43 Bible Verses About Death

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Death
  1. 50 సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు.

    51 ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. 52 బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం. 53 నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి. 54 ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు,

    “విజయం మరణాన్ని మింగివేసింది”

    అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి.

    55 “మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?”

    56 మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.

    57 అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి. 58 కాబట్టి నా ప్రియ సోదరులారా, స్థిరంగా, నిబ్బరంగా ఉండండి. మీ కష్టం ప్రభువులో వ్యర్థం కాదని ఎరిగి, ప్రభువు సేవలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి.

  2. 13 సోదరులారా, కన్నుమూసిన మన సహ విశ్వాసులకు ఏమి జరుగుతుందో మీరు అపార్థం చేసుకోకూడదని కోరుతున్నాము. మీరు అవిశ్వాసుల్లాగా దుఃఖపడకూడదు. చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారని ఆశాభావం లేనివారు చనిపోయిన వారి గురించి వారు తీవ్ర వేదన పడతారు. 14 యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు.

    15 మేము ప్రభువు మాట ప్రకారం మీకు చెప్పేదేమిటంటే ప్రభువు తిరిగి వచ్చేంత వరకూ బ్రతికి ఉండే మనం కన్నుమూసిన వారి కంటే ముందే ఆయనను చేరుకోము. 16 ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు. 17 ఆ తరవాత బతికి ఉండే మనలను కూడా వారితోబాటు ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపై తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం.

    18 కాబట్టి మీరు ఈ మాటలు చెప్పుకుని ఒకరినొకరు ఆదరించుకోండి.

  3. 1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు. 2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.

    3 అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు. 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.

    5 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు.

  4. 9 అయితే దేవదూతలకంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసును చూస్తున్నాం. ఆయన తాను పొందిన హింసల ద్వారా మరణం ద్వారా ఘనతా యశస్సులతో కిరీటం పొందాడు. కాబట్టి ఇప్పుడు యేసు దేవుని కృప వలన ప్రతి మనిషి కోసమూ మరణాన్ని రుచి చూశాడు. 10 ఎందుకంటే ఎవరి కోసం అన్నీ ఉనికిలో ఉన్నాయో, ఎవరి వలన సమస్తమూ కలుగుతున్నాయో ఆయన అనేకమంది కుమారులను మహిమకు తీసుకురావడం కోసం వారి రక్షణ కర్తను తాను పొందే బాధల ద్వారా సంపూర్ణుణ్ణి చేయడం దేవునికి సమంజసమే. 11 పరిశుద్ధులుగా అయ్యేవారికీ, వారిని పరిశుద్ధపరిచే వానికీ దేవుడే మూలం. కాబట్టి పరిశుద్ధ పరిచేవాడు తాను పరిశుద్ధపరిచే వారిని సోదరులని పిలవడానికి సంకోచించడు. 12 ఆయన,

    “నీ నామాన్ని నా సోదరులకు ప్రకటిస్తాను.

    సమాజం మధ్యలో నీ గురించి గానం చేస్తాను” అన్నాడు.

    13 ఇంకా, “నేను ఆయనలో నమ్మకముంచుతాను” అన్నాడు.

    ఇంకా “చూడు. నేనూ, దేవుడు నాకిచ్చిన పిల్లలూ” అనీ అన్నాడు.

    14 కనుక దేవుని పిల్లలందరూ రక్తమాంసాలున్న వారు కాబట్టి యేసు కూడా ఆ రక్తమాంసాలు పంచుకున్నాడు. తద్వారా తన మరణం మూలంగా మరణ బలం ఉన్నవాణ్ణి అంటే సాతానును శక్తిహీనుడుగా చేసాడు. 15 మరణ భయంతో జీవిత కాలమంతా బానిసత్వంలో జీవిస్తున్న వారిని విడిపించడానికి ఆయన ఆ విధంగా చేశాడు.

  5. 12 ఇదిలా ఉండగా, ఒక మనిషి ద్వారా పాపం ఎలా ఈ లోకంలోకి ప్రవేశించిందో, అలాగే పాపం ద్వారా మరణం ప్రవేశించింది. మనుషులంతా పాపం చేయడం వలన చావు అందరికీ దాపురించింది. 13 ఎందుకంటే ధర్మశాస్త్రం రాక ముందు కూడా లోకంలో పాపం ఉంది గాని ధర్మశాస్త్రం లేదు కాబట్టి దేవుడు వారిపై పాపం ఆరోపించలేదు. 14 అయినా, ఆదాము కాలం నుండి మోషే కాలం వరకూ మానవులపై మరణం రాజ్యం చేసింది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కాని అతని వలే పాపం చెయ్యని వాళ్ళపై కూడా మరణం రాజ్యం చేసింది. ఆదాము రాబోయే వాడికి ఒక సూచనగా ఉన్నాడు.

    15 కాని దేవుడు ఇచ్చిన వరానికి, ఆదాము చేసిన పాపానికి పోలిక లేదు. ఎలాగంటే ఒకడి అపరాధం వలన చాలా మంది చనిపోయారు. అయితే దేవుని అనుగ్రహం, యేసు క్రీస్తు అనే ఒక మనిషి కృప వలన కలిగిన ఉచిత కృపాదానం మరి నిశ్చయంగా అనేకమందికి సమృద్ధిగా కలిగింది. 16 పాపం చేసిన ఒక్కడి వలన శిక్ష కలిగినట్టు ఆ కృపాదానం కలగ లేదు. ఎందుకంటే తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చి శిక్షకు కారణమయ్యింది. కృపావరమైతే అనేక అపరాధాల మూలంగా వచ్చి మనుషులను నీతిమంతులుగా తీర్చడానికి కారణమయ్యింది. 17 మరణం ఒక్కడి అపరాధం మూలంగా వచ్చి ఆ ఒక్కడి ద్వారానే ఏలితే విస్తారమైన కృప, నీతి అనే కానుక పొందేవారు జీవం కలిగి మరింత నిశ్చయంగా యేసు క్రీస్తు అనే ఒకడి ద్వారానే ఏలుతారు.

  6. 18 అయితేనేం? కపటంతో గానీ సత్యంతో గాని, ఎలాగైనా క్రీస్తును ప్రకటించడం మాత్రం జరుగుతూ ఉంది. అందుకు నేను ఆనందిస్తున్నాను. ఇక ముందు కూడా ఆనందిస్తాను.

    19 మీ ప్రార్థనల వలన, యేసు క్రీస్తు ఆత్మసాయం వలన, నా విడుదల కోసం ఇదంతా జరుగుతూ ఉందని నాకు తెలుసు. 20 నేను ఏ విషయంలోనైనా సిగ్గుపాలు కానని నాకు నిబ్బరమైన ఆశాభావం ఉంది. అయితే, ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా నా జీవితం వలన గానీ, చావు వలన గానీ క్రీస్తును నా శరీరంతో ఘనపరుస్తాను అనే ధైర్యం ఉంది.

    21 నావరకైతే బతకడం క్రీస్తే, మరి చావడం లాభమే. 22 అయినా శరీరంలో నేనింకా బతుకుతూ నా ప్రయాసకు ఫలితం ఉంటే, అప్పుడు నేనేం కోరుకోవాలో నాకు తెలియడం లేదు. 23 ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయాను. నేను లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమం. 24 అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం.

  7. 23 యేసు ఆమెతో, “నీ సోదరుడు మళ్ళీ బతికి లేస్తాడు” అన్నాడు. 24 మార్త ఆయనతో, “చివరి రోజున పునరుత్థానంలో బతికి లేస్తాడని నాకు తెలుసు” అంది.

    25 అందుకు యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు, 26 బతికి ఉండి నన్ను నమ్మిన వారు ఎప్పుడూ చనిపోరు. ఇది నువ్వు నమ్ముతున్నావా?” అన్నాడు.

  8. దావీదు కీర్తన.

    1 యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు.

    2 పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు.

    3 నా ప్రాణాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు, తన నామాన్ని బట్టి సరైన మార్గాల్లో నన్ను నడిపిస్తాడు.

    4 చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.

    5 నా శత్రువుల సముఖంలో నువ్వు నాకు భోజనం సిద్ధం చేస్తావు, నూనెతో నా తల అభిషేకం చేశావు. నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది.

  9. 19 “ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు ఊదారంగు బట్టలు, ఖరీదైన బట్టలూ ధరించేవాడు. ప్రతి రోజూ విలాసంగా జీవించేవాడు. 20 లాజరు అనే నిరుపేద కూడా ఉండేవాడు. ఇతనికి ఒంటినిండా కురుపులుండేవి. ఇతడు ధనవంతుని ఇంటి గుమ్మం ముందు పడి ఉండేవాడు. 21 ధనవంతుని భోజన బల్ల పైనుంచి కింద పడే రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకోడానికి ప్రయత్నం చేసేవాడు. అంతేకాకుండా వీధి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేవి. 22 ఆ నిరుపేద చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు. తరువాత ధనవంతుడు కూడా చనిపోయాడు. అతణ్ణి పాతిపెట్టారు.

    23 “అతడు పాతాళంలో యాతనపడుతూ పైకి తేరి చూసి దూరంగా ఉన్న అబ్రాహామునూ అతనికి సన్నిహితంగా ఉన్న లాజరునూ చూసి. 24 ‘తండ్రీ అబ్రాహామూ, నన్ను కరుణించు. నేను ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను. లాజరు తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకపై చల్లడానికి అతణ్ణి పంపు’ అని కేకలు పెట్టాడు.

    25 దానికి జవాబుగా అబ్రాహాము, ‘నాయనా, గుర్తుందా? నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకిష్టమైన వాటిని నువ్వు అనుభవించావు. అప్పుడు లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అతడు సేద దీరుతున్నాడు. నువ్వు యాతన పడుతున్నావు. 26 అదీగాక ఇక్కడ నుండి మీ దగ్గరికి రావాలనుకునే వారు రాలేకుండా అక్కడి వారు మా దగ్గరికి రాకుండా మీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఉంది,’ అన్నాడు.

  10. 10 అయితే మనుషులు చనిపోయినప్పుడు కదలకుండా పడి ఉంటారు. మనుషులు ప్రాణం విడిచిన తరువాత వాళ్ళు ఏమైపోతారు?

    11 సముద్రంలో నీళ్ళు ఎలా ఇంకిపోతాయో, నదిలో నీళ్ళు ఎలా ఆవిరైపోతాయో అలాగే మనుషులు చనిపోయి ఇక తిరిగి లేవరు.

    12 ఆకాశం అంతరించి పోయేదాకా వాళ్ళు మేల్కోరు. ఎవరూ వారిని నిద్ర లేపలేరు.

    13 నువ్వు నన్ను మృత్యులోకంలో దాచి ఉంచితే ఎంత మేలు! నా మీద నీ కోపం చల్లారే దాకా మరుగు చేస్తే ఎంత బాగుంటుంది! నాకు కొంతకాలం గడువుపెట్టి ఆ తరువాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను.

    14 మనుషులు చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతుకుతారా? ఆలా జరిగే పక్షంలో నా పోరాటం ముగిసి నాకు విడుదల కలిగేదాకా నేను ఎదురుచూస్తూ ఉంటాను.

    15 అప్పుడు నువ్వు పిలుస్తావు. నేను నీతో మాట్లాడతాను. నీ చేతిపనిని చూసి నువ్వు ఇష్టపడతావు.

  11. 27 మనుషులంతా ఒకేసారి చనిపోతారు. తరువాత తీర్పు జరుగుతుంది.

  12. 11 తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు. 12 చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు.

    13 సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణమూ, పాతాళ లోకమూ వాటి వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు. 14 మరణాన్నీ పాతాళాన్నీ అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండవ మరణం. 15 జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు.

  13. 4 యెహోవా, నా జీవితం ఎప్పుడు అంతమౌతుందో నాకు తెలియజెయ్యి. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియజెయ్యి. నా జీవితం ఎంత క్షణ భంగురమో నేను తెలుసుకునేలా చెయ్యి.

    5 ఇదిగో, నువ్వు నా జీవితంలో రోజులను ఒక బెత్తెడంతగా చేశావు. నా జీవితకాలం నీ ఎదుట అసలు లేనట్టే ఉంది. ప్రతి మనిషీ నిశ్చయంగా కేవలం ఊపిరిలాగా ఉన్నాడు. సెలా.

    6 నిశ్చయంగా ప్రతి మనిషీ నీడలా తిరుగుతూ ఉంటాడు. నిస్సందేహంగా మనుషులు సంపదలు సమకూర్చుకోవడానికి త్వరపడుతూ ఉంటారు, అవన్నీ చివరగా ఎవరికి దక్కుతాయో తెలియకపోయినా సరే.

  14. 23 ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.

  15. 16 దేవుడైన యెహోవా “ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు. 17 కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిషికి ఆజ్ఞాపించాడు.

  16. 1 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.

    2 క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది. 3-4 ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు.

    5 శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు. 6 శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. 7 ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా. 8 కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు.

  17. 20 కానీ ఇప్పుడు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా చనిపోయిన వారిలో నుండి లేచిన వారిలో ప్రథమఫలం అయ్యాడు. 21 మనిషి ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనిషి ద్వారానే చనిపోయిన వారు తిరిగి లేవడం జరిగింది. 22 ఆదాములో అందరూ ఏ విధంగా చనిపోతున్నారో, అదే విధంగా క్రీస్తులో అందరూ బ్రతికించబడతారు. 23 ప్రతి ఒక్కడూ తన తన వరుసలో బ్రతికించబడతారు. మొదట, అంటే ప్రథమ ఫలంగా క్రీస్తు, ఆ తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనకు చెందినవారు బ్రతికించబడతారు.

    24 ఆ తరువాత ఆయన సమస్త ఆధిపత్యాన్నీ అధికారాన్నీ బలాన్నీ రద్దు చేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు అంతం వస్తుంది. 25 ఎందుకంటే ఆయన శత్రువులంతా ఆయన పాదాక్రాంతులయ్యే వరకూ ఆయన పరిపాలించాలి. 26 చిట్ట చివరిగా నాశనమయ్యే శత్రువు మరణం. 27 దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచాడు. సమస్తం అనే మాటలో పాదాల కింద ఉంచిన దేవుడు తప్ప మిగిలినవన్నీ ఆయన పాదాల కింద ఉన్నాయి అని తేటతెల్లం అవుతుంది కదా. 28 సమస్తమూ కుమారుడికి వశమైన తరువాత దేవుడు సర్వాధికారిగా ఉండే నిమిత్తం ఆయన కుమారుడు సమస్తాన్నీ తన కింద ఉంచిన దేవునికి తానే లోబడతాడు.

  18. 10 నిన్ను చేయమని అడిగిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయి. నువ్వు వెళ్ళే సమాధిలో పని గాని, ఉపాయం గాని, తెలివి గాని, జ్ఞానం గాని లేదు.

  19. 1 కష్టకాలం రాకముందే,

    “జీవితం అంటే నాకిష్టం లేదు”

    అని నువ్వు చెప్పే కాలం రాకముందే,

    2 సూర్య చంద్ర నక్షత్రాల కాంతికి చీకటి కమ్మక ముందే,

    వాన వెలిసిన తరువాత మబ్బులు మళ్ళీ రాక ముందే,

    నీ యువ ప్రాయంలోనే నీ సృష్టికర్తను స్మరించుకో.

    3 ఆ సమయంలో ఇంటి కావలివారు వణకుతారు.

    బలంగా ఉండేవారు వంగిపోతారు.

    తిరగలి విసిరే స్త్రీలు కొద్దిమందే ఉంటారు కాబట్టి పని ఆపేస్తారు.

    కిటికీల్లో నుంచి చూసేవాళ్ళు ఇక చూడలేరు.

    4 తిరుగటిరాళ్ల శబ్దం ఆగిపోతుంది.

    వీధి తలుపులు మూసేస్తారు.

    పిట్ట కూతకు మనుషులు మేలుకుంటారు.

    అమ్మాయిల పాటల స్వరాలు తగ్గిపోతాయి.

    5 ఎత్తు స్థలాలంటే, దారిలోని అపాయాలంటే మనుషులు భయపడే సమయమది.

    బాదం చెట్టుకు పూలు పూసినప్పుడు,

    మిడతల్లాగా బతుకు భారంగా ఈడుస్తుంటే,

    సహజమైన కోరికలు అంతరిస్తాయి.

    అప్పుడు మనిషి తన శాశ్వత నివాసం చేరతాడు.

    ఏడ్చేవాళ్ళు వీధుల్లో తిరుగుతారు.

    6 వెండి తాడు తెగిపోక ముందే లేదా బంగారు గిన్నె నలిగిపోక ముందే,

    లేదా నీటి ఊట దగ్గర కుండ పగిలిపోక ముందే,

    లేదా బావి దగ్గర కప్పీ పగిలి పోక ముందే నీ సృష్టికర్తను స్మరించుకో.

    7 మట్టి తాను దేనిలోనింఛి వచ్చిందో ఆ భూమిలో కలిసిపోక ముందే

    ఆత్మ, దాన్నిచ్చిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది.

    8 ప్రసంగి ఇలా అంటున్నాడు. “నీటి ఆవిరి, అంతా అదృశ్యమయ్యే ఆవిరే.”

  20. 32 తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా? 33 దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరారోపణ చేయగల వాడెవడు? నిర్దోషిగా ప్రకటించేవాడు దేవుడే. 34 ఎవరు శిక్ష విధించ గలిగేది? క్రీస్తు యేసా? చనిపోయినవాడు, మరింత ప్రాముఖ్యంగా చనిపోయిన వారిలో నుండి లేచినవాడు, దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నవాడు, మన కోసం విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే.

    35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా? 36 దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే,

    “నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం.

    వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”

    37 అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

  21. 19 నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూ చెమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు” అని చెప్పాడు.

  22. 1 మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు 2 పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.

    4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.

    6 దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు.

  23. 5 బతికి ఉన్న వారికి తాము చనిపోతామని తెలుసు.

    అదే చనిపోయిన వారికి ఏమీ తెలియదు.

    వారిని అందరూ మరచిపోయారు. వారికి ఇక లాభం ఏమీ లేదు.

    6 వారి ప్రేమ, పగ, అసూయ అన్నీ గతించి పోయాయి.

    సూర్యుని కింద జరిగే వాటిలో ఇక దేనిలోనూ వారి పాత్ర ఉండదు.

  24. 19 కాని మీరు “తండ్రి పాపశిక్ష కొడుకు ఎందుకు మొయ్యడు?” అంటారు. ఎందుకంటే, కొడుకు నీతిన్యాయాలకు అనుగుణంగా, నా శాసనాలనే అనుసరించి వాటి ప్రకారం చేస్తున్నాడు గనుక అతడు కచ్చితంగా బ్రతుకుతాడు! 20 పాపం చేసినవాడే చస్తాడు. తండ్రి పాపశిక్ష కొడుకు, కొడుకు పాప శిక్ష తండ్రి మొయ్యరు. నీతిమంతుని నీతి ఆ నీతిమంతునికే చెందుతుంది. దుష్టుడి దుష్టత్వం ఆ దుష్టునికే చెందుతుంది.

    21 అయితే దుష్టుడు తాను చేసిన పాపాలన్నీ విడిచి, నా శాసనాలన్నీ అనుసరించి, నీతిని అనుసరించి, న్యాయం జరిగిస్తే అతడు చావడు. అతడు కచ్చితంగా బ్రతుకుతాడు. 22 అతనికి విరోధంగా అతడు చేసిన అతిక్రమాలు జ్ఞాపకానికి రావు. అతడు పాటించే నీతినిబట్టి అతడు బ్రదుకుతాడు.

    23 “దుష్టులు నశిస్తే నేను గొప్పగా ఆనందిస్తానా? అతడు తన ప్రవర్తన సరిచేసుకుని బ్రతకడమే నాకు ఆనందం.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

    24 “కాని, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసి, దుష్టులు చేసే అసహ్యమైన పనులు జరిగిస్తే అతడు బ్రతుకుతాడా? అతడు నాకు నమ్మకద్రోహం చేసి రాజద్రోహం జరిగించాడు గనుక అతడు చేసిన నీతి పనులు ఏమాత్రం జ్ఞాపకానికి రావు. కాబట్టి అతడు చేసిన పాపం కారణంగా చస్తాడు.

  25. 7 మనలో ఎవరూ తన కోసమే బతకడు, తన కోసమే చనిపోడు. 8 మనం జీవించినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే. కాబట్టి మనం జీవించినా, చనిపోయినా ప్రభువుకే చెంది ఉన్నాం.

  26. 1 భూలోక నివాసులమైన మనం నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనం నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు. 2 పరలోక సంబంధమైన మన నివాసాన్ని ధరించుకోవాలని ఆశపడుతూ ఈ గుడారంలో మూలుగుతున్నాం. 3 ఎందుకంటే దాన్ని ధరించుకున్నపుడు మనం నగ్నంగా కనబడం. 4 ఈ గుడారంలో ఉన్న మనం బరువు మోస్తూ మూలుగుతూ ఉన్నాం. వీటిని తీసివేయాలని కాదు గాని చావుకు లోనయ్యేది జీవం చేత మింగివేయబడాలి అన్నట్టుగా, ఆ నివాసాన్ని దీని మీద ధరించుకోవాలని మన ఆశ.

  27. 14 అయినా పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచిస్తానా?

    మృత్యువు నుండి వారిని రక్షిస్తానా?

    ఓ మరణమా, నీవు తెచ్చే బాధలు ఎక్కడ? వాటిని ఇటు తీసుకురా.

    పాతాళమా, నీ నాశనం ఏది? దాన్ని ఇటు తీసుకురా.

    నాకు కనికరం పుట్టదు.

  28. 6 అందుచేత ఎప్పుడూ నిబ్బరంగా ఉండండి. ఈ దేహంలో నివసిస్తున్నంత కాలం, ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు. 7 కంటికి కనిపించే వాటిని బట్టి కాక విశ్వాసంతోనే మనం నడచుకుంటున్నాము. 8 ఈ దేహాన్ని విడిచి పెట్టి ప్రభువు దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి నిబ్బరంగా ఉన్నాం.

  29. 11 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించే వాడికి రెండవ మరణం ఏ హని చేయలేదు.”

  30. 2 సమాధుల్లో నిద్రించే చాలా మంది మేలుకుంటారు. కొందరు నిత్యజీవం అనుభవించడానికి, కొందరు నిందపాలు కావడానికి నిత్యంగా అసహ్యులై పోవడానికి మేలుకుంటారు.

  31. 24 కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు. 25 మీకు కచ్చితంగా చెబుతున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బతుకుతారు.

    26 తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండడానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు.

  32. 6 ఒక పానార్పణగా నేను బలి అవుతూ ఉన్నాను. నా మరణం సమీపించింది. 7 మంచి పోరాటం సాగించాను, నా పరుగు ముగించాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. 8 ఇప్పుడు నా కోసం నీతికిరీటం సిద్ధంగా ఉంది. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు దాన్ని ఆ రోజున నాకు అనుగ్రహిస్తాడు. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షానికై ప్రేమతో ఎదురుచూసే వారందరికీ అనుగ్రహిస్తాడు.

  33. 39 వేలాడుతున్న ఆ నేరస్థుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ, “నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు” అన్నాడు.

    40 కాని రెండోవాడు వాణ్ణి చీవాట్లు పెట్టాడు. “నువ్వూ అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా. దేవునికి భయపడవా? 41 మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు” అన్నాడు.

    42 తరువాత ఆయనను చూసి, “యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు. 43 అందుకాయన వాడితో, “ఈ రోజు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

    44 అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలముకుంది. 45 సూర్యుడు అంతర్థానమయ్యాడు. దేవాలయంలో గర్భాలయం తెర రెండుగా చిరిగిపోయింది.

    46 అప్పుడు యేసు పెద్ద స్వరంతో కేకవేసి, “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.” అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి ప్రాణం విడిచాడు.

    47 శతాధిపతి జరిగిందంతా చూసి, “ఈ వ్యక్తి నిజంగా నీతిపరుడే” అని చెప్పి దేవుణ్ణి కీర్తించాడు. 48 ఈ దృశ్యం చూడడానికి సమకూడిన ప్రజలు జరిగిందంతా చూసి గుండెలు బాదుకుంటూ తిరిగి వెళ్ళారు. 49 ఆయనతో పరిచయమున్న వారూ, గలిలయ నుండి ఆయనను అనుసరించిన స్త్రీలూ దూరంగా నిలబడి చూస్తున్నారు.

  34. 11 యేసు ఈ సంగతులు చెప్పిన తరువాత వారితో ఇలా అన్నాడు, “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతన్ని నిద్ర లేపడానికి వెళ్తున్నాను.” 12 అందుకు శిష్యులు ఆయనతో, “ప్రభూ, అతడు నిద్రపోతూ ఉంటే బాగుపడతాడు” అన్నారు. 13 యేసు అతని చావు గురించి మాట్లాడాడు గాని వారు నిద్రలో విశ్రాంతి తీసుకోవడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు.

    14 అప్పుడు యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.

  35. 1 కాబట్టి ఏమందాం? కృప విస్తరించడం కోసం పాపంలోనే కొనసాగుదామా? 2 అలా ఎన్నటికీ జరగకూడదు. పాపపు జీవితం విషయంలో చనిపోయిన మనం దానిలో ఎలా కొనసాగుతాం? 3 క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమంతా ఆయన మరణంలోకి కూడా బాప్తిసం పొందామని మీకు తెలియదా?

    4 తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము. 5 ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం.

  36. 8 కాబట్టి నువ్వు మన ప్రభువు విషయమైన సాక్ష్యం గురించి గానీ, ఆయన ఖైదీనైన నన్ను గురించి గానీ సిగ్గుపడకుండా, దేవుని శక్తితో సువార్త మూలంగా వాటిల్లే కష్టాల్లో భాగం పంచుకో.

    9 ఆయన మన క్రియలనుబట్టి కాక తన సంకల్పాన్నిబట్టి, కాలం ఆరంభానికి ముందే మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపునిచ్చాడు. 10 ఆ కృప ఇప్పుడు క్రీస్తు యేసు అనే మన రక్షకుడు ప్రత్యక్షం కావడం ద్వారా వెల్లడి అయింది. ఆయన మరణాన్ని నాశనం చేసి జీవాన్నీ అమర్త్యతనూ సువార్త ద్వారా వెలుగులోకి తెచ్చాడు.

  37. 29 నీవు ముఖం దాచుకుంటే అవి కలత చెందుతాయి. నీవు వాటి ఊపిరి ఉపసంహరిస్తే అవి ప్రాణం విడిచి మట్టిపాలవుతాయి.

  38. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

  39. 10 క్రీస్తులో ఉంటే పాపం కారణంగా మీ శరీరం చనిపోయింది గాని నీతి కారణంగా మీ ఆత్మ జీవం కలిగి ఉంది. 11 చనిపోయిన వారిలో నుండి యేసును లేపిన వాడి ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, ఆయన చావుకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించే తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు.

    12 కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము. 13 మీరు శరీరానుసారంగా నడిస్తే చావుకు సిద్ధంగా ఉన్నారు గానీ ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే మీరు జీవిస్తారు.

  40. 4 అప్పుడు సింహాసనాలు చూశాను. వాటిపై కూర్చున్న వారికి తీర్పు చెప్పే అధికారం ఇచ్చారు. యేసును గురించి తాము చెప్పిన సాక్ష్యం కోసమూ, దేవుని వాక్కును ప్రకటన చేసినందుకూ తల నరికించుకున్న భక్తుల ఆత్మలు చూశాను. వారు క్రూర మృగాన్ని గానీ, వాడి విగ్రహాన్ని గానీ పూజించలేదు. వారి నుదుటి మీద గానీ చేతి మీద గానీ ముద్ర వేయనీయలేదు. వారిప్పుడు సజీవులై క్రీస్తుతో కలిసి వెయ్యేళ్ళు పరిపాలించారు.

    5 ఆ వెయ్యి సంవత్సరాలు ముగిసే వరకూ చనిపోయిన మిగిలిన వారు సజీవులు కాలేదు. ఇదే మొదటి పునరుత్థానం. 6 ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు పరిశుద్ధులు, దీవెన పొందిన వారు. వీళ్ళపై రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికీ, క్రీస్తుకీ యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు.

  41. 5 నా చుట్టూ ఉన్నవాళ్ళ దోషాలు నా కాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు చెడ్డ రోజులకు నేనెందుకు భయపడాలి?

    6 వాళ్ళు విస్తరించిన తమ సంపదలను గూర్చి చెప్పుకుంటారు. తమ ఆస్తులనే నమ్ముకుంటారు.

    7 వాళ్ళలో ఎవడూ తన సోదరుణ్ణి రక్షించుకోలేడు. తన సోదరుడి కోసం ఎవడూ దేవునికి బంధ విముక్తి వెల చెల్లించలేడు.

    8 ఎందుకంటే ఒక వ్యక్తి జీవిత విమోచనకు చాలా వ్యయం అవుతుంది. అది ఎప్పుడైనా ఎంతో వ్యయంతో కూడుకున్నది.

    9 ఎవరూ తన శరీరం కుళ్ళిపోకుండా కలకాలం జీవించరు.

    10 వాడు తన క్షయాన్ని చూస్తాడు. జ్ఞానులు చనిపోతారు. మూర్ఖుడూ, క్రూరుడూ ఒక్కలాగే నశించిపోతారు. తమ సంపదలను ఇతరులకు విడిచిపెట్టి పోతారు.

  42. 17 మృతులు, మౌనస్థితిలోకి దిగిపోయే వారు యెహోవాను స్తుతించరు.

  43. 8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.