35 Bible Verses About Loneliness

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Loneliness
  1. 18 దేవుడైన యెహోవా “మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను” అనుకున్నాడు. 19 దేవుడైన యెహోవా, ప్రతి భూజంతువునూ ప్రతి పక్షినీ నేలలోనుంచి చేసి, ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరికి వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ ఆదాము ఏ పేరు పెట్టాడో, ఆ పేరు దానికి ఖాయం అయ్యింది. 20 అప్పుడు ఆదాము పశువులన్నిటికీ, ఆకాశపక్షులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది. 21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు. 22 ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారుచేసి ఆదాము దగ్గరికి తీసుకువచ్చాడు.

    23 ఆదాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం.

    మనిషిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి” అన్నాడు.

    24 ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు.

  2. 5 తన పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా, వితంతువులకు సహాయకుడిగా ఉన్నాడు.

    6 దేవుడు ఒంటరి వారిని కుటుంబాలుగా చేస్తాడు. ఆయన బంధకాల్లో ఉన్న వారిని విడిపించి వారిని వృద్ధి చెందిస్తాడు. తిరుగుబాటు చేసే వారి భూములు బీడులైపోతాయి.

  3. 5 డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. “నిన్ను ఎన్నటికీ విడిచి పెట్టను. నిన్ను పరిత్యజించను” అని దేవుడే చెప్పాడు. 6 కాబట్టి, “ప్రభువు నాకు సహాయం చేసేవాడు. నేను భయపడను. నన్ను ఎవరేం చేయగలరు?” అని ధైర్యంగా చెప్పగలిగేలా తృప్తి కలిగి ఉందాం.

  4. 35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా? 36 దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే,

    “నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం.

    వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”

    37 అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

  5. 15 నా కళ్ళు ఎప్పుడూ యెహోవా మీదే ఉన్నాయి, ఎందుకంటే ఆయన నా పాదాలను వలలోనుంచి విడిపిస్తాడు.

    16 నా వైపు తిరిగి నన్ను కరుణించు, ఎందుకంటే నేను ఒంటరివాణ్ణి, బాధ పొందినవాణ్ణి.

    17 నా హృదయవేదనలు అతి విస్తారం. అమితమైన బాధ నుంచి నన్ను బయటకు లాగు.

    18 నా బాధ, నా కష్టం చూడు. నా పాపాలన్నీ క్షమించు.

    19 నా శత్రువులను చూడు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రూరమైన ద్వేషంతో వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు.

    20 నా ప్రాణం కాపాడి నన్ను రక్షించు. నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను నీ ఆశ్రయం కోరుతున్నాను.

    21 నీ కోసం నేను కనిపెడుతున్నాను గనక యథార్థత, నిర్దోషత్వం నన్ను సంరక్షిస్తాయి గాక.

  6. 15 మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.

    16 “నేను తండ్రిని అడుగుతాను. మీతో ఎల్లప్పుడూ ఉండేలా ఇంకొక ఆదరణకర్తను ఆయన మీకు ఇస్తాడు. 17 ఆయన సత్యం అయిన ఆత్మ. లోకం ఆయనను చూడదు, తెలుసుకోదు కాబట్టి ఆయనను స్వీకరించదు. అయితే మీకు ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. 18 నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మీకోసం నేను మళ్ళీ వస్తాను.

  7. 9 నా నుంచి నీ ముఖం దాచకు. కోపంతో నీ సేవకుణ్ణి దెబ్బ కొట్టకు! నా సహాయకుడిగా నువ్వే ఉన్నావు, రక్షణకర్తవైన నా దేవా, నన్ను విడువకు, నన్ను విడిచి వెళ్ళకు.

    10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తాడు.

  8. 18 అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. 19 కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.

  9. 33 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది. 34 మూడు గంటలకు యేసు, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!” అని గావుకేక పెట్టాడు. ఆ మాటలకు, “నా దేవా! నా దేవా! నా చెయ్యి విడిచిపెట్టావెందుకు?” అని అర్థం.

  10. 16 నేను మొదట న్యాయస్థానం ఎదుట వాదించుకున్నపుడు నా పక్షంగా ఎవరూ నిలబడలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరం కాకుండా ఉండు గాక.

    17 అయితే నేను సువార్త సంపూర్ణంగా ప్రకటించేందుకూ యూదులు కాని వారంతా దాన్ని వినేందుకూ ప్రభువు నా పక్షాన ఉండి నన్ను బలపరిచాడు కాబట్టి సింహం నోటి నుండి ప్రభువు నన్ను తప్పించాడు. 18 ప్రభువు అన్ని చెడుపనుల నుండీ నన్ను తప్పించి సురక్షితంగా తన పరలోక రాజ్యం చేరుస్తాడు. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక, ఆమేన్‌.

