70 Bible Verses About Hate

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Hate
  1. 43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.

    46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.

  2. 8 పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు.

    9 దేవుని ద్వారా జన్మించిన వాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా జన్మించిన వాడిలో దేవుని విత్తనం ఉంటుంది కాబట్టి అతడు పాపం చెయ్యలేడు. 10 నీతిని జరిగించని వారు దేవుని పిల్లలు కాదు. తమ సోదరుణ్ణి ప్రేమించనివారు దేవుని పిల్లలు కాదు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, సైతాను పిల్లలెవరో తెలిసిపోతుంది.

    11 మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలన్న సందేశం మీరు ఆరంభం నుండి వింటూనే ఉన్నారు. 12 సైతాను సంబంధి అయిన కయీను తన తమ్ముణ్ణి చంపాడు. మీరు అతనిలా ఉండవద్దు. కయీను తన తమ్ముణ్ణి ఎందుకు చంపాడు? అతని క్రియలు దుర్మార్గమైనవి. అతని తమ్ముని క్రియలు నీతిగలవి.

    13 నా సోదరులారా, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. 14 మనం మన సోదరులను ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మరణంలో నుండి జీవంలోకి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు. 15 తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతివాడూ హంతకుడే. ఏ హంతకునిలోనూ శాశ్వత జీవం నిలిచి ఉండదని మీకు తెలుసు.

  3. 27 “వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. 28 మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి.

  4. 10 యెహోవాను ప్రేమించే మీరంతా దుర్మార్గాన్ని అసహ్యించుకోండి! తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడతాడు, దుర్మార్గుల చేతిలోనుంచి ఆయన వారిని తప్పిస్తాడు.

  5. 8 అయినా, మీకు కొత్త ఆజ్ఞ రాస్తున్నాను. క్రీస్తులోనూ, మీలోనూ ఇది నిజమే. ఎందుకంటే చీకటి వెళ్ళిపోతూ ఉంది. నిజమైన వెలుగు ఇప్పటికే ప్రకాశిస్తూ ఉంది. 9 తాను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, తన సోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు. 10 తన సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. అతడు తడబడి పడిపోయే అవకాశం లేదు. 11 కాని తన సోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. చీకట్లోనే నడుస్తూ ఉన్నాడు. చీకటి అతణ్ణి గుడ్డివాడుగా చేసింది కాబట్టి అతడు ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు.

  6. 18 “ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, మీకన్నా ముందు అది నన్ను ద్వేషించిందని తెలుసుకోండి. 19 మీరు ఈ లోకానికి చెందిన వారైతే ఈ లోకం దాని సొంతవాళ్ళలా మిమ్మల్ని ప్రేమిస్తుంది. కాని, మీరు లోకానికి చెందిన వారు కాదు. ఎందుకంటే, నేను మిమ్మల్ని ఈ లోకంలోనుంచి వేరు చేశాను. అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది.

    20 “‘దాసుడు తన యజమానికంటే గొప్పవాడు కాదు’ అని నేను మీతో చెప్పిన మాట గుర్తు చేసుకోండి. వారు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా మాట ప్రకారం చేస్తే, మీ మాట ప్రకారం కూడా చేస్తారు. 21 వారికి నన్ను పంపిన వాడు తెలియదు కాబట్టి, నా పేరిట ఇవన్నీ మీకు చేస్తారు.

  7. 19 దేవుడే మొదట మనలను ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం.

    20 “నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని చెబుతూ, తన సోదరుణ్ణి ద్వేషిస్తే, అతడు అబద్ధికుడే. కనిపిస్తున్న సోదరుణ్ణి ప్రేమించని వాడు, కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు. 21 దేవుణ్ణి ప్రేమించేవాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి, అన్న ఆజ్ఞ ఆయన నుండి మనకు ఉంది.

  8. 13 దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, అహంకారం, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం.

  9. 17 నీ హృదయంలో నీ సోదరుణ్ణి అసహ్యించుకోకూడదు.

    నీ పొరుగువాడి పాపం నీ మీదికి రాకుండేలా నీవు తప్పకుండా అతణ్ణి గద్దించాలి.

