109 Bible Verses About Lies

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Lies
  1. 43 నా మాటలు మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా మాట వినే మీకు సహనం లేదు. 44 మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి.

    45 నేను చెబుతున్నది సత్యమే అయినా మీరు నన్ను నమ్మరు. 46 నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించ గలరు? నేను సత్యాన్నే చెబుతున్నా మీరెందుకు నమ్మడం లేదు? 47 ఒకడు దేవునికి చెందినవాడు అయితే దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు కాబట్టి మీరు ఆయన మాటలు వినరు.”

  2. 17 సత్యం కోసం నిలబడేవాడు నీతిగల మాటలు పలుకుతాడు. అబద్ద సాక్ష్యం పలికేవాడు కపటపు మాటలు పలుకుతాడు.

    18 కత్తిపోటులాంటి మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. జ్ఞానుల మాటలు ఆరోగ్యం కలిగిస్తాయి.

    19 నిజాలు పలికే పెదవులు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. అబద్ధాలు పలికే నాలుక ఉనికి క్షణకాలం.

    20 కీడు తలపెట్టేవాళ్ళ హృదయాల్లో మోసం ఉంటుంది. శాంతి కోసం సలహాలు ఇచ్చేవాళ్ళకు సంతోషం కలుగుతుంది.

    21 నీతిమంతులకు ఎలాంటి హానీ జరగదు. దుర్మార్గులను కష్టాలు వెంటాడుతుంటాయి.

    22 అబద్ధాలు పలికే పెదవులంటే యెహోవాకు అసహ్యం. నిజాయితీపరులను ఆయన ప్రేమిస్తాడు.

  3. 8 కానీ ఇప్పుడు మీరు తీవ్ర కోపం, ఆగ్రహం, దుర్మార్గపు ఉద్దేశాలు, నిందా వాక్కులు, మీ నోటి నుండి అవమానకరమైన మాటలు, బూతులు అన్నీ వదిలి పెట్టాలి. 9 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. 10 ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు.

  4. 17 కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను. 18 ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు. 19 వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.

    20 అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు. 21 యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు. 22 కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి 23 మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. 24 దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.

    25 మనం ఒకరికొకరం అవయవాల వంటి వారం. కాబట్టి మీరు అబద్ధాలు మానేసి మీ సాటిమనిషితో సత్యమే పలకాలి.

  5. 7 జయించేవాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు.

    8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.

  6. 16 యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు.

    17 అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు, 18 దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు, 19 లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.

    20 కుమారా, నీ తండ్రి బోధించే ఆజ్ఞలు పాటించు. నీ తల్లి చెప్పే ఉపదేశాన్ని నిర్ల్యక్షం చెయ్యకు.

  7. 16 నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు.

  8. 1 అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు. 2 భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.

    3 అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? 4 అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు.

    5 అననీయ ఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది విన్న వారందరికీ చాలా భయం వేసింది.

  9. 11 నేను మీ దేవుడైన యెహోవాను.

    మీరు దొంగతనం చేయకూడదు.

    అబద్ధం ఆడకూడదు.

    ఒకడినొకడు దగా చెయ్యకూడదు.

    12 నా నామం పేరిట అబద్ధంగా ఒట్టు పెట్టుకోకూడదు.

    నీ దేవుని పేరును అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.

  10. 13 ఆల్ఫా, ఓమెగా నేనే. మొదటి వాణ్ణి, చివరి వాణ్ణి నేనే. ప్రారంభాన్నీ ముగింపునీ నేనే.

    14 జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణ ద్వారాల నుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యులు అయ్యేందుకై తమ వస్త్రాలను ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు.

    15 పట్టణం బయట కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ ఉంటారు.

  11. 23 చెడు హృదయం ఉండి ప్రేమగా మాట్లాడే పెదాలు ఉండడం మట్టి పెంకుపై పూసిన వెండి పూతతో సమానం.

    24 పగవాడు పెదాలతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు.

    25 వాడు దయగా మాటలాడితే వాడి మాట నమ్మవద్దు. వాడి హృదయంలో ఏడు అసహ్యమైన విషయాలు ఉన్నాయి.

    26 వాడు తన ద్వేషాన్ని కపట వేషంతో కప్పుకుంటాడు. సమాజంలో వాడి చెడుతనం బట్టబయలు అవుతుంది.

    27 గుంట తవ్వే వాడే దానిలో పడతాడు. రాతిని పొర్లించే వాడి మీదికే అది తిరిగి వస్తుంది.

    28 అబద్ధాలాడే నాలుక తాను నలగగొట్టిన వాళ్ళను ద్వేషిస్తుంది. ముఖస్తుతి మాటలు పలికే నోరు నాశనం తెస్తుంది.

  12. 6 దేశంలో నమ్మకంగా ఉండే వాళ్ళు నా చుట్టూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సన్మార్గంలో నడుచుకునే వాళ్ళు మాత్రమే నాకు సేవకులుగా ఉంటారు.

    7 మోసంతో బతికేవాడు నా ఇంట్లో ఉండకూడదు. అబద్ధాలు పలికేవాడు నా కళ్ళ ఎదుట నిలబడకూడదు.

    8 ప్రతిరోజూ ఉదయాన్నే దేశంలో దుర్మార్గులందరినీ నేను సంహరిస్తాను. యెహోవా పట్టణంలో పాపం చేసేవాళ్ళు లేకుండా చేస్తాను.

  13. 1 దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు. 2 స్త్రీ ఆ సర్పంతో “ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు. 3 కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది.

    4 పాము స్త్రీతో “మీరు చావనే చావరు. 5 ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు” అన్నాడు. 6 స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.

    7 అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు.

  14. 4 నువ్వు దుష్టత్వాన్ని సమర్ధించే దేవుడివి కాదు. చెడుతనం చేసే వాళ్ళు నీ అతిథులుగా ఉండరు.

    5 దురహంకారులు నీ సన్నిధిలో నిలబడరు. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లను నువ్వు ద్వేషిస్తావు.

    6 అబద్ధమాడే వాళ్ళను నువ్వు నాశనం చేస్తావు. హింసించేవాళ్ళను, మోసగాళ్ళను యెహోవా ద్వేషిస్తాడు.

  15. 9 అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు నాశనమౌతాడు.

  16. 8 అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తగిన విధంగా ఉపయోగిస్తే అది మేలైనదే అని మనకు తెలుసు.

