76 Bible Verses About God's Mercy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About God's Mercy
  1. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.

    4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.

    6 దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. 7 రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనపరచడానికి ఆయన ఇలా చేశాడు.

    8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు.

  2. 14 కాబట్టి ఏమంటాము? దేవుడు అన్యాయం చేశాడనా? కానే కాదు. 15 అందుకు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “నేను ఎవరిపై కనికరం చూపాలనుకుంటానో వారిపై కనికరం చూపిస్తాను. ఎవరిపై జాలి చూపాలనుకుంటానో వారిపై జాలి చూపిస్తాను.” 16 కాబట్టి ఒకరు ఆశించడం వలన గానీ, ఒకరు ప్రయాస పడడం వలన గానీ కాదు, దేవుడు కనికరం చూపడం వల్లనే అవుతుంది.

    17 దేవుని వాక్కు ఫరోతో చెప్పిందేమంటే, “నేను నీలో నా బలాన్ని ప్రదర్శించాలి, నా పేరు భూలోకమంతా ప్రచురం కావాలి. ఈ ఉద్దేశం కోసమే నిన్ను హెచ్చించాను.” 18 కాబట్టి ఆయన ఎవరిని కనికరించాలి అనుకుంటాడో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలి అనుకుంటాడో వారిని కఠినపరుస్తాడు. 19 అలాగైతే, “ఆయన సంకల్పాన్ని ఎదిరించి నిలిచేదెవరు? ఇంకా ఆయన మనలను తప్పు పట్టడమెందుకు?” అని నీవు నాతో అనవచ్చు. 20 అది సరే గానీ, ఓ మనిషీ, దేవుణ్ణి ఎదురు ప్రశ్నించడానికి నీ వెవరివి? నన్నెందుకిలా చేశావు అని తయారైనది తనను తయారు చేసిన వానితో చెప్పగలదా? 21 ఒకే మట్టి ముద్దలో నుండి ఒక పాత్రను ప్రత్యేకమైన వాడకం కోసం, ఇంకొకటి రోజువారీ వాడకం కోసం చేయడానికి కుమ్మరికి అధికారం లేదా?

    22 ఆ విధంగా దేవుడు తన కోపాన్ని చూపాలనీ తన ప్రభావాన్ని వెల్లడి పరచాలనీ కోరుకుని, నాశనానికి నిర్ణయమై, కోపానికి గురైన పాత్రలను ఎంతో సహనంతో ఓర్చుకొంటే ఏమిటి? 23 తద్వారా మహిమ పొందాలని ఆయన ముందుగా సిద్ధం చేసిన ఆ కరుణ పొందిన పాత్రల పట్ల, 24 అంటే యూదులపై మాత్రమే కాక, యూదేతరుల్లో నుండి ఆయన పిలిచిన మనపై, తన మహిమైశ్వర్యాన్ని చూపాలని సంకల్పిస్తే ఏమిటి?

  3. 19 నా బాధ, నా దురవస్థ, నేను తాగిన ద్రావకపు చేదు నేను గుర్తు చేసుకుంటున్నాను.

    20 కచ్చితంగా నేను వాటిని గుర్తు చేసుకుని, నాలో నేను కృంగిపోయాను.

    21 కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది.

    22 యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.

    23 ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు.

    నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!

    24 “యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది.

    కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.

  4. 14 ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. 16 కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.

  5. 12 నన్ను బలపరచి, నమ్మకమైన వాడుగా ఎంచి తన సేవకు నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకి కృతజ్ఞుణ్ణి. 13 అంతకు ముందు దేవ దూషకుణ్ణి, హింసించేవాణ్ణి, హానికరుణ్ణి. అయితే తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి కనికరం పొందాను. 14 మన ప్రభువు తన ధారాళమైన కృపను నాపై కుమ్మరించి, యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ విశ్వాసాలను అనుగ్రహించాడు. 15 పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగినదీ, సంపూర్ణంగా అంగీకరించదగినదీ. అలాంటి పాపుల్లో నేను మొదటి వాణ్ణి.

    16 అయినా నిత్యజీవం కోసం తనపై విశ్వాసముంచబోయే వారికి నేను ఒక నమూనాగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన ఓర్పును నాలో కనుపరచేలా నన్ను కరుణించాడు. 17 అన్ని యుగాల్లో రాజూ, అమర్త్యుడూ, అదృశ్యుడూ అయిన ఏకైక దేవునికి ఘనత, మహిమ యుగయుగాలు కలగాలి. ఆమేన్‌.

  6. 7 కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.

  7. 35 మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు. 36 మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి.

    37 ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు ఎవరూ మీకు తీర్పు తీర్చరు. ఎవరి మీదా నేరారోపణ చేయవద్దు. అప్పుడు ఎవరూ మీ మీద నేరం మోపరు. ఇతరులను క్షమించండి. అప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది.

  8. 4 యెహోవా, నీ మార్గాలు నాకు తెలియజెయ్యి. నీ త్రోవలు నాకు నేర్పించు.

    5 నీ సత్యంలోకి నన్ను నడిపించి నాకు బోధించు, ఎందుకంటే నువ్వే నా రక్షణకర్తవైన దేవుడివి. రోజంతా నేను నీ కోసం కనిపెడతాను.

    6 యెహోవా, నీ కరుణతో, నిబంధన నమ్మకత్వంతో నువ్వు చేసిన పనులు గుర్తు చేసుకో. ఎందుకంటే అవి ఎప్పుడూ నిలిచి ఉన్నాయి.

    7 బాల్యంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనం గుర్తు చేసుకోవద్దు. యెహోవా, నీ మంచితనంతో, నీ నిబంధన నమ్మకత్వంతో నన్ను గుర్తు చేసుకో.

