26 Bible Verses About Infidelity

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Infidelity
  1. 27 “‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా. 28 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు. 29 నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. 30 నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.

  2. 4 అందుకాయన, “సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడనీ, 5 ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏకశరీరంగా అవుతారు’ అని చెప్పాడనీ మీరు చదవలేదా? 6 కాబట్టి వారింక ఇద్దరు కాదు, ఏక శరీరమే. కాబట్టి దేవుడు జత పరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు” అని జవాబిచ్చాడు.

    7 అందుకు వారు, “అలాటప్పుడు ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే ఆమెకు విడాకుల పత్రిక రాసివ్వాలని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని అడిగారు. 8 అప్పుడాయన, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీ భార్యలను విడిచిపెట్టవచ్చని మోషే చెప్పాడు గానీ, ప్రారంభం నుండీ అలా జరగలేదు. 9 భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను” అని వారితో అన్నాడు.

  3. 14 వ్యభిచారం చెయ్యకూడదు.

  4. 6 యోషీయా రాజు పాలన సమయంలో యెహోవా నాకిలా చెప్పాడు.

    “ఇశ్రాయేలు ఎంత అపనమ్మకం చూపిందో చూశావా? ఆమె ఎత్తయిన ప్రతి కొండమీదికీ పచ్చని ప్రతి చెట్టు కిందికీ వెళ్ళి అక్కడ వ్యభిచారం చేస్తున్నది.

    7 ఆమె వాటన్నిటినీ చేసినా ఆమెను నా దగ్గరికి తిరిగి రమ్మన్నాను కానీ ఆమె రాలేదు. ద్రోహి అయిన ఆమె సోదరి అయిన యూదా దాన్ని చూసింది.

    8 ఇశ్రాయేలు వ్యభిచారం చేసినందుకే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు విడాకులిచ్చి పంపేశాను. విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా దాన్ని చూసి ఆమె కూడా భయం లేకుండా వ్యభిచారం చేస్తూ ఉంది.

    9 రాళ్ళతో, మొద్దులతో విగ్రహాలను చేసుకుని, ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రపరచింది.

  5. 32 వ్యభిచారం చేసేవాడు కేవలం బుద్ధి లేనివాడు. ఆ పని చేసేవాడు తన సొంత నాశనం కోరుకున్నట్టే.

    33 వాడు గాయాలకు, అవమానాలకు గురి అవుతాడు. వాడికి కలిగే అవమానం ఎప్పటికీ తొలగిపోదు.

    34 భర్తకు వచ్చే రోషం తీవ్రమైన కోపంతో కూడి ఉంటుంది. ప్రతీకారం చేసే సమయంలో అతడు కనికరం చూపించడు.

    35 ప్రాయశ్చిత్తంగా నువ్వు ఇచ్చే దేనినీ అతడు లక్ష్యపెట్టడు. ఎన్ని విలువైన కానుకలు ఇచ్చినా అతడు తీసుకోడు.

  6. 6 కాని, సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు. 7 అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి జీవిస్తాడు. 8 వారిద్దరు ఐక్యమై ఒకే శరీరంగా మారిపోతారు. కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాకుండా ఒకరిలా జీవిస్తారు. 9 కాబట్టి దేవుడు కలిపిన వారిని ఏ మనిషీ వేరు చేయకూడదు” అని వారితో చెప్పాడు.

    10 అందరూ ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ సంగతి గురించి వివరంగా చెప్పమని కోరారు. 11 యేసు, “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే. 12 అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి” అని వారితో అన్నాడు.

  7. 4 వివాహం అందరూ గౌరవించేదిగా దాంపత్యం పవిత్రంగా ఉండనివ్వండి. లైంగిక అవినీతిపరులనూ, వ్యభిచారులనూ దేవుడు శిక్షిస్తాడు.

  8. 24 వ్యభిచారిణి దగ్గరికి వెళ్ళకుండా, చెడ్డ స్త్రీ చెప్పే మోసపు మాటలకు లోబడకుండా అవి నిన్ను కాపాడతాయి.

    25 దాని అందం చూసి నీ హృదయంలో మోహించకు. అది తన కనుసైగలతో నిన్ను లోబరుచుకోవాలని చూస్తే దాని వల్లో పడవద్దు.

    26 వేశ్యలతో సాంగత్యం చేసేవాళ్ళకు కేవలం రొట్టెముక్క మాత్రమే మిగులుతుంది. వ్యభిచారి నీ విలువైన ప్రాణాన్ని వేటాడుతుంది.

    27 ఒకడు తన ఒడిలో నిప్పు ఉంచుకుంటే వాడి బట్టలు కాలిపోకుండా ఉంటాయా?

    28 ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి కాళ్ళు కాలకుండా ఉంటాయా?

    29 తన పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు ఆ విధంగానే నాశనం అవుతాడు. ఆమెను తాకిన వాడికి శిక్ష తప్పదు.

  9. 2 వివాహిత అయిన స్త్రీ, తన భర్త జీవించి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోతే వివాహ సంబంధమైన ధర్మశాస్త్ర నియమం నుండి ఆమె స్వేచ్ఛ పొందుతుంది. 3 కాబట్టి భర్త జీవించి ఉండగా ఆమె వేరే పురుషుణ్ణి కలిస్తే ఆమె వ్యభిచారి అవుతుంది గాని, భర్త చనిపోతే ఆమె ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛ పొందింది కాబట్టి వేరొక పురుషుణ్ణి పెళ్ళి చేసికొన్నప్పటికీ ఆమె వ్యభిచారిణి కాదు.

  10. 9 అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతికి పాలుపడే వారూ, విగ్రహాలను పూజించేవారూ, మగ వేశ్యలు, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులూ, విపరీత సంపర్కం జరిపే వారూ, 10 దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    11 గతంలో మీలో కొంతమంది అలాటివారే. అయితే ప్రభు యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మ మిమ్మల్ని కడగడం ద్వారా పవిత్రులై దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు.

  11. 10 వేరొకడి భార్యతో వ్యభిచరించిన వాడికి, అంటే తన పొరుగు వాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్న వాడికి-ఆ వ్యభిచారికి, వ్యభిచారిణికి మరణశిక్ష విధించాలి.

    11 తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం కోసం ఆమెతో పండుకున్న వాడు తన తండ్రి గౌరవాన్ని భంగపరిచాడు. వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. వారు తమ శిక్షకు తామే కారకులు.

    12 ఒకడు తన కోడలితో లైంగిక సంబంధం పెట్టుకుంటే వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. వారు వరసలు తప్పారు. వారు దోషులు. మరణ శిక్షకు పాత్రులు.

  12. 13 మళ్ళీ రెండోసారి కూడా మీరు అలాగే చేస్తారు. అయితే ఆయన మీ నైవేద్యాన్ని స్వీకరించడు. మీరు అర్పించే అర్పణలు ఆయన లక్ష్యపెట్టడు. అప్పుడు యెహోవా బలిపీఠాన్ని ఏడ్పుతో, కన్నీళ్లతో, రోదనతో మీరు తడుపుతారు.

    14 ఇలా ఎందుకు జరుగుతుంది? అని మీరు అడుగుతారు. యవ్వన కాలంలో నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయంగా విడిచిపెట్టిన నీ భార్య పక్షంగా యెహోవా సాక్షిగా నిలబడతాడు. నీ భార్య నీ సహకారి కాదా, నీవు చేసిన నిబంధన ప్రకారం భార్య కాదా. 15 ఆయన మీ ఇద్దరినీ ఒక్కటిగా చేశాడు. శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా. అలా ఒకటిగా చేయడం దేనికి? దేవుని మూలంగా వారికి సంతతి కలగాలని. అందువల్ల మిమ్మల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోండి. యవ్వనంలో పెళ్లి చేసుకున్న మీ భార్యలకు ద్రోహం చేసి విశ్వాస ఘాతకులుగా మారకండి.

    16 ఒకడు తన భార్యను విడిచి పెట్టడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఒకడు తన బట్టలతో బాటు బలాత్కారంతో తనను కప్పుకోవడం నాకు అసహ్యమని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నాడు. కనుక మీ హృదయాలను కాపాడుకోండి. విశ్వాస ఘాతకులుగా ఉండకండి.

  13. 3 అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. వారు ఆమెను వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు. ఆమెను అందరి మధ్య నిలబెట్టారు.

    4 వారు ఆయనతో, “బోధకా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. 5 ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు కదా! నువ్వేమంటావ్?” అని అడిగారు.

  14. 18 లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.

  15. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

  16. 21 నమ్మదగిన ఈ పట్టణం ఒక వేశ్యలా ఎలా మారింది!

    అది న్యాయంతో నిండి ఉండేది.

    నీతి దానిలో నివాసం ఉండేది.

    ఇప్పుడైతే దాని నిండా నరహంతకులు నివాసం ఉంటున్నారు.

    22 నీ వెండి మలినమైపోయింది.

    నీ ద్రాక్షారసం నీళ్లతో పలచబడి పోయింది.

    23 నీ అధికారులు ద్రోహులు.

    వాళ్ళు దొంగలతో సావాసం చేస్తారు.

    అందరూ లంచం ఆశిస్తారు.

    చెల్లింపుల వెంటబడతారు.

    తండ్రి లేని వాళ్ళ పక్షంగా ఉండరు.

    వితంతువుల న్యాయమైన అభ్యర్ధన వాళ్ళు పట్టించుకోరు.

  17. 1 ఇప్పుడు మీరు నాకు రాసిన వాటి సంగతి. పురుషుడు తన భార్యను ముట్టుకోకుండా ఉండవలసిన సమయాలు కొన్ని ఉన్నాయి. 2 అయితే లైంగిక దుర్నీతి క్రియలు జరుగుతున్న కారణం చేత ప్రతి పురుషుడికీ తనకంటూ భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి.

    3 భర్త తన భార్య పట్లా, భార్య తన భర్త పట్లా వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి. 4 భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు. 5 ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి.

  18. 13 ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.

  19. 22 ఎవడైనా మరొకడి భార్యతో శారీరకంగా కలుస్తూ పట్టుబడితే వారిద్దరినీ, అంటే ఆ స్త్రీతో శారీరకంగా కలిసిన పురుషుడినీ, స్త్రీనీ చంపాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని ఇశ్రాయేలులో నుంచి రూపుమాపుతారు.

  20. 32 కులటా! నువ్వు నీ భర్తకు బదులుగా పరాయివాళ్ళను అంగీకరించావు!

  21. 18 “భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.

  22. 17 నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది. 18 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? 19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి. 20 మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” అని వారితో చెప్పాడు.

  23. 20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22 వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”

  24. 15 మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తు అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా జరగకూడదు. 16 వేశ్యతో కలిసేవాడు దానితో ఏక శరీరం అవుతాడని మీకు తెలియదా? “వారిద్దరూ ఒకే శరీరం అవుతారు” అని లేఖనాలు చెబుతున్నాయి కదా?

  25. 20 ఒక బానిస పిల్లలు ఒకడితో నిశ్చితార్థం జరిగాక ఆమెను వెల ఇచ్చి విడిపించకుండా, లేదా ఆమెకు విముక్తి కలగక ముందు ఎవరైనా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అలాటి వాణ్ణి శిక్షించాలి. ఆమెకు విడుదల కలగలేదు గనక వారికి మరణశిక్ష విధించ కూడదు. 21 అతడు అపరాధ పరిహార బలిని, అంటే అపరాధ పరిహార బలిగా ఒక పొట్టేలును ప్రత్యక్ష గుడార ద్వారానికి యెహోవా సన్నిధికి తీసుకు రావాలి. 22 అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపాన్నిబట్టి పాప పరిహార బలిగా ఆ పొట్టేలు మూలంగా యెహోవా సన్నిధిలో అతని కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ విధంగా అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగుతుంది.

  26. 12 నువ్వు వెళ్లి ఉత్తరం వైపుకు ఇలా ప్రకటించు, విశ్వాసం లేని ఇశ్రాయేలూ, తిరిగి రా. మీ మీద నేను కోపపడను. నేను దయగలవాణ్ణి కాబట్టి శాశ్వతంగా కోపించేవాణ్ణి కాను.” ఇదే యెహోవా వాక్కు.

    13 నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ, నా మాట తోసిపుచ్చి ప్రతి పచ్చని చెట్టు కిందా అన్యులతో వ్యభిచరించావు.

    నువ్వు నీ దోషాన్ని ఒప్పుకోవాలి. ఇదే యెహోవా వాక్కు.

    14 చెడిపోయిన పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానిని. ఇదే యెహోవా వాక్కు

    ఒక్కొక్క ఊరిలోనుండి ఒకణ్ణి, ఒక్కొక్క వంశం లోనుండి ఇద్దరినీ, సీయోనుకు తీసుకొస్తాను.