    9 దేవుడు నాకు అప్పగించిన ఈ గొప్ప సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ఉన్నది నీతిమంతుల కోసం కాదు. ధర్మ విరోధులూ తిరుగుబాటు చేసేవారూ భక్తిహీనులూ పాపులూ దుర్మార్గులూ భక్తిహీనులూ చెడిపోయిన వారూ తల్లిదండ్రులను చంపేవారూ హంతకులూ 10 వ్యభిచారులూ స్వలింగ సంపర్కులూ బానిస వ్యాపారులూ అబద్ధికులూ అబద్ధ సాక్ష్యం చెప్పేవారూ నిజమైన బోధకు వ్యతిరేకంగా నడచుకొనేవారూ ఇలాటివారి కోసమే ధర్మశాస్త్రం ఉంది అని మనకు తెలుసు.

    11 ఈ మహిమగల సువార్తను మహిమగల దివ్య ప్రభువు నాకు అప్పగించాడు.

  17. 1 పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు. 2 ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది.

  18. 27 పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసినవారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్నవారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.

  19. 5 నీతిమంతులకు అబద్దాలంటే అసహ్యం. దుష్టుడు నిందలు మోపుతూ, అవమానపరుస్తూ ఉంటాడు.

  20. 19 అప్పుడు మీకాయా ఇలా అన్నాడు. “యెహోవా చెప్పే మాట ఇప్పుడు వినండి, యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. పరలోక సమూహమంతా ఆయన కుడి వైపు, ఎడమ వైపు, నిలబడి ఉన్నారు. 20 ‘అహాబు రామోత్గిలాదు మీదికి వెళ్లి అక్కడ ఓడిపోయేలా అతన్ని ఎవడు ప్రేరేపిస్తాడు’ అని యెహోవా అడిగాడు. ఒకడు ఒక రకంగా ఇంకొకడు ఇంకొక రకంగా చెబుతున్నారు.

    21 అప్పుడు ఒక ఆత్మ ముందుకు వచ్చి యెహోవా ఎదుట నిలబడి ‘నేనతన్ని ప్రేరేపిస్తాను’ అన్నాడు. యెహోవా, ‘ఎలా’ అని అతన్ని అడిగాడు. 22 అందుకతడు ‘నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మగా ఉంటాను’ అని చెప్పాడు. ఆయన, ‘నీవు అతన్ని ప్రేరేపిస్తావు, నీ ప్రయత్నం సఫలమవుతుంది. వెళ్లి అలా చెయ్యి’ అన్నాడు. 23 చూడండి, నీకు చెడు జరుగుతుందని యెహోవా నిర్ణయించి ఈ నీ ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మను ఉంచాడు.”

  21. 1 నా తల జలమయంగా నా కళ్ళు కన్నీటి ఊటగా ఉండు గాక.

    ఎందుకంటే హతమైన నా ప్రజలను గూర్చి నేను రాత్రింబగళ్ళూ విలపించాలని కోరుతున్నాను.

    2 నా ప్రజలంతా వ్యభిచారులు, ద్రోహుల గుంపులాగా ఉన్నారు.

    నేను వారిని విడిచిపెట్టి వెళ్లి ఉండడానికి అరణ్యంలో ఒక బాటసారుల నివాసం నాకు దొరికితే బాగుండును.

    3 విల్లును వంచినట్టుగా వారు తమ నాలుకను అబద్ధమాడడానికి వంచుతారు. ఈ భూమిపై వారు నమ్మదగిన వారు కాదు. వారు ఒకటి తరవాత మరొకటి చెడుకార్యాలు జరిగిస్తున్నారు. “నేను ఎవరో వారు ఎరుగరు” అని యెహోవా చెబుతున్నాడు.

    4 మీలో ప్రతివాడూ తన పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    ఏ సోదరుణ్నీ నమ్మవద్దు. ఎందుకంటే నిజంగా ప్రతి సోదరుడూ మోసం చేసేవాడే.

    ప్రతి పొరుగువాడూ అపనిందలు వేస్తూ తిరుగుతుంటాడు.

    5 ప్రతివాడూ సత్యం చెప్పకుండా తన పొరుగువాడిని మోసం చేస్తాడు. అక్రమం జరిగించడం వారికి అలవాటై పోయింది. ఎంతసేపూ ఎదుటి వారిలో తప్పులు పట్టాలని చూస్తారు.

    6 కపటం మధ్యలో నువ్వు నివసిస్తున్నావు. వారి కపటంలో వారు నన్ను తెలుసుకోలేక పోతున్నారు. ఇదే యెహోవా వాక్కు.

  22. 5 నమ్మకమైన సాక్షి అబద్ధం పలకడు. కపట సాక్షికి అబద్ధాలు చెప్పడమే ఇష్టం.

  23. 6 యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు.

  24. 10 జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి. 11 అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి. 12 ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది.

  25. 3 దుర్మార్గులు పుట్టుకతోనే విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన వెంటనే అబద్ధాలాడుతూ తప్పిపోతారు.

  26. 4 చెడు నడవడిక గలవాడు చెప్పుడు మాటలు వింటాడు. హానికరమైన మాటలు పలుకుతుంటే అబద్ధికుడు శ్రద్ధగా వింటాడు.

  27. 1 యెహోవా హస్తం రక్షించలేనంత కురుచగా అయిపోలేదు. ఆయన చెవులు వినలేనంత నీరసం కాలేదు.

    మీ అపరాధాలు మీకూ మీ దేవునికీ అడ్డంగా వచ్చాయి.

    2 మీ పాపాలు ఆయన ముఖం మీకు కనబడకుండా చేశాయి. అందుచేత ఆయన వినడం లేదు.

    3 మీ చేతులు రక్తంతో మీ వేళ్లు అపరాధాలతో మరకలయ్యాయి.

    మీ పెదవులు అబద్ధాలాడుతున్నాయి. మీ నాలుక ద్వేషంతో మాటలాడుతున్నది.

    4 ఎవడూ న్యాయంగా దావా వేయడం లేదు. ఎవడూ నిజాయితీతో తన వాదన వినిపించడం లేదు.

    వాళ్ళు వట్టి మాటలను నమ్ముకుని అబద్ధాలు చెబుతారు. చెడును గర్భం ధరించి పాపాన్ని కంటారు.

  28. 4 “నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు. 5 కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు.

    6 ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి.

  29. 31 కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, “మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు. 32 సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అన్నాడు.

  30. 12 జీవితాన్ని కాంక్షించేవాడు, ఎక్కువ కాలం జీవించాలని ఆశించే వాడు, చక్కని జీవితం కావాలి అనుకునేవాడు ఏం చేయాలి?

    13 దుర్మార్గమైన మాటలు పలకకుండా ఉండు. అబద్ధాలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో.

  31. 163 అబద్ధం నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.

  32. 18 అబద్ధికుడు తన మనసులో పగ ఉంచుకుంటాడు. మూర్ఖులు నిందలు ప్రచారం చేస్తారు.

    19 వ్యర్థంగా మాట్లాడే మాటల్లో తప్పు దొర్లుతుంది. మితంగా మాట్లాడేవాడు బుద్ధిమంతుడు.

  33. 5 అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు తప్పించుకోలేడు.

  34. 8 అప్పుడు ఆ అక్రమ పురుషుడు బయటపడతాడు. ప్రభు యేసు తన నోటి శ్వాస చేత వాణ్ణి సంహరిస్తాడు. తన ఆగమన తేజస్సుతో నాశనం చేస్తాడు. 9 సాతాను సమస్త శక్తీ, వాడి కపట సూచక క్రియల, అద్భుతాల ద్వారా అక్రమ పురుషుడు బయట పడతాడు. నశిస్తున్న వారి మధ్య నీతి రాహిత్యమైన అన్ని మోసాలతో వాడు తనను వెల్లడి చేసుకుంటాడు.

    10 ఎందుకంటే వారు రక్షణ పొందేలా సత్యాన్ని ప్రేమించలేదు, అంగీకరించలేదు. 11 ఈ కారణం చేత సత్యాన్ని నమ్మకుండా అక్రమంలోనే సంతోషించే వారిని శిక్షించడానికి 12 అబద్ధాన్ని నమ్మేలా భ్రమింపజేసే దాన్ని దేవుడు వారి మధ్యకు పంపిస్తున్నాడు.

  35. 7 అతి వాగుడు బుద్ధిలేనివాడికి తగదు. అంతకన్నా ముఖ్యంగా అబద్ధమాడడం అధిపతికి పనికిరాదు.

  36. 6 అబద్ధాలాడి ధనం సంపాదించుకోవడం మరణ సమయంలో కొన ఊపిరితో సమానం.

  37. ప్రధాన సంగీతకారుని కోసం, తీగవాయిద్యాలతో. దావీదు కీర్తన.

    1 నా నీతిన్యాయాలకు ఆధారమైన దేవా, నేను విజ్ఞప్తి చేసినప్పుడు నాకు జవాబివ్వు. ఇరుకులో ఉన్నప్పుడు నాకు విశాలత ఇవ్వు. నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించు.

    2 మనుషులారా, ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? ఎంతకాలం పనికిరాని వాటిని ప్రేమించి అబద్ధాల వెంటబడతారు? సెలా.

    3 యెహోవా తన భక్తులను తన కోసం ఏర్పరచుకుంటాడని తెలుసుకోండి. నేను యెహోవాకు విజ్ఞప్తి చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడు.

    4 భయంతో గడగడ వణకండి, కానీ పాపం చెయ్యకండి. మీరు పడక మీద ఉన్నప్పుడు మీ హృదయాల్లో ధ్యానం చేసుకుని నింపాదిగా ఉండండి. సెలా.

  38. 2 నీ నాలుక నాశనాన్ని ఆలోచిస్తుంది. అది పదునైన కత్తిలా వంచన చేస్తూ ఉంది.

    3 నువ్వు మంచి కంటే దుర్మార్గాన్ని ఎక్కువ ప్రేమిస్తావు. న్యాయం మాట్లాడటం కంటే అబద్దం మాట్లాడటం నీకిష్టం.

    4 కపటమైన నాలుకా! ఇతరులను మింగేసే మాటలను నువ్వు ప్రేమిస్తావు.

    5 కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు. ఆయన నిన్ను నీ గుడారంలో నుండి పెరికి వేస్తాడు. సజీవులుండే ప్రాంతం నుండి నిన్ను పెల్లగిస్తాడు.

  39. 1 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మాట ఆలకించండి.

    సత్యం, కనికరం, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం దేశంలో లేకపోవడం చూసి.

    యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుతున్నాడు.

    2 అబద్ధసాక్ష్యం పలకడం, అబద్ధమాడడం.

    హత్య, దొంగతనం, వ్యభిచారం అలవాటై పోయింది.

    ప్రజలు కన్నం వేస్తారు. మానక హత్య చేస్తారు.

  40. 16 మీరు చేయవలసిన వేమిటంటే ప్రతివాడూ తన పొరుగు వాడితో సత్యమే మాటలాడాలి.

    సత్యాన్ని బట్టి శాంతికరమైన న్యాయాన్నిబట్టి మీ గుమ్మాల్లో తీర్పు తీర్చాలి.

    17 తన పొరుగువాని మీద ఎవరూ చెడు ఆలోచనలు పెట్టుకోకూడదు.

    అబద్ధ ప్రమాణం చేయడానికి ఇష్టపడకూడదు.

    ఇలాటివన్నీ నాకు అసహ్యం.” ఇదే యెహోవా వాక్కు.

  41. 17 వాగ్దానానికి వారసులైన వారికి తన సంకల్పం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు ఒట్టు పెట్టుకోవడం ద్వారా తన వాగ్దానానికి హామీ ఇచ్చాడు.

    18 అందువల్ల వేటి విషయం దేవుడు అబద్ధం ఆడలేడో, మార్పు లేని ఆ రెండింటి ద్వారా ఆశ్రయం కోరి పరుగు తీసే మన ఎదుట ఉన్న ఆశాభావాన్ని మనం బలంగా పట్టుకోడానికి గట్టి ప్రోత్సాహం ఉండాలని అలా చేశాడు.

  42. 9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు.

  43. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

    18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు. 19 ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. 20 దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు.

    21 అయితే సత్యాన్ని అనుసరించే వాడు తన పనులు మరింత స్పష్టంగా కనిపించడానికీ దేవుని పట్ల విధేయతలో అవి జరిగాయని వెల్లడి చేయడానికీ వెలుగు దగ్గరికి వస్తాడు.”

  44. 3 ఎన్నాళ్లు మీరంతా ఒక్క మనిషిపై దాడి చేస్తారు? ఒకడు ఒరిగిపోయే గోడను, పడిపోతున్న కంచెను కూలదోసినట్టు నీవు ఎంతకాలం ఒక్కణ్ణి కూలదోయాలని చూస్తారు?

    4 గౌరవప్రదమైన స్థానం నుండి అతణ్ణి పడదోయడానికే వారు అతనితో ఆలోచిస్తారు. అబద్ధాలు చెప్పడం వారికి సంతోషం. వారు తమ నోటితో దీవెనలు పలుకుతూ వారి హృదయాల్లో మాత్రం అతన్ని శపిస్తారు.

  45. 29 మోసపు మార్గం నా నుండి దూరం చెయ్యి. దయచేసి నాకు నీ ఉపదేశం వినిపించు.

    30 విశ్వసనీయత మార్గం ఎంచుకున్నాను. నీ న్యాయవిధులను నేను ఎప్పుడూ నా ఎదుట పెట్టుకుని ఉన్నాను.

  46. 8 వ్యర్థమైన వాటిని ఆబద్ధాలను నాకు దూరం చెయ్యి. పేదరికాన్నిగానీ ఐశ్వర్యాన్ని గానీ నాకు ఇవ్వొద్దు. చాలినంత అన్నం మాత్రం పెట్టు.

    9 ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి “యెహోవా ఎవరు?” అంటానేమో. లేదా పేదరికం వల్ల దొంగతనం చేసి నా దేవుని నామాన్ని తెగనాడతానేమో.

  47. 13 ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారు పాపం చేయరు.

    అబద్ధమాడరు. కపటాలు పలికే నాలుక వారి నోట ఉండదు.

    వారు ఎవరి భయం లేకుండ విశ్రాంతిగా అన్నపానాలు పుచ్చుకుంటారు.”

  48. 20 మీ సాటి మనిషికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు.

  49. 22 గేహాజీ “అంతా క్షేమమే. నా యజమాని నన్ను పంపించాడు. ‘ఎఫ్రాయిము పర్వత ప్రాంతం లోని ప్రవక్తల సమాజం నుండి ఇద్దరు యువకులు ఇప్పుడే నా దగ్గరికి వచ్చారు. మీరు దయచేసి వారి కోసం ముప్ఫై నాలుగు కిలోల వెండీ, రెండు జతల బట్టలూ ఇవ్వండి’ అని చెప్పమన్నాడు” అన్నాడు.

    23 అందుకు నయమాను “నీకు డెబ్భై కిలోలు సంతోషంగా ఇస్తాను” అన్నాడు. నయమాను గేహాజీని బలవంతపెట్టి రెండు బస్తాల్లో డెబ్భై కిలోల వెండి ఉంచి, రెండు జతల బట్టలూ ఇచ్చి వాటిని మోయడానికి తన దగ్గర ఉన్న ఇద్దరు పనివాళ్ళను పంపాడు. వారు వాటిని మోసుకుని గేహాజీ ముందు నడిచారు. 24 వారు పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు గేహాజీ ఆ వెండి బస్తాలను తీసుకుని ఇంట్లో దాచిపెట్టి వాళ్ళను పంపించి వేశాడు. వారు వెళ్ళిపోయారు. 25 తరువాత అతడు లోపలికి వెళ్ళి తన యజమాని ఎలీషా ఎదుట నిలబడ్డాడు. ఎలీషా అతణ్ణి “గేహజీ, నీవు ఎక్కడినుండి వస్తున్నావ్?” అని అడిగాడు. దానికి గేహాజీ “నీ సేవకుణ్ణి. నేను ఎక్కడికీ వెళ్ళలేదు” అన్నాడు.

    26 అప్పుడు ఎలీషా గేహజీతో “ఆ వ్యక్తి నిన్ను కలుసుకోడానికి తన రథాన్ని ఆపినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదనుకున్నావా? డబ్బూ, మంచి బట్టలూ, ఒలీవ తోటలూ, ద్రాక్ష తోటలూ, గొర్రెలూ, పశువులూ, సేవకులూ, సేవకురాళ్ళూ వీటిని సంపాదించుకోడానికి ఇదా సమయం? 27 అందుచేత నయమానుకి ఉన్న కుష్ఠు నీకూ, నీ వారసులకూ నిత్యం ఉంటుంది” అన్నాడు. కాబట్టి గేహాజీకి మంచులా తెల్లని కుష్టురోగం వచ్చింది. అతడు ఎలీషా దగ్గరనుండి వెళ్ళి పోయాడు.

  50. దావీదు కీర్తన.

    1 యెహోవా, నీ మందిరంలో ఉండదగినవాడు ఎవరు? నీ పవిత్ర పర్వతం మీద నివసించ గలవాడు ఎవరు?

    2 అతడు యథార్థమైన ప్రవర్తన కలిగి, న్యాయమైనది చేస్తూ, హృదయంలోనుంచి సత్యం పలుకుతాడు.

    3 అతడు నాలుకతో కొండేలు చెప్పడు. ఇతరులకు హాని చెయ్యడు, తన పొరుగు వాణ్ణి కించపరచడు.

  51. 22 మనిషి హృదయం కోరేది నిబద్ధతే. అబద్ధికుడికంటే దరిద్రుడే మేలు.

    23 యెహోవాకు చెందవలసిన భయభక్తులు ఆయనకి చెల్లించాలి. అది జీవ సాధనం. అది ఉన్న వాడు తృప్తిగా బ్రతుకుతాడు.

  52. 22 యేసే క్రీస్తు అని అంగీకరించని వాడు గాక మరి అబద్ధికుడు ఎవరు? తండ్రిని, కుమారుణ్ణి నిరాకరించేవాడే క్రీస్తు విరోధి. 23 కుమారుణ్ణి నిరాకరించిన ప్రతివాడికీ తండ్రి లేనట్టే. కుమారుణ్ణి ఒప్పుకున్న వాడికి తండ్రి ఉన్నట్టే.

  53. 11 అతడు ఐగుప్తులో ప్రవేశించడానికి ముందు తన భార్య శారయితో “చూడు, నువ్వు చాలా అందగత్తెవని నాకు తెలుసు, 12 ఐగుప్తీయులు నిన్ను చూసి, ‘ఈమె అతని భార్య’ అని నీ మూలంగా నన్ను చంపుతారు. కాని నిన్ను బ్రతకనిస్తారు. 13 నీ వల్ల నాకు మేలు కలిగేలా, నీ కారణంగా నేను చావకుండేలా నువ్వు నా సోదరివి అని దయచేసి చెప్పు” అన్నాడు.

    14 అబ్రాము ఐగుప్తులో ప్రవేశించినప్పుడు ఐగుప్తీయులు శారయి చాలా అందంగా ఉండడం గమనించారు. 15 ఫరో అధిపతులు ఆమెను చూసి ఫరో దగ్గర ఆమె అందాన్ని పొగిడారు. ఆమెను ఫరో ఇంటికి తీసుకెళ్ళారు.

  54. 15 ఐగుప్తు రాజు హీబ్రూ మంత్రసానులతో మాట్లాడాడు. వారి పేర్లు షిఫ్రా, పూయా. 16 “మీరు హెబ్రీ స్త్రీలకు పురుడు పోస్తున్నప్పుడు జాగ్రత్తగా కనిపెట్టి చూడండి. మగ పిల్లవాడు పుడితే ఆ బిడ్డను చంపివేయండి, ఆడ పిల్ల అయితే బతకనియ్యండి” అన్నాడు. 17 అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయలేదు. మగపిల్లలను చంపకుండా బతకనిచ్చారు. 18 ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి “మీరు ఇలా ఎందుకు చేశారు? మగపిల్లలను చంపకుండా ఎందుకు బతకనిచ్చారు?” అని అడిగాడు.

    19 అప్పుడు ఆ మంత్రసానులు “హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలలాంటి వాళ్ళు కాదు. తెలివైనవాళ్ళు. మంత్రసాని వాళ్ళ దగ్గరికి వెళ్లకముందే ప్రసవిస్తున్నారు” అని ఫరోతో చెప్పారు. 20 మంత్రసానులు దేవునికి భయపడినందువల్ల దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో వారి సంతానం విస్తరించింది. 21 ఆయన వారి వంశాన్ని వృద్ధి చేశాడు.

  55. 19 అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు.

    మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు.

    ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా?

    ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?

  56. 9 హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు?

    10 నేను యెహోవాను. హృదయాన్ని పరిశోధిస్తాను. మనసును పరీక్షిస్తాను. ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తన ప్రకారం వారి పనులకు తగ్గట్టుగా నేనిస్తాను.

  57. 14 యెరూషలేము ప్రవక్తల మధ్య ఘోరమైన పనులు నేను చూశాను. వాళ్ళు వ్యభిచారులు. మోసంలో నడుస్తున్నారు. వాళ్ళు దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారు! ఎవడూ తన దుర్మార్గం విడిచిపెట్టడం లేదు. వాళ్ళంతా నా దృష్టికి సొదొమ ప్రజల్లాగా మారారు. యెరూషలేము నివాసులు గొమొర్రా ప్రజల్లాగా మారారు.

  58. 4 యెహోవాను నమ్ముకోకుండా అబద్దాలను నమ్మేవాళ్ళనూ అహంకారులనూ పట్టించుకోకుండా యెహోవానే తన ఆధారంగా చేసుకున్న వాడు ధన్యజీవి.

  59. 2 యెహోవా, అబద్ధాలు పలికే పెదాల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను కాపాడు.

  60. 32 “మోసపు కలలను పలికే వాళ్లకు నేను విరోధిని. వాళ్ళు అబద్ధాలు చెబుతూ మోసంతో గొప్పలు చెప్పుకుంటూ నా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.” ఇది యెహోవా వాక్కు. “నేను వాళ్ళను పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వాళ్ళ వలన ఈ ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు.” ఇదే యెహోవా వాక్కు.

  61. 18 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? 19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి. 20 మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” అని వారితో చెప్పాడు.

  62. 14 కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి.

  63. 9 అప్పుడు యెహోవా కయీనుతో “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అన్నాడు. అతడు “నాకు తెలియదు. నేను నా తమ్ముడికి కాపలా వాడినా?” అన్నాడు.

  64. 18 అతడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్నగారూ, అని పిలిచాడు. ఇస్సాకు “కొడుకా ఏమిటి? నువ్వు ఎవరివి?” అని అడిగాడు. 19 దానికి యాకోబు “నేను ఏశావుని. నీ పెద్ద కొడుకుని. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. లేచి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అన్నాడు.

  65. 25 నిజాలు పలికే సాక్షి మనుషులను కాపాడతాడు. అబద్ధాలు చెప్పేవాడు కేవలం మోసగాడు.

  66. 1 నరహత్య చేసిన పట్టణమా, నీకు బాధ తప్పదు. అది నిరంతరం అబద్ధాలతో దొంగిలించి తెచ్చిన వస్తువులతో నిండి ఉంది. దాని చేతుల్లో హతమైన వారు దానిలో ఉన్నారు.

  67. 3 కొందరు యూదులు నమ్మదగని వాళ్ళు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా? 4 కానేకాదు. “నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా కనిపించడానికి, నీపై విచారణ జరిగినప్పుడు గెలవడానికి” అని రాసి ఉన్న ప్రకారం మనుషులంతా అబద్ధికులైనా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడే.

  68. 12 శారా “నా బలమంతా పోయింది. ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా” అనుకుని తనలో తాను నవ్వుకుంది.

    13 అప్పుడు యెహోవా అబ్రాహాముతో “శారా ‘ముసలిదాన్ని అయిన నేను నిజంగా బిడ్డను కనగలనా’ అనుకుని ఎందుకు నవ్వింది? 14 యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. 15 అప్పుడు శారా భయపడి “నేను నవ్వలేదండీ” అంది. దానికి ఆయన “అలా అనకు, నువ్వు నవ్వావు” అని జవాబిచ్చాడు.

  69. 6 కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు. 7 అక్కడి మనుషులు అతని భార్యను చూసి ఆమె సంగతి ఇస్సాకును అడిగారు. దానికతడు “ఆమె నా చెల్లి” అని చెప్పాడు. ఆమె తన భార్య అని చెప్పడానికి భయపడ్డాడు. ఎందుకంటే రిబ్కా అందకత్తె కాబట్టి అక్కడి మనుషులు ఆమె కోసం తనని చంపుతారేమో అనుకున్నాడు. 8 అతడు చాలా రోజులు అక్కడ గడిపాడు. తరువాత ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి చూస్తుంటే సరిగ్గా అదే సమయంలో ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరస సల్లాపాలు ఆడటం అతనికి కనిపించింది.

    9 అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి “చూడు, ఆమె కచ్చితంగా నీ భార్యే, ఆమె నా చెల్లి అని ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. దానికి ఇస్సాకు “ఆమెను పొందటం కోసం ఎవరైనా నన్ను చంపుతారేమోనని అనుకున్నాను” అన్నాడు. 10 అందుకు అబీమెలెకు “నువ్వు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ ప్రజల్లో ఎవడైనా భయం లేకుండా తేలిగ్గా ఆమెతో శారీరిక సంబంధం పెట్టుకునే వాడే కదా! మాకు ఆ పాతకం చుట్టుకునేదే కదా!” అన్నాడు. 11 కాబట్టి అబీమెలెకు తన ప్రజలందరికీ “ఈ వ్యక్తిని గానీ ఇతని భార్యను గానీ ముట్టుకునే వాడు కచ్చితంగా మరణశిక్ష పొందుతాడు” అంటూ ఒక హెచ్చరిక జారీ చేశాడు.

  70. 12 రాజు గనక అబద్ధాలు నమ్ముతూ ఉంటే అతని ఉద్యోగులు దుష్టులుగా ఉంటారు.

  71. 33 “‘నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా. 34 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే ఎంతమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని సింహాసనం. 35 భూమి తోడు అనవద్దు. అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు. అది మహారాజు నగరం. 36 నీ తల తోడని ప్రమాణం చేయవద్దు. నీవు ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు. 37 మీ మాట ‘అవునంటే అవును, కాదంటే కాదు’ అన్నట్టే ఉండాలి. అలా కాని ప్రతిదీ అపవాది సంబంధమైనదే.

  72. 17 సత్యం ద్వారా వారిని పవిత్రం చెయ్యి. నీ వాక్యమే సత్యం.

  73. 2 నువ్వు చేస్తున్న పనులూ, నువ్వు పడుతున్న కష్టమూ, నీ ఓర్పూ నాకు తెలుసు. నువ్వు దుర్మార్గులను సహించలేవనీ, అపొస్తలులు కాకుండానే, మేము అపొస్తలులం అని చెప్పుకుంటూ తిరిగే వారిని పరీక్షించి వారు మోసగాళ్ళని పసిగట్టావనీ నాకు తెలుసు.

  74. 1 పుకార్లు పుట్టించకూడదు. అన్యాయ సాక్ష్యం చెప్పడానికి దుష్టులతో చేతులు కలప కూడదు. 2 దుష్టకార్యాలు జరిగించే గుంపులతో కలిసి ఉండ కూడదు. న్యాయాన్ని తారుమారు చేసే గుంపుతో చేరి న్యాయం విషయంలో అబద్ద సాక్ష్యం చెప్ప కూడదు.

  75. 6 ఇదిగో, నువ్వు నా హృదయంలో నమ్మదగ్గవాడుగా ఉండాలని నువ్వు కోరుతున్నావు. నా హృదయంలో జ్ఞానాన్ని తెలుసుకునేలా చేస్తావు.

  76. 23 దేవా, నువ్వు దుష్టులను నాశనకూపంలో పడవేస్తావు. ఇతరులతో పోలిస్తే రక్తాపరాధులు, వంచకులు సగం కంటే ఎక్కువకాలం బతకరు. నేనైతే నీలోనే నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాను.

  77. 28 అకారణంగా నీ పొరుగువాడిపై సాక్ష్యం పలక వద్దు. నీ పెదాలతో మోసపు మాటలు పలకొచ్చా?

  78. 6 మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు.

  79. 21 మీకు సత్యం తెలియదు అనే ఉద్దేశంతో నేను మీకు రాయలేదు. సత్యం మీకు తెలుసు. సత్యం నుండి ఏ అబద్ధమూ రాదు కాబట్టి మీకు రాస్తున్నాను.

  80. 31 వారు ఒక మేకపిల్లను చంపి, యోసేపు అంగీని దాని రక్తంలో తడిపారు. 32 వారు దాన్ని తమ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి “ఇది మాకు దొరికింది. ఇది నీ కొడుకు అంగీనో కాదో చూడు” అన్నారు. 33 అతడు దాన్ని గుర్తుపట్టి “ఈ అంగీ నా కొడుకుదే, ఏదో ఒక క్రూర జంతువు వాణ్ణి చంపి తినేసింది. తప్పనిసరిగా అది యోసేపును చీల్చేసి ఉంటుంది” అన్నాడు.

    34 యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుముకు గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కొడుకు కోసం దుఃఖించాడు. 35 అతని కొడుకులు, కూతుర్లు అందరూ అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నం చేశారు గానీ అతడు ఓదార్పు పొందలేదు. “నేను ఏడుస్తూ చనిపోయిన వారుండే స్థలానికి నా కొడుకు దగ్గరికి వెళ్తాను” అని అతడు యోసేపు కోసం ఏడ్చాడు.

  81. 2 నా న్యాయాన్ని తీసివేసిన దేవుని జీవం తోడు. నా ప్రాణాన్ని వ్యాకుల పరచిన సర్వశక్తుని తోడు.

    3 నా ప్రాణం నాలో ఉన్నంత కాలం, దేవుని ఊపిరి నా నాసికా రంధ్రాల్లో ఉన్నంత వరకు,

    4 నిశ్చయంగా నా పెదవులు అబద్ధం పలకవు. నా నాలుక మోసం ఉచ్ఛరించదు.

    5 మీరు చెప్పినది న్యాయమని నేనెంత మాత్రం ఒప్పుకోను. మరణమయ్యే దాకా నేనెంత మాత్రం యథార్థతను వదిలి పెట్టను.

  82. 3 యెహోవా పర్వతం ఎక్కే అర్హత ఎవరికుంది? ఆయన పవిత్ర స్థలంలో ఎవరు ప్రవేశించగలరు?

    4 అసత్యంపై మనసు పెట్టకుండా, మోసపూరితంగా ఒట్టు పెట్టుకోకుండా, నిర్దోషమైన చేతులూ, శుద్ధమైన హృదయం కలిగినవాడే.

    5 అతడు యెహోవా వల్ల ఆశీర్వాదం పొందుతాడు, తన రక్షకుడైన దేవుని వల్ల నిర్దోషత్వం పొందుతాడు.

  83. 11 నేను తొందరపడి ఏ మనిషీ నమ్మదగినవాడు కాదు, అనుకున్నాను.

  84. 5 దేవుని మాటలన్నీ పవిత్రమైనవే. ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన డాలు.

    6 ఆయన మాటలతో ఏమీ చేర్చవద్దు. ఆయన నిన్ను గద్దిస్తాడేమో. అప్పుడు నీవు అబద్ధికుడివౌతావు.

  85. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

    24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.

  86. 12 అయితే ప్రస్తుతం నేను చేసేది తరువాత కూడా చేస్తాను. ఎందుకంటే, కొందరు ఏఏ విషయాల్లో గర్వంగా చెప్పుకొంటారో ఆ విషయాల్లో తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు. అలా గర్వంతో చెప్పే అవకాశమేమీ వారికి లేకుండా చేయాలని కోరుతున్నాను.

    13 అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు. 14 ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటాడు. 15 అందుచేత, వాడి సేవకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. వారి పనులనుబట్టే వారి అంతముంటుంది.

  87. 18 తన పొరుగువాడిపై అబద్ధ సాక్ష్యం పలికేవాడు యుద్ధంలో వాడే గదలాంటి వాడు, కత్తిలాంటి వాడు. వాడియైన బాణం వంటివాడు.

  88. 28 దాని ప్రవక్తలు దొంగ దర్శనాలు చూస్తూ, యెహోవా ఏమీ చెప్పనప్పటికీ, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని చెప్తూ, అసత్య అంచనాలు ప్రకటిస్తూ, మట్టి గోడకు సున్నం వేసినట్టు తమ పనులు కప్పిపుచ్చుతూ ఉన్నారు.

  89. 55 మీకు ఆయన ఎవరో తెలియదు. నాకు ఆయన తెలుసు. ఆయన ఎవరో నాకు తెలియదు అని నేను చెబితే మీలాగా నేనూ అబద్ధికుడిని అవుతాను. కానీ నాకు ఆయన తెలుసు. ఆయన మాటను నేను పాటిస్తాను.

  90. 10 చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. 11 మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.

    12 ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.

    13 అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. 14 మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం, 15 పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. 16 వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి.

  91. 9 ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వాడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వాణ్ణీ వాడితో పాటు వాడి అనుచర దూతలనూ భూమి మీదికి తోసి వేశారు.

  92. 24 “నువ్వు నిజంగా నా కొడుకు ఏశావువేనా?” అని అడిగాడు. యాకోబు “అవును నేనే” అన్నాడు.

  93. 1 యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు. 2 “ఒక వ్యక్తి తన పొరుగున ఉన్నవాడు తనకు అప్పగించిన దాని విషయంలో అతణ్ణి మోసం చేసినా, వంచించినా, దోచుకున్నా, లేక తన పొరుగున ఉన్నవాణ్ణి పీడించినా 3 అతడు పోగొట్టుకున్న వస్తువు తనకు దొరికినా దాని విషయం అబద్ధం చెప్పినా, ఒట్టు పెట్టి మరీ అబద్ధం చెప్పినా, ఇంకా ఇలాంటి విషయాల్లో పాపం చేస్తే అది యెహోవాకి వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించి చేసిన పాపం అవుతుంది. 4 ఇలా పాపం చేసినవాడు అపరాధి. కాబట్టి అలాంటివాడు తను ఇతరుల దగ్గర దోచుకున్నదీ, పీడించి సంపాదించిందీ, లేక తనకు అప్పగించినదీ, తనకు దొరికినదీ తిరిగి ఇచ్చివేయాలి.

    5 తాను దేని గురించైతే అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని పూర్తిగా చెల్లించాలి. ఇంకా అది ఎవరికి చెందుతుందో వారికి దానిలో ఐదో వంతు తప్పక చెల్లించాలి. దాన్ని అపరాధ బలి అర్పించే రోజున చెల్లించాలి.

  94. 1 నూను కుమారుడు యెహోషువ ఇద్దరు గూఢచారులను పిలిచి “మీరు వెళ్ళి ఆ దేశాన్ని, మరి ముఖ్యంగా యెరికో పట్టణం చూడండి” అని వారితో చెప్పి, షిత్తీము నుండి వారిని రహస్యంగా పంపాడు. వారు వెళ్లి రాహాబు అనే ఒక వేశ్య ఇంటికి వెళ్ళి అక్కడ బస చేశారు.

    2 దేశాన్ని వేగుచూడటానికి ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ఎవరో రాత్రివేళ ఇక్కడికి వచ్చారని యెరికో రాజుకు సమాచారం వచ్చింది. 3 అతడు తన మనుషులను పంపి “నీ దగ్గరికి వచ్చి నీ ఇంట్లో ప్రవేశించిన ఆ మనుషులను బయటికి తీసుకురా, వారు ఈ దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు” అని రాహాబుకు కబురు పంపాడు.

    4 ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తీసుకెళ్ళి దాచిపెట్టి, ఆ వచ్చిన వారితో “మనుషులు నా దగ్గరికి వచ్చిన మాట నిజమే, 5 వాళ్ళెక్కడ నుండి వచ్చారో నాకు తెలీదు, చీకటి పడేటప్పుడు కోట తలుపులు మూసే వేళ వాళ్ళు బయటికి వెళ్లిపోయారు, వాళ్ళెక్కడికి వెళ్ళారో నాకు తెలీదు, మీరు వాళ్ళను తొందరగా తరిమితే పట్టుకుంటారు” అని చెప్పింది. 6 అంతకుముందు ఆమె ఆ ఇద్దరినీ తన మిద్దె మీదికి ఎక్కించి దాని మీద రాశివేసి ఉన్న జనపకట్టల్లో వాళ్ళని దాచి పెట్టింది.

  95. 2 అందరూ తమ పొరుగు వాళ్ళతో అబద్ధాలు చెబుతున్నారు. అందరూ మోసకరమైన పెదాలతో ద్వంద్వ హృదయంతో మాట్లాడుతున్నారు.

    3 యెహోవా, మోసపు మాటలు పలికే పెదాలనూ, గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకనూ కోసివెయ్యి.

    4 మా నాలుకలతో మేము సాధిస్తాం, మా పెదాలతో మేము మాట్లాడినప్పుడు మా మీద ప్రభువుగా ఎవరు ఉండగలరు? అని అంటున్నది వీళ్ళే.

    5 పేదలకు విరోధంగా జరుగుతున్న హింస కారణంగా, అవసరతలో ఉన్నవాళ్ళ మూలుగుల కారణంగా నేను లేచి వస్తాను, అని యెహోవా అంటున్నాడు. వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ రక్షణ నేను వాళ్లకు అందిస్తాను.

    6 యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి కొలిమిలో ఏడు సార్లు నిర్మలం చేసిన వెండి అంత పరిశుద్ధం.

  96. 18 అబద్ధాలాడే పెదాలు మూతబడి పోనీ. వారు గర్వంతో నీతిమంతులను చిన్నచూపు చూస్తూ వారిపై కఠినంగా మాట్లాడతారు.

  97. 12 వారి పెదాల మాటలను బట్టి, వారి నోటి పాపాన్ని బట్టి, వారు పలికిన శాపాలను బట్టి, అబద్ధాలను బట్టి వారు తమ గర్వంలో చిక్కుకునేలా చెయ్యి.

  98. 14 కాబట్టి యెహోవా ఇశ్రాయేలులో నుంచి తల, తోక, తాటి మట్ట, రెల్లు అన్నిటినీ ఒకే రోజు నరికేస్తాడు.

    15 పెద్దలూ, ఘనులూ తల. అసత్యాలు ఉపదేశించే ప్రవక్తలు తోక.

    16 ఈ ప్రజలను నడిపించే వాళ్ళు ప్రజలను దారి తప్పిస్తున్నారు. వాళ్ళ వెంట నడుస్తున్న వాళ్ళు నాశనమౌతారు.

  99. 6 ‘యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని చెప్పే వాళ్ళు అబద్ధపు దర్శనాలు చూసి అబద్ధపు జోస్యాలు చెప్తారు. యెహోవా వాళ్ళని పంపలేదు. అయినా తమ సందేశం జరుగుతుంది అని ప్రజలు ఆశ పడేలా చేస్తారు. 7 నేను అసలేమీ మాట్లాడకుండానే ‘యెహోవా చెప్పేది ఇదీ, అదీ’ అంటూ చెప్పే మీరు అబద్ధపు దర్శనాలు చూడలేదా? అబద్ధపు జోస్యాలు చెప్పలేదా?

    8 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు అబద్ధపు దర్శనాలు చూసి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ప్రభువైన యెహోవా మీకు విరోధంగా చేస్తున్న ప్రకటన ఇదే, 9 అబద్ధపు దర్శనాలు చూస్తూ జోస్యం చెప్తున్న ప్రవక్తలకి నేను వ్యతిరేకిని. నా ప్రజల సభలోకి వాళ్ళని రానివ్వను. ఇశ్రాయేలు ప్రజల్లో వాళ్ళను నమోదు చేయను. వాళ్ళు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికి వీల్లేదు. అలా జరిగినప్పుడు నేనే యెహోవాను, అని మీరు తెలుసుకుంటారు.

  100. 69 పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరికి వచ్చి, “నీవు గలిలయ వాడైన యేసుతో ఉన్నావు కదా?” అని అడిగింది. 70 అందుకు అతడు, “నీవు చెప్పే సంగతి నాకు తెలియదు” అని అందరి ముందూ అన్నాడు.

    71 అతడు నడవలోకి వెళ్ళినపుడు మరొక పని పిల్ల అతణ్ణి చూసి, “ఇతడు కూడా నజరేతు వాడైన యేసుతో కలిసి ఉండేవాడు” అని అక్కడున్న వారితో చెప్పింది. 72 పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టు పెట్టుకుంటూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు.

    73 కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరికి వచ్చి, “నిజమే, నువ్వు కూడా వారిలో ఒకడివే. నీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది” అన్నారు. 74 దానితో పేతురు, “ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను” అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది.

  101. 9 అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతికి పాలుపడే వారూ, విగ్రహాలను పూజించేవారూ, మగ వేశ్యలు, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులూ, విపరీత సంపర్కం జరిపే వారూ, 10 దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    11 గతంలో మీలో కొంతమంది అలాటివారే. అయితే ప్రభు యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మ మిమ్మల్ని కడగడం ద్వారా పవిత్రులై దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు.

  102. 26 తాను భక్తిపరుణ్ణి అనుకుంటూ తన నాలుకను అదుపులో పెట్టుకోనివాడు తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటాడు. అతని భక్తి వ్యర్థం.

  103. 13 వాడు అనేక చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు. మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి అద్భుతాలు చేస్తున్నాడు. 14 తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమిపై అందర్నీ మోసం చేస్తూ ఉన్నాడు. కత్తి దెబ్బ తిన్నా బతికే ఉన్న మొదటి క్రూరమృగానికి ఒక విగ్రహాన్ని స్థాపించాలని వాడు అందరికీ చెబుతూ ఉన్నాడు.

    15 పైగా ఆ మృగం విగ్రహానికి ప్రాణం పోసి అది మాట్లాడేలా చేయడానికీ, ఆ మృగం విగ్రహాన్ని పూజించని వారిని చంపడానికీ వాడికి అధికారం ఇవ్వడం జరిగింది.

  104. 1 దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం.

  105. 7 మోసగాడి పద్ధతులన్నీ దుర్మార్గంగా ఉంటాయి. పేదవాళ్ళు సరైనదేదో చెప్పినా, పేదవాళ్ళని నాశనం చేయడానికి వాడు అబద్దాలతో పన్నాగాలు పన్నుతాడు.

  106. 8 అయితే ఆయన ఇలా అన్నాడు. “కచ్చితంగా వారు నా ప్రజలు. అవిధేయులు కాని పిల్లలు.” ఆయన వారికి రక్షకుడయ్యాడు.

  107. 19 చారెడు బార్లీ గింజలకీ కొన్ని రొట్టె ముక్కలకీ ఆశపడి ప్రజల్లో నా పేరును అవమానపరిచారు. అబద్ధాలు వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్తూ వాళ్ళు నిర్దోషులను చంపేలా, చావడానికి అర్హులైన వాళ్ళను విడిచిపెట్టేలా చేశారు.

  108. 10 దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే,

    “నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు.

    11 గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు.

    12 అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు.

    మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు.

    13 వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది.

    వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు.

    వారి పెదవుల కింద పాము విషం ఉంది.

    14 వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి.

  109. 17 కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టిలో మేలు జరిగించండి. 18 మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి.

    19 ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోవద్దు. దేవుని కోపానికి చోటియ్యండి. “పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది.

    20 “కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు.

    అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది.”

    21 కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి.