68 Bible Verses About Being Thankful

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Being Thankful
  1. 17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.

  2. 18 ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.

  3. 4 ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి.

    5 మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు. 6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

  4. 10 విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు. 11 ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది.

    12 మీరు చేసే ఈ సేవ పరిశుద్ధుల అక్కరలు తీర్చడమే కాకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించేలా చేస్తుంది. 13 ఈ సేవ ద్వారా మీ యోగ్యత కనబడుతుంది. క్రీస్తు సువార్తను ఒప్పుకుని విధేయులై, ఇంత ఉదారంగా వారికీ, అందరికీ పంచిపెట్టడం బట్టి, వారు కూడా దేవుణ్ణి మహిమ పరుస్తారు. 14 మీ పట్ల దేవుడు కనపరచిన అత్యధికమైన కృపను చూసి, వారు మీ కోసం ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు. 15 వర్ణించ శక్యం గాని ఆయన బహుమానానికి దేవునికి ధన్యవాదాలు.

  5. 15 బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి. 16 సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి. 17 అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి. 18 మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి. 19 కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి. 20 ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.

  6. 1 రండి, యెహోవాకు పాట పాడదాం, మన రక్షణకు ఆధారశిలకు ఆనందంగా పాడదాం.

    2 కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వద్దాం, ఆయనకు స్తుతి గీతాలు పాడదాం.

    3 యెహోవా గొప్ప దేవుడు. దేవుళ్ళందరికీ పైగా ఉన్న గొప్ప రాజు.

    4 భూమి అగాధస్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరాలు ఆయనవే.

    5 సముద్రం ఆయనది. ఆయనే దాన్ని చేశాడు. ఆయన చేతులు పొడి నేలను చేశాయి.

    6 రండి సాగిలపడి ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త యెహోవా ఎదుట మోకరిల్లుదాం.

  7. 2 ఆనందంగా యెహోవాకు సేవ చేయండి, ఆనంద గీతాలు పాడుతూ ఆయన సన్నిధికి రండి.

    3 యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయన మనలను పుట్టించాడు. మనం ఆయన వాళ్ళం. మనం ఆయన ప్రజలం. ఆయన మేపే గొర్రెలం.

    4 కృతజ్ఞతతో ఆయన ద్వారాలగుండా ప్రవేశించండి. స్తుతులతో ఆయన ఆవరణాల్లోకి రండి. ఆయనకు ధన్యవాదాలు చెప్పండి. ఆయన నామాన్ని పొగడండి.

    5 యెహోవా మంచివాడు. ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది. ఆయన విశ్వసనీయత తరతరాలకు ఉంటుంది.

  8. 3-5 పరలోకంలో మీకోసం భద్రంగా ఉంచిన నిశ్చయమైన నిరీక్షణనుబట్టి మీరు క్రీస్తు యేసుపై నిలిపిన విశ్వాసాన్ని గూర్చీ, పరిశుద్ధులందరి పట్ల మీరు చూపుతున్న ప్రేమను గూర్చీ, మేము విని మీ గురించి ప్రార్థన చేసే ప్రతిసారీ మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సత్యవాక్కు అయిన సువార్త మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ నిరీక్షణను గూర్చి మొదటిసారి మీరు విన్నారు.

    6 ఈ సువార్త మీరు విని దేవుని కృపను నిజంగా తెలుసుకున్నప్పటి నుంచీ అది మీలో ఫలించి అభివృద్ధి చెందినట్టే ప్రపంచమంతటా ఈ సువార్త ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంది. 7 ఇది ప్రియమైన మా తోటి దాసుడూ, యేసుక్రీస్తుకు నమ్మకమైన సేవకుడూ అయిన ఎపఫ్రా నుండి ఆ విషయాలు నేర్చుకున్న ప్రకారమే. 8 ఆత్మలో మీ ప్రేమను గూర్చి అతడు మాకు తెలియజేశాడు.

    9 ఈ ప్రేమ మూలంగా మీ గురించి మేం విన్న రోజు నుండీ మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు సంపూర్ణ జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం కలిగి ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం. 10 ప్రతి మంచి కార్యం విషయంలోనూ మీరు ఫలిస్తూ, దేవునికి సంబంధించిన జ్ఞానంలో పెరుగుతూ, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేలా, ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము ప్రార్ధిస్తున్నాం. 11 మహిమ ప్రభావాలతో కూడిన ఆయన శక్తి మిమ్మల్ని ప్రతివిధమైన సామర్థ్యం ఇచ్చి బలపరచాలని దేవుణ్ణి వేడుకుంటున్నాం. అదే మీకు సహనాన్నీ, పట్టుదలతో కొనసాగే శక్తినీ కలిగిస్తుంది.

    12 వెలుగు నివాసులుగా తనకోసం ప్రత్యేకించబడిన వారి వారసత్వంలో భాగం పంచుకోడానికి మనలను అర్హులుగా చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. 13 ఆయన మనలను చీకటి రాజ్యపు ఆధిపత్యం నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుడి రాజ్యంలోకి తరలించాడు. 14 ఆ కుమారుడిలోనే మనకు పాప క్షమాపణా విమోచనా ఉన్నాయి.

  9. 30 దేవుని నామాన్ని గానాలతో స్తుతిస్తాను. కృతజ్ఞతలతో ఆయన్ని ఘనపరుస్తాను.

    31 ఎద్దు కంటే, కొమ్ములు డెక్కలు గల కోడె కంటే అది యెహోవాకు ఇష్టం.

    32 దీనులు అది చూసి సంతోషిస్తారు. దేవుని వెదికేవారలారా, మీ హృదయాలు తిరిగి బ్రతుకు గాక.

    33 అక్కరలో ఉన్నవారి ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. బంధకాల్లో ఉన్న తన వారిని ఆయన అలక్ష్యం చేయడు.

    34 భూమీ ఆకాశాలూ ఆయనను స్తుతిస్తాయి గాక. సముద్రాలు, వాటిలోని సమస్తం ఆయనను స్తుతిస్తాయి గాక.

    35 దేవుడు సీయోనును రక్షిస్తాడు. ఆయన యూదా పట్టణాలను తిరిగి కట్టిస్తాడు. ప్రజలు అక్కడ నివాసం ఉంటారు. అది వారి సొంతం అవుతుంది.

  10. 34 యెహోవా మంచివాడు, ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది.

    ఆయనను స్తుతించండి.

  11. 13 కాగా, “నమ్మాను కాబట్టి మాట్లాడాను” అని రాసినట్టుగా అలాంటి విశ్వాసం గల మనసు కలిగి మేము కూడా నమ్ముతున్నాము కాబట్టి మాట్లాడుతున్నాము.

    14 ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి, మీతో తన ఎదుట నిలబెడతాడని మాకు తెలుసు. 15 కృప చాలామందికి విస్తరించినట్టుగా దేవుని మహిమ కోసం కృతజ్ఞత విస్తరించేలా అన్నీ మీ కోసమే జరిగాయి. 16 అందుచేత మేము నిరుత్సాహపడడం లేదు. మా దేహాలు రోజురోజుకీ క్షీణించి పోతున్నా లోలోపల ప్రతి రోజూ దేవుడు మమ్మల్ని కొత్తవారినిగా చేస్తున్నాడు.

    17 మేము కనిపించే వాటి కోసం కాకుండా కనిపించని వాటి కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి క్షణమాత్రం ఉండే స్వల్ప బాధ, దానికి ఎన్నో రెట్లు అధికమైన అద్భుతమైన వైభవానికి మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంది. అది ఎప్పటికీ ఉండే వైభవం. 18 కనిపించేవి కొంత కాలమే ఉంటాయి కానీ కనిపించనివి శాశ్వతంగా ఉంటాయి.

  12. 1 పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు. 2 ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది. 3 వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల్లో కొన్ని తినకూడదని వీరు అంటారు.

    4 దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొన్నది ఏదీ నిషేధం కాదు. 5 ఎందుకంటే దేవుని వాక్యమూ ప్రార్థనా దాన్ని పవిత్ర పరుస్తాయి.

  13. 18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది. 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

    21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది.

  14. 6 మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగానే ఆయనలో నడుస్తూ ఉండండి. 7 ఆయనలో స్థిరంగా నాటుకుని ఉండండి. ఆయన పైనే మీ జీవితాలు కట్టుకోండి. మీకు బోధించిన రీతిగానే విశ్వాసంలో వేరు పారి ఉండండి. కృతజ్ఞతలు చెల్లించడంలో పొంగిపొరలుతూ ఉండండి.

  15. 2 ప్రార్థనలో నిలిచి ఉండండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ మెలకువగా ఉండండి.

    3 దేవుని వాక్కు అయిన క్రీస్తు మర్మాన్ని బోధించడానికి దేవుడు నాకు పరిస్థితులను అనుకూలపరచాలని ప్రార్ధించండి. ఈ వాక్కు కారణంగానే నేను సంకెళ్ళ పాలయ్యాను. 4 నేను బోధించాల్సిన విధంగా, స్పష్టంగా బోధించాలని నా కోసం ప్రార్ధించండి.

    5 సంఘానికి బయట ఉన్నవారి విషయంలో జ్ఞానంతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 6 మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు.

  16. 14 ఎలాంటి నిత్యమైన పట్టణమూ ఇక్కడ మనకు లేదు. మనం రాబోయే పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం.

    15 యేసు ద్వారా మనం నిరంతరం దేవునికి స్తుతులు యాగంగా అర్పిస్తూ ఉండాలి. స్తుతులు అంటే మన పెదవుల ద్వారా ఆయన పేరును అంగీకరిస్తూ మనం ఆయనకు అర్పించే ఫలం. 16 ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం.

  17. 53 నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి. 54 ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు,

    “విజయం మరణాన్ని మింగివేసింది”

    అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి.

    55 “మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?”

    56 మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.

    57 అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి. 58 కాబట్టి నా ప్రియ సోదరులారా, స్థిరంగా, నిబ్బరంగా ఉండండి. మీ కష్టం ప్రభువులో వ్యర్థం కాదని ఎరిగి, ప్రభువు సేవలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి.

  18. పంచమ పరిచ్ఛేదము

    1 యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యం ఉంటుంది.

    2 యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుతారు గాక. విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించిన వారూ,

    3 తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నానాదేశాల నుండి ఆయన పోగు చేసినవారూ ఆ మాట పలుకుతారు గాక.

  19. 10 ఇలాంటి ఒక ఆజ్ఞ జారీ అయిందని దానియేలుకు తెలిసినప్పటికీ అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం యెరూషలేము వైపుకు తెరిచి ఉన్న తన ఇంటి పైగది కిటికీల దగ్గర మోకాళ్ళపై ప్రతిరోజూ మూడుసార్లు తన దేవునికి ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ ఉన్నాడు.

  20. 14 దేవునికి నీ కృతజ్ఞతార్పణ సమర్పించు. మహోన్నతుడికి నీ ప్రమాణాలను నెరవేర్చు.

    15 సమస్యలు చుట్టుముట్టిన రోజున నాకు ప్రార్థించు. నేను నిన్ను కాపాడతాను. నువ్వు నన్ను కీర్తిస్తావు.

  21. విశ్రాంతి దినం కోసం పాట, ఒక కీర్తన.

    1 యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం, మహోన్నతుడా, నీ నామానికి స్తుతి పాడడం మంచిది.

    2 ఉదయాన నీ కృపను ప్రతి రాత్రీ నీ విశ్వసనీయతను తెలియజేయడం మంచిది.

    3 పది తీగల వాయిద్యంతో, సితారా మాధుర్యంతో స్తుతించడం మంచిది.

  22. 8 ఆయన నిబంధన విశ్వసనీయతను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

    9 ఎందుకంటే దాహం గొన్న వారిని ఆయన తృప్తిపరచాడు. ఆకలి గొన్నవారిని మేలుతో నింపాడు.

  23. 14 దేవుడు క్రీస్తులో విజయ సూచకమైన తన ఊరేగింపులో మమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తున్నాడు. క్రీస్తును గురించిన జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అంతటా గుబాళించేలా చేస్తున్న ఆయనకు ధన్యవాదాలు. 15 విమోచన పొందుతున్న వారిమధ్య, నాశనమైపోతున్న వారిమధ్య, మేము దేవునికి క్రీస్తు పరిమళంగా ఉన్నాము. 16 నాశనమైపోతున్న వారికి మరణపు వాసనగా, విమోచన పొందుతున్న వారికి జీవపు సువాసనగా ఉన్నాము. వీటికి యోగ్యులెవరు?

  24. 16 అప్పుడు దేవుని ఎదుట సింహాసనాలపై కూర్చున్న ఇరవై నలుగురు పెద్దలూ సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించారు.

    17 “ప్రభువైన దేవా, సర్వ శక్తిశాలీ, పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా, నువ్వు నీ మహాశక్తి సమేతంగా పాలించడం ప్రారంభించినందుకు నీకు మా కృతజ్ఞతలు. 18 జనాలకు క్రోధం పెరిగిపోయింది. కాని నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. చనిపోయిన వారికి తీర్పు తీర్చడానికీ, నీ సేవకులైన ప్రవక్తలకీ పరిశుద్ధులకీ గొప్పవారైనా అనామకులైనా నీ పేరు అంటే భయభక్తులు ఉన్న వారికి పారితోషికాలు ఇవ్వడానికీ, భూమిని నాశనం చేసే వారిని లేకుండా చేయడానికీ సమయం వచ్చింది” అన్నారు.

  25. 1 యెహోవా దయ గలవాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    2 ఘనుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    3 ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    4 గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగేది ఆయన ఒక్కడే. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    5 ఆయన తన జ్ఞానాన్ని అనుసరించి ఆకాశాలను ఏర్పరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    6 ఆయన నీళ్లమీద భూమిని విశాలపరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    7 ఆయన గొప్ప జ్యోతులను నిర్మించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    8 పగటి సమయాన్ని పాలించడానికి ఆయన సూర్యుణ్ణి ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    9 రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    10 ఈజిప్టు దేశంలోని తొలిచూలు సంతానాన్ని ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    11 ఈజిప్టు ప్రజల మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన బయటకు రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    12 ఆయన చెయ్యి చాపి తన భుజబలంతో ఇశ్రాయేలీయులను రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    13 ఎర్రసముద్రం రెండు పాయలుగా చీలిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    14 ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం మధ్యలో నడిచి వెళ్ళేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    15 ఫరో సైన్యాన్ని ఎర్రసముద్రంలో మునిగిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    16 ఎడారి మార్గం గుండా ఆయన తన ప్రజలను నడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    17 గొప్ప రాజులను ఆయన కూలగొట్టాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    18 ఘనత వహించిన రాజులను ఆయన హతం చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    19 అమోరీయుల రాజైన సీహోనును ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    20 బాషాను రాజైన ఓగును ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    21 వాళ్ళ దేశాన్ని మనకు వారసత్వ సంపదగా అప్పగించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    22 తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని సొత్తుగా అప్పగించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    23 మనం దీనావస్థలో పడి ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఆదరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    24 మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    25 సమస్త జీవరాశులకు ఆయన ఆహారం అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    26 పరలోకంలో ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

  26. 15 ఈ కారణం చేత ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించీ పరిశుద్ధులందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను గురించీ నేను విన్నప్పటి నుంచి, 16 మీ విషయంలో మానకుండా నా ప్రార్థనల్లో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. 17 మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు, మహిమ గల తండ్రి, తనను తెలుసుకోడానికి మీకు తెలివిగల ఆత్మనూ, తన జ్ఞాన ప్రత్యక్షతగల మనసునూ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

    18 మీ మనోనేత్రాలు వెలిగి, మన పిలుపు గురించిన నిరీక్షణ ఎలాంటిదో, పరిశుద్ధుల్లో ఆయన మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో మీరు గ్రహించాలని నా ప్రార్థన. 19 తనను నమ్ముకున్న మనలో తన అపరిమిత ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన.

    20 దేవుడు ఈ శక్తితో క్రీస్తును తిరిగి బ్రతికించి పరలోకంలో తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. 21 సర్వాధిపత్యం, అధికారం, ప్రభావం, ప్రభుత్వం కంటే ఈ యుగంలోగానీ రాబోయే యుగంలోగానీ పేరు గాంచిన ప్రతి నామం కంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడు. 22 దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచి, సంఘంలోని అన్నిటి మీదా ఆయనను తలగా నియమించాడు. 23 ఈ సంఘం ఆయన శరీరం, అంతటినీ అన్ని విధాలుగా నింపుతున్న ఆయన సంపూర్ణత.

  27. 7 ఆ రోజు దావీదు మొదటిగా ఆసాపునూ, అతని బంధువులనూ, యెహోవాను స్తుతిస్తూ కృతజ్ఞత అర్పించడానికి ఈ పాట పాడాలని నియమించాడు.

    8 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.

    ఆయన పేరును ప్రకటన చెయ్యండి.

    ఆయన కార్యాలను ప్రజల్లో తెలియజెయ్యండి.

    9 ఆయనను గూర్చి పాడండి.

    ఆయనను కీర్తించండి.

    ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.

    10 ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి.

    యెహోవాను కోరుకునే వాళ్ళు హృదయంలో సంతోషిస్తారు గాక.

    11 యెహోవాను ఆశ్రయించండి. ఆయన బలాన్ని ఆశ్రయించండి.

    ఆయన సన్నిధిని నిత్యం వెదకండి.

  28. 1 యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం ఉంటుంది.

    2 యెహోవా పరాక్రమ కార్యాలను వర్ణించగలవాడెవడు? ఆయన కీర్తి అంతటినీ ఎవడు ప్రకటించగలడు?

  29. 7 కృతజ్ఞతా స్తుతులతో యెహోవాను కీర్తించండి. తంతి వాయిద్యంతో మన దేవునికి స్తుతి గీతాలు పాడండి.

    8 ఆయన ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు. భూమి కోసం వర్షం సిద్ధం చేస్తాడు. కొండల మీద గడ్డి మొలిపిస్తాడు.

    9 పశువులకు, అరుస్తూ ఉండే కాకి పిల్లలకు ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు.

  30. 9 నా మట్టుకు నేను కృతజ్ఞతాస్తుతులతో నీకు బలి సమర్పిస్తాను.

    నేను మొక్కుకున్న దాన్ని తప్పక నెరవేరుస్తాను.

    యెహోవా దగ్గరే రక్షణ దొరుకుతుంది.”

  31. ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. ముత్ లబ్బెన్ రాగం.

    1 హృదయ పూర్వకంగా నేను యెహోవాకు ధన్యవాదాలు చెల్లిస్తాను. యెహోవా, నీ ఆశ్చర్య కార్యాలన్నిటి గురించి నేను చెబుతాను.

    2 మహోన్నతుడైన యెహోవా! నేను నీ గురించి సంతోషించి హర్షిస్తాను. నీ నామానికి స్తుతి కీర్తన పాడుతాను.

  32. 6 యెహోవా నా విజ్ఞాపన స్వరం ఆలకించాడు గనక ఆయనకు స్తుతి కలుగు గాక!

    7 యెహోవా నా బలం, నా డాలు. నా హృదయం ఆయనలో నమ్మిక ఉంచుతుంది గనక నాకు సహాయం కలిగింది. కాబట్టి, నా హృదయం ఉప్పొంగి పోతుంది. కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తున్నాను.

  33. 11 యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు. 12 ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే. 13 మా దేవా, మేము నీకు కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావం గల నీ పేరును కొనియాడుతున్నాం.

    14 ఈ విధంగా మనస్పూర్తిగా ఇచ్చే సామర్ధ్యం మాకు కలగడానికి నేను ఏమాత్రం వాణ్ణి? నా ప్రజలు ఏమాత్రం వాళ్ళు? అన్నీ నీ వలనే కలిగాయి గదా? నీ దానిలో నుంచి కొంత మేము నీకిచ్చాం.

  34. 17 యెహోవా న్యాయాన్నిబట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. సర్వోన్నతుడైన యెహోవాకు స్తుతి కీర్తన పాడతాను.

  35. 8 మీ విశ్వాసం లోకమంతా ప్రచురం కావడం చూసి, మొదట మీ అందరి కోసం యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను.

  36. 1 తండ్రి అయిన దేవునిలోనూ ప్రభు యేసు క్రీస్తులోనూ ఉన్న తెస్సలోనిక సంఘానికి పౌలు, సిల్వాను, తిమోతి రాస్తున్న సంగతులు. కృపా శాంతీ మీకు కలుగు గాక!

    2 మీ అందరి కోసం దేవునికి ఎప్పుడూ మా ప్రార్థనల్లో కృతజ్ఞతలు చెబుతూ మీ కోసం ప్రార్ధిస్తూ ఉన్నాం. 3 విశ్వాసంతో కూడిన మీ పనినీ, ప్రేమతో కూడిన మీ ప్రయాసనూ, మన ప్రభు యేసు క్రీస్తులో ఆశాభావం వల్ల కలిగిన మీ సహనాన్నీ మన తండ్రి అయిన దేవుని సమక్షంలో మేము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం.

  37. 12 నన్ను బలపరచి, నమ్మకమైన వాడుగా ఎంచి తన సేవకు నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకి కృతజ్ఞుణ్ణి. 13 అంతకు ముందు దేవ దూషకుణ్ణి, హింసించేవాణ్ణి, హానికరుణ్ణి. అయితే తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి కనికరం పొందాను. 14 మన ప్రభువు తన ధారాళమైన కృపను నాపై కుమ్మరించి, యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ విశ్వాసాలను అనుగ్రహించాడు.

  38. 18 అప్పుడు నేను మహాసమాజంలో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అనేకమంది జనాలున్న చోట నిన్ను స్తుతిస్తాను.

  39. 3 నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా నా దేవునికి వందనాలు చెబుతాను. 4 మీ కోసం నేను ప్రార్థించే ప్రతిసారీ అది ఆనందభరితమైన ప్రార్థనే. 5 సువార్త విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ మీ సహవాసానికి వందనాలు. 6 మీలో ఈ మంచి పని మొదలు పెట్టినవాడు యేసు క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకూ ఆ పని కొనసాగించి పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం.

  40. 1 మా ప్రియ సోదరుడు, జతపనివాడు అయిన ఫిలేమోనుకు, 2 మన సోదరి అప్ఫియకు, మన సాటి సైనికుడు అర్ఖిప్పుకు, నీ ఇంట్లో సమావేశమయ్యే సంఘానికీ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు. 3 మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.

    4-5 ప్రభువైన యేసు పట్ల, పరిశుద్ధులందరి పట్ల నీకున్న ప్రేమను గూర్చి, విశ్వాసం గూర్చి నేను విని, నా ప్రార్థనల్లో మీ గురించి విజ్ఞాపన చేస్తూ, ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను. 6 విశ్వాసంలో నీవు పాల్గొనడం క్రీస్తులో మనకు ఉన్న ప్రతి మంచినీ నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం లో మరింత చురుకుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. 7 సోదరా, పరిశుద్ధుల హృదయాలకు నీవు సేద దీర్చావు కాబట్టి నీ ప్రేమ నాకెంతో ఆనందాన్నీ ఆదరణనూ తెచ్చింది.

  41. దావీదు కీర్తన.

    1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.

    2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు.

    3 ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు.

    4 నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు.

    5 నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.

  42. 3 సోదరులారా, మేము ఎప్పుడూ మీ విషయమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది సముచితం. ఎందుకంటే మీ విశ్వాసం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మీలో ఒకరి పట్ల మరొకరు చూపే ప్రేమ అత్యధికం అవుతూ ఉంది. 4 అందుకే మీరు పొందుతున్న హింసలన్నిటిలోనూ, మీరు సహిస్తున్న యాతనల్లోనూ, మీ సహనాన్నీ, విశ్వాసాన్నీ చూసి దేవుని సంఘాల్లో మీ గురించి మేమే గర్వంగా చెబుతున్నాం.

  43. 9 ఆ తరువాత సింహాసనం ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా ఒక మహా జనసమూహం నిలబడి ఉండడం నేను చూశాను. వీరిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. వారిలో ప్రతి జాతినుండీ, ప్రతి వంశం నుండీ, ప్రతి గోత్రం నుండీ, భూమి మీద ఉన్న అన్ని భాషల్లో మాట్లాడే వారి నుండీ ప్రజలు ఉన్నారు. వారు తెల్లని బట్టలు ధరించి చేతుల్లో ఖర్జూరం మట్టలు పట్టుకుని ఉన్నారు. 10 వీరంతా కలసి,

    “రక్షణ సింహాసనంపై కూర్చున్న మా దేవునిది, గొర్రెపిల్లది”

    అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు.

    11 దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారంతా సింహాసనం ఎదుట సాష్టాంగపడి తమ ముఖాలు నేలకు ఆనించి,

    12 “ఆమేన్! మా దేవుడికి కీర్తీ, యశస్సూ, జ్ఞానమూ, కృతజ్ఞతలు, ఘనత, శక్తి, మహా బలం కలకాలం కలుగు గాక” అని చెబుతూ దేవుణ్ణి పూజించారు.

  44. 10 రాతి చెక్కడం పనివారు యెహోవా మందిరం పునాది వేస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలు రాజు దావీదు నిర్ణయించిన క్రమం ప్రకారం యాజకులు తమ వస్త్రాలు ధరించుకుని బాకాలతో నిలబడ్డారు. ఆసాపు వంశం వారైన లేవీయులు చేతి తాళాలతో యెహోవాను స్తుతించారు. 11 వీరు వంతుల వారీగా “యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల మీద ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అని పాడుతూ యెహోవాను కీర్తించారు. యెహోవా మందిరం పునాది పడడం చూసిన ప్రజలంతా గొప్ప శబ్దంతో యెహోవాను స్తుతించారు.

  45. 1 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి.

    2 ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.

    3 ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక.

  46. 21 ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

    22 వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలను ప్రకటించుదురు గాక.

  47. 17 నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను. యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను

  48. 11 నువ్వు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చావు. నా గోనెపట్ట తీసివేసి, సంతోషాన్ని నాకు వస్త్రంగా ధరింపజేశావు.

    12 అందుకే నా ప్రాణం మౌనంగా ఉండక, నీకు స్తుతులు పాడుతుంది. యెహోవా, నా దేవా, నేను నిన్ను ఎల్లకాలం స్తుతిస్తాను.

  49. ఒక కీర్తన. ఆలయ ప్రతిష్ట గీతం. దావీదు కీర్తన.

    1 యెహోవా, నేను నిన్ను ఘనపరుస్తాను. ఎందుకంటే, నా శత్రువులు నా మీద అతిశయించనియ్యకుండా నీవు పైకెత్తావు.

    2 యెహోవా, నా దేవా, నేను నీకు మొరపెట్టాను. నువ్వు నన్ను స్వస్థపరిచావు.

    3 యెహోవా, పాతాళం నుండి నా ప్రాణాన్ని లేవనెత్తావు. నేను సమాధికి వెళ్ళకుండా నన్ను బతికించావు.

    4 యెహోవా భక్తులారా, ఆయన్ని కీర్తించండి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనను స్తుతించండి.

    5 ఆయన కోపం ఒక్క నిమిషమే ఉంటుంది. అయితే ఆయన దయ జీవిత కాలమంతా ఉంటుంది. రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ ఉదయానికి సంతోషం కలుగుతుంది.

  50. దావీదు కీర్తన

    1 నేను నా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అన్య దేవుళ్ళ ఎదుట కూడా నిన్ను కీర్తిస్తాను.

    2 నీ పరిశుద్ధ ఆలయం వైపుకు తిరిగి నిన్ను ఆరాధిస్తాను. నీ నిబంధన విశ్వసనీయత, నీ నమ్మకత్వాలను బట్టి నీ నామానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. నీవు నీ పేరు ప్రతిష్టలను, నీ వాక్కును గొప్ప చేశావు.

    3 నేను నిన్ను వేడుకున్న రోజున నువ్వు నాకు జవాబిచ్చావు. నన్ను ధైర్యపరచి నాలో బలం పుట్టించావు.

    4 యెహోవా, భూమిపై ఉన్న రాజులంతా నీ నోటి వెంట వచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారు.

    5 యెహోవా మహా బలప్రభావాలు గలవాడని వారు యెహోవా విధానాలను గూర్చి పాటలు పాడతారు.

  51. 16 మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా? 17 దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు. 18 తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు.

  52. 11 ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలో సమరయ, గలిలయ ప్రాంతాల గుండా వెళ్తూ 12 ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ కుష్టు రోగులు పదిమంది ఆయనకు ఎదురై దూరంగా నిలిచారు. 13 “యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు” అని గట్టిగా కేకలు వేశారు. 14 ఆయన వారిని చూసి, “మీరు వెళ్ళి, యాజకులకు కనపడండి” అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు.

    15 వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి 16 బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ, తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. వాడు సమరయ ప్రాంతం వాడు. 17 అందుకు యేసు, “పది మంది శుద్ధులయ్యారు కదా, తక్కిన తొమ్మిది మంది ఏరీ? 18 దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడక పోవడం ఏమిటి?” అన్నాడు. 19 “నువ్వు లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు.

  53. 8 ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికీ ఆరు రెక్కలున్నాయి. వాటి చుట్టూ, లోపలా, రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలూ రాత్రీ మానకుండా ఈ విధంగా చెబుతున్నాయి, “పూర్వం ఉండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అంతటినీ పరిపాలించే వాడూ, దేవుడూ అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!”

    9 ఆ ప్రాణులు సింహాసనంపై కూర్చుని శాశ్వతంగా జీవిస్తున్న వాడికి ఘనత, కీర్తి, కృతజ్ఞతలూ సమర్పిస్తూ ఉన్నప్పుడు 10 ఆ ఇరవై నలుగురు పెద్దలూ సింహాసనంపై కూర్చున్న వాడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు శాశ్వతంగా జీవిస్తున్న వాడికి మొక్కి, 11 “మా ప్రభూ, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి” అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు.

  54. 21 అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాలోనే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను.

    22 అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. 23 కానీ వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసులోని ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవాల్లోని పాప నియమానికి నన్ను బందీగా చేస్తున్నది. 24 అయ్యో, నేనెంత నికృష్టుణ్ణి? చావుకు లోనైన ఈ శరీరం నుండి నన్నెవరు విడిపిస్తారు? 25 మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెబుతున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవనియమానికీ, శరీర విషయంలో పాప నియమానికీ దాసుణ్ణి.

  55. 3 నా ప్రార్థనల్లో నిన్ను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ నా పూర్వీకులవలే కల్మషంలేని మనస్సాక్షితో నేను సేవిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. 4 నీ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుని, నిన్ను చూసి నా ఆనందాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఎదురుచూస్తున్నాను. 5 నీలోని కపటం లేని విశ్వాసం నాకు తెలుసు. ఆ విశ్వాసం మొదట మీ అమ్మమ్మ లోయిలోనూ, మీ అమ్మ యునీకేలోనూ ఉంది. అది నీలో కూడా ఉన్నదని నా పూర్తి నమ్మకం.

  56. 28 నువ్వు నా దేవుడివి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నువ్వు నా దేవుడివి. నిన్ను ఘనపరుస్తాను.

    29 యెహోవా దయాళుడు. ఆహా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నిబంధన విశ్వాస్యత శాశ్వతకాలం నిలిచి ఉంది.

  57. 10 “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11 పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.

    14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.

  58. 1 యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.

  59. 25 ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు, “తండ్రీ, పరలోకానికీ భూమికీ ప్రభూ, నీవు జ్ఞానులకూ తెలివైన వారికీ ఈ సంగతులను మరుగు చేసి చిన్న పిల్లలకు వెల్లడి పరచావు. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను. 26 అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకెంతో ఇష్టం.

  60. 3 అగ్నీ యెహోవా తేజస్సూ మందిరం పైకి దిగటం చూసి ఇశ్రాయేలీయులంతా సాష్టాంగ నమస్కారం చేసి “యెహోవా దయ గలవాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అంటూ ఆయనను ఆరాధించి స్తుతించారు. 4 రాజూ, ప్రజలూ కలిసి యెహోవా ముందు బలులు అర్పించారు. 5 సొలొమోను రాజు 22,000 పశువులనూ 1, 20,000 గొర్రెలనూ బలులుగా అర్పించాడు. రాజు, ప్రజలు, అందరూ కలిసి దేవుని మందిరాన్ని ప్రతిష్టించారు. 6 యాజకులు తమ తమ సేవా స్థలాల్లో నిలిచారు. లేవీయులు “యెహోవా కృప నిత్యమూ నిలుస్తుంది” అంటూ దేవుణ్ణి స్తుతించడానికి దావీదు ఏర్పాటు చేసిన యెహోవా గీతాలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. యాజకులు వారికి ఎదురుగా నిలబడి బూరలు ఊదుతూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలంతా నిలబడి ఉన్నారు.

  61. 12 నీతిమంతులారా, యెహోవా మూలంగా ఆనందించండి, ఆయన పవిత్ర నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పండి.

  62. 21 కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది.

    22 యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.

    23 ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు.

    నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!

    24 “యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది.

    కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.

    25 తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు.

  63. 1 దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు దాసుడైన యాకోబు, చెదరిపోయిన పన్నెండు గోత్రాల వారికి అభినందనలు. 2 నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని 3 రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి. 4 ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు.

  64. 19 నేను ప్రవేశించేలా నీతి ద్వారాలు తెరవండి, ఎక్కడ దేవుని ప్రజలు ప్రవేశిస్తారో. నేను ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను.

    20 ఇది యెహోవా ద్వారం. నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు.

    21 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నేను పిలిస్తే పలికావు. నాకు రక్షణాధారం అయ్యావు.

  65. 29 ఇక్కడ మనస్సాక్షి అంటే, నీ సొంత మనస్సాక్షి కాదు, ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తమే అని చెబుతున్నాను. నా స్వేచ్ఛ విషయంలో వేరొకడి మనస్సాక్షి ఎందుకు తీర్పు చెప్పాలి? 30 నేను కృతజ్ఞతతో పుచ్చుకొంటే కృతజ్ఞతలు చెల్లించిన దాని విషయంలో నేనెందుకు నిందకు గురి కావాలి?

    31 కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి.

  66. 6 సేచ్చార్పణ బలులు నేను నీకు అర్పిస్తాను. యెహోవా, నీ నామం ఉత్తమం. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

    7 ప్రతి ఆపద నుండి ఆయన నన్ను విడిపించాడు. నా శత్రువుల ఓటమిని నా కన్ను సంతోషంగా చూస్తున్నది.

  67. 12 ప్రభూ, నా దేవా, నా హృదయమంతటితో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని శాశ్వతకాలం గొప్ప చేస్తాను.

  68. 13 అప్పుడు నీ ప్రజలమూ నీ మంద గొర్రెలమూ అయిన మేము ఎప్పటికీ నీకు ధన్యవాదాలు చెబుతాం. తరతరాలకు నీ కీర్తి ప్రచురిస్తాం.