26 Bible Verses About Charity

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Charity
  1. 1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. 2 దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. 3 పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.

    4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.

    5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.

    6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.

    7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.

    8 ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.

    9 ఎందుకంటే మనకు కొంతవరకే తెలుసు. కొంతవరకే ప్రవచిస్తున్నాము. 10 అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానివి అంతమైపోతాయి. 11 నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగానే మాట్లాడాను, చిన్నవాడిలాగానే తర్కించాను. ఇప్పుడు పెద్దవాడినయ్యాక పిల్లచేష్టలు మానేశాను.

    12 అలాగే ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్టు మసకగా చూస్తున్నాం. అప్పుడైతే ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసింది కొంత మాత్రమే. అప్పుడు దేవుడు నన్ను పూర్తిగా ఎరిగినంత మట్టుకు నేను కూడా పూర్తిగా తెలుసుకుంటాను.

    13 ప్రస్తుతం విశ్వాసం, ఆశాభావం, ప్రేమ ఈ మూడూ నిలిచి ఉన్నాయి. వీటిలో ఉన్నతమైనది ప్రేమే.

  2. 1 “మనుషులకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ప్రతిఫలమూ రాదు. 2 కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో, వీధుల్లో అలా చేస్తారు. వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని కచ్చితంగా చెబుతున్నాను.

    3 నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనీయవద్దు. 4 అప్పుడే నీ దానం గుప్తంగా ఉంటుంది. ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.

  3. 7 మీ దేవుడు యెహోవా మీకిస్తున్న దేశంలోని మీ పట్టణాల్లో ఎక్కడైనా మీ సోదరుల్లో ఒక బీదవాడు ఉంటే అతనిపై దయ చూపాలి. మీ హృదయాలను కఠినపరచుకోకూడదు. 8 మీ చెయ్యి ముడుచుకోకుండా తప్పక వాడి వైపు చాచి, వాడి అక్కరకు చాలినంతగా వాడికి అప్పు ఇవ్వాలి. 9 అప్పు రద్దు చేయాల్సిన “ఏడో సంవత్సరం దగ్గర పడింది” అనే చెడ్డ తలంపు మీ మనస్సులో కలగనీయవద్దు. బీదవాడైన మీ సోదరునిపై మీరు దయ చూపి అతనికేమీ ఇవ్వకపోతే వాడొకవేళ మిమ్మల్ని గూర్చి యెహోవాకు మొరపెడితే అది మీకు పాపం అవుతుంది.

    10 కాబట్టి మీరు తప్పకుండా అతనికి ఇవ్వాలి. అతనికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన యెహోవా దేవుడు మీ పనులన్నిటిలో, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 11 పేదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను మీ దేశంలో దీనులు, “పేదలు అయిన మీ సోదరులకు తప్పకుండా సహాయం చేయాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

  4. 6 “కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు. 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. 8 అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు.

  5. 17 పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు.

  6. 16 యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి. 17 ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?

    18 నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం. 19 దీనివలన మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట నిబ్బరంగా ఉంటాయి.

  7. 6 నేను ఆమోదించే ఉపవాసం ఏదంటే,

    దుర్మార్గపు బంధకాలను విప్పడం, కాడిమాను మోకులు తీసేయడం,

    అణగారిన వారిని విడిపించడం, ప్రతి కాడినీ విరగగొట్టడం.

    7 ఆకలితో అలమటించే వాళ్లతో నీ ఆహారం పంచుకోవడం, ఇల్లు లేకుండా తిరిగే పేదవారిని నీ ఇంట్లోకి చేర్చుకోవడం.

    దిగంబరిగా నీకెవరైనా కనిపిస్తే, వాడికి బట్టలు ఇవ్వు. నీ సొంత బంధువులకు నీ ముఖం చాటేయవద్దు.

    8 అప్పుడు నీ వెలుగు, ఉదయకాంతిలాగా ఉదయిస్తుంది. నీ ఆరోగ్యం నీకు త్వరగా లభిస్తుంది.

    నీ నీతి, నీకు ముందుగా వెళ్తుంది. యెహోవా మహిమ నీ వెనుక కావలి కాస్తుంది.

    9 అప్పుడు నువ్వు పిలిస్తే యెహోవా జవాబిస్తాడు. సహాయం కోసం నువ్వు మొర్ర పెడితే “ఇదిగో ఇక్కడే ఉన్నాను” అంటాడు.

    ఇతరులను అణిచివేయడం, వేలుపెట్టి చూపిస్తూ నిందించడం, మోసంగా మాట్లాడడం నువ్వు మానుకుంటే,

    10 ఆకలితో అలమటించే వారికి నీకున్న దానిలోనుంచి ఇచ్చి, బాధితుల అవసరాలను తీర్చి వాళ్ళను తృప్తి పరిస్తే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది. నీ చీకటి నీకు మధ్యాహ్నం లాగా ఉంటుంది.

    11 అప్పుడు యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూ ఉంటాడు. ఎండిపోయిన నీ ఆత్మను తృప్తిపరుస్తాడు.

    నీ ఎముకలను బలపరుస్తాడు. నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉంటావు.

    ఎన్నడూ ఆగని నీటి ఊటలాగా ఉంటావు.

  8. ప్రధాన సంగీతకారుడి కోసం దావీదు కీర్తన

    1 బలహీనులను పట్టించుకునే వాడు ధన్యజీవి. కష్ట సమయంలో యెహోవా అతణ్ణి కాపాడతాడు.

    2 యెహోవా అతణ్ణి భద్రపరచి సజీవంగా ఉంచుతాడు. భూమి మీద అతణ్ణి ఆశీర్వదిస్తాడు. అతని శత్రువులు కోరుకున్నట్టుగా అతణ్ణి వాళ్ళకి స్వాధీనం చేయడు.

    3 జబ్బు చేసి పడకపై ఉన్నప్పుడు యెహోవా అతణ్ణి పరామర్శిస్తాడు. వ్యాధి పడకను నువ్వు స్వస్థత పడకగా మారుస్తావు.

    4 నేనిలా అన్నాను. యెహోవా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. నన్ను కనికరించు. నా హృదయాన్ని బాగుచెయ్యి.

  9. 3 నేను మాసిదోనియ వెళ్తున్నపుడు నీకు చెప్పినట్టుగా నువ్వు ఎఫెసులోనే ఉండు. భిన్నమైన సిద్ధాంతాలను బోధించే వారిని అలా చేయవద్దని నువ్వు ఆజ్ఞాపించాలి. 4 అంత మాత్రమే కాక కల్పనా కథలను, అంతూ పొంతూ లేని వంశావళులను పట్టించుకోవద్దని వారికి ఆజ్ఞాపించు. ఎందుకంటే అవి వివాదాలకు కారణమౌతాయే గాని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుకు ఎంత మాత్రమూ తోడ్పడవు. 5 ఈ హెచ్చరికలోని ఉద్దేశం పవిత్ర హృదయం నుండీ మంచి మనస్సాక్షి నుండీ యథార్థమైన విశ్వాసం నుండీ వచ్చే ప్రేమే.

  10. 38 ఇవ్వండి. అప్పుడు మీకూ ఇస్తారు. అప్పుడు మనుషులు మీకు అదిమి, కుదించి పొంగి పొర్లి పోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకూ కొలవడం జరుగుతుంది.”

  11. 33 మీకు ఉన్నవాటిని అమ్మి దాన ధర్మాలు చేయండి. పరలోకంలో పాతగిలిపోని డబ్బు సంచులనూ, నాశనం కాని ధనాన్నీ సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, పురుగు పట్టదు.

  12. 7 అన్నిటికీ అంతం సమీపించింది. కాబట్టి మెలకువగా, ప్రార్థనల్లో చైతన్య వంతులుగా ఉండండి. 8 అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు. 9 ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి. 10 దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి.

  13. 27 పేదలకు ఇచ్చే వాడికి లేమి కలగదు. వారిని చూడకుండా కళ్ళు మూసుకునే వాడికి ఎన్నో శాపాలు కలుగుతాయి.

  14. 42 నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు.

  15. 34 తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి. 35 ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. 36 బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు.

  16. 41 మీకు ఉన్నవాటిని పేదలకు ధర్మం చేయండి. అప్పుడు మీకు అన్నీ శుభ్రంగా ఉంటాయి.

  17. 1 హుండీలో కానుకలు వేస్తున్న సంపన్నులను ఆయన చూశాడు. 2 ఒక పేద వితంతువు అతి తక్కువ విలువగల రెండు నాణాలు అందులో వేస్తుంటే చూశాడు. 3 అప్పుడాయన “ఈ పేద వితంతువు అందరి కంటే ఎక్కువ వేసిందని మీతో నిజంగా చెబుతున్నాను. 4 వారంతా తమ కలిమిలో నుండి కానుకలు వేశారు. కానీ ఈమె తన లేమిలోనుంచి తన బతుకు తెరువంతా వేసింది” అని వారితో చెప్పాడు.

  18. 35 మీరు కూడా అదే విధంగా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలనీ, ‘పుచ్చు కోవడం కంటే ఇవ్వడం ధన్యకరమైనది’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనీ, నేను అన్ని విషయాల్లో మీకు ఆదర్శంగా నిలిచాను.”

  19. 14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది.

  20. 24 ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు కూడా ఉన్నారు.

    25 ఔదార్యం చూపేవారు వర్ధిల్లుతారు. నీళ్లు పోసేవాడికి నీళ్లు పోస్తారు.

    26 ధాన్యం అక్రమంగా నిల్వ చేసే వాణ్ణి ప్రజలు శపిస్తారు. దాన్ని సక్రమంగా అమ్మే వాడికి దీవెనలు కలుగుతాయి.

  21. 12 తరువాత ఆయన తనను పిలిచిన వ్యక్తితో ఇలా అన్నాడు, “నువ్వు పగలైనా రాత్రి అయినా విందు చేసినప్పుడు నీ స్నేహితులనూ నీ సోదరులనూ నీ బంధువులనూ ధనికులైన నీ పొరుగువారినీ పిలవకు. ఎందుకంటే నువ్వు వారిని పిలిచావు కాబట్టి వారు నిన్ను తిరిగి పిలవవచ్చు. కాబట్టి ఆ విధంగా వారు నీ రుణం తీర్చుకుంటారు. 13 అందుకని నువ్వు విందు చేసినప్పుడు పేదలనూ వికలాంగులనూ కుంటివారినీ గుడ్డివారినీ పిలువు. 14 నీకు తిరిగి ఉపకారం చేయడానికి వారి దగ్గరేమీ ఉండదు. కాబట్టి నువ్వు దీవెన పొంది ధన్యుడివి అవుతావు. చనిపోయిన నీతిమంతులు సజీవంగా లేచినప్పుడు నీకు ప్రతిఫలం దొరుకుతుంది” అని చెప్పాడు. 15 ఆయనతో భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, “దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు” అని ఆయనతో అన్నాడు.

    16 అప్పుడు ఆయన అతనితో ఇలా చెప్పాడు, “ఒక మనిషి పెద్ద విందు చేయించి చాలా మందిని పిలిచాడు.

  22. 1 పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి. 2 నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచి పెట్టాలి. 3 నేను వచ్చినప్పుడు ఎవరిని ఈ పనికి మీరు నిర్ణయిస్తారో వారికి ఉత్తరాలిచ్చి, వారిచేత మీ చందాను యెరూషలేముకు పంపిస్తాను.

  23. 5 జాలిపరులు, అప్పిచ్చే వారు, తమ వ్యవహారాలు యధార్థంగా నిర్వహించుకునే వారు క్షేమంగా ఉంటారు.

    6 అలాటి వారు ఎన్నటికీ స్థిరంగా ఉండిపోతారు. నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు.

    7 అతడు దుర్వార్తకు జడిసి పోడు. అతడు యెహోవాను నమ్ముకుని నిబ్బరంగా ఉంటాడు.

    8 అతని మనస్సు స్థిరంగా ఉంటుంది. తన శత్రువులపై గెలిచేదాకా అతడు భయపడడు.

    9 అతడు ఉదారంగా పేదలకు దానం చేస్తాడు. అతని నీతి నిత్యం నిలిచి ఉంటుంది. అతడు ఘనత పొందుతాడు.

  24. 10 అప్పుడు గుంపులో కొంతమంది, “అయితే మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు. 11 అతడు, “రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి” అని చెప్పాడు.

  25. 16 ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం.

  26. 13 కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది.

    14 నా సోదరులారా, ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెప్పి, క్రియలు లేనివాడైతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం అతన్ని రక్షించగలదా?

    15 ఒక సోదరునికి గాని, సోదరికి గాని కట్టుకోడానికి బట్టలు, ఆ రోజు తినడానికి భోజనం అవసరం అయితే, 16 మీలో ఒకడు అలాటి వారితో, “శాంతిగా వెళ్ళు, వెచ్చగా ఉండు, తృప్తిగా తిను” అని చెబితే ఏం ప్రయోజనం? 17 అదే విధంగా, క్రియలు లేకుండా విశ్వాసం ఒక్కటే ఉంటే, అదీ చచ్చినదే.