  9. 18 నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి.

    నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి.

    నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి.

    నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు.

    19 నువ్వు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తావు.

    నీ పాదాల కింద మా అపరాధాలను నువ్వు తొక్కేస్తావు.

    మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు నువ్వు పడవేస్తావు.

    20 నువ్వు యాకోబుకు సత్యాన్ని ఇస్తావు.

    పూర్వకాలంలో మా పూర్వీకులు అబ్రాహాముకు ప్రమాణం చేసిన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తావు.

  10. 67 అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా పలికాడు,

    68 “ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందు గాక.

    ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగించాడు.

    69 తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు.

    70-73 మన శత్రువులబారి నుండీ మనలను ద్వేషించే వారందరి చేతినుండీ తప్పించి రక్షణ నిచ్చాడు.

    దీన్ని గురించి ఆయన ఆదినుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు.

    ఆయన మన పూర్వీకులను కరుణించడానికీ తన పవిత్ర ఒడంబడికను,

    అంటే మన తండ్రి అయిన అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికీ ఈ విధంగా జరిగించాడు.

    74-75 మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది,

    పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో,

    పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ,

    భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే,

    మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం.

    76-78 ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు.

    మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి,

    వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా,

    ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు.

    79 మన పాదాలను శాంతి మార్గంలో

    నడిపించేలా చీకటిలోను, చావు నీడలోను కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది.

    ఆ మహా వాత్సల్యాన్ని బట్టి పై నుండి ఆయన మనపై ఉదయ కాంతి ప్రసరింపజేశాడు.”

  11. 6 భర్త వదిలి వేయగా ఎంతో విచారంతో ఉన్న భార్యను భర్త తిరిగి రప్పించినట్టు, పడుచుతనంలో పెళ్ళిచేసుకుని తృణీకారానికి గురి అయిన భార్యను తిరిగి రప్పించినట్టుగా యెహోవా నిన్ను తిరిగి రప్పించాడని, నీ దేవుడు చెబుతున్నాడు.

    7 కొంతసేపే నేను నిన్ను వదిలేశాను. అయితే ఎంతో జాలితో నేను నిన్ను చేరదీస్తాను.

    8 కాసేపే నీమీద కోపంతో నా ముఖం దాచాను.

    నీ మీద జాలి చూపిస్తాను. నిన్నెప్పటికీ నమ్మకంగా ప్రేమిస్తానని నిన్ను విమోచించే యెహోవా చెబుతున్నాడు.

  12. 12 నిజమైన స్వాతంత్రం ఇచ్చే ధర్మశాస్త్రం విషయంలో తీర్పుకు గురయ్యే వారికి తగినట్టుగా మాట్లాడండి. అదే విధంగా ప్రవర్తించండి. 13 కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది.

  13. 1 పరిపాలకులకూ, అధికారులకూ లోబడి ఉండాలనీ ప్రతి మంచి పనీ చేయడానికి సిద్ధంగా ఉండాలనీ వారికి గుర్తు చెయ్యి. 2 వారు ఎవరినీ దూషించకుండా, వాదనలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా మనుషులందరి పట్లా సంపూర్ణమైన మర్యాద కలిగి జీవించాలి. 3 ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ద్వేషానికి గురి అవుతూ ద్వేషిస్తూ ఉండేవాళ్ళం.

    4 అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు 5 మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. 6-7 దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.

    8 ఈ మాట నమ్మదగింది కాబట్టి దేవునిలో విశ్వసించేవారు తమ ఎదుట ఉంచబడిన మంచి పనులు శ్రద్ధగా చేయడంలో మనసు లగ్నం చేయమని నీవు ఈ సంగతులను గూర్చి గట్టిగా చెప్పాలని నేను కోరుతున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి.

    9 అంతేగానీ, అర్థం పర్ధంలేని వాదాలు, వంశావళులను గూర్చిన వాదోపవాదాలు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వివాదాల వలన ప్రయోజనం శూన్యం. అవి ఎందుకూ కొరగానివి కాబట్టి వాటికి దూరంగా ఉండు. 10 మీలో విభేదాలు కలిగించే వారిని ఒకటి రెండుసార్లు హెచ్చరించిన తరువాత వారితో తెగతెంపులు చేసుకో. 11 నీకు తెలుసు, అలాటివాడు దారి తప్పిపోయి పాపం చేసి తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు.

  14. 3 మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.

    4 దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది. 5 ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి.

  15. 17 నీవు మేలిమి బంగారంతో ప్రాయశ్చిత్త స్థానమైన మూతను చెయ్యాలి. దాని పొడవు రెండు మూరలున్నర. దాని వెడల్పు మూరెడున్నర. 18 సాగగొట్టిన బంగారంతో రెండు బంగారు కెరూబు రూపాలను చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూత రెండు అంచులతో వాటిని ఏకాండంగా చెయ్యాలి. 19 ఈ కొనలో ఒక కెరూబును ఆ కొనలో ఒక కెరూబును చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూతపై దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండంగా చెయ్యాలి. 20 ఆ కెరూబులు రెక్కలు పైకి విచ్చుకుని ప్రాయశ్చిత్త మూతను తమ రెక్కలతో కప్పుతూ ఉండాలి. వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. ఆ కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూత వైపుకి తిరిగి ఉండాలి. 21 నీవు ఆ మూతను మందసం మీద ఉంచాలి. నేను నీకిచ్చే శాసనాలను ఆ మందసంలో ఉంచాలి. 22 అక్కడ నేను నిన్ను కలుసుకుని ప్రాయశ్చిత్త మూత మీద నుండి, శాసనాలున్న మందసం మీద ఉన్న రెండు కెరూబుల మధ్య నుండి, ఇశ్రాయేలీయుల కోసం ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ నీకు తెలియజేస్తాను.

  16. ప్రధాన సంగీతకారుడి కోసం. బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు దగ్గరకు నాతాను వచ్చినప్పుడు దావీదు రాసిన కీర్తన.

    1 దేవా, నీ నిబంధన కృప కారణంగా నన్ను కనికరించు. నీ అధికమైన కరుణను బట్టి నా దోషాలను తుడిచివెయ్యి.

    2 నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు. నా పాపం నుండి నన్ను పవిత్రపరచు.

    3 నా అతిక్రమాలేంటో నాకు తెలుసు. నేను చేసిన పాపం నా కళ్ళ ఎదుటే ఉంది.

    4 నీకు వ్యతిరేకంగా, కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతావు. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు.

  17. 5 యెహోవా మేఘం నుండి దిగి అక్కడ మోషే దగ్గర నిలిచి యెహోవా తనను వెల్లడి చేసుకున్నాడు.

    6 యెహోవా అతని ఎదురుగా అతణ్ణి దాటి వెళ్తూ “యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, అమితమైన కృప, సత్యం గల దేవుడు. 7 ఆయన వేలాది మందికి తన కృప చూపిస్తాడు. అతిక్రమాలు, అపరాధాలు, పాపాలు క్షమిస్తాడు. అయితే దోషులను ఏమాత్రం శిక్షించకుండా ఉండడు. తండ్రుల దోష ఫలితం మూడు నాలుగు తరాలదాకా వారి సంతానం మీదికి రప్పించేవాడు” అని ప్రకటించాడు.

  18. 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  19. 8 యెహోవా దయ, వాత్సల్యం గలవాడు. ఆయన కోపం విషయంలో నిదానించే వాడు. నిబంధన విశ్వసనీయత ఆయనలో పొంగి పొరలుతూ ఉంది.

    9 యెహోవా అందరికీ మేలు చేస్తాడు. సృష్టి అంతటి మీదా ఆయన వాత్సల్యం చూపుతాడు.

  20. 17 ‘యెహోవా దీర్ఘశాంతుడు, నిబంధన నమ్మకత్వం సమృద్ధిగా కలిగినవాడు. 18 దోషం, అతిక్రమం పరిహరించేవాడు. అపరాధిని నిరపరాధిగా ఎంచకుండా, మూడు నాలుగు తరాల వరకూ తండ్రుల దోషాన్ని కొడుకుల మీదికి తెచ్చే వాడిగా ఉన్నాడు’ అని నువ్వు చెప్పిన మాట ప్రకారం నా ప్రభువు బలానికి ఘనత కలుగు గాక. 19 ఐగుప్తులోనుంచి వచ్చింది మొదలు ఇంతవరకూ నువ్వు ఈ ప్రజల పాపం పరిహరించినట్టు నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్నిబట్టి ఈ ప్రజల పాపాన్ని దయచేసి క్షమించు” అన్నాడు.

  21. 10 మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు.

    11 భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం.

    12 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు.

    13 తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు, యెహోవా తనను గౌరవించే వాళ్ళను జాలితో చూసుకుంటాడు.

    14 మనం ఎలా సృష్టి అయ్యామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు.

  22. 6 యెహోవా మీకు దొరికే సమయంలో ఆయన్ని వెదకండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయన్ని వేడుకోండి.

    7 భక్తిహీనులు తమ మార్గం విడిచిపెట్టాలి. చెడ్డవాళ్ళు తమ తలంపులు మార్చుకోవాలి.

    వాళ్ళు యెహోవా వైపు తిరగాలి. అప్పుడు ఆయన వారి మీద జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగితే ఆయన అధికంగా క్షమిస్తాడు.

    8 “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ విధానాలు నా విధానాల వంటివి కావు.” ఇదే యెహోవా వాక్కు.

    9 “ఆకాశాలు భూమి కంటే ఎత్తుగా ఉన్నాయి. అలాగే నా విధానాలు మీ విధానాల కంటే, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి.

    10 వాన, మంచు ఆకాశాన్నుంచి వచ్చి భూమిని తడుపుతాయి.

    దానినుంచి విత్తనం చల్లే వాడికి విత్తనాన్నీ తినడానికి తిండినీ ఇచ్చేలా, మొక్కలు మొలిచి ఫలించేలా చేస్తాయి.

    అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగి వెళ్ళవు.

    11 ఆలాగే నా నోట నుంచి వచ్చే మాట ఉంటుంది. నిష్ఫలంగా నా దగ్గరికి తిరిగి రాదు.

    అది నా సంకల్పాన్ని నెరవేరుస్తుంది. నేను పంపించిన ఉద్దేశాన్ని సాధిస్తుంది.

  23. 8 మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు.

    ఆయన నిన్ను కోరేదేంటంటే,

    న్యాయంగా ప్రవర్తించు.

    కనికరాన్ని ప్రేమించు.

    వినయంగా నీ దేవునితో నడువు.

  24. 15 అయితే ప్రభూ, నువ్వు కృపా కనికరాలు గల దేవుడివి. కోపించడానికి నిదానించే వాడివి. అత్యంత కృపగల వాడివి. నమ్మదగిన వాడివి.

    16 నావైపు తిరిగి నన్ను కనికరించు, నీ సేవకుడికి నీ బలం ఇవ్వు. నీ సేవకురాలి కొడుకును కాపాడు.

  25. 12 యెహోవా ఇలా అంటున్నాడు,

    “ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ

    హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.”

    13 మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు.

    త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు.

    శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు.

    కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక

    మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి.

    14 ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో.

    మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని,

    పానార్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో ఎవరికి తెలుసు?

  26. 50 ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది.

  27. 5 ప్రభూ, నువ్వు మంచివాడివి. క్షమించడానికి సిద్ధంగా ఉంటావు. నీకు మొరపెట్టే వారందరినీ అమితంగా కనికరిస్తావు.

  28. 12 నువ్వు వెళ్లి ఉత్తరం వైపుకు ఇలా ప్రకటించు, విశ్వాసం లేని ఇశ్రాయేలూ, తిరిగి రా. మీ మీద నేను కోపపడను. నేను దయగలవాణ్ణి కాబట్టి శాశ్వతంగా కోపించేవాణ్ణి కాను.” ఇదే యెహోవా వాక్కు.

  29. 1 యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం ఉంటుంది.

  30. 9 మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేశాము. అయితే ఆయన కృప, క్షమాగుణం ఉన్న దేవుడు.

  31. 8 యెహోవా దయాళువు, కృపాభరితుడు. ఆయన సహనశీలి, నిబంధన సంబంధమైన నమ్మకత్వం ఆయనలో ఉంది.

  32. 13 అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు.

    14 ఎల్లప్పుడూ ఎవరైతే చేడు పనులు చేయకుండా భయంతో ఉంటారో వాడు ధన్యుడు. హృదయాన్ని కఠినపరచుకొనేవాడు కీడులో పడిపోతాడు.

  33. 13 నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికే వచ్చాను, నీతిపరులను కాదు. కాబట్టి మీరు వెళ్ళి ‘మీరు బలులు అర్పించడం కాదు, కనికరం చూపించాలనే కోరుతున్నాను’ అనే వాక్యభావం నేర్చుకోండి” అని చెప్పాడు.

  34. 21 అప్పుడు పేతురు వచ్చి, “ప్రభూ, నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్లు సరిపోతుందా?” అని యేసుని అడిగాడు. 22 అందుకు యేసు అతనికి జవాబిస్తూ, “ఏడు సార్లు వరకే కాదు, ఏడుకు డెబ్భై సార్ల వరకూ అని నీతో చెబుతున్నాను. 23 కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడడానికి పూనుకున్నట్టు ఉంది.

    24 అతడు లెక్క చూడడం ప్రారంభించగానే, అతనికి పదివేల తలాంతులు బాకీపడిన ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు. 25 ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ రాజు అతనినీ అతని భార్యనూ అతని పిల్లలనూ, ఇంకా అతనికి ఉన్నదంతా అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు. 26 అప్పుడా పనివాడు ఆ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, ‘రాజా, నా విషయం కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. 27 ఆ రాజు జాలిపడి, అతని బాకీ అంతా క్షమించి, అతనిని విడిచి పెట్టేశాడు.

    28 అయితే ఆ పనివాడు బయటికి వెళ్ళి తనకు కేవలం వంద దేనారాలు బాకీ ఉన్న తోటి పనివాణ్ణి చూసి ‘నా బాకీ తీర్చు’ అని అతని గొంతు పట్టుకున్నాడు. 29 అందుకు అతని తోటి పనివాడు సాగిలపడి, ‘కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. 30 కాని దానికి అతడు ఒప్పుకోక తన బాకీ తీర్చేవరకూ అతణ్ణి ఖైదులో పెట్టించాడు.

    31 “అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి, వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు. 32 అప్పుడా రాజు ఆ మొదటి పనివాణ్ణి పిలిపించి, ‘నువ్వు చెడ్డవాడివి. నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ బాకీ అంతా క్షమించేశానే! 33 నేను నీ మీద దయ చూపించినట్టే నీవు కూడా నీ తోటి పనివాణ్ణి క్షమించాలి కదా’ అని చెప్పి 34 అతని మీద కోపంతో అతడు తనకు బాకీపడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టే వారికి అతన్ని అప్పగించాడు.

    35 మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.

  35. 29 వారు యెరికో దాటి వెళుతుండగా గొప్ప జనసమూహం ఆయన వెంట వెళ్తూ ఉంది. 30 అప్పుడు దారి పక్కనే కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, “ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు” అని కేకలు వేశారు. 31 ప్రజలు వారిని కేకలు వేయవద్దని గద్దించారు గాని వారు, “ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు” అని ఇంకా పెద్దగా కేకలు వేశారు.

    32 యేసు ఆగి, వారిని పిలిచి, “మీకోసం నన్నేమి చేయమంటారు?” అని అడిగాడు. 33 వారు, “ప్రభూ, మాకు చూపు అనుగ్రహించు” అన్నారు. 34 యేసు వారిమీద జాలిపడి వారి కళ్ళు ముట్టుకున్నాడు. వెంటనే వారు చూపు పొంది ఆయన వెంట వెళ్ళారు.

  36. 21 ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి. 22 అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి. 23 భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. 24 నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. 25 క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. 26 ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.

    27 కాబట్టి మనం గొప్పలు చెప్పుకోడానికి కారణమేది? దాన్ని కొట్టివేయడం అయిపోయింది. ఏ నియమాన్ని బట్టి? క్రియలను బట్టా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టే.

  37. 31 మీ దేవుడు యెహోవా కనికరం గలవాడు కాబట్టి మీ చెయ్యి విడవడు, మిమ్మల్ని నాశనం చేయడు. తాను మీ పూర్వీకులతో చేసిన నిబంధన వాగ్దానాన్ని మరచిపోడు.

  38. 14 వారు కొండ దిగి అక్కడి జనసమూహంలోకి రాగానే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకరించి, 15 “ప్రభూ, నా కొడుకును కనికరించు. వాడు మూర్ఛరోగి. చాలా బాధపడుతున్నాడు. పదే పదే నిప్పుల్లో నీళ్ళలో పడిపోతుంటాడు. 16 వాణ్ణి నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాను గాని వారు బాగుచేయలేక పోయారు” అని చెప్పాడు. 17 అందుకు యేసు, “వక్ర మార్గం పట్టిన విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎప్పటి వరకూ మిమ్మల్ని సహిస్తాను? అతణ్ణి నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు. 18 యేసు ఆ దయ్యాన్ని గద్దించగానే అది ఆ బాలుణ్ణి విడిచిపెట్టేసింది. వెంటనే అతడు బాగుపడ్డాడు.

  39. 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు.

    4 ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.

  40. 13 బాధకు గురి అయిన తన ప్రజల మీద యెహోవా జాలిపడి వారిని ఓదారుస్తాడు.

    ఆకాశమా, ఉత్సాహధ్వని చెయ్యి. భూమీ, సంతోషించు. పర్వతాల్లారా, ఆనందగీతాలు పాడండి.

  41. 21 యేసు బయలుదేరి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. 22 అప్పుడు అక్కడ నివసించే కనాను జాతి స్త్రీ ఒకామె వచ్చి, “ప్రభూ, దావీదు కుమారా, నన్ను కరుణించు. నా కూతురికి దయ్యం పట్టి విపరీతంగా బాధ పెడుతున్నది” అని పెద్దగా అరిచి చెప్పింది.

    23 కానీ ఆయన ఏమీ బదులు పలకలేదు. అప్పుడు ఆయన శిష్యులు, “ఈమె కేకలు వేస్తూ మన వెంటే వస్తున్నది, ఈమెని పంపించెయ్యి” అని ఆయనను వేడుకున్నారు. 24 దానికి ఆయన, “దేవుడు ఇశ్రాయేలు వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకే నన్ను పంపించాడు, ఇంకెవరి దగ్గరకూ కాదు” అని జవాబిచ్చాడు. 25 అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నాకు సహాయం చెయ్యి” అంది. 26 ఆయన, “పిల్లలు తినే రొట్టెను కుక్కపిల్లలకి పెట్టడం సరి కాదు” అని ఆమెతో అన్నాడు. 27 ఆమె, “ప్రభూ, నిజమే! కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపై నుండి కింద పడే ముక్కలు తింటాయి కదా” అంది.

    28 అందుకు యేసు, “నీ నమ్మకం గొప్పదమ్మా. నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది” అని ఆమెతో చెప్పాడు. సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది.

  42. 19 ఆయన “నా మంచితనమంతా నీ ఎదుట నుండి దాటిపోయేలా చేస్తాను. యెహోవా అనే నా పేరును నీ ఎదుట ప్రకటిస్తాను. నాకు ఎవరిమీద కరుణ చూపాలని ఉందో వాళ్ళను కరుణిస్తాను, ఎవరి మీద జాలిపడాలో వారిపట్ల జాలి చూపిస్తాను” అన్నాడు.

  43. 14 అందుకు దావీదు “గొప్ప చిక్కులో పడ్డాను. యెహోవా కరుణా సంపన్నుడు గనక మనుషుల చేతిలో పడడం కంటే యెహోవా చేతిలోనే పడదాము” అని గాదుతో అన్నాడు.

  44. 27 అందువల్ల నువ్వు వాళ్ళను వారి శత్రువుల వశం చేశావు. ఆ శత్రువులు వారిని బాధించినప్పుడు వారు కష్టాల పాలై నీకు మొర పెట్టినప్పుడు పరలోకంలో ఉన్న నువ్వు వారి మొర ఆలకించి, వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించడానికి నీ కృపా బాహుళ్యాన్ని బట్టి వారిని విడిపించే రక్షకులను పంపించావు.

  45. 17 కాని ప్రియులారా, అంతకు ముందు మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు పలికిన మాటలను గుర్తు చేసుకోండి. 18 చివరి కాలంలో భక్తిలేని తమ ఆశలననుసరించి నడుచుకొంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని అపొస్తలులు మీతో చెప్పారు. 19 వీరు సహజ సిద్ధంగా దైవాత్మ లేని వారు. ప్రకృతి సంబంధులు, భేదాలు కలిగించేవారు.

    20 కాని ప్రియులారా, అతి పవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ 21 మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి. 22 అనుమానంతో ఉన్న కొంతమంది పట్ల దయగా ఉండండి. 23 అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించండి. ఇంకొంత మందిపై భయంతో కూడిన దయ చూపండి. పాపంతో మలినమైన దుస్తులను సైతం మీరు అసహ్యించుకోండి.

  46. 15 ఉదయం అయినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టారు. “రా, రా, బయల్దేరు. ఈ ఊరికి కలుగబోయే శిక్షలో తుడిచి పెట్టుకుపోకుండా నీ భార్యనూ ఇక్కడే ఉన్న నీ ఇద్దరు కూతుళ్లనూ తీసుకుని బయల్దేరు” అన్నారు.

    16 అయితే అతడు ఆలస్యం చేసాడు. యెహోవా అతని పట్ల కనికరం చూపడం వల్ల ఆ మనుషులు అతని చేతినీ, అతని భార్య చేతినీ అతని ఇద్దరు కూతుళ్ళ చేతులనూ పట్టుకున్నారు. వాళ్ళని బయటకు తీసుకువచ్చారు. అలానే పట్టణం బయటకు తీసుకువచ్చారు. 17 ఆ దూతలు వారిని పట్టణం బయటకు తీసుకు వచ్చిన తరువాత వాళ్ళలో ఒకడు “మీ ప్రాణాలు దక్కించుకోవడం కోసం పారిపొండి. వెనక్కు తిరిగి చూడవద్దు. మైదాన ప్రాంతాల్లో ఎక్కడా ఆగవద్దు. మీరు తుడిచి పెట్టుకుపోకుండేలా పర్వతాల్లోకి పారిపోయి తప్పించుకోండి” అని చెప్పాడు.

    18 అప్పుడు లోతు “ప్రభువులారా, అలా కాదు. 19 మీ సేవకుడినైన నన్ను దయ చూశారు. నా ప్రాణాన్ని రక్షించి నా పట్ల మీ మహా కనికరాన్ని ప్రదర్శించారు. కానీ నేను ఆ పర్వతాలకు పారిపోయి తప్పించుకోలేను. ఆ పర్వతాలను చేరుకునే లోపుగానే ఏదైనా కీడు నాపైకి వస్తుందేమో. అలా జరిగి నేను ఇక్కడే చనిపోతానేమో. 20 చూడండి, నేను పారిపోవడానికి ఆ కనిపించే ఊరు దగ్గర్లో ఉంది. నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి. అది చిన్నది గదా, నేను బతుకుతాను” అన్నాడు.

    21 అప్పుడు ఆయన “అలాగే, ఈ మనవి కూడా అంగీకరిస్తున్నాను. నువ్వు చెప్పిన ఈ ఊరిని నేను నాశనం చేయను. 22 నువ్వు త్వరపడి, అక్కడికి వెళ్లి తప్పించుకో. నువ్వు అక్కడకు చేరుకునే వరకూ నేను ఏమీ చేయలేను” అన్నాడు. కాబట్టి ఆ ఊరికి సోయరు అనే పేరు వచ్చింది.

  47. 30 నువ్వు అనేక సంవత్సరాలు వారిని సహించి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారిని హెచ్చరించినా వారు లక్ష్యపెట్ట లేదు. అందువల్ల నువ్వు వాళ్ళని పొరుగు ప్రాంతాల ప్రజలకు అప్పగించేశావు.

    31 నువ్వు నిజంగా కృపా కనికరాలు ఉన్న దేవుడవు. నీ కనికరాన్నిబట్టి వారిని పూర్తిగా నాశనం కాకుండా కాపాడావు.

  48. 18 నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను. 19 ఇక నుండి నీ కొడుకు అనిపించుకోవడానికి నాకు ఏ అర్హతా లేదు. నన్ను నీ కూలీల్లో ఒకడిగా పెట్టుకో అని చెబుతాను.’ ఇలా అనుకుని అతడు లేచి తన తండ్రి దగ్గరికి వచ్చాడు.

    20 అతడింకా దూరంగా ఉండగానే తండ్రి అతణ్ణి చూసి కనికరపడి, పరుగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. 21 అప్పుడు ఆ కొడుకు తండ్రితో, ‘నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను. ఇక నుండి నీ కొడుకునని చెప్పుకోడానికి నాకు ఏ యోగ్యతా లేదు’ అన్నాడు.

    22 “అయితే తండ్రి తన సేవకులతో, “శ్రేష్ఠమైన బట్టలు తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని చేతికి ఉంగరం పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడగండి. 23 కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం తిని సంబరాలు చేసుకుందాం. 24 నా ఈ కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు. తప్పిపోయి దొరికాడు’ అని చెప్పాడు. అప్పుడు వారంతా సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు.

  49. 8 మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.

    9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు. 10 మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయనను అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.

  50. 18 అయినా మీపై దయ కనపరచాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మల్ని కరుణించాలని నిలబడి ఉన్నాడు.

    యెహోవా న్యాయం తీర్చే దేవుడు. ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు ధన్యులు.

  51. 14 “మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు. 15 మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు.

  52. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

  53. 28 సువార్త విషయమైతే మిమ్మల్ని బట్టి వారు ద్వేషించబడి ఉండవచ్చు గానీ, దేవుని ఎన్నిక విషయమైతే పితరులను బట్టి వారు దేవునికి ప్రియమైన వారు. 29 ఎందుకంటే, దేవుని కృపావరాలు, ఆయన పిలుపు విషయాల్లో ఆయన మార్పు లేని వాడు. 30 గతంలో మీరు దేవునికి అవిధేయులు. ఇప్పుడు యూదుల అవిధేయత మూలంగా మీరు కనికరం పొందారు. 31 అలాగే మీపై చూపిన కనికరాన్ని బట్టి ఇప్పుడు కనికరం పొందడం కోసం, వారు ఇప్పుడు అవిధేయులుగా ఉన్నారు. 32 అందరి పైనా తన కనికరం చూపాలని, దేవుడు అందరినీ లోబడని స్థితిలో మూసివేసి బంధించాడు.

  54. 25 నా సోదరుడు, జతపని వాడు, సాటి యోధుడు, మీ ప్రతినిధి, నాకు అవసరమైనప్పుడు సేవ చేసే వాడు అయిన ఎపఫ్రొదితును మీ దగ్గరికి పంపడం అవసరమనుకున్నాను. 26 అతడు జబ్బు పడ్డాడని మీకు తెలిసింది కాబట్టి అతడు మీ అందరితో ఉండాలని చాలా బెంగగా ఉన్నాడు. 27 అతడు చావుకు దగ్గరగా వెళ్ళాడు, కానీ దేవుడు అతని మీద జాలి చూపించాడు. అతని మీదే కాదు, దుఃఖం వెంట దుఃఖం కలగకుండా నా మీద కూడా జాలి చూపాడు. 28 కాబట్టి మీరు అతన్ని మళ్ళీ చూసి సంతోషించేలా, నా విచారం తగ్గేలా అతన్ని త్వరపెట్టి పంపుతున్నాను. 29 ఎపఫ్రొదితును పూర్ణానందంతో ప్రభువు పేరిట చేర్చుకోండి. అలాంటి వారిని గౌరవంగా చూడండి. 30 ఎందుకంటే అతడు క్రీస్తు పనిలో దాదాపు చావును ఎదుర్కొన్నాడు. నాకు సేవ చేయడానికీ మీరు తీర్చలేకపోయిన నా అవసరాలను మీ బదులు తీర్చడానికి, అతడు తన ప్రాణం సైతం లెక్కచేయలేదు.

  55. 2 యెహోవా, నేను నీరసంగా ఉన్నాను. నన్ను కరుణించు, యెహోవా, నా ఎముకలు వణుకుతున్నాయి, నన్ను స్వస్థపరచు.

  56. 31 ప్రభువు అతన్ని ఎల్లకాలం తృణీకరించడు.

    32 ఆయన శోకం రప్పించినా, తన నిబంధన నమ్మకత్వపు గొప్పదనాన్ని బట్టి కనికరం చూపిస్తాడు.

    33 హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు.

  57. 23 నేను ఆమెను భూమిలో నాకోసం నాటుతాను.

    లో రుహమా పై నేను జాలి పడతాను.

    నా ప్రజలు కానివారితో “మీరే నా ప్రజలు” అని నేను చెప్పగా,

    వారు “నీవే మా దేవుడివి” అంటారు. ఇదే యెహోవా వాక్కు.

  58. 13 మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి. 14 కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి. 15 ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది.

    16 ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి. 17 అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం. తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది. సమ్మతి గలది. కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది.

  59. 10 ఒకప్పుడు మీరు ప్రజ కాదు.

    కానీ ఇప్పుడు దేవుని ప్రజ.

    పూర్వం మీరు కనికరానికి నోచుకోలేదు.

    అయితే ఇప్పుడు కనికరం పొందారు.

  60. 10 నీ నీతిని నా హృదయంలో దాచుకుని ఉండలేదు. నీ విశ్వసనీయతనూ, నీ ముక్తినీ నేను ప్రకటించాను. నీ నిబంధన కృపనూ, నీ విశ్వసనీయతనూ మహా సమాజానికి ప్రకటించకుండా నేను దాచలేదు.

    11 యెహోవా, నా కోసం నువ్వు కనికరంతో చేసే పనులను నా నుండి దూరం చేయకు. నీ నిబంధన కృప, నీ విశ్వసనీయత ఎప్పుడూ నన్ను కాపాడనీ.

    12 అసంఖ్యాకమైన ఆపదలు నన్ను చుట్టుముట్టాయి. నా దోషాలు నన్ను తరిమి పట్టుకున్నాయి. దాంతో నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను. అవి నా తల వెంట్రుకలకంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. నా గుండె జారిపోయింది.

  61. 27 యేసు అక్కడనుంచి వెళ్తూ ఉంటే ఇద్దరు గుడ్డివారు ఆయనను అనుసరిస్తూ, “దావీదు కుమారా, మామీద దయ చూపించు” అని కేకలు వేశారు. 28 యేసు ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. యేసు వారితో, “నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా?” అని వారిని అడిగాడు. వారు, “అవును ప్రభూ” అన్నారు. 29 అప్పుడాయన వారి కళ్ళు ముట్టి, “మీరు నమ్మినట్టే మీకు జరుగుతుంది” అన్నాడు. 30 వారి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు యేసు “ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండి” అని ఖండితంగా వారికి చెప్పాడు. 31 కానీ ఆ ఇద్దరూ వెళ్లి ఈ వార్త ఆ ప్రాంతమంతా చాటించారు.

  62. 8 అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను. 9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.

    10 బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.

  63. 11 చూడండి, సహించి నిలబడిన వారిని ధన్యులని భావిస్తాము గదా? మీరు యోబు సహనాన్ని గూర్చి విన్నారు. యోబు విషయంలో దేవుని ఉద్దేశాలను తెలిసిన మీరు ఆయన ఎంతో జాలి, కరుణ ఉన్నవాడని గ్రహించారు.

  64. 10 నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం కలుసుకున్నాయి, నీతిన్యాయాలు, శాంతిసమాధానాలు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి.

  65. 4 అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణాన్ని విడిపించమని యెహోవా నామాన్నిబట్టి నేను మొర్రపెట్టాను.

    5 యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు.

    6 యెహోవా సాధుజీవులను కాపాడేవాడు. నేను క్రుంగి ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించాడు.

  66. 7 యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయాన్ని, యెహోవా స్తుతి పాత్రమైన పనులను వర్ణిస్తాను.

    యెహోవా మనకు చేసిన వాటన్నిటిని గురించి నేను చెబుతాను.

    తన వాత్సల్యాన్ని బట్టి, కృపాతిశయాన్ని బట్టి, ఇశ్రాయేలు వంశం వారికి ఆయన చూపిన మహాకనికరాన్ని నేను ప్రకటన చేస్తాను.

    8 అయితే ఆయన ఇలా అన్నాడు. “కచ్చితంగా వారు నా ప్రజలు. అవిధేయులు కాని పిల్లలు.” ఆయన వారికి రక్షకుడయ్యాడు.

  67. 6 నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను.

    దహనబలుల కంటే నన్ను గురించిన జ్ఞానం, అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలని కోరుతున్నాను.

  68. 2 యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను.

    యెహోవా, ఈ సంవత్సరాల్లో నీ కార్యం నూతన పరచు.

    ఈ రోజుల్లో నీ పనులు తెలియచెయ్యి.

    కోపంలో కనికరం మరచిపోవద్దు.

  69. 17 “నేను నియమించే రోజు సమీపించినప్పుడు వారు నావారుగా, నా ప్రత్యేక సొత్తుగా ఉంటారు. తండ్రి తనను సేవించే కొడుకును కనికరించే విధంగా నేను వారిని కనికరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.

  70. 25 ఒకసారి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి ఆయనను పరీక్షిస్తూ, “బోధకుడా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు. 26 అందుకాయన, “ధర్మశాస్త్రంలో ఏమని రాసి ఉంది? నువ్వు దానినెలా అర్థం చేసుకున్నావు?” అని అడిగాడు. 27 అతడు, “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనసుతోనూ ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణీ ప్రేమించాలి” అన్నాడు. 28 దానికి ఆయన, “సరిగ్గా చెప్పావు. నువ్వూ అలా చెయ్యి, జీవిస్తావు” అన్నాడు.

    29 అయితే తనను నీతిమంతుడిగా చూపించుకోడానికి అతడు, “అది సరే గానీ, నా పొరుగువాడు ఎవడు?” అని యేసును అడిగాడు. 30 అందుకు యేసు, “ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమై పోతూ దోపిడీ దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకుని అతణ్ణి కొట్టి, కొన ప్రాణంతో విడిచి పెట్టారు.

    31 అప్పుడొక యాజకుడు ఆ దారినే వెళ్తూ అతణ్ణి చూసి పక్కగా వెళ్ళిపోయాడు. 32 ఆలాగే ఒక లేవీయుడు అటుగా వచ్చి అతణ్ణి చూసి పక్కగా వెళ్ళాడు. 33 అయితే ఒక సమరయుడు ప్రయాణమై వెళ్తూ, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. అతణ్ణి చూసి జాలి పడ్డాడు. 34 అతనిపై నూనే, ద్రాక్షారసం పోసి, గాయాలకు కట్లు కట్టి తన గాడిదపై ఎక్కించుకుని ఒక సత్రానికి తీసుకువెళ్ళి అతని బాగోగులు చూశాడు.

    35 మరుసటి రోజు అతడు రెండు వెండి నాణాలు తీసి ఆ సత్రం యజమానికిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతనికి నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే ఈసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు అది నీకు తీర్చేస్తాను’ అనిచెప్పి వెళ్ళిపోయాడు. 36 అయితే ఇప్పుడు ఆ ముగ్గురిలో దొంగల చేతిలో చిక్కిన వాడికి పొరుగువాడు ఎవరని నీకు అనిపిస్తుంది?” అని అతనిని అడిగాడు. 37 దానికి అతడు, “అతని మీద జాలి చూపిన వాడే” అన్నాడు. యేసు, “నువ్వు కూడా వెళ్ళి అలాగే చెయ్యి” అని అతనితో చెప్పాడు.

  71. 9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10 “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11 పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.

    14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.

  72. 8 నేను చెప్పేదేమిటంటే పితరులకు చేసిన వాగ్దానాల విషయం దేవుడు సత్యవంతుడని నిరూపించడానికీ, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి దేవుని మహిమపరచడానికీ క్రీస్తు సున్నతి గలవారికి సేవకుడయ్యాడు. 9 దీని గురించి,

    “ఈ కారణం చేత యూదేతరుల్లో నేను నిన్ను స్తుతిస్తాను.

    నీ నామ సంకీర్తనం చేస్తాను” అని రాసి ఉంది.

    10 ఇంకా ఏమని ఉన్నదంటే,

    “యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి” అనీ,

    11 “యూదేతరులందరూ ప్రభువును స్తుతించండి. ప్రజలంతా ఆయనను కొనియాడతారు.”

    12 యెషయా ఇలా అన్నాడు,

    “యెష్షయిలో నుండి వేరు చిగురు యూదేతరులను ఏలడానికి వస్తాడు.

    ఆయనలో యూదేతరులు తమ నమ్మకం పెట్టుకుంటారు.”

    13 మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సమృద్ధి అయిన నిరీక్షణ కలిగి ఉండేలా నిరీక్షణకర్త అయిన దేవుడు పూర్తి ఆనందంతో, సమాధానంతో మిమ్మల్ని నింపు గాక.

  73. 31 సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. 32 హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.

  74. 9 మీరు యెహోవా వైపు తిరిగితే మీ సోదరుల పైనా, మీ పిల్లల పైనా వారిని బందీలుగా తీసుకు పోయిన వారికి దయ కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా కృప, జాలి గలవాడు కాబట్టి మీరు ఆయనవైపు తిరిగితే ఆయన మీ వైపునుంచి తన ముఖం తిప్పుకోడు.”

  75. 5 అప్పుడే నా పాపాన్ని నీ ఎదుట ఒప్పుకున్నాను. నా దోషాన్ని ఇక నేను దాచిపెట్టుకోలేదు. నేను నా అతిక్రమాలను యెహోవా దగ్గర అంగీకరిస్తాను అనుకున్నాను. అప్పుడు నువ్వు నా పాపాలను క్షమించావు. సెలా.

  76. యాత్రల కీర్తన

    1 యెహోవా, లోతైన లోయలో ఉండి నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను.

    2 ప్రభూ, నా ప్రార్థన అంగీకరించు. నేను చేసే ఆర్తనాదం శ్రద్ధగా ఆలకించు.

    3 యెహోవా, నువ్వు మా పాపాలను కనిపెట్టి చూసినప్పుడు నీ ఎదుట ఎవ్వరూ నిలవలేరు.

    4 అయినప్పటికీ నువ్వు వాళ్ళను క్షమిస్తున్నావు. నీ పట్ల భయభక్తులు కలిగి జీవించేలా చేస్తున్నావు.