    18 పగ సాధించ వద్దు. ఎవరిమీదా కక్ష పెట్టుకోవద్దు.

    నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ సాటి మనిషిని ప్రేమించాలి. నేను యెహోవాను.

  10. 19 దేవా, దుష్టులను నువ్వు కచ్చితంగా హతమారుస్తావు. హింసించే వాళ్ళంతా నా దగ్గర నుండి వెళ్ళిపొండి.

    20 వాళ్ళు దుష్ట తలంపులు మనసులో ఉంచుకుని నీపై తిరగబడతారు. నీ శత్రువులు అబద్ధాలాడతారు.

    21 యెహోవా, నిన్ను ద్వేషించే వాళ్ళను నేను ద్వేషిస్తున్నాను గదా. నీ మీద తిరుగుబాటు చేసేవాళ్ళను నేను అసహ్యించుకుంటున్నాను గదా.

    22 వాళ్ళ మీద నాకు తీవ్రమైన ద్వేషం ఉంది. వాళ్ళు నాకు శత్రువులు.

    23 దేవా, నన్ను పరిశోధించు. నా హృదయంలో ఏమున్నదో పరిశీలించి చూడు. నన్ను పరీక్షించి నా ఆలోచనలు ఎలాంటివో తెలుసుకో.

    24 నీకు బాధ కలిగించే విధానాలు నేను అనుసరిస్తున్నానేమో నన్ను పరిశీలించు. శాశ్వత మార్గంలో నన్ను నడిపించు.

  11. 12 ప్రేమ దోషాలన్నిటినీ కప్పి ఉంచుతుంది. పగ తగాదాలను రేకెత్తిస్తుంది.

  12. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

  13. 26 “నా దగ్గరికి వచ్చే వాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ చివరకూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు.

  14. 22 నా నామాన్ని బట్టి అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. చివరి వరకూ సహించే వారిని దేవుడు రక్షిస్తాడు.

  15. 9 మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి.

  16. 16 యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు.

    17 అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు, 18 దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు, 19 లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.

  17. 23 “నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. 24 ఎవ్వరూ చెయ్యని క్రియలు నేను వారి మధ్య చేయకపోతే వారికి పాపం ఉండేది కాదు. కాని, వారు నా కార్యాలు చూసినా నన్నూ, నా తండ్రినీ ద్వేషిస్తున్నారు. 25 ‘కారణం లేకుండా నన్ను ద్వేషించారు’ అని వారి ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కు నెరవేరేలా ఇది జరుగుతూ ఉంది.

  18. 24 పగవాడు పెదాలతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు.

    25 వాడు దయగా మాటలాడితే వాడి మాట నమ్మవద్దు. వాడి హృదయంలో ఏడు అసహ్యమైన విషయాలు ఉన్నాయి.

    26 వాడు తన ద్వేషాన్ని కపట వేషంతో కప్పుకుంటాడు. సమాజంలో వాడి చెడుతనం బట్టబయలు అవుతుంది.

  19. 4 నువ్వు దుష్టత్వాన్ని సమర్ధించే దేవుడివి కాదు. చెడుతనం చేసే వాళ్ళు నీ అతిథులుగా ఉండరు.

    5 దురహంకారులు నీ సన్నిధిలో నిలబడరు. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లను నువ్వు ద్వేషిస్తావు.

    6 అబద్ధమాడే వాళ్ళను నువ్వు నాశనం చేస్తావు. హింసించేవాళ్ళను, మోసగాళ్ళను యెహోవా ద్వేషిస్తాడు.

  20. 104 నీ ఉపదేశం మూలంగా నాకు వివేకం కలిగింది. తప్పుమార్గాలన్నీ నాకు అసహ్యమనిపించాయి.

  21. 2 యెహోవా ఈ విధంగా అంటున్నాడు. “నేను మీ పట్ల ప్రేమ కనపరిచాను. అయితే మీరు ‘ఏ విషయంలో నీవు మా పట్ల ప్రేమ చూపించావు?’ అంటారు. ఏశావు యాకోబుకు అన్న కదా. నేను యాకోబును ప్రేమించాను. 3 ఏశావును ద్వేషించాను. అతని నివాస స్థలాలను పాడుచేసి అతని ఆస్తిని ఎడారిలో ఉన్న నక్కలపాలు చేశాను.”

