42 Bible Verses About Friendship

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Friendship
  1. 12 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ. 13 స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టిన వాడి ప్రేమకన్నా గొప్ప ప్రేమ లేదు. 14 నేను మీకు ఆజ్ఞాపించినట్టు చేస్తే మీరు నాకు స్నేహితులు.

    15 “నేను ఇక మిమ్మల్ని దాసులు అని పిలవను. ఎందుకంటే దాసుడికి యజమాని చేసేది తెలియదు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే, నా తండ్రి నుంచి నేను విన్నవన్నీ మీకు తెలియజేశాను. 16 మీరు నన్ను కోరుకోలేదు. మీరు వెళ్ళి ఫలవంతం అవ్వాలని, మీ ఫలం నిలకడగా ఉండాలని నేను మిమ్మల్ని ఎన్నుకుని నియమించాను. నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినా ఇవ్వాలని ఇది చేశాను. 17 మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

  2. 5 లోలోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు.

    6 స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. శత్రువు లెక్క లేనన్ని ముద్దులు పెడతాడు.

    7 కడుపు నిండిన వాడు తేనెపట్టునైనా సరే కాళ్ళతో తొక్కేస్తాడు. ఆకలి వేసిన వాడికి చేదు పదార్థమైనా తియ్యగా ఉంటుంది.

    8 తన సొంత ఇల్లు విడిచిపెట్టి తిరిగేవాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం.

    9 పరిమళం, సుగంధం హృదయాన్ని సంతోషపెడుతుంది. అలాగే మిత్రుడి హృదయంలో నుండి వచ్చే మధుర వాక్కులు హృదయాన్ని సంతోషపెడతాయి.

    10 నీ స్నేహితుడినైనా నీ తండ్రి స్నేహితుడినైనా విడిచి పెట్టవద్దు. నీ ఆపద దినాన నీ అన్నదమ్ముల ఇళ్ళకు వెళ్లకు. దూరంగా ఉన్న సోదరుడి కంటే దగ్గరున్న పొరుగువాడే మంచిది.

  3. 17 స్నేహితుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. కష్టకాలంలో ఆదుకోడానికే సోదరులు పుట్టేది.

    18 తన పొరుగువాడికి జామీను ఉండి అతడి అప్పులకు హామీ ఉండే వాడు తెలివితక్కువ వాడు.

  4. 24 ఎక్కువ మంది స్నేహితులున్న వాడికి నష్టం. అయితే సోదరుని కన్నా సన్నిహితంగా ఉండే మిత్రులు కూడా ఉంటారు.

  5. 9 ఇద్దరు కష్టపడితే ఇద్దరికీ మంచి జరుగుతుంది.

    కాబట్టి ఒంటరిగా కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది.

    10 ఒకడు కింద పడినా మరొకడు లేపుతాడు.

    అయితే ఒక్కడే ఉంటే అతడు పడినప్పుడు లేపేవాడు లేనందువలన అతనికి కష్టమే మిగులుతుంది.

    11 ఇద్దరు కలిసి పండుకొంటే వారికి వెచ్చగా ఉంటుంది. ఒక్కడే ఉంటే వీలు కాదు కదా!

    12 ఒంటరిగా ఉన్నవాణ్ణి పడదోయడం తేలిక.

    అయితే ఇద్దరు కలిసి ఉంటే తమపై దాడిని ఎదుర్కోగలరు.

    మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు గదా?

  6. 17 ఇనుము చేత ఇనుము పదును అవుతుంది. అలాగే ఒక మనిషి తన సాటి మనిషికి పదును పెడతాడు.

  7. 12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.

    14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.

    16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.

  8. 1 దావీదు సౌలుతో మాట్లాడడం అయిపోయిన తరువాత, యోనాతాను మనసు దావీదు మనసుతో పెనవేసుకు పోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకుని అతణ్ణి ప్రేమించాడు. 2 ఆ రోజు దావీదును అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయకుండా సౌలు తన దగ్గరే ఉంచుకున్నాడు.

    3 యోనాతాను దావీదును తన ప్రాణంతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి అతనితో ఒప్పందం చేసుకున్నాడు. 4 యోనాతాను తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు.

    5 దావీదు, సౌలు తనను పంపిన ప్రతి చోటుకీ వెళ్ళి, తెలివిగా పనులు సాధించుకుంటూ వచ్చాడు. సౌలు తన సైన్యంలో అధిపతిగా అతణ్ణి నియమించాడు. ప్రజల దృష్టిలో, సౌలు సేవకుల దృష్టిలో దావీదు అనుకూలంగా ఉన్నాడు.

  9. 20 జ్ఞానులతో స్నేహం చేసే వారు జ్ఞానం సంపాదించుకుంటారు. మూర్ఖులతో స్నేహం చేసేవాడు నాశనమైపోతాడు.

  10. 24 కోపం అదుపులో ఉంచుకోలేని వాడితో స్నేహం చెయ్య వద్దు. క్రోధంతో రంకెలు వేసే వాడి దగ్గరికి వెళ్ల వద్దు.

    25 నువ్వు కూడా వాడి ధోరణి నేర్చుకుని నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో జాగ్రత్త.

    26 అప్పులకు హామీ ఉండకు. ఇతరుల బాకీలకు పూచీ తీసుకోకు.

    27 ఆ అప్పు తీర్చడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే వాడు నువ్వు పడుకునే పరుపు తీసుకు పోకుండా ఆపడం ఎలా?

  11. 23 “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.” అని లేఖనాల్లో ఉన్న విషయం నెరవేరింది. అంతేకాక అబ్రాహాముకు దేవుని స్నేహితుడు అని పేరు వచ్చింది.

  12. 4 కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు.

  13. 9 ప్రేమను కోరేవాడు జరిగిన తప్పును గుట్టుగా ఉంచుతాడు. జరిగిన సంగతి మాటిమాటికీ ఎత్తేవాడు దగ్గర స్నేహితులను కూడా పాడు చేసుకుంటాడు.

  14. 33 మోసపోకండి. “దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుంది.”

  15. 16 అందుకు రూతు “నీతో రావద్దనీ, నిన్ను విడిచిపొమ్మనీ నాకు చెప్పొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేనూ అక్కడికే వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటావో నేనూ అక్కడే ఉంటాను. ఇకనుండి నీ ప్రజలే నా ప్రజలు. నీ దేవుడే నా దేవుడు. 17 నువ్వు ఎక్కడ చనిపోతావో నేనూ అక్కడే చనిపోతాను. అక్కడే నా సమాధి కూడా ఉంటుంది. చావు తప్ప ఇంకేదీ నన్ను నీ నుండి దూరం చేస్తే యెహోవా నన్ను శిక్షిస్తాడు గాక” అంది.

    18 తనతో రావడానికే ఆమె నిశ్చయించుకున్నదని నయోమి గ్రహించినప్పుడు ఇక ఆమెతో ఆ విషయం మాట్లాడటం మానుకుంది.

  16. 20 నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నా కళ్ళు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి.

    21 ఒక వ్యక్తి తన స్నేహితుని కోసం బ్రతిమిలాడినట్టు నా కోసం దేవుణ్ణి వేడుకునే ఒక మనిషి నాకు కావాలి.

  17. 9 మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి. 10 సోదర ప్రేమతో ఒకడిపై ఒకడు అభిమానం చూపిస్తూ, గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి. 11 ఆసక్తి విషయంలో వెనకబడిపోవద్దు, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి.

  18. 14 కుంగిపోయిన వ్యక్తి సర్వశక్తుడైన దేవుని పట్ల భయభక్తులు విడిచినప్పటికీ అతని స్నేహితుని ఆదరణకు పాత్రుడు అవుతాడు.

    15 నా స్నేహితులు ఎండిపోయిన చిన్న కాలవలాగా, కనబడకుండా మాయమైపోయే ప్రవాహంలాగా నమ్మకూడని వారుగా మారారు.

  19. 28 మూర్ఖుడు కలహాలు కల్పిస్తాడు. చాడీలు చెప్పేవాడు మిత్రులను విడదీస్తాడు.

  20. 8 నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను ఎన్నుకున్న యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,

  21. 2 ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.

  22. 9 ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ పొందడానికే మనలను నియమించాడు గానీ ఉగ్రతను ఎదుర్కోడానికి కాదు. 10 మనం మెలకువగా ఉన్నా నిద్రపోతూ ఉన్నా తనతో కలసి జీవించడానికే ఆయన మన కోసం చనిపోయాడు. 11 కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలగజేసుకోండి.

  23. 11 ఒక వ్యక్తి తన స్నేహితునితో మాట్లాడుతున్నట్టు యెహోవా మోషేతో ముఖాముఖీగా మాట్లాడేవాడు. తరువాత అతడు శిబిరంలోకి తిరిగి వచ్చేవాడు. అయితే మోషే సేవకుడు, నూను కొడుకు అయిన యెహోషువ అనే యువకుడు గుడారం నుండి బయటకు వచ్చేవాడు కాదు.

  24. 7 నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుంచి ఈ దేశవాసులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాము సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నువ్వే.”

  25. 26 ఉత్తముడు తన పొరుగువాడు సన్మార్గంలో నడిచేలా చేస్తాడు. దుర్మార్గుల దుష్ట ప్రవర్తన మూలంగా వారు దారి తప్పిపోతారు.

    27 సోమరిపోతు వేటకు వెళ్ళినా ఏమీ పట్టుకోలేడు. చురుకుదనం కలిగి ఉండడం గొప్ప వరం.

  26. 27 “వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. 28 మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి.

    29 నిన్ను ఒక చెంప మీద కొట్టే వాడికి రెండవ చెంప కూడా చూపించు. నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్ళే వాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు. 30 అడిగే ప్రతివాడికీ ఇవ్వు. నీ వస్తువులను తీసుకున్న వాణ్ణి వాటి కోసం తిరిగి అడగవద్దు. 31 మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి.

  27. 8 అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు. 9 ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి. 10 దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి.

  28. 12 నన్ను దూషించేవాడు శత్రువు కాడు. శత్రువైతే నేను దాన్ని సహించేవాడినే. నా పైకి లేచినవాడు నా పగవాడు కాడు. అదే అయితే నేను దాక్కోవచ్చు.

    13 ఆ పని చేసింది నువ్వు అంటే నా నెచ్చెలివి, నా చెలికాడివి. నా ప్రియమిత్రుడివి.

    14 మనం కలిసి మధుర సహవాసం అనుభవించాం. ఉత్సవంగా దేవుని మందిరానికి వెళ్లాం.

  29. దావీదు రాసిన యాత్రల కీర్తన

    1 చూడండి, సోదరులు ఐక్యంగా కలసి ఉండడం ఎంత మంచిది! ఎంత రమ్యమైనది!

  30. 15 “ఇంకో విషయం. నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే.

  31. 5 తరువాత ఆయన వారితో ఇలా అన్నాడు. “మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి. అర్థరాత్రి వేళ ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ‘మిత్రమా, నాకు మూడు రొట్టెలు బదులివ్వు. 6 నా స్నేహితుడు ప్రయాణం చేస్తూ దారిలో నా దగ్గరికి వచ్చాడు. అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు’ అని చెప్పారనుకోండి. 7 అతడు లోపలే ఉండి, ‘నన్ను తొందర పెట్టవద్దు. తలుపు వేసేశాను. చిన్న పిల్లలు నిద్ర పోతున్నారు. నేను లేచి ఇవ్వలేను’ అని చెబుతాడా?

    8 మీరు తన స్నేహితుడని కాకపోయినా సిగ్గు విడిచి అదేపనిగా అడగడం వల్లనైనా లేచి కావలసినవన్నీ ఇస్తాడని మీకు చెబుతున్నాను.

  32. 24 అధికంగా ప్రేమించడానికీ, మంచి పనులు చేయడానికీ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి. 25 కొంత మంది సమాజంగా సమకూడడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ దినం దగ్గర పడడం చూసే కొద్దీ ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉండండి.

  33. 11 తేమానీయుడు ఎలీఫజు, షూహీయుడు బిల్దదు, నయమాతీయుడు జోఫరు అనే యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి విన్నారు. అతనితో కలిసి దుఃఖించడానికి, అతణ్ణి ఓదార్చడానికి వెళ్లాలని నిర్ణయించుకుని తమ ప్రాంతాలు విడిచి యోబు దగ్గరికి వచ్చారు.

    12 వారు వచ్చి కొంత దూరంగా నిలబడి అతణ్ణి చూశారు. యోబును పోల్చుకోలేక తమ బట్టలు చింపుకున్నారు. ఆకాశం వైపు తల మీదికి దుమ్ము చల్లుకుని బిగ్గరగా ఏడ్చారు. 13 అతడు అనుభవిస్తున్న తీవ్రమైన బాధను గ్రహించి ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడు రోజులపాటు రాత్రీ పగలూ అతనితో కలిసి నేలపై కూర్చున్నారు.

