18 Bible Verses About Divorce
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
1 యేసు ఈ మాటలు చెప్పిన తరువాత గలిలయ ప్రాంతాన్ని విడిచి యొర్దాను నది అవతల ఉన్న యూదయ ప్రాంతానికి వచ్చాడు. 2 గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. ఆయన వారిని అక్కడ బాగుచేశాడు.
3 పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఆయనను పరీక్షించడం కోసం, “ఏ కారణం చేతనైనా సరే, పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం చట్టబద్ధమేనా?” అని అడిగారు.
4 అందుకాయన, “సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడనీ, 5 ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏకశరీరంగా అవుతారు’ అని చెప్పాడనీ మీరు చదవలేదా? 6 కాబట్టి వారింక ఇద్దరు కాదు, ఏక శరీరమే. కాబట్టి దేవుడు జత పరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు” అని జవాబిచ్చాడు.
7 అందుకు వారు, “అలాటప్పుడు ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే ఆమెకు విడాకుల పత్రిక రాసివ్వాలని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని అడిగారు. 8 అప్పుడాయన, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీ భార్యలను విడిచిపెట్టవచ్చని మోషే చెప్పాడు గానీ, ప్రారంభం నుండీ అలా జరగలేదు. 9 భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను” అని వారితో అన్నాడు.
-
27 “‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా. 28 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు. 29 నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. 30 నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.
-
10 ఇక పెళ్ళయిన వారికి నేను కాక, ప్రభువే ఇచ్చే ఆజ్ఞ ఏమంటే, భార్య భర్తకు వేరు కాకూడదు. 11 ఒకవేళ వేరైతే మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు. లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు.
12 మిగిలిన వారితో ప్రభువు కాక, నేనే చెప్పేదేమంటే, ఒక సోదరునికి అవిశ్వాసి అయిన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. 13 అలాగే, ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి, అతడు ఆమెతో కాపురం చేయడానికి తన సమ్మతి తెలిపితే, ఆమె అతణ్ణి విడిచిపెట్టకూడదు. 14 అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన తన భార్యను బట్టి పవిత్రత పొందుతాడు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పవిత్రత పొందుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు. కాని ఇప్పుడు వారు పవిత్రులే.
15 అయితే అవిశ్వాసి అయిన భాగస్వామి విడిచి వెళ్ళిపోతానంటే పోనివ్వండి. అప్పుడు సోదరుడైనా సోదరి ఐనా తన పెళ్ళినాటి ప్రమాణాలకు కట్టుబడనవసరం లేదు. శాంతిగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు. 16 మహిళా, నీ భర్తను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? పురుషుడా, నీ భార్యను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు?
17 అయితే ప్రభువు ప్రతివాడికీ ఏ స్థితి నియమించాడో, ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలోనే నడుచుకోవాలి. ఇదే నియమం సంఘాలన్నిటిలో ఏర్పాటు చేస్తున్నాను.
-
11 యూదా ప్రజలు ద్రోహులుగా మారారు. ఇశ్రాయేలు ప్రజల మధ్య యెరూషలేములోనే నీచ కార్యాలు జరుగుతున్నాయి. యూదా ప్రజలు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేసి అన్యదేవత ఆరాధకుల పిల్లలను వివాహం చేసుకున్నారు.
12 ఈ విధంగా చేసిన వాళ్ళను యాకోబు సంతానానికి చెందిన గుడారాల్లో లేకుండా, సైన్యాలకు అధిపతియైన యెహోవాకు నైవేద్యాలు అర్పించే వారి సహవాసంలో లేకుండా యెహోవా నాశనం చేస్తాడు. 13 మళ్ళీ రెండోసారి కూడా మీరు అలాగే చేస్తారు. అయితే ఆయన మీ నైవేద్యాన్ని స్వీకరించడు. మీరు అర్పించే అర్పణలు ఆయన లక్ష్యపెట్టడు. అప్పుడు యెహోవా బలిపీఠాన్ని ఏడ్పుతో, కన్నీళ్లతో, రోదనతో మీరు తడుపుతారు.
14 ఇలా ఎందుకు జరుగుతుంది? అని మీరు అడుగుతారు. యవ్వన కాలంలో నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయంగా విడిచిపెట్టిన నీ భార్య పక్షంగా యెహోవా సాక్షిగా నిలబడతాడు. నీ భార్య నీ సహకారి కాదా, నీవు చేసిన నిబంధన ప్రకారం భార్య కాదా. 15 ఆయన మీ ఇద్దరినీ ఒక్కటిగా చేశాడు. శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా. అలా ఒకటిగా చేయడం దేనికి? దేవుని మూలంగా వారికి సంతతి కలగాలని. అందువల్ల మిమ్మల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోండి. యవ్వనంలో పెళ్లి చేసుకున్న మీ భార్యలకు ద్రోహం చేసి విశ్వాస ఘాతకులుగా మారకండి.
16 ఒకడు తన భార్యను విడిచి పెట్టడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఒకడు తన బట్టలతో బాటు బలాత్కారంతో తనను కప్పుకోవడం నాకు అసహ్యమని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నాడు. కనుక మీ హృదయాలను కాపాడుకోండి. విశ్వాస ఘాతకులుగా ఉండకండి.
-
2 కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించే ఉద్దేశంతో, “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ధర్మమేనా?” అని అడిగారు. 3 యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు. 4 వారు, “విడాకుల పత్రం రాసిచ్చి భార్యతో తెగతెంపులు చేసుకోవడానికి మోషే అనుమతి ఇచ్చాడు” అన్నారు.
5 యేసు, “మీరు దేవునికి లోబడని వారు, కాబట్టి మోషే ఆ విధంగా ఆదేశించాడు. 6 కాని, సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు. 7 అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి జీవిస్తాడు. 8 వారిద్దరు ఐక్యమై ఒకే శరీరంగా మారిపోతారు. కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాకుండా ఒకరిలా జీవిస్తారు. 9 కాబట్టి దేవుడు కలిపిన వారిని ఏ మనిషీ వేరు చేయకూడదు” అని వారితో చెప్పాడు.
10 అందరూ ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ సంగతి గురించి వివరంగా చెప్పమని కోరారు. 11 యేసు, “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే. 12 అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి” అని వారితో అన్నాడు.
-
18 “భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
-
21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు. 22 ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారుచేసి ఆదాము దగ్గరికి తీసుకువచ్చాడు.
23 ఆదాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం.
మనిషిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి” అన్నాడు.
24 ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు.
-
6 యోషీయా రాజు పాలన సమయంలో యెహోవా నాకిలా చెప్పాడు.
“ఇశ్రాయేలు ఎంత అపనమ్మకం చూపిందో చూశావా? ఆమె ఎత్తయిన ప్రతి కొండమీదికీ పచ్చని ప్రతి చెట్టు కిందికీ వెళ్ళి అక్కడ వ్యభిచారం చేస్తున్నది.
7 ఆమె వాటన్నిటినీ చేసినా ఆమెను నా దగ్గరికి తిరిగి రమ్మన్నాను కానీ ఆమె రాలేదు. ద్రోహి అయిన ఆమె సోదరి అయిన యూదా దాన్ని చూసింది.
8 ఇశ్రాయేలు వ్యభిచారం చేసినందుకే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు విడాకులిచ్చి పంపేశాను. విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా దాన్ని చూసి ఆమె కూడా భయం లేకుండా వ్యభిచారం చేస్తూ ఉంది.
-
18 అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ వ్యక్తిని పట్టుకుని శిక్షించి, 100 వెండి నాణాలు అపరాధ రుసుం అతడి దగ్గర తీసుకుని ఆ స్త్రీ తండ్రికి చెల్లించాలి.
19 ఎందుకంటే అతడు ఇశ్రాయేలు కన్యను అవమానపరిచాడు. ఇకపై ఆమె అతనికి భార్యగా ఉంటుంది. అతడు తాను జీవించే కాలమంతా ఆమెను విడిచి పెట్టకూడదు. 20 అయితే ఆ వ్యక్తి ఆరోపించిన నింద నిజమైనప్పుడు, అంటే ఆ కన్యలో కన్యాత్వం కనబడని పక్షంలో 21 పెద్దలు ఆమె తండ్రి ఇంటికి ఆమెను తీసుకురావాలి. అప్పుడు ఆమె ఊరి ప్రజలు ఆమెను రాళ్లతో కొట్టి చావగొట్టాలి. ఎందుకంటే ఆమె తన పుట్టింట్లో వ్యభిచరించి ఇశ్రాయేలులో చెడ్డ పని చేసింది. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీ మధ్యనుంచి మీరు రూపుమాపుతారు.
22 ఎవడైనా మరొకడి భార్యతో శారీరకంగా కలుస్తూ పట్టుబడితే వారిద్దరినీ, అంటే ఆ స్త్రీతో శారీరకంగా కలిసిన పురుషుడినీ, స్త్రీనీ చంపాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని ఇశ్రాయేలులో నుంచి రూపుమాపుతారు. 23 కన్య అయిన స్త్రీ తనకు ప్రదానం జరిగిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శారీరకంగా కలిస్తే 24 ఆ ఊరి ద్వారం దగ్గరికి వారిద్దరినీ తీసుకువచ్చి, ఆ స్త్రీ ఊరిలోని ప్రజలను పిలవనందుకు ఆమెనూ, తన పొరుగువాడి భార్యను అవమాన పరచినందుకు ఆ వ్యక్తినీ రాళ్లతో చావగొట్టాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీలోనుంచి రూపుమాపాలి.
-
1 సోదరులారా, ధర్మశాస్త్రం మనిషి జీవించి ఉన్నంత వరకే అధికారం చెలాయిస్తుందని మీకు తెలియదా? ధర్మశాస్త్రం తెలిసిన మీతో మాట్లాడుతున్నాను. 2 వివాహిత అయిన స్త్రీ, తన భర్త జీవించి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోతే వివాహ సంబంధమైన ధర్మశాస్త్ర నియమం నుండి ఆమె స్వేచ్ఛ పొందుతుంది. 3 కాబట్టి భర్త జీవించి ఉండగా ఆమె వేరే పురుషుణ్ణి కలిస్తే ఆమె వ్యభిచారి అవుతుంది గాని, భర్త చనిపోతే ఆమె ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛ పొందింది కాబట్టి వేరొక పురుషుణ్ణి పెళ్ళి చేసికొన్నప్పటికీ ఆమె వ్యభిచారిణి కాదు.
-
39 భార్య తన భర్త బతికి ఉన్నంత వరకూ అతనికి కట్టుబడి ఉండాలి. భర్త మరణిస్తే తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకోడానికి ఆమెకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఆమె విశ్వాసిని మాత్రమే చేసుకోవాలి.
-
18 యేసు క్రీస్తు పుట్టుక వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో ప్రదానం అయింది కానీ వారు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. 19 ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు.
20 అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, “దావీదు కుమారా, యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది.
-
26 దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27 దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.
28 దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు.
-
1 ఒక మనిషి తన భార్యను విడిచిపెట్టి ఆమెను పంపి వేస్తే ఆమె అతని దగ్గర నుండి వెళ్ళి ఇంకొకడికి భార్య అయ్యింది.
అప్పుడు అతడు ఆమెను తిరిగి చేర్చుకుంటాడా? అదే జరిగితే ఆ దేశం ఎంతో అపవిత్రమవుతుంది కదా.
నువ్వు అనేకమంది విటులతో వ్యభిచారం చేశావు. అయినా నా దగ్గరికి తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు.
-
10 వేరొకడి భార్యతో వ్యభిచరించిన వాడికి, అంటే తన పొరుగు వాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్న వాడికి-ఆ వ్యభిచారికి, వ్యభిచారిణికి మరణశిక్ష విధించాలి.
-
27 వివాహ వ్యవస్థలో భార్యకు కట్టుబడి ఉన్నావా? వేరు కావాలనుకోవద్దు. భార్య లేకుండా స్వేచ్ఛగా, లేక అవివాహితుడుగా ఉన్నావా? భార్య కావాలని కోరవద్దు. 28 ఒకవేళ నీవు పెళ్ళి చేసుకున్నా పాపమేమీ చేసినట్టు కాదు. అవివాహిత పెళ్ళి చేసుకున్నా ఆమె పాపమేమీ చేసినట్టు కాదు. అయితే అలాటి వారికి దైనందిన కష్టాలు కలుగుతాయి. అవి మీకు కలగకుండా ఉండాలని నా కోరిక.
-
14 వితంతువును గానీ విడాకులు తీసుకున్న స్త్రీని గానీ వేశ్యను గానీ అలాటి వారిని కాక తన ప్రజల్లోని కన్యనే పెళ్లాడాలి.
-
11 కాబట్టి ఇప్పుడు మీ తండ్రుల దేవుడైన యెహోవా ముందు మీ పాపాలను ఒప్పుకుని, ఆయనకు నచ్చే విధంగా ప్రవర్తించడానికి సిద్ధపడి, పరాయి దేశపు స్త్రీలను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని ఉండండి.”
Shows Read in context, Share and Copy.