74 Bible Verses About Promises

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Promises
  1. 13 దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు, ఆయన కంటే గొప్పవాడు ఎవడూ లేడు కాబట్టి, “నా తోడు” అంటూ ప్రమాణం చేశాడు. 14 “నిన్ను కచ్చితంగా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని విస్తారం చేస్తాను” అన్నాడు. 15 ఈ విధంగా అబ్రాహాము సహనంతో వేచి ఉన్న తరువాత దేవుడు తనకు వాగ్దానం చేసిన భూమిని పొందాడు.

    16 సాధారణంగా మనుషులు తమ కంటే గొప్పవాడి తోడు అంటూ ప్రమాణం చేస్తారు. వారికున్న ప్రతి వివాదానికీ పరిష్కారం చూపేది ప్రమాణమే. 17 వాగ్దానానికి వారసులైన వారికి తన సంకల్పం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు ఒట్టు పెట్టుకోవడం ద్వారా తన వాగ్దానానికి హామీ ఇచ్చాడు.

    18 అందువల్ల వేటి విషయం దేవుడు అబద్ధం ఆడలేడో, మార్పు లేని ఆ రెండింటి ద్వారా ఆశ్రయం కోరి పరుగు తీసే మన ఎదుట ఉన్న ఆశాభావాన్ని మనం బలంగా పట్టుకోడానికి గట్టి ప్రోత్సాహం ఉండాలని అలా చేశాడు.

  2. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

    18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు. 19 ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. 20 దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు.

  3. 31 చూడు, నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో, ఒక కొత్త ఒప్పందం స్థిరం చేసే రోజులు వస్తున్నాయి,” ఇది యెహోవా వాక్కు.

    32 “అది ఐగుప్తులోనుంచి నేను వాళ్ళ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చిన రోజుల్లో వాళ్ళ పితరులతో నేను చేసిన ఒప్పందం లాంటిది కాదు. నేను వాళ్ళకు ఒక భర్తగా ఉన్నా, ఆ రోజుల్లో వాళ్ళు ఆ ఒప్పందం ఉల్లంఘించారు.” ఇది యెహోవా వాక్కు.

    33 “కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు.

    34 “అప్పుడు ప్రతివాడూ తన పొరుగువాడికి, తన సహోదరునికి బోధిస్తూ, ‘యెహోవాను తెలుసుకో!’ అని ఇక చెప్పడు. ఎందుకంటే, వాళ్ళల్లో చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వాళ్ళ దోషాలు క్షమించి, వాళ్ళ పాపాలు ఇంక ఎన్నడూ మనసులో పెట్టుకోను.” ఇది యెహోవా వాక్కు.

  4. 38 దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. 39 ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు.

  5. 9 కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.

  6. 17 నేను ఇలా ఆలోచించి చపలచిత్తంగా నడచుకున్నానా? నేను “అవును, అవును” అన్న తరువాత, “కాదు, కాదు” అంటూ లౌక్యంగా ప్రవర్తిస్తున్నానా? 18 అయితే దేవుడు నమ్మదగినవాడు. మేము, “అవును” అని చెప్పి, “కాదు” అనం. 19 నేనూ, సిల్వానూ, తిమోతీ, మీకు ప్రకటించిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు “అవును” అని చెప్పి, “కాదు” అనేవానిగా ఉండలేదు. ఆయన ఎప్పుడూ, “అవును” అనేవానిగానే ఉన్నాడు. 20 దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తులో, “అవును” గానే ఉన్నాయి. కాబట్టి దేవుని మహిమ కోసం ఆయన ద్వారా మనం, “ఆమెన్” అంటున్నాం.

    21 క్రీస్తులో మిమ్మల్నీ మమ్మల్నీ స్థిరపరిచేది దేవుడే. ఆయనే మనలను అభిషేకించి 22 మనం తన వాళ్ళమన్న ముద్ర మనపై వేసాడు, మన హృదయాల్లో తన ఆత్మను హామీగా ఇచ్చాడు.

  7. 13 అబ్రాహాము, అతని సంతానం లోకానికి వారసులవుతారు అనే వాగ్దానం ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు. విశ్వాసం వలన ఏర్పడిన నీతి మూలంగానే కలిగింది. 14 ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే విశ్వాసం వ్యర్థమౌతుంది, వాగ్దానం కూడా నిరర్థకమౌతుంది. 15 ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం లేని చోట దాన్ని అతిక్రమించడం కూడా ఉండదు.

    16 ఈ కారణం చేత ఆ వాగ్దానం అబ్రాహాము సంతతి వారందరికీ, అంటే ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రాహాముకున్న విశ్వాసం గలవారికి కూడా కృపను బట్టి వర్తించాలని, అది విశ్వాసమూలమైనది అయ్యింది. ఆ అబ్రాహాము మనందరికీ తండ్రి.

  8. 1 యేసు క్రీస్తుకు బానిస, అపొస్తలుడు అయిన సీమోను పేతురు, మన దేవుడూ, రక్షకుడూ అయిన యేసు క్రీస్తు నీతిని బట్టి మాకు సమానంగా అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవారికి రాస్తున్న సంగతులు. 2 దేవునిలో, మన ప్రభువైన యేసులో పూర్తి జ్ఞానం ద్వారా మీకు కృప, శాంతి విస్తరించు గాక!

    3 తన మహిమనుబట్టి, మంచి గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు. 4 వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా, లోకంలో ఉన్న దుర్మార్గపు కోరికల నాశనగుణం నుండి తప్పించుకుని మీరు తన స్వభావంలో పాలిభాగస్థులు కావాలన్నదే దేవుని ఉద్దేశం.

  9. 1 యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. “నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు. 2 నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు. 3 నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది.”

    4 యెహోవా అతనికి చెప్పినట్టు అబ్రాము చేశాడు. అతనితోపాటు లోతు కూడా బయలుదేరాడు. హారాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రాము వయసు డెబ్భై ఐదు సంవత్సరాలు.

  10. 4 ఆయన వారిని కలుసుకుని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, “మీరు యెరూషలేమును విడిచి పోవద్దు. నా ద్వారా విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. 5 యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గానీ కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు.”

  11. 23 వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి చలించకుండా మనకు కలిగిన ఆశాభావం గూర్చిన మన ఒప్పుకోలుకు కట్టుబడి ఉందాం.

  12. 22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా చేశాడు. ఆయన ‘నేను యెష్షయి కుమారుడు దావీదును నా ఇష్టానుసారమైన వానిగా కనుగొన్నాను. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు’ అని దావీదును గురించి దేవుడు సాక్షమిచ్చాడు.

    23 “అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కోసం రక్షకుడైన యేసును పుట్టించాడు.

  13. 24 మీరైతే, మొదటినుంచి ఏది విన్నారో అది మీలో నిలిచిపోయేలా చూసుకోండి. మొదటినుండీ విన్నది మీలో అలాగే నిలిచి ఉంటే, మీరు కుమారుడిలో, తండ్రిలో నిలిచి ఉంటారు. 25 ఆయన మనకు శాశ్వత జీవాన్ని వాగ్దానం చేశాడు.

  14. 12 అయితే మీరు వెనక్కి తగ్గి మీమధ్య మిగిలి ఉన్న ఈ రాజ్యాల ప్రజలతో ఏకమైపోయి వాళ్ళతో వియ్యమందుకుని, పరస్పర సంబంధాలు కలిగించుకుంటే 13 మీ దేవుడైన యెహోవా మీ దగ్గరనుండి ఈ రాజ్యాలను వెళ్ళగొట్టడం మానుకుంటాడని మీరు తెలుసుకోవాలి. దానికి బదులు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యీ మంచి ప్రదేశంలో ఉండకుండా మీరు నాశనమయ్యే వరకూ వారు మీకు ఉరిగా బోనుగా మీపక్కలో కొరడాలాగా మీ కళ్ళలో ముళ్లులాగా ఉంటారు.

    14 ఇప్పుడు మనుషులందరిలాగే నేనూ పోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయంలో చేసిన వాగ్దానాల్లో ఒక్కటికూడా తప్పిపోలేదని మీ అందరి హృదయాలకూ మనసులకూ తెలుసు. అవన్నీ మీకు జరిగాయి. వాటిలో ఒక్కటికూడా తప్పిపోలేదు. 15 అయితే మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానాలన్నీ మీకు నెరవేరినట్టుగా మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపచేసే వరకూ యెహోవా మీ మీదికి కీడులన్నీ రప్పిస్తాడు. 16 మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి, ఇతర దేవుళ్ళను పూజించి వాటికి నమస్కరిస్తే యెహోవా కోపం మీ మీద రగులుకుంటుంది. ఆయన మీకిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండాా మీరు త్వరగా నాశనమవుతారు.”

  15. 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.

    12 అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను.

  16. 13 మీరు కూడా సత్య వాక్యాన్ని అంటే రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసముంచారు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ద్వారా మీమీద ముద్ర పడింది. 14 దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగే వరకూ ఆత్మ మన వారసత్వానికి హామీగా ఉన్నాడు.

  17. 19 అతడు విశ్వాసంలో బలహీనుడు కాలేదు, సుమారు నూరు సంవత్సరాల వయస్సు గలవాడు కాబట్టి, తన శరీరాన్ని మృతతుల్యంగా, శారా గర్భం మృతతుల్యంగా భావించాడు. 20 అవిశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహించక విశ్వాసంలో బలపడి దేవుణ్ణి మహిమ పరచాడు. 21 దేవుడు మాట ఇచ్చిన దాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడని గట్టిగా నమ్మాడు. 22 అందుచేత దేవుడు దాన్ని అతనికి నీతిగా ఎంచాడు. 23 దేవుడు ఆ విశ్వాసాన్ని ఆ విధంగా ఎంచాడని అతని కోసం మాత్రమే రాసి లేదు, 24 మన ప్రభు యేసును చనిపోయిన వారిలో నుండి లేపిన దేవునిలో విశ్వాసం ఉంచిన మనలను కూడా నీతిమంతులుగా ఎంచడానికి మన కోసం కూడా రాసి ఉంది.

  18. 23 అయినా దాసి వలన పుట్టినవాడు శరీర రీతిగా పుట్టాడు. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దాన మూలంగా పుట్టాడు.

    24 ఈ విషయాలను అలంకార రూపంలో చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలు. వాటిలో ఒకటి సీనాయి పర్వతానికి సంబంధించి బానిసత్వంలో ఉండడానికి పిల్లలను కంటుంది. ఇది హాగరు. 25 ఈ హాగరు అరేబియా ప్రాంతంలో ఉన్న సీనాయి కొండ. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడ బానిసత్వంలో ఉంది. 26 అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. ఆమె మనకు తల్లి.

    27 “గొడ్రాలా, పిల్లలను కననిదానా, ఆనందించు.

    ప్రసవ వేదన పడనిదానా, ఆనందంతో కేకలు పెట్టు.

    ఎందుకంటే, భర్త ఉన్న ఆమె పిల్లల కంటే భర్త లేని దాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు” అని రాసి ఉంది.

    28 సోదరులారా, మీరు కూడా ఇస్సాకు లాగా వాగ్దానం ప్రకారం పుట్టిన కొడుకులుగా ఉన్నారు.

  19. 12 పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.

  20. 3 ప్రస్తుతం నువ్వున్న ఈ దేశంలోనే పరదేశిగా ఉండిపో. నేను నీతో ఉంటాను. నిన్ను ఆశీర్వదిస్తాను. నీ తండ్రి అయిన అబ్రాహాముతో చేసిన నిబంధనను నెరవేరుస్తాను.

    4 నీ వంశస్థులను ఆకాశంలో నక్షత్రాల్లా విస్తరింపజేస్తాను. నీ వంశస్థులకు ఈ భూములన్నీ ఇస్తాను. నీ వంశస్థుల ద్వారా భూమిపైని జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను. 5 ఎందుకంటే నీ తండ్రి అబ్రాహాము నా మాటకు లోబడి నా ఆజ్ఞలనూ, శాసనాలనూ, నా చట్టాలనూ, నా నియమాలనూ పాటించాడు” అని అతనికి చెప్పాడు.

  21. 29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.

    30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.

    31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.

    వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.

    అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

  22. 33 కాబట్టి ఆయనను దేవుడు తన కుడి స్థానానికి హెచ్చించాడు. ఆయన తన తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ఆయన వలన పొంది, మీరు చూస్తున్న, వింటున్న ఈ కుమ్మరింపును జరిగించాడు.

  23. 21 ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? కానే కాదు. ఒకవేళ ధర్మశాస్త్రం బతికించగలిగేలా ఉంటే, ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగి ఉండేది. 22 యేసు క్రీస్తులో విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి దేవుడు అనుగ్రహించేలా, లేఖనం అందరినీ పాపంలో బంధించింది.

  24. 4 మీరు దాన్ని చదివితే ఆ క్రీస్తు మర్మం విషయంలో నేను పొందిన పరిజ్ఞానం గ్రహించగలరు.

    5 ఈ మర్మం ఇప్పుడు ఆత్మ ద్వారా దేవుని పరిశుద్ధులైన అపొస్తలులకూ ప్రవక్తలకూ వెల్లడైనట్టుగా పూర్వకాలాల్లోని మనుషులకు తెలియలేదు. 6 ఈ మర్మం ఏమిటంటే, సువార్త ద్వారా యూదులతో పాటు యూదేతరులు కూడా క్రీస్తు యేసులో సమాన వారసులు, ఒకే శరీరంలోని అవయవాలు, వాగ్దానంలో పాలిభాగస్తులు అనేదే.

  25. 6 కానీ ఇప్పుడు క్రీస్తు మరింత మేలైన పరిచర్యను పొందాడు. ఎందుకంటే శ్రేష్ఠమైన వాగ్దానాలపై ఏర్పడిన శ్రేష్ఠమైన ఒప్పందానికి ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు.

    7 ఎందుకంటే మొదటి ఒప్పందం లోపం లేనిదైతే రెండవ ఒప్పందానికి అవకాశం ఉండదు. 8 ప్రజల్లో దోషాలు కనిపించినప్పుడు దేవుడు ఇలా అన్నాడు,

    “చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో

    నేను కొత్త ఒప్పందాన్ని చేసే రోజులు వస్తున్నాయి.

  26. 13 అయినా, ఆయన చేసిన వాగ్దానం కారణంగా కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తున్నాం. దానిలో నీతిపరులు నివాసం చేస్తారు.

    14 కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు గనక ప్రశాంతంగా, ఆయన దృష్టిలో ఏ మచ్చా, కళంకం లేని వారిగా ఉండండి.

  27. 12 అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. 13 యెహోవా దానికి పైగా నిలబడి “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను.

    14 నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి. 15 ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను” అని చెప్పాడు.

  28. 19 అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు.

    మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు.

    ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా?

    ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?

  29. 6 మీరు మీ యెహోవా దేవునికి ప్రతిష్ఠితమైన ప్రజలు. ఆయన భూమి మీద ఉన్న అన్ని జాతుల కంటే మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని తన స్వంత ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు. 7 అంతేగానీ మీరు ఇతర జాతులకంటే విస్తారమైన ప్రజలని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు. ఇతర జాతుల ప్రజలకంటే సంఖ్యలో మీరు తక్కువే గదా. 8 అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన మీ పూర్వీకులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కనుక తన బాహుబలంతో మిమ్మల్ని బానిసత్వం నుండీ ఐగుప్తు రాజు ఫరో చేతి నుండి విడిపించాడు.

    9 కాబట్టి మీ దేవుడు యెహోవాయే దేవుడనీ తనను ప్రేమించి, తన ఆజ్ఞలను పాటించే వారికి తన నిబంధనను స్థిరపరచేవాడనీ మీరు తెలుసుకోవాలి. ఆయన వేయి తరాల వరకూ కృప చూపేవాడనీ, నమ్మదగిన దేవుడనీ గ్రహించాలి. తనను ద్వేషించే ప్రతి ఒక్కరినీ నేరుగా నాశనం చేసి వారిని శిక్షించేవాడనీ మీరు తెలుసుకోవాలి. 10 ఆయన తనను ద్వేషించేవారి విషయంలో నేరుగా, త్వరగా దండన విధిస్తాడు. 11 కాబట్టి ఈ రోజు నేను మీకాజ్ఞాపించే విధులను, కట్టడలను మీరు పాటించాలి.

  30. 56 “తాను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తుతి కలుగు గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్క మాటైనా విఫలం కాలేదు.

  31. 49 “వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు.

  32. 6 అయితే ఇప్పుడు దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దాన సంబంధమైన నిరీక్షణను బట్టి నన్నిక్కడ విమర్శకు గురి చేస్తూ నిలబెట్టారు. 7 మన పన్నెండు గోత్రాల ప్రజలు రాత్రింబగళ్ళు దేవుణ్ణి సేవిస్తూ ఆ వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారు. రాజా, ఈ నిరీక్షణ గురించే యూదులు నాపై నేరం మోపారు.

  33. 1 ప్రియమైన కొరింతు విశ్వాసులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి, కాబట్టి దేవుని మీద భయభక్తులతో పరిపూర్ణమైన పరిశుద్ధత కోసం తపన పడుతూ దేహానికీ ఆత్మకూ అంటిన మురికినంతా కడుక్కుందాం.

  34. 8 శరీర సాధనలో కొంత ప్రయోజనం ఉంది. కాని దైవభక్తిలో ప్రస్తుత జీవితానికీ రాబోయే జీవితానికీ కావలసిన వాగ్దానం ఉన్నందున అన్ని విషయాల్లో అది ఉపయోగకరంగా ఉంటుంది.

  35. 1 క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానం ప్రకారం దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు అనే నేను నా ప్రియ పుత్రుడు తిమోతికి రాసిన ఉత్తరం.

  36. 35 కాబట్టి ధైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా ఉంటే గొప్ప బహుమానం ఉంటుంది. 36 దేవుని ఇష్టాన్ని జరిగించిన తరువాత, ఆయన వాగ్దానం చేసిన వాటిని పొందడానికి మీకు సహనం కావాలి.

  37. 12 నువ్వు బతికే రోజులు ముగిసినప్పుడు నిన్ను నీ పితరులతో కలిపి పాతిపెట్టిన తరువాత నీకు జన్మించిన నీ సంతానాన్ని ఘనపరచి, రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను. 13 అతడు నా పేరును ఘనపరిచేలా ఒక మందిరం నిర్మిస్తాడు. అతని సింహాసనాన్ని నేను నిత్యమైనదిగా స్థిరపరుస్తాను. 14 అతనికి తండ్రిలా ఉండి కాపాడుకుంటాను. అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. అతడు తప్పు చేస్తే మనుషుల దండంతో, వారిని కొట్టే దెబ్బలతో అతణ్ణి శిక్షిస్తాను.

    15 అంతే గాని నిన్ను రాజుగా చేయడానికి నేను తోసిపుచ్చిన సౌలుకు నా కనికరం దూరం చేసినట్టు అతనికి నా కనికరాన్ని దూరం చేయను. 16 నీకైతే నీ సంతానం, నీ రాజ్యం కలకాలం స్థిరంగా ఉంటుంది. నీ సింహాసనం అన్నివేళలా స్థిరంగా ఉంటుంది.”

  38. 4 నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని త్వరగా చెల్లించు. మూర్ఖుల విషయంలో ఆయన సంతోషించడు. 5 నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించు. మొక్కుకుని చెల్లించకపోవడం కంటే అసలు మొక్కుకోకపోవడం మంచిది.

  39. 1 “మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి. 2 నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను. 3 నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను. 4 నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ దారి కూడా తెలుసు” అన్నాడు. 5 తోమా యేసుతో, “ప్రభూ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. మాకు దారి ఎలా తెలుస్తుంది?” అన్నాడు. 6 యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు.

  40. 32 పితరులకు చేసిన వాగ్దానాల గురించి మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడు ఈ వాగ్దానాలను వారి పిల్లలమైన మనకు ఇప్పుడు యేసును మృతుల్లో నుండి లేపడం ద్వారా నెరవేర్చాడు.”

    33 “‘నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కన్నాను’

    అని రెండవ కీర్తనలో కూడా రాసి ఉంది. 34 ఇంకా, ఇకపై కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపడం ద్వారా,

    ‘దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన, నమ్మకమైన దీవెనలను నీకిస్తాను’

    అని చెప్పాడు.

  41. 29 మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు.

  42. 43 యెహోవా ప్రమాణం చేసి ఇశ్రాయేలీయుల పూర్వీకులకిస్తానని చెప్పిన దేశమంతా ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. వాళ్ళు దాని స్వాధీనపరచుకుని దానిలో నివసించారు. 44 యెహోవా వారి పూర్వీకులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్నివైపులా వారికి విశ్రాంతి కలగచేశాడు. యెహోవా వారి శత్రువులందరిని వారికి అప్పగించాడు కాబట్టి వాళ్ళలో ఒక్కడు కూడా ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేకపోయారు. 45 యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పలేదు, అన్నీ నెరవేరాయి.

  43. 42 ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ వాగ్దానాన్ని, తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని,

    43 తన ప్రజలను సంతోషంతోను, తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను బయటికి రప్పించాడు.

  44. 3 అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో.

    4 అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు.

    5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  45. 10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను.

    నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి.

    దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను.

    నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.

    11 నీ మీద కోపపడే వారంతా సిగ్గుపడి, అవమానం పాలవుతారు.

    నిన్ను ఎదిరించే వారు కనబడకుండా నశించిపోతారు

    12 నువ్వెంత వెదికినా నీతో కలహించే వారు కనిపించరు.

    నీతో యుద్ధం చేసే వారు లేకుండా పోతారు, పూర్తిగా మాయమైపోతారు.

  46. 2 నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను.

    నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు.

    నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు

  47. 16 అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు, “నీ సంతానాలకు” అని అనలేదు గానీ ఒకడి గురించి అన్నట్టుగా, “నీ సంతానానికి” అన్నాడు. ఆ సంతానం క్రీస్తే.

  48. 17 నేను చెప్పేది ఏంటంటే, 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ముందుగానే స్థిరపరచిన నిబంధనను కొట్టివేయదు. దాని వాగ్దానాన్ని వ్యర్థం చేయదు. 18 ఆ వారసత్వం ధర్మశాస్త్రం వలన అయిందంటే ఇక ఏ మాత్రం వాగ్దానం వలన అయ్యేది కానట్టే. అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం వల్లనే వారసత్వాన్ని ఇచ్చాడు.

  49. 24 మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన అలా చేస్తాడు.

  50. 9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు.

  51. 8 నీకు ముందుగా వెళ్ళేవాడు యెహోవాయే. ఆయన నీతో ఉంటాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, మర్చిపోడు. భయపడవద్దు. వాళ్ళను చూసి దిగులు పడవద్దు” అని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అతనితో చెప్పాడు.

  52. 9 నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”

  53. 3 నేను ఏర్పరచుకున్న వాడితో ఒడంబడిక చేసుకున్నాను. నా సేవకుడు దావీదుతో ప్రమాణం చేశాను.

    4 శాశ్వతంగా ఉండేలా నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, తరతరాలకు నీ సింహాసనం సుస్థిరం చేస్తాను. సెలా.

  54. 8 తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరాల వరకూ ఆయన గుర్తుంచుకుంటాడు. అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను,

    9 ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని, నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు.

    10 వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, ఆ కొద్ది మంది ఆ దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు,

    11 కొలిచిన వారసత్వంగా కనాను దేశం మీకిస్తానని ఆయన చెప్పాడు.

  55. 33 “‘నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా. 34 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే ఎంతమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని సింహాసనం. 35 భూమి తోడు అనవద్దు. అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు. అది మహారాజు నగరం. 36 నీ తల తోడని ప్రమాణం చేయవద్దు. నీవు ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు. 37 మీ మాట ‘అవునంటే అవును, కాదంటే కాదు’ అన్నట్టే ఉండాలి. అలా కాని ప్రతిదీ అపవాది సంబంధమైనదే.

  56. 37 దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు.

  57. 13 “మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. తద్వారా తండ్రికి తన కుమారుడిలో మహిమ కలుగుతుంది. 14 మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. 15 మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.

    16 “నేను తండ్రిని అడుగుతాను. మీతో ఎల్లప్పుడూ ఉండేలా ఇంకొక ఆదరణకర్తను ఆయన మీకు ఇస్తాడు. 17 ఆయన సత్యం అయిన ఆత్మ. లోకం ఆయనను చూడదు, తెలుసుకోదు కాబట్టి ఆయనను స్వీకరించదు. అయితే మీకు ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. 18 నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మీకోసం నేను మళ్ళీ వస్తాను.

  58. 19 అలాగైతే ధర్మశాస్త్రమెందుకు? అతిక్రమాలను బట్టి దేవుడు దాన్ని కలిపాడు. ఎవరి గూర్చి ఆ వాగ్దానం చేశాడో ఆ సంతానం వచ్చే వరకూ అది అమలులో ఉంది. దాన్ని మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా దేవుడు నియమించాడు.

  59. 8 దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అతడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు విధేయత చూపాడు. తాను వారసత్వంగా పొందబోయే స్థలానికి ప్రయాణమై వెళ్ళాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణం అయ్యాడు. 9 విశ్వాసాన్ని బట్టి అతడు వాగ్దాన భూమిలో పరదేశిగా నివసించాడు. అతడు తనతోబాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు, యాకోబు అనే వారితో గుడారాల్లో నివసించాడు.

  60. 39 వీళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వీళ్ళందరినీ స్వీకరించాడు. కానీ ఆయన వాగ్దానం చేసింది వారు పొందలేదు. 40 మనం లేకుండా వారు పరిపూర్ణులు కాకుండా దేవుడు మనకోసం మరింత మెరుగైన దాన్ని ముందే సిద్ధం చేశాడు.

  61. 7 యెహోవా అబ్రాముతో “నీ వారసులకు ఈ దేశాన్ని ఇస్తాను” అని చెప్పాడు. అక్కడ అతడు యెహోవాకు హోమ బలి అర్పించాడు.

  62. 15 యెహోవా దూత రెండవసారి ఆకాశం నుండి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు 16 “నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను. 17 నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు.

    18 నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమి పైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.”

  63. 7 “అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది. 8 అడిగే ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది. 9 మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా? 10 లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా? 11 మీరు చెడ్డ వారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు గదా! అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు.

  64. 25 అందుకు యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు, 26 బతికి ఉండి నన్ను నమ్మిన వారు ఎప్పుడూ చనిపోరు. ఇది నువ్వు నమ్ముతున్నావా?” అన్నాడు.

  65. 8 కానీ ఆ నీతి ఏమి చెబుతున్నదో చూడండి,

    “దేవుని వాక్కు మీకు దగ్గరగా, మీ నోటిలో,

    మీ హృదయంలో ఉంది.”

    మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్కు కూడా ఇదే. 9 అదేమంటే యేసును ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుని, దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడని నీ హృదయంలో నమ్మితే, నీకు రక్షణ కలుగుతుంది. 10 ఎలాగంటే మనిషి నీతి కోసం హృదయంలో నమ్ముతాడు, పాప విమోచన కోసం నోటితో ఒప్పుకుంటాడు. 11 “ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరూ సిగ్గుపడరు” అని దేవుని వాక్కు చెబుతున్నది. 12 ఇందులో యూదులూ, గ్రీకులూ అనే వ్యత్యాసం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఆయన తనకు ప్రార్థన చేసే వారందరికీ కృప చూపగల సంపన్నుడు. 13 ఎందుకంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ పాపవిమోచన కలుగుతుంది.

  66. 4 వాళ్ళు పరాయి వారుగా నివాసం చేసిన కనాను దేశాన్ని వారికి ఇస్తానని నేను ఒప్పందం చేశాను. 5 ఐగుప్తీయులకు బానిసలుగా మారిన ఇశ్రాయేలు ప్రజల నిట్టూర్పులు విని నా నిబంధనను గుర్తు చేసుకున్నాను.

    6 కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. నేనే యెహోవాను. ఐగుప్తీయుల బానిసత్వం కింద ఉన్న మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని ఆ దేశం నుండి బయటకు రప్పిస్తాను. వాళ్లకు గొప్ప తీర్పు క్రియలు చూపి, నా చేతులు చాపి వారి బానిసత్వం కింద ఉన్న మిమ్మల్ని విడిపిస్తాను. 7 మిమ్మల్ని నా సొంత ప్రజగా నా చెంత చేర్చుకుని మీకు దేవుడైన యెహోవాగా ఉంటాను. అప్పుడు ఐగుప్తీయుల బానిసత్వం కింద నుండి మిమ్మల్ని విడిపించి బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. 8 అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇస్తానని నేను చెయ్యి ఎత్తి శపథం చేసిన దేశానికి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ దేశాన్ని మీకు సొంతం చేస్తాను. నేను యెహోవాను.”

  67. 1 మోషే ఇశ్రాయేలు గోత్రాల నాయకులతో ఇలా అన్నాడు, 2 “ఇది యెహోవా ఆజ్ఞ. ఒకడు యెహోవాకు మొక్కుకుంటే లేక ప్రమాణం చేసి ఉంటే, అతడు మాట తప్పకూడదు. తన నోటినుండి వచ్చిన దానంతటినీ అతడు నెరవేర్చాలి.

  68. 25 తొందరపడి, ఇది దేవునికి ఇచ్చేస్తున్నానని చెప్పడం, మొక్కుబడి చేసిన తరువాత దాన్ని గూర్చి విచారించడం ప్రమాద హేతువు.

  69. 31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. 32 దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు.

  70. 17 అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన సమయం దగ్గరపడే కొద్దీ ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి చెందారు.

  71. 31 వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? 32 తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా? 33 దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరారోపణ చేయగల వాడెవడు? నిర్దోషిగా ప్రకటించేవాడు దేవుడే. 34 ఎవరు శిక్ష విధించ గలిగేది? క్రీస్తు యేసా? చనిపోయినవాడు, మరింత ప్రాముఖ్యంగా చనిపోయిన వారిలో నుండి లేచినవాడు, దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నవాడు, మన కోసం విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే.

    35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా?

  72. 15 సోదరులారా, మానవరీతిగా మాట్లాడుతున్నాను. మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి ఇంకేమీ కలపరు.

  73. 12 ఎందుకంటే దేవుని వాక్కు సజీవమైనది, క్రియాశీలకమైనది, రెండంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండి ప్రాణం నుండి ఆత్మనూ, కీళ్ళ నుండి మూలుగనూ విభజించగలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది హృదయంలోని ఆలోచనలపైనా ఉద్దేశాలపైనా తీర్పు చెప్పగలదు. 13 సృష్టిలో ఆయనకు కనిపించనిది అంటూ ఏదీ లేదు. మనం లెక్క అప్పగించవలసిన దేవుని దృష్టికి అంతా స్పష్టంగా ఉంది.

  74. 5 జయించేవాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలో నుండి అతని పేరును నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతే కాకుండా నా తండ్రి ఎదుటా ఆయన దూతల ఎదుటా అతడి పేరు ఒప్పుకుంటాను.