93 Bible Verses About Arguing

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Arguing
  1. 15 “ఇంకో విషయం. నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే. 16 అతడు వినకపోతే, ‘ప్రతి విషయమూ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి.’ కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. 17 అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి. అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా, పన్ను వసూలుదారుడుగా పరిగణించు.

    18 “నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో, దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు. 19 ఇంకో విషయం, దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు.

    20 “ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను.”

  2. 25 మనం ఒకరికొకరం అవయవాల వంటి వారం. కాబట్టి మీరు అబద్ధాలు మానేసి మీ సాటిమనిషితో సత్యమే పలకాలి. 26 కోపపడవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు. 27 సాతానుకు అవకాశం ఇవ్వకండి. 28 దొంగతనం చేసేవాడు దాన్ని విడిచిపెట్టాలి. తన చేతులతో కష్టపడి పనిచేసి అక్కరలో ఉన్నవారికి సహాయం చేయాలి. 29 మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారికి ప్రయోజనం కలిగేలా వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.

    30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ వద్దు. ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకూ మీపై ఉంటుంది. 31 సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. 32 హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.

  3. 17 కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టిలో మేలు జరిగించండి. 18 మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి.

    19 ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోవద్దు. దేవుని కోపానికి చోటియ్యండి. “పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది.

    20 “కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు.

    అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది.”

    21 కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి.

  4. 1 మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా? 2 మీకు లేని వాటిని కోరుకుంటారు. మీరు పొందలేని దాని వెనకాల పరుగులు పెడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు కానీ దేవుణ్ణి అడగరు కాబట్టి మీరేదీ పొందరు.

    3 మీరడిగినా మీకేమీ దొరకదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసం ఖర్చు చేసేందుకు చెడ్డ వాటిని అడుగుతారు. 4 కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు. 5 ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా? 6 కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.

    7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. 8 దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి. 9 చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి. 10 ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.

  5. 21 “‘హత్య చేయవద్దు. హత్య చేసేవాడు శిక్షకు లోనవుతాడు’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు. 22 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు.

    23 “కాబట్టి నీవు నీ కానుకను బలిపీఠం వద్ద అర్పించే ముందు, నీ సోదరునికి నీ మీద ఏదైనా విరోధ భావం ఉందని నీకు గుర్తుకు వచ్చిందనుకో. 24 నీ కానుకను అక్కడే, బలిపీఠం ఎదుటే వదిలి వెళ్ళు. ముందు నీ సోదరునితో రాజీ పడు. ఆ తరువాత వచ్చి నీ కానుకను అర్పించు. 25 నీపై నేరం ఆరోపించేవాడితో న్యాయస్థానానికి వెళ్ళే దారిలోనే త్వరగా రాజీపడు. లేకపోతే అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో. ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాల్లో వేయిస్తాడేమో. 26 చెల్లించాల్సి ఉన్నదంతా చెల్లించే వరకూ నీవు అక్కడ నుండి బయట పడలేవని కచ్చితంగా చెబుతున్నాను.

  6. 22 నువ్వు యువకులకు కలిగే చెడుకోరికలను విడిచి పారిపో. పవిత్ర హృదయాలతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కలిసి నీతినీ విశ్వాసాన్నీ ప్రేమనూ శాంతి సమాధానాలనూ సంపాదించుకోవడానికి కృషి చెయ్యి. 23 బుద్ధిహీనమైన, మూఢత్వంతో కూడిన తర్కాలు జగడాలకు కారణమౌతాయని గ్రహించి వాటిని వదిలెయ్యి.

    24 ప్రభువు సేవకుడు పోట్లాటలకు దిగకూడదు. అందరి మీదా దయ చూపాలి. బోధనా సామర్ధ్యం కలిగి, సహించేవాడై ఉండాలి. 25-26 దేవునికి ఎదురు చెప్పేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే సాతాను తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు. వాడి ఉరి నుండి తప్పించుకుని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.

  7. 1 మీలో ఒకరితో ఒకరికి వివాదం ఏమైనా ఉంటే అతడు పరిశుద్ధుల ఎదుట కాకుండా అవిశ్వాసి అయిన న్యాయాధిపతి ఎదుట వాదించడానికి పూనుకుంటాడా? 2 పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలియదా? మీరు ఈ లోకానికి తీర్పు తీర్చవలసి ఉండగా, చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకొనే సామర్ధ్యం మీకు లేదా? 3 మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు మరి ఈ లోక సంబంధమైన విషయాలను గూర్చి మరి బాగా తీర్పు తీర్చవచ్చు గదా?

    4 కాబట్టి ఈ లోక సంబంధమైన వివాదాలు మీకు కలిగినపుడు వాటిని పరిష్కరించడానికి సంఘంలో ఎలాటి స్థానం లేని వారి దగ్గరికి వెళ్తారా? 5 మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను, తన సోదరీసోదరుల మధ్య వివాదం పరిష్కరించగలిగే బుద్ధిమంతుడు మీలో ఎవరూ లేరా? 6 అయితే ఒక సోదరుడు మరొక సోదరుని మీద వ్యాజ్యెమాడుతున్నాడు. అది కూడా అవిశ్వాసి అయిన న్యాయాధికారి ఎదుట!

    7 అసలు క్రైస్తవుల మధ్య ఒకరితో ఒకరికి వివాదం ఉండడమే మీ అపజయం. దాని కంటే మీరు అన్యాయం సహించడం మంచిది కదా? దానికంటే మీ వస్తువులు పోగొట్టుకోవడం మంచిది కదా? 8 అయితే మీరే ఇతరులకు, మీ సోదర సోదరీలకే అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు.

  8. 19 నా ప్రియ సోదరులారా, ప్రతివాడూ వినడానికి తొందరపడాలి. మాట్లాడడానికీ, కోపానికీ నిదానించాలి. ఇది మీకు తెలుసు. 20 ఎందుకంటే, మనిషి కోపం, దేవుని నీతిని నెరవేర్చదు.

    21 కాబట్టి, సమస్త పాపపు రోతనూ, దుష్టత్వాన్నీ వదిలి మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును సాధు గుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్ధ్యం ఉంది.

  9. 14 మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి. 15 దానివలన మీరు కుటిలమైన వక్రమైన ఈ తరం ప్రజల మధ్య నిర్దోషులు, నిందారహితులు, నిష్కళంకులైన దేవుని కుమారులుగా, లోకంలో దీపాలుగా వెలుగుతుంటారు. 16 జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు క్రీస్తు తిరిగి వచ్చే రోజున నేను వ్యర్థంగా పరుగెత్తలేదనీ నా పని వృధా కాలేదనీ నాకు తెలుస్తుంది. గొప్పగా చెప్పుకోడానికి నాకొక కారణం ఉంటుంది.

    17 మీ విశ్వాస బలిదాన పరిచర్యలో నేను పానార్పణగా పోయబడినా, నేను సంతోషిస్తూ మీ అందరితో ఆనందిస్తాను. 18 అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి.

  10. 14 అందరితో శాంతికరమైన సంబంధాలూ, పరిశుద్ధతా కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు. 15 దేవుని కృప నుండి మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్త పడండి. అలాగే సమస్యలు కలిగించి అనేకమందిని కలుషితం చేసే చేదు అనే వేరు మీలో మొలవకుండా జాగ్రత్త పడండి.

    16 లైంగిక అవినీతిని సాగించేవారుగానీ ఒక్క పూట భోజనం కోసం తన జన్మహక్కును అమ్మి వేసుకున్న ఏశావులాంటి దైవభీతి లేని వాడు కానీ మీలో లేకుండా జాగ్రత్త పడండి.

  11. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

    6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

    దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

    7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

    బానిస రూపం తీసుకున్నాడు.

    మానవుల పోలికలో కనిపించాడు.

    ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

    8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,

    తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

    9-11 అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా,

    భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా,

    ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా,

    దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి,

    అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.

  12. 7 అన్ని రకాల అడవి మృగాలను, పక్షులను, పాకే ప్రాణులను, సముద్ర జీవులను మానవుడు తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకున్నాడు కూడా. 8 కాని, మనుషుల్లో ఏ ఒక్కరూ నాలుకను ఆధీనంలో ఉంచుకోలేక పోతున్నారు. అది ఎడతెగని దుష్టత్వం. అది మరణం కలిగించే విషంతో నిండి ఉంది. 9 నాలుకతో మన ప్రభువైన తండ్రిని స్తుతిస్తాం. అదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న మనిషిని శపిస్తాం. 10 ఒకే నోటినుంచి స్తుతి, శాపం రెండూ బయటకు వస్తాయి. నా సోదరులారా, ఇలా ఉండకూడదు. 11 ఒకే ఊటలోనుంచి మంచి నీళ్ళు, చేదు నీళ్ళు, రెండూ ఊరుతాయా? 12 నా సోదరులారా, అంజూరపు చెట్టుకు ఒలీవ పళ్ళు, ద్రాక్ష తీగెలకు అంజూరుపళ్ళు కాస్తాయా? అదేవిధంగా, ఉప్పునీటి ఊట నుంచి మంచి నీళ్ళు రావు.

    13 మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి. 14 కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి. 15 ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది.

    16 ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి. 17 అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం. తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది. సమ్మతి గలది. కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది. 18 శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది.

  13. 14 వినేవారిని చెడగొట్టడానికే తప్ప మరి ఏ ప్రయోజనమూ లేని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభువు ఎదుట విశ్వాసులకు హెచ్చరిస్తూ ఈ సంగతులు వారికి గుర్తు చెయ్యి. 15 దేవుని దృష్టిలో ఆమోదయోగ్యుడుగా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా నిన్ను నీవే దేవునికి కనుపరచుకో.

    16 భక్తిహీనతకు కారణమయ్యే వట్టి మాటలు వదిలివెయ్యి. ఆ మాటలు మరింత భక్తిహీనతకు దారితీస్తాయి. 17 పుండు కుళ్ళి ఎలా వ్యాపిస్తుందో వారి మాటలు కూడా అలా వ్యాపిస్తాయి. హుమెనై, ఫిలేతు అలాటివారే. 18 వారు “పునరుత్థానం గతించిపోయింది” అని చెబుతూ సత్యం విషయంలో తప్పటడుగు వేసి, మరి కొందరి విశ్వాసాన్ని చెడగొడుతున్నారు.

    19 అయితే “ప్రభువుకు తన వారెవరో తెలుసు,” “ప్రభువు నామాన్ని ఒప్పుకొనే ప్రతివాడూ దుర్నీతి నుండి తొలగిపోవాలి” అని రాసి ఉన్న దేవుని స్థిరమైన పునాది నిలిచి ఉంటుంది.

  14. 1 సున్నితమైన మాట కోపాన్ని తగ్గిస్తుంది. నొప్పించే మాట కోపం రేపుతుంది.

  15. 2 ప్రభువులో మనసు కలిసి ఉండమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను. 3 అవును, నా నిజ సహకారీ, నిన్ను కూడా అడుగుతున్నాను. ఆ స్త్రీలు క్లెమెంతుతో, నా మిగతా సహకారులతో సువార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు కాబట్టి వారికి సహాయం చెయ్యి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి. 4 ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి.

    5 మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు. 6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

  16. 9 శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు.

  17. 4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.

    5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.

    6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.

    7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.

  18. 12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.

    14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.

  19. 12 అపహాసకుడు తనకు బుద్ధి చెప్పే వాళ్ళను ప్రేమించడు. వాడు జ్ఞానుల మంచి మాటల కోసం వారి దగ్గరికి వెళ్లడు.

    13 ఆనందంగా ఉండే హృదయం వదనాన్ని వికసించేలా చేస్తుంది. మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది.

    14 తెలివి గలవారి మనస్సు జ్ఞానం కోసం వెదుకుతుంది. మూర్ఖులు మూఢత్వంతోనే తమ జీవనం సాగిస్తారు.

    15 దీనస్థితిలో ఉన్నవారి కాలమంతా దుర్భరం. మానసిక ఆనందం గల వారికి నిత్యం విందే.

    16 విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండడం కంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నదానితో జీవించడం ఉత్తమం.

    17 ద్వేషం నిండిన ఇంట్లో కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ ఉన్న చోట ఆకుకూరల భోజనం తినడం మేలు.

    18 ముక్కోపి కలహాలు రేపుతాడు. ఓర్పు గలవాడు వివాదాలు శాంతింపజేస్తాడు.

    19 సోమరిపోతుల బాట ముళ్లకంచె వంటిది. నీతిమంతులు రాజమార్గంలో పయనిస్తారు.

  20. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు.

  21. 1-3 కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను.

  22. 3 ఎవరైనా మన ప్రభువైన యేసు క్రీస్తు ఆరోగ్యకరమైన ఉపదేశానికీ, దైవభక్తికి అనుగుణమైన బోధకూ సమ్మతించకుండా, దానికి భిన్నంగా బోధిస్తే 4 వాడు గర్విష్టి. వాడికి ఏమీ తెలియదన్నమాట. వాడు తర్కాల్లో వాగ్వాదాల్లో నిమగ్నమై ఉంటాడు. ఫలితంగా అసూయ, కలహం, దూషణలు, అపోహలు కలుగుతాయి. 5 ఇంకా చెడిపోయిన మనసుతో అలాటి వారు సత్యం నుండి తొలగిపోయి దైవభక్తి ధనసంపాదన మార్గం అనుకుంటారు.

  23. 19 ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వినప్పుడు ఊటలు గల నీళ్ళ బావి లభ్యమైంది. 20 అప్పుడు గెరారులోని పశువుల కాపరులు ఇస్సాకు కాపరులతో “ఈ నీళ్ళు మావే” అంటూ పోట్లాడారు. ఈ విధంగా వాళ్ళు తనతో పోట్లాడారు కనుక ఇస్సాకు ఆ బావికి “ఏశెకు” అని పేరు పెట్టాడు.

    21 తరువాత వాళ్ళు మరో బావి తవ్వారు. దాని కోసం కూడా అక్కడి వాళ్ళు పోట్లాడారు. కాబట్టి ఇస్సాకు దానికి “శిత్నా” అనే పేరు పెట్టాడు. 22 అతడు అక్కడ్నించి వెళ్ళిపోయి మరో బావి తవ్వించాడు. దానికోసం ఎలాంటి గొడవా జరగలేదు. కాబట్టి ఇస్సాకు “యెహోవా మనకు ఒక తావు అనుగ్రహించాడు. కాబట్టి ఇక ఈ దేశంలో మనం అభివృద్ధి చెందుతాం” అంటూ ఆ స్థలానికి రహబోతు అనే పేరు పెట్టాడు.

  24. 10 సోదరులారా, మన ప్రభు యేసు క్రీస్తు నామంలో నేను మిమ్మల్ని వేడుకునేది ఏమంటే మీరంతా ఏకభావంతో మాట్లాడుతూ, మీలో మీకు విభేదాలు లేకుండా చూసుకోండి. ఒకే మనసుతో, ఒకే ఉద్దేశంతో కలిసి మెలసి ఉండండి.

    11 సోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారి ద్వారా తెలిసింది. 12 మీలో ఒకడు ‘నేను పౌలు వాణ్ణి,’ ఒకడు ‘నేను అపొల్లో వాణ్ణి,’ మరొకడు ‘నేను కేఫా వాణ్ణి,’ ఇంకొకడు ‘నేను క్రీస్తు వాణ్ణి’ అని చెప్పుకుంటున్నారని నేను విన్నాను.

    13 క్రీస్తు చీలికలు అయ్యాడా? పౌలు మీ కోసం సిలువ అనుభవించాడా? పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా? 14 నేను క్రిస్పుకు, గాయికి తప్ప వేరెవరికీ బాప్తిసం ఇయ్యలేదు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. 15 ఎందుకంటే నా నామంలోకి మీరు బాప్తిసం పొందారని చెప్పుకోవడం నాకిష్టం లేదు. 16 స్తెఫను ఇంటివారికి కూడా బాప్తిసమిచ్చాను. వీరికి తప్ప మరెవరికైనా ఇచ్చానేమో నాకు తెలియదు. 17 క్రీస్తు నన్ను బాప్తిసమియ్యడానికి పంపలేదు. ఆయన సిలువ వ్యర్ధం కాకుండేలా, జ్ఞానయుక్తమైన మాటలతో కాక కేవలం సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు.

  25. 3 కలహానికి దూరంగా ఉండడం మనిషికి గౌరవం. మూర్ఖుడు కావాలని వాదం పెట్టుకుంటాడు.

  26. 9 అంతేగానీ, అర్థం పర్ధంలేని వాదాలు, వంశావళులను గూర్చిన వాదోపవాదాలు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వివాదాల వలన ప్రయోజనం శూన్యం. అవి ఎందుకూ కొరగానివి కాబట్టి వాటికి దూరంగా ఉండు. 10 మీలో విభేదాలు కలిగించే వారిని ఒకటి రెండుసార్లు హెచ్చరించిన తరువాత వారితో తెగతెంపులు చేసుకో. 11 నీకు తెలుసు, అలాటివాడు దారి తప్పిపోయి పాపం చేసి తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు.

