90 Bible Verses About God's Judgment

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About God's Judgment
  1. 1 కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే నీవు ఎవరివైనా సరే, నిన్ను నీవు సమర్ధించుకోలేవు. దేని విషయంలో ఎదుటి వాడికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే దోషివని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నీవు ఏ పనుల విషయంలో తీర్పు తీరుస్తున్నావో వాటినే నీవు కూడా చేస్తున్నావు కదా?

    2 ఆ పనులు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైనదే అని మనకు తెలుసు. 3 ఆ పనులు చేసే వారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న ఓ మనిషీ, దేవుని తీర్పు నీవెలా తప్పించుకుంటావు? 4 దేవుని కటాక్షం నిన్ను పశ్చాత్తాప పడేందుకు ప్రేరేపిస్తున్నదని తెలియక ఆయన మంచితనం అనే ఐశ్వర్యాన్నీ సహనాన్నీ దీర్ఘశాంతాన్నీ తోసిపుచ్చుతావా?

    5 నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు. 6 ఆయన ప్రతి మనిషికీ అతని పనుల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. 7 మంచి పనులను ఓపికగా చేస్తూ, మహిమ, ఘనత, అక్షయతలను వెదికే వారికి నిత్యజీవమిస్తాడు. 8 అయితే స్వార్ధపరులు, సత్యాన్ని విడిచిపెట్టి దుర్నీతిని జరిగించే వారి మీదికి దేవుని ఉగ్రత, మహా కోపం వస్తాయి. 9 చెడ్డ పని చేసే ప్రతి మనిషి ఆత్మకు, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి బాధ, వేదన కలుగుతాయి. 10 అయితే మంచి పని చేసే ప్రతి వ్యక్తికి, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి మహిమ, ఘనత, శాంతిసమాధానాలు కలుగుతాయి.

    11 ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు.

  2. 11 తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు. 12 చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు.

    13 సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణమూ, పాతాళ లోకమూ వాటి వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు. 14 మరణాన్నీ పాతాళాన్నీ అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండవ మరణం. 15 జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు.

  3. 9 అందుచేత దేహంలో ఉన్నా దేహాన్ని విడిచినా, ఆయనకు ఇష్టులంగా ఉండాలనేదే మా లక్ష్యం.

    10 మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడాలి. ఎందుకంటే ప్రతివాడూ దేహంతో జరిగించిన వాటి ప్రకారం, అవి మంచివైనా చెడ్డవైనా, తగినట్టుగా ప్రతిఫలం పొందాలి.

    11 కాబట్టి మేము ప్రభువు పట్ల భయభక్తులతో ప్రజలను ఒప్పిస్తున్నాము. మేమేంటో దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. మీ మనస్సాక్షికి కూడా అది స్పష్టంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము.

  4. 10 అయితే నీ సోదరునికి ఎందుకు తీర్పు తీరుస్తున్నావ్? నీ సోదరుణ్ణి ఎందుకు తీసిపారేస్తున్నావ్? మనమంతా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం.

    11 “నిశ్చయంగా జీవిస్తున్న నేను చెప్పే దేమిటంటే, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది.

    ప్రతి నాలుకా దేవుని స్తుతిస్తుంది అని ప్రభువు చెబుతున్నాడు”

    అని రాసి ఉంది. 12 కాబట్టి మనలో ప్రతి ఒక్కడూ తన గురించి దేవునికి లెక్క అప్పగించ వలసి ఉంది.

    13 కాబట్టి ఇకమీదట మనం ఒకరికి ఒకరం తీర్పు తీర్చ వద్దు. దానికి ప్రతిగా, మన సోదరునికి అడ్డురాయిలాగా ఆటంకంగా ఉండకూడదని తీర్మానించుకుందాం. 14 సహజంగా ఏదీ అపవిత్రం కాదని నేను ప్రభు యేసులో గ్రహించి గట్టిగా నమ్ముతున్నాను. అయితే దేనినైనా అపవిత్రం అని నమ్మే వారికి అది అపవిత్రమే అవుతుంది.

  5. 9 నేను ఇంకా చూస్తూ ఉండగా,

    ఇంకా సింహాసనాలను వేయడం చూశాను.

    మహా వృద్ధుడు కూర్చున్నాడు.

    ఆయన వస్త్రం మంచులాగా తెల్లగా,

    ఆయన జుత్తు శుద్ధమైన గొర్రెబొచ్చులాగా తెల్లగా ఉన్నాయి.

    ఆయన సింహాసనం అగ్నిజ్వాలల్లాగా మండుతూ ఉంది.

    దాని చక్రాలు మంటల్లాగా ఉన్నాయి.

    10 అగ్నిప్రవాహం ఒకటి ఆయన దగ్గర నుండి ప్రవహిస్తూ ఉంది.

    వేవేలకొలది ఆయనకు పరిచారకులున్నారు.

    కోట్లకొలది మనుషులు ఆయన ఎదుట నిలబడ్డారు.

    తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరిచారు.

  6. 21 “తండ్రి చనిపోయిన వారిని లేపి ఎలా ప్రాణం ఇస్తాడో అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టం అయిన వారిని బతికిస్తాడు. 22 తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు కానీ అందరికీ తీర్పు తీర్చే సమస్త అధికారాన్ని ఆయన కుమారుడికి ఇచ్చాడు. 23 దీని వల్ల తండ్రిని గౌరవించే అందరూ అదే విధంగా కుమారుణ్ణి కూడా గౌరవించాలి. కుమారుణ్ణి గౌరవించని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవించడు. 24 కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు. 25 మీకు కచ్చితంగా చెబుతున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బతుకుతారు.

    26 తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండడానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు. 27 అలాగే ఆయన కుమారుడికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఈ అధికారం ఇచ్చాడు.

    28 “దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు. సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినే కాలం వస్తుంది. 29 అలా విన్నవారు బయటికి వస్తారు. మంచి చేసిన వారు జీవపు పునరుత్థానానికీ చెడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికీ బయటకు వస్తారు.

  7. 30 ఆ ఆజ్ఞాన కాలాలను దేవుడు చూసీ చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే మానవులందరూ అంతటా పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. 31 ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అందరికీ ఆధారం కలగజేశాడు.”

  8. 1 కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని క్రీస్తు సేవకులమనీ, దేవుని మర్మాల విషయంలో నిర్వాహకులమనీ పరిగణించాలి. 2 నిర్వాహకుల్లో ప్రతి ఒక్కడూ నమ్మకంగా ఉండడం చాలా అవసరం. 3 మీరు గానీ, ఇతరులు గానీ నాకు తీర్పు తీర్చడమనేది నాకు చాలా చిన్న విషయం. నన్ను నేనే తీర్పు తీర్చుకోను. 4 నాలో నాకు ఏ దోషమూ కనిపించదు. అంత మాత్రం చేత నేను నీతిమంతుడిని అని కాదు. అయితే, ప్రభువే నాకు తీర్పు తీర్చేవాడు. 5 కాబట్టి ఆ కాలం రాకముందే, అంటే ప్రభువు వచ్చేంత వరకూ, దేనిని గూర్చీ తీర్పు తీర్చవద్దు. ఆయన చీకటిలో ఉన్న రహస్యాలను వెలుగులోకి తెచ్చి మనుషుల అంతరంగంలో ఉన్న ఉద్దేశ్యాలను బట్టబయలు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ తగిన ప్రశంస దేవుని నుండి కలుగుతుంది.

  9. 14 అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలా పైకి ఎత్తాడో, 15 అలాగే విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా ఆయన వల్ల నిత్యజీవం పొందడానికి మనుష్య కుమారుడు కూడా పైకి ఎత్తబడాలి.

    16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

    18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు. 19 ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. 20 దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు.

  10. 27 కాబట్టి ఎవరైతే అయోగ్యమైన విధానంలో ప్రభువు రొట్టెను తిని ఆయన పాత్రలోది తాగుతారో వారు ప్రభువు శరీరం, ఆయన రక్తం విషయంలో అపరాధులు అవుతారు. 28 కాబట్టి ప్రతి ఒక్కడూ తనను తాను పరీక్షించుకుని ఆ రొట్టె తిని, ఆ పాత్రలోది తాగాలి. 29 ఎందుకంటే ప్రభువు శరీరం గురించి సరైన అవగాహన లేకుండా దాన్ని తిని, తాగేవాడు తన మీదికి శిక్ష కొని తెచ్చుకుంటున్నాడు. 30 ఈ కారణం చేతనే మీలో చాలామంది నీరసంగా, అనారోగ్యంగా ఉన్నారు. చాలామంది చనిపోయారు కూడా. 31 అయితే మనలను మనం పరిశీలించుకుంటూ ఉంటే మన పైకి తీర్పు రాదు. 32 మనం తీర్పు పొందినా లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ప్రభువు మనలను శిక్షించి సరిదిద్దుతున్నాడు.

  11. 19 ప్రతి నోటికీ మూతపడాలనీ, లోకమంతా దేవుని తీర్పు కిందికి రావాలనీ ధర్మశాస్త్రం చెప్పే మాటలన్నీ దానికి లోబడి ఉన్నవారితోనే చెబుతున్నదని మనకు తెలుసు. 20 ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది.

    21 ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి. 22 అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి. 23 భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. 24 నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. 25 క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. 26 ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.

  12. 1 విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. 2 ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశించి, అందులో కొనసాగుతూ దేవుని మహిమ గురించిన నిశ్చయతలో ఆనందిస్తున్నాం. 3-4 అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.

    6 ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. 7 నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. 8 అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. 9 కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం. 10 ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము. 11 అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి పొందాము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునిలో ఆనందిస్తున్నాం.

    12 ఇదిలా ఉండగా, ఒక మనిషి ద్వారా పాపం ఎలా ఈ లోకంలోకి ప్రవేశించిందో, అలాగే పాపం ద్వారా మరణం ప్రవేశించింది. మనుషులంతా పాపం చేయడం వలన చావు అందరికీ దాపురించింది. 13 ఎందుకంటే ధర్మశాస్త్రం రాక ముందు కూడా లోకంలో పాపం ఉంది గాని ధర్మశాస్త్రం లేదు కాబట్టి దేవుడు వారిపై పాపం ఆరోపించలేదు. 14 అయినా, ఆదాము కాలం నుండి మోషే కాలం వరకూ మానవులపై మరణం రాజ్యం చేసింది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కాని అతని వలే పాపం చెయ్యని వాళ్ళపై కూడా మరణం రాజ్యం చేసింది. ఆదాము రాబోయే వాడికి ఒక సూచనగా ఉన్నాడు.

    15 కాని దేవుడు ఇచ్చిన వరానికి, ఆదాము చేసిన పాపానికి పోలిక లేదు. ఎలాగంటే ఒకడి అపరాధం వలన చాలా మంది చనిపోయారు. అయితే దేవుని అనుగ్రహం, యేసు క్రీస్తు అనే ఒక మనిషి కృప వలన కలిగిన ఉచిత కృపాదానం మరి నిశ్చయంగా అనేకమందికి సమృద్ధిగా కలిగింది. 16 పాపం చేసిన ఒక్కడి వలన శిక్ష కలిగినట్టు ఆ కృపాదానం కలగ లేదు. ఎందుకంటే తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చి శిక్షకు కారణమయ్యింది. కృపావరమైతే అనేక అపరాధాల మూలంగా వచ్చి మనుషులను నీతిమంతులుగా తీర్చడానికి కారణమయ్యింది. 17 మరణం ఒక్కడి అపరాధం మూలంగా వచ్చి ఆ ఒక్కడి ద్వారానే ఏలితే విస్తారమైన కృప, నీతి అనే కానుక పొందేవారు జీవం కలిగి మరింత నిశ్చయంగా యేసు క్రీస్తు అనే ఒకడి ద్వారానే ఏలుతారు.

  13. 9 ఆయన అయిదవ సీలు తెరచినప్పుడు దేవుని వాక్కు కోసమూ, తమ సాక్ష్యం కారణంగానూ హతమైన వారి ఆత్మలను ఒక బలిపీఠం కింద చూశాను. 10 వారు బిగ్గరగా ఇలా అరుస్తున్నారు, “సర్వాధికారీ, పరిశుద్ధుడా, సత్యవంతుడా, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్నవారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు?” 11 అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికీ తెల్లని దుస్తులు ఇచ్చారు. “మీలాగే హతం కావాల్సిన మీ తోటి సేవకుల, సోదర సోదరీల లెక్క మొత్తం పూర్తి అయేంతవరకూ ఇంకా కొంత సమయం వేచి ఉండాలి” అని వారికి చెప్పడం జరిగింది.

    12 ఆయన ఆరవ సీలు తెరిచినప్పుడు నేను చూస్తూ ఉండగా పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు గొంగళిలాగా నల్లగా మారిపోయాడు. చంద్రబింబమంతా రక్తంలా ఎర్రగా అయింది. 13 పెనుగాలి వీచినప్పుడు అంజూరు చెట్టు నుండి పచ్చి కాయలు రాలినట్టుగా ఆకాశంలోని నక్షత్రాలు భూమిపై రాలాయి. 14 ఆకాశమంతా చుట్టిన కాగితంలా అదృశ్యమై పోయింది. పర్వతాలూ, ద్వీపాలూ అన్నీ వాటి వాటి స్థానాల నుండి కదిలిపోయాయి.

    15 అప్పుడు భూమి మీద ఉన్న రాజులూ, ప్రముఖులూ, సేనాధిపతులూ, సంపన్నులూ, శక్తిమంతులూ, ఇంకా బానిసలూ, స్వేచ్ఛాజీవులూ అంతా పర్వతాల రాళ్ళ సందుల్లోనూ, గుహల్లోనూ దాక్కున్నారు. 16 వారు, “మీరు మా మీద పడండి! సింహాసనంపై కూర్చున్న ఆయన ముఖకాంతి నుండీ గొర్రెపిల్ల తీవ్ర ఆగ్రహం నుండీ మమ్మల్ని దాచిపెట్టండి. 17 వారి మహా ఉగ్రత దినం వచ్చేసింది. ఎవరు నిలబడగలరు?” అంటూ పర్వతాలనూ, రాళ్ళనూ బతిమాలుకున్నారు.

  14. 36 మనుషులు అజాగ్రత్తగా పలికే ప్రతి మాటకూ తీర్పు రోజున లెక్క చెప్పవలసి ఉంటుందని మీతో చెబుతున్నాను. 37 నీ మాటలను బట్టి నువ్వు నీతిపరుడివని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టే నీవు శిక్ష పొందుతావు.”

  15. 5 ఈ సంగతులు మీకు ముందే తెలుసు. అయినా కొన్ని సంగతులు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కానీ నమ్మనివారిని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు. 6 తమ స్థానం నిలుపుకోని దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వారిని చీకటిలో నిత్య సంకెళ్ళతో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు.

    7 అదే విధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు జారత్వానికీ, అసహజమైన లైంగిక కోరికలకూ తమను తాము అప్పగించుకున్నారు. వారు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు.

  16. 1 “ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు మిమ్మల్నీ తీర్పు తీర్చరు. 2 మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత ప్రకారమే మీకూ దొరుకుతుంది. 3 నీ కంటిలో ఉన్న దుంగను గమనించుకోకుండా నీ సాటి మనిషి కంటిలోని నలుసు ఎందుకు చూస్తావు? 4 నీ కంటిలో దుంగను ఉంచుకుని నీ సోదరునితో, ‘నీ కంటిలోని నలుసు తీయనివ్వు’ అని ఎలా చెబుతావు? 5 కపట వేషధారీ! మొదట నీ కంటిలో ఉన్న దుంగను తీసివేసికో, అప్పుడు నీ సోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది.

  17. 9 మేము దేవునితో కలిసి పని చేసే వాళ్ళం. మీరు దేవుని పొలం, దేవుని కట్టడం.

    10 దేవుడు నాకు దయచేసిన కృప వలన నేను నైపుణ్యం గల నిర్మాణకునిగా పునాది వేశాను. మరొకడు దాని మీద నిర్మిస్తున్నాడు. అయితే దాని మీద కడుతున్న ప్రతి ఒక్కరూ తాము ఏ విధంగా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి.

    11 పునాది యేసు క్రీస్తే. వేసిన ఈ పునాది కాక, వేరే పునాది ఎవరూ వేయలేరు.

    12 ఈ పునాది మీద ఎవరైనా బంగారం, వెండి, విలువైన రాళ్ళు, చెక్క, చెత్త పరకలు, ఇలాటి వాటితో కడితే 13 వారి వారి పని బయట పడుతుంది. ఆ రోజు దాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ఎందుకంటే అది అగ్నివల్ల బయట పడుతుంది. ప్రతి ఒక్కరి పనినీ మంటలే పరీక్షిస్తాయి. 14 పునాది మీద ఎవరి పని నిలబడుతుందో అతనికి ప్రతిఫలం దొరుకుతుంది. 15 ఎవరి పని కాలిపోతుందో అతనికి నష్టం వస్తుంది. అతడు తప్పించుకుంటాడు గానీ మంటల్లో నుండి తప్పించుకొన్నట్టుగా ఉంటాడు.

  18. 15 ఏడవ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి, “ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమూ, ఆయన క్రీస్తు రాజ్యమూ అయింది. ఆయన యుగయుగాలు పరిపాలన చేస్తాడు.” 16 అప్పుడు దేవుని ఎదుట సింహాసనాలపై కూర్చున్న ఇరవై నలుగురు పెద్దలూ సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించారు.

    17 “ప్రభువైన దేవా, సర్వ శక్తిశాలీ, పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా, నువ్వు నీ మహాశక్తి సమేతంగా పాలించడం ప్రారంభించినందుకు నీకు మా కృతజ్ఞతలు. 18 జనాలకు క్రోధం పెరిగిపోయింది. కాని నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. చనిపోయిన వారికి తీర్పు తీర్చడానికీ, నీ సేవకులైన ప్రవక్తలకీ పరిశుద్ధులకీ గొప్పవారైనా అనామకులైనా నీ పేరు అంటే భయభక్తులు ఉన్న వారికి పారితోషికాలు ఇవ్వడానికీ, భూమిని నాశనం చేసే వారిని లేకుండా చేయడానికీ సమయం వచ్చింది” అన్నారు.

  19. 47 ఎవరైనా నా మాటలు విని, వాటిని పాటించకపోతే నేను అతనికి తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను, తీర్పు తీర్చడానికి కాదు.

    48 నన్ను తోసిపుచ్చి, నా మాటలు అంగీకరించని వాడికి తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు. నేను పలికిన వాక్కే చివరి రోజున అతనికి తీర్పు తీరుస్తుంది.

  20. 27 మనుషులంతా ఒకేసారి చనిపోతారు. తరువాత తీర్పు జరుగుతుంది. 28 అలాగే క్రీస్తు అనేకమంది పాపాలను తీసివేయడం కోసం ఒక్కసారే తనను తాను అర్పించుకున్నాడు. ఆయన రెండోసారి కనిపించనున్నాడు. అయితే ఈ సారి పాపాల కోసం కాదు కానీ తన కోసం సహనంతో వేచి ఉన్నవారి రక్షణ కోసం కనిపించనున్నాడు.

  21. 26 సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తరువాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు. 27 కానీ భయంతో తీర్పు కోసం ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది. అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్ని ఉంటుంది. 28 ఎవడైనా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే ఇద్దరో ముగ్గురో చెప్పిన సాక్ష్యం మీద వాడిని ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా చంపుతారు.

    29 ఇలా ఉంటే మరి దేవుని కుమారుణ్ణి తమ కాళ్ళ కింద తొక్కివేసి, తనను శుద్ధి చేసిన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి, కృపాభరితమైన ఆత్మను అవమానించిన వాడికి మరి ఇంకెంత ఎక్కువ శిక్ష పడుతుందో ఆలోచించండి. 30 “ప్రతీకారం తీర్చడం నా పని. నేనే తిరిగి చెల్లిస్తాను” అనీ, అలాగే “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అనీ చెప్పిన వాడు మనకు తెలుసు. 31 సజీవుడైన దేవుని చేతిలో పడడం భయానకమైన విషయం.

  22. 9 కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.

    10 అయితే, ప్రభువుదినం ఎవరికీ తెలియని విధంగా దొంగ వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఆకాశాలు మహా ఘోషతో గతించిపోతాయి. పంచభూతాలు మంటల్లో కాలిపోతాయి. భూమి, దానిలో ఉన్నవన్నీ తీర్పుకు గురౌతాయి. 11 ఇవన్నీ ఈ విధంగా నాశనం అయిపోతాయి గనుక మీరు పవిత్ర జీవనం, దైవభక్తి సంబంధమైన విషయాల్లో ఏ విధంగా జీవించాలి?

    12 దేవుడు వచ్చే రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు గనుక ఆ రోజు త్వరగా రావాలని ఆశించండి. ఆ దినాన పంచభూతాలు తీవ్రమైన సెగతో కరిగిపోతాయి. ఆకాశంలో ఉన్నవన్నీ మంటల్లో కాలిపోతాయి

  23. 20 అప్పుడాయన ఏ పట్టణాల్లో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను గద్దించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అవి పశ్చాత్తాప పడలేదు. 21 “అయ్యో కొరాజీనూ! నీకు శిక్ష తప్పదు. అయ్యో బేత్సయిదా! నీకు శిక్ష తప్పదు. మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాల్లో గనక జరిగి ఉంటే అక్కడి ప్రజలు చాలా కాలం ముందే పశ్చాత్తాపపడి గోనె పట్ట కట్టుకుని బూడిద పూసుకునేవారే.

    22 తీర్పు దినాన మీకు పట్టే గతి కంటే తూరు సీదోను పట్టణాల వారి గతే ఓర్చుకోదగినది అవుతుంది అని మీతో చెప్తున్నాను. 23 కపెర్నహూమా, పరలోకానికి హెచ్చిపోగలను అని నీవు అనుకుంటున్నావా? నీవు పాతాళంలోకి దిగి పోతావు. నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో గనక జరిగి ఉంటే అది ఈనాటి వరకూ నిలిచి ఉండేదే! 24 తీర్పు దినాన నీకు పట్టే గతి కంటే సొదొమ నగరానికి పట్టే గతే ఓర్చుకోదగినది అవుతుంది, అని మీతో చెప్తున్నాను.”

  24. 12 “చూడండి, నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసిన పనుల ప్రకారం నేనివ్వబోయే ప్రతిఫలం నా దగ్గర ఉంది.

    13 ఆల్ఫా, ఓమెగా నేనే. మొదటి వాణ్ణి, చివరి వాణ్ణి నేనే. ప్రారంభాన్నీ ముగింపునీ నేనే.

    14 జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణ ద్వారాల నుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యులు అయ్యేందుకై తమ వస్త్రాలను ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు.

    15 పట్టణం బయట కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ ఉంటారు.

    16 యేసు అనే నేను సంఘాలకు చెప్పడం కోసం ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నా దూతను పంపించాను. నేనే దావీదు వేరునూ సంతానాన్నీ ప్రకాశవంతమైన వేకువ నక్షత్రాన్నీ.

    17 “రా” అంటూ ఆత్మా, పెళ్ళికూతురూ చెబుతున్నారు. వింటున్నవాడూ, “రా” అని చెప్పాలి. దాహం వేసిన వాడు రావాలి. ఇష్టమున్న వ్యక్తి జీవ జలాన్ని ఉచితంగా తీసుకోవచ్చు.”

  25. 16 అంతేగాక ఈ లోకంలో న్యాయతీర్పు జరిగించే స్థలాల్లో, నీతి ఉండాల్సిన స్థలాల్లో నాకు దుష్టత్వం కనిపించింది. 17 “మంచివారికీ చెడ్డవారికీ వారి ప్రతి ప్రయత్నానికీ, పనికీ తగిన సమయంలో దేవుడే తీర్పు తీరుస్తాడు” అని నా హృదయంలో అనుకున్నాను.

  26. 14 ఎందుకంటే దేవుడు ప్రతి పనినీ, రహస్యంగా ఉంచిన ప్రతి విషయాన్నీ,

    అది మంచిదైనా చెడ్డదైనా, తీర్పులోకి తెస్తాడు.

  27. 1 మీలో ఒకరితో ఒకరికి వివాదం ఏమైనా ఉంటే అతడు పరిశుద్ధుల ఎదుట కాకుండా అవిశ్వాసి అయిన న్యాయాధిపతి ఎదుట వాదించడానికి పూనుకుంటాడా? 2 పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలియదా? మీరు ఈ లోకానికి తీర్పు తీర్చవలసి ఉండగా, చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకొనే సామర్ధ్యం మీకు లేదా? 3 మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు మరి ఈ లోక సంబంధమైన విషయాలను గూర్చి మరి బాగా తీర్పు తీర్చవచ్చు గదా?

    4 కాబట్టి ఈ లోక సంబంధమైన వివాదాలు మీకు కలిగినపుడు వాటిని పరిష్కరించడానికి సంఘంలో ఎలాటి స్థానం లేని వారి దగ్గరికి వెళ్తారా?

  28. 6 ఒక పానార్పణగా నేను బలి అవుతూ ఉన్నాను. నా మరణం సమీపించింది. 7 మంచి పోరాటం సాగించాను, నా పరుగు ముగించాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. 8 ఇప్పుడు నా కోసం నీతికిరీటం సిద్ధంగా ఉంది. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు దాన్ని ఆ రోజున నాకు అనుగ్రహిస్తాడు. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షానికై ప్రేమతో ఎదురుచూసే వారందరికీ అనుగ్రహిస్తాడు.

  29. 1 “ఆ కాలంలో నీ ప్రజల పక్షాన నిలిచే మహా అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ ప్రజలు రాజ్యంగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలం వరకూ ఎప్పుడూ కలగనంత ఆపద కలుగుతుంది. అయితే నీ ప్రజల్లో గ్రంథంలో పేరున్న వారు తప్పించుకుంటారు. 2 సమాధుల్లో నిద్రించే చాలా మంది మేలుకుంటారు. కొందరు నిత్యజీవం అనుభవించడానికి, కొందరు నిందపాలు కావడానికి నిత్యంగా అసహ్యులై పోవడానికి మేలుకుంటారు.

    3 బుద్ధిమంతులైతే ఆకాశమండలం లోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. నీతిమార్గం అనుసరించి నడుచుకొనేలా ఎవరు అనేకమందిని తిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు.

  30. 18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది. 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

    21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

    24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.

    26 ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. 27 అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు.

    28 వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.

    30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, 31 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. 32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.

  31. 7 కాబట్టి సోదరులారా, ప్రభువు రాక వరకూ సహనంతో ఉండండి. రైతు తొలకరి వాన, కడవరి వాన కురిసే దాకా విలువైన పంట కోసం ఓపికతో ఎదురు చూస్తూ వేచి ఉంటాడు కదా. 8 ప్రభువు రాక దగ్గర పడింది. మీరు కూడా ఓపికగా ఉండండి. మీ హృదయాలను దిటవు చేసుకోండి.

    9 సోదరులారా, ఒకడి మీద ఒకడు సణుక్కోకండి, అప్పుడు మీ మీదికి తీర్పు రాదు. ఇదుగో న్యాయాధిపతి వాకిట్లోకి వచ్చేశాడు. 10 నా సోదరులారా, ప్రభువు నామంలో బోధించిన ప్రవక్తలు ఎదుర్కొన్న హింసలను, ఓపికను ఆదర్శంగా తీసుకోండి. 11 చూడండి, సహించి నిలబడిన వారిని ధన్యులని భావిస్తాము గదా? మీరు యోబు సహనాన్ని గూర్చి విన్నారు. యోబు విషయంలో దేవుని ఉద్దేశాలను తెలిసిన మీరు ఆయన ఎంతో జాలి, కరుణ ఉన్నవాడని గ్రహించారు.

    12 నా సోదరులారా, ఒక ముఖ్యమైన సంగతి. ఆకాశం తోడనీ భూమి తోడనీ మరి దేని తోడనీ ఒట్టు పెట్టుకోవద్దు. మీరు “అవునంటే అవును, కాదంటే కాదు” అన్నట్టుగా ఉంటే మీరు తీర్పు పాలు కారు.

  32. 1 క్రీస్తు శరీర హింసలు పొందాడు కాబట్టి, మీరు కూడా అలాంటి మనసునే ఆయుధంగా ధరించుకోండి. శరీర హింసలు పొందిన వాడు పాపం చేయడం మానేస్తాడు. 2 ఈ వ్యక్తి తన శేష జీవితాన్ని ఇకమీదట మానవ కోరికలను అనుసరించక, దేవుని ఇష్టం కోసమే జీవిస్తాడు. 3 యూదేతరులు చేసినట్టు చేయడానికి గతించిన కాలం చాలు. గతంలో మీరు లైంగిక పరమైన అనైతిక కార్యాలూ, చెడ్డ కోరికలు, మద్యపానం, అల్లరి చిల్లరి వినోదాలూ, విచ్చలవిడి విందులూ, నిషిద్ధమైన విగ్రహ పూజలూ చేశారు. 4 వారితోబాటుగా మీరూ ఇలాటి విపరీతమైన తెలివిమాలిన పనులు ఇప్పుడు చేయడం లేదని వారు మిమ్మల్ని వింతగా చూస్తున్నారు. అందుకే వారు మీ గురించి చెడ్డగా చెబుతున్నారు.

    5 బతికున్న వారికీ చనిపోయిన వారికీ తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవాడికి వారు లెక్క అప్పజెప్పాలి.

  33. 4 పూర్వం పాపం చేసిన దేవదూతలను కూడా విడిచిపెట్టకుండా దేవుడు వారిని సంకెళ్లకు అప్పగించి దట్టమైన చీకటిలో తీర్పు వరకూ ఉంచాడు. 5 అలాగే దేవుడు పూర్వకాలపు లోకాన్ని కూడా విడిచిపెట్టకుండా, నీతిని ప్రకటించిన నోవహును, మిగతా ఏడుగురిని కాపాడి, దైవభక్తి లేని ప్రజల మీదికి జల ప్రళయం రప్పించాడు.

    6 దైవభక్తి లేని ప్రజలకు కలిగే వినాశనానికి ఉదాహరణగా దేవుడు సొదొమ, గొమొర్రా పట్టణాలపై తీర్పు విధించి వాటిని బూడిదగా మార్చాడు. 7 దైవభయం లేని దుర్మార్గుల లైంగిక వికార ప్రవర్తన చేత మనస్తాపానికి గురైన నీతిపరుడైన లోతును రక్షించాడు. 8 దినదినం ఆ దుర్మార్గుల మధ్య ఉంటూ, వారు చేసే అక్రమమైన పనులు చూస్తూ, వింటూ, నీతిగల అతని మనసు దుఃఖిస్తూ ఉండేది. 9 ఆ విధంగా, దైవభక్తి ఉన్నవారిని పరీక్షల నుండి ఎలా కాపాడాలో ప్రభువుకు తెలుసు, తీర్పు రోజున శిక్ష పొందేవరకూ దుర్మార్గులను ఎలా నిర్బంధించి ఉంచాలో కూడా ప్రభువుకు తెలుసు.

    10 ముఖ్యంగా ప్రభుత్వాన్ని తోసిపుచ్చుతూ, అపవిత్రమైన శరీర ఆశలను తీర్చుకుంటూ, తెగువతో, అహంకారంతో, పరలోక సంబంధులను దూషించడానికి భయపడని వారి విషయంలో ఇది నిజం.

  34. 6-7 ప్రభు యేసు తన ప్రభావాన్ని కనుపరిచే దూతలతో పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని హింసించే వారికి యాతనా, ఇప్పుడు కష్టాలు పడుతున్న మీకూ మాకూ కూడా విశ్రాంతి కలగజేయడం దేవునికి న్యాయమే.

    8 దేవుడు తనను ఎరుగని వారిని, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించని వారిని అగ్నిజ్వాలల్లో దండిస్తాడు. 9-10 ఆ రోజున తన పరిశుద్ధులు ఆయనను మహిమ పరచడానికీ, విశ్వసించిన వారికి ఆశ్చర్య కారకంగా ఉండటానికీ ఆయన వచ్చినప్పుడు అవిశ్వాసులు ప్రభువు సన్నిధి నుండీ, ఆయన ప్రభావ తేజస్సు నుండీ వేరై శాశ్వత నాశనం అనే దండన పొందుతారు.

    ఆ పరిశుద్ధుల్లో మీరూ ఉన్నారు. ఎందుకంటే మేము చెప్పిన సాక్ష్యం మీరు నమ్మారు.

  35. 9 యువకా, నీ యువదశలో సంతోషంగా ఉండు.

    నీ యువదశలో మనసారా సంతోషించు.

    నీ మనస్సులోని కోరికల ప్రకారం, నీ కళ్ళు చూచే వాటన్నిటినీ అనుభవించు.

    అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని గుర్తుపెట్టుకో.

  36. 29 ప్రజలంతా గుంపులుగా ఉన్నప్పుడు ఆయన వారికి ఇలా చెప్పాడు, “ఈ తరం చెడ్డది. వీరు సూచన అడుగుతున్నారు. అయితే యోనా సూచన తప్పించి మరి ఏ సూచనా వీరికి చూపడం జరగదు. 30 యోనా నీనెవె పట్టణ వాసులకు ఎలా సూచనగా ఉన్నాడో ఆలాగే మనుష్య కుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు.

    31 దక్షిణ దేశం రాణి తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వీరి మీద నేరం మోపుతుంది. ఆమె సొలొమోను జ్ఞాన వాక్కులు వినడానికి సుదూర దేశం నుండి వచ్చింది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.

    32 నీనెవె ప్రజలు తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతారు. ఎందుకంటే వారు యోనా బోధ విని మారుమనస్సు పొందారు. యోనా కంటే ఘనుడు ఇక్కడ ఉన్నాడు.

  37. 45 అయితే ఆ పనివాడు నా యజమాని ఆలస్యం చేస్తున్నాడని మనసులో అనుకుని తోటి దాసదాసీలను కొట్టడం, తిని తాగి మత్తెక్కి ఉండడం చేస్తే 46 వాడు ఎదురు చూడని రోజున తెలియని సమయంలో యజమాని వస్తాడు. వాణ్ణి కఠినంగా శిక్షించి నమ్మదగని వారి గతే వాడికి పట్టేలా చేస్తాడు. 47 తన యజమాని ఇష్టం తెలిసి కూడా సిద్ధపడకుండా, ఆయన ఇష్ట ప్రకారం చేయకుండా ఉండే సేవకుడికి చాలా దెబ్బలు తగులుతాయి. 48 దెబ్బలకు తగిన పనులు చేసినా తెలియక చేసిన వాడికి తక్కువ దెబ్బలే తగులుతాయి. ఎవరికి ఎక్కువగా ఇచ్చారో అతని దగ్గర ఎక్కువగా తీసుకుంటారు. మనుషులు ఎవరికి ఎక్కువ అప్పగిస్తారో వారి దగ్గరే ఎక్కువగా అడుగుతారు.

    49 “నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను. అది ఇప్పటికే రగులుకుని మండాలని ఎంతగానో కోరుతున్నాను. 50 అయితే నేను పొందాల్సిన బాప్తిసం ఉంది. అది జరిగే వరకూ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను.

  38. 1 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.

    2 క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది. 3-4 ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు.

  39. 14 ఆదాము నుండి ఏడవవాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచిస్తూ ఇలా అన్నాడు. “వినండి, ప్రభువు వేవేలమంది పవిత్రులతో కలిసి వస్తున్నాడు. 15 వారిలో భక్తి లేనివారు భక్తిహీన మార్గంలో చేసిన భక్తిహీన కార్యాలన్నిటి గురించీ నేరం రుజువు చేయడానికి, భక్తిలేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించీ అందరికీ తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు.”

  40. 7 కాని యెహోవా శాశ్వత కాలం ఉంటాడు. న్యాయం తీర్చడానికి ఆయన తన సింహాసనాన్ని స్థాపిస్తాడు.

    8 యెహోవా లోకానికి న్యాయమైన తీర్పు తీరుస్తాడు. జాతుల కోసం న్యాయమైన నిర్ణయాలు చేస్తాడు.

    9 పీడిత ప్రజలకు యెహోవా బలమైన ఆశ్రయం. ఆపత్కాలంలో బలమైన అండ.

  41. 9 లోకానికి తీర్పు తీర్చడానికి, నీతితో ప్రపంచ ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి యెహోవా రాబోతున్నాడు.

  42. 47 “పరలోకరాజ్యం సముద్రంలో వేసే వలను పోలి ఉంది. అందులో రకరకాల చేపలు పడతాయి. 48 అది నిండినప్పుడు తీరానికి లాగి, కూర్చుని మంచి వాటిని గంపల్లో వేసుకుని పనికి రాని వాటిని విసిరి పారేస్తారు. 49 అలాగే ఈ లోకాంతంలో జరుగుతుంది. దేవ దూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరు చేసి, 50 వారిని అగ్ని గుండంలో పడవేస్తారు. అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.

  43. 1 కాబట్టి క్రీస్తు సందేశం గురించి ప్రారంభంలో మనం విన్న అంశాలను వదలి, మరింత పరిణతి సాధించే దిశగా సాగిపోదాం. నిర్జీవ క్రియల కోసం పశ్చాత్తాప పడటమూ, దేవునిపై విశ్వాసమూ, 2 బాప్తీసాలూ, తలపై చేతులుంచడమూ, చనిపోయినవారు పునర్జీవితులు కావడమూ, నిత్య శిక్షా వంటి ప్రాథమిక అంశాలపై మళ్ళీ పునాది వేయకుండా ముందుకు సాగుదాం. 3 ఒకవేళ దేవుడు అనుమతిస్తే అలా చేస్తాం.

    4-5 తమ జీవితాల్లో ఒకసారి వెలుగును పొందిన వారు, పరలోక వరాన్ని అనుభవించినవారు, పరిశుద్ధాత్మలో భాగం పొందినవారు దేవుని శుభవాక్కునూ, రాబోయే కాలం తాలూకు శక్తులనూ రుచి చూసిన వారు ఒకవేళ మార్గం విడిచి తప్పిపోతే వారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం. 6 ఎందుకంటే దేవుని కుమారుణ్ణి వారే మళ్ళీ సిలువ వేస్తూ ఆయనను బహిరంగంగా అపహాస్యం చేస్తున్నారు.

    7 ఇది ఎలాగంటే, నేల తరచుగా తనపై కురిసే వాన నీటిలో తడిసి తనను దున్నిన రైతులకు ప్రయోజనకరమైన పంటలనిస్తూ దేవుని దీవెనలు పొందుతుంది. 8 అయితే ముళ్ళూ, ముళ్ళ పొదలూ ఆ నేలపై మొలిస్తే అది పనికిరానిదై శాపానికి గురి అవుతుంది. తగలబడిపోవడంతో అది అంతం అవుతుంది.

  44. 17 దేవుని ఇంటి వారికి తీర్పు మొదలయ్యే సమయం వచ్చింది. అది మనతోనే మొదలయితే, దేవుని సువార్తకు లోబడని వారి గతేంటి? 18 నీతిమంతుడే రక్షణ పొందడం కష్టమైతే ఇక భక్తిహీనుడు, పాపి సంగతి ఏమిటి?

  45. 1 ప్రియులారా, ఇది నేను మీకు రాస్తున్న రెండవ ఉత్తరం. యథార్ధమైన మీ మనసును పురికొల్పడానికి జ్ఞాపకం చేస్తూ వీటిని రాస్తున్నాను. 2 పవిత్ర ప్రవక్తలు పూర్వకాలంలో చెప్పిన మాటలనూ, మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞనూ మీరు గుర్తు చేసుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను.

    3 ముందుగా ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించి నడిచే కొందరు బయలుదేరతారు. 4 “ఆయన మళ్ళీ వస్తాడన్న వాగ్దానం ఏమయ్యింది? మా పూర్వీకులు చనిపోయారు, కాని సృష్టి ఆరంభం నుండి అన్ని విషయాలూ ఏమీ మార్పు లేకుండానే జరిగిపోతున్నాయి” అంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. 5 చాలాకాలం కిందట, ఆకాశాన్నీ భూమినీ దేవుడు తన వాక్కు ద్వారా నీళ్ళలో నుండి, నీళ్ళ ద్వారా స్థిరపరిచాడనీ, 6 ఆయన వాక్కును బట్టే, ఆ రోజుల్లో ఉన్న లోకం వరద నీటిలో మునిగి నాశనం అయ్యిందనీ, 7 అదే వాక్కును బట్టి ఇప్పటి ఆకాశం, భూమి భక్తిహీనులకు జరిగే తీర్పు రోజు వరకు, మంటల్లో నాశనం కావడానికి సిద్ధంగా ఉన్నదనీ వారు ఉద్దేశ పూర్వకంగా మరచిపోతారు.

  46. 20 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక 21 నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది.”

    22 ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కానీ అబ్రాహాము ఇంకా యెహోవా సముఖంలోనే నిలబడి ఉన్నాడు. 23 అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. “దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా?

    24 ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా? 25 నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?”

  47. 21 “‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు. 22 ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు. 23 అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.

  48. 36 అప్పుడాయన ప్రజలను పంపివేసి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పొలంలోని కలుపు మొక్కలను గురించిన ఉపమానం అర్థం మాకు చెప్పు” అని అడిగారు. 37 అందుకాయన ఇలా అన్నాడు, “మంచి విత్తనం చల్లేది మనుష్య కుమారుడు. 38 పొలం ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించిన వారు. కలుపు మొక్కలు దుష్టుని సంబంధులు. 39 వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోత కోసే వారు దేవదూతలు. 40 కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది. 41 మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు. 42 అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి. 43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారు. వినగలిగే చెవులున్నవాడు విను గాక.

  49. 42 దేవుడు సజీవులకూ మృతులకూ న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సాక్షమివ్వాలని ఆయన మాకు ఆజ్ఞాపించాడు.

  50. 12 తీర్పు రోజున ఆ ఊరికి పట్టే గతి కంటే సొదొమ పట్టణానికి పట్టిన గతే ఓర్చుకోదగినది అవుతుందని మీతో చెబుతున్నాను.

    13 “అయ్యో కొరాజీనూ, నీకు యాతన. అయ్యో బేత్సయిదా, నీకు యాతన. మీ మధ్య చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేస్తే ఆ పట్టణాల్లోని వారు ముందే గోనె పట్ట కట్టుకుని బూడిదెలో కూర్చుని మనసు మార్చుకుని ఉండేవారు. 14 అయినా తీర్పు రోజున మీ గతి కంటే తూరు, సీదోను పట్టణాల గతి ఓర్చుకోదగినదిగా ఉంటుంది. 15 కపెర్నహూమా, ఆకాశం వరకూ హెచ్చించుకున్నా నువ్వు పాతాళం వరకూ దిగిపోతావు.

  51. 31 “మనుష్య కుమారుడు తన మహిమతో, తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.

    32 మానవులందరినీ పోగుచేసి ఆయన ముందు నిలబెడతారు. అప్పుడు ఒక గొల్లవాడు తన మందలో మేకలను, గొర్రెలను వేరు చేసినట్టు 33 ఆయన తన కుడి వైపున ‘గొర్రెలు’ (నీతిపరులు), ఎడమవైపున ‘మేకలు’ (అనీతిపరులు) ఉండేలా వేరు చేసి నిలబెడతాడు.

    34 తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి. 35 ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. 36 బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు.

    37 అందుకు నీతిపరులు ‘ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం? 38 ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం? 39 ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండడం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం?’ అని ఆయనను అడుగుతారు. 40 అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే’ అని వారికి జవాబిస్తాడు.

    41 “తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. 42 ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. 43 పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు’ అని చెబుతాడు.

    44 అందుకు వారు కూడా, ‘ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దాహంతో ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండడం చూసి నీకు సహాయం చేయలేదు?’ అని అడుగుతారు. 45 అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే’ అని వారికి జవాబిస్తాడు. 46 వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు.”

  52. 1 నాదాబు అబీహులు అహరోను కొడుకులు. వీళ్ళు తమ ధూపం వేసే పాత్రల్లో నిప్పులు ఉంచి వాటిపై ధూప ద్రవ్యాన్ని వేశారు. యెహోవా ఆదేశించని వేరే అగ్నిని ఆయన సమక్షంలోకి తీసుకు వచ్చారు. 2 దాంతో యెహోవా సమక్షంలో నుండి మంటలు వచ్చి వాళ్ళని కాల్చి వేశాయి. యెహోవా సమక్షంలోనే వాళ్ళు చనిపోయారు.

    3 అప్పుడు మోషే అహరోనుతో “నాకు సమీపంగా ఉన్నవారికి నా పవిత్రతని చూపిస్తాను. ప్రజలందరి ముందూ నేను మహిమ పొందుతాను అని యెహోవా చెప్పిన మాటకి అర్థం ఇదే” అన్నాడు. అహరోను ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు.

  53. 21 నా పర్వతాలన్నిటిలో అతని మీదికి ఖడ్గం వచ్చేలా చేస్తాను. ప్రతి ఒక్కరి ఖడ్గం అతని సోదరుని మీద పడుతుంది.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 22 తెగులు, మరణం పంపి అతని మీదా అతని సైన్యం మీదా అతనితో ఉన్న జనాల మీదా భీకరమైన వర్షాన్నీ పెద్ద వడగండ్లనూ అగ్నిగంధకాలనూ కురిపించి అతనితో వాదిస్తాను. 23 అన్యజనాలంతా నేను యెహోవానని తెలుసుకునేలా నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను వారి ఎదుట చూపించి నన్ను నేను హెచ్చించుకుంటాను.

  54. 41 నీనెవె ప్రజలు యోనా ప్రకటన విని పశ్చాత్తాప పడ్డారు కాబట్టి నీనెవె వారు ఈ తరం వారితో నిలబడి తీర్పు రోజున వారి మీద నేరం మోపుతారు. చూడండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.

    42 తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతుంది. ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి ఎంతో దూరం నుండి వచ్చింది. అయితే చూడండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.

  55. 34 తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు. “ఎవరైనా నా వెంట రావాలనుకుంటే తనను తాను కాదనుకుని, తన సిలువను మోసుకుంటూ నాతో నడవాలి. 35 ఎందుకంటే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. 36 ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి, తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం? 37 ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏమి ఇవ్వగలడు?

    38 వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు.”

  56. 4 వివాహం అందరూ గౌరవించేదిగా దాంపత్యం పవిత్రంగా ఉండనివ్వండి. లైంగిక అవినీతిపరులనూ, వ్యభిచారులనూ దేవుడు శిక్షిస్తాడు.

  57. 12 నిజమైన స్వాతంత్రం ఇచ్చే ధర్మశాస్త్రం విషయంలో తీర్పుకు గురయ్యే వారికి తగినట్టుగా మాట్లాడండి. అదే విధంగా ప్రవర్తించండి. 13 కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది.

  58. 7 యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు.

    కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే.

    8 దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ,

    మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ

    వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే.

    పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే.

    భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి.

    ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.

    9 తన భక్తుల పాదాలు తొట్రుపడకుండా ఆయన వారిని కాపాడతాడు.

    దుర్మార్గులు చీకటిలో దాక్కొంటారు.

    బలం వలన ఎవరూ విజయం సాధించలేరు.

    10 యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు.

    పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు.

    భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు.

    తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు.

    తాను అభిషేకించిన రాజుకు అధికమైన బలం కలిగిస్తాడు.”

  59. 4 కానేకాదు. “నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా కనిపించడానికి, నీపై విచారణ జరిగినప్పుడు గెలవడానికి” అని రాసి ఉన్న ప్రకారం మనుషులంతా అబద్ధికులైనా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడే. 5 మన దుర్నీతి దేవుని న్యాయాన్ని వెల్లడి చేస్తున్నప్పటికీ కోపం చూపే దేవుడు అన్యాయం చేసేవాడని చెప్పాలా? నేను మానవ వ్యవహార రీతిలో మాట్లాడుతున్నాను. 6 అలా కానే కాదు. అలాగైతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు?

  60. 5-6 అప్పుడు నీటికి అధిపతిగా ఉన్న దూత, “పూర్వముండి ప్రస్తుతమున్న దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధుల రక్తాన్నీ, ప్రవక్తల రక్తాన్నీ వారు ఒలికించారు. అందుకే నువ్వు వారికి తాగడానికి రక్తం ఇచ్చావు. ఈ విధమైన తీర్పు చెప్పావు గనక నువ్వు న్యాయవంతుడివి. దీనికి వారు అర్హులే.” అని చెప్పాడు. 7 అప్పుడు బలిపీఠం, “అవును, ప్రభూ దేవా, సర్వశక్తి శాలీ, నువ్వు చెప్పే తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి” అని జవాబివ్వగా విన్నాను.

  61. 1 మనుషులు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టారు. వాళ్లకు కూతుళ్ళు పుట్టినప్పుడు 2 దైవ కుమారులు మనుషుల కూతుళ్ళు అందంగా ఉండడం చూసి, వాళ్ళల్లో తమకు నచ్చిన స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు. 3 యెహోవా “జీవమిచ్చే నా ఊపిరి మనుషుల్లో ఎల్లకాలం ఉండదు. ఎందుకంటే వారు బలహీనమైన రక్తమాంసాలు గలవారు. వారు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకరు” అన్నాడు.

    4 దైవ కుమారులు మనుషుల కూతుళ్ళను పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. వీరు ఆ రోజుల్లో, ఆ తరువాత కూడా భూమి మీద ఉన్న దీర్ఘదేహులు. ఈ మహా కాయులు గొప్ప శూరులు. పూర్వకాలంలో పేరుప్రఖ్యాతులు గల వారు వీరే.

    5 మనుషుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు. 6 తాను భూమిమీద మనుషులను చేసినందుకు బాధపడి, హృదయంలో విచారించాడు.

    7 కాబట్టి యెహోవా “నేను సృష్టించిన మనుషులను ఈ భూమిమీద లేకుండా చేస్తాను. మనుషులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాశపక్షులను భూమిమీద లేకుండా తుడిచి వేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను” అన్నాడు.

    8 అయితే నోవహు యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు.

  62. 35 వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే.

    ప్రతిఫలమిచ్చేది నేనే.

    వారి ఆపద్దినం దగ్గర పడింది.

    వారి అంతం త్వరగా వస్తుంది.

    36 బానిస గానీ, స్వతంత్రుడు గానీ, మరెవరూ మిగలకపోతే,

    వారికి ఆధారం లేనప్పుడు చూసి,

    తన సేవకులకు జాలి చూపిస్తాడు,

    తన ప్రజలకు యెహోవా నిర్ణయం చేస్తాడు.

  63. 2 నీ సేవకుణ్ణి విచారణలోకి రప్పించకు. ఎందుకంటే ఏ ఒక్కడూ నీ సమక్షంలో నీతిమంతుడు కాదు.

  64. 1 యెష్షయి వేరు నుంచి చిగురు పుడుతుంది. అతని వేరుల నుంచి కొమ్మ ఎదిగి ఫలిస్తుంది.

    2 జ్ఞానవివేకాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, ఆలోచన బలాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, తెలివినీ యెహోవా పట్ల భయభక్తులనూ పుట్టించే యెహోవా ఆత్మ అతని మీద నిలుస్తుంది.

    3 యెహోవా భయం అతనికి ఆనందం కలిగిస్తుంది.

    4 కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు. తాను విన్న దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసుల్లో దీనులైన వాళ్లకు నిజాయితీగా విమర్శ చేస్తాడు. తన నోటి దండంతో లోకాన్ని కొడతాడు. తన పెదవుల ఊపిరితో దుర్మార్గులను హతం చేస్తాడు.

    5 అతని నడుముకు న్యాయం, అతని మొలకు సత్యం నడికట్టుగా ఉంటాయి.

    6 తోడేలు గొర్రెపిల్లతో నివాసం చేస్తుంది. చిరుతపులి మేకపిల్లతో కలిసి పడుకుంటుంది. దూడ, సింహం కూన, కొవ్విన దూడ కలిసి ఉంటాయి. చిన్న పిల్లవాడు వాటిని తోలుకెళ్తాడు.

    7 ఆవు, ఎలుగుబంటి కలిసి మేస్తాయి. వాటి పిల్లలు ఒక్క చోటే పండుకుంటాయి. ఎద్దు మేసినట్టు సింహం గడ్డి మేస్తుంది.

    8 పాలు తాగే పసిపిల్ల పాము పుట్ట మీద ఆడుకుంటుంది. పాలు విడిచిన పిల్ల, సర్పం పుట్టలో తన చెయ్యి పెడుతుంది.

    9 నా పరిశుద్ధ పర్వతమంతటి మీద, ఏ మృగమూ హాని చెయ్యదు, నాశనం చెయ్యదు. ఎందుకంటే సముద్రం నీటితో నిండి ఉన్నట్టు లోకం యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.

  65. 34 నేను ఉగ్రత కుమ్మరిస్తూ, బలమైన చేతితోనూ, ఎత్తిన చేతితోనూ మిమ్మల్ని చెదరగొట్టిన అనేక దేశాల్లోనుంచ, ప్రజల్లోనుంచి నేను మిమ్మల్ని సమకూర్చి 35 జనాలున్న ఎడారిలోకి మిమ్మల్ని రప్పించి, అక్కడ ముఖాముఖిగా మీకు తీర్పు చెబుతాను. ఇదే యెహోవా వాక్కు.

    36 ఐగుప్తీయుల దేశపు ఎడారిలో నేను మీ పితరులకు తీర్పు చెప్పినట్టు మీకూ తీర్పు చెబుతాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 37 “నా చేతి కర్ర కింద మిమ్మల్ని దాటించి నిబంధన ఒడంబడికలోకి మిమ్మల్ని తీసుకొస్తాను. 38 నా మీద తిరుగుబాటు చేసేవాళ్ళనూ, దోషం చేసేవాళ్ళనూ, మీలో ఉండకుండాా ప్రక్షాళన చేస్తాను. వారు కాపురమున్న దేశంలో నుంచి వాళ్ళను రప్పిస్తాను గాని, నేను యెహోవానని మీరు తెలుసుకునేలా, వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు.”

  66. 1 ఆ రోజుల్లో, ఆ సమయంలో యూదావారిని, యెరూషలేము నివాసులను నేను చెరలోనుంచి రప్పించేటప్పుడు,

    2 ఇతర ప్రజలందరినీ సమకూర్చి,

    యెహోషాపాతు లోయకు వారిని తీసుకువస్తాను.

    నా ప్రజలను బట్టి, నా సొత్తయిన ఇశ్రాయేలును బట్టి

    నేను అక్కడ వారిని శిక్షిస్తాను.

    వారు నా ప్రజలను ఇతర ప్రజల మధ్యకు చెదరగొట్టి

    నా దేశాన్ని పంచుకున్నారు.

  67. 1 ఇదిగో వినండి. యెహోవా తీర్పు దినం వచ్చేస్తోంది. ఆ రోజు మీ నుండి దోచుకున్న సొమ్ము మీ పట్టణాల్లోనే పంచిపెడతారు. 2 ఎందుకంటే యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను ఇతర దేశాల ప్రజలను సమకూర్చబోతున్నాను. అప్పుడు పట్టణం శత్రువు చేజిక్కుతుంది. ఇళ్ళు దోచుకుంటారు. స్త్రీలకు మానభంగాలు జరుగుతాయి. నగరంలో సగానికి పైగా బందీలుగా వెళ్ళిపోతారు. మిగిలినవారు నాశనం కాకుండా నగరంలోనే మిగిలిపోతారు.

    3 అప్పుడు యెహోవా బయలు దేరతాడు. యుద్ధకాలంలో పోరాడే విధంగా ఆయన ఆ ఇతర దేశాల ప్రజలతో యుద్ధం చేస్తాడు. 4 ఆ రోజున ఆయన యెరూషలేము ఎదురుగా తూర్పు దిక్కున ఉన్న ఒలీవ కొండపై ఆయన పాదాలు మోపుతాడు. అప్పుడు ఒలీవ కొండ తూర్పుకు, పడమరకు మధ్యకు చీలిపోయి సగం కొండ ఉత్తరం వైపుకు, సగం కొండ దక్షిణం వైపుకు జరుగుతుంది. వాటి మధ్య ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది.

    5 కొండల మధ్య ఏర్పడిన లోయ ఆజీలు వరకు వ్యాపిస్తుంది. మీరు ఆ కొండ లోయగుండా పారిపోతారు. గతంలో యూదా రాజు ఉజ్జియా రోజుల్లో కలిగిన భూకంపానికి భయపడి పారిపోయినట్టు మీరు పారిపోతారు. నీతోబాటు పరిశుద్ధులందరూ వస్తారు. అప్పుడు నా దేవుడు యెహోవా ప్రత్యక్షం అవుతాడు.

  68. 7 “అయినప్పటికీ, నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు మంచిదే. నేను వెళ్ళకపోతే, ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. కాని నేను వెళ్తే, ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను. 8 ఆదరణకర్త వచ్చినప్పుడు, పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకాన్ని ఒప్పిస్తాడు. 9 ప్రజలు నాలో నమ్మకం ఉంచలేదు గనక పాపం గురించి ఒప్పిస్తాడు. 10 నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు ఇంక నన్ను ఎన్నడూ చూడరు గనక నీతిని గురించి ఒప్పిస్తాడు. 11 ఈ లోకపాలకుడు తీర్పు పొందాడు గనక తీర్పును గురించి ఒప్పిస్తాడు.

  69. 13 మీరు శరీరానుసారంగా నడిస్తే చావుకు సిద్ధంగా ఉన్నారు గానీ ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే మీరు జీవిస్తారు.

    14 దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు. 15 ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం. 16 మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు. 17 మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం.

    18 మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను. 19 దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. 20 ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి, 21 నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది. 22 ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు.

  70. 7 అతడు, “మీరు దేవునికి భయపడండి. ఆయనకు మహిమ ఆపాదించండి. ఆయన మనుషులకు తీర్పు చెప్పే సమయం వచ్చింది. కాబట్టి భూమినీ, ఆకాశాలనూ, సముద్రాన్నీ, భూమి మీద నీటి ఊటలనూ సృష్టించిన ఆయనను పూజించండి.” అంటూ బిగ్గరగా చెప్పాడు.

  71. 11 తరువాత పరలోకం తెరుచుకుని ఉండడం చూశాను. అప్పుడు చూడండి! తెల్లని గుర్రం ఒకటి నాకు కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు ‘నమ్మకమైన వాడు, సత్యవంతుడు.’ ఆయన న్యాయంగా తీర్పు చెబుతూ యుద్ధం చేస్తాడు. 12 ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. అది ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు. 13 ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. ‘దేవుని వాక్కు’ అనే పేరు ఆయనకుంది.

    14 ఆయన వెనకే పరలోక సేనలు తెల్లని నార బట్టలు వేసుకుని తెల్ల గుర్రాలపై ఎక్కి వెళ్తున్నారు. 15 వివిధ జాతి ప్రజలను కొట్టడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుప లాఠీతో వారిని పరిపాలిస్తాడు. సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఆగ్రహపు ద్రాక్ష గానుగ తొట్టిని ఆయనే తొక్కుతాడు.

  72. 10 దేవుడు “నువ్వు చేసిందేమిటి? నీ తమ్ముడి రక్తం నేలలో నుంచి నాకు మొరపెడుతూ ఉంది. 11 ఇప్పుడు నీ మూలంగా ఒలికిన నీ తమ్ముడి రక్తాన్ని మింగడానికి నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండాా నువ్వు శాపానికి గురయ్యావు. 12 నువ్వు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు. నువ్వు భూమి మీద నుంచి అస్తమానం పారిపోతూ, దేశదిమ్మరిగా ఉంటావు” అన్నాడు.

    13 కయీను “నా శిక్ష నేను భరించలేనిది. 14 ఈ రోజు ఈ ప్రదేశం నుంచి నువ్వు నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధిలోకి నేనిక రావడం కుదరదు. ఈ భూమి మీద పలాయనం అవుతూ, దేశదిమ్మరిగా ఉంటాను. నన్ను ఎవరు చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు” అన్నాడు.

    15 యెహోవా అతనితో “అలా జరగదు. నిన్ను చూసిన వాడు ఎవడైనా నిన్ను చంపితే అతణ్ణి తీవ్రంగా శిక్షిస్తానని తెలియజేసేందుకు నీ మీద ఒక గుర్తు వేస్తాను. నిన్ను నేను శిక్షించిన దానికి ఏడు రెట్లు అలాటి వాణ్ణి శిక్షిస్తాను” అన్నాడు. అప్పుడు యెహోవా కయీను మీద ఒక గుర్తు వేశాడు.

  73. 39 చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి.

    నేను తప్ప మరో దేవుడు లేడు.

    చంపేది నేనే, బతికించేది నేనే.

    దెబ్బ కొట్టేది నేనే, బాగు చేసేది నేనే.

    నా చేతిలో నుంచి విడిపించేవాడెవడూ లేడు.

    40 ఆకాశం వైపు నా చెయ్యెత్తి

    నేనెప్పటికీ జీవిస్తున్నట్టుగా పని చేస్తాను.

    41 నేను తళతళలాడే నా కత్తి నూరి,

    నా చెయ్యి న్యాయం తీర్చడం మొదలెడితే,

    నా శత్రువులకు ప్రతీకారం చేస్తాను.

    నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను.

    42 నా బాణాలు రక్తంతో మత్తెక్కి పోయేలా చేస్తాను.

    నా కత్తి, మాంసం భక్షిస్తుంది!

    చచ్చిన వారి రక్తాన్నీ, బందీల రక్తాన్నీ,

    శత్రువు అధికారులనూ అవి తింటాయి.

    43 ఇతర రాజ్యాల ప్రజలారా, దేవుని ప్రజలతో ఆనందించండి.

    వధకు గురి అయిన తన సేవకుల రక్తానికి ఆయన పగ తీరుస్తాడు.

    తన విరోధులకు ప్రతీకారం చేస్తాడు.

    తన దేశం కోసం, తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు.

  74. 13 నేను ఆకాశాన్ని మూసివేసి వాన కురవకుండా చేసినప్పుడూ, దేశాన్ని నాశనం చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడూ, నా ప్రజల మీదికి తెగులు రప్పించినప్పుడూ, 14 నా పేరు పెట్టుకున్న నా ప్రజలు తమని తాము తగ్గించుకుని, ప్రార్థన చేసి, నన్ను వెతికి, తమ దుష్టత్వాన్ని విడిచి నన్ను వేడుకుంటే, నేను పరలోకం నుండి వారి ప్రార్థన విని, వారి పాపాన్ని క్షమించి, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను.

  75. 8 యెహోవా, జాతులకు తీర్పు తీర్చు. నేను ఏ తప్పూ చెయ్యలేదు గనక, నేను న్యాయం జరిగించాను గనక, యెహోవా, మహోన్నతుడా, నా మాట నిజం చెయ్యి.

    9 దుర్మార్గుల దుష్ట కార్యాలు అంతం అగు గాక. కానీ హృదయాలనూ, మనస్సులనూ పరిశీలించే న్యాయమూర్తివైన దేవా, న్యాయవంతులైన ప్రజలను స్థిరపరుచు.

  76. 3 మన దేవుడు వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయనకు ముందుగా భీకర అగ్ని కబళించుకుంటూ వెళ్తుంది. ఆయన చుట్టూ ప్రచండ గాలులు వీస్తున్నాయి.

    4 తన ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయన ఆకాశాలనూ భూమినీ పిలుస్తున్నాడు.

    5 బలి అర్పణ ద్వారా నాతో నిబంధన చేసుకున్న నా విశ్వాస పాత్రులను నా దగ్గరకు సమకూర్చండి అని పిలుస్తున్నాడు.

    6 ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు తానే న్యాయాధిపతిగా ఉన్నాడు.

  77. 8 నీ తీర్పు పరలోకం నుంచి వచ్చింది, భూమికి భయమేసింది, అది మౌనంగా ఉంది.

    9 దేవా! నువ్వు తీర్పు ప్రకటించడానికి, దేశమంతటా అణగారిన వాళ్ళను కాపాడడానికి లేచావు. సెలా.

  78. 16 దానికి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు.

    “చూడండి, నేను సీయోనులో ఒక పునాది రాయి వేస్తాను. అది పరిశోధనకి గురైన రాయి.

    ఒక ప్రశస్తమైన మూలరాయిని వేస్తాను. అది దృఢమైన పునాది రాయి. విశ్వాసం ఉంచే వాడు సిగ్గుపడడు.

    17 నేను న్యాయాన్ని కొలబద్దగానూ, నీతిని ఒడంబంగానూ చేస్తాను. వడగళ్ళు మీ అబద్దాలనే ఆశ్రయాన్ని తుడిచి పెట్టేస్తాయి.

    మీరు దాగి ఉన్న చోటును వరద నీళ్ళు ముంచెత్తుతాయి.

  79. 18 వాళ్ళు చేసిన దానికి తగ్గట్టుగా తిరిగి చేస్తాడు. ఆయన తన విరోధులను కోపంతో శిక్షిస్తాడు. తన శత్రువులపట్ల ప్రతీకారం తీర్చుకుంటాడు. ద్వీపవాసులను కూడా తగురీతిగా శిక్షిస్తాడు.

    19 పడమటి దిక్కున ఉన్నవాళ్ళు యెహోవా నామానికి భయపడతారు. సూర్యోదయ దిక్కున ఉన్నవాళ్ళు ఆయన మహిమకు భయపడతారు. యెహోవా ఊపిరితో కొట్టుకుపోయే ప్రవాహంలాగా ఆయన వస్తాడు.

  80. 24 జాతుల్లోకెల్లా అత్యంత దుర్మార్గమైన జాతిని నేను పంపుతాను. వాళ్ళు వచ్చి ఇళ్ళను స్వాధీనం చేసుకుంటారు.

    వాళ్ళ పవిత్ర స్థలాలను అపవిత్రం చేసి బలశూరుల అహంకారానికి స్వస్తి చెపుతాను!

    25 భయం కలుగుతుంది! వాళ్ళు శాంతిని వాంచిస్తారు కానీ అది వారికి దొరకదు.

    26 నాశనం తరువాత నాశనం కలుగుతుంది.

    పుకార్ల తరువాత పుకార్లు పుట్టుకొస్తాయి.

    వాళ్ళు ప్రవక్తల దగ్గరికి దర్శనం కోసం వెళ్తారు. యాజకులకు ధర్మశాస్త్ర జ్ఞానం లేకుండా పోతుంది.

    సలహా ఇచ్చే పెద్దలకు తెలివి ఉండదు. 27 రాజు విచారంగా ఉంటాడు. యువరాజు నిస్పృహలో సామాన్య వస్త్రాలు ధరిస్తాడు.

    దేశ ప్రజల చేతులు భయంతో వణకుతాయి.

    వాళ్ళ విధానంలోనే నేను వాళ్లకి ఇలా చేస్తాను.

    నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకునే వరకూ వాళ్ళ ప్రమాణాలను బట్టే వాళ్ళకి తీర్పు తీరుస్తాను.”

  81. 16 అందుచేత యెహోవా ప్రభువు,

    సేనల అధిపతి అయిన దేవుడు చెప్పేదేమిటంటే,

    “ప్రతి రాజమార్గంలో ఏడుపు ఉంటుంది.

    ప్రతి నడివీధిలో ప్రజలు చేరి ‘అయ్యో! అయ్యో’ అంటారు.

    ఏడవడానికి, వాళ్ళు రైతులను పిలుస్తారు.

    దుఖపడే నేర్పు గలవారిని ఏడవడానికి పిలిపిస్తారు.

    17 ద్రాక్షతోటలన్నిటిలో ఏడుపు తీవ్రంగా ఉంటుంది.

    ఎందుకంటే నేను మీ మధ్యగా వెళతాను.”

    18 యెహోవా తీర్పు దినం రావాలని ఆశించే మీకు

    ఎంతో బాధ. యెహోవా తీర్పు దినం కోసం ఎందుకు ఆశిస్తారు?

    అది వెలుగుగా ఉండదు, చీకటిగా ఉంటుంది.

    19 ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే

    ఎలుగుబంటి ఎదురు పడినట్టు,

    లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే

    పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది.

    20 యెహోవా దినం వెలుగుగా కాక అంధకారంగా ఉండదా?

    కాంతితో కాక చీకటిగా ఉండదా?

    21 మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు.

    మీ ప్రత్యేక సభలంటే నాకేమీ ఇష్టం లేదు.

    22 నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా

    నేను వాటిని అంగీకరించను.

    సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను.

    23 మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి.

    మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను.

    24 నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి.

    నీతిని ఎప్పుడూ ప్రవహించేలా చేయండి.

  82. 27 మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి. మీ చెవిలో వినిపించేది మేడలమీద చాటించండి.

    28 “ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు. ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి.

  83. 24 “ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో,

    సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు కాంతినివ్వడు.

    25 ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి.

    ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి.

  84. 37 ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు ఎవరూ మీకు తీర్పు తీర్చరు. ఎవరి మీదా నేరారోపణ చేయవద్దు. అప్పుడు ఎవరూ మీ మీద నేరం మోపరు. ఇతరులను క్షమించండి. అప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది.

    38 ఇవ్వండి. అప్పుడు మీకూ ఇస్తారు. అప్పుడు మనుషులు మీకు అదిమి, కుదించి పొంగి పొర్లి పోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకూ కొలవడం జరుగుతుంది.”

  85. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

  86. 7 మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.

    8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు.

  87. 1 అందుచేత మనం విన్న సంగతుల నుండి కొట్టుకుని పోకుండా వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. 2 ఎందుకంటే దేవదూతలు పలికిన సందేశం నమ్మదగినదైతే, ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన శిక్ష కలిగితే, 3 ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? ఆ రక్షణను మొదటిగా ప్రభువే ప్రకటించాడు, దాన్ని విన్న వారి ద్వారా అది మనకు రుజువు అయింది. 4 దేవుడు తన సూచకక్రియలు, అద్భుతాలు, అనేక రకాల గొప్ప గొప్ప కార్యాలు చేయడం ద్వారానూ, తన ఇష్ట ప్రకారం పంచి ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాల ద్వారానూ దాన్ని నిర్ధారణ చేశాడు.

  88. 5 జయించేవాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలో నుండి అతని పేరును నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతే కాకుండా నా తండ్రి ఎదుటా ఆయన దూతల ఎదుటా అతడి పేరు ఒప్పుకుంటాను.

  89. 19 నేను ప్రేమించేవారిని మందలిస్తాను. శిక్షిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు.

  90. 1 ఈ విషయాలు జరిగిన తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు పరలోకంలో నుండి ఒక పెద్ద శబ్దం నేను విన్నాను.

    “హల్లెలూయ! రక్షణ, యశస్సు, బల ప్రభావాలు మన దేవునివే.

    2 ఆయన తీర్పులు సత్యంగా న్యాయంగా ఉన్నాయి.

    తన లైంగిక అవినీతితో భూలోకాన్ని భ్రష్టత్వంలోకి నెట్టిన మహా వేశ్యను ఆయన శిక్షించాడు.

    ఆమె ఒలికించిన తన సేవకుల రక్తానికి ఆయన ప్రతీకారం తీర్చాడు.”

    3 రెండోసారి వారంతా, “హల్లెలూయ! ఆ నగరం నుండి పొగ కలకాలం పైకి లేస్తూనే ఉంటుంది” అన్నారు.