  22. 3 వ్యర్ధమైవి నా కన్నుల ఎదుట ఉండకుండా చూసుకుంటాను. భయభక్తులు లేనివాళ్ళు చేస్తున్న పనులు నాకు అసహ్యం. వాటికి నేను దూరంగా ఉంటాను.

  23. 163 అబద్ధం నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.

  24. 15 చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి.

    పట్టణ గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరచండి.

    ఒకవేళ యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు

    యోసేపు వంశంలో మిగిలిన వారిని కనికరిస్తాడేమో.

  25. 6 అప్పుడు యేసు, “నా సమయం ఇంకా రాలేదు. మీ సమయం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. 7 లోకం మిమ్మల్ని ద్వేషించదు. కానీ దాని పనులన్నీ చెడ్డవని నేను సాక్ష్యం చెబుతున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తూ ఉంది. 8 మీరు పండక్కి వెళ్ళండి. నా సమయం ఇంకా సంపూర్ణం కాలేదు. కాబట్టి నేను ఈ పండక్కి ఇప్పుడే వెళ్ళను” అని వారితో చెప్పాడు.

  26. 6 అయితే నీలో ఈ విషయం ఉంది. నికొలాయితులు అనే వారి పనులను నువ్వు అసహ్యించుకుంటున్నావు. ఆ పనులంటే నాకూ అసహ్యమే.

  27. 3 యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు కాబట్టి తన కొడుకులందరికంటే అతణ్ణి ఎక్కువగా ప్రేమించి అతని కోసం ఒక అందమైన నిలువుటంగీ కుట్టించాడు. 4 అతని సోదరులు తమ తండ్రి అతణ్ణి తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగపట్టి, అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు.

  28. 3 నన్ను చుట్టుముట్టి నా మీద ద్వేషపూరితమైన మాటలు పలుకుతున్నారు. అకారణంగా నాతో పోట్లాడుతున్నారు

    4 నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నాపై నిందలు వేస్తున్నారు. అయితే నేను వారికోసం ప్రార్థన చేస్తున్నాను.

    5 నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నేను చూపిన ప్రేమకు బదులుగా నాపై ద్వేషం పెట్టుకున్నారు.

  29. 18 అబద్ధికుడు తన మనసులో పగ ఉంచుకుంటాడు. మూర్ఖులు నిందలు ప్రచారం చేస్తారు.

  30. 17 ద్వేషం నిండిన ఇంట్లో కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ ఉన్న చోట ఆకుకూరల భోజనం తినడం మేలు.

  31. 24 ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవునికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు.

  32. 22 “మనుష్యకుమారుడి కారణంగా మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, అవమానించి మీరు చెడ్డవారంటూ మీ పేరును తిరస్కరించినప్పుడు మీరు ధన్యులు. 23 ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి. చూడండి, పరలోకంలో మీకు గొప్ప ప్రతిఫలం కలుగుతుంది. వారి పూర్వీకులు ప్రవక్తలకు అలాగే చేశారు.

    24 “అయ్యో, ధనికులారా, మీకు యాతన. మీరు కోరిన ఆదరణ మీరు ఇప్పటికే పొందారు.

  33. 17 కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టిలో మేలు జరిగించండి. 18 మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి.

    19 ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోవద్దు. దేవుని కోపానికి చోటియ్యండి. “పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది.

    20 “కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు.

    అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది.”

    21 కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి.

  34. 41 యకోబుకు తన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం విషయమై ఏశావు అతణ్ణి ద్వేషించాడు. ఏశావు ఇలా అనుకున్నాడు. “నా తండ్రి చనిపోయే రోజు ఎంతో దూరం లేదు. అది అయ్యాక నా తమ్ముడు యాకోబును చంపుతాను.”

  35. 19 నా శత్రువులను చూడు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రూరమైన ద్వేషంతో వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు.

  36. 16 ఒకడు తన భార్యను విడిచి పెట్టడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఒకడు తన బట్టలతో బాటు బలాత్కారంతో తనను కప్పుకోవడం నాకు అసహ్యమని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నాడు. కనుక మీ హృదయాలను కాపాడుకోండి. విశ్వాస ఘాతకులుగా ఉండకండి.

  37. 15 అమ్నోను ఇలా చేసిన తరువాత ఆమెను ప్రేమించినంతకంటే ఎక్కువ ద్వేషం ఆమెపై పుట్టింది. ఆమెను “లేచి వెళ్ళిపో” అని చెప్పాడు.

  38. 5 దుష్టుల గుంపు నాకు అసహ్యం, దుర్మార్గులతో నేను సహవాసం చెయ్యను.

  39. 21 మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు.

    మీ ప్రత్యేక సభలంటే నాకేమీ ఇష్టం లేదు.

  40. 19 ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. 20 దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు.

    21 అయితే సత్యాన్ని అనుసరించే వాడు తన పనులు మరింత స్పష్టంగా కనిపించడానికీ దేవుని పట్ల విధేయతలో అవి జరిగాయని వెల్లడి చేయడానికీ వెలుగు దగ్గరికి వస్తాడు.”

  41. 11 ఒకడు తన పొరుగువాడి మీద పగ పట్టి, అతని కోసం కాపు కాసి అతని మీద పడి వాడు చనిపోయేలా కొట్టి 12 ఆ పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోతే, ఆ ఊరిపెద్దలు మనుషులను పంపి అక్కడనుంచి వాణ్ణి రప్పించాలి. హత్య విషయం ప్రతీకారం చేసేవాడి చేతికి అతన్ని అప్పగించి చంపించాలి. 13 అతడిపై కనికరం చూపించకూడదు. మీకు మేలు కలిగేలా ఇశ్రాయేలు ప్రజల మధ్యనుంచి నిర్దోషి ప్రాణం విషయంలో దోషాన్ని పరిహరించాలి.

  42. 19 నా విషయంలో నా శత్రువులు అన్యాయంగా సంతోష పడేలా చేయకు. వాళ్ళ దుర్మార్గపు ప్రణాళికలను అమలు చెయ్యనీయకు.

  43. 7 నువ్వు నీతిని ప్రేమించావు. దుర్మార్గతను అసహ్యించుకున్నావు. కాబట్టి దేవుడు, నీ దేవుడు నిన్ను నీ సహచరులకంటే ఎక్కువగా ఆనందతైలంతో అభిషేకించాడు.

  44. 16 మీరు చేయవలసిన వేమిటంటే ప్రతివాడూ తన పొరుగు వాడితో సత్యమే మాటలాడాలి.

    సత్యాన్ని బట్టి శాంతికరమైన న్యాయాన్నిబట్టి మీ గుమ్మాల్లో తీర్పు తీర్చాలి.

    17 తన పొరుగువాని మీద ఎవరూ చెడు ఆలోచనలు పెట్టుకోకూడదు.

    అబద్ధ ప్రమాణం చేయడానికి ఇష్టపడకూడదు.

    ఇలాటివన్నీ నాకు అసహ్యం.” ఇదే యెహోవా వాక్కు.

  45. 21 “‘హత్య చేయవద్దు. హత్య చేసేవాడు శిక్షకు లోనవుతాడు’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు. 22 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు.

    23 “కాబట్టి నీవు నీ కానుకను బలిపీఠం వద్ద అర్పించే ముందు, నీ సోదరునికి నీ మీద ఏదైనా విరోధ భావం ఉందని నీకు గుర్తుకు వచ్చిందనుకో. 24 నీ కానుకను అక్కడే, బలిపీఠం ఎదుటే వదిలి వెళ్ళు. ముందు నీ సోదరునితో రాజీ పడు. ఆ తరువాత వచ్చి నీ కానుకను అర్పించు. 25 నీపై నేరం ఆరోపించేవాడితో న్యాయస్థానానికి వెళ్ళే దారిలోనే త్వరగా రాజీపడు. లేకపోతే అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో. ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాల్లో వేయిస్తాడేమో. 26 చెల్లించాల్సి ఉన్నదంతా చెల్లించే వరకూ నీవు అక్కడ నుండి బయట పడలేవని కచ్చితంగా చెబుతున్నాను.