  27. 33 వారు కపెర్నహూము చేరారు. అందరూ ఇంట్లో చేరాక యేసు వారితో, “దారిలో మీరు దేని గురించి చర్చించుకుంటున్నారు?” అని అడిగాడు. 34 అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే దారిలో వారు తమలో ఎవరు గొప్ప, అని వాదించుకున్నారు. 35 యేసు కూర్చుని పన్నెండు మందిని పిలిచి, “మీలో ఎవడైనా ముఖ్యుడుగా ఉండాలంటే అతడు అందరికన్నా చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి” అని వారితో అన్నాడు.

  28. 10 గర్వాంధుడు కలహాలు రేపుతాడు. మంచి మాటలు ఆలకించే వారికి జ్ఞానం చేకూరుతుంది.

  29. 9 ప్రేమను కోరేవాడు జరిగిన తప్పును గుట్టుగా ఉంచుతాడు. జరిగిన సంగతి మాటిమాటికీ ఎత్తేవాడు దగ్గర స్నేహితులను కూడా పాడు చేసుకుంటాడు.

    10 బుద్ధిహీనుడికి నూరుదెబ్బల కంటే బుద్ధిమంతుడికి ఒక గద్దింపు మాట మరింత లోతుగా నాటుతుంది.

    11 దుర్మార్గుడు ఎప్పుడూ తిరుగుబాటు చేయడానికే చూస్తాడు. అలాటి వాడికి వ్యతిరేకంగా క్రూరుడైన వార్తాహరుణ్ణి పంపిస్తారు.

    12 మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుడికి ఎదురు పడడం కంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలుసుకోవడమే క్షేమం.

    13 మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు.

    14 పోట్లాట మొదలు పెట్టడం నీటిని వదిలిపెట్టినట్టే. కాబట్టి వివాదం పెరగక ముందే దాన్ని వదిలెయ్యి.

  30. 1 పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి. ఇది మంచిది. 2-3 “నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది.” ఇది వాగ్దానంతో కలిసి ఉన్న మొదటి ఆజ్ఞ.

    4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు. వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి.

    5 సేవకులారా, భయంతో వణకుతో, క్రీస్తుకు లోబడినట్టు, ఈ లోకంలో మీ యజమానులకు హృదయపూర్వకంగా లోబడండి. 6 మనుషులను సంతోషపెట్టేవారు చేసినట్టు పైపైన కాక, క్రీస్తు దాసులుగా దేవుని సంకల్పాన్ని హృదయపూర్వకంగా జరిగిస్తూ, 7 ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవచేయండి. 8 దాసుడైనా, స్వతంత్రుడైనా, మీలో ప్రతివాడూ తాను చేసిన మంచి పనికి ప్రభువు వలన ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.

    9 యజమానులారా, మీరూ మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. మీకూ మీ దాసులకూ ఒక్కడే యజమాని పరలోకంలో ఉన్నాడనీ, ఆయన పక్షపాతం లేని వాడనీ గ్రహించి, వారిని బెదిరించడం మానండి.

  31. 5 అబ్రాముతో పాటు కలసి వెళ్ళిన లోతుకు కూడా గొర్రెలు, పశువులు, పరివారం ఉన్నాయి. 6 వాళ్ళు కలిసి నివాసం చెయ్యడానికి ఆ ప్రదేశం చాల లేదు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండలేనంత విస్తారమైన సంపద వారికి ఉంది. 7 ఆ సమయంలో అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం ఏర్పడింది. ఆ కాలంలో కనానీయులు, పెరిజ్జీయులు ఆ ప్రదేశంలో కాపురం ఉన్నారు.

    8 కాబట్టి అబ్రాము “మనం బంధువులం కాబట్టి నాకూ నీకూ నా పశువుల కాపరులకూ నీ పశువుల కాపరులకూ ఘర్షణ ఉండకూడదు. 9 ఈ ప్రదేశం అంతా నీ ముందు కనిపిస్తూ ఉంది కదా. దయచేసి నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండు. నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపుకు, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడమవైపుకు వెళ్తాను” అని లోతుకు చెప్పాడు.

  32. 9 గయ్యాళితో భవంతిలో ఉండడం కంటే మిద్దెపై ఒక మూలన నివసించడం మేలు.

  33. 1 విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్న వారిని చేరదీయండి గానీ వారి అనుమానాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు. 2 ఆహార పదార్ధాలు అన్నీ తినవచ్చని ఒకడు నమ్ముతుంటే, ఇంకొకడు నమ్మకం లేక కూరగాయలే తింటున్నాడు. 3 తినేవాడు తినని వాణ్ణి తక్కువగా చూడకూడదు. తినని వాడు తినేవాడిపై నిందారోపణ చేయకూడదు. ఎందుకంటే దేవుడు అతణ్ణి అంగీకరించాడు. 4 వేరొకరి సేవకుని విషయంలో న్యాయం చెప్పడానికి నువ్వెవరివి? అతడు నిలబడినా, పడిపోయినా అది అతని యజమాని బాధ్యత. కాని అతడు నిలబడతాడు. ప్రభువు అతణ్ణి నిలబెట్టడానికి శక్తి గలవాడు.

    5 ఇంకొక చోట ఒకడు ఒక రోజు కంటే మరొక రోజు మంచిదని నమ్ముతున్నాడు. ఇంకొకడు రోజులన్నీ మంచివే అని నమ్ముతున్నాడు. ప్రతివాడూ తనకు తాను ఒక నిర్ణయానికి రావాలి.

  34. 19 కాబట్టి సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించే వాటిని ఆసక్తితో అనుసరించుదాం.

  35. 1 తోటి పెద్దనూ, క్రీస్తు బాధలు చూసిన వాణ్ణి, ప్రత్యక్షం కాబోయే మహిమలో భాగస్వామినీ అయిన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. 2 మీ దగ్గరున్న దేవుని మందను కాయండి. బలవంతంగా కాకుండా దేవుడు కోరే రీతిగా ఇష్ట పూర్వకంగా వారిని చూసుకోండి. చెడు లాభం ఆశించి కాకుండా ఇష్టంగా వారిని చూసుకోండి. 3 మీ అజమాయిషీ కింద ఉన్న వారిపై పెత్తనం చేసేవారుగా ఉండక, మందకు ఆదర్శంగా ఉండండి. 4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీకు వాడిపోని మహిమ కిరీటం లభిస్తుంది.