  11. 10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను.

    నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి.

    దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను.

    నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.

  12. 7 నేను ఆలోచిస్తున్నపుడు సూర్యుని కింద నిష్ప్రయోజనమైంది ఇంకొకటి కనిపించింది.

    8 ఒకడు ఒంటరిగా ఉన్నాడు.

    అతనికి జతగాడు గాని, కొడుకు గాని, సోదరుడు గాని లేడు.

    అయినా అతడు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు.

    ఐశ్వర్యం అతనికి తృప్తి కలిగించదు.

    సుఖమనేది లేకుండా ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాను అనుకుంటాడు.

    ఇది కూడా ఆవిరిలాగా నిష్ప్రయోజనం, విచారకరం.

    9 ఇద్దరు కష్టపడితే ఇద్దరికీ మంచి జరుగుతుంది.

    కాబట్టి ఒంటరిగా కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది.

    10 ఒకడు కింద పడినా మరొకడు లేపుతాడు.

    అయితే ఒక్కడే ఉంటే అతడు పడినప్పుడు లేపేవాడు లేనందువలన అతనికి కష్టమే మిగులుతుంది.

    11 ఇద్దరు కలిసి పండుకొంటే వారికి వెచ్చగా ఉంటుంది. ఒక్కడే ఉంటే వీలు కాదు కదా!

    12 ఒంటరిగా ఉన్నవాణ్ణి పడదోయడం తేలిక.

    అయితే ఇద్దరు కలిసి ఉంటే తమపై దాడిని ఎదుర్కోగలరు.

    మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు గదా?

  13. 28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  14. 4 చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.

    5 నా శత్రువుల సముఖంలో నువ్వు నాకు భోజనం సిద్ధం చేస్తావు, నూనెతో నా తల అభిషేకం చేశావు. నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది.

    6 కచ్చితంగా నేను బ్రతికిన రోజులన్నీ మంచి, నిబంధన నమ్మకత్వం నన్ను వెంటాడతాయి. చాలా కాలం యెహోవా ఇంట్లో నేను నివాసం ఉంటాను.

  15. 31 యేసు జవాబిస్తూ, “మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? 32 మీరందరూ ఎవరి ఇంటికి వారు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతూ ఉంది. వచ్చేసింది కూడా. అయినప్పటికీ, నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిని కాదు. 33 నన్ను బట్టి మీకు శాంతి కలగాలని నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు బాధ ఉంది. కాని ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను” అన్నాడు.

  16. 6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు. వాళ్ళను చూసి కంగారు పడవద్దు. మీతో వచ్చేవాడు మీ యెహోవా దేవుడే. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మర్చిపోడు.”

  17. 3 ఆయన మనుష్యుల తృణీకారానికీ నిరాకరణకూ గురి అయ్యాడు. ఆయన విచారాలతో అస్తమానం బాధలతో నిండిపోయినవాడు.

    మన ముఖాలు ఆయనకు కనబడకుండా చేసుకున్నాం. ఆయన తృణీకారానికి గురి అయ్యాడు. ఆయనంటే మనకు లెక్కలేదు.

    4 అయితే ఆయన మన రోగాలను కచ్చితంగా భరించాడు. మన దుఖాలను మోశాడు.

    అయినా దేవుడు ఆయనను శిక్షించాడనీ దెబ్బ కొట్టి బాధించాడనీ మనం భావించుకున్నాం.

    5 కానీ ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలగగొట్టడం జరిగింది.

    మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్దాం.

    6 మనందరం గొర్రెలలాగా దారి తప్పాము. మనలో ప్రతివాడూ తనకిష్టమైన దారికి తొలగిపోయాము.

    యెహోవా మనందరి దోషాన్ని ఆయనమీద మోపాడు.

  18. 35 ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు.

  19. 9 నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”

  20. 24 ఎక్కువ మంది స్నేహితులున్న వాడికి నష్టం. అయితే సోదరుని కన్నా సన్నిహితంగా ఉండే మిత్రులు కూడా ఉంటారు.

  21. 15 స్త్రీ, తన గర్భాన పుట్టిన బిడ్డ మీద జాలిపడకుండా ఉంటుందా? తన చంటిపిల్లను మరచిపోతుందా? వాళ్ళు మరచిపోవచ్చు గానీ నేను నిన్ను మరచిపోను.

    16 చూడు, నా అరచేతుల్లో నిన్ను పచ్చబొట్టు పొడిపించుకున్నాను. నీ గోడలు ఎప్పటికీ నా ఎదుట ఉన్నాయి.

  22. 8 నీకు ముందుగా వెళ్ళేవాడు యెహోవాయే. ఆయన నీతో ఉంటాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, మర్చిపోడు. భయపడవద్దు. వాళ్ళను చూసి దిగులు పడవద్దు” అని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అతనితో చెప్పాడు.

  23. 4 మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి, దుర్మార్గులు వరద ప్రవాహంలా నా మీద పడి నన్ను అణిచివేస్తున్నారు

    5 పాతాళ పాశాలు నన్ను చుట్టుముట్టాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి.

    6 నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను. నాకు సహాయం చెయ్యమని దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయంలోనుంచి నా స్వరం విన్నాడు, నా నివేదన ఆయన సన్నిధిలో ఆయన చెవిన పడింది.

  24. 23 అయినా నేను నిరంతరం నీతో ఉన్నాను. నువ్వు నా కుడిచెయ్యి పట్టుకుని ఉన్నావు.

    24 నీ సలహాలతో నన్ను నడిపిస్తావు. తరువాత నన్ను మహిమలో చేర్చుకుంటావు.

    25 పరలోకంలో నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకింకేమీ అక్కరలేదు.

    26 నా శరీరం, నా హృదయం క్షీణించిపోయినా దేవుడు ఎప్పుడూ నా హృదయానికి బలమైన దుర్గంగా ఉన్నాడు.

  25. 1 అప్పుడు అపవాది వల్ల యేసును విషమ పరీక్షలకు గురి చేయడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. 2 నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది.

  26. 14 ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. 16 కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.

  27. ప్రధాన సంగీతకారుని కోసం, అయ్యలెతు షహరు (జింకల లయ) రాగంలో దావీదు కీర్తన.

    1 నా దేవా, నా దేవా, నువ్వు నన్నెందుకు విడిచిపెట్టేశావు? నన్ను రక్షించడానికీ, నా వేదన వాక్కులు వినడానికీ, నువ్వు దూరంగా ఎందుకున్నావు?

    2 నా దేవా, పగలు నేను మొరపెడతాను, కాని నువ్వు జవాబివ్వవు. రాత్రివేళ నేను మౌనంగా ఉండను!

  28. 7 నీ ఆత్మ నుండి నేనెక్కడికి వెళ్ళగలను? నీ సమక్షంలో నుండి నేనెక్కడికి పారిపోగలను?

    8 ఆకాశానికి ఎక్కి వెళ్దామంటే నువ్వు అక్కడ ఉన్నావు. మృత్యులోకంలో దాక్కుందామనుకుంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు.

    9 నేను ఉదయకాలం రెక్కలు కట్టుకుని ఎగిరివెళ్ళి సముద్రపు లోతుల్లో దాక్కుంటాను.

    10 అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. నీ కుడిచెయ్యి నన్ను పట్టుకుంటుంది.

  29. 4 నా కుడి పక్కన చూస్తే నన్ను ఆదరించేవాడు ఒక్కడు కూడా కనిపించలేదు. తప్పించుకునే దారి లేదు. నాప్రాణం గురించి పట్టించుకునే వాడే లేడు.

  30. 16 సేనల ప్రభువైన యెహోవా, నేను నీ పేరు పెట్టుకున్నాను. నీ మాటలు నాకు దొరికితే నేను వాటిని తిన్నాను. నీ మాటలు నాకెంతో సంతోషంగా హృదయానందంగా ఉన్నాయి.

    17 వేడుక చేసుకునే వాళ్ళ గుంపులో నేను కూర్చుని సంతోషించలేదు. నీ బలమైన చెయ్యి నా మీద ఉంది. కడుపుమంటతో నువ్వు నన్ను నింపావు. కాబట్టి, నేను ఒంటరిగా కూర్చున్నాను.

  31. 3 నిజమైన వితంతువులను గౌరవించు. 4 అయితే ఏ వితంతువుకైనా పిల్లలు గాని, మనవలు గాని ఉంటే, వీరు మొదట తమ ఇంటివారి పట్ల తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవునికి ఎంతో ఇష్టం. 5 నిజంగా వితంతువు ఒక్కతే ఉండి, దేవుని మీదనే తన నమ్మకం పెట్టుకుని, ఆయన సాయం కోసం రేయింబగళ్ళు ప్రార్ధిస్తూ, విన్నపాలు చేస్తూ ఉంటుంది. 6 అయితే విలాసాల్లో బతికే వితంతువు బతికి ఉన్నా చచ్చినట్టే.

  32. 17 ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు.

    18 విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు.

  33. 11 నా ఈ పరిస్థితి కారణంగా నా స్నేహితులూ, తోటివాళ్ళూ నన్ను వదిలేశారు. నా పొరుగువాళ్ళు దూరంగా నిలబడ్డారు.

  34. 28 నీకు తెలియలేదా? నీవు వినలేదా?

    భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు.

    ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.

    29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.

    30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.

    31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.

    వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.

    అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

  35. 20 “ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను.”