85 Bible Verses About God Provides

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About God Provides
  1. 25 “అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే, ‘ఏమి తినాలి? ఏమి తాగాలి?’ అని మీ జీవితాన్ని గురించి గానీ, ‘ఏమి కట్టుకోవాలి?’ అని మీ శరీరం గురించి గానీ బెంగ పెట్టుకోవద్దు. తిండి కంటే జీవితమూ బట్టల కంటే శరీరమూ ఎక్కువే కదా! 26 ఎగిరే పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైన వారు కాదా?

    27 ఆందోళనపడి మీలో ఎవరు తన జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడు? 28 బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి పని చేయవు, బట్టలు నేయవు. 29 అయినా నేనంటాను, తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సైతం వీటిలో ఒక్క దానికున్నంత అలంకారం లేదు. 30 ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!

    31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. 32 దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు. 34 కాబట్టి రేపటి విషయం దిగులు పడవద్దు. దాని సంగతి అదే చూసుకుంటుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.

  2. 29 రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు. 30 మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు. 31 కాబట్టి భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు.

  3. 1 గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామం వాడైన ఏలీయా అహాబుతో “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రాణం తోడు, నేను ఆయన ఎదుట నిలబడి చెబుతున్నాను. నేను మళ్ళీ చెప్పే వరకూ, రాబోయే కొన్నేళ్ళు మంచు గానీ వాన గానీ పడదు” అన్నాడు. 2 ఆ తరువాత యెహోవా అతనితో ఇలా చెప్పాడు. 3 “నీవు ఇక్కడ నుంచి తూర్పు వైపుగా వెళ్లి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాక్కో. 4 ఆ వాగు నీళ్ళు నీవు తాగాలి. అక్కడ నీకు ఆహారం తెచ్చేలా నేను కాకులకు ఆజ్ఞాపించాను” అని అతనికి చెప్పాడు.

    5 అతడు వెళ్లి యెహోవా చెప్పినట్టు యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివసించాడు. 6 అక్కడ కాకులు ఉదయమూ సాయంత్రమూ రొట్టె, మాంసాలను అతని దగ్గరికి తెచ్చేవి. అతడు వాగు నీళ్ళు తాగాడు.

  4. 13 నీ రాజ్యం కలకాలం ఉంటుంది. నీ రాజ్య పరిపాలన తరతరాలు నిలిచి ఉంటుంది.

    14 కూలిపోతున్న వాళ్ళను యెహోవా స్థిరపరుస్తాడు. కృంగిన వాళ్ళను లేవనెత్తుతాడు.

    15 జీవులన్నిటి కళ్ళు నీవైపే చూస్తున్నాయి. తగిన కాలంలో నువ్వు వాటికి ఆహారం పెడుతున్నావు.

    16 నీ గుప్పిలి విప్పి ప్రతి ప్రాణి ఆకలి తీరుస్తున్నావు.

  5. 25 ఆయనే అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు.

    26 ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు. 27 అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే,

    28 మనం ఆయనలో బతుకుతున్నాం,

    ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి.

    ‘మనమాయన సంతానం,’

    అని మీ కవులు కూడా కొందరు చెప్పారు.

  6. 19 కాగా నా దేవుడు తన ఐశ్వర్యంతో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు.

    20 ఇప్పుడు మన తండ్రి అయిన దేవునికి ఎప్పటికీ మహిమ కలుగు గాక. ఆమేన్‌.

    21 పవిత్రులందరికీ క్రీస్తు యేసులో అభివందనాలు చెప్పండి. నాతో పాటు ఉన్న సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. 22 పవిత్రులంతా, ముఖ్యంగా సీజర్ చక్రవర్తి ఇంట్లో ఉన్న పవిత్రులు మీకు అభివందనాలు చెబుతున్నారు.

    23 ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండు గాక.

  7. 3 ఆయన నీ పాదాలను జారనియ్యడు. నిన్ను కాపాడేవాడు కునికిపాట్లు పడదు.

    4 ఇశ్రాయేలు ప్రజల సంరక్షకుడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు.

    5 నిన్ను కాపాడేవాడు యెహోవాయే. నీ కుడి పక్కన యెహోవా నీకు తోడూనీడా.

    6 పగలు సూర్యుడు గానీ రాత్రి చంద్రుడు గానీ నీకు హాని చెయ్యరు.

    7 ఎలాంటి ప్రమాదం జరగకుండా యెహోవా నిన్ను కాపాడతాడు. నీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే.

    8 ఇకనుండి అన్ని వేళలా నువ్వు చేసే వాటన్నిటిలో యెహోవా నిన్ను కాపాడతాడు.

  8. 11 అప్పుడు ఆకాశం నుండి యెహోవా దూత “అబ్రాహామూ, అబ్రాహామూ” అని పిలిచాడు. దానికతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. 12 అప్పుడు ఆయన “ఆ బాలునిపై చెయ్యి వేయకు. అతనికి ఏ హానీ తలపెట్టవద్దు. నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకివ్వడానికి వెనుకంజ వేయలేదు. అది చూశాక నీకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసింది” అన్నాడు.

    13 అప్పుడు అబ్రాహాము తలెత్తి చూశాడు. ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. అబ్రాహాము వెళ్ళి ఆ పోట్టేలుని పట్టుకుని తన కొడుక్కి బదులుగా దాన్ని దహనబలిగా అర్పించాడు. 14 అబ్రాహాము ఆ చోటును “యెహోవా యీరే” అని పిలిచాడు. కాబట్టి “యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు” అనే మాట ఈ నాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది.

  9. 11 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “నేను ఇశ్రాయేలు ప్రజల సణుగులు విన్నాను. 12 వాళ్ళతో ఇలా చెప్పు. సాయంత్రం పూట మీరు మాంసం తింటారు, ఉదయం పూట తృప్తిగా ఆహారం తింటారు. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.” 13 అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు పూరేడు పిట్టలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయమయ్యాక శిబిరం అంతా మంచు పడి ఉంది. 14 నేలపై మంచు ఇంకిపోయాక నేలమీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి. 15 ఇశ్రాయేలీయులు దాన్ని చూసి, అది ఏమిటో తెలియక “ఇదేంటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

    16 మోషే వాళ్ళతో “ఇది తినడానికి యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మేరకు సేకరించుకోవాలి. తమ గుడారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికీ ఒక ఓమెరు చొప్పున తీసుకోవాలి.” 17 ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేశారు. అయితే కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా కూర్చుకున్నారు.

    18 వాళ్ళు కొలత ప్రకారం చూసినప్పుడు ఎక్కువగా తీసుకొన్న వారికి ఏమీ మిగల్లేదు, తక్కువ తీసుకొన్నవారికి ఏమీ తక్కువ కాలేదు. ప్రతి ఒక్కరూ తమ అవసరం మేరకు తమ ఇంటి వాళ్ళ భోజనానికి సరిపడినంత సమకూర్చుకున్నారు.

  10. 39 ఆడసింహం కోసం నువ్వు జంతువును వేటాడతావా?

    40 సింహం పిల్లలు తమ గుహల్లో పడుకుని ఉన్నప్పుడు, తమ మాటుల్లో పొంచి ఉన్నప్పుడు నువ్వు వాటి ఆకలి తీరుస్తావా?

    41 కాకి పిల్లలు దేవునికి మొరపెట్టేటప్పుడు, ఆకలికి అలమటించేటప్పుడు వాటికి ఆహారం ఇచ్చేవాడెవడు?

  11. 15 సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం. ఇప్పటికే పొద్దుపోయింది. ఈ ప్రజలు గ్రామాల్లోకి వెళ్ళి ఆహారం కొనుక్కోడానికి వారిని పంపి వెయ్యి” అన్నారు. 16 యేసు వారితో, “వారు వెళ్ళనక్కర లేదు, మీరే వారికి భోజనం పెట్టండి” అన్నాడు. 17 వారు, “ఇక్కడ మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్ప ఇంకేమీ లేవు” అని ఆయనతో అన్నారు. 18 అందుకు ఆయన, “వాటిని నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు. 19 ప్రజలు పచ్చిక మీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతిలో తీసుకుని ఆకాశం వైపు చూసి దీవించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు.

    20 వారంతా తిని సంతృప్తి చెందిన తరువాత మిగిలిపోయిన ముక్కలు పోగుచేస్తే మొత్తం పన్నెండు గంపలు నిండాయి. 21 స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు ఐదు వేలమంది తిన్నారు.

  12. 17 అయినా ఆయన మేలు చేస్తూ ఆకాశం నుండి మీకు వర్షాన్నీ, ఫలవంతమైన రుతువులనూ దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతూ, తన గురించిన సాక్ష్యం నిలిపి ఉంచాడు.”

  13. 42 తరువాత బయల్షాలిషా నుండి ఒక వ్యక్తి కొత్తగా పండిన యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలనూ, తాజాగా కోసిన ధాన్యాన్నీ ఒక బస్తాలో వేసుకుని దేవుని మనిషి కోసం తీసుకు వచ్చాడు. అప్పుడు అతడు “వీటిని వడ్డించు, ఇక్కడున్నవారు భోజనం చేస్తారు” అని చెప్పాడు. 43 అయితే అతని సేవకుడు “ఏమిటీ? వందమందికి తినడానికి ఈ మాత్రం వాటిని వడ్డించాలా?” అన్నాడు. దానికి అతడు “వారు తినడానికి వడ్డించు. ఎందుకంటే ‘వారు తినగా ఇంకా మిగులుతాయి’ అని యెహోవా చెప్తున్నాడు” అన్నాడు. 44 కాబట్టి అతని సేవకుడు వాటిని వాళ్ళకి వడ్డించాడు. యెహోవా చెప్పినట్లుగానే వాళ్ళంతా భుజించిన తరువాత ఆహారం ఇంకా మిగిలి పోయింది.

  14. 6 ఆకాశ మహాకాశాలను, అందులో ఉండే సైన్యాలను, భూమిని, భూమిపై ఉన్న సమస్తాన్ని, సముద్రాలను, వాటిలో ఉండే వాటిని సృష్టించి వాటినన్నిటినీ కాపాడుతున్న అద్వితీయ దేవుడైన యెహోవావు నువ్వే. ఆకాశ సైన్యమంతా నీకు లోబడుతుంది.

  15. 9 యెహోవా నా ఆశ్రయం. మహోన్నతుణ్ణి నీకు కూడా శరణుగా చేసుకో.

    10 ఏ హానీ నిన్ను ముంచెత్తదు. ఏ ఆపదా నీ ఇంటి దరిదాపులకు రాదు.

    11 నువ్వు చేసే వాటన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను పురమాయిస్తాడు.

    12 నువ్వు జారి బండ రాయిపై పడిపోకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు.

    13 నువ్వు సింహాలనూ నాగుపాములను నీ కాళ్ళ కింద తొక్కుతావు, సింహం కూనలను, పాములను అణగదొక్కుతావు.

  16. 27 తగిన కాలంలో నీవు వాటికి ఆహారమిస్తావని ఇవన్నీ నీ దయకోసం కనిపెడుతున్నాయి.

    28 నీవు వాటికి అందిస్తే అవి కూర్చుకుంటాయి. నీవు గుప్పిలి విప్పితే అవి మంచివాటిని తిని తృప్తి చెందుతాయి.

  17. 7 కృతజ్ఞతా స్తుతులతో యెహోవాను కీర్తించండి. తంతి వాయిద్యంతో మన దేవునికి స్తుతి గీతాలు పాడండి.

    8 ఆయన ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు. భూమి కోసం వర్షం సిద్ధం చేస్తాడు. కొండల మీద గడ్డి మొలిపిస్తాడు.

    9 పశువులకు, అరుస్తూ ఉండే కాకి పిల్లలకు ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు.

  18. 1 “ఇశ్రాయేలు పసిప్రాయంలో నేను అతనిపట్ల ప్రేమగలిగి,

    నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలోనుండి పిలిచాను.

    2 వారిని ఎంతగా పిలిస్తే బయలు దేవుళ్ళకు వారు అంత ఎక్కువగా బలులు అర్పించారు.

    విగ్రహాలకు ధూపం వేశారు.

    3 ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాణ్ణి నేనే.

    వారి చేతులు పట్టుకుని పైకి లేపిన వాణ్ణి నేనే.

    నేనే వారిని పట్టించుకున్నాను అనే సంగతి వారికి తెలియదు.

    4 మానవత్వపు బంధంతో వారిని నడిపించాను.

    స్నేహబంధాలతో తోడుకుపోయాను.

    వారి పళ్ళ మధ్య నుంచి కాడిని తీసిన వాడిలా నేను వారికి ఉన్నాను.

    వంగి వారికి అన్నం తినిపించాను.

  19. 24 కాకుల గురించి ఆలోచించండి. అవి విత్తనాలు చల్లవు, కోయవు, వాటికి గిడ్డంగులూ, కొట్లూ లేవు. అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటే ఎంతో ఉన్నతమైన వారు. 25 పైగా మీలో ఎవడు చింత పడడం వల్ల తన ఎత్తును ఒక మూరెడు ఎక్కువ చేసుకోగలడు? 26 కాబట్టి చిన్న చిన్న విషయాలే మీరు చేయలేకపోతే పెద్దవాటిని గురించి ఆలోచించడం ఎందుకు? పువ్వులు ఎలా పూస్తున్నాయో చూడండి.

  20. 3 మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.

    4 దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది. 5 ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి.

  21. 10 నీ ప్రజలు దానిలో నివసిస్తారు. దేవా, నీ మంచితనంతో పేదలను అనుగ్రహించావు.

  22. 6 “కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు. 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. 8 అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు.

    9 దీని గురించి “అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని లేఖనంలో రాసి ఉంది.

    10 విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు. 11 ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది.

  23. 3 దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బల ప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు.

  24. 8 దానికి అబ్రాహాము “కొడుకా, దహనబలికి గొర్రెపిల్లను దేవుడే దయచేస్తాడు” అన్నాడు.

  25. 5 అయినా, నన్నిక్కడకు మీరు అమ్మేసినందుకు దుఃఖపడవద్దు. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రాణరక్షణ కోసం దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 6 రెండేళ్ళ నుంచి దేశంలో కరువు ఉంది. ఇంకా ఐదేళ్ళు దున్నడం గానీ పంటకోత గానీ ఉండదు.

    7 మిమ్మల్ని రక్షించి, భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపడానికీ ప్రాణాలతో కాపాడడానికీ దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 8 కాబట్టి నన్ను దేవుడే పంపాడు. మీరు కాదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా అతని ఇంటివారందరికి ప్రభువుగా ఐగుప్తు దేశమంతటి మీదా అధికారిగా నియమించాడు.

  26. 20 మీరు నాకు కీడు చేయాలని చూశారు గానీ మీరిప్పుడు చూస్తున్నట్టు, అనేకమందిని బతికించేలా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు.

  27. 1 యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా సీను ఎడారి ప్రాంతం నుండి ప్రయాణం చేసి రెఫీదీములో దిగారు. అక్కడ ప్రజలు తాగడానికి నీళ్ళు లేవు. 2 దానికి వాళ్ళు మోషే పై నింద మోపుతూ “మాకు తాగడానికి నీళ్లియ్యి” అన్నారు. అప్పుడు మోషే “మీరు నాతో ఎందుకు పోట్లాడుతున్నారు? యెహోవాను ఎందుకు శోధిస్తున్నారు?” అన్నాడు. 3 ప్రజలు దాహంతో మోషే మీద సణుగుతూ “ఇదేంటి? మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దాహంతో చంపడానికి ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకువచ్చావా?” అన్నారు.

    4 అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు. “ఈ ప్రజలను నేనేం చెయ్యాలి? కొంచెం సేపట్లో వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో” అన్నాడు. 5 అప్పుడు యెహోవా “ప్రజల పెద్దల్లో కొందరిని వెంటబెట్టుకుని నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకుని ప్రజలకు ఎదురుగా వెళ్లి నిలబడు. 6 నేను అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను. నువ్వు ఆ బండను కర్రతో కొట్టు. అప్పుడు ప్రజలు తాగడానికి ఆ బండలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి” అని మోషేతో చెప్పాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దల కళ్ళెదుట ఆ విధంగా చేశాడు. 7 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసిన గొడవనుబట్టి, వారు “యెహోవా మన మధ్య ఉన్నాడా, లేడా?” అని యెహోవాను శోధించడాన్నిబట్టి ఆ స్థలానికి “మస్సా” అనీ “మెరీబా” అనీ పేర్లు పెట్టాడు.

  28. 1 ఏలీయా చేసిందంతా అతడు బయలు ప్రవక్తలందరినీ కత్తితో చంపించిన సంగతీ అహాబు యెజెబెలుకు చెప్పాడు. 2 యెజెబెలు ఒక వార్తాహరునితో ఏలీయాకు ఈ కబురు పంపింది “రేపు ఈ పాటికి చనిపోయిన ఆ ప్రవక్తల ప్రాణం లాగా నేను నీ ప్రాణాన్ని చేయకపోతే దేవుళ్ళు దాని కంటే ఎక్కువ కీడు నా మీదికి తెస్తారు గాక.” 3 ఏలీయా ఈ విషయం తెలుసుకుని, లేచి తన ప్రాణం కాపాడుకోడానికి, యూదాలోని బెయేర్షెబాకు వచ్చి, తన సేవకుణ్ణి అక్కడ ఉంచాడు.

    4 అతడు ఒక రోజంతా ఎడారిలోకి ప్రయాణించి ఒక రేగు చెట్టు కింద కూర్చున్నాడు. చచ్చిపోదామని ఆశించాడు. “యెహోవా, ఇంతవరకూ చాలు, చనిపోయిన నా పూర్వీకుల కంటే నేనేమంత గొప్పవాణ్ణి కాదు. నా ప్రాణం తీసుకో” అని ప్రార్థన చేశాడు. 5 అతడు రేగు చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఉన్నట్టుండి ఒక దేవదూత వచ్చి అతన్ని తాకి “నీవు లేచి భోజనం చెయ్యి” అన్నాడు. 6 ఏలీయా లేచి చూస్తే, అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ల సీసా కనిపించాయి. కాబట్టి అతడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు.

    7 యెహోవా దూత రెండవసారి మళ్ళీ వచ్చి అతన్ని లేపి “నీవు చాలా దూరం ప్రయాణం చెయ్యాలి, లేచి భోజనం చెయ్యి” అని చెప్పాడు. 8 అతడు లేచి తిని, తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు.

  29. దావీదు కీర్తన.

    1 యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు.

    2 పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు.

  30. 23 మనం దీనావస్థలో పడి ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఆదరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    24 మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    25 సమస్త జీవరాశులకు ఆయన ఆహారం అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

    26 పరలోకంలో ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

  31. 26 నేను వాళ్ళను దీవిస్తాను. నా పర్వతం చుట్టూ ఉన్న స్థలాలను దీవిస్తాను. సరైన కాలాల్లో వానలు కురిపిస్తాను. దీవెన జల్లులివే. 27 పళ్ళ చెట్లు కాయలు కాస్తాయి. భూమి పంట ఇస్తుంది. నా గొర్రెలు వాటి ప్రాంతాల్లో క్షేమంగా ఉంటాయి. నేను వారి కాడికట్లను తెంపి వారిని బందీలుగా చేసినవారి చేతిలో నుంచి వారిని విడిపించేటప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.

    28 ఇకపై వారు ఇతర రాజ్యాలకు దోపిడీగా ఉండరు. క్రూర జంతువులు వారిని మింగివేయవు! వాళ్ళు ఎవరికీ భయపడకుండా క్షేమంగా నివసిస్తారు. 29 వాళ్ళ పైరుకు ప్రశాంతంగా పెరిగే వాతావరణం కలిగిస్తాను. వాళ్ళు ఇక ఏమాత్రం దేశంలో కరువుకు గురి కారు. ఇతర రాజ్యాలు వారిని చిన్నచూపు చూడరు.

  32. 38 ఇవ్వండి. అప్పుడు మీకూ ఇస్తారు. అప్పుడు మనుషులు మీకు అదిమి, కుదించి పొంగి పొర్లి పోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకూ కొలవడం జరుగుతుంది.”

  33. 35 ఇంకా ఆయన “నేను డబ్బు సంచీ, చెప్పులూ లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయిందా?” అని అడిగాడు. దానికి వారు, “ఏమీ తక్కువ కాలేదు” అన్నారు.

  34. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు.

  35. 13 ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.

  36. 20 అప్పుడు నోవహు యెహోవాకు పవిత్రమైన పశువులు, పక్షులన్నిట్లో నుంచి కొన్నిటిని తీసి హోమబలి అర్పించాడు. 21 యెహోవా ఆ ఇంపైన వాసన ఆస్వాదించి “వారి హృదయాలు బాల్యం నుంచే దుష్టత్వం వైపు మొగ్గుచూపాయి. ఇక ఎప్పుడూ మనుషులను బట్టి భూమిని కీడుకు గురిచేయను. నేనిప్పుడు చేసినట్టు ప్రాణం ఉన్నవాటిని ఇకపై ఎన్నడూ నాశనం చెయ్యను. 22 భూమి ఉన్నంత వరకూ విత్తనాలు నాటేకాలం, కోతకాలం, వేసవి, శీతాకాలాలు, పగలూ రాత్రీ ఉండక మానవు” అని తన హృదయంలో అనుకున్నాడు.

  37. 15 ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను” అని చెప్పాడు.

  38. 31 అప్పుడు యెహోవా దగ్గరనుండి వాయువు బయల్దేరింది. అది సముద్రం నుండి పూరేడు పిట్టలను తీసుకు వచ్చి శిబిరంలో అంతటా పడవేసింది. ఈ వైపునుండి ఆ వైపుకీ, ఆ వైపునుండి ఈ వైపుకీ ఒక రోజు ప్రయాణమంత దూరం వరకూ అవి వచ్చి పడ్డాయి. అవి భూమికి రెండు మూరల ఎత్తున పడ్డాయి. 32 కాబట్టి ప్రజలు ఉదయాన్నే లేచి ఆ రోజంతా వాటిని సేకరించారు. ఆ రాత్రీ మరుసటి రోజు అంతా వాటిని సేకరించారు. నూరు తూముల పిట్టల కంటే తక్కువ సేకరించినవాడు లేడు. తరువాత వారు వాటిని శిబిరం చుట్టూ తమ కోసం పరచి ఉంచారు.

  39. 7 ఎందుకంటే మీ చేతి పని అంతటినీ మీ యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. ఈ గొప్ప ఎడారిలో నువ్వు ఈ నలభై సంవత్సరాలు తిరిగిన సంగతి ఆయనకు తెలుసు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు, మీకేమీ తక్కువ కాదు.”

  40. 11 మీరు నది దాటి స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న ఈ దేశం కొండలు, లోయలు ఉన్న దేశం. 12 అది ఆకాశం నుండి కురిసే వర్షం నీరు తాగుతుంది. అది మీ దేవుడు యెహోవా తన దృష్టి ఉంచిన దేశం. ఆయన కనుదృష్టి సంవత్సరం ప్రారంభం నుండి అంతం వరకూ ఎల్లప్పుడూ దానిమీద ఉంటుంది.

  41. 7 యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు.

    కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే.

    8 దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ,

    మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ

    వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే.

    పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే.

    భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి.

    ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.

  42. 9 తన భక్తుల పాదాలు తొట్రుపడకుండా ఆయన వారిని కాపాడతాడు.

    దుర్మార్గులు చీకటిలో దాక్కొంటారు.

    బలం వలన ఎవరూ విజయం సాధించలేరు.

  43. 12 ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే.

  44. 21 “నేను నా తల్లి కడుపులోనుండి దిగంబరిగా వచ్చాను. దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగు గాక.”

  45. 6 నీ న్యాయం ఉన్నతమైన పర్వతాలతో సమానం. నీ న్యాయం లోతైన సముద్రంతో సమానం. యెహోవా నువ్వు మానవులను, జంతువులను సంరక్షిస్తావు.

  46. 28 ఎందుకంటే యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు. విశ్వాసంతో తనను అనుసరించే వాళ్ళను ఆయన విడిచిపెట్టడు. వాళ్ళను శాశ్వతంగా భద్రపరుస్తాడు. అయితే దుర్మార్గుల సంతానం నాశనం అవుతుంది.

  47. 9 ఎందుకంటే దాహం గొన్న వారిని ఆయన తృప్తిపరచాడు. ఆకలి గొన్నవారిని మేలుతో నింపాడు.

  48. 6 భూమి పైన, ఆకాశంలో, సముద్రాల్లో, అగాధ సముద్రాల్లో ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు.

    7 భూమి అంచుల నుంచి ఆయన మేఘాలను రప్పిస్తాడు. వర్షంతో బాటు ఆకాశంలో మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగిలోనుంచి గాలిని బయటికి తెస్తాడు.

  49. 5 యాకోబు దేవుడు ఎవరికి సహాయంగా ఉంటాడో, తమ దేవుడైన యెహోవా మీద ఎవరు ఆశాభావం పెట్టుకుని ఉంటారో వాళ్ళు ధన్యులు.

    6 ఆయన భూమినీ, ఆకాశాలనూ, సముద్రాలనూ, వాటిలో ఉన్న సమస్తాన్నీ సృష్టి చేసినవాడు. ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పడు.

    7 దోపిడీకి గురైన వాళ్లకు ఆయన న్యాయం చేకూరుస్తాడు. ఆకలిగొన్న వాళ్లకు ఆహారం అనుగ్రహిస్తాడు. ఖైదీలకు విడుదల కలిగిస్తాడు.

    8 యెహోవా గుడ్డివాళ్ళ కళ్ళు తెరిపిస్తాడు. అణగారిపోయిన వాళ్ళను ఆదరించి లేవనెత్తుతాడు. యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు.

    9 ఇతర జాతుల ప్రజలను యెహోవా కాపాడతాడు. తండ్రిలేని అనాథలను, విధవరాళ్ళను ఆదరించేవాడు ఆయనే. దుష్టులను ఆయన వ్యతిరేకిస్తాడు.

  50. 4 ఎందుకంటే దరిద్రులకు నీవు భద్రతగాను, అవసరతలో ఉన్నవారికి సంరక్షకునిగానూ ఉన్నావు. గాలివానలో ఆశ్రయంగాను వేసవిలో నీడగానూ ఉన్నావు. నిర్దయుల ఊపిరి సెగలాగా గోడకి తగులుతున్న తుఫానులాగా ఉంటే నీవు కవచంగా ఉన్నావు.

  51. 3 యెహోవా అనే నేనే దాన్ని సంరక్షిస్తున్నాను. ప్రతీ నిత్యం దానికి నీళ్ళు పోస్తున్నాను. దానికి ఎవడూ హాని తలపెట్టకుండా పగలూ రాత్రీ కాపలా కాస్తున్నాను.

  52. 5 ఎగురుతూ ఉండే పక్షిలాగా సేనల ప్రభువు యెహోవా యెరూషలేమును కాపాడుతాడు.

    ఆయన దానిపై సంచరించేటప్పుడు దాన్ని సంరక్షిస్తాడు, విడిపిస్తాడు, భద్రపరుస్తాడు.

  53. 4 నువ్వు ముసలివాడివయ్యే వరకూ, నీ తల వెండ్రుకలు తెల్లగా అయ్యే వరకూ నిన్ను మోసేవాణ్ణి నేనే.

    నేనే నిన్ను చేశాను, నిన్ను ఎత్తుకునే వాణ్ణీ, నిన్ను మోస్తూ రక్షించేవాణ్ణీ కూడా నేనే.

  54. 43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.

  55. 9 మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా? 10 లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా? 11 మీరు చెడ్డ వారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు గదా! అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు.

  56. 32 అప్పుడు యేసు తన శిష్యులను పిలిచి, “ఈ ప్రజల మీద నాకు జాలిగా ఉంది. మూడు రోజుల నుండి వీరు నా దగ్గరే ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. అలా పంపివేస్తే వారు దారిలోనే స్పృహ తప్పి పోతారేమో” అన్నాడు. 33 ఆయన శిష్యులు, “ఇంతమందికి సరిపడినన్ని రొట్టెలు ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి?” అన్నారు. 34 యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారిని అడిగాడు. వారు, “ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి” అని చెప్పారు.

    35 అప్పుడు యేసు “నేల మీద కూర్చోండి” అని ఆ ప్రజలకి ఆజ్ఞాపించి, 36 ఆ ఏడు రొట్టెలు, ఆ చేపలు పట్టుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వాటిని ముక్కలు చేసి తన శిష్యులకిచ్చాడు. శిష్యులు ఆ ప్రజలకు వాటిని పంచిపెట్టారు. 37 వారంతా కడుపారా తిన్న తరువాత అక్కడ ఏడు గంపల నిండుగా ముక్కలు మిగిలిపోయాయి. 38 స్త్రీలు, పిల్లలు కాకుండా కేవలం పురుషులే నాలుగువేల మంది తిన్నారు.

  57. 12 పొద్దు గుంకుతూ ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “మనం అరణ్య ప్రాంతంలో ఉన్నాం. వీరంతా చుట్టుపక్కల గ్రామాలకూ, పల్లెలకూ వెళ్ళి రాత్రి బస చూసుకుని, ఆహారం సంపాదించుకోడానికి వీరిని పంపించెయ్యి” అన్నారు. 13 ఆయన, “మీరే వీళ్ళకి భోజనం పెట్టండి” అన్నాడు. అప్పుడు వారు మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్పించి ఇంకేమీ లేవు. వీళ్ళందరికీ పెట్టాలంటే భోజనం కొని తేవాల్సిందే” అన్నారు.

    14 అక్కడ సుమారు పురుషులే ఐదు వేలమంది ఉన్నారు. ఆయన, “వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి” అని శిష్యులతో చెప్పాడు. 15 వారు అలానే చేసి అందర్నీ కూర్చోబెట్టారు. 16 అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలనూ రెండు చేపలనూ తీసుకు, ఆకాశం వైపు చూసి, వాటిని దీవించి, విరిచి, జనసమూహానికి వడ్డించమని శిష్యులకిచ్చాడు. 17 వారంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపల్లో ఎత్తారు.

  58. 6 ఐదు పిచ్చుకలను రెండు కాసులకు అమ్ముతారు కదా. అయినా వాటిలో ఒక్కదాన్ని కూడా దేవుడు మర్చిపోడు. 7 మీ తలవెంట్రుకలన్నిటికీ లెక్క ఉంది. భయపడకండి. మీరు ఎన్నో పిచ్చుకల కంటే విలువైన వారు కదా.

  59. 29 ఏం తింటాం, ఏం తాగుతాం అని దిగులు పెట్టుకోకండి. చింతించకండి. 30 లోకులు వీటిని వెతుకుతారు. ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలుసు. 31 మీరు మాత్రం ఆయన రాజ్యాన్ని వెదకండి. దానితోపాటుగా ఇవి కూడా మీకు లభిస్తాయి.

  60. 36 సమస్తమూ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసం ఉన్నాయి. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక. ఆమేన్‌.

  61. 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాల్లో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనలను దీవించాడు. 4 క్రీస్తులో మనలను సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనలను ఎన్నుకున్నాడు. 5 యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా స్వీకరించడానికి దేవుడు తన ప్రేమతో ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.

    6 తన దివ్యకృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దాన్ని తన ప్రియ కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు. 7 దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది. 8 ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు. 9 ఆయన క్రీస్తు ద్వారా తన ఇష్ట పూర్తిగా ప్రదర్శించిన పథకం తాలూకు రహస్య సత్యాన్ని మనకు తెలియజేశాడు.

    10 కాలం సంపూర్ణమైనప్పుడు పరలోకంలోనూ, భూమి మీదా ఉన్న సమస్తాన్నీ క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు. 11 క్రీస్తును ముందుగా నమ్మిన మనం తన మహిమకు కీర్తి కలగజేయాలని, 12 దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ఎన్నుకుని, మనకు వారసత్వం ఏర్పరచాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం ప్రకారం అన్ని కార్యాలనూ జరిగిస్తున్నాడు.

  62. 17 ఈ లోకంలోని ధనవంతులు గర్విష్టులు కాకూడదని ఆజ్ఞాపించు. వారు అస్థిరమైన ధనంపై నమ్మకం పెట్టుకోకుండా, అనుభవించడానికి సమస్తాన్నీ ధారాళంగా దయచేసే దేవునిలోనే నమ్మకం పెట్టుకోవాలని ఆజ్ఞాపించు.

  63. 24 మీరు తడబడకుండా భద్రం చేయడానికి ఆయన తన మహిమగల సన్నిధి ఎదుట మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని మచ్చలేని వారుగా ఉంచగలవాడు. 25 ఏకైక దేవుడైన మన రక్షకునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కలుగు గాక. ఆమెన్.

  64. 10 ఓర్పుతో సహించాలన్న నా ఆదేశానికి నువ్వు కట్టుబడి ఉన్నావు. కాబట్టి భూమిపై నివసించే వారిని పరిశోధించడానికి లోకం మీదికి రాబోయే పరీక్షా కాలంలో నేను నిన్ను కాపాడతాను.

  65. 24 మనిషి ప్రవర్తన యెహోవా వశంలో ఉంటుంది. తనకు జరగబోయేది అతనికి ఎలా తెలుస్తుంది?

  66. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

  67. 4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.

    6 దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. 7 రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనపరచడానికి ఆయన ఇలా చేశాడు.

    8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  68. 20 మనలో పని చేసే తన శక్తి ప్రకారం మనం అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే ఎంతో ఎక్కువగా చేయ శక్తి గల దేవునికి, 21 సంఘంలో క్రీస్తు యేసులో తరతరాలకూ నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్‌.

  69. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

  70. 3 తన మహిమనుబట్టి, మంచి గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు. 4 వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా, లోకంలో ఉన్న దుర్మార్గపు కోరికల నాశనగుణం నుండి తప్పించుకుని మీరు తన స్వభావంలో పాలిభాగస్థులు కావాలన్నదే దేవుని ఉద్దేశం.

  71. 17 ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు.

    18 విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు.

    19 ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటి పైనా అతనికి విజయం ఇస్తాడు.

    20 ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతాడు. వాటిలో ఒక్కటి కూడా విరిగి పోదు.

  72. 9 నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు. దాన్ని ఐశ్వర్యవంతం చేస్తున్నావు. దేవుని నది జలమయంగా ఉంది. నువ్వు భూమిని ఆ విధంగా సిద్ధం చేసి మానవాళికి ధాన్యం దయ చేస్తున్నావు.

    10 దాని దుక్కులను నీళ్లతో సమృద్ధిగా తడిపి దాని నాగటి చాళ్ళను చదును చేస్తున్నావు. వాన జల్లు కురిపించి దాన్ని మెత్తన చేస్తున్నావు. అది మొలకెత్తినప్పుడు దాన్ని ఆశీర్వదిస్తున్నావు.

    11 సంవత్సరమంతటికీ నీ మంచితనం ఒక కిరీటంగా ఉంది. నీ రథ చక్రాల జాడలు సారం ఒలికిస్తున్నాయి.

    12 అడవి బీడులు సారాన్ని వెదజల్లుతున్నాయి. కొండలు ఆనందాన్ని నడుముకు కట్టుకున్నాయి.

    13 గొర్రెల మందలు పచ్చిక మైదానాలను శాలువాలాగా కప్పాయి. లోయలు పంట ధాన్యంతో కప్పి ఉన్నాయి. అవన్నీ సంతోషధ్వని చేస్తున్నాయి. అవన్నీ పాటలు పాడుతున్నాయి.

  73. 17 ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి.

  74. 13 అయినా, ఆయన చేసిన వాగ్దానం కారణంగా కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తున్నాం. దానిలో నీతిపరులు నివాసం చేస్తారు.

  75. 43 యెహోవా ప్రమాణం చేసి ఇశ్రాయేలీయుల పూర్వీకులకిస్తానని చెప్పిన దేశమంతా ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. వాళ్ళు దాని స్వాధీనపరచుకుని దానిలో నివసించారు. 44 యెహోవా వారి పూర్వీకులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్నివైపులా వారికి విశ్రాంతి కలగచేశాడు. యెహోవా వారి శత్రువులందరిని వారికి అప్పగించాడు కాబట్టి వాళ్ళలో ఒక్కడు కూడా ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేకపోయారు. 45 యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పలేదు, అన్నీ నెరవేరాయి.

  76. 35 నీ రక్షణ డాలును నువ్వు నాకిచ్చావు. నీ కుడిచెయ్యి నన్ను ఆదుకుంది, నీ దయ నన్ను గొప్పచేసింది.

  77. 5 నా శత్రువుల సముఖంలో నువ్వు నాకు భోజనం సిద్ధం చేస్తావు, నూనెతో నా తల అభిషేకం చేశావు. నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది.

  78. 19 నీలో భయభక్తులు గలవారి కోసం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మనుషులు చూస్తుండగా నీ ఆశ్రయం కోరేవారి కోసం నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.

  79. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  80. 9 ఒకడు తాను చేయాలనుకున్నదంతా హృదయంలో ఆలోచించుకుంటాడు. అతని మార్గాన్ని యెహోవా స్థిరపరుస్తాడు.

  81. 33 చీట్లు ఒడిలో వేస్తారు. నిర్ణయం యెహోవాదే.

  82. 6 కాని, చూడు, నేను ఆరోగ్యం, స్వస్థత తీసుకొస్తాను. నేను వాళ్ళను స్వస్థపరిచి వాళ్ళను సమృద్ధిలోకి, శాంతిలోకి, నమ్మకత్వంలోకి తీసుకొస్తాను. 7 యూదా, ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళ భాగ్యం మళ్ళీ తీసుకొస్తాను. ఆరంభంలో ఉన్నట్టు వాళ్ళను నిర్మాణం చేస్తాను.

    8 అప్పుడు వాళ్ళు నాకు విరోధంగా చేసిన దోషాల నుంచి వాళ్ళను పవిత్రం చేస్తాను. నాకు విరోధంగా చేసిన వాళ్ళ దోషాలనూ తిరుగుబాటునూ క్షమిస్తాను. 9 నేను వాళ్ళ కోసం చెయ్యబోతున్న మంచి సంగతులు విన్న భూజనులందరి ఎదుట, వాళ్ళు నా ఆనందానికి, స్తోత్ర గీతానికి, ఘనతకు కారణంగా ఉంటారు. నేను వారికి ఇచ్చే మంచి విషయాలు, శాంతి కారణంగా వాళ్ళు భయపడతారు.’”

  83. 10 నా ఆలయంలో ఆహారం ఉండేలా మీ దశమ భాగం నా ఆలయం గిడ్డంగిలోనికి తీసుకురండి. ఇలా తీసుకువచ్చి నన్ను శోధించండి, నేను పరలోక ద్వారాలు విప్పి, పట్టలేనంత దీవెనలు విస్తారంగా కుమ్మరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.

  84. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  85. 18 నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు ద్వారా అందాయి. నాకు ఏమీ కొదువ లేదు. అవి ఇంపైన సువాసనగా, దేవునికి ఇష్టమైన అర్పణగా ఉన్నాయి.