70 Bible Verses About Losing a Child

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Losing a Child
  1. 1 యేసు ఆ ప్రజా సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. 2 ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు.

    3 “ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే.

    4 దుఃఖించే వారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది.

  2. 13 సోదరులారా, కన్నుమూసిన మన సహ విశ్వాసులకు ఏమి జరుగుతుందో మీరు అపార్థం చేసుకోకూడదని కోరుతున్నాము. మీరు అవిశ్వాసుల్లాగా దుఃఖపడకూడదు. చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారని ఆశాభావం లేనివారు చనిపోయిన వారి గురించి వారు తీవ్ర వేదన పడతారు. 14 యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు.

    15 మేము ప్రభువు మాట ప్రకారం మీకు చెప్పేదేమిటంటే ప్రభువు తిరిగి వచ్చేంత వరకూ బ్రతికి ఉండే మనం కన్నుమూసిన వారి కంటే ముందే ఆయనను చేరుకోము. 16 ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు. 17 ఆ తరవాత బతికి ఉండే మనలను కూడా వారితోబాటు ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపై తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం.

    18 కాబట్టి మీరు ఈ మాటలు చెప్పుకుని ఒకరినొకరు ఆదరించుకోండి.

  3. 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు.

    4 ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.

    5 క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది. 6 మాకు కష్టాలు వస్తే అవి మీ విమోచన కోసం, మీ ఆదరణ కోసం. మాకు ఆదరణ కలిగితే అది కూడా మీ ఆదరణ కోసమే. మాలాగే మీరూ పడుతున్న కష్టాలను సహించడానికి కావలసిన ఓర్పును ఈ ఆదరణ కలిగిస్తున్నది.

    7 మీరు మా కష్టాలను ఎలా పంచుకుంటున్నారో అలాగే మా ఆదరణ కూడా పంచుకుంటున్నారని మాకు తెలుసు. అందుచేత మీ గురించి మాకు దృఢమైన ఆశాభావం ఉంది.

  4. 1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు. 2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.

    3 అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు. 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.

    5 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు.

  5. 18 విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు.

    19 ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటి పైనా అతనికి విజయం ఇస్తాడు.

    20 ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతాడు. వాటిలో ఒక్కటి కూడా విరిగి పోదు.

    21 చెడుతనం దుర్మార్గులను హతం చేస్తుంది. ధర్మాత్ముణ్ణి అసహ్యించుకునే వాడు శిక్ష పొందుతాడు.

    22 యెహోవా తన సేవకుల ప్రాణాలను విడుదల చేస్తాడు. ఆయన శరణు వేడిన వాడికి శిక్ష ఉండదు.

  6. 10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను.

    నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి.

    దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను.

    నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.

  7. ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. అలమోత్ రాగం పై పాడాలి. ఒక గీతం.

    1 దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం.

    2 కాబట్టి భూమి మారిపోయినా, సముద్ర అఖాతంలో పర్వతాలు మునిగిపోయినా మేము భయపడం.

    3 సముద్రంలో నీళ్ళు గర్జించినా, తీవ్ర ఉద్రేకంతో అవి పొంగినా, వాటి పొంగుకు పర్వతాలు కంపించినా సరే. సెలా.

  8. 1 “మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి. 2 నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను. 3 నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను. 4 నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ దారి కూడా తెలుసు” అన్నాడు.

  9. 25 ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు, “తండ్రీ, పరలోకానికీ భూమికీ ప్రభూ, నీవు జ్ఞానులకూ తెలివైన వారికీ ఈ సంగతులను మరుగు చేసి చిన్న పిల్లలకు వెల్లడి పరచావు. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను. 26 అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకెంతో ఇష్టం. 27 సమస్తాన్నీ నా తండ్రి నాకు అప్పగించాడు. తండ్రి తప్ప కుమారుణ్ణి ఎవరూ ఎరగరు. కుమారుడూ, ఎవరికి వెల్లడించాలని కుమారుడు ఉద్దేశిస్తాడో వాడూ తప్ప మరి ఎవరూ తండ్రిని ఎరగరు.

    28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  10. 51 ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. 52 బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం. 53 నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి. 54 ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు,

    “విజయం మరణాన్ని మింగివేసింది”

    అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి.

    55 “మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?”

    56 మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.

    57 అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి.

  11. దావీదు కీర్తన.

    1 యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు.

    2 పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు.

    3 నా ప్రాణాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు, తన నామాన్ని బట్టి సరైన మార్గాల్లో నన్ను నడిపిస్తాడు.

    4 చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.

  12. 3 గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వాళ్ళ గాయాలు నయం చేసేవాడు ఆయనే.

  13. 6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.

    7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి.

  14. 26 నా శరీరం, నా హృదయం క్షీణించిపోయినా దేవుడు ఎప్పుడూ నా హృదయానికి బలమైన దుర్గంగా ఉన్నాడు.

  15. 23 యేసు ఆమెతో, “నీ సోదరుడు మళ్ళీ బతికి లేస్తాడు” అన్నాడు. 24 మార్త ఆయనతో, “చివరి రోజున పునరుత్థానంలో బతికి లేస్తాడని నాకు తెలుసు” అంది.

    25 అందుకు యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు, 26 బతికి ఉండి నన్ను నమ్మిన వారు ఎప్పుడూ చనిపోరు. ఇది నువ్వు నమ్ముతున్నావా?” అన్నాడు.

  16. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.

  17. 34 యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుముకు గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కొడుకు కోసం దుఃఖించాడు. 35 అతని కొడుకులు, కూతుర్లు అందరూ అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నం చేశారు గానీ అతడు ఓదార్పు పొందలేదు. “నేను ఏడుస్తూ చనిపోయిన వారుండే స్థలానికి నా కొడుకు దగ్గరికి వెళ్తాను” అని అతడు యోసేపు కోసం ఏడ్చాడు.

  18. 1 ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికీ ప్రతి ఉద్దేశానికీ ఒక సమయం ఉంది.

    2 పుట్టడానికీ, చనిపోడానికీ నాటడానికీ, నాటిన దాన్ని పెరకడానికీ

    3 చంపడానికీ, స్వస్థపరచడానికీ కూలదోయడానికీ, కట్టడానికీ

    4 ఏడవడానికీ, నవ్వడానికీ, దుఃఖించడానికీ, నాట్యం చేయడానికీ

    5 రాళ్లను పారవేయడానికీ, వాటిని పోగు చేయడానికీ ఎదుటి వారిని కౌగలించుకోడానికీ, మానడానికీ

    6 వస్తువులను వెదకడానికీ, పోగొట్టుకోడానికీ దాచుకోడానికీ, పారవేయడానికీ

    7 వస్త్రాలను చింపడానికీ, కుట్టడానికీ మౌనం వహించడానికీ, మాటలాడడానికీ

    8 ప్రేమించడానికీ, ద్వేషించడానికీ యుద్ధం చేయడానికీ, సంధి చేసుకోడానికీ ఇలా ప్రతిదానికీ ఒక సమయం ఉంది.

  19. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

  20. 35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా? 36 దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే,

    “నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం.

    వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”

    37 అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

  21. 31 ప్రభువు అతన్ని ఎల్లకాలం తృణీకరించడు.

    32 ఆయన శోకం రప్పించినా, తన నిబంధన నమ్మకత్వపు గొప్పదనాన్ని బట్టి కనికరం చూపిస్తాడు.

    33 హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు.

  22. 12 యెహోవా ఇలా చెబుతున్నాడు,

    “నదిలాగా శాంతిసమాధానాలు ఆమె దగ్గరికి ప్రవహించేలా చేస్తాను.

    రాజ్యాల ఐశ్వర్యం ఒడ్డు మీద పొర్లిపారే ప్రవాహంలాగా చేస్తాను.

    మిమ్మల్ని చంకలో ఎత్తుకుంటారు. మోకాళ్ల మీద ఆడిస్తారు.

    13 తల్లి తన బిడ్డను ఓదార్చినట్టు నేను మిమ్మల్ని ఓదారుస్తాను. యెరూషలేములోనే మిమ్మల్ని ఓదారుస్తాను.”

    14 మీరు దీన్ని చూస్తారు. మీ హృదయం సంతోషిస్తుంది. మీ ఎముకలు లేతగడ్డిలాగా బలుస్తాయి.

    యెహోవా హస్తబలం ఆయన సేవకులకు వెల్లడి అవుతుంది. అయితే ఆయన తన శత్రువుల మీద కోపం చూపుతాడు.

  23. 35 యేసు ఏడ్చాడు.

  24. 6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

    8 చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి.

  25. 5 ఆయన కోపం ఒక్క నిమిషమే ఉంటుంది. అయితే ఆయన దయ జీవిత కాలమంతా ఉంటుంది. రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ ఉదయానికి సంతోషం కలుగుతుంది.

  26. 22 నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.

  27. 4 అయితే ఆయన మన రోగాలను కచ్చితంగా భరించాడు. మన దుఖాలను మోశాడు.

    అయినా దేవుడు ఆయనను శిక్షించాడనీ దెబ్బ కొట్టి బాధించాడనీ మనం భావించుకున్నాం.

    5 కానీ ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలగగొట్టడం జరిగింది.

    మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్దాం.

    6 మనందరం గొర్రెలలాగా దారి తప్పాము. మనలో ప్రతివాడూ తనకిష్టమైన దారికి తొలగిపోయాము.

    యెహోవా మనందరి దోషాన్ని ఆయనమీద మోపాడు.

  28. 27 శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి.

  29. 1 ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నాడు.

    అణగారిన వారికి శుభవార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు.

    గుండె పగిలిన వారిని బాగుచేయడానికి బందీలుగా ఉన్నవారికి విడుదల, ఖైదీలకు విముక్తి ప్రకటించడానికి,

    2 యెహోవా దయావత్సరాన్నీ మన దేవుని ప్రతిదండన దినాన్నీ ప్రకటించడానికి, దుఃఖించే వారందరినీ ఓదార్చడానికి ఆయన నన్ను పంపాడు.

    3 సీయోనులో దుఃఖించేవారిని చక్కపెట్టడానికి, బూడిదకు బదులు అందమైన తలపాగా, దుఃఖానికి బదులు ఆనందతైలం, కుంగిన మనసు బదులు స్తుతి వస్త్రం వారికివ్వడానికి ఆయన నన్ను పంపాడు.

    నీతి విషయంలో మస్తకి వృక్షాలనీ యెహోవా ఘనతకోసం నాటిన చెట్లు అనీ వారిని పిలుస్తారు.

  30. 22 “అలాగే, మీరు ఇప్పుడు దుఖపడుతున్నారు గాని, నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను. అప్పుడు మీ హృదయం ఆనందిస్తుంది. మీ ఆనందం మీ దగ్గరనుంచి ఎవ్వరూ తీసివేయలేరు.

  31. 18 మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను.

  32. 6 అందుచేత ఎప్పుడూ నిబ్బరంగా ఉండండి. ఈ దేహంలో నివసిస్తున్నంత కాలం, ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు. 7 కంటికి కనిపించే వాటిని బట్టి కాక విశ్వాసంతోనే మనం నడచుకుంటున్నాము. 8 ఈ దేహాన్ని విడిచి పెట్టి ప్రభువు దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి నిబ్బరంగా ఉన్నాం.

  33. 2 యెహోవా నా ఆశ్రయశిల, నా కోట, నన్ను రక్షించేవాడు, ఆయన నా దేవుడు, నా ఆశ్రయశిల. నేను ఆయనలో ఆశ్రయం పొందుతాను. ఆయన నా డాలు, నా రక్షణ కొమ్ము, నా బలమైన పట్టు.

  34. 8 నా పలాయనాలను నువ్వు లెక్కించావు. నా అశ్రువులు నీ ఎదుట ఉన్న సీసాలో నింపావు. అవన్నీ నీ పుస్తకంలో కనిపిస్తాయి కదా.

  35. 9 నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”

  36. 18 అదే సమయంలో మరో సేవకుడు వచ్చి “నీ కొడుకులు, కూతుళ్ళు నీ పెద్ద కొడుకు ఇంట్లో భోజనం చేస్తూ, ద్రాక్షరసం తాగుతూ ఉన్నారు. 19 అప్పుడు ఎడారి ప్రాంతం నుండి గొప్ప సుడిగాలి బలంగా వీచి వాళ్ళున్న ఇల్లు నాలుగు వైపులా కొట్టింది. ఇల్లు ఆ యువతీయువకుల మీద పడిపోవడం వల్ల వాళ్ళంతా చనిపోయారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు.

    20 అప్పుడు యోబు లేచి తన పై దుస్తులు చింపుకున్నాడు. తలవెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు. 21 “నేను నా తల్లి కడుపులోనుండి దిగంబరిగా వచ్చాను. దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగు గాక.”

  37. 2 నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను.

    నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు.

    నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు

  38. 33 అప్పుడు రాజు తీవ్రంగా పరితాపం చెందాడు. పట్టణం గుమ్మానికి పైన ఉన్న గదికి వెళ్లి, ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతూ “అబ్షాలోమా, నా బిడ్డా, అబ్షాలోమా” అని కేకలు వేస్తూ “అయ్యో నా బిడ్డా, నీ బదులు నేను చనిపోయినా బాగుండేది. నా బిడ్డా, అబ్షాలోమా, నా బిడ్డా” అని విలపిస్తూ ఉన్నాడు.

  39. 9 పీడిత ప్రజలకు యెహోవా బలమైన ఆశ్రయం. ఆపత్కాలంలో బలమైన అండ.

  40. 8 మరెన్నడు ఉండకుండా మరణాన్ని ఆయన మింగి వేస్తాడు. ప్రభువైన యెహోవా ప్రతివాడి ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. భూమి మీద నుండి తన ప్రజల నిందను తీసివేస్తాడు. ఇలా జరుగుతుందని యెహోవా సెలవిచ్చాడు.

    9 ఆ దినాన ప్రజలు ఇలా అంటారు. ఇదిగో మనలను రక్షిస్తాడని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనం ఎదురు చూసిన యెహోవా ఈయనే. ఆయన ఇచ్చే రక్షణ విషయం సంతోషించి ఉత్సాహ పడదాము.

  41. 28 నీకు తెలియలేదా? నీవు వినలేదా?

    భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు.

    ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.

    29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.

    30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.

    31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.

    వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.

    అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

  42. 8 మనం జీవించినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే. కాబట్టి మనం జీవించినా, చనిపోయినా ప్రభువుకే చెంది ఉన్నాం.

  43. 13 అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం నాకిలా వినిపించింది, “ఇలా రాయి. ‘ఇక నుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు దీవెన పొందినవారు.’” నిజమే, వారు తమ బాధ ప్రయాసలన్నీ విడిచి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారు చేసిన పనులు వారి వెనకే వెళ్తాయి.

  44. 15 సంతోషించే వారితో కలిసి సంతోషించండి. దుఖపడే వారితో కలిసి దుఖపడండి.

  45. 16 యెహోవా ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డను మొత్తి జబ్బు పడేలా చేశాడు. 17 దావీదు ఉపవాసం ఉండి లోపలికి వెళ్లి బిడ్డ కోసం దేవుణ్ణి బతిమిలాడుతూ రాత్రంతా నేల మీద పడి ఉన్నాడు. ఇంట్లో ప్రముఖులు అతణ్ణి నేలపై నుండి లేపడానికి ప్రయత్నించారు. కానీ దావీదు ఒప్పుకోలేదు, వారితో కలసి భోజనం చేయలేదు.

    18 ఏడవ రోజు బిడ్డ చనిపోయాడు. దావీదు సేవకులు “బిడ్డ బతికి ఉన్నపుడు అతనితో ఏమి చెప్పినా అతడు మన మాట వినలేదు. 19 ఇప్పుడు బిడ్డ చనిపోయాడని చెబితే తనకు తాను ఏదైనా హాని చేసుకొంటాడేమో” అనుకున్నారు. వారు బిడ్డ చనిపోయాడన్న సంగతి అతనితో చెప్పడానికి భయపడ్డారు. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుకోవడం గమనించి బిడ్డ చనిపోయాడని అర్థం చేసుకున్నాడు. “బిడ్డ చనిపోయాడా?” అని తన సేవకులను అడిగాడు. వారు “చనిపోయాడు” అని జవాబిచ్చాడు.

    20 అప్పుడు దావీదు నేలపై నుండి లేచి స్నానంచేసి నూనె రాసుకుని వేరే బట్టలు ధరించాడు. యెహోవా మందిరంలో ప్రవేశించి దేవునికి మొక్కి, తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తీసుకురమ్మన్నాడు. వారు భోజనం తెచ్చి వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు.

    21 అతని సేవకులు “బిడ్డ బతికి ఉన్నప్పుడు ఉపవాసంతో బిడ్డ కోసం ఏడుస్తూ ఉన్నావు, వాడు చనిపోయినప్పుడు లేచి భోజనం చేశావు. నువ్వు ఇలా చేయడంలో అర్థం ఏమిటి?” అని దావీదును అడిగారు. 22 అప్పుడు దావీదు “బిడ్డ బతికి ఉన్నప్పుడు దేవుడు నన్ను కరుణించి బిడ్డను బతికిస్తాడన్న ఆశతో నేను ఉపవాసముండి ఏడుస్తూ వేడుకొన్నాను. 23 ఇప్పుడు బిడ్డ చనిపోయాడు కనుక నేనెందుకు ఉపవాసముండాలి? బిడ్డను నేను తిరిగి రప్పించగలనా? నేనే వాడి దగ్గరకు వెళ్తాను గానీ వాడు నా దగ్గరికి మళ్ళీ రాడు కదా” అని వారితో చెప్పాడు.

  46. 24 ఆయన బాధపడే వాళ్ళ బాధను తృణీకరించలేదు, వాళ్ళను చూసి ఆయన అసహ్యపడలేదు. అతనినుంచి తన ముఖం దాచుకోలేదు. బాధలో ఉన్నవాడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించాడు.

  47. 9 యెహోవా, నన్ను కనికరించు. నేను ఇరుకులో పడిపోయాను. దుఃఖంతో నా కళ్ళు క్షీణిస్తున్నాయి. నా ప్రాణం, దేహం క్షీణిస్తున్నాయి.

    10 నా బ్రతుకు దుఃఖంతో వెళ్లబుచ్చుతున్నాను. నా ఆయుష్షు అంతా నిట్టూర్పులతో గతించిపోతున్నది. నా పాపం వలన నా బలం తగ్గిపోతున్నది. నా ఎముకలు క్షీణించిపోతున్నాయి.

  48. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  49. 21 “ఇప్పుడు ఆకలితో ఉన్నవారలారా, మీరు ధన్యులు, మీకు తృప్తి కలుగుతుంది.

    “ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు.

  50. 35 దానికి జవాబుగా యేసు, “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాడికి ఆకలి వేయదు. నాపై విశ్వాసముంచే వాడికి దాహం వేయదు. 36 కాని నేను మీతో చెప్పినట్టు, నన్ను చూసి కూడా మీరు నమ్మలేదు. 37 తండ్రి నాకు ఇచ్చే వారంతా నా దగ్గరికి వస్తారు. ఇక నా దగ్గరికి వచ్చేవారిని నేను ఎంత మాత్రం నా దగ్గర నుండి తోలివేయను. 38 ఎందుకంటే నేను నా స్వంత ఇష్టాన్ని జరిగించడానికి రాలేదు. నన్ను పంపించిన వాని ఇష్టాన్ని జరిగించడానికే పరలోకం నుండి వచ్చాను. 39 ఆయన నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ పోగొట్టుకోకుండా ఉండడమూ, వారందరినీ అంత్యదినాన లేపడమూ నన్ను పంపిన వాడి ఇష్టం. 40 ఎందుకంటే కుమారుణ్ణి చూసి ఆయనలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం. అంత్యదినాన నేను వారిని సజీవంగా లేపుతాను.”

  51. 13 మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సమృద్ధి అయిన నిరీక్షణ కలిగి ఉండేలా నిరీక్షణకర్త అయిన దేవుడు పూర్తి ఆనందంతో, సమాధానంతో మిమ్మల్ని నింపు గాక.

  52. 21 నావరకైతే బతకడం క్రీస్తే, మరి చావడం లాభమే. 22 అయినా శరీరంలో నేనింకా బతుకుతూ నా ప్రయాసకు ఫలితం ఉంటే, అప్పుడు నేనేం కోరుకోవాలో నాకు తెలియడం లేదు. 23 ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయాను. నేను లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమం. 24 అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం.

  53. 28 నా దీపానికి వెలుగును ఇచ్చేవాడివి నువ్వే. నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేస్తాడు.

  54. 14 ఈ దేవుడు నిరంతరం మనకు దేవుడుగా ఉన్నాడు. మరణం వరకూ ఆయన మనలను నడిపిస్తాడు.

  55. 10 పర్వతాలు కూలిపోయినా కొండలు కదిలినా నా కృప నీనుంచి తొలగిపోదు. నా శాంతి ఒడంబడిక, నిన్ను విడిచిపోదు” అని నీ మీద జాలిపడే యెహోవా చెబుతున్నాడు.

  56. 13 వారు వెళ్ళిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, “లేచి బాలుణ్ణీ, తల్లినీ తీసుకుని ఐగుప్తుకు పారిపో. నేను నీకు మళ్ళీ చెప్పే వరకూ అక్కడే ఉండు. ఎందుకంటే హేరోదు ఈ బాలుణ్ణి చంపాలని వెదకబోతున్నాడు” అని అతనితో చెప్పాడు. 14 యోసేపు లేచి, రాత్రి వేళ బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఐగుప్తుకు తరలిపోయాడు. 15 హేరోదు చనిపోయే వరకూ అక్కడే ఉండిపోయాడు.

    ‘ఐగుప్తు నుంచి నా కుమారుణ్ణి పిలిచాను’

    అని ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది.

    16 ఆ జ్ఞానులు తనను మోసగించారని హేరోదు గ్రహించి కోపంతో మండిపడ్డాడు. తాను జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములో, దాని పరిసర గ్రామాలన్నిటిలో రెండేళ్ళు, అంతకు తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు.

    17-18 “ఏడుపు, రోదనలతో రమాలో ఒక స్వరం వినబడింది.

    రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది.

    వారిని కోల్పోయి ఓదార్పు పొందలేక ఉంది”

    అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇలా నెరవేరాయి.

  57. 11 ఇది జరిగిన తరువాత ఆయన నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు, ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు. 12 ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి మోసుకుపోతూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె వితంతువు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు.

    13 ప్రభువు ఆమెను చూసి ఆమెపై జాలిపడి, “ఏడవ వద్దు” అని ఆమెకు చెప్పి, దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దాన్ని మోసేవారు నిలబడి పోయారు. 14 ఆయన, “అబ్బాయ్, నేను చెబుతున్నాను, లే!” అన్నాడు. 15 ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు.

  58. 13 కాగా, “నమ్మాను కాబట్టి మాట్లాడాను” అని రాసినట్టుగా అలాంటి విశ్వాసం గల మనసు కలిగి మేము కూడా నమ్ముతున్నాము కాబట్టి మాట్లాడుతున్నాము.

    14 ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి, మీతో తన ఎదుట నిలబెడతాడని మాకు తెలుసు. 15 కృప చాలామందికి విస్తరించినట్టుగా దేవుని మహిమ కోసం కృతజ్ఞత విస్తరించేలా అన్నీ మీ కోసమే జరిగాయి. 16 అందుచేత మేము నిరుత్సాహపడడం లేదు. మా దేహాలు రోజురోజుకీ క్షీణించి పోతున్నా లోలోపల ప్రతి రోజూ దేవుడు మమ్మల్ని కొత్తవారినిగా చేస్తున్నాడు.

    17 మేము కనిపించే వాటి కోసం కాకుండా కనిపించని వాటి కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి క్షణమాత్రం ఉండే స్వల్ప బాధ, దానికి ఎన్నో రెట్లు అధికమైన అద్భుతమైన వైభవానికి మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంది. అది ఎప్పటికీ ఉండే వైభవం. 18 కనిపించేవి కొంత కాలమే ఉంటాయి కానీ కనిపించనివి శాశ్వతంగా ఉంటాయి.

  59. 9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.

    10 బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.

  60. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

  61. 10 తన నిత్య మహిమకు క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన అపార కరుణానిధి అయిన దేవుడు కొంత కాలం మీరు బాధపడిన తరువాత, తానే మిమ్మల్ని సరైన స్థితిలోకి తెచ్చి, బలపరచి, సామర్థ్యం ఇచ్చి స్థిర పరుస్తాడు. 11 ఆయనకే ప్రభావం శాశ్వతంగా కలుగు గాక. ఆమేన్‌.

  62. ప్రధాన సంగీతకారుని కోసం. తీగె వాయిద్యాలతో పాడేది. దావీదు కీర్తన

    1 దేవా, నా మొర ఆలకించు, నా ప్రార్థన శ్రద్ధగా విను.

    2 నా ప్రాణం తల్లడిల్లినప్పుడు భూదిగంతాల నుండి నీకు మొరపెడతాను. నేను ఎక్కలేనంత ఎత్తయిన కొండ పైకి నన్ను ఎక్కించు.

  63. 15 యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది.

  64. 20 కానీ ఇప్పుడు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా చనిపోయిన వారిలో నుండి లేచిన వారిలో ప్రథమఫలం అయ్యాడు. 21 మనిషి ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనిషి ద్వారానే చనిపోయిన వారు తిరిగి లేవడం జరిగింది. 22 ఆదాములో అందరూ ఏ విధంగా చనిపోతున్నారో, అదే విధంగా క్రీస్తులో అందరూ బ్రతికించబడతారు. 23 ప్రతి ఒక్కడూ తన తన వరుసలో బ్రతికించబడతారు. మొదట, అంటే ప్రథమ ఫలంగా క్రీస్తు, ఆ తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనకు చెందినవారు బ్రతికించబడతారు.

  65. 14 ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. 16 కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.

  66. 5 తన పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా, వితంతువులకు సహాయకుడిగా ఉన్నాడు.

  67. 20 ఎన్నో కఠిన బాధలు మాకు కలిగేలా చేసిన దేవా, నువ్వు మమ్మల్ని మళ్ళీ జీవించేలా చేస్తావు. అగాధ లోయల్లో నుండి మళ్ళీ మమ్మల్ని లేవనెత్తుతావు.

    21 నా గొప్పతనాన్ని వృద్ధిచెయ్యి. నావైపు తిరిగి నన్ను ఆదరించు.

  68. 8 మరణం నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు కార్చకుండా నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను నువ్వు తప్పించావు.

  69. 32 కీడు కలిగినప్పుడు తమ చెడ్డ పనుల వల్ల భక్తిహీనులు నశిస్తారు. నీతిమంతునికి సత్య సమయంలో కూడా ఆశ్రయం దొరుకుతుంది.

  70. 6 ఒక పానార్పణగా నేను బలి అవుతూ ఉన్నాను. నా మరణం సమీపించింది. 7 మంచి పోరాటం సాగించాను, నా పరుగు ముగించాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. 8 ఇప్పుడు నా కోసం నీతికిరీటం సిద్ధంగా ఉంది. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు దాన్ని ఆ రోజున నాకు అనుగ్రహిస్తాడు. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షానికై ప్రేమతో ఎదురుచూసే వారందరికీ అనుగ్రహిస్తాడు.