61 Bible Verses About Rain

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Rain
  1. 41 ఏలీయా “పెద్ద వాన కురుస్తున్న శబ్దం వస్తున్నది. నీవు వెళ్లి భోజనం చెయ్యి” అని అహాబుతో చెప్పాడు. 42 అహాబు భోజనం చేయడానికి వెళ్ళాడు గాని, ఏలీయా కర్మెలు పర్వతం ఎక్కి నేలమీద పడి ముఖం మోకాళ్ల మధ్య పెట్టుకున్నాడు. 43 తరువాత అతడు తన సేవకుణ్ణి పిలిచి “నీవు పైకి వెళ్లి సముద్రం వైపు చూడు” అన్నాడు. వాడు మెరక ఎక్కి చూసి “ఏమీ కనబడ్డం లేదు” అన్నాడు. అతడు ఇంకా ఏడు సార్లు “వెళ్లి చూడు” అన్నాడు. 44 ఏడో సారి అతడు చూసి “అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం, సముద్రం నుంచి పైకి లేస్తూ ఉంది” అన్నాడు. అప్పుడు ఏలీయా “నీవు అహాబు దగ్గరికి వెళ్లి, నీ రథాన్ని సిద్ధ పరచుకో, వానలో చిక్కుకుపోక ముందే వెళ్ళిపో” అని చెప్పమని అతన్ని పంపాడు.

    45 అంతలోనే ఆకాశం కారుమేఘాలు కమ్మింది. దానికి గాలి తోడైంది. వాన జోరుగా కురిసింది. అహాబు రథమెక్కి యెజ్రెయేలు పట్టణం వెళ్లిపోయాడు. 46 అయితే యెహోవా హస్తం ఏలీయా మీద ఉంది. అతడు నడుం బిగించుకుని అహాబు కంటే ముందే పరుగెత్తి యెజ్రెయేలు చేరుకున్నాడు.

  2. 16 కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీకు స్వస్థత కలిగేలా ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన ఫలభరితమైనది. అది ఎంతో బలవత్తరమైనది. 17 ఏలీయా మనలాటి స్వభావం ఉన్న మనిషే. వానలు కురవకుండా అతడు తీవ్రంగా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు భూమి మీద వాన కురవలేదు. 18 అతడు తిరిగి ప్రార్థన చేస్తే ఆకాశం వాన కురిపించింది, భూమి ఫలసాయం ఇచ్చింది.

  3. 24 “కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు. 25 వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు. 26 నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు. 27 వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం.”

  4. 10 మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఐగుప్తు లాంటిది కాదు. అక్కడ మీరు విత్తనాలు చల్లి కూరమొక్కలకు చేసినట్టు మీ కాళ్లతో తోటకు నీరు కట్టారు. 11 మీరు నది దాటి స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న ఈ దేశం కొండలు, లోయలు ఉన్న దేశం. 12 అది ఆకాశం నుండి కురిసే వర్షం నీరు తాగుతుంది. అది మీ దేవుడు యెహోవా తన దృష్టి ఉంచిన దేశం. ఆయన కనుదృష్టి సంవత్సరం ప్రారంభం నుండి అంతం వరకూ ఎల్లప్పుడూ దానిమీద ఉంటుంది.

    13 కాబట్టి మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను సేవించాలి. ఈ రోజు నేను మీకిచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని పాటిస్తే, 14 మీ దేశానికి వర్షం, అంటే తొలకరి, కడవరి వానలు వాటి కాలంలో కురుస్తాయి. అందువలన మీరు మీ ధాన్యాన్నీ ద్రాక్షారసాన్నీ నూనెనూ పోగు చేసుకుంటారు. 15 మీరు తిని తృప్తిపొందుతారు. ఆయన మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాడు.

    16 మీ హృదయం మోసపోయి, మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి, వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి. 17 లేకపోతే యెహోవా మీమీద కోపపడి ఆకాశాన్ని మూసివేస్తాడు. అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవా మీకిస్తున్న ఆ మంచి దేశంలో నివసించకుండా మీరు త్వరగా నాశనమైపోతారు.

  5. 23 సీయోను ప్రజలారా, ఆనందించండి.

    మీ యెహోవా దేవుణ్ణి తలుచుకుని సంతోషించండి.

    ఆయన నీతి బట్టి మీ కోసం సరిపోయినంత తొలకరి వాన, వాన జల్లు పంపిస్తాడు.

    ముందులాగా తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తాడు.

    24 కళ్ళాలు గోదుమ గింజలతో నిండి ఉంటాయి.

    కొత్త ద్రాక్షారసం, నూనెతో తొట్లు పొర్లి పారతాయి.

    25 “ఎగిరే మిడతల గుంపులూ పెద్ద మిడతలూ మిడత పిల్లలూ గొంగళి పురుగులూ,

    ఆ నా మహాసేన తినేసిన సంవత్సరాల పంటను మీకు మళ్ళీ ఇస్తాను.

    26 మీరు కడుపునిండా తిని తృప్తి పడతారు.

    మీ మధ్య చేసిన అద్భుతాలను బట్టి

    మీ యెహోవా దేవుని పేరును స్తుతిస్తారు.

    నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను.

  6. 7 దేవా, నీవు నీ ప్రజలకు ముందుగా బయలుదేరినప్పుడు అరణ్యంలో ప్రయాణించినప్పుడు

    8 దేవుని సన్నిధిలో ఆయన సీనాయి కొండకు వచ్చినపుడు, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో భూమి వణికింది, ఆకాశాలు వర్షించాయి.

    9 దేవా, నీ వారసత్వం మీద వర్షం సమృద్ధిగా కురిపించావు. అది అలసి ఉన్నప్పుడు నువ్వు దాన్ని బలపరచావు.

    10 నీ ప్రజలు దానిలో నివసిస్తారు. దేవా, నీ మంచితనంతో పేదలను అనుగ్రహించావు.

  7. 35 వారు నీకు వ్యతిరేకంగా పాపం చేయడం వలన ఆకాశం మూసుకుపోయి వర్షం కురవకపోతే, వారి ఇబ్బంది వలన వారు నీ నామాన్ని ఒప్పుకుని తమ పాపాలను విడిచి ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేస్తే, 36 నీవు ఆకాశం నుండి విని, నీ దాసులు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారు నడుచుకోవలసిన మార్గాన్ని వారికి చూపించి, వారికి నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపించు.

  8. 6 కోసిన గడ్డిపై కురిసే వానలాగా, భూమిని తడిపే మంచి వర్షంలాగా అతడు దిగి వస్తాడు గాక.

  9. 43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.

    46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.

  10. 10 వాన, మంచు ఆకాశాన్నుంచి వచ్చి భూమిని తడుపుతాయి.

    దానినుంచి విత్తనం చల్లే వాడికి విత్తనాన్నీ తినడానికి తిండినీ ఇచ్చేలా, మొక్కలు మొలిచి ఫలించేలా చేస్తాయి.

    అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగి వెళ్ళవు.

    11 ఆలాగే నా నోట నుంచి వచ్చే మాట ఉంటుంది. నిష్ఫలంగా నా దగ్గరికి తిరిగి రాదు.

    అది నా సంకల్పాన్ని నెరవేరుస్తుంది. నేను పంపించిన ఉద్దేశాన్ని సాధిస్తుంది.

  11. 9 యూదా, బెన్యామీను గోత్రాల వారంతా మూడు రోజుల్లోగా యెరూషలేము చేరుకున్నారు. తొమ్మిదో నెల 20 వ రోజున ప్రజలంతా దేవుని మందిరం వీధిలో వర్షంలో తడుస్తూ కూర్చున్నారు. జరగబోయేది తలంచుకుని భయంతో వణికిపోతున్నారు.

  12. 3 మీరు నా శాసనాలను బట్టి నడుచుకుంటూ నా ఆజ్ఞలను పాటిస్తూ వాటిని అనుసరించి ప్రవర్తించాలి.

    4 వర్షాకాలంలో మీకు వర్షం ఇస్తాను. మీ భూమి పంటలనిస్తుంది. మీ పొలాల్లో చెట్లు ఫలిస్తాయి. 5 మీ ద్రాక్ష పండ్లకాలం వరకూ మీ పంట నూర్పు కొనసాగుతుంది. మీరు తృప్తిగా తిని మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారు.

  13. 7 కృతజ్ఞతా స్తుతులతో యెహోవాను కీర్తించండి. తంతి వాయిద్యంతో మన దేవునికి స్తుతి గీతాలు పాడండి.

    8 ఆయన ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు. భూమి కోసం వర్షం సిద్ధం చేస్తాడు. కొండల మీద గడ్డి మొలిపిస్తాడు.

  14. 15 “అయ్యలారా, మీరెందుకిలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మానవమాత్రులమే. మీరు ఇలాంటి పనికిమాలిన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉండే సమస్తాన్నీ సృష్టించిన జీవంగల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. 16 ఆయన గతించిన కాలాల్లో మనుషులందరినీ తమ సొంత మార్గాల్లో నడవనిచ్చాడు. 17 అయినా ఆయన మేలు చేస్తూ ఆకాశం నుండి మీకు వర్షాన్నీ, ఫలవంతమైన రుతువులనూ దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతూ, తన గురించిన సాక్ష్యం నిలిపి ఉంచాడు.”

  15. 14 మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనకు విధేయత చూపి ఆయనను సేవించి, ఆయన ఆజ్ఞలకు లోబడి, మీరూ, మిమ్మల్ని పాలించే మీ రాజూ మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే మీకు మేలు, క్షేమం కలుగుతాయి. 15 అలా కాక, యెహోవా మాట వినకుండా ఆయన ఆజ్ఞలకు లోబడకపోతే యెహోవా కృప మీ పూర్వీకులకు వ్యతిరేకంగా ఉన్నట్టు మీ పట్ల కూడా విరోధంగా ఉంటుంది.

    16 మీరు నిలబడి చూస్తూ ఉండగానే యెహోవా జరిగించే ఈ గొప్ప పనులను చూడండి. 17 ఇది గోదుమ పంట కోసే కాలం గదా. మీ కోసం రాజును నియమించమని కోరుకోవడం ద్వారా యెహోవా దృష్టిలో మీరు ఘోరమైన తప్పిదం చేశారని మీరు గ్రహించి తెలుసుకొనేలా యెహోవా ఉరుములు, వర్షం పంపాలని నేను ఆయనను వేడుకొంటున్నాను.” 18 సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములు, వర్షం పంపించగా ప్రజలంతా యెహోవాకు, సమూయేలుకు అమితంగా భయపడ్డారు.

    19 వారు సమూయేలుతో ఇలా అన్నారు. “రాజు కావాలని మేము అడగడం ద్వారా మా పాపాలన్నిటి కంటే ఎక్కువ పాపం చేశాం. అందువల్ల మేమంతా చనిపోకుండేలా దీనులమైన మా కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యి.”

  16. 1 మనం యెహోవా దగ్గరికి తిరిగి వెళ్దాం రండి.

    ఆయన మనలను చీల్చివేశాడు.

    ఆయనే మనలను స్వస్థపరుస్తాడు.

    ఆయన మనలను గాయపరిచాడు.

    ఆయనే మనకు కట్లు కడతాడు.

    2 రెండు రోజుల తరువాత ఆయన మనలను బ్రతికిస్తాడు.

    మనం ఆయన సముఖంలో బ్రతికేలా,

    మూడవ రోజున ఆయన మనలను తిరిగి లేపుతాడు.

    3 యెహోవాను తెలుసుకుందాం రండి.

    యెహోవాను తెలుసుకోడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం. ఆయన్ని అనుసరించుదాము రండి.

    పొద్దు పొడవడం ఎంత కచ్చితమో ఆయన రావడం అంత కచ్చితం.

    వర్షం చినుకుల్లాగా భూమిని తడిపే తొలకరి వర్షంలాగా ఆయన మన దగ్గరికి వస్తాడు.

  17. 1 కడవరి వాన కాలంలో వర్షం దయచేయమని యెహోవాను వేడుకోండి. ఆకాశంలో మెరుపులు పుట్టేలా చేసేవాడు యెహోవాయే. ఆయన ప్రతి ఒక్కరి పొలంలో పంటలు పెరిగేలా సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడు.

  18. 6 నువ్వు భూమి మీద పడమని మంచుకు, వర్షానికి, జడివానకు ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు.

    7 మనుషులందరూ ఆయన సృష్టికార్యాన్ని తెలుసుకునేలా ఆయన ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడు.

  19. 1 నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి.

    చాలా రోజులకు మళ్ళీ అది నీకు దొరుకుతుంది.

    2 దాన్ని ఏడు, ఎనిమిది మందితో పంచుకో.

    ఎందుకంటే భూమి మీద ఏ విపత్తులు వస్తున్నాయో నీకు తెలియదు.

    3 మబ్బుల నిండా నీరుంటే అవి భూమి మీద వాన కురిపించి ఖాళీ అయిపోతాయి.

    ఒక చెట్టు దక్షిణం వైపుకు పడినా ఉత్తరం వైపుకు పడినా అది పడిన చోటే ఉంటుంది.

    4 గాలిని లక్ష్యపెట్టేవాడు విత్తనాలు చల్లడు.

    మబ్బులను చూస్తూ ఉండేవాడు పంట కోయడు.

    5 స్త్రీ గర్భంలో పసికందు ఎముకలు ఎలా ఏర్పడతాయో,

    గాలి ఎక్కడ నుంచి వస్తుందో నీవెలా గ్రహించలేవో

    సమస్తాన్నీ సృష్టించిన దేవుని పనిని నువ్వు గ్రహించలేవు.

    6 ఉదయాన విత్తనం నాటు.

    సాయంత్రం వరకూ అవసరమైనంత మట్టుకు నీ చేతులతో పని చెయ్యి.

    ఏవి ఫలిస్తాయో, ఉదయమా, సాయంత్రమా లేక రెండూ ఒకేలా బాగుంటాయో నీకు తెలియదు.

  20. 16 యెరూషలేము మీదికి వచ్చిన ఇతర దేశాల ప్రజల్లో నాశనం కాకుండా మిగిలిన వారందరూ సేనల ప్రభువు యెహోవా అనే రాజుకు మొక్కుబడులు చెల్లించడానికీ, పర్ణశాల పండగ ఆచరించడానికీ ఏటేటా యెరూషలేముకు వస్తారు.

    17 లోకంలో ఉన్న అన్య జాతుల ప్రజల్లో ఎవరైనా సేనల ప్రభువు యెహోవా అనే రాజుకు మొక్కుబడులు చెల్లించడానికి యెరూషలేముకు రాని పక్షంలో వారి ప్రాంతాల్లో వాన కురవదు. 18 ఐగుప్తీయుల కుటుంబాలవారు బయలు దేరకుండా, రాకుండా ఉన్నట్టయితే వారికి వాన కురవకుండా పోతుంది. పర్ణశాల పండగ ఆచరించడానికి రాని ఇతర దేశాల ప్రజలను యెహోవా తాను నియమించిన తెగుళ్ళతో హింసిస్తాడు. 19 ఐగుప్తీయులకు, పర్ణశాల పండగ ఆచరించడానికి రాని ఇతర దేశాల ప్రజలందరికీ సంభవించబోయే శిక్ష ఇదే.

  21. 22 ఇతర రాజ్యాలు పెట్టుకున్న విగ్రహాలు ఆకాశం నుంచి వాన కురిపిస్తాయా? మా యెహోవా దేవా, ఇలా చేసేది నువ్వే గదా! ఇవన్నీ నువ్వే చేస్తున్నావు, నీ కోసమే మేము ఆశాభావంతో ఉన్నాము.

  22. 15 రాజుల ముఖకాంతి వలన జీవం కలుగుతుంది. అతని అనుగ్రహం వసంతకాలంలో వాన కురిసే మేఘం లాంటిది.

  23. 4 ఎందుకంటే, ఇంకా ఏడు రోజుల్లో నేను, నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమిమీద వర్షం కురిపించి, నేను చేసిన జీవం ఉన్న ప్రతి దాన్ని నాశనం చేస్తాను” అని నోవహుతో చెప్పాడు. 5 తనకు యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నోవహు అంతా చేశాడు.

  24. 1 గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామం వాడైన ఏలీయా అహాబుతో “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రాణం తోడు, నేను ఆయన ఎదుట నిలబడి చెబుతున్నాను. నేను మళ్ళీ చెప్పే వరకూ, రాబోయే కొన్నేళ్ళు మంచు గానీ వాన గానీ పడదు” అన్నాడు.

  25. 24 వారు “రండి, మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు చూపుదాం. తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని వాటి కాలంలో కురిపించేవాడు ఆయనే కదా.

    నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను మనకు వచ్చేలా చేసేవాడు ఆయనే కదా” అని తమ మనస్సులో అనుకోరు.

  26. 22 తెగులు, మరణం పంపి అతని మీదా అతని సైన్యం మీదా అతనితో ఉన్న జనాల మీదా భీకరమైన వర్షాన్నీ పెద్ద వడగండ్లనూ అగ్నిగంధకాలనూ కురిపించి అతనితో వాదిస్తాను.

  27. 4 దేవుడైన యెహోవా భూమిని ఆకాశాలను చేసినప్పుడు, ఆకాశాల సంగతి, భూమి సంగతి ఈ విధంగా ఉన్నాయి, 5 భూమి మీద అంతకుముందు ఆరుబయట ఏ పొదలూ లేవు, ఏ చెట్లూ మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించ లేదు. నేలను సేద్యం చెయ్యడానికి ఏ మనిషీ లేడు. 6 కాని, భూమిలోనుంచి నీటి ప్రవాహాలు పొంగి నేలంతా తడిపేది గనక భూతలం అంతటా నీళ్ళు ఉండేవి.

  28. 2 నా ఉపదేశం వానలా కురుస్తుంది.

    నా మాటలు మంచు బిందువుల్లా,

    లేతగడ్డిపై పడే చినుకుల్లా,

    పచ్చికపై కురిసే చిరుజల్లులా,

    మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి.

  29. 24 ఆయన కార్యాలను కీర్తించు. మనుషులు వాటిని గురించే పాడారు.

    25 మనుష్యులంతా వాటిని చూశారు. అయితే వారు దూరంగా నిలిచి ఆ కార్యాలను చూశారు.

    26 ఆలోచించు, దేవుడు గొప్పవాడు. మనం ఆయనను సరిగా అర్థం చేసుకోలేము. ఆయన సంవత్సరాలను ఎవరూ లెక్కబెట్టలేరు.

    27 ఆయన నీటిబిందువులను తెస్తాడు. తన మంచును వానచినుకుల్లాగా మార్చి కురిపిస్తాడు.

    28 మేఘాలు వాటిని కుమ్మరిస్తాయి. మనుషుల మీదికి అవి జడివానగా కురుస్తాయి.

    29 నిజంగా మేఘాలు ముసిరే విధానం ఎవరైనా అర్థం చేసుకోగలరా? ఆయన మందిరం లోనుండి ఉరుములు వచ్చేదెలాగో ఎవరికైనా తెలుసా?

    30 చూడు, ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేస్తాడు. సముద్రాన్ని చీకటితో ఆయన కప్పుతాడు.

    31 ఈ విధంగా ఆయన మనుషులకు ఆహారం పెడతాడు. ఆయన ఆహారాన్ని పుష్కలంగా ఇస్తాడు.

    32 తన చేతుల్లో ఉరుములను పట్టుకుంటాడు. గురికి తగలాలని ఆయన వాటికి ఆజ్ఞాపిస్తాడు.

    33 వాటి గర్జన ముంచుకు వస్తున్న తుఫానును మనుషులకు తెలుపుతుంది. పశువులకు సైతం దాని రాకడ తెలుసు.

  30. 7 కాబట్టి సోదరులారా, ప్రభువు రాక వరకూ సహనంతో ఉండండి. రైతు తొలకరి వాన, కడవరి వాన కురిసే దాకా విలువైన పంట కోసం ఓపికతో ఎదురు చూస్తూ వేచి ఉంటాడు కదా. 8 ప్రభువు రాక దగ్గర పడింది. మీరు కూడా ఓపికగా ఉండండి. మీ హృదయాలను దిటవు చేసుకోండి.

    9 సోదరులారా, ఒకడి మీద ఒకడు సణుక్కోకండి, అప్పుడు మీ మీదికి తీర్పు రాదు. ఇదుగో న్యాయాధిపతి వాకిట్లోకి వచ్చేశాడు. 10 నా సోదరులారా, ప్రభువు నామంలో బోధించిన ప్రవక్తలు ఎదుర్కొన్న హింసలను, ఓపికను ఆదర్శంగా తీసుకోండి. 11 చూడండి, సహించి నిలబడిన వారిని ధన్యులని భావిస్తాము గదా? మీరు యోబు సహనాన్ని గూర్చి విన్నారు. యోబు విషయంలో దేవుని ఉద్దేశాలను తెలిసిన మీరు ఆయన ఎంతో జాలి, కరుణ ఉన్నవాడని గ్రహించారు.

  31. 10 ఏడు రోజుల తరువాత ఆ ప్రళయజలాలు భూమిమీదికి వచ్చాయి.

    11 నోవహు వయస్సు ఆరువందల సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున, మహా అగాధజలాల ఊటలన్నీ తెరుచుకున్నాయి. ఆకాశపు కిటికీలు తెరుచుకున్నాయి. 12 నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమి మీద వర్షం కురిసింది.

  32. 6 భూమి పైన, ఆకాశంలో, సముద్రాల్లో, అగాధ సముద్రాల్లో ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు.

    7 భూమి అంచుల నుంచి ఆయన మేఘాలను రప్పిస్తాడు. వర్షంతో బాటు ఆకాశంలో మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగిలోనుంచి గాలిని బయటికి తెస్తాడు.

  33. 7 కోతకాలానికి మూడు నెలలు ముందే

    వానలేకుండా చేశాను.

    ఒక పట్టణం మీద వాన కురిపించి

    మరొక పట్టణం మీద కురిపించలేదు.

    ఒక చోట వాన పడింది,

    వాన పడని పొలం ఎండిపోయింది.

  34. 1 చాలా రోజులు గడిచిన తరువాత కరువు కాలంలో మూడో సంవత్సరం యెహోవా ఏలీయాతో “నేను భూమ్మీద వాన కురిపిస్తాను. నీవు వెళ్లి అహాబుకు కనబడు” అన్నాడు. 2 అహాబును కలుసుకోడానికి ఏలీయా వెళ్ళాడు. షోమ్రోనులో కరువు తీవ్రంగా ఉంది.

  35. 23 వాళ్ళు తమ కడుపు నింపుకునే సమయంలో దేవుడు వాళ్ళ మీద తన కోపాగ్ని కురిపిస్తాడు. వాళ్ళు తినే సమయంలోనే అది కురుస్తుంది.

  36. 23 ఉత్తర వాయువు వాన తెస్తుంది. అలానే గుట్టు బయట పెట్టేవాడి ముఖం గంభీరంగా ఉంటుంది.

  37. 7 ఇది ఎలాగంటే, నేల తరచుగా తనపై కురిసే వాన నీటిలో తడిసి తనను దున్నిన రైతులకు ప్రయోజనకరమైన పంటలనిస్తూ దేవుని దీవెనలు పొందుతుంది.

  38. 12 దేవుడు “నాకు, మీకు, మీతోపాటు ఉన్న జీవరాసులన్నిటికీ మధ్య నేను తరతరాలకు చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే, 13 మేఘంలో నా ధనుస్సు ఉంచాను. అది నాకు, భూమికి, మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది.

    14 భూమిమీదికి నేను మేఘాన్ని తీసుకొచ్చినప్పుడు మేఘంలో ఆ ధనుస్సు కనబడుతుంది. 15 అప్పుడు నాకు, మీకు, జీవరాసులన్నిటికీ మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకొంటాను గనుక సర్వశరీరులను నాశనం చెయ్యడానికి ఇక ఎన్నడూ నీళ్ళు జలప్రళయంగా రావు.

    16 ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూసి దేవునికీ, భూమి మీద ఉన్న సర్వశరీరుల్లో ప్రాణం ఉన్న ప్రతి దానికీ మధ్య ఉన్న శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకొంటాను” అన్నాడు. 17 దేవుడు “నాకు, భూమిమీద ఉన్న సర్వశరీరులకు మధ్య నేను స్థిరం చేసిన నిబంధనకు గుర్తు ఇదే” అని నోవహుతో చెప్పాడు.

  39. 27 అప్పుడు ఒక ఆకారాన్ని నేను చూశాను. అతని నడుము పైగా అగ్నితో మండుతున్న లోహంలా నాకు కనిపించింది. అతని నడుము కింద చుట్టూ అగ్నిలా, ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది. 28 అది వర్షం కురిసినప్పుడు మబ్బుల్లో కనిపించే మేఘధనస్సులా, దాని చుట్టూ ఉండే ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది. అది యెహోవా మహిమలా కనిపించింది. అది చూసి నేను సాగిలపడ్డాను. అప్పుడు ఒక స్వరం నాతో మాట్లాడటం నేను విన్నాను.

  40. 26 నేను వాళ్ళను దీవిస్తాను. నా పర్వతం చుట్టూ ఉన్న స్థలాలను దీవిస్తాను. సరైన కాలాల్లో వానలు కురిపిస్తాను. దీవెన జల్లులివే. 27 పళ్ళ చెట్లు కాయలు కాస్తాయి. భూమి పంట ఇస్తుంది. నా గొర్రెలు వాటి ప్రాంతాల్లో క్షేమంగా ఉంటాయి. నేను వారి కాడికట్లను తెంపి వారిని బందీలుగా చేసినవారి చేతిలో నుంచి వారిని విడిపించేటప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.

  41. 54 తరవాత ఆయన జనసమూహాలతో ఇలా అన్నాడు, “మీరు పడమర నుండి మబ్బు పైకి రావడం చూసేటప్పుడు వాన వస్తుందని వెంటనే చెప్పేస్తారు. అలాగే జరుగుతుంది. 55 దక్షిణపు గాలి వీయడం చూసేటప్పుడు వడగాలి కొడుతుందని చెబుతారు. అలాగే జరుగుతుంది. 56 కపట భక్తులారా, మీరు భూమి, ఆకాశాల ధోరణులను గుర్తిస్తారు గానీ ఇప్పటి కాలం తీరు గుర్తించలేక పోతున్నారు.

  42. 6 ఆ మహిమ పగలు ఎండకు నీడగానూ, గాలివానకు ఆశ్రయంగానూ, పైకప్పుగానూ ఉంటుంది.

  43. 1 ఎండాకాలానికి మంచు ఎలానో కోతకాలానికి వర్షమెలానో అలానే బుద్ధి లేనివాడికి గౌరవం తగినది కాదు.

  44. 3 పేదలను బాధించే పేదవాడు ఆహారపదార్థాలను కొట్టుకుపోయేలా చేసే వానతో సమానం.

  45. 8 అంతరిక్షమా, పైనుండి కురిపించు. ఆకాశాలు నీతిన్యాయలు వర్షించనీ.

    భూమి విచ్చుకుని రక్షణ మొలకెత్తేలా నీతిని దానితో బాటు మొలిచేలా చెయ్యనీ. యెహోవానైన నేను దాన్ని కలిగించాను.

  46. 12 మీ కోసం నీతి విత్తనం వేయండి.

    నిబంధన విశ్వాస్యత అనే కోత కోయండి.

    ఇదివరకెప్పుడూ దున్నని బీడుభూమి దున్నండి.

    ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతివర్షం కురిపించే వరకూ,

    యెహోవాను వెదకడానికి ఇదే అదను.

  47. 33 మోషే ఫరోతో మాట్లాడి ఆ పట్టణం నుండి బయటకు వెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు వాన ఆగిపోయింది. ఉరుములు, వడగళ్ళు నిలిచిపోయాయి.

    34 అయితే వర్షం, వడగళ్ళు, ఉరుములు ఆగిపోవడం చూసిన ఫరో, అతని సేవకులు ఇంకా పాపం చేస్తూ తమ హృదయాలను కఠినం చేసుకున్నారు.

  48. 26 వారు నీ దృష్టికి పాపం చేయడం వలన ఆకాశం మూసుకు పోయి వర్షం కురవనప్పుడు, వారు ఈ స్థలం లో ప్రార్థన చేసి నీ నామాన్ని ఒప్పుకుని, నువ్వు కలిగించిన బాధలో వారు తమ పాపాలను విడిచిపెట్టి తిరిగితే 27 పరలోకంలో ఉన్న నువ్వు ఆలకించి, నీ సేవకులు, నీ ప్రజలు అయిన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారు నడవాల్సిన మంచి మార్గం వారికి బోధించి, నువ్వు నీ ప్రజలకి స్వాస్థ్యంగా ఇచ్చిన నీ దేశంలో వర్షం కురిపించు.

  49. 11 యెహోవా మీకిస్తానని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా మీ గర్భఫలాన్నీ మీ పశువులనూ మీ పంటనూ సమృద్ధిగా వర్ధిల్లజేస్తాడు. 12 యెహోవా మీ దేశం మీద దాని కాలంలో వాన కురిపించడానికీ మీరు చేసే పనంతటినీ ఆశీర్వదించడానికీ ఆకాశ గిడ్డంగులను తెరుస్తాడు. మీరు అనేక రాజ్యాలకు అప్పిస్తారు కాని అప్పు చెయ్యరు.

  50. 22 యెహోవా “నీ చెయ్యి ఆకాశం వైపు చాపు. ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల మీదా, జంతువుల మీదా పంటలన్నిటి మీదా వడగళ్లు కురుస్తాయి” అని మోషేతో చెప్పాడు.

    23 మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములు వడగండ్లు కురిపించాడు. భూమి మీద పిడుగులు పడుతున్నాయి. ఐగుప్తు దేశం అంతటా యెహోవా వడగళ్ళు కురిపించాడు. 24 ఆ విధంగా వడగళ్ళు, వడగళ్ళతో కూడిన పిడుగులు ఎంతో బాధ కలిగించాయి. ఐగుప్తు దేశం ఏర్పడినది మొదలు ఇలాంటిది సంభవించ లేదు. 25 ఐగుప్తు దేశమంతటా కురిసిన ఆ వడగళ్ళు మనుష్యులను, జంతువులను, బయట ఉండిపోయిన సమస్తాన్నీ నాశనం చేశాయి. పొలంలో ఉన్న పంట అంతా నాశనం అయ్యింది. చెట్లన్నీ విరిగిపోయాయి. 26 అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషెను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు.

  51. 6 ఎవరూ దాన్ని బాగు చెయ్యరు. పారతో త్రవ్వరు. దానిలో గచ్చపొదలు ముళ్ళ చెట్లు పెరుగుతాయి.

    దాని మీద కురవవద్దని మేఘాలకు ఆజ్ఞ ఇస్తాను.

  52. 6 దుర్మార్గుల మీద ఆయన రగులుతున్న నిప్పు కణికెలు, అగ్నిగంధకం కురిపిస్తాడు. ఆయన గిన్నెలోని వడగాలి వాళ్ళ పానీయభాగం అవుతుంది.

  53. 14 ఏమీ ఇవ్వకుండానే ఇచ్చానని సొంత డబ్బా వాయించుకునే వాడు వర్షం లేని మబ్బుతో గాలితో సమానం.

  54. 12 ఆయన తన బలంతో భూమిని సృష్టించాడు. తన జ్ఞానంతో ప్రపంచాన్ని స్థాపించాడు, తన తెలివితో ఆకాశాన్ని చక్కగా పరిచాడు.

    13 ఆయన స్వరం ఆకాశమండలంలో నీటి గర్జనలాగా వినిపిస్తుంది. భూదిగంతాల్లో నుండి ఆయన ఆవిరి మేఘాలు వచ్చేలా చేస్తాడు. వర్షంతో బాటు ఆయన మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగుల నుండి గాలిని పంపిస్తాడు.

  55. 18 ఇదిగో విను, రేపు ఈ పాటికి నేను తీవ్రమైన బాధ కలిగించే వడగళ్ళు కురిపిస్తాను. ఐగుప్తు సామ్రాజ్యం ఏర్పడినది మొదలు ఇప్పటి వరకూ అలాంటి వడగళ్ళు కురియలేదు.

  56. 12 వీరు సిగ్గు లేకుండా విందుల్లో మీతో భోజనం చేస్తూ, తమను తాము బాగా పోషించుకుంటూ, నీటిలో దాగిన బండల్లా ఉన్నారు. వీరు గాలిలో ఎగిరే నీళ్ళులేని మేఘాలు. ఆకు రాలే కాలంలో పళ్ళు లేకుండా రెండు సార్లు చచ్చి వేళ్ళతో సహా పెళ్ళగించిన చెట్లలాంటివారు. 13 సముద్రంలోని అలల నురగలాగా వారి సొంత అవమానం ఉంటుంది. వీరు దిక్కు తెలియక తిరుగుతున్న చుక్కల్లా ఉన్నారు. శాశ్వత గాడాంధకారం వారికోసం సిద్ధంగా ఉంది.

  57. 6 తాము ప్రవచించే రోజుల్లో వాన కురవకుండా ఆకాశాన్ని మూసి ఉంచే అధికారం వారికి ఉంటుంది. అలాగే తాము తలచుకున్నపుడల్లా నీటిని రక్తంగా చేయడానికీ అన్ని రకాల పీడలతో భూమిని వేధించడానికీ వారికి అధికారం ఉంది.

  58. 10 అయ్యా కూతురు రిస్పా గోనెపట్ట తీసుకు కొండపైన పరచుకుని కోతకాలం ఆరంభం నుండి మృతదేహాలపై ఆకాశం నుండి వానలు కురిసే దాకా అక్కడే ఉండిపోయి, పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండా, రాత్రులు అడవి జంతువులు వాటి దగ్గరికి రాకుండా వాటిని కాపలా కాస్తూ ఉన్నది.

  59. 12 అప్పుడు యెహోవా రాత్రి వేళ సొలొమోనుకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు “నేను నీ విన్నపాన్ని అంగీకరించి ఈ స్థలాన్ని నాకు బలులు అర్పించే మందిరంగా కోరుకున్నాను. 13 నేను ఆకాశాన్ని మూసివేసి వాన కురవకుండా చేసినప్పుడూ, దేశాన్ని నాశనం చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడూ, నా ప్రజల మీదికి తెగులు రప్పించినప్పుడూ, 14 నా పేరు పెట్టుకున్న నా ప్రజలు తమని తాము తగ్గించుకుని, ప్రార్థన చేసి, నన్ను వెతికి, తమ దుష్టత్వాన్ని విడిచి నన్ను వేడుకుంటే, నేను పరలోకం నుండి వారి ప్రార్థన విని, వారి పాపాన్ని క్షమించి, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను.

  60. 12 అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు.

    దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు.

  61. 2 వినండి! శక్తిశాలీ, బలశాలీ అయిన ఒకడు ప్రభువుకి ఉన్నాడు. అతడు వడగళ్ళ లాంటి వాడు.

    అతడు వినాశనకారి అయిన తుఫాను వంటివాడు. ముంచెత్తే బలమైన జడివాన వంటివాడు. ఆయన తన చేతితో భూమిని కొడతాడు.