 మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి. 19 కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి. 20 ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.

    21 క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి.

  7. 1 దేవుని సంకల్పం ప్రకారం యేసు క్రీస్తుకు అపొస్తలుడైన పౌలూ మన సోదరుడు తిమోతీ కొలస్సై పట్టణంలో ఉన్న దేవుని పరిశుద్ధులకూ, 2 క్రీస్తులో విశ్వాసముంచిన సోదరులకూ శుభాకాంక్షలతో రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవుని నుండి కృపా శాంతీ మీకు కలుగు గాక!

    3-5 పరలోకంలో మీకోసం భద్రంగా ఉంచిన నిశ్చయమైన నిరీక్షణనుబట్టి మీరు క్రీస్తు యేసుపై నిలిపిన విశ్వాసాన్ని గూర్చీ, పరిశుద్ధులందరి పట్ల మీరు చూపుతున్న ప్రేమను గూర్చీ, మేము విని మీ గురించి ప్రార్థన చేసే ప్రతిసారీ మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సత్యవాక్కు అయిన సువార్త మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ నిరీక్షణను గూర్చి మొదటిసారి మీరు విన్నారు.

    6 ఈ సువార్త మీరు విని దేవుని కృపను నిజంగా తెలుసుకున్నప్పటి నుంచీ అది మీలో ఫలించి అభివృద్ధి చెందినట్టే ప్రపంచమంతటా ఈ సువార్త ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంది. 7 ఇది ప్రియమైన మా తోటి దాసుడూ, యేసుక్రీస్తుకు నమ్మకమైన సేవకుడూ అయిన ఎపఫ్రా నుండి ఆ విషయాలు నేర్చుకున్న ప్రకారమే. 8 ఆత్మలో మీ ప్రేమను గూర్చి అతడు మాకు తెలియజేశాడు.

    9 ఈ ప్రేమ మూలంగా మీ గురించి మేం విన్న రోజు నుండీ మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు సంపూర్ణ జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం కలిగి ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం. 10 ప్రతి మంచి కార్యం విషయంలోనూ మీరు ఫలిస్తూ, దేవునికి సంబంధించిన జ్ఞానంలో పెరుగుతూ, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేలా, ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము ప్రార్ధిస్తున్నాం. 11 మహిమ ప్రభావాలతో కూడిన ఆయన శక్తి మిమ్మల్ని ప్రతివిధమైన సామర్థ్యం ఇచ్చి బలపరచాలని దేవుణ్ణి వేడుకుంటున్నాం. అదే మీకు సహనాన్నీ, పట్టుదలతో కొనసాగే శక్తినీ కలిగిస్తుంది.

    12 వెలుగు నివాసులుగా తనకోసం ప్రత్యేకించబడిన వారి వారసత్వంలో భాగం పంచుకోడానికి మనలను అర్హులుగా చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. 13 ఆయన మనలను చీకటి రాజ్యపు ఆధిపత్యం నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుడి రాజ్యంలోకి తరలించాడు. 14 ఆ కుమారుడిలోనే మనకు పాప క్షమాపణా విమోచనా ఉన్నాయి.

  8. 1 రండి, యెహోవాకు పాట పాడదాం, మన రక్షణకు ఆధారశిలకు ఆనందంగా పాడదాం.

    2 కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వద్దాం, ఆయనకు స్తుతి గీతాలు పాడదాం.

    3 యెహోవా గొప్ప దేవుడు. దేవుళ్ళందరికీ పైగా ఉన్న గొప్ప రాజు.

    4 భూమి అగాధస్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరాలు ఆయనవే.

    5 సముద్రం ఆయనది. ఆయనే దాన్ని చేశాడు. ఆయన చేతులు పొడి నేలను చేశాయి.

  9. 14 ఎలాంటి నిత్యమైన పట్టణమూ ఇక్కడ మనకు లేదు. మనం రాబోయే పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం.

    15 యేసు ద్వారా మనం నిరంతరం దేవునికి స్తుతులు యాగంగా అర్పిస్తూ ఉండాలి. స్తుతులు అంటే మన పెదవుల ద్వారా ఆయన పేరును అంగీకరిస్తూ మనం ఆయనకు అర్పించే ఫలం. 16 ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం.

  10. 30 దేవుని నామాన్ని గానాలతో స్తుతిస్తాను. కృతజ్ఞతలతో ఆయన్ని ఘనపరుస్తాను.

    31 ఎద్దు కంటే, కొమ్ములు డెక్కలు గల కోడె కంటే అది యెహోవాకు ఇష్టం.

  11. 1 పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు. 2 ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది. 3 వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల్లో కొన్ని తినకూడదని వీరు అంటారు.

    4 దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొన్నది ఏదీ నిషేధం కాదు. 5 ఎందుకంటే దేవుని వాక్యమూ ప్రార్థనా దాన్ని పవిత్ర పరుస్తాయి.

  12. 14 దేవునికి నీ కృతజ్ఞతార్పణ సమర్పించు. మహోన్నతుడికి నీ ప్రమాణాలను నెరవేర్చు.

    15 సమస్యలు చుట్టుముట్టిన రోజున నాకు ప్రార్థించు. నేను నిన్ను కాపాడతాను. నువ్వు నన్ను కీర్తిస్తావు.

  13. 13 కాగా, “నమ్మాను కాబట్టి మాట్లాడాను” అని రాసినట్టుగా అలాంటి విశ్వాసం గల మనసు కలిగి మేము కూడా నమ్ముతున్నాము కాబట్టి మాట్లాడుతున్నాము.

    14 ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి, మీతో తన ఎదుట నిలబెడతాడని మాకు తెలుసు. 15 కృప చాలామందికి విస్తరించినట్టుగా దేవుని మహిమ కోసం కృతజ్ఞత విస్తరించేలా అన్నీ మీ కోసమే జరిగాయి.

  14. 2 ప్రార్థనలో నిలిచి ఉండండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ మెలకువగా ఉండండి.

  15. 4 క్రీస్తు యేసులో మీరు పొందిన దేవుని కృపను చూసి, మీ విషయం నా దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 5 క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడింది. 6 అందువల్ల ఆయనలో మీరు ప్రతి విషయంలో, అంటే సమస్త ఉపదేశంలో, సమస్త జ్ఞానంలో, ధనవంతులు అయ్యారు. 7 కాబట్టి ఏ కృపావరంలోనూ లోటు లేకుండా మీరు మన ప్రభు యేసు క్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు. 8 మన ప్రభు యేసు క్రీస్తు రోజున మీరు నిష్కపటంగా ఉండేలా అంతం వరకూ ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. 9 మన ప్రభు యేసు క్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.

  16. 1 మనం సంపూర్ణ భక్తి, గౌరవాలతో, ప్రశాంతంగా, సుఖంగా బతకడానికై, మనుషులందరి కోసం, 2 రాజుల కోసం, అధికారంలో ఉన్న వారందరి కోసం, విన్నపాలూ ప్రార్థనలు, ఇతరుల కోసం విన్నపాలు చేస్తూ కృతజ్ఞతలు చెల్లించాలని అన్నిటికంటే ముఖ్యంగా కోరుతున్నాను.

    3 ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, సమ్మతమైనది. 4 మానవులంతా రక్షణ పొంది సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు.

  17. 6 మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగానే ఆయనలో నడుస్తూ ఉండండి. 7 ఆయనలో స్థిరంగా నాటుకుని ఉండండి. ఆయన పైనే మీ జీవితాలు కట్టుకోండి. మీకు బోధించిన రీతిగానే విశ్వాసంలో వేరు పారి ఉండండి. కృతజ్ఞతలు చెల్లించడంలో పొంగిపొరలుతూ ఉండండి.

  18. 10 రాజైన దావీదు కూడా ఎంతో సంతోషపడి, సమావేశం అందరి ఎదుటా యెహోవాకు స్తోత్రాలు చెల్లిస్తూ “మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, నిరంతరం నువ్వు స్తోత్రానికి అర్హుడవు. 11 యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు. 12 ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే. 13 మా దేవా, మేము నీకు కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావం గల నీ పేరును కొనియాడుతున్నాం.

    14 ఈ విధంగా మనస్పూర్తిగా ఇచ్చే సామర్ధ్యం మాకు కలగడానికి నేను ఏమాత్రం వాణ్ణి? నా ప్రజలు ఏమాత్రం వాళ్ళు? అన్నీ నీ వలనే కలిగాయి గదా? నీ దానిలో నుంచి కొంత మేము నీకిచ్చాం.

  19. 15 ఈ కారణం చేత ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించీ పరిశుద్ధులందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను గురించీ నేను విన్నప్పటి నుంచి, 16 మీ విషయంలో మానకుండా నా ప్రార్థనల్లో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. 17 మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు, మహిమ గల తండ్రి, తనను తెలుసుకోడానికి మీకు తెలివిగల ఆత్మనూ, తన జ్ఞాన ప్రత్యక్షతగల మనసునూ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

    18 మీ మనోనేత్రాలు వెలిగి, మన పిలుపు గురించిన నిరీక్షణ ఎలాంటిదో, పరిశుద్ధుల్లో ఆయన మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో మీరు గ్రహించాలని నా ప్రార్థన. 19 తనను నమ్ముకున్న మనలో తన అపరిమిత ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన.

    20 దేవుడు ఈ శక్తితో క్రీస్తును తిరిగి బ్రతికించి పరలోకంలో తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. 21 సర్వాధిపత్యం, అధికారం, ప్రభావం, ప్రభుత్వం కంటే ఈ యుగంలోగానీ రాబోయే యుగంలోగానీ పేరు గాంచిన ప్రతి నామం కంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడు. 22 దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచి, సంఘంలోని అన్నిటి మీదా ఆయనను తలగా నియమించాడు. 23 ఈ సంఘం ఆయన శరీరం, అంతటినీ అన్ని విధాలుగా నింపుతున్న ఆయన సంపూర్ణత.

  20. 34 యెహోవా మంచివాడు, ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది.

    ఆయనను స్తుతించండి.

  21. 18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది. 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

    21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది.

  22. 14 దేవుడు క్రీస్తులో విజయ సూచకమైన తన ఊరేగింపులో మమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తున్నాడు. క్రీస్తును గురించిన జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అంతటా గుబాళించేలా చేస్తున్న ఆయనకు ధన్యవాదాలు. 15 విమోచన పొందుతున్న వారిమధ్య, నాశనమైపోతున్న వారిమధ్య, మేము దేవునికి క్రీస్తు పరిమళంగా ఉన్నాము. 16 నాశనమైపోతున్న వారికి మరణపు వాసనగా, విమోచన పొందుతున్న వారికి జీవపు సువాసనగా ఉన్నాము. వీటికి యోగ్యులెవరు?

  23. పంచమ పరిచ్ఛేదము

    1 యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యం ఉంటుంది.

    2 యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుతారు గాక. విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించిన వారూ,

    3 తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నానాదేశాల నుండి ఆయన పోగు చేసినవారూ ఆ మాట పలుకుతారు గాక.

  24. 1 యెహోవా దయ గలవాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    2 ఘనుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    3 ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

  25. 10 ఇలాంటి ఒక ఆజ్ఞ జారీ అయిందని దానియేలుకు తెలిసినప్పటికీ అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం యెరూషలేము వైపుకు తెరిచి ఉన్న తన ఇంటి పైగది కిటికీల దగ్గర మోకాళ్ళపై ప్రతిరోజూ మూడుసార్లు తన దేవునికి ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ ఉన్నాడు.

  26. 8 మీ విశ్వాసం లోకమంతా ప్రచురం కావడం చూసి, మొదట మీ అందరి కోసం యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను.

  27. 57 అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి.

  28. 12 నన్ను బలపరచి, నమ్మకమైన వాడుగా ఎంచి తన సేవకు నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకి కృతజ్ఞుణ్ణి. 13 అంతకు ముందు దేవ దూషకుణ్ణి, హింసించేవాణ్ణి, హానికరుణ్ణి. అయితే తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి కనికరం పొందాను. 14 మన ప్రభువు తన ధారాళమైన కృపను నాపై కుమ్మరించి, యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ విశ్వాసాలను అనుగ్రహించాడు. 15 పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగినదీ, సంపూర్ణంగా అంగీకరించదగినదీ. అలాంటి పాపుల్లో నేను మొదటి వాణ్ణి.

    16 అయినా నిత్యజీవం కోసం తనపై విశ్వాసముంచబోయే వారికి నేను ఒక నమూనాగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన ఓర్పును నాలో కనుపరచేలా నన్ను కరుణించాడు. 17 అన్ని యుగాల్లో రాజూ, అమర్త్యుడూ, అదృశ్యుడూ అయిన ఏకైక దేవునికి ఘనత, మహిమ యుగయుగాలు కలగాలి. ఆమేన్‌.

  29. 9 నా మట్టుకు నేను కృతజ్ఞతాస్తుతులతో నీకు బలి సమర్పిస్తాను.

    నేను మొక్కుకున్న దాన్ని తప్పక నెరవేరుస్తాను.

    యెహోవా దగ్గరే రక్షణ దొరుకుతుంది.”

  30. 16 అప్పుడు దేవుని ఎదుట సింహాసనాలపై కూర్చున్న ఇరవై నలుగురు పెద్దలూ సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించారు.

    17 “ప్రభువైన దేవా, సర్వ శక్తిశాలీ, పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా, నువ్వు నీ మహాశక్తి సమేతంగా పాలించడం ప్రారంభించినందుకు నీకు మా కృతజ్ఞతలు.

  31. 7 కృతజ్ఞతా స్తుతులతో యెహోవాను కీర్తించండి. తంతి వాయిద్యంతో మన దేవునికి స్తుతి గీతాలు పాడండి.

    8 ఆయన ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు. భూమి కోసం వర్షం సిద్ధం చేస్తాడు. కొండల మీద గడ్డి మొలిపిస్తాడు.

    9 పశువులకు, అరుస్తూ ఉండే కాకి పిల్లలకు ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు.

  32. 23 మా పూర్వీకుల దేవా, నువ్వు నాకు వివేకాన్నీ, బలాన్నీ అనుగ్రహించావు. ఇప్పుడు మేము కోరుకున్నట్టు రాజుకు వచ్చిన సమస్యకు పరిష్కారం నువ్వే నాకు తెలియజేశావు. అందువల్ల నేను నిన్ను స్తుతిస్తున్నాను.”

  33. 3 మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన. 4 కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలిగానీ అసభ్యమైన మాటలు, మూర్ఖపు మాటలు, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలక కూడదు. ఇవి మీకు తగినవి కావు.

  34. 9 ఆ తరువాత సింహాసనం ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా ఒక మహా జనసమూహం నిలబడి ఉండడం నేను చూశాను. వీరిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. వారిలో ప్రతి జాతినుండీ, ప్రతి వంశం నుండీ, ప్రతి గోత్రం నుండీ, భూమి మీద ఉన్న అన్ని భాషల్లో మాట్లాడే వారి నుండీ ప్రజలు ఉన్నారు. వారు తెల్లని బట్టలు ధరించి చేతుల్లో ఖర్జూరం మట్టలు పట్టుకుని ఉన్నారు. 10 వీరంతా కలసి,

    “రక్షణ సింహాసనంపై కూర్చున్న మా దేవునిది, గొర్రెపిల్లది”

    అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు.

    11 దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారంతా సింహాసనం ఎదుట సాష్టాంగపడి తమ ముఖాలు నేలకు ఆనించి,

    12 “ఆమేన్! మా దేవుడికి కీర్తీ, యశస్సూ, జ్ఞానమూ, కృతజ్ఞతలు, ఘనత, శక్తి, మహా బలం కలకాలం కలుగు గాక” అని చెబుతూ దేవుణ్ణి పూజించారు.

    13 అప్పుడు ఆ పెద్దల్లో ఒకతను “తెల్లటి వస్త్రాలు వేసుకున్న వీళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని నన్ను అడిగాడు. 14 అందుకు నేను “అయ్యా, నీకే తెలుసు” అని జవాబిచ్చాను. అప్పుడు అతడు నాతో ఇలా చెప్పాడు, “వీరంతా మహా బాధల్లో నుండి వచ్చినవారే. వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ బట్టలు ఉతుక్కున్నారు. వాటిని తెల్లగా చేసుకున్నారు.

  35. 1 తండ్రి అయిన దేవునిలోనూ ప్రభు యేసు క్రీస్తులోనూ ఉన్న తెస్సలోనిక సంఘానికి పౌలు, సిల్వాను, తిమోతి రాస్తున్న సంగతులు. కృపా శాంతీ మీకు కలుగు గాక!

    2 మీ అందరి కోసం దేవునికి ఎప్పుడూ మా ప్రార్థనల్లో కృతజ్ఞతలు చెబుతూ మీ కోసం ప్రార్ధిస్తూ ఉన్నాం. 3 విశ్వాసంతో కూడిన మీ పనినీ, ప్రేమతో కూడిన మీ ప్రయాసనూ, మన ప్రభు యేసు క్రీస్తులో ఆశాభావం వల్ల కలిగిన మీ సహనాన్నీ మన తండ్రి అయిన దేవుని సమక్షంలో మేము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం.

    4 దేవుడు ప్రేమించిన సోదరులారా, దేవుడు మిమ్మల్ని తన ప్రజలుగా ఎంపిక చేసుకున్నాడని మాకు తెలుసు గనక ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. 5 ఎందుకంటే మీకు మేము సువార్త ప్రకటించినప్పుడు అది కేవలం మాటతో మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మీ మధ్య శక్తివంతంగా పని చేశాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడని మాకు తెలిసింది. తాను అలా చేస్తున్నానని మాకు పూర్తి నిశ్చయత కలిగించాడు. అదే విధంగా మీకు సహాయంగా ఉండాలని మేము మీ మధ్య ఎలా మాట్లాడామో, ఎలా ప్రవర్తించామో మీకు తెలుసు.

  36. 8 ఆయన నిబంధన విశ్వసనీయతను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

    9 ఎందుకంటే దాహం గొన్న వారిని ఆయన తృప్తిపరచాడు. ఆకలి గొన్నవారిని మేలుతో నింపాడు.

  37. 17 యెహోవా న్యాయాన్నిబట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. సర్వోన్నతుడైన యెహోవాకు స్తుతి కీర్తన పాడతాను.

  38. విశ్రాంతి దినం కోసం పాట, ఒక కీర్తన.

    1 యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం, మహోన్నతుడా, నీ నామానికి స్తుతి పాడడం మంచిది.

    2 ఉదయాన నీ కృపను ప్రతి రాత్రీ నీ విశ్వసనీయతను తెలియజేయడం మంచిది.

    3 పది తీగల వాయిద్యంతో, సితారా మాధుర్యంతో స్తుతించడం మంచిది.

  39. 11 యేసు ఆ రొట్టెలను చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత వడ్డించాడు.

  40. 3 నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా నా దేవునికి వందనాలు చెబుతాను. 4 మీ కోసం నేను ప్రార్థించే ప్రతిసారీ అది ఆనందభరితమైన ప్రార్థనే. 5 సువార్త విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ మీ సహవాసానికి వందనాలు. 6 మీలో ఈ మంచి పని మొదలు పెట్టినవాడు యేసు క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకూ ఆ పని కొనసాగించి పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం.

    7 మిమ్మల్ని గురించి నేనిలా భావించడం సబబే. ఎందుకంటే మీరు నా హృదయంలో ఉన్నారు. నేను ఖైదులో ఉన్నప్పుడూ, నేను సువార్త పక్షంగా వాదిస్తూ నిరూపిస్తున్నపుడు మీరంతా ఈ కృపలో నాతో పాలివారుగా ఉన్నారు. 8 క్రీస్తు యేసు ప్రేమ లోతుల్లో నుంచి, మీ కోసం నేనెంత తపిస్తున్నానో దేవుడే నాకు సాక్షి.

    9 మీ ప్రేమ జ్ఞానంతో, సంపూర్ణ వివేచనతో అంతకంతకూ వృద్ధి చెందుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. 10 దేవునికి మహిమ, స్తుతి కలిగేలా మీరు శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి తెలుసుకుని, యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతిఫలాలతో నిండి, క్రీస్తు వచ్చే రోజు వరకూ యథార్థంగా నిర్దోషంగా ఉండాలన్నదే నా ప్రార్థన 11 అంతేకాక దేవునికి మహిమ, స్తుతి కలిగేలా, మీరు యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతి ఫలాలతో నిండి ఉండాలి.

  41. 3 సోదరులారా, మేము ఎప్పుడూ మీ విషయమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది సముచితం. ఎందుకంటే మీ విశ్వాసం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మీలో ఒకరి పట్ల మరొకరు చూపే ప్రేమ అత్యధికం అవుతూ ఉంది. 4 అందుకే మీరు పొందుతున్న హింసలన్నిటిలోనూ, మీరు సహిస్తున్న యాతనల్లోనూ, మీ సహనాన్నీ, విశ్వాసాన్నీ చూసి దేవుని సంఘాల్లో మీ గురించి మేమే గర్వంగా చెబుతున్నాం.

  42. 7 యెహోవా నా బలం, నా డాలు. నా హృదయం ఆయనలో నమ్మిక ఉంచుతుంది గనక నాకు సహాయం కలిగింది. కాబట్టి, నా హృదయం ఉప్పొంగి పోతుంది. కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తున్నాను.

  43. 18 అప్పుడు నేను మహాసమాజంలో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అనేకమంది జనాలున్న చోట నిన్ను స్తుతిస్తాను.

  44. 1 యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం ఉంటుంది.

  45. 17 నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను. యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను

  46. 11 ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలో సమరయ, గలిలయ ప్రాంతాల గుండా వెళ్తూ 12 ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ కుష్టు రోగులు పదిమంది ఆయనకు ఎదురై దూరంగా నిలిచారు. 13 “యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు” అని గట్టిగా కేకలు వేశారు. 14 ఆయన వారిని చూసి, “మీరు వెళ్ళి, యాజకులకు కనపడండి” అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు.

    15 వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి 16 బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ, తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. వాడు సమరయ ప్రాంతం వాడు. 17 అందుకు యేసు, “పది మంది శుద్ధులయ్యారు కదా, తక్కిన తొమ్మిది మంది ఏరీ? 18 దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడక పోవడం ఏమిటి?” అన్నాడు. 19 “నువ్వు లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు.

  47. 7 ఆ రోజు దావీదు మొదటిగా ఆసాపునూ, అతని బంధువులనూ, యెహోవాను స్తుతిస్తూ కృతజ్ఞత అర్పించడానికి ఈ పాట పాడాలని నియమించాడు.

    8 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.

    ఆయన పేరును ప్రకటన చెయ్యండి.

    ఆయన కార్యాలను ప్రజల్లో తెలియజెయ్యండి.

    9 ఆయనను గూర్చి పాడండి.

    ఆయనను కీర్తించండి.

    ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.

  48. 11 వీరు వంతుల వారీగా “యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల మీద ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అని పాడుతూ యెహోవాను కీర్తించారు. యెహోవా మందిరం పునాది పడడం చూసిన ప్రజలంతా గొప్ప శబ్దంతో యెహోవాను స్తుతించారు.

  49. 1 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి.

    2 ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.

    3 ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక.

  50. 26 వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకుని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీన్ని మీరు తీసుకుని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు. 27 తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి. 28 ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం.

  51. 1 విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్న వారిని చేరదీయండి గానీ వారి అనుమానాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు. 2 ఆహార పదార్ధాలు అన్నీ తినవచ్చని ఒకడు నమ్ముతుంటే, ఇంకొకడు నమ్మకం లేక కూరగాయలే తింటున్నాడు. 3 తినేవాడు తినని వాణ్ణి తక్కువగా చూడకూడదు. తినని వాడు తినేవాడిపై నిందారోపణ చేయకూడదు. ఎందుకంటే దేవుడు అతణ్ణి అంగీకరించాడు. 4 వేరొకరి సేవకుని విషయంలో న్యాయం చెప్పడానికి నువ్వెవరివి? అతడు నిలబడినా, పడిపోయినా అది అతని యజమాని బాధ్యత. కాని అతడు నిలబడతాడు. ప్రభువు అతణ్ణి నిలబెట్టడానికి శక్తి గలవాడు.

    5 ఇంకొక చోట ఒకడు ఒక రోజు కంటే మరొక రోజు మంచిదని నమ్ముతున్నాడు. ఇంకొకడు రోజులన్నీ మంచివే అని నమ్ముతున్నాడు. ప్రతివాడూ తనకు తాను ఒక నిర్ణయానికి రావాలి. 6 ప్రత్యేకమైన రోజులను పాటించేవాడు ప్రభువు కోసమే ఆ పని చేస్తున్నాడు. తినేవాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు కాబట్టి ప్రభువు కోసమే తింటున్నాడు. అలాగే తిననివాడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి ప్రభువు కోసమే తినడం మానేస్తున్నాడు. 7 మనలో ఎవరూ తన కోసమే బతకడు, తన కోసమే చనిపోడు.

  52. 17 ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు.

  53. 1 ఇదంతా జరిగాక నేను చూస్తూ ఉన్నాను. అప్పుడు పరలోకంలో ఒక తలుపు తెరుచుకుని ఉంది. నేను ఇంతకు ముందు విన్న స్వరం భేరీ నాదంలా నాతో మాట్లాడుతుంటే విన్నాను. ఆ స్వరం, “పైకి రా. తరువాత జరగాల్సినవి నీకు చూపిస్తాను” అని పలికింది.

    2 వెంటనే నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. అప్పుడు పరలోకంలో ఉన్న ఒక సింహాసనాన్నీ, ఆ సింహాసనంపై కూర్చున్న ఒక వ్యక్తినీ చూశాను. 3 అలా కూర్చున్న వ్యక్తి చూడడానికి సూర్యకాంత మణిలాగా కెంపులాగా ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తూ ఒక ఇంద్రధనుస్సు ఆవరించి ఉంది.

    4 ఆ సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు వేరే సింహాసనాలున్నాయి. వాటి మీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి.

    5 ఆ సింహాసనం నుండి మెరుపులు, శబ్దాలు, ఉరుములు వస్తున్నాయి. సింహాసనం ముందు ఏడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు.

    6 ఆ సింహాసనం ఎదురుగా స్ఫటికంలాటి సముద్రంలాటిది ఉంది. ముందూ వెనకా కళ్ళు ఉన్న నాలుగు ప్రాణులు సింహాసనం చుట్టూ ఉన్నాయి. 7 మొదటి ప్రాణి సింహంలా ఉంది. రెండవది దూడలా ఉంది. మూడవ ప్రాణికి మనిషి ముఖంలాటి ముఖం ఉంది. నాలుగవ ప్రాణి ఎగురుతూ ఉన్న డేగలా ఉంది.

    8 ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికీ ఆరు రెక్కలున్నాయి. వాటి చుట్టూ, లోపలా, రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలూ రాత్రీ మానకుండా ఈ విధంగా చెబుతున్నాయి, “పూర్వం ఉండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అంతటినీ పరిపాలించే వాడూ, దేవుడూ అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!”

    9 ఆ ప్రాణులు సింహాసనంపై కూర్చుని శాశ్వతంగా జీవిస్తున్న వాడికి ఘనత, కీర్తి, కృతజ్ఞతలూ సమర్పిస్తూ ఉన్నప్పుడు 10 ఆ ఇరవై నలుగురు పెద్దలూ సింహాసనంపై కూర్చున్న వాడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు శాశ్వతంగా జీవిస్తున్న వాడికి మొక్కి, 11 “మా ప్రభూ, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి” అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు.

  54. ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. ముత్ లబ్బెన్ రాగం.

    1 హృదయ పూర్వకంగా నేను యెహోవాకు ధన్యవాదాలు చెల్లిస్తాను. యెహోవా, నీ ఆశ్చర్య కార్యాలన్నిటి గురించి నేను చెబుతాను.

    2 మహోన్నతుడైన యెహోవా! నేను నీ గురించి సంతోషించి హర్షిస్తాను. నీ నామానికి స్తుతి కీర్తన పాడుతాను.

  55. 11 నువ్వు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చావు. నా గోనెపట్ట తీసివేసి, సంతోషాన్ని నాకు వస్త్రంగా ధరింపజేశావు.

    12 అందుకే నా ప్రాణం మౌనంగా ఉండక, నీకు స్తుతులు పాడుతుంది. యెహోవా, నా దేవా, నేను నిన్ను ఎల్లకాలం స్తుతిస్తాను.

  56. 17 దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు. 18 తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు.

  57. 21 అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాలోనే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను.

    22 అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. 23 కానీ వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసులోని ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవాల్లోని పాప నియమానికి నన్ను బందీగా చేస్తున్నది. 24 అయ్యో, నేనెంత నికృష్టుణ్ణి? చావుకు లోనైన ఈ శరీరం నుండి నన్నెవరు విడిపిస్తారు? 25 మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెబుతున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవనియమానికీ, శరీర విషయంలో పాప నియమానికీ దాసుణ్ణి.

  58. 13 కాబట్టి తెలియని భాషతో మాట్లాడేవాడు దానికి అర్థం చెప్పే సామర్ధ్యం కోసం ప్రార్థన చేయాలి.

    14 నేను తెలియని భాషతో ప్రార్థన చేసినపుడు నా ఆత్మ ప్రార్థన చేస్తుంది గాని నా మనసు చురుకుగా ఉండదు. 15 కాబట్టి నేనేం చెయ్యాలి? నా ఆత్మతో ప్రార్ధిస్తాను, మనసుతో కూడా ప్రార్ధిస్తాను. ఆత్మతో పాడతాను, మనసుతో కూడా పాడతాను. 16 అలా కాకుండా, నీవు ఆత్మతో మాత్రమే స్తుతులు చెల్లిస్తే నీవు పలికిన దాన్ని గ్రహించలేని వ్యక్తి నీవు చెప్పిన కృతజ్ఞతలకు, “ఆమేన్‌” అని చెప్పలేడు కదా! 17 నీకై నీవు బాగానే స్తుతులు చెల్లిస్తావు గానీ ఎదుటి వ్యక్తికి మేలు కలగదు.

    18 దేవునికి స్తుతులు! నేను మీ అందరికంటే ఎక్కువగా తెలియని భాషలతో మాట్లాడతాను. 19 అయినా సంఘంలో తెలియని భాషతో పదివేల మాటలు పలకడం కంటే, ఇతరులకు ఉపదేశం దొరికేలా నా మనసుతో ఐదు మాటలు చెప్పడం మంచిది.

  59. 1 మా ప్రియ సోదరుడు, జతపనివాడు అయిన ఫిలేమోనుకు, 2 మన సోదరి అప్ఫియకు, మన సాటి సైనికుడు అర్ఖిప్పుకు, నీ ఇంట్లో సమావేశమయ్యే సంఘానికీ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు. 3 మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.

    4-5 ప్రభువైన యేసు పట్ల, పరిశుద్ధులందరి పట్ల నీకున్న ప్రేమను గూర్చి, విశ్వాసం గూర్చి నేను విని, నా ప్రార్థనల్లో మీ గురించి విజ్ఞాపన చేస్తూ, ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను. 6 విశ్వాసంలో నీవు పాల్గొనడం క్రీస్తులో మనకు ఉన్న ప్రతి మంచినీ నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం లో మరింత చురుకుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. 7 సోదరా, పరిశుద్ధుల హృదయాలకు నీవు సేద దీర్చావు కాబట్టి నీ ప్రేమ నాకెంతో ఆనందాన్నీ ఆదరణనూ తెచ్చింది.

  60. 4 యెహోవా భక్తులారా, ఆయన్ని కీర్తించండి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనను స్తుతించండి.

    5 ఆయన కోపం ఒక్క నిమిషమే ఉంటుంది. అయితే ఆయన దయ జీవిత కాలమంతా ఉంటుంది. రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ ఉదయానికి సంతోషం కలుగుతుంది.

  61. ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తష్హేత్ అనే రాగంలో పాడేది. ఆసాపు కీర్తన, ఒక పాట.

    1 దేవా, మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. నువ్వు నీ సన్నిధిని మాకు వెల్లడించావని నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. మనుషులు నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తారు.

  62. దావీదు కీర్తన.

    1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.

    2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు.

    3 ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు.

    4 నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు.

    5 నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.

  63. 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాల్లో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనలను దీవించాడు. 4 క్రీస్తులో మనలను సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనలను ఎన్నుకున్నాడు. 5 యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా స్వీకరించడానికి దేవుడు తన ప్రేమతో ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.

    6 తన దివ్యకృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దాన్ని తన ప్రియ కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు. 7 దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది. 8 ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు. 9 ఆయన క్రీస్తు ద్వారా తన ఇష్ట పూర్తిగా ప్రదర్శించిన పథకం తాలూకు రహస్య సత్యాన్ని మనకు తెలియజేశాడు.

    10 కాలం సంపూర్ణమైనప్పుడు పరలోకంలోనూ, భూమి మీదా ఉన్న సమస్తాన్నీ క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు. 11 క్రీస్తును ముందుగా నమ్మిన మనం తన మహిమకు కీర్తి కలగజేయాలని, 12 దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ఎన్నుకుని, మనకు వారసత్వం ఏర్పరచాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం ప్రకారం అన్ని కార్యాలనూ జరిగిస్తున్నాడు.

    13 మీరు కూడా సత్య వాక్యాన్ని అంటే రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసముంచారు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ద్వారా మీమీద ముద్ర పడింది. 14 దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగే వరకూ ఆత్మ మన వారసత్వానికి హామీగా ఉన్నాడు.

  64. 3 యెహోవా సీయోనును ఆదరిస్తాడు. పాడైన దాని స్థలాలన్నిటినీ ఆయన ఆదరిస్తాడు.

    దాని అరణ్య ప్రదేశాన్ని ఏదెనులాగా చేశాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటలాగా చేస్తున్నాడు.

    దానిలో ఆనందం, సంతోషం, కృతజ్ఞత, సంగీతనాదం, ఉంటాయి.

  65. 21 కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది.

    22 యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.

    23 ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు.

    నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!

    24 “యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది.

    కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.

  66. 13 మీరు మొదట మా నుండి దేవుని వాక్కు అయిన సందేశాన్ని స్వీకరించినప్పుడు దాన్ని మనుషుల మాటగా కాక దేవుని వాక్కుగా అంగీకరించారు. ఆ కారణం చేత మేము ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము. మీరు స్వీకరించిన ఆ సందేశం నిజంగా దేవుని వాక్కే. అది విశ్వసించిన మీలో పని చేస్తూ ఉంది కూడా.

  67. దావీదు కీర్తన

    1 నేను నా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అన్య దేవుళ్ళ ఎదుట కూడా నిన్ను కీర్తిస్తాను.

    2 నీ పరిశుద్ధ ఆలయం వైపుకు తిరిగి నిన్ను ఆరాధిస్తాను. నీ నిబంధన విశ్వసనీయత, నీ నమ్మకత్వాలను బట్టి నీ నామానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. నీవు నీ పేరు ప్రతిష్టలను, నీ వాక్కును గొప్ప చేశావు.

    3 నేను నిన్ను వేడుకున్న రోజున నువ్వు నాకు జవాబిచ్చావు. నన్ను ధైర్యపరచి నాలో బలం పుట్టించావు.

    4 యెహోవా, భూమిపై ఉన్న రాజులంతా నీ నోటి వెంట వచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారు.

    5 యెహోవా మహా బలప్రభావాలు గలవాడని వారు యెహోవా విధానాలను గూర్చి పాటలు పాడతారు.

  68. 19 ప్రజలు పచ్చిక మీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతిలో తీసుకుని ఆకాశం వైపు చూసి దీవించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు.

  69. 30 నేను కృతజ్ఞతతో పుచ్చుకొంటే కృతజ్ఞతలు చెల్లించిన దాని విషయంలో నేనెందుకు నిందకు గురి కావాలి?

    31 కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి.

  70. 23 కృతజ్ఞతార్పణ అర్పించే వాడు నన్ను స్తుతిస్తున్నాడు. తన ప్రయాణం సరైన మార్గంలో చేయాలని ఆలోచించే వాళ్లకు నేను దేవుని ముక్తిని చూపిస్తాను.

  71. 21 ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

    22 వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలను ప్రకటించుదురు గాక.

  72. 49 అందువల్ల యెహోవా, జాతులలో నేను నీకు కృతజ్ఞత తెలియజేస్తాను. నీ నామానికి స్తుతుల కీర్తన పాడతాను!

  73. 1 యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.

  74. 28 నువ్వు నా దేవుడివి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నువ్వు నా దేవుడివి. నిన్ను ఘనపరుస్తాను.

    29 యెహోవా దయాళుడు. ఆహా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నిబంధన విశ్వాస్యత శాశ్వతకాలం నిలిచి ఉంది.

  75. 4 “యెహోవాను స్తుతించండి. ఆయన పేరు పెట్టి పిలవండి. జనాల్లో ఆయన క్రియలు చాటించండి. ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి.

    5 యెహోవాను గూర్చి పాటలు పాడండి. ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈ సంగతి భూమంతా తెలియనివ్వండి.

  76. 12 నీతిమంతులారా, యెహోవా మూలంగా ఆనందించండి, ఆయన పవిత్ర నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పండి.

  77. 9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10 “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11 పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.

    14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.