  34. 4 సంపద స్నేహితులను సమకూరుస్తుంది. దరిద్రుడికి స్నేహితులు దూరమౌతారు.

    5 అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు తప్పించుకోలేడు.

    6 ఉదార గుణం గలవారిని చాలామంది సహాయం కోసం అడుగుతారు. ఇచ్చేవాడికి అందరూ స్నేహితులే.

    7 పేదవాణ్ణి అతని బంధువులంతా ఏవగించుకుంటారు. అలాగైతే అతని స్నేహితులు మరింకెంతగా దూరమైపోతారు! వాడు వాళ్ళను పిలుస్తాడు గానీ వాళ్ళక్కడ ఉండరు.

  35. 11-12 వారు దాన్ని తీసుకుని ‘చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పని చేశారు. మేమైతే పగలంతా ఎండలో కష్టపడి పని చేశాం. కానీ వారికీ మాకూ జీతం సమానంగా ఇచ్చారేమిటి?’ అని ఆ యజమాని మీద సణుక్కున్నారు.

    13 అప్పుడా యజమాని వారిలో ఒకడితో, “మిత్రమా, నేను నీకు అన్యాయమేమీ చేయలేదు. నీకు జీతం ఒక దేనారం ఇస్తానని ఒప్పుకున్నాను కదా? 14 నీ కూలి సొమ్ము తీసుకుని వెళ్ళు. నీకిచ్చినట్టే చివరిలో వచ్చిన వారికి కూడా ఇవ్వడం నా ఇష్టం. 15 నా సొంత డబ్బును నాకిష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకునే అధికారం నాకు లేదా? నేను మంచివాణ్ణి కావడం నీకు కడుపు మంటగా ఉందా?” అని అన్నాడు. 16 ఆ విధంగా చివరివారు మొదటివారూ, మొదటివారు చివరివారూ అవుతారు.”

  36. 50 యేసు, “మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది చెయ్యి” అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను ఒడిసి పట్టుకున్నారు.

  37. 26 నా సోదరుడా, యోనాతానూ,

    నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి.

    నీ నిమిత్తం నేను తీవ్రంగా శోకిస్తున్నాను.

    నాపై నీ ప్రేమ ఎంతో వింతైనది.

    స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది ఎక్కువైనది.

  38. 9 నేను నమ్మిన నా సన్నిహిత మిత్రుడు, నా ఆహారం పంచుకున్నవాడు నన్ను తన్నడానికి కాలు ఎత్తాడు.

  39. 1 కుమారా, నీ పొరుగువాడి కోసం హామీగా ఉన్నప్పుడు, పొరుగువాడి పక్షంగా వాగ్దానం చేసినప్పుడు, 2 నువ్వు పలికిన మాటలే నిన్ను చిక్కుల్లో పడవేస్తాయి. నీ నోటి మాటల వల్ల నువ్వు పట్టబడతావు.

    3 కుమారా, నీ పొరుగువాడి చేతిలో చిక్కుబడినప్పుడు నువ్వు త్వరగా వెళ్లి నిన్ను విడుదల చేయమని అతణ్ణి బతిమాలుకో.

    4 నీ కళ్ళకు నిద్ర రాకుండా, నీ కనురెప్పలకు కునుకుపాట్లు రానివ్వకుండా ఈ విధంగా చేసి దాని నుండి తప్పించుకో.

    5 వేటగాడి బారి నుండి లేడి తప్పించుకున్నట్టు, బోయవాడి వల నుండి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకో.

  40. 19 మనుష్య కుమారుడు తింటూ, తాగుతూ వచ్చాడు. కాబట్టి ‘వీడు తిండిబోతూ, తాగుబోతూ, పన్నులు వసూలు చేసే వారికీ పాపులకూ స్నేహితుడు’ అని వారంటున్నారు. అయితే జ్ఞానం అది చేసే పనులను బట్టి తీర్పు పొందుతుంది.”

  41. 11 “రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు. అక్కడ పెళ్ళి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు. 12 రాజు అతనితో, ‘మిత్రమా, పెళ్ళి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు. 13 కాబట్టి రాజు, ‘ఇతని కాళ్ళు, చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి’ అని తన పరిచారకులతో చెప్పాడు. 14 ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.”

  42. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి.