35 Bible Verses About Suicide

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Suicide
  1. 13 హత్య చెయ్యకూడదు.

  2. 19 మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. 20 దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.

  3. 16 మీరు దేవుని ఆలయమనీ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనీ మీకు తెలియదా? 17 దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు అతణ్ణి పాడు చేస్తాడు. దేవుని ఆలయం పవిత్రమైనది. ఆ ఆలయం మీరే.

  4. 29 ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు.

  5. 26 దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27 దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.

  6. 5 మీకు ప్రాణం అయిన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను. దాని గురించి ప్రతి జంతువునీ ప్రతి మనిషినీ లెక్క అడుగుతాను. ప్రతి మనిషిని, అంటే తన సోదరుణ్ణి హత్యచేసిన ప్రతి మనిషినీ ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను. 6 దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి. 7 మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు భూమి మీద అధికంగా సంతానం కని విస్తరించండి” అని వాళ్ళతో చెప్పాడు.

  7. 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.

  8. ప్రధాన సంగీతకారుడి కోసం. దావీదు కీర్తన

    1 యెహోవా కోసం నేను సహనంతో వేచి ఉన్నాను. ఆయన నా మాటలు విన్నాడు. నా మొర ఆలకించాడు.

    2 భీకరమైన గుంటలో నుండి, జారుడు మట్టితో నిండి ఉన్న ఊబి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. నా పాదాలను రాయిపై నిలబెట్టాడు. నా అడుగులు స్థిరం చేశాడు.

    3 తనకు స్తుతులు చెల్లించే ఒక కొత్త పాటను మన దేవుడు నా నోట్లో ఉంచాడు. అనేకమంది దాన్ని చూసి ఆయన్ని కీర్తిస్తారు. యెహోవాలో నమ్మకముంచుతారు.

  9. 28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  10. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

  11. 25 మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు. 26 అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి.

    27 అంతలో చెరసాల అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూసి, ఖైదీలు పారిపోయారనుకుని, కత్తి దూసి, ఆత్మహత్య చేసుకోబోయాడు. 28 అయితే పౌలు, “నీవు ఏ హానీ చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం,” అన్నాడు.

    29 చెరసాల అధికారి దీపాలు తెమ్మని చెప్పి వేగంగా లోపలికి వచ్చి, వణుకుతూ పౌలు, సీలలకు సాష్టాంగ పడి, 30 వారిని బయటికి తెచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు. 31 అందుకు వారు, “ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు” అని చెప్పి 32 అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్కు బోధించారు. 33 రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసుకు వచ్చి, వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిసం పొందారు.

    34 అతడు పౌలు సీలలను తన ఇంటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవునిలో విశ్వాసముంచినందుకు తన ఇంటి వారందరితో కూడ ఆనందించాడు.

  12. 2 సౌలును అతని కొడుకులనూ తరిమి యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అనే సౌలు ముగ్గురు కొడుకులను చంపేశారు.

    3 యుద్ధంలో సౌలు ఓడిపోతున్నప్పుడు విలుకాళ్ళు గురి చూసి బాణాలతో అతణ్ణి కొట్టారు. అతడు భయపడి, 4 “సున్నతి లేని వీరు వచ్చి నన్ను చంపి ఎగతాళి చేయకుండా నీ కత్తితో నన్ను పొడువు” అని తన ఆయుధాలు మోసేవాడితో చెబితే, అతడు భయపడి అలా చేయడానికి వెనుకాడాడు. సౌలు తన కత్తి నిలబెట్టి దానిమీద బలంగా ఒరిగాడు. 5 సౌలు చనిపోయాడని అతని ఆయుధాలు మోసేవాడు కూడా తన కత్తి మీద పడి సౌలుతో పాటు చనిపోయాడు.

    6 ఈ విధంగా సౌలు, అతని ముగ్గురు కొడుకులు, సౌలు ఆయుధాలు మోసేవాడు, సౌలు మనుషులంతా ఒకే రోజున చనిపోయారు.

  13. యూదా నిర్వేదనం

    3 అప్పుడు ఆయనను వారికి పట్టించి ఇచ్చిన యూదా, వారు ఆయనకు శిక్ష విధించడం చూసి పశ్చాత్తాపపడి, ఆ ముప్ఫై వెండి నాణాలు ప్రధాన యాజకుల, పెద్దల దగ్గరికి తీసుకొచ్చి, 4 “నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను” అని చెప్పాడు. అందుకు వారు, “ఐతే మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో” అని చెప్పారు. 5 అప్పుడతడు ఆ వెండి నాణాలు దేవాలయంలో విసిరేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు.

  14. 28 అప్పుడు సంసోను “ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారికి నాకు బలం దయచెయ్యి. నా కళ్ళు ఊడబెరికిన వారిపై నన్ను పగ తీర్చుకోనీయి” అని యెహోవాకు మొర్ర పెట్టాడు. 29 ఆ ఆలయానికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాల్లో ఒక దాన్ని కుడిచేతితో మరోదాన్ని ఎడమచేతితో పట్టుకుని నిలబడ్డాడు. 30 “నేనూ, నాతో కూడా ఫిలిష్తీయులూ చనిపోతాం” అంటూ బలంగా ముందుకి వంగినప్పుడు ఆ ఆలయం కూలిపోయింది. దానిలో ఉన్న అధికారుల మీదా, ప్రజలందరి మీదా అదికూలింది. సంసోను తన జీవిత కాలంలో చంపిన వారి కంటే చనిపోయే సమయంలో హతమార్చిన సంఖ్యే ఎక్కువ.

  15. 23 అహీతోపెలు తాను చెప్పిన పథకం అమలు కాకపోవడం చూసి, గాడిదకు గంతలు కట్టి ఎక్కి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి, ఇంటి విషయాలు చక్కబెట్టి ఉరి వేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అతన్ని పాతిపెట్టారు.

  16. 17 ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు.

    18 విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు.

    19 ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటి పైనా అతనికి విజయం ఇస్తాడు.

    20 ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతాడు. వాటిలో ఒక్కటి కూడా విరిగి పోదు.

  17. 10 దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.

  18. 19 ఈరోజు జీవాన్నీ చావునూ ఆశీర్వాదాన్నీ శాపాన్నీ నేను మీ ఎదుట ఉంచుతున్నాను. భూమినీ, ఆకాశాన్నీ మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. 20 మీ పితరులు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించడానికి యెహోవాయే మీ ప్రాణానికీ మీ దీర్ఘాయుష్షుకూ మూలం. కాబట్టి మీరూ మీ సంతానం జీవిస్తూ మీ జీవానికి మూలమైన మీ యెహోవా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఉపదేశం విని ఆయనను హత్తుకుని ఉండేలా జీవాన్ని కోరుకోండి.”

  19. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

  20. 15 ఆ రోజుల్లో సుమారు నూట ఇరవై మంది శిష్యులు సమావేశమై ఉన్నపుడు పేతురు వారి మధ్య నిలబడి, 16 “సోదరులారా, యేసును పట్టుకున్నవారికి దారి చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉంది. 17 ఇతడు మనలో ఒకడుగా లెక్కలోకి వచ్చి ఈ పరిచర్యలో భాగం పొందాడు. 18 ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన డబ్బుతో ఒక పొలం కొన్నాడు. అతడు తలకిందులుగా పడి శరీరం బద్దలై పేగులన్నీ బయటికి వచ్చాయి. 19 ఈ విషయం యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలిసింది. కాబట్టి వారి భాషలో ఆ పొలాన్ని ‘అకెల్దమ’ అంటున్నారు. దాని అర్థం ‘రక్త భూమి.’

    ఇందుకు రుజువుగా,

    20 ‘అతని ఇల్లు పాడైపోవు గాక,

    దానిలో ఎవ్వడూ కాపురముండకపోవు గాక,

    అతని ఉద్యోగం వేరొకడు తీసికొనును గాక,’

    అని కీర్తనల గ్రంథంలో రాసి ఉంది.

  21. 4 అతడు ఒక రోజంతా ఎడారిలోకి ప్రయాణించి ఒక రేగు చెట్టు కింద కూర్చున్నాడు. చచ్చిపోదామని ఆశించాడు. “యెహోవా, ఇంతవరకూ చాలు, చనిపోయిన నా పూర్వీకుల కంటే నేనేమంత గొప్పవాణ్ణి కాదు. నా ప్రాణం తీసుకో” అని ప్రార్థన చేశాడు. 5 అతడు రేగు చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఉన్నట్టుండి ఒక దేవదూత వచ్చి అతన్ని తాకి “నీవు లేచి భోజనం చెయ్యి” అన్నాడు.

  22. 1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులందరూ పారిపోయారు. ఫిలిష్తీయులు వాళ్ళను గిల్బోవ పర్వతం మీద హతమార్చారు. 2 ఫిలిష్తీయులు సౌలునీ అతని కొడుకులనూ వెంటపడి తరిమారు. వాళ్ళు సౌలు కొడుకులు యోనాతానునీ, అబీనాదాబునీ, మల్కీషూవనీ చంపేశారు.

    3 సౌలుకి వ్యతిరేకంగా యుద్ధం తీవ్రమైంది. బాణాలు వేసే వాళ్ళు అతణ్ణి చూశారు. అతనిపై గురిపెట్టి బాణాలు వేసారు. సౌలుకు తీవ్ర గాయాలయ్యాడు.

    4 అప్పుడు సౌలు తన ఆయుధాలు మోసేవాడితో “నీ కత్తితో నన్ను పొడిచెయ్యి. లేకుంటే ఈ సున్నతి లేని వాళ్ళు వచ్చి నన్ను అవమానిస్తారు” అన్నాడు. వాడు అలా చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాడు చాలా భయపడ్డాడు. దాంతో సౌలు తన కత్తి నేలకు ఆనించి దాని మీద పడ్డాడు.

    5 సౌలు చనిపోయాడని ఆయుధాలు మోసేవాడికి అర్థం అయింది. దాంతో వాడు కూడా తన కత్తి పట్టుకుని దానిపైన పడ్డాడు. వాడూ చనిపోయాడు. 6 ఈ విధంగా సౌలూ, అతని ముగ్గురు కొడుకులతో పాటు అతని కుటుంబ సభ్యులందరూ చనిపోయారు.

  23. 10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను.

    నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి.

    దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను.

    నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.

  24. 14 నేను పుట్టిన రోజు శపితమౌతుంది గాక. నా తల్లి నన్ను కనిన రోజు శుభదినం అని ఎవరూ అనరుగాక.

    15 ‘నీకు బాబు పుట్టాడు’ అని నా తండ్రికి కబురు తెచ్చి అతనికి ఆనందం తెచ్చినవాడు శాపానికి గురి అవుతాడు గాక.

    16 ఏమీ జాలి లేక యెహోవా నాశనం చేసిన పట్టణంగా వాడు ఉంటాడు గాక! ఉదయాన ఆర్త ధ్వనినీ మధ్యాహ్నం యుద్ధ ధ్వనినీ అతడు వినుగాక!

    17 యెహోవా నన్ను గర్భంలోనే చంపలేదు. నా తల్లి నాకు సమాధిలాంటిదై ఎప్పటికీ నన్ను గర్భాన మోసేలా చేయలేదు.

    18 కష్టం, దుఖం, అనుభవిస్తూ నేను అవమానంతో నా రోజులు గడుపుతూ ఉన్నాను. ఇందుకేనా నేను గర్భంలోనుంచి బయటికి వచ్చింది?”

  25. 2 ఎంతకాలం నా మనస్సులో నేను ఆందోళన చెందాలి? ఎంతకాలం నా హృదయంలో పగలంతా నేను దుఃఖపడాలి? ఎంతకాలం నా శత్రువుకు నా మీద పైచెయ్యి అవుతుంది?

    3 యెహోవా నా దేవా, నాపై చూపు నిలిపి నాకు జవాబివ్వు. నా కళ్ళు వెలిగించు, లేకపోతే నేను నిద్రలోనే చనిపోతాను.

    4 నేను అతన్ని ఓడించాను, అని చెప్పే అవకాశం నా శత్రువుకు ఇవ్వకు. నా ప్రత్యర్ధి మీద నేను జయం పొందాను, అని నా శత్రువు అనకూడదు. అలా జరగకపోతే, నేను పడిపోయినప్పుడు నా శత్రువులు ఆనందిస్తారు.

  26. 1 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.

    2 క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది.

  27. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. 30 ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.

  28. 9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు.

  29. 22 నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.

  30. 8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  31. 6 ఆ రోజుల్లో మనుషులు చావుకోసం వెతుకుతారు కానీ అది వారికి దొరకదు. చావాలని కోరుకుంటారు గానీ మరణం వారి దగ్గరనుంచి పారిపోతుంది.

  32. 14 ఈ ప్రజలందరి భారం మోయడం నా ఒక్కడి వల్ల కాదు. వీళ్ళ భారం నా శక్తికి మించింది. 15 నువ్వు నాతో ఇలా వ్యవహరించదలిస్తే నన్ను ఇప్పుడే చంపెయ్యి. నా మీద నీకు దయ కలిగితే నన్ను చంపి నా బాధ తీసెయ్యి.”

    16 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలు 70 మందిని నాదగ్గరికి తీసుకురా. వారు ప్రజల్లో పెద్దలనీ అధిపతులనీ స్పష్టంగా గుర్తించి తీసుకురా. వారిని సన్నిధి గుడారం దగ్గరికి తీసుకుని రా. వారిని నీతో కూడా నిలబెట్టు. 17 అక్కడ నేను దిగి నీతో మాట్లాడతాను. తరువాత నీ మీద ఉన్న ఆత్మలో కొంత వారి పైన ఉంచుతాను. వారు నీతో కలసి ప్రజల భారాన్ని మోస్తారు. నువ్వు ఒంటరిగా ఈ భారం మోయాల్సిన అవసరం లేదు.

  33. 1 కాని, ఇది యోనా దృష్టిలో చాలా తప్పుగా అనిపించింది. అతడు కోపంతో మండిపడ్డాడు. 2 కాబట్టి యోనా యెహోవాను ఇలా ప్రార్ధించాడు. “నేను నా దేశంలో ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందని చెప్పాను గదా! అందుకే నేనే మొదట తర్షీషుకు పారిపోడానికి ప్రయత్నించాను. ఎందుకంటే, నువ్వు కృపగల దేవుడివనీ, జాలిగల వాడివనీ, త్వరగా కోపగించే వాడివి కాదనీ, పూర్తిగా నమ్మదగిన వాడివనీ, నశింపజేయడానికి వెనుకంజ వేసేవాడివనీ నాకు తెలుసు. 3 కాబట్టి, యెహోవా, ఇప్పుడు నా ప్రాణం తీసెయ్యమని బతిమాలుతున్నాను. ఎందుకంటే నేను బతకడం కంటే చావే మేలు.”

    4 అందుకు యెహోవా “నువ్వు అంతగా కోపించడం న్యాయమా?” అని అడిగాడు.

  34. 1 విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. 2 ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశించి, అందులో కొనసాగుతూ దేవుని మహిమ గురించిన నిశ్చయతలో ఆనందిస్తున్నాం. 3-4 అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.

  35. 1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు. 2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.

    3 అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు. 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.

    5 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు.