75 Bible Verses About Love and Family
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.
5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.
6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.
7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.
8 ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.
9 ఎందుకంటే మనకు కొంతవరకే తెలుసు. కొంతవరకే ప్రవచిస్తున్నాము. 10 అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానివి అంతమైపోతాయి. 11 నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగానే మాట్లాడాను, చిన్నవాడిలాగానే తర్కించాను. ఇప్పుడు పెద్దవాడినయ్యాక పిల్లచేష్టలు మానేశాను.
12 అలాగే ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్టు మసకగా చూస్తున్నాం. అప్పుడైతే ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసింది కొంత మాత్రమే. అప్పుడు దేవుడు నన్ను పూర్తిగా ఎరిగినంత మట్టుకు నేను కూడా పూర్తిగా తెలుసుకుంటాను.
13 ప్రస్తుతం విశ్వాసం, ఆశాభావం, ప్రేమ ఈ మూడూ నిలిచి ఉన్నాయి. వీటిలో ఉన్నతమైనది ప్రేమే.
-
25 పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి. 26 సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి, 27 దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.
28 అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే.
-
18 భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ఇది ప్రభువులో తగిన ప్రవర్తన.
19 భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. వారితో కటువుగా ఉండవద్దు. 20 పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇది ప్రభువుకు ప్రీతికరంగా ఉంటుంది.
21 తండ్రులారా, మీ పిల్లలు నిరుత్సాహపడకుండేలా వారిని రెచ్చగొట్టవద్దు.
-
16 దేవునికి మనపై ఉన్న ప్రేమను మనం తెలుసుకుని విశ్వసించాము. దేవుడు ప్రేమ. ప్రేమలో నిలిచి ఉన్నవాడు దేవునిలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. 17 తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా మన మధ్య ఈ ప్రేమ పరిపూర్ణం అయ్యింది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆయన ఉన్నట్టే ఉన్నాం.
18 ప్రేమలో భయం లేదు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే భయం శిక్షకు సంబంధించింది. భయం ఉన్నవాడు ఇంకా ప్రేమలో పరిపూర్ణత పొందలేదు. 19 దేవుడే మొదట మనలను ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం.
20 “నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని చెబుతూ, తన సోదరుణ్ణి ద్వేషిస్తే, అతడు అబద్ధికుడే. కనిపిస్తున్న సోదరుణ్ణి ప్రేమించని వాడు, కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు. 21 దేవుణ్ణి ప్రేమించేవాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి, అన్న ఆజ్ఞ ఆయన నుండి మనకు ఉంది.
-
16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.
18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు.
-
9 మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి. 10 సోదర ప్రేమతో ఒకడిపై ఒకడు అభిమానం చూపిస్తూ, గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి.
-
12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.
14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది.
-
37 అందుకు యేసు,
“‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.
38 ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.
39 ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.
40 ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం” అని అతనితో చెప్పాడు.
-
3 చూడండి, పిల్లలు యెహోవా ప్రసాదించే వారసత్వం. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.
4 యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు శూరుడి చేతిలోని బాణాల వంటివాళ్ళు.
5 వారితో తన అంబులపొది నింపుకున్న మనిషి ధన్యుడు. వాళ్ళు గుమ్మంలో తమ విరోధులను ఎదిరించి నిలబడినప్పుడు అవమానం పాలు కారు.
-
7 ప్రియులారా, ఒకరిని ఒకరు ప్రేమించుకుందాం. ఎందుకంటే, ప్రేమ దేవునినుండి వస్తుంది. ప్రేమించే ప్రతి మనిషీ దేవుని ద్వారా పుట్టి, దేవుణ్ణి తెలుసుకున్న వాడు. 8 ప్రేమించని వాడికి దేవుడు తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రేమ. 9 దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి, ఆయన ద్వారా మనం జీవించాలన్నది ఆయన ఉద్దేశం. దీని ద్వారా దేవుని ప్రేమ మన మధ్య వెల్లడి అయ్యింది. 10 మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి, మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా మనకోసం తన కుమారుణ్ణి పంపించాడు. ప్రేమంటే ఇదే.
11 ప్రియులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 12 ఎవ్వరూ, ఎన్నడూ, దేవుణ్ణి చూడలేదు. మనం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే, దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మనలో సంపూర్ణం అవుతుంది.
-
12 నీ దేవుడైన యెహోవా మీకివ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలా నీ తండ్రిని, తల్లిని గౌరవించాలి.
-
34 మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలన్న కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. 35 మీరు ఒకడి పట్ల ఒకడు ప్రేమగలవారైతే, దాన్నిబట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు” అన్నాడు.
-
12 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ. 13 స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టిన వాడి ప్రేమకన్నా గొప్ప ప్రేమ లేదు. 14 నేను మీకు ఆజ్ఞాపించినట్టు చేస్తే మీరు నాకు స్నేహితులు.
15 “నేను ఇక మిమ్మల్ని దాసులు అని పిలవను. ఎందుకంటే దాసుడికి యజమాని చేసేది తెలియదు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే, నా తండ్రి నుంచి నేను విన్నవన్నీ మీకు తెలియజేశాను. 16 మీరు నన్ను కోరుకోలేదు. మీరు వెళ్ళి ఫలవంతం అవ్వాలని, మీ ఫలం నిలకడగా ఉండాలని నేను మిమ్మల్ని ఎన్నుకుని నియమించాను. నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినా ఇవ్వాలని ఇది చేశాను. 17 మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
-
6 పసివాడు నడవాల్సిన మార్గమేదో వాడికి నేర్పించు. వయసు పైబడినా వాడు అందులోనుండి తొలగడు.
-
17 అందుకు యేసు, “మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు” అన్నాడు.
18 అతడు, “ఏ ఆజ్ఞలు?” అని ఆయనను అడిగాడు. యేసు, “నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, 19 నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు అనేవే” అని చెప్పాడు.
-
1-3 కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను.
-
1 పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి. ఇది మంచిది. 2-3 “నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది.” ఇది వాగ్దానంతో కలిసి ఉన్న మొదటి ఆజ్ఞ.
4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు. వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి.
5 సేవకులారా, భయంతో వణకుతో, క్రీస్తుకు లోబడినట్టు, ఈ లోకంలో మీ యజమానులకు హృదయపూర్వకంగా లోబడండి. 6 మనుషులను సంతోషపెట్టేవారు చేసినట్టు పైపైన కాక, క్రీస్తు దాసులుగా దేవుని సంకల్పాన్ని హృదయపూర్వకంగా జరిగిస్తూ, 7 ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవచేయండి.
-
1 పెద్దనైన నేను ఎన్నికైన తల్లికీ, ఆమె పిల్లలకూ, నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తూ, రాస్తున్న సంగతులు. నేను మాత్రమే కాక సత్యాన్ని ఎరిగిన వారందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. 2 ఎందుకంటే మనలో సత్యం నిలిచి ఉంది, అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. 3 తండ్రి అయిన దేవుని నుండీ, కుమారుడు యేసు క్రీస్తు నుండీ సత్యంలో, ప్రేమలో మనకు కృప, దయ, శాంతి తోడుగా ఉండు గాక.
4 తండ్రి నుండి మనం పొందిన ఆజ్ఞ ప్రకారం మీ పిల్లల్లో కొందరు సత్యమార్గంలో ఉన్నారని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను. 5 అమ్మా, కొత్త ఆజ్ఞ మీకు రాసినట్టు కాదు, ఒకరిని ఒకరు ప్రేమించాలన్న ఆజ్ఞ ఆరంభం నుండి మనకు ఉన్నదాన్ని బట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 6 ఆయన ఆజ్ఞలను విధేయతతో పాటించడమే ప్రేమ. ఆరంభం నుండి మీరు విన్న ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
-
5 యేసు, “మీరు దేవునికి లోబడని వారు, కాబట్టి మోషే ఆ విధంగా ఆదేశించాడు. 6 కాని, సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు. 7 అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి జీవిస్తాడు. 8 వారిద్దరు ఐక్యమై ఒకే శరీరంగా మారిపోతారు. కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాకుండా ఒకరిలా జీవిస్తారు. 9 కాబట్టి దేవుడు కలిపిన వారిని ఏ మనిషీ వేరు చేయకూడదు” అని వారితో చెప్పాడు.
-
4 ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు. 5 నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.
6 ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి.
7 మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి.
8 అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి. 9 మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి.
-
43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.
46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.
-
15 వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, “యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలను మేపు” అని అతనితో చెప్పాడు.
16 మరోసారి ఆయన, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అతణ్ణి అడిగాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలకు కాపరిగా ఉండు” అన్నాడు.
17 ఆయన మూడోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, “ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు.
అప్పుడు యేసు, “నా గొర్రెలను మేపు. 18 నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. కచ్చితంగా నీకు చెబుతున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకు పోతాడు” అని అతనితో చెప్పాడు. 19 దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దాన్ని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన, “నన్ను అనుసరించు” అని అతనితో అన్నాడు.
-
6 ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. 7 నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. 8 అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు.
-
దావీదు రాసిన యాత్రల కీర్తన
1 చూడండి, సోదరులు ఐక్యంగా కలసి ఉండడం ఎంత మంచిది! ఎంత రమ్యమైనది!
-
35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా? 36 దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే,
“నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం.
వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”
37 అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.
-
8 ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత ఇంటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్న వాడు. అలాటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.
-
35 అంటే ఒక మనిషికి అతని తండ్రితో, కూతురికి తన తల్లితో, కోడలికి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను. 36 ఒక వ్యక్తి స్వంత ఇంటివాళ్ళే అతనికి శత్రువులుగా తయారవుతారు.
37 నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు. 38 తన సిలువను భుజాన వేసుకుని నావెంట రాని వాడు నాకు తగినవాడు కాడు.
-
32 ఈ మాటల అర్థం గ్రహించడం కష్టం. అయితే నేను క్రీస్తును గూర్చీ సంఘం గూర్చీ చెబుతున్నాను. 33 చివరిగా నేను చెప్పేది, మీలో ప్రతి పురుషుడూ తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.
-
24 ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు.
-
31 మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి.
32 మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపాత్ములు కూడా తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు కదా. 33 మీకు మేలు చేసే వారికే మీరు మేలు చేస్తూ ఉంటే మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా అలాగే చేస్తారు కదా!
34 మీ అప్పు తిరిగి తీరుస్తారు అనుకున్న వారికే మీరు అప్పిస్తూ ఉంటే దాంట్లో మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా మళ్లీ వసూలు చేసుకోవచ్చనుకుని పాపాత్ములకే అప్పులిస్తూ ఉంటారు కదా.
35 మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు.
-
20 మా పూర్వీకులు ఈ కొండ పైన ఆరాధించారు. కానీ ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందనీ అందరూ అక్కడికే వెళ్ళి ఆరాధించాలనీ మీరు అంటారు” అంది.
అందుకు యేసు ఇలా చెప్పాడు. 21 “అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో, యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము. 22 మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది.
-
18 మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి.
19 ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోవద్దు. దేవుని కోపానికి చోటియ్యండి. “పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది.
20 “కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు.
అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది.”
21 కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి.
-
10 నీతిని జరిగించని వారు దేవుని పిల్లలు కాదు. తమ సోదరుణ్ణి ప్రేమించనివారు దేవుని పిల్లలు కాదు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, సైతాను పిల్లలెవరో తెలిసిపోతుంది.
11 మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలన్న సందేశం మీరు ఆరంభం నుండి వింటూనే ఉన్నారు. 12 సైతాను సంబంధి అయిన కయీను తన తమ్ముణ్ణి చంపాడు. మీరు అతనిలా ఉండవద్దు. కయీను తన తమ్ముణ్ణి ఎందుకు చంపాడు? అతని క్రియలు దుర్మార్గమైనవి. అతని తమ్ముని క్రియలు నీతిగలవి.
-
16 యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి. 17 ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?
18 నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం. 19 దీనివలన మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట నిబ్బరంగా ఉంటాయి.
-
14-15 ఈ కారణం వలన పరలోకంలో, భూమి మీదా ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి తన కుటుంబం అని పేరు పొందిందో ఆ తండ్రి ముందు నేను మోకాళ్ళూని ప్రార్థిస్తున్నాను.
-
8 అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు. 9 ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి. 10 దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి. 11 ఎవరైనా బోధిస్తే, దైవోక్తుల్లా బోధించాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్ధ్యంతో చేయాలి. దేవునికి యేసు క్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మహిమ కలుగుతుంది. మహిమ, ప్రభావం ఎప్పటికీ ఆయనకే చెందుతాయి. ఆమేన్.
-
6 మనవలు ముసలివారికి కిరీటాలు. తమ పిల్లలకు ప్రతిష్ట తెచ్చేది తల్లి దండ్రులే.
-
17 స్నేహితుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. కష్టకాలంలో ఆదుకోడానికే సోదరులు పుట్టేది.
-
29 అప్పుడు యేసు, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది ఇది, ‘ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ప్రభువైన మన దేవుడు, ఆ ప్రభువు ఒక్కడే. 30 పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ. 31 రెండవది, ‘నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అంతగా ప్రేమించాలి.’ వీటికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు” అని జవాబిచ్చాడు.
32 ఆ ధర్మశాస్త్ర పండితుడు, “అయ్యా, మీరు బాగా చెప్పారు. దేవుడొక్కడే అనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ మీరు చెప్పింది నిజమే. 33 పూర్ణ హృదయంతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించడం, మనలను ప్రేమించుకున్నట్టే మన పొరుగు వాణ్ణి ప్రేమించడం అన్ని హోమాల కన్నా, బలుల కన్నా ముఖ్యం” అన్నాడు.
34 అతడు వివేకంగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అన్నాడు. ఆ తరువాత ఆయనను ప్రశ్నలు అడగడానికి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది.
-
26 “నా దగ్గరికి వచ్చే వాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ చివరకూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు.
-
16 యేసు ఆమెతో, “నువ్వు వెళ్ళి నీ భర్తను ఇక్కడికి తీసుకురా” అన్నాడు.
-
5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.
-
1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. 2 దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. 3 పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.
-
14 మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.
-
32 హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.
-
15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.
16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.
17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.
-
9 సోదర ప్రేమను గూర్చి ఎవరూ మీకు రాయనక్కరలేదు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పించాడు. 10 అలాగే మీరు మాసిదోనియ అంతటా ఉన్న సోదరులను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమలో మీరు మరింత వృద్ధి చెందుతూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాం.
11-12 సంఘానికి బయట ఉన్నవారి పట్ల మర్యాదగా ఉండడం, మీకు కొదువ ఏమీ లేకుండా మేము ఆదేశించిన విధంగా ప్రశాంతంగా జీవించడం, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ సొంత విషయాల్లో ఆసక్తి కలిగి మీ చేతులతో కష్టపడి పని చేసుకుంటూ ఉండడం లక్ష్యంగా పెట్టుకోండి.
-
22 సత్యానికి లోబడడం ద్వారా మీరు మీ మనసులను పవిత్రపరచుకున్నారు. తద్వారా యథార్ధమైన సోదర ప్రేమను పొందారు. అందుచేత ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి. 23 మీరు నాశనమయ్యే విత్తనం నుంచి కాదు, ఎప్పటికీ ఉండే సజీవ దేవుని వాక్కు ద్వారా, నాశనం కాని విత్తనం నుంచి మళ్ళీ పుట్టారు.
-
3 ఇశ్రాయేలూ, నీ పూర్వీకుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో సుఖశాంతులతో బాగా అభివృద్ధి చెందడానికి నువ్వు వాటిని విని, అనుసరించాలి.
-
15 యెహోవాను సేవించడం మీ దృష్టికి చెడుగా ఉంటే మీరు ఎవర్ని సేవిస్తారో, నది అవతల మీ పూర్వీకులు సేవించిన దేవుళ్ళను సేవిస్తారో, మీరు నివసిస్తున్నఅమోరీయుల ఈ దేశంలోని దేవుళ్ళను సేవిస్తారో ఈ రోజే కోరుకోండి. నేనూ నా ఇంటివాళ్ళూ యెహోవానే సేవిస్తాం” అన్నాడు.
-
29 తన ఇంటివారిని బాధపెట్టేవాడు గాలికి చెదిరి పోతాడు. వివేకం లేనివాడు జ్ఞానం గలవాడికి సేవకుడు అవుతాడు.
-
5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది. చీకటి ఆ వెలుగును లొంగదీసుకోలేక పోయింది.
6 దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోహాను.
-
18 ఎందుకంటే నీకు ఐదుగురు భర్తలున్నారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. ఈ విషయంలో నువ్వు బాగానే చెప్పావు” అన్నాడు.
19 అప్పుడా స్త్రీ, “అయ్యా, నువ్వు ఒక ప్రవక్తవి అని నాకు అర్థమౌతున్నది.
-
5 అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవాలుగా ఉన్నాము.
-
13 సోదరులారా, స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి. 14 ధర్మశాస్త్రమంతా “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉంది. 15 అయితే మీరు ఒకరినొకరు కరచుకుని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి.
-
1 మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు 2 పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.
4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.
-
11 మన తండ్రి అయిన దేవుడూ, మన ప్రభు యేసూ మమ్మల్ని మీ దగ్గరికి ఎలాంటి ఆటంకం లేకుండా తీసుకువస్తాడు గాక!
12 మీ పట్ల మా ప్రేమ ఎలా అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతూ ఉన్నదో అలాగే మీరు కూడా ఒకరిపట్ల ఒకరు, ఇంకా, అందరి పట్ల కూడా ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లేలా ప్రభువు అనుగ్రహించు గాక. 13 మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసి వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో నిందారహితంగా ఉండేలా ఆయన స్థిరపరచు గాక!
-
1 యేసే క్రీస్తు అని నమ్మినవారంతా దేవుని ద్వారా పుట్టినవాళ్ళే. తండ్రిగా అయిన వాణ్ణి ప్రేమించిన వారంతా ఆయన ద్వారా పుట్టినవాణ్ణి కూడా ప్రేమిస్తారు. 2 మనం దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే, దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వల్ల మనకు తెలుసు.
3 ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. ఆయన ఆజ్ఞలు భారం కాదు.
-
దావీదు కీర్తన.
1 యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు.
2 పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు.
3 నా ప్రాణాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు, తన నామాన్ని బట్టి సరైన మార్గాల్లో నన్ను నడిపిస్తాడు.
4 చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.
-
12 యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తాడు. అహరోను వంశస్థులనాశీర్వదిస్తాడు.
13 పిన్నలనేమి, పెద్దలనేమి తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు.
14 యెహోవా మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు.
15 భూమ్యాకాశాలను సృష్టించిన యెహోవా చేత మీరు దీవెన పొందారు.
-
8 కుమారా, నీ తండ్రి చెప్పే సద్బోధ విను. నీ తల్లి చెప్పే మాటలు నిర్ల్యక్ష్యం చెయ్యకు.
-
1 జ్ఞానం ఉన్న కొడుకును బట్టి అతని తండ్రికి సంతోషం కలుగుతుంది. బుద్ధిలేని కొడుకు తన తల్లికి దుఃఖం, వేదన కలిగిస్తాడు.
-
15 ఆమె చీకటితోనే లేచి, తన యింటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన సేవికలకు జీతం నిర్ణయిస్తుంది.
16 ఆమె పొలం చూసి దాన్ని కొంటుంది. కూడబెట్టిన డబ్బుతో ద్రాక్షతోట నాటిస్తుంది.
17 ఆమె బలం ధరించుకుంటుంది. చేతులతో బలంగా పని చేస్తుంది.
-
13 తల్లి తన బిడ్డను ఓదార్చినట్టు నేను మిమ్మల్ని ఓదారుస్తాను. యెరూషలేములోనే మిమ్మల్ని ఓదారుస్తాను.”
14 మీరు దీన్ని చూస్తారు. మీ హృదయం సంతోషిస్తుంది. మీ ఎముకలు లేతగడ్డిలాగా బలుస్తాయి.
యెహోవా హస్తబలం ఆయన సేవకులకు వెల్లడి అవుతుంది. అయితే ఆయన తన శత్రువుల మీద కోపం చూపుతాడు.
15 వినండి. మహా కోపంతో ప్రతీకారం చేయడానికి అగ్నిజ్వాలలతో గద్దించడానికి
యెహోవా మంటలతో వస్తున్నాడు. ఆయన రథాలు తుఫానులాగా వస్తున్నాయి.
16 అగ్నితో తన కత్తితో మనుషులందరినీ యెహోవా శిక్షిస్తాడు. యెహోవా చేతుల్లో అనేకమంది చస్తారు.
-
4 అందుకాయన, “సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడనీ, 5 ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏకశరీరంగా అవుతారు’ అని చెప్పాడనీ మీరు చదవలేదా? 6 కాబట్టి వారింక ఇద్దరు కాదు, ఏక శరీరమే. కాబట్టి దేవుడు జత పరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు” అని జవాబిచ్చాడు.
7 అందుకు వారు, “అలాటప్పుడు ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే ఆమెకు విడాకుల పత్రిక రాసివ్వాలని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని అడిగారు. 8 అప్పుడాయన, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీ భార్యలను విడిచిపెట్టవచ్చని మోషే చెప్పాడు గానీ, ప్రారంభం నుండీ అలా జరగలేదు. 9 భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను” అని వారితో అన్నాడు.
-
2 అతడు రాత్రి వేళ యేసు దగ్గరికి వచ్చాడు. ఆయనతో, “బోధకా, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడివి అని మాకు తెలుసు. దేవుడు తోడు లేకపోతే ఎవరూ నువ్వు చేసే అద్భుతాలు చేయలేరని మాకు తెలుసు” అన్నాడు. 3 దానికి జవాబుగా యేసు అతనితో, “ఎవరైనా కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరని కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
-
10 యేసు ఇలా అన్నాడు, “నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడివై ఉండీ ఈ సంగతులు అర్థం చేసుకోలేవా? 11 మాకు తెలిసిన సంగతులను చెబుతున్నాం, మేము చూసిన వాటి గురించి వివరిస్తున్నాం. అయినా మీరు మా సాక్షాన్ని ఒప్పుకోరని కచ్చితంగా చెబుతున్నాను. 12 భూసంబంధమైన సంగతులు నేను మీకు చెప్పినప్పుడు నమ్మని వారు ఇక నేను పరలోక సంబంధమైన సంగతులు చెప్పినప్పుడు ఎలా నమ్ముతారు?
-
7 ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసు ఆమెతో, “తాగడానికి నీళ్ళు ఇస్తావా?” అని అడిగాడు.
-
24 “తండ్రీ, నేను ఎక్కడ ఉంటానో, నువ్వు నాకిచ్చిన వారు నాతో కూడా అక్కడ ఉండాలని, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వారు చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే భూమికి పునాది వేయక ముందు నుంచే నువ్వు నన్ను ప్రేమించావు.
-
31 అందుకు వారు, “ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు” అని చెప్పి 32 అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్కు బోధించారు. 33 రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసుకు వచ్చి, వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిసం పొందారు.
34 అతడు పౌలు సీలలను తన ఇంటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవునిలో విశ్వాసముంచినందుకు తన ఇంటి వారందరితో కూడ ఆనందించాడు.
-
28 ఇందులో యూదుడు-గ్రీసుదేశస్థుడనీ దాసుడు-స్వతంత్రుడనీ పురుషుడు-స్త్రీ అనీ తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు.
-
10 కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.
-
1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి.
-
1 అయితే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడ సజీవులుగా లేపాడు కాబట్టి పైన ఉన్న వాటినే వెతుకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. 2 పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. 3 ఎందుకంటే మీరు చనిపోయారు గానీ మీ జీవాన్ని దేవుడు క్రీస్తులో దాచి పెట్టాడు. 4 మీ జీవం అయిన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా మహిమలో ఆయనతో ప్రత్యక్షమౌతారు.
-
4 నా పిల్లలు సత్యమార్గంలో నడుచుకుంటున్నారని తెలుసుకోవడం కన్నా నాకు గొప్ప సంతోషం మరేదీ లేదు.
Shows Read in context, Share and Copy.