40 Bible Verses About God's Goodness

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About God's Goodness
  1. 5 వారు నీ మహిమ వైభవాన్ని ధ్యానిస్తారు. నేను నీ అద్భుత క్రియలను తలపోసుకుంటాను.

    6 వారు నీ ఆశ్చర్య కార్యాల్లోని ప్రభావాన్ని వర్ణిస్తారు. నేను నీ ప్రతాపాన్ని వివరిస్తాను.

    7 నువ్వు కనపరిచే కరుణ ఉన్నతిని వాళ్ళు చాటిస్తారు. నీ నీతి క్రియలను వాళ్ళు ఆలపిస్తారు.

    8 యెహోవా దయ, వాత్సల్యం గలవాడు. ఆయన కోపం విషయంలో నిదానించే వాడు. నిబంధన విశ్వసనీయత ఆయనలో పొంగి పొరలుతూ ఉంది.

    9 యెహోవా అందరికీ మేలు చేస్తాడు. సృష్టి అంతటి మీదా ఆయన వాత్సల్యం చూపుతాడు.

  2. 1 కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే నీవు ఎవరివైనా సరే, నిన్ను నీవు సమర్ధించుకోలేవు. దేని విషయంలో ఎదుటి వాడికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే దోషివని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నీవు ఏ పనుల విషయంలో తీర్పు తీరుస్తున్నావో వాటినే నీవు కూడా చేస్తున్నావు కదా?

    2 ఆ పనులు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైనదే అని మనకు తెలుసు. 3 ఆ పనులు చేసే వారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న ఓ మనిషీ, దేవుని తీర్పు నీవెలా తప్పించుకుంటావు? 4 దేవుని కటాక్షం నిన్ను పశ్చాత్తాప పడేందుకు ప్రేరేపిస్తున్నదని తెలియక ఆయన మంచితనం అనే ఐశ్వర్యాన్నీ సహనాన్నీ దీర్ఘశాంతాన్నీ తోసిపుచ్చుతావా?

    5 నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు. 6 ఆయన ప్రతి మనిషికీ అతని పనుల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. 7 మంచి పనులను ఓపికగా చేస్తూ, మహిమ, ఘనత, అక్షయతలను వెదికే వారికి నిత్యజీవమిస్తాడు. 8 అయితే స్వార్ధపరులు, సత్యాన్ని విడిచిపెట్టి దుర్నీతిని జరిగించే వారి మీదికి దేవుని ఉగ్రత, మహా కోపం వస్తాయి. 9 చెడ్డ పని చేసే ప్రతి మనిషి ఆత్మకు, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి బాధ, వేదన కలుగుతాయి. 10 అయితే మంచి పని చేసే ప్రతి వ్యక్తికి, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి మహిమ, ఘనత, శాంతిసమాధానాలు కలుగుతాయి.

    11 ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు.

  3. 19 నీలో భయభక్తులు గలవారి కోసం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మనుషులు చూస్తుండగా నీ ఆశ్రయం కోరేవారి కోసం నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.

    20 మనుషులు పన్నే కుట్రలకు బలి కాకుండా వారికి నీ సన్నిధిలో ఆశ్రయం కలిగించావు. మాటల దాడినుండి వారిని తప్పించి నీ గుడారంలో దాచిపెట్టావు.

  4. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. 30 ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.

  5. 4 నేను యెహోవాకు విజ్ఞాపన చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి మీదా నాకు విజయమిచ్చాడు.

    5 ఆయన వైపు చూసే వాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ ముఖాల్లో అవమానం అన్నది కన్పించదు.

    6 అణచివేతకు గురైన ఈ వ్యక్తి విలపించాడు. దాన్ని యెహోవా విన్నాడు. సమస్యలన్నిటి నుండి అతణ్ణి రక్షించాడు.

    7 యెహోవా అంటే భయమూ భక్తీ ఉన్న వాళ్ళ చుట్టూ ఆయన దూత కాపలా ఉంటాడు. వాళ్ళను కాపాడుతూ ఉంటాడు.

    8 యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి.

  6. 5 యెహోవా మేఘం నుండి దిగి అక్కడ మోషే దగ్గర నిలిచి యెహోవా తనను వెల్లడి చేసుకున్నాడు.

    6 యెహోవా అతని ఎదురుగా అతణ్ణి దాటి వెళ్తూ “యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, అమితమైన కృప, సత్యం గల దేవుడు. 7 ఆయన వేలాది మందికి తన కృప చూపిస్తాడు. అతిక్రమాలు, అపరాధాలు, పాపాలు క్షమిస్తాడు. అయితే దోషులను ఏమాత్రం శిక్షించకుండా ఉండడు. తండ్రుల దోష ఫలితం మూడు నాలుగు తరాలదాకా వారి సంతానం మీదికి రప్పించేవాడు” అని ప్రకటించాడు.

  7. 17 ఆయన బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా, శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు.

    18 యేసు, “నేను మంచి వాడినని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాడు ఎవరూ లేరు. 19 దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా! వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి” అన్నాడు.

    20 అతడు ఆయనతో, “బోధకా, నా చిన్నతనం నుండి నేను వీటిని పాటిస్తున్నాను” అని అన్నాడు. 21 యేసు అతన్ని చూస్తూ, అతనిపై ప్రేమ భావం కలిగి ఇలా అన్నాడు, “నీకు ఒకటి తక్కువగా ఉంది. వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్ళకు ఇవ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపద దొరుకుతుంది. ఆ తరువాత వచ్చి నన్ను అనుసరించు” అని అన్నాడు. 22 అతడు గొప్ప సంపన్నుడు గనక యేసు చెప్పిన ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

  8. 22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు.

  9. 68 నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు. నీ కట్టడలను నాకు బోధించు.

  10. 18 మోషే “దయచేసి నీ మహిమను నాకు చూపించు” అన్నాడు. 19 ఆయన “నా మంచితనమంతా నీ ఎదుట నుండి దాటిపోయేలా చేస్తాను. యెహోవా అనే నా పేరును నీ ఎదుట ప్రకటిస్తాను. నాకు ఎవరిమీద కరుణ చూపాలని ఉందో వాళ్ళను కరుణిస్తాను, ఎవరి మీద జాలిపడాలో వారిపట్ల జాలి చూపిస్తాను” అన్నాడు.

    20 ఆయన ఇంకా “నువ్వు నా ముఖాన్ని చూడలేవు. నన్ను చూసిన ఏ మనిషీ బతకడు” అన్నాడు. 21 యెహోవా “ఇదిగో నాకు దగ్గరలో ఒక చోటు ఉంది. నువ్వు ఆ బండ మీద నిలబడు. 22 నా మహిమ నిన్ను దాటి వెళ్ళే సమయంలో ఆ బండ సందులో నిన్ను దాచి ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకూ నా చేత్తో నిన్ను కప్పుతాను. 23 నేను నా చెయ్యి తీసివేసిన తరువాత నా వీపును మాత్రం నువ్వు చూడగలవు గానీ నా ముఖ దర్శనం నీకు కలగదు” అని మోషేతో చెప్పాడు.

  11. 13 చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, “ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది,” అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు, ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా.

    14 ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. 15 చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది. 16 నా ప్రియ సోదరులారా, మోసపోకండి. 17 ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు.

    18 దేవుడు, తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జీవం ఇవ్వడానికి మనలను కలగజేశాడు.

  12. 7 యెహోవా ఉత్తముడు, బాధ కలిగినప్పుడు ఆయన ఆశ్రయం కలిగిస్తాడు. తనపై నమ్మకం ఉంచేవాళ్ళు ఆయనకు తెలుసు.

  13. 5 ప్రభూ, నువ్వు మంచివాడివి. క్షమించడానికి సిద్ధంగా ఉంటావు. నీకు మొరపెట్టే వారందరినీ అమితంగా కనికరిస్తావు.

  14. 34 యెహోవా మంచివాడు, ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది.

    ఆయనను స్తుతించండి.

  15. 6 యెహోవా, నీ కరుణతో, నిబంధన నమ్మకత్వంతో నువ్వు చేసిన పనులు గుర్తు చేసుకో. ఎందుకంటే అవి ఎప్పుడూ నిలిచి ఉన్నాయి.

    7 బాల్యంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనం గుర్తు చేసుకోవద్దు. యెహోవా, నీ మంచితనంతో, నీ నిబంధన నమ్మకత్వంతో నన్ను గుర్తు చేసుకో.

    8 యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు.

  16. 13 సజీవుల దేశంలో నేను యెహోవా దయ పొందుతానన్న నమ్మకం నాకు లేకపోతే నేను నిరీక్షణ కోల్పోయేవాణ్ణి.

  17. 11 యెహోవా దేవుడు మన సూర్యుడు, మన డాలు. యెహోవా కృప, ఘనత ఇస్తాడు, యథార్ధంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలూ చేయకుండా మానడు.

  18. 43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.

    46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.

  19. 7 “అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది. 8 అడిగే ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది. 9 మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా? 10 లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా? 11 మీరు చెడ్డ వారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు గదా! అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు.

  20. 16 ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, “బోధకుడా, శాశ్వతజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి?” అని ఆయనను అడిగాడు. 17 అందుకు యేసు, “మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు” అన్నాడు.

  21. పంచమ పరిచ్ఛేదము

    1 యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యం ఉంటుంది.

  22. 31 దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.

  23. 4 కృతజ్ఞతతో ఆయన ద్వారాలగుండా ప్రవేశించండి. స్తుతులతో ఆయన ఆవరణాల్లోకి రండి. ఆయనకు ధన్యవాదాలు చెప్పండి. ఆయన నామాన్ని పొగడండి.

    5 యెహోవా మంచివాడు. ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది. ఆయన విశ్వసనీయత తరతరాలకు ఉంటుంది.

  24. 22 యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.

    23 ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు.

    నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!

    24 “యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది.

    కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.

    25 తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు.

    26 యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది.

  25. 22 కాబట్టి దేవుని అనుగ్రహాన్ని, ఆయన కాఠిన్యాన్ని చూడు. అంటే ఆయన ఒక వైపు పడిపోయిన యూదుల మీద కాఠిన్యం చూపించాడు. మరొకవైపు నీవు ఆయన దయలో నిలిచి ఉంటే నీ మీద తన అనుగ్రహాన్ని చూపించాడు. నీవు అలా నిలిచి ఉండకపోతే నిన్ను కూడా నరికివేస్తాడు.

  26. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  27. ప్రధాన సంగీతకారుడి కోసం. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంట్లో ఉన్నాడు, అని చెప్పినప్పుడు దావీదు రాసిన దైవధ్యానం.

    1 బలశాలీ, సమస్యను సృష్టించి ఎందుకు గర్విస్తున్నావు? దేవుని నిబంధన కృప నిత్యమూ ఉంటుంది.

  28. 18 ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. 19 అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు.

  29. 9 నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు. 10 దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.

    11 నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు.

  30. 6 ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. 7 నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. 8 అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు.

  31. 4 దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొన్నది ఏదీ నిషేధం కాదు. 5 ఎందుకంటే దేవుని వాక్యమూ ప్రార్థనా దాన్ని పవిత్ర పరుస్తాయి.

  32. 2 నేను యెహోవాతో అంటాను. నువ్వు నా ప్రభువు. నీకు వేరుగా నాకు ఏ మంచీ లేదు.

  33. 8 ఆయన నిబంధన విశ్వసనీయతను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

    9 ఎందుకంటే దాహం గొన్న వారిని ఆయన తృప్తిపరచాడు. ఆకలి గొన్నవారిని మేలుతో నింపాడు.

  34. 1 యెహోవా దయ గలవాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    2 ఘనుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    3 ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

  35. 14 సమృద్ధితో యాజకుల జీవితాలను నింపుతాను. నా ప్రజలు నా మంచితనంతో తమను తాము నింపుకుంటారు.” ఇదే యెహోవా వాక్కు.

  36. 9 యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించడంలో ఇశ్రాయేలు ప్రజలకు చేసిన మేళ్ళు విని యిత్రో సంతోషించాడు.

  37. 14 సోదరులారా, మీరు మంచివారు, సంపూర్ణ జ్ఞాన సంపన్నులు, ఒకరినొకరు ప్రోత్సహించుకోగల సమర్థులని నేను గట్టిగా నమ్ముతున్నాను.

  38. 9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు.

  39. 35 మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు.

  40. 9 కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.