69 Bible Verses About Harvest

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Harvest
  1. 35 యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ, అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేస్తూ అన్ని పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేశాడు. 36 ఆయన ప్రజాసమూహాలను చూసి వారి మీద జాలి పడ్డాడు. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల్లాగా నిస్పృహగా, చెదరిపోయి ఉన్నారు. 37 ఆయన తన శిష్యులతో, “కోత చాలా ఎక్కువగా ఉంది. కానీ పని వారు తక్కువగా ఉన్నారు. 38 కాబట్టి తన కోతకు కూలి వారిని పంపమని కోత యజమానిని బ్రతిమాలండి” అని తన శిష్యులతో చెప్పాడు.

  2. 34 యేసు వారిని చూసి, “నన్ను పంపించిన వాని ఇష్టాన్ని చేయడం, ఆయన పని చేసి ముగించడమే నా ఆహారం. 35 పంట కోయడానికి కోతకాలం రావాలంటే ఇంకా నాలుగు నెలలు ఉన్నాయని మీరు చెబుతారు కదా! మీ తలలెత్తి పొలాలను చూడండి. అవి ఇప్పటికే పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉన్నాయని మీతో చెబుతున్నాను. 36 విత్తనాలు చల్లేవాడూ పంట కోసేవాడూ కలసి సంతోషించేలా కోసేవాడు జీతం తీసుకుని శాశ్వత జీవం కోసం ఫలాన్ని సమకూర్చుకుంటున్నాడు.

    37 ఈ విషయంలో “విత్తనాలు చల్లేది ఒకరు, పంట కోసేది మరొకరు, అనే మాట నిజమే. 38 మీరు దేని కోసం ప్రయాస పడలేదో దాన్ని కోయడానికి మిమ్మల్ని పంపాను. ఇతరులు చాకిరీ చేశారు. వారి కష్టఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు” అన్నాడు.

  3. 7 మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.

    8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు. 9 మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము. 10 కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.

  4. 18 పొంగజేసే పిండి లేని రొట్టెల పండగ ఆచరించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఐగుప్తునుండి మీరు బయలుదేరి వచ్చిన ఆబీబు నెలలో నియమించిన సమయంలో ఏడు రోజులపాటు పొంగజేసే పిండి లేని రొట్టెలు తినాలి. మీరు అబీబు నెలలో ఐగుప్టులో నుండి బయలుదేరి వచ్చారు గదా.

    19 జంతువుల్లో మొదట పుట్టిన ప్రతి పిల్ల నాది. నీ పశువుల్లో మొదటిగా పుట్టిన ప్రతి మగది, అది దూడ గానీ, గొర్రెపిల్ల గానీ అది నాకు చెందుతుంది. 20 గాడిదను విడిపించాలంటే దానికి బదులు గొర్రెపిల్లను అర్పించాలి. గాడిదను విమోచించకపోతే దాని మెడ విరగగొట్టాలి. మీ సంతానంలో పెద్ద కొడుకుని వెల చెల్లించి విడిపించాలి. నా సన్నిధానంలో ఒక్కడు కూడా ఖాళీ చేతులతో కనిపించకూడదు.

    21 ఆరు రోజులు మీ పనులు చేసుకున్న తరువాత ఏడవ రోజున విశ్రాంతి తీసుకోవాలి. అది పొలం దున్నే కాలమైనా, కోత కోసే కాలమైనా. 22 మీ పొలాల్లో పండిన గోదుమల తొలి పంటల కోత సమయంలో వారాల పండగ ఆచరించాలి. సంవత్సరం ముగింపులో పొలాలనుండి నీ వ్యవసాయ ఫలాన్ని కూర్చుకుని జనమంతా సమకూడి పండగ ఆచరించాలి.

  5. 9 యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు 10 “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. నేను మీకు ఇస్తున్న దేశానికి మీరు వచ్చి దాని పంట కోసేటప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని దగ్గరికి తేవాలి.

  6. 13 అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం నాకిలా వినిపించింది, “ఇలా రాయి. ‘ఇక నుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు దీవెన పొందినవారు.’” నిజమే, వారు తమ బాధ ప్రయాసలన్నీ విడిచి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారు చేసిన పనులు వారి వెనకే వెళ్తాయి.

    14 మళ్ళీ నేను చూసినప్పుడు ఒక తెల్లని మేఘం కనిపించింది. ఆ మేఘంపై మనుష్య కుమారుడి లాంటి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది. 15 అప్పుడు మరో దూత దేవాలయంలో నుండి బయటకు వచ్చి మేఘంపై కూర్చున్న వ్యక్తితో పెద్ద స్వరంతో ఇలా అన్నాడు, “పంట కోసే సమయం వచ్చింది. భూమి పంట పండింది. నీ కొడవలితో కోయడం మొదలుపెట్టు.” 16 అప్పుడు మేఘంపై కూర్చున్న వ్యక్తి భూమి మీదికి కొడవలి విసిరాడు. వెంటనే భూమి మీద కోత జరిగింది.

    17 అంతలోనే పరలోకంలోని ఆలయంలో నుండి మరో దూత బయటకు వచ్చాడు. అతని చేతిలో కూడా ఒక పదునైన కొడవలి ఉంది. 18 మరో దూత బలిపీఠంలో నుండి బయటకు వచ్చాడు. ఇతనికి అగ్నిపై అధికారం ఉంది. ఇతడు పదునైన కొడవలి చేతిలో పట్టుకున్న దూతను పెద్ద కేక పెట్టి పిలిచాడు, “భూమి మీద ద్రాక్ష పళ్ళు పండాయి. పదునైన నీ కొడవలితో ద్రాక్ష గుత్తులు కోయి” అన్నాడు. 19 అప్పుడు ఆ దూత తన కొడవలిని భూమి మీదికి విసిరి భూమిమీద ఉన్న ద్రాక్షగుత్తులను కోశాడు. వాటిని దేవుని ఆగ్రహమనే గొప్ప ద్రాక్ష గానుగ తొట్టిలో పడవేశాడు.

    20 పట్టణానికి బయట ఆ ద్రాక్ష గానుగ తొట్టిలో ద్రాక్షలు తొక్కడం జరిగింది. దానిలో నుండి రక్తం గుర్రం కళ్ళెం అంత ఎత్తున సుమారు రెండు వందల మైళ్ళ వరకూ ప్రవహించింది.

  7. 22 భూమి ఉన్నంత వరకూ విత్తనాలు నాటేకాలం, కోతకాలం, వేసవి, శీతాకాలాలు, పగలూ రాత్రీ ఉండక మానవు” అని తన హృదయంలో అనుకున్నాడు.

  8. 5 బుద్ధిగల కుమారుడు ఎండాకాలంలో సమకూర్చుకుంటాడు. పంట కోత సమయంలో నిద్రపోయే కుమారుడు కుటుంబానికి అవమానం కలిగిస్తాడు.

  9. 3 నువ్వు ప్రజలను విస్తరింపజేశావు. వాళ్ళ సంతోషం వృద్ధి చేశావు. కోతకాలంలో మనుషులు సంతోషంగా ఉన్నట్టు, కొల్లసొమ్ము పంచుకునే వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు వాళ్ళు నీ సన్నిధిలో సంతోషంగా ఉన్నారు.

  10. 24 వారు “రండి, మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు చూపుదాం. తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని వాటి కాలంలో కురిపించేవాడు ఆయనే కదా.

    నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను మనకు వచ్చేలా చేసేవాడు ఆయనే కదా” అని తమ మనస్సులో అనుకోరు.

  11. 36 అప్పుడాయన ప్రజలను పంపివేసి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పొలంలోని కలుపు మొక్కలను గురించిన ఉపమానం అర్థం మాకు చెప్పు” అని అడిగారు. 37 అందుకాయన ఇలా అన్నాడు, “మంచి విత్తనం చల్లేది మనుష్య కుమారుడు. 38 పొలం ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించిన వారు. కలుపు మొక్కలు దుష్టుని సంబంధులు. 39 వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోత కోసే వారు దేవదూతలు. 40 కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది.

  12. 2 వారిని పంపిస్తూ ఆయన వారితో ఇలా అన్నాడు, “కోత ఎక్కువగా ఉంది. పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి పనివారిని పంపమని కోత యజమానిని వేడుకోండి. 3 మీరు వెళ్ళండి. ఇదిగో వినండి, తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. 4 మీరు డబ్బుగానీ సంచిగానీ చెప్పులుగానీ తీసుకువెళ్ళవద్దు. దారిలో ఎవరినీ పలకరించవద్దు.

  13. 9 మీరు మీ పొలం పంట కోసేటప్పుడు నీ పొలం మూలల్లొ పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగె ఏరుకోకూడదు. నీ పండ్ల చెట్ల పరిగెను సమకూర్చుకోకూడదు. 10 నీ ద్రాక్ష తోటలో పండ్లన్నిటినీ సేకరించుకో కూడదు. ద్రాక్ష తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు. పేదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి.

  14. 17 ఇది గోదుమ పంట కోసే కాలం గదా. మీ కోసం రాజును నియమించమని కోరుకోవడం ద్వారా యెహోవా దృష్టిలో మీరు ఘోరమైన తప్పిదం చేశారని మీరు గ్రహించి తెలుసుకొనేలా యెహోవా ఉరుములు, వర్షం పంపాలని నేను ఆయనను వేడుకొంటున్నాను.” 18 సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములు, వర్షం పంపించగా ప్రజలంతా యెహోవాకు, సమూయేలుకు అమితంగా భయపడ్డారు.

  15. 12 రాజ్యాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి.

    చుట్టు పక్కలుండే రాజ్యాలకు

    తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.

    13 పంట పండింది. కొడవలి పెట్టి కోయండి.

    రండి, ద్రాక్ష పళ్ళను తొక్కండి. గానుగ నిండి ఉంది.

    తొట్లు పొర్లి పారుతున్నాయి.

    వారి అపరాధం చాలా ఎక్కువగా ఉంది.

  16. 30 కోతకాలం వరకూ రెంటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో మొదట కలుపు మొక్కలను పోగు చేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి. గోదుమలను నా గిడ్డంగిలో చేర్చండి, అని కోత కోసే వారికి చెబుతాను’ అన్నాడు.”

  17. 10 ఎందుకంటే నీ రక్షణకు కారకుడైన దేవుణ్ణి నువ్వు మర్చి పోయావు. నీ బలానికి ఆధారంగా ఉన్న బండను అలక్ష్యం చేశావు.

    కాబట్టి నువ్వు అందమైన మొక్కలను నాటావు. అన్య దేశాల ద్రాక్ష చెట్లు నాటావు.

    11 నువ్వు వాటిని నాటిన రోజున దానికి కంచె వేసి సేద్యం చేశావు. త్వరలోనే నీ విత్తనాలు ఫలించి మొక్కలు పెరిగాయి.

    కానీ అమితమైన దుఃఖం, భయంకరమైన విచారం కలిగే రోజున నీ పంట విఫలమవుతుంది.

  18. 7 కోతకాలానికి మూడు నెలలు ముందే

    వానలేకుండా చేశాను.

    ఒక పట్టణం మీద వాన కురిపించి

    మరొక పట్టణం మీద కురిపించలేదు.

    ఒక చోట వాన పడింది,

    వాన పడని పొలం ఎండిపోయింది.

  19. 19 మీ పొలంలో మీ పంట కోస్తున్నప్పుడు పొలంలో ఒక పన మర్చిపోతే దాన్ని తెచ్చుకోడానికి మీరు తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. మీ దేవుడైన యెహోవా మీరు చేసే పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. 20 మీ ఒలీవ పండ్లను ఏరుకునేటప్పుడు మీ వెనక ఉన్న పరిగెను ఏరుకోకూడదు. అవి పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. 21 మీ ద్రాక్షపండ్లను కోసుకొనేటప్పుడు మీ వెనకపడిపోయిన గుత్తిని ఏరుకోకూడదు. అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి.

  20. 4 యెహోవా నాకు చెప్పిన మాట ఇదే. “వేసవిలో ఉడుకెత్తే వేడిలా, కోతకాలంలో ఏర్పడే పొగమంచు మబ్బులా

    నేను నిశ్శబ్దంగా నా నివాస స్థలం నుండి గమనిస్తూ ఉంటాను.”

    5 కోతకాలం రాకముందు పువ్వు వికసించే దశ ముగిసిన తర్వాత, పువ్వు ద్రాక్షగా మారుతున్న దశలో ఆయన పోటకత్తులతో ద్రాక్షకాయలను కత్తిరిస్తాడు. వ్యాపిస్తున్న ద్రాక్ష కొమ్మలను నరికి అవతల పారవేస్తాడు.

  21. 26 ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, “దేవుని రాజ్యం ఒక మనిషి భూమి మీద విత్తనాలు చల్లినట్టు ఉంటుంది. 27 ఆ వ్యక్తి నిద్ర పోతున్నా మెలకువగా ఉన్నా రాత్రి, పగలు అతనికి తెలియకుండానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతూనే ఉంటాయి. 28 ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొలక, ఆ తరువాత కంకి, ఆ కంకి నిండా గింజలు పుడతాయి. 29 పంట పండినప్పుడు అతడు కోతకాలం వచ్చిందని వెంటనే కొడవలితో కోస్తాడు.”

  22. 5 కన్నీళ్లు కారుస్తూ విత్తనాలు చల్లేవాళ్ళు కేరింతలతో పంట కోస్తారు.

    6 విత్తనాలు చేతబట్టుకుని ఏడుస్తూ చల్లేవాడు సంబరంగా పనలు మోసుకుంటూ తిరిగి వస్తాడు.

  23. 1 యెహోవా సీనాయికొండ మీద మోషేకు ఇలా చెప్పాడు 2 “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. నేను మీకిస్తున్న దేశానికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలాన్ని పాటించాలి. 3 ఆరు సంవత్సరాలు నీ పొలంలో విత్తనాలు చల్లాలి. ఆరు సంవత్సరాలు నీ పండ్ల తోటను సాగుచేసి దాని పండ్లు సమకూర్చుకోవచ్చు.

    4 ఏడవ సంవత్సరం భూమికి మహా విశ్రాంతి కాలం, అంటే అది యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరంగా ఉండాలి. ఆ సంవత్సరం నీ పొలంలో విత్తనాలు చల్ల కూడదు. నీ పండ్ల తోటను బాగు చేయకూడదు. 5 బీడుగా వదిలిన చేలో దానంతట అదే పండిన పంట కోత కోసం ఏర్పాట్లు చేసుకోకూడదు. బాగు చేయని నీ చెట్ల పండ్లు ఏరుకోకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరం. 6 అప్పుడు భూమి విశ్రాంతి సంవత్సరంలో దానంతట అదే పండిన పంట నీకు, నీ సేవకుడికి, నీ దాసికి, నీ జీతగాడికి, నీతో నివసిస్తున్న పరదేశికి ఆహారంగా ఉంటుంది. 7 నీ పశువులకు, నీ దేశంలోని జంతువులకు దాని పంట అంతా మేతగా ఉంటుంది.

  24. 1 ఎండాకాలానికి మంచు ఎలానో కోతకాలానికి వర్షమెలానో అలానే బుద్ధి లేనివాడికి గౌరవం తగినది కాదు.

  25. 33 సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు. “బబులోను కుమార్తె ధాన్యం నూర్చే కళ్ళం లాగా ఉంది.

    ఆమెను కింద తొక్కివేసే సమయం ఇదే. మరికొంత కాలానికి పంట ధాన్యం వస్తుంది.

  26. 22 మీరు మీ పంటపొలం కోసేటప్పుడు పొలం అంచుల్లో పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. పేదవారికి, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.”

  27. 9 యాజరుతో కలిసి నేను సిబ్మా ద్రాక్షాతీగెల కోసం ఏడుస్తాను. హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లతో నిన్ను తడుపుతాను. ఎందుకంటే నీ వేసవికాల ఫలాల మీద, నీ పంట మీద నీ కేరింతలను నేను అంతమొందించాను.

  28. 11 నా ప్రజల సంపదలు మళ్ళీ వారికి ఇచ్చినప్పుడు, యూదా, నీ కోసం కూడా కోత సిద్ధంగా ఉంది.

  29. 11 భూమిలోనుంచి విశ్వాస్యత మొలుస్తుంది. ఆకాశం నుంచి విజయం తొంగిచూస్తుంది.

    12 యెహోవా తన మంచి దీవెనలనిస్తాడు. మన భూమి దాని పంటనిస్తుంది.

    13 నీతి ఆయనకు ముందుగా నడుస్తుంది. ఆయన అడుగుజాడలకు దారి ఏర్పరస్తుంది.

  30. 13 నమ్మకమైన దూత తనను పంపిన వారిపాలిట కోతకాలపు మంచు చల్లదనం వంటి చల్లదనం గలవాడు. వాడు తన యజమానుల హృదయానికి ఆహ్లాదం కలిగిస్తాడు.

  31. 10 విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు. 11 ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది.

    12 మీరు చేసే ఈ సేవ పరిశుద్ధుల అక్కరలు తీర్చడమే కాకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించేలా చేస్తుంది. 13 ఈ సేవ ద్వారా మీ యోగ్యత కనబడుతుంది. క్రీస్తు సువార్తను ఒప్పుకుని విధేయులై, ఇంత ఉదారంగా వారికీ, అందరికీ పంచిపెట్టడం బట్టి, వారు కూడా దేవుణ్ణి మహిమ పరుస్తారు. 14 మీ పట్ల దేవుడు కనపరచిన అత్యధికమైన కృపను చూసి, వారు మీ కోసం ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు. 15 వర్ణించ శక్యం గాని ఆయన బహుమానానికి దేవునికి ధన్యవాదాలు.

  32. 3 మీరు నా శాసనాలను బట్టి నడుచుకుంటూ నా ఆజ్ఞలను పాటిస్తూ వాటిని అనుసరించి ప్రవర్తించాలి.

    4 వర్షాకాలంలో మీకు వర్షం ఇస్తాను. మీ భూమి పంటలనిస్తుంది. మీ పొలాల్లో చెట్లు ఫలిస్తాయి. 5 మీ ద్రాక్ష పండ్లకాలం వరకూ మీ పంట నూర్పు కొనసాగుతుంది. మీరు తృప్తిగా తిని మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారు.

  33. 4 నాట్లు వేసే కాలంలో సోమరిపోతు నాగలి పట్టడు. కోతకాలంలో పంటకోసం వస్తే వాడికి ఏమీ దొరకదు.

  34. 11 గోదుమ, బార్లీ గురించి రైతులారా, సిగ్గుపడండి,

    ద్రాక్ష రైతులారా దుఖించండి, పొలం పంట నాశనమయింది.

  35. 7 కాబట్టి సోదరులారా, ప్రభువు రాక వరకూ సహనంతో ఉండండి. రైతు తొలకరి వాన, కడవరి వాన కురిసే దాకా విలువైన పంట కోసం ఓపికతో ఎదురు చూస్తూ వేచి ఉంటాడు కదా. 8 ప్రభువు రాక దగ్గర పడింది. మీరు కూడా ఓపికగా ఉండండి. మీ హృదయాలను దిటవు చేసుకోండి.

  36. 10 ఆరు సంవత్సరాల పాటు నీ భూమిని దున్ని దాని పంట సమకూర్చుకోవాలి. 11 ఏడవ సంవత్సరం నీ భూమిని బీడుగా వదిలి పెట్టాలి. అప్పుడు మిగిలి ఉన్న పంటను నీ ప్రజల్లోని పేదవారు తీసుకున్న తరువాత మిగిలినది అడవి జంతువులు తినవచ్చు. మీకు చెందిన ద్రాక్ష, ఒలీవ తోటల విషయంలో కూడా ఈ విధంగానే చెయ్యాలి.

  37. 11 ఆ సంవత్సరం, అంటే ఏభైయవ సంవత్సరం మీకు సునాద కాలం. ఆ సంవత్సరంలో మీరు విత్తనాలు చల్ల కూడదు, కోత ఏర్పాట్లు చేసుకోకూడదు. బీడుగా వదిలిన చేలో దానంతట అదే పండిన పంట తినవచ్చు. బాగు చేయని ద్రాక్ష తోటలో పండ్లు ఏరుకోవచ్చు. 12 అది సునాద కాలం. అది మీకు పవిత్రం. చేలో దానంతట అదే పండిన పంటను మీరు తింటారు.

  38. 5 అది పంట కోసేవాడు ధాన్యాన్ని సమకూర్చినట్టుగా, అతడి చేయి కంకులను కోసినట్టుగా ఉంటుంది.

    రెఫాయీము లోయలో ఒకడు పరిగె సేకరించినట్టుగా ఉంటుంది.

  39. 18 శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది.

  40. 6 రెండేళ్ళ నుంచి దేశంలో కరువు ఉంది. ఇంకా ఐదేళ్ళు దున్నడం గానీ పంటకోత గానీ ఉండదు.

  41. 5 దేవా, ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక. ప్రజలందరు నిన్ను స్తుతిస్తారు గాక.

    6 అప్పుడు భూమి దాని ఫలాన్ని ఇస్తుంది. దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు.

    7 దేవుడు మమ్మల్ని దీవించాడు. భూదిగంతాల ప్రజలు ఆయనలో భయభక్తులు నిలుపుతారు.

  42. 16 బబులోనులో విత్తనాలు చల్లే వాణ్ణీ, కొడవలి తీసుకుని పంట కోసే వాణ్ణీ ఉండకుండా వాళ్ళను నిర్మూలం చేయండి.

    క్రూరమైన ఖడ్గానికి భయపడి వారందరు తమ ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు తమ తమ దేశాలకు పారిపోతున్నారు.

  43. 9 “ధాన్యపు కళ్ళం తొక్కే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అని మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉంది. దేవుడు కేవలం ఎడ్ల గురించేనా ఇక్కడ రాస్తున్నది? 10 నిజానికి ఆయన కచ్చితంగా మన కోసం దీన్ని చెప్పడం లేదా? అవును, ఈ మాట మన కోసమే రాసి ఉంది. ఎందుకంటే, దున్నేవాడు ఆశతో దున్నాలి. కళ్ళం తొక్కించేవాడు పంటలో భాగం పొందుతాను అనే ఆశతో ఆ పని చేయాలి. 11 మీ కోసం మేము ఆధ్యాత్మిక విషయాలు విత్తనాలుగా చల్లాము. దానికి ప్రతిఫలంగా మీ నుండి శరీర సంబంధమైన పంట కోసుకోవడం గొప్ప విషయమేమీ కాదు.

  44. 12 వారు యెహోవాకు అర్పించే మొదటి ఫలాలు, అంటే, నూనెలో ప్రశస్తమైనది, ద్రాక్షారసం, ధాన్యాల్లో ప్రశస్తమైనవన్నీ నీకిచ్చాను. 13 వారు తమ దేశపు పంటలన్నిట్లో యెహోవాకు తెచ్చే మొదటి ఫలాలు నీకు చెందుతాయి. నీ ఇంట్లో ఆచారరీతిగా శుచిగా ఉన్నవారు ఈ అర్పణల్లో దేనినైనా తినొచ్చు.

  45. 1 కొన్ని రోజులైన తరువాత గోదుమ పంట కోత సమయంలో సంసోను ఒక మేకపిల్లను తీసుకుని తన భార్యను చూడటానికి వెళ్ళాడు. “నా భార్యను చూడటానికి ఆమె గదిలోకి వెళ్తాను” అనుకున్నాడు. కాని ఆమె తండ్రి అతణ్ణి లోపలికి వెళ్ళనివ్వలేదు.

  46. 13 బేత్షెమెషు ప్రజలు పొలంలో తమ గోదుమ పంట కోస్తున్నారు. వారు కన్నులెత్తి చూసినప్పుడు మందసం కనబడింది. దాన్ని చూసి వారు సంతోషించారు.

  47. 17 నీ పంట, నీ ఆహారం వారి చేతిలో నాశనం అవుతుంది. నీ కొడుకులనూ, కూతుళ్ళనూ, నీ గొర్రెలనూ, నీ పశువులనూ నాశనం చేస్తారు.

    నీ ద్రాక్షచెట్ల, అంజూరు చెట్ల ఫలాన్ని నాశనం చేస్తారు. నీవు ఆశ్రయంగా భావించిన ప్రాకారాలుగల పట్టణాలను వారు కత్తి చేత కూలదోస్తారు.

  48. 13 ప్రజలు గోదుమలు చల్లారు కానీ ముండ్ల పంట కోస్తారు. పనిలో అలసిపోతున్నారు గాని ప్రయోజనం లేదు.

    యెహోవా కోపం కారణంగా కోయడానికి పంట లేక మీరు సిగ్గుపడతారు.

  49. 11 అయితే ప్రతి క్రమశిక్షణా ప్రస్తుతం మనకు బాధాకరంగానే ఉంటుంది కానీ సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తరువాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది.

  50. 4 ఎద్దులు లేకపోతే కొట్లలో ధాన్యం ఉండదు. ఎద్దులు బలంగా ఉంటే అధిక రాబడి వస్తుంది.

  51. 3 అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనంగా, ఆయన పంటలో ప్రథమ ఫలంగా ఉంది.

    వారిని బాధించే వారందరూ శిక్షకు పాత్రులు. వారిపైకి కీడు దిగి వస్తుంది.” ఇదే యెహోవా వాక్కు.

  52. 13 సోదరులారా, ఇది మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను చాలా సార్లు మీ దగ్గరకి రావడానికి ప్రయత్నించాను గాని ప్రతిసారీ ఆటంకం వచ్చింది. యూదేతర ప్రజల మధ్య నేను పొందిన పరిచర్య ఫలాలు మీ మధ్య కూడా పొందాలని నా ఆకాంక్ష.

  53. 5 అందుచేత సోదరులు ముందుగానే మీ దగ్గరికి వచ్చి పూర్వం మీరు వాగ్దానం చేసిన విరాళం పోగుచేయాలని ప్రోత్సహించడానికి వారిని పంపడం అవసరమని నేను భావించాను. తద్వారా మీ విరాళం బలవంతంగా ఇచ్చింది కాకుండా స్వచ్ఛందంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.

    6 “కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు. 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు.

  54. 4 చూడండి, మీ చేను కోసిన పనివారి కూలీ ఇవ్వకుండా, మీరు మోసంగా బిగపట్టిన కూలీ కేకలు వేస్తున్నది. మీ కోతపని వారి ఆక్రందనలు సేనల ప్రభువు చెవిని బడుతున్నాయి.

  55. 5 యోసేపు ఒక కల కని తన సోదరులతో దాన్ని గూర్చి చెప్పినప్పుడు వారు అతని మీద మరింత పగపట్టారు. 6 అతడు వారితో ఇలా చెప్పాడు. “నేను కన్న ఈ కల మీరూ వినండి. 7 అదేమిటంటే మనం పొలంలో ధాన్యం కట్టలు కడుతూ ఉన్నాం. నా కట్ట లేచి నిలబడగానే మీ కట్టలు దాని చుట్టూ చేరి నా కట్టకి సాష్టాంగపడ్డాయి.” 8 అందుకు అతని సోదరులు “నువ్వు నిజంగానే మమ్మల్ని ఏలుతావా? మామీద నువ్వు అధికారివి అవుతావా” అని అతనితో చెప్పి, అతని కలలను బట్టీ అతని మాటలను బట్టీ అతని మీద మరింత పగ పెంచుకున్నారు.

  56. 14 భోజన సమయంలో బోయజు “నువ్వు ఇక్కడికే వచ్చి భోజనం చెయ్యి. నీ రొట్టెముక్కలను ద్రాక్షారసంలో ముంచుకుని తిను” అని చెప్పాడు. కాబట్టి ఆమె పంట కోసే వాళ్ళ దగ్గర కూర్చుంది. బోయజు ఆమెకు కొన్ని పేలాలు ఇచ్చాడు. ఆమె కొన్ని తృప్తిగా తిని కొన్ని మిగిల్చింది.

  57. 6 సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి జ్ఞానం తెచ్చుకో.

    7 వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు.

    8 అయినప్పటికీ అవి ఎండాకాలంలో తమకు తిండి సిద్ధం చేసుకుంటాయి. పంట కోత కాలంలో ఆహారం సమకూర్చుకుంటాయి.

    9 సోమరీ, ఎంతసేపటి వరకూ నిద్రపోతూ ఉంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు?

    10 ఇంకా ఎంతసేపు కునికిపాట్లు పడుతూ “కొంచెం సేపు నిద్రపోతాను, కాస్సేపు చేతులు ముడుచుకుని పడుకుంటాను” అనుకుంటావు?

    11 అందువల్ల దోపిడీ దొంగ వచ్చినట్టు దరిద్రం నీకు ప్రాప్తిస్తుంది. ఆయుధం ధరించిన శత్రువు వలే లేమి నీ దగ్గరికి వస్తుంది.

  58. 20 ఒకడి కడుపు నిండడం అతని నోటి మాటలను బట్టే ఉంటుంది. తన పెదవుల పంట కోత మూలంగా అతడు తృప్తిచెందుతాడు.

  59. 13 ఒలీవ చెట్టును దులిపేటప్పుడు, ద్రాక్షకోత అయిన తరువాత పరిగె పళ్ళు ఏరు కొనేటప్పుడు జరిగేలా లోక జాతులన్నిటిలో జరుగుతుంది.

  60. 4 పచ్చని లోయ తలపై ఉన్న వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యం

    కోతకాలం రాకముందే పండిపోయిన మొదటి అంజూరపు పండులా ఉంటుంది.

    మొదట దాన్ని చూసినవాడు దాన్ని చేతిలోకి తీసుకున్న వెంటనే నోట్లో వేసుకుని మింగివేస్తాడు.

  61. 10 మరో సంవత్సరం, కొద్ది రోజులకి మీ నమ్మకం వీగిపోతుంది.

    నిశ్చింతగా ఉన్న స్త్రీలూ, ద్రాక్షపంట నష్టమౌతుంది. ద్రాక్షపళ్ళు ఇంటికి రావు.

  62. 13 నేను వారిని పూర్తిగా కొట్టివేస్తున్నాను. ఇక ద్రాక్షతీగెకు ద్రాక్షలు, అంజూరు చెట్టుకు అంజూరపండ్లు కాయవు. వాటి ఆకులు వాడిపోతాయి.

    నేను వారికి ఇచ్చినదంతా నశించిపోతుంది. ఇదే యెహోవా వాక్కు.

  63. 4 ఎగిరే మిడతల గుంపులు విడిచి పెట్టిన దాన్ని పెద్ద మిడతలు తినేశాయి.

    పెద్ద మిడతలు విడిచిపెట్టిన దాన్ని మిడత పిల్లలు తినేశాయి.

    మిడత పిల్లలు విడిచిపెట్టిన దాన్ని గొంగళిపురుగులు తినేశాయి.

  64. 23 మీరు ఆ దేశానికి వచ్చి తినడానికి రకరకాల చెట్లు నాటినప్పుడు వాటి పండ్లను నిషేధంగా ఎంచాలి. మూడు సంవత్సరాల పాటు అవి మీకు అపవిత్రంగా ఉండాలి. వాటిని తినకూడదు. 24 నాలుగో సంవత్సరంలో వాటి పండ్లన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతి అర్పణలుగా ఉంటాయి. ఐదో సంవత్సరంలో వాటి పండ్లను తినొచ్చు. 25 నేను మీ దేవుడైన యెహోవాను.

  65. 9 యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు.

    10 అలా చేస్తే నీ వాకిట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో కొత్త ద్రాక్షారసం పొంగి పారుతుంది.

  66. 4 మిడతలు తిని వేసినట్టు మీ సంపదలు దోపిడీకి గురౌతాయి. మిడతల దండులా శత్రువులు దానిమీద పడతారు.

  67. 19 యెహోవా సీయోనులో లేడా? ఆమె రాజు ఆమెలో లేడా? అని బహు దూరదేశం నుండి నా ప్రజల రోదనలు వినబడుతున్నాయి.

    వారి విగ్రహాలను ఇతర దేశాల మాయ దేవుళ్ళను పెట్టుకుని నాకు ఎందుకు కోపం తెప్పించారు?

    20 కోత కాలం గతించిపోయింది. ఎండాకాలం దాటిపోయింది. మనకింకా రక్షణ దొరకలేదు అని చెబుతారు.

  68. 15 నువ్వు విత్తనాలు చల్లుతావు గానీ కోత కోయవు.

    నువ్వు ఒలీవ పళ్ళను తొక్కుతావు

    కానీ ఆ నూనె పూసుకోవు.

    ద్రాక్షపళ్ళను తొక్కుతావు

    కానీ ద్రాక్షారసం తాగవు.

  69. 6 మీరు ఎక్కువ విత్తనాలు చల్లినా పండింది కొంచెమే.

    మీరు భోజనం చేస్తున్నప్పటికీ ఆకలి తీరడం లేదు.

    మీరు ద్రాక్షరసం తాగుతున్నప్పటికీ మత్తు రావడం లేదు.

    బట్టలు కప్పుకుంటున్నా చలి ఆగడం లేదు.

    పనివారు కష్టపడి జీతం సంపాదించుకున్నా జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది.