86 Bible Verses About Demons
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
16 సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన చాలా మందిని ప్రజలు ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు. ఆయన ఒక్క మాటతో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులందరినీ బాగు చేశాడు. 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే,
“ఆయనే మన బాధలను తనపై వేసుకున్నాడు.
మన రోగాలను భరించాడు.”
18 యేసు తన చుట్టూ ఉన్న పెద్ద గుంపులను చూసి గలిలయ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించాడు.
19 అప్పుడు ధర్మశాస్త్ర పండితుడు ఒకడు వచ్చి, “బోధకా! నీవు ఎక్కడికి వెళ్ళినా సరే, నేను నీ వెంటే వస్తాను” అన్నాడు. 20 అందుకు యేసు అతనితో, “నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు” అన్నాడు. 21 ఆయన శిష్యుల్లో మరొకడు, “ప్రభూ, మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వండి” అని ఆయనను అడిగాడు. 22 అయితే యేసు అతనితో, “నాతో రా. చనిపోయిన వారిని పాతి పెట్టడానికి చనిపోయిన వారు ఉన్నారులే!” అన్నాడు.
23 ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారు. 24 అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు. 25 శిష్యులు ఆయనను నిద్ర లేపి, “ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి” అంటూ కేకలు వేశారు. 26 యేసు వారితో, “అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు?” అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది. 27 శిష్యులు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటివాడో! గాలీ సముద్రం ఈయన మాట వింటున్నాయే” అని చెప్పుకున్నారు.
28 ఆయన అవతలి ఒడ్డున ఉన్న గదరేనీయుల ప్రాంతం చేరుకున్నప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తులు సమాధుల్లో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురు వచ్చారు. వారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుండడం వలన ఎవరూ ఆ దారిన వెళ్ళలేక పోయేవారు. 29 ఆ దయ్యాలు, “దైవకుమారా, నీతో మాకేంటి? మా కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని కేకలు వేశారు.
30 వారికి కొంత దూరంలో పెద్ద పందుల మంద మేస్తూ ఉంది. 31 “నీవు మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే, ఆ పందుల మందలోకి పోనియ్యి” అని ఆ దయ్యాలు యేసును ప్రాధేయపడ్డాయి. 32 యేసు “సరే, పో” అని వాటితో అన్నాడు. అవి బయటికి వచ్చి ఆ పందుల మందలోకి చొరబడ్డాయి. వెంటనే ఆ మంద అంతా నిటారుగా ఉన్న కొండ మీద నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ పోయి సముద్రంలో పడి చచ్చాయి.
33 ఆ పందుల మందను కాసేవారు పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళి జరిగిన సంగతి, ఇంకా దయ్యాలు పట్టిన వాడికి జరిగిన సంగతీ తెలియజేశారు. 34 అప్పుడు ఆ ఊరి వారంతా యేసును కలవడానికి వచ్చారు. ఆయనను చూసి తమ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపొమ్మని ఆయనను బతిమాలారు.
-
22 అప్పుడు దయ్యం పట్టిన ఒకణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చారు. అతడు గుడ్డివాడు, మూగవాడు కూడా. ఆయన అతణ్ణి బాగుచేశాడు. అతనికి మాట, చూపు రెండూ వచ్చాయి. 23 అందుకు ప్రజలందరూ ఆశ్చర్యపడి, “దావీదు కుమారుడు ఈయనే అయి ఉంటాడా” అని చెప్పుకున్నారు.
24 పరిసయ్యులు ఆ మాట విని, “వీడు దయ్యాలరాజు బయెల్జెబూలు మూలంగానే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మరెవరి వలనా కాదు” అన్నారు. 25 ఆయన వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇలా అన్నాడు, “ఏ రాజ్యమైనా సరే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోతే పాడైపోతుంది. తనకు తానే వ్యతిరేకించి చీలిపోయే ఏ పట్టణమైనా ఏ ఇల్లయినా నిలవదు.
26 ఒకవేళ సాతాను సాతానును వెళ్ళగొడితే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోయినట్టు కదా. అలాగైతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? 27 నేను బయెల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతుంటే మీ వారు ఎవరి వలన వెళ్ళగొడుతున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులవుతారు. 28 దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతుంటే కచ్చితంగా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినట్టే.
29 ఒకడు మొదట బలవంతుణ్ణి కట్టేయకుండా అతని ఇంట్లో చొరబడి అతని సామాను ఎలా దోచుకోగలడు? అలా బంధించ గలిగితేనే అతని ఇంట్లోనుంచి అతని సామాను దోచుకోగలడు. 30 నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే.
-
26 వారు గలిలయకి ఎదురుగా ఉండే గెరాసేను ప్రాంతానికి వచ్చారు. 27 ఆయన ఒడ్డున దిగగానే ఆ ఊరి వాడు ఒకడు ఆయనను ఎదుర్కోడానికి వచ్చాడు. వాడికి దయ్యాలు పట్టి చాలా కాలం నుండి బట్టలు కట్టుకోకుండా తిరుగుతున్నాడు. సమాధులే వాడి నివాసం. ఇంట్లో ఉండేవాడు కాదు.
28 వాడు యేసును చూసి, కేకలు వేశాడు. వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. అతడు “సర్వోన్నత దేవుని కుమారా, యేసూ, నా జోలి నీకెందుకు? నన్ను బాధించకు. నిన్ను బతిమాలుకుంటున్నాను” అంటూ కేకలు పెట్టాడు. 29 ఎందుకంటే ఆయన, “ఈ వ్యక్తిని వదిలి బయటకు రా” అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు. అది చాలాసార్లు వాణ్ణి పట్టి పీడిస్తుంది. వాణ్ణి గొలుసులతోనూ, కాలి సంకెళ్ళతోనూ బంధించి వాడికి కాపలా పెట్టారు గానీ వాడు ఆ బంధకాలన్నిటినీ తెంచుకునేవాడు. దయ్యాలు వాణ్ణి చవిటి భూముల్లోకి తీసుకుపోయేవి.
30 యేసు, “నీ పేరు ఏమిటి?” అని వాడిని అడిగాడు. చాలా దయ్యాలు వాడిలో చొరబడి ఉన్నాయి. కాబట్టి వాడు, “నా పేరు సైన్యం” అన్నాడు. 31 పాతాళంలోకి వెళ్ళమని తనకు ఆజ్ఞ ఇవ్వవద్దని అవి ఆయనను ఎంతో బతిమాలాయి. 32 అక్కడ పెద్ద పందుల మంద ఒకటి కొండ మీద మేస్తూ ఉంది. వాటిలో చొరబడడానికి అనుమతినిమ్మని ఆయనను బతిమాలినప్పుడు ఆయన వాటికి అనుమతినిచ్చాడు. 33 అప్పుడు దయ్యాలు ఆ వ్యక్తిని విడిచి పెట్టి వెళ్ళి పందుల్లో చొరబడ్డాయి. అప్పుడు ఆ మంద ఎత్తయిన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్ళి సరస్సులో పడి ఊపిరాడక చచ్చాయి.
34 ఆ పందులను మేపుతున్న వారు ఇదంతా చూసి పారిపోయారు. వారు పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు.
35 ఆ ఊరి ప్రజలు అదంతా చూడడానికి వెళ్ళారు. వారంతా యేసు దగ్గరికి వచ్చారు. అక్కడ దయ్యాలు వదిలిన వాడు బట్టలు కట్టుకుని స్థిమితంగా యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండడం చూసి భయపడ్డారు. 36 జరిగిన దాన్ని దగ్గరగా చూసిన వారు వాడు ఎలా బాగయ్యాడో ప్రజలకు చెప్పారు. 37 గెరాసేను ప్రాంతాల్లో ఉన్నవారంతా ఎంతో భయపడ్డారు. తమను విడిచి వెళ్ళమని ఆయనను బతిమాలుకున్నారు.
38 ఆయన తిరిగి పడవ ఎక్కి వెళ్ళబోతుంటే దయ్యాలు వదిలిన వ్యక్తి తనను కూడా ఆయనతో ఉండనిమ్మని బతిమాలాడు. 39 కానీ ఆయన, “నువ్వు నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకు చేసిన గొప్ప విషయాలను చెప్పు” అని వాణ్ణి పంపివేశాడు. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన గొప్ప కార్యాన్ని గురించి ఆ పట్టణమంతా ప్రకటించాడు.
-
10 చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. 11 మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
12 ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.
13 అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. 14 మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం, 15 పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. 16 వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి. 17 ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.
18 ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి.
-
23 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. 24 వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు. 25 యేసు దురాత్మను గద్దిస్తూ, “మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు. 26 ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది.
27 ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు. 28 ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది.
-
1 వారు సముద్రం దాటి అవతలి ఒడ్డున ఉన్న గెరాసేను ప్రాంతానికి వెళ్ళారు. 2 యేసు పడవ దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరికి వచ్చాడు. 3 వాడు స్మశానంలోనే నివసించేవాడు. ఇనప గొలుసులతో సైతం వాణ్ణి ఎవ్వరూ కట్టెయ్యలేకపోయారు. 4 వాడి చేతులు, కాళ్ళు ఎన్నిసార్లు గొలుసులతో సంకెళ్ళతో కట్టినా ఆ సంకెళ్ళను తెంపి, కట్లను చిందరవందర చేసే వాడు. వాణ్ణి అదుపు చేసే శక్తి ఎవరికీ లేదు. 5 వాడు స్మశానంలో, కొండల మీదా రేయింబవళ్ళు తిరుగుతూ పెద్దగా కేకలు పెడుతూ తన శరీరాన్ని గాయపరచుకొనేవాడు.
6 వాడు యేసును దూరం నుండి చూసి పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు. 7 “యేసూ, మహోన్నత దేవుని కుమారా! నాతో నీకేం పని? దేవుని పేరిట నిన్ను బతిమాలుతున్నాను, నన్ను బాధ పెట్టవద్దు!” అని అన్నాడు. 8 ఎందుకంటే యేసు అతనితో, “అపవిత్రాత్మా! ఈ మనిషిని వదలి బయటకు రా!” అని అన్నాడు.
9 ఆయన, “నీ పేరేమిటి?” అని అతణ్ణి అడిగాడు. “నా పేరు సేన, మేము చాలా మందిమి,” అని అతడు సమాధానం చెప్పాడు. 10 అతడు ఆ ప్రాంతం నుండి వాటిని పంపివేయవద్దని ఎంతో బతిమాలాడు. 11 ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది.
12 ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల గుంపులో చొరబడడానికి అనుమతి ఇవ్వు” అని వేడుకున్నాయి. 13 యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు అతణ్ణి వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి. అవి వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి.
14 ఆ పందులు మేపేవారు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో ఈ సంగతి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు. 15 వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన వాడు బట్టలు వేసుకుని బుద్ధిగా కూర్చుని ఉండడం గమనించారు. వారికి భయం వేసింది. 16 అదంతా స్వయంగా చూసినవారు, దయ్యాలు పట్టిన వాడికి జరిగిన దాన్ని గురించి, పందుల గురించి అందరికీ చెప్పారు. 17 వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకున్నారు.
18 యేసు పడవ ఎక్కుతూ ఉండగా దయ్యాలు పట్టినవాడు వచ్చి తనను కూడా వెంట రానిమ్మని బతిమాలాడు. 19 కాని యేసు దానికి అంగీకరించకుండా అతనితో, “నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ప్రభువు నీకు చేసినదాని గురించీ నీపై చూపిన దయ గురించీ నీ వారికి చెప్పు” అని అన్నాడు. 20 అతడు వెళ్ళి, యేసు తనకు చేసిన గొప్ప కార్యం గురించి దెకపొలి ప్రాంతంలో ప్రకటించాడు. అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది.
-
32 ఆ ఇద్దరూ వెళ్తుండగా కొంతమంది దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. 33 దయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత ఆ మూగవాడు మాటలాడాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడి, “ఇశ్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు” అని చెప్పుకున్నారు. 34 అయితే పరిసయ్యులు, “ఇతడు దయ్యాల రాజు మూలంగా దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అన్నారు.
-
31 అప్పుడాయన గలిలయ ప్రాంతంలోని కపెర్నహూము అనే ఊరు వచ్చి, విశ్రాంతి దినాన వారికి బోధించాడు. 32 వారాయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన సాధికారికంగా మాట్లాడాడు. 33 ఆ సమాజ మందిరంలో అపవిత్ర దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడున్నాడు. అతడు బిగ్గరగా ఇలా కేకలు వేశాడు, 34 “నజరేతువాడా యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి.” 35 యేసు, “ఊరుకో! ఇతనిలో నుండి బయటకు రా” అని దయ్యాన్ని ఆజ్ఞాపించాడు. దయ్యం అతణ్ణి వారి మధ్యలో కింద పడేసి అతనికి ఏ హానీ చేయకుండా అతనిలో నుండి బయటికి వచ్చేసింది. 36 అందరూ ఆశ్చర్య పడ్డారు. “ఇది ఎలాటి మాట, ఈయన అధికారంతో ప్రభావంతో దయ్యాలకు ఆజ్ఞాపిస్తుంటే అవి బయటికి వచ్చేస్తున్నాయి” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. 37 అప్పుడు ఆయనను గురించిన సమాచారం ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పాకిపోయింది.
-
13 అప్పుడు దేశసంచారం చేసే యూదు మాంత్రికులు కొందరు తమ స్వలాభం కోసం యేసు నామం ఉపయోగిస్తూ, “పౌలు ప్రకటించే యేసు తోడు, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను” అని చెప్పి, దురాత్మలు పట్టినవారిపై ప్రభువైన యేసు పేరు ఉచ్ఛరించడానికి పూనుకున్నారు.
14 స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు కూడా ఆ విధంగా చేస్తున్నారు. 15 అందుకు ఆ దురాత్మ, “నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవరు?” అని వారిని అడిగింది. 16 ఆ దురాత్మ పట్టినవాడు ఎగిరి మీద పడి వారిని లొంగదీసుకోవడంతో ఆ దురాత్మ గెలిచింది. అందుచేత ఆ మంత్రగాళ్ళు గాయాలతో బట్టల్లేకుండా పారిపోయారు.
17 ఈ సంగతి ఎఫెసులో నివసించే యూదులకు, గ్రీకువారికి తెలిసినప్పుడు వారందరికీ భయం వేసింది కాబట్టి ప్రభువైన యేసు నామానికి ఘనత కలిగింది.
-
17 ఆ డెబ్భై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, “ప్రభూ, దయ్యాలు కూడా నీ పేరు చెబితే మాకు లోబడుతున్నాయి” అని చెప్పారు. 18 అప్పుడు ఆయన, “సాతాను మెరుపులా ఆకాశం నుండి పడడం చూశాను. 19 ఇదిగో వినండి, పాములనూ, తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. మీకు ఏదీ ఏ మాత్రమూ హని చేయదు. 20 అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పాడు.
-
14 ఒకసారి ఆయన ఒక మూగ దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఆ దయ్యం వదలిపోయిన తరవాత ఆ మూగవాడు మాట్లాడాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. 15 అయితే వారిలో కొందరు, “వీడు దయ్యాలకు నాయకుడైన బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అని చెప్పుకున్నారు.
16 మరి కొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు. 17 ఆయనకు వారి ఆలోచనలన్నీ తెలుసు. ఆయన వారితో ఇలా అన్నాడు, “తనకు తానే వ్యతిరేకంగా వేరైపోయిన ఏ రాజ్యమైనా నశించి పోతుంది. తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోతుంది. 18 సాతాను కూడా తనకు తానే వ్యతిరేకంగా వేరైపోతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? 19 నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని మీరు అంటున్నారే, మరి మీ అనుచరులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొడుతున్నారు? దీని వలన మీ సంతానమే మీకు తీర్పు తీరుస్తారు. 20 అయితే నేను దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొడుతుంటే దాని అర్థం, దేవుని రాజ్యం కచ్చితంగా మీ దగ్గరికి వచ్చిందనే. 21 బలవంతుడు ఆయుధాలు ధరించుకుని, తన ఆవరణలో కాపలా కాస్తే అతని సొత్తు భద్రంగా ఉంటుంది. 22 అయితే అతని కంటే బలవంతుడైన వాడు అతణ్ణి ఎదిరించి ఓడించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ బలవంతంగా తీసుకుని అతని ఆస్తినంతా దోచుకుంటాడు. 23 నా వైపు ఉండని వాడు నాకు విరోధి. నాతో కలసి పోగుచెయ్యని వాడు చెదరగొట్టే వాడే.
-
14 వారు కొండ దిగి అక్కడి జనసమూహంలోకి రాగానే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకరించి, 15 “ప్రభూ, నా కొడుకును కనికరించు. వాడు మూర్ఛరోగి. చాలా బాధపడుతున్నాడు. పదే పదే నిప్పుల్లో నీళ్ళలో పడిపోతుంటాడు. 16 వాణ్ణి నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాను గాని వారు బాగుచేయలేక పోయారు” అని చెప్పాడు. 17 అందుకు యేసు, “వక్ర మార్గం పట్టిన విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎప్పటి వరకూ మిమ్మల్ని సహిస్తాను? అతణ్ణి నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు. 18 యేసు ఆ దయ్యాన్ని గద్దించగానే అది ఆ బాలుణ్ణి విడిచిపెట్టేసింది. వెంటనే అతడు బాగుపడ్డాడు.
19 తరువాత శిష్యులు ఏకాంతంగా యేసును కలిసి, “మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేక పోయాం?” అని అడిగారు. 20 అందుకాయన, “మీ అల్పవిశ్వాసమే దానికి కారణం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్ళిపోతుంది అని మీతో కచ్చితంగా చెబుతున్నాను. 21 మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు” అని వారితో చెప్పాడు.
-
1 ప్రియులారా, లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మనూ నమ్మకండి. ఆ ఆత్మలు దేవునికి సంబంధించినవో, కావో, పరీక్షించి చూడండి.
2 ఏ ఆత్మైనా దేవునికి చెందినదా లేదా అన్న విషయాన్ని ఈ విధంగా గుర్తించగలుగుతాము. యేసు క్రీస్తు మానవునిగా వచ్చాడు అని అంగీకరించే ప్రతి ఆత్మా దేవునికి చెందినది. 3 యేసును అంగీకరించని ప్రతి ఆత్మా దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధికి చెందిన ఆత్మ. అది రాబోతున్నదని మీరు విన్నారు. కానీ అది ఇప్పటికే ఈ లోకంలో ఉంది. 4 పిల్లలూ, మీరు దేవుని సంబంధులు. మీరు ఆ ఆత్మలను జయించారు. ఎందుకంటే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు.
5 ఆ ఆత్మలు లోకానికి చెందినవారు కాబట్టి వారు చెప్పేది లోక సంబంధంగా ఉంటుంది. లోకం వారి మాట వింటుంది. 6 మనం దేవుని సంబంధులం. దేవుణ్ణి తెలుసుకున్నవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దీన్ని బట్టి ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో మనం తెలుసుకుంటాం.
-
37 మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది. 38 ఆ జనసమూహంలో ఒకడు, “బోధకుడా, నా కుమారుణ్ణి కనికరించమని నిన్ను బతిమాలుకుంటున్నాను. వీడు నాకొక్కడే కుమారుడు. 39 చూడు, ఒక దయ్యం వాణ్ణి పడుతుంది. అది వాణ్ణి పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా పెడబొబ్బలు పెడతాడు. అది వాణ్ణి విలవిలలాడిస్తుంది. అప్పుడు వాడి నోటి నుండి నురుగు కారుతుంది. అది అతి కష్టం మీద వాణ్ణి వదిలిపెడుతుంది గానీ వాణ్ణి చాలా గాయాల పాలు చేస్తుంది. 40 దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను బతిమాలాను గానీ అది వారి వల్ల కాలేదు” అని దీనంగా చెప్పాడు.
41 యేసు, “విశ్వాసం లేని అక్రమ తరమా! నేనెంత కాలం మీతో ఉండి మిమ్మల్ని సహించాలి?” అని, “నీ కొడుకుని ఇక్కడికి తీసుకుని రా” అని ఆ తండ్రితో చెప్పాడు. 42 వాడు వస్తుండగానే ఆ దయ్యం వాణ్ణి కింద పడదోసి అల్లాడించింది. యేసు ఆ దయ్యాన్ని గద్దించి ఆ అబ్బాయిని బాగుచేసి అతని తండ్రికి అప్పగించాడు.
-
7 అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి పోరాటం చేశాడు. 8 కానీ గెలవడానికి వాడి బలం చాలలేదు. కాబట్టి పరలోకంలో ఆ మహా సర్పానికీ వాడి అనుచర దూతలకూ స్థానం లేకపోయింది. 9 ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వాడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వాణ్ణీ వాడితో పాటు వాడి అనుచర దూతలనూ భూమి మీదికి తోసి వేశారు.
-
13 అప్పుడు ఆ మహాసర్పం నోటినుండీ, క్రూరమృగం నోటినుండీ, అబద్ధ ప్రవక్త నోటినుండీ కప్పల్లాగా కనిపిస్తున్న మూడు అపవిత్రాత్మలు బయటకు రావడం చూశాను. 14 అవి ఆశ్చర్యకరమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలే. శక్తిశాలి అయిన దేవుని మహాదినాన జరగబోయే యుద్ధానికి లోకంలో ఉన్న రాజులందర్నీ కూడగట్టడానికి వారి దగ్గరికి వెళ్తున్న ఆత్మలు అవి.
-
16 మరొక రోజు మేము ప్రార్థనాస్థలానికి వెళ్తూ ఉంటే సోదె చెప్పే దయ్యం పట్టిన ఒక యువతి మాకు ఎదురైంది. ఆమె సోదె చెబుతూ తన యజమానులకు చాలా లాభం సంపాదించేది.
17 ఆమె పౌలునూ మమ్మల్ని వెంబడిస్తూ, “వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. వీరు మీకు రక్షణమార్గం ప్రకటిస్తున్నారు” అని కేకలు వేసి చెప్పింది. 18 ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ వచ్చింది. కాబట్టి పౌలు చాలా చికాకు పడి ఆమె వైపు తిరిగి, “నీవు ఈమెను వదలి బయటికి వెళ్ళిపోమని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ దయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదలిపోయింది.
19 ఆమె యజమానులు ఆమె యజమానులు పోయిందని చూసి, పౌలునూ సీలనూ పట్టుకొని రచ్చబండకు అధికారుల దగ్గరికి ఈడ్చుకు పోయారు.
-
32 సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. 33 ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. 34 రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
35 ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు. 36 సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు. 37 ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు. 38 ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు. 39 ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.
-
40 పొద్దుగుంకుతున్నపుడు అనేక రకాల జబ్బులున్న వారిని యేసు దగ్గరికి తెచ్చారు. వారిలో ప్రతి ఒక్కరి మీదా ఆయన చేతులుంచి బాగు చేశాడు. 41 వారిలో చాలామందిలో నుండి దయ్యాలు, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేస్తూ బయటికి వెళ్ళిపోయాయి. ఆయన క్రీస్తు అని వాటికి తెలుసు కాబట్టి ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు.
-
19 దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు సరే. కానీ దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయి. నమ్మి గడగడా వణుకుతున్నాయి.
-
43 “అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసం నీళ్ళు లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది. 44 దానికి విశ్రాంతి దొరకదు. అప్పుడది ‘నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను’ అనుకుని వచ్చి, ఆ ఇంట్లో ఎవరూ లేక అది ఊడ్చి చక్కగా సర్దిపెట్టి ఉండడం చూస్తుంది. 45 అప్పుడది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరో ఏడు దయ్యాలను వెంటబెట్టుకుని వస్తుంది. అవన్నీ అక్కడే నివాసముంటాయి. అందుచేత ఆ వ్యక్తి చివరి స్థితి మొదటి దాని కంటే అధ్వాన్నం అవుతుంది. ఈ దుష్టతరం వారికీ అలాగే అవుతుంది.”
-
14 మిగిలిన శిష్యుల దగ్గరికి ఆయన రాగానే వారి చుట్టూ పెద్ద జనసమూహం ఉండడం, కొందరు ధర్మశాస్త్ర పండితులు వారితో వాదిస్తుండడం చూశాడు. 15 ఆ ప్రజలు యేసును చూసిన వెంటనే ఆశ్చర్యానందానికి లోనయ్యారు. వారంతా ఆయన దగ్గరికి పరుగెత్తి వచ్చి ఆయనకు నమస్కరించారు.
16 యేసు, “దేనిని గురించి వారితో వాదిస్తున్నారు?” అని వారిని అడిగాడు. 17 ఆ ప్రజల్లో ఒకడు ఆయనతో, “బోధకుడా! దయ్యం పట్టి మూగవాడైన నా కుమారుణ్ణి మీ దగ్గరికి తీసుకు వచ్చాను. 18 ఆ దయ్యం వాడి మీదికి వచ్చినప్పుడెల్లా అతన్ని కింద పడేస్తుంది. అతని నోటి వెంట నురగ కారుతుంది, పళ్ళు కొరుకుతాడు, శరీరమంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వదిలించమని మీ శిష్యులను అడిగాను. కాని, వారు చేయలేకపోయారు” అన్నాడు.
19 అందుకు యేసు, “విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎంత కాలం మిమ్మల్ని భరించాలి? ఆ పిల్లవాడిని నా దగ్గరికి తీసుకుని రండి” అన్నాడు. 20 వారు తీసుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ పిల్లవాడిని విలవిల లాడించింది. వాడు నేల మీద పడి గిల గిలా కొట్టుకుంటూ నురగ కక్కుతున్నాడు.
21 యేసు వాడి తండ్రితో, “ఇతనికి ఇది ఎంత కాలం నుండి ఉంది?” అని అడిగాడు. ఆ తండ్రి, “వాడి బాల్యం నుండి. 22 ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పుల్లో, నీళ్ళలో పడేసింది. నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చెయ్యి” అని వేడుకున్నాడు.
23 యేసు అతనితో, “నీవు నమ్మగలిగితే, నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే” అన్నాడు. 24 వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, “నేను నమ్ముతున్నాను. నాలో అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి” అన్నాడు.
25 యేసు జనసమూహం తన దగ్గరికి పరుగెత్తుకుంటూ రావడం చూసి ఆ దయ్యాన్ని గద్దించి, “మూగ చెవిటి దయ్యమా! ఇతనిలో నుండి బయటకు రా! ఇంకెప్పుడూ ఇతనిలో ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను” అన్నాడు. 26 ఆ దయ్యం పెద్ద కేకలు పెట్టి, ఆ పిల్లవాణ్ణి విలవిలలాడించి అతనిలో నుండి బయటకు వచ్చింది. ఆ పిల్లవాడు శవంలా పడి ఉండడం వల్ల చాలా మంది అతడు చనిపోయాడనుకున్నారు. 27 కాని, యేసు అతని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు.
28 యేసు ఇంట్లోకి వచ్చిన తరవాత ఇతరులెవ్వరూ లేనప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం?” అని అడిగారు. 29 ఆయన వారితో, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థన వల్ల మాత్రమే వెళ్ళగొట్టగలం” అని జవాబు చెప్పాడు.
-
37 అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.
-
19 ఈ విషయంలో అభిప్రాయం ఇది. విగ్రహాల్లో గాని, వాటికి అర్పించిన వాటిలో గానీ ఏమైనా ఉన్నదని నేను చెప్పడం లేదు. 20 యూదేతరులు అర్పించే బలులు దేవునికి కాక దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలి భాగస్తులు కావడం నాకిష్టం లేదు. 21 మీరు ప్రభువు పాత్రలోనిదీ, దయ్యాల పాత్రలోనిదీ ఒకేసారి తాగలేరు. ప్రభువు బల్లమీదా, దయ్యాల బల్ల మీదా, ఈ రెంటి మీదా ఉన్నవాటిలో ఒకేసారి భాగం పొందలేరు.
-
23 యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగు చేస్తూ గలిలయ ప్రాంతమంతా తిరిగాడు. 24 ఆయన పేరు సిరియా దేశమంతా తెలిసిపోయింది. రకరకాల వ్యాధులతో, నొప్పులతో బాధపడుతున్న వారిని, దయ్యాలు పట్టిన వారిని, మూర్ఛ రోగులను, పక్షవాతం వచ్చిన వారిని ఆయన దగ్గరికి తీసుకు వస్తే ఆయన వారిని బాగుచేశాడు.
-
41 “తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. 42 ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. 43 పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు’ అని చెబుతాడు.
44 అందుకు వారు కూడా, ‘ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దాహంతో ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండడం చూసి నీకు సహాయం చేయలేదు?’ అని అడుగుతారు. 45 అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే’ అని వారికి జవాబిస్తాడు. 46 వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు.”
-
13 ఒకప్పుడు మీరు చేసిన అపరాధాలవల్లా శరీరంలో మీకు సున్నతి జరగక పోవడంవల్లా మీరు చనిపోయిన వారుగా ఉండేవారు. అప్పుడు ఆయన తనతోబాటు మిమ్మల్ని బతికించాడు. మన అపరాధాలన్నిటినీ క్షమించాడు. 14 మనకు వ్యతిరేకంగా రాసి ఉన్న రుణపత్రాన్నీ, దానికి సంబంధించిన నియమ నిబంధనలనూ ఆయన తుడిచివేశాడు. ఆయన వాటన్నిటినీ తీసివేసి సిలువకు మేకులతో కొట్టాడు. 15 ఆయన సిలువపై ప్రభుత్వాలనూ, ఆధిపత్యాలనూ ఓడించి, వారిని నిరాయుధులుగా చేసి తన విజయోత్సవ ఊరేగింపులో బహిరంగంగా ప్రదర్శించాడు.
-
1 పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు. 2 ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది. 3 వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల్లో కొన్ని తినకూడదని వీరు అంటారు.
4 దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొన్నది ఏదీ నిషేధం కాదు. 5 ఎందుకంటే దేవుని వాక్యమూ ప్రార్థనా దాన్ని పవిత్ర పరుస్తాయి.
-
16 వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు.
అసహ్యమైన విగ్రహాలు పెట్టుకుని ఆయనకు కోపం తెప్పించారు.
17 వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు.
తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ,
మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు.
-
25 ఒక స్త్రీ యేసు గురించి విని వచ్చి ఆయన కాళ్ళపై పడింది. ఆమె కూతురుకు దయ్యం పట్టి ఉంది. 26 ఈ స్త్రీ సిరియాకు చెందిన ఫెనికయా ప్రాంతంలో పుట్టిన గ్రీసు దేశస్తురాలు. తన కూతురులో నుండి ఆ దయ్యాన్ని వదిలించమని యేసును బతిమలాడింది.
27 అందుకు యేసు ఆమెతో, “మొదట పిల్లలు తృప్తిగా తినాలి. చిన్నపిల్లల ఆహారం తీసి కుక్కలకు వేయడం తగదు” అని అన్నాడు. 28 అందుకామె, “ఔను ప్రభూ! అది నిజమే గాని, బల్లకింద ఉన్న కుక్కలు కూడా పిల్లలు పడేసిన ముక్కలు తింటాయి కదా!” అని జవాబు ఇచ్చింది. 29 అప్పుడాయన ఆమెతో, “ఈ మాట చెప్పినందువల్ల ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు. దయ్యం నీ కూతురిని వదలిపోయింది” అన్నాడు. 30 ఆమె ఇంటికి వెళ్ళి తన కూతురు తన మంచంపై పడుకుని ఉండడం చూసింది. దయ్యం ఆమెను వదలిపోయింది.
-
7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.
-
36 వారి విగ్రహాలకు పూజ చేశారు. అవి వారికి ఉరి అయినాయి.
37 వారు తమ కొడుకులను, తమ కూతుళ్ళను దయ్యాలకు బలిగా అర్పించారు.
38 నిర్దోష రక్తం, అంటే తమ కొడుకుల రక్తం తమ కూతుళ్ళల రక్తం ఒలికించారు. కనాను జాతి వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. ఆ రక్తం వలన దేశం అపవిత్రం అయిపోయింది.
39 తమ క్రియల వలన వారు అపవిత్రులైపోయారు. తమ నడవడిలో వ్యభిచారులయ్యారు.
-
11 బలహీనపరచే దయ్యం పట్టిన ఒక స్త్రీ పద్దెనిమిది ఏళ్ళుగా అక్కడ ఉంది. ఆమె నడుం వంగిపోయి ఎంత మాత్రమూ సరిగ్గా నిలబడలేక పోతూ ఉంది. 12 యేసు ఆమెను చూసి, తన దగ్గరికి రమ్మని పిలిచి, “అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందావు” అని ఆమెతో చెప్పి 13 ఆమె మీద చేతులుంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమ పరిచింది.
-
16 యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లోని ప్రజలు, రోగులనూ దురాత్మల చేత బాధల పాలౌతున్న వారిని తీసుకొచ్చారు. వారంతా బాగుపడ్డారు.
-
12 అయితే ప్రస్తుతం నేను చేసేది తరువాత కూడా చేస్తాను. ఎందుకంటే, కొందరు ఏఏ విషయాల్లో గర్వంగా చెప్పుకొంటారో ఆ విషయాల్లో తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు. అలా గర్వంతో చెప్పే అవకాశమేమీ వారికి లేకుండా చేయాలని కోరుతున్నాను.
13 అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు. 14 ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటాడు. 15 అందుచేత, వాడి సేవకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. వారి పనులనుబట్టే వారి అంతముంటుంది.
-
8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. 9 వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.
-
11 దయ్యాలు పట్టినవారు ఆయనను చూడగానే, ఆయన ఎదుట నేలపై పడిపోయి, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేశారు.
-
24 “అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరవాత విశ్రాంతి కోసం వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది. దానికెక్కడా విశ్రాంతి దొరకదు. అందుకని అది ‘నా పాత ఇంటికే మళ్ళీ వెళతాను’ అనుకుంటుంది. 25 అది వచ్చి, ఆ ఇల్లు ఊడ్చి, అమర్చి ఉండడం చూసి 26 తిరిగి వెళ్ళి, తన కంటే చెడ్డవైన మరో ఏడు అపవిత్రాత్మలను వెంటబెట్టుకువస్తుంది. అవి ఆ ఇంట్లో చొరబడి ఇక అక్కడే నివాసముంటాయి. కాబట్టి ఆ వ్యక్తి చివరి దశ మొదటి దశ కంటే అధ్వాన్నంగా ఉంటుంది” అని చెప్పాడు.
-
22 అబీమెలెకు మూడు సంవత్సరాలు ఇశ్రాయేలీయుల మీద ఏలుబడి చేశాడు. 23 దేవుడు అబీమెలెకుకు, షెకెము నాయకులకు వైరం కలిగించే దురాత్మను వాళ్ళ మీదికి పంపాడు. అప్పుడు షెకెము నాయకులు అబీమేలెకుతో తమకున్న ఇప్పండం విషయంలో ద్రోహం చేశారు.
24 యెరుబ్బయలు డెబ్భైమంది కొడుకులకు అబీమెలెకు చేసిన ద్రోహం మూలంగా వాళ్ళను చంపిన వారి సోదరుడు అబీమెలెకు మీదికి ప్రతిఫలం వచ్చేలా దేవుడు ఈ విధంగా చేశాడు. అతడు తన సహోదరులను చంపేలా అతన్ని బలపరచిన షెకెము నాయకుల మీదికి కూడా ఆ నరహత్య ఫలం వచ్చేలా ఆయన చేశాడు. 25 షెకెము యజమానులు కొండ శిఖరాలమీద అతని కోసం మాటు గాళ్ళను ఉంచి, ఆ దారిలో వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ దోచుకున్నారు. అది అబీమెలెకుకు తెలిసింది.
-
9 అప్పటినుండి సౌలు దావీదుపై కక్ష పెంచుకున్నాడు.
10 తరువాతి రోజు దేవుని నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా దిగి వచ్చింది. అతడు ఇంట్లో పూనకంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎప్పటిలాగే తంతి వాద్యం తీసుకుని వాయించాడు. 11 ఒకసారి సౌలు తన చేతిలో ఉన్న ఈటెతో దావీదును గోడకు గుచ్చేస్తాననుకుని ఆ ఈటెను దావీదు మీద బలంగా విసిరాడు. అయితే అది తనకు తగలకుండా దావీదు రెండుసార్లు తప్పించుకున్నాడు.
-
1 ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, అన్నిరకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చాడు.
-
22 అప్పుడు అక్కడ నివసించే కనాను జాతి స్త్రీ ఒకామె వచ్చి, “ప్రభూ, దావీదు కుమారా, నన్ను కరుణించు. నా కూతురికి దయ్యం పట్టి విపరీతంగా బాధ పెడుతున్నది” అని పెద్దగా అరిచి చెప్పింది.
23 కానీ ఆయన ఏమీ బదులు పలకలేదు. అప్పుడు ఆయన శిష్యులు, “ఈమె కేకలు వేస్తూ మన వెంటే వస్తున్నది, ఈమెని పంపించెయ్యి” అని ఆయనను వేడుకున్నారు. 24 దానికి ఆయన, “దేవుడు ఇశ్రాయేలు వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకే నన్ను పంపించాడు, ఇంకెవరి దగ్గరకూ కాదు” అని జవాబిచ్చాడు. 25 అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నాకు సహాయం చెయ్యి” అంది. 26 ఆయన, “పిల్లలు తినే రొట్టెను కుక్కపిల్లలకి పెట్టడం సరి కాదు” అని ఆమెతో అన్నాడు. 27 ఆమె, “ప్రభూ, నిజమే! కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపై నుండి కింద పడే ముక్కలు తింటాయి కదా” అంది.
28 అందుకు యేసు, “నీ నమ్మకం గొప్పదమ్మా. నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది” అని ఆమెతో చెప్పాడు. సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది.
-
1 ఆ తరువాత ఆయన ప్రతి పట్టణానికీ ప్రతి గ్రామానికీ దేవుని రాజ్య సువార్త బోధిస్తూ, ప్రకటిస్తూ సంచారం చేస్తున్నాడు. 2 పన్నెండుగురు శిష్యులు, అపవిత్రాత్మలనుంచీ, రోగాలనుంచీ ఆయన బాగుచేసిన కొందరు స్త్రీలూ, అంటే ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ, 3 హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా అనే అతని భార్య యోహన్నా, సూసన్నా ఇంకా అనేకమంది ఇతర స్త్రీలూ ఆయనతో కూడా ఉన్నారు. వారంతా తమ స్వంత ధనం, సామగ్రిని వెచ్చించి ఆయనకు, ఆయన శిష్యులకు సహాయం చేసేవారు.
-
8 పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు.
-
15 యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు సర్వ లోకానికీ వెళ్ళి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి. 16 దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు.
17 “నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి, వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. కొత్త భాషలు మాట్లాడతారు. 18 తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు. విషం తాగినా వారికి ఏ హానీ కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగుపడతారు.”
-
21 “‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు. 22 ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు. 23 అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.
24 “కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు. 25 వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు. 26 నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు. 27 వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం.”
28 యేసు ఈ మాటలు చెప్పి ముగించినపుడు ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. 29 ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాక అధికారం గల వాడిలాగా వారికి బోధించాడు.
-
38 యోహాను ఆయనతో, “బోధకా! ఒకడు నీ పేరట దయ్యాలను వెళ్ళగొట్టడం చూశాం. అతడు మనవాడు కాదు. అందువల్ల అతన్ని అడ్డగించాం” అన్నాడు. 39 అయితే యేసు, “అతనిని ఆపకండి. నా పేరట అద్భుతం చేసే వాడెవడూ నా గురించి అంత తేలికగా చెడు మాట్లాడలేడు. 40 మనకు వ్యతిరేకంగా లేని వాడు మన పక్షంగా ఉన్నవాడే. 41 మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు క్రీస్తుకు చెందిన వారని గుర్తించి నా పేరట ఒక గిన్నెడు నీళ్ళు ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు.
-
44 మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి.
-
19 ఈ మాటలవల్ల యూదుల్లో మళ్ళీ విభేదాలు వచ్చాయి. 20 వారిలో చాలా మంది, “ఇతనికి దయ్యం పట్టింది. ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు మీరు ఎందుకు వింటున్నారు?” అన్నారు. 21 ఇంకొంతమంది, “ఇవి దయ్యం పట్టినవాడి మాటలు కాదు. దయ్యం గుడ్డివారి కళ్ళు తెరవగలదా?” అన్నారు.
-
20 ఈ కీడుల చేత చావకుండా మిగిలిన మానవాళి పశ్చాత్తాపపడలేదు. వారు దయ్యాలను పూజించడం, తమ చేతులతో చేసిన చూడటానికీ, వినడానికీ, నడవడానికీ శక్తి లేని బంగారంతో, వెండితో, కంచుతో, రాయితో, కర్రతో చేసిన విగ్రహాలను పూజించడం మానలేదు.
-
2 అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు.
“బబులోను నాశనమైంది! బబులోను నాశనమైంది! అది దయ్యాలకు నివాసమైంది.
ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది. అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది.
-
14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తరువాత యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ అతణ్ణి భయపెట్టి, వేధించడం మొదలుపెట్టింది, 15 సౌలు సేవకులు “దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ నిన్ను భయపెడుతున్నది. 16 నీ సేవకులమైన మాతో చెప్పు, దేవుని దగ్గర నుండి దురాత్మ నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు దాని నుండి ఉపశమనం పొందడానికి తంతివాద్యం చక్కగా వాయించగల ఒకణ్ణి వెదుకుతాం. దురాత్మ వచ్చి నిన్ను వేధించినప్పుడల్లా అతడు తంతివాద్యం వాయించడం వల్ల నువ్వు బాగుపడతావు” అని సౌలుతో అన్నారు.
-
19 అప్పుడు మీకాయా ఇలా అన్నాడు. “యెహోవా చెప్పే మాట ఇప్పుడు వినండి, యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. పరలోక సమూహమంతా ఆయన కుడి వైపు, ఎడమ వైపు, నిలబడి ఉన్నారు. 20 ‘అహాబు రామోత్గిలాదు మీదికి వెళ్లి అక్కడ ఓడిపోయేలా అతన్ని ఎవడు ప్రేరేపిస్తాడు’ అని యెహోవా అడిగాడు. ఒకడు ఒక రకంగా ఇంకొకడు ఇంకొక రకంగా చెబుతున్నారు.
21 అప్పుడు ఒక ఆత్మ ముందుకు వచ్చి యెహోవా ఎదుట నిలబడి ‘నేనతన్ని ప్రేరేపిస్తాను’ అన్నాడు. యెహోవా, ‘ఎలా’ అని అతన్ని అడిగాడు. 22 అందుకతడు ‘నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మగా ఉంటాను’ అని చెప్పాడు. ఆయన, ‘నీవు అతన్ని ప్రేరేపిస్తావు, నీ ప్రయత్నం సఫలమవుతుంది. వెళ్లి అలా చెయ్యి’ అన్నాడు. 23 చూడండి, నీకు చెడు జరుగుతుందని యెహోవా నిర్ణయించి ఈ నీ ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మను ఉంచాడు.”
-
19 వారు మాతో “శకునాలు చెప్పే వారి దగ్గరికి, గొణుగుతూ గుసగుసలాడుతూ ఉండే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్లి విచారణ చెయ్యండి” అని చెబుతారు. కానీ ప్రజలు విచారించవలసింది తమ దేవుడి దగ్గరనే గదా?
బతికి ఉన్న వారి కోసం చచ్చిన వారి దగ్గరికి వెళ్లడం ఏమిటి?
20 ధర్మశాస్త్రం పైనా సాక్ష్యం పైనా దృష్టి నిలపండి.
వారు ఇలా చెప్పక పోతే అందుకు కారణం వారికి సూర్యోదయం కలగలేదు.
21 అలాటి వారు ఇబ్బంది పడుతూ ఆకలితో దేశమంతా తిరుగులాడుతారు.
ఆకలేసి కోపపడతారు. తమ ముఖాలు ఆకాశం వైపుకు ఎత్తి తమ రాజును, తమ దేవుణ్ణి దూషిస్తారు.
22 భూమి వైపు తేరి చూసి, దురవస్థ, అంధకారం, భరించరాని వేదన అనుభవిస్తారు. ఇతరులు వారిని వారు గాఢాంధకార దేశంలోకి తోలివేస్తారు.
-
17-18 ఆయన వారితో బాటు కొండ దిగి వచ్చి మైదానంలో నిలిచినప్పుడు ఆయన శిష్యులు, ఇంకా ఇతర ప్రజలు పెద్ద గుంపుగా అక్కడ చేరి ఉన్నారు. వారంతా ఆయన సందేశం వినడానికీ, తమ రోగాలు బాగు చేసుకోడానికీ యూదయ దేశమంతటి నుండీ, యెరూషలేము నుండీ తూరు, సీదోను అనే పట్టణాల నుండీ, సముద్ర తీరాల నుండీ వచ్చారు. వారంతా బాగుపడ్డారు. అలాగే అపవిత్రాత్మలు పట్టి పీడిస్తున్న వారు కూడా బాగయ్యారు. 19 రోగాలను బాగుచేసే ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ బాగుచేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆయనను తాకాలని ప్రయత్నం చేశారు.
-
4 అయినా, చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ వెళుతున్నారు.
5 ఫిలిప్పు సమరయ ఊరికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు. 6 జనసమూహాలు ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూసి అతడు చెప్పిన మాటల మీద ధ్యాస పెట్టారు. 7 చాలా మందికి పట్టిన దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదలిపోయాయి. చాలామంది పక్షవాతం వచ్చినవారూ, కుంటివారూ బాగుపడ్డారు. 8 అందుకు ఆ పట్టణంలో చాలా ఆనందం కలిగింది.
-
3 ఒకవేళ మా సువార్త అగోచరంగా ఉంది అంటే అది కేవలం నాశనమై పోతున్నవారికే. 4 దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని చూపే సువార్త వెలుగు చూడకుండా, ఈ లోక దేవుడు వారి అవిశ్వాస మనో నేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు.
-
9 యెహోవా దగ్గర నుండి దురాత్మ వచ్చి సౌలును ఆవహించాడు. సౌలు ఈటె పట్టుకుని యింటి ఆవరణంలో కూర్చుని ఉన్నాడు. దావీదు తంతి వాద్యం వాయిస్తుంటే, 10 సౌలు ఒకే దెబ్బతో దావీదు గోడకు అతుక్కునేలా తన చేతిలోని ఈటె విసిరాడు. దావీదు పక్కకు తొలగడంతో అది అతని పక్కగా గోడకు గుచ్చుకుంది. దావీదు ఆ రాత్రి తప్పించుకుని పారిపోయాడు.
-
22 యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు, “బయల్జెబూలు ఇతణ్ణి ఆవహించాడు. ఆ దయ్యాల అధిపతి సహాయంతోనే దయ్యాలను పారదోలుతున్నాడు” అన్నారు.
23 యేసు వారిని తన దగ్గరికి పిలిచి, ఉదాహరణల రూపంలో ఇలా అన్నాడు, “సైతాను సైతానును ఎలా వెళ్ళగొడతాడు? 24 చీలికలు వచ్చిన రాజ్యం నిలబడదు. 25 చీలికలు వచ్చిన కుటుంబం నిలబడదు. 26 అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే వాని అధికారం అంతమౌతుంది గదా. 27 నిజానికి ఒక బలవంతుడి ఇంట్లో దొంగతనం చేయాలంటే మొదట అతణ్ణి కట్టివేయాల్సిందే.
28 నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మనుషులు చేసిన అన్ని పాపాలను, వారు పలికే దైవ దూషణలను దేవుడు క్షమిస్తాడు. 29 కాని పరిశుద్ధాత్మను దూషించినవాణ్ణి దేవుడు ఎన్నడూ క్షమించడు. అలా చేసేవాడు శాశ్వత పాపం చేసిన దోషంలో ఉంటాడు.” 30 ‘ఆయనకు దయ్యం పట్టింది’ అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు.
-
9 వారం మొదటి రోజు ఆదివారం తెల్లవారుతూ ఉండగా యేసు లేచి, తాను ఏడు దయ్యాలను వదిలించిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనిపించాడు. 10 ఆమె, యేసుతో కలిసి ఉన్న వారి దగ్గరికి వెళ్ళింది. వారు దుఃఖిస్తూ, విలపిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె యేసు తిరిగి లేచిన సంగతి వారికి చెప్పింది. 11 యేసు మళ్ళీ బతికాడనీ, తాను ఆయనను చూశాననీ చెప్పింది. కాని, వారు ఆమె మాటలు నమ్మలేదు.
-
12 తేజోనక్షత్రమా, వేకువచుక్కా, ఆకాశం నుంచి నువ్వెలా పడిపోయావు? జాతులను కూల్చిన నువ్వు నేలమట్టం వరకూ ఎలా తెగి పడిపోయావు?
13 నువ్వు నీ హృదయంలో, ‘నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని గొప్ప చేసుకుంటాను, ఉత్తరం వైపు ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను,
14 మేఘమండలం మీదకు ఎక్కుతాను, మహోన్నతుడైన దేవునితో నన్ను సమానంగా చేసుకుంటాను’ అనుకున్నావు. 15 అయితే నువ్వు ఇప్పుడు పాతాళపు లోతుల్లోకి దిగిపోయావు. నరకంలో పడి ఉన్నావు.
-
49 అప్పుడు యోహాను, “ప్రభూ, ఎవరో ఒక వ్యక్తి నీ పేర దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. వాడు మనలను అనుసరించేవాడు కాదు కాబట్టి వాణ్ణి అడ్డుకున్నాం” అని యేసుతో చెప్పాడు. 50 అందుకు యేసు, “మీరు వాణ్ణి అడ్డుకోవద్దు. మీకు విరోధి కాని వాడు మీ వైపు ఉన్నవాడే” అని చెప్పాడు.
-
1 మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు 2 పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.
-
6 తమ స్థానం నిలుపుకోని దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వారిని చీకటిలో నిత్య సంకెళ్ళతో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు.
-
27 పురుషుడుగానీ స్త్రీగానీ పూనకం వచ్చి చచ్చిన వారితో, ఆత్మలతో మాట్లాడే వాళ్ళు ఉంటే వారికి తప్పక మరణ శిక్ష విధించాలి. ప్రజలు వారిని రాళ్లతో కొట్టాలి. వారు దోషులు, మరణ పాత్రులు.”
-
10 తన కొడుకుని గానీ కూతుర్ని గానీ మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలూ సర్ప శకునాలూ చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి, 11 ఆత్మలను సంప్రదించేవాణ్ణి, దయ్యాలను సంప్రదించే వాణ్ణి మీమధ్య ఉండనివ్వకూడదు. 12 వీటిని చేసే ప్రతివాడూ యెహోవాకు అసహ్యం. ఇలాంటి అసహ్యమైన వాటిని బట్టే మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుంచి ఆ ప్రజలను వెళ్లగొట్టేస్తున్నాడు.
13 మీరు మీ యెహోవా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. 14 మీరు స్వాధీనం చేసుకోబోయే ప్రజలు మేఘ శకునాలు చెప్పేవారి మాట, సోదె చెప్పేవారి మాట వింటారు. మీ యెహోవా దేవుడు అలా చేయడానికి మిమ్మల్ని అనుమతించలేదు.
-
7 యేసు తన పన్నెండుమంది శిష్యులను దగ్గరికి పిలుచుకుని, వారికి దయ్యాల మీద అధికారమిచ్చి ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు.
8 “ప్రయాణం కోసం చేతికర్ర తప్ప ఇంకేదీ తీసుకు వెళ్ళకండి. ఆహారం గాని, చేతి సంచిగాని, నడికట్టులో డబ్బుగాని, తీసుకు వెళ్ళకండి.
9 చెప్పులు వేసుకోండి గాని, మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి. 10 ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం విడిచే వరకూ ఆ ఇంట్లోనే ఉండండి.
11 ఏ గ్రామం వారైనా మిమ్మల్ని స్వీకరించకపోతే, మీ మాటలు వినకపోతే, మీరు ఆ గ్రామం వదిలే ముందు వారి వ్యతిరేక సాక్షంగా మీ పాద ధూళిని దులిపి వేయండి.”
12 శిష్యులు వెళ్ళి ‘పశ్చాత్తాప పడండి’ అంటూ ప్రకటించారు. 13 ఎన్నో దయ్యాలను వదిలించారు. శిష్యులు అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేశారు.
-
7 నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత. 8 అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను.
-
3 ఇంతలో పరలోకంలో మరో సంకేతం కనిపించింది. అది రెక్కలున్న మహా సర్పం. వాడికి ఏడు తలలున్నాయి. పది కొమ్ములున్నాయి. వాడి ఏడు తలలపై ఏడు కిరీటాలున్నాయి. 4 వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదికి విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం.
-
31 చచ్చిన ఆత్మలతో మాట్లాడుతామని చెప్పే వారి దగ్గరికి సోదె చెప్పేవారి దగ్గరికి పోకూడదు. అలా చేస్తే వారివలన మీరు అపవిత్రులౌతారు. నేను మీ దేవుడైన యెహోవాను.
-
22 అప్పుడు పేతురు ఆయన్ని ఒక పక్కకి తీసుకు పోయి, “ప్రభూ, అది నీకు దూరమవుతుంది, నీకలా ఎప్పటికీ జరగదు” అని గద్దింపుగా అన్నాడు. 23 అయితే యేసు పేతురు వైపు తిరిగి, “సాతానూ, నా వెనక్కి పో! నువ్వు నాకు దారిలో అడ్డుబండగా ఉన్నావు. నీవు దేవుని సంగతులపై కాక మనుషుల సంగతుల పైనే మనసు పెడుతున్నావు” అన్నాడు.
-
1 ఆయన తన పన్నెండుగురు శిష్యులను పిలిచి వారికి దయ్యాలన్నిటి మీద శక్తినీ అధికారాన్నీ, రోగాలు నయం చేసే శక్తినీ ఇచ్చాడు. 2 దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికీ రోగులను బాగు చేయడానికీ వారిని పంపాడు.
3 అప్పుడు ఆయన, “మీరు ప్రయాణం కోసం చేతికర్రను గానీ సంచిని గానీ రొట్టెను గానీ వెండిని గానీ ఇంకా దేనినైనా తీసుకు వెళ్ళవద్దు. రెండు అంగీలు దగ్గర ఉంచుకోవద్దు. 4 మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో ఆ ఇంట్లోనే బస చేయండి. అక్కడ నుండే బయలుదేరండి. 5 మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోకపోతే ఆ ఊరిలో నుండి బయలుదేరేటప్పుడు వారిమీద సాక్ష్యంగా ఉండడానికి మీ కాలి దుమ్మును దులిపివేయండి” అన్నాడు.
6 వారు బయలుదేరి అన్ని స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ, రోగులను బాగు చేస్తూ గ్రామాల్లో పర్యటించారు.
-
48 అందుకు యూదులు, “నువ్వు సమరయ వాడివి, నీకు దయ్యం పట్టింది అని మేము చెబుతున్న మాట నిజమే!” అన్నారు.
49 అప్పుడు యేసు, “నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తున్నాను. మీరు నన్ను అవమానిస్తున్నారు. 50 నేను నా పేరు ప్రతిష్టల కోసం వెతకడం లేదు. అలా వెదికే వాడూ, తీర్పు తీర్చే వాడూ వేరే ఉన్నాడు. 51 మీకు కచ్చితంగా చెబుతున్నాను. నా మాటలు అంగీకరించిన వాడు మరణం రుచి చూడడు” అని జవాబిచ్చాడు.
52 అందుకు యూదులు, “నీకు దయ్యం పట్టిందని ఇప్పుడు మేము స్పష్టంగా తెలుసుకున్నాం. అబ్రాహామూ, ప్రవక్తలూ చనిపోయారు. ‘నా మాట విన్న వాడు మరణం రుచి చూడడు’ అని నువ్వు అంటున్నావు.
-
16 ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి.
-
19 మనం దేవుని సంబంధులం అని మనకు తెలుసు. లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉంది.
-
9 వారు బయలు దేరి పరిశుద్ధుల శిబిరమైన ప్రియ పట్టణాన్ని ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది.
10 వారిని మోసం చేసిన అపవాదిని మండుతున్న గంధకం సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధల పాలవుతారు.
11 తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు. 12 చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు.
13 సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణమూ, పాతాళ లోకమూ వాటి వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు. 14 మరణాన్నీ పాతాళాన్నీ అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండవ మరణం. 15 జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు.
-
1 దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు. 2 స్త్రీ ఆ సర్పంతో “ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు. 3 కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది.
4 పాము స్త్రీతో “మీరు చావనే చావరు. 5 ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు” అన్నాడు. 6 స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.
7 అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు.
-
23 దేవుని నుండి దురాత్మ వచ్చి సౌలును వేధించినప్పుడల్లా దావీదు తంతి వాద్యం వాయించేవాడు. అప్పుడు దురాత్మ అతణ్ణి విడిచిపోయేది. అతడు కోలుకుని నెమ్మది పొందేవాడు.
-
18 అప్పుడు మీకాయా ఇలా అన్నాడు. “యెహోవా మాట వినండి. యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం, పరలోక సైన్యమంతా ఆయన కుడివైపూ ఎడమవైపూ నిలబడి ఉండడం నేను చూశాను. 19 ‘ఇశ్రాయేలు రాజు అహాబు రామోతు గిలాదు మీద యుద్ధానికి వెళ్ళి చనిపోయేలా అతణ్ణి ఎవరు ప్రేరేపిస్తారు?’ అని యెహోవా అడిగాడు. అప్పుడు, ఒకడు ఒక రకంగా, ఇంకొకడు మరొక రకంగా జవాబిచ్చారు.
20 అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ముందు నిలబడి, ‘నేను అతణ్ణి ప్రేరేపిస్తాను’ అని చెప్పాడు. యెహోవా, ‘ఏవిధంగా?’ అని అతణ్ణి అడిగాడు. 21 అందుకు ఆ ఆత్మ, ‘నేను వెళ్ళి అతని ప్రవక్తలందరి నోట అబద్ధాలాడే ఆత్మగా ఉంటాను’ అని చెప్పాడు. అందుకు యెహోవా ‘నువ్వు అతణ్ణి ప్రేరేపించి సఫలమౌతావు. వెళ్ళి అలా చెయ్యి’ అని సెలవిచ్చాడు. 22 నీ ప్రవక్తలైన వీరి నోటిలో యెహోవా అబద్ధాలాడే ఆత్మను ఉంచాడు. యెహోవా నీకు కీడు నిర్ణయించాడు.”
-
5 యేసు ఆ పన్నెండు మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే, “మీరు యూదేతరుల ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు. సమరయ ప్రాంతంలోని ఏ ఊరిలోకీ వెళ్ళొద్దు. 6 ఇశ్రాయేలు వంశంలో దారి తప్పిన గొర్రెల దగ్గరకే వెళ్ళండి. 7 వెళుతూ, ‘పరలోకరాజ్యం దగ్గర్లో ఉంది’ అని ప్రకటించండి. 8 రోగులను బాగుచేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టురోగులను శుద్ధి చెయ్యండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి.
9-10 బంగారం, వెండి, ఇత్తడి, ప్రయాణం కోసం పెట్టె, రెండు అంగీలు, చెప్పులు, చేతికర్ర, ఇవేవీ మీ సంచిలో ఉంచుకోవద్దు. ఎందుకంటే పనివాడు తన ఆహారానికి అర్హుడు. 11 మీరు ఏదైనా పట్టణంలో లేదా ఊరిలో ప్రవేశించినప్పుడు దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకోండి. అక్కడ నుండి వెళ్ళే వరకూ అతని ఇంట్లోనే అతిథిగా ఉండిపొండి. 12 ఆ ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటివారికి శుభం పలకండి. 13 ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని పైకి వస్తుంది. దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకు తిరిగి వచ్చేస్తుంది.
14 ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ మాటలు వినకపోతే మీరు ఆ ఇంటిని గానీ ఆ ఊరిని గానీ, విడిచి వెళ్ళిపోయేటపుడు మీ పాదధూళి దులిపి వేయండి. 15 తీర్పు దినాన ఆ పట్టణానికి పట్టే గతి కంటే సొదొమ గొమొర్రా నగరాల గతి నయంగా ఉంటుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
-
18 ఎందుకంటే యోహాను వచ్చి రొట్టె తినకుండా, ద్రాక్షరసం తాగకుండా ఉండేవాడు. ‘అతనికి దయ్యం పట్టింది’ అని వారంటున్నారు. 19 మనుష్య కుమారుడు తింటూ, తాగుతూ వచ్చాడు. కాబట్టి ‘వీడు తిండిబోతూ, తాగుబోతూ, పన్నులు వసూలు చేసే వారికీ పాపులకూ స్నేహితుడు’ అని వారంటున్నారు. అయితే జ్ఞానం అది చేసే పనులను బట్టి తీర్పు పొందుతుంది.”
-
13 తరువాత యేసు కొండ ఎక్కి వెళ్ళి తనను ఎవరు అనుసరించాలని ఆయన కోరుకున్నాడో వారిని పిలిచాడు. వారు ఆయన దగ్గరికి వచ్చారు. 14 తనతో ఉండడానికీ, సువార్త ప్రకటనకు పంపడానికీ ఆయన పన్నెండు మందిని నియమించాడు. వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు. 15 రోగాలను బాగుచేయడానికీ, దయ్యాలను వెళ్ళగొట్టడానికీ వారికి అధికారం ఇచ్చాడు.
-
33 బాప్తిసమిచ్చే యోహాను రొట్టెలు తినకుండా ద్రాక్షారసం తాగకుండా ఉన్నాడని ‘వీడికి దయ్యం పట్టింది’ అని మీరు అంటున్నారు. 34 మనుష్య కుమారుడు తింటూ తాగుతూ ఉన్నాడని ‘వీడు తిండిబోతూ, తాగుబోతూ, సుంకరులకూ పాపులకూ స్నేహితుడు’ అంటున్నారు. 35 అయితే జ్ఞానం దాని పిల్లలను బట్టి జ్ఞానమని తీర్పు పొందుతుంది.”
-
31 ఇప్పుడు ఈ లోకానికి తీర్పు సమయం. ఇది ఈ లోకపాలకుణ్ణి తరిమివేసే సమయం.
-
11 అంతేగాక దేవుడు పౌలు చేత కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతాలను చేయించాడు. 12 అతని శరీరానికి తాకిన చేతిగుడ్డలయినా, నడికట్లయినా రోగుల దగ్గరికి తెస్తే వారి రోగాలు పోయాయి, దురాత్మలు కూడా వదలిపోయాయి.
-
3 మేము శరీరంతో జీవిస్తున్నా శరీరానుసారంగా యుద్ధం చేయం. 4 మా యుద్ధ పరికరాలు లోక సంబంధమైనవి కావు. కోటలను ధ్వంసం చేసి, మనుషులను పక్కదోవ పట్టించే వాదాలను ఓడించే దైవ శక్తి వాటికి ఉంది. 5 వాటితో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్నీ నాశనం చేసి, ప్రతి ఆలోచననూ వశపరచుకుని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం. 6 మీ విధేయత పూర్తి అయినప్పుడు అవిధేయతనంతటినీ శిక్షించడానికి సిద్ధపడి ఉన్నాం.
Shows Read in context, Share and Copy.