    5 యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి ఉండండి. దేవుడు గర్విష్టులను ఎదిరించి వినయం గలవారికి కృప చూపుతాడు. 6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.

    7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి. 8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. 9 వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.

  36. 19 పటిష్టమైన నగరాన్ని వశపరచుకోవడం కంటే అలిగిన సోదరుణ్ణి సముదాయించడం కష్టం. పోట్లాటలు కోట తలుపుల అడ్డగడియలంత గట్టివి.

  37. 20 కట్టెలు లేకపోతే మంట ఆరిపోతుంది. కొండేలు చెప్పేవాడు లేకపొతే జగడం చల్లారుతుంది.

    21 నిప్పు కణికెలకు బొగ్గులు, అగ్నికి కట్టెలు. పోట్లాటలు రేపడానికి కలహప్రియుడు.

  38. 3 ఎందుకంటే మీరింకా శరీర స్వభావంతోనే ఉన్నారు. మీ మధ్య అసూయ, కలహం ఉన్నాయి. దాన్ని బట్టి మీరు శరీర స్వభావం కలిగి మానవ రీతిగా నడచుకొనేవారే కదా?

    4 మీలో ఒకడేమో “నేను పౌలుకు చెందినవాణ్ణి,” మరొకడు “నేను అపొల్లోకు చెందిన వాణ్ణి,” అని చెబుతూ ఉంటే మీరు శరీర స్వభావులే కదా

  39. 8 చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి.

    9 కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.

  40. 2 మూర్ఖుడికి విషయం అర్థం చేసుకోవాలని ఉండదు. తానేమి అనుకుంటున్నాడో అది చెప్పడమే అతనికి ఇష్టం.

  41. 11 విచక్షణ ఒక మనిషికి సహనం ఇస్తుంది. తప్పులు చూసీ చూడనట్టు పోవడం అతనికి ఘనత.

  42. 1 పరిపాలకులకూ, అధికారులకూ లోబడి ఉండాలనీ ప్రతి మంచి పనీ చేయడానికి సిద్ధంగా ఉండాలనీ వారికి గుర్తు చెయ్యి. 2 వారు ఎవరినీ దూషించకుండా, వాదనలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా మనుషులందరి పట్లా సంపూర్ణమైన మర్యాద కలిగి జీవించాలి. 3 ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ద్వేషానికి గురి అవుతూ ద్వేషిస్తూ ఉండేవాళ్ళం.

    4 అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు 5 మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. 6-7 దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.

  43. 12 ప్రేమ దోషాలన్నిటినీ కప్పి ఉంచుతుంది. పగ తగాదాలను రేకెత్తిస్తుంది.

  44. 15 ముసురు పట్టిన రోజున ఏక ధారగా కురుస్తూ ఉండే నీళ్లు, గయ్యాళి ఇల్లాలు ఒకటే.

    16 ఆమెను ఆపాలని ప్రయత్నించేవాడు గాలిని ఆపాలని ప్రయత్నించే వాడితో సమానం. తన కుడిచేతిలో నూనె పట్టుకోవాలని ప్రయత్నించడంతో సమానం.

  45. 22 కోపిష్టి కలహం రేపుతాడు. ముక్కోపి చాలా పాపాలు చేస్తాడు.

  46. 20 ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టులుగా ఉండరేమో అనీ, నేను మీకు ఇష్టుడనుగా ఉండనేమో అని భయపడుతున్నాను. కలహాలు, అసూయ, క్రోధాలు, కక్షలు, వదంతులు, గర్వం, అల్లర్లు ఉంటాయేమో.

  47. 28 మూర్ఖుడు కలహాలు కల్పిస్తాడు. చాడీలు చెప్పేవాడు మిత్రులను విడదీస్తాడు.

  48. 19 కలహాలంటే ఇష్టం ఉన్నవాడు పాపాన్ని ప్రేమించేవాడు. తన ఇంటి వాకిళ్ళు ఎత్తు పెంచేవాడు ఎముకలు విరగడానికి కారణం అవుతాడు.

  49. 46 తమలో ఎవరు గొప్పవాడు అనే వాదం వారిలో పుట్టింది. 47 యేసు వారి హృదయాల్లోని ఆలోచనలను తెలుసుకుని ఒక చిన్న బిడ్డను తన దగ్గర నిలబెట్టుకుని, 48 “ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే అతడు నన్ను స్వీకరిస్తున్నాడు. నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరిస్తున్నాడు. మీలో ఎవరు అందరి కంటే చిన్నవాడిగా ఉంటాడో వాడే గొప్పవాడు.”

  50. 3 మీ వరకూ మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి.

    4 అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా ఏడు సార్లు అపరాధం చేసి అదే రోజు ఏడు సార్లు మీ దగ్గరికి వచ్చి, ‘పశ్చాత్తాప పడుతున్నాను’ అంటే మీరు అతణ్ణి క్షమించాలి.”

  51. 1 యూదయ నుండి కొందరు వచ్చి, “మోషే నియమించిన విశ్వాసులకు సున్నతి పొందితేనే గాని మీకు రక్షణ లేదు” అని విశ్వాసులకు బోధిస్తూ ఉన్నారు.

    2 పౌలుకు, బర్నబాకు వారితో తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. ఈ సమస్య గురించి పౌలు బర్నబాలు, ఇంకా మరి కొంతమంది యెరూషలేములోని అపొస్తలుల, పెద్దల దగ్గరికి వెళ్ళాలని సోదరులు నిశ్చయించారు.

  52. 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  53. 19 దేవుడే మొదట మనలను ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం.

    20 “నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని చెబుతూ, తన సోదరుణ్ణి ద్వేషిస్తే, అతడు అబద్ధికుడే. కనిపిస్తున్న సోదరుణ్ణి ప్రేమించని వాడు, కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు. 21 దేవుణ్ణి ప్రేమించేవాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి, అన్న ఆజ్ఞ ఆయన నుండి మనకు ఉంది.

  54. 16 నీ ప్రజల మధ్య కొండేలు చెబుతూ ఇంటింటికి తిరగకూడదు.

    ఎవరికైనా ప్రాణ హాని కలిగించేది ఏదీ చెయ్యవద్దు. నేను యెహోవాను.

    17 నీ హృదయంలో నీ సోదరుణ్ణి అసహ్యించుకోకూడదు.

    నీ పొరుగువాడి పాపం నీ మీదికి రాకుండేలా నీవు తప్పకుండా అతణ్ణి గద్దించాలి.

    18 పగ సాధించ వద్దు. ఎవరిమీదా కక్ష పెట్టుకోవద్దు.

    నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ సాటి మనిషిని ప్రేమించాలి. నేను యెహోవాను.

  55. 7 ఒకడి ప్రవర్తన యెహోవాకు ఇష్టమైతే ఆయన అతని శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు.

  56. 13 మూర్ఖుడైన కొడుకు తన తండ్రికి కీడు తెస్తాడు. గయ్యాళి భార్య ఆగకుండా పడుతూ ఉండే నీటి బిందువులతో సమానం.

  57. 17 తనకు సంబంధంలేని పోట్లాటలో తల దూర్చేవాడు. దారినపోయే కుక్క చెవులు పట్టుకొనే వాడితో సమానం.

  58. 3 “మేమెందుకు ఉపవాసమున్నాం? నువ్వెందుకు చూడవు? మమ్మల్ని మేము ఎందుకు తగ్గించుకున్నాం? నువ్వు గమనించలేదు” అని వాళ్ళు అంటారు.

    మీ ఉపవాస దినాన మీరు మీకిష్టం వచ్చినట్టు చేస్తూ మీ పనివాళ్ళను కఠినంగా చూస్తారు.

    4 మీరు ఉపవాసమున్నప్పుడు పోట్లాడుకుంటారు. మీ పిడికిళ్ళతో కొట్టుకుంటారు.

    మీరు ఈ రోజుల్లో ఉపవాసముండేది మీ స్వరం పైన వినబడాలని కాదు.

  59. 3 మేము శరీరంతో జీవిస్తున్నా శరీరానుసారంగా యుద్ధం చేయం. 4 మా యుద్ధ పరికరాలు లోక సంబంధమైనవి కావు. కోటలను ధ్వంసం చేసి, మనుషులను పక్కదోవ పట్టించే వాదాలను ఓడించే దైవ శక్తి వాటికి ఉంది. 5 వాటితో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్నీ నాశనం చేసి, ప్రతి ఆలోచననూ వశపరచుకుని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం. 6 మీ విధేయత పూర్తి అయినప్పుడు అవిధేయతనంతటినీ శిక్షించడానికి సిద్ధపడి ఉన్నాం.

    7 మీ ముందున్న వాటిని స్పష్టంగా చూడండి. మీలో ఎవరైనా తాను క్రీస్తు వాడినని నమ్మకం కుదిరితే, అతనెలా క్రీస్తు వాడో మేము కూడా అలానే క్రీస్తు వారిమని తాను గుర్తుంచుకోవాలి.

  60. 1 సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. 2 ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.

  61. 1 ఎవరైనా సంఘానికి అధ్యక్షుడుగా ఉండాలనుకుంటే అతడు శ్రేష్ఠమైన పనిని కోరుకుంటున్నాడు అనే మాటను నమ్మవచ్చు. 2 కాబట్టి అధ్యక్షుడు నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య ఉన్నవాడూ కోరికలు అదుపులో ఉంచుకునేవాడూ వివేచనాపరుడూ మర్యాదస్థుడూ అతిథి ప్రియుడూ బోధించడానికి సమర్థుడూ అయి ఉండాలి. 3 అతడు తాగుబోతూ జగడాలమారీ కాక మృదుస్వభావి, ధనాశ లేనివాడూ అయి ఉండాలి. 4 తన పిల్లలు తనకు సరైన గౌరవంతో లోబడేలా చేసుకుంటూ తన కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకునేవాడై ఉండాలి.

    5 ఎవడైనా తన కుటుంబాన్నే సరిగా నిర్వహించకపోతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు? 6 అతడు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. ఎందుకంటే అతడు గర్విష్టి అయి అపవాది పొందిన శిక్షనే పొందుతాడేమో. 7 అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండేలా సంఘానికి బయట ఉన్నవారి చేత మంచి పేరు పొందినవాడై ఉండాలి.

  62. 4 మూర్ఖుడి మూఢత చొప్పున వాడికి జవాబు ఇవ్వద్దు. అలా ఇస్తే నువ్వు కూడా వాడి లాగానే ఉంటావు.

    5 వాడి మూర్ఖత్వం చొప్పున మూర్ఖుడికి జవాబివ్వు. అలా చేయకపోతే వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకుంటాడు.

  63. 25 దురాశ గలవాడు కలహం రేపుతాడు. యెహోవా పట్ల నమ్మకం పెట్టుకునే వాడు వర్ధిల్లుతాడు.

  64. 33 పాలు చిలికితే వెన్న పుడుతుంది. ముక్కు పిండితే రక్తం కారుతుంది. కోపం రేపితే కలహం పుడుతుంది.

  65. 11 కాబట్టి మీరు కాలాన్ని పరిశీలించి, నిద్ర నుండి మేల్కొన వలసిన సమయం అయ్యిందని గ్రహించండి. మనం మొదట విశ్వాసులం అయినప్పటి కంటే, మన రక్షణ ఇప్పుడు మరింత దగ్గరగా ఉంది. 12 రాత్రి చాలా వరకూ గడిచిపోయి పగలు సమీపంగా వచ్చింది కాబట్టి మనం చీకటి కార్యాలను విడిచిపెట్టి, వెలుగు సంబంధమైన ఆయుధాలను ధరించుదాం. 13 పోకిరీ వినోదాలతో, తాగిన మత్తులో, లైంగిక దుర్నీతితో హద్దూ అదుపూ లేని కామంతో, కలహాలతో, అసూయలతో కాకుండా పగటి వెలుగులోలాగా మర్యాదగా నడుచుకుందాం. 14 చివరగా ప్రభు యేసు క్రీస్తును ధరించుకోండి. శరీరానికీ దాని వాంఛలకు చోటియ్యకండి.

  66. 5 మీరు ఒకే మనసుతో ఏక స్వరంతో అందరూ కలిసి, మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మహిమ పరచడానికి, 6 ఓర్పుకు, ఆదరణకు కర్త అయిన దేవుడు క్రీస్తు యేసును అనుసరించి మీ మధ్య ఐకమత్యం కలుగజేయు గాక.

  67. 3 నేను మాసిదోనియ వెళ్తున్నపుడు నీకు చెప్పినట్టుగా నువ్వు ఎఫెసులోనే ఉండు. భిన్నమైన సిద్ధాంతాలను బోధించే వారిని అలా చేయవద్దని నువ్వు ఆజ్ఞాపించాలి. 4 అంత మాత్రమే కాక కల్పనా కథలను, అంతూ పొంతూ లేని వంశావళులను పట్టించుకోవద్దని వారికి ఆజ్ఞాపించు. ఎందుకంటే అవి వివాదాలకు కారణమౌతాయే గాని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుకు ఎంత మాత్రమూ తోడ్పడవు. 5 ఈ హెచ్చరికలోని ఉద్దేశం పవిత్ర హృదయం నుండీ మంచి మనస్సాక్షి నుండీ యథార్థమైన విశ్వాసం నుండీ వచ్చే ప్రేమే.

    6 కొంతమంది వీటి నుండి తొలగిపోయి పనికిమాలిన కబుర్లకు దిగారు. 7 వారు మాట్లాడేవీ నొక్కి చెప్పేవీ వారికే అర్థం కాకపోయినా, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలనుకుంటారు.

  68. 1 యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా సీను ఎడారి ప్రాంతం నుండి ప్రయాణం చేసి రెఫీదీములో దిగారు. అక్కడ ప్రజలు తాగడానికి నీళ్ళు లేవు. 2 దానికి వాళ్ళు మోషే పై నింద మోపుతూ “మాకు తాగడానికి నీళ్లియ్యి” అన్నారు. అప్పుడు మోషే “మీరు నాతో ఎందుకు పోట్లాడుతున్నారు? యెహోవాను ఎందుకు శోధిస్తున్నారు?” అన్నాడు. 3 ప్రజలు దాహంతో మోషే మీద సణుగుతూ “ఇదేంటి? మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దాహంతో చంపడానికి ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకువచ్చావా?” అన్నారు.

    4 అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు. “ఈ ప్రజలను నేనేం చెయ్యాలి? కొంచెం సేపట్లో వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో” అన్నాడు. 5 అప్పుడు యెహోవా “ప్రజల పెద్దల్లో కొందరిని వెంటబెట్టుకుని నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకుని ప్రజలకు ఎదురుగా వెళ్లి నిలబడు. 6 నేను అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను. నువ్వు ఆ బండను కర్రతో కొట్టు. అప్పుడు ప్రజలు తాగడానికి ఆ బండలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి” అని మోషేతో చెప్పాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దల కళ్ళెదుట ఆ విధంగా చేశాడు. 7 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసిన గొడవనుబట్టి, వారు “యెహోవా మన మధ్య ఉన్నాడా, లేడా?” అని యెహోవాను శోధించడాన్నిబట్టి ఆ స్థలానికి “మస్సా” అనీ “మెరీబా” అనీ పేర్లు పెట్టాడు.

  69. 18 ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు ఒకడు మరొకడిని రాయితో కొట్టి గానీ, పిడికిలితో గుద్దిగానీ చనిపోకుండా మంచాన పడేలా చేస్తే, 19 తరువాత గాయపడ్డవాడు లేచి తన చేతికర్ర సాయంతో తిరుగుతుంటే అతణ్ణి కొట్టిన వాడికి శిక్ష ఏమీ ఉండదు. అయితే గాయపడిన వ్యక్తి పని చేయలేకపోయిన కాలానికి సరిపడ్డ సొమ్ము కొట్టినవాడు ఇచ్చి, అతణ్ణి పూర్తిగా బాగుచేయించాలి.

  70. 30 నీకేమీ కీడు తలపెట్టని వాడితో కారణం లేకుండా పోట్లాడవద్దు.

  71. 12 కుటిలంగా మాట్లాడేవాడు దుర్మార్గుడు, నిష్ప్రయోజకుడు.

    13 వాడు కన్ను గీటుతూ కాళ్లతో సైగలు చేస్తాడు. చేతి వేళ్లతో గుర్తులు చూపిస్తాడు.

    14 వాడి హృదయం దుష్ట స్వభావంతో ఉంటుంది. వాడు ఎప్పుడూ కీడు తలపెట్టాలని చూస్తాడు.

  72. 19 ప్రాణం విసికించే జగడగొండి దానితో కాపురం చెయ్యడం కంటే ఎడారిలో నివసించడం మేలు.

  73. 10 తిరస్కారబుద్ధి గలవాణ్ణి వెళ్ళగొట్టు. కలహాలు, పోరాటాలు, అవమానాలు వాటంతట అవే సద్దు మణుగుతాయి.

  74. 36 కొన్ని రోజులైన తరువాత పౌలు “ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్కు ప్రకటించామో ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి, వారెలా ఉన్నారో చూద్దాం” అని బర్నబాతో అన్నాడు.

    37 అప్పుడు మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకుని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. 38 అయితే పౌలు పంఫులియలో పరిచర్యకు తమతో రాకుండా విడిచి వెళ్ళిపోయిన వాణ్ణి వెంటబెట్టుకుని పోవడం భావ్యం కాదని తలంచాడు. 39 ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు. బర్నబా, మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి సైప్రస్ వెళ్ళాడు.

    40 పౌలు సీలను ఎంపిక చేసుకుని, సోదరులు తనను ప్రభువు కృపకు అప్పగించగా బయలుదేరి,

  75. 5 శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు. 6 శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. 7 ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా.

  76. 11 చివరికి, సోదరీ సోదరులారా, ఆనందించండి! పునరుద్ధరణ కోసం పాటు పడండి. ప్రోత్సాహం పొందండి. ఏక మనసుతో ఉండండి. శాంతితో జీవించండి. ప్రేమ, సమాధానాల దేవుడు మీతో ఉంటాడు.

  77. 18 సేవకులారా, మంచివాళ్ళూ సాత్వికులయిన యజమానులకు మాత్రమే కాక వక్ర బుద్ధి గల వారికి కూడా పూర్తి మర్యాదతో లోబడి ఉండండి.

    19 ఎవరయినా దేవుని గురించిన మనస్సాక్షిని బట్టి అన్యాయాన్ని అనుభవిస్తూ బాధ సహిస్తుంటే అది గొప్ప విషయం. 20 మీరు పాపం చేసి శిక్ష అనుభవిస్తూ సహిస్తుంటే అదేమి గొప్ప? మేలు చేసి బాధలకు గురి అయి సహిస్తుంటే అది దేవుని దృష్టిలో మెచ్చుకోదగినది. 21 దీనికోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి, మీరు తన అడుగు జాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళి పోయాడు.

    22 ఆయన ఎలాంటి పాపం చేయలేదు.

    ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు.

    23 ఆయనను దూషించినా తిరిగి దూషించ లేదు.

    ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు.

    24 మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు. 25 మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుని దగ్గరికి తిరిగి వచ్చారు.

  78. 12 నేనొక్కడినే మీ కష్టాన్ని, భారాన్ని, మీ వివాదాలను ఎలా తీర్చగలను? 13 జ్ఞానం, తెలివి కలిగి మీ గోత్రాల్లో పేరు పొందిన మనుషులను ఎన్నుకోండి. వారిని మీకు నాయకులుగా నియమిస్తాను” అని చెప్పాను.

  79. 15 ఒకడు జరిగించే పాపం, అపరాధం విషయంలో దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం మీద ప్రతి దానినీ నిర్థారణ చేయాలి.

  80. 16 యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు.

    17 అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు, 18 దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు, 19 లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.

  81. 18 కత్తిపోటులాంటి మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. జ్ఞానుల మాటలు ఆరోగ్యం కలిగిస్తాయి.

  82. 28 నీతిమంతుని మనస్సు జ్ఞానంతో కూడిన జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మూర్ఖుల నోటి వెంట చెడ్డ మాటలే వస్తాయి.

  83. 11 బుద్ధిహీనుడు తన కోపమంతా వెళ్ళగక్కుతాడు. జ్ఞానం గలవాడు కోపం అణచుకుంటాడు.

  84. 5 కపట వేషధారీ! మొదట నీ కంటిలో ఉన్న దుంగను తీసివేసికో, అప్పుడు నీ సోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది.

  85. 34 “నేను భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చాననుకోవద్దు. కత్తిని తేవడానికే వచ్చాను గానీ శాంతిని కాదు. 35 అంటే ఒక మనిషికి అతని తండ్రితో, కూతురికి తన తల్లితో, కోడలికి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను. 36 ఒక వ్యక్తి స్వంత ఇంటివాళ్ళే అతనికి శత్రువులుగా తయారవుతారు.

    37 నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు.

  86. 24 చీలికలు వచ్చిన రాజ్యం నిలబడదు. 25 చీలికలు వచ్చిన కుటుంబం నిలబడదు.

  87. 17 ఆయనకు వారి ఆలోచనలన్నీ తెలుసు. ఆయన వారితో ఇలా అన్నాడు, “తనకు తానే వ్యతిరేకంగా వేరైపోయిన ఏ రాజ్యమైనా నశించి పోతుంది. తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోతుంది.

  88. 19 “కాబట్టి యూదేతరుల్లో నుండి దేవుని వైపు తిరిగే వారిని మనం కష్టపెట్టకుండా 20 విగ్రహ సంబంధమైన అపవిత్రతనూ జారత్వాన్నీ విసర్జించాలనీ, గొంతు నులిమి చంపిన దాన్ని, రక్తాన్నీ తినకూడదనీ, వారికి ఉత్తరం రాసి పంపాలని నా అభిప్రాయం.

  89. 8 తరువాత పౌలు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగిస్తూ, దేవుని రాజ్యం గూర్చి తర్కిస్తూ, ఒప్పిస్తూ, ధైర్యంగా మాట్లాడుతూ మూడు నెలలు గడిపాడు. 9 అయితే కొందరు తమ హృదయాలను కఠినం చేసుకుని అతనిని తిరస్కరించి, జనసమూహం ఎదుట క్రీస్తు మార్గాన్ని దూషిస్తూ వచ్చారు. కాబట్టి అతడు వారిని విడిచిపెట్టి, శిష్యులను వారి నుండి వేరు చేసి ప్రతిరోజూ తురన్ను అనే అతని బడిలో చర్చిస్తూ వచ్చాడు.

  90. 28 వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.

    30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, 31 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. 32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.

  91. 17 సోదరులారా, నేను వేడుకునేదేమంటే, మీరు నేర్చుకొన్న బోధకు వ్యతిరేకంగా విభజనలు, ఆటంకాలు కలిగించే వారిని కనిపెట్టి చూడండి. వారికి దూరంగా తొలగిపొండి.

  92. 16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.

  93. 9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు.