44 Bible Verses About Circumcision
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
5 ఇకపైన నీ పేరు అబ్రాము కాదు. నిన్ను అనేక జాతులకు తండ్రిగా నియమిస్తున్నాను కనుక ఇకనుండి నీ పేరు అబ్రాహాము అవుతుంది. 6 నిన్ను అత్యధికంగా ఫలింపజేస్తాను. నీ సంతానం అనేక జాతులుఅయ్యేలా చేస్తాను. నీ సంతానంలో రాజులు జన్మిస్తారు. 7 నేను నీకూ నీ తరువాత నీ సంతానానికీ దేవుడిగా ఉండే విధంగా నాకూ నీకూ మధ్యన, నీ తరువాత నాకూ నీ సంతానానికీ మధ్యన నా నిబంధనను స్థిరం చేస్తాను. అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది. 8 నీకూ నీ తరువాత నీ సంతానానికీ ప్రస్తుతం నువ్వు పరదేశిగా ఉన్న భూమిని, అంటే కనాను దేశాన్నంతా ఇస్తాను. దాన్ని శాశ్వత సంపదగా ఇచ్చి వారికి దేవుడిగా ఉంటాను.”
9 దేవుడు మళ్ళీ అబ్రాహాముతో ఇలా చెప్పాడు. “నీ వరకూ నువ్వు నా నిబంధన పాటించాలి. నువ్వు మాత్రమే గాక, నీ తరువాత నీ సంతానం తమ తరతరాల్లో నా నిబంధన పాటించాలి. 10 నాకూ నీకూ మధ్యన, నీ తరువాత నీ సంతానానికీ మధ్య ఉన్న నిబంధన ఇదే. మీలో ప్రతి మగవాడూ సున్నతి పాటించాలి. 11 అంటే మీరు మీ మర్మాంగం పైచర్మపు కొన కత్తిరించాలి. అది నాకూ నీకూ మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉంటుంది.
12 నీ ప్రజల తరాలన్నిటిలో ప్రతి మగవాడికీ ఎనిమిది రోజున సున్నతి జరగాలి. ఇది నీ ఇంట్లో పుట్టిన వాడికీ, నీ సంతానం కాకుండా మీరు వెల ఇచ్చి ఏ విదేశీయుడి దగ్గరైనా కొనుక్కున్న వాడికీ వర్తిస్తుంది. 13 నీ ఇంట్లో పుట్టిన వారికీ, మీరు వెల పెట్టి కొనుక్కున్న వారికీ తప్పకుండా సున్నతి జరగాలి. ఆ విధంగా నా నిబంధన మీ శరీరంలో శాశ్వత నిబంధన గా ఉంటుంది. 14 సున్నతి పొందని మగవాడు, అంటే ఎవరి మర్మాంగం పై చర్మం సున్నతి కాలేదో అలాంటివాడిని అతని జాతిలోనుండి బహిష్కరించాలి. అతడు నా నిబంధనను భంగం చేశాడు.”
15 దేవుడు అబ్రాహాముతో ఇంకా ఇలా అన్నాడు. “నీ భార్య అయిన శారయిని ఇకనుండి శారయి అని పిలువవద్దు. ఇకనుండి ఆమె పేరు శారా 16 నేను ఆమెను ఆశీర్వదించి, ఆమె ద్వారా నీకు కొడుకుని ఇస్తాను. ఆమె అనేక జాతులకు తల్లి అవుతుంది. ఆమె నుండి అనేక జాతుల రాజులు వస్తారు.”
-
25 నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడివైతే నీకు సున్నతి ప్రయోజనం వర్తిస్తుంది గాని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవాడివైతే, నీ సున్నతి సున్నతి కానట్టే. 26 కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్ర నియమాలను పాటిస్తే సున్నతి లేకపోయినా సున్నతి పొందినవాడుగా ఎంచబడతాడు గదా? 27 సున్నతి పొందకపోయినా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవాడు, లేఖనాలూ, సున్నతి కలిగి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే నీకు తీర్పు తీరుస్తాడు కదా? 28 పైకి యూదుడుగా కనిపించేవాడు యూదుడు కాదు, శరీరంలో పైకి కనిపించే సున్నతి సున్నతి కాదు. 29 అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయానికి చెందింది. అది ఆత్మలో జరిగేదే గాని అక్షరార్ధమైనది కాదు. అలాటి వాణ్ణి మనుషులు కాదు, దేవుడే మెచ్చుకుంటాడు.
-
8 క్రీస్తుపై కాకుండా మానవ సంప్రదాయాలపైనా, ప్రాపంచిక మూల సూత్రాలపైనా ఆధారపడ్డ తత్వజ్ఞానాన్నీ, కేవలం మోసపూరితమైన వట్టి వాదాలనూ ప్రయోగించి ఎవరూ మిమ్మల్ని వశం చేసుకోకుండా చూసుకోండి. 9 ఎందుకంటే దైవత్వపు సర్వ సంపూర్ణత ఆయన శరీరంలో నివసిస్తూ ఉంది. 10 ప్రతి ప్రభుత్వానికీ ఆధిపత్యానికీ పై శిరస్సుగా ఉన్న ఆయనలో మీరు సంపూర్ణులు. 11 మనుషుల చేతులతో చేసినట్టు కాకుండా దేవుడు ఆయనలో మీకు సున్నతి చేశాడు. స్వభావరీత్యా శరీరంలో ఉన్న పాపపు నైజాన్ని తీసివేయడమే క్రీస్తులో మీరు పొందిన సున్నతి.
12 బాప్తిసంలో మీరు ఆయనతో కూడా సమాధి అయ్యారు. అయితే చనిపోయిన వారిలో నుండి ఆయనను సజీవంగా లేపిన దేవుని శక్తిపై మీకున్న విశ్వాసం వల్ల మీరు కూడా సజీవంగా లేచారు.
13 ఒకప్పుడు మీరు చేసిన అపరాధాలవల్లా శరీరంలో మీకు సున్నతి జరగక పోవడంవల్లా మీరు చనిపోయిన వారుగా ఉండేవారు. అప్పుడు ఆయన తనతోబాటు మిమ్మల్ని బతికించాడు. మన అపరాధాలన్నిటినీ క్షమించాడు. 14 మనకు వ్యతిరేకంగా రాసి ఉన్న రుణపత్రాన్నీ, దానికి సంబంధించిన నియమ నిబంధనలనూ ఆయన తుడిచివేశాడు. ఆయన వాటన్నిటినీ తీసివేసి సిలువకు మేకులతో కొట్టాడు.
-
9 ఈ దీవెన సున్నతి ఆచరించే వారి గురించి చెప్పాడా, ఆచరించని వారి గురించి కూడా చెప్పాడా? అబ్రాహాము విశ్వాసం అతణ్ణి నీతిమంతుడుగా తీర్చింది అన్నాం కదా? 10 అతడు ఏ స్థితిలో ఉన్నప్పుడు అది జరిగింది? సున్నతి చేయించుకున్న తరవాతా లేక సున్నతికి ముందా? ముందే కదా! 11 సున్నతి లేకపోయినా నమ్మిన వారికందరికీ అతడు తండ్రి కావడం కోసం వారికి నీతి ఆపాదించడానికై సున్నతి లేనప్పుడే, తాను కలిగి ఉన్న విశ్వాసం వలన పొందిన నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందాడు. 12 అలాగే సున్నతి గలవారికి కూడా తండ్రి కావడానికి, అంటే కేవలం సున్నతి మాత్రమే పొందిన వారు కాక సున్నతి లేనప్పుడు మన తండ్రి అబ్రాహాము విశ్వాసపు అడుగుజాడల్లో నడచిన వారికి కూడా తండ్రి కావడానికి అతడు ఆ గుర్తు పొందాడు.
13 అబ్రాహాము, అతని సంతానం లోకానికి వారసులవుతారు అనే వాగ్దానం ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు. విశ్వాసం వలన ఏర్పడిన నీతి మూలంగానే కలిగింది.
-
1 స్వేచ్ఛగా ఉండడం కోసం క్రీస్తు మనలను విడుదల చేశాడు. కాబట్టి, స్థిరంగా నిలబడండి. మళ్ళీ బానిసత్వపు కాడి కింద చిక్కుకోవద్దు.
2 మీరు సున్నతి పొందితే క్రీస్తు వలన మీకు ఏ ప్రయోజనమూ ఉండదని పౌలు అనే నేను మీతో చెబుతున్నాను. 3 సున్నతి పొందిన ప్రతి మనిషీ ధర్మశాస్త్రమంతటినీ పాటించవలసి ఉంటుందని నేను మళ్ళీ గట్టిగా చెబుతున్నాను. 4 మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతుల లెక్కలోకి రావాలనుకునే వారు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరై పోయారు. కృపలో నుంచి తొలగిపోయారు. 5 మనం విశ్వాసం వలన నీతి కలుగుతుందనే నిశ్చయంతో ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. 6 యేసు క్రీస్తులో సున్నతి పొందడంలోనో, పొందకపోవడంలోనో ఏమీ లేదు, ప్రేమతో పని చేసే విశ్వాసమే ముఖ్యం.
7 మీరు బాగా పరిగెడుతున్నారు. సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు? 8 ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వాడి నుంచి కలగలేదు. 9 పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియబెడుతుంది.
10 మీరెంత మాత్రమూ వేరుగా ఆలోచించరని ప్రభువులో మీ గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను. మిమ్మల్ని కలవరపెట్టేవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు. 11 సోదరులారా, సున్నతి పొందాలని నేను ఇంకా ప్రకటిస్తూ ఉంటే ఇప్పటికీ ఎందుకు హింసలకు గురి అవుతూ ఉన్నాను? సిలువను గురించిన అభ్యంతరాన్ని సున్నతి తీసివేస్తుంది గదా?
12 మిమ్మల్ని తప్పు దారి పట్టించే వారు తమ్మును తాము నరికి వేసికోవడం మంచిది.
-
12 శరీర విషయంలో చక్కగా కనిపించాలని కోరే వారు, తాము క్రీస్తు సిలువ విషయంలో హింస పొందకుండా ఉండడానికి మాత్రమే సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు. 13 అయితే వారు సున్నతి పొందిన వారైనా ధర్మశాస్త్రం ఆచరించరు. వారు మీ శరీర విషయంలో గొప్పలు చెప్పుకోవడం కోసం మీరు సున్నతి పొందాలని కోరుతున్నారు.
14 అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయంలో తప్ప మరి దేనిలోనూ గొప్పలు చెప్పుకోవడం నాకు దూరమవుతుంది గాక. ఆయన ద్వారా లోకానికి నేనూ, నాకు లోకం సిలువ మరణం చెందాను. 15 కొత్త సృష్టి పొందడమే గాని సున్నతి పొందడంలో, పొందకపోవడంలో ఏమీ లేదు.
16 ఈ పద్ధతి ప్రకారం నడుచుకునే వారందరికీ అంటే, దేవుని ఇశ్రాయేలుకు శాంతి, కృప కలుగు గాక.
-
1 చివరిగా, నా సోదరులారా, ప్రభువులో ఆనందించండి. ఈ విషయాలనే మీకు మరలా రాయడం నాకేమీ సమస్య కాదు. మీకది క్షేమకరం. 2 కుక్కల విషయం జాగ్రత్త. చెడు పనులు చేసే వారి విషయం జాగ్రత్త. ఛేదించే ఆచారం పాటించే వారి విషయం జాగ్రత్త. 3 ఎందుకంటే, మనం దేవుని ఆత్మతో ఆరాధిస్తూ శరీరం మీద నమ్మకం పెట్టుకోకుండా క్రీస్తు యేసులో అతిశయిస్తున్నాము. మనమే అసలైన సున్నతి పొందిన వాళ్ళం.
4 చెప్పాలంటే, వాస్తవంగా నేనే శరీరాన్ని ఆధారం చేసుకోగలను. ఎవరైనా శరీరాన్ని ఆధారం చేసుకోవాలనుకుంటే నేను మరి ఎక్కువగా చేసుకోగలను. 5 ఎనిమిదవ రోజున సున్నతి పొందాను. ఇశ్రాయేలు జాతిలో పుట్టాను. బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి. హెబ్రీయుల్లో హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రం విషయంలో పరిసయ్యుణ్ణి. 6 క్రైస్తవ సంఘాన్ని తీవ్రంగా హింసించాను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయంలో నిందారహితుడిని.
7 అయినా ఏవేవి నాకు లాభంగా ఉండేవో వాటిని క్రీస్తు కోసం పనికిరానివిగా ఎంచాను.
-
12 కాబట్టి ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన్ని ప్రేమించి, మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణాత్మతో సేవించు.
13 మీ మేలు కోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను, కట్టడలను పాటించడం తప్ప మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకేమి కోరుతున్నాడు?
14 చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవావే. 15 అయితే యెహోవా మీ పూర్వీకులను ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాడు.
16 కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. 17 ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు.
-
1 “నేను మీకు తెలియపరచిన ఈ విషయాలన్నీ అంటే దీవెనలు, శాపాలు మీ మీదికి వచ్చిన తరువాత మీ దేవుడు మిమ్మల్ని వెళ్లగొట్టించిన 2 అన్ని రాజ్యాల్లో వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. అప్పుడు మీరూ, మీ పిల్లలూ మీ దేవుడైన యెహోవా వైపు తిరిగితే, ఈవేళ నేను మీకాజ్ఞాపించే వాటి ప్రకారం మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ఆయన మాట వింటే 3 మీ దేవుడైన యెహోవా చెరలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని కనికరించి, మీ యెహోవా దేవుడు ఏ ప్రజల్లోకి మిమ్మల్ని చెదరగొట్టాడో వారందరిలో నుంచి మిమ్మల్ని సమకూర్చి ఇక్కడికి తీసుకువస్తాడు.
4 చెదిరిపోయిన మీలో ఎవరైనా భూమి దిగంతాల్లో ఉన్నప్పటికీ అక్కడ నుంచి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుంచి తీసుకు వస్తాడు. 5 మీ పూర్వీకులు స్వాధీనం చేసుకున్న దేశానికి మీ యెహోవా దేవుడు మిమ్మల్ని చేరుస్తాడు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆయన మీకు మేలు చేసి మీ పూర్వీకుల కంటే మిమ్మల్ని అసంఖ్యాకంగా చేస్తాడు.
6 మీరు బతకడానికి, హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని ప్రేమించేలా మీ యెహోవా దేవుడు మీ హృదయానికీ మీ పిల్లల హృదయానికీ సున్నతి చేస్తాడు.
7 మిమ్మల్ని హింసించిన మీ శత్రువుల మీదికీ మిమ్మల్ని ద్వేషించినవారి మీదికీ మీ యెహోవా దేవుడు ఆ శాపాలన్నీ రప్పిస్తాడు. 8 మీరు తిరిగి వచ్చి యెహోవా మాట వింటారు. నేనిప్పుడు మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తిస్తారు.
-
17 అయితే ప్రభువు ప్రతివాడికీ ఏ స్థితి నియమించాడో, ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలోనే నడుచుకోవాలి. ఇదే నియమం సంఘాలన్నిటిలో ఏర్పాటు చేస్తున్నాను. 18 ఎవరినైనా దేవుడు విశ్వాసంలోకి పిలిచినప్పుడు అతడు సున్నతి పొంది ఉన్నాడా? అతడు ఆ సున్నతి గుర్తులు పోగొట్టుకోనక్కర లేదు. ఒకవేళ సున్నతి పొందనివాడు విశ్వాసంలోకి వచ్చాడా? అతడు సున్నతి పొందనక్కర లేదు. 19 దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం గానీ సున్నతి పొందడంలో గానీ, పొందక పోవటంలో గానీ ఏమీ లేదు,
20 ఎవరు ఏ స్థితిలో ఉండగా పిలుపు పొందారో ఆ స్థితిలోనే ఉండాలి.
