91 Bible Verses About Knowledge

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Knowledge
  1. 1 కుమారా, నీవు నా మాటలు అంగీకరించి, నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుంటే దేవుణ్ణి గూర్చిన వివేచన నీకు దొరుకుతుంది.

    2 జ్ఞానంపై మనసు నిలిపి హృదయపూర్వకంగా వివేచన అభ్యాసం చేసినప్పుడు, 3 తెలివితేటల కోసం మొరపెట్టినప్పుడు, వివేచన కోసం వేడుకొన్నప్పుడు, 4 పోగొట్టుకున్న వెండిని వెతికినట్టు దాన్ని వెదికినప్పుడు, దాచుకున్న ధనం కోసం వెతికినట్టు జ్ఞానాన్ని వెతికినప్పుడు, 5 యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది.

    6 యెహోవా మాత్రమే జ్ఞానం అనుగ్రహిస్తాడు. తెలివి, వివేచన ఆయన మాటల్లో నిండి ఉంటాయి.

    7 యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేస్తాడు. సరియైన మార్గం నుండి తప్పిపోకుండా నడుచుకునే వాళ్ళకు ఆయన రక్షణ కలుగజేస్తాడు.

    8 న్యాయ ప్రవర్తన నుండి తొలగిపోకుండా ఆయన కనిపెట్టుకుని ఉంటాడు. తన భక్తులు మంచి ప్రవర్తనలో కొనసాగేలా ఆయన కావలి కాస్తాడు.

    9 అప్పుడు నీతి, న్యాయం, యథార్థత అనే మంచి మార్గాలు నువ్వు తెలుసుకుంటావు.

    10 జ్ఞానం నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది. తెలివి కలిగి ఉండడం నీకు ఇష్టంగా ఉంటుంది.

    11 తెలివితేటలు నిన్ను కాపాడతాయి. వివేకం నీకు కాపలా కాస్తుంది.

    12 అది దుష్టులు నడిచే మార్గాల నుండి, మూర్ఖపు మాటలు మాట్లాడే వారి బారి నుండి నిన్ను కాపాడుతుంది.

  2. 1 దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు.

    2 జ్ఞానం, ఉపదేశం నేర్చుకోవడానికీ, వివేకం, జ్ఞానవాక్కులు బోధించడానికీ, 3 నీతి, న్యాయం, యథార్థతల ప్రకారం నడుచుకుంటూ దిద్దుబాటు చేసుకోవడానికి, 4 ఉపదేశం పొందని వారికి వివేకం ఇవ్వడానికి, యువతకు తెలివి, విచక్షణ కలిగేలా చేయడానికి ఉపకరిస్తాయి.

    5 తెలివి గలవాడు ఈ సామెతలు విని తన జ్ఞానం వృద్ధి చేసుకుంటాడు. వివేకం గలవాడు విని నీతి సూత్రాలు అలవర్చుకుంటాడు.

    6 వీటి మూలంగా సామెతలు, ఉపమానాలు, జ్ఞానుల మాటలు, వారు చెప్పిన నిగూఢ సత్యాలు ప్రజలు గ్రహిస్తారు.

    7 యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలకారణం. మూర్ఖప్రజలు జ్ఞానాన్ని, నీతి వాక్యాలను వ్యతిరేకిస్తారు.

  3. 1 ఇప్పుడిక గ్రహాలకు బలి అర్పించిన వాటి విషయం: మనమంతా తెలివైన వారమే అని మనకి తెలుసు. తెలివి మిడిసిపడేలా చేస్తుంది గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. 2 ఎవరైనా తనకు ఏదైనా తెలుసు అని భావిస్తే, అతడు గ్రహించ వలసిందేమంటే తాను తెలుసుకోవలసినంత ఇంకా తెలుసుకోలేదు అని. 3 ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవునికి అతడు తెలుసన్నమాట.

  4. 13 మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి. 14 కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి. 15 ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది.

    16 ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి. 17 అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం. తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది. సమ్మతి గలది. కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది. 18 శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది.

  5. 1 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మాట ఆలకించండి.

    సత్యం, కనికరం, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం దేశంలో లేకపోవడం చూసి.

    యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుతున్నాడు.

    2 అబద్ధసాక్ష్యం పలకడం, అబద్ధమాడడం.

    హత్య, దొంగతనం, వ్యభిచారం అలవాటై పోయింది.

    ప్రజలు కన్నం వేస్తారు. మానక హత్య చేస్తారు.

    3 కాబట్టి దేశం ఎండిపోతూ ఉంది.

    దాని పశువులు, పక్షులు, దానిలో నివసించే వాళ్ళంతా క్షీణించి పోతున్నారు.

    సముద్రంలో చేపలు సైతం గతించిపోతున్నాయి.

  6. 5 మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. 6 కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు. 7 అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు. 8 అలాటి వాడు చంచలమైన మనసు గలవాడు. తన విషయాలన్నిటిలోనూ నిలకడ లేనివాడు.

  7. 8 ఎగతాళి చేసేవాణ్ణి గద్దించవద్దు. వాణ్ణి గద్దిస్తే ఒకవేళ వాడు నీపై ద్వేషం పెంచుకుంటాడేమో. జ్ఞానం గలవాడికి హితవాక్కులు బోధిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు.

    9 జ్ఞానం గలవాడికి బుద్ధి చెప్పినప్పుడు మరింత జ్ఞానం పొందుతాడు. న్యాయం జరిగించే వాడికి నీతి వాక్కులు బోధిస్తే వాడు తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు.

    10 జ్ఞానం కలిగి ఉండడానికి మూలాధారం యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడమే. వివేకానికి ఆధారం పరిశుద్ధుడైన దేవుణ్ణి గూర్చిన తెలివి కలిగి ఉండడమే.

  8. 3 జ్ఞానం వలన ఇల్లు నిర్మాణం అవుతుంది. వివేచన వలన అది స్థిరం అవుతుంది.

    4 తెలివి చేత దాని గదుల్లో విలువైన రమ్యమైన సర్వ సంపదలు నిండిపోతాయి.

    5 జ్ఞానం గలవాడు బలవంతుడు. తెలివిగలవాడు శక్తిశాలి.

    6 వివేకం గల నాయకుడివై యుద్ధం చెయ్యి. ఆలోచన చెప్పేవారు ఎక్కువ మంది ఉండడం భద్రత.

    7 మూర్ఖులకు జ్ఞానం అందని మాని పండే. గుమ్మం దగ్గర అలాంటి వారు మౌనంగా ఉంటారు.

  9. 2 దేవునిలో, మన ప్రభువైన యేసులో పూర్తి జ్ఞానం ద్వారా మీకు కృప, శాంతి విస్తరించు గాక!

    3 తన మహిమనుబట్టి, మంచి గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు. 4 వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా, లోకంలో ఉన్న దుర్మార్గపు కోరికల నాశనగుణం నుండి తప్పించుకుని మీరు తన స్వభావంలో పాలిభాగస్థులు కావాలన్నదే దేవుని ఉద్దేశం.

    5 ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి జ్ఞానం, 6 జ్ఞానానికి ఆశల అదుపు, ఆశల అదుపుకు ఓర్పు, ఓర్పుకు భక్తి, 7 భక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమకు దైవ ప్రేమ జోడించండి. 8 ఇవి మీలో నిలిచి ఉండి వృద్ధి చెందినపుడు, మన ప్రభు యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో మందకొడిగా, నిష్ఫలంగా ఉండరు.

  10. 9 ఈ ప్రేమ మూలంగా మీ గురించి మేం విన్న రోజు నుండీ మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు సంపూర్ణ జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం కలిగి ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం. 10 ప్రతి మంచి కార్యం విషయంలోనూ మీరు ఫలిస్తూ, దేవునికి సంబంధించిన జ్ఞానంలో పెరుగుతూ, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేలా, ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము ప్రార్ధిస్తున్నాం. 11 మహిమ ప్రభావాలతో కూడిన ఆయన శక్తి మిమ్మల్ని ప్రతివిధమైన సామర్థ్యం ఇచ్చి బలపరచాలని దేవుణ్ణి వేడుకుంటున్నాం. అదే మీకు సహనాన్నీ, పట్టుదలతో కొనసాగే శక్తినీ కలిగిస్తుంది.

    12 వెలుగు నివాసులుగా తనకోసం ప్రత్యేకించబడిన వారి వారసత్వంలో భాగం పంచుకోడానికి మనలను అర్హులుగా చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.

  11. 13 జ్ఞానం సంపాదించుకుని, వివేకం కలిగి ఉన్న మనిషి ధన్యుడు.

    14 వెండి వలన పొందే లాభం కన్నా జ్ఞానం సంపాదించుకోవడం మంచిది. మేలిమి బంగారం సంపాదించుకోవడం కన్నా జ్ఞానం వలన లాభం పొందడం ఉత్తమం.

    15 రత్నాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. అది నీకు ఇష్టమైన అన్ని వస్తువుల కంటే విలువైనది.

    16 జ్ఞానం కుడి చేతిలో సుదీర్ఘమైన ఆయుష్షు, ఎడమ చేతిలో సంపదలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.

    17 అది నడిపించే దారులు రమ్యమైనవి. దాని విధానాలు క్షేమం కలిగించేవి.

    18 దాన్ని అనుసరించే వాళ్ళకు అది జీవఫలాలిచ్చే వృక్షం. దాన్ని అలవరచుకునే వాళ్ళు ధన్యజీవులు.

    19 తన జ్ఞానంతో యెహోవా భూమిని సృష్టించాడు. వివేకంతో ఆయన ఆకాశ మండలాలను స్థిరపరచాడు.

    20 ఆయన తెలివివల్ల జలరాసులు అగాథం నుండి ప్రవహిస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలు మంచు బిందువులు కురిపిస్తున్నాయి.

    21 కుమారా, లోతైన జ్ఞానాన్ని, వివేకాన్ని పదిలం చేసుకో. వాటిని నీ మనసులో నుండి తొలగి పోనివ్వకు.

    22 జ్ఞానం, వివేకాలు నీకు ప్రాణప్రదంగా, నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి.

    23 అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు. నీ నడక ఎప్పుడూ తొట్రుపడదు.

  12. 14 తెలివి గలవారి మనస్సు జ్ఞానం కోసం వెదుకుతుంది. మూర్ఖులు మూఢత్వంతోనే తమ జీవనం సాగిస్తారు.

  13. 7 అందరి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కడికీ ఆత్మ తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. 8 ఎలా అంటే, ఒకే ఆత్మ ఒకడికి బుద్ధి వాక్కు, ఒకడికి జ్ఞాన వాక్కు, 9 మరొకడికి విశ్వాసం, మరొకడికి స్వస్థత వరం ఇస్తాడు. 10 ఆ ఆత్మే ఒకడికి అద్భుతాలు చేసే శక్తి, మరొకడికి ప్రవచనాలు పలికే శక్తి, మరొకడికి ఆత్మలను గుర్తించే శక్తి, మరొకడికి వివిధ రకాల భాషలు మాట్లాడే సామర్ధ్యం, మరొకడికి ఆ భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహిస్తున్నాడు. 11 ఆ ఆత్మ ఒక్కడే ఇవన్నీ చేస్తూ తనకు నచ్చినట్టు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడు.

    12 శరీరం ఒక్కటే, అందులో అనేక అవయవాలు ఉన్నాయి. అవన్నీ ఒకే శరీరంలో అవయవాలైనా శరీరం ఒకటే. క్రీస్తు కూడా అలానే ఉన్నాడు.

  14. 66 నేను నీ ఆజ్ఞలపై నమ్మిక ఉంచాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్చు.

  15. 15 తెలివి గలవారి హృదయం జ్ఞానాన్ని అన్వేషిస్తుంది. వివేకి అస్తమానం దాని పైనే గురి పెట్టుకుంటాడు.

  16. 1 యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు చూసి, ఇలా అన్నాడు, “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ కలిగించేలా, నీ కుమారుడికి మహిమ కలిగించు. 2 నువ్వు నీ కుమారుడికి అప్పగించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా మనుషులందరి మీదా ఆయనకు అధికారం ఇచ్చావు. 3 ఒకే ఒక్క సత్య దేవుడవైన నిన్నూ, నువ్వు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వతజీవం.

  17. 1 ఎందుకంటే మీ కోసమూ, లవొదికయ పట్టణంలోని వారి కోసమూ, నన్ను చూడని వారందరి కోసమూ నేను ఎంత తీవ్ర పోరాటం చేస్తున్నానో మీరు తెలుసుకోవాలి. 2 వారందరూ తమ హృదయాల్లో ప్రోత్సాహం పొందాలనీ ప్రేమలో ఐక్యం కావాలనీ నా అభిలాష. అప్పుడు వారికి కలిగే వాస్తవమైన అవగాహన వల్ల తమ హృదయాల్లో సంపూర్ణ నిశ్చయత కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును అర్థం చేసుకోగలగాలి. 3 జ్ఞానం, తెలివితేటల నిధులన్నీ క్రీస్తులో దాగి ఉన్నాయి.

  18. 1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, 2 “యూదా గోత్రానికి చెందిన బెసలేలును నేను నియమించుకున్నాను. అతడు ఊరీ కొడుకు, హూరు మనుమడు. 3 అతనికి నేను అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, సమస్త జ్ఞానం, నేర్పరితనం ప్రసాదించాను. అతణ్ణి నా ఆత్మతో నింపాను. 4 అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి. రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కను కోసి నునుపు చేయడంలో నిపుణుడు. 5 నేను ప్రసాదించిన సమస్త జ్ఞానం, వివేకాలతో అతడు పనులు జరిగిస్తాడు.

  19. 10 యెహోవా పట్ల భయం జ్ఞానానికి మూలం. ఆయన శాసనాలను అనుసరించేవారంతా మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం.

  20. 16 “యెరూషలేములో నాకంటే ముందున్న వారందరి కంటే నేను అధిక జ్ఞానం సంపాదించాను, సంపూర్ణమైన జ్ఞానాన్నీ విద్యనీ నేను నేర్చుకున్నాను” అని నా మనస్సులో అనుకున్నాను. 17 కాబట్టి జ్ఞానం, వెర్రితనం, బుద్ధిహీనత, వీటిని గ్రహించడానికి కష్టపడ్డాను. కానీ ఇది కూడా ఒకడు గాలిని పట్టుకోడానికి ప్రయాసపడడమే అని తెలుసుకున్నాను.

    18 విస్తారమైన జ్ఞానార్జనలో విస్తారమైన దుఃఖం ఉంది. ఎక్కువ తెలివి సంపాదించిన వారికి ఎక్కువ బాధ కలుగుతుంది.

  21. 16 దేవుడైన యెహోవా “ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు. 17 కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిషికి ఆజ్ఞాపించాడు.

  22. 22 దేవుడైన యెహోవా “ఇప్పుడు మనిషి మంచి చెడ్డలు తెలిసిన మనలాంటివాడయ్యాడు. కాబట్టి ఒకవేళ అతడు తన చెయ్యి చాపి ఆ జీవ వృక్షఫలం కూడా తీసుకుని తిని శాశ్వతంగా జీవిస్తాడేమో. అది మంచిది కాదు” అన్నాడు. 23 దేవుడైన యెహోవా అతణ్ణి ఏ నేలనుంచి తీశాడో ఆ నేలను సాగు చెయ్యడానికి ఏదెను తోటలోనుంచి అతణ్ణి పంపివేశాడు. 24 కాబట్టి దేవుడు ఏదెను తోటలోనుంచి ఆదామును వెళ్ళగొట్టి, ఏదెను తోటకు తూర్పు వైపు కెరూబులు, జీవవృక్షానికి వెళ్ళే దారిని కాపలా కాయడానికి ఇటు అటు తిరిగే అగ్నిఖడ్గం నిలబెట్టాడు.

  23. 7 నా దేవా, యెహోవా, నీవు నా తండ్రి దావీదుకు బదులుగా నీ సేవకుడైన నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుణ్ణి. రాజ్య వ్యవహారాలు జరిపించడానికి నాకు తెలివి చాలదు. 8 నీ దాసుడినైన నేను నీవు ఎన్నుకొన్న ప్రజల మధ్య ఉన్నాను. వారు గొప్ప జనాంగం కాబట్టి వారిని లెక్క పెట్టడం, ఈ విశాలమైన దేశాన్ని అజమాయిషీ చేయడం నాకు అసాధ్యం. 9 నీ ఈ గొప్ప జనాంగానికి ఎవరు న్యాయం తీర్చగలరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ ప్రజలకు న్యాయం తీర్చగలిగేలా నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయం ఇవ్వు.”

    10 సొలొమోను చేసిన ఈ మనవి దేవునికి ఇష్టమైంది. 11 కాబట్టి దేవుడు అతనితో “దీర్ఘాయువునూ ఐశ్వర్యాన్నీ, నీ శత్రువుల ప్రాణాలనూ అడగకుండా, న్యాయాన్ని గ్రహించడానికి వివేకం ఇమ్మని నీవు అడిగావు. 12 నీవు ఈ విధంగా అడిగినందువల్ల నీ మనవి ఆలకించాను. జ్ఞాన వివేకాలు గల హృదయం నీకిస్తున్నాను. పూర్వికుల్లో నీవంటివాడు ఒక్కడూ లేడు, ఇక మీదట ఉండడు.

  24. ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన

    1 యెహోవా, నన్ను పరీక్షించి నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు.

    2 నేను కూర్చోవడం, నా నడక అంతా నీకు తెలుసు. నా మనసులో ఆలోచన పుట్టక ముందే అది నీకు తెలుసు.

    3 నేను వెళ్ళే స్థలాలు, నేను నిద్రించే నా పడక నువ్వు పరిశీలనగా చూస్తావు. నేను చేసే పనులన్నీ నీకు క్షుణ్ణంగా తెలుసు.

    4 యెహోవా, నా నోట మాట రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు.

    5 నా వెనకా, ముందూ, అంతటా నువ్వు ఉన్నావు. నీ సంరక్షణలో నన్ను ఉంచుకున్నావు.

    6 ఇలాంటి తెలివి నాకు అందనిది. అది ఆశ్చర్యకరం. అది నాకు అందదు.

  25. 6 యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు.

    7 మీరు నన్ను తెలుసుకుని ఉంటే, నా తండ్రిని కూడా తెలుసుకుని ఉండేవాళ్ళే. ఇప్పటినుంచి మీకు ఆయన తెలుసు. ఆయనను మీరు చూశారు” అన్నాడు. 8 ఫిలిప్పు యేసుతో, “ప్రభూ, తండ్రిని మాకు చూపించు. అది మాకు చాలు” అన్నాడు. 9 యేసు అతనితో, “ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ‘తండ్రిని చూపించు’ అని నువ్వు ఎలా అంటున్నావు? 10 నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నాం అని నువ్వు నమ్మడం లేదా? నేను మాట్లాడే మాటలు నా సొంత మాటలు కాదు. నాలో నివాసం ఉంటున్న తండ్రి తన పని చేస్తున్నాడు. 11 తండ్రిలో నేను, నాలో తండ్రి ఉన్నాం అని నమ్మండి. అదీ కాకపోతే, ఈ క్రియల గురించి అయినా నన్ను నమ్మండి.

  26. 28 యెహోవా పట్ల భయభక్తులే జ్ఞానం, దుష్టత్వం నుండి తొలగిపోవడమే వివేకం అని ఆయన మనుషులకు చెప్పాడు.

  27. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

    7 నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.

  28. 6 బుద్ధిహీనుడు జ్ఞానం కోసం వెదికినా అది దొరకదు. తెలివిగలవాడు తేలికగా జ్ఞానం పొందుతాడు.

    7 బుద్ధిహీనుడి దగ్గర మంచి మాటలు ఏమీ దొరకవు కనుక వాడితో స్నేహం చేయవద్దు.

    8 వివేకం ఉన్నవారు తమ ప్రవర్తన విషయంలో జ్ఞానం కలిగి జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. బుద్ధి లేనివారు తమ మూర్ఖత్వంతో మోసపూరిత కార్యాలు జరిగిస్తారు.

  29. 25 ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు, “తండ్రీ, పరలోకానికీ భూమికీ ప్రభూ, నీవు జ్ఞానులకూ తెలివైన వారికీ ఈ సంగతులను మరుగు చేసి చిన్న పిల్లలకు వెల్లడి పరచావు. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను. 26 అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకెంతో ఇష్టం. 27 సమస్తాన్నీ నా తండ్రి నాకు అప్పగించాడు. తండ్రి తప్ప కుమారుణ్ణి ఎవరూ ఎరగరు. కుమారుడూ, ఎవరికి వెల్లడించాలని కుమారుడు ఉద్దేశిస్తాడో వాడూ తప్ప మరి ఎవరూ తండ్రిని ఎరగరు.

  30. 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

    21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

  31. 33 ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం. ఆయన మార్గాలు మన ఊహకు అందనివి.

    34 “ప్రభువు మనసు తెలిసిన వాడెవడు?

    ఆయనకు సలహాలు ఇచ్చేదెవరు?

    35 ఆయన దగ్గర నుండి తిరిగి పొందాలని ముందుగా ఆయనకు ఇవ్వగలవాడెవడు?”

    36 సమస్తమూ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసం ఉన్నాయి. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక. ఆమేన్‌.

  32. 20 జ్ఞాని ఎక్కడున్నాడు? మేధావి ఎక్కడున్నాడు? సమకాలిక తర్కవాది ఎక్కడున్నాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు గదా? 21 లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేక పోయింది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో సంకల్పించాడు.

    22 యూదులు సూచనలు, అద్భుతాలు కావాలని కోరుతున్నారు. గ్రీకులు జ్ఞానం కావాలని వెదుకుతున్నారు. 23 అయితే మేము సిలువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకు ఒక అడ్డుబండగా, గ్రీసు దేశస్తులకు బుద్ధిహీనతగా ఉన్నాడు. 24 అయితే యూదులు గానీ, గ్రీకులు గానీ, ఎవరైతే పిలుపు పొందారో వారికి క్రీస్తు దేవుని శక్తీ దేవుని జ్ఞానమూ అయ్యాడు. 25 ఎందుకంటే దేవుని బుద్ధిహీనత మానవుల కంటే తెలివైనది, దేవుని బలహీనత మానవుల కంటే బలమైనది.

  33. 28 అప్పుడు వాళ్ళు నా కోసం మొరపెడతారు, కానీ నేను ఎలాంటి జవాబూ ఇవ్వను. నా కోసం ఆసక్తిగా వెతుకుతారు కానీ నేను వాళ్లకు కనబడను.

    29 జ్ఞానం అంటే వాళ్లకు అసహ్యం వేస్తుంది. యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం వాళ్లకు ఇష్టం లేకుండా పోయింది.

    30 వాళ్ళు నేను చెప్పిన నా మంచి ఆలోచనలు అంగీకరించలేదు. నా మందలింపును నిర్లక్ష్యం చేశారు.

    31 కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. విరక్తి కలిగే దాకా తమ స్వంత ఆలోచనలు అనుసరిస్తారు.

    32 ఉపదేశం పొందని వారు దేవుణ్ణి తిరస్కరించి నాశనమవుతారు. మూర్ఖుల నిర్లక్ష్యం వారిని నిర్మూలం చేస్తుంది.

    33 నా ఉపదేశం విని దాని ప్రకారం నడుచుకునేవాడు సురక్షితంగా నివసిస్తాడు. కీడు కలుగుతుందన్న భయం లేకుండా ప్రశాంతంగా ఉంటాడు.”

  34. 17 శ్రద్ధగా జ్ఞానుల ఉపదేశం ఆలకించు. నేనిచ్చే తెలివిని పొందడానికి మనసు లగ్నం చెయ్యి.

    18 నీ అంతరంగంలో వాటిని నిలుపుకోవడం, అవన్నీ నీ పెదవులపై ఉండడం ఎంతో రమ్యం.

    19 నీవు యెహోవాను ఆశ్రయించేలా నీకు, అవును, నీకే గదా నేను ఈ రోజున వీటిని ఉపదేశించాను?

    20 వివేకం, విచక్షణ గల శ్రేష్ఠమైన సూక్తులు నేను నీకోసం రాయలేదా?

    21 నిన్ను పంపేవారికి నీవు యథార్థంగా జవాబులిచ్చేలా, నమ్మదగిన సత్యవాక్కులు నీకు నేర్పించ లేదా?

  35. 20 “అన్ని యుగాల్లో దేవుని నామానికి స్తుతి కలుగు గాక. ఆయన జ్ఞానం, బల ప్రభావాలు కలిగినవాడు. 21 ఆయన కాలాలపై, సమయాలపై సమస్త అధికారం కలిగి ఉన్నవాడు. రాజులను నియమించేవాడూ, తొలగించేవాడూ ఆయనే. వివేకవంతులకు వివేకం, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించేది ఆయనే, 22 ఆయన గుప్తంగా ఉండే విషయాలను, రహస్యాలను వెల్లడి చేశాడు. పాతాళంలో జరిగే విషయాలు ఆయనకు తెలుసు, ఆయన చుట్టూ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. 23 మా పూర్వీకుల దేవా, నువ్వు నాకు వివేకాన్నీ, బలాన్నీ అనుగ్రహించావు. ఇప్పుడు మేము కోరుకున్నట్టు రాజుకు వచ్చిన సమస్యకు పరిష్కారం నువ్వే నాకు తెలియజేశావు. అందువల్ల నేను నిన్ను స్తుతిస్తున్నాను.”

  36. 1 జ్ఞానం కోరుకున్నవాడు గద్దింపుకు లోబడతాడు. దిద్దుబాటును తిరస్కరించేవాడు పశువుతో సమానం.

  37. 6 నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను.

    దహనబలుల కంటే నన్ను గురించిన జ్ఞానం, అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలని కోరుతున్నాను.

  38. 31 కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, “మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు. 32 సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అన్నాడు.

  39. 9 దీన్ని గూర్చి ‘దేవుడు తనను ప్రేమించే వారికోసం ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయం ఊహకు అందలేదు’ అని రాసి ఉంది. 10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా వెల్లడి చేశాడు. ఆ ఆత్మ అన్నిటినీ, చివరికి దేవుని లోతైన రహస్యాలను కూడ పరిశోధిస్తాడు.

    11 ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్తిలోని ఆత్మకే తెలుస్తాయి గానీ వేరొక వ్యక్తికెలా తెలుస్తాయి? ఆలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప మరెవరికీ తెలియవు. 12 దేవుడు మనకు ఉచితంగా దయచేసిన వాటిని తెలుసుకోవడం కోసం మనం లౌకికాత్మను కాక దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందాము. 13 వాటిని మేము మానవ జ్ఞానం నేర్పగలిగే మాటలతో గాక ఆత్మసంబంధమైన విషయాలను ఆత్మసంబంధమైన వాటితో సరి చూసుకుంటూ, ఆత్మ నేర్పే మాటలతోనే బోధిస్తున్నాం.

    14 సహజ సిద్ధమైన మనిషి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ఎందుకంటే అవి అతనికి తెలివితక్కువగా కనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగానే వివేచించగలం. కాబట్టి అతడు వాటిని గ్రహించలేడు.

  40. 18 ఎవరూ తనను తాను మోసగించుకోవద్దు. మీలో ఎవరైనా ఈ లోకరీతిగా తాను జ్ఞానం గలవాడిని అనుకుంటే, జ్ఞానం పొందడం కోసం అతడు తెలివి తక్కువవాడు కావాలి. 19 ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి తెలివి తక్కువతనమే. “జ్ఞానులను వారి కుయుక్తుల్లోనే ఆయన పట్టుకుంటాడు” అనీ, 20 “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు” అనీ రాసి ఉంది కదా.

  41. 29 దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్నీ బుద్ధినీ అత్యంత వివేచన గల మనస్సునూ దయ చేశాడు. 30 అతనికి కలిగిన జ్ఞానం తూర్పుదేశాల వారి జ్ఞానం కంటే, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటే మించిపోయింది. 31 అతడు మానవులందరి కంటే, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కొడుకులు హేమాను, కల్కోలు, దర్ద అనేవారి కంటే జ్ఞానవంతుడు. కాబట్టి అతని కీర్తి చుట్టూ ఉన్న ప్రజలందరిలో వ్యాపించింది. 32 అతడు 3,000 సామెతలు చెప్పాడు. 1,005 కీర్తనలు రచించాడు.

    33 లెబానోనులో పెరిగే దేవదారు వృక్షమే గాని, గోడలో నుండి మొలిచే హిస్సోపు మొక్కే గాని, చెట్లన్నిటిని గూర్చీ అతడు రాశాడు. ఇంకా మృగాలు, పక్షులు, పాకే జంతువులు, జలచరాలు, అన్నిటిని గురించీ అతడు రాశాడు. 34 అతని జ్ఞానం గురించి వినిన భూరాజులందరిలో నుండీ ప్రజలందరిలో నుండీ అతని జ్ఞానవాక్కులు తెలుసుకోడానికి మనుషులు సొలొమోను దగ్గరకి వచ్చారు.

  42. 5 జ్ఞానం, వివేకం సంపాదించుకో. నా మాటలను విస్మరించ వద్దు, వాటినుండి తొలగిపోవద్దు.

    6 జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అది నిన్ను కాపాడుతుంది. దాన్ని ప్రేమిస్తూ ఉంటే అది నిన్ను రక్షిస్తుంది.

  43. 31 చూడు, నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో, ఒక కొత్త ఒప్పందం స్థిరం చేసే రోజులు వస్తున్నాయి,” ఇది యెహోవా వాక్కు.

    32 “అది ఐగుప్తులోనుంచి నేను వాళ్ళ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చిన రోజుల్లో వాళ్ళ పితరులతో నేను చేసిన ఒప్పందం లాంటిది కాదు. నేను వాళ్ళకు ఒక భర్తగా ఉన్నా, ఆ రోజుల్లో వాళ్ళు ఆ ఒప్పందం ఉల్లంఘించారు.” ఇది యెహోవా వాక్కు.

    33 “కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు.

    34 “అప్పుడు ప్రతివాడూ తన పొరుగువాడికి, తన సహోదరునికి బోధిస్తూ, ‘యెహోవాను తెలుసుకో!’ అని ఇక చెప్పడు. ఎందుకంటే, వాళ్ళల్లో చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వాళ్ళ దోషాలు క్షమించి, వాళ్ళ పాపాలు ఇంక ఎన్నడూ మనసులో పెట్టుకోను.” ఇది యెహోవా వాక్కు.

  44. 17 ఈ నలుగురు యువకుల విషయం ఏమిటంటే, దేవుడు వారికి జ్ఞానం, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత, తెలివితేటలు అనుగ్రహించాడు. దానియేలుకు సకల విధాలైన దైవదర్శనాలకు, కలలకు అర్థాలు, భావాలు వివరించగలిగే సామర్థ్యం దేవుడు అనుగ్రహించాడు.

  45. 3 బుద్ధిమంతులైతే ఆకాశమండలం లోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. నీతిమార్గం అనుసరించి నడుచుకొనేలా ఎవరు అనేకమందిని తిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు. 4 దానియేలూ, నీవు ఈ మాటలను దాచి అంత్యకాలం వరకూ ఈ గ్రంథానికి సీలు వెయ్యి. చాలామంది నలుదిశల సంచరించినందువల్ల తెలివి అధికమవుతుంది.”

  46. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

    18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు. 19 ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. 20 దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు.

  47. 15 మీరు శరీర సంబంధంగా తీర్పు తీరుస్తారు. నేను ఎవరికీ తీర్పు తీర్చను. 16 అయినా నేను ఒంటరిని కాదు. నేను నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నేను తీర్పు తీర్చినా అది సత్యమే అవుతుంది. 17 ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం సత్యం అవుతుందని మీ ధర్మశాస్త్రంలోనే రాసి ఉంది కదా!

    18 నా గురించి సాక్ష్యం నేను చెప్పుకొంటాను. నన్ను పంపిన తండ్రి కూడా నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు” అన్నాడు. 19 వారు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు. అందుకు యేసు, “మీకు నేను గానీ నా తండ్రి గానీ తెలియదు. ఒకవేళ నేను మీకు తెలిస్తే నా తండ్రి కూడా తెలిసే ఉంటాడు” అన్నాడు.

  48. 18 మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు కృపలో అభివృద్ధి పొందండి. ఆయనకే ఇప్పుడూ, శాశ్వతంగా మహిమ కలుగు గాక! ఆమేన్.

  49. 9 దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టునూ అక్కడ నేలలోనుంచి మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్నీ, ఏది మంచో, ఏది చెడో తెలిపే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు.

  50. 31 “వినండి, ఊరు కొడుకు, హూరు మనుమడు బెసలేలును యెహోవా ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి. 32 రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కలను కోసి నునుపు చేయడంలో నిపుణుడు. 33 అతనికి ఆయన అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, జ్ఞానం, నైపుణ్యం ప్రసాదించాడు. అతణ్ణి దేవుడు తన ఆత్మతో నింపాడు. 34 అతడు, దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు ఇతరులకు ఈ పనులు నేర్పించడానికి సామర్ధ్యం కలిగినవాళ్ళు.

    35 వాళ్ళు ఆ విధమైన ఎలాంటి పని అయినా చేయడానికి దేవుడు వాళ్ళకు సామర్ధ్యం ఇచ్చాడు. చెక్కేవాళ్ళ పనిగానీ, చిత్రకారుల పనిగానీ నీలం ఊదా ఎర్ర రంగు సన్నని నార దారాలతో బుటాపని గానీ, నేతపని గానీ వాళ్లకు బాగా తెలుసు. వాళ్ళు అలాంటి పనులు చెయ్యగలరు, చేయించగలరు.”

  51. 22 “జ్ఞాన హీనులారా, జ్ఞానం తెచ్చుకోకుండా ఎంతకాలం ఉండాలని కోరుకుంటారు? అపహాసకులారా, మీరు ఎగతాళి చేస్తూ ఎన్నేళ్ళు ఆనందంగా కాలం గడుపుతారు? బుద్ధిహీనులారా, మీరు ఎంతకాలం జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు?

  52. 10 వెండి కోసం, స్వచ్ఛమైన బంగారం కోసం ఆశ పడకుండా నా ఉపదేశం అంగీకరించి, తెలివితేటలు సంపాదించుకోండి.

  53. 11 విలువైన ముత్యాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. జ్ఞానంతో అత్యంత విలువైన ధన సంపదలు సాటిరావు.

    12 నాలో జ్ఞానం, వివేకం నివసిస్తున్నాయి. మంచి చెడ్డలు ఏమిటో నేను గ్రహించగలను.

    13 దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, అహంకారం, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం.

    14 అమితమైన జ్ఞానం, వివేకంతో కూడిన ఆలోచనలు నేనే అనుగ్రహిస్తాను. జ్ఞానానికి బల ప్రభావాలకు ఆధారం నేనే.

  54. 2 గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది. జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు.

  55. 16 విలువైన బంగారం సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్ఠం. వెండి సంపాదించడం కంటే తెలివితేటలు కోరుకోవడం ఉపయోగకరం.

  56. 23 సత్యాన్ని అమ్మివేయ వద్దు. దాన్ని కొని ఉంచుకో. జ్ఞానం, ఉపదేశం, వివేకం కొని ఉంచుకో.

  57. 10 “ఇప్పటి రోజుల కంటే గతించిన రోజులు ఎందుకు మంచివి” అని అడగొద్దు.

    అది తెలివైన ప్రశ్న కాదు.

    11 జ్ఞానం మనం వారసత్వంగా పొందిన ఆస్తితో సమానం.

    భూమి పైన జీవించే వారందరికీ అది ఉపయోగకరం.

    12 జ్ఞానం, డబ్బు, ఈ రెండూ భద్రతనిచ్చేవే.

    అయితే జ్ఞానంతో లాభం ఏమిటంటే తనను కలిగి ఉన్నవారికి అది జీవాన్నిస్తుంది.

  58. 1 యెష్షయి వేరు నుంచి చిగురు పుడుతుంది. అతని వేరుల నుంచి కొమ్మ ఎదిగి ఫలిస్తుంది.

    2 జ్ఞానవివేకాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, ఆలోచన బలాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, తెలివినీ యెహోవా పట్ల భయభక్తులనూ పుట్టించే యెహోవా ఆత్మ అతని మీద నిలుస్తుంది.

  59. 16 దానికి యేసు, “నేను చేసే ఉపదేశం నాది కాదు. ఇది నన్ను పంపిన వాడిదే. 17 దేవుని ఇష్టప్రకారం చేయాలని నిర్ణయం తీసుకున్నవాడు నేను చేసే ఉపదేశం దేవుని వలన కలిగిందో లేక నా స్వంత ఉపదేశమో తెలుసుకుంటాడు. 18 తనంతట తానే బోధించేవాడు సొంత గౌరవం కోసం పాకులాడతాడు. తనను పంపిన వాని గౌరవం కోసం తాపత్రయ పడేవాడు సత్యవంతుడు. ఆయనలో ఎలాంటి దుర్నీతీ ఉండదు.

  60. 1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. 2 దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే.

  61. 14 ఆయనే మన శాంతి. ఆయన యూదులనూ యూదేతరులనూ ఏకం చేశాడు. మన ఉభయులనూ విడదీస్తున్న విరోధమనే అడ్డుగోడను తన శరీరం ద్వారా కూలగొట్టాడు. 15 అంటే, ఆ ఇద్దరి నుండి ఒక కొత్త ప్రజను సృష్టించడానికి విధులూ ఆజ్ఞలూ గల ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడు. 16 వారి మధ్య ఉన్న వైరాన్ని సిలువ ద్వారా నిర్మూలించి, వీరిద్దరినీ దేవునితో ఏకం చేసి శాంతి నెలకొల్పాలని ఇలా చేశాడు 17 యేసు వచ్చి దూరంగా ఉన్నవారికి సువార్తను, శాంతిని ప్రకటించాడు. దగ్గరగా ఉన్నవారికి శాంతిసమాధానాలు ప్రకటించాడు. 18 యేసు ద్వారానే మీరూ మేమూ ఒకే ఆత్మ ద్వారా తండ్రిని చేరగలం.

  62. 9 మీ ప్రేమ జ్ఞానంతో, సంపూర్ణ వివేచనతో అంతకంతకూ వృద్ధి చెందుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. 10 దేవునికి మహిమ, స్తుతి కలిగేలా మీరు శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి తెలుసుకుని, యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతిఫలాలతో నిండి, క్రీస్తు వచ్చే రోజు వరకూ యథార్థంగా నిర్దోషంగా ఉండాలన్నదే నా ప్రార్థన

  63. 6 స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.

    7 అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు.

  64. 12 కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు.

  65. 13 వివేకం గలవాడి మాటల్లో జ్ఞానం కనబడుతుంది. బుద్ధిలేనివాడి వీపుకు బెత్తం దెబ్బలే ప్రతిఫలం.

    14 జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. మూర్ఖుల మాటలు నాశనం కోరుకుంటాయి.

  66. 33 యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం వృద్ది చేసుకునే సాధనం. వినయం కలిగి ఉంటే గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి.

  67. 13 కుమారా, తేనె తాగు. అది రుచికరం. తేనెపట్టునుండి కారే తేనె తినుము అది నీ నాలుకకి మధురం గదా.

    14 నీ ఆత్మకు జ్ఞానం అలాటిదని తెలుసుకో. అది నీకు దొరికితే నీకు మంచి భవిషత్తు ఉంటుంది. నీకు ఆశాభంగం కలగదు.

  68. 5 యెహోవా మహా ప్రశంస పొందాడు. ఆయన ఉన్నత స్థలంలో నివసిస్తున్నాడు. ఆయన సీయోనును నీతితో, న్యాయంతో నింపుతాడు.

    6 నీ కాలంలో నీ స్థిరత్వం ఆయనే.

    నీకు పుష్కలమైన రక్షణ, జ్ఞానమూ, వివేకమూ ఆయనే. యెహోవా భయం అతని ఐశ్వర్యం.

  69. 23 ఆయన పస్కా పండగ రోజుల్లో యెరూషలేములో ఉన్నప్పుడు చాలామంది ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన నామంలో విశ్వాసం ఉంచారు. 24 అయితే యేసుకు అందరూ తెలుసు. కాబట్టి ఆయన వారిని సంపూర్ణంగా నమ్మలేదు. 25 ఆయనకు మనుషుల అంతరంగం బాగా తెలుసు. ఎవరూ మనుషుల గురించి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు.

  70. 16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.

  71. 3 ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, సమ్మతమైనది. 4 మానవులంతా రక్షణ పొంది సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు.

  72. 20 తిమోతీ, ప్రభువు నీకు అప్పగించిన దాన్ని కాపాడుకుంటూ భక్తిలేని మాటలకూ, మూర్ఖపు వాదాలకూ దూరంగా ఉండు. కొందరు వాటిని జ్ఞానం అనుకుంటారు 21 కొందరు వాటిని మనఃపూర్వకంగా విశ్వసించి విశ్వాసం విషయంలో తప్పిపోయారు.

    కృప మీకు తోడై ఉండు గాక.

  73. 1 నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. 2 మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం.

    3 ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది. 4 “నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు. 5 కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు.

    6 ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి.

  74. 4 ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు. 5 నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.

    6 ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి.

    7 మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి.

    8 అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి. 9 మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి.

  75. 3 యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది.

    మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే.

    కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు.

    అహంకారమైన మాటలు మీ నోట నుంచి రానియ్యవద్దు.

  76. 12 వృద్ధులు జ్ఞానులు. ఆయుష్షు పెరిగే కొద్దీ వివేకం పెరుగుతుంది.

    13 అయితే దేవునికి జ్ఞానం, బల ప్రభావాలు ఉన్నాయి. ఆలోచనా, వివేకమూ ఆయనకు ఉన్నాయి.

  77. 12 అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది?

    13 మనిషికి దాని విలువ తెలియదు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు.

    14 అగాధం “అది నాలో లేదు” అంటుంది. “నా దగ్గర లేదు” అని సముద్రం అంటుంది.

    15 బంగారం దానికి సాటి కాదు. దాని వెల కట్టడానికి వెండిని తూచడం పనికి రాదు.

    16 అది ఓఫీరు బంగారంతోగానీ ప్రశస్తమైన గోమేధికంతో, నీలంతోగానీ కొనగలిగింది కాదు.

    17 సువర్ణమైనా స్ఫటికమైనా దానితో సాటిరావు. ప్రశస్తమైన బంగారు నగలు ఇచ్చి దాన్ని తీసుకోలేము.

  78. 21 ఆయన దృష్టి మనుషుల మార్గాల మీద ఉంది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు.

  79. 7 జ్ఞానం సంపాదించుకోవడమే బుద్ధి వివేకాలకు మూలం. జ్ఞానం కోసం నీకు ఉన్నదంతా ఖర్చు పెట్టు.

  80. 10 గర్వాంధుడు కలహాలు రేపుతాడు. మంచి మాటలు ఆలకించే వారికి జ్ఞానం చేకూరుతుంది.

  81. 7 జ్ఞానుల మాటలు తెలివిని వ్యాప్తి చేస్తాయి. మూర్ఖుల మనస్సు స్థిరంగా ఉండదు.

  82. 15 బంగారం, విస్తారంగా రత్నాలు ఉన్నాయి. కానీ వివేకంగా మాట్లాడే పెదాలు అమూల్యమైన ఆభరణాలు.

  83. 24 అన్నపానాలు పుచ్చుకోవడం కంటే, తన కష్టంతో సంపాదించిన దానితో తృప్తి చెందడం కంటే మానవునికి శ్రేష్టమైంది లేదు. అది దేవుని వల్లనే కలుగుతుందని నేను గ్రహించాను. 25 ఆయన అనుమతి లేకుండా భోజనం చేయడం, సంతోషించడం ఎవరికి సాధ్యం? 26 ఎందుకంటే ఎవరైతే దేవుణ్ణి సంతోషింప జేస్తారో వాడికి దేవుడు జ్ఞానం, తెలివి, ఆనందం ఇస్తాడు. అయితే తనకిష్టమైన వాడికి ఇవ్వడానికి కష్టపడి పోగుచేసే పనిని ఆయన పాపాత్మునికి అప్పగిస్తాడు. ఇది కూడా నిష్ప్రయోజనం, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా ఉంది.

  84. 13 ఇంకా జరుగుతున్న దాన్ని చూసినప్పుడు నేను అది జ్ఞానం అనుకున్నాను. అది నా దృష్టికి గొప్పదిగా ఉంది. 14 ఏమంటే కొద్దిమంది నివసించే ఒక చిన్న పట్టణం ఉంది. దానిమీదికి ఒక గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడించి దాని ఎదురుగా గొప్ప బురుజులు కట్టించాడు. 15 అయితే అందులో ఉండే ఒక బీదవాడు తన తెలివితో ఆ పట్టణాన్ని కాపాడాడు. అయినా ఎవరూ అతణ్ణి జ్ఞాపకం ఉంచుకోలేదు.

    16 కాబట్టి నేనిలా అనుకున్నాను “బలం కంటే తెలివి శ్రేష్ఠమేగాని బీదవారి తెలివిని, వారి మాటలను ఎవరూ లెక్కచేయరు.”

    17 మూర్ఖులను పాలించేవాడి కేకలకంటే మెల్లగా వినిపించే జ్ఞానుల మాటలు మంచివి.

    18 యుద్ధాయుధాల కంటే తెలివి మంచిది.

    ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు.

  85. 9 నా పరిశుద్ధ పర్వతమంతటి మీద, ఏ మృగమూ హాని చెయ్యదు, నాశనం చెయ్యదు. ఎందుకంటే సముద్రం నీటితో నిండి ఉన్నట్టు లోకం యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.

  86. 5 “నీ తల్లి గర్భంలో నీకు రూపం రాక ముందే నువ్వు నాకు తెలుసు. నువ్వు గర్భం నుండి బయట పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను.

    జనాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను.”

  87. 23 యెహోవా చెప్పేదేమంటే “తెలివైనవాడు తన తెలివిని బట్టీ బలవంతుడు తన బలాన్ని బట్టీ గర్వించకూడదు. అలాగే ధనవంతుడు తన ఆస్తిని బట్టి గర్వించకూడదు.

    24 దేనిలో అతిశయించాలంటే, ఈ భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడంలోనే అతిశయించాలి.

    అలాటి వాటిలోనే నేను ఆనందిస్తాను.”

  88. 7 అంతే కాక మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరుల్లాగా వృథా మాటలు పదే పదే పలక వద్దు. చాలా ఎక్కువ మాట్లాడితేనే దేవుడు వింటాడని వారు అనుకుంటారు.

    8 కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు.

  89. 22 ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు. 23 అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.

    24 “కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు. 25 వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు. 26 నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు. 27 వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం.”

  90. 17 ఆయనకు వారి ఆలోచనలన్నీ తెలుసు. ఆయన వారితో ఇలా అన్నాడు, “తనకు తానే వ్యతిరేకంగా వేరైపోయిన ఏ రాజ్యమైనా నశించి పోతుంది. తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోతుంది.

  91. 3 ఆయన మీద ఇలాంటి ఆశాభావం నిలిపిన ప్రతి ఒక్కడూ, ఆయన పవిత్రుడై ఉన్న విధంగా తనను తాను పవిత్రం చేసుకుంటాడు. 4 పాపం చేసే ప్రతివాడూ అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. పాపమంటే అక్రమమే.

    5 మన పాపాలు తీసివేయడానికి క్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయనలో ఏ పాపమూ లేదు. 6 ఆయనలో నిలిచి ఉన్నవారెవరూ పాపం చేస్తూ ఉండరు. పాపం చేస్తూ ఉన్నవాడు, ఆయన ఎవరో తెలుసుకోలేదు, ఆయనను ఎన్నడూ చూడలేదు.

    7 పిల్లలూ, మిమ్మల్ని ఎవ్వరూ తప్పు దారి పట్టించకుండా జాగ్రత్త పడండి. క్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టుగా, నీతిని జరిగించే ప్రతి వాడూ నీతిపరుడు. 8 పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు.