77 Bible Verses About Sin

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Sin
  1. 18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది. 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

    21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

  2. 28 వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.

    30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, 31 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. 32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.

  3. 19 ప్రతి నోటికీ మూతపడాలనీ, లోకమంతా దేవుని తీర్పు కిందికి రావాలనీ ధర్మశాస్త్రం చెప్పే మాటలన్నీ దానికి లోబడి ఉన్నవారితోనే చెబుతున్నదని మనకు తెలుసు. 20 ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది.

    21 ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి. 22 అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి. 23 భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. 24 నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. 25 క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. 26 ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.

  4. 10 ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు గాని, ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమై జీవిస్తున్నాడు.

    11 ఇదే మీకూ వర్తిస్తుంది. మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో క్రీస్తు యేసులో మిమ్మల్ని సజీవులుగా ఎంచుకోండి.

    12 కాబట్టి శరీర దురాశలకు లోబడేలా చావుకు లోనైన మీ శరీరాల్లో పాపాన్ని ఏలనియ్యకండి. 13 మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు. అయితే చనిపోయిన వారిలో నుండి బతికి లేచినవారుగా, మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి.

    14 మీరు కృప కిందే గానీ ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి పాపాన్ని మీ మీద అధికారం చెలాయించ నియ్యవద్దు. 15 అలాగైతే, మనం కృప కిందే గాని ధర్మశాస్త్రం కింద లేము కాబట్టి పాపం చేద్దామా? అలా ఎన్నటికీ చేయకూడదు. 16 మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా? 17 దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు. 18 తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు.

    19 మీ శరీర బలహీనతను బట్టి మానవరీతిగా మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు అక్రమం జరిగించడానికి ఏ విధంగా అపవిత్రతకు, దుర్మార్గానికి మీ అవయవాలను దాసులుగా అప్పగించారో, ఆలాగే పవిత్రత కలగడానికి వాటిని ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించండి. 20 మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో మీకేమీ ఆటంకం లేదు. 21 అప్పుడు చేసిన పనుల వలన మీకేం ప్రయోజనం కలిగింది? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా? చావే వాటి ఫలితం. 22 అయితే మీరు ఇప్పుడు పాపవిమోచన పొంది దేవునికి దాసులయ్యారు. పవిత్రతే దాని ఫలితం. దాని అంతిమ ఫలం శాశ్వత జీవం. 23 ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.

  5. 5 దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం. 6 మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. 7 అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.

    8 మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.

    9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు. 10 మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయనను అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.

  6. 26 సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తరువాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు. 27 కానీ భయంతో తీర్పు కోసం ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది. అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్ని ఉంటుంది. 28 ఎవడైనా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే ఇద్దరో ముగ్గురో చెప్పిన సాక్ష్యం మీద వాడిని ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా చంపుతారు.

    29 ఇలా ఉంటే మరి దేవుని కుమారుణ్ణి తమ కాళ్ళ కింద తొక్కివేసి, తనను శుద్ధి చేసిన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి, కృపాభరితమైన ఆత్మను అవమానించిన వాడికి మరి ఇంకెంత ఎక్కువ శిక్ష పడుతుందో ఆలోచించండి. 30 “ప్రతీకారం తీర్చడం నా పని. నేనే తిరిగి చెల్లిస్తాను” అనీ, అలాగే “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అనీ చెప్పిన వాడు మనకు తెలుసు. 31 సజీవుడైన దేవుని చేతిలో పడడం భయానకమైన విషయం.

  7. 6 ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. 7 నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. 8 అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. 9 కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం. 10 ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము. 11 అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి పొందాము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునిలో ఆనందిస్తున్నాం.

  8. 2 ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. ఇక ముందు మనం ఎలా ఉండబోతున్నామో మనకు ఇంకా వెల్లడి కాలేదు. కాని క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మనం ఆయనను ఉన్నవాడు ఉన్నట్టుగానే చూస్తామనీ ఆయనలాగా ఉంటామనీ మనకు తెలుసు.

    3 ఆయన మీద ఇలాంటి ఆశాభావం నిలిపిన ప్రతి ఒక్కడూ, ఆయన పవిత్రుడై ఉన్న విధంగా తనను తాను పవిత్రం చేసుకుంటాడు. 4 పాపం చేసే ప్రతివాడూ అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. పాపమంటే అక్రమమే.

    5 మన పాపాలు తీసివేయడానికి క్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయనలో ఏ పాపమూ లేదు. 6 ఆయనలో నిలిచి ఉన్నవారెవరూ పాపం చేస్తూ ఉండరు. పాపం చేస్తూ ఉన్నవాడు, ఆయన ఎవరో తెలుసుకోలేదు, ఆయనను ఎన్నడూ చూడలేదు.

    7 పిల్లలూ, మిమ్మల్ని ఎవ్వరూ తప్పు దారి పట్టించకుండా జాగ్రత్త పడండి. క్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టుగా, నీతిని జరిగించే ప్రతి వాడూ నీతిపరుడు. 8 పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు.

    9 దేవుని ద్వారా జన్మించిన వాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా జన్మించిన వాడిలో దేవుని విత్తనం ఉంటుంది కాబట్టి అతడు పాపం చెయ్యలేడు. 10 నీతిని జరిగించని వారు దేవుని పిల్లలు కాదు. తమ సోదరుణ్ణి ప్రేమించనివారు దేవుని పిల్లలు కాదు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, సైతాను పిల్లలెవరో తెలిసిపోతుంది.

  9. 1 దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు. 2 స్త్రీ ఆ సర్పంతో “ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు. 3 కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది.

    4 పాము స్త్రీతో “మీరు చావనే చావరు. 5 ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు” అన్నాడు. 6 స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.

    7 అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు. 8 సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోటలో దేవుడైన యెహోవా నడుస్తున్న శబ్ధం వాళ్ళు విన్నారు. ఆదాము, అతని భార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు.

    9 దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తూ “నువ్వెక్కడ ఉన్నావు?” అన్నాడు. 10 అతడు “నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నగ్నంగా ఉన్నాను గనక భయపడి దాక్కున్నాను” అన్నాడు. 11 దేవుడు “నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినొద్దని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావా?” అన్నాడు.

    12 ఆదాము “నాతో ఉండడానికి నువ్వు నాకిచ్చిన స్త్రీ నాకు ఆ చెట్టు పండు ఇచ్చింది. అప్పుడు నేను దాన్ని తిన్నాను” అన్నాడు. 13 దేవుడైన యెహోవా స్త్రీతో “నువ్వు చేసిందేమిటి?” అన్నాడు. స్త్రీ “సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను” అంది.

  10. 16 నేను ఇష్టపడని దాన్ని చేస్తున్నట్టయితే ధర్మశాస్త్రం మంచిదే అని ఒప్పుకుంటున్నాను. 17 కాబట్టి దాన్ని చేసేది నాలోని పాపమే గాని నేను కాదు. 18 నాలో, అంటే నా శరీరంలో మంచిదేదీ లేదని నాకు తెలుసు. మంచిని చేయాలనే కోరిక నాకు కలుగుతుంది గాని, దాన్ని చేయడం నా వల్ల కావడం లేదు. 19 నేను చేయాలని కోరే మంచిని చేయకుండా, నేను చేయగోరని చెడును జరిగిస్తున్నాను. 20 నేను కోరని దాన్ని చేస్తే అది నాలోని పాపమే గాని నేను కాదు. 21 అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాలోనే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను.

    22 అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. 23 కానీ వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసులోని ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవాల్లోని పాప నియమానికి నన్ను బందీగా చేస్తున్నది. 24 అయ్యో, నేనెంత నికృష్టుణ్ణి? చావుకు లోనైన ఈ శరీరం నుండి నన్నెవరు విడిపిస్తారు? 25 మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెబుతున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవనియమానికీ, శరీర విషయంలో పాప నియమానికీ దాసుణ్ణి.

  11. 2 నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు. నా పాపం నుండి నన్ను పవిత్రపరచు.

    3 నా అతిక్రమాలేంటో నాకు తెలుసు. నేను చేసిన పాపం నా కళ్ళ ఎదుటే ఉంది.

    4 నీకు వ్యతిరేకంగా, కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతావు. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు.

    5 ఇదిగో, నేను పాపంలో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించిన క్షణంలోనే నేను పాపంలో ఉన్నాను.

    6 ఇదిగో, నువ్వు నా హృదయంలో నమ్మదగ్గవాడుగా ఉండాలని నువ్వు కోరుతున్నావు. నా హృదయంలో జ్ఞానాన్ని తెలుసుకునేలా చేస్తావు.

    7 నన్ను హిస్సోపుతో శుభ్రం చెయ్యి. నేను పవిత్రుణ్ణి అవుతాను. నన్ను కడుగు. నేను మంచు కంటే తెల్లగా ఉంటాను.

    8 నువ్వు విరిచిన ఎముకలు హర్షించడానికై ఆనందమూ, సంతోషమూ నాకు వినిపించు.

    9 నా పాపాలనుండి నీ ముఖం తిప్పుకో. నా దోషాలన్నిటినీ తుడిచి పెట్టు.

    10 దేవా, నాలో పవిత్రమైన హృదయం సృష్టించు. నాలో సరైన మనస్సును పునరుద్దరించు.

    11 నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయవద్దు. నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయవద్దు.

    12 నీ రక్షణలోని ఆనందాన్ని నాలో తిరిగి దయచెయ్యి. అంగీకరించే ఆత్మతో నన్ను బలపరచు.

  12. 17 కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు కొత్త సృష్టి. పాతవి గతించి పోయాయి. కొత్తవి వచ్చాయి. 18 అంతా దేవుని వల్లనే అయ్యింది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని, ఆ సమాధాన పరచే సేవను మాకిచ్చాడు. 19 అంటే, దేవుడు వారి అతిక్రమాలను వారి మీద మోపక, క్రీస్తులో లోకాన్ని తనతో సమాధానపరచుకుంటూ, ఆ సమాధాన ఉపదేశాన్ని మాకు అప్పగించాడు.

    20 కాబట్టి మేము క్రీస్తు ప్రతినిధులం. దేవుడే మా ద్వారా మిమ్మల్ని బతిమాలుకొంటున్నట్టుంది. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం. 21 ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.

  13. 1 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.

    2 క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది. 3-4 ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు.

    5 శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు. 6 శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. 7 ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా. 8 కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు.

  14. 12 పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.

    13 చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, “ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది,” అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు, ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా.

    14 ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. 15 చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది.

  15. 17 శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.

    18 ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

  16. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

    18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు. 19 ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. 20 దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు.

  17. 16 తన సోదరుడు, మరణం కలిగించని పాపం చెయ్యడం ఎవరైనా చూస్తే, చూసినవాడు ఆ సోదరుని కోసం ప్రార్థించాలి. అతణ్ణి బట్టి మరణం కలిగించని పాపం చేసిన వాడికి దేవుడు జీవం ఇస్తాడు. మరణం కలిగించే పాపం ఉంది. దాని విషయంలో అతడు ప్రార్థించాలని నేను చెప్పను.

    17 సమస్త దుర్నీతీ పాపమే. కాని మరణం కలిగించని పాపం కూడా ఉంది.

  18. 31 “కాబట్టి నేను మీతో చెప్పేదేమిటంటే, మనుషులు చేసే ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుందిగానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ దొరకదు. 32 మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుందిగానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి, ఈ లోకంలోగానీ రాబోయే లోకంలోగానీ క్షమాపణ ఉండదు.

  19. 17 మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.

  20. 16 ఆయన స్త్రీతో “పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు. అతడు నిన్ను ఏలుతాడు” అని చెప్పాడు. 17 ఆయన ఆదాముతో “నువ్వు నీ భార్య మాట విని ‘తినొద్దు’ అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు. 18 నువ్వు ఎంత కష్టం చేసినా నేల ముళ్ళ తుప్పలను, ముళ్ళ పొదలనే మొలిపిస్తుంది. నువ్వు పొలంలో పండించిన పంట తింటావు. 19 నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూ చెమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు” అని చెప్పాడు.

  21. 13 అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు.

  22. 24 మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు.

  23. 21 “‘హత్య చేయవద్దు. హత్య చేసేవాడు శిక్షకు లోనవుతాడు’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు. 22 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు.

    23 “కాబట్టి నీవు నీ కానుకను బలిపీఠం వద్ద అర్పించే ముందు, నీ సోదరునికి నీ మీద ఏదైనా విరోధ భావం ఉందని నీకు గుర్తుకు వచ్చిందనుకో. 24 నీ కానుకను అక్కడే, బలిపీఠం ఎదుటే వదిలి వెళ్ళు. ముందు నీ సోదరునితో రాజీ పడు. ఆ తరువాత వచ్చి నీ కానుకను అర్పించు.

  24. 34 దానికి యేసు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను, పాపం చేసే ప్రతివాడూ పాపానికి బానిసే. 35 బానిస ఎప్పుడూ ఇంట్లో ఉండడు. కానీ కుమారుడు ఎప్పుడూ ఇంట్లోనే నివాసం ఉంటాడు.

  25. 9 అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతికి పాలుపడే వారూ, విగ్రహాలను పూజించేవారూ, మగ వేశ్యలు, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులూ, విపరీత సంపర్కం జరిపే వారూ, 10 దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    11 గతంలో మీలో కొంతమంది అలాటివారే. అయితే ప్రభు యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మ మిమ్మల్ని కడగడం ద్వారా పవిత్రులై దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు.

  26. 1 నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. 2 మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం.

    3 ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది. 4 “నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు. 5 కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు.

    6 ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి.

  27. 5 మనుషుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు. 6 తాను భూమిమీద మనుషులను చేసినందుకు బాధపడి, హృదయంలో విచారించాడు.

    7 కాబట్టి యెహోవా “నేను సృష్టించిన మనుషులను ఈ భూమిమీద లేకుండా చేస్తాను. మనుషులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాశపక్షులను భూమిమీద లేకుండా తుడిచి వేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను” అన్నాడు.

  28. 5 కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి. 6 వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి వస్తుంది.

    7 గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు. 8 కానీ ఇప్పుడు మీరు తీవ్ర కోపం, ఆగ్రహం, దుర్మార్గపు ఉద్దేశాలు, నిందా వాక్కులు, మీ నోటి నుండి అవమానకరమైన మాటలు, బూతులు అన్నీ వదిలి పెట్టాలి. 9 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. 10 ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు.

    11 ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి పొందిన వాడనీ సున్నతి పొందని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ లేదు. క్రీస్తే సమస్తం, సమస్తంలో ఆయనే ఉన్నాడు.

  29. 27 మనుషులంతా ఒకేసారి చనిపోతారు. తరువాత తీర్పు జరుగుతుంది. 28 అలాగే క్రీస్తు అనేకమంది పాపాలను తీసివేయడం కోసం ఒక్కసారే తనను తాను అర్పించుకున్నాడు. ఆయన రెండోసారి కనిపించనున్నాడు. అయితే ఈ సారి పాపాల కోసం కాదు కానీ తన కోసం సహనంతో వేచి ఉన్నవారి రక్షణ కోసం కనిపించనున్నాడు.

  30. 1 మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా? 2 మీకు లేని వాటిని కోరుకుంటారు. మీరు పొందలేని దాని వెనకాల పరుగులు పెడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు కానీ దేవుణ్ణి అడగరు కాబట్టి మీరేదీ పొందరు.

    3 మీరడిగినా మీకేమీ దొరకదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసం ఖర్చు చేసేందుకు చెడ్డ వాటిని అడుగుతారు. 4 కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు. 5 ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా? 6 కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.

    7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. 8 దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి.

  31. 2 యెహోవా నిర్దోషిగా పరిగణించిన వాడు, తన ఆత్మలో కపటమనేది లేనివాడు ధన్యజీవి.

    3 నేను నిశ్శబ్దంగా ఉండి రాత్రంతా మూల్గుతున్నాను. దాంతో నా ఎముకలు బలహీనమై పోతున్నాయి.

    4 పగలూ రాత్రీ నా మీద నీ చెయ్యి భారంగా ఉంది. వేసవిలో దుర్భిక్షంలా నా శక్తి అంతా హరించుకు పోయింది. సెలా.

    5 అప్పుడే నా పాపాన్ని నీ ఎదుట ఒప్పుకున్నాను. నా దోషాన్ని ఇక నేను దాచిపెట్టుకోలేదు. నేను నా అతిక్రమాలను యెహోవా దగ్గర అంగీకరిస్తాను అనుకున్నాను. అప్పుడు నువ్వు నా పాపాలను క్షమించావు. సెలా.

  32. 17 నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది. 18 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? 19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి. 20 మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” అని వారితో చెప్పాడు.

  33. 20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22 వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”

  34. 12 కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము. 13 మీరు శరీరానుసారంగా నడిస్తే చావుకు సిద్ధంగా ఉన్నారు గానీ ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే మీరు జీవిస్తారు.

    14 దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు. 15 ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం. 16 మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు. 17 మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం.

  35. 15 “ఇంకో విషయం. నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే. 16 అతడు వినకపోతే, ‘ప్రతి విషయమూ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి.’ కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. 17 అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి. అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా, పన్ను వసూలుదారుడుగా పరిగణించు.

    18 “నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో, దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు. 19 ఇంకో విషయం, దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు.

    20 “ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను.”

    21 అప్పుడు పేతురు వచ్చి, “ప్రభూ, నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్లు సరిపోతుందా?” అని యేసుని అడిగాడు. 22 అందుకు యేసు అతనికి జవాబిస్తూ, “ఏడు సార్లు వరకే కాదు, ఏడుకు డెబ్భై సార్ల వరకూ అని నీతో చెబుతున్నాను.

  36. 1 కాబట్టి ఏమందాం? కృప విస్తరించడం కోసం పాపంలోనే కొనసాగుదామా? 2 అలా ఎన్నటికీ జరగకూడదు. పాపపు జీవితం విషయంలో చనిపోయిన మనం దానిలో ఎలా కొనసాగుతాం? 3 క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమంతా ఆయన మరణంలోకి కూడా బాప్తిసం పొందామని మీకు తెలియదా?

    4 తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము.

  37. 4 హేబెలు కూడా తన మందలో తొలుచూలు పిల్లల్లో కొవ్వు పట్టిన వాటిని తెచ్చాడు. యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు. 5 కయీనును, అతని అర్పణను ఆయన అంగీకరించ లేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు.

    6 యెహోవా కయీనుతో “ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు రుసరుసలాడుతున్నావు? 7 నువ్వు సరైనది చేస్తే నీకు ఆమోదం లభిస్తుంది కదా. సరైనది చెయ్యకపోతే గుమ్మంలో పాపం పొంచి ఉంటుంది. అది నిన్ను స్వాధీపర్చుకోవాలని చూస్తుంది. అయితే, నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి” అన్నాడు.

    8 కయీను తన తమ్ముడు హేబెలుతో మాట్లాడాడు. వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలు మీద దాడి చేసి అతణ్ణి చంపివేశాడు. 9 అప్పుడు యెహోవా కయీనుతో “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అన్నాడు. అతడు “నాకు తెలియదు. నేను నా తమ్ముడికి కాపలా వాడినా?” అన్నాడు. 10 దేవుడు “నువ్వు చేసిందేమిటి? నీ తమ్ముడి రక్తం నేలలో నుంచి నాకు మొరపెడుతూ ఉంది. 11 ఇప్పుడు నీ మూలంగా ఒలికిన నీ తమ్ముడి రక్తాన్ని మింగడానికి నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండాా నువ్వు శాపానికి గురయ్యావు. 12 నువ్వు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు. నువ్వు భూమి మీద నుంచి అస్తమానం పారిపోతూ, దేశదిమ్మరిగా ఉంటావు” అన్నాడు.

  38. 12 సోదరులారా, సజీవుడైన దేవుని నుండి తొలగిపోయే హృదయం, అవిశ్వాసంతో నిండిన చెడ్డ హృదయం మీలో ఉండకుండాా జాగ్రత్త పడండి. 13 పాపపు వంచన వల్ల మీలో ఎవరూ కఠినులు కాకుండా ప్రతిరోజూ, ఈ రోజు అనే సమయం ఉండగానే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. 14 ఎందుకంటే ప్రారంభం నుండి చివరి వరకూ ఆయనపై మనకున్న స్థిర విశ్వాసంపై ఆధారపడి ఉండటం వల్ల మనం క్రీస్తులో భాగస్వాములం అయ్యాం.

  39. 1 మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. 2 మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.

    3 మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి.

  40. 12 జీవితాన్ని కాంక్షించేవాడు, ఎక్కువ కాలం జీవించాలని ఆశించే వాడు, చక్కని జీవితం కావాలి అనుకునేవాడు ఏం చేయాలి?

    13 దుర్మార్గమైన మాటలు పలకకుండా ఉండు. అబద్ధాలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో.

    14 చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి పనులు చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు.

    15 యెహోవా కంటి చూపు ధర్మాత్ములపై ఉంది. ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటూ ఉన్నాయి.

    16 చెడు కార్యాలు చేసే వాళ్ళ జ్ఞాపకం భూమిపై ఉండకుండా చేయడానికి యెహోవా వాళ్లకు విరోధంగా ఉన్నాడు.

  41. 1 సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. 2 ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.

    3 ఏ గొప్పతనం లేనివాడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటుంటే తనను తానే మోసపరచుకుంటున్నాడు. 4 ప్రతివాడూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది. 5 ప్రతివాడూ తన బరువు తానే మోసుకోవాలి గదా?

  42. 24 క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.

  43. 15 పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగినదీ, సంపూర్ణంగా అంగీకరించదగినదీ. అలాంటి పాపుల్లో నేను మొదటి వాణ్ణి.

    16 అయినా నిత్యజీవం కోసం తనపై విశ్వాసముంచబోయే వారికి నేను ఒక నమూనాగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన ఓర్పును నాలో కనుపరచేలా నన్ను కరుణించాడు. 17 అన్ని యుగాల్లో రాజూ, అమర్త్యుడూ, అదృశ్యుడూ అయిన ఏకైక దేవునికి ఘనత, మహిమ యుగయుగాలు కలగాలి. ఆమేన్‌.

  44. 10 కుమారా, దుష్టులు నిన్ను ప్రేరేపిస్తే అంగీకరించవద్దు.

    11 దుష్టులు నీతో “మాతో చేతులు కలుపు. ఎవరినైనా చంపడానికి కాపు కాద్దాం. అమాయకుడైన ఒకణ్ణి పట్టుకుందాం.

    12 ఆరోగ్య వంతుణ్ణి పాతాళం అకస్మాత్తుగా తీసేసుకున్నట్టు వారిని సజీవంగా మింగేద్దాం. సమాధిలోకి దిగే వారిలా వారిని చేసేద్దాం.

    13 దోచుకున్న సొమ్ముతో మన ఇల్లు నింపుకుందాం, రకరకాల విలువైన వస్తువులు మనకు దొరుకుతాయి.

    14 నువ్వు మాతో కలసి ఉండు, మనమంతా ఒకే చోట సొమ్ము దాచుకుందాం” అని నీతో చెబితే వాళ్ళ మాటలు లక్ష్యపెట్టవద్దు.

    15 కుమారా, నువ్వు వాళ్ళు నడిచే దారిలో వెళ్ళ వద్దు. వాళ్ళ ఆలోచన ప్రకారం చేయకుండేలా నీ పాదాలు అదుపులో ఉంచుకో.

  45. 18 యెహోవా ఇలా అంటున్నాడు.

    “రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.”

    “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా,

    అవి మంచులా తెల్లగా అవుతాయి.

    కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి.

    19 మీరు ఇష్టపడి నాకు లోబడితే,

    మీరు ఈ దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు.

    20 తిరస్కరించి తిరుగుబాటు చేస్తే,

    కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.”

    యెహోవా నోరు ఈ మాట పలికింది.

  46. 34 ప్రజలు ఘనత పొందడానికి వారి న్యాయవర్తన కారణం అవుతుంది. అపరాధ ప్రవర్తన ప్రజలను అవమానాల పాలు చేస్తుంది.

  47. 14 “మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు. 15 మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు.

  48. 18 లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.

    19 మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. 20 దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.

  49. 5 ఇది దేవుని న్యాయమైన తీర్పుకు ఒక స్పష్టమైన సూచనగా ఉంది. దీని ఫలితం ఏమిటంటే మీరు దేవుని రాజ్యానికి తగిన వారుగా లెక్కలోకి వస్తారు. దేవుని రాజ్యం కోసమే మీరీ కష్టాలన్నీ సహిస్తున్నారు. 6-7 ప్రభు యేసు తన ప్రభావాన్ని కనుపరిచే దూతలతో పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని హింసించే వారికి యాతనా, ఇప్పుడు కష్టాలు పడుతున్న మీకూ మాకూ కూడా విశ్రాంతి కలగజేయడం దేవునికి న్యాయమే.

    8 దేవుడు తనను ఎరుగని వారిని, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించని వారిని అగ్నిజ్వాలల్లో దండిస్తాడు. 9-10 ఆ రోజున తన పరిశుద్ధులు ఆయనను మహిమ పరచడానికీ, విశ్వసించిన వారికి ఆశ్చర్య కారకంగా ఉండటానికీ ఆయన వచ్చినప్పుడు అవిశ్వాసులు ప్రభువు సన్నిధి నుండీ, ఆయన ప్రభావ తేజస్సు నుండీ వేరై శాశ్వత నాశనం అనే దండన పొందుతారు.

    ఆ పరిశుద్ధుల్లో మీరూ ఉన్నారు. ఎందుకంటే మేము చెప్పిన సాక్ష్యం మీరు నమ్మారు.

  50. 19 నా సోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుంచి తొలగిపోతే మరొకడు అతన్ని తిరిగి సత్యానికి మళ్ళించినట్టయితే 20 అలాటి పాపిని తన తప్పుమార్గం నుంచి మళ్ళించే వాడు మరణం నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలను కప్పివేస్తాడని అతడు తెలుసుకోవాలి.

  51. 6 యెహోవా, నీ కరుణతో, నిబంధన నమ్మకత్వంతో నువ్వు చేసిన పనులు గుర్తు చేసుకో. ఎందుకంటే అవి ఎప్పుడూ నిలిచి ఉన్నాయి.

    7 బాల్యంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనం గుర్తు చేసుకోవద్దు. యెహోవా, నీ మంచితనంతో, నీ నిబంధన నమ్మకత్వంతో నన్ను గుర్తు చేసుకో.

    8 యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు.

    9 దీనులను న్యాయంగా నడిపిస్తాడు, దీనులకు తన మార్గం బోధిస్తాడు.

    10 ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనాలు పాటించిన వాళ్లకు యెహోవా త్రోవలన్నీ నిబంధన నమ్మకత్వంతోనూ, విశ్వసనీయతతోనూ నిర్మాణం అయ్యాయి.

  52. 16 యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు.

    17 అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు, 18 దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు, 19 లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.

  53. 13 దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, అహంకారం, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం.

  54. 28 నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మనుషులు చేసిన అన్ని పాపాలను, వారు పలికే దైవ దూషణలను దేవుడు క్షమిస్తాడు. 29 కాని పరిశుద్ధాత్మను దూషించినవాణ్ణి దేవుడు ఎన్నడూ క్షమించడు. అలా చేసేవాడు శాశ్వత పాపం చేసిన దోషంలో ఉంటాడు.” 30 ‘ఆయనకు దయ్యం పట్టింది’ అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు.

  55. 10 యేసు తలెత్తి ఆమెను చూశాడు. “నీమీద నిందారోపణ చేసిన వారంతా ఎక్కడమ్మా? నీకు ఎవరూ శిక్ష వేయలేదా?” అని అడిగాడు. 11 ఆమె, “లేదు ప్రభూ” అంది. దానికి యేసు, “నేను కూడా నీకు శిక్ష వేయను. వెళ్ళు, ఇంకెప్పుడూ పాపం చేయకు” అన్నాడు.

  56. 44 మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి.

  57. 8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  58. 16 కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీకు స్వస్థత కలిగేలా ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన ఫలభరితమైనది. అది ఎంతో బలవత్తరమైనది.

  59. 13 అందుకు దావీదు “నేను పాపం చేశాను” అని నాతానుతో అన్నాడు. అప్పుడు నాతాను “నీ పాపాన్ని బట్టి నువ్వు చనిపోయేలా యెహోవా నిన్ను శిక్షించక పోవచ్చు. 14-15 అయితే నువ్వు చేసిన ఈ పనివల్ల యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నువ్వు ఒక మంచి కారణం చూపించావు. కాబట్టి నీకు పుట్టబోయే పసికందు తప్పకుండా చనిపోతాడు” అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు.

  60. 2 మనుషులారా, ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? ఎంతకాలం పనికిరాని వాటిని ప్రేమించి అబద్ధాల వెంటబడతారు? సెలా.

    3 యెహోవా తన భక్తులను తన కోసం ఏర్పరచుకుంటాడని తెలుసుకోండి. నేను యెహోవాకు విజ్ఞప్తి చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడు.

    4 భయంతో గడగడ వణకండి, కానీ పాపం చెయ్యకండి. మీరు పడక మీద ఉన్నప్పుడు మీ హృదయాల్లో ధ్యానం చేసుకుని నింపాదిగా ఉండండి. సెలా.

    5 నీతి సంబంధమైన బలులు అర్పించి యెహోవాలో నమ్మకం ఉంచండి.

    6 మాకు ఏదైనా క్షేమం కలిగించేది ఎవరు? అని అనేకమంది అంటారు. యెహోవా, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశించు.

  61. 23 దేవా, నన్ను పరిశోధించు. నా హృదయంలో ఏమున్నదో పరిశీలించి చూడు. నన్ను పరీక్షించి నా ఆలోచనలు ఎలాంటివో తెలుసుకో.

    24 నీకు బాధ కలిగించే విధానాలు నేను అనుసరిస్తున్నానేమో నన్ను పరిశీలించు. శాశ్వత మార్గంలో నన్ను నడిపించు.

  62. 1 తరువాత ఒకసారి పన్నులు వసూలు చేసేవారూ, పాపులూ అనేకమంది ఆయన ఉపదేశం వినడానికి ఆయన దగ్గరికి వచ్చారు. 2 పరిసయ్యులూ, ధర్మశాస్త్ర పండితులూ అది చూసి, “ఈ మనిషి పాపులను దగ్గరికి రానిస్తూ వారితో కలసి భోజనం చేస్తున్నాడు” అని సణుక్కున్నారు. 3 అందుకాయన వారికి ఈ ఉపమానం చెప్పాడు,

    4 “మీలో ఏ మనిషికైనా వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను అడవిలో వదిలి, వెళ్ళి ఆ తప్పిపోయిన గొర్రె దొరికేంత వరకూ వెదకడా?” 5 అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులనూ, ఇరుగుపొరుగు వారినీ పిలిచి 6 ‘మీరు నాతో కలిసి సంతోషించండి. ఎందుకంటే తప్పిపోయిన నా గొర్రె దొరికింది’ అని వారితో చెబుతాడు కదా. 7 అలాగే పశ్చాత్తాపం అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే పశ్చాత్తాపం పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది.

  63. 14 ఆ తరువాత యేసు దేవాలయంలో అతణ్ణి చూశాడు. “చూడు, నీవు స్వస్థత పొందావు. ఇప్పుడు పాపం చేస్తే నీకు ఎక్కువ కీడు కలుగుతుంది. అందుకని ఇక పాపం చేయవద్దు.” అని అతడితో చెప్పాడు.

  64. 11 పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి. 12 ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.

  65. 10 ఎవరైనా ధర్మశాస్త్రం అంతా పాటించి, ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో అయినా తడబడితే, ఆజ్ఞలన్నిటినీ మీరిన అపరాధి అవుతాడు. 11 “వ్యభిచారం చెయ్యవద్దు” అని చెప్పిన దేవుడు, “హత్య చెయ్యవద్దు” అని కూడా చెప్పాడు. నువ్వు వ్యభిచారం చేయకుండా హత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే.

  66. 11 ప్రియులారా, మీరీ లోకంలో పరదేశులుగా, బాటసారులుగా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మకు విరోధంగా పోరాటం చేసే శరీర దురాశలు విసర్జించాలని వేడుకుంటున్నాను. 12 యూదేతరులు మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉంటే, వారు మీ మంచి పనులు చూసి, దేవుడు దర్శించే రోజున ఆయనను మహిమ పరచేలా, వారి మధ్య మీ మంచి ప్రవర్తన చూపించండి.

  67. 20 అందుకు మోషే “భయపడకండి. మిమ్మల్ని పరీక్షించడానికి, ఇక నుంచి మీరు పాపం చేయకుండా ఆయన భయం మీకు ఉండేలా దేవుడు వచ్చాడు” అని ప్రజలతో చెప్పాడు.

  68. ప్రథమ పరిచ్ఛేదము

    1 దుర్మార్గుల సలహా ప్రకారం నడుచుకోనివాడు, పాపాత్ముల దారిలో నిలవనివాడు, అల్లరి మూకలతో కూర్చోని వాడు ధన్యుడు.

    2 అతడు యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తాడు. అతడు రేయింబవళ్ళు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు.

  69. 6 నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం దోషానికి తగిన పరిహారం కలిగిస్తాయి. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నవాడు దుష్టత్వం నుండి దూరంగా తొలగిపోతాడు.

  70. 5 నేను “అయ్యో, నావి అపవిత్రమైన పెదాలు. అపవిత్రమైన పెదాలున్న జనం మధ్య నివసిస్తున్నాను.

    నేను నశించాను. రాజు, సేనల ప్రభువు అయిన యెహోవాను నేను కన్నులారా చూశాను” అనుకున్నాను.

    6 అప్పుడు ఆ సెరాపుల్లో ఒకడు బలిపీఠం మీద నుండి పట్టుకారుతో ఎర్రగా కాలిన నిప్పు తీసి నా దగ్గరికి ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించాడు.

    7 “ఇది నీ పెదాలకు తగిలింది గనక నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయింది. నీ దోషం తొలగి పోయింది” అన్నాడు.

  71. 4 “చూడు! ప్రతివాడూ నావాడే. తండ్రులూ, కొడుకులూ, అందరి ప్రాణాలూ నావే! పాపం చేసినవాడు చస్తాడు!

  72. 19 కాబట్టి మీ పాపాల ప్రక్షాళన కోసం పశ్చాత్తాపపడి తిరగండి. అప్పుడు ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి. 20 అభిషిక్తుడైన క్రీస్తు యేసును మీ కోసం ఆయన పంపుతాడు. మీ పాపాలు తుడిచి వేస్తాడు.

  73. 21 మనిషి ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనిషి ద్వారానే చనిపోయిన వారు తిరిగి లేవడం జరిగింది. 22 ఆదాములో అందరూ ఏ విధంగా చనిపోతున్నారో, అదే విధంగా క్రీస్తులో అందరూ బ్రతికించబడతారు.

  74. 17 కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను. 18 ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు. 19 వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.

    20 అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు. 21 యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు. 22 కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి 23 మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. 24 దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.

  75. 24 కొందరి పాపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అవి వారి తీర్పుకు ముందే నడుస్తున్నాయి. మరి కొంతమంది పాపాలు వారి వెంటే వెళుతున్నాయి.

  76. 1 క్రీస్తు శరీర హింసలు పొందాడు కాబట్టి, మీరు కూడా అలాంటి మనసునే ఆయుధంగా ధరించుకోండి. శరీర హింసలు పొందిన వాడు పాపం చేయడం మానేస్తాడు. 2 ఈ వ్యక్తి తన శేష జీవితాన్ని ఇకమీదట మానవ కోరికలను అనుసరించక, దేవుని ఇష్టం కోసమే జీవిస్తాడు. 3 యూదేతరులు చేసినట్టు చేయడానికి గతించిన కాలం చాలు. గతంలో మీరు లైంగిక పరమైన అనైతిక కార్యాలూ, చెడ్డ కోరికలు, మద్యపానం, అల్లరి చిల్లరి వినోదాలూ, విచ్చలవిడి విందులూ, నిషిద్ధమైన విగ్రహ పూజలూ చేశారు.

  77. 13 తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు సైతానుని ఓడించారు కాబట్టి మీకు రాస్తున్నాను.

    14 చిన్నపిల్లల్లారా, మీరు తండ్రిని తెలుసుకుని ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నాను.

    తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను.

    యువకులారా, మీరు బలవంతులు, దేవుని వాక్కు మీలో నిలిచి ఉంది, మీరు సైతానును ఓడించారు, అందుకే మీకు రాస్తున్నాను.

    15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. 16 ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే.