37 Bible Verses About God's Beautiful Creation

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About God's Beautiful Creation
  1. 1 ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. 2 భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.

    3 దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. 4 ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు. 5 దేవుడు వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది, మొదటి రోజు.

    6 దేవుడు “మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగు గాక. అది నీళ్ళనుండి నీళ్ళను వేరు చేయు గాక” అన్నాడు. 7 దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి, దాని పైన ఉన్న జలాలను, కింద ఉన్న జలాలను వేరు చేసాడు. అది అలాగే జరిగింది. 8 దేవుడు ఆ విశాల ప్రదేశానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది, రెండవ రోజు.

    9 దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది. 10 దేవుడు ఆరిన నేలకు “భూమి” అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది.

    11 దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 12 వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 13 రాత్రి అయింది, ఉదయం వచ్చింది-మూడవ రోజు.

    14 దేవుడు “రాత్రి నుంచి పగలును వేరు చెయ్యడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి. 15 భూమికి వెలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి” అన్నాడు. అలాగే జరిగింది.

    16 దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు. 17 భూమికి వెలుగు ఇవ్వడానికీ, 18 పగటినీ రాత్రినీ పాలించడానికీ, వెలుగునూ చీకటినీ వేరు చెయ్యడానికీ, దేవుడు ఆకాశ విశాలంలో వాటిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 19 రాత్రి అయింది. ఉదయం వచ్చింది-నాలుగో రోజు.

    20 దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు. 21 దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.

    22 దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు. 23 రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఐదో రోజు.

    24 దేవుడు “వాటి వాటి జాతుల ప్రకారం ప్రాణం గలవాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 25 దేవుడు, వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాటి వాటి జాతుల ప్రకారం పశువులనూ, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.

    26 దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27 దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.

    28 దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు. 29 దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.

    30 భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది. 31 దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.

  2. ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. గిత్తీత్ రాగం.

    1 యెహోవా మా ప్రభూ, పై ఆకాశాలలో నీ మహిమను చూపించేవాడా, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!

    2 శత్రువునూ, ప్రతీకారం చేసేవాణ్ణీ నోరు మూయించడానికీ, నీ విరోధుల కారణంగా, పసికందుల, చంటి పిల్లల నోటిలో నువ్వు స్తుతిని సృష్టించావు.

    3 నీ చేతి వేళ్ళు తయారు చేసిన నీ ఆకాశాలనూ, వాటి తావులలో నీవుంచిన చంద్రనక్షత్రాలనూ నేను చూసినప్పుడు,

    4 నువ్వు పట్టించుకోవడానికి మానవజాతి ఏ పాటిది? నువ్వు మానవాళి పట్ల శ్రద్ధ చూపడానికి వారు ఎంతటివాళ్ళు?

    5 అయినా, నువ్వు వాళ్ళను స్వర్గలోక ప్రాణులకన్నా కొంచెం మాత్రమే తక్కువగా చేశావు. వాళ్లకు మహిమా ప్రభావాల కిరీటం పెట్టావు.

    6 నీ చేతిపనుల మీద అతనికి పరిపాలన ఇచ్చావు. అతడి పాదాల కింద సమస్తమును ఉంచావు.

    7 గొర్రెలను, ఎడ్లను, అడవి మృగాలను సైతం,

    8 ఆకాశ పక్షులను, సముద్ర ప్రాణులను, సముద్ర ప్రవాహాల్లో తిరిగే వాటిని నువ్వు అతని పాదాల కింద ఉంచావు.

    9 యెహోవా మా ప్రభూ, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!

  3. ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన.

    1 ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. గగనం ఆయన చేతి పనిని విశదపరుస్తున్నది!

    2 రోజు వెంబడి రోజు అది మాట్లాడుతూ ఉంది. రాత్రి వెంబడి రాత్రి జ్ఞానం కనపరుస్తూ ఉంది.

    3 వాటికి భాష గాని మాటలు గాని లేవు. వాటి స్వరం వినిపించదు.

    4 అయినా వాటి మాటలు భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి, వాటి ఉపదేశం భూమి అంచుల వరకూ వెళ్ళింది. వాటిలో ఆయన సూర్యుడికి గుడారం వేశాడు.

    5 సూర్యుడు తన విడిదిలోనుంచి బయటకు వస్తున్న పెళ్లి కొడుకులాగా, పందెంలో పరిగెత్తడానికి వేగిరపడే దృఢకాయునిలాగా ఉన్నాడు.

    6 ఆకాశంలో సూర్యుడు ఈ దిగంశాన ఉదయించి ఆ దిక్కుకు దాటతాడు. దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.

  4. 18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది. 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

    21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

  5. దావీదు కీర్తన.

    1 భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే.

    2 ఎందుకంటే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేశాడు. నదుల మీద దాన్ని ఏర్పరిచాడు.

  6. 1 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవా, నా దేవా, నీవు మహా ఘనత వహించిన వాడివి. నీవు మహాత్మ్యాన్ని, ప్రభావాన్ని ధరించుకున్నావు.

    2 ఉత్తరీయం లాగా నీవు వెలుగును కప్పుకున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలాన్ని నీవు పరిచావు.

    3 జలాల్లో ఆయన తన గదుల దూలాలు వేశాడు. మేఘాలను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కలమీద ప్రయాణిస్తున్నాడు.

    4 వాయువులను తనకు దూతలుగా అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా యెహోవా చేసుకున్నాడు.

    5 భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు.

    6 దాని మీద అగాధ జలాలను నీవు వస్త్రం లాగా కప్పావు. కొండలకు పైగా నీళ్లు నిలిచాయి.

    7 నీవు గద్దించగానే అవి పారిపోయాయి. నీ ఉరుము ధ్వని విని అవి త్వరగా పారిపోయాయి.

    8 నీవు వాటికి నియమించిన చోటికి పోవడానికి అవి పర్వతాలెక్కాయి. పల్లాలకు దిగాయి.

    9 అవి మరలి వచ్చి భూమిని కప్పకుండేలా దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించావు.

    10 ఆయన కొండలోయల్లో నీటిఊటలు పుట్టిస్తాడు. అవి కొండల్లో ప్రవహిస్తాయి.

    11 అవి అడవి జంతువులన్నిటికీ దాహం తీరుస్తాయి. వాటివలన అడవి గాడిదలు సేదదీరుతాయి.

    12 వాటి ఒడ్డున ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి. కొమ్మల మధ్య అవి కిలకిలారావాలు చేస్తాయి.

    13 తన మేడ గదుల్లోనుండి ఆయన కొండలకు జలధారలనిస్తాడు. నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుతున్నది.

    14 పశువులకు గడ్డిని, మనుషుల వాడకానికి కాయగూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు

    15 అందువల్ల భూమిలోనుండి ఆహారాన్నీ మనుషుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసాన్నీ వారి ముఖాలకు మెరుపునిచ్చే తైలాన్నీ మనుషుల హృదయాన్ని బలపరిచే ఆహారాన్నీ ఆయన మొలకెత్తిస్తున్నాడు.

    16 యెహోవా వృక్షాలు ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు నీటి వసతి గలిగి ఉన్నాయి.

    17 అక్కడ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి. అక్కడ సరళవృక్షాలపై కొంగలు నివాసముంటున్నాయి.

    18 ఎత్తయిన కొండలు కొండమేకలకు ఉనికిపట్లు. బండరాళ్ళు కుందేళ్లకు ఆశ్రయస్థానాలు.

    19 ఋతువులను సూచించడానికి ఆయన చంద్రుణ్ణి నియమించాడు. సూర్యుడికి అతడు అస్తమించవలసిన కాలం తెలుసు.

    20 నీవు చీకటి కమ్మ జేయగా రాత్రి అవుతున్నది. అప్పుడు అడవిజంతువులన్నీ సంచరిస్తున్నాయి.

    21 సింహం పిల్లలు వేట కోసం గర్జిస్తున్నాయి. తమ ఆహారాన్ని దేవుని చేతిలోనుండి తీసుకోడానికి చూస్తున్నాయి.

    22 సూర్యుడు ఉదయించగానే అవి మరలిపోయి తమ గుహల్లో పడుకుంటాయి.

    23 సాయంకాలం దాకా పాటుపడి తమ పనులు జరుపుకోడానికి మనుషులు బయలుదేరుతారు.

    24 యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది.

    25 అదిగో విశాలమైన మహాసముద్రం. అందులో లెక్కలేనన్ని జలచరాలు, చిన్నవి పెద్దవి జీవరాసులు ఉన్నాయి.

    26 అందులో ఓడలు నడుస్తున్నాయి. నీవు సృష్టించిన మొసళ్ళు దానిలో జలకాలాడుతూ ఉన్నాయి.

    27 తగిన కాలంలో నీవు వాటికి ఆహారమిస్తావని ఇవన్నీ నీ దయకోసం కనిపెడుతున్నాయి.

    28 నీవు వాటికి అందిస్తే అవి కూర్చుకుంటాయి. నీవు గుప్పిలి విప్పితే అవి మంచివాటిని తిని తృప్తి చెందుతాయి.

    29 నీవు ముఖం దాచుకుంటే అవి కలత చెందుతాయి. నీవు వాటి ఊపిరి ఉపసంహరిస్తే అవి ప్రాణం విడిచి మట్టిపాలవుతాయి.

    30 నీవు నీ ఊపిరి విడిస్తే అవి ఉనికిలోకి వస్తాయి. ఆ విధంగా నీవు మైదానాలను నూతనపరుస్తున్నావు.

    31 యెహోవా మహిమ నిత్యం ఉండుగాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించు గాక.

    32 ఆయన భూమిని చూడగా అది వణికి పోతుంది. ఆయన పర్వతాలను ముట్టగా అవి పొగరాజుకుంటాయి.

    33 నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను.

    34 ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను.

    35 పాపులు భూమిపై లేకుండా పోవాలి. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవాను స్తుతించండి.

  7. 24 విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు. 25 ఆయనే అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు.

    26 ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు. 27 అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే,

    28 మనం ఆయనలో బతుకుతున్నాం,

    ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి.

    ‘మనమాయన సంతానం,’

    అని మీ కవులు కూడా కొందరు చెప్పారు.

    29 కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.

  8. 7 అయితే, మృగాలను అడగండి, అవి మీకు బోధ చేస్తాయి. ఆకాశంలో పక్షులను అడగండి, అవి మీకు చెబుతాయి.

    8 భూమి గురించి ఆలోచిస్తే అది నీకు బోధిస్తుంది. సముద్రంలో ఉండే చేపలు కూడా నీకు ఉపదేశం చేస్తాయి.

    9 యెహోవా వీటన్నిటినీ తన చేతితో సృష్టించాడని గ్రహించలేని వాడెవడు?

    10 జీవం ఉన్న సమస్త ప్రాణులు, సమస్త మానవకోటి ఆత్మలు ఆయన ఆధీనంలో ఉన్నాయి.

  9. 1 ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే. 2 ఆ వాక్కు ప్రారంభంలో దేవుడితో ఉన్నాడు.

    3 సృష్టి అంతా ఆ వాక్కు ద్వారానే కలిగింది. ఉనికిలో ఉన్న వాటిలో ఏదీ ఆయన లేకుండా కలగలేదు.

  10. 4 దేవుడైన యెహోవా భూమిని ఆకాశాలను చేసినప్పుడు, ఆకాశాల సంగతి, భూమి సంగతి ఈ విధంగా ఉన్నాయి, 5 భూమి మీద అంతకుముందు ఆరుబయట ఏ పొదలూ లేవు, ఏ చెట్లూ మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించ లేదు. నేలను సేద్యం చెయ్యడానికి ఏ మనిషీ లేడు. 6 కాని, భూమిలోనుంచి నీటి ప్రవాహాలు పొంగి నేలంతా తడిపేది గనక భూతలం అంతటా నీళ్ళు ఉండేవి.

    7 దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది. 8 దేవుడైన యెహోవా తూర్పువైపున ఏదెనులో ఒక తోట వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు.

    9 దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టునూ అక్కడ నేలలోనుంచి మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్నీ, ఏది మంచో, ఏది చెడో తెలిపే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు.

  11. 12 భూమినీ దానిపైనున్న మనుషులనూ సృష్టించింది నేనే. నా చేతులు ఆకాశాలను విశాలపరిచాయి. వాటిలోని సమస్తాన్నీ నా ఆజ్ఞతోనే నడిపిస్తాను.

  12. 11 “మా ప్రభూ, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి” అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు.

  13. 5 ఆయన నీతినీ న్యాయాన్నీ ప్రేమిస్తాడు. నిబంధన పట్ల యెహోవాకు ఉన్న విశ్వసనీయతతో లోకం నిండి ఉంది.

    6 యెహోవా తన నోటి మాట వల్ల ఆకాశాలను చేశాడు. తన నోటి శ్వాస చేత నక్షత్రాలను చేశాడు.

    7 ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూరుస్తాడు. మహా సముద్ర జలాలను గిడ్డంగిలో నిలవ చేస్తాడు.

    8 భూలోకం అంతా యెహోవాకు భయపడాలి. లోకంలో నివసించే వాళ్ళంతా యెహోవా పట్ల భయభీతులు కలిగి విస్మయం చెందాలి.

    9 ఆయన మాట పలికాడు. ఆ మాట ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించాడు. అది స్థిరంగా నిలిచింది.

  14. 3 యెహోవా గొప్ప దేవుడు. దేవుళ్ళందరికీ పైగా ఉన్న గొప్ప రాజు.

    4 భూమి అగాధస్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరాలు ఆయనవే.

    5 సముద్రం ఆయనది. ఆయనే దాన్ని చేశాడు. ఆయన చేతులు పొడి నేలను చేశాయి.

  15. 13 దేవా, నా లోపలి భాగాలను నువ్వే నిర్మించావు. నా తల్లి గర్భంలో నన్ను రూపొందించావు.

    14 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను తయారు చేసిన విధానం దిగ్భ్రమ కలిగించేది, అద్భుతమైనది. నా జీవితం నీకు బాగా తెలుసు.

    15 నేను రహస్యంగా తయారౌతున్నప్పుడు, నా స్వరూపం భూమి అగాధస్థలాల్లో విచిత్రంగా నిర్మితమౌతున్నప్పుడు నా శరీరమంతా నీకు తేట తెల్లమే.

    16 నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూశాయి. నాకు నియమితమైన రోజుల్లో ఒకటైనా గడవక ముందే నా రోజులన్నీ నీ గ్రంథంలో రాసి ఉన్నాయి.

  16. 19 దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. 20 ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి, 21 నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది. 22 ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు.

  17. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  18. ఆసాపు కీర్తన

    1 శక్తిశాలి, దేవుడు అయిన యెహోవా ఆదేశిస్తున్నాడు. పొద్దు పొడిచే దిశ నుండి పొద్దు గుంకే దిశ వరకూ ఉన్న ప్రజలందర్నీ రమ్మని పిలుస్తున్నాడు.

    2 పరిపూర్ణ సౌందర్యం అయిన సీయోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు.

    3 మన దేవుడు వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయనకు ముందుగా భీకర అగ్ని కబళించుకుంటూ వెళ్తుంది. ఆయన చుట్టూ ప్రచండ గాలులు వీస్తున్నాయి.

    4 తన ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయన ఆకాశాలనూ భూమినీ పిలుస్తున్నాడు.

    5 బలి అర్పణ ద్వారా నాతో నిబంధన చేసుకున్న నా విశ్వాస పాత్రులను నా దగ్గరకు సమకూర్చండి అని పిలుస్తున్నాడు.

    6 ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు తానే న్యాయాధిపతిగా ఉన్నాడు.

  19. 1 యెహోవాను స్తుతించండి. పరలోక నివాసులారా, యెహోవాను స్తుతించండి. ఉన్నత స్థలాల్లో నివసించేవాళ్ళంతా ఆయనను స్తుతించండి.

    2 ఆయన దూతలారా, మీరంతా ఆయనను స్తుతించండి. ఆయన సైన్య సమూహమా, మీరంతా ఆయనను స్తుతించండి.

    3 సూర్యడా, చంద్రుడా, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల్లారా మీరంతా ఆయనను స్తుతించండి.

    4 అంతరిక్షంలో ఉన్న నగరాల్లారా, ఆయనను స్తుతించండి. ఆకాశంపై ఉన్న జలాశయాల్లారా ఆయనను స్తుతించండి.

    5 అవన్నీ యెహోవా నామాన్ని స్తుతిస్తాయి గాక. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ ఏర్పడ్డాయి.

    6 ఆయన వాటికి శాశ్విత నివాస స్థానాలు ఏర్పాటు చేశాడు. ఆయన వాటికి శాసనాలు నియమించాడు. ప్రతిదీ వాటికి లోబడక తప్పదు.

    7 భూమి మీద సృష్టి అయిన ప్రతి వస్తువూ ఆయనను స్తుతించాలి. సముద్రంలో ఉన్న అగాధజలాల్లారా, యెహోవాను స్తుతించండి.

    8 అగ్నిపర్వతాలూ, వడగళ్ళూ, మంచూ, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫానూ, యెహోవాను స్తుతించండి.

    9 పర్వతాలూ, ఎన్నెన్నో కొండలూ, ఫలాలిచ్చే చెట్లూ, అన్ని దేవదారు వృక్షాలూ యెహోవాను స్తుతించండి.

    10 మృగాలూ, పశువులూ, నేల మీద పాకే జీవులూ, రెక్కలతో ఎగిరే పక్షులూ యెహోవాను స్తుతించండి.

    11 భూరాజులూ, సమస్త ప్రజల సమూహాలూ, భూమిపై ఉన్న అధిపతులూ, సమస్త న్యాయాధిపతులూ యెహోవాను స్తుతించండి.

    12 యువకులు, కన్యలు, వృద్ధులు, బాలబాలికలు అందరూ యెహోవా నామాన్ని స్తుతిస్తారు గాక.

    13 ఆయన నామం మాత్రమే మహోన్నతమైనది. ఆయన ప్రభావం భూమి కంటే, ఆకాశం కంటే ఉన్నతమైనది.

    14 ఆయన తన ప్రజలకు రెట్టింపు ఘనత కలిగించాడు. అది ఆయన భక్తులకు, ఆయన శరణు కోరిన ఇశ్రాయేలు ప్రజలకు గర్వకారణంగా ఉన్నది. యెహోవాను స్తుతించండి.

  20. 11 దేవుడు ప్రతి దానినీ దాని కాలానికి సరిపడినట్టుగా చేశాడు. ఆయన నిత్యమైన జ్ఞానాన్ని మానవుల హృదయాల్లో ఉంచాడు. దేవుని కార్యాలను మొదటి నుండి చివరి వరకూ పూర్తిగా గ్రహించడానికి అది చాలదు.

  21. 5 ‘నా గొప్ప బలంతో చాచిన చేతితో భూమిని చేశాను. భూమి మీద ఉన్న మట్టినీ జంతువులనూ నేనే చేశాను. వాటిని నా దృష్టిలో ఎవరు సరిగా ఉన్నారో వారికే ఇస్తాను.

  22. 28 బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి పని చేయవు, బట్టలు నేయవు. 29 అయినా నేనంటాను, తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సైతం వీటిలో ఒక్క దానికున్నంత అలంకారం లేదు. 30 ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!

    31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. 32 దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు.

  23. 29 రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు. 30 మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు. 31 కాబట్టి భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు.

  24. 7 ఉత్తర దిక్కున శూన్యమండలం మీద ఆకాశ విశాలాన్ని ఆయన పరిచాడు. శూన్యంపై భూమిని వేలాడదీశాడు.

    8 ఆయన తన కారు మేఘాల్లో నీళ్లను బంధించాడు. అయినా అవి పిగిలి పోవడం లేదు.

    9 దాని మీద మేఘాన్ని వ్యాపింపజేసి ఆయన తన సింహాసన కాంతిని కప్పి ఉంచాడు.

    10 వెలుగు చీకటుల మధ్య సరిహద్దుల దాకా ఆయన జలాలకు హద్దు నియమించాడు.

    11 ఆయన గద్దించగా ఆకాశ విశాల స్తంభాలు ఆశ్చర్యపడి అదిరిపోతాయి.

    12 తన బలం వలన ఆయన సముద్రాన్ని రేపుతాడు. తన వివేకం వలన రాహాబును నలగగొడతాడు.

    13 ఆయన ఊపిరి వదలగా ఆకాశ విశాలాలకు అందం వస్తుంది. ఆయన హస్తం పారిపోతున్న మహా సర్పాన్ని పొడిచింది.

    14 ఇవి ఆయన కార్యాల్లో స్వల్పమైనవి. ఆయన్ను గూర్చి మనకు వినబడుతున్నది ఎంతో మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే గదా. గర్జనలు చేసే ఆయన మహాబలం ఎంతో గ్రహించగలవాడెవడు?

  25. 11 ఆయన దట్టమైన మేఘాన్ని జలంతో నింపుతాడు. తన మెరుపుల మేఘాన్ని వ్యాపింపజేస్తాడు.

    12 ఆయన పంపించగా మనుషులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపు, మేఘాలు సంచారం చేస్తాయి. ఆయన వాటికి ఆజ్ఞాపించేది అంతా అవి నెరవేరుస్తాయి.

    13 ఇదంతా ఆయన శిక్ష కోసం గాని, తన భూలోకం కోసం గాని కృపా భరితమైన నమ్మకత్వం కోసం గాని నెరవేరుస్తాడు.

    14 యోబు, ఈ మాట ఆలకించు. మౌనం వహించి దేవుని అద్భుత క్రియలను ఆలోచించు.

    15 దేవుడు తన మేఘం మెరుపు ప్రకాశించాలని ఎలా తీర్మానం చేస్తాడో నీకు తెలుసా?

    16 మేఘాలను తేలజేయడం పరిపూర్ణ జ్ఞానం గలవాడి మహా కార్యమని నీకు తెలుసా?

  26. 11 ఆకాశాలు నీవే, భూమి కూడా నీదే. లోకాన్నీ దానిలో ఉన్నదంతా నువ్వే చేశావు.

  27. 15 దేవుడైన యెహోవా ఏదెను తోట సాగు చెయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెట్టాడు.

  28. 11 యెహోవా రాబోతున్నాడు. ఆకాశం సంతోషించు గాక. భూమి ఆనందించు గాక. సముద్రం, దానిలో ఉన్నదంతా ఆనందంతో ఘోషించు గాక.

    12 మైదానాలు, వాటిలో ఉన్నదంతా ఆనందించు గాక.

    అడవి చెట్లన్నీ ఉత్సాహంతో కేకలు వేస్తాయి గాక

    13 లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నీతితో ఆయన లోకానికి తన విశ్వసనీయతతో ప్రజా సమూహాలకు ఆయన తీర్పు తీరుస్తాడు.

  29. 13 ఆయన స్వరం ఆకాశమండలంలో నీటి గర్జనలాగా వినిపిస్తుంది. భూదిగంతాల్లో నుండి ఆయన ఆవిరి మేఘాలు వచ్చేలా చేస్తాడు. వర్షంతో బాటు ఆయన మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగుల నుండి గాలిని పంపిస్తాడు.

  30. 8 ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు.

    చీకటిని తెలవారేలా చేసేవాడు.

    పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు.

    సముద్రపు నీటిని మబ్బుల్లాగా చేసి

    భూమి మీద కుమ్మరిస్తాడు.

    9 ఆయన పేరు యెహోవా.

    బలవంతుల మీదికి ఆయన అకస్మాత్తుగా

    నాశనం రప్పిస్తే కోటలు నాశనమవుతాయి.

  31. 27 అవి కష్టపడవు, బట్టలు నేయవు. అయినా తన వైభవమంతటితో సహా సొలొమోనుకున్న అలంకరణ ఈ పూలలో ఏ ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెబుతున్నాను.

  32. 6 ఆకాశ మహాకాశాలను, అందులో ఉండే సైన్యాలను, భూమిని, భూమిపై ఉన్న సమస్తాన్ని, సముద్రాలను, వాటిలో ఉండే వాటిని సృష్టించి వాటినన్నిటినీ కాపాడుతున్న అద్వితీయ దేవుడైన యెహోవావు నువ్వే. ఆకాశ సైన్యమంతా నీకు లోబడుతుంది.

  33. 1 చూడండి! యెహోవా భూమిని ఖాళీ చేయబోతున్నాడు. దాన్ని నాశనం చేయబోతున్నాడు. దాని ఉపరితలాన్ని పాడు చేయబోతున్నాడు. దానిపై నివాసమున్న వారిని చెదరగొట్టబోతున్నాడు.

    2 ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగుతుంది. దాసులకు జరిగినట్టు యజమానులకు జరుగుతుంది. దాసీలకు జరిగినట్టు వారి యజమానురాళ్లకు జరుగుతుంది. కొనేవారికి జరిగినట్టు అమ్మేవారికి జరుగుతుంది. అప్పిచ్చే వారికి జరిగినట్టు అప్పు పుచ్చుకొనే వారికి జరుగుతుంది. వడ్డీకి ఇచ్చేవారికి జరిగినట్టు వడ్డీకి తీసుకునేవారికి జరుగుతుంది.

    3 దేశం కేవలం వట్టిదిగా అయి పోతుంది. అది కేవలం కొల్లసొమ్ము అవుతుంది. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు.

    4 దేశం వ్యాకులం చేత వాడిపోతున్నది. లోకంలోని గొప్పవారు క్షీణించి పోతున్నారు.

    5 లోక నివాసులు ధర్మ శాసనాలు అతిక్రమించారు. నియమాన్ని మార్చి నిత్య నిబంధనను మీరారు. దాని నివాసుల చేత లోకం అపవిత్రమైపోయింది.

    6 శాపం దేశాన్ని నాశనం చేస్తున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు. దేశ నివాసులు కాలిపోయారు. శేషించిన మనుషులు కొద్దిమందే ఉన్నారు.

  34. 28 నీకు తెలియలేదా? నీవు వినలేదా?

    భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు.

    ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.

  35. 17 ఇదిగో నేను కొత్త ఆకాశాన్నీ కొత్త భూమినీ సృష్టించబోతున్నాను.

    గత విషయాలు మనసులో పెట్టుకోను. గుర్తుపెట్టుకోను.

    18 అయితే, నేను సృష్టించబోయే వాటి కారణంగా ఎప్పటికీ సంతోషించండి. నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలంగా ఆమె ప్రజలను సంతోషకారణంగా సృష్టించబోతున్నాను.

  36. 6 యెహోవా దేవుడు ఒక మొక్కను సిద్ధం చేసి, అతనికి కలిగిన బాధ పోగొట్టడానికి, అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చేలా చేశాడు. ఆ మొక్కను బట్టి యోనా చాలా సంతోషించాడు. 7 మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును సిద్ధంచేసి ఉంచాడు. అది ఆ మొక్కను పాడు చేయగా అది వాడిపోయింది.

    8 ఆ తరువాత రోజు సూర్యోదయం అయినప్పుడు, దేవుడు తూర్పునుండి వీచే వడగాలిని సిద్ధం చేశాడు. యోనాకు ఎండ దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయాడు. “బతకడం కంటే చావడమే నాకు మేలు” అని తనలో తాను అనుకున్నాడు. 9 అప్పుడు దేవుడు యోనాతో “ఈ మొక్క గురించి నువ్వు అంతగా కోపపడడం భావ్యమేనా?” అన్నాడు. యోనా “చచ్చి పోయేటంతగా కోపపడడం భావ్యమే” అన్నాడు.

    10 అందుకు యెహోవా “నువ్వేమాత్రం కష్టపడకుండా, పెంచకుండా దానికదే పెరిగిన మొక్క మీద నువ్వు జాలిపడుతున్నావే. అది ఒక రాత్రిలోనే పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయింది. 11 అయితే నీనెవె మహా పట్టణంలో కుడి ఎడమలు తెలియని లక్షా ఇరవై వేల కంటే ఎక్కువమంది ప్రజలున్నారు. చాలా పశువులు కూడా ఉన్నాయి. దాని గురించి నేను జాలిపడవద్దా?” అని అతనితో అన్నాడు.

  37. 6 ఐదు పిచ్చుకలను రెండు కాసులకు అమ్ముతారు కదా. అయినా వాటిలో ఒక్కదాన్ని కూడా దేవుడు మర్చిపోడు.