36 Bible Verses About Modesty

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Modesty
  1. 9 అలాగే స్త్రీలు కూడా నిరాడంబరమైన, సక్రమమైన వస్త్రాలు ధరించుకోవాలి గానీ జడలతో బంగారంతో ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో కాకుండా 10 భక్తిపరులమని చెప్పుకొనే స్త్రీలకు తగినట్టుగా మంచి పనులతో తమను తాము అలంకరించుకోవాలి.

    11 స్త్రీలు మౌనంగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. 12 ఉపదేశించడానికీ, పురుషుని మీద అధికారం చేయడానికీ స్త్రీకి అనుమతినివ్వను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే. 13 ఎందుకంటే దేవుడు మొదట ఆదామును తరువాత హవ్వను గదా సృష్టించాడు? 14 ఆదాము మోసపోలేదు, స్త్రీయే మోసపోయి అపరాధి అయింది.

    15 అయినా స్త్రీలు వివేకవతులై, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతల్లో నిలకడగా ఉంటే ప్రసవం ద్వారా దేవుడు వారిని కాపాడతాడు.

  2. 1 భార్యలుగా ఉన్న మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులయినా సరే, మాటలతో కాకుండా, వారి భార్యల ప్రవర్తనే వారిని ప్రభువు కోసం సంపాదిస్తుంది. 2 ఎందుకంటే గౌరవ ప్రదమైన మీ పవిత్ర ప్రవర్తన వారు గమనిస్తారు.

    3 జడలు అల్లుకోవడం, బంగారు ఆభరణాలు, ఖరీదైన బట్టలు అనే బాహ్య అలంకారాలు మీకు వద్దు. 4 వాటికి బదులు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. అలాంటి అలంకారం నాశనం కాదు. అది దేవుని దృష్టికి చాలా విలువైనది. 5 పూర్వకాలంలో దేవుని మీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు ఈ విధంగా అలంకరించుకున్నారు. వారు తమ భర్తలకు లోబడి ఉంటూ తమ్మును తాము అలంకరించుకున్నారు. 6 ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది. ఏ భయాలకూ లొంగకుండా, మంచి చేస్తూ ఉంటే మీరు ఆమె పిల్లలు.

  3. 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  4. 6 స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.

    7 అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు. 8 సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోటలో దేవుడైన యెహోవా నడుస్తున్న శబ్ధం వాళ్ళు విన్నారు. ఆదాము, అతని భార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు.

    9 దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తూ “నువ్వెక్కడ ఉన్నావు?” అన్నాడు. 10 అతడు “నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నగ్నంగా ఉన్నాను గనక భయపడి దాక్కున్నాను” అన్నాడు. 11 దేవుడు “నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినొద్దని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావా?” అన్నాడు.

  5. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

    6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

    దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

    7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

    బానిస రూపం తీసుకున్నాడు.

    మానవుల పోలికలో కనిపించాడు.

    ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

    8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,

    తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

  6. 27 “‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా. 28 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు. 29 నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.

  7. 2 కాబట్టి అధ్యక్షుడు నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య ఉన్నవాడూ కోరికలు అదుపులో ఉంచుకునేవాడూ వివేచనాపరుడూ మర్యాదస్థుడూ అతిథి ప్రియుడూ బోధించడానికి సమర్థుడూ అయి ఉండాలి.

  8. 21 దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో బట్టలు చేసి తొడిగించాడు.

  9. 15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. 16 ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే. 17 ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.

  10. 41 నీవు నీ సోదరుడు అహరోనుకు, అతని కుమారులకు వాటిని తొడిగించాలి.

    వారు నాకు యాజకులయ్యేలా వారికి అభిషేకం చేసి, వారిని ప్రతిష్ఠించి పవిత్రపరచాలి. 42 వారి నగ్నతను కప్పుకొనేందుకు నీవు వారికి నారతో చేసిన లోదుస్తులు కుట్టించాలి. 43 వారు ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించేటప్పుడు గానీ పరిశుద్ధస్థలం లో సేవ చేయడానికి బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు గానీ వారు దోషులై చావకుండేలా అహరోను, అతని కుమారులు వాటిని ధరించాలి. ఇది అతనికి, అతని తరువాత అతని సంతానానికి ఎప్పటికీ నిలిచి ఉండే శాసనం.”

  11. 30 చక్కదనం మోసకరం. సౌందర్యం వ్యర్థం. యెహోవా పట్ల భయభక్తులు గల స్త్రీని అందరూ ప్రశంసిస్తారు.

  12. 5 ఏ స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు. అలా చేసేవారంతా మీ దేవుడైన యెహోవాకు అసహ్యులు.

  13. 5 యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి ఉండండి. దేవుడు గర్విష్టులను ఎదిరించి వినయం గలవారికి కృప చూపుతాడు. 6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.

    7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి.

  14. 6 కానీ నన్ను నమ్మిన ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే వాడి మెడకి ఒక పెద్ద తిరగలి బండ కట్టి చాలా లోతైన సముద్రంలో పడవేయడం అతనికి మేలు.

    7 “నా విషయంలో ఆటంకాలు కలిగించడం లోకానికి తీర్పుకు కారణమౌతుంది. ఆటంకాలు రాక మానవు. కానీ అవి ఎవరి వలన కలుగుతాయో, ఆ వ్యక్తికి శిక్ష తప్పదు. 8 నీ చెయ్యి గాని, నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే, దాన్ని నరికి పారవెయ్యి. రెండు చేతులూ రెండు పాదాలూ ఉండి నిత్యాగ్నిలో పడడం కంటే కుంటివాడుగానో, అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది. 9 నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవెయ్యి. రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.

  15. 21 కాబట్టి కన్ను చేతితో, “నీవు నాకక్కర లేదు” అనీ, తల పాదాలతో, “మీరు నాకక్కర లేదు” అనీ చెప్పడానికి వీలు లేదు. 22 అంతేకాక, శరీరంలో బలహీనంగా కనిపించే అవయవాలు ఎక్కువ అవసరమైనవి.

    23 శరీరంలో ఘనత లేనివని తలంచే అవయవాలను మరి ఎక్కువగా ఘనపరుస్తాం. అందం లేదని తలచే అవయవాలకు ఎక్కువ అందాన్ని కలిగిస్తాం. 24-25 అందమైన అవయవాలకు మరింత అందం అక్కర లేదు. ఆ విధంగా దేవుడు శరీరంలో వివాదాలు రాకుండా అవయవాలన్నీ ఒకదాని పట్ల మరొకటి శ్రద్ధ వహించేలాగా, తక్కువ దానికే ఎక్కువ ఘనత కలిగించి, శరీరాన్ని అమర్చాడు. 26 కాబట్టి ఒక అవయవం బాధపడితే మిగిలిన అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి. ఒకటి ఘనత పొందితే అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి. 27 మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు.

    28 దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు. 29 అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు. 30 అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు. 31 కృపావరాల్లో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వ శ్రేష్ఠ మార్గాన్ని మీకు చూపిస్తాను.

  16. 7 అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. “అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు.”

  17. 22 స్త్రీ ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆమెకు వివేకం లేకపోతే ఆ స్త్రీ పంది ముక్కుకు తొడిగిన బంగారు ముక్కుపుడకతో సమానం.

  18. 1 బబులోను కన్యా, కిందికి దిగి మట్టిలో కూర్చో.

    కల్దీయుల కుమారీ, సింహాసనం లేకుండా నేల మీద కూర్చో.

    నువ్వు సుతిమెత్తని దానివనీ సుకుమారివనీ ప్రజలు ఇక ముందు చెప్పరు.

    2 తిరగలి తీసుకుని పిండి విసురు. నీ ముసుగు తీసివెయ్యి.

    కాలి మీద జీరాడే వస్త్రాలు తీసివెయ్యి. కాలి మీది బట్ట తీసి నదులు దాటు.

    3 నీ చీర కూడా తీసేస్తారు. నీ నగ్నత్వం బయటపడుతుంది.

    నేను మనుషులపై ప్రతీకారం తీర్చుకునేటప్పుడు వారిపై జాలిపడను.

  19. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  20. 6 నా యింటి కిటికీలో నుండి, కిటికీ పరదా నుండి నేను చూశాను.

    7 జ్ఞానం లేని యువకుల మధ్య ఒక తెలివి తక్కువ యువకుడు నాకు కనబడ్డాడు.

    8 సాయంత్ర సమయం ముగిసి చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రివేళ అతడు వ్యభిచారి ఉండే వీధిలో ప్రవేశించాడు.

    9 ఆ వీధిలో తిరుగుతూ అది ఉండే యింటి దారి పట్టాడు.

    10 అప్పుడు వేశ్య వేషం ధరించిన ఒక కుటిల బుద్ధిగల స్త్రీ అతనికి ఎదురు వచ్చింది.

    11 ఆమె తిరుగుబోతు. అదుపు లేకుండా తిరుగుతూ ఉండేది. ఆమె కాళ్ళు ఇంట్లో నిలవవు.

    12 ఆమె ఒక్కోసారి తన ఇంటి ఎదుట, ఒక్కోసారి పట్టణ వీధుల్లో ఉంటుంది. ప్రతి సందులోనూ ఆమె కాపు కాసి ఉంటుంది.

  21. 1 నేను నా కన్నులతో ఒప్పందం చేసుకున్నాను గనక కన్యను కోరికతో ఎలా చూస్తాను?

  22. 25 బలం, ఘనత ఆమెకు వస్త్రాలు. ఆమె భవిషత్తు విషయమై నిర్భయంగా ఉంటుంది.

  23. 1 ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “ఆటంకాలు రాకుండా ఉండడం అసాధ్యం. కానీ అవి ఎవరి వల్ల వస్తాయో అతని స్థితి ఎంత భయానకమో! 2 అలాంటి వ్యక్తి ఈ చిన్న బిడ్డల్లో ఎవరికైనా ఆటంకం కలగజేయడం కంటే అతడి మెడకు తిరగలి రాయి కట్టి సముద్రంలో పడవేయడం అతనికి మేలు.

  24. 3 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి.

  25. 8 శరీర సాధనలో కొంత ప్రయోజనం ఉంది. కాని దైవభక్తిలో ప్రస్తుత జీవితానికీ రాబోయే జీవితానికీ కావలసిన వాగ్దానం ఉన్నందున అన్ని విషయాల్లో అది ఉపయోగకరంగా ఉంటుంది.

  26. 42 అయితే యేసు వారిని దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు, “అన్యజనుల అధికారులు ప్రజల మీద తమ ఆధిపత్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తారు. వారిలో ప్రముఖులు వారిపై అధికారం చెలాయిస్తారు. 43 మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు కావాలనుకొనేవాడు సేవకుడై ఉండాలి. 44 మీలో మొదటివాడు కావాలని కోరేవాడు అందరికీ దాసుడై ఉండాలి. 45 ఎందుకంటే మనుష్య కుమారుడు సేవ చేయించుకోడానికి రాలేదు, సేవ చేయడానికీ, అందరి పక్షాన తన ప్రాణాన్ని వెలగా ధార పోయడానికి వచ్చాడు.”

  27. 25 అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. ప్రజల మీద అధికారం చెలాయించే వారు ‘ధర్మదాతలు’ అని పిలిపించుకుంటారు. 26 మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు తక్కువవాడుగా, నాయకుడు సేవకుడిలా ఉండాలి. 27 అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను.

  28. 20 నిజమే. వారి అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయడం జరిగింది. నీవైతే విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్నావు. నిన్ను నీవు హెచ్చించుకోక, భయం కలిగి ఉండు. 21 ఎందుకంటే దేవుడు సహజమైన కొమ్మలనే వదల్లేదంటే నిన్ను కూడా వదలడు గదా!

  29. 13 కాబట్టి ఇకమీదట మనం ఒకరికి ఒకరం తీర్పు తీర్చ వద్దు. దానికి ప్రతిగా, మన సోదరునికి అడ్డురాయిలాగా ఆటంకంగా ఉండకూడదని తీర్మానించుకుందాం.

  30. 13 మేమైతే మా స్థాయికి మించి అతిశయపడం, మిమ్మల్ని చేరగలిగేలా దేవుడు మాకు ఏర్పరచిన హద్దుల్లోనే ఉంటాం. 14 మేము మీ దగ్గరికి వచ్చినపుడు మా హద్దులు మీరలేదు. క్రీస్తు సువార్త మోసుకుంటూ మీ దాకా మొట్టమొదట వచ్చింది మేమే. 15 మేము మా హద్దు మీరి ఇతరుల కష్ట ఫలంలో మాకు వంతు ఉన్నట్టు అతిశయపడము. అయితే మీ విశ్వాసం అభివృద్ధి అయ్యే కొద్దీ మా పరిధిలో పని ఇంకా ఎక్కువగా అభివృద్ది అవుతుందనీ, దాని వలన 16 మీకు అవతల ఉన్న ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించాలనీ మా ఆశ. మరొకరి పరిధిలో జరుగుతున్న పని గురించి మేము అతిశయించం.

  31. 5 అలాంటి వ్యక్తి తరపున నేను అతిశయిస్తాను. అయితే నా బలహీనతల విషయంలో తప్ప నా తరపున నేను అతిశయించను. 6 ఒకవేళ అతిశయించాలనుకొన్నా అది తెలివి తక్కువతనమేమీ కాదు. ఎందుకంటే నేను సత్యమే చెబుతున్నాను. కానీ ఎవరైనా నాలో చూసినదాని కంటే, నేను చెప్పింది విన్నదాని కంటే నన్ను ఎక్కువ ఘనంగా ఎంచకుండా ఉండేలా అతిశయించడం మానుకుంటాను.

  32. 11 చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది. 12-13 మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ భక్తిహీనతనూ, ఈ లోక సంబంధమైన దురాశలనూ వీడి, ఈ యుగంలో నీతితో, భక్తితో జీవించమని అది మనకు నేర్పుతుంది.

    14 ఆయన సమస్తమైన విచ్చలవిడి పనుల నుండి మనలను విమోచించి, మంచి పనులు చేయడంలో ఆసక్తిగల ప్రజలుగా పవిత్రపరచి తన సొత్తుగా చేసుకోడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు.

  33. 14 ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. 15 చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది.

  34. 6 యెహోవాకు నేనేం తీసుకురాను?

    మహోన్నతుడైన దేవునికి వంగి నమస్కారం చేయడానికి ఏం తీసుకురాను?

    దహనబలులనూ ఏడాది దూడలనూ తీసుకుని నేను ఆయన దగ్గరికి రానా?

    7 వేలకొలది పొట్టేళ్లు, పది వేల నదుల నూనెతో యెహోవా సంతోష పడతాడా?

    నా అతిక్రమానికి నా పెద్ద కొడుకుని నేనివ్వాలా?

    నా సొంత పాపానికి నా గర్భఫలాన్ని నేనివ్వాలా?

    8 మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు.

    ఆయన నిన్ను కోరేదేంటంటే,

    న్యాయంగా ప్రవర్తించు.

    కనికరాన్ని ప్రేమించు.

    వినయంగా నీ దేవునితో నడువు.

  35. 3 అలాగే వృద్ధ స్త్రీలు గౌరవప్రదంగా, పుకార్లు పుట్టించేవారుగా కాకుండా ఉండాలి. అస్తమానం మద్యపానంలో మునిగి తేలుతూ ఉండకూడదు. నడవడిలో భయభక్తులు గలిగి మంచి విషయాలు నేర్పుతూ ఉండాలి. 4-5 దేవుని వాక్యానికి చెడ్డ పేరు రాకుండేలా తమ భర్తలను, పిల్లలను ప్రేమతో చూసుకోవాలని యువతులను ప్రోత్సహిస్తూ, మనసును అదుపులో ఉంచుకుంటూ, శీలవతులుగా, తమ ఇంటిని శ్రద్ధగా చక్కబెట్టుకొనేవారుగా, తమ భర్తలకు లోబడుతూ ఉండాలని వృద్ధ స్త్రీలు వారికి బోధించాలి.

  36. 17 ‘నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది, నాకే లోటూ లేదు’ అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే నీవొక నిర్భాగ్యుడివి, దీనావస్థలో ఉన్నావు, దరిద్రుడివి, గుడ్డివాడివి. బట్టలు లేవు.

    18 నా సలహా విను, నీకు సంపద పెరగడం కోసం కొలిమిలో కరగబెట్టిన బంగారాన్నీ, నీ నగ్నత్వం కనిపించి నీ సిగ్గు పోకుండా ధరించడానికి తెల్లని వస్త్రాలనూ, నీవు చూడగలిగేలా కళ్ళకు మందు నా దగ్గర కొనుక్కో.