  46. 28 వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.

    30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, 31 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. 32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.

  47. 3 ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ద్వేషానికి గురి అవుతూ ద్వేషిస్తూ ఉండేవాళ్ళం.

  48. 8 అందుకు ఇశ్రాయేలు రాజు “ఇమ్లా కొడుకు మీకాయా అనే ఒకడున్నాడు. అతని ద్వారా మనం యెహోవా దగ్గర సలహా తీసుకోవచ్చు గాని అతడు ఎప్పుడూ నాకు మంచి జరుగుతుందని ప్రవచించకుండా కేవలం చెడు జరుగుతుందననే ప్రవచిస్తాడు. అందుకే అతడంటే నాకు ద్వేషం” అని యెహోషాపాతుతో అన్నాడు. అయితే యెహోషాపాతు “రాజైన మీరు అలా అనొద్దు” అన్నాడు.

  49. 5 యెహోవా న్యాయవంతులనూ, దుర్మార్గులనూ, ఇద్దరినీ పరిశీలన చేస్తున్నాడు. హింసించడం పనిగా పెట్టుకున్న వాళ్ళను ఆయన ద్వేషిస్తాడు.

  50. 6 నేను యెహోవాను నమ్ముకున్నాను. పనికిమాలిన విగ్రహాలను పూజించేవారు నాకు అసహ్యం.

  51. 21 చెడుతనం దుర్మార్గులను హతం చేస్తుంది. ధర్మాత్ముణ్ణి అసహ్యించుకునే వాడు శిక్ష పొందుతాడు.

  52. 20 ఎవరైనా చనిపోయేలా పగపట్టి పొడిచినా, లేక పొంచి ఉండి వాడి మీద దేనినైనా విసిరినా, లేక వైరంతో చేతితో కొట్టినా, కొట్టినవాడు నరహంతకుడు. అతణ్ణి తప్పకుండా చంపాలి.

  53. 9 కాబట్టి మీ దేవుడు యెహోవాయే దేవుడనీ తనను ప్రేమించి, తన ఆజ్ఞలను పాటించే వారికి తన నిబంధనను స్థిరపరచేవాడనీ మీరు తెలుసుకోవాలి. ఆయన వేయి తరాల వరకూ కృప చూపేవాడనీ, నమ్మదగిన దేవుడనీ గ్రహించాలి. తనను ద్వేషించే ప్రతి ఒక్కరినీ నేరుగా నాశనం చేసి వారిని శిక్షించేవాడనీ మీరు తెలుసుకోవాలి. 10 ఆయన తనను ద్వేషించేవారి విషయంలో నేరుగా, త్వరగా దండన విధిస్తాడు.

  54. 7 అందుకు యెఫ్తా “మీరు నా మీద పగపట్టి నా తండ్రి ఇంట్లోనుంచి నన్ను తోలేశారు కదా. ఇప్పుడు మీకు బాధ వచ్చినప్పుడు నేను కావలసి వచ్చానా?” అని గిలాదు పెద్దలతో అన్నాడు.

  55. 128 నీ ఉపదేశాలన్నీ యథార్థమని నేను వాటిని శిరసావహిస్తున్నాను. అబద్ధ మార్గాలన్నీ నాకు అసహ్యం.

  56. 5 నీతిమంతులకు అబద్దాలంటే అసహ్యం. దుష్టుడు నిందలు మోపుతూ, అవమానపరుస్తూ ఉంటాడు.

  57. 10 రక్తపిపాసులు నిర్దోషులను ద్వేషిస్తారు. వారు నీతిపరుల ప్రాణాలు తీయాలని చూస్తుంటారు.

  58. 13 అర్థం లేని అర్పణలు మీరు ఇక తీసుకు రావొద్దు. ధూపార్పణ నాకు అసహ్యం.

    అమావాస్య, విశ్రాంతి దినాలు, సమాజ కూటాలు జరుగుతున్నాయి కాని, మీ దుర్మార్గ సమావేశాలు నేను సహించలేను.

    14 మీ అమావాస్య ఉత్సవాలు, నియామక ఉత్సవాలు నాకు అసహ్యం. అవి నాకు బాధాకరం.

    వాటిని సహించలేక విసిగిపోయాను.

  59. 9 మీరు వ్యభిచారం, దొంగతనం, నరహత్యలు, 10 అబద్ధ ప్రమాణాలు చేస్తూ, బయలు దేవుడికి ధూపం వేస్తూ మీకు తెలియని దేవుళ్ళను అనుసరిస్తున్నారు. అదే సమయంలో నా పేరు పెట్టిన ఈ మందిరంలోకి వచ్చి నా సన్నిధిలో నిలబడి “మేం తప్పించుకున్నాం” అంటున్నారు. మీరు విడుదల పొందింది ఈ అసహ్యమైన పనులు చేయడానికేనా?

  60. 34 మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలన్న కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. 35 మీరు ఒకడి పట్ల ఒకడు ప్రేమగలవారైతే, దాన్నిబట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు” అన్నాడు.

  61. 29 మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారికి ప్రయోజనం కలిగేలా వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.

  62. 9 నువ్వు నీతిని ప్రేమించి అక్రమాన్ని అసహ్యించుకున్నావు.

    కాబట్టి దేవా, నీ దేవుడు నీ సహచరుల కంటే

    ఎక్కువగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాడు.

  63. 30 యాకోబు రాహేలుతో రాత్రి గడిపాడు. అతడు లేయా కంటే రాహేలును ఎక్కువగా ప్రేమించి లాబానుకు మరి ఏడు సంవత్సరాలు సేవ చేశాడు.

    31 అతడు లేయాను ప్రేమించక పోవడం చూసి యెహోవా ఆమె గర్భం తెరిచాడు. రాహేలు గొడ్రాలుగా ఉంది.

  64. 22 “జ్ఞాన హీనులారా, జ్ఞానం తెచ్చుకోకుండా ఎంతకాలం ఉండాలని కోరుకుంటారు? అపహాసకులారా, మీరు ఎగతాళి చేస్తూ ఎన్నేళ్ళు ఆనందంగా కాలం గడుపుతారు? బుద్ధిహీనులారా, మీరు ఎంతకాలం జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు?

  65. 1 జ్ఞానం కోరుకున్నవాడు గద్దింపుకు లోబడతాడు. దిద్దుబాటును తిరస్కరించేవాడు పశువుతో సమానం.

  66. 22 కీడుకు ప్రతికీడు తలపెట్టవద్దు. యెహోవా కోసం కనిపెట్టుకో. ఆయన నిన్ను కాపాడుతాడు.

  67. 2 మీరు మంచిని అసహ్యించుకుని చెడును ఇష్టపడతారు.

    నా ప్రజల చర్మం ఒలిచేసి

    వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని చీలుస్తారు.

  68. 25 తన ప్రాణాన్ని ప్రేమించుకొనే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు శాశ్వత జీవం కోసం దాన్ని భద్రం చేసుకుంటాడు.

  69. 12 తెల్లవారిన తరువాత కొందరు యూదులు పోగై, తాము పౌలును చంపేటంతవరకూ అన్నపానాలు ముట్టం అని ఒట్టు పెట్టుకున్నారు. 13 నలభై కంటే ఎక్కువమంది ఈ కుట్రలో చేరారు. 14 వారు ప్రధాన యాజకుల దగ్గరకూ, పెద్దల దగ్గరకూ వచ్చి, “మేము పౌలును చంపేవరకూ ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొన్నాం. 15 కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనిని క్షుణ్ణంగా విచారించాలి అన్న వంకతో అతణ్ణి మీ దగ్గరికి తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. అతడు మీ దగ్గరకి రాకముందే మేము అతనిని చంపడానికి సిద్ధపడి ఉన్నాం” అని చెప్పారు.

  70. 31 సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి.