34 Bible Verses About Judging Others
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
1 “ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు మిమ్మల్నీ తీర్పు తీర్చరు. 2 మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత ప్రకారమే మీకూ దొరుకుతుంది. 3 నీ కంటిలో ఉన్న దుంగను గమనించుకోకుండా నీ సాటి మనిషి కంటిలోని నలుసు ఎందుకు చూస్తావు? 4 నీ కంటిలో దుంగను ఉంచుకుని నీ సోదరునితో, ‘నీ కంటిలోని నలుసు తీయనివ్వు’ అని ఎలా చెబుతావు? 5 కపట వేషధారీ! మొదట నీ కంటిలో ఉన్న దుంగను తీసివేసికో, అప్పుడు నీ సోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది.
6 పవిత్రమైనదాన్ని కుక్కలకు పెట్టవద్దు. మీ ముత్యాలు పందుల ముందు వేయవద్దు. అలా చేస్తే అవి వాటిని కాళ్ళతో తొక్కేసి, తరువాత మీమీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయేమో.
-
11 సోదరులారా, మీలో ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడకండి. తన సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేక తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావంటే ధర్మశాస్త్రానికి నువ్వు లోబడడం లేదని అర్థం. ధర్మశాస్త్రానికే న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్నావని అర్థం. 12 ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందీ తీర్పు తీర్చేదీ ఒక్కరే. దేవుడే! ఆయనే రక్షించడానికీ నాశనం చేయడానికీ సమర్ధుడు. ఇతరులకి తీర్పు తీర్చడానికి నువ్వెవరు?
-
34 మీ అప్పు తిరిగి తీరుస్తారు అనుకున్న వారికే మీరు అప్పిస్తూ ఉంటే దాంట్లో మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా మళ్లీ వసూలు చేసుకోవచ్చనుకుని పాపాత్ములకే అప్పులిస్తూ ఉంటారు కదా.
35 మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు. 36 మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి.
37 ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు ఎవరూ మీకు తీర్పు తీర్చరు. ఎవరి మీదా నేరారోపణ చేయవద్దు. అప్పుడు ఎవరూ మీ మీద నేరం మోపరు. ఇతరులను క్షమించండి. అప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది.
38 ఇవ్వండి. అప్పుడు మీకూ ఇస్తారు. అప్పుడు మనుషులు మీకు అదిమి, కుదించి పొంగి పొర్లి పోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకూ కొలవడం జరుగుతుంది.”
-
24 బయటకు కనిపించే దాన్ని బట్టి కాక న్యాయసమ్మతంగా నిర్ణయం చేయండి” అన్నాడు.
-
1 కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే నీవు ఎవరివైనా సరే, నిన్ను నీవు సమర్ధించుకోలేవు. దేని విషయంలో ఎదుటి వాడికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే దోషివని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నీవు ఏ పనుల విషయంలో తీర్పు తీరుస్తున్నావో వాటినే నీవు కూడా చేస్తున్నావు కదా?
2 ఆ పనులు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైనదే అని మనకు తెలుసు. 3 ఆ పనులు చేసే వారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న ఓ మనిషీ, దేవుని తీర్పు నీవెలా తప్పించుకుంటావు? 4 దేవుని కటాక్షం నిన్ను పశ్చాత్తాప పడేందుకు ప్రేరేపిస్తున్నదని తెలియక ఆయన మంచితనం అనే ఐశ్వర్యాన్నీ సహనాన్నీ దీర్ఘశాంతాన్నీ తోసిపుచ్చుతావా?
5 నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు.
-
9 వ్యభిచారులతో సహవాసం చేయవద్దని నా ఉత్తరంలో మీకు రాశాను. 10 అయితే ఈ లోకానికి చెందిన వ్యభిచారులు, దురాశపరులు, దోచుకునే వారు, విగ్రహాలను పూజించేవారు ఇలాటి వారితో ఏ మాత్రం సహవాసం చేయవద్దని కాదు. అలా ఉండాలంటే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వస్తుంది.
11 ఇప్పుడు నేను మీకు రాసేదేమంటే, క్రీస్తులో సోదరుడు లేక సోదరి అని పిలిపించుకొనే వారెవరైనా సరే, వ్యభిచారులూ దురాశపరులూ విగ్రహాలను పూజించేవారూ దూషించేవారూ తాగుబోతులూ దోచుకునే వారూ అయి ఉంటే, అలాటి వారితో సహవాసం చేయకూడదు. కనీసం వారితో కలిసి భోజనం చేయకూడదు. 12 సంఘానికి బయట ఉన్నవారికి నేనెందుకు తీర్పు తీర్చాలి? వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. 13 లోపలి వారికి తీర్పరులు మీరే కదా! కాబట్టి ఆ దుష్టుణ్ణి మీలో నుండి తొలగించండి.
-
1 మీలో ఒకరితో ఒకరికి వివాదం ఏమైనా ఉంటే అతడు పరిశుద్ధుల ఎదుట కాకుండా అవిశ్వాసి అయిన న్యాయాధిపతి ఎదుట వాదించడానికి పూనుకుంటాడా? 2 పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలియదా? మీరు ఈ లోకానికి తీర్పు తీర్చవలసి ఉండగా, చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకొనే సామర్ధ్యం మీకు లేదా? 3 మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు మరి ఈ లోక సంబంధమైన విషయాలను గూర్చి మరి బాగా తీర్పు తీర్చవచ్చు గదా?
4 కాబట్టి ఈ లోక సంబంధమైన వివాదాలు మీకు కలిగినపుడు వాటిని పరిష్కరించడానికి సంఘంలో ఎలాటి స్థానం లేని వారి దగ్గరికి వెళ్తారా? 5 మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను, తన సోదరీసోదరుల మధ్య వివాదం పరిష్కరించగలిగే బుద్ధిమంతుడు మీలో ఎవరూ లేరా? 6 అయితే ఒక సోదరుడు మరొక సోదరుని మీద వ్యాజ్యెమాడుతున్నాడు. అది కూడా అవిశ్వాసి అయిన న్యాయాధికారి ఎదుట!
-
1 సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. 2 ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.
-
15 “ఇంకో విషయం. నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే. 16 అతడు వినకపోతే, ‘ప్రతి విషయమూ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి.’ కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. 17 అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి. అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా, పన్ను వసూలుదారుడుగా పరిగణించు.
18 “నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో, దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు. 19 ఇంకో విషయం, దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు.
20 “ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను.”
-
10 అయితే నీ సోదరునికి ఎందుకు తీర్పు తీరుస్తున్నావ్? నీ సోదరుణ్ణి ఎందుకు తీసిపారేస్తున్నావ్? మనమంతా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం.
11 “నిశ్చయంగా జీవిస్తున్న నేను చెప్పే దేమిటంటే, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది.
ప్రతి నాలుకా దేవుని స్తుతిస్తుంది అని ప్రభువు చెబుతున్నాడు”
అని రాసి ఉంది. 12 కాబట్టి మనలో ప్రతి ఒక్కడూ తన గురించి దేవునికి లెక్క అప్పగించ వలసి ఉంది.
13 కాబట్టి ఇకమీదట మనం ఒకరికి ఒకరం తీర్పు తీర్చ వద్దు. దానికి ప్రతిగా, మన సోదరునికి అడ్డురాయిలాగా ఆటంకంగా ఉండకూడదని తీర్మానించుకుందాం.
-
16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.
18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు. 19 ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. 20 దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు.
21 అయితే సత్యాన్ని అనుసరించే వాడు తన పనులు మరింత స్పష్టంగా కనిపించడానికీ దేవుని పట్ల విధేయతలో అవి జరిగాయని వెల్లడి చేయడానికీ వెలుగు దగ్గరికి వస్తాడు.”
-
3 అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. వారు ఆమెను వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు. ఆమెను అందరి మధ్య నిలబెట్టారు.
4 వారు ఆయనతో, “బోధకా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. 5 ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు కదా! నువ్వేమంటావ్?” అని అడిగారు. 6 ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ ఇలా అడిగారు. అయితే యేసు విననట్టు తన వేలితో నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. 7 వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే ఉన్నారు. దాంతో ఆయన తల ఎత్తి చూసి, “మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు” అని వారితో చెప్పి
-
15 “అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకుని మీ దగ్గరికి వస్తారు. కాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 16 వారి ఫలాలను బట్టి వారిని తెలుసు కోవచ్చు. ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరపండ్లు గానీ కోస్తారా? 17 అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది. 18 మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు. 19 మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు. 20 ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు.
-
3 మీరు గానీ, ఇతరులు గానీ నాకు తీర్పు తీర్చడమనేది నాకు చాలా చిన్న విషయం. నన్ను నేనే తీర్పు తీర్చుకోను. 4 నాలో నాకు ఏ దోషమూ కనిపించదు. అంత మాత్రం చేత నేను నీతిమంతుడిని అని కాదు. అయితే, ప్రభువే నాకు తీర్పు తీర్చేవాడు. 5 కాబట్టి ఆ కాలం రాకముందే, అంటే ప్రభువు వచ్చేంత వరకూ, దేనిని గూర్చీ తీర్పు తీర్చవద్దు. ఆయన చీకటిలో ఉన్న రహస్యాలను వెలుగులోకి తెచ్చి మనుషుల అంతరంగంలో ఉన్న ఉద్దేశ్యాలను బట్టబయలు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ తగిన ప్రశంస దేవుని నుండి కలుగుతుంది.
-
12 దేవుడు మనకు ఉచితంగా దయచేసిన వాటిని తెలుసుకోవడం కోసం మనం లౌకికాత్మను కాక దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందాము. 13 వాటిని మేము మానవ జ్ఞానం నేర్పగలిగే మాటలతో గాక ఆత్మసంబంధమైన విషయాలను ఆత్మసంబంధమైన వాటితో సరి చూసుకుంటూ, ఆత్మ నేర్పే మాటలతోనే బోధిస్తున్నాం.
14 సహజ సిద్ధమైన మనిషి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ఎందుకంటే అవి అతనికి తెలివితక్కువగా కనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగానే వివేచించగలం. కాబట్టి అతడు వాటిని గ్రహించలేడు. 15 ఆత్మ సంబంధి అన్నిటినీ సరిగా అంచనా వేయగలడు గాని అతణ్ణి ఎవరూ సరిగా అంచనా వేయలేరు. 16 ప్రభువు మనసు గ్రహించి ఆయనకు ఎవరు ఉపదేశించ గలరు? మనకైతే క్రీస్తు మనసు ఉంది.
-
3 తినేవాడు తినని వాణ్ణి తక్కువగా చూడకూడదు. తినని వాడు తినేవాడిపై నిందారోపణ చేయకూడదు. ఎందుకంటే దేవుడు అతణ్ణి అంగీకరించాడు. 4 వేరొకరి సేవకుని విషయంలో న్యాయం చెప్పడానికి నువ్వెవరివి? అతడు నిలబడినా, పడిపోయినా అది అతని యజమాని బాధ్యత. కాని అతడు నిలబడతాడు. ప్రభువు అతణ్ణి నిలబెట్టడానికి శక్తి గలవాడు.
-
1 మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట గదా. ఇలాటి వ్యభిచారం యూదేతరుల్లో సైతం కనిపించదు.
2 ఇలా ఉండి కూడా మీరు విర్రవీగుతున్నారు. నిజానికి ఈ విషయమై మీరు విలపించాలి గదా. ఇలాటి పని చేసిన వాణ్ణి మీలో నుండి తప్పక వెలివేయాలి. 3 నేను శరీరరీతిగా మీకు దూరంగా ఉన్నప్పటికీ ఆత్మరీతిగా మీతో కూడ ఉన్నట్టుగానే ఆ పని చేసినవాడి విషయంలో ఇప్పటికే తీర్పు తీర్చాను. 4 ఎలాగంటే, ప్రభు యేసు నామంలో మీరు సమకూడినప్పుడు ప్రభు యేసు శక్తి ద్వారా నేను నా ఆత్మలో మీతో ఉండగా, 5 ప్రభువు వచ్చే రోజున అతని ఆత్మకు విమోచన కలగడం కోసం అతని భౌతిక శరీరం నశించేలా అలాటి వాణ్ణి సైతానుకు అప్పగించండి.
-
7 అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. “అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు.”
-
9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10 “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11 పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.
14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.
-
15 మీరు శరీర సంబంధంగా తీర్పు తీరుస్తారు. నేను ఎవరికీ తీర్పు తీర్చను. 16 అయినా నేను ఒంటరిని కాదు. నేను నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నేను తీర్పు తీర్చినా అది సత్యమే అవుతుంది.
-
15 అన్యాయ తీర్పు తీర్చకూడదు.
బీదవాడని పక్షపాతం చూపకూడదు.
గొప్పవాడని అభిమానం చూపకూడదు.
నీ పొరుగువాడి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి.
-
12 నేనొక్కడినే మీ కష్టాన్ని, భారాన్ని, మీ వివాదాలను ఎలా తీర్చగలను? 13 జ్ఞానం, తెలివి కలిగి మీ గోత్రాల్లో పేరు పొందిన మనుషులను ఎన్నుకోండి. వారిని మీకు నాయకులుగా నియమిస్తాను” అని చెప్పాను.
14 అప్పుడు మీరు “నీ మాట ప్రకారం చేయడం మంచిది” అని నాకు జవాబిచ్చారు. 15 కాబట్టి నేను మీ గోత్రాల్లో పేరు పొంది, తెలివీ జ్ఞానమూ కలిగిన వారిని పిలిచి, మీ గోత్రాలకు వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున వారిని మీ మీద న్యాయాధికారులుగా నియమించాను.
16 అప్పుడు నేను వారితో “మీ సోదరుల వివాదాలు తీర్చి, ప్రతివాడికీ వాడి సోదరుడికీ వాడి దగ్గర ఉన్న పరదేశికీ న్యాయం ప్రకారం తీర్పు తీర్చండి. 17 అలా చేసేటప్పుడు తక్కువ, ఎక్కువ అనే పక్షపాతం లేకుండా వినాలి. న్యాయపు తీర్పు దేవునిది కాబట్టి మీరు మనుషుల ముఖం చూసి భయపడవద్దు. మీకు కష్టమైన వివాదాన్ని నా దగ్గరికి తీసుకు రండి. దాన్ని నేను విచారిస్తాను” అని ఆజ్ఞాపించాను.
-
5 ఒకడు నీతిమంతుడుగా ఉండి, నీతిన్యాయాలు జరిగించేవాడై ఉండి, 6-7 పర్వతాల మీద భోజనాలు చెయ్యకుండా, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహాలవైపు చూడకుండా, తన పొరుగువాడి భార్యను చెరపకుండా, ఋతుస్రావంలో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవకుండా, అప్పు తీసుకున్నవాడికి అతని తాకట్టు వస్తువు తిరిగి ఇచ్చేస్తూ, బలవంతంగా ఎవరికీ నష్టం చెయ్యక, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చి, బట్టలు లేని వాడికి బట్టలిచ్చి, 8 వడ్డీకి అప్పు ఇవ్వకుండా, అధిక లాభం తీసుకోకుండా, అన్యాయం చెయ్యకుండా, పక్షపాతం లేకుండా న్యాయం తీర్చి, 9 నమ్మకంగా నా ఆదేశాలు పాటిస్తూ, నా శాసనాల ప్రకారం నడుస్తూ ఉంటే, వాడే నీతిమంతుడు. అతడు నిజంగా బ్రతుకుతాడు” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
-
9 సోదరులారా, ఒకడి మీద ఒకడు సణుక్కోకండి, అప్పుడు మీ మీదికి తీర్పు రాదు. ఇదుగో న్యాయాధిపతి వాకిట్లోకి వచ్చేశాడు.
-
17 సోదరులారా, నేను వేడుకునేదేమంటే, మీరు నేర్చుకొన్న బోధకు వ్యతిరేకంగా విభజనలు, ఆటంకాలు కలిగించే వారిని కనిపెట్టి చూడండి. వారికి దూరంగా తొలగిపొండి. 18 అలాటివారు ప్రభు యేసు క్రీస్తుకు కాదు, తమ కడుపుకే దాసులు. వారు వినసొంపైన మాటలతో, ఇచ్చకాలతో అమాయకులను మోసం చేస్తారు.
-
21 ఎవరైనా ఘనహీనమైన వాటిలో చేరకుండా తనను శుద్ధి చేసుకుంటే వాడు పవిత్రమై, యజమాని వాడుకోవడానికి అర్హుడై అన్ని మంచి కార్యాలకూ సిద్ధపడి, ఘనత కోసమైన గిన్నెగా ఉంటాడు.
22 నువ్వు యువకులకు కలిగే చెడుకోరికలను విడిచి పారిపో. పవిత్ర హృదయాలతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కలిసి నీతినీ విశ్వాసాన్నీ ప్రేమనూ శాంతి సమాధానాలనూ సంపాదించుకోవడానికి కృషి చెయ్యి. 23 బుద్ధిహీనమైన, మూఢత్వంతో కూడిన తర్కాలు జగడాలకు కారణమౌతాయని గ్రహించి వాటిని వదిలెయ్యి.
24 ప్రభువు సేవకుడు పోట్లాటలకు దిగకూడదు. అందరి మీదా దయ చూపాలి. బోధనా సామర్ధ్యం కలిగి, సహించేవాడై ఉండాలి. 25-26 దేవునికి ఎదురు చెప్పేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే సాతాను తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు. వాడి ఉరి నుండి తప్పించుకుని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.
-
16-17 దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.
-
22 తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు కానీ అందరికీ తీర్పు తీర్చే సమస్త అధికారాన్ని ఆయన కుమారుడికి ఇచ్చాడు.
-
51 “ఒక వ్యక్తి చెప్పే మాట వినకుండా అతడేం చేశాడో తెలుసుకోకుండా మన ధర్మశాస్త్రం అతడికి తీర్పు తీరుస్తుందా?” అన్నాడు.
-
1 విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్న వారిని చేరదీయండి గానీ వారి అనుమానాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు.
-
31 అయితే మనలను మనం పరిశీలించుకుంటూ ఉంటే మన పైకి తీర్పు రాదు. 32 మనం తీర్పు పొందినా లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ప్రభువు మనలను శిక్షించి సరిదిద్దుతున్నాడు.
-
26 సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తరువాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు. 27 కానీ భయంతో తీర్పు కోసం ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది. అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్ని ఉంటుంది. 28 ఎవడైనా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే ఇద్దరో ముగ్గురో చెప్పిన సాక్ష్యం మీద వాడిని ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా చంపుతారు.
29 ఇలా ఉంటే మరి దేవుని కుమారుణ్ణి తమ కాళ్ళ కింద తొక్కివేసి, తనను శుద్ధి చేసిన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి, కృపాభరితమైన ఆత్మను అవమానించిన వాడికి మరి ఇంకెంత ఎక్కువ శిక్ష పడుతుందో ఆలోచించండి. 30 “ప్రతీకారం తీర్చడం నా పని. నేనే తిరిగి చెల్లిస్తాను” అనీ, అలాగే “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అనీ చెప్పిన వాడు మనకు తెలుసు.
-
1 నా సహోదరులారా, మహిమ స్వరూపి అయిన మన ప్రభు యేసు క్రీస్తును విశ్వసించే వారుగా పక్షపాతం లేకుండా ఉండండి.
2 ఎవరైనా బంగారు ఉంగరాలు పెట్టుకుని, ఖరీదైన బట్టలు వేసుకున్న వాడు, మాసిన బట్టలు వేసుకొన్న పేదవాడొకడు, వీరిద్దరూ మీ సమావేశానికి వచ్చారనుకోండి. 3 మీ దృష్టి ఖరీదైన బట్టలు వేసుకున్నవాడి మీద ఉంచి, “దయచేసి ఈ మంచి చోట కూర్చోండి,” అని చెప్పి, పేదవానితో, “నువ్వు అక్కడ నిలబడు,” లేదా, “నా కాళ్ళ దగ్గర కూర్చో,” అంటే, 4 మీరు చెడు ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని తేడా చూపుతున్నట్టే కదా?
-
1 ప్రియులారా, లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మనూ నమ్మకండి. ఆ ఆత్మలు దేవునికి సంబంధించినవో, కావో, పరీక్షించి చూడండి.
Shows Read in context, Share and Copy.