77 Bible Verses About Business

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Business
  1. 11 ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిర్లక్ష్యం చేసి మీ దేవుడైన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త పడండి. 12 మీరు కడుపారా తిని, మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తారు. 13 మీ పశువులు, గొర్రెలు, మేకలు వృద్ధి చెంది, మీ వెండి బంగారాలు విస్తరించి, మీకు కలిగినదంతా వర్ధిల్లుతుంది.

    14 అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో.

    15 బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు. 16 చివరికి మీకు మేలు చేయాలని ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని మీ పూర్వీకులు గాని ఎప్పుడూ ఎరగని మన్నాతో మిమ్మల్ని పోషించాడు. 17 అయితే మీరు, ‘మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి’ అనుకుంటారేమో.

    18 కాబట్టి మీరు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు తన నిబంధనను ఈ రోజులాగా స్థాపించాలని మీరు ఐశ్వర్యం సంపాదించుకోడానికి మీకు సామర్ధ్యం కలిగించేవాడు ఆయనే.

  2. 9 సోదర ప్రేమను గూర్చి ఎవరూ మీకు రాయనక్కరలేదు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పించాడు. 10 అలాగే మీరు మాసిదోనియ అంతటా ఉన్న సోదరులను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమలో మీరు మరింత వృద్ధి చెందుతూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాం.

    11-12 సంఘానికి బయట ఉన్నవారి పట్ల మర్యాదగా ఉండడం, మీకు కొదువ ఏమీ లేకుండా మేము ఆదేశించిన విధంగా ప్రశాంతంగా జీవించడం, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ సొంత విషయాల్లో ఆసక్తి కలిగి మీ చేతులతో కష్టపడి పని చేసుకుంటూ ఉండడం లక్ష్యంగా పెట్టుకోండి.

  3. 29 తన పనిలో నిపుణతగల వాణ్ణి చూసావా? వాడు రాజుల సమక్షంలోనే నిలబడతాడు, మామూలు వాళ్ళ ఎదుట కాదు.

  4. 10 సోదర ప్రేమతో ఒకడిపై ఒకడు అభిమానం చూపిస్తూ, గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి. 11 ఆసక్తి విషయంలో వెనకబడిపోవద్దు, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. 12 ఆశాభావంతో ఎదురు చూస్తూ సంతోషించండి. కష్టాల్లో సహనం చూపుతూ, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. 13 పవిత్రుల అవసరాల్లో సహాయం చేస్తూ, అతిథులను శ్రద్ధగా ఆదరించండి.

  5. 23 మీరు ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి. మనుషుల కోసం అని కాదు గానీ ప్రభువుకు చేస్తున్నట్లు భావించుకుని చేయండి. 24 ప్రభువు నుండి మీకు వారసత్వం బహుమతిగా లభిస్తుందని మీకు తెలుసు. ప్రభువైన క్రీస్తుకు మీరు సేవ చేస్తున్నారు.

  6. 13 నీ పొరుగు వాణ్ణి పీడించకూడదు.

    అతణ్ణి దోచుకోకూడదు.

    కూలివాడి కూలీ డబ్బు మరునాటి వరకూ నీ దగ్గర ఉంచుకోకూడదు.

  7. 4 శ్రద్ధ లేకుండా బద్దకంగా పనిచేసే వాడు దరిద్రుడుగా మారతాడు. శ్రద్ధ కలిగి పనిచేసే వాడికి సంపద సమకూరుతుంది.

  8. 3 నీ పనుల భారమంతా యెహోవా మీద ఉంచు. అప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి.

    4 యెహోవా ప్రతి దానినీ దాని దాని పనుల కోసం నియమించాడు. మూర్ఖులు నాశనమయ్యే రోజు కోసం సృష్టింపబడ్డారు.

  9. 11 వారు ఈ మాటలు వింటున్నప్పుడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. ఎందుకంటే ఆయన యెరూషలేముకు దగ్గరలో ఉండడం వల్ల దేవుని రాజ్యం వెంటనే వచ్చేస్తుందని వారు అనుకుంటున్నారు.

    12 “గొప్ప వంశానికి చెందిన ఒక వ్యక్తి తన కోసం రాజ్యం సంపాదించుకుని రావాలని దూరదేశానికి ప్రయాణం అయ్యాడు. 13 దానికి ముందు తన సేవకులు పది మందిని పిలిచి వారికి పది బంగారు నాణాలు ఇచ్చాడు. “నేను తిరిగి వచ్చే వరకూ మీరు వీటితో వ్యాపారం చేయండి” అని చెప్పాడు. 14 అయితే అతని పట్టణంలోని పౌరులు అతణ్ణి ద్వేషించారు. ‘ఇతడు మమ్మల్ని పరిపాలించడం మాకు ఇష్టం లేదు’ అంటూ అతని వెనుకే రాయబారం పంపారు. 15 అయినా అతడు ఆ రాజ్యాన్ని సంపాదించుకుని తిరిగి వచ్చాడు. తన దాసులు వ్యాపారం చేసి ఎంత సంపాదించారో తెలుసుకోవాలని వారిని పిలిపించాడు.

    16 “మొదటి వాడు వచ్చి, ‘అయ్యా, మీరిచ్చిన నాణెం మరో పది నాణేలను సంపాదించింది” అన్నాడు. 17 దానికి ఆ యజమాని, ‘భలే, మంచి సేవకా! నువ్వు ఈ చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు. 18 ఇక రెండవ పనివాడు వచ్చాడు. ‘అయ్యా, మీరిచ్చిన నాణెంతో మరో ఐదు నాణాలు సంపాదించాను’ అన్నాడు. 19 యజమాని వాడితో, ‘నువ్వు ఐదు పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు.

    20 అప్పుడు మరో పనివాడు వచ్చాడు. వాడిలా అన్నాడు, ‘అయ్యా, ఇదిగో నువ్వు ఇచ్చిన నాణెం. 21 దీన్ని జాగ్రత్తగా గుడ్డలో కట్టి దాచిపెట్టాను. నువ్వు కఠినుడివని నాకు తెలుసు. నువ్వు పెట్టని చోట తీసుకుంటావు, నాటని చోట పంట కోస్తావు,’ అన్నాడు. 22 అందుకా యజమాని, ‘చెడ్డ సేవకా, నీ నోటి మాట పైనే నీకు తీర్పు తీరుస్తాను. నేను పెట్టని చోట తీసుకుంటాను, నాటని చోట పంట కోస్తాను, కఠినుడినని నీకు తెలుసు కదా, 23 అలాంటప్పుడు నా డబ్బుని వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు? అలా చేస్తే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునే వాణ్ణి కదా’ అని వాడితో చెప్పి, 24 తన దగ్గర ఉన్న వారితో, “వీడి దగ్గర ఉన్న నాణెం తీసేసుకుని పది నాణాలు ఉన్న వాడికివ్వండి’ అన్నాడు. 25 దానికి వారు, ‘అయ్యా అతని దగ్గర పది నాణాలు ఉన్నాయి కదా’ అన్నారు. 26 అందుకు అతడు, ‘ఉన్న ప్రతి వాడికీ ఇవ్వడం, లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుందని మీకు చెబుతున్నాను.’ 27 మరోమాట, ‘నేను తమని పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా కళ్ళెదుట వారిని వధించండి’ అన్నాడు.”

  10. 33 మీ దేశంలో పరదేశి ఎవరైనా మీ మధ్య నివసించేటప్పుడు అతణ్ణి బాధ పెట్టకూడదు, 34 మీ మధ్య నివసించే పరదేశిని మీలో పుట్టినవాడి లాగానే ఎంచాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే అతణ్ణి ప్రేమించాలి. ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉన్నారు గదా. నేను మీ దేవుడైన యెహోవాను.

    35 కొలతలోగాని తూనికలోగాని పరిమాణంలో గాని మీరు అన్యాయం చేయకూడదు. 36 న్యాయమైన త్రాసులు న్యాయమైన బరువులు, న్యాయమైన కొల పాత్రలు న్యాయమైన పడి మీకుండాలి. నేను ఐగుప్తులోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను.

  11. 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.

  12. 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  13. 5 శ్రద్ధగలవారి ఆలోచనలు లాభాన్ని తెస్తాయి. తొందరపాటుగా పనిచేసే వాడికి నష్టమే.

  14. 11 మోసం చేసి సంపాదించిన సొత్తు తరిగి పోతుంది. కష్టపడి ధనం సంపాదించిన వాడు దాన్ని వృద్ధి పరుచుకుంటాడు.

  15. 1 నీవు పరిపాలకునితో భోజనానికి కూర్చుంటే నీవెవరి సమక్షాన ఉన్నావో బాగా యోచించు.

    2 నీవు తిండిపోతువైనట్టయితే నీ గొంతుకకు కత్తి పెట్టుకో.

    3 అతని రుచికరమైన భోజన పదార్థాలను ఆశించకు. అవి మోసకరమైనవి.

    4 ఐశ్వర్యవంతుడివి కావడానికి కాయకష్టం చేయకు. అలాటి ప్రయాస ఎప్పుడు చాలించుకోవాలో గ్రహించే జ్ఞానం నీకుండాలి.

    5 డబ్బుపై నీవు దృష్టి నిలిపినంతలోనే అది మాయమౌతుంది. హటాత్తుగా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. గరుడ పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్టు అది ఎగిరి పోతుంది.

    6 దుష్టుని ఆహారం భుజించ వద్దు. అతడు నీవు తింటున్నదాన్ని అదే పనిగా చూస్తుంటాడు. వాడి రుచిగల పదార్థాలను ఆశించవద్దు.

    7 ఇలాంటి వాడు లోలోపల ఖరీదు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నీతో “తినండి, తాగండి” అంటూ ఉంటాడు గానీ అది హృదయపూర్వకంగా అనే మాట కాదు.

    8 నీవు తిన్న కొద్ది ఆహారాన్ని కూడా కక్కి వేస్తావు. నీవు పలికిన యింపైన మాటలు అనవసరంగా మాట్లాడినట్టు అవుతుంది.

  16. 30 మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు, 31 “వినండి, ఊరు కొడుకు, హూరు మనుమడు బెసలేలును యెహోవా ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి. 32 రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కలను కోసి నునుపు చేయడంలో నిపుణుడు. 33 అతనికి ఆయన అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, జ్ఞానం, నైపుణ్యం ప్రసాదించాడు. అతణ్ణి దేవుడు తన ఆత్మతో నింపాడు. 34 అతడు, దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు ఇతరులకు ఈ పనులు నేర్పించడానికి సామర్ధ్యం కలిగినవాళ్ళు.

    35 వాళ్ళు ఆ విధమైన ఎలాంటి పని అయినా చేయడానికి దేవుడు వాళ్ళకు సామర్ధ్యం ఇచ్చాడు. చెక్కేవాళ్ళ పనిగానీ, చిత్రకారుల పనిగానీ నీలం ఊదా ఎర్ర రంగు సన్నని నార దారాలతో బుటాపని గానీ, నేతపని గానీ వాళ్లకు బాగా తెలుసు. వాళ్ళు అలాంటి పనులు చెయ్యగలరు, చేయించగలరు.”

  17. 1 దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం.

    2 గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది. జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు.

    3 నిజాయితీ గల వారిని వారి న్యాయబుద్ధి నడిపిస్తుంది. దుర్మార్గుల మూర్ఖత్వం వారిని చెడగొడుతుంది.

  18. 4 సోమరిపోతు ఎక్కువగా ఆశ పడతాడు గానీ వాడికి ఏమీ మిగలదు. కష్టపడి పని చేసేవాడు సుఖంగా జీవిస్తాడు.

  19. 1 ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నపుడు రోజువారీ భోజనాల వడ్డనల్లో తమలోని విధవరాళ్ళను చిన్నచూపు చూస్తున్నారని గ్రీకు భాష మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదుల మీద ఫిర్యాదు చేశారు.

    2 అప్పుడు పన్నెండుమంది అపొస్తలులు శిష్యుల సమూహాన్ని తమ దగ్గరికి పిలిచి, “మేము దేవుని వాక్యాన్ని బోధించడం మాని భోజనాలు వడ్డించడం మంచిది కాదు. 3 కాబట్టి సోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వారై, మంచి పేరున్న ఏడుగురిని మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాం. 4 మేము మాత్రం ప్రార్థనలోనూ, వాక్య పరిచర్యలోనూ కొనసాగుతూ ఉంటాం” అన్నారు.

    5 ఈ మాట అందరికీ నచ్చింది. కాబట్టి, వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండి ఉన్న స్తెఫను, ఇంకా ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, సీమోను, పర్మెనాసు, యూదామతంలోకి మారిన అంతియొకయ నివాసి నీకొలాసు అనేవారిని ఎంచుకున్నారు. 6 వారిని అపొస్తలుల ముందుంచారు. అపొస్తలులు ప్రార్థన చేసి వారిమీద చేతులుంచారు.

    7 దేవుని వాక్కు అంతకంతకూ వ్యాపించి శిష్యుల సంఖ్య యెరూషలేములో పెరిగిపోయింది. యాజకుల్లో కూడా చాలామంది విశ్వసించారు.

  20. 23 ఆ రోజుల్లో క్రీస్తు మార్గం గురించి అక్కడ చాలా అల్లరి చెలరేగింది. 24 ఎలాగంటే, దేమేత్రి అనే ఒక కంసాలి డయానా దేవతకు వెండి విగ్రహాలను చేయిస్తూ అక్కడి పనివారికి మంచి ఆదాయం కల్పించేవాడు.

    25 అతడు వారిని, ఆ వృత్తిలో ఉన్న ఇతరులను పోగుచేసి వారితో, “ఈ పని ద్వారా మనకి మంచి ఆదాయం వస్తూ మన జీవనోపాధి బాగా జరుగుతూ ఉందని మీకు తెలుసు. 26 అయితే ఈ పౌలు, చేతులతో చేసిన విగ్రహాలు నిజమైన దేవుళ్ళు కారని బోధించి, ఎఫెసులో మాత్రమే కాక మొత్తం ఆసియా అంతట చాలామంది ప్రజలను పెడదారి పట్టించాడని మీరు విన్నారు, చూశారు కూడా. 27 పైగా మన వృత్తి మీద శ్రద్ధ తగ్గిపోవడమే కాక, డయానా దేవస్థానం కూడ నిర్లక్షానికి గురై, ఆసియా అంతటా, ఇంకా భూలోకమంతటా పూజలందుకుంటున్న ఈమె ప్రభావం తగ్గిపోతుందేమో అని నాకు భయం వేస్తున్నది” అని వారితో చెప్పాడు.

    28 వారు అది విని ఉగ్రులైపోయి, “ఎఫెసీయుల డయానా మహాదేవి” అని కేకలు వేశారు. 29 దానితో పట్టణం బహు గందరగోళంగా తయారైంది. వెంటనే వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియాకు చెందిన గాయి, అరిస్తార్కులను పట్టుకుని దొమ్మీగా అక్కడి నాటక ప్రదర్శనశాలలోకి ఈడ్చుకు పోయారు.

  21. 1 కుమారా, నీ పొరుగువాడి కోసం హామీగా ఉన్నప్పుడు, పొరుగువాడి పక్షంగా వాగ్దానం చేసినప్పుడు, 2 నువ్వు పలికిన మాటలే నిన్ను చిక్కుల్లో పడవేస్తాయి. నీ నోటి మాటల వల్ల నువ్వు పట్టబడతావు.

    3 కుమారా, నీ పొరుగువాడి చేతిలో చిక్కుబడినప్పుడు నువ్వు త్వరగా వెళ్లి నిన్ను విడుదల చేయమని అతణ్ణి బతిమాలుకో.

    4 నీ కళ్ళకు నిద్ర రాకుండా, నీ కనురెప్పలకు కునుకుపాట్లు రానివ్వకుండా ఈ విధంగా చేసి దాని నుండి తప్పించుకో.

    5 వేటగాడి బారి నుండి లేడి తప్పించుకున్నట్టు, బోయవాడి వల నుండి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకో.

    6 సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి జ్ఞానం తెచ్చుకో.

    7 వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు.

    8 అయినప్పటికీ అవి ఎండాకాలంలో తమకు తిండి సిద్ధం చేసుకుంటాయి. పంట కోత కాలంలో ఆహారం సమకూర్చుకుంటాయి.

    9 సోమరీ, ఎంతసేపటి వరకూ నిద్రపోతూ ఉంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు?

    10 ఇంకా ఎంతసేపు కునికిపాట్లు పడుతూ “కొంచెం సేపు నిద్రపోతాను, కాస్సేపు చేతులు ముడుచుకుని పడుకుంటాను” అనుకుంటావు?

    11 అందువల్ల దోపిడీ దొంగ వచ్చినట్టు దరిద్రం నీకు ప్రాప్తిస్తుంది. ఆయుధం ధరించిన శత్రువు వలే లేమి నీ దగ్గరికి వస్తుంది.

  22. 10 నిన్ను చేయమని అడిగిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయి. నువ్వు వెళ్ళే సమాధిలో పని గాని, ఉపాయం గాని, తెలివి గాని, జ్ఞానం గాని లేదు.

  23. 13 అక్రమంగా తన ఇంటినీ, అన్యాయంగా తన మేడగదులనూ కట్టించుకునే వాడికి బాధ. జీతమివ్వకుండా తన పొరుగువాడి చేత ఊరికే పని చేయించుకునే వాడికి బాధ.

    14 “నేను విశాలమైన మేడ గదులున్న పెద్ద ఇంటిని కట్టించుకుంటాను, అనుకునే వాళ్లకు బాధ. అతడు పెద్ద పెద్ద కిటికీలు చేయించుకుని దేవదారు పలకలతో పొదిగి, ఎర్ర రంగుతో అలంకరిస్తాడు.”

    15 నువ్వు దేవదారు పలకల ఇంటిని కట్టించుకుని రాజువవుతావా? నీ తండ్రి కూడా తింటూ తాగుతూ నీతిన్యాయాలను అనుసరించలేదా? అప్పుడు అతడు బాగానే ఉన్నాడు.

    16 అతడు పేదలకూ అక్కరలో ఉన్నవారికీ న్యాయం జరిగిస్తూ సుఖంగా బతికాడు. అలా చేయడమే నన్ను తెలుసుకోవడం కాదా? ఇది యెహోవా వాక్కు.

    17 అయితే అక్రమ సంపాదనపై, నిర్దోషుల రక్తం ఒలికించడంపై, దుర్మార్గం చేయడంపై, ఇతరులను అణగదొక్కడంపై నీ దృష్టి, మనసూ ఉంది.

  24. 34 తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు. “ఎవరైనా నా వెంట రావాలనుకుంటే తనను తాను కాదనుకుని, తన సిలువను మోసుకుంటూ నాతో నడవాలి. 35 ఎందుకంటే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. 36 ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి, తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం? 37 ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏమి ఇవ్వగలడు?

    38 వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు.”

  25. 10 చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు. చిన్న విషయాల్లో అన్యాయంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా అన్యాయంగానే ఉంటాడు.

  26. 5 సేవకులారా, భయంతో వణకుతో, క్రీస్తుకు లోబడినట్టు, ఈ లోకంలో మీ యజమానులకు హృదయపూర్వకంగా లోబడండి. 6 మనుషులను సంతోషపెట్టేవారు చేసినట్టు పైపైన కాక, క్రీస్తు దాసులుగా దేవుని సంకల్పాన్ని హృదయపూర్వకంగా జరిగిస్తూ, 7 ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవచేయండి. 8 దాసుడైనా, స్వతంత్రుడైనా, మీలో ప్రతివాడూ తాను చేసిన మంచి పనికి ప్రభువు వలన ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.

    9 యజమానులారా, మీరూ మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. మీకూ మీ దాసులకూ ఒక్కడే యజమాని పరలోకంలో ఉన్నాడనీ, ఆయన పక్షపాతం లేని వాడనీ గ్రహించి, వారిని బెదిరించడం మానండి.

  27. 17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.

  28. 6 సాటి విశ్వాసులారా, మేము ఉపదేశించిన సత్యాల ప్రకారం చేయకుండా సోమరులుగా బ్రతుకుతున్న వారి నుండి తొలగి పోవాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర మీకు ఆదేశిస్తున్నాం. 7 మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య సోమరులుగా ప్రవర్తించలేదు. 8 ఎవరి దగ్గరా ఉచితంగా ఆహారం భుజించలేదు. మేము మీలో ఎవరికీ భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాం, కష్టపడి పని చేశాం.

    9 మీరు మమ్మల్ని అనుకరించడం కోసం, ఆదర్శంగా ఉండాలనే ఇలా చేశాం కానీ మాకు మీ దగ్గర హక్కు లేదని కాదు. 10 అలాగే మేము మీ దగ్గర ఉన్నప్పుడు, “పని చేయకుండా ఎవడూ భోజనం చేయకూడదు” అని ఆజ్ఞాపించాం కదా! 11 మీలో కొంతమంది ఏ పనీ చేయకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ సోమరుల్లా తిరుగుతున్నారని మేము వింటున్నాం. 12 అలాంటి వారు ప్రశాంతంగా పని చేసుకుంటూ సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాం.

    13 సోదరులారా, మీరైతే యోగ్యమైన పనులు చేయడంలో నిరుత్సాహపడవద్దు.

  29. 4 చూడండి, మీ చేను కోసిన పనివారి కూలీ ఇవ్వకుండా, మీరు మోసంగా బిగపట్టిన కూలీ కేకలు వేస్తున్నది. మీ కోతపని వారి ఆక్రందనలు సేనల ప్రభువు చెవిని బడుతున్నాయి.

  30. 9 మీరు మీ పొలం పంట కోసేటప్పుడు నీ పొలం మూలల్లొ పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగె ఏరుకోకూడదు. నీ పండ్ల చెట్ల పరిగెను సమకూర్చుకోకూడదు. 10 నీ ద్రాక్ష తోటలో పండ్లన్నిటినీ సేకరించుకో కూడదు. ద్రాక్ష తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు. పేదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి.

  31. 13 వేరు వేరు తూకం రాళ్లు పెద్దదీ, చిన్నదీ రెండు రకాలు మీ సంచిలో ఉంచుకోకూడదు. 14 వేరు వేరు తూములు పెద్దదీ, చిన్నదీ మీ ఇంట్లో ఉంచుకోకూడదు. 15 మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో మీరు శాశ్వతకాలం జీవించి ఉండేలా కచ్చితమైన న్యాయమైన తూనికరాళ్లు ఉంచుకోవాలి. కచ్చితమైన న్యాయమైన కొలత మీకు ఉండాలి. 16 ఆ విధంగా చేయని ప్రతివాడూ అంటే అన్యాయం చేసే ప్రతివాడూ మీ యెహోవా దేవునికి అసహ్యుడు.

  32. 5 జాలిపరులు, అప్పిచ్చే వారు, తమ వ్యవహారాలు యధార్థంగా నిర్వహించుకునే వారు క్షేమంగా ఉంటారు.

  33. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  34. 1 గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాలకంటే దయ మరింత అభిలషించ దగినవి.

  35. 16 తన ఆస్తిపాస్తులు పెంచుకోవాలని పేదలను పీడించే వారికి, ధనవంతులకే ఇచ్చే వాడికి నష్టమే కలుగుతుంది.

  36. 20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22 వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”

  37. 23 కష్టంతో కూడిన ఏ పని చేసినా ఫలితం దక్కుతుంది. వ్యర్ధమైన మాటలు దరిద్రానికి నడుపుతాయి.

  38. 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. 8 అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు.

  39. 15 దేవుడైన యెహోవా ఏదెను తోట సాగు చెయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెట్టాడు.

  40. 1 యోసేపును ఐగుప్తుకు తీసుకొచ్చారు. ఫరో దగ్గర ఉద్యోగి, రాజు అంగరక్షకుల అధిపతి అయిన పోతీఫరు అనే ఐగుప్తీయుడు, అతన్ని అక్కడికి తీసుకొచ్చిన ఇష్మాయేలీయుల దగ్గర యోసేపును కొన్నాడు. 2 యెహోవా యోసేపుతో ఉన్నాడు. అతడు వర్ధిల్లుతూ తన యజమాని అయిన ఐగుప్తీయుని ఇంట్లో ఉన్నాడు. 3 యెహోవా అతనికి తోడై ఉన్నాడనీ, అతడు చేసేదంతా యెహోవా సఫలం చేస్తున్నాడనీ అతని యజమాని గమనించాడు. 4 యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు. అతడు పొతీఫరుకు సేవ చేశాడు. పొతీఫరు తన ఇంటి మీద యోసేపును కార్యనిర్వాహకునిగా నియమించి తనకు కలిగినదంతా అతని అధీనంలో ఉంచాడు.

    5 అతడు తన ఇంటి మీదా తనకు ఉన్న దానంతటి మీదా అతన్ని కార్యనిర్వహకునిగా నియమించిన దగ్గరనుండి యెహోవా యోసేపును బట్టి ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు. యెహోవా దీవెన అతని ఇంట్లో, పొలంలో, అతనికి ఉన్న దానంతటి మీదా ఉంది. 6 అతడు తనకు కలిగినదంతా యోసేపుకు అప్పగించి, తాను భోజనం చేయడం తప్ప తనకేమి ఉందో ఏమి లేదో చూసుకొనేవాడు కాడు. యోసేపు అందగాడు, చూడడానికి బావుంటాడు.

    7 ఆ తరువాత అతని యజమాని భార్య యోసేపును మోహించింది. “నాతో సుఖపడు” అని అతనిని అడిగింది. 8 అయితే అతడు తిరస్కరించి “నా యజమాని తనకు కలిగినదంతా నా వశంలో ఉంచాడు. నేను ఇక్కడ ఉండడం వలన ఇంట్లో ఏ విషయాన్నీ అతడు చూసుకోవడం లేదు. 9 ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నువ్వు అతని భార్యవు కాబట్టి నిన్ను మినహాయించి మిగతా అంతటినీ అతడు నా అధీనంలో ఉంచాడు. కాబట్టి నేనెలా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తాను?” అని తన యజమాని భార్యతో అన్నాడు.

    10 ప్రతిరోజూ ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉంది గానీ అతడు ఆమెతో ఉండడానికి గానీ పాపం చేయడానికి గానీ ఒప్పుకోలేదు. 11 అలా ఉండగా ఒక రోజు అతడు పని మీద ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళెవరూ అక్కడ లేరు. 12 అప్పుడామె అతని పై వస్త్రాన్ని పట్టుకుని “నాతో పండుకో” అని అడిగింది. అతడు తన బట్టను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు.

  41. 14 చెవిటివాణ్ణి తిట్ట కూడదు.

    గుడ్డివాడి దారిలో అడ్డంకులు వేయకూడదు.

    నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను.

  42. 8 అన్యాయంగా సంపాదించే అధికమైన సంపద కంటే నీతిగా వచ్చే కొంచెమైనా ఉత్తమం.

  43. 5 తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అబద్దసాక్ష్యం పలికే వారి మీద నా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను.

    నేనంటే భయం లేకుండా కూలి ఇచ్చే విషయంలో కూలివాళ్ళను, విధవరాండ్రను, తండ్రిలేని వారిని బాధపెట్టిన వారి విషయంలో, పరాయి దేశస్థుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి విషయంలో నేను బలంగా సాక్ష్యం పలుకుతాను అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.

  44. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు.

  45. 36 యేసు వారి మాటలు పట్టించుకోకుండా, వెంటనే సమాజ మందిరం అధికారితో, “భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు” అన్నాడు.

  46. 41 పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళడం కద్దు. 42 ఆయన పన్నెండేళ్ళ ప్రాయంలో వాడుక చొప్పున వారు ఆ పండగకు యెరూషలేము వెళ్ళారు. 43 ఆ రోజులు తీరిన తరువాత వారు తిరిగి వెళుతుండగా బాల యేసు యెరూషలేములో ఉండిపోయాడు. ఆయన తల్లిదండ్రులకు ఆ సంగతి తెలియలేదు.

    44 ఆయన గుంపులో ఉన్నాడనుకుని, ఒక రోజు ప్రయాణం చేసి, తమ బంధువుల్లో, అయినవారిలో ఆయనను వెదకసాగారు. 45 ఆయన కనబడక పోవడంతో ఆయనను వెదుక్కుంటూ యెరూషలేముకు తిరిగి వచ్చారు. 46 అప్పటికి మూడు రోజులైంది. ఆయన ఆలయంలో ఉపదేశకుల మధ్య కూర్చుని, వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలడుగుతూ ఉండగా చూశారు. 47 ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరాలకు అబ్బురపడ్డారు.

    48 ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి, “కుమారా, ఎందుకిలా చేశావు? మీ నాన్న, నేను ఆందోళనగా నిన్ను వెదకుతున్నాం” అంది. 49 అందుకు ఆయన, “మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా?” అన్నాడు. 50 కానీ ఆయన తమతో చెప్పిందేమిటో వారికి అర్థం కాలేదు.

    51 అప్పుడు ఆయన వారితో కలిసి బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసికుంది.

  47. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  48. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

  49. 17 చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా వాక్యోపదేశంలో, బోధలో కష్టపడే వారిని, రెండింతలు గౌరవానికి యోగ్యులుగా పరిగణించాలి. 18 ఇందుకు అనుగుణంగా లేఖనంలో, “కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అనీ, “పనివాడు తన జీతానికి అర్హుడు” అనీ ఉంది.

  50. 16-17 దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.

  51. 28 దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు. 29 దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.

    30 భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది. 31 దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.

  52. 5 కొత్తగా పెళ్ళిచేసుకున్న వాళ్ళు సైన్యంలో చేరకూడదు. వాళ్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదు. ఒక సంవత్సరం పాటు అతడు కులాసాగా తన ఇంట్లో ఉంటూ పెళ్లి చేసుకున్న భార్యను సంతోషపెట్టాలి.

  53. 13 నా సేవకుడైనా దాసి అయినా నాతో వ్యాజ్యెమాడి న్యాయం కోసం చేసిన విన్నపం నేను నిర్లక్ష్యం చేస్తే,

    14 దేవుడు లేచి నాపై తప్పు మోపినప్పుడు నేనేమి చేస్తాను? ఆయన విచారణకై వచ్చినప్పుడు నేను ఆయనకు ఏమి ప్రత్యుత్తరం ఇస్తాను?

  54. 23 ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేసేవారు మహాజలాల మీద తిరుగుతూ వ్యాపారం చేసేవారు

    24 యెహోవా కార్యాలను, సముద్రంలో ఆయన చేసే అద్భుతాలను చూశారు.

  55. 22 సలహా చెప్పే వారు లేని చోట కార్యం వ్యర్థమైపోతుంది. ఎక్కువమంది సలహాలతో కొనసాగించే కార్యం స్థిరంగా ఉంటుంది.

  56. 16 జ్ఞానాన్ని అభ్యసించడానికీ మనుషులు దివారాత్రులు నిద్ర లేకుండా చేసే వ్యాపారాలను పరిశీలించి చూశాను. 17 దేవుని పనులన్నిటినీ నేను గమనించాను. సూర్యుని కింద జరిగే సంగతులను మనుషులు ఎంత ప్రయత్నించినా గ్రహించలేరనీ, దాన్ని తెలుసుకోవాలని చివరికి జ్ఞానులు పూనుకున్నప్పటికీ వారు సైతం గ్రహించలేరనీ నేను తెలుసుకున్నాను.

  57. 17 మంచి చెయ్యడం నేర్చుకోండి.

    న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి.

    తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి.

    వితంతువు పక్షాన నిలబడండి.

    18 యెహోవా ఇలా అంటున్నాడు.

    “రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.”

    “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా,

    అవి మంచులా తెల్లగా అవుతాయి.

    కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి.

    19 మీరు ఇష్టపడి నాకు లోబడితే,

    మీరు ఈ దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు.

    20 తిరస్కరించి తిరుగుబాటు చేస్తే,

    కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.”

    యెహోవా నోరు ఈ మాట పలికింది.

  58. 24 ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవునికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు.

  59. 7 “అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది. 8 అడిగే ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది. 9 మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా? 10 లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా? 11 మీరు చెడ్డ వారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు గదా! అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు.

    12 “కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వారికి చేయండి. ధర్మశాస్త్రమూ ప్రవక్తల ఉపదేశమూ ఇదే.

  60. 18 మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను. 19 దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. 20 ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి, 21 నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది. 22 ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు.

  61. 6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

  62. 5 మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. 6 కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు. 7 అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు. 8 అలాటి వాడు చంచలమైన మనసు గలవాడు. తన విషయాలన్నిటిలోనూ నిలకడ లేనివాడు.

  63. 1 మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా? 2 మీకు లేని వాటిని కోరుకుంటారు. మీరు పొందలేని దాని వెనకాల పరుగులు పెడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు కానీ దేవుణ్ణి అడగరు కాబట్టి మీరేదీ పొందరు.

    3 మీరడిగినా మీకేమీ దొరకదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసం ఖర్చు చేసేందుకు చెడ్డ వాటిని అడుగుతారు. 4 కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు. 5 ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా? 6 కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.

    7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. 8 దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి. 9 చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి. 10 ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.

    11 సోదరులారా, మీలో ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడకండి. తన సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేక తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావంటే ధర్మశాస్త్రానికి నువ్వు లోబడడం లేదని అర్థం. ధర్మశాస్త్రానికే న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్నావని అర్థం. 12 ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందీ తీర్పు తీర్చేదీ ఒక్కరే. దేవుడే! ఆయనే రక్షించడానికీ నాశనం చేయడానికీ సమర్ధుడు. ఇతరులకి తీర్పు తీర్చడానికి నువ్వెవరు?

    13 “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట. 14 రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.

    15 కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి. 16 ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది. 17 మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.

  64. 6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.

    7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి. 8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. 9 వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.

    10 తన నిత్య మహిమకు క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన అపార కరుణానిధి అయిన దేవుడు కొంత కాలం మీరు బాధపడిన తరువాత, తానే మిమ్మల్ని సరైన స్థితిలోకి తెచ్చి, బలపరచి, సామర్థ్యం ఇచ్చి స్థిర పరుస్తాడు. 11 ఆయనకే ప్రభావం శాశ్వతంగా కలుగు గాక. ఆమేన్‌.

  65. 11 నేను మీ దేవుడైన యెహోవాను.

    మీరు దొంగతనం చేయకూడదు.

    అబద్ధం ఆడకూడదు.

    ఒకడినొకడు దగా చెయ్యకూడదు.

  66. 39 నీ స్వజాతి వాడు పేదవాడై తనను నీకు అమ్మేసుకుంటే వాడిచేత బానిసలా ఊడిగం చేయించుకో కూడదు.

  67. 5 దేవుని మందసాన్ని కిర్యత్యారీము నుంచి తీసుకు రావడానికి దావీదు ఐగుప్తులోని షీహోరు నది మొదలుకుని హమాతు పొలిమేర వరకూ ఉండే ఇశ్రాయేలీయులందరినీ సమావేశపరిచాడు. 6 కెరూబుల మధ్య నివాసం చేసే దేవుడైన యెహోవా పేరు పెట్టిన ఆయన మందసాన్ని యూదాలో ఉండే కిర్యత్యారీము అనే బాలా నుంచి తీసుకు రావడానికి అతనూ, ఇశ్రాయేలీయులందరూ అక్కడికి వెళ్ళారు.

    7 వాళ్ళు దేవుని మందసాన్ని ఒక కొత్త బండి మీద ఎక్కించి, అబీనాదాబు ఇంటి నుంచి తీసుకువచ్చారు. ఉజ్జా, అహ్యో అనే వారు బండిని తోలారు. 8 దావీదూ, ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణశక్తితో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, తీగ వాయిద్యాలు, తంబురాలు, కంచు తాళాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ ఉన్నారు.

    9 వాళ్ళు కీదోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు పశువులకు కాలు జారినందువల్ల మందసాన్ని పట్టుకోవాలని ఉజ్జా చెయ్యి చాపినప్పుడు 10 యెహోవా కోపం అతని మీద రగిలింది. అతడు తన చెయ్యి మందసం దగ్గరికి చాపినప్పుడు ఆయన అతన్ని దెబ్బ కొట్టాడు. అతడు అక్కడే దేవుని సన్నిధిలో చనిపోయాడు. 11 యెహోవా ఉజ్జాను హతం చెయ్యడం చూసి దావీదుకు కోపం వచ్చింది. ఆ కారణంగా ఆ స్థలానికి ఈ రోజు వరకూ పెరెజ్‌ ఉజ్జా అని పేరు.

    12 ఆ రోజున దావీదు దేవుని విషయంలో భయపడి “దేవుని మందసాన్ని నా దగ్గరికి నేను ఎలా తీసుకు పోతాను?” అన్నాడు. 13 కాబట్టి దావీదు, మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకుపోకుండా గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లోకి దాన్ని తీసుకువెళ్ళాడు. 14 దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో అతని కుటుంబంతో మూడు నెలలు ఉంది. యెహోవా ఓబేదెదోము ఇంటివాళ్ళను, అతని ఆస్తి అంతటినీ ఆశీర్వదించాడు.

  68. 4 తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.

  69. 17 పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు.

  70. 27 దానియేలు అనే నేను తట్టుకోలేక కొన్నాళ్లు నీరసంగా పడి ఉన్నాను. తరువాత నేను లేచి రాజు కోసం చేయవలసిన పని చేస్తూ వచ్చాను. ఈ దర్శనాన్ని గూర్చి నిర్ఘాంతపోయిన స్థితిలో ఉండిపోయాను. దాన్ని అర్థం చేసుకోగలిగిన వారెవరూ లేరు.

  71. 8 మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు.

    ఆయన నిన్ను కోరేదేంటంటే,

    న్యాయంగా ప్రవర్తించు.

    కనికరాన్ని ప్రేమించు.

    వినయంగా నీ దేవునితో నడువు.

  72. 26 అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు. 27 ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.

    28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు.

  73. 7 మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.

    8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు. 9 మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము.

  74. 1 యజమానులారా, పరలోకంలో మీకు ఒక యజమాని ఉన్నాడని తెలుసుకోండి. మీ దాసుల పట్ల న్యాయమైన, సరైన దానిని చేయండి.

  75. 9-10 మన రక్షకుడైన దేవుని గూర్చిన బోధ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా దాసులు అన్నివిషయాల్లో తమ యజమానులకు విధేయులై ఉండాలి. తమ యజమానులను ఎదిరించక అన్ని విషయాల్లో వారిని సంతోషపెట్టాలి. పనివారు యజమానులకు ఎదురు చెప్పకూడదు. దొంగతనం చేయకూడదు. సంపూర్ణ విశ్వాసపాత్రులుగా ఉండాలి. మన రక్షకుడైన దేవుని ఉపదేశాన్ని ఇతరులకు ఆకర్షణీయంగా చేయాలి. ఈ సంగతులు వారికి బోధించు.

    11 చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది. 12-13 మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ భక్తిహీనతనూ, ఈ లోక సంబంధమైన దురాశలనూ వీడి, ఈ యుగంలో నీతితో, భక్తితో జీవించమని అది మనకు నేర్పుతుంది.

    14 ఆయన సమస్తమైన విచ్చలవిడి పనుల నుండి మనలను విమోచించి, మంచి పనులు చేయడంలో ఆసక్తిగల ప్రజలుగా పవిత్రపరచి తన సొత్తుగా చేసుకోడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు. 15 వీటిని గూర్చి బోధించు. సంపూర్ణమైన అధికారంతో హెచ్చరించు, ఖండించు. ఎవరూ నిన్ను నిర్లక్ష్యం చేయకుండా చూసుకో.

  76. 15 మీలో ఎవడూ హంతకుడుగా, దొంగగా, దుర్మార్గుడుగా, పరుల జోలికి పోయేవాడుగా బాధ అనుభవించకూడదు. 16 ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలసి వస్తే సిగ్గు పడకూడదు. ఆ పేరును బట్టి అతడు దేవుణ్ణి మహిమ పరచాలి.

  77. 3 తన మహిమనుబట్టి, మంచి గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు. 4 వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా, లోకంలో ఉన్న దుర్మార్గపు కోరికల నాశనగుణం నుండి తప్పించుకుని మీరు తన స్వభావంలో పాలిభాగస్థులు కావాలన్నదే దేవుని ఉద్దేశం.

    5 ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి జ్ఞానం, 6 జ్ఞానానికి ఆశల అదుపు, ఆశల అదుపుకు ఓర్పు, ఓర్పుకు భక్తి, 7 భక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమకు దైవ ప్రేమ జోడించండి. 8 ఇవి మీలో నిలిచి ఉండి వృద్ధి చెందినపుడు, మన ప్రభు యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో మందకొడిగా, నిష్ఫలంగా ఉండరు.

    9 కాని ఈ గుణాలు లేనివాడు, తాను గతంలో చేసిన పాపాలనుండి దేవుడు శుభ్రపరిచాడని మరచిపోతాడు. అతడు దూరదృష్టి లేని గుడ్డివాడు. 10 కాబట్టి సోదరులారా, మీ పిలుపును, మీ ఎన్నికను స్థిరం చేసుకోడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎన్నడూ తడబడరు. 11 దీని ద్వారా మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు రాజ్యంలోకి ఘనమైన ప్రవేశం మీకు దొరుకుతుంది.