44 Bible Verses About Baptism

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Baptism
  1. 38 దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. 39 ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు. 40 ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో సాక్షమిచ్చి, “మీరు ఈ దుష్ట తరం నుండి వేరుపడి రక్షణ పొందండి” అని వారిని హెచ్చరించాడు. 41 అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు.

  2. 18 అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. 19 కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.

  3. 13 ఆ సమయాన యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు. 14 అయితే యోహాను, “నేను నీచేత బాప్తిసం పొందవలసి ఉండగా, నీవు నా దగ్గరికి వస్తున్నావా?” అని ఆయనను నివారింపజూశాడు. 15 కానీ యేసు, “ఇప్పటికి కానివ్వు. నీతి అంతా ఇలా నెరవేర్చడం మనకు సబబే” అని అతనికి జవాబిచ్చాడు, కాబట్టి అతడు ఆ విధంగా చేశాడు.

    16 యేసు బాప్తిసం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురంలాగా దిగి తన మీద వాలడం ఆయన చూశాడు. 17 “ఇదిగో చూడండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం” అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది.

  4. 1 కాబట్టి ఏమందాం? కృప విస్తరించడం కోసం పాపంలోనే కొనసాగుదామా? 2 అలా ఎన్నటికీ జరగకూడదు. పాపపు జీవితం విషయంలో చనిపోయిన మనం దానిలో ఎలా కొనసాగుతాం? 3 క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమంతా ఆయన మరణంలోకి కూడా బాప్తిసం పొందామని మీకు తెలియదా?

    4 తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము. 5 ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం. 6 ఎందుకంటే, మనకు తెలుసు, మనం ఇకమీదట పాపానికి దాసులుగా ఉండకుండాా పాపశరీరం నాశనం అయ్యేలా, మన పాత స్వభావం క్రీస్తుతో కలిసి సిలువ మరణం పాలైంది. 7 చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు.

  5. 1 అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమంటే, పౌలు మన్య ప్రాంతాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులు అతనికి కనిపించారు. వారిని, “మీరు నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందారా?” అని అడిగాడు. 2 వారు, “అసలు పరిశుద్ధాత్మను గురించి మేము వినలేదు” అని చెప్పారు. 3 అప్పుడు పౌలు, “అలాగైతే మీరు ఎలాంటి బాప్తిసం పొందారు?” అని అడగ్గా, వారు, “యోహాను బాప్తిసం” అని చెప్పారు.

    4 అందుకు పౌలు, “యోహాను తన వెనక వచ్చే వాడిలో, అంటే యేసులో విశ్వాసముంచాలని ప్రజలతో చెబుతూ, పశ్చాత్తాపం విషయమైన బాప్తిసమిచ్చాడు” అని చెప్పాడు. 5 వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామంలో బాప్తిసం పొందారు.

  6. 35 ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలుపెట్టి యేసును గూర్చిన సువార్తను అతనికి బోధించాడు. 36 వారు దారిలో వెళ్తూ ఉండగానే కొద్దిగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చారు. నపుంసకుడు “ఇక్కడ నీళ్ళున్నాయి! నాకు బాప్తిసమివ్వడానికి ఆటంకమేమిటి?” అని అడిగి రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు.

    37 ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరూ నీటిలోకి దిగారు. 38 అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చాడు. 39 వారు నీళ్లలో నుండి బయటికి వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకుపోయాడు. నపుంసకుడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళిపోయాడు. అతడు ఫిలిప్పును ఇంకెప్పుడూ చూడలేదు. 40 అయితే ఫిలిప్పు అజోతు అనే ఊళ్ళో కనిపించాడు. అతడు ఆ ప్రాంతం గుండా వెళ్తూ కైసరయ వరకూ అన్ని ఊళ్లలో సువార్త ప్రకటించాడు.

  7. 44 పేతురు ఈ మాటలు చెబుతూ ఉండగానే అతని బోధ విన్న వారందరి మీదికీ పరిశుద్ధాత్మ దిగాడు. 45 సున్నతి పొందిన విశ్వాసులంతా, అంటే పేతురుతో పాటు వచ్చినవారంతా, పరిశుద్ధాత్మ వరాన్ని యూదేతరుల మీద కూడా దేవుడు కుమ్మరించడం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. 46 ఎందుకంటే యూదేతరులు భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించడం వారు విన్నారు. 47 అప్పుడు పేతురు, “మనలాగా పరిశుద్ధాత్మను పొందిన వీరు నీటి బాప్తిస్మం పొందకుండా ఎవరైనా అడ్డు చెప్పగలరా?” అని చెప్పి 48 యేసుక్రీస్తు నామంలో వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు. అటు తరువాత మరికొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారతన్ని బతిమాలారు.

  8. 18 క్రీస్తు కూడా పాపాల కోసం ఒక్కసారే చనిపోయాడు. మనలను దేవుని దగ్గరికి తీసుకు రావడానికి, దోషులమైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడు. ఆయనను శారీరకంగా చంపారు గానీ దేవుని ఆత్మ ఆయనను బతికించాడు. 19 ఇప్పుడు చెరసాల్లో ఉన్న ఆత్మల దగ్గరికి, ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడు. 20 ఆ ఆత్మలు దేవునికి విధేయత చూపలేదు. పూర్వం నోవహు రోజుల్లో ఓడ తయారవుతూ ఉంటే దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టిన ఆ రోజుల్లో, ఆ ఓడలో కొద్ది మందినే, అంటే ఎనిమిది మందినే, దేవుడు నీళ్ళ ద్వారా రక్షించాడు.

    21 దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంది. అది ఒంటి మీద మురికి వదిలించుకున్నట్టు కాదు, అది యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవునికి మనస్సాక్షితో చేసే అభ్యర్ధనే. 22 ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేవుని కుడి వైపున ఉన్నాడు. దూతలూ, అధికారులూ, శక్తులు, అన్నీ ఆయనకు లోబరచబడినాయి.

  9. 11 మనుషుల చేతులతో చేసినట్టు కాకుండా దేవుడు ఆయనలో మీకు సున్నతి చేశాడు. స్వభావరీత్యా శరీరంలో ఉన్న పాపపు నైజాన్ని తీసివేయడమే క్రీస్తులో మీరు పొందిన సున్నతి.

    12 బాప్తిసంలో మీరు ఆయనతో కూడా సమాధి అయ్యారు. అయితే చనిపోయిన వారిలో నుండి ఆయనను సజీవంగా లేపిన దేవుని శక్తిపై మీకున్న విశ్వాసం వల్ల మీరు కూడా సజీవంగా లేచారు.

    13 ఒకప్పుడు మీరు చేసిన అపరాధాలవల్లా శరీరంలో మీకు సున్నతి జరగక పోవడంవల్లా మీరు చనిపోయిన వారుగా ఉండేవారు. అప్పుడు ఆయన తనతోబాటు మిమ్మల్ని బతికించాడు. మన అపరాధాలన్నిటినీ క్షమించాడు.

  10. 26 యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు. 27 క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు. 28 ఇందులో యూదుడు-గ్రీసుదేశస్థుడనీ దాసుడు-స్వతంత్రుడనీ పురుషుడు-స్త్రీ అనీ తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు. 29 మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు.

  11. 12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించీ యేసు క్రీస్తు నామం గురించీ సువార్త ప్రకటిస్తూ ఉంటే, స్త్రీ పురుషులు నమ్మి బాప్తిసం పొందారు. 13 అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుతో ఉంటూ, అతని ద్వారా సూచకక్రియలూ గొప్ప అద్భుతాలూ జరగడం చూసి ఆశ్చర్యపడ్డాడు.

    14 సమరయ వారు దేవుని వాక్కు అంగీకరించారని విని, యెరూషలేములోని అపొస్తలులు పేతురు యోహానులను వారి దగ్గరికి పంపారు. 15 వారు వచ్చి సమరయ విశ్వాసులు పరిశుద్ధాత్మ పొందేలా వారికోసం ప్రార్థన చేశారు. 16 అంతకు ముందు వారిలో ఎవరి మీదా పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామంలో బాప్తిసం మాత్రం పొందారు.

    17 అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు.

  12. 29 చెరసాల అధికారి దీపాలు తెమ్మని చెప్పి వేగంగా లోపలికి వచ్చి, వణుకుతూ పౌలు, సీలలకు సాష్టాంగ పడి, 30 వారిని బయటికి తెచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు. 31 అందుకు వారు, “ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు” అని చెప్పి 32 అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్కు బోధించారు. 33 రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసుకు వచ్చి, వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిసం పొందారు.

    34 అతడు పౌలు సీలలను తన ఇంటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవునిలో విశ్వాసముంచినందుకు తన ఇంటి వారందరితో కూడ ఆనందించాడు.

  13. 12 మీలో ఒకడు ‘నేను పౌలు వాణ్ణి,’ ఒకడు ‘నేను అపొల్లో వాణ్ణి,’ మరొకడు ‘నేను కేఫా వాణ్ణి,’ ఇంకొకడు ‘నేను క్రీస్తు వాణ్ణి’ అని చెప్పుకుంటున్నారని నేను విన్నాను.

    13 క్రీస్తు చీలికలు అయ్యాడా? పౌలు మీ కోసం సిలువ అనుభవించాడా? పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా? 14 నేను క్రిస్పుకు, గాయికి తప్ప వేరెవరికీ బాప్తిసం ఇయ్యలేదు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. 15 ఎందుకంటే నా నామంలోకి మీరు బాప్తిసం పొందారని చెప్పుకోవడం నాకిష్టం లేదు. 16 స్తెఫను ఇంటివారికి కూడా బాప్తిసమిచ్చాను. వీరికి తప్ప మరెవరికైనా ఇచ్చానేమో నాకు తెలియదు. 17 క్రీస్తు నన్ను బాప్తిసమియ్యడానికి పంపలేదు. ఆయన సిలువ వ్యర్ధం కాకుండేలా, జ్ఞానయుక్తమైన మాటలతో కాక కేవలం సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు.

  14. 12 శరీరం ఒక్కటే, అందులో అనేక అవయవాలు ఉన్నాయి. అవన్నీ ఒకే శరీరంలో అవయవాలైనా శరీరం ఒకటే. క్రీస్తు కూడా అలానే ఉన్నాడు. 13 ఎలాగంటే, యూదులైనా, గ్రీకులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమంతా ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మలోనే బాప్తిసం పొందాం. మనమంతా ఒకే ఆత్మను పానం చేశాం. 14 శరీరం అంటే ఒక్క అవయవమే కాదు, అది అనేక అవయవాలతో ఉంది.

  15. 15 యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు సర్వ లోకానికీ వెళ్ళి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి. 16 దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు.

  16. 8 “నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు” అన్నాడు.

    9 యోహాను ఇలా ప్రకటిస్తున్న రోజుల్లో గలిలయ ప్రాంతంలోని నజరేతు నుండి యేసు వచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. 10 యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం రూపంలో తన మీదికి దిగి రావడం చూశాడు. 11 అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, “నీవు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం.”

  17. 5 యెరూషలేము, యూదయ ప్రాంతం, యొర్దాను నదీ ప్రాంతాల వారంతా అతని దగ్గరికి వచ్చి, 6 తమ పాపాలు ఒప్పుకొంటూ యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు.

    7 చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి అతడు, “విషసర్పాల పిల్లలారా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? 8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. 9 ‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెబుతున్నాను.

  18. 3 దానికి జవాబుగా యేసు అతనితో, “ఎవరైనా కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరని కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

    4 అందుకు నికోదేము, “మనిషి ముసలివాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? రెండవ సారి పుట్టడానికి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించలేడు గదా! అలా ప్రవేశిస్తాడా?” అని ఆయనను అడిగాడు.

    5 అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “కచ్చితంగా చెబుతున్నాను. నీళ్ళ మూలంగా ఆత్మ మూలంగా తిరిగి పుట్టకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. 6 శరీర మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ.

  19. 1-3 కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. 4 ఏ విధంగా మీ పిలుపుకు సంబంధించిన నిశ్చయతతో ఉన్నారో ఆ విధంగా శరీరం ఒక్కటే, ఆత్మా ఒక్కడే. 5 ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. 6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికంటే పైనా, అందరి ద్వారా అందరిలో ఉన్నాడు.

  20. 1 యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుంటున్నాడని, అతని కన్నా ఎక్కువ మందికి బాప్తిసమిస్తున్నాడని పరిసయ్యులు విన్నారని ప్రభువుకు తెలిసింది. 2 నిజానికి యేసు తానే బాప్తిసం ఇవ్వలేదు, ఆయన శిష్యులు ఇస్తూ ఉన్నారు.

  21. 8 ఆ సమాజ మందిరం అధికారి క్రిస్పు కుటుంబ సమేతంగా ప్రభువులో విశ్వాసముంచాడు. ఇంకా కొరింతు పౌరుల్లో చాలామంది విని, విశ్వసించి బాప్తిసం పొందారు.

  22. 29 మరుసటిరోజు యేసు యోహాను దగ్గరికి వచ్చాడు. ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు, “చూడండి, లోకపాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల! 30 ‘నా వెనక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు’ అంటూ నేను ఎవరి గురించి చెప్పానో ఆయనే ఈయన. 31 నేను ఆయనను గుర్తించలేదు, కానీ ఆయన ఇశ్రాయేలు ప్రజలకు వెల్లడి కావాలని నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తూ వచ్చాను.”

    32 యోహాను ఇంకా సాక్షమిస్తూ, “ఆత్మ ఒక పావురంలా ఆకాశం నుండి దిగి వచ్చి ఆయనపై నిలిచి పోవడం చూశాను. 33 నేను ఆయనను గుర్తు పట్టలేదు. కాని ‘ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలిచిపోవడం చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు’ అని నీళ్ళలో బాప్తిసం ఇవ్వడానికి నన్ను పంపినవాడు నాకు చెప్పాడు.

  23. 12 “అక్కడ ధర్మశాస్త్రం విషయంలో భక్తిపరుడూ, అక్కడ నివసించే యూదులందరి చేతా మంచి పేరు పొందిన అననీయ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి 13 ‘సోదరా సౌలూ, చూపు పొందు’ అని నాతో చెప్పగానే అదే గడియలో నేను చూపు పొంది అతణ్ణి చూశాను. 14 అప్పుడు అతడు ‘మన పూర్వీకుల దేవుని సంకల్పాన్ని తెలుసుకోడానికీ, ఆ నీతిమంతుణ్ణి చూడటానికీ, ఆయన నోటి మాట వినడానికీ నిన్ను నియమించాడు. 15 నీవు చూసిన వాటిని గురించీ, విన్న వాటిని గురించీ ప్రజలందరి ముందూ ఆయనకు సాక్షివై ఉంటావు. 16 కాబట్టి ఆలస్యమెందుకు? లేచి బాప్తిసం పొంది, ఆయన నామంలో ప్రార్థన చేసి నీ పాపాలను కడిగి వేసుకో’ అన్నాడు.

  24. 10 అప్పుడు గుంపులో కొంతమంది, “అయితే మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు. 11 అతడు, “రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి” అని చెప్పాడు. 12 పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి, “బోధకా, మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు. 13 అతడు, “మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని వారితో చెప్పాడు.

    14 “మా సంగతేంటి? మేమేం చేయాలి?” అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. “ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి” అని అతడు వారితో చెప్పాడు.

    15 క్రీస్తు కోసం ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ, యోహానే క్రీస్తు అయి ఉంటాడని అని అందరూ లోలోపల అనుకుంటున్నారు. 16 వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు, “నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తున్నాను, అయితే నాకన్నా శక్తి గలవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు. 17 తన కళ్ళం బాగు చేయడానికి తూర్పారబట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తన గిడ్డంగిలో గోదుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు.”

  25. 4 ఆయన వారిని కలుసుకుని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, “మీరు యెరూషలేమును విడిచి పోవద్దు. నా ద్వారా విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. 5 యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గానీ కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు.”

  26. 1 సొదరీ సోదరులారా, మన పితరులు మేఘం కిందుగా ప్రయాణాలు చేశారు. వారంతా సముద్రంలో గుండా నడిచి వెళ్ళారు. 2 అందరూ మోషేను వెంబడించి అతనిని బట్టి మేఘంలో, సముద్రంలో, బాప్తిసం పొందారు. 3 వారంతా ఆధ్యాత్మికమైన ఒకే ఆహారం తిన్నారు. 4 ఆధ్యాత్మికమైన ఒకే పానీయాన్ని తాగారు. ఎలాగంటే వారు తమ వెంటే వచ్చిన ఆత్మసంబంధమైన బండలో నుండి ప్రవహించిన నీటిని తాగారు. ఆ బండ క్రీస్తే.

  27. 4 యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు. 5 యూదయ ప్రాంతం, యెరూషలేము పట్టణం వారంతా, యోహాను దగ్గరికి వెళ్లి, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు.

  28. 14 లూదియ అనే దేవుని ఆరాధకురాలు ఒకామె మా మాటలు విన్నది. ఆమె ఊదారంగు బట్టలు అమ్మేది. ఆమెది తుయతైర పట్టణం. పౌలు చెప్పే మాటలను శ్రద్ధగా వినేలా ప్రభువు ఆమె హృదయం తెరచాడు. 15 ఆమె, ఆమె ఇంటివారూ బాప్తిసం పొందారు. “నేను ప్రభువులో విశ్వాసం గలదాన్ని అని మీరు భావిస్తే, నా ఇంటికి వచ్చి ఉండాలి,” అని ఆమె మమ్మల్ని బలవంతం చేసింది.

  29. 15 నేను మాట్లాడడం మొదలుపెట్టినపుడు పరిశుద్ధాత్మ ప్రారంభంలో మన మీదికి దిగినట్టుగానే వారి మీదికీ దిగాడు. 16 అప్పుడు, ‘యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు’ అని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను.

    17 “కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా అదే వరం ఇస్తే, దేవుణ్ణి అడ్డగించడానికి నేనెవర్ని?” అని వారితో అన్నాడు.

  30. 24 “ఇతర రాజ్యాల్లో నుంచి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ యా దేశాల్లో నుంచి సమకూర్చి, మీ సొంత దేశంలోకి మిమ్మల్ని రప్పిస్తాను. 25 మీ అపవిత్రత అంతా పోయేలా నేను మీ మీద పవిత్ర జలం చల్లుతాను. మీ విగ్రహాల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేస్తాను.

    26 కొత్త హృదయం మీకిస్తాను. కొత్త స్వభావం మీకు కలగచేస్తాను. రాతిగుండె మీలోనుంచి తీసి వేసి మాంసపు గుండె మీకిస్తాను. 27 నా ఆత్మ మీలో ఉంచి, నా చట్టాలను అనుసరించే వారిగా నా విధులను పాటించే వారిగా మిమ్మల్ని చేస్తాను.

  31. 17 అననీయ వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి, అతని మీద చేతులుంచి, “సౌలా, సోదరా, నీవు వచ్చిన దారిలో నీకు కనబడిన ప్రభు యేసు, నీవు చూపు పొంది, పరిశుద్ధాత్మతో నిండేలా నన్ను నీ దగ్గరకి పంపాడు” అని చెప్పాడు. 18 వెంటనే అతని కళ్ళ నుండి పొరల్లాంటివి రాలిపోగా అతడు చూపు పొంది, లేచి బాప్తిసం పొందాడు. తరువాత భోజనం చేసి బలం పుంజుకున్నాడు.

  32. 24 అలెగ్జాండ్రియా వాడైన అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసు వచ్చాడు. అతడు గొప్ప విద్వాంసుడు, లేఖనాల్లో ప్రావీణ్యత కలిగినవాడు. 25 అతడు ప్రభువు మార్గంలో ఉపదేశం పొంది, ఆత్మలో తీవ్రత కలిగి, యేసును గూర్చి అనర్గళంగా, స్పష్టంగా మాట్లాడుతూ, సమాజ మందిరాల్లో ధైర్యంగా బోధించడం మొదలు పెట్టాడు. కానీ అతనికి యోహాను బాప్తిసం గురించి మాత్రమే తెలుసు.

    26 ప్రిస్కిల్ల, అకుల అతని గురించి విని, అతనిని చేర్చుకుని దేవుని మార్గం గురించి పూర్తిగా విశదపరిచారు. 27 తరువాత అతడు అకయ వెళ్ళాలని తలంచినప్పుడు అక్కడి విశ్వాసులకు ఉత్తరాలు రాసి అతనిని చేర్చుకోమని అక్కడి సోదరులను ప్రోత్సాహపరిచారు. అతడు అక్కడికి వచ్చి, దైవ కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు. 28 లేఖనాల ఆధారంతో యేసే క్రీస్తని రుజువు పరుస్తూ, బహిరంగంగా యూదుల వాదాన్ని గట్టిగా ఖండిస్తూ వచ్చాడు.

  33. 22 ఇదయ్యాక యేసు తన శిష్యులతో కూడా యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బాప్తిసం ఇస్తూ, తన శిష్యులతో కాలం గడుపుతూ ఉన్నాడు. 23 సలీము అనే ప్రాంతం దగ్గర ఉన్న ఐనోను అనే స్చోట నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి యోహాను అక్కడ బాప్తిసం ఇస్తున్నాడు. ప్రజలు అక్కడికి వెళ్ళి బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు.

  34. 29 ఇదేమీ కాకపోతే చనిపోయిన వారి కోసం బాప్తిసం పొందేవారి సంగతేమిటి? చనిపోయినవారు లేవకపోతే వారి కోసం బాప్తిసం పొందడం ఎందుకు?

  35. 38 యేసు, “మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను తాగిన దాన్ని మీరు తాగగలరా? నేను పొందే బాప్తిసం మీరు పొందగలరా?” అని అడిగాడు. 39 వారు, “పొందగలం” అని జవాబు చెప్పారు. యేసు వారితో, “నేను తాగిన దాన్ని మీరు తాగుతారు, నేను పొందిన బాప్తిసం మీరు పొందుతారు.

  36. 21 ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నపుడు ఆకాశం తెరుచుకుంది. 22 పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. “నీవు నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం.”

  37. 50 అయితే నేను పొందాల్సిన బాప్తిసం ఉంది. అది జరిగే వరకూ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను.

  38. 3 అతడు యొర్దాను నదీ ప్రాంతమంతా తిరుగుతూ పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసాన్ని ప్రకటించాడు.

  39. 19 యెరూషలేము నుండి యూదులు, “నువ్వు ఎవరు?” అని యోహానును అడగడానికి యాజకుల నుండీ లేవీయుల నుండీ కొందరిని పంపించారు. అప్పుడు అతడు ఇదే సాక్ష్యం ఇచ్చాడు. 20 అతడు, “నాకు తెలియదు” అనకుండా, “నేను క్రీస్తును కాదు” అంటూ ఒప్పుకున్నాడు. 21 కాబట్టి వారు, “అయితే నువ్వు ఎవరివి? ఏలీయావా?” అంటే అతడు, “కాదు” అన్నాడు. “నువ్వు ప్రవక్తవా?” అని అడిగితే కాదని జవాబిచ్చాడు. 22 దాంతో వారు, “అయితే అసలు నువ్వు ఎవరివి? మమ్మల్ని పంపిన వారికి మేమేం చెప్పాలి? అసలు నీ గురించి నువ్వేం చెప్పుకుంటున్నావ్?” అన్నారు. 23 దానికి అతడు, “యెషయా ప్రవక్త పలికినట్టు నేను,

    ‘ప్రభువు కోసం దారి తిన్నగా చేయండి’ అని

    అరణ్యంలో బిగ్గరగా కేక పెట్టే ఒక వ్యక్తి స్వరాన్ని” అన్నాడు.

    24 అలాగే అక్కడ పరిసయ్యులు పంపిన కొందరున్నారు. 25 వారు, “నువ్వు క్రీస్తువు కావు, ఏలీయావు కావు, ప్రవక్తవూ కావు. అలాంటప్పుడు మరి బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు?” అని అడిగారు. 26 దానికి యోహాను, “నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను. కాని మీ మధ్య మీరు గుర్తించని వ్యక్తి నిలిచి ఉన్నాడు.

  40. 25 యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?” అని వారిని అడిగాడు.

    అప్పుడు వారు, “మనం పరలోకం నుండి, అని చెబితే, ‘మీరెందుకు యోహానును నమ్మలేదు?’ అంటాడు.

  41. 29 ప్రజలందరూ, పన్ను వసూలుదారులూ యోహాను సందేశం విని, దేవుడు నీతిమంతుడని అంగీకరించారు. అతని ద్వారా బాప్తిసం పొందారు. 30 కానీ పరిసయ్యులూ, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారూ అతని చేత బాప్తిసం పొందకుండా వారి జీవితాల్లో దేవుని సంకల్పాన్ని నిరాకరించారు.

  42. 1 కాబట్టి క్రీస్తు సందేశం గురించి ప్రారంభంలో మనం విన్న అంశాలను వదలి, మరింత పరిణతి సాధించే దిశగా సాగిపోదాం. నిర్జీవ క్రియల కోసం పశ్చాత్తాప పడటమూ, దేవునిపై విశ్వాసమూ, 2 బాప్తీసాలూ, తలపై చేతులుంచడమూ, చనిపోయినవారు పునర్జీవితులు కావడమూ, నిత్య శిక్షా వంటి ప్రాథమిక అంశాలపై మళ్ళీ పునాది వేయకుండా ముందుకు సాగుదాం.

  43. 4 మోషే యెహోవా చెప్పిన మాటలన్నిటినీ రాశాడు. అతడు ఉదయాన్నే లేచి ఆ కొండ పాదం దగ్గర బలిపీఠం కట్టాడు. ఇశ్రాయేలు ప్రజల పన్నెండు గోత్రాల ప్రకారం పన్నెండు స్తంభాలు నిలిపాడు. 5 తరవాత ఇశ్రాయేలు ప్రజల్లో కొందరు యువకులను పంపినప్పుడు వాళ్ళు వెళ్లి హోమ బలులు అర్పించి యెహోవాకు సమాధానబలులగా కోడెలను వధించారు.

    6 అప్పుడు మోషే వాటి రక్తంలో సగం పళ్ళెంలో పోశాడు. మిగతా సగం బలిపీఠం మీద కుమ్మరించాడు. 7 తరువాత అతడు నిబంధన గ్రంథం చేతబట్టుకుని ప్రజలకు వినిపించాడు. ప్రజలంతా “యెహోవా చెప్పినవన్నీ చేస్తూ ఆయనకు విధేయులుగా ఉంటాం” అన్నారు. 8 మోషే అప్పుడు రక్తం తీసుకుని ప్రజల మీద చిలకరించాడు. “ఇది నిబంధన రక్తం. ఇదిగో ఈ విషయాలన్నిటి ప్రకారం యెహోవా మీతో చేసిన నిబంధన ఇదే” అని చెప్పాడు.

  44. 17 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు. “నువ్వు ఇత్తడితో ఒక గంగాళం సిద్ధం చేసి ఇత్తడి పీటపై ఉంచాలి. 18 సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్యలో ఆ గంగాళం ఉంచి దాన్ని నీళ్లతో నింపాలి. 19 ఆ నీళ్లతో అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి.

    20 వాళ్ళు సన్నిధి గుడారం లోపలికి వెళ్ళే సమయంలో చనిపోకుండా ఉండేలా నీళ్ళతో తమను శుభ్రం చేసుకోవాలి. సేవ చేయడానికి బలిపీఠం సమీపించి యెహోవాకు హోమం అర్పించే ముందు వారు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. అలా చెయ్యని పక్షంలో చనిపోతారు.

    21 వాళ్ళు చనిపోకుండా ఉండేలా తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. ఇది వారికి, అంటే అహరోనుకి, అతని సంతానానికి, తరతరాలకు నిలిచి ఉండే చట్టం.”