118 Bible Verses About Righteousness

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Righteousness
  1. 21 ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి. 22 అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి. 23 భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. 24 నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. 25 క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. 26 ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.

    27 కాబట్టి మనం గొప్పలు చెప్పుకోడానికి కారణమేది? దాన్ని కొట్టివేయడం అయిపోయింది. ఏ నియమాన్ని బట్టి? క్రియలను బట్టా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టే. 28 కాబట్టి మనుషులు ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వలన నీతిమంతులని తీర్పు పొందుతున్నారని నిర్ణయిస్తున్నాము.

  2. 20 కాబట్టి మేము క్రీస్తు ప్రతినిధులం. దేవుడే మా ద్వారా మిమ్మల్ని బతిమాలుకొంటున్నట్టుంది. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం. 21 ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.

  3. 1 సోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలనేదే నా హృదయవాంఛ, వారి గురించిన నా ప్రార్థన. 2 దేవుని విషయంలో వారు బహు ఆసక్తి గలవారని వారి గురించి సాక్షమిస్తున్నాను. అయితే వారి ఆసక్తి జ్ఞానయుక్తమైంది కాదు. 3 అయితే వారికి దేవుని నీతి విషయంలో అవగాహన లేదు. కాబట్టి తమ స్వనీతిని స్థాపించాలని చూస్తూ దేవుని నీతికి విధేయత చూపలేదు. 4 విశ్వసించే ప్రతివాడికీ నీతి కలగడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపు పలికాడు. 5 ధర్మశాస్త్ర మూలమైన నీతిని నెరవేర్చేవాడు దాని వల్లనే జీవిస్తాడని మోషే రాస్తున్నాడు. 6 అయితే విశ్వాసమూలమైన నీతి ఇలా చెబుతున్నది, “పరలోకానికి ఎవడు ఎక్కిపోతాడు? (అంటే క్రీస్తును కిందకి తేవడానికి). 7 లేక అగాధంలోకి ఎవడు దిగిపోతాడు? (అంటే క్రీస్తును చనిపోయిన వారిలో నుండి పైకి తేవడానికి) అని నీ హృదయంలో అనుకోవద్దు.”

    8 కానీ ఆ నీతి ఏమి చెబుతున్నదో చూడండి,

    “దేవుని వాక్కు మీకు దగ్గరగా, మీ నోటిలో,

    మీ హృదయంలో ఉంది.”

    మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్కు కూడా ఇదే. 9 అదేమంటే యేసును ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుని, దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడని నీ హృదయంలో నమ్మితే, నీకు రక్షణ కలుగుతుంది. 10 ఎలాగంటే మనిషి నీతి కోసం హృదయంలో నమ్ముతాడు, పాప విమోచన కోసం నోటితో ఒప్పుకుంటాడు. 11 “ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరూ సిగ్గుపడరు” అని దేవుని వాక్కు చెబుతున్నది. 12 ఇందులో యూదులూ, గ్రీకులూ అనే వ్యత్యాసం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఆయన తనకు ప్రార్థన చేసే వారందరికీ కృప చూపగల సంపన్నుడు. 13 ఎందుకంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ పాపవిమోచన కలుగుతుంది.

  4. 2 కుక్కల విషయం జాగ్రత్త. చెడు పనులు చేసే వారి విషయం జాగ్రత్త. ఛేదించే ఆచారం పాటించే వారి విషయం జాగ్రత్త. 3 ఎందుకంటే, మనం దేవుని ఆత్మతో ఆరాధిస్తూ శరీరం మీద నమ్మకం పెట్టుకోకుండా క్రీస్తు యేసులో అతిశయిస్తున్నాము. మనమే అసలైన సున్నతి పొందిన వాళ్ళం.

    4 చెప్పాలంటే, వాస్తవంగా నేనే శరీరాన్ని ఆధారం చేసుకోగలను. ఎవరైనా శరీరాన్ని ఆధారం చేసుకోవాలనుకుంటే నేను మరి ఎక్కువగా చేసుకోగలను. 5 ఎనిమిదవ రోజున సున్నతి పొందాను. ఇశ్రాయేలు జాతిలో పుట్టాను. బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి. హెబ్రీయుల్లో హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రం విషయంలో పరిసయ్యుణ్ణి. 6 క్రైస్తవ సంఘాన్ని తీవ్రంగా హింసించాను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయంలో నిందారహితుడిని.

    7 అయినా ఏవేవి నాకు లాభంగా ఉండేవో వాటిని క్రీస్తు కోసం పనికిరానివిగా ఎంచాను. 8 వాస్తవంగా ఇప్పుడు మిగతా వాటన్నిటినీ నష్టంగా ఎంచుతున్నాను ఎందుకంటే నా ప్రభువైన యేసు క్రీస్తును ఎరగడమే ఎంతో శ్రేష్ఠమైన విషయం. ఆయనను బట్టి మిగతా వాటన్నిటినీ ఇష్టపూర్వకంగా తిరస్కరించాను. క్రీస్తును సంపాదించటానికి వాటిని చెత్తతో సమానంగా ఎంచాను. 9 ధర్మశాస్త్రమూలమైన నా స్వనీతిగాక, క్రీస్తులోని విశ్వాసమూలమైన నీతికి బదులుగా, అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే నీతిగలవాడనై ఆయనలో కనపడేలా అలా చేశాను.

    10-11 ఆయనను ఎరగడం అనే నీతిన్యాయాలు, ఆయన పునరుత్థాన శక్తి, ఆయన పొందిన హింసల్లో సహానుభవం, క్రీస్తు మూలంగా ఆయన మరణం పోలికలోకి మార్పు చెందడం కోసం, ఏ విధంగానైనా చనిపోయిన వారిలో నుండి నాకు పునరుత్థానం కలగాలని, కోరుతున్నాను.

  5. 1 కాబట్టి శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాముకు ఏం దొరికింది? 2 అబ్రాహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్పు పొంది ఉంటే అతడు గొప్పలు పోవడానికి కారణం ఉండేది గానీ అది దేవుని ఎదుట కాదు. 3 లేఖనం చెబుతున్నదేమిటి? “అబ్రాహాము దేవునిలో నమ్మకముంచాడు. దాని ద్వారానే అతడు నీతిమంతుడని తీర్పు పొందాడు.” 4 పని చేసే వ్యక్తికి ఇచ్చే జీతం అతనికి హక్కుగా రావలసిన సొమ్మే గాని దానం కాదు.

    5 కానీ క్రియలు చేయకుండా దానికి బదులు భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చే దేవునిలో కేవలం విశ్వాసం ఉంచే వ్యక్తి విశ్వాసాన్నే దేవుడు నీతిగా ఎంచుతాడు. 6 అదే విధంగా క్రియలు లేకుండా దేవుడు నీతిమంతుడుగా ప్రకటించిన మనిషి ధన్యుడని దావీదు కూడా చెబుతున్నాడు. 7 ఎలా అంటే,

    “తన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు,

    తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు.

    8 ప్రభువు ఎవరి అపరాధం లెక్కలోకి తీసుకోడో వాడు ధన్యుడు.”

    9 ఈ దీవెన సున్నతి ఆచరించే వారి గురించి చెప్పాడా, ఆచరించని వారి గురించి కూడా చెప్పాడా? అబ్రాహాము విశ్వాసం అతణ్ణి నీతిమంతుడుగా తీర్చింది అన్నాం కదా? 10 అతడు ఏ స్థితిలో ఉన్నప్పుడు అది జరిగింది? సున్నతి చేయించుకున్న తరవాతా లేక సున్నతికి ముందా? ముందే కదా! 11 సున్నతి లేకపోయినా నమ్మిన వారికందరికీ అతడు తండ్రి కావడం కోసం వారికి నీతి ఆపాదించడానికై సున్నతి లేనప్పుడే, తాను కలిగి ఉన్న విశ్వాసం వలన పొందిన నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందాడు. 12 అలాగే సున్నతి గలవారికి కూడా తండ్రి కావడానికి, అంటే కేవలం సున్నతి మాత్రమే పొందిన వారు కాక సున్నతి లేనప్పుడు మన తండ్రి అబ్రాహాము విశ్వాసపు అడుగుజాడల్లో నడచిన వారికి కూడా తండ్రి కావడానికి అతడు ఆ గుర్తు పొందాడు.

  6. 30 అలా అయితే మనం ఏమనగలం? న్యాయాన్ని వెదకని యూదేతరులు నీతిని, అంటే విశ్వాసమూలమైన నీతిని పొందారు. 31 అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమాన్ని వెంటాడినా దాన్ని చేరుకోలేకపోయారు. 32 ఎందుకు? ఎందుకంటే వారు దాన్ని విశ్వాసంతో కాక తమ క్రియల ద్వారా అందుకోవాలని చూశారు.

    33 “ఇదిగో నేను సీయోనులో ఒక అడ్డురాయిని,

    తొట్రుపడేలా చేసే ఒక అడ్డుబండను ఉంచుతాను.

    ఆయనలో విశ్వాసం ఉంచేవాడు సిగ్గు పడడు”

    అని రాసి ఉన్న ప్రకారం వారు ఆ అడ్డురాయి తగిలి, తొట్రుపడ్డారు.

  7. 13 అబ్రాహాము, అతని సంతానం లోకానికి వారసులవుతారు అనే వాగ్దానం ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు. విశ్వాసం వలన ఏర్పడిన నీతి మూలంగానే కలిగింది. 14 ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే విశ్వాసం వ్యర్థమౌతుంది, వాగ్దానం కూడా నిరర్థకమౌతుంది. 15 ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం లేని చోట దాన్ని అతిక్రమించడం కూడా ఉండదు.

    16 ఈ కారణం చేత ఆ వాగ్దానం అబ్రాహాము సంతతి వారందరికీ, అంటే ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రాహాముకున్న విశ్వాసం గలవారికి కూడా కృపను బట్టి వర్తించాలని, అది విశ్వాసమూలమైనది అయ్యింది. ఆ అబ్రాహాము మనందరికీ తండ్రి. 17 దీని గురించే, “నిన్ను అనేక జనాలకు తండ్రిగా నియమించాను” అని రాసి ఉంది. తాను నమ్ముకున్న దేవుని సమక్షంలో, అంటే చనిపోయిన వారిని బతికించేవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి. 18 అలాగే, “నీ సంతానం ఇలా ఉంటుంది” అని రాసి ఉన్నట్టుగా తాను అనేక జనాలకు తండ్రి అయ్యేలా ఎలాటి ఆశాభావం లేనప్పడు సైతం అతడు ఆశాభావంతో నమ్మాడు. 19 అతడు విశ్వాసంలో బలహీనుడు కాలేదు, సుమారు నూరు సంవత్సరాల వయస్సు గలవాడు కాబట్టి, తన శరీరాన్ని మృతతుల్యంగా, శారా గర్భం మృతతుల్యంగా భావించాడు. 20 అవిశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహించక విశ్వాసంలో బలపడి దేవుణ్ణి మహిమ పరచాడు. 21 దేవుడు మాట ఇచ్చిన దాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడని గట్టిగా నమ్మాడు. 22 అందుచేత దేవుడు దాన్ని అతనికి నీతిగా ఎంచాడు. 23 దేవుడు ఆ విశ్వాసాన్ని ఆ విధంగా ఎంచాడని అతని కోసం మాత్రమే రాసి లేదు, 24 మన ప్రభు యేసును చనిపోయిన వారిలో నుండి లేపిన దేవునిలో విశ్వాసం ఉంచిన మనలను కూడా నీతిమంతులుగా ఎంచడానికి మన కోసం కూడా రాసి ఉంది. 25 ఆయనను దేవుడు మన అపరాధాల కోసం అప్పగించి, మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయనను తిరిగి లేపాడు.

  8. 16 మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా? 17 దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు. 18 తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు.

    19 మీ శరీర బలహీనతను బట్టి మానవరీతిగా మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు అక్రమం జరిగించడానికి ఏ విధంగా అపవిత్రతకు, దుర్మార్గానికి మీ అవయవాలను దాసులుగా అప్పగించారో, ఆలాగే పవిత్రత కలగడానికి వాటిని ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించండి. 20 మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో మీకేమీ ఆటంకం లేదు. 21 అప్పుడు చేసిన పనుల వలన మీకేం ప్రయోజనం కలిగింది? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా? చావే వాటి ఫలితం. 22 అయితే మీరు ఇప్పుడు పాపవిమోచన పొంది దేవునికి దాసులయ్యారు. పవిత్రతే దాని ఫలితం. దాని అంతిమ ఫలం శాశ్వత జీవం.

  9. 14 గ్రీకులకూ, ఇతరులకూ, తెలివైన వారికీ, బుద్ధిహీనులకూ నేను రుణపడి ఉన్నాను. 15 కాబట్టి రోమాలోని మీకు కూడా సువార్త ప్రకటించాలన్న ఆశతో నేను సిద్ధంగా ఉన్నాను.

    16 సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే మొదట యూదుడికి, తరవాత గ్రీసు జాతి వాడికి నమ్మే ప్రతి ఒక్కరికీ అది దేవుని శక్తి. 17 నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు, అని రాసి ఉన్న ప్రకారం విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడి అవుతున్నది.

  10. 29 ఆయన నీతిమంతుడు అని మీకు తెలుసు కాబట్టి, నీతిని అనుసరించే వారందరూ ఆయన వల్ల పుట్టినవారని కూడా మీకు తెలుసు.

  11. 16 పాపం చేసిన ఒక్కడి వలన శిక్ష కలిగినట్టు ఆ కృపాదానం కలగ లేదు. ఎందుకంటే తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చి శిక్షకు కారణమయ్యింది. కృపావరమైతే అనేక అపరాధాల మూలంగా వచ్చి మనుషులను నీతిమంతులుగా తీర్చడానికి కారణమయ్యింది. 17 మరణం ఒక్కడి అపరాధం మూలంగా వచ్చి ఆ ఒక్కడి ద్వారానే ఏలితే విస్తారమైన కృప, నీతి అనే కానుక పొందేవారు జీవం కలిగి మరింత నిశ్చయంగా యేసు క్రీస్తు అనే ఒకడి ద్వారానే ఏలుతారు.

    18 కాబట్టి తీర్పు ఒక్క అపరాధం ద్వారా వచ్చి, మనుషులందరిపై శిక్షకు ఏ విధంగా కారణమయ్యిందో, ఆలాగే ఒక్క నీతి కార్యం వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి కలగడానికి కారణమయ్యింది. 19 ఎందుకంటే ఒకడి అవిధేయత అనేకమందిని పాపులుగా ఎలా చేసిందో, ఆలాగే ఒకడి విధేయత అనేక మందిని నీతిమంతులుగా చేస్తుంది.

  12. 5 యెహోవా ఇలా చెబుతున్నాడు “రాబోయే రోజుల్లో నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు.

    6 ఆయన రోజుల్లో యూదాకు విడుదల వస్తుంది. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తుంది. ‘యెహోవా మనకు నీతి’ అని అతనికి పేరు పెడతారు.”

    7 కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు “ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన యెహోవా జీవం తోడు” అని ఇకపై ప్రమాణం చెయ్యరు.

  13. 6 నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు.

  14. 1 విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. 2 ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశించి, అందులో కొనసాగుతూ దేవుని మహిమ గురించిన నిశ్చయతలో ఆనందిస్తున్నాం. 3-4 అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.

    6 ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. 7 నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. 8 అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. 9 కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం. 10 ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము. 11 అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి పొందాము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునిలో ఆనందిస్తున్నాం.

  15. 26 సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా. 27 దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. 28 గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. 29 ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం.

    30 అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. 31 “అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు.

  16. 6 మేమంతా అపవిత్రులవంటివారిగా అయ్యాం. మా నీతి పనులన్నీ బహిష్టు బట్టల్లాంటివి.

    మేమంతా ఆకుల్లాగా వాడిపోయే వాళ్ళం. గాలి కొట్టుకుపోయినట్టు మా దోషాలను బట్టి మేము కొట్టుకుపోతాం.

  17. 31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. 32 దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు.

  18. 24 మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు.

  19. 9 మీ ప్రేమ జ్ఞానంతో, సంపూర్ణ వివేచనతో అంతకంతకూ వృద్ధి చెందుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. 10 దేవునికి మహిమ, స్తుతి కలిగేలా మీరు శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి తెలుసుకుని, యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతిఫలాలతో నిండి, క్రీస్తు వచ్చే రోజు వరకూ యథార్థంగా నిర్దోషంగా ఉండాలన్నదే నా ప్రార్థన 11 అంతేకాక దేవునికి మహిమ, స్తుతి కలిగేలా, మీరు యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతి ఫలాలతో నిండి ఉండాలి.

  20. 4 నా ప్రజలారా, నా మీద దృష్టి పెట్టండి. నా మాట వినండి!

    నేనొక ఆజ్ఞ జారీ చేస్తాను. రాజ్యాలకు వెలుగుగా నా న్యాయాన్ని ఉంచుతాను.

    5 నా నీతి దగ్గరగా ఉంది. నా విడుదల బయలుదేరుతుంది. నా చెయ్యి రాజ్యాలను శిక్షిస్తుంది.

    ద్వీపాల్లో ఉండేవాళ్ళు నా కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు నా చేతి వైపు ఆశతో చూస్తారు.

    6 ఆకాశం వైపు మీ కళ్ళు ఎత్తండి. కిందున్న భూమిని చూడండి.

    అంతరిక్షం, పొగలాగా కనిపించకుండా పోతుంది. భూమి బట్టలాగా మాసిపోతుంది. దాని నివాసులు ఈగల్లాగా చస్తారు.

    అయితే నా రక్షణ ఎప్పటికీ ఉంటుంది. నా నీతికి అంతం ఉండదు.

    7 సరైనది అంటే ఏంటో తెలిసిన మీరు నా మాట వినండి. నా చట్టాన్ని మీ హృదయంలో ఉంచుకున్న మీరు, వినండి.

    మనుషుల నిందకు భయపడవద్దు. వారి దూషణకు దిగులుపడవద్దు.

    8 చిమ్మెట బట్టలను కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. పురుగు, బొచ్చును కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది.

    అయితే నా నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నా రక్షణ తరతరాలుంటుంది.

  21. 1 ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా దూత అబ్రాముకు దర్శనమిచ్చాడు. “అబ్రామూ, భయపడకు! నేనే నీకు డాలును, గొప్ప బహుమానాన్ని” అన్నాడు. 2 అబ్రాము “ప్రభూ యెహోవా, నాకేం ఇస్తావు? నేను సంతానం లేనివాడిగా ఉండిపోతున్నాను కదా. దమస్కు వాడైన ఎలీయెజెరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా! 3 నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు గనుక, చూడు, నా సేవకుల్లో ఒకడు నాకు వారసుడు అవుతాడు” అన్నాడు.

    4 యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చి “ఇతడు నీ వారసుడు కాడు. నీ ద్వారా నీకు పుట్టబోయేవాడే నీ వారసుడు అవుతాడు” అన్నాడు. 5 ఆయన అతణ్ణి బయటకు తీసుకువచ్చి “నువ్వు ఆకాశం వైపు చూసి, ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు” అని చెప్పి “నీ సంతానం కూడా అలా అవుతుంది” అని చెప్పాడు.

    6 అతడు యెహోవాను నమ్మాడు. ఆ నమ్మకాన్నే ఆయన అతనికి నీతిగా పరిగణించాడు.

  22. 13 కాబట్టి ఇకమీదట మనం ఒకరికి ఒకరం తీర్పు తీర్చ వద్దు. దానికి ప్రతిగా, మన సోదరునికి అడ్డురాయిలాగా ఆటంకంగా ఉండకూడదని తీర్మానించుకుందాం. 14 సహజంగా ఏదీ అపవిత్రం కాదని నేను ప్రభు యేసులో గ్రహించి గట్టిగా నమ్ముతున్నాను. అయితే దేనినైనా అపవిత్రం అని నమ్మే వారికి అది అపవిత్రమే అవుతుంది. 15 నీ సోదరుడు నీవు తినేదాని విషయంలో బాధకు గురైతే నీలో ప్రేమ లేదన్నమాటే. ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో అతణ్ణి నీ ఆహారం చేత పాడు చేయవద్దు. 16 మీరు మంచిగా భావించేది దూషణకు గురి కాకుండా చూసుకోండి.

    17 దేవుని రాజ్యం తినడం, తాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ కలిగించే ఆనందం. 18 ఈ విధంగా క్రీస్తుకు సేవ చేసేవాడు దేవుని దృష్టికి ఇష్టమైన వాడు, మనుషుల దృష్టికి యోగ్యుడు. 19 కాబట్టి సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించే వాటిని ఆసక్తితో అనుసరించుదాం.

  23. 2 జ్ఞానవివేకాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, ఆలోచన బలాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, తెలివినీ యెహోవా పట్ల భయభక్తులనూ పుట్టించే యెహోవా ఆత్మ అతని మీద నిలుస్తుంది.

    3 యెహోవా భయం అతనికి ఆనందం కలిగిస్తుంది.

    4 కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు. తాను విన్న దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసుల్లో దీనులైన వాళ్లకు నిజాయితీగా విమర్శ చేస్తాడు. తన నోటి దండంతో లోకాన్ని కొడతాడు. తన పెదవుల ఊపిరితో దుర్మార్గులను హతం చేస్తాడు.

    5 అతని నడుముకు న్యాయం, అతని మొలకు సత్యం నడికట్టుగా ఉంటాయి.

  24. 1 నీతిని అనుసరిస్తూ యెహోవాను వెతుకుతూ ఉండే మీరు, నా మాట వినండి.

    ఏ బండ నుంచి మిమ్మల్ని చెక్కారో ఏ గని నుంచి మిమ్మల్ని తవ్వారో దాన్ని గమనించండి.

    2 మీ తండ్రి అబ్రాహామును, మిమ్మల్ని కనిన శారాను గమనించండి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు

    నేను అతన్ని పిలిచాను. అతన్ని దీవించి అనేకమందిగా చేశాను.

  25. 1 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.

    2 క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది. 3-4 ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు.

    5 శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు. 6 శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. 7 ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా. 8 కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు. 9 దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీలో ఆత్మ స్వభావమే ఉంది. శరీర స్వభావం కాదు. ఎవరిలోనైనా క్రీస్తు ఆత్మ లేకపోతే అతడు క్రీస్తుకు చెందినవాడు కాడు. 10 క్రీస్తులో ఉంటే పాపం కారణంగా మీ శరీరం చనిపోయింది గాని నీతి కారణంగా మీ ఆత్మ జీవం కలిగి ఉంది. 11 చనిపోయిన వారిలో నుండి యేసును లేపిన వాడి ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, ఆయన చావుకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించే తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు.

  26. 14 మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు.

  27. 4 దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు ఉపయోగపడవు. నీతిమంతులు మరణం నుండి తప్పించు కుంటారు.

    5 యథార్థవంతుల న్యాయ ప్రవర్తన వారి మార్గాన్ని సరళం చేస్తుంది. దుష్టులు తమ దుర్మార్గ క్రియలవల్ల కూలిపోతారు.

    6 నిజాయితీపరుల మంచితనం వారికి విడుదల కలిగిస్తుంది. ద్రోహులు తమ దురాశ చేత చిక్కుల్లో పడతారు.

  28. 24 ‘యెహోవాలోనే రక్షణ, బలం ఉన్నాయి’ అని ప్రజలు నా గురించి చెబుతారు.”

    మనుషులంతా ఆయన దగ్గరకే వస్తారు. ఆయనను వ్యతిరేకించిన వారంతా సిగ్గుపడతారు.

    25 ఇశ్రాయేలు సంతానం వారంతా యెహోవా వలన నీతిమంతులుగా తీర్పు పొంది అతిశయిస్తారు.

  29. 11 దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు. 12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి, దేవుడు దేనిని పొందడానికి నిన్ను పిలిచాడో ఆ నిత్యజీవాన్ని చేపట్టు. దాని విషయంలో నువ్వు అనేకమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావు. 13 అంతటికీ జీవాధారమైన దేవుని ఎదుటా పొంతి పిలాతు ముందు సత్యాన్ని గూర్చి ధైర్యంగా సాక్షమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటా 14 నువ్వు నిష్కళంకంగా, నిందారహితుడిగా ఈ ఆజ్ఞను గైకొనాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు దీన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో ప్రత్యక్షమయ్యే వరకూ చేస్తుండాలి.

    15 భాగ్యవంతుడు, ఎకైక శక్తిశాలి అయిన దేవుడు తగిన కాలంలో ఆ ప్రత్యక్షతను కనుపరుస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 16 ఆయన మాత్రమే అమరత్వం కలిగి సమీపింప శక్యం గాని తేజస్సులో నివసిస్తున్నాడు. మనుషుల్లో ఎవరూ ఆయనను చూడలేదు, ఎవరూ చూడలేరు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావం కలుగు గాక. ఆమేన్‌.

  30. 6 ఒక పానార్పణగా నేను బలి అవుతూ ఉన్నాను. నా మరణం సమీపించింది. 7 మంచి పోరాటం సాగించాను, నా పరుగు ముగించాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. 8 ఇప్పుడు నా కోసం నీతికిరీటం సిద్ధంగా ఉంది. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు దాన్ని ఆ రోజున నాకు అనుగ్రహిస్తాడు. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షానికై ప్రేమతో ఎదురుచూసే వారందరికీ అనుగ్రహిస్తాడు.

  31. 16 అప్పుడు న్యాయం అరణ్యంలో నివసిస్తుంది. ఫలభరితమైన భూమిలో నీతి ఉంటుంది.

    17 నీతి శాంతిని కలుగ చేస్తుంది. నీతి ఫలితంగా నిత్యమైన నెమ్మదీ నమ్మకమూ కలుగుతాయి.

    18 నా ప్రజలు శాంతిభరితమైన చోట, సురక్షితమైన ఇళ్ళల్లో నివసిస్తారు.

  32. 17 “నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు. 18 నేను కచ్చితంగా చెబుతున్నాను. ఆకాశం, భూమి నశించే వరకూ ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకూ ధర్మశాస్త్రం నుంచి ఒక్క పొల్లు అయినా, ఒక సున్నా అయినా తప్పిపోదు. 19 కాబట్టి ఈ ఆజ్ఞల్లో ఎంత చిన్న దానినైనా సరే అతిక్రమించి, ఇతరులకు కూడా అలా చేయమని బోధించేవాణ్ణి పరలోకరాజ్యంలో అతి తక్కువ వాడుగా ఎంచుతారు. కానీ ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ, వాటిని బోధించేవాణ్ణి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా లెక్కిస్తారు. 20 ధర్మశాస్త్ర పండితుల, పరిసయ్యుల నీతికన్నా మీ నీతి మిన్నగా ఉండకపోతే మీరు పరలోకరాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించలేరని మీతో చెబుతున్నాను.

  33. 17 కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను. 18 ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు. 19 వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.

    20 అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు. 21 యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు. 22 కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి 23 మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. 24 దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.

  34. 8 అయితే తన కుమారుణ్ణి గూర్చి ఇలా అన్నాడు.

    “దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది.

    నీ రాజదండం న్యాయదండం.

    9 నువ్వు నీతిని ప్రేమించి అక్రమాన్ని అసహ్యించుకున్నావు.

    కాబట్టి దేవా, నీ దేవుడు నీ సహచరుల కంటే

    ఎక్కువగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాడు.

  35. 18 దుష్టుల సంపద వాళ్ళను మోసపరుస్తుంది. నీతి అనే విత్తనం నాటేవాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు.

    19 వాస్తవమైన నీతి జీవానికి మూలం. అదే పనిగా చెడ్డ కార్యాలు చేసేవాడు తన మరణానికి దగ్గరౌతాడు.

  36. 12 మీ కోసం నీతి విత్తనం వేయండి.

    నిబంధన విశ్వాస్యత అనే కోత కోయండి.

    ఇదివరకెప్పుడూ దున్నని బీడుభూమి దున్నండి.

    ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతివర్షం కురిపించే వరకూ,

    యెహోవాను వెదకడానికి ఇదే అదను.

  37. 9 అలాగని మేము వారికంటే మంచివారమా? ఎంతమాత్రం కాదు. యూదులైనా, యూదేతరులైనా, అందరూ పాపం కింద ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశాం కదా. 10 దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే,

    “నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు.

    11 గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు.

    12 అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు.

    మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు.

  38. 1 తెలివిలేని గలతీయులారా, మిమ్మల్ని భ్రమపెట్టిందెవరు? సిలువకు గురి అయినట్టుగా యేసు క్రీస్తును మీ కళ్ళ ముందు చూపించాము గదా! 2 మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్న ఒకే విషయం ఏమిటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందారా లేక విన్న దాన్ని విశ్వసించడం వలన పొందారా? 3 మీరింత అవివేకులయ్యారా? మొదట దేవుని ఆత్మతో మొదలు పెట్టి, ఇప్పుడు శరీరంతో ముగిస్తారా?

    4 వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? అవన్నీ నిజంగా వ్యర్థమైపోతాయా? 5 ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతాలు చేయించేవాడు, ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలనా లేక విశ్వాసంతో వినడం వల్ల చేయిస్తున్నాడా?

    6 అబ్రాహాము, “దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.” 7 కాబట్టి, నమ్మకముంచే వారే అబ్రాహాము సంతానమని మీరు తెలుసుకోవాలి. 8 విశ్వాసం ద్వారా దేవుడు యూదేతరులను నీతిమంతులుగా తీరుస్తాడని లేఖనం ముందుగానే ప్రవచించింది. “ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ నీలో దీవెనలు పొందుతాయి.” అని అబ్రాహాముకు సువార్త ముందుగానే ప్రకటించడం జరిగింది. 9 కాబట్టి విశ్వాసముంచిన అబ్రాహాముతో బాటు విశ్వాస సంబంధులనే దేవుడు దీవిస్తాడు.

  39. 22 నువ్వు యువకులకు కలిగే చెడుకోరికలను విడిచి పారిపో. పవిత్ర హృదయాలతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కలిసి నీతినీ విశ్వాసాన్నీ ప్రేమనూ శాంతి సమాధానాలనూ సంపాదించుకోవడానికి కృషి చెయ్యి.

  40. 7 ఎందుకంటే యెహోవా న్యాయవంతుడు. ఆయన నీతిన్యాయాలను ప్రేమిస్తాడు. నిజాయితీపరులు ఆయన ముఖం చూస్తారు.

  41. 2 ఒకడు ఎన్నుకున్న మార్గం అది ఎలాటిదైనా సరే, తన దృష్టికది న్యాయం గానే కనిపిస్తుంది. హృదయాలను పరిశీలించేది యెహోవాయే.

    3 బలులు అర్పించడం కంటే నీతిన్యాయాలను అనుసరించి నడచు కోవడం యెహోవాకు ప్రీతికరం.

  42. 7 ప్రభూ, నీవే నీతిమంతుడవు. మేము నీ మీద తిరుగుబాటు చేశాము. యెరూషలేములో, యూదయ దేశంలో నివసిస్తున్న వారందరి ముఖాలకు, ఇశ్రాయేలీయులందరి ముఖాలకు సిగ్గే తగినది. నీవు చెదరగొట్టిన స్వదేశవాసులకు, పర దేశవాసులకు ఇదే శాస్తి. మేము నీ పట్ల చేసిన గొప్ప నమ్మక ద్రోహానికి ఇదే శిక్ష.

    8 ప్రభూ, నీకు విరోధంగా పాపం చేసినందున మాకు, మా రాజులకు, మా అధికారులకు, మా పూర్వీకులకు ముఖం చిన్నబోయేలా సిగ్గే తగినది.

  43. 11 ఇదే మీకూ వర్తిస్తుంది. మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో క్రీస్తు యేసులో మిమ్మల్ని సజీవులుగా ఎంచుకోండి.

    12 కాబట్టి శరీర దురాశలకు లోబడేలా చావుకు లోనైన మీ శరీరాల్లో పాపాన్ని ఏలనియ్యకండి. 13 మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు. అయితే చనిపోయిన వారిలో నుండి బతికి లేచినవారుగా, మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి.

    14 మీరు కృప కిందే గానీ ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి పాపాన్ని మీ మీద అధికారం చెలాయించ నియ్యవద్దు.

  44. 5 మనం విశ్వాసం వలన నీతి కలుగుతుందనే నిశ్చయంతో ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము.

  45. 14 కానీ నీవు మాత్రం కచ్చితంగా తెలుసుకున్న వాటిని ఎవరి ద్వారా నేర్చుకున్నావో గ్రహించి వాటిలో నిలకడగా సాగిపో. 15 ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు.

    16-17 దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.

  46. 15 యెహోవా కంటి చూపు ధర్మాత్ములపై ఉంది. ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటూ ఉన్నాయి.

  47. 3 కలిమి, సంపద అతని ఇంట్లో ఉంటాయి. అతని నీతి నిత్యం నిలకడగా ఉంటుంది.

  48. 15 నీతి కలిగి జీవించేవాడూ, యథార్ధంగా మాట్లాడేవాడూ, అవినీతి వల్ల కలిగే లాభాన్ని అసహ్యించుకునే వాడూ, లంచాన్ని తిరస్కరించేవాడూ, హింసాత్మక నేరం చేయాలని ఆలోచించని వాడూ చెడుతనం చూడకుండా కళ్ళు మూసుకునే వాడూ,

    16 అలాంటి వాడు ఉన్నత స్థలాల్లో నివసిస్తాడు. అతనికి పర్వత శిఖరాలపైని శిలలు ఆశ్రయంగా ఉంటాయి. ఆహారమూ, నీళ్ళూ క్రమంగా అతనికి లభ్యమౌతాయి.

    17 నీ కళ్ళు రాజును అతని సౌందర్యమంతటితో చూస్తాయి. విశాలమైన దేశాన్ని నీ కళ్ళు చూస్తాయి.

  49. 23 యెహోవా చెప్పేదేమంటే “తెలివైనవాడు తన తెలివిని బట్టీ బలవంతుడు తన బలాన్ని బట్టీ గర్వించకూడదు. అలాగే ధనవంతుడు తన ఆస్తిని బట్టి గర్వించకూడదు.

    24 దేనిలో అతిశయించాలంటే, ఈ భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడంలోనే అతిశయించాలి.

    అలాటి వాటిలోనే నేను ఆనందిస్తాను.”

  50. 10 నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.

  51. 22 ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కానీ అబ్రాహాము ఇంకా యెహోవా సముఖంలోనే నిలబడి ఉన్నాడు. 23 అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. “దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా?

    24 ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా? 25 నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?” 26 దానికి యెహోవా “సొదొమ పట్టణంలో యాభైమంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను” అన్నాడు.

    27 అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. 28 యాభై మంది నీతిమంతుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువయ్యారనుకోండి. ఐదుగురు తక్కువయ్యారని ఆ పట్టణమంతటినీ నాశనం చేస్తావా?” అని మళ్ళీ అడిగాడు. అందుకాయన “అక్కడ నలభై ఐదుగురు కనిపిస్తే నాశనం చేయను” అన్నాడు.

    29 అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ “ఒకవేళ అక్కడ నలభై మందే కనిపిస్తారేమో” అన్నాడు. దానికి ఆయన “ఆ నలభై మంది కోసం నాశనం చేయను” అని చెప్పాడు. 30 అతడు మళ్ళీ “ప్రభూ, నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ ముప్ఫై మందే అక్కడ కనిపిస్తారేమో” అన్నాడు. అప్పుడాయన “ముప్ఫై మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు. 31 అందుకు అతడు “నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ ఇరవైమందే ఉంటారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “ఆ ఇరవైమంది కోసం నాశనం చేయను” అన్నాడు.

    32 చివరిగా అతడు “ప్రభూ, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ పదిమందే అక్కడ ఉన్నారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “పదిమంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు. 33 అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.

  52. 25 మన యెహోవా దేవుడు మనకి ఆజ్ఞాపించిన విధంగా ఆయన ఎదుట ఈ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ నడుచుకుంటే అదే మన విషయంలో నీతి అనిపించుకుంటుంది.”

  53. 7 నువ్వు నీతిని ప్రేమించావు. దుర్మార్గతను అసహ్యించుకున్నావు. కాబట్టి దేవుడు, నీ దేవుడు నిన్ను నీ సహచరులకంటే ఎక్కువగా ఆనందతైలంతో అభిషేకించాడు.

  54. 2 భక్తిహీనుల సంపద వారికి ఉపయోగపడదు. ఉత్తముడు మరణం నుండి తప్పించుకుంటాడు.

    3 ఉత్తముడు ఆకలితో అలమటించేలా యెహోవా చెయ్యడు. దుర్మార్గుల ప్రయత్నాలను యెహోవా భగ్నం చేస్తాడు.

  55. 9 దుర్మార్గుల మార్గాలు యెహోవాకు హేయమైనవి. నీతిని అనుసరించి నడుచుకునే వారిని ఆయన ప్రేమిస్తాడు.

  56. 10 పెళ్ళికొడుకు అందమైన తలపాగా ధరించుకున్నట్టు, పెళ్ళికూతురు నగలతో అలంకరించుకున్నట్టు

    ఆయన నాకు రక్షణ వస్త్రాలు ధరింపచేశాడు. నీతి అనే అంగీ నాకు తొడిగించాడు.

    యెహోవాను బట్టి ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉత్సాహపడుతూ ఉంది.

  57. 14 అవిశ్వాసులతో మీరు జతగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి?

  58. 9 ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం.

  59. 10 చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. 11 మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.

    12 ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.

    13 అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. 14 మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం, 15 పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. 16 వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి. 17 ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.

    18 ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి. 19 సువార్త రహస్యాన్ని ధైర్యంగా తెలియజేసేలా, నేను మాట్లాడనారంభించినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నా కోసం కూడా ప్రార్థించండి. 20 సంకెళ్ళలో ఉన్న నేను ఈ సువార్త నిమిత్తమైన రాయబారిని. నేను ఈ సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా.

  60. 7 హింసలను క్రమశిక్షణగా భావించి సహించండి. తండ్రి క్రమశిక్షణలో పెట్టని కుమారుడు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా భావించి మీతో వ్యవహరిస్తాడు. 8 కుమారులు అయిన వారందరినీ దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. ఒకవేళ మీకు క్రమశిక్షణ లేదంటే దాని అర్థం మీరు నిజమైన కుమారులు కాదు, అక్రమ సంతానంలాంటి వారన్న మాట.

    9 ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో తండ్రులు శిక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. మనం వారిని గౌరవిస్తాం. అంతకంటే ఎక్కువగా మనం ఆత్మలకు తండ్రి అయిన వాడికి విధేయులంగా జీవించనక్కర్లేదా? 10 మన తండ్రులు వాళ్లకి సరి అని తోచినట్టు కొన్ని సంవత్సరాలు మనకు నేర్పించారు. కాని మనం ఆయన పరిశుద్ధతను పంచుకోడానికి దేవుడు మన మంచి కోసం మనకు శిక్షణనిస్తున్నాడు.

    11 అయితే ప్రతి క్రమశిక్షణా ప్రస్తుతం మనకు బాధాకరంగానే ఉంటుంది కానీ సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తరువాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది.

    12 కాబట్టి సడలి పోయిన మీ చేతులను పైకెత్తండి. బలహీనంగా మారిన మోకాళ్ళను తిరిగి బలపరచండి. 13 మీ కుంటికాలు బెణకక బాగుపడేలా మీ మార్గాలు తిన్ననివిగా చేసుకోండి 14 అందరితో శాంతికరమైన సంబంధాలూ, పరిశుద్ధతా కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు. 15 దేవుని కృప నుండి మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్త పడండి. అలాగే సమస్యలు కలిగించి అనేకమందిని కలుషితం చేసే చేదు అనే వేరు మీలో మొలవకుండా జాగ్రత్త పడండి.

    16 లైంగిక అవినీతిని సాగించేవారుగానీ ఒక్క పూట భోజనం కోసం తన జన్మహక్కును అమ్మి వేసుకున్న ఏశావులాంటి దైవభీతి లేని వాడు కానీ మీలో లేకుండా జాగ్రత్త పడండి. 17 ఏశావు ఆ తరవాత ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నప్పుడు అతనికి దక్కింది తిరస్కారమే. ఎందుకంటే అతడు కన్నీళ్ళతో శ్రద్ధగా వెదికినా పశ్చాత్తాపం పొందే అవకాశం అతనికి దొరకలేదని మీకు తెలుసు.

  61. 16 కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీకు స్వస్థత కలిగేలా ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన ఫలభరితమైనది. అది ఎంతో బలవత్తరమైనది.

  62. 4 యథార్థవంతులకు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. వారు కృపాభరితులు, దయాపరులు, న్యాయవంతులు.

    5 జాలిపరులు, అప్పిచ్చే వారు, తమ వ్యవహారాలు యధార్థంగా నిర్వహించుకునే వారు క్షేమంగా ఉంటారు.

    6 అలాటి వారు ఎన్నటికీ స్థిరంగా ఉండిపోతారు. నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు.

    7 అతడు దుర్వార్తకు జడిసి పోడు. అతడు యెహోవాను నమ్ముకుని నిబ్బరంగా ఉంటాడు.

    8 అతని మనస్సు స్థిరంగా ఉంటుంది. తన శత్రువులపై గెలిచేదాకా అతడు భయపడడు.

  63. 142 నీ నీతి శాశ్వతం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం.

  64. 28 నీతిమార్గంలో జీవం ఉంది. జీవమార్గంలో మరణం అనేది ఉండదు.

  65. 3 దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులు అనుసరించే దీనులారా, యెహోవాను వెదకండి.

    మీరు వెతికి వినయంతో నీతిని అనుసరిస్తే ఒకవేళ ఆయన ఉగ్రత దినాన మీరు భద్రంగా ఉంటారేమో.

  66. 29 కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.

    30 ఆ ఆజ్ఞాన కాలాలను దేవుడు చూసీ చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే మానవులందరూ అంతటా పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. 31 ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అందరికీ ఆధారం కలగజేశాడు.”

  67. 20 ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది.

  68. 12 ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది.

  69. 4 పాపం చేసే ప్రతివాడూ అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. పాపమంటే అక్రమమే.

    5 మన పాపాలు తీసివేయడానికి క్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయనలో ఏ పాపమూ లేదు. 6 ఆయనలో నిలిచి ఉన్నవారెవరూ పాపం చేస్తూ ఉండరు. పాపం చేస్తూ ఉన్నవాడు, ఆయన ఎవరో తెలుసుకోలేదు, ఆయనను ఎన్నడూ చూడలేదు.

    7 పిల్లలూ, మిమ్మల్ని ఎవ్వరూ తప్పు దారి పట్టించకుండా జాగ్రత్త పడండి. క్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టుగా, నీతిని జరిగించే ప్రతి వాడూ నీతిపరుడు. 8 పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు.

    9 దేవుని ద్వారా జన్మించిన వాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా జన్మించిన వాడిలో దేవుని విత్తనం ఉంటుంది కాబట్టి అతడు పాపం చెయ్యలేడు. 10 నీతిని జరిగించని వారు దేవుని పిల్లలు కాదు. తమ సోదరుణ్ణి ప్రేమించనివారు దేవుని పిల్లలు కాదు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, సైతాను పిల్లలెవరో తెలిసిపోతుంది.

  70. 4 దుర్మార్గులు అలా ఉండరు. వాళ్ళు గాలికి ఎగిరిపోయే ఊకలాగా ఉంటారు.

    5 కాబట్టి తీర్పులో దుర్మార్గులు నిలవరు. అలానే నీతిమంతుల సభలో పాపులు నిలవరు.

    6 నీతిపరుల మార్గం యెహోవాకు ఆమోదం. దుర్మార్గుల మార్గం నాశనం.

  71. 12 ఎందుకంటే యెహోవా, నువ్వు న్యాయవంతులను ఆశీర్వదిస్తావు. నీ డాలుతో కప్పినట్టు నువ్వు వాళ్ళను దయతో ఆవరిస్తావు.

  72. 15 నీ నీతిని, నీ రక్షణను రోజంతా వివరిస్తాను. వాటిని నేను లెక్కించలేను.

  73. 3 న్యాయం అనుసరించేవారు, ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకునేవారు ధన్యులు.

  74. 24 తిరుగుబాటును అణచి వేయడానికి, పాపాన్ని నివారణ చేయడానికి, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, యుగాంతం వరకు ఉండే నీతిని వెల్లడి చేయడానికి, దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి, నీ ప్రజలకు, పరిశుద్ధ పట్టణానికి 70 వారాలు విధించబడ్డాయి.

  75. 14 నా సోదరులారా, ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెప్పి, క్రియలు లేనివాడైతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం అతన్ని రక్షించగలదా?

    15 ఒక సోదరునికి గాని, సోదరికి గాని కట్టుకోడానికి బట్టలు, ఆ రోజు తినడానికి భోజనం అవసరం అయితే, 16 మీలో ఒకడు అలాటి వారితో, “శాంతిగా వెళ్ళు, వెచ్చగా ఉండు, తృప్తిగా తిను” అని చెబితే ఏం ప్రయోజనం? 17 అదే విధంగా, క్రియలు లేకుండా విశ్వాసం ఒక్కటే ఉంటే, అదీ చచ్చినదే. 18 అయినా ఒకడు, “నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి” అనవచ్చు. క్రియలు లేని నీ విశ్వాసం నాకు చూపించు. అప్పుడు నేను నా క్రియల ద్వారా నా విశ్వాసం చూపిస్తాను.

    19 దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు సరే. కానీ దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయి. నమ్మి గడగడా వణుకుతున్నాయి. 20 బుద్ధిలేనివాడా! క్రియలు లేని విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు అని నీకు తెలుసుకోవాలని లేదా?

    21 మన పూర్వికుడు అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పణ చేసినప్పుడు, క్రియల వల్ల నీతిమంతుడుగా తీర్పు పొందలేదా? 22 అతని విశ్వాసం క్రియలతో కలిసి పని చేసింది. అతని క్రియల ద్వారా విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహిస్తున్నావు గదా. 23 “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.” అని లేఖనాల్లో ఉన్న విషయం నెరవేరింది. అంతేకాక అబ్రాహాముకు దేవుని స్నేహితుడు అని పేరు వచ్చింది.

    24 మనిషిని విశ్వాసం ద్వారా మాత్రమే కాకుండా క్రియల ద్వారా దేవుడు నీతిమంతుడుగా ఎంచడం మీరు చూశారు. 25 అలానే వేశ్య రాహాబు కూడా వార్తాహరులను ఆహ్వానించి వేరొక మార్గంలో వారిని పంపివేయడాన్ని బట్టి తన క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలుగా ఎంచ బడింది గదా? 26 ప్రాణం లేని శరీరం ఎలా మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే.

  76. 18 శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది.

  77. 7 నీతిమంతులను ఆయన చూడక పోడు. ఆయన వారిని నిత్యం సింహాసనంపై కూర్చునే రాజులతోబాటు కూర్చోబెడతాడు. వారు ఘనత పొందుతారు.

  78. సాదె

    137 యెహోవా, నీవు నీతిమంతుడివి. నీ న్యాయవిధులు యథార్థం.

  79. 17 యెహోవా తన విధానాలన్నిటిలో నిజాయితీగా ప్రవర్తిస్తాడు. ఆయన తన కృప ద్వారా పనులు సఫలం చేస్తాడు.

  80. 16 నీతిమంతుల కష్టార్జితం జీవం కలిగిస్తుంది. దుర్మార్గుల రాబడి పాపం వృద్ది అయ్యేలా చేస్తుంది.

  81. 29 నీతిమంతులకు యెహోవా మార్గం బలమైన కోట. పాపం చేసేవాళ్ళకు అది నాశన హేతువు.

    30 ఉత్తముడు కదిలించబడక స్థిరంగా ఉంటాడు. మూర్ఖులకు దేశంలో స్థానం ఉండదు.

    31 ఉత్తముడు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని బోధిస్తాడు. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుకను తెగ గొడతారు.

    32 ఉత్తముడు అనుకూలమైన మాటలు పలుకుతాడు. భక్తిహీనుల నోటి నుండి మూర్ఖపు మాటలు వస్తాయి.

  82. 17 నీకు విరోధంగా తయారైన ఎలాంటి ఆయుధమూ గెలవదు.

    నీ మీద నేరారోపణ చేసే వారందరినీ నువ్వు శిక్షిస్తావు.

    యెహోవా సేవకులకు ఈ హక్కు ఉంటుంది. వారిని నిర్దోషులని నిరూపించడం నా వల్ల అవుతుంది. యెహోవా ప్రకటించేది ఇదే.

  83. 1 యెహోవా ఇలా చెబుతున్నాడు. “నా రక్షణ దగ్గరగా ఉంది.

    నా నీతి త్వరలో వెల్లడవుతుంది. కాబట్టి న్యాయాన్ని పాటించండి. నిజాయితీతో ప్రవర్తించండి.

  84. 3 బుద్ధిమంతులైతే ఆకాశమండలం లోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. నీతిమార్గం అనుసరించి నడుచుకొనేలా ఎవరు అనేకమందిని తిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు.

  85. 13 ఆ సమయాన యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు. 14 అయితే యోహాను, “నేను నీచేత బాప్తిసం పొందవలసి ఉండగా, నీవు నా దగ్గరికి వస్తున్నావా?” అని ఆయనను నివారింపజూశాడు. 15 కానీ యేసు, “ఇప్పటికి కానివ్వు. నీతి అంతా ఇలా నెరవేర్చడం మనకు సబబే” అని అతనికి జవాబిచ్చాడు, కాబట్టి అతడు ఆ విధంగా చేశాడు.

    16 యేసు బాప్తిసం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురంలాగా దిగి తన మీద వాలడం ఆయన చూశాడు. 17 “ఇదిగో చూడండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం” అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది.

  86. 5 యూదా దేశానికి హేరోదు రాజుగా ఉన్న రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన జెకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య అహరోను వంశీకురాలు. ఆమె పేరు ఎలీసబెతు. 6 వీరిద్దరూ ప్రభువు ఆజ్ఞలు, న్యాయవిధులన్నిటి విషయంలో నిరపరాధులుగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకొనేవారు. 7 అయితే వారికి పిల్లలు లేరు. ఎలీసబెతు గొడ్రాలు. అంతేకాదు, వారిద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు.

  87. 9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10 “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11 పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.

    14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.

  88. 25 నీతిన్యాయాలు గల తండ్రీ, లోకం నిన్ను తెలుసుకోలేదు, కాని నువ్వు నాకు తెలుసు. నువ్వు నన్ను పంపావని వీరికి తెలుసు.

  89. 34 “దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తాడని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. 35 ప్రతి జనంలోనూ తనపట్ల భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు.

  90. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. 30 ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.

  91. 34 కాబట్టి మేల్కోండి! నీతి ప్రవర్తన కలిగి, పాపం చేయకండి. మీలో కొందరికి దేవుని గూర్చిన అవగాహన లేదు. మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను.

  92. 1 నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు.

  93. 11 తరువాత పరలోకం తెరుచుకుని ఉండడం చూశాను. అప్పుడు చూడండి! తెల్లని గుర్రం ఒకటి నాకు కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు ‘నమ్మకమైన వాడు, సత్యవంతుడు.’ ఆయన న్యాయంగా తీర్పు చెబుతూ యుద్ధం చేస్తాడు.

  94. 6 సొలొమోను ఈ విధంగా వేడుకున్నాడు “నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యాన్ని, నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలిగి ప్రవర్తించాడు. కాబట్టి నీవు అతని మీద పరిపూర్ణ కటాక్షం చూపించి, ఈ రోజు ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చోబెట్టి అతని పై గొప్ప అనుగ్రహం చూపించావు.

  95. 15 యెహోవా, ఇశ్రాయేలు దేవా, నువ్వు నీతిపరుడివి. కాబట్టి ఈనాటి వరకూ మిగిలిన మేము కొద్దిమందిమే. ఇదిగో, మేము నీ సన్నిధిలో అపరాధులం. నీ సన్నిధిలో నిలబడడానికి ఎవ్వరికీ అర్హత లేదు.”

  96. 7 దేవా, యెహోవా, అబ్రామును ఎన్నిక చేసుకుని, కల్దీయుల ఊరు అనే ప్రాంతం నుండి అతణ్ణి బయటకు రప్పించి అతనికి అబ్రాహాము అనే పేరు పెట్టినవాడివి నువ్వే. 8 అతడు నమ్మకమైన మనస్సు గలవాడు గనక కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అనే వాళ్ళ దేశాన్ని అతని సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశావు.

  97. 14 నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను గనక అది నన్ను ధరించింది. నా న్యాయవర్తన నాకు వస్త్రం, పాగా అయింది.

  98. 9 దుర్మార్గుల దుష్ట కార్యాలు అంతం అగు గాక. కానీ హృదయాలనూ, మనస్సులనూ పరిశీలించే న్యాయమూర్తివైన దేవా, న్యాయవంతులైన ప్రజలను స్థిరపరుచు.

  99. 10 దేవా, నాలో పవిత్రమైన హృదయం సృష్టించు. నాలో సరైన మనస్సును పునరుద్దరించు.

  100. 22 నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.

  101. సొలొమోను కీర్తన

    1 దేవా, రాజుకు నీ న్యాయవిధులను, రాకుమారుడికి నీ నీతిని తెలియజెయ్యి.

    2 అతడు నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయవిధులను బట్టి పేదవారికి న్యాయం తీరుస్తాడు గాక.

    3 నీతిని బట్టి పర్వతాలు, కొండలు ప్రజలకు క్షేమం కలిగిస్తాయి గాక.

    4 ప్రజల్లో పేదవారికి అతడు న్యాయం తీరుస్తాడు గాక. అక్కరలో ఉన్నవారి పిల్లలను రక్షించి, బాధపెట్టే వారిని నలగగొడతాడు గాక.

  102. 11 యెహోవా రాబోతున్నాడు. ఆకాశం సంతోషించు గాక. భూమి ఆనందించు గాక. సముద్రం, దానిలో ఉన్నదంతా ఆనందంతో ఘోషించు గాక.

    12 మైదానాలు, వాటిలో ఉన్నదంతా ఆనందించు గాక.

    అడవి చెట్లన్నీ ఉత్సాహంతో కేకలు వేస్తాయి గాక

    13 లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నీతితో ఆయన లోకానికి తన విశ్వసనీయతతో ప్రజా సమూహాలకు ఆయన తీర్పు తీరుస్తాడు.

  103. 2 మబ్బులూ చీకటీ ఆయనచుట్టూ ఉన్నాయి. నీతి న్యాయాలు యెహోవా సింహాసనానికి పునాదిగా ఉన్నాయి.

    3 ఆయన ముందు అగ్ని బయలు దేరింది. చుట్టూ ఉన్న ఆయన శత్రువులను అది కాల్చివేస్తుంది.

  104. 4 అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణాన్ని విడిపించమని యెహోవా నామాన్నిబట్టి నేను మొర్రపెట్టాను.

    5 యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు.

    6 యెహోవా సాధుజీవులను కాపాడేవాడు. నేను క్రుంగి ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించాడు.

  105. 8 యెహోవా గుడ్డివాళ్ళ కళ్ళు తెరిపిస్తాడు. అణగారిపోయిన వాళ్ళను ఆదరించి లేవనెత్తుతాడు. యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు.

  106. 34 ప్రజలు ఘనత పొందడానికి వారి న్యాయవర్తన కారణం అవుతుంది. అపరాధ ప్రవర్తన ప్రజలను అవమానాల పాలు చేస్తుంది.

  107. 21 నీతిగా దయగా ఉండే వాడు జీవాన్ని, నీతిని ఘనతను పొందుతాడు. అతడు సరైన నిర్ణయాలు చేస్తాడు.

    22 జ్ఞానవంతుడు పరాక్రమశాలుల నగరం పై దాడి చేస్తాడు. అతడు దాని భద్రమైన కోటను కూలదోస్తాడు.

  108. 10 నీకు మేలు కలుగుతుందని నీతిమంతుడితో చెప్పు.

    వాళ్ళు తమ క్రియల ఫలం అనుభవిస్తారు.

  109. 14 పవిత్రుడూ నీతిమంతుడైన వాణ్ణి మీరు తిరస్కరించి, హంతకుణ్ణి మీకోసం విడుదల చేయాలని అడిగారు. 15 మీరు జీవానికి కర్తను చంపించారు కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. అందుకు మేమే సాక్షులం.

    16 ఆయన నామంలో ఉంచిన విశ్వాసమే మీరు చూసి ఎరిగిన ఇతనిని బలపరచింది, యేసుపై ఉన్న విశ్వాసమే మీ అందరి ముందు ఇతనికి ఈ సంపూర్ణ స్వస్థత కలిగించింది.

  110. 11 చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది. 12-13 మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ భక్తిహీనతనూ, ఈ లోక సంబంధమైన దురాశలనూ వీడి, ఈ యుగంలో నీతితో, భక్తితో జీవించమని అది మనకు నేర్పుతుంది.

    14 ఆయన సమస్తమైన విచ్చలవిడి పనుల నుండి మనలను విమోచించి, మంచి పనులు చేయడంలో ఆసక్తిగల ప్రజలుగా పవిత్రపరచి తన సొత్తుగా చేసుకోడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు.

  111. 5 మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. 6-7 దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.

  112. 4 విశ్వాసం ద్వారా హేబెలు కయీను కంటే శ్రేష్ఠమైన బలిని దేవునికి అర్పించాడు. దీని వల్లనే అతణ్ణి నీతిమంతుడని పొగడడం జరిగింది. అతడు తెచ్చిన కానుకలను బట్టి దేవుడతణ్ణి మెచ్చుకున్నాడు. దాని వల్ల హేబెలు చనిపోయినా ఇప్పటికీ మాట్లాడుతున్నాడు.

  113. 17 కానీ యెహోవా ఇలా అనుకున్నాడు. “అబ్రాహాము కచ్చితంగా ఒక బలమైన గొప్ప జాతి అవుతాడు. 18 అతని మూలంగా భూమిపై అన్ని జాతులూ ఆశీర్వాదం పొందుతాయి. నేను చేయబోతున్న పనులను అబ్రాహాముకు తెలియకుండా ఎలా దాచగలను? 19 అతని తరువాత అతని వారసులు నీతి న్యాయాలను జరిగించేలా వారికి యెహోవా మార్గాన్ని బోధించడానికీ తద్వారా అబ్రాహాముకు ఆయన చెప్పిన విషయాలన్నీ జరిగించడానికీ నేను అబ్రాహామును ఎన్నుకున్నాను.”

  114. 31 వాళ్ళు వచ్చి ఆయన న్యాయ విధానం గురించి చెబుతారు. ఆయన క్రియలను ఇంకా పుట్టని వారికి చెబుతారు!

  115. 10 నీ నీతిని నా హృదయంలో దాచుకుని ఉండలేదు. నీ విశ్వసనీయతనూ, నీ ముక్తినీ నేను ప్రకటించాను. నీ నిబంధన కృపనూ, నీ విశ్వసనీయతనూ మహా సమాజానికి ప్రకటించకుండా నేను దాచలేదు.

  116. 10 దేవా, నీ నామం గొప్పదైనట్టు నీ కీర్తి కూడా భూమి అంచులవరకూ గొప్పగా ఉంది. నీతి న్యాయాలతో నీ కుడిచెయ్యి నిండి ఉంది.

  117. 14 నా రక్షణకు ఆధారమైన దేవా, రక్తాన్ని చిందించినందుకు నన్ను క్షమించు. నీ నీతిన్యాయాలను బట్టి నేను ఆనందంతో బిగ్గరగా గానం చేస్తాను.

  118. 3 సోదరులారా, మేము ఎప్పుడూ మీ విషయమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది సముచితం. ఎందుకంటే మీ విశ్వాసం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మీలో ఒకరి పట్ల మరొకరు చూపే ప్రేమ అత్యధికం అవుతూ ఉంది. 4 అందుకే మీరు పొందుతున్న హింసలన్నిటిలోనూ, మీరు సహిస్తున్న యాతనల్లోనూ, మీ సహనాన్నీ, విశ్వాసాన్నీ చూసి దేవుని సంఘాల్లో మీ గురించి మేమే గర్వంగా చెబుతున్నాం.

    5 ఇది దేవుని న్యాయమైన తీర్పుకు ఒక స్పష్టమైన సూచనగా ఉంది. దీని ఫలితం ఏమిటంటే మీరు దేవుని రాజ్యానికి తగిన వారుగా లెక్కలోకి వస్తారు. దేవుని రాజ్యం కోసమే మీరీ కష్టాలన్నీ సహిస్తున్నారు. 6-7 ప్రభు యేసు తన ప్రభావాన్ని కనుపరిచే దూతలతో పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని హింసించే వారికి యాతనా, ఇప్పుడు కష్టాలు పడుతున్న మీకూ మాకూ కూడా విశ్రాంతి కలగజేయడం దేవునికి న్యాయమే.

    8 దేవుడు తనను ఎరుగని వారిని, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించని వారిని అగ్నిజ్వాలల్లో దండిస్తాడు. 9-10 ఆ రోజున తన పరిశుద్ధులు ఆయనను మహిమ పరచడానికీ, విశ్వసించిన వారికి ఆశ్చర్య కారకంగా ఉండటానికీ ఆయన వచ్చినప్పుడు అవిశ్వాసులు ప్రభువు సన్నిధి నుండీ, ఆయన ప్రభావ తేజస్సు నుండీ వేరై శాశ్వత నాశనం అనే దండన పొందుతారు.

    ఆ పరిశుద్ధుల్లో మీరూ ఉన్నారు. ఎందుకంటే మేము చెప్పిన సాక్ష్యం మీరు నమ్మారు. 11 ఈ కారణం చేత మీకు అందిన పిలుపుకి తగిన వారిగా మిమ్మల్ని దేవుడు ఎంచాలనీ, మేలు చేయాలనే మీ ప్రతి ఆలోచననూ విశ్వాస మూలమైన ప్రతి పనినీ ఆయన తన బల ప్రభావాలతో నెరవేర్చాలనీ మేము మీ కోసం అనునిత్యం ప్రార్ధిస్తున్నాము. 12 తద్వారా మన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రసాదించే కృప మూలంగా మీలో మన ప్రభువైన యేసు నామం మహిమ పొందుతుంది. మీరు ఆయనలో మహిమ పొందుతారు.