64 Bible Verses About Dating

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Dating
  1. 14 అవిశ్వాసులతో మీరు జతగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి? 15 క్రీస్తుకు సాతానుతో ఒప్పందమేమిటి? అవిశ్వాసితో విశ్వాసికి భాగమేమిటి? 16 దేవుని ఆలయానికి విగ్రహాలతో సంబంధం ఏమిటి? మనం జీవం గల దేవుని ఆలయం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు.

    “నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడుగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”

    17 కాబట్టి, “మీరు వారిలో నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు”

    అని ప్రభువు చెబుతున్నాడు.

    18 “నేను మిమ్మల్ని చేర్చుకుంటాను,

    మీకు తండ్రిగా ఉంటాను. మీరు నాకు కొడుకులుగా కూతురులుగా ఉంటారు”

    అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు.

  2. 18 లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.

    19 మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. 20 దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.

  3. 18 దేవుడైన యెహోవా “మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను” అనుకున్నాడు.

  4. 3 మీరు పరిశుద్ధులు కావడం, జారత్వానికి దూరంగా ఉండడం దేవుని ఉద్దేశం.

    4 మీలో ప్రతివాడూ దేవుణ్ణి ఎరగని ఇతరుల్లాగా కామవికారంతో కాకుండా 5 పరిశుద్ధతలోనూ ఘనతలోనూ తన పాత్రను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండటమే దేవుని ఉద్దేశం. 6 ఈ విషయాన్ని ఎవరూ మీరకూడదు. తన సోదరుణ్ణి మోసం చేయకూడదు. ఎందుకంటే మేము ఇంతకు ముందు మీకు చెప్పి హెచ్చరించినట్టే ఈ విషయాల్లో ప్రభువు తప్పక ప్రతీకారం చేస్తాడు. 7 పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు.

    8 కాబట్టి ఈ ఉపదేశాన్ని నిరాకరించేవాడు మనిషిని కాక, మీకు తన పరిశుద్ధాత్మను ప్రసాదించిన దేవుణ్ణే నిరాకరిస్తున్నాడు.

  5. 27 “‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా. 28 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు. 29 నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. 30 నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.

    31 “‘తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి’ అని చెప్పడం కూడా మీరు విన్నారు. 32 నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.

  6. 7 ఏది ఏమైనా, మనుషులందరూ నాలాగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కడికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకడికి ఒక వరం, ఇంకొకడికి ఇంకొక వరం ఇచ్చాడు.

    8 నాలాగా ఉండడం వారికి మంచిదని అవివాహితులతో, వితంతువులతో చెబుతున్నాను. 9 అయితే కోరికలను నిగ్రహించుకోలేకపోతే పెండ్లి చేసుకోవచ్చు. విరహాగ్నితో వేగి పోవడం కంటే పెండ్లి చేసుకోవడం మంచిది.

  7. 23 ఆదాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం.

    మనిషిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి” అన్నాడు.

    24 ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు.

  8. 4 వివాహం అందరూ గౌరవించేదిగా దాంపత్యం పవిత్రంగా ఉండనివ్వండి. లైంగిక అవినీతిపరులనూ, వ్యభిచారులనూ దేవుడు శిక్షిస్తాడు.

  9. 1 ఇప్పుడు మీరు నాకు రాసిన వాటి సంగతి. పురుషుడు తన భార్యను ముట్టుకోకుండా ఉండవలసిన సమయాలు కొన్ని ఉన్నాయి. 2 అయితే లైంగిక దుర్నీతి క్రియలు జరుగుతున్న కారణం చేత ప్రతి పురుషుడికీ తనకంటూ భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి.

    3 భర్త తన భార్య పట్లా, భార్య తన భర్త పట్లా వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి. 4 భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు. 5 ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి.

  10. 22 నువ్వు యువకులకు కలిగే చెడుకోరికలను విడిచి పారిపో. పవిత్ర హృదయాలతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కలిసి నీతినీ విశ్వాసాన్నీ ప్రేమనూ శాంతి సమాధానాలనూ సంపాదించుకోవడానికి కృషి చెయ్యి.

  11. 4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.

    5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.

    6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.

    7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.

    8 ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.

  12. 21 క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి. 22 స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి. 23 క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు. 24 సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.

    25 పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి. 26 సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి, 27 దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.

  13. 4 అందుకాయన, “సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడనీ, 5 ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏకశరీరంగా అవుతారు’ అని చెప్పాడనీ మీరు చదవలేదా? 6 కాబట్టి వారింక ఇద్దరు కాదు, ఏక శరీరమే. కాబట్టి దేవుడు జత పరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు” అని జవాబిచ్చాడు.

  14. 3 యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు.

    4 తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.

  15. 9 మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి.

  16. 33 మోసపోకండి. “దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుంది.”

  17. 33 చివరిగా నేను చెప్పేది, మీలో ప్రతి పురుషుడూ తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.

  18. 1 భార్యలుగా ఉన్న మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులయినా సరే, మాటలతో కాకుండా, వారి భార్యల ప్రవర్తనే వారిని ప్రభువు కోసం సంపాదిస్తుంది. 2 ఎందుకంటే గౌరవ ప్రదమైన మీ పవిత్ర ప్రవర్తన వారు గమనిస్తారు.

    3 జడలు అల్లుకోవడం, బంగారు ఆభరణాలు, ఖరీదైన బట్టలు అనే బాహ్య అలంకారాలు మీకు వద్దు. 4 వాటికి బదులు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. అలాంటి అలంకారం నాశనం కాదు. అది దేవుని దృష్టికి చాలా విలువైనది. 5 పూర్వకాలంలో దేవుని మీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు ఈ విధంగా అలంకరించుకున్నారు. వారు తమ భర్తలకు లోబడి ఉంటూ తమ్మును తాము అలంకరించుకున్నారు. 6 ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది. ఏ భయాలకూ లొంగకుండా, మంచి చేస్తూ ఉంటే మీరు ఆమె పిల్లలు.

  19. 13 ఆహార పదార్ధాలు కడుపు కోసమూ, కడుపు ఆహార పదార్ధాల కోసమూ ఉన్నాయి. కానీ దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. శరీరం ఉన్నది లైంగిక దుర్నీతి కోసం కాదు, ప్రభువు కోసమే. ప్రభువే శరీర పోషణ సమకూరుస్తాడు.

  20. 18 భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ఇది ప్రభువులో తగిన ప్రవర్తన.

    19 భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. వారితో కటువుగా ఉండవద్దు.

  21. 26 దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27 దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.

    28 దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు.

  22. దావీదు రాసిన కీర్తన, మస్కిల్. దైవధ్యానం.

    1 తాను చేసిన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు, తన పాపాలు పరిహారం అయినవాడు ధన్యజీవి.

    2 యెహోవా నిర్దోషిగా పరిగణించిన వాడు, తన ఆత్మలో కపటమనేది లేనివాడు ధన్యజీవి.

    3 నేను నిశ్శబ్దంగా ఉండి రాత్రంతా మూల్గుతున్నాను. దాంతో నా ఎముకలు బలహీనమై పోతున్నాయి.

    4 పగలూ రాత్రీ నా మీద నీ చెయ్యి భారంగా ఉంది. వేసవిలో దుర్భిక్షంలా నా శక్తి అంతా హరించుకు పోయింది. సెలా.

    5 అప్పుడే నా పాపాన్ని నీ ఎదుట ఒప్పుకున్నాను. నా దోషాన్ని ఇక నేను దాచిపెట్టుకోలేదు. నేను నా అతిక్రమాలను యెహోవా దగ్గర అంగీకరిస్తాను అనుకున్నాను. అప్పుడు నువ్వు నా పాపాలను క్షమించావు. సెలా.

    6 దీని కారణంగా భయభక్తులు కలిగిన వాడు నువ్వు దొరికే సమయంలో నీకు ప్రార్ధించాలి. అప్పుడు జల ప్రవాహాలు ఉప్పొంగినా అవి అతని దగ్గరకు రావు.

  23. 14 ఇల్లు, ధనం పూర్వికులనుండి వారసత్వంగా వస్తుంది. అయితే వివేకవతియైన ఇల్లాలిని ఇచ్చేది యెహోవాయే.

  24. 1 సొలొమోను రాసిన పరమగీతం.

    2 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

    నీ నోటితో నాకు ముద్దులు పెడితే ఎంత బాగుండు.

    నీ ప్రేమ ద్రాక్షారసం కంటే ఉత్తమం.

  25. 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  26. 13 పోకిరీ వినోదాలతో, తాగిన మత్తులో, లైంగిక దుర్నీతితో హద్దూ అదుపూ లేని కామంతో, కలహాలతో, అసూయలతో కాకుండా పగటి వెలుగులోలాగా మర్యాదగా నడుచుకుందాం.

  27. 1 వయసులో పెద్దవాణ్ణి కఠినంగా మందలించ వద్దు. అతనిని తండ్రిగా భావించి హెచ్చరించు. 2 యువకులను సోదరులుగా, వయసు పైబడిన స్త్రీలను తల్లులుగా, యువతులను సోదరీలుగా ఎంచి పూర్ణ పవిత్రతతో హెచ్చరించు.

  28. 63 ఆ సాయంత్రం ఇస్సాకు ధ్యానం చేయడానికి మైదానంలోకి వెళ్ళాడు. అక్కడ అతడు తలెత్తి చూసినప్పుడు ఒంటెలు వస్తూ ఉన్నాయి. 64 రిబ్కా కూడా ఇస్సాకును చూసింది. వెంటనే ఒంటె పైనుండి దిగింది. 65 “మనలను కలుసుకోడానికి మైదానం నుండి వస్తున్నఆ వ్యక్తి ఎవరు?” అని అబ్రాహాము సేవకుణ్ణి అడిగింది. దానికతడు “ఆయన నా యజమాని” అన్నాడు. వెంటనే ఆమె ముసుగు వేసుకుంది.

    66 అప్పుడు ఆ దాసుడు జరిగినదంతా ఇస్సాకుకు వివరించి చెప్పాడు. 67 అప్పుడు ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారం లోకి ఆమెను తీసుకు వెళ్ళాడు. అలా అతడు రిబ్కాను తన భార్యగా స్వీకరించాడు. అతడు ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి మరణం విషయమై ఆదరణ పొందాడు.

  29. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

    7 నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.

  30. 23 అన్నిటికంటే ముఖ్యంగా వాటిని నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. అప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి.

  31. 22 భార్య దొరికిన వాడికి మేలు దొరికింది. అతడు యెహోవా అనుగ్రహం పొందాడు.

  32. 31 కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి.

  33. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. 24 క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.

  34. 29 ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు. 30 మనం సంఘమనే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు.

    31 “ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు” 32 ఈ మాటల అర్థం గ్రహించడం కష్టం. అయితే నేను క్రీస్తును గూర్చీ సంఘం గూర్చీ చెబుతున్నాను.

  35. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి.

  36. 2 నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు. నా పాపం నుండి నన్ను పవిత్రపరచు.

    3 నా అతిక్రమాలేంటో నాకు తెలుసు. నేను చేసిన పాపం నా కళ్ళ ఎదుటే ఉంది.

    4 నీకు వ్యతిరేకంగా, కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతావు. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు.

  37. 24 కోపం అదుపులో ఉంచుకోలేని వాడితో స్నేహం చెయ్య వద్దు. క్రోధంతో రంకెలు వేసే వాడి దగ్గరికి వెళ్ల వద్దు.

  38. 7 (ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)

    యెరూషలేము ఆడపడుచులారా, పొలాల్లోని జింకల మీద, లేళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పండి.

    మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు.

  39. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు. 34 కాబట్టి రేపటి విషయం దిగులు పడవద్దు. దాని సంగతి అదే చూసుకుంటుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.

  40. 9 భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను” అని వారితో అన్నాడు.

  41. 9 అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతికి పాలుపడే వారూ, విగ్రహాలను పూజించేవారూ, మగ వేశ్యలు, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులూ, విపరీత సంపర్కం జరిపే వారూ, 10 దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    11 గతంలో మీలో కొంతమంది అలాటివారే. అయితే ప్రభు యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మ మిమ్మల్ని కడగడం ద్వారా పవిత్రులై దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు.

  42. 3 మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన.

  43. 5 కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి.

  44. 7 అలాగే భర్తలైన మీరు, జీవమనే బహుమానంలో మీ భార్యలు మీతో కూడా వాటాదారులని గ్రహించి, వారు అబలలని ఎరిగి గౌరవపూర్వకంగా వారితో కాపురం చేయండి. ఇలా చేస్తే మీ ప్రార్థనలకు ఆటంకం కలగదు.

  45. 20 యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు. అయినా అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి చాలా తక్కువ రోజులుగా అనిపించాయి.

  46. 1 నేను నా కన్నులతో ఒప్పందం చేసుకున్నాను గనక కన్యను కోరికతో ఎలా చూస్తాను?

  47. 4 ఒక నది ఉంది, దాని ప్రవాహాలు దేవుని పట్టణాన్ని, అత్యున్నత ప్రభువు మందిరపు పరిశుద్ధ స్థలాన్ని సంతోషపెడుతూ ఉన్నాయి.

    5 దేవుడు ఆ పట్టణం మధ్యలో ఉన్నాడు. దాన్ని ఎవ్వరూ కదిలించలేరు. దేవుడు ఆమెకు సహాయం చేస్తాడు. త్వరలో ఆయన సహాయం చేస్తాడు.

  48. 30 చక్కదనం మోసకరం. సౌందర్యం వ్యర్థం. యెహోవా పట్ల భయభక్తులు గల స్త్రీని అందరూ ప్రశంసిస్తారు.

  49. 19 ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు.

  50. 1 మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట గదా. ఇలాటి వ్యభిచారం యూదేతరుల్లో సైతం కనిపించదు.

  51. 11 ఇప్పుడు నేను మీకు రాసేదేమంటే, క్రీస్తులో సోదరుడు లేక సోదరి అని పిలిపించుకొనే వారెవరైనా సరే, వ్యభిచారులూ దురాశపరులూ విగ్రహాలను పూజించేవారూ దూషించేవారూ తాగుబోతులూ దోచుకునే వారూ అయి ఉంటే, అలాటి వారితో సహవాసం చేయకూడదు. కనీసం వారితో కలిసి భోజనం చేయకూడదు.

  52. 32 మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్ళి కానివాడు ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఆయన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు. 33 పెళ్ళయిన వాడు తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోకవిషయాల గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు. 34 అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. అదే విధంగా పెళ్ళయిన స్త్రీకీ, పెళ్ళికాని స్త్రీకీ తేడా ఉంది. కన్య శరీరంలో ఆత్మలో పవిత్రత కలిగి ఉండాలని ప్రభువు కార్యాలను గూర్చి శ్రద్ధ కలిగి ఉంటుంది. పెళ్ళైన స్త్రీ అయితే తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటుంది. 35 మీకు ఆటంకంగా ఉండాలని కాదు, మీ మంచి కోసమే చెబుతున్నాను. మీరు మంచి నడవడితో, ఇతర ధ్యాసలేమీ లేకుండా ప్రభువుపై దృష్టి ఉంచి ఆయన సేవ చేయాలని నా ఆశ.

    36 ఒకడు తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావిస్తే, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటం వల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావిస్తే, అతడు తన ఇష్ట ప్రకారం చేయవచ్చు. అతడు ఆమెను పెళ్ళి చేసుకోవచ్చు. అది పాపం కాదు.

  53. 3 ఆయన మీద ఇలాంటి ఆశాభావం నిలిపిన ప్రతి ఒక్కడూ, ఆయన పవిత్రుడై ఉన్న విధంగా తనను తాను పవిత్రం చేసుకుంటాడు.

  54. 14 వ్యభిచారం చెయ్యకూడదు.

  55. 22 స్త్రీతో లైంగిక సంబంధం ఉన్నట్టు పురుషునితో ఉండకూడదు. అది అసహ్యం.

  56. 17 తన హృదయం తొలగిపోకుండా అతడు ఎక్కువమంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. వెండి బంగారాలను అతడు తన కోసం ఎక్కువగా సంపాదించుకోకూడదు.

  57. 9 ఇద్దరు కష్టపడితే ఇద్దరికీ మంచి జరుగుతుంది.

    కాబట్టి ఒంటరిగా కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది.

    10 ఒకడు కింద పడినా మరొకడు లేపుతాడు.

    అయితే ఒక్కడే ఉంటే అతడు పడినప్పుడు లేపేవాడు లేనందువలన అతనికి కష్టమే మిగులుతుంది.

    11 ఇద్దరు కలిసి పండుకొంటే వారికి వెచ్చగా ఉంటుంది. ఒక్కడే ఉంటే వీలు కాదు కదా!

    12 ఒంటరిగా ఉన్నవాణ్ణి పడదోయడం తేలిక.

    అయితే ఇద్దరు కలిసి ఉంటే తమపై దాడిని ఎదుర్కోగలరు.

    మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు గదా?

  58. 7 (ఆ యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

    నా ప్రాణ ప్రియా! నీ మందను నీవెక్కడ మేపుతావో నాకు చెప్పు.

    మధ్యాహ్నం నీ మందను నీడలో ఎక్కడ ఉంచుతావు?

    నీ స్నేహితుల మందల దగ్గర అటూ ఇటూ తిరిగే దానిగా నేనెందుకుండాలి?

  59. 10 నా సోదరీ, సఖీ! నీ ప్రేమ ఎంత మధురం! ద్రాక్షారసం కంటే నీ ప్రేమ ఎంత శ్రేష్ఠం!

    నువ్వు పూసుకున్న పరిమళాల వాసన సుగంధ ద్రవ్యాలన్నిటి కన్నా మించినది.

  60. 8 కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు.

  61. 36 “బోధకా, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు.

    37 అందుకు యేసు,

    “‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.

    38 ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.

    39 ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.

    40 ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం” అని అతనితో చెప్పాడు.

  62. 24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.

    26 ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. 27 అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు.

  63. 6 సాటి విశ్వాసులారా, మేము ఉపదేశించిన సత్యాల ప్రకారం చేయకుండా సోమరులుగా బ్రతుకుతున్న వారి నుండి తొలగి పోవాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర మీకు ఆదేశిస్తున్నాం.

  64. 7 “గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది.

    పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది.

    కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం.

    ఆయనకు మహిమ ఆపాదించుదాం.”

    8 ఆమె ధరించుకోడానికి మెరిసిపోయే, పరిశుభ్రమైన శ్రేష్ఠవస్త్రాలు ఇచ్చారు.

    ఈ శ్రేష్ఠవస్త్రాలు పరిశుద్ధుల నీతి కార్యాలు.

    9 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి.” అతడే ఇంకా, “ఇవి నిజంగా దేవుని మాటలు” అన్నాడు.