-
25 యెహోవా చెప్పేదేమంటే “అన్యజాతి ప్రజలు సున్నతి పొందలేదు. ఇశ్రాయేలీయులేమో హృదయ సంబంధమైన సున్నతి పొందలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో సున్నతి పొందని వారినీ, పొందిన వారినీ కలిపి శిక్షిస్తాను. 26 అంటే ఐగుప్తు వారు, యూదులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఎడారిలో నివసిస్తూ తమ గడ్డాలు చెంపలపై గొరిగించుకునేవారు, వీరందరినీ నేను శిక్షిస్తాను.”
-
2 “నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు. ఒక స్త్రీ గర్భవతిగా ఉండి ఒక మగ పిల్లాణ్ణి కంటే ఆమె ఏడు రోజులు అశుద్ధంగా ఉంటుంది. తాను బహిష్టు రోజుల్లో ఉన్నట్టే అశుద్ధంగా ఉంటుంది. 3 ఎనిమిదో రోజున ఆ పిల్లాడికి సున్నతి చేయించాలి.
-
21 ఆ బిడ్డకి సున్నతి ఆచారం జరిగించవలసిన ఎనిమిదవ రోజున, ఆయన గర్భంలో పడక మునుపు దేవదూత పెట్టిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టారు. 22-24 మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ దినాలు పూర్తి అయినాయి. “ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి” అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉంది. కాబట్టి ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి, ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు గువ్వల జతను గానీ రెండు పావురం పిల్లలను గానీ బలిగా సమర్పించడానికి వారు ఆయనను యెరూషలేముకు తీసుకు వెళ్ళారు.
-
1 యూదయ నుండి కొందరు వచ్చి, “మోషే నియమించిన విశ్వాసులకు సున్నతి పొందితేనే గాని మీకు రక్షణ లేదు” అని విశ్వాసులకు బోధిస్తూ ఉన్నారు.
2 పౌలుకు, బర్నబాకు వారితో తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. ఈ సమస్య గురించి పౌలు బర్నబాలు, ఇంకా మరి కొంతమంది యెరూషలేములోని అపొస్తలుల, పెద్దల దగ్గరికి వెళ్ళాలని సోదరులు నిశ్చయించారు. 3 కాబట్టి సంఘం వారిని సాగనంపగా, వారు ఫేనీకే, సమరయ ప్రాంతాల ద్వారా వెళ్తూ, యూదేతరులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియజేసి సోదరులందరికి మహానందం కలగజేశారు.
4 వారు యెరూషలేము చేరగానే సంఘం, అపొస్తలులూ పెద్దలూ వారికి స్వాగతం పలికారు. దేవుడు తమకు తోడై చేసిన వాటన్నిటినీ వారు వివరించారు. 5 కానీ పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, యూదేతరులకు సున్నతి చేయించాలనీ, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేలా వారికి ఆజ్ఞాపించాలనీ చెప్పారు.
6 అప్పుడు అపొస్తలులూ పెద్దలూ ఈ సంగతి గూర్చి ఆలోచించడానికి సమావేశమయ్యారు. చాలా చర్చ జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇలా అన్నాడు.
7 “సోదరులారా, యూదేతరులు నా నోట సువార్త విని విశ్వసించేలా మీలో నుండి నన్ను ఆరంభ దినాల్లో దేవుడు ఎన్నుకున్నాడని మీకు తెలుసు. 8 హృదయాలను ఎరిగిన దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఇచ్చినట్టే, వారికీ ఇచ్చి, తాను వారిని స్వీకరించినట్టుగా వెల్లడి పరిచాడు. 9 మనకీ వారికీ ఏ తేడా చూపకుండా వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచాడు. 10 కాబట్టి మన పూర్వీకులు గానీ మనం గానీ మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు? 11 ప్రభువైన యేసు కృప ద్వారా మనం రక్షణ పొందుతామని మనం నమ్ముతున్నాం గదా? అలాగే వారూ రక్షణ పొందుతారు.”
12 అప్పుడు బర్నబా, పౌలు తమ ద్వారా దేవుడు యూదేతరుల్లో చేసిన సూచకక్రియలనూ మహత్కార్యాలనూ వివరిస్తుంటే సభ అంతా నిశ్శబ్దంగా ఆలకించింది.
13 వారు చెప్పడం ముగించిన తరువాత యాకోబు లేచి ఇలా అన్నాడు, “సోదరులారా, నా మాట వినండి. 14 యూదేతరుల్లో నుండి దేవుడు తన నామం కోసం ఒక జనాన్ని ఏర్పరచుకోడానికి వారిని మొదట ఎలా కటాక్షించాడో సీమోను తెలియజేశాడు. 15 ఇందుకు ప్రవక్తల మాటలు సరిపోతున్నాయి. ఎలాగంటే,
16 ‘ఆ తరువాత నేను తిరిగి వస్తాను.
మనుషుల్లో మిగిలినవారూ,
నా నామం ఎవరైతే ధరించారో
ఆ యూదేతరులందరూ, ప్రభువును వెదకేలా
17 పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి నిర్మిస్తాననీ పాడైన వాటిని తిరిగి కట్టి వాటిని నిలబెడతాననీ
18 అనాదికాలం నుండి ఈ సంగతులను తెలియజేసిన ప్రభువు సెలవిస్తున్నాడు’
అని రాసి ఉంది.
19 “కాబట్టి యూదేతరుల్లో నుండి దేవుని వైపు తిరిగే వారిని మనం కష్టపెట్టకుండా 20 విగ్రహ సంబంధమైన అపవిత్రతనూ జారత్వాన్నీ విసర్జించాలనీ, గొంతు నులిమి చంపిన దాన్ని, రక్తాన్నీ తినకూడదనీ, వారికి ఉత్తరం రాసి పంపాలని నా అభిప్రాయం. 21 ఎందుకంటే, సమాజ మందిరాల్లో ప్రతి విశ్రాంతిదినాన మోషే లేఖనాలను చదువుతూ తరతరాల నుండి దాన్ని ప్రకటించే వారు ప్రతి పట్టణంలో ఉన్నారు” అని చెప్పాడు.
-
24 ప్రయాణం మధ్యలో వారు బస చేసినప్పుడు యెహోవా వారిని ఎదుర్కొని మోషేను చంపడానికి చూశాడు. 25 మోషే భార్య సిప్పోరా ఒక పదునైన రాయి తీసుకుని తన కొడుక్కి సున్నతి చేసి మర్మాంగ చర్మం కొన మోషే పాదాల దగ్గర పడేసింది. “నువ్వు నిజంగా నా రక్తసంబంధమైన భర్తవి” అని చెప్పింది. 26 అప్పుడు యెహోవా అతణ్ణి విడిచిపెట్టాడు. అప్పుడు ఆమె “ఈ సున్నతిని బట్టి నువ్వు నాకు రక్తసంబంధమైన భర్తవయ్యావు” అంది.
-
1 యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు తిరిగి రాదలిస్తే నా దగ్గరకే రావాలి.
మీరు మీ హేయమైన విగ్రహాలను తీసివేసి నా సన్నిధి నుండి ఇటూ అటూ తప్పిపోకుండా ఉంటే,
2 యథార్థంగా, నీతి నిజాయితీతో “యెహోవా జీవం తోడు” అని ప్రమాణం చేస్తే,
జాతులకు ఆయనలో ఆశీర్వాదం దొరుకుతుంది. వారు ఆయనలోనే అతిశయిస్తారు.
3 యూదా వారికీ యెరూషలేము నివాసులకూ యెహోవా చెప్పేదేమంటే, ముళ్ల పొదల్లో విత్తనాలు చల్లవద్దు. మీ బీడు భూమిని దున్నండి.
4 యూదా, యెరూషలేము ప్రజలారా, మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. మీ దుష్టక్రియలను బట్టి నా కోపం అగ్నిలాగా మండుతున్నది. దాన్ని ఎవరూ ఆర్పివేయలేరు. కాబట్టి యెహోవాకు లోబడి ఉండండి.
-
11 కాబట్టి పూర్వం మీరు శారీరికంగా అన్యులు. “శరీరంలో మనుషుల చేతితో సున్నతి పొందిన యూదులు” మిమ్మల్ని “సున్నతి లేనివారు” అని పిలిచేవారు. 12 ఆ కాలంలో మీరు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారుగా వాగ్దాన నిబంధనలకు పరాయివారుగా, నిరీక్షణ లేనివారుగా, లోకంలో దేవుడు లేనివారుగా ఉన్నారు. 13 అయితే పూర్వం దేవునికి దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసులో క్రీస్తు రక్తం వలన దేవునికి దగ్గరయ్యారు.
14 ఆయనే మన శాంతి. ఆయన యూదులనూ యూదేతరులనూ ఏకం చేశాడు. మన ఉభయులనూ విడదీస్తున్న విరోధమనే అడ్డుగోడను తన శరీరం ద్వారా కూలగొట్టాడు. 15 అంటే, ఆ ఇద్దరి నుండి ఒక కొత్త ప్రజను సృష్టించడానికి విధులూ ఆజ్ఞలూ గల ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడు. 16 వారి మధ్య ఉన్న వైరాన్ని సిలువ ద్వారా నిర్మూలించి, వీరిద్దరినీ దేవునితో ఏకం చేసి శాంతి నెలకొల్పాలని ఇలా చేశాడు 17 యేసు వచ్చి దూరంగా ఉన్నవారికి సువార్తను, శాంతిని ప్రకటించాడు. దగ్గరగా ఉన్నవారికి శాంతిసమాధానాలు ప్రకటించాడు. 18 యేసు ద్వారానే మీరూ మేమూ ఒకే ఆత్మ ద్వారా తండ్రిని చేరగలం.
19 కాబట్టి యూదేతరులైన మీరు ఇకమీదట అపరిచితులూ పరదేశులూ కారు. పరిశుద్ధులతో సాటి పౌరులు, దేవుని కుటుంబ సభ్యులు. 20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డారు. 21 ఆయన వల్లనే తన కుటుంబమనే కట్టడం చక్కగా అమరి, ప్రభువు కోసం పరిశుద్ధ దేవాలయంగా రూపొందుతూ ఉంది. 22 ఆయనలో మీరు కూడా ఆత్మలో దేవునికి నివాసస్థలంగా ఉండడానికి వృద్ది చెందుతూ ఉన్నారు.
-
1 పద్నాలుగు సంవత్సరాలైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేము తిరిగి వెళ్ళాను. 2 మేము వెళ్ళాలని దేవుడు దర్శనంలో నాకు చెబితేనే వెళ్ళాను. నా ప్రయాస వ్యర్థమైపోతుందేమో, లేక వ్యర్థమైపోయిందేమో అని నేను యూదేతరులకు ప్రకటిస్తున్న సువార్త గురించి విశ్వాసుల్లో ముఖ్యమైన నాయకులకు ఏకాంతంగా వివరించాను.
3 అయినా నాతో ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనప్పటికీ సున్నతి పొందాలని ఎవరూ అతణ్ణి బలవంతం చేయలేదు. 4 క్రీస్తు యేసులో మనకు కలిగిన స్వాతంత్రాన్ని కనిపెట్టడానికీ, మనలను ధర్మశాస్త్రానికి బానిసలుగా చేసుకోడానికీ క్రీస్తు యేసు వల్ల మనకు కలిగిన స్వేచ్ఛను గూఢచారుల్లాగా కనిపెట్టడానికి రహస్యంగా కపట సోదరులు ప్రవేశించారు. 5 సువార్త సత్యం మార్పులేనిదిగా, మీకు ప్రయోజనంగా నిలిచి ఉండేలా కాసేపైనా వారితో మేము ఏకీభవించలేదు.
-
9 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. 10 ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు.
11 ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి పొందిన వాడనీ సున్నతి పొందని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ లేదు. క్రీస్తే సమస్తం, సమస్తంలో ఆయనే ఉన్నాడు.
-
10 నేనెవరితో మాట్లాడి హెచ్చరించాలి? వారు వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వినలేదు.
ఇదిగో, యెహోవా వాక్యం వారిని సరిదిద్దడానికి వారి దగ్గరికి వచ్చింది కానీ దాన్ని వారు తృణీకరిస్తారు.
11 కాబట్టి నేను యెహోవా కోపంతో నిండిపోయాను. దాన్ని నాలోనే అణచుకోలేక నేను విసిగిపోయాను.
వీధుల్లో తిరిగే పసిపిల్లలు, యువకులు, ఇలా ప్రతి ఒక్కరి మీదా దాన్ని కుమ్మరించాల్సి వస్తున్నది.
భార్యతో బాటు భర్తనూ, వయస్సు మీరిన ప్రతి వాడితో కలిపి వృద్ధులందరినీ పట్టుకుంటారు.
-
14 పండగ ఉత్సవాల్లో సగం రోజులు గడిచాక యేసు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉపదేశించడం ప్రారంభించాడు. 15 ఆయన ఉపదేశానికి యూదులు ఆశ్చర్యపడి, “చదువూ సంధ్యా లేని వాడికి ఇంత పాండిత్యం ఎలా కలిగింది” అని చెప్పుకున్నారు.
16 దానికి యేసు, “నేను చేసే ఉపదేశం నాది కాదు. ఇది నన్ను పంపిన వాడిదే. 17 దేవుని ఇష్టప్రకారం చేయాలని నిర్ణయం తీసుకున్నవాడు నేను చేసే ఉపదేశం దేవుని వలన కలిగిందో లేక నా స్వంత ఉపదేశమో తెలుసుకుంటాడు. 18 తనంతట తానే బోధించేవాడు సొంత గౌరవం కోసం పాకులాడతాడు. తనను పంపిన వాని గౌరవం కోసం తాపత్రయ పడేవాడు సత్యవంతుడు. ఆయనలో ఎలాంటి దుర్నీతీ ఉండదు. 19 మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా! కానీ మీలో ఎవరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించరు. మీరు నన్ను చంపాలని ఎందుకు చూస్తున్నారు?” అన్నాడు.
20 అందుకు ఆ ప్రజలు, “నీకు దయ్యం పట్టింది. నిన్ను చంపాలని ఎవరు కోరుకుంటారు?” అన్నారు. 21 యేసు వారితో, “నేనొక కార్యం చేశాను. దానికి మీరంతా ఆశ్చర్యపడుతున్నారు. 22 మోషే మీకు సున్నతి అనే ఆచారాన్ని నియమించాడు. ఈ ఆచారం మోషే వల్ల కలిగింది కాదు. ఇది పూర్వీకుల వల్ల కలిగింది. అయినా విశ్రాంతి దినాన మీరు సున్నతి కార్యక్రమం చేస్తున్నారు. 23 విశ్రాంతి దినాన సున్నతి పొందినా మోషే ధర్మ శాస్త్రాన్ని అతిక్రమించినట్టు కాదు గదా! అలాంటప్పుడు నేను విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగు చేస్తే నా మీద ఎందుకు కోపం చూపుతున్నారు? 24 బయటకు కనిపించే దాన్ని బట్టి కాక న్యాయసమ్మతంగా నిర్ణయం చేయండి” అన్నాడు.
-
57 ఎలీసబెతు నెలలు నిండి కొడుకుని కన్నది. 58 అప్పుడు ప్రభువు ఆమెపై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగుపొరుగు, బంధువులు విని ఆమెతో కలిసి సంతోషించారు. 59 వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని నామకరణం చేయబోతుండగా 60 తల్లి, “అలా కాదు. ఆ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి” అంది. 61 అందుకు వారు, “నీ బంధువుల్లో ఆ పేరుగల వారెవరూ లేరు గదా” అని, 62 “వాడికి ఏ పేరు పెట్టాలి?” అని తండ్రిని సైగలతో అడిగారు. 63 అతడు పలక తెమ్మని, “బాబు పేరు యోహాను” అని రాశాడు. అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు. 64 వెంటనే అతని నోరు తెరుచుకుంది, నాలుక సడలి, అతడు దేవుణ్ణి స్తుతించ సాగాడు. 65 అది చూసి చుట్టుపక్కల కాపురం ఉన్న వారికందరికీ భయమేసింది. ఈ సమాచారం యూదయ మన్యంలో అంతటా చెప్పుకోసాగారు. 66 జరిగిన సంగతులు విన్న వారంతా ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉండటం చూసి, “ఈ బిడ్డ ఎలాటి వాడవుతాడో!” అనుకున్నారు.
-
1 పౌలు, దెర్బే లుస్త్ర పట్టణాలకు వచ్చాడు. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడున్నాడు. అతని తల్లి విశ్వాసి అయిన ఒక యూదు వనిత. తండ్రి గ్రీసు దేశస్థుడు. 2 తిమోతికి లుస్త్ర, ఈకొనియలో ఉన్న సోదరుల మధ్య మంచి పేరు ఉంది. 3 అతడు తనతో కూడ రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలుసు గనక వారిని బట్టి అతనికి సున్నతి చేయించాడు.
4 వారు ఆ పట్టణాల ద్వారా వెళ్తూ, యెరూషలేములో ఉన్న అపొస్తలులూ పెద్దలూ నిర్ణయించిన విధులను పాటించేలా వాటిని వారికి అందజేశారు. 5 కాబట్టి సంఘాలు విశ్వాసంలో బలపడి, ప్రతిరోజూ సంఖ్యలో పెరిగాయి.
-
10 ఎందుకంటే అక్రమకారులు, ముఖ్యంగా సున్నతి పొందిన వారు చాలామంది ఉన్నారు. వారి మాటలు ఎందుకూ పనికి రానివి. వారు మనుషులను తప్పుదారి పట్టిస్తారు. 11 వారి నోళ్ళు మూయించడం అవసరం. వారు సిగ్గుకరమైన స్వలాభం కోసం బోధించకూడని వాటిని బోధిస్తూ, కుటుంబాలను పాడు చేస్తున్నారు.
12 వారిలో ఒకడు, వారి స్వంత ప్రవక్తే ఇలా అన్నాడు, ‘క్రేతు ప్రజలు ఎంతసేపూ అబద్ధికులు, ప్రమాదకరమైన దుష్టమృగాలు, సోమరులైన తిండిబోతులు.’ 13-14 ఈ మాటలు నిజమే. అందుచేత వారు యూదుల కల్పిత గాథలనూ, సత్యం నుండి మళ్ళిన వారి ఆజ్ఞల గురించి సమయం వ్యర్థం చేసుకోకుండా పట్టించుకోకుండా విశ్వాసంలో స్థిరపడడం కోసం వారిని కఠినంగా మందలించు.
-
44 పేతురు ఈ మాటలు చెబుతూ ఉండగానే అతని బోధ విన్న వారందరి మీదికీ పరిశుద్ధాత్మ దిగాడు. 45 సున్నతి పొందిన విశ్వాసులంతా, అంటే పేతురుతో పాటు వచ్చినవారంతా, పరిశుద్ధాత్మ వరాన్ని యూదేతరుల మీద కూడా దేవుడు కుమ్మరించడం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. 46 ఎందుకంటే యూదేతరులు భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించడం వారు విన్నారు. 47 అప్పుడు పేతురు, “మనలాగా పరిశుద్ధాత్మను పొందిన వీరు నీటి బాప్తిస్మం పొందకుండా ఎవరైనా అడ్డు చెప్పగలరా?” అని చెప్పి 48 యేసుక్రీస్తు నామంలో వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు. అటు తరువాత మరికొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారతన్ని బతిమాలారు.
-
23 అప్పుడు అబ్రాహాము అదే రోజు తన కుమారుడు ఇష్మాయేలునూ, తన ఇంట్లో పుట్టిన వారినందర్నీ, అలాగే తాను వెల ఇచ్చి కొన్న వారందరినీ తన ఇంట్లోని ప్రతి మగవాణ్ణీ తీసుకుని వారందరికీ వారి మర్మాంగం పైచర్మాన్ని సున్నతి చేశాడు.
24 అబ్రాహాము మర్మాంగం పైచర్మానికి సున్నతి జరిగినప్పుడు అతని వయస్సు తొంభై తొమ్మిది ఏళ్ళు. 25 అతని కుమారుడు ఇష్మాయేలుకు సున్నతి జరిగినప్పుడు అతనికి పదమూడేళ్ళు. 26 అబ్రాహామూ అతని కుమారుడు ఇష్మాయేలూ ఒక్కరోజే సున్నతి పొందారు. 27 అతని ఇంట్లో పుట్టినవారూ, విదేశీయుల దగ్గర వెల ఇచ్చి కొన్నవారూ, ఇంకా అతని ఇంట్లో మగవాళ్ళంతా సున్నతి పొందారు.
-
1 యూదేతరులు కూడా దేవుని వాక్కు అంగీకరించారని అపొస్తలులు, యూదయలోని సోదరులు విన్నారు. 2 పేతురు యెరూషలేముకు వచ్చినపుడు సున్నతి పొందినవారు, 3 “నీవు సున్నతి లేని వారి దగ్గరికి పోయి వారితో భోజనం చేశావు” అని అతనిని విమర్శించారు.
4 అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలా వివరిస్తూ, 5 “నేను యొప్పే ఊరిలో ప్రార్థన చేసుకుంటుంటే, పారవశ్యంలో ఒక దర్శనం చూశాను. దానిలో నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా దగ్గరికి వచ్చింది. 6 దాన్ని నేను నిదానించి చూస్తే భూమి మీద ఉండే వివిధ రకాల నాలుగు కాళ్ళ జంతువులూ అడవి జంతువులూ పాకే పురుగులూ ఆకాశపక్షులూ నాకు కనబడ్డాయి.
7 అప్పుడు, ‘పేతురూ, నీవు లేచి చంపుకుని తిను’ అనే ఒక శబ్దం నాతో చెప్పడం విన్నాను. 8 అందుకు నేను, ‘వద్దు ప్రభూ, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదీ నేనెన్నడూ తినలేదు’ అని జవాబిచ్చాను. 9 రెండవసారి ఆ శబ్దం ఆకాశం నుండి, ‘దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు’ అని వినిపించింది. 10 ఈ విధంగా మూడుసార్లు జరిగింది. తరువాత అదంతా ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.
11 వెంటనే కైసరయ నుండి నా దగ్గరికి వచ్చిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి దగ్గర నిలబడ్డారు. 12 అప్పుడు ఆత్మ, ‘నీవు ఏ భేదం చూపకుండా వారితో కూడా వెళ్ళు’ అని ఆజ్ఞాపించాడు. ఈ ఆరుగురు సోదరులు నాతో వచ్చారు. మేము కొర్నేలి ఇంటికి వెళ్ళాం. 13 అతడు తన యింట్లో నిలబడిన దూతను తానెలా చూశాడో చెబుతూ, ‘నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే పేరున్న సీమోనును పిలిపించు. 14 నీవూ, నీ ఇంటివారంతా రక్షణ పొందే మాటలు అతడు నీతో చెబుతాడు’ అని అన్నాడని తెలియజేశాడు.
15 నేను మాట్లాడడం మొదలుపెట్టినపుడు పరిశుద్ధాత్మ ప్రారంభంలో మన మీదికి దిగినట్టుగానే వారి మీదికీ దిగాడు. 16 అప్పుడు, ‘యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు’ అని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను.
17 “కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా అదే వరం ఇస్తే, దేవుణ్ణి అడ్డగించడానికి నేనెవర్ని?” అని వారితో అన్నాడు. 18 వారీ మాటలు విని ఇంకేమీ అడ్డు చెప్పకుండా “అలాగయితే యూదేతరులకు కూడా దేవుడు నిత్యజీవాన్ని మారుమనసును దయచేశాడు” అని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరిచారు.
-
3 అబ్రాహాము తన భార్య శారా ద్వారా తనకు పుట్టిన తన కొడుక్కి ఇస్సాకు అనే పేరు పెట్టాడు. 4 దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన కొడుకు ఇస్సాకుకు ఎనిమిదవ రోజున సున్నతి చేశాడు.
-
40 వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును, తమ దోషాన్ని, తమ తండ్రుల దోషాన్ని ఒప్పుకుని, తాము నాకు విరోధంగా నడిచామని, 41 నేను వారికి విరోధంగా నడిచానని, తమ శత్రువుల దేశంలోకి తమ్మును రప్పించాననీ ఒప్పుకుంటే, అంటే లోబడని తమ హృదయాలు లొంగి తాము చేసిన దోషానికి ప్రతి దండన అనుభవించామని ఒప్పుకుంటే, 42 నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. ఆ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాను.
-
1 వారు యొర్దానును దాటినంతసేపూ యెహోవా ఇశ్రాయేలీయుల ముందు ఉండి ఆ నదిలో నీళ్లను ఆరిపోయేలా చేసిన సంగతి యొర్దానుకు పశ్చిమాన ఉన్న అమోరీయుల రాజులూ, మహాసముద్రం తీరాన ఉన్న కనానీయుల రాజులూ విన్నప్పుడు, వారి గుండెలు అదిరిపోయాయి. ఇశ్రాయేలీయుల భయంతో వారు అధైర్యపడ్డారు.
2 ఆ సమయంలో యెహోవా “రాతికత్తులు చేయించి మళ్లీ ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించు” అని యెహోషువకు ఆజ్ఞాపించాడు. 3 యెహోషువ రాతి కత్తులు చేయించి “గిబియత్ హరాలోత్” అనే స్థలం దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించాడు.
4 యెహోషువ సున్నతి చేయించటానికి కారణం, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధసన్నద్ధులైన వారందరూ ఐగుప్తు మార్గంలో అరణ్యంలోనే చనిపోయారు. 5 బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందినవారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్యమార్గంలో పుట్టిన వారిలో ఎవ్వరూ సున్నతి పొందలేదు.
6 యెహోవా మాట వినకపోవడం వల్ల వారికి ఏ దేశాన్ని ఇస్తానని వారి పితరులతో యెహోవా ప్రమాణం చేశాడో, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తాను వారికి ఇంక చూపించనని ప్రమాణం చేసినందువల్ల ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ నశించే వరకూ ఇశ్రాయేలీయులు నలభై సంవత్సరాలు అరణ్యంలో సంచరిస్తూ ఉండిపోయారు. 7 ఆయన వారికి స్థానంలో పుట్టించిన వారి కుమారులు సున్నతి పొందలేదు కాబట్టి వారికి ఇప్పుడు సున్నతి చేయించాడు, ఎందుకంటే మార్గంలో వారికి సున్నతి జరగలేదు.
8 కాబట్టి ప్రజలందరికీ సున్నతి చేయించిన తరువాత వారు బాగుపడే వరకూ శిబిరం లోనే ఉండిపోయారు.
-
8 ఆయన అబ్రాహాముకు సున్నతితో కూడిన ఒక నిబంధనను ఇచ్చాడు. అతడు ఇస్సాకును కని ఎనిమిదవ రోజున సున్నతి చేశాడు. ఇస్సాకు యాకోబును, యాకోబు పన్నెండుమంది గోత్ర మూలపురుషులనూ కని వాళ్లకి సున్నతి చేశారు.
-
12 అప్పుడు మోషే “ఇశ్రాయేలీయులు నా మాట వినకపోతే ఫరో ఎందుకు వింటాడు? నాకు వాక్చాతుర్యం లేదు” అని యెహోవా సముఖంలో చెప్పాడు.
-
4 తరవాత అతడు నన్ను ఉత్తర ప్రవేశద్వారం గుండా మందిరం ముందు భాగానికి తీసుకు వచ్చాడు. అంతలో మందిరం యెహోవా మహిమ తేజస్సుతో నిండి ఉండడం చూసి నేను సాగిలపడ్డాను. 5 యెహోవా నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, యెహోవా మందిరం గురించిన కట్టడలు, విధులు అన్నిటిని నేను నీకు తెలియజేస్తున్నాను, నీవు శ్రద్ధగా గమనించు. ఈ సంగతులన్నిటిని నీ కళ్ళతో చూసి చెవులతో ఆలకించు. మందిరం బయటికి పోయే, లోపలి వచ్చే మార్గాలను గూర్చి ఆలోచించు.
6 తిరుగుబాటు చేసే ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించు, ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘ఇశ్రాయేలీయులారా, ఇంతవరకూ మీరు చేసిన అకృత్యాలు చాలు. 7 మీరు నాకు ఆహారం, కొవ్వు, రక్తం, అర్పించే సమయాల్లో హృదయంలో శరీరంలో సున్నతి లేని అన్యులను నా పరిశుద్ధ స్థలంలోకి తీసుకువచ్చారు. వారు మీ అకృత్యాలను ఆధారం చేసుకుని దాన్ని అపవిత్రపరచి నా నిబంధనను భంగపరిచారు. 8 నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన ఆవరణను మీరు కాపాడకపోగా, ఆ బాధ్యతను అన్యులకు అప్పగించారు.’
9 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తూ ఉండి హృదయంలో, శరీరంలో సున్నతి లేని అన్యుల్లో ఎవరూ నా పరిశుద్ధస్థలాల్లో ప్రవేశింపకూడదు.
-
27 కాబట్టి మనం గొప్పలు చెప్పుకోడానికి కారణమేది? దాన్ని కొట్టివేయడం అయిపోయింది. ఏ నియమాన్ని బట్టి? క్రియలను బట్టా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టే. 28 కాబట్టి మనుషులు ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వలన నీతిమంతులని తీర్పు పొందుతున్నారని నిర్ణయిస్తున్నాము.
29 దేవుడు యూదులకు మాత్రమేనా దేవుడు? యూదేతరులకు కాడా? అవును, వారికి కూడా దేవుడే. 30 దేవుడు ఒక్కడే కాబట్టి, ఆయన సున్నతి గలవారిని విశ్వాసం ద్వారా, సున్నతి లేని వారిని విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీరుస్తాడు.
31 విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నామా? కాదు, ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము.
-
3 వారు “నీ బంధువుల్లో గానీ మన సొంత జాతిలో గానీ అమ్మాయిలు లేరనా సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల్లో నుండి అమ్మాయిని భార్యగా తెచ్చుకోడానికి వెళ్తున్నావు?” అని అతణ్ణి అడిగారు. అందుకు సంసోను “ఆమె నాకు నచ్చింది. నా కోసం ఆమెను తెప్పించు” అని తన తండ్రితో అన్నాడు.
-
51 “మీరు మెడ వంచనివారూ, హృదయంలో చెవులలో సున్నతి లేని వారు. మీరు కూడా మీ పూర్వీకుల లాగే ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. 52 మీ పూర్వీకులు ఏ ప్రవక్తను హింసించకుండా ఉన్నారు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందే తెలియజేసిన వారిని చంపేశారు. ఆయనను కూడా మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు. 53 దూతలు అందించిన ధర్మశాస్త్రాన్ని పొందారు గాని దాన్ని మీరే పాటించలేదు” అని చెప్పాడు.
-
11 అయితే కేఫా, అంతియొకయకు వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు. కాబట్టి నేను ముఖాముఖిగా అతన్ని నిలదీశాను. 12 ఎందుకంటే, యాకోబు దగ్గర నుంచి కొంతమంది రాక ముందు అతడు యూదేతరులతో భోజనం చేస్తున్నాడు. వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తగ్గి, పక్కకి వెళ్ళిపోయాడు. 13 మిగతా యూదులు కూడా కేఫాతో ఈ కపటంలో కలిసిపోయారు. బర్నబా కూడా వారి కపట వేషధారణ వల్ల మోసపోయాడు. 14 వారు సువార్త సత్యాన్ని అనుసరించడం లేదని నేను చూసి అందరి ముందు కేఫాతో, “నీవు యూదుడవై ఉండి కూడా యూదుల్లాగా కాక యూదేతరుడిలా ప్రవర్తిస్తుంటే, యూదేతరులు యూదుల్లాగా ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు?” అన్నాను.
15 మనం పుట్టుకతో యూదులం గానీ, “యూదేతర పాపులం” కాదు. 16 మనిషి యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారానే దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు గాని, ధర్మశాస్త్ర క్రియల వలన కాదు. ఆ సంగతి ఎరిగిన మనం కూడా ధర్మశాస్త్ర క్రియల వలన గాక క్రీస్తు పట్ల విశ్వాసం ద్వారానే దేవుని చేత నీతిమంతులుగా తీర్పు పొందడానికి యేసు క్రీస్తులో విశ్వాసముంచాము. ధర్మశాస్త్ర క్రియల వలన ఎవరూ నీతిమంతుడని తీర్పు పొందడు గదా.
17 అయితే, దేవుడు మనలను క్రీస్తులో నీతిమంతులుగా తీర్చాలని కోరుకొంటూ, మనకు మనం పాపులుగా కనబడితే, క్రీస్తు పాపానికి సేవకుడయ్యాడా? కచ్చితంగా కాదు. 18 నేను పడగొట్టిన వాటిని మళ్ళీ కడితే నన్ను నేనే అపరాధిగా చేసుకుంటాను గదా. 19 నేనైతే దేవుని కోసం బతకడానికి ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రానికి చనిపోయాను.
20 నేను క్రీస్తుతోబాటు సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను సమర్పించుకున్న దేవుని కుమారుడి మీద విశ్వాసం వల్లనే. 21 నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం ద్వారా సాధ్యం అయితే క్రీస్తు అనవసరంగా చనిపోయినట్టే గదా.
-
43 తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు. “ఇది పస్కా పండగను గూర్చిన నియమం. వేరే జాతికి చెందిన వాడెవడూ దాన్ని తినకూడదు. 44 మీలో ఎవరైనా డబ్బిచ్చి కొనుక్కున్న దాసుడు సున్నతి పొందితే అలాంటి వాడు దాన్ని తినవచ్చు. 45 వేరే దేశాలకు చెందిన వాళ్ళు, కూలి పనికి వచ్చిన సేవకులు దాన్ని తినకూడదు. 46 ఏ ఇంట్లో వారు ఆ ఇంట్లో మాత్రమే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెం కూడా ఇంట్లో నుండి బయటికి తీసుకు వెళ్ళకూడదు. వధించిన జంతువులోని ఒక్క ఎముకను కూడా మీరు విరగ్గొట్టకూడదు.
47 ఇశ్రాయేలు ప్రజల సమాజం అంతా పండగ ఆచరించాలి. 48 మీ దగ్గర నివసించే ఎవరైనా విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలని కోరుకుంటే వాళ్ళ కుటుంబంలోని ప్రతి మగవాడూ సున్నతి పొందాలి. అప్పుడు వాళ్ళు సమాజంతో కలసి పస్కా ఆచరింపవచ్చు. వాళ్ళు మీ దేశంలో పుట్టిన వాళ్ళతో సమానం అవుతారు. సున్నతి పొందనివాడు దాన్ని తినకూడదు. 49 స్వదేశీయుడికీ మీతో కలసి నివసించే విదేశీయుడికీ ఈ విషయంలో ఒకే నియమం ఉండాలి.”
50 యెహోవా మోషే అహరోనులకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలందరూ చేశారు. 51 ఆ రోజే యెహోవా ఇశ్రాయేలు ప్రజలను వారి వారి సేనల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు నడిపించాడు.
-
1 యాకోబుకు లేయా ద్వారా పుట్టిన కూతురు దీనా. ఆమె ఆ దేశపు యువతులను చూడడానికి బయటికి వెళ్ళింది. 2 ఆ దేశపు రాజు, హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని, బలాత్కారం చేసి చెరిచాడు. 3 అయితే అతడు ఆమెపై మనసు పడ్డాడు. ఆమెని ప్రేమించి ఆమెతో ఇష్టంగా మాట్లాడాడు.
4 షెకెము తన తండ్రి హమోరును “ఈ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చెయ్యి” అని అడిగాడు. 5 అతడు తన కూతురిని చెరిచిన సంగతి యాకోబు విన్నాడు. తన కుమారులు పశువులతో పొలంలో ఉండడం వలన వారు వచ్చే వరకూ నెమ్మదిగా ఉన్నాడు. 6 షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి అతని దగ్గరికి వచ్చాడు. 7 యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలం నుండి తిరిగి వచ్చారు. అతడు యాకోబు కూతురును మానభంగం చేసి ఇశ్రాయేలు ప్రజలను కించపరిచాడు. అది చేయకూడని పని కాబట్టి అది వారికి చాలా అవమానకరంగా ఉంది. వారికి చాలా కోపం వచ్చింది.
8 అప్పుడు హమోరు వారితో “షెకెము అనే నా కొడుకు మీ కూతురిపై మనసు పడ్డాడు. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్ళి చేయండి. 9 మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకుని మాతో వియ్యం కలుపుకుని మా మధ్య నివసించండి. 10 ఈ దేశం మీ ఎదుట ఉంది. మీరు ఇందులో నివసించి వ్యాపారాలు చేసి ఆస్తి సంపాదించుకోండి” అని చెప్పాడు. 11 అతడింకా “నామీద దయ చూపండి. మీరేమి అడుగుతారో దాన్ని నేనిస్తాను. 12 ఓలి గానీ, కట్నం గానీ ఎంతైనా అడగండి. మీరు అడిగినంతా ఇస్తాను. ఆ యువతిని మాత్రం నాకు ఇవ్వండి” అని ఆమె తండ్రితో, సోదరులతో చెప్పాడు. 13 అయితే తమ సోదరి అయిన దీనాను అతడు చెరిచినందుకు యాకోబు కుమారులు షెకెముతో, అతని తండ్రి హమోరుతో కపటంగా జవాబిచ్చారు.
14 వారు “మేము ఈ పనికి అంగీకరించలేం. సున్నతి చేయించుకోని వాడికి మా సోదరిని ఇయ్యలేము. ఎందుకంటే అది మాకు అవమానకరం. 15 అయితే మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మాలాగా ఉండే పక్షంలో మాత్రమే మేము దీనికి అంగీకరించగలం. 16 ఆ ఒక్క షరతుతో మీ మాటకు ఒప్పుకుని, మా పిల్లలను మీ కిచ్చి మీ పిల్లలను మేము చేసుకుని, మీ మధ్య నివసిస్తాం. అప్పుడు మనమంతా ఒకే జనంగా ఉంటాం. 17 మీరు మా మాట విని సున్నతి పొందకపోతే మా అమ్మాయిని తీసుకు వెళ్ళిపోతాం” అన్నారు.
18 వారి మాటలు హమోరుకూ అతని కుమారుడు షెకెముకూ ఇష్టంగా ఉన్నాయి. 19 ఆ యువకుడికి యాకోబు కూతురు అంటే ప్రేమ కాబట్టి అతడు ఆ పని చేయడానికి ఆలస్యం చేయలేదు. అతడు తన వంశం వారందరిలో పేరు పొందినవాడు.
20 హమోరూ అతని కుమారుడు షెకెమూ ఆ ఊరి ద్వారం దగ్గరికి వచ్చి తమ ఊరి ప్రజలతో మాట్లాడుతూ, 21 “ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు కాబట్టి వారిని మన దేశంలో ఉండనిచ్చి దీనిలో వ్యాపారం చేసుకోనిద్దాం. ఈ భూమి వారికి కూడా చాలినంత విశాలంగా ఉంది కదా, మనం వారి పిల్లలను చేసుకుని మన పిల్లలను వారికి ఇద్దాం.
22 అయితే ఒక విషయం, ఆ మనుషులు సున్నతి పొందినట్టుగానే మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందితేనే వారు మన మాటకు ఒప్పుకుని మనలో నివసించి ఒకే జనంగా కలిసి ఉంటారు. 23 వారి మందలూ వారి ఆస్తీ వారి పశువులూ అన్నీ మనవవుతాయి కదా. ఎలాగైనా మనం వారి షరతుకు ఒప్పుకుందాం. అప్పుడు వారు మనలో నివసిస్తారు.”
24 హమోరు, అతని కుమారుడు షెకెము చెప్పిన మాటలు ఆ ఊరి ద్వారం గుండా వెళ్ళేవారంతా విన్నారు. అప్పుడు ఆ ద్వారం గుండా వెళ్ళే వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందాడు. 25 మూడో రోజు వారంతా బాధపడుతూ ఉన్నప్పుడు యాకోబు కుమారుల్లో ఇద్దరు, అంటే దీనా సోదరులైన షిమ్యోను, లేవి, వారి కత్తులు తీసుకు అకస్మాత్తుగా ఆ ఊరిమీద పడి ప్రతి మగ వాణ్నీ చంపేశారు. 26 వారు హమోరునీ అతని కొడుకు షెకెమునీ కత్తితో చంపి షెకెము ఇంట్లో నుండి దీనాను తీసుకెళ్ళిపోయారు. 27 తక్కిన యాకోబు కొడుకులు తమ సోదరిని చెరిపినందుకు చనిపోయిన వారు పడి ఉన్నచోటికి వచ్చి ఆ ఊరిపై పడి దోచుకున్నారు. 28 వారి గొర్రెలనూ పశువులనూ గాడిదలనూ ఊరిలో గానీ పొలంలో గానీ 29 వారి ఆస్తి అంతా తీసుకు, వారి పిల్లలనూ స్త్రీలనూ చెరపట్టి, వారి ఇళ్ళలో ఉన్న వస్తువులు సైతం దోచుకున్నారు.
-
30 అందుకు మోషే “నాకు వాక్చాతుర్యం లేదు. నా మాట ఫరో ఎలా వింటాడు?” అని యెహోవా సముఖంలో అన్నాడు.
-
1 సీయోనూ! లే! నీ బలం తెచ్చుకో. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా! నీ అందమైన బట్టలు వేసుకో. ఇక ఎన్నటికీ సున్నతి పొందని వాడొకడైనా, అపవిత్రుడొకడైనా నీ లోపలికి రాడు.
-
31 చూడు, నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో, ఒక కొత్త ఒప్పందం స్థిరం చేసే రోజులు వస్తున్నాయి,” ఇది యెహోవా వాక్కు.
32 “అది ఐగుప్తులోనుంచి నేను వాళ్ళ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చిన రోజుల్లో వాళ్ళ పితరులతో నేను చేసిన ఒప్పందం లాంటిది కాదు. నేను వాళ్ళకు ఒక భర్తగా ఉన్నా, ఆ రోజుల్లో వాళ్ళు ఆ ఒప్పందం ఉల్లంఘించారు.” ఇది యెహోవా వాక్కు.
33 “కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు.
34 “అప్పుడు ప్రతివాడూ తన పొరుగువాడికి, తన సహోదరునికి బోధిస్తూ, ‘యెహోవాను తెలుసుకో!’ అని ఇక చెప్పడు. ఎందుకంటే, వాళ్ళల్లో చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వాళ్ళ దోషాలు క్షమించి, వాళ్ళ పాపాలు ఇంక ఎన్నడూ మనసులో పెట్టుకోను.” ఇది యెహోవా వాక్కు.
-
18 ఘనత, ఆధిక్యం విషయంలో నీకు ఏదెను తోటలోని వృక్షాల్లో సాటి ఏది? అయినా నువ్వు ఏదెను వృక్షాలతో పాటు భూమి కిందికి, సున్నతిలేని వారి దగ్గరికి దిగిపోవలసి వస్తుంది. కత్తితో చచ్చిన వారితో నువ్వు నివసిస్తావు! ఫరో, అతని సేవకులందరికీ జరిగేది ఇదే” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
-
17 మేము యెరూషలేము చేరినప్పుడు సోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకున్నారు.
18 మరునాడు పెద్దలంతా అక్కడికి వచ్చినపుడు పౌలు మాతో కలిసి యాకోబు దగ్గరికి వచ్చాడు. 19 అతడు వారిని కుశల ప్రశ్నలు అడిగి, తన పరిచర్య వలన దేవుడు యూదేతరుల్లో చేసిన కార్యాలను వివరంగా తెలియజెప్పాడు.
20 అది విని వారు దేవుణ్ణి మహిమపరచి అతనితో, “సోదరా, యూదుల్లో విశ్వాసులు ఎన్ని వేలమంది ఉన్నారో చూశావు గదా? వారంతా ధర్మశాస్త్రంలో ఆసక్తి గలవారు. 21 యూదేతరుల మధ్య నివసించే యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనీ, మన ఆచారాలను పాటించకూడదనీ నీవు చెప్పడం వలన వారంతా మోషేను విడిచిపెట్టాలని నీవు బోధిస్తున్నట్టుగా ఇక్కడి వారికి సమాచారం ఉంది.
22 కాబట్టి మనమేం చేద్దాం? నీవు వచ్చిన సంగతి వారికి తప్పకుండా తెలుస్తుంది. 23 మేము నీకు చెప్పినట్టు చెయ్యి. మొక్కుబడి ఉన్న నలుగురు వ్యక్తులు మా దగ్గర ఉన్నారు. 24 నీవు వారిని తీసుకుపోయి వారితో కూడా శుద్ధి చేసుకుని, వారు తల క్షౌరం చేయించుకోడానికి అయ్యే ఖర్చు నువ్వే భరించు. అప్పుడు నిన్ను గూర్చి తాము విన్న సమాచారం నిజం కాదనీ, నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని యథావిధిగా పాటించే వ్యక్తివనీ వీరు గ్రహిస్తారు.
25 అయితే విశ్వసించిన యూదేతరుల విషయంలో విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, వారికి రాశాం, జారత్వాన్నీ మానాలని నిర్ణయించి వారికి రాశాం” అని చెప్పారు.
26 కాబట్టి పౌలు ఆ మరునాడు మొక్కుబడి ఉన్న ఆ వ్యక్తులను వెంటబెట్టుకుని వెళ్ళి, వారితో కలిసి శుద్ధి చేసుకుని, దేవాలయంలో ప్రవేశించి, వారందరి పక్షంగా కానుక అర్పించే వరకూ శుద్ధిదినాలు నెరవేరుస్తానని చెప్పాడు.
Shows Read in context, Share and Copy.