50 Bible Verses About Agape Love

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Agape Love
  1. 1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. 2 దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. 3 పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.

    4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.

    5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.

    6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.

    7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.

    8 ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.

    9 ఎందుకంటే మనకు కొంతవరకే తెలుసు. కొంతవరకే ప్రవచిస్తున్నాము. 10 అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానివి అంతమైపోతాయి. 11 నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగానే మాట్లాడాను, చిన్నవాడిలాగానే తర్కించాను. ఇప్పుడు పెద్దవాడినయ్యాక పిల్లచేష్టలు మానేశాను.

    12 అలాగే ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్టు మసకగా చూస్తున్నాం. అప్పుడైతే ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసింది కొంత మాత్రమే. అప్పుడు దేవుడు నన్ను పూర్తిగా ఎరిగినంత మట్టుకు నేను కూడా పూర్తిగా తెలుసుకుంటాను.

    13 ప్రస్తుతం విశ్వాసం, ఆశాభావం, ప్రేమ ఈ మూడూ నిలిచి ఉన్నాయి. వీటిలో ఉన్నతమైనది ప్రేమే.

  2. 7 ప్రియులారా, ఒకరిని ఒకరు ప్రేమించుకుందాం. ఎందుకంటే, ప్రేమ దేవునినుండి వస్తుంది. ప్రేమించే ప్రతి మనిషీ దేవుని ద్వారా పుట్టి, దేవుణ్ణి తెలుసుకున్న వాడు. 8 ప్రేమించని వాడికి దేవుడు తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రేమ. 9 దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి, ఆయన ద్వారా మనం జీవించాలన్నది ఆయన ఉద్దేశం. దీని ద్వారా దేవుని ప్రేమ మన మధ్య వెల్లడి అయ్యింది. 10 మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి, మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా మనకోసం తన కుమారుణ్ణి పంపించాడు. ప్రేమంటే ఇదే.

    11 ప్రియులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 12 ఎవ్వరూ, ఎన్నడూ, దేవుణ్ణి చూడలేదు. మనం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే, దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మనలో సంపూర్ణం అవుతుంది.

  3. 31 యూదా వెళ్ళిపోయిన తరువాత, యేసు, “ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పొందాడు. దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు” అన్నాడు. 32 దేవుడు ఆయనలో మహిమ పరచబడినట్టయితే, తనలో ఆయనను మహిమ పరుస్తాడు. వెంటనే ఆయనను మహిమ పరుస్తాడు. 33 పిల్లలూ, ఇంకా కొంత కాలం నేను మీతో ఉంటాను. మీరు నా కోసం వెదుకుతారు. కాని, నేను యూదులకు చెప్పినట్టు మీతో కూడా చెబుతున్నాను, ‘నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు.’ 34 మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలన్న కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. 35 మీరు ఒకడి పట్ల ఒకడు ప్రేమగలవారైతే, దాన్నిబట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు” అన్నాడు.

  4. 12 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ. 13 స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టిన వాడి ప్రేమకన్నా గొప్ప ప్రేమ లేదు.

  5. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.

    6 ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. 7 నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. 8 అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. 9 కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం.

  6. 43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.

    46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.

  7. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

  8. 16 యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి. 17 ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?

    18 నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం. 19 దీనివలన మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట నిబ్బరంగా ఉంటాయి.

  9. 22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు.

  10. 16 దేవునికి మనపై ఉన్న ప్రేమను మనం తెలుసుకుని విశ్వసించాము. దేవుడు ప్రేమ. ప్రేమలో నిలిచి ఉన్నవాడు దేవునిలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. 17 తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా మన మధ్య ఈ ప్రేమ పరిపూర్ణం అయ్యింది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆయన ఉన్నట్టే ఉన్నాం.

    18 ప్రేమలో భయం లేదు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే భయం శిక్షకు సంబంధించింది. భయం ఉన్నవాడు ఇంకా ప్రేమలో పరిపూర్ణత పొందలేదు. 19 దేవుడే మొదట మనలను ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం.

    20 “నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని చెబుతూ, తన సోదరుణ్ణి ద్వేషిస్తే, అతడు అబద్ధికుడే. కనిపిస్తున్న సోదరుణ్ణి ప్రేమించని వాడు, కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు. 21 దేవుణ్ణి ప్రేమించేవాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి, అన్న ఆజ్ఞ ఆయన నుండి మనకు ఉంది.

  11. 12 అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది. 13 కానీ అంతం వరకూ ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది.

  12. 15 వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, “యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలను మేపు” అని అతనితో చెప్పాడు.

    16 మరోసారి ఆయన, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అతణ్ణి అడిగాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలకు కాపరిగా ఉండు” అన్నాడు.

    17 ఆయన మూడోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, “ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు.

    అప్పుడు యేసు, “నా గొర్రెలను మేపు.

  13. 9 మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి. 10 సోదర ప్రేమతో ఒకడిపై ఒకడు అభిమానం చూపిస్తూ, గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి. 11 ఆసక్తి విషయంలో వెనకబడిపోవద్దు, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. 12 ఆశాభావంతో ఎదురు చూస్తూ సంతోషించండి. కష్టాల్లో సహనం చూపుతూ, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. 13 పవిత్రుల అవసరాల్లో సహాయం చేస్తూ, అతిథులను శ్రద్ధగా ఆదరించండి.

  14. 8 ప్రేమ విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికీ రుణ పడి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. 9 ఎందుకంటే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వేరొకరిది ఆశించవద్దు అనేవీ, మరింకే ఆజ్ఞ అయినా ఉంటే అదీ, “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి. 10 ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే.

  15. 9 తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమలో నిలకడగా ఉండండి. 10 నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నిలకడగా ఉన్నట్టే, మీరు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలకడగా ఉంటారు.

  16. 37 అందుకు యేసు,

    “‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.

    38 ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.

    39 ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.

    40 ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం” అని అతనితో చెప్పాడు.

  17. 19 కొద్దికాలం తరువాత ఇంక ఈ లోకం నన్ను చూడదు. కాని, మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. 20 నేను నా తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నాం అని ఆ రోజు మీరు తెలుసుకుంటారు.

    21 నా ఆజ్ఞలను కలిగిఉండి, వాటిని పాటించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను అతన్ని ప్రేమించి, నన్ను అతనికి ప్రత్యక్షం చేసుకుంటాను” అన్నాడు. 22 యూదా (ఇస్కరియోతు కాక వేరొక యూదా) యేసుతో, “ప్రభూ, నీవు లోకానికి కాకుండా మాకు మాత్రమే నిన్ను నీవు ప్రత్యక్షం చేసుకోడానికి కారణం ఏమిటి?” అన్నాడు. 23 యేసు జవాబిస్తూ, “ఎవడైనా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట ప్రకారం చేస్తాడు. నా తండ్రి అతణ్ణి ప్రేమిస్తాడు. మేము అతని దగ్గరికి వచ్చి అతనితో నివాసం చేస్తాము.

    24 నన్ను ప్రేమించని వాడు నా మాట ప్రకారం చెయ్యడు. మీరు వినే ఈ మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిది.

  18. 12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.

    14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.

    16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.

    17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.

  19. 12 వీరు సిగ్గు లేకుండా విందుల్లో మీతో భోజనం చేస్తూ, తమను తాము బాగా పోషించుకుంటూ, నీటిలో దాగిన బండల్లా ఉన్నారు. వీరు గాలిలో ఎగిరే నీళ్ళులేని మేఘాలు. ఆకు రాలే కాలంలో పళ్ళు లేకుండా రెండు సార్లు చచ్చి వేళ్ళతో సహా పెళ్ళగించిన చెట్లలాంటివారు.

  20. 37 అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

  21. 1 పెద్దనైన నేను ఎన్నికైన తల్లికీ, ఆమె పిల్లలకూ, నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తూ, రాస్తున్న సంగతులు. నేను మాత్రమే కాక సత్యాన్ని ఎరిగిన వారందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. 2 ఎందుకంటే మనలో సత్యం నిలిచి ఉంది, అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. 3 తండ్రి అయిన దేవుని నుండీ, కుమారుడు యేసు క్రీస్తు నుండీ సత్యంలో, ప్రేమలో మనకు కృప, దయ, శాంతి తోడుగా ఉండు గాక.

    4 తండ్రి నుండి మనం పొందిన ఆజ్ఞ ప్రకారం మీ పిల్లల్లో కొందరు సత్యమార్గంలో ఉన్నారని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను. 5 అమ్మా, కొత్త ఆజ్ఞ మీకు రాసినట్టు కాదు, ఒకరిని ఒకరు ప్రేమించాలన్న ఆజ్ఞ ఆరంభం నుండి మనకు ఉన్నదాన్ని బట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 6 ఆయన ఆజ్ఞలను విధేయతతో పాటించడమే ప్రేమ. ఆరంభం నుండి మీరు విన్న ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.

  22. 25 ఒకసారి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి ఆయనను పరీక్షిస్తూ, “బోధకుడా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు. 26 అందుకాయన, “ధర్మశాస్త్రంలో ఏమని రాసి ఉంది? నువ్వు దానినెలా అర్థం చేసుకున్నావు?” అని అడిగాడు. 27 అతడు, “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనసుతోనూ ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణీ ప్రేమించాలి” అన్నాడు. 28 దానికి ఆయన, “సరిగ్గా చెప్పావు. నువ్వూ అలా చెయ్యి, జీవిస్తావు” అన్నాడు.

    29 అయితే తనను నీతిమంతుడిగా చూపించుకోడానికి అతడు, “అది సరే గానీ, నా పొరుగువాడు ఎవడు?” అని యేసును అడిగాడు. 30 అందుకు యేసు, “ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమై పోతూ దోపిడీ దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకుని అతణ్ణి కొట్టి, కొన ప్రాణంతో విడిచి పెట్టారు.

  23. 15 మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.

    16 “నేను తండ్రిని అడుగుతాను. మీతో ఎల్లప్పుడూ ఉండేలా ఇంకొక ఆదరణకర్తను ఆయన మీకు ఇస్తాడు. 17 ఆయన సత్యం అయిన ఆత్మ. లోకం ఆయనను చూడదు, తెలుసుకోదు కాబట్టి ఆయనను స్వీకరించదు. అయితే మీకు ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. 18 నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మీకోసం నేను మళ్ళీ వస్తాను.

  24. 13 సోదరులారా, స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి. 14 ధర్మశాస్త్రమంతా “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉంది. 15 అయితే మీరు ఒకరినొకరు కరచుకుని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి.

  25. 3 ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది. 4 “నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు. 5 కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు.

    6 ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి.

  26. 28 ధర్మశాస్త్ర పండితుల్లో ఒకడు వచ్చి వారి వాదన విన్నాడు. యేసు చక్కని సమాధానం చెప్పాడని గ్రహించి, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని ఆయనను అడిగాడు. 29 అప్పుడు యేసు, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది ఇది, ‘ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ప్రభువైన మన దేవుడు, ఆ ప్రభువు ఒక్కడే. 30 పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ. 31 రెండవది, ‘నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అంతగా ప్రేమించాలి.’ వీటికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు” అని జవాబిచ్చాడు.

  27. 26 నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ వారిలో ఉండాలనీ, నేను వారిలో ఉండాలనీ, నీ నామాన్ని వారికి తెలియజేశాను. ఇంకా తెలియజేస్తాను.”

  28. 1 ఇప్పుడిక గ్రహాలకు బలి అర్పించిన వాటి విషయం: మనమంతా తెలివైన వారమే అని మనకి తెలుసు. తెలివి మిడిసిపడేలా చేస్తుంది గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. 2 ఎవరైనా తనకు ఏదైనా తెలుసు అని భావిస్తే, అతడు గ్రహించ వలసిందేమంటే తాను తెలుసుకోవలసినంత ఇంకా తెలుసుకోలేదు అని. 3 ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవునికి అతడు తెలుసన్నమాట.

  29. 20 మీరంతా సమావేశమై కలిసి తినేది ప్రభు రాత్రి భోజనం కాదు. 21 ఎందుకంటే మీరు ఆ భోజనం తినేటప్పుడు ఒకడికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే తింటున్నాడు. దీనివలన ఒకడు ఆకలితో ఉండగానే ఇంకొకడు బాగా తిని తాగి మత్తులో మునిగిపోతాడు. 22 ఏమిటిది? తిని తాగడానికి మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘాన్ని చిన్నచూపు చూస్తూ లేని వారిని చిన్నచూపు చూస్తూ? మీతో ఏమి చెప్పాలి? మిమ్మల్ని మెచ్చుకోమంటారా? ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోలేను.

  30. 1 కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి. 2 క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.

  31. 25 పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి. 26 సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి, 27 దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.

    28 అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే. 29 ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు.

  32. 7 అన్నిటికీ అంతం సమీపించింది. కాబట్టి మెలకువగా, ప్రార్థనల్లో చైతన్య వంతులుగా ఉండండి. 8 అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు. 9 ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి. 10 దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి. 11 ఎవరైనా బోధిస్తే, దైవోక్తుల్లా బోధించాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్ధ్యంతో చేయాలి. దేవునికి యేసు క్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మహిమ కలుగుతుంది. మహిమ, ప్రభావం ఎప్పటికీ ఆయనకే చెందుతాయి. ఆమేన్‌.

  33. 7 దేవుడు మనకు శక్తీ, ప్రేమా, నిగ్రహం కలిగించే ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనం కలిగించే ఆత్మను ఇవ్వలేదు.

  34. 15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే.

  35. 1 యేసే క్రీస్తు అని నమ్మినవారంతా దేవుని ద్వారా పుట్టినవాళ్ళే. తండ్రిగా అయిన వాణ్ణి ప్రేమించిన వారంతా ఆయన ద్వారా పుట్టినవాణ్ణి కూడా ప్రేమిస్తారు. 2 మనం దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే, దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వల్ల మనకు తెలుసు.

    3 ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. ఆయన ఆజ్ఞలు భారం కాదు. 4 దేవుని ద్వారా పుట్టినవారు అందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించింది మన విశ్వాసమే. 5 లోకాన్ని జయించేది ఎవరు? యేసు దేవుని కుమారుడు అని నమ్మినవాడే!

  36. 2 నువ్వు చేస్తున్న పనులూ, నువ్వు పడుతున్న కష్టమూ, నీ ఓర్పూ నాకు తెలుసు. నువ్వు దుర్మార్గులను సహించలేవనీ, అపొస్తలులు కాకుండానే, మేము అపొస్తలులం అని చెప్పుకుంటూ తిరిగే వారిని పరీక్షించి వారు మోసగాళ్ళని పసిగట్టావనీ నాకు తెలుసు. 3 ఎంతో ఓర్పుతో నువ్వు నా నామం కోసం భారం భరిస్తూ అలసి పోలేదనీ నాకు తెలుసు.

    4 అయినా నీ విషయంలో నాకు అభ్యంతరం ఒకటి ఉంది. మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలి వేశావు. 5 కాబట్టి ఎంత ఉన్నత స్థాయి నుండి నువ్వు పడిపోయావో గుర్తు చేసుకో. పశ్చాత్తాపపడి ప్రారంభంలో చేసిన పనులు చెయ్యి. అలా చేసి నువ్వు మారితే సరి. లేకపోతే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని అక్కడ నుండి తీసివేస్తాను.

  37. 26 దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27 దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.

    28 దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు. 29 దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.

    30 భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది. 31 దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.

  38. 19 ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు.

  39. 7 ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసు ఆమెతో, “తాగడానికి నీళ్ళు ఇస్తావా?” అని అడిగాడు. 8 ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు. 9 ఆ సమరయ స్త్రీ యేసుతో ఇలా అంది, “నువ్వు యూదుడివి. సమరయ స్త్రీ అయిన నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు?” ఎందుకంటే యూదులు సమరయులతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోరు. 10 దానికి యేసు, “నువ్వు దేవుని బహుమానాన్నీ, తాగడానికి నీళ్ళు కావాలని నిన్ను అడుగుతున్న వ్యక్తినీ తెలుసుకుంటే నువ్వే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడు” అన్నాడు.

    11 అప్పుడా స్త్రీ, “అయ్యా, ఈ బావి చాలా లోతు. తోడుకోడానికి నీ దగ్గర చేద లేదు. ఆ జీవజలం నీకెలా దొరుకుతుంది? 12 మన తండ్రి అయిన యాకోబు ఈ బావి నీళ్ళు తాగాడు. తన సంతానానికీ, తన పశువులకూ తాగడానికి ఈ నీళ్ళే ఇచ్చాడు. మాకూ తాగడానికి ఈ బావిని ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా?” అంది.

  40. 15 నీ సోదరుడు నీవు తినేదాని విషయంలో బాధకు గురైతే నీలో ప్రేమ లేదన్నమాటే. ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో అతణ్ణి నీ ఆహారం చేత పాడు చేయవద్దు.

  41. 13 మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ధైర్యం గలిగి, బలవంతులై ఉండండి. 14 మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.

    15 స్తెఫను ఇంటివారు అకయ ప్రాంతానికి ప్రథమ ఫలమనీ, వారు పరిశుద్ధులకు సేవ చేయడానికి తమను అంకితం చేసుకున్నారనీ మీకు తెలుసు. 16 కాబట్టి సోదరులారా, అలాటి వారికి, పనిలో సహాయం చేసే వారికి, కష్టపడే వారికందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను.

    17 స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనే వారు రావడం సంతోషంగా ఉంది. మీరు లేని కొరత నాకు వీరి వల్ల తీరింది. 18 నా ఆత్మకు, మీ ఆత్మకు వీరు ఆదరణ కలిగించారు. అలాటి వారిని గుర్తించి గౌరవించండి.

  42. 16-17 ఆయన మీలో ఉన్న తన ఆత్మ ద్వారా తన మహిమైశ్వర్యాన్ని బట్టి శక్తితో మిమ్మల్ని బలపరచడం అనే వరం ఇవ్వాలి. క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి. మీరు ఆయన ప్రేమలో వేరు పారి స్థిరంగా ఉండాలి. ఇదే నా ప్రార్థన 18 పరిశుద్ధులందరితో కలిసి దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో పూర్తిగా గ్రహించగలగాలనీ 19 జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోడానికి తగిన శక్తి పొందాలనీ నా ప్రార్థన.

  43. 1 మా ప్రియ సోదరుడు, జతపనివాడు అయిన ఫిలేమోనుకు, 2 మన సోదరి అప్ఫియకు, మన సాటి సైనికుడు అర్ఖిప్పుకు, నీ ఇంట్లో సమావేశమయ్యే సంఘానికీ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు. 3 మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.

    4-5 ప్రభువైన యేసు పట్ల, పరిశుద్ధులందరి పట్ల నీకున్న ప్రేమను గూర్చి, విశ్వాసం గూర్చి నేను విని, నా ప్రార్థనల్లో మీ గురించి విజ్ఞాపన చేస్తూ, ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను.

  44. 1 తండ్రి అయిన దేవుని పిలుపును, ప్రేమను పొంది, యేసు క్రీస్తు ద్వారా భద్రంగా ఉన్నవారికి యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయిన యూదా రాస్తున్నది. 2 దయ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగు గాక.

  45. 5 నమ్మకమైన సాక్షీ, చనిపోయిన వారిలో నుండి ప్రథముడిగా లేచిన వాడూ, భూరాజులందరి పరిపాలకుడూ అయిన యేసు క్రీస్తు నుండీ కృపా, శాంతీ మీకు కలుగు గాక. ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మనలను మన పాపాల నుండి విడిపించాడు.

  46. 4 ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు. 5 నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.

    6 ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి.

  47. 42 అయ్యో పరిసయ్యులారా, మీకు యాతన. మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి ఆకు కూరలోనూ పదోభాగం దేవునికి చెల్లిస్తారు గానీ దేవుని ప్రేమనూ, న్యాయాన్నీ వదిలేస్తున్నారు. మిగిలిన వాటిని చేస్తూనే న్యాయంగా నడుచుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి.

  48. 4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.

  49. 18 భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ఇది ప్రభువులో తగిన ప్రవర్తన.

    19 భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. వారితో కటువుగా ఉండవద్దు.

  50. 1 మనం దేవుని పిల్లలం అని పిలిపించుకోవాలని తండ్రి మనకు ఎలాటి ప్రేమను కట్టబెట్టాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఆ కారణం చేత లోకం మనలను గుర్తించదు, ఎందుకంటే అది దేవుణ్ణి ఎరగదు.