65 Bible Verses About Adultery

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Adultery
  1. 27 “‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా. 28 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు. 29 నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. 30 నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.

    31 “‘తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి’ అని చెప్పడం కూడా మీరు విన్నారు. 32 నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.

  2. 14 వ్యభిచారం చెయ్యకూడదు.

    15 దొంగతనం చెయ్యకూడదు.

    16 నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు.

    17 నీ పొరుగువాడి ఇల్లు గానీ, అతని భార్యను గానీ, దాస దాసీలను గానీ, అతని ఎద్దును గానీ, గాడిదను గానీ, నీ పొరుగు వాడికి చెందిన దేనినీ ఆశించకూడదు.

    18 ప్రజలంతా ఆ ఉరుములు, మెరుపులు, భీకరమైన బూర శబ్దం, ఆ కొండ నుండి రగులుతున్న పొగ చూసి భయపడ్డారు. భయంతో దూరంగా తొలగిపోయి మోషేతో, 19 “దేవుడే గనక మాతో మాట్లాడితే మేమంతా చచ్చిపోతాం. నువ్వే మాతో మాట్లాడు, మేము వింటాం” అన్నారు.

  3. 23 దేవుని ఆజ్ఞలు దీపం లాంటివి. ఉపదేశం వెలుగు వంటిది. క్రమశిక్షణ కోసం చేసే దిద్దుబాట్లు జీవానికి సోపానాలు.

    24 వ్యభిచారిణి దగ్గరికి వెళ్ళకుండా, చెడ్డ స్త్రీ చెప్పే మోసపు మాటలకు లోబడకుండా అవి నిన్ను కాపాడతాయి.

    25 దాని అందం చూసి నీ హృదయంలో మోహించకు. అది తన కనుసైగలతో నిన్ను లోబరుచుకోవాలని చూస్తే దాని వల్లో పడవద్దు.

    26 వేశ్యలతో సాంగత్యం చేసేవాళ్ళకు కేవలం రొట్టెముక్క మాత్రమే మిగులుతుంది. వ్యభిచారి నీ విలువైన ప్రాణాన్ని వేటాడుతుంది.

    27 ఒకడు తన ఒడిలో నిప్పు ఉంచుకుంటే వాడి బట్టలు కాలిపోకుండా ఉంటాయా?

    28 ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి కాళ్ళు కాలకుండా ఉంటాయా?

    29 తన పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు ఆ విధంగానే నాశనం అవుతాడు. ఆమెను తాకిన వాడికి శిక్ష తప్పదు.

    30 బాగా ఆకలి వేసిన దొంగ భోజనం కోసం దొంగతనం చేసినప్పుడు వాణ్ణి ఎవ్వరూ తిరస్కారంగా చూడరు గదా.

    31 అయినప్పటికీ వాడు దొరికిపోతే వాడు దొంగిలించిన దానికి ఏడు రెట్లు చెల్లించాలి. అందుకోసం తన యింటిని అమ్మివేయాలిసి వచ్చినా దాన్ని అమ్మి తప్పక చెల్లించాలి.

    32 వ్యభిచారం చేసేవాడు కేవలం బుద్ధి లేనివాడు. ఆ పని చేసేవాడు తన సొంత నాశనం కోరుకున్నట్టే.

    33 వాడు గాయాలకు, అవమానాలకు గురి అవుతాడు. వాడికి కలిగే అవమానం ఎప్పటికీ తొలగిపోదు.

    34 భర్తకు వచ్చే రోషం తీవ్రమైన కోపంతో కూడి ఉంటుంది. ప్రతీకారం చేసే సమయంలో అతడు కనికరం చూపించడు.

    35 ప్రాయశ్చిత్తంగా నువ్వు ఇచ్చే దేనినీ అతడు లక్ష్యపెట్టడు. ఎన్ని విలువైన కానుకలు ఇచ్చినా అతడు తీసుకోడు.

  4. 9 అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతికి పాలుపడే వారూ, విగ్రహాలను పూజించేవారూ, మగ వేశ్యలు, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులూ, విపరీత సంపర్కం జరిపే వారూ, 10 దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    11 గతంలో మీలో కొంతమంది అలాటివారే. అయితే ప్రభు యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మ మిమ్మల్ని కడగడం ద్వారా పవిత్రులై దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు.

  5. 4 వివాహం అందరూ గౌరవించేదిగా దాంపత్యం పవిత్రంగా ఉండనివ్వండి. లైంగిక అవినీతిపరులనూ, వ్యభిచారులనూ దేవుడు శిక్షిస్తాడు.

  6. 6 యోషీయా రాజు పాలన సమయంలో యెహోవా నాకిలా చెప్పాడు.

    “ఇశ్రాయేలు ఎంత అపనమ్మకం చూపిందో చూశావా? ఆమె ఎత్తయిన ప్రతి కొండమీదికీ పచ్చని ప్రతి చెట్టు కిందికీ వెళ్ళి అక్కడ వ్యభిచారం చేస్తున్నది.

    7 ఆమె వాటన్నిటినీ చేసినా ఆమెను నా దగ్గరికి తిరిగి రమ్మన్నాను కానీ ఆమె రాలేదు. ద్రోహి అయిన ఆమె సోదరి అయిన యూదా దాన్ని చూసింది.

    8 ఇశ్రాయేలు వ్యభిచారం చేసినందుకే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు విడాకులిచ్చి పంపేశాను. విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా దాన్ని చూసి ఆమె కూడా భయం లేకుండా వ్యభిచారం చేస్తూ ఉంది.

    9 రాళ్ళతో, మొద్దులతో విగ్రహాలను చేసుకుని, ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రపరచింది.

    10 ఇంత జరిగినా విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా పైపైనే గాని తన పూర్ణహృదయంతో నా దగ్గరికి రావడం లేదు.

  7. 3 వ్యభిచారిణి పెదవుల నుండి తేనెలాంటి మాటలు వెలువడతాయి. దాని నోటి మాటలు నూనె కంటే మృదువుగా ఉంటాయి.

    4 చివరికి ఆమె వసనాభి కాయలాగా ఉంటుంది. రెండంచుల కత్తి వలే ఉంటుంది.

    5 దాని ప్రవర్తన మరణంలో పడిపోవడానికి దారితీస్తుంది. దాని మార్గం సూటిగా పాతాళానికి చేరుస్తుంది.

    6 జీవమార్గం గురించి వ్యభిచారిణి ఎంతమాత్రం ఆలోచించదు. ఆమె ఎటు వెళ్తుందో ఆమెకే తెలియక అటూ ఇటూ సంచరిస్తుంది.

    7 కుమారులారా, నేను చెప్పే బోధ ఆలకించండి. నేను చెప్పే ఉపదేశం నుండి పక్కకు మళ్ళుకోవద్దు.

    8 వ్యభిచారిణి నివసించే స్థలాల నుండి నీ అడుగులు దూరం చేసుకో. ఆమె యింటి వాకిలి వైపు పోవద్దు.

    9 నువ్వు గనుక వ్యభిచారిణి దగ్గరికి వెళ్లిన పక్షంలో నీ ప్రతిష్ట నవ్వుల పాలౌతుంది. నీ జీవిత కాలమంతా దుష్టుల చేతిల్లోకి వెళ్తుంది.

    10 అన్యులు నీ ఆస్తిని అనుభవిస్తారు. నీ కష్టార్జితమంతా పరుల ఇల్లు చేరుతుంది.

    11 చివరికి నీ కండరాలు, నీ శరీరం క్షీణించిపోతాయి.

    12 అప్పుడు నువ్వు, అయ్యో, ఉపదేశాన్ని నేనెందుకు లక్ష్యపెట్టలేదు? నా మనస్సాక్షి గద్దింపును ఎందుకు తిరస్కరించాను?

    13 నా బోధకులు చెప్పిన మంచి మాటలు వినలేకపోయాను. నా గురువుల ఉపదేశాలను పట్టించుకోలేదు.

    14 సమాజంలో నేను అన్ని రకాల కీడులకు దగ్గరగా వచ్చాను, అని నీకు నువ్వు చెప్పుకుంటూ మధనపడతావు.

    15 నీ ఇంటి బావిలో ఉబుకుతున్న నీళ్ళు, నీ సొంత కుండలోని నీళ్లు తాగు.

    16 నీ ఇంట ఉబికే నీటి ఊటలు బయటికి పారవచ్చా? అవి కాలువల్లాగా వీధుల్లో ప్రవహించవచ్చా?

    17 పరాయి వ్యక్తులు నీతోబాటు వాటిని అనుభవించకూడదు. ఆ నీరు నీ కోసమే ఉండాలి గదా.

    18 నీ జలాశయం దీవెనలు పొందుతుంది. నీ యవ్వన కాలంలో పెళ్ళాడిన నీ భార్యతో సంతోషించు.

    19 ఆమె నీకు రమణీయమైన లేడి వంటిది. అందమైన దుప్పిలాంటిది. ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడూ తృప్తి కలిగించనియ్యి. ఆమె ప్రేమకు బద్ధుడివై చిరకాలం జీవించు.

    20 కుమారా, నువ్వు ఎందుకు వ్యభిచారిణి వలలో పడిపోయి ఉంటావు? ఆమె రొమ్మును ఎందుకు కౌగలించుకుంటావు?

    21 మనుషుల ప్రవర్తన యెహోవాకు తెలుసు. వారి నడతలన్నిటినీ ఆయన గుర్తిస్తాడు.

    22 దుష్టుడు చేసే పనులు వాణ్ణి ఇరకాటంలో పడవేస్తాయి. వాడు తన పాప కార్యాల వల్ల శిక్షకు గురౌతాడు.

    23 అలాంటివాడు క్రమశిక్షణ లేకపోవడం వల్ల పరమ మూర్ఖుడై దారి తప్పి నాశనానికి గురౌతాడు.

  8. 10 వేరొకడి భార్యతో వ్యభిచరించిన వాడికి, అంటే తన పొరుగు వాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్న వాడికి-ఆ వ్యభిచారికి, వ్యభిచారిణికి మరణశిక్ష విధించాలి.

    11 తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం కోసం ఆమెతో పండుకున్న వాడు తన తండ్రి గౌరవాన్ని భంగపరిచాడు. వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. వారు తమ శిక్షకు తామే కారకులు.

    12 ఒకడు తన కోడలితో లైంగిక సంబంధం పెట్టుకుంటే వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. వారు వరసలు తప్పారు. వారు దోషులు. మరణ శిక్షకు పాత్రులు.

  9. 8 అప్పుడాయన, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీ భార్యలను విడిచిపెట్టవచ్చని మోషే చెప్పాడు గానీ, ప్రారంభం నుండీ అలా జరగలేదు. 9 భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను” అని వారితో అన్నాడు.

  10. 20 అయినా నీ మీద ఒక తప్పు ఎత్తి చూపాలి. అదేమిటంటే ‘నేను ప్రవక్తని’ అని చెప్పుకుంటున్న యెజెబెల్ అనే స్త్రీని నువ్వు సహిస్తున్నావు. ఆమె తన బోధతో నా సేవకులకు వ్యభిచారం చేయడం, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం నేర్పిస్తూ వారిని మోసం చేస్తూ ఉంది. 21 పశ్చాత్తాపపడడానికి నేను ఆమెకు సమయమిచ్చాను. కానీ ఆమె వ్యభిచారం విడిచి పశ్చాత్తాపపడడానికి ఇష్టపడలేదు. 22 ఇదిగో విను, నేను ఆమెను జబ్బుపడి మంచం పట్టేలా చేస్తాను. ఆమెతో వ్యభిచారం చేసిన వారు పశ్చాత్తాప పడాల్సిందే. లేకపోతే వారు తీవ్రమైన హింసలు పడేలా చేస్తాను. 23 ఆమె పిల్లలను కచ్చితంగా చంపుతాను. దాని వల్ల అంతరంగాలనూ హృదయాలనూ పరిశీలించేవాణ్ణి నేనే అని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. మీలో ప్రతి ఒక్కరికీ వారు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాను.

    24 అయితే తుయతైరలో మిగిలినవారు, అంటే ఈ బోధను అంగీకరించకుండా, సాతాను లోతైన విషయాలు అభ్యసించని వారితో ‘ఇక మరే భారమూ మీ మీద పెట్టను’ అని చెబుతున్నాను. 25 నా రాక వరకూ మీకు ఉన్నదాన్నే గట్టిగా పట్టుకోండి.

  11. 10 వారు నాకు, అంటే యెహోవాకు దూరమయ్యారు. నన్ను విడిచిపోయారు.

    కాబట్టి వారు భోజనం చేసినా తృప్తి పొందరు.

    వ్యభిచారం చేస్తారు గానీ అభివృద్ధి పొందలేరు.

    11 లైంగిక విచ్చలవిడితనం, ద్రాక్షామద్యం, కొత్త ద్రాక్షా రసం, వారి మతి పోగొట్టాయి.

    12 నా ప్రజలు తాము పెట్టుకున్న చెక్క బొమ్మల దగ్గర విచారణ చేస్తారు.

    వారి చేతికర్ర వారికి ప్రవచనాలు చెబుతున్నది.

    వ్యభిచార మనస్సు వారిని దారి తప్పించగా వారు నన్ను, అంటే వారి దేవుణ్ణి విసర్జించారు.

    13 వారు పర్వత శిఖరాల మీద బలులర్పిస్తారు.

    కొండలపై ధూపం వేస్తారు.

    సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద,

    మస్తకి వృక్షాల కింద నీడ మంచిదని అక్కడే ధూపం వేస్తారు.

    అందువలనే మీ కూతుర్లు వేశ్యలయ్యారు. మీ కోడళ్ళు కూడా వ్యభిచారిణులయ్యారు.

    14 మీ కుమార్తెలు చేసే లైంగిక దుర్మార్గతను బట్టి నేను వారిని శిక్షించను.

    మీ కోడళ్ళ వ్యభిచారాన్ని బట్టి నేను వారిని శిక్షించను.

    ఎందుకంటే ప్రజలు తామే వేశ్యల దగ్గరికి పోతారు.

    తామే ఆలయ వేశ్యలతో పోకిరీ పనులు చెయ్యడం కోసం బలులర్పిస్తారు.

    అవగాహన లేని జనం నిర్మూలమైపోతారు.

  12. 11 యేసు, “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే. 12 అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి” అని వారితో అన్నాడు.

  13. 3 అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. వారు ఆమెను వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు. ఆమెను అందరి మధ్య నిలబెట్టారు.

    4 వారు ఆయనతో, “బోధకా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. 5 ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు కదా! నువ్వేమంటావ్?” అని అడిగారు. 6 ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ ఇలా అడిగారు. అయితే యేసు విననట్టు తన వేలితో నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. 7 వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే ఉన్నారు. దాంతో ఆయన తల ఎత్తి చూసి, “మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు” అని వారితో చెప్పి 8 మళ్ళీ వంగి వేలితో నేల మీద రాస్తూ ఉన్నాడు.

    9 ఆయన పలికిన మాట విని పెద్దా చిన్నా అంతా ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్ళారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ స్త్రీ అలానే మధ్యలో నిలబడి ఉంది. 10 యేసు తలెత్తి ఆమెను చూశాడు. “నీమీద నిందారోపణ చేసిన వారంతా ఎక్కడమ్మా? నీకు ఎవరూ శిక్ష వేయలేదా?” అని అడిగాడు. 11 ఆమె, “లేదు ప్రభూ” అంది. దానికి యేసు, “నేను కూడా నీకు శిక్ష వేయను. వెళ్ళు, ఇంకెప్పుడూ పాపం చేయకు” అన్నాడు.

  14. 6 వారు చేసినట్టుగా మనం కూడా చెడ్డ సంగతులను ఆశించకుండా ఉండాలని ఈ సంగతులు ఉదాహరణలుగా మన కోసం రాసి ఉన్నాయి. 7 “ప్రజలు తినడానికీ తాగడానికీ కూర్చున్నారు, కామసంబంధమైన నాట్యాలకు లేచారు” అని రాసి ఉన్నట్టు వారిలాగా మీరు విగ్రహారాధకులు కావద్దు. 8 వారిలాగా లైంగిక దుర్నీతిలో మునిగిపోవద్దు. వారిలో కొందరు వ్యభిచారం జరిగించి ఒక్క రోజునే ఇరవై మూడు వేలమంది చనిపోయారు. 9 వారిలో చాలామంది ప్రభువును వ్యతిరేకించి పాము కాటుకు లోనై చనిపోయినట్టు మనమూ చేసి ప్రభువును పరీక్షించవద్దు. 10 అలాగే మీరు సణుక్కోవద్దు. వారిలో చాలామంది దేవునిపై సణిగి సంహార దూత చేతిలో నాశనమయ్యారు.

    11 నాశనమయ్యారు మనకు ఉదాహరణలుగా ఉండడానికే. వాటిని చూసి ఈ చివరి రోజుల్లో మనం బుద్ధి తెచ్చుకోడానికి అవి రాసి ఉన్నాయి. 12 కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో, అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి. 13 ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.

    14 కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపొండి.

  15. 14 దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు. మనలను కూడా తన శక్తితో లేపుతాడు.

    15 మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తు అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా జరగకూడదు. 16 వేశ్యతో కలిసేవాడు దానితో ఏక శరీరం అవుతాడని మీకు తెలియదా? “వారిద్దరూ ఒకే శరీరం అవుతారు” అని లేఖనాలు చెబుతున్నాయి కదా? 17 అదే విధంగా, ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకే ఆత్మగా ఉన్నాడు. 18 లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.

    19 మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. 20 దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.

  16. 22 ఎవడైనా మరొకడి భార్యతో శారీరకంగా కలుస్తూ పట్టుబడితే వారిద్దరినీ, అంటే ఆ స్త్రీతో శారీరకంగా కలిసిన పురుషుడినీ, స్త్రీనీ చంపాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని ఇశ్రాయేలులో నుంచి రూపుమాపుతారు. 23 కన్య అయిన స్త్రీ తనకు ప్రదానం జరిగిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శారీరకంగా కలిస్తే 24 ఆ ఊరి ద్వారం దగ్గరికి వారిద్దరినీ తీసుకువచ్చి, ఆ స్త్రీ ఊరిలోని ప్రజలను పిలవనందుకు ఆమెనూ, తన పొరుగువాడి భార్యను అవమాన పరచినందుకు ఆ వ్యక్తినీ రాళ్లతో చావగొట్టాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీలోనుంచి రూపుమాపాలి. 25 ప్రదానం జరిగిన కన్యను పొలంలో ఒకడు కలుసుకున్నప్పుడు అతడు ఆమెను బలవంతం చేసి, ఆమెతో శారీరకంగా కలిస్తే, ఆమెతో శారీరకంగా కలిసిన వాడు మాత్రమే చావాలి.

  17. 1 ఇప్పుడు మీరు నాకు రాసిన వాటి సంగతి. పురుషుడు తన భార్యను ముట్టుకోకుండా ఉండవలసిన సమయాలు కొన్ని ఉన్నాయి. 2 అయితే లైంగిక దుర్నీతి క్రియలు జరుగుతున్న కారణం చేత ప్రతి పురుషుడికీ తనకంటూ భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి.

    3 భర్త తన భార్య పట్లా, భార్య తన భర్త పట్లా వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి. 4 భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు. 5 ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి.

  18. 4 కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు. 5 ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా? 6 కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.

    7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.

  19. 9 నేను హృదయంలో పరస్త్రీని మోహించినట్టయితే, నా పొరుగువాడి వాకిట్లో అతని భార్య కోసం నేను పొంచి ఉన్నట్టయితే,

    10 నా భార్య వేరొకడి తిరుగలి విసరు గాక. ఇతరులు ఆమెను అనుభవిస్తారు గాక.

    11 అది భయంకరమైన నేరం. అది న్యాయాధిపతుల చేత శిక్షనొందదగిన నేరం.

    12 అది నాశనకూపం వరకూ దహించే అగ్నిహోత్రం. అది నా పంట కోత అంతటినీ నిర్మూలం చేస్తుంది.

  20. 9 నీవు యెహోవా మాటను ధిక్కరించి ఆయన దృష్టికి చెడ్డ పని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్యగా చేసుకోవడానికి కుట్ర పన్నావు. అమ్మోనీయుల చేత అతణ్ణి చంపించావు.

    10 నువ్వు నన్ను లక్ష్యపెట్టక హిత్తీయుడైన ఊరియా భార్యను నీ భార్యగా చేసుకొన్నావు కాబట్టి నీ ఇంటివారిపై కత్తి ఎల్లకాలం నిలిచి ఉంటుంది.

    11 నా మాట విను. యెహోవానైన నేను చెప్పేదేమిటంటే, నీ సంతానం మూలంగా నేను నీకు కీడు కలుగజేస్తాను. నువ్వు చూస్తుండగానే నేను నీ భార్యలను మరొకరికి అప్పగిస్తాను. 12 పగలు సమయంలోనే వారు నీ భార్యలతో శయనిస్తారు. నువ్వు నీ పాపం రహస్యంగా చేశావు గానీ ఇశ్రాయేలీయులంతా చూస్తుండగా పట్టపగలే నేను చెప్పినదంతా జరుగుతుంది” అని అన్నాడు.

    13 అందుకు దావీదు “నేను పాపం చేశాను” అని నాతానుతో అన్నాడు. అప్పుడు నాతాను “నీ పాపాన్ని బట్టి నువ్వు చనిపోయేలా యెహోవా నిన్ను శిక్షించక పోవచ్చు. 14-15 అయితే నువ్వు చేసిన ఈ పనివల్ల యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నువ్వు ఒక మంచి కారణం చూపించావు. కాబట్టి నీకు పుట్టబోయే పసికందు తప్పకుండా చనిపోతాడు” అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు.

  21. 17 నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది. 18 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? 19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి. 20 మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” అని వారితో చెప్పాడు.

  22. 1 ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజులు, యెహోయాషు కుమారుడైన ఇశ్రాయేలు రాజు యరొబాము పరిపాలించిన దినాల్లో బెయేరి కుమారుడు హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

    2 యెహోవా హోషేయతో మొదట మాట్లాడినప్పుడు ఇలా ఆజ్ఞాపించాడు.

    “వెళ్ళి ఒక వేశ్యను నీకు భార్యగా తెచ్చుకో.

    ఆమె వ్యభిచారం ఫలితంగా పుట్టిన సంతానాన్ని స్వీకరించు.

    ఎందుకంటే దేశం నన్ను విడిచిపెట్టి నీచమైన వ్యభిచార కార్యాలు చేసింది.”

    3 కాబట్టి హోషేయ వెళ్ళి దిబ్లయీము కూతురు గోమెరును పెళ్ళాడాడు.

    ఆమె గర్భం ధరించి అతనికొక కొడుకుని కన్నది.

  23. 18 “భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.

  24. 2 వివాహిత అయిన స్త్రీ, తన భర్త జీవించి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోతే వివాహ సంబంధమైన ధర్మశాస్త్ర నియమం నుండి ఆమె స్వేచ్ఛ పొందుతుంది. 3 కాబట్టి భర్త జీవించి ఉండగా ఆమె వేరే పురుషుణ్ణి కలిస్తే ఆమె వ్యభిచారి అవుతుంది గాని, భర్త చనిపోతే ఆమె ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛ పొందింది కాబట్టి వేరొక పురుషుణ్ణి పెళ్ళి చేసికొన్నప్పటికీ ఆమె వ్యభిచారిణి కాదు.

  25. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

  26. 3 మీరు పరిశుద్ధులు కావడం, జారత్వానికి దూరంగా ఉండడం దేవుని ఉద్దేశం.

    4 మీలో ప్రతివాడూ దేవుణ్ణి ఎరగని ఇతరుల్లాగా కామవికారంతో కాకుండా 5 పరిశుద్ధతలోనూ ఘనతలోనూ తన పాత్రను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండటమే దేవుని ఉద్దేశం. 6 ఈ విషయాన్ని ఎవరూ మీరకూడదు. తన సోదరుణ్ణి మోసం చేయకూడదు. ఎందుకంటే మేము ఇంతకు ముందు మీకు చెప్పి హెచ్చరించినట్టే ఈ విషయాల్లో ప్రభువు తప్పక ప్రతీకారం చేస్తాడు. 7 పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు.

  27. 18 వ్యభిచారం చేయకూడదు.

  28. 37 వాళ్ళు వ్యభిచారం చేశారు. వాళ్ళ చేతులకు రక్తం అంటింది. వాళ్ళు విగ్రహాలతో వ్యభిచారం చేశారు. నాకు కన్న కొడుకులను వాళ్ళ విగ్రహాలు మింగేలా వాటికి దహన బలి అర్పించారు.

  29. 18 ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. 19 అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు. 20 వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు.

  30. 7 నీ పిల్లలు నన్ను విడిచి, దేవుళ్ళు కాని వారి పేరున ప్రమాణం చేస్తారు.

    నేను వారిని సమృద్ధిగా పోషించాను కానీ వారు వ్యభిచారం చేస్తూ వేశ్యల ఇళ్ళలో సమావేశం అవుతారు. వారిని నేనెందుకు క్షమించాలి?

    8 బాగా బలిసిన గుర్రాల్లాగా వారిలో ప్రతి ఒక్కడూ ఇటూ అటూ తిరుగుతూ తన పొరుగువాని భార్యను చూసి సకిలిస్తాడు.

  31. 2 మీ అమ్మపై న్యాయవిచారణ మొదలుపెట్టు.

    వ్యాజ్యం వెయ్యి.

    ఆమె నా భార్యా కాదు, నేనామెకు భర్తనీ కాను.

    ఆమె మొదట తన వేశ్యా వృత్తిని మానుకోమనండి.

    తన స్తనాల మధ్య నుండి వ్యభిచారాన్ని తొలగించుకోమనండి.

    3 లేకపోతే ఆమెను నగ్న శరీరిగా చేస్తాను.

    ఆమె పుట్టిన దినాన ఎలా ఉన్నదో అలా బట్టలు లేకుండా చేసేస్తాను.

    ఆమెను అరణ్యంలాగా ఎండిన భూమిలాగా చేస్తాను.

    దాహంతో అలమటించి చనిపోయేలా చేస్తాను.

    4 ఆమె పిల్లల మీద జాలి చూపను. ఎందుకంటే దాని పిల్లలు వ్యభిచారం వల్ల పుట్టినవారు.

    5 వారి తల్లి కులట.

    వారిని కన్నతల్లి సిగ్గు లేకుండా ప్రవర్తించింది.

    ఆమె “నా విటుల వెంట పోతాను. వాళ్ళు నాకు అన్నపానాలు, ఉన్ని, జనపనార, నూనె, పానీయం ఇస్తారు” అనుకుంది.

    6 కాబట్టి దాని దారికి అడ్డంగా ముళ్ళ కంచె వేస్తాను.

    దానికి దారి కనబడకుండా గోడ కడతాను.

    7 అది తన విటులను వెంటాడినా వారిని కలుసుకోలేక పోతుంది.

    ఎంత వెతికినా వారు దానికి కనబడరు.

    అప్పుడు ఆమె అంటుంది. “నా మొదటి భర్త దగ్గరికి తిరిగి వెళ్తాను. ఎందుకంటే ఇప్పటి కంటే అదే బాగుంది.”

  32. 20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22 వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”

  33. 38 అప్పుడు ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యుల్లో కొందరు ఆయనకు జవాబిస్తూ, “బోధకుడా, నువ్వు ఒక సూచక క్రియ చేస్తే చూడాలని ఉంది” అన్నారు. ఆయన ఇలా అన్నాడు, 39 “వ్యభిచారులైన ఈ దుర్మార్గపు తరం వారు సూచక క్రియ అడుగుతున్నారు. యోనా ప్రవక్త గురించిన సూచక క్రియ తప్ప ఏ సూచక క్రియా వారికి ఇవ్వబడదు.

  34. 18 అతడు, “ఏ ఆజ్ఞలు?” అని ఆయనను అడిగాడు. యేసు, “నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు,

  35. 22 వెంటనే అతడు ఆమె వెంట వెళ్ళాడు. పశువు వధకై వెళ్లినట్టు, పరాయివాళ్ళ చేతికి చిక్కి చెరసాల పాలైనట్టు అతడు వెళ్ళాడు.

    23 పక్షి తనకు ప్రాణాపాయం ఉన్నదని తెలియక ఉచ్చులో పడినట్టు, అతని గుండెను చీల్చే బాణం దూసుకుపోయేంత వరకూ అతడు ఆమె వెంటబడి వెళ్ళాడు.

    24 నా కుమారులారా, నా మాటలు వినండి. నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి.

    25 నీ మనస్సు వ్యభిచారి నడిచే మార్గాల వైపు మళ్ళనియ్యకు. దారి తప్పి ఆమె నడిచే దారిలోకి పోకు.

    26 ఆమె అనేకులను లోబరచుకుని గాయపరచింది. లెక్కలేనంతమంది ఆమె బారిన పడి నాశనమయ్యారు.

    27 ఆమె ఇల్లు పాతాళానికి నడిపించే దారి. ఆ దారి మరణానికి నడిపిస్తుంది.

  36. 13 సమరయ ప్రవక్తల మధ్య నేరం చూశాను. వాళ్ళు బయలు దేవుడి పేర ప్రవచనం చెప్పి నా ఇశ్రాయేలు ప్రజలను దారి తప్పించారు.

    14 యెరూషలేము ప్రవక్తల మధ్య ఘోరమైన పనులు నేను చూశాను. వాళ్ళు వ్యభిచారులు. మోసంలో నడుస్తున్నారు. వాళ్ళు దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారు! ఎవడూ తన దుర్మార్గం విడిచిపెట్టడం లేదు. వాళ్ళంతా నా దృష్టికి సొదొమ ప్రజల్లాగా మారారు. యెరూషలేము నివాసులు గొమొర్రా ప్రజల్లాగా మారారు.

  37. 19 దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా! వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి” అన్నాడు.

  38. 10 ఇక పెళ్ళయిన వారికి నేను కాక, ప్రభువే ఇచ్చే ఆజ్ఞ ఏమంటే, భార్య భర్తకు వేరు కాకూడదు. 11 ఒకవేళ వేరైతే మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు. లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు.

  39. 10 ఎవరైనా ధర్మశాస్త్రం అంతా పాటించి, ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో అయినా తడబడితే, ఆజ్ఞలన్నిటినీ మీరిన అపరాధి అవుతాడు. 11 “వ్యభిచారం చెయ్యవద్దు” అని చెప్పిన దేవుడు, “హత్య చెయ్యవద్దు” అని కూడా చెప్పాడు. నువ్వు వ్యభిచారం చేయకుండా హత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే.

  40. 13 వారి చెడుతనానికి ప్రతిఫలంగా వారికి హాని కలుగుతుంది. వారు పట్టపగలు సుఖభోగాల్లో ఉంటారు. మచ్చలుగా, కళంకాలుగా ఉంటారు. వారు, మీతో కూడా విందుల్లో పాల్గొంటూనే తమ భోగాల్లో సుఖిస్తూ ఉంటారు. 14 వారి కళ్ళు వ్యభిచారపు చూపులతో నిండి ఉండి, ఎడతెగక పాపం చేస్తూ ఉంటారు. వారు, నిలకడ లేని వారిని తప్పుదారి పట్టడానికి ప్రేరేపిస్తారు. వారి హృదయాలు ఎప్పుడూ పేరాశతో సిద్ధంగా ఉంటాయి. వారు శాపానికి గురైన ప్రజలు.

    15 వారు, అవినీతి సంబంధమైన జీతం కోసం ఆశపడిన బెయోరు కుమారుడు బిలామును అనుసరించి తప్పిపోయారు. సక్రమ మార్గాన్ని వదిలిపెట్టారు.

  41. 20 నీ పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని ఆమె మూలంగా అపవిత్రం కాకూడదు.

  42. 14 వేశ్య నోరు లోతైన గొయ్యి. యెహోవా శాపాన్ని మూటగట్టుకున్నవాడు దానిలో పడతాడు.

  43. 22 అప్పుడు వీళ్ళ గురించి బబులోనులో ఉన్న వాళ్ళందరూ శాపవచనాలు పలుకుతారు. ‘బబులోను రాజు అగ్నిలో కాల్పించిన సిద్కియాలాగా, అహాబులాగా యెహోవా నిన్ను చేస్తాడు గాక,’ అని శాపం పెడతారు. 23 ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, వాళ్ళు ఇశ్రాయేలీయుల్లో దుర్మార్గం జరిగిస్తూ, తమ పొరుగువాళ్ళ భార్యలతో వ్యభిచారం చేస్తూ, నేను వాళ్లకు ప్రకటించని అబద్ధపు మాటలు నా పేరట ప్రకటించారు. నేనే ఈ సంగతి తెలుసుకున్నాను, నేనే దానికి సాక్షం,” ఇదే యెహోవా వాక్కు.

  44. 32 కులటా! నువ్వు నీ భర్తకు బదులుగా పరాయివాళ్ళను అంగీకరించావు!

  45. 1 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మాట ఆలకించండి.

    సత్యం, కనికరం, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం దేశంలో లేకపోవడం చూసి.

    యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుతున్నాడు.

    2 అబద్ధసాక్ష్యం పలకడం, అబద్ధమాడడం.

    హత్య, దొంగతనం, వ్యభిచారం అలవాటై పోయింది.

    ప్రజలు కన్నం వేస్తారు. మానక హత్య చేస్తారు.

  46. 13 మళ్ళీ రెండోసారి కూడా మీరు అలాగే చేస్తారు. అయితే ఆయన మీ నైవేద్యాన్ని స్వీకరించడు. మీరు అర్పించే అర్పణలు ఆయన లక్ష్యపెట్టడు. అప్పుడు యెహోవా బలిపీఠాన్ని ఏడ్పుతో, కన్నీళ్లతో, రోదనతో మీరు తడుపుతారు.

    14 ఇలా ఎందుకు జరుగుతుంది? అని మీరు అడుగుతారు. యవ్వన కాలంలో నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయంగా విడిచిపెట్టిన నీ భార్య పక్షంగా యెహోవా సాక్షిగా నిలబడతాడు. నీ భార్య నీ సహకారి కాదా, నీవు చేసిన నిబంధన ప్రకారం భార్య కాదా. 15 ఆయన మీ ఇద్దరినీ ఒక్కటిగా చేశాడు. శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా. అలా ఒకటిగా చేయడం దేనికి? దేవుని మూలంగా వారికి సంతతి కలగాలని. అందువల్ల మిమ్మల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోండి. యవ్వనంలో పెళ్లి చేసుకున్న మీ భార్యలకు ద్రోహం చేసి విశ్వాస ఘాతకులుగా మారకండి.

    16 ఒకడు తన భార్యను విడిచి పెట్టడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఒకడు తన బట్టలతో బాటు బలాత్కారంతో తనను కప్పుకోవడం నాకు అసహ్యమని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నాడు. కనుక మీ హృదయాలను కాపాడుకోండి. విశ్వాస ఘాతకులుగా ఉండకండి.

  47. 22 ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారుచేసి ఆదాము దగ్గరికి తీసుకువచ్చాడు.

    23 ఆదాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం.

    మనిషిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి” అన్నాడు.

    24 ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు.

  48. 7 ఆ తరువాత అతని యజమాని భార్య యోసేపును మోహించింది. “నాతో సుఖపడు” అని అతనిని అడిగింది. 8 అయితే అతడు తిరస్కరించి “నా యజమాని తనకు కలిగినదంతా నా వశంలో ఉంచాడు. నేను ఇక్కడ ఉండడం వలన ఇంట్లో ఏ విషయాన్నీ అతడు చూసుకోవడం లేదు. 9 ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నువ్వు అతని భార్యవు కాబట్టి నిన్ను మినహాయించి మిగతా అంతటినీ అతడు నా అధీనంలో ఉంచాడు. కాబట్టి నేనెలా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తాను?” అని తన యజమాని భార్యతో అన్నాడు.

    10 ప్రతిరోజూ ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉంది గానీ అతడు ఆమెతో ఉండడానికి గానీ పాపం చేయడానికి గానీ ఒప్పుకోలేదు. 11 అలా ఉండగా ఒక రోజు అతడు పని మీద ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళెవరూ అక్కడ లేరు. 12 అప్పుడామె అతని పై వస్త్రాన్ని పట్టుకుని “నాతో పండుకో” అని అడిగింది. అతడు తన బట్టను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు.

  49. 1 వసంత కాలంలో రాజులు యుద్ధాలకు బయలుదేరే కాలంలో, అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణాన్ని ఆక్రమించుకోడానికి దావీదు యోవాబునీ తన సేవకులనూ ఇశ్రాయేలు సైన్యమంతటినీ పంపించాడు. దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు.

    2 ఒకరోజు సాయంత్రం సమయంలో దావీదు పడక మీద నుండి లేచి రాజభవనం డాబా మీద నడుస్తున్నాడు. డాబాపై నుండి కిందికి చూస్తున్నప్పుడు స్నానం చేస్తూ ఉన్న ఒక స్త్రీ కనిపించింది. 3 ఆమె ఎంతో అందంగా ఉంది. ఆమె గురించి వివరాలు తెలుసుకు రమ్మని దావీదు ఒకణ్ణి పంపించాడు. అతడు వచ్చి “ఆమె పేరు బత్షెబ. హిత్తీయుడైన ఊరియా భార్య, ఏలీయాము కూతురు” అని చెప్పాడు. 4 దావీదు తన మనుషులను పంపి ఆమెను తన దగ్గరికి పిలిపించాడు. ఆమె అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆమెతో శయనించాడు. ఆమె తనకు కలిగిన మలినం పోగొట్టుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళింది.

    5 కొన్ని రోజులకు ఆమె గర్భం ధరించింది. “నేను గర్భవతి నయ్యాను” అని ఆమె దావీదుకు కబురు పంపింది.

  50. 15 వ్యభిచారి ఏ కన్నైనా తనను చూడదనుకుని తన ముఖానికి ముసుకు వేసుకుని సందె చీకటి కోసం కనిపెడతాడు.

    16 దుర్మార్గులు చీకట్లో కన్నం వేస్తారు. పగలు దాక్కుంటారు. వారు వెలుగును చూడరు.

    17 ఉదయం వారి దృష్టిలో దట్టమైన అంధకారం. గాఢాంధకార భయాలు వారికి ఏమీ ఇబ్బందిగా అనిపించవు.

    18 వారు జలాల మీద తేలికగా కొట్టుకు పోతారు. వారి స్వాస్థ్యం భూమి మీద శాపగ్రస్థం. ద్రాక్షతోటల దారిలో వారు ఇకపై నడవరు.

  51. 1 ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నాడు.

    అణగారిన వారికి శుభవార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు.

    గుండె పగిలిన వారిని బాగుచేయడానికి బందీలుగా ఉన్నవారికి విడుదల, ఖైదీలకు విముక్తి ప్రకటించడానికి,

    2 యెహోవా దయావత్సరాన్నీ మన దేవుని ప్రతిదండన దినాన్నీ ప్రకటించడానికి, దుఃఖించే వారందరినీ ఓదార్చడానికి ఆయన నన్ను పంపాడు.

    3 సీయోనులో దుఃఖించేవారిని చక్కపెట్టడానికి, బూడిదకు బదులు అందమైన తలపాగా, దుఃఖానికి బదులు ఆనందతైలం, కుంగిన మనసు బదులు స్తుతి వస్త్రం వారికివ్వడానికి ఆయన నన్ను పంపాడు.

    నీతి విషయంలో మస్తకి వృక్షాలనీ యెహోవా ఘనతకోసం నాటిన చెట్లు అనీ వారిని పిలుస్తారు.

  52. 9 మీరు వ్యభిచారం, దొంగతనం, నరహత్యలు, 10 అబద్ధ ప్రమాణాలు చేస్తూ, బయలు దేవుడికి ధూపం వేస్తూ మీకు తెలియని దేవుళ్ళను అనుసరిస్తున్నారు. అదే సమయంలో నా పేరు పెట్టిన ఈ మందిరంలోకి వచ్చి నా సన్నిధిలో నిలబడి “మేం తప్పించుకున్నాం” అంటున్నారు. మీరు విడుదల పొందింది ఈ అసహ్యమైన పనులు చేయడానికేనా?

  53. 27 నీ వ్యభిచారం, కామంతో కూడిన నీ సకిలింపులు నీ జార కార్యాలు నాకు తెలుసు.

    పొలాల్లోని ఉన్నత స్థలాల్లో నీవు చేసిన అసహ్యమైన కార్యాలు నాకు కనబడుతున్నాయి.

    యెరూషలేమా, నీకు శ్రమ. నిన్ను నువ్వు పవిత్ర పరచుకోవడం లేదు. ఇలా ఎంత కాలం కొనసాగుతుంది?

  54. 3 పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఆయనను పరీక్షించడం కోసం, “ఏ కారణం చేతనైనా సరే, పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం చట్టబద్ధమేనా?” అని అడిగారు.

    4 అందుకాయన, “సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడనీ, 5 ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏకశరీరంగా అవుతారు’ అని చెప్పాడనీ మీరు చదవలేదా? 6 కాబట్టి వారింక ఇద్దరు కాదు, ఏక శరీరమే. కాబట్టి దేవుడు జత పరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు” అని జవాబిచ్చాడు.

  55. 15 అయితే అవిశ్వాసి అయిన భాగస్వామి విడిచి వెళ్ళిపోతానంటే పోనివ్వండి. అప్పుడు సోదరుడైనా సోదరి ఐనా తన పెళ్ళినాటి ప్రమాణాలకు కట్టుబడనవసరం లేదు. శాంతిగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు.

  56. 17 ఇశ్రాయేలు కుమార్తెల్లో ఎవరూ వేశ్యలుగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో ఎవరూ పురుష సంపర్కులుగా ఉండకూడదు. 18 పురుష సంపర్కం వల్ల గానీ పడుపు సొమ్ము వల్ల గానీ వచ్చే ధనాన్ని మొక్కుబడిగా మీ దేవుడైన యెహోవా ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఆ రెండూ మీ దేవుడైన యెహోవాకు అసహ్యం.

  57. 18 నా బుద్ధికి మించినవి మూడు ఉన్నాయి. నేను గ్రహించలేనివి నాలుగు ఉన్నాయి.

    19 అవి, అంతరిక్షంలో గరుడ పక్షి జాడ, బండమీద పాము జాడ, నడిసముద్రంలో ఓడ వెళ్ళే జాడ, కన్యతో మగవాడి జాడ.

    20 వ్యభిచారిణి మార్గం కూడా అలాటిదే. ఆమె తిని నోరు తుడుచుకుని నాకేం తెలియదంటుంది.

  58. 1 నేను ఇశ్రాయేలును బాగు చేద్దామని కోరినప్పుడల్లా ఎఫ్రాయిము దోషం కనిపిస్తూ ఉంది.

    షోమ్రోను దుష్కార్యాలు బయటపడుతున్నాయి.

    వారు మోసం అభ్యాసం చేస్తారు.

    దొంగతనానికి చొరబడతారు.

    బంది పోటు దొంగల్లా వీధుల్లో దోచుకుంటారు.

    2 తమ క్రియలు వారి చుట్టూ ఉన్నప్పటికీ,

    అవి నా ఎదుటనే జరిగినప్పటికీ,

    వారి దుర్మార్గత నేను జ్ఞాపకం చేసుకోనని తమలో తాము అనుకుంటారు.

    3 వారి దుష్టత్వానికి, వారి అధికారుల అబద్ధాలకు వారి రాజు సంతోషిస్తాడు.

    4 వారంతా కాముకులే.

    రొట్టెలు కాల్చే వాడు ముద్ద పిసికిన తరువాత.

    ముద్దంతా పొంగే దాకా పొయ్యిని బాగా వేడిచేసి.

    ఊరుకున్నట్టు వారంతా కాముకులే.

  59. 5 తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అబద్దసాక్ష్యం పలికే వారి మీద నా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను.

    నేనంటే భయం లేకుండా కూలి ఇచ్చే విషయంలో కూలివాళ్ళను, విధవరాండ్రను, తండ్రిలేని వారిని బాధపెట్టిన వారి విషయంలో, పరాయి దేశస్థుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి విషయంలో నేను బలంగా సాక్ష్యం పలుకుతాను అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.

  60. 22 వ్యభిచారం చేయవద్దని చెప్పే నీవే వ్యభిచారం చేస్తావా? విగ్రహాలను అసహ్యించుకుంటూ నీవే గుడులను దోచుకుంటావా?

  61. 9 ఎందుకంటే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వేరొకరిది ఆశించవద్దు అనేవీ, మరింకే ఆజ్ఞ అయినా ఉంటే అదీ, “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి.

  62. 16 మహిళా, నీ భర్తను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? పురుషుడా, నీ భార్యను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు?

  63. 17 కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను. 18 ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు. 19 వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.

    20 అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు.

  64. 15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. 16 ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే. 17 ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.

  65. 8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.